లేబుళ్లు

29, డిసెంబర్ 2011, గురువారం

ఈనాడు


నిజానికి 'ఇజా ' లేమి లేవు

ఉన్నదల్లా టూరిజం మాత్రమే

అని ఒకాయన అన్నాడని

గింజుకున్నారు గొంతుచించుకున్నారు

నిజం కాదా !

నిన్న మొన్నటి దాకా పోరాటం

నేడు దాసోహం అది కాదా నేటి నైజం

ఏమయిందా ' ఇజం'

పాతేశారా?

పాశవిక దాడులు

పౌర అణు ఒప్పందాలు

మీ   'నైజానికి' నిజానికి ఒప్పిదమేనా

వీటన్నిటిలో నీ ఒంతేమిటి

'లో' పాపాలు ఉత్తుత్తి పోరాటాలతో పోతాయా?

నిద్ర నటిస్తే నిశ్చింతేనా?

నాడు 'సై' తోడు నేడు 'చెయ్' తోడు

దేనికోసం? ఎవరికోసం ? మీపాట్లు !

పేదోని కష్టం కూస్తయినా గుర్తెరుగు!

మధ్యతరగతి మాటెఱిఁగి  నడువు
పాత వాసనతో నెగ్గుకోచ్చేరోజులు పోయాయి నేస్తమా!

నిద్రలే !


5, డిసెంబర్ 2011, సోమవారం

వసుధైక కుటుంబం

                                                                          వసుధైక  కుటుంబం          

                                          ప్రపంచం చిన్నదై  పోయింది. ప్రపంచమో ఓ కుగ్రామమయింది. ప్రపంచీకరణ తో దేశాలు కాలనీల్లా మారిపోతున్నాయి అనే మాటలు నాకసలు అర్ధమయ్యేవి కావు. మాచిన్నమ్మాయి, మావారు  ఈ మాటలు  నాకు అర్ధమయ్యేలా చెప్పాలని చాలా సార్లు ప్రయత్నం చేసి వారి  వల్ల కాక దాని ప్రయత్నం మానేశారు . ఈమధ్య జరిగిన ఒక సంఘటనతో ప్రపంచం చిన్నదై పోయిందని ఎందుకంటున్నారో సోదాహరణంగా అర్ధంమయింది.

                                         మాచిన్నమ్మాయి హైదరాబాదులో ఓ MNC లో పనిచేస్తోంది.  వాళ్ళకి ఓ కొత్త బాసు వచ్చాడట. అమెరికా నుంచి వచ్చాడట  అందునా చక్కటి తెలుగు మాట్లాడుతు న్నాడట. ఆయనే  ఏదైనా హాలిడే కి ఫామిలీస్ తో సహా బయటకు వెళ్దామని ప్రొపోజ్ చేసాడట అందుకు ఈ ఆదివారం వాళ్ళ ఆఫీసు వాళ్ళంతా వికారాబాద్ దగ్గర ఏదో రిసార్టుకు వెళదామని, అందరు కుటుంబాలతో సహా వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
'ఈ మధ్య మీరుకూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా రండి' అని మమ్ముల్ని కూడా బలవంతంగా తీసుకెళ్ళింది.
నేను కూడా సరే బావుంది ఎలాగైనా కార్తిక మాసం కదా ....ఈ సారి వనభోజనాలకు వెళ్ళలేదు ....
అందుకే దేముడు ఇలా అవకాశం కల్పించాడు అనుకున్నాను మనసులో ....బయటకు అంటే మళ్ళీ అంతా నీ చాదస్తం అంటారని. ఉదయాన్నే తొందరగా తెమిలి బయదేరామేమో 9 గంటలకల్లా రిసార్ట్ కి చేరాము. అప్పటికే వంద మందికి  పైగా వాళ్ళ ఆఫీసు వాళ్ళంతా వచ్చేశారు. అంతా హడావుడిగా వుంది. రంగు రంగుల ప్రపంచంలా అనిపించింది అక్కడ వాతావరణం చూస్తె..... ఎటు చూసినా  రంగు రంగుల  పూలు, రంగు రంగుల దుస్తుల్లో పిల్లలు, తల్లులు. ఉత్తర, దక్షిణ భారత దేశ ప్రజలంతా ఒక్క చోట చేరినట్లు చూడడానికి ఎంతో మనోహరంగా ఉందా దృశ్యం!
ఏ వంక వెళ్ళినాఇంగ్లీషు కంటే  భారతీయ  భాషల్లో బాసలు.....ఆహా ....భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా....సోషల్ సబ్జెక్టు లో ఈ విషయం చస్తే అర్ధం అయ్యేది కాదు....పాఠం  బట్టీ పాటే వాళ్ళం....ఇదన్న మాట విషయం!
చాలా పెద్ద రిసార్ట్ లా వుంది. రక రకాల చెట్లు. వచ్చిన  వారంతా గ్రూపులు, గ్రూపులుగా విడిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు ఆడుతున్నారు. మా అమ్మాయి, అల్లుడు గారు వాళ్ళ వాళ్ళ స్నేహుతుల గ్రూపుల్లో చేరి పోయారు.
మేమూ..... వాళ్ళ స్నేహితుల పేరెంట్స్ గ్రూపుల్లో చేరి పోయాము. రెండు, మూడు తెలిసిన ఫామిలీస్. అందరికి బ్రేక్  ఫాస్ట్  సర్వ్ చేశారు. టిఫెన్ చేసిన వాళ్ళు  వాటర్ గేమ్స్, షటిల్ బాడ్మింటన్ , టెన్నిస్   మొదలెట్టారు. మేము ఒక పెద్ద మర్రి చెట్టు కింద కార్పెట్ మీద సెటిల్ అయ్యాము.తరువాత అటు...ఇటు...తిరుగుతూ రిసార్ట్ లోవున్నా A C గదుల  వేపు వచ్చాము.
ఇంతలో 5-6 సంవత్సరాలుంటాయి...... ఓ చిన్నబాబు తెల్లగా, పొడుగ్గా... బంగారపు రంగు జుట్టు....చూస్తేనే తెలుస్తోంది.....విదేశీ పిల్లాడు  అని.... మా దగ్గరికి  వాడు విసిరిన  బంతి కోసం పరుగెత్తుకుంటూ వచ్చాడు. దగ్గరగావచ్చాక స్పష్టంగా చూశాను.....సందేహంలేదు.. వాడే....అచ్చువాడే....రాబర్టే..........ఆయనకూడాపిల్లాడిని చూస్తూ  నావంక   చూశారు ! దగ్గరికి వచ్చిన పిల్లాడిని......" ఏమోయ్........ఈ పిల్లాడు 'రాబర్ట్' కొడుకే అయి వుండాలి ఎలాంటి సందేహం లేదు ......చిన్నప్పుడు 'రాబర్ట్' అచ్చు ఇలానే వుండేవాడు కదా ' అన్నారు ఆయన నా సందేహం నివుర్తి చేస్తూ .
అంటే.....అమ్మాయి కి వచ్చిన కొత్త 'బాసు'  'రాబర్టే'....అన్నమాట......అని మనసులో అనుకుంటూ
బంతిని తీసుకుని ఆ పిల్లాడికి ఇచ్చి అడిగాను. 'where is dad'  ....?  అని .....
ఆ పిల్లాడు సమాధానం చెప్పకుండా దూరంగా  పరుగెత్తాడు.
మేమూ అక్కడ నుంచి మెల్లగా అందరు  ఉన్న చోటికి చేరాము. వెంటనే మా అమ్మాయిని కలిసి మీ కొత్త బాసు
పేరేంటి ?...అని అడిగాను.
ఎందుకూ? ...అంటూ...'రాబర్ట్ ' అంది !
ఇక నేను వుండబట్టుకోలేక పోయాను. ఒకసారి మమ్ముల్నిఅతనికి పరిచయం చేయవే....అతనెక్కడ వున్నాడు ?
వరుస ప్రశ్నలకి ....నా అకస్మాత్తు ప్రవర్తనకి మా అమ్మాయి బిత్తర పోయింది.
ఇంతలో అతనే మావేపు వస్తూ ' హే ...మీ   పేరెంట్స్ ని నాకు పరిచయం చేయవా" అంటూ మాకు రెండు చేతులతో
నమస్కారం చేస్తూ ...మమ్ముల్ని చూస్తూ....నమస్తే అంకుల్ ....నమస్తే ఆంటీ....అని మావంక అదోలా చూస్తూ ఒక్కసారిగా మాదగ్గరికి వచ్చి నాకూ, మావారికి పాదాభివందనం చేసి '' what a pleasant surprise aunty.........uncle....."  అంటూ నన్నూ మావారిని కౌగలించుకున్నాడు !
నేను ప్రతి నమస్కారం చేస్తూ......మీ మదర్ ' మేరీ'......ఎలావుంది?  రాబర్ట్ అని అడిగాను....
'మాం .....బావుంది...ఆరోగ్యం అంతగా బావుండలేదు....ఇక్కడే నాదగ్గరే వుంది....ఇక్కడికి రాలేదు....ఇంట్లో వుంది'...
అప్పటికే  మాచుట్టూ ఉన్నవాళ్ళకి అందరికీ ఇక్కడ ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు!
మా అమ్మాయి కూడా స్థాణువులా నిలబడి పోయింది.
మాఇద్దరి పరిస్థితి కూడా చాలా ఉద్వేగపూరితంగా తయారయింది.
అతనే తమాయించుకుని ఈ అంకుల్,అంటీ నేను చిన్నప్పుడు కాకినాడలో ఉన్న రోజుల్లో మా పక్క ఇంట్లోనే ఉండేవారు అదే పరిచయం,,,,అంటూ మా ఇద్దరి భుజాల చుట్టూ చేతులు వేసి ' give us little time' అని అక్కడి వాళ్ళతో చెబుతూ  తన ఫ్యామిలీ ఉన్న గెస్ట్ రూం  వంక తీసుకెళ్ళాడు !
                           సాయంత్రం తిరిగి వస్తూ అమ్మాయితో చెప్పాను అసలు సంగతి. రాబర్ట్' వాళ్ళ ఫ్యామిలీ కాకినాడలో  మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఫ్రెంచి దేశపు వ్యక్తి వాళ్ళ పూర్వీకుల కాలం నుంచి ఇక్కడే' యానాం' లో స్థిర పడ్డారు. ఆయనకు  దాదాపు నలభై సంవత్సరాలు ఉండేవి. తల్లిగారు బ్రిటిష్ దేశస్తురాలు. కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. కాకినాడలో ఏదో కాన్వెంట్ స్కూల్  head misstress  గా పనిచేసేవారు.' రాబర్ట్'  నాన్నగారు   దగ్గరలోనే ఉన్న పొగాకు ఫాక్టరీ లో పనిచేస్తూ బాగా అనారోగ్యం పాలయ్యారు. ఎక్కువ కాలం బతకడని  డాక్టర్లు చెప్పేశారు. వైద్యం ఖర్చు అంతా పొగాకు కంపెనీ భరించేది. దాదాపు సంవత్సరం పాటు హాస్పిటల్ కి వస్తూ పోతూనే ఉండేవారు . అప్పుడే రాబర్ట్ వాళ్ళ అమ్మగారు రాబర్ట్ ని మాకు అప్పగించి హాస్పిటల్ కి, ఉద్యోగానికి వెళ్ళే వారు. ఆ సంవత్సరం పాటు పాపం ఆవిడ పడ్డ బాధ నాకు తెలుసు.
'నీకు రాబర్ట్ గురించి పెద్దగా  తెలీదు. నువ్వు రెండు సంవత్సరాల పిల్లవను కుంటాను. కాని మీ అక్కకు, అన్నకు 'రాబర్ట్ ' బాగానే పరిచయం. కలిసి ఆడుకునే వాళ్ళు. దాదాపు సంవత్సరం పైన మనింట్లోనే ఉన్నట్లు  ఉండే వాడు'! వాడికి ఆవకాయ , పులిహార, కొబ్బరి కజ్జి కాయలన్నా ఎంత ఇష్టమో. అవి చేస్తున్నట్లు వాడు ఎలా పసిగట్టే వాడో వాడికి పెట్టిన దాక తల్లి పిలిచినా ఇంటికి వెళ్ళేవాడు కాదు.
వాళ్ళ నాన్నగారు బాగా సుస్తీ చేసి సంవత్సరం తిరగకుండానే హాస్పిటల్ లోనే పోయారు! అప్పటికి వీడికి 7 సంవత్సరాలు ఉండేవేమో! తరువాత వీళ్ళ అమ్మగారు వీడిని    తీసుకుని  లండన్ వెళ్లి పోయారు. దాదాపు 30 సంవత్సరాలు పైన   అయివుంటుంది ఇప్పటికి. ఇప్పుడు వీడు మళ్ళీ కలిశాడు. ఎంత విచిత్రం ! అనుబంధం, ఆత్మీయతకు  ఎల్లలు ఉన్నట్లు లేదు. కాలం ఎంత దూరాల నైనా ఎప్పుడో ఒకసారి దగ్గరికి చేరుస్తుందేమో !
ఈరోజు సంఘటన నా మనసుకు ఎంతటి  బలాన్ని తెచ్చిందంటే ముఫ్ఫై సంవత్సరాల వెనక్కి వెళ్లి పోయాను. భగవంతుడిని  మనసారా స్మరించాను. ప్రపంచమే ఒక వసుధైక  కుటుంబం అని ఎవరో అన్న మాటలు ఎంత సత్యమో అర్ధం అయింది!
రచన :
కేశిరాజు  వెంకట వరదయ్య.
  

                   

30, నవంబర్ 2011, బుధవారం

ఎల్లలెరుగని స్నేహ బంధం

                                                          ఎల్లలెరుగని   స్నేహ బంధం                
                                                      -----------------------------------

బంధాలు, అనుబంధాలు ఎంత లేవనుకున్నా, కావనుకున్న అవి  తెగి పోవు. ఏదో ఒక సందర్భంలోనో ఎక్కడో ఒకచోట మనుషుల్ని కలుపుతూనే ఉంటాయి.వాటికి  భాష, దేశం, వేషం అలాంటి హద్దులేమి లేవు.
ఈ మధ్యనే నేను అమెరికా వెళ్ళివచ్చాను.  అక్కడో చిత్ర మైన సంఘటన  జరిగింది.  అమెరికాలో డల్లాస్ లో నా కూతురు దగ్గర్నుంచి  కనెక్టి కట్ లోఉన్న  నా కజిన్ రెండు  రోజులు రావే అంటే వెళ్లాను. దాని కూతురు మెడిసిన్  చదువుతోంది. చక్కటి డాన్సరు. పదేళ్ళకి  పైగా భరత నాట్యం నేర్చుకుంది. వీకెండ్ కి  మా కజిన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక తమిళావిడది గోల్డెన్  జుబిలీ మ్యారేజ్ డే ఫంక్షన్ కి వెళ్ళాలంది. నన్ను ఫంక్షన్ కి రమ్మంది.
'వద్దులేవే ! అంతా పరిచయం లేని వాళ్ళు......నేను వచ్చి నిన్ను కూడా ఇబ్బంది పెట్టడమే...మీరు వెళ్లి రండి' అన్నాను  కాదులే చాల సరదాగా  వుంటుంది....పైగా నీ మేనకోడలు డాన్సు ప్రోగ్రాం వుంది రమ్మని  బలవంతంగా  తీసుకెళ్ళింది. ఫంక్షన్ చూశాక  నిజంగా' చిత్రం' అనిపించింది. ఇండియాలోకూడా  ఇటువంటి ఫంక్షన్లో అంత సాంప్రదాయం పాటించమేమో. విచిత్రం ఏమిటంటే ఫంక్షన్ లో  డ్రెస్ కోడ్ .కొంతమంది అమెరికన్లు మగవాళ్ళు ప్యాంటు /  పైజమా కుర్త , ఆడవాళ్ళు చీరలు,పంజాబీ డ్రెస్లు,చక్కటి నగలు ,  పాపిడిచేర్లు, గోరింటాకు, బొట్టు, గాజులు, వేసుకుని వచ్చారు. దాదాపు 200 మంది వరకు  అతిధులు వ చ్చారు. దోశలు, ఉప్మా ఇడ్లి ,పొంగలి ,సాంబారు, పరమాన్నం    ఓహ్......ఇంకా ఎన్నో  తినుబండారాలు వేడి వేడిగా ! వాళ్ళందరి ఉపన్యాసాలు అయ్యేసరికి మధ్యాన్నం రెండు  అయ్యింది. కొద్దిగా విరామమిచ్చి టంచనుగా మూడు గంటలకల్ల మాఅమ్మాయి డాన్సు   ప్రోగ్రాము మొదలెట్టారు.  మన భారతీయులు  సరే  అమెరికన్లు ప్రతివాళ్ళు అభినందించారు. అసలు చిత్రం ఇక్కడే జరిగింది . ఫంక్షన్ లో ఒక  అమెరికన్ లేడీ దాదాపు 80 సంవత్సరాలు  వుంటాయి. చక్కటి గులాబి రంగు పట్టు చీర  కట్టుకుంది.
ఆవిడ వేదిక మీదకు వెళ్లి గోల్డెన్ జూబిలీ జంటకు ఒక బహుమతి ఇచ్చింది.  మైకు తీసుకుని మాట్లాడింది.
తను ఇచ్చిన ప్రెజెంటేషను కాంజీవరం  పట్టు చీర అని అది  తనకు 1960 లో తనకు ఇంటిపక్కనున్న ఒక ఇండియన్ బహుమతి గా ఇచ్చిందని, తను ఆ  చీరను చాల ఇండియన్ ఫంక్షన్ల లో కట్టుకున్నానని  ఆ చీర ఈరోజుకి గూడా చెక్కు చెదర  కుండా వుందని అదే చీరను ఇప్పుడు కానుకగా ఇచ్చానని,
ఆ ఇంటి పక్కన స్నేహితురాలు  ఎవరో కాదు ఇప్పుడు వేదిక మీద మ్యారేజ్ గోల్డెన్  జూబిలీ చేసుకుంటున్న  ఆవిడని, తానిప్పుడు వేరే సిటీ లో  ఉంటున్నానని,ఇటువంటి వ్యక్తిత్వం,ఇటువంటి
సాంప్రదాయ జీవితం, వేడుకలు ఒక్క భారతీయులకు మాత్రమే సాధ్యమని ఇలాంటి స్నేహితులు వుండడం తనకు, తన వ్యక్తిత్వానికి, తన కుటుంబానికి చాలా మంచి జరిగిందని,
తనతో భారత దేశం సందర్శించానని, ప్రపంచం లోనే భారత దేశం ఒక మహోన్నత దేశమని ఇంకా ఎన్నో విషయాలు చెప్పి, ఇప్పటికి వారు చక్కటి  స్నేహితుల మని చెప్పి ఆ చీరని సభికులందరికీ చూపించమని కోరింది.
ఆవిడ చీర విప్పి  అందరికి వేదిక మీద నుంచి చూపెట్టింది. చక్కటి వంగపండు రంగు చీర , ఆరెంజ్ బోర్డర్,  ఝరీ అంచు ధగ ధగ మెరుస్తూ వుంది.
ఆవిడ కళ్ళలో కాంతి, ముఖంలో పట్టలేని సంతోషం  దాగలేదు. రెండు నిముషాలు ఆవిడ వేదికమీదనుంచి దిగివెల్లి తిరిగి వేగంగా వేదికమీదకు  వచ్చి
మైకు తీసుకుని తనకు 1961 లో మద్రాసు పెళ్లి అయిందని 1962 తన భర్త తో  అమెరికా వచ్చినట్లు, అప్పుడుఈ అమెరికన్ ఆవిడ  పక్కన ఇంట్లో ఉండేదని,
అమెరికా, భాష  కొత్త కావడం తో తనకేమి తెలియదని, సర్వం తానె అయి ఈ అమెరికన్ సాయం చేసిందని, అమెరికా  గురించి తనకెంతో నేర్పిందని,
తను అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి, ఇక్కడకొచ్చి చదువుకొని ఒక ఉన్నతోద్యోగిని  కావడానికి  తన  ప్రోత్సాహమే కారణమని , చాలా మంచి  స్నేహితురాలని,
తానిప్పుడు L.A ఉంటుందని తన  ఫంక్షన్ కి అంత దూరం నుంచి రావడమేకాక తనకో అపురూపమైన కానుక
ఇచ్చిందని ఇటువంటి  స్నేహితులుండడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పింది.
అదండీ స్నేహబంధం అంటే!
ఇంకేముంది.  కరతాళధ్వనులు మిన్నంటాయండీ..
నా పరిస్థితి  నాకు అర్ధం కాలేదు. కళ్ళు చమర్చాయి. ఏదోలోకంలో వున్నట్లయింది. ఆ క్షణం లో ప్రపంచం ఎంతో సుందరంగా కనిపించింది.

కేశిరాజు రజని

12, సెప్టెంబర్ 2011, సోమవారం

నడివయసు నగారా


                                                           నడివయసు నగారా

నా చిన్న కూతురికి 32 సంవత్సరాలు. తన ఫ్యామిలీ  'హై టెక్ సిటీ' లో వుంటారు.
ఓ MNC లో తనో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. దాదాపు 11 సంవత్సరాలనుంచి పనిచేస్తోంది. పెళ్ళయి 10 సంవత్సరాలయింది. తనకో పాప.వేళగాని వేళల్లో పని. అర్దరాత్రి లేదు అపరాత్రి లేదు.
ఆ లేప్ టాప్ వళ్ళో వేసుకుని ఎడతెగని పని. దాంతో అలసట, ఒత్తిడి, ఆందోళన, మెడనొప్పి, వీపు నొప్పి,ఎసిడిటి,స్పాండిలోసిస్,
కుటుంబం అంతా కలిసి పట్టుమని వారానికి ఒక్క శలవు రోజు గడపడం కూడా గగన కుసుమం అయిపొయింది. రోజుకి రెండు మూడు  సార్లు ఫోను చేసి అక్కడనొప్పి, ఇక్కడ నొప్పి అంటూ తన బాధలు చెప్పుకుంటుంది వాళ్ళ నాన్నగారితో. ఆయన ఏదో వూరడిస్తారు.
నాకు ఫోను చేస్తే కోప్పడతానని భయం.
"ఆరోగ్యం జాగ్రత్త తల్లీ..విపరీతంగా కష్టపడుతున్నావు. ఈ పని ఒత్తిడి, మానసిక ఆందోళన నీ ఆరోగ్యం పాడుచేస్తుంది. ఇప్పుడు వయసులో వున్నావు కాబట్టి నెట్టుకొస్తున్నావు రేపు కొద్దిగా వయసు మీదబడితే చాలా ఇబ్బంది పడతావు" అని తనని, తన స్నేహితులను చాలా సార్లు హెచ్చరించాను.
ఆఫీసులకు వెళ్లి పనిచేసే  ఆడవారు అందునా ఐ.టి.లో పనిచేసే ఆడపిల్లలు ఆహార, విహార,వ్యవహారాల్లో తప్పనిసరిగా కొన్ని పద్దతులు అలవరుచుకోవాలని చాలాసార్లు చెప్పాను.
అవి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు.
వేష భాషలు కావచ్చు. సాంప్రదాయ, ఆచార నియమ నిబంధనలు కావచ్చు.
వాటికి విలువ ఇవ్వాల్సిందే. వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే.
వారి జీవితాలు మా అరవై పడిలోబడ్డ వారి జీవితాల్లా కాలమాన పరిస్థితులకు, వాటి కొలబద్దలకు లోబడినవి కాదు. సమాజ రీతి, రివాజులకు ఎదురీదవలసి వస్తోంది.
దాంతో ఘర్షణ,,సంఘర్షణ !
వారి ఆధునిక స్త్రీ పోకడలు 'పాత తరాల' వారందరికి అర్ధం కావు !
అర్ధం అయినా నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించేవారు వున్నారు.
ఎవరికైనా తమదయాకా వస్తే గానే అర్ధంకాలేదు! అయినా అది వారివారి పిల్లవరకే వర్తిస్తారు.  
అందుకే బయటకు వెళ్లి పనిచేసే ప్రతి ఆడపిల్లలకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదేమంటే ఆఫీసు వదిలి ఇంటికి వచ్చాక వీలున్నంతవరకు ఆఫీసుని మరిచిపొండి.ఇంట్లో 'ఇల్లాలి' గానే మెసలండి.
అవసరానికయినా 'అహాన్ని' వదిలేయండి.
లేకుంటే వారి జీవితాలు నరక ప్రాయమవడానికి ఎంతో కాలం పట్టదు.
అలాగని అనవసరంగా 'వ్యక్తిత్వాన్ని' చంపుకోమని నేననడంలేదు. ఖచ్చితంగా అవసరంలేదు!
అవసరమొస్తే 'అవసరమైన' చోట పోరాడాలసిందే. అలసత్వానికి చోటిస్తే మొదటికే మోసమొస్తుందని గ్రహించండి    

'సరే'.. విషయం వదిలి చాలా దూరం వచ్చాను.
మొన్న పండక్కి వచ్చింది తను. అల్లుడు గారు, మనవరాలు.
తెలిసిందే కదా! మనం ఎంత చేసినా మనవరాళ్లకు/మనవళ్లకు తాతలంటేనే  ప్రాణం కదా ! పండుగకదా. పిండివంటలు,స్వీటు చేద్దామని వంట మొదలెట్టాను.
శరీరం సహకరించక పోయినా తప్పదుకదా!
మధ్యలో ఆయనే వచ్చి ఏమైనా సాయం కావాలా?... అని అడిగి వెళ్ళారు.
తరువాత మా చిన్నది కిచెన్లోకి వచ్చి 'సారీ' అమ్మా అన్నీ నువ్వే చేసుకోవాల్సి వస్తోంది.
నేను ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకుంటానే' అంది గారం పోతూ.
'సరేలే వెళ్లు.నేను చేసుకుంటాలే' అనిచెప్పి దాన్ని పంపించాను.
అన్నీచేసి వడ్డించే సరికి రెండు దాటింది.వా ళంతా కూర్చుని పేకాడుతున్నారు.
అందరు తినే సరికి టైం మూడయింది.
నేను ఏదో ఎంగిలి పడ్డాను. ఏమీ తినబుద్ధి కాలేదు. కిచెన్ కొద్దిగా సదురుకుని 'బెడ్' మీద
ఒదిగాను. నడుం విపరీతమైన నొప్పి. మామనవరాలు వచ్చింది.
'అమ్ముమ్మా' నాకు కొత్త డ్రెస్ తెచ్చానన్నావు...ఏదీ? అనడిగింది గారంగా.
ఒక్కసారిగా బెడ్ మీదనుంచి నా మీదకు వాలి పోతూ.
నువ్వు కాసేపు ఇలా నాదగ్గర పడుకో,నిద్రలేచాక నీ కొత్త డ్రెస్ ఇస్తాను అని దాన్ని నిద్ర పుచ్చాను.
మళ్లీ నడుం వాల్చి పక్కనే ఉన్న 'వార పత్రిక' తిరగేస్తున్నానే కాని మనసు పరి పరి విధాల పగ్గాల్లేకుండా పరుగెత్తుతోంది.
ఇప్పుడు నాబోటి వాళ్ళు అంటే అరవైపడిలోబడ్డ మా జెనరేషను వాళ్ళం...వయస్సు ఏభై, ఏభై అయిదు దాటిన తల్లులు, అత్తలునూ! మేము కూడా అంతగా ఇదివరకు రోజుల్లోలా శారీరక శ్రమకోర్చలేకపోతున్నాము.
మేము చేసి పెట్టడం లేదనో వారికి అంతగా సహకరించడం లేదనో ఈరోజున కూతుళ్ళు, కోడళ్ళు, ఆరోపిస్తున్నారు. మేము ముగ్గురు, నలుగురు పిల్లలని పెంచి పెద్ద చేసిన వాళ్ళమే. మళ్ళీ ఇప్పుడు నా బోంట్లవారి పని మళ్ళీ మొదలుకొచ్చింది.
భర్తలు 'రిటైర్' అయ్యి ఇండ్ల దగ్గర వుంటారు.
పిల్లలు ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పోతారు.
మేము మా  అత్తగార్లకి ఇప్పటికి చేయాల్సిందే !.
ఇక మాకు విశ్రాంతి ఎప్పుడు? మాకు చేసే వారెవరయినా వున్నారా?
మేము ఎప్పుడూ ఒకరికి సేవ చేసే జెనరేషనా ?
కొడుకులు, కోడళ్ళు ఎలాగు దగ్గరవుండరు.
దగ్గర వున్నా'సేవ' చేసే తీరికా, కోరికా ఎందరికి వుంటుంది.
కూతుళ్ళు చుట్టపుచూపుకి వచ్చినా వాళ్ళు పుట్టిల్లు కదాని ఇటు పుల్ల అటు కదల్చరు.
వారి వారి దృష్టిలో అదీ కరక్టే నేమో !
ఇంతవరకు ఈ విషయంలో ఒక పార్శ్యాన్నే చూశాం.
ఈ విషయాన్నే ఇంకొక కోణంలో చూస్తే ఈ సమాజంలో మా జనరేషనులో ఎక్కడికయినా వెళ్లి నాలుగురోజులు విశ్రాంతి తీసుకునే భాగ్యం ఎంతమందికి వుంది?
ఎంతమందికి డబ్బు ఖర్చుపెట్టే శక్తి వుంది? కనీసం సొంత గూడు ఉన్నవాళ్ళ సంగతి వేరు.
అదీ లేని వాళ్ళ సంగతేమిటి?
అందరికీ  వంటమనిషిని పెట్టుకునే స్తోమతు ఉండదుకదా!
అటు డబ్బుకు కట, కటా... ఇటు ఇంటెడు చాకిరి.
ఇక ఆరోగ్యం సంగతి సరే... అదీ సరిగా లేని వాళ్ళ పరిస్థితి దుర్భరం.
అసలు అర్ధం కాని పరిస్థితి.బయటవారికి  ఇది చాలా చిన్నవిషయం గాను, మామూలు విషయం లాగాను కన్పిస్తుంది.
అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది సమస్య !
ఇంతలో ఫోను మ్రోగుతోంది. అవతల వాళ్ళంతా సీరియెస్ గా  పేకాడుతున్నారు.
వాళ్ళెవరు రారని అయిష్టంగానే లేచి ఫోను ఎత్తాను.
అవతల మా అమ్మ! 'భోజనాలు అయ్యాయా' అని అడిగింది అమ్మ.
'ఇప్పుడే అయ్యాయమ్మా' సమాధానం చెప్పాను అమ్మకి.
'అదేంటే అంత నీరసంగా మాట్లాడుతున్నావు' అంది అమ్మ.
'ఏంటోనమ్మా'వంటిల్లు' అంటేనే 'చికాకుగా ఉంటోంది.అసలు చేత కావడం లేదు' న్నాను నేను.
"అదేంటే వున్నది నువ్వు మీ ఆయనే కదా"
పెద్ద వంట ఏముంది  ఇద్దరికీ చేసుకోవడానికే అంత చేత కాక పోవడమేమిటే ?
వంట్లో బావుందా .."?
అమ్మ కూడా అలా అనే సరికి ఇక తట్టుకో లేక పోయాను.
'తరువాత మాట్లడుతానమ్మా.వంట్లో బాగాలేకేం.నిక్షేపంగా వున్నాను' అని గొంతులో విసుగు పైకి అమ్మకి  తెలియకుండా  ఫోను పెట్టేసి.'అమ్మ కూడా   ఎందుకిలా అంది' ?
'పిల్ల లంటే సరే ! వాళ్ళు ఇక్కడికొచ్చినా, నేను వాళ్ళ ఇండ్లకు వెళ్ళినా నా కష్టం నాదే' పిసరంత సాయం వుండదు '
చివరకి అమ్మ కూడా నా  బాధ, ఆందోళన, కష్టం  అర్ధం చేసుకోలేదే !
తను ఎందుకంత   తేలిగ్గా తీసుకుంది…
"ఏమిటి... నా కొక్క దానికేనా ఈ సమస్య.నా తరం ఆడవాళ్ళ అందరి సమస్యనా ఇది ?"
నాకు చేతనయినంత కాలం ఒక మరలాగా పని చేస్తూనే ఉన్నాను.
నాకు ఈమధ్య నిజంగా 'కిచెన్' లోకి వెళ్ళా లంటేనే చిరా గా ఉంటోంది.
వంట చేయాలంటేనే ఏమాత్రం ఇష్టం వుండడం లేదు. ప్రతి నిముషం నిస్తేజం,నిస్సత్తువ ఆవరిస్తున్నాయి.
నా ఈ నిస్సత్తువ,నిస్పృహ,చికాకు'.వీటికీ  వేరే  ఆరోగ్య  కారణాలు ఉన్నాయా ?
ఉన్నా సరే …  ఉద్యోగాల్లో రిటైర్మెంటు లా  నాకూ విశ్రాంతి కావాలనిపిస్తోంది.
నా ఈతరం ఆడవాళ్ళంతా కోరుకునేదదే.....కాకపోతే అందరూ నోరేత్తలేరు.....నోరేత్తినా ఇలాంటి బాధ వ్యక్తం
చేయడానికి ఒక 'మాద్యమం' కావాలి...
అందుకే నాయీ సమస్య ,బాధ,ఆందోళన,ఆలోచన...నాతరం అందరి అక్కల,చెల్లెళ్ళ తరపున వ్యక్తం చేస్తున్నాను !

కేశిరాజు రజని
మొబైల్ నంబరు : 7893112587
 

20, జూన్ 2011, సోమవారం

ఏమని చెప్పుదు ?...కవిత ...

                
                    ఏమని చెప్పుదు ?

భావనలసంద్రంలో భాషా  దారిద్ర్యం
గుండె నిండా బాసలున్నా
కలం గుండెలో 'సిరా' ఉన్నా
అక్షరం నిలవదు
పాదు కుదరదు
పన్నా తిరగదు 
పుట్టుకకు ముందే 
పరమపదం చేరుతున్నాయి 
నా భావగీతికల తోరణమాలలు!
రచన :
కేశిరాజు  వెంకట వరదయ్య
మొబైల్ నం. 9849118254       

15, జూన్ 2011, బుధవారం

నేటిభారతం ...... కవిత


                     నేటిభారతం


ఆపాదమస్తకం అలజడితో సతమతం  
ఆటుపోట్లతో అంధకారం అలుముకొంటోంది
సమస్యల జడివానలో తల్లి భారతి
తడిసి ముద్దయిపోతోంది 
చలికాచే  వారు లేరు..సరికదా!
చనుబాలు త్రాగిన వారే
పరాయి పంచన చేరి
పంపకాలు చేస్తున్నారు!
దేశాన్ని ఏలే వారు
దిశా నిర్దేశం  చేయడం లేదు
పగ్గాలు వదేలేశారు 
ప్రాపకులు ఎక్కువయ్యారు 
ఎంచుకోవడం, పంచుకోవడం 
నిత్య కృత్యమైంది 
'ప్రజ'నడిగేవారు లేరు
మెరమెచ్చు మాటలు
మాయ సంకేతాలు 
సడి ఎరిగి సంతలో
కొంటారు మాటను!
బేరాలలో నుంచి
మదిరమ్ములోముంచి
సవ్వడే లేకుండా 
ఏలికలవుతున్నారు !  
పాలకులవుతున్నారు !


 రచన
కేశిరాజు వెంకట వరదయ్య  

5, మార్చి 2011, శనివారం

జీవితం జీవించడానికే !

                                                  జీవితం జీవించడానికే !

సికిందరాబాదు రైల్వే స్టేషన్ వచ్చి వెళ్ళే జనంతో కోలాహలంగా వుందారోజు. నేను,మావారు,మా అత్తగారు, ఇంకా కొంతమంది చుట్టాలతో 8 వ.నంబరు ప్లాట్ ఫారం మీదకు వచ్చాం. మా అత్తయ్య గారికి 83 ఏళ్ళు నిండాయి.
తను  పోయే లోపులో 'కాశీ'లో  తొమ్మిది రాత్రులు నిద్రచేయాలని ఆవిడ ఒకటే గొడవచేసింది. అందుకే
'కాశీ' బయలుదేరాం! తన ఆరోగ్యం అంతంత మాత్రమే! ఆమెతో బాటు ఆమె తోటి కోడళ్ళు,మరిది,మా ఆడపడుచు ఇంకా దగ్గరిచుట్టాలు  కొందరు పెద్దవాళ్ళు  మొత్తం 11 మందిమి పాట్నా ఎక్స్ ప్రెస్ 3 tier ఎ.సి బోగీ లో 'కాశీ'  బయలు దేరాం. ట్రైన్ ఉదయం సరిగ్గా 10 గంటలకు బయలుదేరింది. మరుసటి రోజు సాయంత్రం 3 గంటలకు వారణాసి చేరుతుంది ఎక్కాడ లేటు లేకుండా వెళ్తే. 
దాదాపు అందరు పెద్ద వయసు వారే, ఆరోగ్యాలు అంతంత మాత్రమే!  వీళ్ళందరినీ తీసుకుని 'కాశి' బయలుదేరాం!ఈ పెద్దవాళ్ళఅందరితో ఎలా నెగ్గుకోస్తామన్నభయంతోనే ప్రయాణం మొదలయింది. మాకు పరీక్ష  ట్రైన్లోనే మొదలయింది. రైల్వే వారు మాకు ముచ్చటగా మూడు మాత్రమే క్రింద బెర్తులు మాత్రమే ఇచ్చారు. మాకు కనీసం 7  క్రింద బెర్త్ లు కావాలి. తోటి ప్రయాణీకులని బతిమిలాడి, బామాలి  సర్దుకున్నాం.
నా సీట్ పక్కనే మధ్య వయస్కులు భార్య భర్త లా వున్నారు. వాళ్ళ క్రింద బెర్త్ కూడా మాకు ఇచ్చారు.
వాళ్ళ ముఖాలు చూస్తె ఏదో కొండంత భారం మోస్తున్న వారిలా మొహాలు పీక్కుపోయి, రోజులు తరబడి తినని వారిలా, బ్రదుకులో శూన్యంతప్ప ఏమీలేని వారిలావున్నారనిపించింది. ఎందుకలా వున్నారని అడగాలనిపించినా
భావ్యం కాదని, వారేదైనా బాధలో వుంటే ఇంకా బాధ పెట్టినదాన్నవుతానని అడగలేదు.  ట్రైన్ ప్రయాణం అందునా 30 గంటలు ప్రయాణం అంటే పక్కన కూర్చున్నవారు, ఎదురుగా కూర్చున్న వారు పరిచయం కాకుండా వుండరు మరీ అడవి మనుషులైతే తప్ప. అలాగే మా ఎదురుగా ఇంకో వయస్సు మళ్ళినజంట వాళ్ళ పిల్లలచదువుల గురించి, ఎంసెట్ లో వాళ్ళ రేంక్ ల గురించి,వాళ్ళ విదేశీ ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడుతూనే  వున్నారు.
నన్ను కూడా పిల్లగురించి అడిగారు. పక్కన వాళ్ళ అనాసక్తి  గమనించి  నేను ముక్తసరిగా చెప్పాను. చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెట్టేలా వున్న వారి  వాగ్దోరణిని  నేనూ హర్షించలేకపోయాను. అందుకే వారి 'అతికి' అడ్డు కట్ట వేయడానికి నేను మూడు సార్లు అమెరికా వెళ్లోచ్చాను, మా పిల్లలు అక్కడే వున్నారు అని చెప్పాక కాని వారి అతి వాగుడు  తగ్గలేదు. నేను గమనిస్తూనే వున్నాను. ఎదురావిడ మాట్లాడినంత సేపు నాపక్కన వాళ్ళ ముఖాల్లో చెప్పుకోలేని తీవ్ర బాధ,నిరాశ, నిస్పృహ, కళ్ళలోనీళ్ళు సుళ్ళు తిరగడం  ఆవిడ మాటి మాటి కి కళ్ళు తుడుచుకోవడం   స్పష్టంగా గమనించాను. ట్రైన్ దిగే లోపున వాళ్ళ బాధ తెలుసుకుని కొంతయినా ఊర డించాలని పించింది. మధ్యాన్నం రెండు గంటలకల్లా తెచ్చుకున్న భోజనం అయిందనిపించాము.
ట్రైన్ లో 'పేంట్రీ' కారు ఉందేమో కాఫీ, టీ లుబావున్నాయి. గంట, రెండు గంటల కోసారి బోగీ అంత క్లీన్ చేస్తున్నారు. 
ఇండియన్  రైల్వేస్ ఇంతబాగు పడిందేమిటి అనుకున్నాను. బోగీ క్లీన్ చేస్తున్న వారిని అడిగితే చెప్పారు.....ఈ క్లీనింగ్ కొన్ని సెలెక్టేడ్ ట్రైన్స్ లో మాత్రమే వుందట. పోనీలే ఇప్పటికయినా మనవారు ఇటు దృష్టి పెట్టారు అనుకున్నాను.సాయంత్రం నాలుగంటలయింది. ట్రైన్ మహారాష్ట్ర విదర్భ ప్రాంతం లో పరుగెడుతోంది. చంద్రపూర్ దాటింది. బాగా ఇండస్ట్రియల్ ఏరియాలా వుంది. పక్కనావిడ బయటకు వెళ్ళింది. ఇంతలో మా అత్తగారు బాత్రూం కి వెళ్ళాలంది. 
ఆవిడను తీసుకుని బయటకు వెళ్లాను. నా పక్కనావిడ అక్కడే  కొంగు నోటికడ్డం పెట్టుకుని  దిగాలుగా                   ఓ పక్కగా నిలబడి  వుంది. మా అత్తయ్య గారిని లోపల దింపి మళ్ళీ బయటకు వెళ్లాను. ఆవిడ అక్కడే వుంది.
నాకు ఆపరిస్థితిలో తనతో  ఎలా వ్యవహరించాలోఅర్ధం కాలేదు. అందునా ఏదో బాధలో వున్న వ్యక్తి! 
అయినా ధైర్యం చేసుకుని లేని చొరవతో  ఏంటండీ ...... ఇందాకట్నుంచి ఇక్కడే వున్నారు. ఏదైనా 'ప్రాబ్లం' నా? 
మీరేదో చాల బాధలో ఉన్నట్లున్నారు!  ముఖం కడుక్కోండి. కొద్దిగా  రిలీఫ్ వస్తుంది.....అంటూ ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి పక్కనే వున్న వాష్ బేసిన్  దగ్గరగా తీసుకెళ్ళాను. ఆవిడ ముఖం కడుక్కున్నాక మా సీట్ దగ్గరికి వచ్చి మావారికి  లేచి వెళ్ళమని సైగ చేశాను .ఆయన అర్ధచేసుకుని వెంటనే లేచి వెళ్లారు.
మాది సైడ్ బెర్త్  కావడంతో  తనని కూర్చోమని తనని కూర్చోమని నేనూ కూర్చున్నాను.
పక్కన వాళ్ళంతా పడకలు వేశారు.ఎ.సి కోచ్ కావడంతో పెద్దగా శబ్దం లేదు.
నేనే సంభాషణ మొదలెట్టాను. ఎక్కడదాక వెళ్తున్నారని అడిగాను.
ఆవిడ అలహాబాద్ త్రివేణి సంగమానికి వెళ్తున్నామని, తమకి  ఒక్కడే        కొడుకని అతను ఇక లేడని అతని ఆత్మ శాంతికోసమే త్రివేణి సంగమానికి వెళ్తున్నామని,
సీట్ క్రింద సంచి వంక చేయి చూపుతూ  
దుఖ్ఖం ఆపుకోలేక బావురుమంటూ  రెండుచేతులతో   ముఖం కప్పుకుందావిడ. ఇంతలో 'టీ'వచ్చింది. తనకి ఒక 'టీ' ఇచ్చి నేనూ ఒక 'టీ' తీసుకున్నాను.
నేను తనని సముదాయిస్తూ కష్టం మనిషికే వస్తుందని, చావు, పుట్టుకలు మన చేతిలో లేవని నాకు తెలిసిన రెండు మాటలు చెప్పాను.తను 'టీ' త్రాగింది.
తను కొద్దిగా తేరుకున్నాక అసలే మయిందని అడిగాను. తమకు ఒకే కొడుకని ఇంటర్ కాగానే ఎంసెట్ వ్రాశాడని మంచి రేంక్ రాకపోవడంతో ఇంజినీరింగ్ లో సీట్ రాలేదని,
మళ్ళీ మరుసటి సంవత్సరం దాకా ప్రిపేర్  అయ్యి మళ్ళీ ఎంసెట్ వ్రాసిన మంచి రేంక్ రాలేదని తమకు మేనేజ్ మెంటు కోట సీట్ తాహతు లేదనీ డిగ్రీ లో చేరమని, ఇంజినీరింగ్ ఒక్కటే చదువు కాదని,డిగ్రీ చదివి సివిల్ పరీక్షలు వ్రాయవచ్చని,
మొదల్నుంచి వాళ్ళ నాన్నగారు చెపుతున్నా వినిపించుకోకుండా మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగి మళ్ళీ ఎంసెట్ వ్రాసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి వాళ్ళ బలవంతం
తో డిగ్రీ లో చేరినా మనిషి డిప్రెషన్  లోకి వె ళ్లాడని  ఇంకొక
సంవత్సరానికి తన ఫ్రెండ్స్ ఇంజినీరింగ్ అయిపోతుందని , వారిక అమెరికా వెళ్లి పోతారని,
ఇక తను బ్రతకడం  వేస్ట్
అని మీరాలం చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇక తమ జీవితాలు వ్యర్ధమని,
తాము ఇంకా ఎందుకు బ్రతికి ఉండాలో అర్ధం కావడంలేదని  చెప్పింది.
ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకున్నాడా ....ఏమవుతోంది...ఈ యువతకి... చదువులు, ప్రేమలు ...విఫలమవుతే ఆత్మహత్యలేనా...వారనుకున్న లక్ష్యం నేరవేరకపోతేనో, ప్రేమ విఫలమవుతోనో ఆత్మ హత్యలే శరణ్యమా? ఇక వేరే జీవితం లేదా? అందరు ఇంజినీర్లె జీవిస్తున్నారా? ఇంజినీర్ కావాలనుకుని కాలేక పోయినవాళ్ళు జీవితం చాలించాలా? ఏమిటీ పిచ్చి? పిల్లల పెంపకం లో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? పిల్లలు   15 -18  ఏళ్ళ వయస్సు వచ్చాక వాళ్ళ మనసుకు నచ్చే చదువుల్లో చేరవచ్చు. అది నెరవేరని పరిస్థితి లో వాళ్లకి నచ్చచెప్పి వేరే మార్గంలోకే మళ్ళించే ప్రయత్నం గట్టిగా చేయాలి. వినకపోతే స్నేహితులతోనో, వేరే ప్రయత్నాలతో వారి మనస్సు మార్చాలి. వారి మంకు పట్టు మార్చాలి. సరైన మార్గంలో    పెట్టే   దాక తల్లి తండ్రులు పట్టు వదల కూడదు, కొంత వరకైనా సరైన నిర్ణయాలు,సరైన సమయంలో  తీసుకుని  
 వారిని సరైన త్రోవలో పెట్టాలి. .వారిని మందలించి ఊరుకోవడమో, వారి నిర్ణయాలకు వదిలేయదమో చేస్తే ఇదిగో  పరిణామాలు ఇలాగే విపరీతంగా వుంటాయి.
అంతేకాదు.పిల్లలూ ఇక్కడ ఒక్క విషయం గమనించండి. పిల్లలు  కోరుకున్న చదువులు, ప్రేమలు,పెళ్ళిళ్ళు మాత్రమే కాదు జీవితం. జీవితాల్లో ఇవి ఒక భాగం మాత్రమే.
మీరు జీవితాలు చాలిస్తే మీ తలితండ్రులు ఎంత క్షోభకు గురవుతారో, వారి బ్రతుకులు ఎలా చిన్న భిన్నమవుతాయో, ఆలోచించండి. బ్రతకడానికి వేయి మార్గాలు.
కోరుకున్న చదువు, కోరికలు, స్వప్నాలు నేరవేరేకపోతే మనిషి తనువు చాలించాలంటే
ఇక ప్రపంచం యుగాంతానికి వచ్చినట్లే.
జీవితంలో ఒక మార్గం మూసుకుపోతే ఇంకావందల  మార్గాలు వుంటాయి. నేటి యువత ఇది గమనించి మెలగాలి.
క్షణికావేశంలో చేతులారా నిండు  ప్రాణాలు తీసుకోకండి!మీ కన్నవారి ఆశలు అడియాశలు  చేయకండి! "జీవితం జీవించడానికే గాని ప్రశ్నించడానికి కాదు" అన్నారు స్వామి వివేకానందుదు.ఆయన చెప్పిన చెప్పిన ఈ మాటలు ప్రతి విద్యార్ధి , ప్రతి ప్రేమికులు పాటించాలి.
కేశిరాజు రజని.