లేబుళ్లు

21, ఏప్రిల్ 2021, బుధవారం

                                                      అన్యధా శరణం నాస్తి 
                                                  ------------------------------------
                (ఈ మినీ కథ 'సహరి' కొసమెరుపు కధల పోటీ లో సా.ప్ర కు ఎంపిక కాబడింది)

      

"గీతా ! నువ్వున్నపళంగా బయలుదేరి హైదరాబాద్ రావాలి తల్లీ ! అసంబద్ధ, అసమంజస కోరిక కోరుతున్నానని మాత్రం అనుకోవద్దు. నువ్విప్పుడు రాకపోతే  అనర్ధం జరిగడం ఖాయం. నేనేమీ ఆషామాషీ మాటలు మాట్లాడడం లేదు. నా మాటల్లో తీవ్రత కూడా నీకు అర్ధంగాకపోవచ్చు. నువ్వు మీ అమ్మతో మాట్లాడి కూడా ప్రయోజనమేమీ లేదు" కెనడాలో ఉన్న కూతురిని ఫోనులో హెచ్చరిస్తూ అన్నాడు క్రిష్ణమూర్తి. 

"నాకు తెలుసు నాన్నా! అత్యవసరం అవుతే తప్ప మీరలా అనరు. కానీ నేనిప్పుడు రావడం కష్టం. ఉద్యోగంలో చేరి సంవత్సరం కాలేదు. శలవు దొరకాలి...ఖర్చు. నెత్తిమీద బరువులా బోలెడంత అప్పు. నువ్వేమో విషయేయమేమీ చెప్పకుండా ఇదిగో... ఇలా కంగారు పెట్టేస్తావు" అన్నది ఆందోళనగా అంది గీత.  

"గీతా ! నాకు చెప్పాలనిపించింది నీకు చెప్పాను. వివరాలు నాకు తెలియవు. 
ఊహాగానం చేయలేను. అసమర్ధుణ్ణి క్షమించు" అన్నాడు ఫోను పెట్టేస్తూ కృష్ణమూర్తి. 
తండ్రి గొంతులో ఆర్తిని గమనించి ఇంటి దగ్గర ఏమవుతుందో, ఏం చేయాలో తెలియక అమితాందోళన చెందింది గీత.
క్రిష్ణమూర్తి అమీర్ పేట చౌరస్తాపక్కనే వున్న అమ్మవారి గుడిలో పూజారి. సాత్వికుడు. 
అంతో ఇంతో వచ్చే రాబడితో పొదుపుగా కుటుంబాన్ని పోషించేవాడు. కూతురు గీత శ్రద్ధగా 
చదివి ఇంజనీరింగ్ చేసింది. క్యాంపస్ సెలక్షన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించింది. ట్రైనింగ్  అవుతూనే  తనని కెనడా పంపించారు కంపెనీ వారు. 
కొడుకు పార్ధసారధి. ఆరేళ్లనుంచి ఇంజనీరింగ్ పరీక్షలు వ్రాస్తూనే వున్నాడు.   
"ఆ ఇంజనీరింగ్  ఎలాగూ పూర్తిచేయలేక పోయావు. బ్రతుకు దెరువు కోసమైనా పూజాదికాలు నేర్చుకుని పూజారిగానైనా స్థిరపడవయ్యా" అన్నాడు కొడుకుతో కృష్ణమూర్తి.
''పూజారివై  నువ్వెలగబెడుతున్నావు. ఇక నేను పూజారిని కావాలా ?" అంటూ వెటకారంగా మాట్లాడేవాడు పార్ధసారధి . 
'దుర్గమ్మ తల్లీ ! వీడితో ఎలావేగేది ? హారతి పళ్లెంలో భక్తులు వేసే కానుకలు ఎప్పటికప్పుడు మాయం చేయడం, పోచికోలు తిరుగుడు తప్ప ఇల్లు, గమ్యం శూన్యం. వాడి చదువుకి చేసిన బ్యాంకు అప్పు నాలుగు లక్షలు, ఇతర అప్పులు రెండులక్షల చిల్లర మొత్తం వడ్డీలతో కలిపి పది లక్షలు భారమైకూర్చుంది. బ్యాంక్ నుంచి నోటిసుల మీద నోటీసులు వస్తున్నాయి. వాడికి చీమ
కుట్టినట్లు గా లేదు. అప్పు చెల్లించాలన్న ఆలోచనే లేదు ఆ అప్రయోజకునికి మంచి బుద్ధి ప్రసాదించు తల్లీ ' అని అమ్మవారితో మొరబెట్టుకుంటూ అప్పు చెల్లించే బాధ్యత నైతికంగా తనదేనని ఎల్లవేళలా చింతిస్తూ ఉంటాడు కృష్ణమూర్తి. 
''ఇరవై మూడేళ్లు నిండాయి. నీవల్ల పైసా సాయంలేకపోగా నాకు, గుడికీ నీవల్ల చెడ్డపేరొస్తోంది. 
నీ తోవ నువ్వు చూసుకో" అని తండ్రి అనడమే తరువాయి నాలుగు నెలల క్రింద మాయమయిన పార్ధసారధి ఈ రోజుకీ జాడలేడు.
"పార్ధు  తిరిగి వచ్చి గొడవేమైనా చేశాడా ? ఏవిటో ! ... ఈ నాన్నొకడు ! విషయమేమీ అర్దగాకుండా  మాట్లాడి ఫోను పెట్టేశాడు. అమ్మకుఫోను లేదు. ఇంకెవరికి ఫోనుచేసేది ... ఎవరినడిగేది ?  ఉదయాన్నే సంధ్యకు ఫోను చేసి సంగతేమిటో కనుక్కోవాలి అనుకుంటూ పనిలో
నిమగ్నమైంది  గీత. 
                                                                   * * * * *
ఇండియాలో తెల్లవారి తొమ్మిదవుతూనే  అమీర్ పేట, అమ్మవారి గుడికి ఆనుకునే వున్న 'మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫీసు' లో పనిచేస్తున్న క్లాసుమేట్ సంధ్యకి ఫోను చేసింది గీత.
"హేయ్ !... గీత ఎలావున్నావు ? వాంకోవర్ నుంచేనా ? ఏమిటి విశేషం ఫోనుచేశావు"అంది సంధ్య.  
"సంధ్యా! చిన్న సహాయం చేయగలవా? ప్లీజ్... చాలా అవసరం"
"డబ్బు మాత్రం అడక్కు. మాఆయనకు నాకు రోజూ ఇదే గొడవ "
"నో... నో.. డబ్బు కాదు. మాఇంటికి వెళ్లి అందరూ బాగున్నారా... లేదా చూసిరావా ప్లీజ్! 
నేనొక గంటతరువాత ఫోను చేస్తాను" ప్రాధేయబడుతూ అడిగింది గీత. 
"ఒకే ... మీ ఇంటికి  వెళ్లాలంటే చుట్టూతిరిగి వెళ్ళాలి. వన్ వే లతో పెద్ద తలనొప్పి. అర్జెంటుగా రిపోర్ట్స్ పంపించాలి. అవి అవుతూనే వెళతాను. ఎలెవన్ థర్టీ 
తరువాత ఫోను చెయ్యి. సరేనా !?" అంటూ ఫోను పెట్టేసింది సంధ్య. 
సరిగ్గా అనుకున్న టైం కి  ఫోను చేసింది గీత. 
"ఇదిగో ! ఇక్కడే ఉన్నాను. మీ అమ్మతో మాట్లాడు...అంటూ ఆవిడకు ఫోను ఇచ్చింది సంధ్య. 
"అమ్మా! బాగున్నావా ? పార్ధు ఎక్కడున్నాడో తెలిసిందా ? వాడు క్షేమంగా ఉన్నాడా ?
నన్నువెంటనే హైదరాబాద్ రమ్మని నాన్న ఫోను చేశారు.ఏమైంది ?" ప్రశ్నలతో ముంచెత్తింది తల్లిని గీత. 
"మేమిద్దరం బాగానే ఉన్నాము. పార్ధు జాడ తెలియదు. వాడు రాలేదు. ఆయన ఏ ధ్యాసలో ఫోను చేశారో ఏమో ! నువ్వెందుకు రావడం ఇప్పుడు. డబ్బు దండుగ . ఇద్దరం బాగానే ఉన్నాము. 
ఫోను ఆ అమ్మాయికి ఇస్తున్నాను" అంది తల్లి రంగనాయకి.
"ఒకే నా ! ఇక నేను ఆఫీసుకి వెళతాను" అంది సంధ్య 
"థాంక్ యు సంధ్యా ! థాంక్ యు సో మచ్ " అని ఫోను పెట్టేసి 
'ఏమిటీ మిస్టరీ ... వెంటనే రాకుంటే అనర్ధం జరిగి పోతుందంటాడు నాన్న! అంత బాగానే ఉంది అంటుంది అమ్మ... ఏవిటో అంతా అగమ్యగోచరం" అనుకుంటూ నిద్రలోకి జారుకుంది గీత. 
                                                                * * * * * 
పని ఒత్తిడితో తండ్రికి వారం పాటు ఫోను చేయలేదు గీత. ఆదివారం. ఇండియాలో సమయం ఉదయం ఎనిమిది దాటింది. గుడిలో ఉంటాడని తండ్రికి ఫోను చేసింది గీత. 
'ఫోన్ స్విచ్డ్ ఆఫ్' అని వస్తోంది. అర్ధగంట తరువాత కంగారుగామళ్ళీ ఫోను చేసింది. 'ఫోను స్విచ్డ్ ఆఫ్' అనే రికార్డెడ్ సమాధానం వస్తోంది. సంధ్యకు ఫోను చేసింది. 
ఆమె ఫోను ఎత్తలేదు. ఇద్దరు ముగ్గురు స్నేహితులుని కాంటాక్ట్ చేసింది. స్నేహితుడు రవీంద్ర మాట్లాడాడు. విషయం చెప్పి అర్జెంటుగా ఇంటికి వెళ్లి అక్కడనుంచి ఫోను చేయమని అడ్రసు వివరంగా చెప్పింది. అర్ధగంటలో అతను ఫోను చేశాడు.  
"గీతా ! గుడి వెనకాల వున్న సిమెంట్ రేకుల ఇల్లేనా ? తాళం వేసి ఉంది. గుడి కూడా తాళం వేసి వుంది. మూడు, నాలుగు రోజులనుంచి పూజారిగారు,ఆయన భార్య లేరని, పక్కనున్న కిరాణా షాపతను అంటున్నాడు. నువ్వు తెలుసట అతనికి. అతనితో మాట్లాడుతావా? "అంటూ గుప్తా ఫోన్ ఇచ్చాడు రవీంద్ర.
"గీతమ్మా ! కిరానా షాప్ గుప్తా అంకుల్ ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా ?  మీ నాయనగారు కాశీ వెళ్లారని తెలిసింది. అమ్మగారు అనారోగ్యంతో చౌరస్తా పక్కనే ఉన్న హాస్పిటలో చేరారు. మీ తమ్ముడు దేశాలు పట్టుకుపోయాడు. ఇంటి తాళం చెవి నాకు ఇచ్చి వెళ్లారు అమ్మగారు" అన్నాడు గుప్తా. 
గుప్తా ఫోను నంబరు తీసుకుని రవీంద్రకు థాంక్స్ చెప్పి ఫోను పెట్టేసి ఆలోచనపడింది గీత.
                                                                * * * * *
'అమ్మకు ఆరోగ్యం బాగాలేదా ? అందుకే నాన్న వెంటనే  రమ్మన్నారా ? ఇక తాత్సార్యం చేయడం మంచిదికాదు. ఒకసారి వెళ్లి రావడం బెటర్' అనుకుంటూ కంపెనీ అనుమతి తీసుకుని  
హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకుంది. రెండురోజుల తరువాత హైదరాబాద్ వచ్చింది గీత. 
అమీర్ పేటలో ఇంటికి చేరేసరికి ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉంది. కిరాణాషాప్ 
అమిత్ గుప్తాతో మాట్లాడింది. ఇంటి తాళంచెవి తీసుకుని స్నానంచేసి బయలుదేరి చౌరస్తా పక్కనే ఉన్న హాస్పిటల్ వెళ్ళి ఆరా తీసింది గీత. 
"రంగనాయకి నూట మూడో నంబరు గదిలో ఉంది" చెప్పింది రిసెప్షనిస్ట్
రూమ్ తలుపు కొట్టి లోనికి వెళ్ళింది గీత. అలికిడికి లేచింది రంగనాయకి. 
"గీతా నువ్వా ? ఎప్పుడొచ్చావు. నేనిక్కడున్నాని ఎవరుచెప్పారు ?" ఆశ్చర్యానందాలతో లేచి కూతురిని కౌగలించుకుంది  రంగనాయకి. 
"ఎవరు చెప్పలేదు. నేనే వెతుక్కుంటూ వచ్చాను. ఏమైందమ్మా నీకు ... ఆరోగ్యం బాలేదా ? 
సంధ్య వచ్చినప్పుడేమీ చెప్పలేదే ? ఎలా వున్నావమ్మా ? నీకిలావుండగా నాన్న కాశీ ఎందుకు వెళ్లారు?" ఆర్ద్రంగా అంది గీత ఏం వినాల్సి వస్తుందోనన్న భయంతో. 
"నేను బాగానే ఉన్నానమ్మా ! అనారోగ్యం ఏమీ లేదు. నేను చేసినపనే ఆయనకు నచ్చలేదు.. కోపం వచ్చి వెళ్లిపోయారు" అంది రంగనాయకి నిర్వికారంగా.
"అంత కాని పనేం చేశావమ్మా ?"ఆవేదనతో తల్లడిల్లిపోతూ అడిగింది గీత.     
"కాని పనేం చేయలేదు. డబ్బు కావాలి. సంసారాన్ని కాపాడుకోవాలి. అదే ధ్యేయంగా నడిచాను. 
మీ నాన్నగారు ఒప్పుకోరని ముందుగా చెప్పలేదు. ఆయన అపార్థం చేసుకుని నీతో మాట్లాడారు. డాక్టర్ చెప్పాక, వివరం విని తట్టుకోలేక  కోపంతో కాశీ వెళ్లిపోయారు.
డబ్బున్న వారే ఇల్లు, కార్లు అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. 
నేనెందుకు అద్దెకివ్వకూడదనుకున్నాను. ఇచ్చాను ! ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు". 
"అద్దెకిచ్చావా ... ఏమిచ్చావమ్మా? "
"గర్భం" అంటూ ముగించింది రంగనాయకి నిర్వికారంగా. 
తల్లి ఒడిలో వాలిన గీత కళ్ళనుండి అశ్రుధారలు ఆగకుండా వర్షిస్తున్నాయి.  
                                                     ----------xxx----------

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 98491 18254 

 (ఈ మినీ కథ 'సహరి' కొసమెరుపు కధల పోటీ లో సా.ప్ర కు ఎంపిక కాబడింది)