లేబుళ్లు

9, ఆగస్టు 2010, సోమవారం

Gundechappudu.

                                                         గుండె చప్పుడు/ sixth sense.
నాకు మావారికి యాత్రలకి వెళ్ళాలంటే మహా ఇష్టం. దక్షిణ దేశ యాత్ర ఇప్పటికే నాలుగు సార్లు అయింది. ఈసారి ఉత్తర దేశ యాత్ర అందునా 'చార్ ధామ్'(యమునోత్రి,గంగోత్రి ,బదరీనాథ్,కేదార్నాథ్)యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అసలు ఈపాటికే అమెరికా వెళ్ళాల్సి ఉంది. కానీ మా పెద్దమ్మాయి నెలతప్పిందని తెలిసి ఆఖరి నిముషం లో ప్రయాణం అయిదు నెలలు వాయిదా వేసుకుని  'చార్ ధాం' యాత్రకు బయలు దేరాం. మా  చిన్నఅమ్మాయి హైదరాబాదు లో ఉంటుంది. దానికి చెప్పాను ఇలా ఉత్తర దేశ యాత్ర కి వెళ్తామని.అన్ని  వివరాలు తీసుకుంది. హైదరాబాదు నుంచి ఢిల్లీ దాక విమానం లో
అక్కడనుంచి ఉత్తరాంచల్ టూరిజం వారి బస్సు లో ప్రయాణం. వసతి సౌకర్యం కూడ కలిపి  అన్నిటికెట్స్ తను ఆన్ లైన్ తీసుకుంది. ప్రయాణ తేదీలు, ఏ రోజు ఎక్కడ ఉంటాము అన్ని వివరాలు అమెరికాలో ఉన్న అన్నకు,అక్కకు పంపి మాకు ఒక కాపీ ఇచ్చింది. ఢిల్లీ నుంచి  హృషీ కేష్  ప్రయాణం కొద్దిగా అలసట అనిపించినా సాఫీగా సాగింది. హృషీ కేష్  చేరే సరికి
సాయంత్రం 6 గంటలయింది. అక్కడ రెండు రోజుల విశ్రాంతి. మాకిచ్చిన వసతి గృహం చాలా బాగుంది. హృషీ కేష్, హరిద్వార్ లో చూడవలసిన" గంగామయ్య" హారతి, రాం ఝూలా,లక్ష్మన్ ఝూలా,ముఖ్యమైన దేవాలయాలు వారే మరుసటి రోజు  చూపిస్తామన్నారు. అందరిని బయటకు ఒంటరిగా వెళ్ళవద్దని నగలు, నట్రా జాగ్రత్త అని, పర్సులు,డబ్బు జాగ్రత్త అని, పదే పదే  హెచ్చరించారు. మరుసటి రోజు అన్ని చూసి తిరిగి వచ్చే సరికి దాదాపు రాత్రి 10  గంటలయింది. వారి కాంటీన్ లోనే
దాల్ రోటి తినేసి రూంకి వచ్చాము. పిల్లలూ ముగ్గురు కూడబలుక్కున్నట్లు  ఒకరితరువాత ఒకరు ముగ్గురు ఫోన్లు చేశారు.ప్రతి రోజు ఇదే టైం కి ఫోన్ చేస్తామని ఆరోగ్యం జాగ్రత్త అని మేము వాళ్ళకి చెప్పినట్లు తిరిగి మాకు చెప్పారు.
ఉదయం స్నానం, టిఫెన్ ముగించుకుని మేమిద్దరం,ఇంకా కొంత తెలుగు వారం కలిసిరెండు   టాక్సీలు  చేసుకుని  హరిద్వార్
మళ్ళీ వెళ్ళాం. సంకట మోచన్ గణేష్ దేవాలయం, ఇంకా కొన్నిమందిరాలు చూసి ఒక పెద్ద శివాలయం కి వచ్చాము.
ఆలయంలో చాల రద్దీ, తోపుడుగా ఉంది. అయినా సరే వచ్చాం కదా అని మేము గుంపుగా ఆలయంలోకి వెళ్లి
ఆ రద్దీ లో,తోపుడులో మావారు ఒక పక్కకి నేనొక పక్కకి అయి పోయాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మా పని అయిపొయింది. నాకేదో తెలియని ఇబ్బందిగా అనిపించి బాగ్, అందులో పర్సు చూసుకున్నాను అప్రయత్నంగానే. ఇంకేముంది రెండు అరల్లో పెట్టిన దాదాపు 15 వేల రూపాయలు మాయం. పర్సు జిప్ తీసి ఉంది. గుండె తీవ్రంగా కొట్టుకుంటోంది.
నోట మాట రావడం లేదు.ఆయనకు ఈ విషయం చెపుదామని నాప్రయత్నం. నోరు పెగల లేదు.
సైగలతో నే ఖాళీ పర్సు చూపిద్దామని అయన కోసం చూశాను. అక్కడ ఇంకో తెలుగావిడది నాపరిస్తితే. ఈయన ఆవిడను,వాళ్ళ  ఆయనను పరామర్శిస్తున్నారు.వాళ్ళాయన ఆవిడను  ఒకటే అరుస్తున్నాడు. నా పరిస్తితి కి నాకే నవ్వు వచ్చింది. రండి, మనసంగతి చూడండిముందు, అనుకున్నాను, మనస్సులో కొద్దిగా కుదుట పడి ఆయనదగ్గరికి  వెళ్లి మనది కూడ అదే పరిస్థితి. మొత్తం డబ్బు పోయింది.అని ఖాళీ పర్సు చూపించాను. మీ దగ్గర ఎంత ఉంది అని అడిగాను ఆయన్ని.
అయన జేబులు  చూసుకొని మూడు వేలు  ఉందన్నారు.  ఇంకా 14 రోజులు గడవాలి, ఎట్లారా భగవంతుడా,ఎంత పని చేశావు స్వామీ !అనుకోవడం తప్ప ఇంకేమి చేయగలం. టికెట్స్ అన్నీ కొన్నాం, కానీ తిండీ, తిప్పలూ ఎలా ? మా గ్రూప్ లోనే ఒకాయన ఇవన్నీ గమనించి ఏం ఫరవా లేదండి. తెలుగు వాళ్ళం ఇంత మాత్రం సర్దుకు పోక పోతే ఎలాగండీ.నా దగ్గర దండి గానే ఉంది లెండి. సర్దు కుందాం అన్నాడు ఒకాయన.ఆయన దేవుడిలా కనిపించాడు ఆక్షణంలో.
ఇంతలోనే ఆయన భార్య ఆయనకు క్లాసు పీకడం మొదలెట్టింది.
మొదలెట్టారూ? ఎక్కడ  కెళ్ళినా ఈ సంత తప్పదు కదా నాకు. అంటోంది ఆవిడ బిగ్గరగానే . అందరూ ఆవిడని ఏదోలా చూశారు.
నా మనస్సు చివుక్కు మంది. అనవసరంగా మాట పడాల్సి వచ్చింది నావల్లే కదా అన్నాను ఆయనతో.
మనమేమి వాళ్ళని అడగలేదే.నువ్వెందుకు బాధ పడాలి. అయన నా చెయ్యి పట్టుకుని వదిలెయ్యి అన్నట్లుగా చూశారు నావంక. అందరు అక్కడే ఉన్న పెద్ద చెట్టు క్రింద నీడలో కూర్చున్నాం. పోలీసు రిపోర్ట్ ఇవ్వడమా,లేదా, తలొక మాట మాట్లాడుతున్నారు.ఇంతలో మావారు, సరే,  ఇక్కడ పక్కనే స్టేటు బ్యాంకు ఉందండీ. క్రెడిట్ కార్డు మీద ఏమైనా కేష్  లోన్  ఇస్తాడేమో అడిగి  వస్తాను. అని చెప్పి వెంటనే  వెళ్లారు. ఇంతలో నా మొబైల్ మ్రోగింది. అమెరికా నుంచి మావాడి ఫోను. అమ్మా మీరిద్దరూ బావున్నారా? మీ దగ్గర డబ్బు ఎంత ఉంది. కొద్దిగా ఎక్కువ ఉంచుకోండి. ఇప్పుడు
హృషీ కేష్  లో వున్నారా? రేపు కదా మీ యాత్ర స్టార్ట్ అయ్యేది అన్నాడు వాడు.  అవునురా, ఇప్పుడు మీకు రాత్రి రెండు న్నరో,మూడో అయ్యింది  కదా ఇంకా నిద్ర పోలేదా? అనడిగాను. లేదమ్మా, నిద్ర లోనే వున్నాను, ఏదో పిచ్చి కల వచ్చింది.నీ దగ్గర డబ్బు మొత్తం పోయినట్లు కల వచ్చిందమ్మా, అని డాడీ కివ్వమ్మా ఫోను అన్నాడు. డాడీ లేరురా ఇక్కడ అయన ఇక్కడే ఎక్కడో తిరుగు తున్నారు,. అని చెప్పాను. సరే అమ్మా, పెన్ తీసుకుని ఈ నెంబరు  నోట్ చేసుకో అన్నాడు వాడు. అరేయ్, నాదగ్గర పెన్, పేపరు లేదు పది నిముషాలాగి  ఫోన్ చెయ్యి లేకపోతే డాడీ నెంబరు కి ఫోన్ చెయ్యి అని చెప్పాను.. సరే అన్నాడు వాడు .ఇక వెల్దామండీ   మీవారు ఇంకా రాలేదేంటి, అని తొందర పెడుతున్నారు ఇక్కడ మిగతా వాళ్ళంతా. దాదాపు అర్ధగంట
తరువాత తిరిగి వచ్చారు ఈయన. వస్తూనే పని అయింది. బ్యాంకు వాళ్ళు చాల బాగా  సహకరించారు. నిముషాల్లో కార్డు/debits/ నా identity పరిశీలించారు. రూ. 20 ,000/- తెచ్చాను అన్నారు. చాల రిలీఫ్ వచ్చింది.మనస్సులో
ఆయన్నిఅభినందించుకున్నాను. ఇంతలో ఆయన, నువ్వుగాని వంశీ (మా అబ్బాయి) కి ఫోను చేశావేంటి అనడిగారు. లేదే! నేనేమి ఫోను చెయ్యలేదు, వాడే ఇంతకూ ముందే ఫోన్ చేశాడు.వాడికి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయినట్లు కల వచ్చిందట. ఏదో నెంబరు నోట్ చేసుకోమన్నాడు.అదేదో మీకే చెప్పమని చెప్పాను. అదే చెపుతున్నాను నువ్వే ఫోను చేసి
డబ్బులు పోయాయి అని చెప్పి వుంటావు. అందుకే వాడు నాకు ఫోను చేసి  వెస్ట్రన్ మనీ (western money) లో 500 డాలర్లు
పంపించాను అని ఒక కోడ్ నంబరు ఇచ్చాడు. మీ ID చూపించి ఎక్కడయినా పోస్ట్ ఆఫీసు లో తీసుకోవచ్చు.మీరు కేష్ తీసుకోండి, ఇబ్బంది పడకండి అన్నాడు వాడు. సరే ఎలాగు మేము స్టేటు బ్యాంకు లో డబ్బు తీసుకున్నాము.
అసలు మా డబ్బు పోయినట్లు వాడికి కల రావడమేమిటి? వాడు, డబ్బు పోయిన పది నిముషాల్లో ఫోన్ చేసి డబ్బు పంపించాను అని చెప్పడమేమిటి! అంతా ఒక విచిత్రం! దాన్నే 'టెలిపతి'  (telepathy) అంటారు అన్నారు మావారు.
కాదు  నా గుండె చప్పుడు వినిపించింది వాడికి అనిపించింది నాకు. తరువాత యాత్ర అంతా చేసుకుని క్షేమంగా   తిరిగి వచ్చాం.
జరిగింది చెపుతే అందరికి వాడి కల గురించి 'చిత్రం' అనిపించింది. మా పెద్దది ఫోను చేసి అమ్మా నాకు కూడ మీ డబ్బులు పోయిన రోజు ఎలాగో అనిపించింది. నేను వంశీ కి ఫోన్ చేసి డాడీ వాళ్లకి డబ్బులు పంపించాలంటే ఎలారా అని వాడిని అడిగానమ్మా, కాని వెధవ వాడు అప్పటికే  పంపించాడట అని అది అంటుంటే నాకు నిజంగా sixth సెన్స్ అంటుంటారు కదా అది తల్లులకే  కాదు పిల్లలకు వుంటుంది అని తెలిసిందారోజు! కాకపోతే ప్రతి మనిషి గుర్తించ వలసిన విషయం ఏమిటంటే అలాంటి స్పందన ఏదైనా మీలో కలిగినప్పుడు, ఆ గుండె చప్పుడు, మీ మనస్సు చెపుతున్న విషయం వినండి.అర్ధం చేసుకోండి.
వెంటనే, కాలయాపన చేయ కుండా స్పందించండి.మీ వాళ్ళని ఆదుకున్నవాళ్ళవుతారు. తరువాత ఇక్కడ ఇంకో విషయం
కూడా వ్రాయ తలచుకున్నాను. ఆడ వాళ్ళూ మారండి.మాట జారకండి. మనస్సులు నొచ్చుకుంటాయి. ఆపదలు చెప్పి రావు.
రేపు మీకు  అదే పరిస్థితి  ఎదురు కావచ్చు. హంగు వున్నవాళ్ళు ఏదో విధంగా ఒంటి మీద నగ, నట్రా అమ్ముకోనయినా బయట పడవచ్చు. అందరు వున్నవాళ్ళు కాదుకదా. మనది కాని వూరిలో లేక దేశంలో ఎవరికైనాఆపద రావచ్చు.
మీరు సాయం చెయ్యక పోవచ్చు.చేసే వాళ్ళని చెడ గొట్టకండి.
కేశిరాజు రజని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి