లేబుళ్లు

30, సెప్టెంబర్ 2010, గురువారం

నిరామయ భారతం .... కవిత

నిరామయ భారతం  

భరతమాతనునేను
భరత ధాత్రిని నేను
తరతరాల దాస్యంతో
ధరిత్రి చరిత్రలో పుటల కెక్కిన నేను
తెల తెల్లని మిన్నాగుల బారినుంచి
బంధనాలుతెంచుకుని
బయల్పడ్డా ననుకొన్నాను
బిడ్డల నీడలో ఒడలంతా
బడలిక తీర్చుకుందా మనుకొన్నాను
దశాబ్దాలు దాటాయి
నాటి మొదలు నేటి వరకు
నా 'శిరోభారం' తీర్చిన వారు లేరు
శిరమే కాదు భారం
ఒడలంతా ఒరుసుకుపోతోంది
తూర్పు, పడమరలు
దక్షిణ, ఉత్తరాలు
ఎటు  చూసినా ఆటుపోట్లు
ఏమిచేస్తే 'మేలో' పాలు పోవడంలేదు లేదు !
అర్దరాత్రి స్వాతంత్ర్యం
అవస్థ పెడుతోందో ?
అవాచ్య విశృంఖలత్వం
విజ్రుంభించిందో ?
'వివక్ష' విభజనగా విస్ఫుటిస్తోందో  ?
మత మహమ్మారి మట్టగిస్తోందో ?
భిన్న సంస్కృతుల నా ప్రజ
'పక్షపాతం' పాలయ్యారో  ?
పాలకుల చేతిలో పగ్గాలు
పక్క దారి పట్టాయో ?
'పబ్బం' గడుపుకునే
'ప్రాపులు'ప్రామాణిక మయ్యారో ?
పొలాల పండుగలు
పట్నవాసం పాలయ్యాయో ?
పౌరసత్వ హక్కులు
పోరుసల్పందే 'పాలు' కావడంలేదో ?
తళుకు,బెళుకులు తలకెక్కాయో ?
తలనెరిసిన వారి తలలు
నీడ కోసం నిట్టూరుస్తున్నాయో  ?
జాతి సంపద 'సంపీడ్య' సాంక్రమిక
హక్కు భుక్త  మవుతోందో ?
ఏమీ తెలియక తెల్లమోహమేసుకుని
అర్ధంకాని, వ్యర్ధమైవుతున్న
స్వాతంత్ర్యంతో
స్వాంతన కరువైన 
స్వజనంతో ఏమని చెప్పను?
ఎవరికి  చెప్పను?
ఉన్నాయి ఊసులు
ఎన్నో, ఇంకెన్నో
ఇంకెవరికి చెప్పను?
నా హిమన్నదాలు ఇంకి పోతున్నాయనా!
నా 'గంగ' ఇంక గట్టుకి చేరదనా !
గమన నియమాలు'నీటికీ' నిబద్ధమనా!
నదీమతల్లుల నాట్యం
నిరంతరం నిరర్గళ మవుతే
నిర్నిబద్ధమేగా పైవారికి
నిరాపేక్షణేయమేగా క్రిందవారికి
అందుకు సన్నద్ధంకండి!
హరితవనాల్ని స'హరితం' చేయండి.
ప్రకృతి ప్రసాదాల్ని
పంచడం మానండి !
అవే ఆదుకునేది నాప్రజని
అప్పుడే 'నిరామయం' నా ప్రజకి .

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.   
   

20, సెప్టెంబర్ 2010, సోమవారం

బూచి ( boochi )

                                                                        బూచి
                                                  
             శనివారం. వినాయక చవితి. నాకు జ్ఞాపక మున్నంత వరకు వినాయక చవితి రోజున ఉదయాన్నేవెళ్లి మట్టి వినాయకుణ్ణి, పత్రి తీసుకునే వచ్చే అలవాటు. రెండు సంవత్స రాల నుంచి మా 'జూనియెర్' 'దియ' నాతో బయటకి తప్పక రావాల్సిందే. దానికిప్పుడు  అయిదేళ్ళు. ఈ సారి కుకట్ పల్లి  'రైతు బజార్'  దగ్గర  దూరంగా బైక్ పార్కు చేసి  ఇద్దరం నడిచి వస్తున్నాం.
పిచ్చిజనం. నడిచేందుకుకూడా సరిగ్గా జాగా లేదు. కుడిలేదు,ఎడమలేదు.
ట్రాఫిక్ సెన్స్ అసలే లేదు.ఆటోలు, బైకులు జనాలని రాసుకుంటూనే వెళ్తున్నాయి. చూస్తుండగానే పాపం మా ముందు నడుస్తున్నావిడ పాదం రాసుకుంటూ 'ఆటో' వెనక చక్రం పోయింది.  కుడి చేతిలో మట్టి వినాయకుణ్ణి మెల్లగా సంచిమీద పెట్టి  కాలుపట్టుకుని 'అమ్మా' అంటూ బాధగా అరుస్తూ కూలబడిందావిడ. ఎవరిగోల వారిదే అనుకుంటూ  దాన్నిఎత్తుకుని, ఆవిణ్ణి రోడ్డు పక్కగా తీసుకెళ్ళి కాలు చూశాను, కుడికాలి చిటికినవేలు నలిగి పైన చర్మం చీరుకు పోయింది. నలభై, నలభై ఐదు ఏళ్ళు ఉంటాయావిడకు. కూరగాయల సంచి ఒకచేత్తో, మట్టి వినాయకుడు ఇంకో చేతిలో, కూరల సంచి మోయలేకపాపం ఇబ్బంది పడుతోంది.
ఆవిడ చేయి పట్టుకుని పక్కనే మెడికల్ షాపు మెట్ల మీద తనని కూర్చో బెట్టి షాపులో ఆల్కహాల్ 'వైప్' తెచ్చి గాయం క్లీన్ చేసి  ఆవిడకు 'ప్రధమ చికిత్స' చేసి  ఆవిడ  వెళ్ళాక  నా షాపింగ్  మొదలెట్టాను. వెళ్తూ  ఆవిడ కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఆ రణగొణ ధ్వనిలో  'డాడీ, డాడీ' తనకు అందిన నా షర్టు అంచును పట్టుకుని లాగుతూ 'ఆమె ఎవరు'?... 
కాలుకు బ్లడ్ ఎందుకు వచ్చింది'? దాని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాను.
ఇంతలోనే  'డాడీ'...'పిన్ని'....'బూచి' ట్రాఫిక్ వేపు చేయి చూపిస్తూ అంది' 'దియ' .
ఆ రద్దీలో  నాకు 'దియ' ఏమన్నదో  సరిగ్గా వినబడలేదు.
'బూచి' అన్న పదం మాత్రం వినబడింది.
అది చూపించిన వేపు చూశాను.హోండా మోటరు బైక్  మీద ఓ కుర్రాడు,వెనకాల ఒక అమ్మాయి వెళుతున్నారు.
వెనకాల కూర్చున్న అమ్మాయి మా వంక చూస్తూ నేను కూడా అటుగా చూడడంతో చప్పున ముఖం తిప్పేసుకుంది.
ఆ అమ్మాయి ముఖం మొత్తంలో ఒక్క ముక్కు మాత్రమే బయటకు కనిపిస్తోంది. ముసుగుతో ముఖం మొత్తం తలవెనకాలగా రంగు రంగుల చున్నీతో కప్పేసుకుంది.
'ఓహో....ఆ అమ్మాయి వేషాన్ని చూసి 'బూచి' అనుకుందిలే' అని 'దియా'మాటలు పెద్దగా పట్టించుకోలేదు. మార్కెట్లోకావలసిన వన్నీమట్టి వినాయకుడు తో సహా  తీసుకుని ఇంటికి చేరేసరికి 10 గంటలు దాటింది.
'పూజకు అంతా రెడీనా' ? అడిగాను నేను.
'ఇంకాఎక్కడ, అమ్మవంట ఇంకా కాలేదు' సాగతీస్తూ అంది శ్రీమతి.
'పద్మా' నువ్వువంట త్వరగా చేస్తానంటే నేనేమీ వద్దు అన్నానా'? నా మానాన నేను హాయిగా టి.వి చూసుకుంటూ కూర్చునే దాన్ని. వంటచేయమని ఇప్పుడు దెప్పుతావేం ? మరి నాకు చేతనయినట్లు చెస్తాను. నీలాగా ఉరుకులు, పరుగుల మీద చేయలేనే తల్లీ ....' పెద్దగా నిట్టూరుస్తూ సమాధానమిచ్చారు ఉడుక్కుంటూ అత్తయ్య గారు .
'బాబోయ్...మీ కూతురితో వాదన పెట్టుకోకండి అత్తయ్యగారూ, కింద పడ్డ తనదే పైచెయ్యి అంటుంది' అన్నాను నేను మధ్యలో కల్పించు కుంటూ!
'ఆపుతావా నీ సోది అన్నట్లు చూసింది' నా వంక పద్మ.
'అప్పుడే ఆకలిదంచేస్తుంది. కొద్దిగా టీ ఇవ్వు పద్మా' వేడికోలుగా అడిగాడు తను.
'ఏమిటో బాబూ....ఇప్పుడు చూస్తున్నాం కానీ, మా చిన్నతనంలో'... 'అంతెందుకు మీ చిన్నతనం లో పూజ అయిందాకాఅసలు కాఫీ, టీ ఏమైనా తాగే వాళ్ళా'?  అసహనంతో అంది అత్తయ్య గారు.
ఇంతలో టీ తీసుకు వచ్చింది శ్రీమతి, ఆ చేత్తోనే 'దియ' కి కూడా 'బోర్న్ విటా' ఇచ్చింది, చల్లగాఉందేమో గట,గటా త్రాగేసింది దియ.
11 గంటలు. నేను పేపరు చదువుతూ కూర్చున్నాను.అది కిచెన్ సెట్ తో ఆడుతోంది .
నావంక చూస్తూ'ఈ పిల్ల ఇంకా రాలేదు. పూజ టైం లోపునే వస్తానంది' అర్ధగంటలో వస్తానని బయటకు వెళ్ళిన తన చెల్లెలి గురించి అంటోంది మా శ్రీమతి.
'అమ్మా' పిన్ని'బూచి' వేషం వేసుకుని స్కూటరు మీద వెళ్తుంటే చూశాను, అంది 'దియ' .
నేను పేపరులోంచి తల బయటకుపెట్టి మా ఆవిడ వంక ఆశ్చర్యార్ధకంగా చూశాను.
'ఏమిటండీ, ఇదేమిటో అంటోంది' ప్రశ్నార్ధకంగా నావైపు చూస్తూ.
'కమల' స్కూటర్  మీద వెళుతుంటే చూశానంటోంది' అన్నాను నేను.
ఆవిషయం నాకర్ధం అయింది మహానుభావా ?  మీరు బయటకు వెళ్లి నప్పుడే కదా ఇది మీతో వచ్చింది.'మీకు కమల కన్పించిందా  స్కూటరు మీద వెళ్తూ' అనుమానంగా అడిగింది మా శ్రీమతి.
'కొద్దిగా ఆలోచించాను. ' ఇదేమిటి మళ్ళీ అదేమాట అంటోంది. నాకు తానేమీ కన్పించలేదే'. ఇదేమైనా కన్ఫ్యూజ్ అయిందా ? లేక దీనికి  తను కన్పించిందా'? నాకు కొద్దిగా అనుమానం మొదలయింది.
ఇప్పుడు, నేను కొద్దిగా అనుమాన పడినట్లు 'పద్మ'కు అనుమానమొచ్చినా 'కమల' బ్రతుకు బస్స్టాండ్ పాలే.చంపేస్తుంది మాఆవిడ. అందుకే కచ్చితంగా చెప్పాను అది ఎవర్నో చూసి కన్ఫ్యూజ్ అయిందని.
అది విని  ఊరుకోవచ్చుగా, వేలెడంత లేదు, 'డాడీ'చూడలేదు మమ్మీ నేను చూశాను  పిన్నిని'
అంది కళ్ళు తిప్పుకుంటూ  'దియ'.
'ఎక్కడ చూశావే' ? ఆరా తీస్తూ అడిగింది మా ఆవిడ.
'మరేమో'నేనూ' దీర్ఘంతీస్తూ మొదలెట్టింది 'దియ'.
' పద్మా ' ఆపుతావా ఇంక ? అదేదో పేలుతోంది, అక్కడ ఇసుకేస్తే
రాలనంత జనం ఇది ఎవరిని చూసి కమల అనుకుందో' నువ్వేమో పెద్ద క్రాస్ ఎక్జామినేషను! వదిలేయ్' మనసులో ఏదో అనుమానం వేధిస్తున్నా పైకి మాత్రం అలా అన్నాను ఆ టాపిక్ అక్కడికి ఆపేయాలని !
'ఇక లే ముందు. దాని కేదో వేషధారణ చేస్తావుగా, మొదలెట్టు. నేనూ కూడ తయారవుతాను,
ఇక పూజ మొదలెడదాం'.
'పూజ టైంకల్లా కమల వస్తానంది అంటున్నావుగా,వచ్చేస్తుందిలే.కంగారేమిటి? చిన్నపిల్లే మి కాదుగా'అన్నాను నేను.
'అవును' అదే కదా నాబాధ. చిన్నపిల్ల అయితే బావుండేది. పెద్దది కదా' అందుకే నా భయం అంది పద్మ. ఇంతలో రానే వచ్చింది, కమల. 'ఎక్కడి కెళ్లావే' స్కూటరు మీద వెళ్తున్నావట కదా'? అంది పద్మ కమల వంక అనుమానంగా చూస్తూ.
'క్షణం, బిత్తరపోయి, నేనా ? స్కూటరు మీదనా? ఎవరన్నారు? అనుమానంగా నావంక చూసింది కమల.
భుజాలు తడుముకున్నట్లు 'నేను కాదు తల్లీ'దియ' నిన్నుమార్కెట్ దగ్గర స్కూటరు మీద వెళుతుంటే చూసిందట. వాళ్ల అమ్మకు చెప్పింది' తన అనుమానం క్లియర్  చేశాను నేను.
'అది ఎవర్ని చూసిందో నాలాగా ఉన్నవాళ్ళని' అయినా నేను ఇక్కడే పక్కన వీధిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే వున్నా'సంజాయిషీ' ఇస్తున్నట్లు అంది కమల.
'మళ్ళీ అంది 'దియ''ఏం కాదు..నిన్నేచూశాను నేను'.
'నన్నుకూడా చూశావు నువ్వు. 'బూచి' లాగా ముసుగు వేసుకున్నావు కూడా',
'బాబోయ్' ఇప్పుడు ఇంకా అడ్వాన్సు స్టేటుమెంటు' తనని కమల కూడా చూసిందని ఏమాత్రం తొణక్కుండా అంటోంది,'దియ'. నాకు మాత్రం ఏం తోచడం లేదు.
కమల వంక చూశాను సాలోచనగా. తన ముఖ కవళికలు చూశాక తను అబద్ధం చెబుతున్నట్లే అనిపించింది నాకు.
ఇక టాపిక్ ఆపాల్సిందే, లేకుంటే ఏం గొడవో అనుకుంటూ 'సరే' ఇక ఆవండి లేటవుతోంది.  పూజకు కూర్చుందాం అని అందరం  కూర్చుని శ్రద్ధగా విఘ్ననాయకుని
పూజను  పూర్తి చేశాము. తరువాత భోజనాలయ్యాయి.
                                                                   * * * * *

                               రెండు రోజుల తరువాత నేను ఆఫీసుకు వెళ్తూ గమనించాను. చాలా మంది అమ్మాయిలూ మోటారుసైకిల్, స్కూటరులు డ్రైవ్ చేస్తు, కుర్రాళ్ళ వెనక కూర్చుని ముఖం పూర్తిగా ముసుగేసుకుని వెళ్ళడం చూశాను. అంతే కాదు రోడ్డు మీద నడుస్తూ, షాపింగ్ మాల్స్  నుంచి బయటకు వస్తూ కూడ చాలా మంది అమ్మాయిలు ముక్కు తప్ప ముఖం పూర్తిగా స్కార్ఫ్ తోనో లేక చున్నీ తోనో  కప్పుకున్నవారిని చూశాను. అంతగా ముఖం పూర్తిగా కప్పుకున్న మనిషిని గుర్తించడం అంత సామాన్య మైన విషయం కాదే.
మరి 'దియ' ఆ రోజేలా ముసుగేసుకున్న పిల్లను  'పిన్ని' అని ఎలా గుర్తించింది.
దాన్నిఅడుగుదామంటే బావుండదు అనిపించి నేనే అడిగే ధైర్యం చేయలేదు. కానీ నా మనసు శాంతించలేదు పైగా ఆఘటన పదే పదే గుర్తుకు వస్తోంది.
ఆ మోటర్ బైక్ మీద ముసుగులో ఉన్నఅమ్మాయి 'కమలే' నా? అయితే తప్పేముంది.
బైక్ మీద ఫ్రెండ్ తో వెళ్ళడం తప్పేమీ కాదే? అయితే  బైక్ మీద తను కాదని, ఫ్రెండ్ ఇంట్లో వున్నానని ఎందుకు చెప్పింది ? అందుకే ఆ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా మనసులో ఏదో అనుమానం తొలుస్తోంది.కావాలనే మైండ్ డైవర్ట్ చేసుకునే వాడిని.
ఒక రోజు నేను, పద్మ, దియ సినిమా కు వెళ్ళాము 'సినిమేక్సు'లో.
సినిమాలో మా పక్కనే ఒక జంట. ఓ కుర్రాడు, అమ్మాయి. ఆ అమ్మాయి హాల్లోకి వస్తూనే ముసుగుతో వచ్చింది.
ఆ పిల్లను చూస్తూనే అమ్మా 'బూచి' అని పెద్దగానే  అంది దియ.
ముసుగుతో ఉన్న అమ్మాయి ముసుగు తీసి నేను 'బూచి'ని కాదు అంది.
'ఏయ్, తప్పుఅలా అనకూడదు' అని 'దియాని' వారించింది 'పద్మ'.వెంటనే నా 'బుర్ర' ఆలోచనలో పడింది.
'దియా' పూర్తిగా ముఖం కప్పుకున్న పిల్లను 'బూచి' అంది కాని 'పిన్ని' అనలేదు.
అంటే 'దియ' ఏదో 'గుర్తు'తో 'కమల'ను' గుర్తించిందన్నమాట.
అయితే ఏమిటా గుర్తు? నాకు రోజురోజుకు ఉత్సుకత పెరుగుతోంది రెండు విషయాల్లో.
ఒకటి,'దియ'ముసుగులో ఉన్న కమలను ఎలా గుర్తించింది?
రెండు, కమల ఎవరితో స్కూటరు మీద వెళ్ళింది ? వెళ్ళినా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ?
'కమల' కనీసం నాతో కూడా ఆరోజు తరువాత ఆవిషయం గురించి మాట్లాడ లేదు.
నాతో తనకి చాల చనువు.  అక్కతో మాట్లాడని విషయాలు కూడా నాతో పంచుకుంటుంది.
తను 'మైక్రోసాఫ్ట్' లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. నాతో ఫ్రెండ్స్ అందరి గురించి అరమరిక ల్లేకుండా మాట్లాడేది.'దియా' బైక్ మీద చూసిన అమ్మాయి నిజంగా 'తనే' అయివుండి, ఇప్పటికీ నాతో చెప్పలేదు అంటే
కచ్చితంగా కమల నాదగ్గర కూడా ఏదో దాస్తున్నట్లే, ఏమైంది తనకి? ఎవరి నైనా ప్రేమిస్తుందా? అని ఆలోచిస్తున్నా.
ఇంతలో సినిమా హాల్లో అందరు పెద్దగా నవ్వేసరికి ఈలోకంలోకి వచ్చాను.
ఇంతలో 'ఏవండీ'ఇది మీ దగ్గరికి వస్తుందట' అని 'దియా 'ని అందించింది పద్మ.
నా ఆలోచనలకూ బ్రేక్ పడ్డది. ఆలోచనలు మాని సినిమాచూడ్డం లో నిమగ్నమయ్యాను.                                                           
తరువాత 'ఏమైనా సరే' ఈ విషయమేదో తేల్చుకోవలసిందే అని నిర్ణయించుకున్నాను.
'దియ' మళ్ళీ ఈ మేటరు ని పెద్దది చేయకుండా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాను.
ఇంటర్వల్ లో లైట్లు వెలగ్గానే పక్కన అమ్మాయి మళ్ళీ ముఖం కవరు చేసుకుంది.
నాకు విషయం స్పష్టంగా అర్ధమైంది.హైడింగ్ ఐడెన్టిటి.ఈ పిల్ల తనని ఎవరు గుర్తించ కుండా ముఖం కప్పుకుంటోంది. అయితే 'కమల' కూడా ఇలానే చేసి ఉండవచ్చు'అన్ననిర్ణ యానికి వచ్చాను. కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్క 'దియ'మాట తప్ప వేరే ప్రూఫ్ ఏమీ లేదు.
కాబట్టి శోధించాలి అని అనుకున్నాను.
ఘంటసాల గారు పాడిన పాట' శోధించి సాధించాలి అదియే ధీర గుణం' గుర్తు కి వచ్చింది.
వారం అంతా ఆఫీసు లో పని ఒత్తిడి  వల్ల నా పరిశోధన కొద్దిగా వాయిదా వేసుకున్నాను.
                                                           * * * * *
      
                         మరుసటి రోజు  కమల ఆఫీసుకు బయలు దేరింది. బ్లూ జీన్స్ పేంటు దానిమీద నలుపు, తెలుపు టాప్ వేసుకుంది. బ్యాగు తీసుకుని బయలు దేరింది. నేను తను బయలు దేరిన రెండు నిముషాలకు బాల్కనీలోకి వచ్చితను 'స్కూటరు' మీద వెళ్తుంటే చూశాను.
తలమీద మాత్రం ఒక కేప్ పెట్టుకుంది.అనవసరంగా తనని అనుమానించానా అని అనుమానం వచ్చింది. అయినా ఎలాగు ఈ రోజు శలవు పెట్టాను ఈ పని కోసమే. తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడదని, మామూలుగా ఆఫీసు కి బయలు దేరే టైం కి భోజనం చేసి బాక్స్ తీసుకుని బయలు దేరాను. లంచ్ టైం కల్లా 'కమల' వాళ్ళ ఆఫీసు దగ్గర కాపువేశాను. అర్ధగంట, గంట, మధ్యాహ్నం మూడింటి వరకు  వెయిట్ చేశాను. ఏమీ వర్క్ అవుట్ కాలేదు.'కమల'లంచ్ కి బయటకు రాలేదు.వీళ్ళు ఇంటికి ఎప్పుడు బయలుదేరుతారో తెలీదు. అందుకే  ఈసురోమని ఇంటికి తిరిగి వచ్చాను.
'ఏంటండీ' ఇవాళ త్వరగా వచ్చేశారు' అంది పద్మ ఇంట్లోకి రావడంతోనే. 'ఆఫీసు కి వెళ్ళ లేదుగా' నోటి దాకా వచ్చింది. తేరుకుని  కొద్దిగా తలనొప్పిగా వుంది, అందుకే వచ్చేశాను.
'కొద్దిగా టీ ఇవ్వు' అని ఫ్రెష్ అయి వచ్చి 'టీవీ' పెట్టుకుని కూర్చున్నా.
'డాడీ' అంటూ పరుగెత్తు కుంటువచ్చి ఒళ్ళో వాలింది 'దియ'.
దగ్గరికి తీసుకుని 'ముద్దు' పెట్ట్టుకుని స్కూలికి వెళ్ళావా? ఏం చెప్పారు స్కూల్లో ఈరోజు ? తన్ని ఎత్తుకుంటూ అడిగాను.
నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ 'డాడీ, డాడీ' ఈ రోజు నా ఫ్రెండ్  'దీప్తి' బర్త్ డే తెలుసా? అంది దియ నా రెండు చెవులూ సున్నితంగా వెనుకనుంచి పట్టుకుంటూ.
'తెలీదమ్మా' అయినా నువ్వు చెబుతేనే కదా నీ ఫ్రెండ్ గురించి నాకు తెలిసేది' అన్నాను నేను.
'మా అందరికీ చాకోలెట్లు,పెన్సిల్ బాక్స్ ఇచ్చింది' అంది నా మీదనుంచి  జారి పరుగు మొదలెడుతూనే.
'ఏయ్ ... దియా ' ఇలారా...  అని నేను అనే లోపునే 'బర్త్ డే' గిఫ్ట్ 'పెన్సిల్ బాక్స్ తీసుకు వచ్చి నాకు చూపెట్టింది.
నా బర్త్ డే కి కూడ 'గిఫ్ట్'  ఇవ్వాలి  తెలుసా? అంది ముద్దుగా.
'అలాగే' 'సరేనా'అని టీవీ న్యూస్లో మునిగిపోయాను.
పద్మ అమృతాంజనం, 'టీ' తెచ్చి ఇచ్చిపక్కనే కూర్చుంది.అంటే ఏమిటో చెప్పాలన్నమాట.
'ఏమిటి' ? అన్నట్లు తన  ముఖంలోకి చూశాను.
'కమల'కు అమ్మవాళ్ళ చుట్టాలబ్బాయి సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి హైటెక్ సిటీలో జాబు చేస్తున్నాడు.
'ఆంధ్ర యూనివర్సిటి M .Tech. కుర్రాడు చాలా బావుంటాడు. పేరు రవి. తెలిసిన వాళ్ళే. అడ్రెస్స్, ఫోను నంబరు వున్నాయి.'కమల'తో అమ్మమాట్లాడింది.అది ఇప్పుడే చేసుకోదట.
సంబంధం ఏమీ చూడాల్సిన పనిలేదు అని కచ్చితంగా చెప్పిందట.
అమ్మ చాలా భయపడుతుంది. నేను మాట్లాదామంటే అది నాతో అంతా 'క్లోజ్' గా మాట్లాడదు.
మీరు ఒకసారి దాంతో మాట్లాడితే బావుంటుంది. దానికి ఇరవై ఐదేళ్ళువచ్చాయి.
'ఇక పెళ్లి వాయిదా వేయడం కుదరదు అంటోంది అమ్మ' ఆందోళనగా అంది పద్మ.
'బావుంది' మన పరిశోధనకు ఇది ఒక అవకాశమే అనుకుంటూ.
'సరే పద్మా' మీదంతా కంగారు.ఆందోళన పడాల్సిన అవసరం ఏముంది.
ఇప్పుడేగా ప్రయత్నం మొదలెట్టింది. తను ఇదివరకే చెప్పిందిగా 25 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోనని. 'ఇక మొదలెడదాం వేట'.
తన టేస్ట్ కూడ తెలుసు కోవాలికదా! ఎటువంటి వాడు కావాలో, అన్ని కనుక్కుందాం' నేను తనతో మాట్లాడుతాలే. మీరు కంగారు పడకండి' అన్నాను నేను టి.వి చానెల్ మారుస్తూ.
పద్మలేచి వెళుతూ 'నేను, అమ్మా కాసేపు బయటకు వెళ్లివస్తాము. కొద్దిగాషాపింగ్ వుంది.
'దియ' ని మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళు షాపింగ్ కి వెళ్ళారు.
టీవీ లో ఏచానెల్ లోను మంచి ప్రోగ్రాము రావడం లేదు.
'దియ' నేను బాల్కనీ లో కుర్చీ వేసుకుని కూర్చున్నాం. నా వొళ్ళో కూర్చున్న 'దియ' లేచి 'బాల్కనీ రైలింగు' లోనుంచి బయటకు చూస్తూ నిలబడింది. నేను 'దియ' తో ఆ టాపిక్ ఎలా రైజ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను.
అంతలోనే  'డాడీ' అదిగో 'బూచి' అంది. అదే అవకాశమని 'బూచి' కాదురా!
'కమల' పిన్నికదరా అన్నాను నేను' తన రియాక్షను తెలుసు కుందామని.
'కాదు, 'డాడీ' కమల పిన్ని కాదు.  ఈ 'బూచి'కి 'కొత్త చెప్పులు లేవుగా' అంది.
'చెప్పులేమిటి రా'అన్నాను నేనుఇంకా వివరం రాబట్టాలని'
'అదికాదు, డాడీ' 'పిన్ని, నేను వెళ్లి కొత్త  చెప్పులు కొన్నాము గదా!
' బూచి' ఆ చెప్పులు వేసుకోలేదుగా. ఆ చెప్పులు ఇక్కడే వున్నాయిగా ఇప్పుడు'.
'అంటే, ఆ రోజు 'కమల'ను కొత్త చెప్పులు చూసి గుర్తు పట్టిందన్నమాట...'
'ఎక్కడున్నాయిరా కొత్త చెప్పులు'అడిగాను'దియ' ని. పరుగెత్తి కెళ్ళి చెప్పుల జత తెచ్చింది, దియ.
'మరేమో డాడీ' నేను, కమలపిన్ని షాపింగ్ కి వెళ్లి ఈ చెప్పులు కొన్నాము.
'నేనే పిన్నికి ఇవి బావున్నాయి అని చెప్పాను' అంది దియ.
'ఓ.కే. 'దియా' చెప్పులు మళ్ళీ అక్కడ పెట్టి రా' అని నామనస్సులో వినాయక చవితి రోజు మోటర్ బైక్ మీద ఇది చూసిన ముసుగు పిల్ల 'కమలే'నని కన్ఫర్మ్ చేసుకున్నా.అయితే కమల అబద్ధం ఎందుకు చెపుతోంది?
'ఆ అబద్ధానికి ఇప్పుడు పెళ్లి వద్దు అనడానికి ఏమైనా సంబధం ఉందా'?
తనని సూటిగా అడిగి ఈ విషయం క్లారిఫై చేసుకోవాల్సిందే. అని నిర్ణయించుకున్నాను.
తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆరోజు రానే వచ్చింది.
ఆరోజు అత్తయ్యగారు, పద్మ గుడికి వెళ్తూ 'దియా'ని ఇంట్లో వుంచి వెళ్తుంటే దాని కూడా తీసుకెళ్ల మన్నాను.
'కమల' ఇంట్లోనే వుందికదా మాట్లాడుదామని 'దియా'ని  తీసుకెళ్లమన్నాను.
'గుడికివెళుతున్నామండీ, మనశ్శాంతిగా దేవుడికి  దణ్ణం కూడ పెట్టుకోనివ్వదు బాబూ' 
కాసేపు మీరే చూడండి దాన్ని అని వదిలేసి  వెళ్ళారు.వాళ్ళు వెళ్ళగానే ఇది కమల రూములో చేరింది.
నేను 'కమలా' ఏం చేస్తున్నావు?  అనుకుంటూ తన రూములోనికి వెళ్లాను.
'దియా' ఏవో బొమ్మలతో ఆడుతోంది, కమల  పడుకుని ఏదో మేగజీన్ చదువుతోంది.
నన్నుచూసి లేచి 'ఏంటి బావా'? అని అడిగింది.
'నీతో కొద్దిగా మాట్లాడాలి 'కమలా' అన్నాను నేను.
'నేను కూడా నీతో మాట్లాడాలి బావా' అంది కమల.
'దాన్నిఏదైనా బొమ్మలతో ఎంగేజీ చేసి ఇలా హాల్లోకి రా' అని చెప్పినేను హాల్లోకి వచ్చికూర్చున్నాను.
రెండు నిముషాల్లో 'కమల'వచ్చి సోఫాలో అటు పక్కగా కూర్చుంది.
నేను లేటు చేయకుండా పాయింట్ కి వచ్చేశాను.
'కమలా నువ్వంటే నాకు చాల గౌరవం. నువ్వెప్పుడు అల్లరి చిల్లర పనులుచేసినట్లుగా కూడా నాకు తెలీదు. చక్కగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు.
నాకు తెలిసి దాదాపు ఈ ఎనిమిది సంవత్సరాలలో నువ్వు అబద్ధం చెప్పడం నేను మొట్టమొదటి సారి గమనించాను. 'అదీ' ఏదో పెద్ద విషయానికి కాదు.
 ఫ్రెండ్  బైక్ మీద లిఫ్ట్ తీసుకోవడం తప్పేమీ కాదే.
ఎందుకు ఆ విషయంలో నువ్వు అబద్ద మాడ వలసి వచ్చిందో నాకు అర్ధం కాలేదు.
అదీ 'దియ' చెపితే గాని మాకు తెలీదు. ఆరోజు బైక్ మీద ముసుగు కప్పుకున్న అమ్మాయివి నీవేనని కచ్చితంగా నాకు తెలుసు' అన్నాను తన ముఖంలోకి సూటిగా చుస్తూ!
'ఎందుకు తెలీదు,.బావా? చిన్నపిల్లని పట్టుకుని వివరాలు అడిగితే,తెలీదేంటి?
ఎదురు  ప్రశ్నవేసింది 'కమల'.
బిత్తర పోవడం నావంతయింది.
'అదేంటి''దియ' నేను చెప్పులు చూపించ మన్నవిషయం కమలకు గాని చెప్పిందేమిటి ? కొంపముంచి? ఆదుర్దాగా నాలో నేను అనుకున్నాను. అయినా బింకంగా'చెప్పులేమిటి, కమలా'? అన్నాను నేను.
'బావా'పెద్ద డిటెక్టివ్ లా ఏమిటా పనులు?
'అది అసలే ఖతర్నాక్  పిల్ల' అటు మీకు నాచెప్పుల గురించి చెప్పింది.
బైక్ మీద వెనుక ముసుగులో వున్నది నేనే నన్నది,అది క్షణంలో అంత ట్రాఫిక్ లో నా చెప్పులు చూసి గుర్తు పట్టింది'.
'ఆ చెప్పులు నేను అది వెళ్లి కొన్నాము. తరువాత చెప్పులు మీకు చూపించానని కూడా నేను అడక్కుండానే చెప్పింది'.
'ఆరోజు నేను దాన్ని ముసుగులోనుంచే  చూశాను. నేను తనని చూసిన విషయం అది కూడ గమనించింది' బాబోయ్ దానివి గద్ద కళ్ళలాగా చాలా షార్ప్.
'దానికన్నీ నా పోలికలే'.'దియా' ని మెచ్చుకుంటూ అంది కమల.
'నేను ఇక అసలు విషయానికి వస్తాను'. 'నువ్వే అంతా మేనేజ్ చెయ్యాలి బావా' !
అలా అని నాకు ప్రామిస్ చేస్తే అన్ని విషయాలు మీకు చెపుతాను అంటూ తన కుడి చేతిని ముందుకు చాపింది కమల.
'ఎలాగు నాకు నాన్నగాని ,అన్నతమ్ముళ్ళు గాని లేరు'.
'అన్ని మీరే నాకు' సీరియెస్ గా అంది కమల తల వంచుకుని చాలా ఎమోషనల్ గా .
నా బుర్ర తిరిగి పోతోంది. ఈ పిల్ల ఏం బాంబుపేల్చ పోతోందో దేవుడా అని.
ఏం ప్రామిస్ చేస్తే  ఎలా ఇరుక్కు పోతానో'అని క్షణం ఆలోచిస్తూ వుండి పోయాను నా కుడి చేతిని ముందుకు కొద్దిగా వెనక్కి కొద్దిగా జరుపుతూ.
'వినాయక చవితి రోజు బైక్ మీద వెనకాల కూర్చున్నది నేనే.
'దియా' నన్నుగుర్తుపట్టింది' అని చెపుతూ టక్కున ఆపేసింది 'దియ' అక్కడకి రావడంతో.
'ఆపేశావేం'.చెప్పు'కమలా' రెండుకళ్ళ మీద చేతులు పెట్టుకుని అదేదో సినిమా లో డైలాగ్  గుర్తు తెచ్చుకుంటు  కళ్ళుమూసుకుని అన్నాను నేను.
'ఏంటిడాడీ'ఏం చెప్పాలి'? అంది దియ. ఉలిక్కిపడి దిగ్గున లేచాను నేను.
పక,పకా నవ్వుతోంది కమల.
నేనింకా తేరుకోలేదు.'దియ' వంక అయోమయంగా చూస్తున్నా.
'మీరేం 'వర్రీ' కాకండి. అంతా ఓకే. మీరల్లా  నాకు కొద్ది మాట సాయం చేయడమే'.
'అక్కకు, అమ్మకు తెలియకుండా 'మేనేజ్' చెయ్యాలి అంతే' అంది కమల గుంభనగా
విషయం ఏమిటో చెప్పకుండా.
'ఇంకేముంది' ఈ పిల్ల కొంప ముంచేసింది. నేననుకున్నదే కరెక్టు' అనుకున్నాస్వగతంలో.
'అదేమీ కరెక్ట్ కాదు. మీరూహించుకున్నట్లు. నేనేమీ ఎవరి కొంప ముంచలేదు. ముందు నేను చెప్పేది వినండీ బావా' అనునయంగా అంది కమల.
'ఇదేమిటీ...నేను ఏ మాట పైకి అనకుండానే నేనకుంటున్న మాటలు పొల్లుబోకుండా చెప్పేస్తోంది,ఎలాగబ్బా? ఎలా సాధ్యం '? విస్మయంతో అనుకున్నాను స్వగతంలో.
'ఎలాగో తరువాత నేనే చెబుతాగాని ముందు నేను చెప్పేది వినండి అంది కమల .
నవ్వు ఆపి.
'అది, 'ఆల్ ఇండియా రేడియో', జాగ్రత్త బావా'అని నన్ను హెచ్చరించే సరికి నాకు ఉన్న మతికూడా పోయి, 'ఏం.లేదమ్మా' కమల పిన్ని నాకు కధ  చెపుతూ ఆపింది. అందుకు కధ చెప్పమని అడుగుతున్నా, అన్నాను కంగారుగా ఏం మాట్లాడుతున్నానో తెలీకుండానే.
'హూ,హూ....ఇందాక ఎన్నిసార్లు అడిగాను స్టొరీ చెప్పమని. నాకు చెప్పకుండా డాడీ కి చెపుతున్నావా'? రెండు చేతులు ఊపుతూ అలిగినట్లు మారాం చేస్తూ  అంది 'దియ'.
'బావా' కమల అరిచిందో,గదిమిందో'నాకు అర్ధంకాలా. అంతలా అరిచింది కమల.
'నేను,అయిపోయాను'.దానిని ఇప్పుడు ఎలా మేనేజి చెయ్యాలో'? అంటూ లేచి వెళ్లి ఒక  'ఫైవ్ స్టార్ చాకోలేటు' దానికిచ్చి అది ఆడుకునే 'టాయ్' 'కిచెన్ సెట్' తెచ్చిదూరంగా సదిరి, నాకో 'పిజ్జా' డాడీకో 'పిజ్జా' చేసి తీసుకోరా' అని చెప్పి వెనక్కి వచ్చింది కమల.
'చాకోలేటు' తింటూ... కిచెన్ ఆటలో మునిగిపోయింది దియ.
'అమ్మయ్య ' గండం గడిచినట్లు ఊపిరి పీల్చుకున్నాను నేను.
'అయినా ప్రతి చిన్న విషయానికి అంతలా కంగారు పడితే ఎలా బావా'.అయినా నీకు ఉందిలే 'ముసళ్ళపండగ' ముందు, ముందు దీనితో. వెనక్కు తిరిగి ప్రేమగా 'దియా' ని పరిశీలనగా చూస్తూ అంది కమల .
'అవును కమలా'దీని ముందు ఏమి మాట్లాడాలో, ఏది కూడదో కూడా తెలీడం లేదు' అన్నాను నేను మెల్లగా 'దియా' వినకుండా.
'సరేలే బావా'చిన్న పిల్ల అది'.'దాన్నినాకు వదిలేయండిపెద్ద అయిన తరువాత. 'సరేనా' రెట్టించింది కమల.
'సరే తల్లీ సరే'అన్నాను నేను అన్యమస్కంగా. తరువాతగాని నాకు అర్ధంకాలే, నేను ఏమిఅన్నానో...
"సరే,బావా' అమ్మావాళ్ళువచ్చేస్తారు. నేను చెప్పేదేమిటంటే ఆరోజు నేను 'రవీంద్ర' బైక్ మీద  వెళుతుంటేనే  'దియా' చూసింది.
'రవీంద్ర' వాళ్ళు మనవాళ్ళే. ఈ రోజో, రేపో, మీకు ఒక సంబంధం గురించి అమ్మో,అక్కయ్యో ఎవరో ఒకళ్ళు చెపుతారు' అంది కమల.
'అవును కమలా..."ఇప్పుడే పెళ్ళేంటి'సంబంధాలు వద్దన్నావట కదామీ అమ్మతో' అన్నాను నేను సమయానికి పద్మ చెప్పింది గుర్తుకువచ్చి.   
'అయ్యో బావా' అలా అంటేనే అమ్మా వాళ్ళు తొందరపడతారని నాకు తెలుసు' నవ్వుతూ అంది కమల.
'అమ్మా, కమలా,ఎంత గుండెలు తీసిన బంటువి. నువ్వు సామాన్యురాలివి కాదు.
'దియా'  కి నీ పోలికే వచ్చినట్లుంది...అన్నాను నిజంగా గుండెల మీద రెండు అరిచేతులు  ఆనించుకుని.
'బావా'..ఆ పిల్లవాడు..ఈ రవీంద్రనే !
మంచి కుర్రాడు. సంవత్సరంనుంచి గమనిస్తున్నాను. ఏ చెడు అలవాట్లు లేవు, అక్కా వాళ్ళుగుడి నుంచి వచ్చాక మనం బయటకు వెళదాము. అతన్నిపరిచయం చేస్తాను. మీరు అతని తో మాట్లాడండి. మాట్లాడాక అతని
గురించి ఏమైనా 'ఎంక్వయిరి' గట్రా చేస్తానంటే మీఇష్టం. నూటికి నూరుపాళ్ళుమీకు  ఆ కుర్రాడు అన్నివిషయాల్లో నచ్చితేనే, నేను ప్రొసీడ్ అవుతాను. మీ కంటే నాకు ఈ ప్రపంచంలోనే 'వెల్విషరు' గానీ 'గాడ్ ఫాదర్' గాని ఎవరు లేరు అంటూ నారెండూచేతుల్ని తనచేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా ఒత్తి వదిలేస్తూ' 
'వాళ్ళు మాకు దూరపు చుట్టాలే. అతని అక్కకి నా రెఫెరెన్సు అక్కే సంవత్సరం కింద ఏదో పెళ్ళిలో ఇచ్చిందట. అప్పుడు అతను ఒకరోజు నన్ను ఆఫీసు దగ్గర కలిశాడు. అప్పటినుంచి అతను నాకు తెలుసు. మంచి స్నేహితులం.  మేమిద్దరం ఒకరికి  ఒకరం తెలుసునన్న విషయం ఇటు అమ్మ,అక్కయ్య వాళ్లకి గాని, అటు అతని అక్కకి గాని పేరెంట్స్ గాని ఎవరికీ తెలీదు.
కట్నాలు, గిట్నాలు ఏమీ లేవు'
అమ్మావాళ్ళు ఈరోజు మీతో ఈ సంబంధం గురించి చెప్పాక, మీరు మామూలుగానే 'ప్రోసీడు' కండి.
ఏదో పరాయి సంబంధం లాగే మాట్లాడుతూ ఉండండి. వాళ్ళ వాళ్ళు వస్తారు. చూస్తారు.ఒప్పుకుంటారు'
'సరేనా,అర్ధం  అయ్యిందా?ఇంకొక విషయం. ఎక్కడయినా తిక్క వేషాలు వేసి అక్కకు గాని, అమ్మకుగాని, వాళ్లకు గాని మీ వల్ల తెలిసిందనుకోండి.
మీ పని బట్టేస్తాను. అంది కమల నవ్వుతూ చూపుడు వేలు ఊపుతూ!
మళ్ళీ వెంటనే  'ప్లీజ్ బావా జాగ్రత్తగా 'డీల్'  చేయండి. సరేనా' మిమ్ముల్'నేఅని రెండు చేతులు జోడించి, చనువుగా బతిమాలుతూ,నొక్కి పలుకుతూ నావంక చూస్తూ అంది కమల.
'అర్ధం అయింది నాకు ఒక్కడికే కాదు, సోఫా వెనకాల చూడు' అన్నాడు తను.
కెవ్వున అరిచినంత పనిచేసింది కమల....
'నీకు 'పిజ్జా' ఆర్డర్ ఇచ్చాను కదా' అయిందా'? అంది 'దియా' వంక చూస్తూ
'ఏం కాలేదు. 'నీకు 'వెజ్' పిజ్జానా ? 'నాన్ వెజ్' పిజ్జానా' ? అడుగాదామని వచ్చా.నువ్వేమో 'డాడీ' కి కధ చెపుతున్నావు. అందుకే వింటున్నాను' కమల అడిగిన ప్రశ్నకు  దీర్ఘంగా జవాబు చెప్పింది 'దియ'.
'చచ్చానురా బాబోయ్ ఈ పిల్లతో, ఏం విన్నదో?.ఏం అర్ధమయిందో,.ఎక్కడ ఏం వాగుతుందో'
కంగారుగా అంది కమల.
'మీ కసలు 'జాగ్రత్త' అనేది లేదుబావా. నాతో మాట్లాడుదామనుకున్నప్పుడు, దాన్నివాళ్ళతో తీసుకు పొమ్మని  చెప్పివుండ వచ్చు కదా' అంటూ కమల దాన్నివళ్ళోకి తీసుకుని కధవిన్నావారా? అని నవ్వుతూ అడిగింది.
'ఆ,విన్నాను. కానీ అంతా అర్ధం కాలే.
'నువ్వు 'రవీంద్ర' అబ్బాయి బైక్ మీద వెనకాల కూర్చున్నావు. అదే అర్ధం అయింది.అంతే!
'నాకు మొదలు నుంచి చెప్పు స్టొరీ'...ముద్దుగా అడిగింది దియ.
'బావా, ఐ విల్ టెల్ హర్ సం స్టొరీ.....ఐ విల్ మేనేజ్ హర్ ' యు డోంట్ వర్రీ' అండ్ యు ప్రొసీడ్ ఏజ్ ఐ సెడ్ ప్లీజ్' అంది కమల 'దియా'ని తన  గదిలోకి తీసుకు వెళ్తూ.
'సరేగాని కమలా, నాకు ఇంకొక చిన్నవిషయం చెప్పు.మీ అమ్మాయిలని గుర్తించకుండా ఉండటానికేనా ముఖం అంతా ముసుగు కప్పు కునేది'? గదిలోనికి వెళ్తున్న కమల నుద్దేశించి అన్నాడు తను.
'పిచ్చి బావగారూ ... అందరూ ...మీలామంచి కుర్రాళ్ళు, మనుషులుకారు.
యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్ నుంచి తప్పించు కోవడం కోసమే ఈ కన్సీలింగ్ ఐడెంటిటి, ఇవన్నీమాఆత్మరక్షణ కోసమే' అంతే కాదు ఇంకో రహస్యం కూడ వుంది. మా అందమైన ముఖాలు దుమ్ము,ధూళి, కాలుష్య బారి నుంచి కాపాడు కోవడానికి కూడా ... అంది కమల హాయిగా నవ్వుతు.
'బావా' రేపట్నుంచి మీ ముఖ సౌందర్యం కాపాడుకోవడం కోసం మీరు ముఖానికి ముసుగు వేసుకోకండేం ... జనం కాదు దడుచుకునేది...పోలీసువాళ్ళు...అంది మళ్ళీ హాయిగా నవ్వుతూ కమల.
'సరేలే....ఈ చిట్కా 'రవీంద్రకు' చెపుతా.....నాకెందుకు.
ఇంకో "బూచి" తయారవుతాడు మనింట్లో నీకు తోడు ? అన్నాడు తను కూడా హాయిగా నవ్వుతు.
'మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు' స్టోరి' అయిపోయిందా ? ఆరా తీసింది ...చిట్టి 'దియా'.

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.
Mob. No.9849118254

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

Ganga.

                                                          ఓం విఘ్ననాయకాయనమః                                                                                  


                                                                 గంగ

ఆదివారం. ఈరోజు ఇంట్లో ఆయన లేరు. ఏదో పని వుందని, సాయంత్రం దాకా రానని, భోజనం కూడ బయటే చేస్తా నని చెప్పి  వెళ్ళారు. నాకు బద్ధకం వేసి వంట కూడ చేయలేదు.రాత్రి చేసినవి రెండు చపాతీలు వుంటే తిని ఏదో పుస్తకం పట్టుకుని ఇట్లా నడుం వాల్చిపది నిముషాలు కాలేదు. కాలింగ్ బెల్ ఒకటే మోత ఆగకుండా. 'బుద్దిలేదు మనుషులకి వచ్చేదాకా ఆగొచ్చు కదా' అనుకుంటూ వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా పోలీసు కానిస్టేబుల్.
గుండె ఆగినంత పని అయింది. భయంతో ఆ క్షణంలో ఎన్నో పిచ్చిఆలోచనలు. ధైర్యం తెచ్చుకున్నాను.
'ఏమిటి'? అని నేను నోరు పెగల్చుకుని ప్రశ్నించే  లోపులోనే అతను ''శారద గారు  మీరేనా అమ్మా" అని చాలా మర్యాదగా అడిగాడు.
'అవును...నేనే' ? అన్నాను భయంతో వెన్నుల్లోంచి వస్తున్న వణుకుని కప్పి పుచ్చుకుంటూ,
'మీతో కొద్దిగా మాట్లడాలమ్మా' 'లోపలకి రావచ్చా'? అన్నాడతను నా ముఖంలోకి సూటిగా చూస్తూ.
'అసలు సంగతి ఏమిటో చెప్పు బాబూ, కంగారుగా వుంది' అంది ఆందోళనగా శారద. 
'ముందు ఇంటి లోని కి పదండమ్మా'..... నేను  ఇక్కడ లోకల్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్    నే నమ్మా...సార్ నాకు బాగా పరిచయమే నమ్మా,నా పేరు సత్యం'
'మీరు ముందుగా లోపలికి  వెళితే బావుంటుంది.ఇంట్లో సార్ వుంటే పిలవండమ్మా' కొద్దిగా మాట్లడాలమ్మా
నాకు క్షణ, క్షణానికి..గుండె దడ ఎక్కువయి పోతోంది... అప్రయత్నంగానే అతనికి దారి వదిలాను.
అతను హాలు లోనికి వచ్చి 'అమ్మా''మీవాళ్ళేవరైనా  'కాశీ' కి వెళ్ళరా'? అని అడిగాడు.
కొద్దిగా అలోచించి...ముఖం మీద చెమట చీర కొంగుతో తుడుచు కుంటూ'వుహూ' లేదే,అన్నాను నేను.
'స్నేహితులుకాని, దూరపు బంధువులు కాని,మీకు బాగా తెలిసిన వాళ్ళెవ రైనా ......'
'లేదు బాబూ' ... అసలు సంగతేమిటో చెప్పు' . టెన్షన్ భరించలేక.
'మీరేమీ కంగారు పడకండమ్మా'... 'ఇంట్లో మరెవరైనా వున్నా పిలవండమ్మా దయచేసి ' అన్నాడు కానిస్టేబులు బహుశా నా కంగారు చూసి 'వుండు మా పని పిల్ల వుంది పిలుస్తాను' అన్నాను నేను.
ఇంతలో'జ్యోతి పనిపిల్ల' అదే క్రిందకు వచ్చింది.
పోలీసుని  చూసి  ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది.
'ఇక్కడికి రా  అమ్మాయ్' అన్నాడు కానిస్టేబులు.
మాట్లాడ కుండా వచ్చి నాప్రక్కనే నిలపడింది.
'నేను అమ్మతో మాట్లాడి వెళ్ళిన దాకా ఇక్కడే వుండు.నీ పేరేంటి?
'ఈ పిల్ల పేరు జ్యోతి...మాఇంట్లో పనిచేస్తుంది'...
'చూడండమ్మా'  పోలిస్ కంట్రోల్ రూముకి 'కాశీ' ఘాట్ పోలీసు స్టేషను నుంచి ఉదయం ఫోను వచ్చిందమ్మా.
'అక్కడ పోలీసులకు గంగలో మునిగి  చనిపోయిన ఇద్దరూ స్త్రీల శవాలు దొరికాయి అమ్మా'...
'వాళ్ళబ్యాగు,సూట్ కేసు' లలో..మీ పేరు, అడ్రస్, ఫోను నంబరు, ఉన్న పేపరు దొరికిందట అమ్మా'....
'ఆ ఫోను నంబరు కి వాళ్ళు ఫోను చేస్తేఆ నంబరు పనిచేయడం లేదట' అందుకు పోలీసు కంట్రోల్ రూము కి 'మెసేజ్'  ఇచ్చారమ్మా'.. చనిపోయిన ఇద్దరిలో ఒకావిడకు దాదాపు 50 ఏళ్ళు, ఇంకొకావిడకు షుమారు 30 ఏళ్ళు ఉంటాయటమ్మా'...
'ఆ చనిపోయిన వారి పేర్లు వారికేమి తెలియ లేదమ్మా' అక్కడి పోలీసు వాళ్ళు 'కాశీ' నుంచి చనిపోయిన వారి ఫోటోలు కూడా 'ఫాక్సు' చేశారమ్మా'....
'కానీ, ఈ ఫాక్సు కాపీలో వారి ముఖాలు స్పష్టం గా లేవమ్మా....ఈ ఫోటోలు చూడండి' అని ఆ ఫాక్సు కాపీ నాకిచ్చాడు..
ఒక్క క్షణం నా కాళ్ళ క్రింద  భూమి కంపించినట్లయింది...ఫోటోలు ఎంత అస్పష్టంగా వున్నా వెంటనే గుర్తించాను.
"సరోజా ...గంగా".....
'ఎవరమ్మా..వాళ్ళు'? అడిగాడు కానిస్టేబులు..
'సరోజ .నా స్నేహితురాలు...'గంగ' ఆమె కూతురు'... వాళ్ళు మీ చుట్టాలేమీ కాదమ్మా'?
'కాదు...'సరోజ' నేను కలిసి  చదువుకున్నాము' నాకు చాల కావలసిన మనిషి, ప్రాణస్నేహితురాలు. 'గంగ' ఆమె కూతురు. మెంటల్లీ చాలెంజ్డ్ గర్ల్  !
'మరి, వాళ్ళ ఫ్యామిలీ...ఎవరూ లేరా అమ్మా' ? అన్నాడతను.
'వున్నారు, వాళ్ళ అమ్మా, నాన్నా, అత్త గారు' అందరూ వున్నారు,
'అర్ధం అయింది అమ్మా'....' పాడు లోకం'... అన్నాడు అతను వేదాంత ధోరణితో.
'సరే నమ్మా'....'మీరు ఫోటోలో వాళ్ళని గుర్తించారు కదమ్మా! అక్కడి పోలీసు స్టేషను నంబరు, అడ్రస్, SI పేరు,ఆ యన మొబైల్ ఫోను నంబరు  ఈ పేపరులో వ్రాసి  ఉన్నాయమ్మా, మీరు ఎంత త్వరగా వెళితే అంత మంచిది.శవాలు మార్చురీ లో వుంచారమ్మా. రెండు మూడు రోజులు చూస్తారమ్మా! లేకుంటే వాళ్ళు......మిగతా పని అంతా
చేశేస్తారమ్మా, త్వరగా నిర్ణయం తీసుకుని అక్కడ SI గారితో మాట్లాడండి' అన్నాడు సత్యం లేచి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ .
ఒక్క క్షణం ఆలోచించాను...
'బాబూ సత్యం...ఓ చిన్న సాయం చేస్తావా'? ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాను.    
' అయ్యో ఇంతగా అడగాలా.... చెప్పండమ్మా' చొరవ చూపిస్తూ అన్నాడు సత్యం. 
'నువ్వే ఒక్కసారి అక్కడి SI గారితో మాట్లాడి...సంగతి ఏమిటో కనుక్కుని, మేము ఈరోజే తప్పని సరిగా బయలుదేరుతామని చెప్పగలవా'?
'దానికేముందమ్మా, ఇప్పుడే మాట్లాడుతాను' అంటూ తన మొబైల్ తీశాడు, సత్యం కానిస్టేబులు.
'ఈ ఫోను నుంచి చెయ్యమ్మా', అని నా మొబైల్ అతని చేతికి ఇస్తూ', అన్నాను నేను అతని చొరవకు మనస్సులోనే మెచ్చుకుంటూ
'హలో 'కాశీ' ఘాట్ పోలీసు స్టేషన్? మై SI నిహాల్ యాదవ్ సాబ్ సే బాత్ కర్ సక్తా హూ'?
'మై హైదరాబాద్ 'కొండాపూర్' పోలీసు స్టేషన్ కానిస్టేబులు సత్యం.. బాత్ కర్ రహా హూ'...
'సుభ హ్' ఆప్  గంగా  మే డూబ్ కే మిలేసో దో  అవరతోం లాశోం కే బారే మే హైదరాబాద్  కంట్రోల్ రూం కో ఇన్ఫర్మేషన్ దియే థే!
'ఓ అవరత్..లాశోం కా 'నాం', అవర్ 'పతా'  మిల్ చుకా హై... ఉన్కే దోస్త్ కే 'పతా' సే ఏ మాలూం హువా హై! అవ్ర్ ఓ లోగోం కా నాం, పతా నోట్ కర్లీజియే'...అని నా పేరు, అయన పేరు, ఫోను నంబర్లు, అడ్రస్ అన్ని చెప్పాడు..నా అనుమతి తోనే..
మేము ఈరోజే బయలు దేరు తున్నామని, శవాలు ఉంచమని చెప్పి...ఫోను పెట్టేశి, నేను వెల్తానమ్మా, అని బయలు దేరాడు.
అతన్ని ఉండమని చెప్పి..నేను రెండు వందలు తెచ్చి ఇవ్వబోయాను.'
'వద్దమ్మా....వుంచండి'..అని సున్నితంగానే తిరస్కరిస్తూ  'మీ లాంటి స్నేహితులు...ప్రతి మనిషికి వుండాలమ్మా'అని నాకు నమస్కరించి  వెళ్ళాడతను.
ఒక్క క్షణం కూర్చున్నాను...'ఏమయిందమ్మా సరోజమ్మ గారికి, గంగమ్మ గారికి'? ఆందోళనతో అడిగింది జ్యోతి.
''వాళ్లిద్దరు కాశీ లో చనిపోయారటే' గంగా నదిలో స్నానం చేస్తు మునిగి పోయారట... జ్యోతికి వాళ్ళిద్దరూ తెలుసు.
అది పదేళ్ళ పైగా ఇంట్లో పనిచేస్తోంది. రెండు నిముషాలు మౌనంగా దాన్నే చూస్త్తు వున్నాను.
కళ్ళు తుడుచుకుంటూ అంది..'' పోనీలే అమ్మా...సరోజమ్మ కష్టాలు  తీరి పోయాయి'
ఆయమ్మ పడ్డ కష్టాల ముందు..సీతమ్మోరి కష్టాలెంతవమ్మా? దేముడు మంచి పనే చేసినాడు...ఆమె బతికున్నాజీవితాంతం బాధ పడేదే. ఆ తల్లి మనసు నాకు బాగా తెలుసు! వచ్చే జన్మ లోనన్న దేముడు ఆయమ్మని మంచి పుటక పుట్టించాల" అంది..కళ్ళు..ముక్కు తుడుచుకుంటూ.. జ్యోతి.
ఎంత ఆపుకుందామన్నా కనీళ్ళు ఆగడంలేదు..
ముందు ఆయనకు ఫోను చేశాను. వెంటనే ఇంటికి రమ్మన్నాను. అయన లేదు ఇప్పుడు రాలేను అని ఖచ్చితంగా చెప్పేశారు. ఇక అసలు సంగతి చెప్పక తప్పలేదు. వెంటనే బయలు దేరాలి అని చెప్పాను. టికెట్స్ సంగతి అవి చూడమని చెప్పాను. నేను వెంటనే ఇద్దరివి నాలుగు జతలు బట్టలు సదిరేశాను.ఆకలిగా లేదు.ఆయన వచ్చిన తరువాత ఆకలవుతే రెండు ముద్దలు తిన వచ్చులే అనుకున్నాను.  అర్ధ గంటలో ఆయన దగ్గరనుంచి ఫోను వచ్చింది. ట్రావెల్  ఏజెంట్  కి టికెట్స్ కోసం వాళ్ళ జూనియర్ పురమాయించాడట. మూడు  గంటలకల్లా  వస్తానన్నారు.
ఫోను బుక్ తీసి సరోజ వాళ్ళ నాన్నగారింటికి ఫోను చేశాను. ఎవరో పనివాడు ఫోను ఎత్తి సారూ వాళ్ళు మూడు రోజుల క్రింద అమెరికాలో అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళారు అమ్మా, అన్నాడు. అమెరికాలో వాళ్ల 'టైం' ఏమిటో ఆలోచించ కుండానే వెంటనే పెద్దదానికి, బాబుకి ఫోను చేసి వాళ్ళని వెంటనే సరోజ వాళ్ళ తమ్ముణ్ణి, సరోజ పేరెంట్స్ ని కాంటాక్ట్  చేసి ఈ సంగతులన్నీ చెప్పమని చెప్పి, కాశీ పోలీసుల  ఫోను నంబర్లు అన్నీ  ఇచ్చి వాళ్ళు వస్తారా, రారా, మమ్ముల్ని ఏమి చేయమంటారు, అన్నీవిపులంగా  కనుక్కుని వెంటనే  ఫోను చేయమని చెప్పాను.     
                           ఆలోచనలు ఎంత ఉగ్గ పట్టుకున్న ఆగడం లేదు. సరోజ వాళ్ళ ఫ్యామిలీ , మేము పక్క, పక్క ఇండ్లలో వుండే వాళ్ళం.  సరోజ కి నాకు నాలుగు రోజుల తేడా. ఇద్దరం చిన్నతనం లో ఒకటే వూళ్ళో ఉన్నామేమో ఒకర్ని వదలి ఒకళ్ళం వుండే వాళ్ళం కాదు. పండగలకి మా ఇద్దరిదే ఆర్భాటం. చదువుల్లో నేను ముందుండే దాన్ని. నేను డిగ్రీ చేసాను. అది డిగ్రీ మధ్యలో ఆపేసింది. అది నాకంటే తెలుపు,చాలా అందంగా వుండేది.అందరు దాన్ని అదృష్టవంతురాలవని అంటుండే వాళ్లు. వాళ్లకి బాగా ఆస్తి వుండేది. మా నాన్నగారు అంటుండే వారు, దానితో పోల్చుకోవద్దని. వాళ్లు చాల ధనవంతులని. ఇద్దరికీ నెల తేడాలో  పెళ్ళిళ్ళు అయ్యాయి. మా ఆయన అడ్వొకేటు. దాని భర్త జమీందారు గారి కొడుకు. పెద్ద ఆస్తి పరుడు. మా ఇద్దరికీ మొదటి సంతానం కూతుర్లే. నా కూతురికి దాని కూతురికి కూడా నాలుగు రోజులే తేడానే. నాకూతురు నాలుగు రోజులు పెద్దది. వారిద్దరికీ ముఫ్ఫై నిండాయి. సరోజ బ్రతికుందంటే ఆ కూతురికోసమే నని అందరికి తెలుసు. కూతురు మానసిక రోగి, మూర్చలు. తన పనులే తానే చేసుకోలేదు. అన్నిసరోజ  చేయాల్సిందే. కాల కృత్యాల దగ్గరనుంచి బట్ట కట్టడం కూడా తనే చేయాలి. ఒంటిలో కాళ్ళు,కళ్ళు రెండే సరైన అంగాలు.అదీ కొద్ది దూరం నడవగలదు. అంతే! దాన్ని తలుచుకుంటేనే మనసు భారమవుతుంది. కాసేపు మళ్ళీ మనిషిని కాలేను.
                          సరోజ పెళ్ళయిన మూడేళ్లకే భర్త ఏదో తెలియని రోగంతో పోయాడు. బాగా వున్నవాళ్ళు. పిల్ల సుఖ పడుతుంది , మంచి సంబంధం అని పెళ్లి చేసేశారు. అతనికి పెళ్ళికి ముందే రోగం వుండేదట. అంతా దాచేసి పెళ్లి చేశారు. కాపురానికి వెళ్ళేటప్పటికే భర్త రోగిష్టి అని, తను జీవితంలో పూర్తిగా మోసపోయానని, పెళ్ళిచేస్తే నన్న ఆరోగ్యం బాగు పడుతుందని చేశామని అత్తగారు ఎన్నోసార్లు అన్నారని, తనని నష్ట జాతకరాలినని, అందుకే కొడుకు ఆరోగ్యం పెళ్లయినా మెరుగవ్వలేదని అత్తగారు విపరీతంగా సాధించేదని సరోజ ఎన్నో సార్లు నాతో చెప్పుకుని ఏడ్చింది. పెళ్ళయిన ఏడాదికే బిడ్డని కంది సరోజ . ఆడపిల్లని కన్నావని సాధింపు, అందునా కొద్ది నెలలు నిండే సరికి పిల్లకి మూర్చలు వచ్చేవి. ఆ తరువాత కొద్ది కాలానికే సరోజ భర్త పోయారు. అక్కడ నుంచి దాని  జీవితం దుర్భర మయింది. పిల్ల మందులకి ,డాక్టర్ల ఫీజులకి కుడా డబ్బులు ఇచ్చేది కాదు అత్తగారు. మా బాబాయి గారు, పిన్ని ఇక దాన్ని అక్కడ వుంచడం క్షేమం కాదని దాన్ని తీసుకుని వచ్చారు. తరువాత పిన్నికూడా విసుక్కోవడం మొదలెట్టిందనీ, పిల్లని దగ్గరిక్కుడా రానిచ్చేది కాదని, బాబాయి గారే కొద్దో, గొప్పో చాలా నయమని అమ్మచెపుతుండేది. కాలం గడిచిపోయింది. రాక పోకలు తగ్గి పోయాయి. ఏదైనా ఫంక్షన్ లలోనో, పెళ్ళిళ్ళ లోనో  సరోజ అమ్మ,నాన్నకలిసే వారు. అది మాత్రం వచ్చేది కాదు. అలాంటప్పుడు నా మనసు తల్లడిల్లి పోయేది. దాన్ని ఎప్పుడూ నా సొంత అక్కగానే ఆనుకున్నా. ఏనాడు అదికూడా  నన్ను పరాయిగా చూడలేదు.
                        మా పెద్దది మాట్లాడినా,కనిపించినా, నేను దాని దగ్గరికి వెళ్ళినా, అది నాదగ్గరికి వచ్చినా నాకు సరోజ  కూతురు గుర్తుకు వచ్చేది. ఇక సరోజని  తలుచుకుంటేనే బాధ, ఆందోళన .ఈరోజుకీ దాన్ని తలుచుకుంటేనే నాకు  నేను ఏదో దోషిలా ఫీలయ్యేదాన్ని. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు అమెరికాలో నే ఉద్యోగాలు. ఆర్ధికంగా బాగానే వున్నాము. హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నాము. సరోజ తల్లి, తండ్రీ కూడా హైదరాబాదు లోనే  నివాసం. అది మాత్రం ఆ అవిటి పిల్లతో వూళ్ళో.నేను చాలా సార్లు ఇక్కడకి రావే, మాఇంట్లో  ఉండొచ్చు అన్నాను. మావారు కూడా రమ్మనే చెప్పారు. వాళ్ళ ఇంట్లోనే వుండ నప్పుడు మీ ఇంట్లో ఉండడానికి నాకు ఎట్లా వీలవుతుంది అనేది!   నేను ఒక్కదాన్ని, మా అయన  చాలాసార్లు వూరికి వెళ్లే  దాన్ని, పిల్లని చూసి వచ్చే దాన్ని. మా పిల్లలు కూడా ఇండియా వచ్చినప్పుడల్లా దాని కలవకుండా వెళ్ళడం అరుదు. గంగకి ఏవేవో తెచ్చే వాళ్ళు. పెద్దదానికి గంగ అంటే ఎంతో ప్రేమ.   చివరిసారి వెళ్ళినప్పుడు అనుకుంటాను సరోజ  నాతో అంది, వాళ్ళ  నాన్న కూడా ఈమధ్య రాలేదని.
నువ్వు ఒక్కదాని వేనే నాకు మిగిలింది. నాకేమయినా అనుకోకుండా అయితే ఈ పిల్ల సంగతి ఏమిటే ?
అందుకే దేవుణ్ణి ఒక్కటే ప్రార్ధిస్తున్నా! నాకంటే దాన్ని ముందు తీసుకెళ్ళమని ! పిచ్చిగా మాట్లాడ వద్దని వారించడం తప్ప నేనేం చేయలేక పోయాను. నా దగ్గరున్న కొద్ది డబ్బు దాని చేతిలో పెట్టాను. ఎప్పుడూ వారించేది, తీసుకుంటూ తిరిగి ఇచ్చేస్తానే అంది. తరువాత మూడు, నాలుగు సార్లు పిల్లల పురుళ్లకి అమెరికా వెళ్లి రావడం అయింది. దాంతో దాన్ని కలవక, పిల్లని చూడక..దాదాపు ఏడెనిమిది నెలలయింది. ఇప్పుడనిపిస్తోంది అయ్యో ఎంత తప్పు చేశాను, పిల్లని చూడక ఎన్నాళ్ళయింది. నామీద నాకే అసహ్యం వేసింది. ఎలాగు కారు వుంది. తీరిక చేసుకుని ఒక్కపూట వెళ్లి వచ్చుంటే బాగుండేది. ఎంత గా సముదాయించుకున్నా కళ్ళు చమరుస్తూనే వున్నాయి.
ఫోను మ్రోగడంతో నా ఆలోచనలకూ స్వస్తి చెప్పి ఫోను తీశాను. పెద్దమ్మాయి ఫోను.
సరోజ పెద్దమ్మ వాళ్ళ తమ్ముడితో, వాళ్ళ నాన్న గారితో అన్నీ చెప్పాను. వాళ్ళు వచ్చి రెండు రోజులే అయిందట. సరోజ పెద్దమ్మా వాళ్ళ నాన్నగారు,  తమ్ముడు టికెట్స్ దొరికితే  వెంటనే బయలు దేరు తామన్నారు. మిమ్ముల్ని అక్కడ అంతా మేనేజ్ చెయ్య మన్నారు. అంటే, ఏమిటే? వాళ్ళు వచ్చిందాకా మేము వెయిట్ చేయాలా?
'ఏమో నమ్మా, వాళ్ళు చెప్పింది నీకు చెప్పాను. సరేగాని, అమ్మా,ఎలా జరిగింది ఇదంతా'?
ఏమోనే...నాకు అంతా అయోమయం గాను, కంగారుగాను వుంది. మేము వెళ్ళి, వచ్చిన తరువాత అన్నీ చెపుతాను. అని ఫోను పెట్టేశాను. ఇంతలో ఆయన దగ్గరనుంచి ఫోను. రేపు ఉదయం 0630  hrs కి  ఫ్లయ్ ట్.  1030  hrs కల్లా కాశీ వయా ఢిల్లీ చేరాము. సరాసరి ఘాట్ పోలీసు స్టేషనుకి వెళ్ళాము. పరిచయం చేసుకున్నాక బ్యాగు, సూట్ కేసు, చూపించారు. నేను గుర్తించాను. పోలీసు ఫార్మాలిటీస్ ఏవో ఉన్నాయన్నారు. అన్నీ ఆయన చూసుకున్నారు. ఒక కానిస్టేబుల్  మాతో ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చారు. నాకు కాళ్ళు, చేతులలో వణుకు మొదలయ్యింది.వెన్ను లోంచి చలి వస్తోంది. మార్చురీ కి వచ్చాము.
రెండు బోడీస్ పోస్ట్ మార్టం చేసి ప్యాక్ చేసి ఉంచారు. ఇద్దరి ముఖాలు చూశాము. చక్కగా వున్నాయి. నాదగ్గర ఉన్న అమ్మ వారి కుంకుమ తీసి  ఇద్దరి ముఖాన దిద్దాను. నాకు ఏడుపు ఆగ లేదు. బోరున విలపించాను.ఆయన నన్ను బయటకు తీసుకు వచ్చి కూర్చోపెట్టారు. మళ్ళీ ఆయన పోలీసులతో, హాస్పిటల్ వారితో , ఇంకెవరితో నో మాట్లాడారు. ఆయన మళ్ళీ పెద్ద అమ్మాయితో మాట్లాడారు. సరోజ వాళ్ళ నాన్న గారు, తమ్ముడు బయలు దేరారట, రేపువుదయానికల్లా కాశీ వస్తారట. అప్పటి దాకా  మేము కూడా వెయిట్ చేద్దామని నిర్ణ ఇంచుకున్నాం. పోలీసు స్టేషన్ నుంచి పోలీసు వారు ఇచ్చిన  లగేజ్  తీసుకుని హోటల్ కి వచ్చేశాము. మరుసటి రోజు ఏర్పాట్లు అన్నీ  చూడమని అయన ఎవరికో పురమాయించారు. హోటల్లో దాని బ్యాగు,సూట్ కేసులో వస్తువులు బట్టలు అన్నీ తీసి చూశాను. దాని చాలా పాత  డైరీ ఒకటి, దానిలో  అక్కడక్కడా ఏవో వ్రాతలు, నా అడ్రస్, మా ఇంటి పాత ఫోను నంబరు..ఇంకా ఏవో డబ్బుల లెక్కలు, నేను తనకి ఇచ్చిన డబ్బుల లెక్ఖ తో సహా ! ఇంకా తను నాకు చాలా ఋణ పడి పోయానని, నా పిల్లలంతా ముగ్గురు  తననీ, తన పిల్లనీ, తన సొంత వాళ్ళకంటే ఎక్కువగాఆదరించారని, ప్రేమించారని , ఇంకో జన్మ అంటూవుంటే నా ఇంట్లో పుట్టి నా ఋణం తీర్చుకుంటానని వ్రాసింది. నా కళ్ళవెంట నీరు ధారలుగా కారుతోంది. డైరీ పక్కన పడేసి, బ్యాగులో / సూట్ కేసులో వస్తువులు /బట్టలూ అన్నీ ఒక్కటొక్కటిగా తీసి చూశాను. నేను మా పెద్ద దాని పెళ్ళిలో పెట్టిన కంచి పట్టు చీర కన్పించింది. చీర ఇంకా చెక్కు చెదర లేదు. నా బలవంతం మీద పెళ్ళిలో చీర కట్టుకుని వెంటనే విప్పేసింది. తరువాత మళ్ళీ కట్టి నట్టు లేదు. మెల్లగా  చీరను చేతిలోకి తీసుకున్నాను కాసేపు దాన్ని స్పృశిస్తూ అలాగే ఉండిపోయాను.
పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ చెప్పిన మాటలు చెవిలో మార్మోగుతున్నాయి. ' బడే అమ్మ కి సాడీ చోటే అమ్మ సాడీ కో  బాంద్ కే హై మాజీ '  దోనోం ఏక సాత్ మే డూబ్ గయే' ..... ఐసా లగా కీ ఓ దోనోం బాహర్  నికలనే కోషిష్ నయ్ కీ'
''ఎంత  యాతన పడ్డారో'... అనుకుంటూ చీరను  మళ్ళీ చూస్త్తూంటే లోపల మడతల్లో చిన్న చీటీ కన్పించింది. తీసి చూశాను.
ఏదో కొరిఎర్ రశీదు నా పేరున వుంది. మొన్ననే ఒక కవరు నాకు  హైదరాబాదు పంపినట్లుగా వుంది.' ఏమిటిది? ప్రమాదం కాదా'? అన్న భావనే నేను తట్టుకో లేక పోయాను. గుండె విపరీతంగా కొట్టుకుంది. ఒళ్ళంతా అంత AC లో కూడ చెమటలు పట్టాయి. ఇంతలో ఆయన వచ్చారు. రసీదు చూపించాను.
'దీనిని ఇప్పుడు ఎవరికీ చూపించకు' అన్నారు ఆయన.
                             తెల్లారింది.... ఎనిమిది గంటలకల్లా సరోజ తండ్రీ, తమ్ముడూ వచ్చారు....మమ్ముల్ని కలిశారు. ముభావకంగా వున్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, మేము  ఏమీ ఎక్కువగా మాట్లాడ లేదు......
'మీకెలా తెలిసింది'? ఈ సంగతి..... అని అడిగారు అంకుల్. పోలీసులు నాకు కబురు చేశారు అని చెప్పాను. తరువాత వాళ్ళు పోలీసులని కలిశారు. ఆయన, వాళ్ళ వంటిమీద నగలేమైనా ఉన్నాయా అనడిగారు...నాకు ఇప్పటి వరకు నాకు ఆ విషయం మీదకు ధ్యాస పోనేలేదు. పోలీసులు నగలేమీ లేవని చెప్పారు.  ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి  దహన సంస్కారాలన్నీ అయిపోయే టప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. స్నానాలు, దేవుడి దర్శనం పూర్తి చేసుకుని మేము సాయంత్రం నాలుగు గంటల  ఫ్లయట్ కి ఢిల్లీ వచ్చి, వెంటనే హైదరాబాద్ ఫ్లయట్ ఎక్కి, ఇంటికి చేరే  సరికి రాత్రి 11 గంటలు అయింది.
గుమ్మానికి కొరియెర్ నోటీసు వుంది ఫోన్ నంబరుతో సహా. తెల్లారి 9 గంటలకే కొరియెర్ ఆఫీసు కి ఫోన్ చేసి రొటీన్ లో పడిపోయాను. దాదాపు 11 గంటలకు కొరియెర్ అబ్బాయి వచ్చి కవరు డెలివరీ ఇచ్చి వెళ్ళాడు.
కవరు తీసుకున్న దగ్గరనుంచి కడుపులో నుంచి బాధ తన్నుకోవస్తోంది. ఇక టెన్షన్ భరించ లేక హాల్లో సోఫాలో చేరగిలి కవరు తెరిచిచూశాను. ఒక  లెటరు వుంది. చదవడం మొదలెట్టాను.

ప్రియమైన శారదకు,

                                   ఈ లెటరు నీ చేతికి అందేసరికి మేము తిరిగి రాలేనంత దూరానికి వెళ్లి పోయుంటాము.
నువ్వు ఈ లెటరు చదివి ఎలా రియాక్ట్  అవుతావో నా ఊహకు అందడం లేదు. నీ అంతగా నన్ను, గంగ ను ప్రేమించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరని నాకు తెలుసు. అందుకే చివరిగా నీకు, మీవారికి, మీ పిల్లలకీ కృతజ్ఞతలు చెపుదామని ఈ వుత్తరం వ్రాస్తున్నాను.

                                  శారదా జీవితంతో  అలిసి పోయాను. ఇక నావల్ల కాదు. నేను నీతో చాలా సార్లు అన్నాను. నేను ముందు వెళితే దీని సంగతి ఏమిటని? నిజం. ఈ ప్రశ్న నన్ను ప్రతిరోజూ, ప్రతి క్షణం వేధిస్తూనే వుంది. దానికి 30 ఏళ్ళు వచ్చాయి. దీనికి 15 ఏళ్ళు వచ్చిందగ్గరనుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. ఈ మధ్య జరిగిన రెండు, మూడు సంఘటనల తో నాకు అర్ధమైంది జీవితాంతం, ప్రతిక్షణం  గంగను  మానవ మృగాలనుంచి కాపాడడం నా వల్ల కాదేమోనని.
స్నానం చేసిరావాలన్నా, బాత్ రూం కి వెళ్లి రావాలన్నా, భయమే. తలుపులు మూసి వెళ్దామంటే 'గంగ' ఒకటే కేక లేస్తుంది. బట్టలులాగేసుకుంటుంది. క్రూరమైన ఈ మనుషుల మధ్య ఈ పిచ్చితల్లిని వదిలి వెళ్ళలేను. నాకు వంట్లో బావుండడం లేదు. డాక్టరు దగ్గరికి  వెళ్లా లని కూడా లేదు. ఈ బ్రతుకు  ఈడ్చే శక్తి నాకింక లేదు. బ్రత కాలన్నఇచ్ఛ
అసలే  లేదు.  నేను కన్న వారికే కాదు, భూమికే  భారమయ్యానన్న  సంగతి నాకు అర్ధ మయింది. అంతే కాదు  ఈ మధ్య నేను నాకే భారమయ్యా ననిపిస్తోంది. నేను నాకే భార మైతే మరి దాని సంగతో! అలాగని దాన్నికడతేర్చే కసాయి దాన్నీకాదు. నాకు బ్రతకాలని లేదు.
దానికి 'గంగ' అని పేరు ఏ క్షణాన పెట్టానో తెలీదు. 'గంగ' వాహిని లా పవిత్రంగా, నవ్వుతు,తుళ్ళుతూ ఉండాలనుకున్నాను. కాని భగవంతుడు దాని నొసటన ఇలా వ్రాశాడు.   అది పుట్టి నప్పటి నుంచి 'కాశీ' కెళ్ళా లని వుండేది. ఎప్పటి నుంచో నా 'గంగ' తో  ఈ 'గంగ' లో మునిగి పునీతం కావాలనుకున్నా. ఆక్షణం వచ్చేసింది.
ఏ జన్మ లో చేసిన పాపమో, నువ్వు, నీ కుటుంబానికి తప్ప  ఎవరికీ కాకుండా పోయాము. నా వాళ్ళందరికీ నా సంగతేమో గాని నా 'గంగ' అంటేనే దూరం. ఇంక  నా బ్రతుకు కి అర్ధం, పరమార్ధం ఏమీ కాన రావడం లేదు.     
'గంగ' లో మునిగితే మా పురాకృత పాపాల శేషం  ఇంకా మిగిలి  వుంటే కొట్టుకు పోతుందని 'గంగ'ను  తీసుకుని  'గంగ' కు  వచ్చాను.  నీకుటుంబం  మా పట్ల చూపిన ప్రేమ,ఆత్మీయత,అనురాగం నా సొంతమనుషుల్నుంచి
నేనేనాడు పొందలేదు. దాని కేనాడు నేను బాధ పడలేదు.
ఈ లెటర్ నీకు అందే వరకు నాన్నా,అమ్మా వాళ్ళు తమ్ముడి దగ్గరకు అమెరికా వెళ్లి వుంటారు. నీవు  తప్ప నాకు చెప్పుకునేందుకు వేరే వారున్నా...వారెవరు నాకు, నీఅంత అంతరంగికులు కారు. నీ ఋణం నేను తీర్చ లేదు. ఎందుకో తెలుసా?
మళ్ళీ జన్మ అంటూ వుంటే నీ ఇంట పుట్టాలని వుంది. ఇక వుంటాను,
నీ నెచ్చెలి 'సరోజ' కడసారి వీడ్కోలు! ఇక శలవు......
ఎప్పటికీ నీ ..... ,
సరోజ.
రచన:- 
కేశిరాజు వెంకట వరదయ్య