లేబుళ్లు

23, ఆగస్టు 2021, సోమవారం

నేటి సావిత్రి

                                                                 నేటి సావిత్రి
                                                            ==============           
తెల్లవారి లేచేసరికి తలుపులు బార్లా తెరిచివున్నాయి. బయట గేటు తాళం వేయడం మరిచి  అలాగే నిద్రపోయింది సీతమ్మ. మతిస్థిమితం లేని భర్త రాఘవరావు ఇంటినుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాన్నం వరకు సీతమ్మ, పనిమనిషి, ఇరుగు పొరుగు వారందరు ఇంటి చుట్టుపక్కల వీధులన్నీ గాలించారు. రాఘవరావు కనిపించలేదు. పోలిసు రిపోర్ట్ ఇచ్చింది భార్య సీతమ్మ.

"చూస్తమమ్మా! మీరూ రెండురోజులు చూడండి. చుట్టాలింటికి గాని,స్నేహితులింటికి గాని వెళ్ళిండేమో " అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
"స్వయంగా ఆయన ఎక్కడికీ వెళ్ళలేడు. డెబ్బై ఆరేళ్ల మతిస్థిమితంలేని పెద్దమనిషి బాబూ ! అయిదారేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నాను. రాత్రి తలుపులు తెరుచుకుని వెళ్ళిపోయాడు. 
పాపిష్టిదాన్నిగేటు తాళంవేయడం మరిచి నిద్రపోయాను. మనిషి మాయమయ్యాడు" ఏడుస్తూ తన గోడు చెప్పుకుంది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ తో అరవై ఆరేళ్ల సీతమ్మ.
"సరేనమ్మా! మతిలేని మనిషి అంటున్నారు కదా! రిపోర్ట్ రాసుకున్నాము. ఫోటోలు, ఫోను నంబరు ఇచ్చారు కదా... ఆచూకీ తెలుస్తూనే కబురు చేస్త..." అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
రాఘవరావు తప్పిపోయి మూడు రోజులయింది. పోలీస్ వారి నుంచి ఏ కబురూ లేదు.
మరుసటి ఉదయాన్నేనాలుగు మెతుకులు తిని పోలీస్ స్టేషనుకి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే బయట బెంచిమీద కూర్చుంది. బయటకు వెళుతూ సీతమ్మను చూసి
''చూడు పెద్దమ్మా! పెద్దాయన్ని వెదుకుతూ ఉన్నాం. నువ్వు స్టేషన్ కి వచ్చి ఎందుకు కూర్చుంటావ్ ? ఆయన దొరికితే మాదగ్గర వుంచుకోము కదా. ఇంటికి వెళ్లమ్మా!" అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గద్దిస్తూ.
"నాయనా! మూడు రోజులయింది పెద్దమనిషి కనబడక. దణ్ణంపెడతా. దయచేసి త్వరగా వెదకండయ్యా!" అంటూ రెండు చేతులు జోడించి సబ్ ఇన్స్పెక్టర్ ని ప్రార్ధించింది సీతమ్మ.
"మీరిక్కడకి రాకున్నా మీ వారిని వెతుకుతామమ్మా ! అవసరముంటే నేనే ఫోనుచేస్తాను. ఇక్కడ కూర్చుని మమ్ముల్ని ఇబ్బంది పెట్టవద్దు" అంటూ సున్నితంగా హెచ్చరించాడు సబ్ ఇన్స్పెక్టర్.
ఇంటికి వెళుతుండగా ఇంటి ఎదురుగా  ఉన్న సూపర్ బజార్ మేనేజర్ బయట నిలబడి ఉన్నాడు. సీతమ్మను చూసి లోనికి పిలిచి కూర్చోబెట్టి ఫ్రూటీ యిచ్చి, సి సి కెమెరాలో రికార్డయిన వీడియో  ఫుటేజీ ప్లే చేసి చూపించాడు.
రాఘవరావు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక గేటుతెరిచి ఇంటి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు వైపు నడవడం మొదలెట్టాడు. కాళ్లకు చెప్పులు లేవు. రోడ్డు పక్కనున్నవెల్డింగ్ షాపులో పనిచేస్తున్న కుర్రా డెవరో బయటకు వచ్చి ఆయన్నేదో అడిగినట్లనిపించింది. వీడియో రివైండ్ చేసి చూశారు. పలకరించిన వాడి మాట ఆయన వినిపించుకోలేదు. ఆపైన రోడ్డుకిరువైపులా ఉన్న పెద్ద చెట్లనీడ వల్ల చీకట్లో వీడియో ఫుటేజ్ మసకగా ఉండడంతో ఏమీ కన్పించలేదు.
ఇదే సంగతి సబ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళింది సీతమ్మ. వారు అంతగా స్పందించలేదు. 
"మేమూ ఆ వీడియో చూశామమ్మా! పెద్దాయన ఇంటినుంచి బయటకు వచ్చాక మెయిన్ రోడ్డు వైపు నడిచారు. కానీ మెయిన్ రోడ్డు దాకా వెళ్ళలేదు. వేరే కెమెరాల్లో రికార్డయిన వీడియోలు కూడా చూశాము. వెల్డింగ్ షాపులో  కుర్రాడు ఆ రాత్రి టైం అడిగాడట. వారి మాటకు ఆయన స్పందించలేదు. పార్కులోని కెళ్ళారేమోనని చూశాము. పార్కులో కెమెరాలు ఒక్కటీ పనిచేయడంలేదు. ఆ అర్ధరాత్రి సమయంలో ఆయన్నెవరూ గమనించినట్లు మాకు సమాచారమేమీ లేదు. పోలీస్ పెట్రోల్ టీం కూడా ఆ రాత్రి ఆయన్ని ఎక్కడా గమనించలేదు. ఉదయాన్నే రెగ్యులర్ గా నడకకు వచ్చేవారెవరూ ఆయన్ని చూసినట్లు సమాచారం లేదు. ఇన్వెస్టిగేషన్ అక్కడ ఆగిపోయింది" అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
వారంరోజులు గడిచాయి. కేసులో పురోగతేమీ లేదు. క్రైమ్ కేసు కాకపోవడంతో కేసుకి ప్రాధాన్యత లేదు. కేసుని వారు సీరియస్ గా తీసుకున్నట్లనిపించలేదు. 
ఆ రోజు అమెరికా నుంచి రాఘవరావు కొడుకు పురుషోత్తం, న్యూజిలాండ్ నుంచి కూతురు పావని ఇద్దరు  వచ్చారు. ప్రయాణం వాయిదాలు వేసుకుంటూ నెలరోజులపాటు తల్లి దగ్గరే ఉండి, తండ్రిని వెదకడంలో చేయని ప్రయత్నం లేదు. పోలీసు పై అధికారులను ఎన్నోసార్లు కలిశారు. హాస్పిటళ్లు, వృద్ధాశ్రమాలు, చుట్టాలిళ్లు,స్నేహితుల ఇళ్ళు, పార్కులు వెదకని ప్రదేశం లేదు. పేపర్లలో, టీవీల్లో, గోడ పత్రికల్లో ప్రకటన వేయించారు. అయినా ఏ ఆధారమూ దొరకలేదు. రాఘవరావు ఆచూకీ దొరకలేదు.
తోడుగా ఉంటుందని ఊరినుంచి పిలిపించుకున్న అక్కతో కలసి, కొడుకు, కూతురు, పోలీసులు  వారిస్తున్నా, ప్రతిరోజూ పోలీసుస్టేషన్ వెళ్ళివస్తూనే వుంది సీతమ్మ! పోలీసువారు నోరు మెదపడం లేదు. పోలీసులు అన్నిస్టేషన్లకు సమాచారమిచ్చారు. 
''ఇంకా ఎక్కడ వెదకాలో చెప్పండి వెదుకుతాం'' అని విసుక్కుంటున్నారు పోలీసులు.
'జవాబుదారీతనం ప్రజలకేనా?' అనుకుంది సీతమ్మ. 
'మాయదారి జబ్బు ఆయనకే రావాలా! ఎక్కడున్నాడో...తిన్నాడో లేదో...ఒంటి మీద బట్టయినా వుందో లేదో' ? మతి సరిగ్గాఉన్ననాడే ఎదురుగా ఉన్నవస్తువే కనిపించేది కాదు. స్నానానికి టవల్ దగ్గరినుంచి అందించాల్సి వచ్చేది. వేళకింత పెడితే తినేవాడు. మాయమైపోయాడు. ఇంతపెద్ద పట్నంలో ఎక్కడని వెదకనయ్యా...!' అని కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తోంది అర్ధాంగి సీతమ్మ.
అవన్నీ 'అల్జీమర్స్ ' వ్యాధి లక్షణాలని ఆమెకు తెలియదు.పెద్దతనం, మతిమరపనే అనుకునేది సీతమ్మ .
"అమ్మా! పిల్లలూ, మా ఆయన రమ్మని గొడవ చేస్తున్నారు. క్షమించమ్మా ! నేను వెళ్లాలి" అంటూ కూతురు పావని తిరిగి న్యూజిలాండ్ వెళ్ళింది.
"పనులున్నాయమ్మా! నేను కూడా వెళ్లి తిరిగి వారం, పది రోజుల్లో మళ్ళీ వస్తాను" అని చెల్లెలు వెళ్లిన నాలుగో రోజు కొడుకూ తిరిగి వెళ్ళాడు.
నెల పది రోజులయింది రాఘవరావు ఇంటినుంచి తప్పిపోయి. చుట్టాలు,స్నేహితులు వచ్చి సీతమ్మను పరామర్శించి వెళుతున్నారు. మళ్లీ వస్తానన్నకొడుకు ఇంకా రాలేదు. సీతమ్మ ఒంటరి పోరాటం కొనసాగిస్తోంది. సీతమ్మకు తోడుగా వచ్చిన అక్క ఇంట వుంది.
                                                                    * * * * *
రాఘవరావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సంపాదించిన ప్రతి పైసా భార్య చేతిలో పెట్టేవాడు. పొదుపుగా ఖర్చుచేస్తూ హైదరాబాద్ 'రాజీవ్ నగర్' లో చిన్నఇల్లు కట్టుకుని కొడుకు, కూతుర్ని ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్లు చేశాడు. రిటైర్ అయ్యాక ఏడెనిమిది సంవత్సరాలు ఆరోగ్యంగానే ఉన్నాడు. తరువాత 'అల్జీమర్స్ ' వ్యాధి సోకి, ఐదారేళ్లుగా బాగా ముదిరి ఇంటినుండి బయటకు వెళ్ళి తప్పిపోయాడు. 
'పిల్లలిద్దరూ వచ్చి నెలరోజులపాటు విఫలయత్నం చేసివెళ్లారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. ఎన్నాళ్లని ఉంటారు ? వారికి ఉద్యోగాలు, సంసారాలు ఉన్నాయిగా!
ఉన్న నెలరోజులు పోలీస్ స్టేషన్, సిటీ చుట్టూ తిరిగినా ఏం ప్రయోజనం లేకపోయింది'
అనుకుంది సీతమ్మ తల్లిమనసుతో.  
                                                                    * * * * *                              
"ఇంట కూర్చుని చేసేదేముంది. రేపు పోలీస్ స్టేషనుకి వెళ్లివస్తాను" అంది సీతమ్మ అక్కతో.  
పోలీసుస్టేషనుకి వెళుతూ దారిలో వెల్డింగ్ షాపుకి వచ్చింది సీతమ్మ.
షాపులో భర్తను పలకరించిన కుర్రాడిని గురించి మళ్ళీ వాకబు చేస్తుండగా షాపు యజమాని బయటకు వచ్చి ''నా పేరు బాసిత్ అమ్మా! రావు సాబ్ నాకు తెలుసు. చాలా రోజులుగా ఆయన్ని చూడలేదు. ఆయన  'పానం' బాగుందా ? బయటకు రావడంలేదా ?
మీ ఇల్లు కట్టినప్పుడు ఇంటి గేటు, కిటికీలు నేనే తయారు చేసిన అమ్మా ! నిన్నుకూడా నేను గుర్తుపట్టింది" అన్నాడు బాసిత్ ఉర్దూ యాసతో
''అవును. ఆయనకి ఒంట్లో బాగాలేదు. మతి స్థిమితం లేక నెలరోజులు క్రింద ఇంటినుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము'' విషయం వివరిస్తూ అంది సీతమ్మ.
''ఏమిటీ ! నెలరోజులు అయిందా ? పెద్ద మనిషి కనబడలేదు. ఇంటికి రాలేదు ...!? ఏ ఖుదా !'' అన్నాడు బాధ వ్యక్తపరుస్తూ బాసిత్.
''నేను ఇట్లా చెబుతున్నయి అని ఏమీ అనుకోవద్దు బెహెన్. మీ అబ్బాయి పురుషోత్తం బాబు కూడా నాయనకోసం అమెరికా నుంచి వచ్చి నిజంగా బాధపడ్డడు. నా దగ్గరికి వచ్చి నువ్వు అడిగినట్లే వాడు అడిగింది. అప్పుడు నాకు అనుమానం రాలేదు. ఇప్పుడు నాకి ఒక అనుమానం వచ్చింది. మీకు నిజంగా సాయం చేద్దామని చెపుతున్నయి. ఇక్కడ పార్క్ లో బిచ్చగాళ్ళు చాలా ఉన్నయి. రోజూ వాళ్లందరినీ ఒక లీడర్ సిటీలో వేరే వేరే సెంటర్లకి తిప్పుతాడు. వాళ్ళని అడిగితే రాఘవరావు సాబ్ ని వాళ్ళెవరైనా చూసింరా అన్నఇన్ఫర్మేషన్ ఏమైనా దొరకవచ్చు" అన్నాడు బాసిత్ మెల్లగా రహస్యం చెబుతున్నట్లుగా.
అది విన్న సీతమ్మకు ఒక్క క్షణంలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వెంటనే నిరుత్సాహ పడుతూ ''బిచ్చగాళ్లను అడగాలా ఆయన గురించి...ఎందుకు ?" అని అడిగి ఆలోచించింది.
బాసిత్ అన్నమాట అర్ధం అవుతూనే ఒళ్ళు గగుర్పాటుతో బాటు ఆమె పంచేంద్రియాలు పనిచేయడం మానేశాయి. నిస్సత్తువ ఆవహించి, బాధతో విలవిల్లాడి పోయిందా మనిషి.
                                                                 * * * * *
ఇంటికి వెళ్ళాక రెండు, మూడు గంటలు మనిషి కాలేక పోయింది సీతమ్మ. తినలేదు.
పచ్చి గంగ ముట్టలేదు. గదిలోనుంచి బయటకు రాలేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి.
''మొక్కు తీర్చుకోవడానికి ఏదో క్షేత్రానికి వెళ్ళి వచ్చినట్లుగా ఒక్కొక్కరూ వచ్చి వెళ్లారు.
కుటుంబం కోసం జీవితాన్ని ధారపోసిన మనిషి దిక్కూ, మొక్కూలేక ఎక్కడో పడి ఉండవచ్చని తెలిశాక, జీవితమే వ్యర్థమనిపిస్తోంది. ప్రయోజకులైన కన్నబిడ్డలూ దగ్గరలేక, ఆయన అనాథ కావడం తనని నిలువునా తొలిచేస్తోంది'' అని అక్కతో చెప్పుకుని బాధపడ్డది సీతమ్మ.
"అవునే తల్లీ ! నీకు రావలసిన కష్టం కాదిది. తన పర అనకుండా ఎంతమందికి సాయం చేశావు.  అయినా ఏం ఖర్మమో దేవుడిట్లా వ్రాశాడు నీ నొసటన"
"నేను కష్టాల కెన్నడూ వెరవలేదక్కా! కష్టంలో కన్నబిడ్డలే అక్కరకు రాలేని పరిస్థితి! ఎప్పుడో, ఏదో, ఎవరికో సాయం చేశామని అనుకుని ప్రయోజనమేమిటి ? పురుషోత్తం పైచదువుకి అమెరికా వెళ్తానంటే 'మీరాదేశం వెళితే మరి రారు. మా ఇద్దరివిక ఒంటరి బతుకులే ! అయినా నీ భవిష్యత్తు నిలపడానికి నే నెవ్వరిని ? మనిషికి దేవుడు తలరాత ఒక్కసారే రాస్తాడంట. నేను కాదన్నా తిరిగి రాయడుగా!' అని ఆయన అన్నప్పుడు నాకర్ధం కాలేదు. ఆ ప్రతి మాట పొల్లుబోకుండా యదార్ధమయిందిప్పుడు.
'ముసలితనం, మతిమరుపనుకున్నానేగాని  రోగంతో బాధపడుతున్న విషయం తెలుసుకోలేనంత మూర్ఖురాలినయ్యాను. ఆయన తప్పి పోవడానికి కారణమయ్యాను. ఆయన దొరికిందాకా పోరాడుతాను' అని అక్కతో చెప్పుకుని బాధపడుతూ కన్నీరు మున్నీరయింది సీతమ్మ.
                                                                * * * * *
వెల్డింగ్ షాప్ యజమాని బాసిత్ సలహా మేరకు వరుసగా రెండురోజులు సీతమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధి చివర పార్కులోనే ఒక మూలగా కూర్చుంది. వచ్చేపోయే జనం గాక అయిదారుగురు బిచ్చగాళ్ళు, పల్లీలు, సమోసాలు, ఐస్ క్రీం అమ్మేవాళ్ళు, రోజంతా అక్కడక్కడే తిరుగుతూ కనిపించారు.
ఒక బిచ్చగాడు దుక్కలాగా ఉన్నాడు. ఓ కన్ను గుడ్డి. వాడికి పది రూపాయలిచ్చి రాఘవరావు ఫోటో చూపెట్టి అడిగింది సీతమ్మ. 
"ఈ ముసలాయన్నిఈ  పార్కులో ఎప్పుడయినా చూశావా?" అని....
''లేదమ్మా! నేను చూడలేదు" అంటూ పరుగులాంటి నడకతో వెళ్లిపోయాడక్కడనుంచి.
వేరే కొందరినీ అడిగింది సీతమ్మ. వారూ తెలియదని సమాధానం చెప్పారు.
బాసిత్ భాయ్ కి ఈ సంగతి చెబుదామని షాపుకి వెళ్ళింది. అతనప్పుడు షాపులో లేడు.
                                                                 * * * * *
మరుసటి రోజు మధ్యాన్నం ఒంటిగంటకు బాసిత్ భాయ్ గేటు తీసుకుని ఇంటికి రావడం చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది.
''నమస్తే అమ్మా ! రావు సాబ్ 'అతా, పతా' ఏమైనా తెలిసిందా?'' అనడిగాడు బాసిత్.
"ప్చ్! ఇంకాలేదు'' అంది సీతమ్మ నీరసంగా.
"నేను ఎంక్వైరీ చేసినాను. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ లతో మాట్లాడినాను. ఈ రోజు సాయంత్రం పోలీసులు రమ్మన్నారు. మీరు రెడీగా ఉండండి. నేను ఫోను చేసినప్పుడు వెంటనే స్టేషనుకి రండి'' అని చెప్పి ఆమె మొబైల్ ఫోనునంబరు నోట్ చేసుకుని వెళ్ళాడు బాసిత్.
తరువాత బాసిత్ భాయ్ ఫోను వచ్చిందాకా సమయం గడవడమే కష్టమయియింది సీతమ్మకి.
అసహనం, ఉద్విగ్నతతో అసలు కాలమే నిలిచి పోయినట్లనిపించిందామెకి. ఏభై ఏళ్లకు పైగా భర్తతో సాన్నిహిత్యం గుర్తుకి వచ్చి మనసంతా కకావికలమయింది. ఇంటికీ, బయటకు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. 
సాయంత్రం ఆరు గంటలయింది. బాసిత్ భాయ్ దగ్గనుంచి ఫోన్ రాలేదు.
'ఈరోజు ఆయన దొరుకుతాడనిపిస్తోంది' ఇవాళ ఇంటికి వస్తాడాయన అని పదే పదే మనసులో అనుకుంది. దేవుణ్ణి ప్రార్ధించింది.వెంకటేశ్వరస్వామికి ముడుపు కట్టింది.
ఇంతలో బాసిత్ భాయ్ దగ్గర నుంచి ఫోను,వెంటనే పోలీసుస్టేషన్ కి రమ్మని.
పది నిముషాల్లో స్టేషను కి వెళ్ళింది సీతమ్మ. 
ఇన్స్పెక్టర్ ఎదురుకుర్చీలో కూర్చుని ఉన్నాడు బాసిత్ భాయ్. సీతమ్మ వస్తూనే ఇన్స్పెక్టర్ కి పరిచయం చేసి "మీరు ఇక్కడే స్టేషన్లోనే ఉండండి అమ్మా! మేము ఇదే పనిమీద బయటకు వెళుతున్నాము" అన్నాడు బాసిత్.
"లేదు! ఆమెను మనతో తీసుకెళ్ళాలి... " అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
"ఇన్స్పెక్టర్ సాబ్! పెద్ద మనిషి. ఆమె అక్కడికి ఎందుకు ?" అన్నాడు బాసిత్ ఆందోళనగా.
"అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదు...ఆ గుంపులో ఆయన వుంటే గుర్తించాలి గదా! అందుకే ఆమెను తీసుకుని వెళదాము" అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
రెండు నిముషాల్లోనే 'చాయ్' వచ్చింది. సీతమ్మ వద్దంది.
ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతూ గంటలు కొడుతున్నగోడ గడియారం వంక చూస్తూ 'అర్ధగంట తరువాత బయలుదేరుదామన్నాడు బాసిత్ భాయ్ తో. ఎక్కడికి వెళుతున్నది వివరాలేమీ తెలియదు.
అర్ధగంట తరువాత అందరు స్టేషను బయటకొచ్చారు.పెద్ద పోలీసు వేను, రెండు జీపులు, పదిమంది కానిస్టేబుళ్లతో అంత బందోబస్తుగా వెళుతుంటే ఏదో 'రెయిడ్' కి వెళుతున్నట్లుగా అనిపించింది.
బాసిత్ భాయ్ ని వెనక, సీతమ్మని ముందుసీటులో జీప్ ఎక్కమన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
గంటన్నర పైగా డ్రైవ్ చేసి సిటీకి దూరంగా విసిరేసినట్లు అక్కడక్కడ ఇళ్లున్న ఏదో 'కాలొనీ' కొచ్చి
ఒక పెద్ద షెడ్ దగ్గర ఆగాయి వెహికల్స్.
అది ఒక కోళ్ళ ఫారం. షెడ్ బయట పెద్ద బోర్డు ఉంది.
పోలీసులంతా బిల బిల మంటూ వేను దిగుతూనే షెడ్ నాలుగు వైపులా నలుగురు కానిస్టేబుళ్లు పొజిషన్ తీసుకున్నారు. కాంపౌండ్ గోడ ఎక్కి లోనికి దిగి గేటు తెరిచాక మిగతా పోలీసువారంతా లోనికి వెళ్తూనే గేటు మూసేశారు. బాసిత్, సీతమ్మ బయటే ఉన్నారు.
అయిదు నిముషాల తరువాత కానిస్టేబుల్ బయటకువచ్చి సీతమ్మని, బాసిత్ ని లోనికి తీసుకువెళ్ళాడు.
షెడ్  లోపల పరిస్థితి అతి భీతావహంగా, దయనీయంగాఉంది. దుర్వాసనతో ముక్కులు బద్దలయ్యేలా వుంది. కడుపులో దేవుతూ వాంతి వచ్చేలా అనిపించింది సీతమ్మకు.
లోన పసి పిల్లల దగ్గరనుంచి పండు వయసున్న ఆడా, మగ మనుషులందరు కలిపి సుమారు వందమందికి పైగా ఉన్నారు. షెడ్ అంతటా పాతపరుపులు, గోనె సంచులు, ప్లాస్టిక్ పట్టాలు,చిరిగిన దుప్పట్లు, జంపకానల మీద గోడలకు చేరి, అడ్డ దిడ్డంగా ఉన్నారు. కొందరు పడుకుని, కొందరు కూర్చుని జోగుతూ, కొందరు పేకలాడుతూ, జూదమాడుతూ కొందరు, ముక్కుతూ,మూల్గుతూ హీనంగా ఉన్నవారి పరిస్థితి చూసి చలించిపోయింది సీతమ్మ.
ఒక పక్కన నాలుగయిదు కుండల్లో నీరు,మసిబారిన పెద్ద డేక్సా గిన్నెల్లో అన్నం, పప్పు,  ఇంకొకమూలన దుర్వాసనగొడుతున్నచెత్తకుప్ప....!
"త్వరగా వెతకండమ్మా... మీ భర్త ఉన్నారేమో" అన్నాడు ఇన్స్పెక్టర్ హ్యాండ్ కర్చీఫ్ తో ముక్కు  నోరు కప్పుకుంటూ అంబులెన్సుకు, మున్సిపల్ అధికారులకు ఫోను చేశాడు. లోన ఉన్న గదులలో సోదా జరుగుతోంది.
పిల్లలను, వృద్ధులను చేతకానివారిని బలవంతగా ఎత్తుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నారన్న అభియోగంపై లోన ఉన్ననలుగురు నిర్వాహకులను చేతులకు బేడీలు వేసి బయటకు పట్టుకెళ్లారు పోలీసులు.
"నేను ఇటు పక్కన వెతుకుతాను. మీరు అటు పక్కన చూడండి అమ్మా!" అన్నాడు బాసిత్ వెంటనే.
ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ భర్తకోసం వెతకడం మొదలెట్టింది సీతమ్మ ముక్కుకి కొంగు అడ్డంగా పెట్టుకుని. ఇంటిదగ్గర పార్కులో దుక్కలాగా కన్పించిన ఒంటి కన్ను బిచ్చగాడు కన్పించాడు. వాడిని చూస్తూనే ఆశ్చర్యానికి లోనయింది సీతమ్మ. వెంటనే బాసిత్ భాయ్ కి, సబ్ ఇన్స్పెక్టర్ కి వాడిని చూపించి, భర్తకోసం శ్రద్ధగా వెదకడంమొదలెట్టింది.  
ఓ మూలన గచ్చునేలమీద ఓ గోనె సంచి కప్పి ఉన్న ఓ ఎముకుల గూడంటి మనిషిని చూసి అక్కడ ఆగింది సీతమ్మ. గోనె సంచి తీసి ముఖం పరీక్షగా చూసింది. మట్టితో జుట్టు మాసి,గడ్డం, మీసం పెరిగి గుర్తు పట్టలేనంతగా కళ్ళు లోతుకు పోయి, ఒళ్లంతా మట్టి కొట్టుకుపోయి, ఎక్కడో కొద్దిగా మినుకు, మినుకుమంటున్న ప్రాణం, అందీ అందనట్లున్ననాడి. పిడికెడంతున్నాడా మనిషి. ఎముకల గూడు మీద పల్చటి చర్మం. మోకాళ్ళమీద కూర్చుని ఆ మనిషిని పరిశీలనగా చూస్తే గానీ భర్తని గుర్తించలేకపోయింది సీతమ్మ. రెండు చేతులతో ఆయన భుజాలను పొదివి పట్టుకుని కింద కూలబడ్డది.
ప్రాణప్రదమైన భర్త దిక్కులేని వీధి జంతువులా, ఈగలు మూగి, స్పృహలేక కొన ప్రాణంతో  
పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది సీతమ్మ.
"బాసిత్ భాయ్ !" అంటూ పెద్ద కేకవేసింది సీతమ్మ.
పరుగున వచ్చాడు బాసిత్.
రెండుచేతులు జోడించి బాసిత్ కి నమస్కారం చేసి  రెండు చేతుల్తో భర్తను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చూసి "అమ్మా! ఏం చేస్తున్నావు. జర ఆగండి" అంటూ పరుగున బయటికి వెళ్లి అప్పటికే వచ్చిన అంబులెన్సు నుంచి స్టెచర్ ని,హెల్పర్ని కూడా తీసుకువచ్చాడు బాసిత్.
"అంబులెన్సులు వచ్చాయి. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి" అన్నాడు సబ్  ఇన్స్పెక్టర్, రాఘవరావు పరిస్థితి విషమంగా ఉండడం చూసి.
భర్తని స్టెచర్ మీదకు చేర్చి ,హెల్పర్ ఒక వైపు, రెండో వైపు బాసిత్ పట్టుకోగా స్టెచర్ పక్కన పట్టుకుని, యముడి బారి నుంచి భర్తను రక్షించుకున్నసావిత్రిలా నడిచింది సీతమ్మ అంబులెన్సు వద్దకు.
షెడ్ బయట, అప్పుడే వచ్చిన టి.వి.ఛానళ్ల వేన్లు, కెమెరాలతో కోలాహలంగా ఉంది. ఇద్దరు ముగ్గురు కెమెరాలతో సీతమ్మను పలకరించే ప్రయత్నం చేశారు. వారిని దాటి భర్త స్ట్రెచర్, బాసిత్ భాయ్ తో బాటు అంబులెన్సు ఎక్కింది సీతమ్మ. సైరను మోగుతూ అంబులెన్సు వేగంగా కదిలింది.  
"ఆక్సిజన్ పెట్టేనమ్మా! అర్ధగంటలో హాస్పటల్ కి వెళ్ళిపోతాం. మరేం భయంలేదు" అన్నాడు  బోయ్ రాఘవరావుని అంబులెన్సులో ఎక్కించిన మరుక్షణంలో
                                                   ===========xxx==========

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254