లేబుళ్లు

31, అక్టోబర్ 2021, ఆదివారం

                                                                       పాకెట్ మనీ  

                                                                       
               ''నాన్నగారు ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లి ఇంకా రాలేదు. రోజూ ఎనిమిదిన్నర, తొమ్మిది కల్లా వచ్చేస్తారు. పదిన్నరవుతోంది.ఇంకా రాలేదు. క్రింద కూడా లేరట.  ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. కంగారుగా, భయంగా ఉందమ్మా !'' ఆందోళనగా అంది విశాలాక్షి, కూతురు అర్పితకు ఫోను చేసి . 
అర్పిత వెంటనే తండ్రి మొబైల్ కి ఫోన్ చేసింది. 'స్విచ్డ్ ఆఫ్' అని వాయిస్ మెసేజ్ వచ్చింది.  వెంటనే భర్త శశాంక్ కి చెప్పి తల్లితండ్రులుండే బాలాజీ అపార్టుమెంట్ కి వచ్చింది అర్ధగంటలో అర్పిత. 
'నాన్నగారెప్పుడూమొబైల్ స్విచ్ ఆఫ్ చేయరే' అనుకుంటూ అపార్టుమెంటులో తండ్రి వాకింగ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఇంటర్ కామ్ నుంచి ఫోన్ చేసి వారితో మాట్లాడి, అపార్ట్ మెంట్ సెక్యూరిటీకి ఫోను చేసి ఆరా తీసింది అర్పిత.
''చూస్తనే ఉన్నమమ్మా మేడం చెప్పింరు…అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్, క్లబ్ హౌస్, జిమ్, లైబ్రరి అంతా వెతికినం. రాఘవరావు సారు ఏడా లేరు. అగపడితే  ఫోనుచేసి చెబుతమమ్మా" అన్నాడు మెయిన్ గేట్ సెక్యూరిటి సూపర్ వైజర్.
రాఘవరావు గారి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. 
''ఎక్కడైనా కబుర్లు చెప్పుకోవడమో లేక క్లబ్ హౌస్ లైబ్రరీకి  వెళ్ళారేమో ! కిందకెళ్ళి చూసి వస్తాం. కంగారు పడకండి. వచ్చేస్తారు'' అని అమ్మకు ధైర్యం చెప్పి వెళ్ళారు. 
రాఘవరావు తో పరిచయంలేనివారు అపార్ట్ మెంట్ లో అరుదు. అందునా ఆదివారం కావడంతో అపార్ట్ మెంట్ లో రాఘవరావు గారు కన్పించడంలేదన్న వార్త గుప్పుమంది. ఒక్కొక్కరువచ్చి ఏమైందని ఆరాతీస్తూ ఫ్లాట్ బయట రెసిడెంట్స్ గుంపులుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. 
రాఘవరావు ఫ్రెండ్స్ తిరిగి వచ్చి '' ఆయన ఎక్కడా కన్పించలేదమ్మా ! వాకింగ్ అయ్యాక అపార్టుమెంటుకి తిరిగి వచ్చారు. ఇంకొద్దిసేపు చూసి పోలీసు కంప్లైంట్ ఇవ్వమ్మా'' అని సలహాఇచ్చి వెళ్లారు. 
                                                                     * * * * *
మధ్యాన్నం 12' గంటలుఅర్పిత, శశాంక్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చివచ్చారు
ఆక్సిడెంట్ కేసులేమయినా ఉన్నాయానని ఎంక్వయిరీ చేశాడు శశాంక్. అలాటి కేసులేమీ లేవు. 
రాఘవరావుకు రిటైర్ అయి పదేళ్ళయింది. వాకింగ్  తరువాత కనబడ్డ వారితో బాతాఖాని వేయడం ఆయన రొటీన్. ఆ విషయమై ఆయనకు, భార్య విశాలాక్షికి తరచూ వాగ్వాదం జరుగుతుండేది. చేసిన టిఫెన్ చల్లారి పోవడమో లేక ఆయన టిఫెన్ ఆమె వంటకి అడ్డురావడం గాని జరిగేది. అందుకే వాకింగ్ అయ్యాక తిన్నగా ఇంటికి రమ్మని పోరేది విశాలాక్షి. ఆ మాటను ఆయనెన్నడూ ఖాతరు చేయలేదు. 
టైం ఒంటిగంట అయింది. రాఘవరావు ఇంటికింకా రాలేదు. 
పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్ స్వయంగా టేక్ అప్ చేశాడీ కేసుని. అపార్టుమెంట్  కి వచ్చి సెక్యూరిటీ వారిని విచారించి రాఘవరావు ఫ్లాట్ కి వచ్చాడు.  
''రాఘవరావుగారితో కొద్ధి పరిచయముందమ్మా. ఆయన ఏ బంధువుల ఇండ్లకుగానీ, స్నేహితుల ఇండ్లకేమైనా వెళ్ళేరేమో ?" అన్నాడు ఇన్స్పెక్టర్ సందేహం వెలిబుచ్చుతూ. 
''ఉహూ... అలా చెప్పకుండా వెళ్ళేమనిషి కాదు. ఆయన ఫోను స్విచ్ ఆఫ్ కావడం ఇంతవరకు నేనెరుగను. స్నానం చేయలేదు. టిఫెన్ చేయలేదు. ఆకలికి తట్టుకునే మనిషి కాదు. చెప్పాపెట్టకుండా ఎక్కడికెళ్ళారో? కంగారు పడతామన్నధ్యాస కూడా లేకపాయే!'' అంది విశాలాక్షి గద్గదస్వరంతో ఉబుకుతున్నకన్నీళ్లను చీరకొంగుతో ఒత్తుకుంటూ.
''ఏడవకమ్మా! శ్రీనివాస్, నరేందర్ అంకుల్ కి ఫోను చేశాను. డాడీ, వాళ్ళిండ్లకు వెళ్ళలేదు.  
'ఎక్కడికెళ్లి ఉంటారీయన' అనుకుంది మనసులో వ్యాకులపడుతూ అర్పిత .
''ఆయనకి ఎవరితోనైనా శత్రుత్వం గానీ, ప్రాపర్టీ గొడవలు గానీ, డబ్బు లావాదేవీలున్నాయా?
ఎవరితోనైనా గొడవ పడ్డారా? అన్ వాంటెడ్ ఫోన్ కాల్స్, డబ్బు డిమాండ్ చేస్తూ గానీ, బెదిరింపు ఫోన్లు గానీ వచ్చాయా? గుర్తు చేసుకుని చెప్పండి'' అడు ఇన్స్పెక్టర్.  
''లేదు బాబూ ! మాకెలాటి ప్రాపర్టీ గొడవలు లేవు. ఎవరి దగ్గర డబ్బుఅప్పుగా తీసుకోవడం గానీ ఇవ్వడంగానీ లేదు. ఇంటా బయట ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు. నీకు తెలుసో లేదో...ఆయన ఒకటి రెండు సార్లు మీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ ఫ్లాట్స్ వాళ్ళ గొడవలు రాజీ చేయించి వచ్చారు'' అంటూ సమాధానమిచ్చింది విశాలాక్షి.
''ప్రాపర్టీ గొడవలు లేవు. ఎవరితోనూ గొడవలు లేవు. కిడ్నాపయ్యారనుకోవడానికి ఎలాటి మోటివ్ గాని ఆధారం గానీ కనిపించడం లేదు. ఎటువంటి బెదిరింపు, డిమాండ్ ఫోన్ కాల్స్ రాలేదు. ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చేస్తారు'' అన్నాడు. 
లేచి బయలుదేరుతూ  "చూడండమ్మా! నాకు చెప్పని కొత్త విషయం ఏదైనా గుర్తుకు వచ్చినా, మీరింకేదైనా చెప్పదలుచుకున్నా ఫోను చేయండి'' అని రాఘవరావు రిటైర్ కాకముందు ఆఫీసు విషయాలు అడిగి ఆయనవి నాలుగు ఫొటోలు తీసుకుని, పర్సనల్ ఫోను నంబరు ఇచ్చికేసు స్వయంగా తనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్పి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. 
వెళుతూ అపార్టుమెంటులో ఇద్దరు వాకింగ్ స్నేహితుల్ని విచారించి వెళ్ళాడు.                                    ఫోను డైరీ తీసి, పాత ఫ్రెండ్స్ కి, దగ్గరి బంధువులకు ఒక్కొక్కరికీ ఫోను చేసింది అర్పిత. వారెవరి ఇండ్లకి రాఘవరావు వెళ్లలేదన్న విషయం స్పష్టమైంది. 
ఇంటర్ కామ్ నిర్విరామంగా మోగుతూనే ఉంది. రెసిడెంట్స్ ఎంక్వైరీలతో విసుగొచ్చి కాసేపు ఫోను పక్కన పెట్టింది అర్పిత. దాంతో స్వయంగా వచ్చి మరీ అడుగుతున్నారు.     
                                                                    * * * * *
సాయంత్రం నాలుగు గంటలు
అపార్టుమెంటులో ఎవరెవరో టీ, కాఫీ, స్నాక్స్  తెస్తూనే ఉన్నారు. అర్పిత ఇన్స్పెక్టర్ కి ఫోను చేసింది. ఇంకేమీ తెలియరాలేదని చెప్పిఫోను పెట్టేశాడు ఇన్స్పెక్టర్. రాఘవరావు తమ్ముళ్లు, అక్క చెల్లెళ్లు ఒక్కొక్కరు దిగుతున్నారు. 
ఇల్లంతా సందడిగా, రభసగానూ తిరునాళ్లలా ఉంది.
''వీరందరికీ రాత్రికి భోజనాలు?" భర్తతో అంది అర్పిత అందరికీ టీ ఇస్తూ. 
''టెన్షన్ పడకు. బయటనుంచి తెప్పిద్దాం'' అన్నాడు శశాంక్. స్థిమిత పడింది అర్పిత.
ఇంతలో ఎవరో రెసిడెంట్ ఇంటర్ కాంలో ఫోన్ చేసి రాఘవరావు గారి మిస్సింగ్ కేసు వార్త, ఆయన ఫోటో తెలుగు టి.వి ఛానళ్లలో వస్తోందని చెప్పారు. 
వార్త టి వి లో చూసిందగ్గరనుంచి మనస్సులో తెలీని భయం, బాధ కలగలిపి తలనొప్పి, కడుపులో వికారంగా అనిపించి ఏడుపు ఆగలేదు అర్పితకు. 
'నాన్నగారు కనిపించకుండా పోవడమేమిటి ? ఆయన్నెవరు కిడ్నాపు చేశారు ? ఎందుకు ? అయన దగ్గర పెద్దగా డబ్బూ లేదు, దస్కంలేదు. దన్నులేదు. ఎవరితో గొడవలూ లేవు. అందునా తనకు మాలిన ధర్మమెక్కువ. డాడీ మా దగ్గర  సీక్రెట్స్ ఏమైనా దాచారా ... ఏదో సినిమాల్లో చూసినట్లు' అనుకుంది అర్పిత. 
'ఛా, ఛా…నాన్నగారి గురించా నేనిలా ఆలోచించింది. నాకే మాత్రం బుద్ధి లేదు. తప్పు,తప్పు ... సారీ డాడీ!' అనుకుంటూ లెంపలు వేసుకుంది అర్పిత అసంకల్పితంగా. 
''అదేమిటే లెంపలు వేసుకుంటున్నావు, నీలో నువ్వే గొణుక్కుంటూ'' కళ్ళువిప్పార్చి ఆశ్చర్యంగా అంది విశాలాక్షి. 
శశాంక్ అర్పిత దగ్గరిగా వచ్చి ఆమె మీదకు ఒంగి వింతగా, పరీక్షగా చూశాడు.
అప్పటికి గాని ఆమెకు అర్ధంగాలేదు తను అసంకల్పితంగా లెంపలేసుకున్నానన్నసంగతి !
                                                                  * * * * *
సాయంత్రం ఏడుగంటలు. రాఘవరావు మొబైల్ ఫోనింకా స్విచ్డ్ ఆఫ్ మోడ్ లోనే వుంది. . పోలీసులెవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు.  
''మేడం! మీరూ, ఆయన ఏమైనా మాట, మాట అనుకున్నారా? కోప తాపాలేమైనా వచ్చాయా ? 
డబ్బు ఇబ్బందులున్నాయా ? ఎప్పుడైనా ఇంట్లోనుంచి వెళ్లిపోతానని బెదిరించారా ? క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయా? ఎవరికైనా డబ్బు అప్పిచ్చి తిరిగివ్వమని ఒత్తిడి చేశారా?" కొత్త ప్రశ్నలు వేసి, కొత్త అనుమానాలు రేకెత్తించి వెళ్ళాడు.  
వెళుతూ విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏమైనా కొత్త సమాచారం ఉంటే ఫోను చేయమని చెప్పివెళ్ళాడు.
అతనలా వచ్చి వెళ్ళాడో లేదో ఇన్స్పెక్టర్ సురేందర్ మళ్ళీ వచ్చాడు. 
"రెండు నిముషాలు మాట్లాడవచ్చా?'' అని అడిగి కూర్చుని 
''ఉదయం రాఘవరావుగారు అపార్ట్ మెంట్ కి తిరిగి వచ్చిన తరువాతే ఎక్కడికో వెళ్ళడం గాని, కిడ్నాప్ కావడం గానీ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అపార్టుమెంట్  మెయిన్ గేటు దగ్గ్గర ఉదయం నుంచి అనుమానాస్పద ఘటనేమీ జరగలేదు. అక్కడ సి.సి కెమెరాలు లేవు. 
వాకింగ్  అయ్యాక అపార్టుమెంటు లోనికి తిరిగి వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. సో... తెలిసిన వ్యక్తులెవరో ఆయన్ని మభ్యపెట్టి తీసుకెళ్ళి ఉంటారన్నకోణంలో చూస్తున్నాము. 
దేనికైనా మోటివ్ ఉండాలి. అది తెలుసుకోవడంకోసమే వచ్చాను. ఏదైనా విషయం దాచి ఉంటే చెప్పండి. ఆయన్ని త్వరగా ట్రేస్ చేయడానికి ఉపయోగపడుతుంది'' అని చెప్పి తల్లీ కూతుళ్ళ వంక పరీక్షగా, పరిశీలనగా చూశాడు ఇన్స్పెక్టర్ సురేందర్.
''ఇన్స్పెక్టర్ గారూ ! అలాంటిదేమైనా ఉంటే మీకు చెప్పకుండా దాచివుంచే ప్రసక్తే లేదు. అమ్మగాని, నేనుగాని, వేరెవరైనా నాన్నగారితో గొడవపడే అవకాశమే లేదు. మీరనుమానించ దగ్గ విషయమేమీ జరగలేదు'' అంది అర్పిత. 
''రాఘవరావు గారికి వేరే ఆడవారితో సంబంధం .... ?" మెల్లగా అడిగాడు ఇన్స్పెక్టర్. 
"ఛ...ఛ...లేదు" ఖచ్చితంగా అంది అర్పిత.  
"అల్జీమర్స్ జబ్బేమైనా ఉందా?" అడిగాడు ఇన్స్పెక్టర్ సూటిగా.  
''సర్! నిజానికి నాకదే అనుమానం వచ్చింది. కానీ ఆయనకలాటి జబ్బేమీ లేదు. ఆరోగ్యం బాగుంది"
''టెలిఫోను కాల్స్ చెక్ చేశాము. అనుమానాస్పద కాల్స్ లేవు. మిస్టరీగా ఉంది'' అన్నాడు ఇన్స్పెక్టర్ పరిశీలనగా వారిని చూస్తూ.
''బంధువులెవరితోనైనా గొడవలేమైనా ఉన్నాయా?" సాలోచనగా చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్.
''లేవు'' అంది అర్పిత..
''సరేనమ్మా ! వస్తాను. ఏదేమైనా, రాఘవరావుగారు క్షేమంగా తిరిగి వస్తారన్ననమ్మకం నాకుంది'' కేప్ సర్దుకుంటూ వడి వడిగా వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్.
'ఇన్స్పెక్టర్ గారు అంత ఖచ్చితంగా, ధైర్యంగా డాడీ త్వరలో తిరిగి వస్తారని అంటున్నారంటే పోలీసులకేమైనా క్లూ దొరికిందా ? దొరికితే ఇంకా మమ్ముల్నిప్రశ్నించవలసిన అవసరమేముంది. అంతా అయోమయంగా ఉంది' అనుకుంది అర్పిత. 
తండ్రి క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు మొక్కుకుని హాల్లో సోఫాలో ఒరిగింది అర్పిత. విశాలాక్షి గదిలో పడుకునే ఉంది. రాఘవరావు తోబుట్టువులంతా వేరే గదిలో మాట్లాడుకుంటున్నారు.
                                                                     * * * * *
రాత్రి 10 గంటల 30 నిముషాలు. 
దగ్గరికి వేసి వున్నబయట తలుపు నిశ్సబ్దంగా, మెల్లగా తెరుచుకుంది.
హాల్లో సోఫాలో పడుకున్నఅర్పిత లేచి ఆత్రుతగా గుమ్మం వంక చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. రాఘవరావు …తలుపు నెట్టుకుని మెల్లగా లోనికి వచ్చారు. 
''డాడీ!" అంటూ ఉన్నపళాన లేచి రెండంగలలో వెళ్లి ఆయనను చుట్టేసుకుంది అర్పిత. 
''చెప్పకుండా ఎక్కడికెళ్ళారు? మీ ఫోనుకేమయింది ?" ఆప్యాయంగా అడిగి ఆయన రెండు చేతులను పట్టుకుని ఆయన ముఖంవంక నిశితంగా చూసింది. ఒక్కపూటకే ముఖమంతా పీక్కు పోయింది. తలమీద ఉన్న కొద్ది జుట్టు అస్తవ్యస్తంగా ఉంది. వాకింగ్ పైజమా, టి షర్ట్ మీదనే ఉన్నారాయన. గడ్డం మాసి, ఎడమ పక్కన మీసానికి బ్రౌన్ కలర్ ఎధెసివ్ గమ్ టేపు ముక్క అంటుకుని ఉంది. 
దాన్ని పట్టుకుని ఒక్కసారిగా లాగింది అర్పిత. చురుక్కుమంది ఆయనకు. 
''అబ్బా'' అన్నారు రాఘవరావు బాధగా ఎధెసివ్ టేప్ ముక్కని అర్పిత ఒక్కసారిగా లాగడంతో.
ఆయన అరవకుండా నోటికి గమ్ టేప్ వేశారని,ఆయనను ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారని అర్ధమయిందామెకు.
వెంటనే ఆయన చేతులు, మణికట్టు, కాళ్ళను పరిశీలనగా తడిమి చూసింది. మణికట్టు మీద 
తాడు వత్తుకుపొయిన గాట్లు, అక్కడక్కడ చర్మం ఎర్రగా కందిపోయి స్పష్టంగా కనిపించింది.
''ఏంటమ్మా...ఏం చేస్తున్నావు?" అంటూ అర్పితను సున్నితంగా తప్పించుకుని లోనికి నడిచారు రాఘవరావు. 
వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేయాలనుకుంది అర్పిత. ముందుగా తండ్రి సంగతి చూడడం ముఖ్యమని సోఫాలో కూర్చొబెట్టి మంచినీళ్ళు త్రాగాక ఆపిల్ జ్యూసిచ్చింది. ఆకలిగా ఉందేమో చప్పున త్రాగి గ్లాస్ తిరిగిచ్చారు. 
విశాలాక్షి ఆయన పక్కనే కూర్చుంది. ఆయన తమ్ముళ్లు, అక్కా, చెల్లెలు,ఆయన చుట్టూ మూగి  ప్రశ్నలు మొదలెట్టారు.
ఆయన పెద్దక్క కళ్ళుతుడుచుకోవడం గమనించింది అర్పిత. వాళ్ళిద్దరి అనుబంధం గురించి తనకు తెలుసు. అందుకే పెద్దత్త దగ్గరిగా వెళ్లి "డాడీ క్షేమంగా వచ్చారు కదా అత్తా" ఊరుకొమ్మని అనునయించింది. ఆమె తన ఎడం చేతిని అర్పిత భుజం చుట్టూ వేసి వీపు తడిమింది.
ఎంతో హాయిగా అనిపించింది అత్తస్పర్శ ఆక్షణంలో అర్పితకు.
తోడబుట్టిన వారి అనుబంధం, ఆత్మీయత అంటే ఏమిటో చాలా దగ్గరిగా చూశాననిపించిండామెకు. ఇంతలోనే ఎలాతెలిసిందో ఏమిటో అపార్ట్ మెంట్ జనం ఒక్కొక్కళ్ళు వచ్చి పరామర్శించడం మొదలెట్టారు.
"పొద్దున మాట్లాడుదాం. ప్లీజ్!" అని సున్నితంగా చెప్పి తలుపు వేసింది అర్పిత. ఇంటర్ కామ్ నిర్విరామంగా మోగుతూనే ఉంది. పినతండ్రిని ఇంటర్ కాం ఫోను దగ్గర కూర్చోబెట్టి చుట్టాలింటికి వెళ్లి వచ్చారని చెప్పమంది. 
బాత్రూంలో వేన్నీళ్ళు బకెట్లోనింపి, అక్కడినుంచే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ''నాన్నగారు  వచ్చారండీ !'' అంటుండగానే ''నాకు తెలుసమ్మా...నేనే ఆయన్నిఫ్లాట్ ముందు వదిలి వెళ్ళాను. ముందు పెద్దాయన సంగతి చూడమ్మా. బాగా అలిసిపోయారు. తిన్నాక ఒక నిద్ర మాత్ర ఇవ్వండి. ఉదయం మాట్లాడుదాం!" అని ఫోన్ కట్ చేశాడు ఇన్స్పెక్టర్ సురేందర్. 
'మిస్టరీగా ఉంది. డాడీని ఇప్పుడు వివరమడిగే పరిస్థితి లేదు. టైర్డ్ గా ఉన్నారు.
ఇన్స్పెక్టర్ చెప్పినట్లు డిన్నరయ్యాక నిద్రమాత్ర ఇచ్చి పడుకోమని చెప్పాలి' అనుకుంది. 
తండ్రి డిన్నర్ చేసి పడుకున్నతరువాత స్థిమితపడ్డది అర్పిత. 
                                                                    * * * * *                               
ఉదయాన్నే పదిగంటలకల్లా పోలీస్ స్టేషన్ కి వెళ్లింది అర్పిత. 
ఇన్స్పెక్టర్ సురేందర్ అర్పితను చూసి ''అరే…అప్పుడే వచ్చారా?"
''ఎలా ఉన్నారు డాడీ ? బ్యాక్ టు నార్మల్ కదా !'' 
''బావున్నారు. అసలేం జరిగింది సర్ ! " అడిగింది అర్పిత ఆత్రుతగా 
ఇన్స్పెక్టర్ కేసు గురించి సీక్వెన్షియల్ చెప్పడం మొదలెట్టాడు.                                                                                                                                  * * * * *  
గాంధీనగర్ పోలీస్ స్టేషను. ముందురోజు రాత్రి తొమ్మిది గంటలు.
ఇన్స్పెక్టర్ సురేందర్, సబ్ ఇన్స్పెక్టర్లతో కూర్చుని రాఘవరావు మిస్సింగ్ కేసు ప్రోగ్రెస్  చర్చిస్తున్నారు. ఆయన మొబైల్ రింగయింది. ఫోను ఎత్తాడు ఇన్స్పెక్టర్. 
''హలో గుడ్ ఈవెనింగ్ సర్ ! 
యాదయ్య, కానిస్టేబుల్ ఆన్ సర్వైలెన్స్ డ్యూటీ రిపోర్టింగ్ ఫ్రమ్ బాలాజీ అపార్ట్ మెంట్ సర్! ఆ ఫ్లాట్ లోపల ముగ్గురో, నలుగురో పిల్లలున్నారు సర్. ఇద్దరు పిల్లలు  రెండుసార్లు బయటకు వచ్చి మళ్ళీ లోనికి వెళ్లి తలుపు బంద్ చేశారు సర్! ఫ్లాట్ లో ఉండే ఇద్దరు పిల్లలు బయటకెల్లలే. వాళ్ళ పేరెంట్స్ ఊరికి పోయింరంట. రెండు మూడు రోజులుదాకా రారంట. మస్తు అనుమానంగా ఉంది. మీరు జల్దీ వచ్చేయండి...సార్ !" అన్నాడు యాదయ్య 
''సరే, యాదయ్యా ! అలర్ట్ గా ఉండు. పది నిముషాల్లో అక్కడుంటాం '' అని ఫోను కట్ చేసి టైం చూసుకున్నాడు ఇన్స్పెక్టర్ సురేందర్. టైం తొమ్మిది గంటల ముఫై నిముషాలవుతోంది. 
వెంటనే తను, ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుళ్ళతో బాలాజీ అపార్ట్ మెంట్ కి చేరుకున్నారు 
'గేటు దగ్గరినుంచి సెక్యూరిటీ గార్డ్ ని తీసుకుని థర్డ్ ఫ్లోర్ కి వెళ్లారు. అపార్ట్ మెంట్ 
ఫ్లోర్ పాసేజ్ పొడుగ్గా ఉంది. అక్కడక్కడ లైట్స్ వెలగక పోవడంతో అంతగా వెలుగులేదు.
చేయి ఊపాడు ఫ్లోర్ చివరనుంచి ముఫ్టీలోఉన్న కానిస్టేబుల్ యాదయ్య. 
పోలీసులు ఆ టైంలో రావడంతో అదే ఫ్లోర్ లో బయట కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు రెసిడెంట్స్ పోలీసుల వెనకాలే నడుస్తూ ''ఎనీ అప్డేట్ సర్ రాఘవరావుగారి కేసులో ... " అని అడగడంతో వారికి సమాధానం చెప్పకుండా ''ప్లీజ్ ఫాలో మీ'' అంటూ వారిని తనతో రమ్మని సైగ చేశాడు ఇన్స్పెక్టర్.  
ఏదో జరుగుతోందన్న ఉత్సుకతతో ఇద్దరు రెసిడెంట్స్ పొలిసు వారి వెనకాలే నడిచారు .
మఫ్టిలో ఉన్న కానిస్టేబుల్ యాదయ్య తను సర్వైలెన్స్ చేస్తున్న అనుమానాస్పద  ఫ్లాట్ తలుపుతట్టాడు.  
మిగతావారంతా ఓ పక్కగా గోడకానుకుని నిలబడి నిశ్సబ్దంగా గమనిస్తూ ఉన్నారు. ఫ్లాట్ తలుపు కొద్దిగా తెరుచుకుంది. 
సుమారు పదిహేను,పదహారు  సంవత్సరాల వయసున్న కుర్రాడు తల కొద్దిగా బయటపెట్టి 'కౌన్ హై... హూ ఈజ్ దట్ ? అన్నాడు రెండు భాషల్లో.
"మీ డాడీని పిలువమ్మా...నన్ను రమ్మన్నారు'' అన్నాడు కానిస్టేబుల్
''డాడీ  ఈజ్ అవుట్  అఫ్  స్టేషన్ .. హి  విల్  కం  డే  ఆఫ్టర్  టుమారో.. యు  కం  లేటర్ !'' అని విసురుగా తలుపు మూశాడు. కానిస్టేబుల్ తన ఎడంకాలు తలుపు కడ్డంగా బెట్టి తలుపు బలంగా లోనికి నెట్టి  
''ఇంట్లో పెద్దవాళ్ళుంటే పిలువు బాబూ... పనిఉంది" అని రెండుచేతులతో తలుపును  బలంగా తెరిచి  పట్టుకుని తలలోనికి ఉంచి ఇంట్లోకి చూశాడు కానిస్టేబుల్.
''ఇంట్లో ఎవరూ లేరు. నేనొక్కడినే ఉన్నాను. మా పేరెంట్స్ ఊరి కెళ్ళారు'' అన్నాడా కుర్రాడు తలుపుమూయడానికి నెడుతూ ...  
కానిస్టేబుల్ తలుపు బలంగా వెనక్కి నెట్టడంతో ''హేయ్...వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్...ఐ విల్ కాల్ పోలీస్'' అంటూ లోపలి నుంచి వచ్చిన ఇంకొక కుర్రాడితో కలిసి మఫ్టీలో ఉన్నకానిస్టేబుల్ ని బయటకు నెట్టడానికి ప్రయత్నం చేస్తుండగానే, యూనిఫార్మ్ లో ఉన్న పోలీసులు గుమ్మం ముందుకు వచ్చి తలుపు పూర్తిగా తెరిచారు. 
ఇన్స్పెక్టర్ ఇద్దరు రెసిడెంట్స్ కి  చెప్పాడు. రాఘవరావుని ఆ ఫ్లాట్లో బందీగా ఉంచినట్లుగా ఇన్ఫర్మేషన్ ఉందని, లోపలి వెళ్లి చూడమని. 
ఇంతలో తలుపు తీసిన కుర్రాడు సడెన్ గా బయటకు వచ్చి మెట్ల వైపు పరుగెత్తాడు. 
అనుకోని సంఘటనకు ఇద్దరు రెసిడెంట్స్ బిత్తరపోయి చూస్తుండగానే కానిస్టేబుల్ పరుగెత్తి 
ఆ కుర్రాడిని పట్టుకువచ్చాడు. తన పేరు సంజీవ్ అని, ఫ్లాట్ లో నితిన్, వికాస్, దుశ్యంత్ వున్నారని చెప్పాడు. 
ఇన్స్పెక్టర్ సురేందర్, కానిస్టేబుళ్లు, ఇద్దరు రెసిడెంట్స్ ఫ్లాట్ లోనికి వెళ్లారు. 
ఒక్క బెడ్ రూం మినహా ఫ్లాట్ లో వేరే రెండు బెడ్ రూములు తెరిచే ఉన్నాయి.
''నాకేమీ తెలీదు. నన్నొదిలేయండి. నితిన్, వికాస్,...వాళ్లిద్దరే అంకుల్ని గదిలో ఉంచారు'' అని గింజుకుంటూ పెద్దగా ఏడుస్తూ చెప్పాడు సంజీవ్.  
తలుపుతీసిన కుర్రాడితో మాట్లాడి వివరాలు సేకరించి వికాస్, సంజీవ్, దుశ్యంత్ పేరెంట్స్ ని ఫ్లాట్ కి పిలిపించాడు ఇన్స్పెక్టర్.

ఒక బెడ్ రూం లోపలినుంచి క్లోజ్ చేసి ఉంది. ఇన్స్పెక్టర్ చేసిన సైగ తో ఒక రెసిడెంట్ తలుపు కొట్టి ''నితిన్! నేను ప్రకాష్ అంకుల్ ని మాట్లాడుతున్నాను. మీ డాడీ ఫోన్ లో ఉన్నారు మీతో మాట్లాడాలట'' అన్నాడు. 
తలుపు తీశాడు నితిన్. అతని వెంట వికాస్ ఉన్నాడు. వెంటనే కానిస్టేబుల్, ఇద్దరు రెసిడెంట్స్, తరువాత ఇన్స్పెక్టర్ లోనికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి అందరు ఆవాక్కయ్యారు. 
రాఘవరావు చేతులు, కాళ్ళు వెనక్కికుర్చీకి  కట్టేసి, ఆ కుర్చీని ఒక మూలగా ఉంచారు. ఆయనకు డైనింగ్ టేబుల్ అడ్డుగా పెట్టారు. నోటికి ఎధెసివ్  గమ్ టేప్ వేసి ఇద్దరు కుర్రాళ్ళు కాపలా 
ఉన్నారు. ఇంట్లో మొత్తం నలుగురు కుర్రాళ్ళు  ఉన్నారు. అక్కడి దృశ్యం అంతా వీడియో, ఫోటోలు తీశాడు కానిస్టేబుల్.
సబ్ ఇన్స్పెక్టర్ రాఘవరావు కట్లు విప్పాడు. ఒక రెసిడెంట్ లోనికి వెళ్లి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. మొత్తం నలుగురు పిల్లలు వంచిన తలలు పైకి ఎత్తడం లేదు.
''ఎలా ఉన్నారు సర్! మీ ఫ్లాట్ దాకా నడచే ఓపిక ఉందా ? దెబ్బలేమైనా తగిలాయా ? హాస్పిటల్ కి వెళదామా" అని రాఘవరావుని అడిగాడు ఇన్స్పెక్టర్. 
''లేదు. దెబ్బలేమీ లేవు ... నడవగలను. హాస్పిటల్ అవసరం లేదు '' అంటూ లేచి నిలబడుతూ  తూలి పడబోయారు రాఘవరావు.  
కానిస్టేబుల్ ఆయన భుజాలచుట్టు చేయివేసి సోఫాలో కూర్చోబెట్టి ఆయన పక్కనే నిలబడి ఉన్నాడు. 
మంచినీళ్లు త్రాగి, రాఘవరావు కుడి చేత్తో ముఖం తడుముకుని, ఎడం భుజాన్ని కుడిచేత్తో వత్తుకున్నారు.
సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఆ గది క్షుణ్ణంగా సోదా చేసి, వారు వాడిన ఎధెసివ్ టేప్ రోల్ ని, ప్లాస్టిక్  తాళ్ళను, రాఘవరావు కట్టేసిన కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. పిల్లల నలుగురి జేబులు సోదా చేసి వాళ్ళ దగ్గరనుంచి రెండు మొబైల్ ఫోనులు స్వాధీనం చేసుకుని పిల్లల పేరెంట్స్ ని కాంటాక్ట్ చేశారు పోలీసులు.
నితిన్  పేరెంట్స్ ఢిల్లీలో ఉన్నామని, ఉదయమే పోలీసు స్టేషన్ కి వచ్చి కలుస్తామని చెప్పారు.  రెసిడెంట్ ప్రకాష్ వారితో మాట్లాడారు. 
కొద్దిగా తేరుకున్న రాఘవరావుగారు లేచి తను వెళ్తానని ఆ పిల్లలని అరెస్ట్ చేయవద్దని, మరుసటి రోజు పిల్లలని ప్రశ్నించమని పోలీస్ ఇన్స్పెక్టర్ ని రిక్వెస్ట్ చేశాడు. 
''మంచితనానిక్కూడా హద్దుండాలి. ఇలాటి వాళ్ళు మంచితనాన్నిఅసమర్ధత, చేతగానితనంగా తీసుకుని రెచ్చిపోతూ ఉంటారు. మీకేమైనా అయివుంటే పరిస్థితి ఏమిటి ? వీక్ హార్ట్ వాళ్ళవుతే ఏదైనా జరగొచ్చు. లా  విల్  టేక్  ఇట్స్ ఓన్  కోర్స్'' అన్నాడు ఇన్స్పెక్టర్.    
రాఘవరావు ఇంటికి వెళతానని లేవడంతో ఆయనకు ఎస్కార్ట్ గా ఫ్లాట్ వరకు నడిచి "మీరిప్పుడు వెళ్ళండి. రేపు స్టేషనుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళండి" అని రాఘవరావు ఇంట్లోకి వెళ్ళిన దాకా వేచి చూసి, ఫ్లాట్ కి  తిరిగి వచ్చాడు ఇన్స్పెక్టర్. 
పంచనామా, స్టేటుమెంట్లు అయ్యేసరికి తెల్లవారింది. ఉదయాన్నే నలుగురు జువనైల్ దోషుల్నిస్టేషనుకి తరలించారు పోలీసులు. వారివెంట కొందరు పేరెంట్స్,వెళ్లారు.    
                                                                       * * * * *
''అదమ్మా జరిగిన కధ"' అన్నాడు ఇన్స్పెక్టర్ .
''డాడీనే  ఎందుకు కిడ్నాప్ చేశారు? అదే మీ భాషలో... మోటివ్ ఏమిటి? మీరా టైంకి వెళ్ళకపోతే ఏం జరిగేది ? అన్నది ప్రశ్నలుగానే ఉండిపోయయికదా ?'' అంది అర్పిత కుతూహలంగా. 
''సమాధానం నేను చెప్పేకంటే మీరే వినండి'' అంటూ కాలింగ్ బెల్  నొక్కాడు ఇన్స్పెక్టర్.
''సర్'' అంటూ స్టిఫ్ గా సెల్యూట్ చేశాడు లోనికి వచ్చిన కానిస్టేబుల్. 
''ముందుగా ముగ్గురు పేరెంట్స్ ని, సాక్షులని లోనికి పంపించు. తరువాత ఒక్కొక్క పిల్లాణ్ణి పంపించు"
ఐదుగురు లోనికి వచ్చి కూర్చున్నారు. 
ముందుగా నితిన్ లోనికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.   
"రాఘవరావుగారి నెందుకు, ఎలా కిడ్నాప్ చేశారు? " అడిగాడు ఇన్స్పెక్టర్.
"పేరెంట్స్ ఎవరూ మాట్లాడవద్దు. వార్నింగ్ టు యూ ఆల్ ! నలుగురి దోషుల స్టేట్ మెంట్స్ ఆర్  రికార్డెడ్ ఇన్ వీడియో ఇన్ ప్రెజెన్స్ అఫ్ పేరెంట్స్ అండ్ విట్నెసెస్ ... కమాన్ ప్రొసీడ్. నితిన్ !'' అన్నాడు ఇన్స్పెక్టర్.
"సర్ ! చిన్న పిల్లలు....ఇదంతా ఆక్సిడెంటల్ గా జరిగింది. కేసు వద్దు సర్! పిల్లల ఫ్యూచర్ ..." అన్నాడు నితిన్  ఫాదర్ 
"నేరం పిల్లలు చేశారా... పెద్దవాళ్లు చేశారా కాదు. నేర తీవ్రతను బట్టి కేసు దోషులపై రిజిస్టర్ అవుతుంది. 
ఈ కేసు చిన్నది కాదు. ఆక్సిడెంటల్ అంతకన్నా కాదు. మీ పిల్లలు, మీరు అదృష్టవంతులు. రాఘవరావుగారికేమీ కాలేదు ... ముందు మీ పెంపకం గురించి ఆలోచించండి!" కరకుగా అన్నాడు ఇన్స్పెక్టర్. 
"కమాన్  నితిన్ ప్రొసీడ్" అన్నాడు ఇన్స్పెక్టర్ .  
''సర్! రాఘవరావు అంకుల్ మమ్ముల్ని సతాయించేవాడు. అపార్టుమెంటులో క్రికెట్ ఆడినా, ఫుట్ బాల్ ఆడినా గ్లాసెస్ పగుల్తాయని, వాకింగ్ చేసేవారికి దెబ్బలు తగుల్తాయని. సైకిల్ రేసింగ్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేసివాడు. ఆయన వల్ల మామా ఆటలకి ఫ్రీడమ్ ఉండేది కాదు.  
రీసెంట్ గా ఒకరోజు అపార్టుమెంటులో ఒక పెయింటర్ పనయ్యాక వెళుతూ మిగిలిన పెయింట్ డబ్బాలు, బ్రష్ లు సెల్లార్ పార్కింగ్ లో పెట్టి వెళ్ళడం మేము చూశాము. 
''మేము ...అంటే ఎవరెవరు?" కరకుగా అన్నాడు ఇన్స్పెక్టర్. 
''నేను, సంజీవ్'' 
"తరువాత... " 
"ఆ పెయింట్ ని ఏదైనా వాల్ కి వేద్దామనుకున్నాము. మరుసటి రోజు ఆదివారం. నేను, సంజీవ్ కలిసి సెల్లార్ లో ఒక కార్నర్ వాల్ కి పెయింట్ వేస్తుంటే జారి, స్పిల్ అయి పక్కన కార్ విండ్ షీల్డ్ మీద పడ్డది. ఆ పెయింట్ తుడిచాము. కారు గ్లాస్ మీద అక్కడక్కడ పెయింట్ డ్రై అయింది. 
ఆ కారు ఓనర్ సొసైటీ కి కంప్లంట్ చేశాడు. దాంతో సి. సి కెమెరాలు లేవు. ఎవరు వేస్తున్నారో తెలియక సొసైటీ లో బాగా అల్లరయ్యేది. వుయ్ హేడ్ గ్రేట్ ఫన్. అలా వీలుదోరికినప్పుడెల్లా సీక్రెట్ గా ఏదో ఒక కార్ విండ్ షీల్డ్ మీద పెయింట్ వేశాము. అలా అయిదు కార్ల గ్లాస్ మీద పెయింట్ వేశాము. ప్రతిసారీ గొడవయ్యేది. మేం నలుగురం నవ్వుకునే వాళ్ళం.
''పెయింట్ వేసిన మిగతా ఇద్దరి పేర్లేమిటి ?"ఇన్స్పెక్టర్ గట్టిగా అడిగాడు.
"వికాస్, దుశ్యంత్" అన్నాడు నితిన్. 
"తరువాత ఏమైంది ?"
"ఆ పెయింట్ మేమే వేశామని సొసైటీ మీటింగ్ లో మా డాడీ అడ్మిట్ చేశారు. మా డాడీకి సొసైటి వాళ్ళు పెనాల్టీ వేశారు. కార్ల పెయింట్ క్లీనింగ్ ఖర్చంతా డాడీ మీద పడ్డది. పనిష్మెంట్ గా డాడ్  'పాకెట్ మనీ' ఇవ్వడం మానేశారు. 
ఇదంతా  రాఘవరావు అంకుల్ కంప్లయింట్ వల్లే జరిగిందని మేము నలుగురం అనుకున్నాము. 
కమ్యూనిటిలో మేం 'బేడ్ బోయ్స్' అయ్యాము. పాకెట్ మనీ పోయింది. ఓనర్, అపార్టుమెంటు వెకేట్ చేయమన్నాడు. అందుకే అంకుల్ కి  వార్నింగ్ ఇద్దామని మా ఫ్లాట్ కి  తీసుకెళ్ళాను.
"అంకుల్ అంటే ఎవరు"? రెట్టించి అడిగాడు ఇన్స్పెక్టర్. 
"రాఘవరావు అంకుల్" వారు స్పష్టంగా చెప్పిందాకా రెట్టించాడు ఇన్స్పెక్టర్. 
"కంటిన్యూ..." అన్నాడు ఇన్స్పెక్టర్.
"అంకుల్ కి వార్నింగ్ ఇచ్చి వెంటనే వదిలేద్దామనుకున్నాము. వదిలేయడానికి వీల్లేకుండా మా ఎదురు ఫ్లాట్ లో  ఫంక్షన్ కి వచ్చిన వారు మా ఫ్లాట్ ఎదురుగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు.  సాయంత్రం వరకు క్రౌడెడ్ గా ఉంది. అప్పటికే అంకుల్ కిడ్నాప్ అయినట్లు కమ్యూనిటీలో గొడవ అవుతోందని, పోలీసులు వచ్చారని తెలిసింది. అదీగాక సెక్యూరిటీ గార్డ్ అక్కడే తిరుగుతూ ఉండడం వల్ల అంకుల్ ని వదలడానికి భయపడ్డాము. అంతేగాని ఆయన్ని మేము కట్టివేయాలనుకోలేదు. అంతా ఆక్సిడెంటల్ గా జరిగింది.  కావాలని చేసింది కాదు. ఇదంతా నావల్లే జరిగింది. తప్పంతా నాదే. ఇక ఎప్పుడూ ఇలాటి పని చేయను. మమ్ముల్నివదిలేయండి ప్లీజ్"అంటూ బావురుమని ఏడుపు మొదలెట్టాడు నితిన్.
''ఆయనను మీ ఫ్లాట్ లోనికెలా తీసుకు వెళ్ళారు ?" అడిగాడు ఇన్స్పెక్టర్ నితిన్ ముఖంలోకి నిశితంగా చూస్థూ.
''అంకుల్ ఉదయాన్నే వాకింగ్ నుంచి తిరిగిరావడం గేట్ దగ్గరే ఉన్ననేను చూశాను. 
ఆయన లిఫ్ట్ ఎక్కుతుంటే నేను లిఫ్ట్ ఎక్కి ఆయనతో మాటలు కలిపాను. ఇంట్లో దేవుడి ఫోటో ఎక్కడ ఫిక్స్ చేయాలో తెలవడంలేదు. అంకుల్ ని ఒకసారి వచ్చి వెళ్ళమని మామ్ చెప్పిందని చెప్పి ఫ్లాట్ లోకి తీసుకువచ్చాను.అంకుల్ లోనికి రాగానే వికాస్ తలుపు క్లోజ్ చేశాడు. 
అప్పుడే సంజీవ్ వచ్చి "ఎదురు ఫ్లాట్ లో ఏదో ఫంక్షన్ అవుతోంది. చాలామంది 
ఫ్లాట్ ఎదురుగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు అంకుల్ ని వదిలేస్తే ఆయన బయటకు వెళ్లి అందరికీ చెబితారేమో" అన్నాడు    
"ఆయన ఎవరికి చెప్పనని, తనని వదలమని గట్టిగా అనడంతో భయపడి నేనే అంకుల్ నోటికి టేప్ వేశాను. నలుగురం కలిసి ఆయన్ని కుర్చీకి కట్టేసి డైనింగ్ టేబుల్ అడ్డంగా జరిపాము. సాయంత్రం వరకు ఎదురు ఫ్లాట్ లో ఫంక్షన్ అవుతూనేవుంది. సెక్యూరిటీ గార్డ్, మరొక వ్యక్తి  అక్కడక్కడే తిరుగుతున్నారు. అందుకే అంకుల్ ని వదలడం కుదరలేదు" అన్నాడు నితిన్  
మిగతా ముగ్గురు పిల్లలు ఇంచు మించు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు.  
''అదీ యదార్ధంగా జరిగిన సంగతి'' అన్నాడు ఇన్స్పెక్టర్.
''ఇంకొక విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు'' అంది అర్పిత 
''షూట్...'' అన్నాడు ఇన్స్పెక్టర్.
''ఈ పిల్లలే డాడీని కిడ్నాప్ చేశారన్నడౌట్ మీకెలా వచ్చింది?" అంది అర్పిత ఇన్స్పెక్టర్ వంక సూటిగా చూస్తూ.   .
''ఏ కిడ్నాప్ కైనా మోటివ్ ఉంటుంది. అదేదో తెలిస్తే గాని కేసు సాల్వ్ కాదు. ఈ కేసులో నెగటివ్ ఎవిడెన్స్ లేదు. సో... బయటవాళ్లు చేసిన కిడ్నాప్ కాదని నిర్ధారణకు వచ్చాము. తరువాత  ఫ్రెండ్స్, బంధువులు. మీతో మాట్లాడాక అదీ రూల్ అవుటయింది. మిగిలింది అపార్టుమెంట్ లోవారు. అక్కడా రాఘవరావు గారి మీద ఎటువంటి నెగటివ్ రిపోర్ట్ లేదు. 
సెక్యురిటి గార్డ్ ఒకడు చెప్పాడు. కమ్యూనిటీ లో నలుగురు అల్లరి పిల్లలు ఉన్నారని... వాళ్ళకి రాఘవరావు సారంటే కోపమని చెప్పాడు. ఆ చిన్న'క్లూ' తో ఆ నలుగురు పిల్లల మీద, ఆ ఫ్లాట్ మీద  నిఘా ఉంచాము. తరువాత ఏం జరిగింది మీకూ తెలుసు" అంటూ ముగించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్.
"కంప్లైంట్ విత్ డ్రా చేసుకొమ్మన్నారు డాడీ" అంది అర్పిత.
"నాకూ అదేమాట చెప్పారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఆయన సేఫ్ గా వచ్చారు కాబట్టి మీ అందరికీ కేసు తీవ్రత తెలియడంలేదు. వీక్ మైండ్ మనుషులవుతే అలాటి సిట్యుయేషన్ లో ఏదైనా కావచ్చు. ఎనీహౌ మీ ఇష్టం. రాఘవరావుగారిని స్టేషన్ కి వచ్చిస్టేటుమెంటు యిమ్మన్నాను. ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశాము. మీరేం చేయదలుచుకున్నా వ్రాత పూర్వకంగా యివ్వండి. కోర్ట్ నిర్ణయం తీసుకుంటుంది. మా చేతుల్లో ఏమీ లేదు" స్పష్టంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ సురేందర్. 
                                        
                                                 * * * * *   సమాప్తం   * * * * *                                                                  
                         

  
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
Mob. No.9849118254                         
           




14, సెప్టెంబర్ 2021, మంగళవారం


                                                                   ఆపన్నులు 
                                                                  ==========  

సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నర గంటలు. రాజగోపాలస్వామి గుడి గంట ఠంగ్…ఠంగ్ మంటూ వాయులీనమైన ప్రతిధ్వనితో మ్రోగింది. ఆరోజుకిక గుడి ద్వారం మూసి తాళంవేసి భక్తులందరూ వెళ్ళారా లేదానని చూశాడు పూజారి తిరువనంతాచార్యులు. లైట్లన్నీఆర్పి ఆలయపు ఆవరణలోనే మిద్దెపైనున్ననివాసానికి వెళుతూ చావడి మూలన ఏదో ఆకారం కదిలినట్లనిపించి లైట్ వేశాడు. ఎవరో వ్యక్తి  గోడనానుకుని కాళ్ళు జాపి కూర్చుని జోగుతున్నట్లనిపించి ''ఎవరదీ?" గద్దించి అడిగాడు పూజారి. అతన్నుంచి సమాధానం లేదు.  
''గుడి మూశాను ... ప్రసాదం అయిపోయింది. అందరూ వెళ్లారు. మీరు కూడా వెళితే బయట తలుపులు మూస్తాను" అన్నాడు పూజారి. 
అతనిలో కదలిక లేదు. కంగారుగా నాలుగంగల్లో అతన్ని చేరి మసక వెలుతురులో పరికించాడతణ్ణి. వయస్సు సుమారు ఏభై ఐదు, అరవై సంవత్సరాల మధ్య ఉంటాయి. పొట్టి లాల్చీ, జీన్స్ ప్యాంటులోఉన్నాడు.
చేతికి ఖరీదయిన వాచీ, ఉంగరపు వేలుకి వజ్రపుటుంగరం. పక్కనే బ్యాక్ ప్యాక్. 
ఉన్నవాడిలా కన్పించాడతను. తక్షణం అతని చేయి నందుకుని 'నాడి' పరీక్షించాడు.  మెల్లగా కొట్టుకుంటోంది. ఆయుర్వేద వైద్యంలో ప్రవీణుడయిన పూజారి తిరువనంతాచార్యులకి స్పష్టమయింది ఆవ్యక్తి  తినక నీరసంతో స్పృహకోల్పోయాడని.
భార్య పారిజాతంను కేకేసి "త్వరగా గ్లాసెడు మంచినీళ్లు తీసుకురా" బిగ్గరగా అరిచాడు పూజారి, మిద్దెపైనున్న భార్యకు వినిపించేలా. పరుగున మంచినీళ్ళు తెచ్చిందావిడ. 
నీళ్లు చిలకరించాడతని మొహాన పూజారి. 
అతని కనురెప్పలు కదిలాయి. మెల్లగా కదిలాడు. కదులుతున్న కనుగుడ్ల ఆనవాలు కనురెప్పలపైనుంచి పసిగట్టి, గట్టిగా తడుతూ అతన్నిస్పృహలోనికి రప్పించే ప్రయత్నం చేశాడు పూజారి. 
నీరసంగా కళ్లు తెరుస్తూనే పూజారి వంక చూస్తూ ''అనంతూ!'' అన్నాడతను హీన స్వరంతో. 
ఆ పిలుపుకు అనూహ్యంగా స్పందించింది అనంతాచార్యులు హృదయం. 
మనసు ఉత్తేజితమయిందిఒళ్ళు గగుర్పాటు చెందింది. వివశుడయ్యాడు పూజారి.         
ముప్ఫై అయిదు సంవత్సరాలపైమాటే అతనా పిలుపువిని. 
"ప్రకాశం...నువ్వా."!? ఒళ్ళు తెలియని ఉద్వేగంతో లేచి ఒంగుని ప్రకాశం భుజాలు పట్టుకుని కుదుపుతూ మోకాళ్ళమీద నిలిచి, అతని తల వెనకాలగా ఎడమచేతిని ఊతంగా చేర్చి కాసిన్ని మంచినీళ్లు పట్టాడతనికి.  
కొద్దిగా తేరుకుని కళ్ళు తెరిచి కొద్దిగా వెనక్కి జరిగి నీరసంగా గోడకు జేరగిలబడ్డాడు ప్రకాశం. 
"పారిజాతం! కొద్ది పంచదార వేసి త్వరగా వేడిపాలు తీసుకురా" అని భార్యకు చెప్పాడు 
తిరువనంతాచార్యులు. 
వేడి పాలుత్రాగి కొద్దిగా తేరుకున్నతను "అనంతూ... నీలో పెద్దమార్పేమీ లేదు. వయస్సు ఛాయలు కనబడుతున్నాయి. అంతే! నన్ను గుర్తించలేదు కదూ!" రహస్యం చెబుతున్నట్లుగా మెల్లగా అన్నాడు ప్రకాశం
"తరువాత మాట్లాడదాం ప్రకాశం! ఎప్పుడు తిన్నావు?" ప్రశ్నించాడు తిరువనంతాచార్యులు.
"నిన్నఉదయం భోజనం చేశాను. తరువాత ఏమీ తినలేదు. గుడి లోనికి వస్తూనే కళ్ళు తిరిగినట్లనిపించింది. ఈ మూలకు వచ్చి గోడకానుకుని కూర్చున్నాను. తరువాత ఏమైందో తెలియదు" అన్నాడు ప్రకాశం. 
"నీరసంగా ఉన్నావు. కొద్దిగా తిని, విశ్రాంతి తీసుకుందువుగాని. ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు" అంటూ ప్రకాశానికి చేతినందించి మిద్దె పైన తనింటికి  తీసుకెళ్లాడు తిరువనంతాచార్యులు. 
                                                                   * * * * *        
తెల తెలవారుతూనే గుడి గంటలు, సుప్రభాత మంత్రాలు వినబడ్డాయి ప్రకాశానికి. లుంగలు చుట్టిన పాత దూది పరుపు మీద చిరుగుల తెల్లటి చలువ దుప్పటి, కొసలు వ్రేలాడుతున్న తెల్లటి గలీబులో గట్టి పల్చని దిండు. పేదరికం తాండవిస్తూ కనిపించిందా ప్రదేశం. పక్కనే ఇంకొక పరుపు చుట్టేసి ఉంది. 
'ఓ! ... రాత్రి అనంతు ఇక్కడే పడుకుని లేచి వెళ్లినట్లుంది' అనుకుంటూ రాత్రి జరిగినదంతా మననం చేసుకుని, లేచి కూర్చుని పరిసరాలు పరికించి చూశాడతను. 
గోడలకి తాపడం చేసిన చైనా పింగాణీ టైల్స్, బెల్జియం అద్దాలతో నిగలాడుతూ ఉండే ఆ అద్దాలచావడిని శిధిలావస్థలో చూసి చలించిపోయాడు ప్రకాశం. 
గోడలుకున్న టైల్స్ ఊడి సున్నపు తాపడం పెచ్చులు ఊడుతున్న గోడలు, 
నెర్రెలు బాసి ఎర్రటి తారసు బిళ్ళలు జారి ఊడి పడేట్లుగా ఉన్న పైకప్పు, జీవంపోయి ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా వుంది. మాసిన చావడిలో మూసివున్న రెండు పడక గదులు.  ఇంకొక పక్క నల్లమద్ది భోషాణం, పాత పందిరిమంచం, మూలగా చేతులు విరిగిన టేకు కుర్చీల కుప్ప, ఆ మిద్దె  ఒకప్పటి వైభవానికి సాక్షీభూతంగా పడివున్నాయి. కిటికీ నుంచి కనిపించే పూలతోట, తులసి వనం, పెద్ద నందివర్ధన చెట్టు మాయమయ్యాయి. తోట చుట్టూవున్న ప్రహరీ గోడ ఆనవాళ్లులేవు. 
పిల్లల ఆటస్థలమైనట్లుగా వుంది. వేప, రాగి, ఉసిరి వృక్షాల ఉనికే లేదు. 
అదే ఆవరణలో బాల్యంలో తిరుగాడిన జ్ఞాపకాలు దొంతర్లుగా ప్రకాశం బుర్రలో తిరుగాడాయి.
                                                            * * * * *
"అనంతూ! ఈ రోజు సినిమాకెళదాం" పన్నెండో తరగతి సంవత్సర చివరి పరీక్షవుతూనే అన్నాడు ప్రకాశం. 
"వెళదాం గాని ఏమైంది మీ నాన్నగారి తిరుగు ప్రయాణం?"  అన్నాడు అనంతు 
"అదే అనంతూ ! ఎలా చెప్పాలో అర్ధంగావడం లేదు. నాన్నగారొక్కరే అమెరికా వెళతారనుకున్నాను. కాదట! కుటుంబం అందరం వెళ్ళితున్నామట. ఇక నా చదువక్కడే. 
మళ్లీ వస్తామో, రామో... తెలీదనంతూ !" అంటూ అతన్నిచుట్టుకుని బావురుమన్నాడు ప్రకాశం.   అనంతు ముఖం ఒక్కసారిగా వివర్ణమైంది. 
ప్రాణస్నేహితుడు తనని వదలి వెళ్లిపోతున్నట్లుగా అర్ధమయింది. కాళ్లక్రింద భూమి 
కదులుతున్నట్లనిపించిందతనికి. 
'నాచదువంతటితో ముగిసినట్లేనా ? ఇన్నాళ్లు ఖర్చు భరించి చదివించిన స్నేహితుని తండ్రి వెళ్లిపోతున్నారు. భవిష్యత్తు అర్ధం కావడంలేదు' అనుకుంటూ  
"కలిసి బి.ఇ చేద్దామనుకున్నాం కదా! చదువక్కడే అంటావేంటి ? తిరిగి రావడంలేదా?  
మరి ఆస్తి, ఇల్లు, గొడ్లు... ?" తిరిగివస్తామని చెబుతాడేమోనన్న గంపెడాశతో అన్నాడనంతు.   
మౌనంగా నేలచూపులు చూస్తున్న ప్రకాశాన్ని చూసి "అవును కదా! ఆవిషయాలు నీకెలా తెలుస్తాయి? మన చేతిలో ఏముంది. పెద్దవాళ్ళ నిర్ణయం. మనమేం చేయగలం" అన్నాడు అనంతాచార్యులు పరిస్థితనవగతం చేసుకుని నిట్టూరుస్తూ. 
"నిజంగా ఆవిషయాలు నాకు తెలియవనంతూ! నాన్నగారినడిగాను, నీ చదువుగురించి ఫీజులగురించి..." మొహమాటంగా అన్నాడు ప్రకాశం. 
"ఆయనేమన్నారు ?"
"నీ వెంతవరకు చదివితే అంతవరకూ తనే చదివిస్తానన్నారు. వెళ్ళేలోపు కొంత డబ్బు మీ నాన్నగారికిచ్చి నీ చదువు విషయం మాట్లాడతానన్నారు" అన్నాడు ప్రకాశం. 
అనంతు ముఖం వికసించింది.        
ఆ వారం రోజులు సినిమాలు, షికార్లు ఒకర్నొకరు వదలకుండా తిరిగారిద్దరు స్నేహితులు.
                                                                * * * * *
ప్రకాశం వెళ్లే రోజు రానేవచ్చింది. తిరువనంతాచార్యుల చదువుకయ్యే మొత్తం ఖర్చుతనే భరిస్తానని భరోసాఇచ్చి, చదువు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపవద్దని చెప్పి కొంత డబ్బు ఇచ్చివెళ్లారు ప్రకాశం నాన్నగారు. చిన్ననాటి నుంచి కలిసి చదుకున్నప్రాణస్నేహితులు అలా విడిపోయి 
'చికాగో' వెళ్ళిన ప్రకాశం ఇప్పడిలా ప్రత్యక్షమయ్యాడు దేవాలయంలో.   
                                                               * * * * *
ప్రకాశం నిద్రలేచాడో లేదో చూద్దామని అక్కడికొచ్చిన పారిజాతం 
"లేచారా బాబూ! గుడి వెనకాల చేద భావి ఉంది. బ్రష్ చేసుకుని వస్తే కాఫీ ఇస్తాను" అని చెప్పివెళ్ళింది పారిజాతం.  
"అలాగేనమ్మా!" అంటూ లేచి పక్కబట్టలు మడత బెట్టి బ్యాగ్ తో కిందకు వెళ్లి బ్రష్ చేసుకుని, మొండిగోడల బాత్రూమ్ లో స్నానం చేసి పైకి వచ్చేసరికి  గుళ్లో పూజ ముగించుకుని వచ్చాడు తిరువనంతాచార్యులు.
తేరిపార చూశాడు ప్రకాశం స్నేహితుని వంక.  
రాని వయస్సు ముఖంలో కనబడుతున్నా తరగని ముఖ వర్చస్సు, చెరగని చిరునవ్వు, ఉంగరాలు తిరిగి భుజాలమీదకు జారిన వత్తైన నల్లటి జులపాల జుట్టు, నిగ నిగలాడే నల్లటి విగ్రహం, దిద్దిన  తిరునామాలు! 
అప్రయత్నంగా లేచి నిలబడి తలవంచి రెండుచేతులు జోడించి నమస్కారం చేశాడు ప్రకాశం. 
ప్రతి నమస్కారం చేసి రెండుచేతులు పైకెత్తి "ఆయుష్మాన్ భవ'' అని అలవాటుగా  దీవించి, ప్రకాశం చేతిని పట్టుకుని పరీక్షించి "నాడి నిక్షేపంలా వుంది. ఇక చెప్పరా... ప్రకాశం!" అన్నాడు తిరువనంతాచార్యులు . 
ఇంతలో పారిజాతం కాఫీ తేవడంతో ఇద్దరు కాఫీ ముగించుకుని హాలులో కూర్చున్నారు. 
"నోరు జారాను. ఏమీ అనుకోవద్దు ? ఏమిటీ రాక ? ఎక్కడనుంచి ? ఎక్కడ దిగావు ? అమెరికానుంచెప్పుడొచ్చావు?" చొరవగాఅడిగాడు తిరువనంతాచార్యులు.   
"ఏం ఫరవాలేదు. నువ్వెలా పిలిచినా నాకిబ్బంది లేదు. అలాగే పిలువు ! మనసుకు హాయిగా ఉంది. ఇండియా వచ్చి రెండు వారాలైంది. కాశీనుంచి కన్యాకుమారిదాకా తిరిగి చివరిగా తిరుపతి నుంచి ఇక్కడికి వచ్ఛాను. నా సంగతలా ఉంచు. నేను వెళ్లిన దగ్గరినుంచి నీచదువు, పెళ్లి, పిల్లలు ...అన్ని విషయాలు చెప్పు" అన్నాడు ప్రకాశం.
"ఒక్కడివే వచ్చావా? భార్యా పిల్లలెవరూ రాలేదా? ఎలావున్నారు వారంతా ? నువ్వేమీ బాధల్లో లేవు కదా ? " ప్రశ్నార్థకంగా చూశాడు తిరువనంతాచార్యులు. 
"ఒక్కడినే వచ్చాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. భార్య తెలుగమ్మాయే. అందరూ బావున్నారు. బాగా సంపాదించాను. ఎలాటి బాధలూ లేవు. ఒక ముఖ్యమైన పని మీద వచ్చానిక్కడికి. నీ కథంతా విన్నాక నా విషయాలన్నీ చెబుతాను. ముందుగా నీ వంతు!" అన్నాడు ప్రకాశం.
"ఇన్ని సంవత్సరాలు మాతృదేశానికి, మాతృభాషకు దూరంగా అమెరికాలో ఉన్నా నీ తెలుగుభాషా ఉఛ్ఛారణలో ఏమాత్రం తేడా రాలేదే!"
నవ్వి ఊరుకున్నాడు ప్రకాశం.    
 "నా చదువుకి మీనాన్నగారిచ్చిన డబ్బు ఇంటి అత్యవసరాలకి ఖర్చు చేశారు. బి.ఇ లో సీట్ వచ్చింది. చేర్పించలేదు. నా మాట వినేవారు లేకపోయారు. చదువాగిపోయింది. 
పూజాదికాలు మొదలెట్టాల్సివచ్చింది. మామయ్య కూతురు పారిజాతంతో పెళ్లయింది. 
ఇద్దరు మగపిల్లలు. ఇంటర్ తోనే చదువాపేశారు. ఈవృత్తి వద్దు ... చదువుకొమ్మని చెప్పినా ఇద్దరూ పెడచెవిన బెట్టారు. చదువబ్బలేదు. వృత్తి విద్యకే తల ఒగ్గారు. ఇద్దరూ పూజారులే. పట్నంలోవారి బ్రతుకులు వారీడుస్తున్నారు. ఇక నా సంగతి కొస్తే ... అదిగో! ఆయన, మేము ఒకలాగే ఉన్నాము'' అన్నాడు తిరువనంతాచార్యులు గుడివైపు చూపిస్తూ. 
అతని కళ్ళలో, మాటల్లో చెప్పలేని, వ్యక్తీకరించని లోతైన వైరాగ్య భావన, బాధ ప్రస్ఫుటంగా  కన్పించింది.  
"సంపాదన గురించేకదా నువ్వలా అన్నది ... ఎందుకలా అన్నావు? నాకర్ధంకాలేదు. వివరంగా చెప్పు!"
"కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదు. వస్తున్నది ... భగవంతుడిస్తున్నదంతే నని నమ్మకం.     
అది తప్పో, ఒప్పో తర్కించే తత్వంకాదు నాది ! ఈ మాట నా నోట మొదటిసారిగా బయటకన్నాను. బ్రతకీడ్చడానికి సరిపుచ్చుకునే సంపాదన. 
ఇంగ్లీషులో అంటారుకదా 'స్ట్రగుల్ ఫర్ సర్వైవల్'... అదే మా పరిస్థితి!' 
ఆయుర్వేద వైద్యం చేస్తాను. ఆ వైద్యాన్ని, నన్ను నమ్మేవారు ఒకరో, ఇద్దరో రోగులు. వారేమైనా ఇస్తే పుచ్చుకుంటాను.    
దేవుడి మాన్యం రెండెకరాల పొలం కౌలు వస్తే వచ్చినట్లు. చేతికొచ్చిందాకా గండమే. తుఫాన్లు మింగుతాయో తెలియదు. కౌలుదారు దయ. మా ప్రాప్తం! ఎంతిస్తాడో, ఎగ్గొడతాడో తెలియదు.  
అది తప్ప వేరే చెప్పుకోతగ్గ ఆదాయం లేదు.  
పారిజాతం ముప్పూటలా కష్టపడుతుంది. ఎంబ్రాయిడరీ, టైలరింగ్ చేస్తుంది. నర్సింగ్ చేస్తుంది. పిండి వంటలు చేస్తుంది. నిజం చెప్పాలంటే తన సంపాదనే మా సంసారానికి అండ, అక్కర.  ఇన్నేళ్ళలో తనకి ఖరీదైన బట్ట, నగ ఒక్కటీ కొనిబెట్టలేకపోయాను. 
ఈ ఊళ్ళోనే కాదు. ఎక్కడో ఒకటి, అరా తప్ప అంతటా దేవాలయాల పరిస్థితి,  
పూజారుల పరిస్థితిదే !" అన్నాడు తిరువనంతాచార్యులు.
"అంటే ఆర్ధికంగా పుష్టి లేదనే కదా నీ వనేది"
"అవును! తరాలు మారాయి. నమ్మకాలు సడలాయి. విశ్వాసాలు మారాయి. మారుతున్నాయి.
ఇదివరలో రైతులు కూరగాయలతో సహా ఇంటికి సంబారాలు పంపేవారు. అన్నీ ఆగిపోయాయి. 
దీప, ధూప నైవేద్యాలకే నెలకు రెండు వందలన్నారు. ఇప్పటికి ఏడేళ్లుగా అదీ రాలేదు. జీత భత్యాలంటూ లేవు. హారతి పళ్లెంలో కానుకలు అరుదే. తరచూ దేవాలయానికి వచ్చే మనిషి ఇంటనే దణ్ణం పెట్టుకుంటున్నాడు. గుడికి రావడం తగ్గింది. పుట్టినరోజునో లేక పండగకో, పబ్బానికో మాత్రమే గుడికి రావడం. అదీ సమయం దొరుకుతే ! గుళ్లోనుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు ఊళ్ళోకెళ్ళి పదేళ్ల పైగా అయింది. ఇకముందు వెళతాయన్న నమ్మకం లేదు. దానికి తోడు ఏదో అంటు రోగంతో మేటి ప్రపంచమే ముడుచుకు కూర్చుంది. ఇక మా బోటి వారెంత ?" 
"అంటే జనాలలో మార్పు వచ్చిందనా నువ్వనేది ?"
"పూజారిగా నేను ఆ విశ్లేషణ చేయతగనేమో!"
"అనంతూ ! నాకో ఇల్లు కావాలి" హఠాత్తుగా టాపిక్ మారుస్తూ అన్నాడు ప్రకాశం. 
"ఇల్లేమిటి ? అద్దెకా ...  కొనడానికా? అమెరికా తిరిగి వెళ్లడంలేదా ?"ఆశ్చర్యంగా అడిగాడు తిరువనంతాచార్యులు 
"ఇప్పుడే వెళ్ళను. కొన్నాళ్లపాటిక్కడే, ఈ ఊళ్ళోనే ఉందామనుకుంటున్నాను"
"మీ నాన్నపాలికి వచ్చిన పాత పెంకుటిల్లు ఎన్నోఏళ్లుగా తాళం వేసి ఉంది. నువ్వుండడానికి బాగుండదేమో! ఆస్తి పంపకాలలో మీ తాతగారు మీ నాన్నపేరిట విల్లులో వ్రాసిన ఇల్లది. 
ఆలనా పాలనా లేక పాడుబడింది. బాగు చేయించుకుని ఆ ఇంటే ఉండొచ్చేమో చూడు!"
"అలాగా! నాన్నగారనలేదు. నాకు తెలియదు. తాతగారు పోయారుగా? మా పెదనాన్న, చిన్నాన్న వాళ్ళెవరూ ఆ ఇంటిని అట్టేపెట్టుకోలేదా ? ఇల్లు మాపాలికి వచ్చినా సరే... ఖాళీగా ఉంటేనే చూద్దాం. ఎవ్వరినీ నొప్పించవద్దు"
"మీ వారెవరూ ఆ ఇంట నివసించడం లేదు. అందరు భవంతులు కట్టుకున్నారు. అతిధుల కోసం ప్రత్యేకించిన ఇల్లట" 
"అలా బయటకెళదాం !" అన్నాడు ప్రకాశం ఇంటి వివరం వినడం ఇష్టంలేనట్లుగా 
"టిఫిను చేసి వెళదాం" అంటూ లోనికి వెళ్ళాడు తిరువనంతాచార్యులు. 
                                                                   * * * * *  
"ఇదే ఆ ఇల్లు ! ఇంటి తాళంచెవి ఉందేమో మీ అన్నగారింట్లో కనుక్కుందాం! అలాగే వారింటికి వెళ్లినట్లుంటుంది. నువ్వు వారిని పలకరించి నట్లుంటుంది" అంటూ  దేవాలయానికి దగ్గరలోనే ఉన్న ఇంటి గేటు తీసి పెద్ద భవంతిలోకి నడిచాడు తిరువనంతాచార్యులు. అతన్ననుసరించాడు ప్రకాశం. 
పలకరింపులు, కాఫీలయ్యాక "ఏరా! బాబాయి, పిన్ని అంతా బావున్నారా ? తోట,ఇల్లమ్మడానికి వచ్చావా ?" అన్నాడు ప్రకాశాన్ని ఉద్దేశించి పెదనాన్న కొడుకు.
"ఇంటి తాళం చెవి ఉందా?" అన్నాడు ప్రకాశం అతని ప్రశ్నకు సమాధాన చెప్పకుండా.
"అదిగో! ఆ గుంజ మేకుకి తగిలించి వుంది. ఇన్నేళ్ళలో ఎవరూ దాన్ని ముట్టుకోలేదు. నువ్వే అందుకో !" అన్నాడు తేలికగా.  
"ఇంటి పేపర్లు... ?" అన్నాడు ప్రకాశం 
"ఉంటావా రెండ్రోజులు ... ఎప్పుడొచ్చావు. ఎక్కడ దిగావు ? రాత్రి  భోజనానికి రా! ఏదైనా ఎవ్వారం ఉంటే మాట్లాడుకోవచ్చు.పేపర్లు తీసిఉంచుతాను. ఇంటితో బాటు మీనాన్న పాలికి రెండెకరాల మావిడి తోట కూడా వచ్చింది. దాని తాలూకూ డబ్బు, లెక్క నాదగ్గరే ఉన్నాయి. పట్టుకెళ్ళు" అన్నాడు అన్న.  
"వస్తాను" తాళంచెవి తీసుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న లోగిలికి  తుప్పుపట్టిన పాత గేటు తీసుకుని లోనికి నడిచారు వారిద్దరు.  
"వస్తానన్నావు ... ?" అన్నాడు తిరువనంతాచార్యులు ప్రకాశం మొహంలోకి సాలోచనగాచూస్తూ. 
"భోజనానికి"... 
ఇంటి తాళం తీసి "లోపల, వెనకాల పెరడు చూస్తూవుండు. పాతిల్లు, జాగ్రత్త!
చూసి నడువు పురుగు, పుట్ర ఉండగలవు. కూలి మనుషుల్ని, సుతారిని పిలుచుకొస్తాను. 
ఇల్లు శుభ్రం చేయించి నివాసయోగ్యంగా మరమ్మత్తులు చేయిద్దాము" అంటూ బజారు కెళ్ళాడు తిరువనంతాచార్యులు.     
                                                                     * * * * * 
ఇంటి మరమ్మత్తులు అదే రోజు వేగంగా మొదలయ్యాయి. 
ముందుగా ఇంటావరణలో ఉన్నపెద్ద వేపచెట్టు చుట్టూ నెర్రెలు బాసిన గుండ్రటి అరుగు, ఆపైన గోడల మరమ్మత్తులయ్యాయి. పట్నం నుంచి ఆటోల్లో పనివారు వచ్చి, వెళుతున్నారు. ఇంటికప్పు పూర్తిగా తిరగవేశారు. పడకగదులకు ఎ.సి లు బిగించారు. వంటిల్లు నిత్య నూతనంగా తయారయింది. బావికి మోటార్, కుళాయిలు ఏర్పాటయ్యాయి. చూస్తుండగానే  రెండు వారాల్లో ఇల్లంతా హంగులతో కళకళ్ళాడింది. ఇంటి బయట సున్నం, లోన రంగులు అయ్యాయి. 
'డబ్బుంటే కొండ మీది కోతైనా దిగి వస్తుందనే నానుడి కర్ధం ఇదేనేమో ! పాడుపడిందనుకున్న ఇల్లు వసతులతో కళకళలాడుతోంది' అనుకున్నాడు తిరువనంతాచార్యులు.
"ఇంటి మరమ్మత్తులన్నీ పూర్తయ్యాయి. ఇల్లిప్పుడు నివాసయోగ్యమే. నువ్వు, చెల్లాయి ఈ ఇంట్లో గృహప్రవేశంచేయాలి అనంతూ !" అన్నాడు ప్రకాశం. 
"మేమా? ఎందుకు? ఇంటిపై బోలెడంత ఖర్చుచేశావు. అంత ఆడంబరం భరించే శక్తి నాకు లేదు" నిరాసక్తిగా, ఒకింత ఆశ్చర్యంగా అన్నాడు తిరువనంతాచార్యులు. 
"నిన్నీ ఇంట్లోకి రమ్మనడానికి కారణం ఒకటి కాదు. మూడున్నాయి. తరువాత చెబుతాను"  
"నాకు గుడి, మడి, ఆచారం ఉన్నాయి"
"ఎప్పటిలానే పాటించు ! ఎవరు కాదన్నారు ?"
"గుడి నెవరు చూస్తారు ?"
"పూజారులంతా ఆలయావరణలలో నివసిస్తున్నారా? అందరికీ వసతుల్లేవే. అలాగే నువ్వు. 
గుడి కాపలా నీ బాధ్యతెలా అవుతుంది ?" ఆలోచనలో పడ్డాడు తిరువనంతాచార్యులు.     
"నాకయోమయంగా ఉంది. ఇప్పటికిప్పుడే  నిర్ణయం తీసుకోలేను. ఊహకందని మార్పు! 
పూర్వా పరాలు ఆలోచించుకునే అవకాశమివ్వు. నీకు ముందే చెప్పాను. కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదని ... "
"నీకు నువ్వుగా పరుగెత్తడం లేదే ! కాలమే మార్పులను తీసుకొస్తుంది. మన ప్రమేయం లేకుండానే  కొన్నిఅమరుతుంటాయి. కొన్ని అంది పుచ్చుకోవాలి. 
కొందరికి కర్మఫలం సఫలం, మరికొందరికి విఫలం! 
అదేమిటో, ఎందుకో ... అర్ధమయిన్నాడు మనిషికి పగ్గాలుండవుకదా! నీ శుశ్రూషకు ఫలంగా నీ రాజగోపాలస్వామే ప్రసాదించాడనుకోవచ్చుగదా! ఇలాటి మాటలు భక్తులెందరితోనో 
అనుంటావు. నీ సిద్ధాంతమే నీకు వర్తించదా!?"
"ప్రకాశం!  కొద్ధి సమయమివ్వు. మాటలతో మభ్యపెట్టకు. మానసిక దౌర్బల్యానికి గురిచేయకు!" అని చప్పున గుడి వైపు వడి వడిగా అడుగులేశాడు తిరువనంతాచార్యులు.     
                                                                      * * * * *
రాత్రి ఎనిమిదిన్నర గంటలు. గుడికి వచ్చాడు ప్రకాశం. ఇద్దరు గుడి చావడిలో కూర్చున్నారు. 
"ప్రకాశం ! ఏమిటిదంతా... ? అసలు నువ్వెందు కొచ్చావు ? కారణం చెబుతావా ? మన స్నేహితం మీద ఆన.  దేవాలయంలో కూర్చున్నావు. నిజం చెప్పు" 
"నువ్వా  ఇంట్లోకి మారతావా లేదా ? ముందుగా చెప్పు!" 
"ఇదేదో నాకు గోపాలస్వామి పెట్టిన పరీక్షలా ఉంది. చూశావుగా... ఆలయ పరిస్థితి. శిధిలావస్థలో ఉంది. ఉద్ధరణకు నడుంకట్టే మహానుభావుడెవరో రావాలి ! ఆనాటి దాకా  దేవాలయాన్ని వదిలి నా స్వసుఖం కోసం నీయింటికి రావడం అసమంజసం, అనైతికం. భక్తుల విశ్వాశాన్ని, నమ్మకాల్ని వమ్ము చేయను. దేవునికే గాదు, నామనః స్సాక్షికీ  సమాధానం చెప్పుకోలేను. నువ్వు గొప్ప స్నేహితుడివి. దైవ కార్య, కర్మల కంకితమైన నన్నాయనముందు దోషిగా నిలబెట్టకు! నిన్నర్ధిస్తున్నాను. 
కుచేలుని ఉద్ధరించడానికి వచ్చిన శ్రీ కృష్ణునిలా వచ్చావని అర్ధమైంది.నేనేమీ ఆచించలేదు. నేనీ మార్పునాకాంక్షించలేదు. అంగీకరించలేను. నన్ను క్షమించు" అతని గొంతు గాద్గగమైంది.
                                                                   * * * * *
ప్రకాశం దగ్గరిగా జరిగి స్నేహితుడి భుజం చుట్టూ చేయివేసి ఆప్యాయంగా వీపురాస్తూ 
"అనంతూ ! ధర్మాధర్మచింతన గురించి నీకు చెప్పేంత వాడి ఉన్నవాడిని గాను. అయినా అవసరం, సమయం, సందర్భం వచ్చింది కాబట్టి గీతలో శ్లోకం ఒకటి గుర్తుచేస్తాను.
 
సహజం  కర్మ  కౌంతేయ  సదోషమపి  న  త్యజేత్
సర్వారంభా  హి  దోషేణ  ధూమేనాగ్నిరివావృతా ||

దోషముతో కూడినదైనా సహజ కర్మను త్యజింపరాదు. నిప్పుని పొగ ఆవరించినట్లు మన  కర్మలలోను ఏదో ఒక దోషము ఉంటుందనే కదా శ్రీకృష్ణభగవానుడు చెప్పింది. 
మనం చేస్తున్నది అసహజ కర్మ కాదని నా ఉద్దేశ్యం! 
తిరువనంతాచార్యులు చకితుడై చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. 
"ఇప్పుడు సమయం వచ్చిందనంతూ! నువ్వాఇంట్లోకి ఎందుకు మారాలో మూడు కారణాలున్నాయన్నాను కదా... చెబుతాను. విను!
మొదటిది. మనం బాల్యంలో తిరుగాడిన ఈ దేవాలయం, మిద్దె పైన అద్దాలగది నన్నుగత కొన్నేళ్లుగా కలలో వెంటాడుతున్నాయి. గర్భగుడిపై గుమ్మటం నుంచి సున్నం, ఇటుక పెల్లలు రాలుతూ కనిపించేవి. నువ్వు వాటిని శుభ్రం చేస్తూ కన్పించేవాడివి. 
నేనిక్కడికొచ్చిన రోజు అద్దాలగదిలో నేను పడుకున్న చోట తెల్లారేసరికి సున్నం పెచ్చులు, ఇటుక పెల్లలు పైకప్పునుంచి రాలి పడ్డాయి. అదే దృశ్యం నాకు కలలో పదే పదే కన్పించేది. 
ఈ దేవాలయాన్ని, నువ్వుండే మిద్దెను పునర్మించడానికే వచ్చాను. నా కల అంతరార్ధ దైవేచ్ఛను నెరవేరుస్తాను. మిద్దె పునర్మితమయ్యాక నువ్వు, గ్రామ పెద్దలు కలిసి దాన్ని గ్రామ ప్రజల హితానికి, ప్రయోజనానికి ఉపయోగించండి. ఇది భగవత్పేరిత నిర్ణయం.  
రెండవది. ముఖ్యమైంది. నేను మరమ్మతులు చేయించిన ఇల్లు మాది కాదు. మీదే !
సరిగ్గా ఆరవై సంవత్సరాల క్రితం శార్వరి నామ సంవత్సర విజయదశమి రోజున ఆ ఇంటిని రాజగోపాలస్వామి దేవాలయ పూజారి పేరిట వ్రాసిన దస్తావేజు దఖలు పత్రం నా దగ్గర ఉంది. ఈ గుడి పూజారుల నివాసం కోసం ప్రత్యేకంగా మా తాతగారు నిర్మించిన ఇల్లది. 
ఇన్నేళ్లు ఈ విషయం ఎందుకు, ఎవరి స్వార్ధంతో మరుగున పడ్డదో, ఆ ఇల్లు మాకుటుంబ  స్వాధీనంలో ఎందుకు ఉందో కారణాలు నాకు తెలియవు. 
రాత్రి అన్న ఇచ్చిన ఆస్తుల వీలునామా పత్రంతో పాటు ఆ ఇంటి పాత దఖలు దస్తావేజు కూడా ఉంది. దీన్ని చూడు!  తెలిసీ స్వార్ధపూరితంగా ఇల్లు నాన్నపేరిట వీలునామా వ్రాశారు తాత! 
ఆ విషయమిప్పుడు,ఇక, అప్రస్తుతం ! 
ఈ క్షణంలో స్వామివారి సమక్షంలో మీకు చెందిన ఆ ఇంటిని నీకు దఖలు చేస్తున్నాను" అంటూ ఆ పాత పత్రాలు, స్నేహితుని పేరిట వ్రాసిన కొత్త పత్రాలు తిరువనంతాచార్యుల చేతిలో పెట్టాడు ప్రకాశం.  
ఇక మూడవది, చివరిది స్నేహధర్మం.  
నువ్వు అన్యధా భావించవద్దు! ఈ పాత పత్రాలు లేకున్నాఆ ఇల్లు, మామిడితోట నీ పరంచేసి వెళ్ళేవాడిని. అందుకే వచ్చాను. నాన్నగారితో మాట్లాడాను. సంతోషపడ్డారు. ఆయన సంతోషంగా తన అంగీకారాన్ని తెలియచేశారు.  
గీతానుసారం సహజ కర్మలను త్యజించరాదు కదా అనంతూ !" వినమ్రంగా, అనునయంగా సందర్భాన్ని అన్వయిస్తూ తలవంచి రెండుచేతులు జోడించి అన్నాడు ప్రకాశం .  
ఉద్వేగంతో లేచి నిల్చుని భగవత్ప్రసాదాన్ని స్వీకరించాడు తిరువనంతాచార్యులు అశ్రునయనాలతో.  

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254


                  

23, ఆగస్టు 2021, సోమవారం

నేటి సావిత్రి

                                                                 నేటి సావిత్రి
                                                            ==============           
తెల్లవారి లేచేసరికి తలుపులు బార్లా తెరిచివున్నాయి. బయట గేటు తాళం వేయడం మరిచి  అలాగే నిద్రపోయింది సీతమ్మ. మతిస్థిమితం లేని భర్త రాఘవరావు ఇంటినుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాన్నం వరకు సీతమ్మ, పనిమనిషి, ఇరుగు పొరుగు వారందరు ఇంటి చుట్టుపక్కల వీధులన్నీ గాలించారు. రాఘవరావు కనిపించలేదు. పోలిసు రిపోర్ట్ ఇచ్చింది భార్య సీతమ్మ.

"చూస్తమమ్మా! మీరూ రెండురోజులు చూడండి. చుట్టాలింటికి గాని,స్నేహితులింటికి గాని వెళ్ళిండేమో " అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
"స్వయంగా ఆయన ఎక్కడికీ వెళ్ళలేడు. డెబ్బై ఆరేళ్ల మతిస్థిమితంలేని పెద్దమనిషి బాబూ ! అయిదారేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నాను. రాత్రి తలుపులు తెరుచుకుని వెళ్ళిపోయాడు. 
పాపిష్టిదాన్నిగేటు తాళంవేయడం మరిచి నిద్రపోయాను. మనిషి మాయమయ్యాడు" ఏడుస్తూ తన గోడు చెప్పుకుంది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ తో అరవై ఆరేళ్ల సీతమ్మ.
"సరేనమ్మా! మతిలేని మనిషి అంటున్నారు కదా! రిపోర్ట్ రాసుకున్నాము. ఫోటోలు, ఫోను నంబరు ఇచ్చారు కదా... ఆచూకీ తెలుస్తూనే కబురు చేస్త..." అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
రాఘవరావు తప్పిపోయి మూడు రోజులయింది. పోలీస్ వారి నుంచి ఏ కబురూ లేదు.
మరుసటి ఉదయాన్నేనాలుగు మెతుకులు తిని పోలీస్ స్టేషనుకి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే బయట బెంచిమీద కూర్చుంది. బయటకు వెళుతూ సీతమ్మను చూసి
''చూడు పెద్దమ్మా! పెద్దాయన్ని వెదుకుతూ ఉన్నాం. నువ్వు స్టేషన్ కి వచ్చి ఎందుకు కూర్చుంటావ్ ? ఆయన దొరికితే మాదగ్గర వుంచుకోము కదా. ఇంటికి వెళ్లమ్మా!" అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గద్దిస్తూ.
"నాయనా! మూడు రోజులయింది పెద్దమనిషి కనబడక. దణ్ణంపెడతా. దయచేసి త్వరగా వెదకండయ్యా!" అంటూ రెండు చేతులు జోడించి సబ్ ఇన్స్పెక్టర్ ని ప్రార్ధించింది సీతమ్మ.
"మీరిక్కడకి రాకున్నా మీ వారిని వెతుకుతామమ్మా ! అవసరముంటే నేనే ఫోనుచేస్తాను. ఇక్కడ కూర్చుని మమ్ముల్ని ఇబ్బంది పెట్టవద్దు" అంటూ సున్నితంగా హెచ్చరించాడు సబ్ ఇన్స్పెక్టర్.
ఇంటికి వెళుతుండగా ఇంటి ఎదురుగా  ఉన్న సూపర్ బజార్ మేనేజర్ బయట నిలబడి ఉన్నాడు. సీతమ్మను చూసి లోనికి పిలిచి కూర్చోబెట్టి ఫ్రూటీ యిచ్చి, సి సి కెమెరాలో రికార్డయిన వీడియో  ఫుటేజీ ప్లే చేసి చూపించాడు.
రాఘవరావు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక గేటుతెరిచి ఇంటి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు వైపు నడవడం మొదలెట్టాడు. కాళ్లకు చెప్పులు లేవు. రోడ్డు పక్కనున్నవెల్డింగ్ షాపులో పనిచేస్తున్న కుర్రా డెవరో బయటకు వచ్చి ఆయన్నేదో అడిగినట్లనిపించింది. వీడియో రివైండ్ చేసి చూశారు. పలకరించిన వాడి మాట ఆయన వినిపించుకోలేదు. ఆపైన రోడ్డుకిరువైపులా ఉన్న పెద్ద చెట్లనీడ వల్ల చీకట్లో వీడియో ఫుటేజ్ మసకగా ఉండడంతో ఏమీ కన్పించలేదు.
ఇదే సంగతి సబ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళింది సీతమ్మ. వారు అంతగా స్పందించలేదు. 
"మేమూ ఆ వీడియో చూశామమ్మా! పెద్దాయన ఇంటినుంచి బయటకు వచ్చాక మెయిన్ రోడ్డు వైపు నడిచారు. కానీ మెయిన్ రోడ్డు దాకా వెళ్ళలేదు. వేరే కెమెరాల్లో రికార్డయిన వీడియోలు కూడా చూశాము. వెల్డింగ్ షాపులో  కుర్రాడు ఆ రాత్రి టైం అడిగాడట. వారి మాటకు ఆయన స్పందించలేదు. పార్కులోని కెళ్ళారేమోనని చూశాము. పార్కులో కెమెరాలు ఒక్కటీ పనిచేయడంలేదు. ఆ అర్ధరాత్రి సమయంలో ఆయన్నెవరూ గమనించినట్లు మాకు సమాచారమేమీ లేదు. పోలీస్ పెట్రోల్ టీం కూడా ఆ రాత్రి ఆయన్ని ఎక్కడా గమనించలేదు. ఉదయాన్నే రెగ్యులర్ గా నడకకు వచ్చేవారెవరూ ఆయన్ని చూసినట్లు సమాచారం లేదు. ఇన్వెస్టిగేషన్ అక్కడ ఆగిపోయింది" అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
వారంరోజులు గడిచాయి. కేసులో పురోగతేమీ లేదు. క్రైమ్ కేసు కాకపోవడంతో కేసుకి ప్రాధాన్యత లేదు. కేసుని వారు సీరియస్ గా తీసుకున్నట్లనిపించలేదు. 
ఆ రోజు అమెరికా నుంచి రాఘవరావు కొడుకు పురుషోత్తం, న్యూజిలాండ్ నుంచి కూతురు పావని ఇద్దరు  వచ్చారు. ప్రయాణం వాయిదాలు వేసుకుంటూ నెలరోజులపాటు తల్లి దగ్గరే ఉండి, తండ్రిని వెదకడంలో చేయని ప్రయత్నం లేదు. పోలీసు పై అధికారులను ఎన్నోసార్లు కలిశారు. హాస్పిటళ్లు, వృద్ధాశ్రమాలు, చుట్టాలిళ్లు,స్నేహితుల ఇళ్ళు, పార్కులు వెదకని ప్రదేశం లేదు. పేపర్లలో, టీవీల్లో, గోడ పత్రికల్లో ప్రకటన వేయించారు. అయినా ఏ ఆధారమూ దొరకలేదు. రాఘవరావు ఆచూకీ దొరకలేదు.
తోడుగా ఉంటుందని ఊరినుంచి పిలిపించుకున్న అక్కతో కలసి, కొడుకు, కూతురు, పోలీసులు  వారిస్తున్నా, ప్రతిరోజూ పోలీసుస్టేషన్ వెళ్ళివస్తూనే వుంది సీతమ్మ! పోలీసువారు నోరు మెదపడం లేదు. పోలీసులు అన్నిస్టేషన్లకు సమాచారమిచ్చారు. 
''ఇంకా ఎక్కడ వెదకాలో చెప్పండి వెదుకుతాం'' అని విసుక్కుంటున్నారు పోలీసులు.
'జవాబుదారీతనం ప్రజలకేనా?' అనుకుంది సీతమ్మ. 
'మాయదారి జబ్బు ఆయనకే రావాలా! ఎక్కడున్నాడో...తిన్నాడో లేదో...ఒంటి మీద బట్టయినా వుందో లేదో' ? మతి సరిగ్గాఉన్ననాడే ఎదురుగా ఉన్నవస్తువే కనిపించేది కాదు. స్నానానికి టవల్ దగ్గరినుంచి అందించాల్సి వచ్చేది. వేళకింత పెడితే తినేవాడు. మాయమైపోయాడు. ఇంతపెద్ద పట్నంలో ఎక్కడని వెదకనయ్యా...!' అని కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తోంది అర్ధాంగి సీతమ్మ.
అవన్నీ 'అల్జీమర్స్ ' వ్యాధి లక్షణాలని ఆమెకు తెలియదు.పెద్దతనం, మతిమరపనే అనుకునేది సీతమ్మ .
"అమ్మా! పిల్లలూ, మా ఆయన రమ్మని గొడవ చేస్తున్నారు. క్షమించమ్మా ! నేను వెళ్లాలి" అంటూ కూతురు పావని తిరిగి న్యూజిలాండ్ వెళ్ళింది.
"పనులున్నాయమ్మా! నేను కూడా వెళ్లి తిరిగి వారం, పది రోజుల్లో మళ్ళీ వస్తాను" అని చెల్లెలు వెళ్లిన నాలుగో రోజు కొడుకూ తిరిగి వెళ్ళాడు.
నెల పది రోజులయింది రాఘవరావు ఇంటినుంచి తప్పిపోయి. చుట్టాలు,స్నేహితులు వచ్చి సీతమ్మను పరామర్శించి వెళుతున్నారు. మళ్లీ వస్తానన్నకొడుకు ఇంకా రాలేదు. సీతమ్మ ఒంటరి పోరాటం కొనసాగిస్తోంది. సీతమ్మకు తోడుగా వచ్చిన అక్క ఇంట వుంది.
                                                                    * * * * *
రాఘవరావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సంపాదించిన ప్రతి పైసా భార్య చేతిలో పెట్టేవాడు. పొదుపుగా ఖర్చుచేస్తూ హైదరాబాద్ 'రాజీవ్ నగర్' లో చిన్నఇల్లు కట్టుకుని కొడుకు, కూతుర్ని ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్లు చేశాడు. రిటైర్ అయ్యాక ఏడెనిమిది సంవత్సరాలు ఆరోగ్యంగానే ఉన్నాడు. తరువాత 'అల్జీమర్స్ ' వ్యాధి సోకి, ఐదారేళ్లుగా బాగా ముదిరి ఇంటినుండి బయటకు వెళ్ళి తప్పిపోయాడు. 
'పిల్లలిద్దరూ వచ్చి నెలరోజులపాటు విఫలయత్నం చేసివెళ్లారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. ఎన్నాళ్లని ఉంటారు ? వారికి ఉద్యోగాలు, సంసారాలు ఉన్నాయిగా!
ఉన్న నెలరోజులు పోలీస్ స్టేషన్, సిటీ చుట్టూ తిరిగినా ఏం ప్రయోజనం లేకపోయింది'
అనుకుంది సీతమ్మ తల్లిమనసుతో.  
                                                                    * * * * *                              
"ఇంట కూర్చుని చేసేదేముంది. రేపు పోలీస్ స్టేషనుకి వెళ్లివస్తాను" అంది సీతమ్మ అక్కతో.  
పోలీసుస్టేషనుకి వెళుతూ దారిలో వెల్డింగ్ షాపుకి వచ్చింది సీతమ్మ.
షాపులో భర్తను పలకరించిన కుర్రాడిని గురించి మళ్ళీ వాకబు చేస్తుండగా షాపు యజమాని బయటకు వచ్చి ''నా పేరు బాసిత్ అమ్మా! రావు సాబ్ నాకు తెలుసు. చాలా రోజులుగా ఆయన్ని చూడలేదు. ఆయన  'పానం' బాగుందా ? బయటకు రావడంలేదా ?
మీ ఇల్లు కట్టినప్పుడు ఇంటి గేటు, కిటికీలు నేనే తయారు చేసిన అమ్మా ! నిన్నుకూడా నేను గుర్తుపట్టింది" అన్నాడు బాసిత్ ఉర్దూ యాసతో
''అవును. ఆయనకి ఒంట్లో బాగాలేదు. మతి స్థిమితం లేక నెలరోజులు క్రింద ఇంటినుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము'' విషయం వివరిస్తూ అంది సీతమ్మ.
''ఏమిటీ ! నెలరోజులు అయిందా ? పెద్ద మనిషి కనబడలేదు. ఇంటికి రాలేదు ...!? ఏ ఖుదా !'' అన్నాడు బాధ వ్యక్తపరుస్తూ బాసిత్.
''నేను ఇట్లా చెబుతున్నయి అని ఏమీ అనుకోవద్దు బెహెన్. మీ అబ్బాయి పురుషోత్తం బాబు కూడా నాయనకోసం అమెరికా నుంచి వచ్చి నిజంగా బాధపడ్డడు. నా దగ్గరికి వచ్చి నువ్వు అడిగినట్లే వాడు అడిగింది. అప్పుడు నాకు అనుమానం రాలేదు. ఇప్పుడు నాకి ఒక అనుమానం వచ్చింది. మీకు నిజంగా సాయం చేద్దామని చెపుతున్నయి. ఇక్కడ పార్క్ లో బిచ్చగాళ్ళు చాలా ఉన్నయి. రోజూ వాళ్లందరినీ ఒక లీడర్ సిటీలో వేరే వేరే సెంటర్లకి తిప్పుతాడు. వాళ్ళని అడిగితే రాఘవరావు సాబ్ ని వాళ్ళెవరైనా చూసింరా అన్నఇన్ఫర్మేషన్ ఏమైనా దొరకవచ్చు" అన్నాడు బాసిత్ మెల్లగా రహస్యం చెబుతున్నట్లుగా.
అది విన్న సీతమ్మకు ఒక్క క్షణంలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వెంటనే నిరుత్సాహ పడుతూ ''బిచ్చగాళ్లను అడగాలా ఆయన గురించి...ఎందుకు ?" అని అడిగి ఆలోచించింది.
బాసిత్ అన్నమాట అర్ధం అవుతూనే ఒళ్ళు గగుర్పాటుతో బాటు ఆమె పంచేంద్రియాలు పనిచేయడం మానేశాయి. నిస్సత్తువ ఆవహించి, బాధతో విలవిల్లాడి పోయిందా మనిషి.
                                                                 * * * * *
ఇంటికి వెళ్ళాక రెండు, మూడు గంటలు మనిషి కాలేక పోయింది సీతమ్మ. తినలేదు.
పచ్చి గంగ ముట్టలేదు. గదిలోనుంచి బయటకు రాలేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి.
''మొక్కు తీర్చుకోవడానికి ఏదో క్షేత్రానికి వెళ్ళి వచ్చినట్లుగా ఒక్కొక్కరూ వచ్చి వెళ్లారు.
కుటుంబం కోసం జీవితాన్ని ధారపోసిన మనిషి దిక్కూ, మొక్కూలేక ఎక్కడో పడి ఉండవచ్చని తెలిశాక, జీవితమే వ్యర్థమనిపిస్తోంది. ప్రయోజకులైన కన్నబిడ్డలూ దగ్గరలేక, ఆయన అనాథ కావడం తనని నిలువునా తొలిచేస్తోంది'' అని అక్కతో చెప్పుకుని బాధపడ్డది సీతమ్మ.
"అవునే తల్లీ ! నీకు రావలసిన కష్టం కాదిది. తన పర అనకుండా ఎంతమందికి సాయం చేశావు.  అయినా ఏం ఖర్మమో దేవుడిట్లా వ్రాశాడు నీ నొసటన"
"నేను కష్టాల కెన్నడూ వెరవలేదక్కా! కష్టంలో కన్నబిడ్డలే అక్కరకు రాలేని పరిస్థితి! ఎప్పుడో, ఏదో, ఎవరికో సాయం చేశామని అనుకుని ప్రయోజనమేమిటి ? పురుషోత్తం పైచదువుకి అమెరికా వెళ్తానంటే 'మీరాదేశం వెళితే మరి రారు. మా ఇద్దరివిక ఒంటరి బతుకులే ! అయినా నీ భవిష్యత్తు నిలపడానికి నే నెవ్వరిని ? మనిషికి దేవుడు తలరాత ఒక్కసారే రాస్తాడంట. నేను కాదన్నా తిరిగి రాయడుగా!' అని ఆయన అన్నప్పుడు నాకర్ధం కాలేదు. ఆ ప్రతి మాట పొల్లుబోకుండా యదార్ధమయిందిప్పుడు.
'ముసలితనం, మతిమరుపనుకున్నానేగాని  రోగంతో బాధపడుతున్న విషయం తెలుసుకోలేనంత మూర్ఖురాలినయ్యాను. ఆయన తప్పి పోవడానికి కారణమయ్యాను. ఆయన దొరికిందాకా పోరాడుతాను' అని అక్కతో చెప్పుకుని బాధపడుతూ కన్నీరు మున్నీరయింది సీతమ్మ.
                                                                * * * * *
వెల్డింగ్ షాప్ యజమాని బాసిత్ సలహా మేరకు వరుసగా రెండురోజులు సీతమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధి చివర పార్కులోనే ఒక మూలగా కూర్చుంది. వచ్చేపోయే జనం గాక అయిదారుగురు బిచ్చగాళ్ళు, పల్లీలు, సమోసాలు, ఐస్ క్రీం అమ్మేవాళ్ళు, రోజంతా అక్కడక్కడే తిరుగుతూ కనిపించారు.
ఒక బిచ్చగాడు దుక్కలాగా ఉన్నాడు. ఓ కన్ను గుడ్డి. వాడికి పది రూపాయలిచ్చి రాఘవరావు ఫోటో చూపెట్టి అడిగింది సీతమ్మ. 
"ఈ ముసలాయన్నిఈ  పార్కులో ఎప్పుడయినా చూశావా?" అని....
''లేదమ్మా! నేను చూడలేదు" అంటూ పరుగులాంటి నడకతో వెళ్లిపోయాడక్కడనుంచి.
వేరే కొందరినీ అడిగింది సీతమ్మ. వారూ తెలియదని సమాధానం చెప్పారు.
బాసిత్ భాయ్ కి ఈ సంగతి చెబుదామని షాపుకి వెళ్ళింది. అతనప్పుడు షాపులో లేడు.
                                                                 * * * * *
మరుసటి రోజు మధ్యాన్నం ఒంటిగంటకు బాసిత్ భాయ్ గేటు తీసుకుని ఇంటికి రావడం చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది.
''నమస్తే అమ్మా ! రావు సాబ్ 'అతా, పతా' ఏమైనా తెలిసిందా?'' అనడిగాడు బాసిత్.
"ప్చ్! ఇంకాలేదు'' అంది సీతమ్మ నీరసంగా.
"నేను ఎంక్వైరీ చేసినాను. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ లతో మాట్లాడినాను. ఈ రోజు సాయంత్రం పోలీసులు రమ్మన్నారు. మీరు రెడీగా ఉండండి. నేను ఫోను చేసినప్పుడు వెంటనే స్టేషనుకి రండి'' అని చెప్పి ఆమె మొబైల్ ఫోనునంబరు నోట్ చేసుకుని వెళ్ళాడు బాసిత్.
తరువాత బాసిత్ భాయ్ ఫోను వచ్చిందాకా సమయం గడవడమే కష్టమయియింది సీతమ్మకి.
అసహనం, ఉద్విగ్నతతో అసలు కాలమే నిలిచి పోయినట్లనిపించిందామెకి. ఏభై ఏళ్లకు పైగా భర్తతో సాన్నిహిత్యం గుర్తుకి వచ్చి మనసంతా కకావికలమయింది. ఇంటికీ, బయటకు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. 
సాయంత్రం ఆరు గంటలయింది. బాసిత్ భాయ్ దగ్గనుంచి ఫోన్ రాలేదు.
'ఈరోజు ఆయన దొరుకుతాడనిపిస్తోంది' ఇవాళ ఇంటికి వస్తాడాయన అని పదే పదే మనసులో అనుకుంది. దేవుణ్ణి ప్రార్ధించింది.వెంకటేశ్వరస్వామికి ముడుపు కట్టింది.
ఇంతలో బాసిత్ భాయ్ దగ్గర నుంచి ఫోను,వెంటనే పోలీసుస్టేషన్ కి రమ్మని.
పది నిముషాల్లో స్టేషను కి వెళ్ళింది సీతమ్మ. 
ఇన్స్పెక్టర్ ఎదురుకుర్చీలో కూర్చుని ఉన్నాడు బాసిత్ భాయ్. సీతమ్మ వస్తూనే ఇన్స్పెక్టర్ కి పరిచయం చేసి "మీరు ఇక్కడే స్టేషన్లోనే ఉండండి అమ్మా! మేము ఇదే పనిమీద బయటకు వెళుతున్నాము" అన్నాడు బాసిత్.
"లేదు! ఆమెను మనతో తీసుకెళ్ళాలి... " అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
"ఇన్స్పెక్టర్ సాబ్! పెద్ద మనిషి. ఆమె అక్కడికి ఎందుకు ?" అన్నాడు బాసిత్ ఆందోళనగా.
"అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదు...ఆ గుంపులో ఆయన వుంటే గుర్తించాలి గదా! అందుకే ఆమెను తీసుకుని వెళదాము" అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
రెండు నిముషాల్లోనే 'చాయ్' వచ్చింది. సీతమ్మ వద్దంది.
ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతూ గంటలు కొడుతున్నగోడ గడియారం వంక చూస్తూ 'అర్ధగంట తరువాత బయలుదేరుదామన్నాడు బాసిత్ భాయ్ తో. ఎక్కడికి వెళుతున్నది వివరాలేమీ తెలియదు.
అర్ధగంట తరువాత అందరు స్టేషను బయటకొచ్చారు.పెద్ద పోలీసు వేను, రెండు జీపులు, పదిమంది కానిస్టేబుళ్లతో అంత బందోబస్తుగా వెళుతుంటే ఏదో 'రెయిడ్' కి వెళుతున్నట్లుగా అనిపించింది.
బాసిత్ భాయ్ ని వెనక, సీతమ్మని ముందుసీటులో జీప్ ఎక్కమన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
గంటన్నర పైగా డ్రైవ్ చేసి సిటీకి దూరంగా విసిరేసినట్లు అక్కడక్కడ ఇళ్లున్న ఏదో 'కాలొనీ' కొచ్చి
ఒక పెద్ద షెడ్ దగ్గర ఆగాయి వెహికల్స్.
అది ఒక కోళ్ళ ఫారం. షెడ్ బయట పెద్ద బోర్డు ఉంది.
పోలీసులంతా బిల బిల మంటూ వేను దిగుతూనే షెడ్ నాలుగు వైపులా నలుగురు కానిస్టేబుళ్లు పొజిషన్ తీసుకున్నారు. కాంపౌండ్ గోడ ఎక్కి లోనికి దిగి గేటు తెరిచాక మిగతా పోలీసువారంతా లోనికి వెళ్తూనే గేటు మూసేశారు. బాసిత్, సీతమ్మ బయటే ఉన్నారు.
అయిదు నిముషాల తరువాత కానిస్టేబుల్ బయటకువచ్చి సీతమ్మని, బాసిత్ ని లోనికి తీసుకువెళ్ళాడు.
షెడ్  లోపల పరిస్థితి అతి భీతావహంగా, దయనీయంగాఉంది. దుర్వాసనతో ముక్కులు బద్దలయ్యేలా వుంది. కడుపులో దేవుతూ వాంతి వచ్చేలా అనిపించింది సీతమ్మకు.
లోన పసి పిల్లల దగ్గరనుంచి పండు వయసున్న ఆడా, మగ మనుషులందరు కలిపి సుమారు వందమందికి పైగా ఉన్నారు. షెడ్ అంతటా పాతపరుపులు, గోనె సంచులు, ప్లాస్టిక్ పట్టాలు,చిరిగిన దుప్పట్లు, జంపకానల మీద గోడలకు చేరి, అడ్డ దిడ్డంగా ఉన్నారు. కొందరు పడుకుని, కొందరు కూర్చుని జోగుతూ, కొందరు పేకలాడుతూ, జూదమాడుతూ కొందరు, ముక్కుతూ,మూల్గుతూ హీనంగా ఉన్నవారి పరిస్థితి చూసి చలించిపోయింది సీతమ్మ.
ఒక పక్కన నాలుగయిదు కుండల్లో నీరు,మసిబారిన పెద్ద డేక్సా గిన్నెల్లో అన్నం, పప్పు,  ఇంకొకమూలన దుర్వాసనగొడుతున్నచెత్తకుప్ప....!
"త్వరగా వెతకండమ్మా... మీ భర్త ఉన్నారేమో" అన్నాడు ఇన్స్పెక్టర్ హ్యాండ్ కర్చీఫ్ తో ముక్కు  నోరు కప్పుకుంటూ అంబులెన్సుకు, మున్సిపల్ అధికారులకు ఫోను చేశాడు. లోన ఉన్న గదులలో సోదా జరుగుతోంది.
పిల్లలను, వృద్ధులను చేతకానివారిని బలవంతగా ఎత్తుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నారన్న అభియోగంపై లోన ఉన్ననలుగురు నిర్వాహకులను చేతులకు బేడీలు వేసి బయటకు పట్టుకెళ్లారు పోలీసులు.
"నేను ఇటు పక్కన వెతుకుతాను. మీరు అటు పక్కన చూడండి అమ్మా!" అన్నాడు బాసిత్ వెంటనే.
ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ భర్తకోసం వెతకడం మొదలెట్టింది సీతమ్మ ముక్కుకి కొంగు అడ్డంగా పెట్టుకుని. ఇంటిదగ్గర పార్కులో దుక్కలాగా కన్పించిన ఒంటి కన్ను బిచ్చగాడు కన్పించాడు. వాడిని చూస్తూనే ఆశ్చర్యానికి లోనయింది సీతమ్మ. వెంటనే బాసిత్ భాయ్ కి, సబ్ ఇన్స్పెక్టర్ కి వాడిని చూపించి, భర్తకోసం శ్రద్ధగా వెదకడంమొదలెట్టింది.  
ఓ మూలన గచ్చునేలమీద ఓ గోనె సంచి కప్పి ఉన్న ఓ ఎముకుల గూడంటి మనిషిని చూసి అక్కడ ఆగింది సీతమ్మ. గోనె సంచి తీసి ముఖం పరీక్షగా చూసింది. మట్టితో జుట్టు మాసి,గడ్డం, మీసం పెరిగి గుర్తు పట్టలేనంతగా కళ్ళు లోతుకు పోయి, ఒళ్లంతా మట్టి కొట్టుకుపోయి, ఎక్కడో కొద్దిగా మినుకు, మినుకుమంటున్న ప్రాణం, అందీ అందనట్లున్ననాడి. పిడికెడంతున్నాడా మనిషి. ఎముకల గూడు మీద పల్చటి చర్మం. మోకాళ్ళమీద కూర్చుని ఆ మనిషిని పరిశీలనగా చూస్తే గానీ భర్తని గుర్తించలేకపోయింది సీతమ్మ. రెండు చేతులతో ఆయన భుజాలను పొదివి పట్టుకుని కింద కూలబడ్డది.
ప్రాణప్రదమైన భర్త దిక్కులేని వీధి జంతువులా, ఈగలు మూగి, స్పృహలేక కొన ప్రాణంతో  
పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది సీతమ్మ.
"బాసిత్ భాయ్ !" అంటూ పెద్ద కేకవేసింది సీతమ్మ.
పరుగున వచ్చాడు బాసిత్.
రెండుచేతులు జోడించి బాసిత్ కి నమస్కారం చేసి  రెండు చేతుల్తో భర్తను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చూసి "అమ్మా! ఏం చేస్తున్నావు. జర ఆగండి" అంటూ పరుగున బయటికి వెళ్లి అప్పటికే వచ్చిన అంబులెన్సు నుంచి స్టెచర్ ని,హెల్పర్ని కూడా తీసుకువచ్చాడు బాసిత్.
"అంబులెన్సులు వచ్చాయి. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి" అన్నాడు సబ్  ఇన్స్పెక్టర్, రాఘవరావు పరిస్థితి విషమంగా ఉండడం చూసి.
భర్తని స్టెచర్ మీదకు చేర్చి ,హెల్పర్ ఒక వైపు, రెండో వైపు బాసిత్ పట్టుకోగా స్టెచర్ పక్కన పట్టుకుని, యముడి బారి నుంచి భర్తను రక్షించుకున్నసావిత్రిలా నడిచింది సీతమ్మ అంబులెన్సు వద్దకు.
షెడ్ బయట, అప్పుడే వచ్చిన టి.వి.ఛానళ్ల వేన్లు, కెమెరాలతో కోలాహలంగా ఉంది. ఇద్దరు ముగ్గురు కెమెరాలతో సీతమ్మను పలకరించే ప్రయత్నం చేశారు. వారిని దాటి భర్త స్ట్రెచర్, బాసిత్ భాయ్ తో బాటు అంబులెన్సు ఎక్కింది సీతమ్మ. సైరను మోగుతూ అంబులెన్సు వేగంగా కదిలింది.  
"ఆక్సిజన్ పెట్టేనమ్మా! అర్ధగంటలో హాస్పటల్ కి వెళ్ళిపోతాం. మరేం భయంలేదు" అన్నాడు  బోయ్ రాఘవరావుని అంబులెన్సులో ఎక్కించిన మరుక్షణంలో
                                                   ===========xxx==========

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254

     




21, ఏప్రిల్ 2021, బుధవారం

                                                      అన్యధా శరణం నాస్తి 
                                                  ------------------------------------
                (ఈ మినీ కథ 'సహరి' కొసమెరుపు కధల పోటీ లో సా.ప్ర కు ఎంపిక కాబడింది)

      

"గీతా ! నువ్వున్నపళంగా బయలుదేరి హైదరాబాద్ రావాలి తల్లీ ! అసంబద్ధ, అసమంజస కోరిక కోరుతున్నానని మాత్రం అనుకోవద్దు. నువ్విప్పుడు రాకపోతే  అనర్ధం జరిగడం ఖాయం. నేనేమీ ఆషామాషీ మాటలు మాట్లాడడం లేదు. నా మాటల్లో తీవ్రత కూడా నీకు అర్ధంగాకపోవచ్చు. నువ్వు మీ అమ్మతో మాట్లాడి కూడా ప్రయోజనమేమీ లేదు" కెనడాలో ఉన్న కూతురిని ఫోనులో హెచ్చరిస్తూ అన్నాడు క్రిష్ణమూర్తి. 

"నాకు తెలుసు నాన్నా! అత్యవసరం అవుతే తప్ప మీరలా అనరు. కానీ నేనిప్పుడు రావడం కష్టం. ఉద్యోగంలో చేరి సంవత్సరం కాలేదు. శలవు దొరకాలి...ఖర్చు. నెత్తిమీద బరువులా బోలెడంత అప్పు. నువ్వేమో విషయేయమేమీ చెప్పకుండా ఇదిగో... ఇలా కంగారు పెట్టేస్తావు" అన్నది ఆందోళనగా అంది గీత.  

"గీతా ! నాకు చెప్పాలనిపించింది నీకు చెప్పాను. వివరాలు నాకు తెలియవు. 
ఊహాగానం చేయలేను. అసమర్ధుణ్ణి క్షమించు" అన్నాడు ఫోను పెట్టేస్తూ కృష్ణమూర్తి. 
తండ్రి గొంతులో ఆర్తిని గమనించి ఇంటి దగ్గర ఏమవుతుందో, ఏం చేయాలో తెలియక అమితాందోళన చెందింది గీత.
క్రిష్ణమూర్తి అమీర్ పేట చౌరస్తాపక్కనే వున్న అమ్మవారి గుడిలో పూజారి. సాత్వికుడు. 
అంతో ఇంతో వచ్చే రాబడితో పొదుపుగా కుటుంబాన్ని పోషించేవాడు. కూతురు గీత శ్రద్ధగా 
చదివి ఇంజనీరింగ్ చేసింది. క్యాంపస్ సెలక్షన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించింది. ట్రైనింగ్  అవుతూనే  తనని కెనడా పంపించారు కంపెనీ వారు. 
కొడుకు పార్ధసారధి. ఆరేళ్లనుంచి ఇంజనీరింగ్ పరీక్షలు వ్రాస్తూనే వున్నాడు.   
"ఆ ఇంజనీరింగ్  ఎలాగూ పూర్తిచేయలేక పోయావు. బ్రతుకు దెరువు కోసమైనా పూజాదికాలు నేర్చుకుని పూజారిగానైనా స్థిరపడవయ్యా" అన్నాడు కొడుకుతో కృష్ణమూర్తి.
''పూజారివై  నువ్వెలగబెడుతున్నావు. ఇక నేను పూజారిని కావాలా ?" అంటూ వెటకారంగా మాట్లాడేవాడు పార్ధసారధి . 
'దుర్గమ్మ తల్లీ ! వీడితో ఎలావేగేది ? హారతి పళ్లెంలో భక్తులు వేసే కానుకలు ఎప్పటికప్పుడు మాయం చేయడం, పోచికోలు తిరుగుడు తప్ప ఇల్లు, గమ్యం శూన్యం. వాడి చదువుకి చేసిన బ్యాంకు అప్పు నాలుగు లక్షలు, ఇతర అప్పులు రెండులక్షల చిల్లర మొత్తం వడ్డీలతో కలిపి పది లక్షలు భారమైకూర్చుంది. బ్యాంక్ నుంచి నోటిసుల మీద నోటీసులు వస్తున్నాయి. వాడికి చీమ
కుట్టినట్లు గా లేదు. అప్పు చెల్లించాలన్న ఆలోచనే లేదు ఆ అప్రయోజకునికి మంచి బుద్ధి ప్రసాదించు తల్లీ ' అని అమ్మవారితో మొరబెట్టుకుంటూ అప్పు చెల్లించే బాధ్యత నైతికంగా తనదేనని ఎల్లవేళలా చింతిస్తూ ఉంటాడు కృష్ణమూర్తి. 
''ఇరవై మూడేళ్లు నిండాయి. నీవల్ల పైసా సాయంలేకపోగా నాకు, గుడికీ నీవల్ల చెడ్డపేరొస్తోంది. 
నీ తోవ నువ్వు చూసుకో" అని తండ్రి అనడమే తరువాయి నాలుగు నెలల క్రింద మాయమయిన పార్ధసారధి ఈ రోజుకీ జాడలేడు.
"పార్ధు  తిరిగి వచ్చి గొడవేమైనా చేశాడా ? ఏవిటో ! ... ఈ నాన్నొకడు ! విషయమేమీ అర్దగాకుండా  మాట్లాడి ఫోను పెట్టేశాడు. అమ్మకుఫోను లేదు. ఇంకెవరికి ఫోనుచేసేది ... ఎవరినడిగేది ?  ఉదయాన్నే సంధ్యకు ఫోను చేసి సంగతేమిటో కనుక్కోవాలి అనుకుంటూ పనిలో
నిమగ్నమైంది  గీత. 
                                                                   * * * * *
ఇండియాలో తెల్లవారి తొమ్మిదవుతూనే  అమీర్ పేట, అమ్మవారి గుడికి ఆనుకునే వున్న 'మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫీసు' లో పనిచేస్తున్న క్లాసుమేట్ సంధ్యకి ఫోను చేసింది గీత.
"హేయ్ !... గీత ఎలావున్నావు ? వాంకోవర్ నుంచేనా ? ఏమిటి విశేషం ఫోనుచేశావు"అంది సంధ్య.  
"సంధ్యా! చిన్న సహాయం చేయగలవా? ప్లీజ్... చాలా అవసరం"
"డబ్బు మాత్రం అడక్కు. మాఆయనకు నాకు రోజూ ఇదే గొడవ "
"నో... నో.. డబ్బు కాదు. మాఇంటికి వెళ్లి అందరూ బాగున్నారా... లేదా చూసిరావా ప్లీజ్! 
నేనొక గంటతరువాత ఫోను చేస్తాను" ప్రాధేయబడుతూ అడిగింది గీత. 
"ఒకే ... మీ ఇంటికి  వెళ్లాలంటే చుట్టూతిరిగి వెళ్ళాలి. వన్ వే లతో పెద్ద తలనొప్పి. అర్జెంటుగా రిపోర్ట్స్ పంపించాలి. అవి అవుతూనే వెళతాను. ఎలెవన్ థర్టీ 
తరువాత ఫోను చెయ్యి. సరేనా !?" అంటూ ఫోను పెట్టేసింది సంధ్య. 
సరిగ్గా అనుకున్న టైం కి  ఫోను చేసింది గీత. 
"ఇదిగో ! ఇక్కడే ఉన్నాను. మీ అమ్మతో మాట్లాడు...అంటూ ఆవిడకు ఫోను ఇచ్చింది సంధ్య. 
"అమ్మా! బాగున్నావా ? పార్ధు ఎక్కడున్నాడో తెలిసిందా ? వాడు క్షేమంగా ఉన్నాడా ?
నన్నువెంటనే హైదరాబాద్ రమ్మని నాన్న ఫోను చేశారు.ఏమైంది ?" ప్రశ్నలతో ముంచెత్తింది తల్లిని గీత. 
"మేమిద్దరం బాగానే ఉన్నాము. పార్ధు జాడ తెలియదు. వాడు రాలేదు. ఆయన ఏ ధ్యాసలో ఫోను చేశారో ఏమో ! నువ్వెందుకు రావడం ఇప్పుడు. డబ్బు దండుగ . ఇద్దరం బాగానే ఉన్నాము. 
ఫోను ఆ అమ్మాయికి ఇస్తున్నాను" అంది తల్లి రంగనాయకి.
"ఒకే నా ! ఇక నేను ఆఫీసుకి వెళతాను" అంది సంధ్య 
"థాంక్ యు సంధ్యా ! థాంక్ యు సో మచ్ " అని ఫోను పెట్టేసి 
'ఏమిటీ మిస్టరీ ... వెంటనే రాకుంటే అనర్ధం జరిగి పోతుందంటాడు నాన్న! అంత బాగానే ఉంది అంటుంది అమ్మ... ఏవిటో అంతా అగమ్యగోచరం" అనుకుంటూ నిద్రలోకి జారుకుంది గీత. 
                                                                * * * * * 
పని ఒత్తిడితో తండ్రికి వారం పాటు ఫోను చేయలేదు గీత. ఆదివారం. ఇండియాలో సమయం ఉదయం ఎనిమిది దాటింది. గుడిలో ఉంటాడని తండ్రికి ఫోను చేసింది గీత. 
'ఫోన్ స్విచ్డ్ ఆఫ్' అని వస్తోంది. అర్ధగంట తరువాత కంగారుగామళ్ళీ ఫోను చేసింది. 'ఫోను స్విచ్డ్ ఆఫ్' అనే రికార్డెడ్ సమాధానం వస్తోంది. సంధ్యకు ఫోను చేసింది. 
ఆమె ఫోను ఎత్తలేదు. ఇద్దరు ముగ్గురు స్నేహితులుని కాంటాక్ట్ చేసింది. స్నేహితుడు రవీంద్ర మాట్లాడాడు. విషయం చెప్పి అర్జెంటుగా ఇంటికి వెళ్లి అక్కడనుంచి ఫోను చేయమని అడ్రసు వివరంగా చెప్పింది. అర్ధగంటలో అతను ఫోను చేశాడు.  
"గీతా ! గుడి వెనకాల వున్న సిమెంట్ రేకుల ఇల్లేనా ? తాళం వేసి ఉంది. గుడి కూడా తాళం వేసి వుంది. మూడు, నాలుగు రోజులనుంచి పూజారిగారు,ఆయన భార్య లేరని, పక్కనున్న కిరాణా షాపతను అంటున్నాడు. నువ్వు తెలుసట అతనికి. అతనితో మాట్లాడుతావా? "అంటూ గుప్తా ఫోన్ ఇచ్చాడు రవీంద్ర.
"గీతమ్మా ! కిరానా షాప్ గుప్తా అంకుల్ ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా ?  మీ నాయనగారు కాశీ వెళ్లారని తెలిసింది. అమ్మగారు అనారోగ్యంతో చౌరస్తా పక్కనే ఉన్న హాస్పిటలో చేరారు. మీ తమ్ముడు దేశాలు పట్టుకుపోయాడు. ఇంటి తాళం చెవి నాకు ఇచ్చి వెళ్లారు అమ్మగారు" అన్నాడు గుప్తా. 
గుప్తా ఫోను నంబరు తీసుకుని రవీంద్రకు థాంక్స్ చెప్పి ఫోను పెట్టేసి ఆలోచనపడింది గీత.
                                                                * * * * *
'అమ్మకు ఆరోగ్యం బాగాలేదా ? అందుకే నాన్న వెంటనే  రమ్మన్నారా ? ఇక తాత్సార్యం చేయడం మంచిదికాదు. ఒకసారి వెళ్లి రావడం బెటర్' అనుకుంటూ కంపెనీ అనుమతి తీసుకుని  
హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకుంది. రెండురోజుల తరువాత హైదరాబాద్ వచ్చింది గీత. 
అమీర్ పేటలో ఇంటికి చేరేసరికి ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉంది. కిరాణాషాప్ 
అమిత్ గుప్తాతో మాట్లాడింది. ఇంటి తాళంచెవి తీసుకుని స్నానంచేసి బయలుదేరి చౌరస్తా పక్కనే ఉన్న హాస్పిటల్ వెళ్ళి ఆరా తీసింది గీత. 
"రంగనాయకి నూట మూడో నంబరు గదిలో ఉంది" చెప్పింది రిసెప్షనిస్ట్
రూమ్ తలుపు కొట్టి లోనికి వెళ్ళింది గీత. అలికిడికి లేచింది రంగనాయకి. 
"గీతా నువ్వా ? ఎప్పుడొచ్చావు. నేనిక్కడున్నాని ఎవరుచెప్పారు ?" ఆశ్చర్యానందాలతో లేచి కూతురిని కౌగలించుకుంది  రంగనాయకి. 
"ఎవరు చెప్పలేదు. నేనే వెతుక్కుంటూ వచ్చాను. ఏమైందమ్మా నీకు ... ఆరోగ్యం బాలేదా ? 
సంధ్య వచ్చినప్పుడేమీ చెప్పలేదే ? ఎలా వున్నావమ్మా ? నీకిలావుండగా నాన్న కాశీ ఎందుకు వెళ్లారు?" ఆర్ద్రంగా అంది గీత ఏం వినాల్సి వస్తుందోనన్న భయంతో. 
"నేను బాగానే ఉన్నానమ్మా ! అనారోగ్యం ఏమీ లేదు. నేను చేసినపనే ఆయనకు నచ్చలేదు.. కోపం వచ్చి వెళ్లిపోయారు" అంది రంగనాయకి నిర్వికారంగా.
"అంత కాని పనేం చేశావమ్మా ?"ఆవేదనతో తల్లడిల్లిపోతూ అడిగింది గీత.     
"కాని పనేం చేయలేదు. డబ్బు కావాలి. సంసారాన్ని కాపాడుకోవాలి. అదే ధ్యేయంగా నడిచాను. 
మీ నాన్నగారు ఒప్పుకోరని ముందుగా చెప్పలేదు. ఆయన అపార్థం చేసుకుని నీతో మాట్లాడారు. డాక్టర్ చెప్పాక, వివరం విని తట్టుకోలేక  కోపంతో కాశీ వెళ్లిపోయారు.
డబ్బున్న వారే ఇల్లు, కార్లు అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. 
నేనెందుకు అద్దెకివ్వకూడదనుకున్నాను. ఇచ్చాను ! ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు". 
"అద్దెకిచ్చావా ... ఏమిచ్చావమ్మా? "
"గర్భం" అంటూ ముగించింది రంగనాయకి నిర్వికారంగా. 
తల్లి ఒడిలో వాలిన గీత కళ్ళనుండి అశ్రుధారలు ఆగకుండా వర్షిస్తున్నాయి.  
                                                     ----------xxx----------

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 98491 18254 

 (ఈ మినీ కథ 'సహరి' కొసమెరుపు కధల పోటీ లో సా.ప్ర కు ఎంపిక కాబడింది)