లేబుళ్లు

20, ఆగస్టు 2010, శుక్రవారం

Role model

    
                                                    ఎక్కడో ఒకరు
                                            -------------------------- 
మా ఆడపడుచు పెళ్లి అని నాలుగు రోజుల ముందు వచ్చాం అమెరికానుంచి. హైదరాబాదులో పెళ్లి. ఆడపడుచు సాఫ్ట్ వేర్ ఇంజినీర్,బాగా చడువువచ్చిన పిల్ల.M.Tech (IIT ). పిల్లవాడు B.Tech, I I M , అహమ్మదాబాద్, లో M.B.A  చేసాడు. ఏదో MNC  లో వర్క్ చేస్తున్నాడు.మంచి జీతం. చివరి పెళ్లి అని, వాళ్ళు కొద్దిగా పై స్థాయి వాళ్ళని,  మా మామ గారు చాలా ఆడంబరంగా చేస్తున్నారు. మేమే చాలా డబ్బు తెచ్చాము పెళ్ళికని.  పెళ్ళివారి విడిది నుంచి మాటికి మాటికి ఏవో కోరికలు వస్తూనే వున్నాయి. పిల్లాడి తల్లి,వ్యవధి ఇవ్వకుండానే ఏవో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. కనీసం మాకుటుంబం వరకైనా వెండి పళ్ళేలలో టిఫెన్లు పెట్టండి అన్నారు. అప్పటికప్పుడు ఈయన వెళ్లి  వెండి ప్లేట్లు కొనుక్కో వచ్చారు.  పిల్లవాడు, తండ్రి వాళ్ళని ఎందుకు అలా విసిగిస్తారు అని అంటూనే వున్నారు. పెళ్లి కొడుకు తల్లి వయసు  55  సంవత్సరాల పైన మాటే. ఆవిడ పెద్ద హీల్స్ఉన్న చెప్పులు వేసుకుని నడుస్తుంటే నాకు నవ్వు వస్తోంది.ఎక్కడ బొక్క బోర్లా పడుతుందో అని నవ్వుకున్నాను నాలో నేను. పైకి నవ్వితే  ఎక్కడ కోపాలోస్తాయో నని భయ పడి చస్తున్నాను.మా అత్త గారు గమనిస్తూనే వుంది.' జాగ్రత్త వాళ్ళతో.ఆమె సొసైటీ వేరు" అని హెచ్చరించి వెళ్ళారు అక్కడనుండి..
ఎదురుకోళ్ళు అయి పోయాయి.అంతా సరదాగానే వుంది. ఆవిడ, పెళ్లి కొడుకు అక్క గారు ముడుచుకునే వున్నారు.
అసలు పెళ్లి కొడుకు తల్లికి మన సంబంధం ఇష్టం లేదులా వుంది అని పించింది ఆ క్షణాన, నాకైతే.
పెళ్లి ముహూర్తం రాత్రి 10.00  గంటలకి. ఇంకా రెండు గంటలు వుంది. ముందు భోజనాలు  చేస్తా మన్నారు.
పెళ్లి వాళ్ళకి  వడ్డించాలన్నారు. అందరు భోజనం చాలా బాగుంది అన్నారు, ఆవిడ, ఆవిడ కూతురు తప్ప. మిగతా వాళ్ళందరికీ
బుఫే. అతిధులు చాలమంది వచ్చారు.  రాత్రి 9.30 గంటలయింది.  బ్రాహ్మలు పెళ్లి కుమారుణ్ణి, తల్లీ, తండ్రినీ  త్వరగా మంటపానికి  రమ్మని మైకులో పిలుస్తున్నారు. మామగారు, అత్త గారు, ఈయన  అందరు  హడావుడిగా వెళ్ళారు
నేను పెళ్లి కూతురు  దగ్గర వున్నాను.గౌరీ పూజ అయిపొయింది.
ఇంతలో ఈయన చాలా హడావుడిగా వచ్చారు మా గదిలోకి. ఆయన్ని చూసే సరికి నాకు ఏదో జరగ  కూడనిది ఏదో జరిగిందని   పించింది. " పెళ్లి కొడుకు తల్లి  పెళ్లి  మంటపానికి దీపాలతో వస్తూ మెట్లమీద బోర్ల పడింది.
లేవ లేక పోతోంది. ముక్కు,మూతి పగిలినట్లుంది. చాలా రక్తం వస్తోంది. కుడి కాలు కూడ కడప లేక పోతోంది. డాక్టర్ ఎవరోవున్నారు.చూస్తునారు". అని చెప్పి వెళ్ళారు అయన. నువ్వు ఇక్కడే ఉండమని పెళ్లి కూతురుతో చెప్పి నేను ఆవిడ పరిస్థితి ఎలావుందో చూసి వద్దామని వెళ్లాను. డాక్టరు పరీక్ష  అయినట్లుంది. ముక్కు, మూతి శుభ్రం చేసి నట్లున్నారు. ఆవిడని బెడ్ మీదకు చేర్చారు. కుడి కాలు మోకాలి దగ్గర విరిగిందట.
కూర్చోవడానికి  ఏమాత్రం వీలు లేదట. నొప్పి తో కేకలేస్తోంది ఆవిడ. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అని నిర్ణయించారు.
ఆ స్థితిలో కూడ  ఆవిడ పెళ్లి కూతుర్ని నోటికొచ్చినట్లు మాటలంటోంది. పిల్ల  జాతకం మంచిది కాదుట.  ఇంకా నయం నా కొడుక్కేమి కాలేదు. ఈ ముహూర్తానికి మాత్రం పెళ్లి వీల్లేదు అంటోంది అవిడ భర్తతో.ఆయన ఆమెను వారిస్తున్నాడు.
చిన్నదెబ్బలే కదా పెళ్లి ఆపవద్దు. ఎవరికీ మంచిది కాదు. ఆపిల్ల సంగతి కూడ ఆలోచించు.నువ్వు కూడా ఆడపిల్ల తల్లివే. ఆవిడ, పెళ్లి కొడుకు అక్క గారు ససేమిరా అంటున్నారు. సరే తరువాత ఇంకో ముహార్తానికి  చూద్దాం  లెండి అంటోంది  ఆవిడ. ఆయనకీ కూడ ఓపిక పోయినట్లుంది. ఆయన  సూచన మేరకు మామగారు , అత్తయ్య గారు, ఇంకా కొద్ది  మంది పెద్దవాళ్ళు ఆవిడని పెళ్లి వాయిదా వెయ్య వద్దని బతిమిలాడు తున్నారు. అత్తయ్య గారైతే ఆవిడ కాళ్ళు పట్టుకున్నంతగా బతిమిలాడు తున్నారు. విసుక్కుంటోంది ఆత్తయ్య గారిని ఆమె. నాకు చాల బాధగా అనిపించింది.
ఛీ, ఏం మనిషో! ఎంతమంది చెపుతున్నాకనీసం ఆడపిల్ల పెళ్లి  ఇంతా వరకు వచ్చి ఇంత చిన్న కారణానికి, అదీ ఆవిడ అజాగ్రత్త వల్ల జరిగి, ఆగిపోతే ఎంత ఇబ్బంది! అత్తయ్య గారిని ఇవతలకు పట్టుకుని తీసుకు వచ్చాను.
ఆవిడ లో ఏమాత్రం చలనం లేదు. లేదు, ఇప్పుడు కాదు, తరువాత చూద్దాం   తప్ప వేరే మాట లేదు. ఇంక లాభం లేదని అందరూ వెనక్కి వచ్చేశారు. పెళ్లి కొడుకు కూడా నచ్చ చెప్పాడు. ఇప్పుడు కాదు! ముహూర్తం బాగా లేదు. ఇక నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం! ఆవిడ నిర్ణయం చెప్పేసింది. డాక్టరు  ఇంకా మాట్లాడకుండా నొప్పి తెలవ కుండా  ఇంజెక్షను ఇచ్చారు. ఏమీ ప్రమాదం లేదు . ఆవిడను కుర్చీ కూర్చోబెట్టి కార్య క్రమం కానివచ్చు అన్నాడు. మీకేమి భయం లేదండీ అని  చిన్న పిల్లకు చెప్పినట్లు చెప్పారు డాక్టరు గారు. ఇంతలో  అంబులెన్సు వచ్చింది. ఆమె భర్త, పెళ్లి కొడుకు, డాక్టరు  గారు పెళ్లి తంతు గంటలో అయి పోతుంది అప్పుడు వెళదాం  ఎంత వారిస్తున్నాతనే అంబులెన్సు వారిని స్త్రెచెర్ తెమ్మని చెప్పింది. చూస్తూండగానే  ఆవిడ హాస్పిటల్ కి వెళ్ళారు, కూతురుఆవిడతో వెళ్ళింది. మామయ్య గారు ఆఖరి ప్రయత్నం గా మీ తమ్ముడు గారు వాళ్లెవరైనా పీటల మీద కూర్చొని పెళ్లి కాని వ్వచ్చండీ అన్నారు పెళ్లి కొడుకు తండ్రితో. అలాగా ! ఆగండి, అని అయన స్వయానా తమ్ముణ్ణి పిలిచి నువ్వు, మరదలు కూర్చుని పెళ్లి కానివ్వండిరా" అన్నారు. ఆయన తనని పక్కకి తీసుకు వెళ్లి ఏదో మాట్లాడారు.మాటలు కొద్దిగా వినిపిస్తూనే వున్నాయి. వదిన మమ్మల్ని బతకనివ్వదన్నయ్యా' అంటున్నాడు అయన. ఆయన భార్య బావగారు,ఇప్పుడే రిలేషన్లు అంతంత మాత్రం. ఇక అది కూడా తెగ్గొట్టు కొమ్మంటారా మమ్ములని "అంటోంది అవిడ.
మా పరిస్థితి అంతా అగమ్య గోచరం. మామయ్య గారు,అత్తయ్య గారు, పెళ్లి కొడుకు తండ్రితో మళ్ళీ మాట్లాడారు.
ఆయన , క్షమించండి ! నేను, బాబు   శాయ శక్తులా కృషి  చేశాము. మావల్ల కాలేదు.ఆయన పాపం తల దించుకునే మాట్లాడారు. పెళ్లి కొడుకు చూపుల్లోనే తెలుస్తోంది. అతను పడుతున్న బాధ! అపరాధిలా వంచిన తల ఎత్తలేదు.
ఇక తరు వాత ఇంకో ముహూర్తం చూద్దాం. అని, ఆయన పెళ్లి కొడుకుతో  సహా వెళ్ళారు.
ఇంతలో బ్రాహ్మలు 'అయ్యా, ముహూర్త సమయం మించి పోయింది. ఇక మేము వెళ్లి వస్తామండీ'...అంటూ వారు కూడా వెళ్లి పోయారు. ఒకళ్ళ తరు వాత ఒకళ్ళు చూస్తుండగానే పెళ్లి హాలు ఖాళి అయిపొయింది. 'బాజాల వాళ్ళు అయ్యా రేపు ఇంటికి వచ్చి కలుస్తాం' అనగానే మామగారు జేబులో డబ్బు తీసి ఇచ్చారు. నాకు తల తిరిగి పోతోంది. ఈ మనుషులు మారరు!
ఉన్న సమస్య అంతా ఈ ఆడవాళ్ళ తోనే వుంది! ఆనుకున్నా మనస్సులో. లేదు మంచి వాళ్ళు కూడా వున్నారు నీకు తెలుసుగా అంది నా మనస్సు. చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ,వున్నవాళ్ళు, లేని వాళ్ళు అని  కాదు సమస్య. సంస్కారం, కుసంస్కారం!అంతే.
అందరు  ఇంటికి చేరే సరికి రాత్రి 12 గంటలయింది. నేను, అత్తయ్య గారు, ఆడపడుచు ముందే ఇంటికి వచ్చాం.
ఎవ్వరు ఏమీ తినలేదు.అత్తయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రం.నేను వెళ్లి కాసిని పాలు వేడి చేసి ఇచ్చాను.ఆవిడ అవి కూడా తాగి నట్లు లేదు.ఇక పెళ్ళికూతురి మొహం  చూడడానికే నాకు చాలా బాధగా వుంది. మామయ్య గారు రావడమే తన గదిలోకి
వెళ్లి తలుపు వేసుకున్నారు. ఆయనకు కూడ కాసిని వేడి పాలు ఇచ్చి వచ్చాను. ఆయన వచ్చారు. ముఖం కళా విహీనంగాఅయింది. పీక్కు పోయింది. ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. ఆయనకీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.
" ఏమిటిది? ఎందుకిలా అయింది?. పాపం చెల్లి సంగతి తలుచు కుంటేనే భయం వేస్తోంది. అది ధైర్యం కలదే. అమ్మ,నాన్న గారి పరిస్థితి ఏమిటో అర్ధం కావడంలేదు. అసలా పెళ్లి వాళ్ళు మళ్ళీ మన్ని కలవడం కాని, మళ్ళీ ముహూర్తాల ప్రస్తావన  కాని వస్తుందన్న ఆశ మాత్రం నాకు లేదు. ఈ సంగతులన్నీ తెలుస్తే చెల్లి ఆకుర్రాడితో అసలు పెళ్ళికి ఒప్పుకోదు! ఏమిటో అంతా అయోమయంగా వుంది! అసలు పెళ్లి కొడుకు తల్లి కి ఈ పెళ్లి ఇష్టం వున్నట్లు నా కనిపించడం లేదు. అవిడ, అవిడ కూతురు ఇద్దరూ ఇద్దరే! సినిమాల్లో, T V  సీరియల్ లో విలన్ల్నలా వున్నారు. నాకు ఇవాళ అక్కడ పరిస్థితి చూసి మీ చెల్లి పెళ్లి  గుర్తు
కొచ్చింది. మీ చెల్లి అత్తగారికున్నపెద్దమనసు ఈపెద్దమనుషులకి కొద్దిగాయినా వుంటే ఈరోజు ఇలా  జరిగి వుండేది కాదు. ఎందుకు  సంస్కారం లేని చదువులు ! దేశంలో ఇలా ఎక్కడా జరగదనుకుంటా. తప్పు ఆమెది. ఆ వయస్సులో ఆ   హై హీల్స్ చెప్పులేమిటి.  అదీ పెళ్లి మంటపానికి వస్తూ చెప్పులెందుకు. సరే అయిందేదో అయింది. సాటి ఆడ మనిషే! తనకు కూడ ఆడ పిల్ల వుంది. మన సమాజం లో , పెళ్లి ఆగితే ఆడపిల్ల, తల్లి తండ్రుల వెతలు తెలీదా !ఇందుకే కదూ, ఆత్మ హత్యలు, తలి తండ్రుల బలిదానాలు. ఛీ! ఎందుకు ఆడపుటక పుట్టారు",  ఆయన ఆవేశంతో ఊగి పోతు మాట్లాడుతున్నారు.నేను మెల్లగా వెళ్ళాను అయన దగ్గరికి. చేతిలోకి చేయి తీసుకుని  మౌనంగానే వున్నాను చాలా సేపు. అయన కళ్ళ వెంట నీళ్లు వస్తూనే వున్నాయి. గద్గద స్వరం తోనే మాట్లాడుతున్నారు ఇంతసేపు. ఆయన కొద్ది భావోద్రేకం చెందినా గొంతు గీర పోతుంది. నాకు మనసులో మనసు లేదు.' నేను మీ చెల్లి దగ్గరికి వెళుతున్నాను మీరేమైనా తింటారా'? అయన మౌనం గానే వున్నారు. అదే అయన సమాధానం.
నేను మెల్లగా వెళ్లి తన పక్కనే కూర్చున్నాను.తను నిద్ర పోయినట్లు లేదు. వదినా మీ చెల్లి పెళ్లి అప్పుడు ఇలాగే జరిగింది కదా!
అత్తగారికి చాల సీరియస్ గా వళ్ళు కాలింది కదా! అయినా ఆవిడ పెళ్లి చేయమని ,పెళ్లి  ఎట్టి  పరిస్థితిలో  ఆపొద్దు అని చెప్పి పెళ్లేయ్యేలా చూసింది కదా! మరి ఈవిడ ఎందుకిలా చేసింది ?   "ఏదో  బాడ్ లక్. వదిలేయ్. పడుకో.తరువాత మాట్లాడవచ్చు'.అన్నాను నేను. అది కాదు వదినా just  compare ! ఈవిడకు చాల చిన్న దెబ్బలు. ఆవిడకు పెద్ద ప్రమాదం.
40 % కాలిగాయాలు. అసలు పోలికే లేదు. ఈవిడకు ఈ పెళ్లి ఇష్టం లేదు. thats it ! ఇప్పుడు నాకు  ఇష్టం లేదు! ఫినిష్ ! అంతా closed , thats the end  of the matter . 'అంతా మన మంచికే'  అని అటు తిరిగి పడుకుంది తను. బ్రేవ్ గర్ల్ అనుకున్నాను.
నేను మంచానికి ఇటు  చివరగా ఒరిగాను. ఎంత కళ్ళు మూసుకుందామన్నాకళ్ళు మూత పడలేదు.
రెండేళ్ళ క్రింద  మాచెల్లి పెళ్ళిలో జరిగిన  సంఘటన కళ్ళ ముందు కదలాడింది.      
చెల్లి పెళ్లి ముహుర్తానికింకా మూడు,నాలుగు  గంటలు వ్యవధి వుంది. మా అన్నయ్య, మా ఆయన   మగ పెళ్లి  వాళ్ళని తీసుకుని రావడానికి బయలుదేరు తున్నారు. జాగ్రత్త అండీ. ట్రాఫిక్ చాలా ఎక్కువగా వుంది జాగ్రత్త అని వాళ్ళ కారు వెళ్ళగానే లోపలికి వచ్చేసాను.మళ్ళీ టైం చూసుకున్నాను. ముహుర్తానికింక చాల టైము ఉంది. ఒక్క సారి కూర్చుని చెల్లి, నేను,అమ్మ మళ్లి పెళ్లి కావలసిన సామాగ్రి అంతా సరి చూశాము. సారె పెట్టె కూడ సది రేశాను. ఇంకా మంటపం కడుతునే వున్నారు.' ఏమయ్యా బాబూ, ముహూర్తం టైము దాకా కడుతూనే ఉంటారా'?  అనడిగాను నేను. 'అయిపోయిందమ్మా ఇంకా అర్ధగంటలో అయిపోతది'.
వంట వాళ్ళూ ఏమి చేస్తున్నారో చూద్దాం అని అటుగా వెళ్లాను. ఇద్దరు కూరలు తరుగు తున్నారు.మరిద్దరు పిండికలుపుతునారు. అంతా ఎవరి పని లో వాళ్ళు నిమగ్నమై వున్నారు. నన్ను చూసి కేటరర్ మనిషనుకుంటా.
ఏంటమ్మా ఏమైనా కావాలా? మర్యాదగా అడిగాడు.  నాలుగయిదు 'టీ' లు పంపించగలరా? ఫ్రెష్ గా పెట్టండి!
అలాగేనమ్మా ఇప్ప్డుడే పంపిస్తాను' అన్నాడతను. అతిధులు, చుట్టాలు కొంత మంది వచ్చేశారు.
నేను వెనక్కి వచ్చి మా రూములో ఫాను  క్రిందకు  కుర్చీ లాక్కుని కూర్చుని కొద్దిగా రిలాక్సేడ్  గా కూర్చున్నాను.
అమ్మా,చెల్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలకి హాయిగా పెద్ద స్థలం  దొరికిందేమో  తెగ ఆడుతున్నారు. ఇంతలో మా ఆయన
చెప్పిన విషయం గుర్తుకి వచ్చి లేచి మగ పెళ్లి వాళ్ళ కిచ్చిన  రూము వైపు వెళ్లాను. క్రింద కార్పెట్ బాగా మాసి పోయింది.
బాత్ రూం అంతా శుభ్రంగా లేదు. కార్పెట్ మార్చమని రూమంతా శుభ్రం చేయించమని చెప్పినా ఇంకా అలాగే వుంది. అక్కడ
మేనేజర్ ని కలిసి గట్టిగా చెప్పి టీ వచ్చిందేమో నని  గది కి వచ్చి మళ్ళీ ఫాను క్రింద కూర్చున్నా. ఇంతలో 'టీ ' వచ్చింది!   
వేడి 'టీ' తాగే సరికి కొద్దిగా ఉత్సాహం వచ్చింది. చెల్లిని స్నానం చేసి ఇంక తయారు కావే అని చెప్పి ఇటు తిరిగే సరికి  అమ్మ
నాన్న గారి ఫోటో శుభ్రం చేస్తూవుంది. ఒక్కసారి మనసంతా బాధగా అనిపించింది. పాపం నాన్నగారు ఏమీ అనుభవించ
కుండానే వెళ్లి పోయారు. మనవడు, మనవరాలు బాగా  చదువుకుంటున్నారు, నేను,ఆయన  అమెరికాలో మంచి ఉద్యోగాలు చేస్తున్నామంటే  ఎంత సంతోషించే వారు. అమెరికా వచ్చి వుండే వారు. పాపం అయన జీవితం లో ఏమి
 సుఖ పడకుండానే వెళ్లి పోయారు, అని అనుకున్నాను. ఇంతలో అన్నయ్య దగ్గరనుంచి ఫోను. పెళ్ళికొడుకు ఇంటికి చేరారట. అర్ధగంటలో బయలు దేరు తారట.బయలు దేరిన వెంటనే ఫోను చేస్తామని చెప్పాడు వాడు. అమ్మకి ఈ విషయం చెప్పాను.
 పెళ్లి వాళ్ళు రాగానే బయట నుంచే మేళంతో  తీసుక రావాలని, భజంత్రీ లను తయారు గా ఉండమని చెప్పాను.
మంటపం, మగ పెళ్లివాళ్ళ గది అన్నీ మళ్ళీ చూశాను.అంతా సవ్యంగానే వుంది. కేటరింగ్ ఆయనకు చెప్పి ఫలహారం,కాఫీ,టీ,
రెడీ గా ఉంచమని చెప్పాను. వాళ్ళు రాగానే అందరికి ఇవ్వాలని చెప్పాను. ఇంతలో ఆయన దగ్గరనుంచి ఫోను.బయలు దేరామని, అర్ధగంటలో అక్కడుంటామని. అమ్మతో చెప్పి చెల్లి దగ్గరికి వెళ్లాను. అది స్నానానికి వెళ్ళింది.
బయటకు వచ్చాను. మంటపం వెనుకాల వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, ప్రతిమలను సర్దు తున్నారు.
స్వామి అంతా సవ్యంగా జరిపించు తండ్రీ అని మనః స్పూర్తిగా వేడుకున్నాను. తధాస్తు అన్నట్లు చేతిలో ఫోను మ్రోగింది.
అయన దగ్గరనుంచే. ఒక్కసారిగా, నా నెత్తిన పిడుగు పడ్డట్లు అయింది. స్పృహ వున్నా తల తిరుగుతోంది. ఇప్పుడే కదా స్వామీ నిన్ను మనః స్పూర్తిగా వేడుకున్నాను. ఇంతలా అన్యాయం చేస్తావా? అమ్మకు చెపుదామా, వద్దా అని కంగారు పడుతూ
లోపలి వెళ్ళాను. అప్పటికే ఎవరో వాళ్ళ  చుట్టాలకి కబురంది నట్లుంది...అమ్మ గోల, గోలగా ఏడుస్తోంది. చుట్టాల్లో అంతా గగ్గోలు. అమ్మ నన్ను చూసి ఒక్కసారిగా లేచి నాదగ్గరికి వచ్చి ఇదేంటి ,తల్లీ, పెళ్లి కొడుకు తల్లి వళ్ళంతా  కాలిందట కారులో వస్తుంటే?
అసలు సంగతి ఏమిటే? అమ్మ నన్ను నిలతీసింది. నన్ను నేను కొద్దిగా శాంత పరుచుకొని, కూడ తీసుకుని అమ్మా, ఏమీ లేదు,
కొద్దిగా కాలి   గాయాలు అయ్యాయట ఆవిడకు. కారులో ముందు కూర్చుని కాళ్ళ దగ్గర  ముట్టించిన దీపారాధన కుందులు పెట్టు కుందట. చీర అంటుకుని కాళ్ళకి కొద్దిగా కాలిన గాయాలయ్యా యట. ఏమిటో నమ్మా,అంతా కంగారుగా వుంది.ఆయన, అన్నయ్య అక్కడే వున్నారు. ఇంతలో మళ్ళీ ఫోను వచ్చింది. అన్నయ్య ఫోను. ఆవిడను ఉస్మానియా హాస్పిటలు కి తీసుకు వెళ్లారట , పోలీసులు కూడా వచ్చారట.అన్నయ్య మళ్ళీ ఫోను చేస్తానన్నాడు. మళ్ళీ మంటపం దగ్గరకు వచ్చి స్వామి కి
మొక్కు కున్నాను. పెళ్లి నిర్విఘ్నం గా అయ్యేట్లు చూడు స్వామీ.నీ కొండకు నడిచి వస్తాను  అని  మొక్కు కున్నాను. వచ్చిన  అతిధులు, మగ పెళ్లి వాళ్ళ చుట్టాలు, మాచుట్టాలు, స్నేహితులు అందరు ఆవిడ ప్రమాదం గురించే చర్చ. ఇంకేమి పెళ్లిలే!
తల్లి కి ఇంత అయితే వాళ్లు  అసలు రావొద్దూ! ఎంత అప్రదిష్ట ! పెళ్లి కూతురు సరిగ్గా నోచుకో లేదు. తండ్రీ లేడు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగితే ఇంకేమన్నా ఉందా? బాబోయ్! నలుగురు నాలుగు మాటలు, నానా మాటలు! ఏమి మనుషులు రా బాబూ! ఇంతలో
మంటపం కట్టిన వాళ్ళు అంతా బాగా కట్టినమమ్మ, మంచి పూలతో సజాయిన్చినమమ్మా! శుభ్రం కూడ చేసినం. వాడి చేతిలో రెండు వందలు పెట్టి పక్కకు వచ్చి ఆయనకు ఫోను చేసాను. ఆయనతో  మాట్లాడిన తరువాత కొద్దిగా ఉపశమనం కలిగింది.
ప్రాణ భయం లేదు.దాదాపు 40% వళ్ళుకాలిందట.ఆవిడ స్పృహ లోనే వున్నారు. పోలీసు లకి అంతా తన పొరబాటు వాళ్ళే జరిగిందని చెప్పిందట. పెళ్లి ఎట్టి పరిస్తితుల్లో ఆగడానికి వీల్లేదని వాళ్ల ఆయన్ని వెంటనే కొడుకుని తో  బయలు దేరమని, కొడుకుతో కంగారేమీ లేదని వెంటనే వెళ్ళమని చెప్పిందట. అన్నయ్యను, మా ఆయన్ను కూడా పిలిచి బాబూ నావల్ల ఈ తప్పు జరిగింది. పిల్లకి చెడ్డపేరు రాకూడదు.నలుగురు నానా మాటలు అంటారు. వెంటనే పెళ్లి కుమారుణ్ణి మీతో తీసుకు వెళ్ళండి.మావాళ్ళకి అయన ఫోను చేసి చెప్పారు. ఎవరో ఒకళ్ళు పీటల మీద కూర్చుంటారు. వెంటనే బయలు దేరండి అని ధైర్యం చెప్పిందట. పెళ్లి కొడుకుతో సహా వీలు బయలు దేరారు.ఇంక అర్ధగంటలో ఇక్కడ వుంటారు. నాకు నిజంగా ఆ క్షణంలో ఆవిడ మీద ఎంత గౌరవం పెరిగి పోయింది. అవిడ సంస్కారానికి చేతు లెత్తి మొక్కాను. అమ్మతో జరిగిందంతా చెప్పి  మళ్ళీ మంటపం దగ్గరికి వచ్చి స్వామీ ఏమిటీ పరీక్ష ?  రక్షించావు స్వామీ! ఎన్ని జన్మ లెత్తినా నీ ఋణం తీర్చుకో లేను స్వామీ, అని నమస్కరించాను స్వామికి. పెళ్లి కొడుకు బాబాయి లా వున్నారు, వచ్చి" ముహూర్తానికి అన్నీ సిద్హంగా వున్నాయి కదమ్మా!
అన్నయ్య, వదినా ఇద్దరూ మాట్లాడారు. మమ్ముల్ని కూర్చుని పెళ్లి కానివ్వ మన్నారమ్మాఇక ఆట్టే సమయం లేదు !
వాళ్ళు రాగానే తంతు ప్రారంభిద్దాం" అని అయన అటు వెళ్ళారో,  లేదో బయట గేటు దగ్గర భజంత్రీల వాయిద్యం మొదలయింది. అమ్మయ్య వీళ్ళు వచ్చేసినట్లున్నారు. బ్రాహ్మలు కూడ ఏమవుందో నని స్తబ్దుగా ఉన్న వాళ్ళు హడావుడి మొదలెట్టారు మైకులో. నేను ఇంకా చాలా మంది గేటు దగ్గరికి వెళ్ళాము. పెళ్లి కొడుకు, అతని తమ్ముడు  వచ్చారు. అన్నయ్య పెళ్లి కొడుకు చేయి పట్టుకుని తీసుకు వస్తున్నాడు. వాళ్ళ  చుట్టాలు చాల మంది అతని చుట్టూ మూగి  ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అందరికి కలిపి అతను ఒక్కటే సమాధానం చెప్పాడు. "అమ్మ బావుంది. పెళ్లి కానివ్వమంది. దయచేసి  ఎవరూ  ఏమీ మాట్లాడ వద్దు. its an accident ". అయన పిల్లాడి వెనకాలే  వున్నారు. ఒక్కటే మాటన్నారు.' ఆవిడ సంస్కారం ఆడవాళ్ళ అందరికి మార్గ దర్శకం. ఆవిడ సంస్కారంలో పదో వంతు వున్నా ఈ సంఘం కొంతయినా  బాగు  పడుతుంది. ఆవిడ అయిదవ తరగతి వరకు చదువుకుందట. ఈరోజు ఆవిడ చూపిన సంస్కారం నేను జన్మలో మరచిపోను' అన్నారు అయన.
" పెద్ద కొడుకు పెళ్లి కోసం  కలలు కందిట, ఆవిడ, నాతో అంది. ఆవిడ ఎవరూ అడక్కుండానే ఎంత తెగువ చూపింది. ఆవిడని పొగుడుతూనే వున్నారాయన.
నాకు కూడా నిజంగా వెళ్లి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి రావాలని పించింది. "పిల్లాడిని కొద్దిగా ఫ్రెష్ అవుతారా" అనడిగాను నేను. ' నేను కాదు వదిన గారు, ముందు మీరు ఫ్రెష్ అయి రండి' అంటూ
ఫరవాలేదండీ, ముందు టైం చూడండి. అన్నాడతను నవ్వుతూ. 'తల్లికి తగ్గ కొడుకు అనిపించాడు'. అనుకున్నాను మనసులో.  పెళ్ళికొడుకుని సరాసరి మంటపం లోకి తీసుకు రమ్మన్నారు బ్రాహ్మలు. ముహూర్తానికి వధూ,వరుల్తో  జీలకర్ర, బెల్లం పెట్టించారు . పెళ్లి చాల తృప్తిగా అయింది. భోజనాలయ్యాయి. అతిధులు, చుట్టాలు అందరూ వెళ్లి పోయారు. వాళ్ళ వాళ్ళు ఎవరో హాస్పిటలు కి వెళ్లి తండ్రిని పంపించారు. ఆయన్ని నేను మావారు దగ్గరుండి చూసుకున్నాము. అప్పగింతలు అయ్యేసరికి రాత్రి 12.30 గంటలయింది. పెళ్లి కొడుకు తండ్రి వారిస్తున్నా మావారు ముందు వధూ,వరులని ని హాస్పిటలు కి వెళ్లి తన ఆశీర్వచనం  తీసుకు వెళ్ళాలని పట్టు బట్టారు. పిల్లాడు, తండ్రి అంతా కలిసి హాస్పిటలు కి వెళ్లి  పిల్లలకి ఆవిడ ఆశీర్వచనం తెసుకుని ఇంటికి వెళ్లారు. నేను అన్నయ్య ఇక్కడ పనులన్నీ చేసుకుని ఉదయం హాస్పిటలు కి వెళ్ళాము. తన కాళ్ళని నేను తాకి రెండు చేతులు జోడించి నమస్కారం చేసాను.అమ్మ కూడా ఆమెకు నమస్కారం చేసింది. మనస్సు చాలా తేలిక అయింది. చెల్లి చాలా అదృష్ట వంతు రాలనుకున్నా. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడయినా, ఆమె గురించి టాపిక్ వస్తే మావారు చాల భావోద్రేకులవుతారు.  ఆమెను దేవుడే అంటారు ఆయన. అంతే కాదు ఆయనకు ఆవిడో రోల్ మోడల్. అంతే కదండీ మరి! ఒక్కో సారి మనుషుల  త్యాగాలవల్ల, సందర్భాన్ని పట్టి తీసుకునే నిర్ణయాల వల్ల సంఘం లో ఎంతో కొంత మంది మనుషుల్లో పరివర్తన రావడ మనేది జరుగుతోంది అంటే ఇలాంటి  వాళ్ళే కదా కారణం!
నా వరకు నేను ఈ రోజు జరిగిన ఈసంఘటనతో మానసికంగా ఎంతో ఎదిగాను.పెళ్లి క వచ్చిన వాళ్ళలో కూడ ఎంతో మంది ఆవిడ నిర్ణయాని హర్షించడం నేను విన్నాను.
ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఎంతలేసి వుద్యోగంచేస్తున్నా, ఎంత డబ్బున్నా మనసున్న మనుషులు అందునా భర్త, అత్త మామలు దొరకడం ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం,తలి తండ్రుల చేసుకున్న పూజ ఫలాలే.
కేశిరాజు రజని వరదయ్య.         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి