ఆరోగ్యానికి హరివిల్లు
---------------
మనం తినే ఆహారం ఎంత వర్ణ రంజితంగా, వైవిధ్యంగా భరితంగా వుంటే ఆరోగ్యానికి అంత మంచిదని ప్రయోజ నకారి అని, పోషకాహార నిపుణుల ఉద్దేశ్యం. రకరకాల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ,ఒంటికీ కూడా విందు చేస్తుంది. ఈ రంగురంగుల వృక్ష సంబంధమైన ఆహరంలో కీలకపోషకాలైన కెరోటినాయిడ్లు, బయో ఫ్లవనోఇడ్లు వంటివి ఉంటాయి. ఇవి మనశరీరంలో విశ్రుంఖల కణాల (ఫ్రీ రేడికల్స్) దాడిని అడ్డుకుంటాయి. అంతే కాక ఇవి వయసుతో పాటు శరీరంలో, శరీర కణాజాలంలోవచ్చే క్షీణతను నిలవరిస్తూ కణజాలన్ని కాపాడుతూ ఉంటాయి.
టొమాటో, పుచ్చకాయ, ద్రాక్ష,అంజీర లాటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపెన్....జీవకణాలలో ఒత్తిడిని తగ్గించే 'యాంటీ ఆక్సిడెంట్' గానే గాక శరీరంలోపల రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
బొప్పాయి, క్యారట్లు, చిలగడ దుంప లాటి పసుపు, నారింజ రంగులలో ఉండే పండ్లు కూరగాయల్లో 'బీటా కేరోటిన్లు' అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎప్పటికప్పుడు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరిచడానికి కావలసిన శక్తిని ఇస్తూ ఆ వ్యవస్థను మెరుగుపరుస్తుంటాయి. విటమిన్ 'ఎ' లోపం రాకుండానే కాక 'కేన్సర్' కారక కణాలను నివారిస్తూ ఉంటాయి.
ఇక మసాలా దినుసులు, పసుపు, గ్రీన్ టి, బత్తాయి,నారింజ వంటి పండ్లు, దుంపలు, కూరగాయల్లో అధికంగా ఉండే బయో ఫ్లవనాయిడ్లు గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇలా సహజంగా లభ్యమయ్యే అన్ని రంగుల పండ్లు, కూరగాయలు, దినుసులు, అన్ని రకాల పదార్ధాలకు ఏదో ఆరోగ్య ప్రయోజనం ఉంది. కాబట్టి సహజంగా లభించే రంగు, రంగుల పదార్ధాలు మితంగా ఎన్ని తింటే అంత మంచిదని గుర్తించండి.
ప్రొద్దున మంచి ఉపాహారం, తరువాత మిత భోజనం ఆరోగ్యానికి మంచిదని గుర్తించండి.
పొద్దున్న ఉపాహారం మానేస్తే శక్తి హీనత, మధ్యాహ్నం, రాత్రి భోజనం మానేస్తే మొదటికే మోసమని తెలుసుకోవడం మంచిది.
ఉపవాసమనో లేక బరువు తగ్గుదామనో చాలామంది తరుచు ఉపవాసం చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయని గుర్తుంచుకోండి. ఖాళీ కడుపుతో ఉండడం వల్ల బలహీనత, అసిడిటి, అలసిపోవడం, తీవ్ర తలనొప్పులు వంటి బాధలు వేధిస్తాయి.
కొందరు తినడం మొదలెడితే గొంతు దాకా ఆబగా తినేస్తుంటారు....ఎవరో తరుముతున్నట్లు గబగబా వేగంగా తినేస్తుంటారు. ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. ఆహారం నెమ్మదిగా నమిలి, రుచిని అస్వాదిస్తూ తినడం మంచిది. వేగంగా తినే వాళ్లకి ఎంత తిన్నా కడుపు నిండిన భావన ఉండదట. ఎందుకంటే మన కడుపు ఖాళీగా ఉందా లేక ఇంకా తినాలా లేదా కడుపు నిండిందా....వంటి సమాచారాన్ని మన మెదడుకు చేరవేయడానికి మన శరీరంలోనే ఒక 'వ్యవస్థ' ఉంది. ఆ సమాచారం మెదడుకు అందించడానికి ఆ వ్యవస్థకు దాదాపు 20 నిముషాల వ్యవధి కావాలి. కొందరు ఆలోపునే భోజనం ముగిస్తారు. దాంతో గబా గబా తినే వారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. వారికి కడుపు నిండిందా లేదా అన్న విషయం తెలీక ఆకలి తగ్గిందని మెదడుకు సరైన సమాచారం అందక ఇంకా తినేస్తు ఉంటారు. ఫలితంగా కావలసిన దానికన్నా ఎక్కువ తినడం, ఊబకాయం బారిన పడడం తధ్యం.
అందుకే ఆహారాన్ని నింపాదిగా నమలడం, మితంగా తినడం పిల్లలకు నేర్పండి. భారత దేశంలో కూడా 'ఫాస్ట్ ఫుడ్' అలవాట్ల మూలంగా 'ఊబకాయ' లక్షణాలు కన్పిస్తున్న పిల్లలు, పెద్దలు ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. అందువల్ల ఆహారం తినడం విషయంలో ఈ జాగ్రత్తలు అలవాటు చేసుకుంటే ప్రతి మనిషికి అవి మేలు చేస్తాయి.
తరువాత ముఖ్యంగా 'నీరు'......తిన్నది గొంతు దిగడానికి మాత్రమే అన్నట్లు వ్యవహరించే వారు మన దేశంలో ఎక్కువే. వారంతా గమనించి పాటించవలసిన విషయమేమంటే నీరు త్రాగడం ఆరోగ్యానికి అతి అవసరం. మనం జీవించడానికి గాలి ఎలా అవసరమో నీరు కూడా అంతే అవసరమని గుర్తించండి. మన శరీరంలో మలినాల విసర్జన మీరు తాగే నీటి పరిమాణం మీదే అధారపడుతుందని గ్రహించండి. రోజుకి కనీసం రెండు లీటర్ల నీరు శరీరానికి అవసరం. నిజానికి దాహమయినప్పుడు శరీరం కోరుకునేది 'నీరు' అన్నది తెలుసుకోవడం మంచిది. ఎ కూల్ డ్రింకు లో త్రాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే శుభ్రమైన నీరు త్రాగడం కంటే ఉత్తమ మైనది లేద్దని గ్రహించండి.