లేబుళ్లు

12, సెప్టెంబర్ 2011, సోమవారం

నడివయసు నగారా


                                                           నడివయసు నగారా

నా చిన్న కూతురికి 30 సంవత్సరాలు. తన ఫ్యామిలీ ఇక్కడే గచ్చిబౌలిలో వుంటారు. ఓ MNC లో తనో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. దాదాపు 11 సంవత్సరాలనుంచి పనిచేస్తోంది. పెళ్ళయి 10 సంవత్సరాలయింది. తనకో పాప. వేళగాని వేళల్లో పని. అర్దరాత్రి లేదు అపరాత్రి లేదు ఆ లేప్ టాప్ వళ్ళో వేసుకుని ఎడతెగని పని. దాంతో అలసట, ఒత్తిడి, ఆందోళన, మెడనొప్పి, ఎసిడిటి, స్పాండిలోసిస్,....కుటుంబం అంతా కలిసి పట్టుమని వారానికి రెండు శలవు రోజులు గడపడం కూడా గగన కుసుమం అయిపొయింది. రోజుకి ఏడు, ఎనిమిది సార్లు ఫోను చేసి అక్కడనొప్పి, ఇక్కడ నొప్పి అంటూ తన బాధలు చెప్పుకుంటుంది వాళ్ళ నాన్నగారితో. ఆయన ఏదో వూరడిస్తారు. నాకు ఫోను చేస్తే కోప్పడతానని భయం. నేను తనకి ఎన్నో సార్లు చెప్పాను. ఆరోగ్యం జాగ్రత్త తల్లీ.......విపరీతంగా కష్టపడుతున్నావు. ఈ విపరీతమైన ఒత్తిడి, మానసిక ఆందోళన నీ ఆరోగ్యం పాడుచేస్తుంది. ఇప్పుడు వయసులో వున్నావు కాబట్టి నెట్టుకొస్తున్నావు రేపు కొద్దిగా వయసు మీదబడితే చాలా ఇబ్బంది పడతావు అని తనని, తన స్నేహితులను చాలా సార్లు హెచ్చరించాను. ఆఫీసులకు వెళ్లి పనిచేశే ఆడవారు అందునా ఐ.టి.లో పనిచేసే ఆడపిల్లలు ఆహార,విహార,వ్యవహారాల్లో తప్పనిసరిగా కొన్ని పద్దతులు అలవరుచుకోవాలని చాలాసార్లు చెప్పాను.
అవి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు.వేష భాషలు కావచ్చు. సాంప్రదాయ, ఆచార నియమ నిబంధనలు కావచ్చు. వాటికి విలువ ఇవ్వాల్సిందే. వాటిని ఖచ్చితంగా పాటించాలి. వారి జీవితాలు మా జీవితాల్లా కాలమాన పరిస్థితులకు, వాటి కొలబద్దలకు లోబడినవి కాదు. ఎదురీదవలసి వస్తోంది. వారి ఆధునిక స్త్రీ పోకడలు పాత తరాల వారికి అందరికి అర్ధం కావు.అర్ధం అయినా నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించేవారు వున్నారు. అందుకే బయటకు వెళ్లి పనిచేశే ఆడపిల్లలకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదేమంటే ఆఫీసు వదిలి ఇంటికి వచ్చాక వీలున్నంతవరకు ఆఫీసుని మరిచిపొండి.ఇంట్లో ఇల్లాలు గానే మెసలండి. అవసరానికయినా 'అహాన్ని' వదిలేయండి. అలాగని అనవసరంగా వ్యక్తిత్వాన్ని చంపుకోమనడంలేదు.
లేకుంటే వారి జీవితాలు నరక ప్రాయమవడానికి ఎంతో కాలం పట్టదు. సరే.... విషయం వదిలి చాలా దూరం వచ్చాను.
                             మొన్న పండక్కి వచ్చింది తను.....అల్లుడు గారు, మనవరాలు ...నేను ఎంత చేసినా మామనవరాలికి  తాతంటేనే  ప్రాణం. పండుగకదా.. పిండివంటలు...స్వీటు చేసుకుంటాం కదా...శరీరం సహకరించక పోయినా తప్పదుకదా....మధ్యలో ఆయనే వచ్చి ఏమైనా సాయం కావాలా?... అని అడిగి వెళ్ళారు. తరువాత మా చిన్నది కిచెన్లోకి వచ్చి అమ్మా 'సారీ' అమ్మా అన్నీ నువ్వే చేసుకోవాల్సి వస్తోంది. నేను ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకుంటానే' అంది గారం పోతు. 'సరేలే వెళ్లు.... నేను చేసుకుంటాలే'...... అనిచెప్పి దాన్ని పంపించాను. అన్నీ చేసి వడ్డించే సరికి రెండు దాటింది. వీళ్ళంతా కూర్చుని పేకాడుతున్నారు. అందరు తినే సరికి టైం మూడయింది. నేను ఏదో ఎంగిలి పడ్డాను. ఏమీ తినబుద్ధి కాలేదు. కిచెన్ కొద్దిగా సదురుకుని బెడ్ మీద వరిగాను. నడుం విపరీతమైన నొప్పి. మామనవరాలు వచ్చింది. 'అమ్ముమ్మా.....నాకు కొత్త డ్రెస్ తెచ్చానన్నావు...ఏదీ? అనడిగింది గారంగా. ఒక్కసారిగా బెడ్ మీదనుంచి నా మీదకు వాలి పోతూ. నువ్వు కాసేపు ఇలా నాదగ్గర పడుకో...నిద్రలేచాక నీ కొత్త డ్రెస్ ఇస్తాను అని దాన్ని నిద్ర పుచ్చాను. మల్ల్లీ నడుం వాల్చి పక్కనే ఉన్న వార పత్రిక తిరగేస్తున్నానే కాని మనసు పరి పరి విధాల పగ్గాల్లేకుండా పరుగెత్తుతోంది.
ఇప్పుడు నాబోటి వాళ్ళు అంటే మా జెనరేషను వాళ్ళం ... వయస్సు ఏభై, ఏభై అయిదు దాటిన తల్లులు, అత్తలునూ! మేము కూడా అంతగా ఇదివరకు రోజుల్లోలా శారీరక శ్రమకోర్చలేకపోతున్నాము. మేము చేసి పెట్టడం లేదనో వారికి అంతగా సహకరించడం లేదనో ఈరోజున కూతుళ్ళు, కోడళ్ళు, ఆరోపిస్తున్నారు. మేము ఇద్దరు, ముగ్గురు పిల్లలని పెంచి పెద్ద చేసిన వాళ్ళమే. మళ్ళీ ఇప్పుడు నా బోంట్లవారి పని మళ్ళీ మొదలుకొచ్చింది. భర్తలు రిటైర్ అయ్యి ఇండ్ల దగ్గర వుంటారు. పిల్లలు ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పోతారు. మేము మా  అత్తగార్లకి ఇప్పటికి చేయాల్సిందే. ఇక మాకు విశ్రాంతి ఎప్పుడు? మాకు చేసే వారెవరయినా వున్నారా? మేము ఎప్పుడూ ఒకరికి సేవ చేసే జెనరేషనా... కొడుకులు, కోడళ్ళు ఎలాగు దగ్గరవుండరు. దగ్గర వున్నా సేవ చేసే తీరికా, కోరికా ఎందరికి వుంటుంది.... కూతుళ్ళు చుట్టపుచూపుకి వచ్చినా వాళ్ళు పుట్టిల్లు కదాని ఇటు పుల్ల అటు కదల్చరు. వారి వారి దృష్టిలో అదీ కరక్టే నేమో !
ఇంతవరకు ఈ విషయంలో ఒక పార్శ్యాన్నే చూశాం. ఇంకొక వైపు చూస్తే ఈ సమాజంలో మా జనరేషనులో ఎక్కడికయినా వెళ్లి నాలుగురోజులు విశ్రాంతి తీసుకునే భాగ్యం ఎంతమందికి వుంది? ఎంతమందికి డబ్బు ఖర్చుపెట్టే శక్తి వుంది? కనీసం సొంత గూడు ఉన్నవాళ్ళ సంగతి వేరు. అదీ లేని వాళ్ళ సంగతేమిటి? అటు డబ్బుకు కట, కటా... ఇటు ఇంటెడు చాకిరి......ఇక ఆరోగ్యం సంగతి సరే... అదీ సరిగా లేని వాళ్ళ పరిస్థితి దుర్భరం.  అసలు అర్ధం కాని పరిస్థితి.......బయటవారికి  ఇది చాలా చిన్నవిషయం లాగాను, మామూలు విషయం లాగాను కన్పిస్తుంది..... కాని అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది బాధ!
ఇంతలో ఫోను మ్రోగుతోంది. అవతల వాళ్ళంతా సీరియెస్ గా  పేకాడుతున్నారు. వాళ్ళెవరు రారని అయిష్టంగానే లేచి ఫోను ఎత్తాను.
అవతల మా అమ్మ! 'భోజనాలు అయ్యాయా ?అని అడిగింది అమ్మ.
ఇప్పుడే అయ్యాయమ్మా'... సమాధానం చెప్పాను అమ్మకి.
అదేంటే  అంత నీరసంగా మాట్లాడుతున్నావు అంది అమ్మ. ఏంటోనమ్మా...వంటిల్లు పని అంటేనే  'చికాకుగా ఉంటోంది...అసలు చేత కావడం లేదు'  అన్నాను నేను.
"అదేంటే వున్నది నువ్వు మీ ఆయనే కదా....
పెద్ద వంట ఏముంది..... ఇద్దరికీ చేసుకోవడానికి ....అంత చేత కాక పోవడమేమిటే.....వంట్లో బావుందా అసలు"?
అమ్మ కూడా అలా అనే సరికి ఇక తట్టుకో లేక పోయాను.
'తరువాత మాట్లడుతానమ్మా...వంట్లో బాగాలేకేం...... నిక్షేపంగా వున్నాను' అని గొంతులో విసుగు పైకిఅమ్మకి  తెలియకుండా  ఫోను పెట్టేసి......
అమ్మ కూడా   ఎందు కిలా అంది  ?.....
పిల్ల లంటే  సరే ! వాళ్ళు ఇక్కడికొచ్చినా, నేను వాళ్ళ ఇండ్లకు వెళ్ళినా నా కష్టం నాదే... పిసరంత సాయం వుండదు   ..... ' చివరకి అమ్మ కూడా నా  బాధ, ఆందోళన, కష్టం  అర్ధం చేసుకోలేదే  ...... తను ఎందుకంత   తేలిగ్గా తీసుకుంది'......
ఏమిటి... నా కొక్క దానికేనా ఈ సమస్య......నా తరం ఆడవాళ్ళ సమస్యనా ఇది....
'లేక ....తరాల అంతరమా'.....?
నాకు చేతనయినంత కాలం ఒక మరలాగా పని చేస్తూనే ఉన్నాను.
నాకు ఈమధ్య నిజంగా కిచెన్ లోకి వెళ్ళా లంటేనే చికాకుగా ఉంటోంది....వంట చేయాలంటేనే ఏమాత్రం ఇష్టం వుండడం లేదు. ప్రతి నిముషం నిస్తేజం .....నిస్సత్తువ ఆవరిస్తున్నాయి.
నా ఈ నిస్సత్తువ ...నిస్పృహ.....చికాకు.....దీనికి వేరే  ఆరోగ్య  కారణాలు ఉండొచ్చు....
కానీ ఉద్యోగాల్లో రిటైర్మెంటు లా  నాకూ విశ్రాంతి కావాలి.....
నా ఈతరం ఆడవాళ్ళంతా కోరుకునేదదే.....కాకపోతే అందరూ నోరేత్తలేరు.....నోరేత్తినా ఇలాంటి బాధ వ్యక్తం
చేయడానికి ఓ  'భాష' కావాలి ....ఒక మాద్యమం కావాలి...
అందుకే నాయీ బాధ...ఆందోళన...ఆలోచన...నాతరం అందరి అక్కల,చెల్లెళ్ళ తరపున వ్యక్తం చేస్తున్నాను !