లేబుళ్లు

17, సెప్టెంబర్ 2020, గురువారం

దిక్కులు, మూలలు, వేదాలు, జ్యోతిర్లింగాలు,పురుషార్ధాలు, పంచేంద్రియాలు, దేవతావృక్షాలు, పంచోపచారాలు, పంచారామాలు, షడ్రుచులు, తిరుపతిసప్తగిరులు,అరిషడ్వర్గాలు షడ్గుణాలు

దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

వేదాలు :(1) ఋగ్వే దం, (2) యజుర్వేదం,(3) సామవేదం,(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,(3) కామ,(4) మోక్షా

పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

పంచేంద్రియాలు : (1) కన్ను,(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,(5) చర్మం.

లలిత కళలు : (1) కవిత్వం,(2) చిత్రలేఖనం, (3) నాట్యం,(4) సంగీతం, (5) శిల్పం.

పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,(3) గోదావరి, (4) కావేరి,(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు : (1) మందారం, (2) పారిజాతం, (3) కల్పవృక్షం, (4) సంతానం, (5) హరిచందనం.

పంచోపచారాలు : (1) స్నానం,(2) పూజ,  (3) నైవేద్యం,(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.

పంచామృతాలు : (1) ఆవుపాలు,(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, (5) తేనె.

పంచలోహాలు : (1) బంగారం,(2) వెండి,  (3) రాగి,(4) సీసం, (5) తగరం.

పంచారామాలు : )1) అమరావతి,(2) భీమవరం, (3) పాలకొల్లు,(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,(3) చేదు, (4) వగరు,(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం,(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,(5) మదం, (6) మత్సరం.

సప్త ఋషులు : (1) కాశ్యపుడు,(2) గౌతముడు,  (3) అత్రి,(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతిసప్తగిరులు : (1) శేషాద్రి,(2) నీలాద్రి, (3) గరుడాద్రి,(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్తవ్యసనాలు : (1) జూదం, (2) మద్యం, (3) దొంగతనం, (4) వేట, (5) వ్యభిచారం, (6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు : (1) గంగ,(2) యమునా,  (3) సరస్వతి,(4) గోదావరి,  (5) సింధు,(6) నర్మద,  (7) కావేరి.
            
నవధాన్యాలు : (1) గోధుమ,(2) వడ్లు,  (3) పెసలు,(4) శనగలు, (5) కందులు,(6) నువ్వులు, (7) మినుములు, 
(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం, (2) పగడం, (3) గోమేధికం,(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,(7) కనకపుష్యరాగం, 
(8) పచ్చ (మరకతం), (9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 5) ఇనుము, (6) కంచు,(7) సీసం, (8) తగరం, 
(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,(6) భయానక, (7) బీభత్స, (8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి, (2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,(4) కూష్మాండ, (5) స్కందమాత, 
(6) కాత్యాయని, (7) కాళరాత్రి, (8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు : (1 ) వివాహం, ( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , (4 ) సీమంతం, (5) జాతకకర్మ, 
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, (8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, (10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,(2) కూర్మ, (3 ) వరాహ,(4) నరసింహ, (5) వామన,(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2) మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) తమిళనాడు ~ రామలింగేశ్వరం
 
తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,(3) మంగళ, (4) బుధ, (5) గురు,(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, (5) శ్రావణం, (6) భాద్రపదం, (7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, 
(9) మార్గశిరం, (10) పుష్యం, (11) మాఘం, (12) ఫాల్గుణం.

రాశులు : (1) మేషం,(2) వృషభం, (3) మిథునం, (4) కర్కాటకం,(5) సింహం, (6) కన్య, (7) తుల, (8) వృశ్చికం, (9) ధనస్సు, 
(10) మకరం, (11) కుంభం,(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, (3) తదియ, (4) చవితి,(5) పంచమి, (6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, (9) నవమి, 
(10) దశమి,(11) ఏకాదశి, (12) ద్వాదశి, (13) త్రయోదశి, (14) చతుర్దశి,(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, (3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, (6) ఆరుద్ర, (7) పునర్వసు,(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, (14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, (17) అనురాధ, (18) జ్యేష్ఠ,(19) మూల, (20) పూర్వాషాఢ, 
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,(23) ధనిష్ఠ, (24) శతభిషం, (25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, (27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107;

(2) విభవ :- 1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :- 
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. - 
1934, 1994, 2054, 2114

9యువ.  - 
1935, 1995, 2055, 2115

10.ధాత.  - 
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. - 
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. - 
1939, 1999, 2059, 2119

14.విక్రమ. - 
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. - 
1942, 2002, 2062, 2122

17.స్వభాను. - 
1943, 2003, 2063, 2123

18.తారణ. - 
1944, 2004, 2064, 2124

19.పార్థివ. - 
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. - 
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. - 
1948, 2008, 2068, 2128

23.విరోధి. - 
1949, 2009, 2069, 2129

24.వికృతి. - 
1950, 2010, 2070, 2130

25.ఖర. 
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ. 
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి. 
1956, 2016, 2076, 2136

31.హేవళంబి. 
1957, 2017, 2077, 2137

32.విళంబి. 
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి. 
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్. 
1962, 2022, 2082, 2142

37.శోభకృత్. 
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144, 

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ. 
1967, 2027, 2087, 2147

42.కీలక. 
1968, 2028, 2088, 2148

43.సౌమ్య. 
1969, 2029, 2089, 2149

44.సాధారణ . 
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్. 
1971, 2031, 2091, 2151

46.పరీదావి. 
1972, 2032, 2092, 2152

47.ప్రమాది. 
1973, 2033, 2093, 2153

48.ఆనంద. 
1974, 2034, 2094, 2154

49.రాక్షస. 
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156, 

51.పింగళ                 
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి         
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి              
1979, 2039, 2099, 2159

54.రౌద్రి                 
1980, 2040, 2100, 2160

55.దుర్మతి              
1981, 2041, 2101, 2161

56.దుందుభి             
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి         
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి                 
1984, 2044, 2104, 2164

59.క్రోదన                  
1985, 2045, 2105, 216

60.అక్షయ              
1986, 2046, 2106, 2166.

30, జనవరి 2020, గురువారం

'నల్ల'తల్లి

ఈ కథ ఆంధ్రజ్యోతి "నవ్య " ది. 29-01-2020  వారపత్రికలో  ప్రచురింపబడినది.
( సంక్రాంతి కధలపోటీలో బహుమతి గెలుచుకున్న కధ )


                                                                  'నల్ల'తల్లి
                                                              --------------------

''ఎవరో ఆడమనిషి.ఆమెతో ఒక చిన్నపిల్ల గుమ్మం దగ్గర ఉన్నారు. ఇంట్లోకి రమ్మనాలా అమ్మా''? అంది పనిమనిషి సుజాత.
''నీకెన్నిసార్లు చెప్పాలి సుజాతా? వచ్చినవారితో మర్యాదగామాట్లాడి పేరు కనుక్కొనిరమ్మని '' పనిమనిషిని మందలిస్తూ అంది రాగిణి తనే లేచి బయటగుమ్మం వైపు నడుస్తూ.
''అయ్యో…పేరు అడగనే లేదమ్మా ! ఇప్పడే అడిగొస్తా '' …
''నువ్వట్లా ఆగు నేను వెళ్తా ''అని రాగిణి అంటున్నావినిపించుకోకుండా పరుగులాటి నడకతో బయటకు వెళ్ళింది సుజాత. 
గుమ్మం దగ్గర నీలవేణిని చూసి సంభ్రమాశ్చర్యాలకి లోనై నోటమాటరాక కొన్నిక్షణాలు అలా చూస్తూనే ఉండిపోయి ''నీలూ... నువ్వా''? ఎన్ని సంవత్సరాలయిందే నిన్నుచూసి అని ఒక్క అంగలో చేరి ఒళ్ళు తెలియని ఆనందంతో నీలవేణిని కౌగలించుకుంది రాగిణి. ఆ ఉద్విగ్నం నుంచి తేరుకుని ''గుర్తుపట్టకుండా తయారయ్యావు. ఏవిటా జుట్టు'' ? చనువుగా అంటూ బ్యాగు, సూట్ కేసు తీసుకురమ్మని సుజాతకు చెప్పి ఒక చేత్తో నీలవేణి చేయి, రెండో చేతితో పాప చేతిని పట్టుకుని లోనికి నడిచింది రాగిణి.
''నువ్వు కాఫీ తాగి స్నానం చేద్దుగాని ముందు పాపకు తినడానికేమైనా పెట్టమంటావా''? అంటూ తన  సమాధానం కోసం ఎదురు చూడకుండానే  'సుజాతా' సూట్ కేస్, బ్యాగు తీసుకుని గెస్ట్ బెడ్ రూములో పెట్టి గీజర్ వేసి అమ్మకు బాత్రూం చూపెట్టి ఇలావచ్చేయ్' అని చెప్పి కిచెన్లోకి నడిచింది రాగిణి. క్షణాల్లో నీలవేణి కి కాఫీ, పాపకు కాచి చల్లార్చిన పాలు,గ్లూకోస్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి వంటకు ఉపక్రమించింది రాగిణి.
కాఫీ తాగి స్నానం చేసి వంటింట్లోకి వస్తూ ''ఇప్పుడు వంటేమీ చేయకు నాకు ఆకలిగా లేదు'' అంది నీలవేణి రాగిణిని వారిస్తూ.
''సరే.. నీకు ఆకలి లేదు మరి ఆ చంటి పిల్లకు కూడా ఆకలి లేదా''? అంది రాగిణి వాత్సల్యంతో.
''ఎక్కడ నుంచి వస్తున్నావు? ఒక్కదానివే వచ్చావా ? యశ్వంత్ వాళ్ళు రాలేదా'?
ఆ పిల్లెవరు''? అంది రాగిణి నీలవేణి వంక చూడకుండానే పోపులో బెండకాయ ముక్కలు వేస్తూ ఉత్సుకత ముఖంలో కనబడనీయకుండా.
''యశ్వంత్ వాళ్ళెవరు నాతోలేరు. అన్నవరంలో స్నేహితుడి పెళ్లి చూసుకుని తిరిగివస్తూ ఉదయమే విజయవాడలో నిన్నుకలిసి అమ్మవారి దర్శనం చేసుకుని వెళదామనుకుని వచ్చాను'' అంది నీలవేణి
''అవునూ…నా అడ్రస్ ఎవరిచ్చారు నీకు నేనివ్వలేదే ? నువ్వు మన స్నేహితులతో ఎవరితోనూ టచ్ లో లేవు. ఇల్లెలా దొరికింది''? అంది రాగిణి సాలోచనగా.
''నువ్వు క్రిత సంవత్సరం గృహప్రవేశం చేసుకున్నావు కదా ! ఆ ఆహ్వానపత్రిక  నాతో  తెచ్చుకున్నాను. అది ఆటోవాడికి చూపాను. వాడు సరాసరి తీసుకువచ్చి నీఇంటి ముందు దింపాడు.ఆ పత్రిక నాకు ఎలా దొరికిందనిమాత్రం నన్నుఇప్పుడు అడక్కు.
అది నాకు ఎలా దొరికిందో, ఎక్కడ దొరికిందో తరువాత నీకు తీరిగ్గా చెబుతాను'' అంది నీలవేణి. .
''సరే గాని ఒక్క మాట…చెప్పకుండా అకస్మాత్తుగా వచ్చాను. ఇబ్బందవుతే నేను బయలుదేరుతాను'' తలవంచుకుని మెల్లగా, సందిగ్ధంగా అంది నీలవేణి.
''అబ్బో అంతా ఇంతా కాదు. చాలా ఇబ్బంది. సుజాతా…ఆబ్యాగులు తీసుకుని ఆటోని పిల్చి ఈమెను ఎక్కించేయమ్మా'' అంది రాగిణి నొచ్చుకుంటూ నీలవేణి మాటలకు స్పందించి .
''ఏంటమ్మా…ఏదో అంటున్నారు'' అంటూ అక్కడక్క డే తచ్చాడుతూ మాటలు చాటుగా వింటున్నసుజాత ఒక్క అంగలో వంటగదిలోకి వచ్చింది.
''ఏంలేదులే వెళ్ళు, పనిచూసుకో'' అంటూ సుజాతను కసురుకుంది రాగిణి.
''అదేంటమ్మా...పిలిచినట్లనిపించి వచ్చానమ్మా'' ఏమయిందో అర్ధంగాక  వెనక్కి హాల్లోకి వెళుతూ అంది సుజాత.
అర్ధగంటలో వంటచేసి వారిద్దరూ తినగానే గది లోనికి వెళ్లి బెడ్ మీద కూర్చుంటూ ''ఇక చెప్పవే నీ కధ కమామీషు'' అని కూర్చున్నదల్లా తనకి విశ్రాంతి కావాలేమో అన్నధ్యాస వచ్చి మంచంమీదనుంచి లేస్తూ ''నువ్వు కాసేపు పడుకోవే, లేచాక మాట్లాడుకుందాం'' అంది రాగిణి. తలవూపింది నీలవేణి. తలుపు దగ్గరగా వేసి గదిలోనుంచి మెల్లగా బయటకు నడిచింది రాగిణి.
                                                                   * * * * *
        రాగిణి, నీలవేణి దగ్గరి చుట్టాలనడంకంటే మంచి స్నేహితులనే చెప్పాలి.
నీలవేణి తలిదండ్రులకు ఒక్కతే కూతురు. తనకు రాగిణి సొంత మేనత్త కూతురే.
ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో ఒకే స్కూలు, ఒకే జూనియర్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇంటర్ అయినవెంటనే పద్దెనిమిదో ఏటే రాగిణి పెళ్ళి అయింది. స్వతహాగా చదువులో చురుకైన పిల్లకావడంతోనీలవేణి మాత్రం పైచదువులు చదవాలనే పట్టుదలతో ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ లో మంచి 'రాంక్' సంపాదించింది. కూతురుతో కలిసి చదువుకుంటున్న చెల్లెలు కూతురు రాగిణికి పెళ్ళికావడంతో కూతురు నీలవేణికి కూడా పెళ్లి చేయాలని తండ్రి రామరాజు ఆరాటపడ్డారు. నీలవేణి బాగా నలుపు. జుట్టు తెల్లగా ఉండేది. అంచేత నచ్చక పోవడంతో ఏ సంబంధము కుదరలేదు.చుట్టాల్లో ఉన్నఒక స్కూల్ టీచరుకి ఇచ్చి చేద్దామనుకున్నారు. 
వారు ఆస్తి ముందే వారిపేరుమీద వ్రాసియివ్వాలని షరతు పెట్టడంతో అదీ కుదరలేదు. 
నీలవేణి కొచ్చిన ర్యాంక్ కి వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సీటు వస్తుందని అక్కడే  చేరమని లెక్చరర్లు ప్రోత్సహించడంతో వైజాగ్ లో చదువుతానంటూ తండ్రిని ప్రాధేయపడింది నీలవేణి.
''ఇంటర్ దాకా చదివింది చాలు. నువ్వు ఏ ఇంజనీరో అవుతే అంతకంటే ఎక్కువ చదువుకున్నోడిని ఎక్కడనుంచి తేవాలి నేను'' అన్నాడు తండ్రి రామరాజు.
''నేనెంత చదివినా నువ్వెవరిని చేసుకోమంటే వాడిని చేసుకుంటాను.
మీకా అనుమానం వద్దు. ఒట్టేసి చెబుతున్నాను. నన్నుమాత్రం చదువాపమని అనవద్దు. నాకో ధ్యేయం వుంది'' అంది నీలవేణి తండ్రి రామరాజుని బ్రతిమిలాడుతూ
''ఒక్కగానొక్క పిల్ల అంతలా అడుగుతుంటే ఏందయ్యా నీ మంకుపట్టు. నువ్వెప్పుడు పెళ్ళిచేస్తానంటే అప్పుడొస్తాననిచెబుతోందిగా. చదువుకొనీ దాన్ని'' అంది తల్లి  సీతారత్నం మొగుణ్ణి ఈసడిస్తూ.
దాంతో ఆయన ఒక మెట్టుదిగి విశాఖపట్నంలో కాదు. ఇక్కడే భీమవరంలో చదవమను. కళ్లెదుటే ఉండాలంటూ భీమవరంలో ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడాయన. అలా ఇంజనీరింగ్ లో చేరింది నీలవేణి. రామరాజు కూతురికి సంబంధాలు చూడడం మానలేదు. ఏ సంబంధమూ కుదరనూలేదు. నీలవేణి మాత్రం పట్టు వదలకుండా ఇంజినీరింగ్ తరువాత ఐ.ఐ.టి. ఖర్గపూర్ లో ఎం.టెక్ చేసి వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి ఉద్యోగంచేస్తూ చేస్తూ నాలుగేళ్ల తరువాత పి.హెచ్.డి చేయడానికని ఉద్యోగం వదులుకుని అమెరికా వెళ్ళింది. తండ్రి రామరాజు మాత్రం నీలవేణిని ఉద్యోగం వద్దు సద్యోగం వద్దు మనకేమన్నా డబ్బుకి కొదవలేదు ఇంటి దగ్గరే ఉండమనే పోరాడేవాడు. అయినా నీలవేణి చదువు,ఉద్యోగం అమెరికా ప్రయాణంపూర్తిగా తల్లి సహకారంతో కొనసాగింది.
                                                               * * * * *
నీలవేణి కిప్పుడు నలభై ఏళ్ళు దాటాయి. ఇప్పటికీ పెళ్లి కాలేదు.పెళ్లి వద్దు అన్ననిర్ణయం కూడా తీసుకుంది. తను బాగా నలుపు. జుట్టు చిన్నతనం లోనే నెరిసి తెల్లగా ఉండేది. హైస్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకరోజు రాగిణి, నీలవేణి కలిసి వెళుతుంటే వెనకాలనుంచి మొగపిల్లలు 'కన్నయ్యా నల్లని కన్నయ్యా' అని వెక్కిరిస్తూ అదేదో ఎన్టీయార్ సినిమాలో పాట పాడుతూ గేలి చేశారు. రాగిణి ఉడుక్కుని వాళ్ళతో పోట్లాడింది. నీలవేణి మాత్రం ఏమాత్రం ఉలుకు పలుకూ లేకుండా ''పోనీలేవే నేను నల్లగా ఉన్నాననే కదా వాళ్ళు అనేది. నిజమే కదా ! పాడుకోనీ... నాకేంటి నష్టం అనేది'' ఎంతో మౌనం, ఓర్పు ప్రదర్శిస్తూ.
అంతటితో ఆగకుండా రాగిణి హెడ్ మాస్టారికి కంప్లైంట్ చేసింది.
హెడ్మాస్టారు మాతృభాష తమిళం. ఆయనకి తెలుగు కొంత అర్ధమయ్యీ గాక నీలవేణిని పిలిచి ''ఏమమ్మా రాగిణి చెబుతున్నది నిజమేనా'' ? అని నీలవేణిని అడిగాడు.
''ఏం లేదు మాస్టారూ'' అని అక్కడినుంచి రాగిణిని లాక్కువచ్చింది నీలవేణి.
ఆయన నీలవేణిని ఉద్దేశించి చనువుగా నల్ల...తల్లి, బహుమంచికూన అన్నాడు. అది విని హాయిగా నవ్వుకున్నారు వారిద్దరు.
                                                                   * * * * *
ఏది ఏమైనా నీలవేణి అమెరికాలో ఉండడం మూలాన వారిద్దరి మధ్య కలివిడి తగ్గింది. మొదట్లో ఉత్తరాలు వ్రాసుకోవడం, మొబైల్ ఫోన్లు వచ్చాక మాట్లాడుకోవడం బాగానే ఉండేది. క్రమేణా మాట్లాడుకోవడంకూడా తగ్గి ఆపై పూర్తిగా ఆగిపోయింది.
నీలవేణిని అమెరికా వెళ్లేముందు కలిసింది రాగిణి. మళ్ళీ కలవడం ఇప్పుడే. ఇద్దరికీ ఎవరెక్కడున్నారో చూచాయగా మాత్రం తెలుసు.
'తనిప్పుడు ఎందుకు వచ్చింది…  అమెరికా నుంచెప్పుడు వచ్చింది ?
యశ్వంత్ వాళ్ళు దీనితో కలిసి ఉండడం లేదా ? ఈ అమెరికన్ పిల్లెవరు ?
మళ్ళీ అమెరికా వెళ్తోందా లేదా.... '? అన్న ఆలోచనలతో సతమతమవుతూ
'నిద్ర లేచాక అన్నీ తెలుస్తాయి కదా. ఎందుకీ ఆరాటం' అని తనకి తాను సమాధానపడుతూ, నీలవేణికిష్టమని కాసిన్ని ఉల్లిపాయ పకోడీలు వేద్దామని లేచింది రాగిణి.                                                                                                   * * * * *
సరిగ్గా గంట తరువాత నీలవేణి హాల్లోకి రావడం గమనించిన రాగిణి సోఫా మీదనుంచి లేస్తూ ''రావే నిద్రపట్టిందా? ఎ.సి వేయడం మరిచిపోయాను. గదిలోకి వస్తే అలికిడికి లేస్తావేమోనని అటురాలేదు.పాప లేచిందా''? అడిగింది రాగిణి
''అలసి పోయానేమో వెంటనే నిద్రపట్టింది. ఫ్యాన్ వేసే వెళ్లావుగా అయినా అంత వేడిగా ఏమీలేదు'' అంటూ రెండు పెర్ఫ్యూమ్ బాటిల్స్ రాగిణికి ఇచ్చి ''ఒకటి నీకు రెండోది
మీ ఆయనకు''అంది నీలవేణి.
పెర్ఫ్యూమ్ అందుకుంటూ ''చిన్నది ఒక్కతి రూములో ఎందుకు? తీసుకురా దాన్నికూడా''? అంది రాగిణి ఒక పెర్ఫ్యూమ్ ని ఎడమచేతి వెనకాల వేసుకుని వాసనచూస్తూ.
''అది మీ అయనకే...అది మొగవాళ్ళది'' అంది నవ్వుతూ నీలవేణి.
''దీంట్లో కూడా ఆడా మొగా చచ్చాయా ! నాకేం తెలుసు. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తే వేసుకోవడం అంతే. ఆయనకు ఇవంటే మహాఇష్టం.ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు''అంది రాగిణి సర్ది చెప్పుకుంటూ .
''మరిచేపోయాను ఇందాక అడుగుతూ...ఇంతకూ పాప పేరేంటే'' ?
''పాప పేరు 'ఏవా'. నా కూతురు'' అంది నీలవేణి రాగిణి ముఖంలో హావభావాలకై వెదుకుతూ.
''కూతురా ? నీకు పెళ్లేకాలేదు. మరి…" అంది రాగిణి ఉత్సుకతతో నీలవేణివంక సూటిగా చూస్తూ
''ఏవాని పెంచుకుంటున్నాను. దాని తల్లీ తండ్రీ ఇద్దరూ కారు ప్రమాదంలో చనిపోయారు.
ఆప్రమాదంలో ఇది బతికి బయటపడ్డది. అప్పుడిది సంవత్సరంన్నరపిల్ల
దీని తల్లితండ్రులు అమెరికాలో నా ఇంటిపక్కన ఇంట్లో ఉండేవాళ్ళు.ఇప్పుడు తాత, నానమ్మ ఉన్నారు. తన అమ్ముమ్మ, ఇంకొక తాత, ఇటలీలో ఉంటారు. వారందరి ఇష్టంతోనే
ఇది నాదగ్గర ఉంది. అంటే ఇక్కడి భాషలో చెప్పాలంటే నేను దాన్నిదత్తత తీసుకున్నాను.
నన్ను'మామ్' అనే పిలుస్తుంది. దానికి తెలుగు వచ్చు. మన ఆహారం అంటే దానికి చాల ఇష్టం. పులిహార అంటే మరీను.అదీ పిల్ల సంగతి'' అంటూ ముగించింది నీలవేణి.
''పకోడీల ప్లేట్లు తెచ్చి తింటూ మాట్లాడుకుందాం'' అంటూ తను పకోడీప్లేట్లు తెచ్చి నీలవేణి పక్కనే కూర్చుంటూ ''ఇక చెప్పు ఐదారేళ్ళ సంగతులు అయిదు నిముషాల్లో కుదరదు నాకు వివరంగా చెప్పు'' అంది రాగిణి పక్కనే సర్దుకుని కూర్చుని.
''నేను అమెరికా వెళ్ళాక పి.హెచ్.డి పూర్తి చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.
ఉద్యోగం వెంటనే వచ్చింది. అప్పుడు యశ్వంత్  ఎం.ఎస్ చేయడానికి అమెరికా వచ్చాడు. యశ్వంత్ నాదగ్గరే ఉండి ఎం.ఎస్ చేశాడు అని నీలవేణి చెప్పేలోగానే
''అవును బాబాయి కొడుకైనా వాడి ఫీజులు, చదువు ఖర్చులన్నీ నువ్వే భరించావని వాళ్లే అందరికి చెప్పారు. అది మా అందరికీ తెలుసు'' అంది రాగిణి.
''సంగతులేమిటని నన్నడిగావు. నేను చెప్పేది వింటావా'' అంది నీలవేణి  చెప్పడం మానేసి.
''సరే...ఇక నేను మాట్లాడను చెప్పు'' అని సింబాలిక్ గా నోటికి చేతిని అడ్డుపెట్టుకుంది రాగిణి.
''వీసా సమస్య వల్ల యశ్వంత్ పెళ్ళికి రాలేకపోయాను. ఉద్యోగం వచ్చి వేరే వెళ్ళిన తరువాత  ఏడాది, ఏడాదిన్నర పైగా వాడు నేను కలవలేదు.ఎప్పుడయినా నేను ఫోను చేయడమే కాని వాడి దగ్గరనుంచి ఫోను గాని కబురుగాని లేదు. బాబాయి, పిన్నీ అమెరికా వచ్చినప్పుడు కూడా ఏదో క్లుప్తంగా, ముభావకంగా మాట్లాడారు. వాళ్ళు ఆంటీ ముట్టనట్లు వుంటున్నారు. బాబాయి, పిన్ని,యశ్వంత్ నాతో ఎందుకలా ప్రవర్తిస్తున్నారో ఇప్పటికీ నాకు సరిగ్గా తెలీదు.నీకు తెలుసుకదా…నాకు ఈ గొడవలు అసలు నచ్చవు. ఇక ఆ టాపిక్ వదిలెయ్''
''సాయంత్రం దుర్గ అమ్మవారి దర్శనం చేసుకుని రేపుదయం బయలుదేరి భీమవరం వెళతాను. అన్నట్లు చెప్పడం మరిచాను. నేను ఇండియా వచ్చినట్లు అమ్మవాళ్ల కింకా తెలీదు.వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని '' అంది నీలవేణి.
''దుర్గ అమ్మవారి గుళ్లో ఆయనకు తెలిసిన వాళ్ళెవరో ఉండాలి. ఆయనకు ఫోను చేసి చెబుతాను.దర్శనం త్వరగా అవుతుంది'' అంది రాగిణి.
''అవసరం లేదే.శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుని వెళ్దాం. ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం'' అంది నీలవేణి కల్పించుకుంటూ.
''దర్శనానికే గదా. మనమేమైనా చీరలు,సారెలు అడుగుతున్నామా''?
''ఫరవాలేదు.ఈ చిన్నసాయం చేస్తే ఆయనేం కరిగిపోడులే ఉండు'' అని తన ధోరణిలో ఫోను చేసి సాయంత్రం ఆరుగంటలకల్లా గుడికి రమ్మని భర్త కు చెప్పి ఫోను పెట్టేసి మనమూ త్వరగా తెమిలి గుడికి బయలుదేరదాం'' అంది రాగిణి లేచి రాత్రికి వంట ప్రయత్నం మొదలెడదామని.
                                                          * * * * *
మరుసటి రోజు ఉదయం పదిగంటలకల్లా టాక్సీలో భీమవరం వచ్చింది నీలమణి.
ఉరుము మెరుపులేని వర్షంలా గుమ్మం ముందు ప్రత్యక్షమైన కూతుర్నితనతో చిన్నపాపని చూసి అవాక్కయ్యారు నీలవేణి తలితండ్రులు.
''ఎప్పుడు బయలు దేరావు? చెప్పాపెట్టకుండా ఏమిటీ రాక'' అంది సీతారత్నం కూతురి చేతిలో సూట్ కేసు అందుకుంటూ, ఆప్యాయంగా మందలిస్తున్నట్లుగా ఇద్దరినీ పరిశీలనగా మార్చి మార్చి చూస్తూ.
''అమ్మా, ఏమిటా ఆ కంగారు ? ఈ పిల్ల ఏవా. తన ఫోటోలు మీకు పంపించానుగా'' అంది నీలవేణి.
''ఏకంగా పిల్లను తీసుకునే తయారయ్యావా ? ఇక వూళ్ళో మా పరువేం కాను''? అన్నాడు రామరాజు కోపంగా చేతిలో కండువాను ఒక్కసారి విదిల్చి అక్కడనుంచి లోనికి వెళుతూ.
''అదేంటమ్మా ? నాన్న అలా అంటున్నారు'' ఒక్కసారిగా హతాశురాలై అంది నీలమణి.  చిన్నబుచ్చుకున్నాతండ్రి మాటలను తేలిగ్గా తీసుకుంది ఆయనన్నమాటల్లో అంతరార్ధం తెలియక. ''అంతేలే అమ్మా ఆయన తీరు. మనకంటే ఊళ్ళోవాళ్ళ చెప్పుడు మాటలే ఆయనకు ముఖ్యం. మనం ఏం చెప్పినా ఆయన తలకెక్కవు. అదే తమ్ముడో, మరదలో చెబుతే అదే
వేద వాక్కు'' అంది సీతారత్నం నొచ్చుకుంటూ.
''సరేలే అమ్మా. నాన్నతో నీకెప్పుడూ ఉన్నదేగా కొత్తేమీ కాదుగా'' అంది లోనికినడుస్తూ నీలవేణి.
''అదేమిటే…ఆయనన్నది నన్నుకాదు. ఆ మాటకి అర్ధం…నీ కర్ధంకానట్లుంది'' అంది సీతారత్నం  నివ్వెరపోతూ నీలవేణితో. అప్పటికే నీలవేణి గది లోనికి వెళ్ళిపోయింది తల్లి మాట వినిపించుకోకుండా.
''భగవంతుడా ఈపిల్ల ఉన్నన్నిరోజులు ఇంట్లో గొడవల్లేకుండా గడిస్తే చాలుతండ్రీ'' అంటూ    మొక్కుకుంది సీతారత్నం ఎదురుగా గోడ మీద వెంకటేశ్వరస్వామి ఫోటోని చూస్తూ.
                                                        * * * * *
మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి చావిడిలో మడతమంచం మీద పడుకున్న తండ్రి దగ్గరగా వెళ్లి ప్రక్కనేవున్నబల్ల మీద కూర్చుంటూ ''ఏమిటి నాన్నా ఇన్ని సంవత్సరాల తరువాత వచ్చాను. మీరేమో మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడంలేదు. అంతలా మిమ్ముల్ని నొప్పించేలా ఏం చేశాను ? పైగా పొద్దున్న రావడంతోనే ఏకంగా పిల్లను తీసుకుని తయారయ్యావా? మా పరువేం గానూ'' అంటూ అసహ్యించుకున్నారు.
''అసలు మీ బాధకి కారణం ఏమిటి ? నేనా ఆ పిల్లా ? ఇంతవరకు నావల్ల మీ ప్రతిష్టకు భంగం ఎప్పుడు వచ్చింది చెప్పండి'' ? చనువుగా అంది నీలవేణి తండ్రిని ఖచ్చితంగా ప్రశ్నిస్తూ.
మాట్లాడడానికి ఇష్టపడనట్లు పక్కకి తిరిగి పడుకున్నాడు రామరాజు.
ఒక్కసారిగా తండ్రి భుజాన్ని పట్టుకుని తనవైపు లాగింది నీలవేణి అసహనంగా.
లేచి కూర్చుంటూ '' ఏం మాట్లాడమంటావు ? నువ్వు ఏనాడు నామాట విన్నావు గనుక.
పై చదువులు వద్దంటే వినలేదు.పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు. ఉద్యోగం వద్దంటే వినలేదు. పరాయి దేశం వెళ్లావు. ఇప్పుడు ఊళ్ళో తలెత్తుకోకుండా చేశావు'' అన్నాడాయన తన బాధ ఒక్కసారిగా ఉక్రోషం వెళ్ళగ్రక్కుతూ.
''నాన్నా...చిన్నప్పుడు బడిలో శర్మమేష్టారు చెప్పిన 'విద్యలేనివాడు వింత పశువు' అన్నమాటే
నా మనస్సులో బలంగా నాటుకుపోయింది. చిన్నప్పటి నుంచి నాకో ధ్యేయముంది. ఎప్పటికయినా నేను పుట్టిన ఈ వూళ్ళో ఒక స్కూలుపెట్టాలి. పేద పిల్లల చదువుచెప్పాలి…దాన్ని సాధించడం కోసమే నేనూహించుకున్న చదువు చదువుకున్నాను. నాధ్యేయం నెరవేర్చుకోవడం కోసం ఉద్యోగంచేస్తున్నాను. సంపాదిస్తున్నాను. నాకాళ్ళమీద నేను నిలబడ్డాను. దీంట్లో నేను చేసిన తప్పేంటో, నాపట్ల మీకుఎందుకు విముఖత ఏర్పడిందో నాకెప్పుడూ అర్ధంగాదు.పెళ్లి కాకపోవడం మూలాన్నే మిమ్ముల్నడిగే పై చదువులకెళ్ళాను.
అంతేకాని మీ మాటని కాదని నేను ఎప్పుడూ అనలేదు, మిమ్ముల్నివ్యతిరేకించనూ లేదు.
పెళ్లికానంత మాత్రాన నా జీవితానికేమీ తక్కువకాలేదు.చక్కగా వున్నాను. ఇంతకాలానికి మిమ్ముల్నిఅమ్మని చూద్దామని, నేను పెంచుకుంటున్న పిల్లని చూపిద్దామని, కొద్ది రోజులు మీతో సరదాగా గడుపుదామని, మీ ఆశీర్వాదం కోసం పడీ పడీ వస్తే గుమ్మంలో అడుగెట్టగానే నారాక మీకు అంత చేదయిందా ? చెప్పండి నాన్నా నా మీద ఎందుకంత ద్వేషం''? తండ్రిని గట్టిగా నిలదీసి అడిగింది నీలవేణి ఆవేశంగా ఎనలేని బాధతో.
''ఏమన్నావు. పెంచుకుంటున్న పిల్లా ? ఆ పిల్ల నీ కూతురు గాదా ? నువ్వు కన్నబిడ్డ కాదా?
నాకంతా తెలుసు.ఇంకాఎందుకు బొంకుతావు''? అన్నాడు రామరాజు కటువుగా
నీలవేణి వంక చూడకుండా.
తండ్రి మాటలకు క్షణకాలం నిశ్చేష్టురాలై, కాళ్ళకింద భూమి కదిలిపోతున్నట్లుగా, వంట్లో నీరంతా ఆవిరైపోయినట్లుగా నాలుక పిడచగట్టినట్లనిపించింది నీలవేణికి .ఆక్షణంలో.
పుట్టిబుద్ధెరిగిన నాటి నుంచి ఇంతవరకు పల్లెత్తుమాట అనని తండ్రేనా ఆమాటన్నది అర్ధం కాలేదు. నిర్ఘాంతపోయి నోటమాటరాక కొన్నిక్షణాలు చిత్తరువులా నిలబడి ఆవేశంతో పూనకం వచ్చిందానిలా ''నాన్నా'' బిగ్గరగా అరిచింది కూర్చున్నస్టూల్ మీదనుంచి లేచి నిలబడి నిలువెల్లా కోపంతో ఊగిపోతూ  ''ఏంమాట్లాడుతున్నారు మీరు ? ఛీ,ఛీ ...ఈ చెత్త మాటలు అనిపించుకోవడానికా నేను అంత దూరం నుంచి వచ్చింది'' అంది నీలవేణి మాటలకోసం వెదుక్కుంటూ రెండుచేతులతో రెండు కణతలు నొక్కుకుంటూ.
''ఏమయిందే తల్లీ…ఏమిటా కేకలు''అంటూ లోన పడుకున్నతల్లి చావడిలోకి పరుగెత్తుకొచ్చింది.
''అమ్మా... నేను ఈ క్షణం తిరిగి వెళుతున్నాను.నా బొందిలోప్రాణం ఉండగా మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాను.ఈ పిల్ల నా కన్నకూతురట. నేను బొంకుతున్నానట. ఇక నా వల్ల కాదు. నన్నుఇన్ని మాటలన్నది ఎవరో కాదు.స్వయానా నా తండ్రి. నేను పుట్టి బుద్ధెరిగినతరువాత ఇంతలా ఎవరితోనూ మాటబడలేదు.అలాటిది నాతండ్రే నా మీద పిచ్చిప్రేలాపనలు చేస్తూ ఉంటే నేనిక  భరించలేను. ఉండలేను '' అంటూ గదిలోనికి రెండంగలలో వెళ్లి బ్యాగు, సూట్ కేసు విసిరి బయట పడవేసింది.
తల్లి సీతారత్నం బ్యాగ్, సూట్ కేసు తిరిగి గదిలోనపెడుతూ,ఆయన ఏదో అనడం నువ్వు బయలుదేరడం…అంత బాగానే ఉంది'' అంటూ .
'భగవంతుడా…ఉన్నది ఒక్కగానొక్క పిల్ల పెళ్లి కాలేదు. ఒంటరిగా దూరదేశంలో ఉంటుంది.
దిక్కూ మొక్కూ లేదు అన్నబాధ ఒక్కటే మనస్సును తొలిచేది. ఇప్పుడదిగాక ఇదో గొడవా !
మమ్ముల్ని ఒడ్డున పడెయ్యి తండ్రీ'  అని మనసులో దేవుడికి మొక్కుకుంటూ, ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా కూతురికి నచ్చచెబుతూ .....
''నీలమ్మా, నీ మీద ఓ అపవాదు పడ్డది.అది నిజంకాదని నిగ్గు తేల్చి అన్నవాళ్ళ నోళ్ళు మూయించాలి గాని ఇప్పుడు ఇక్కడ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఆ అభాండాన్నినిజం చేసినదానవవుతావు, ఒప్పుకున్నదానివవుతావు.ఆమచ్చ మన జీవితాలకే మరకవుతుంది. మేమింక  ఊళ్ళో తలెత్తుకుని తిరగగలమా ? నిలబడి ఈ పుకారు ఎవరు పుట్టించారో నిగ్గు తేల్చుకో. చదువుకున్నదానివి. నింపాదిగా కూర్చుని ఆలోచించుకో. మీ నాన్నదేముంది? పాతకాలపు మనిషి. అన్నెం పున్నెం తెలీదు. ఎవరు ఏది చెబుతే అది నిజమని నమ్మేయడమే ఆయన నైజం.పై చదువుకని,ఉద్యోగానికి నువ్వీ ఇల్లు వదిలి దాదాపు పదిహేను సంవత్సరాలయింది. నీ చిన్నతనం తప్పితే ఆయనతో నీ బంధం ఈ నింద ముందు పరువుగా బ్రతికే ఆయనకు చాలా చిన్నదయింది. అందుకే ఆయన కూతురని కూడా చూడకుండా అంత మాటనేశారు''.     
''ఈ పిల్ల నీస్వంత కూతురని ఓ కధను అల్లి దాదాపు సంవత్సరం క్రింద దురాలోచనతోఆయన బుర్రలో ఎవరో ఒక మొక్కనాటారు. నాటి నుంచి ఆయన ఇల్లు కదలడమే మానేశారు.
తట్టుకోలేక పోతున్నారు. ఇప్పుడు ఆ మొక్క కాస్తా చెట్టయింది.అది ఓ అబద్ధమని, అపనిందని తేల్చు.చెప్పినవాళ్ళ చెంప చెళ్ళు మనిపించు. ఆయనకు అసలు విషయం అర్ధమయ్యేలా చెయ్యి. నీ మీద ఈ అపవాదు మోపినవాళ్ళు ఏం సాధించాలనుకున్నారు ? ఎందుకీ నాటకానికి తెర తీశారు' అన్నవిషయం దగ్గరనుంచి ఆలోచించు.
నీకన్ని విషయాలు క్షణంలో అవగతమవుతాయి'' అంది సీతారత్నం కూతురి మీద పడ్డ అపవాదు ఎలా తుడిచేయాలానని తల్లి మనసుతో ఆలోచిస్తూ. 
                                                      * * * * *
''నీతో ఈమాట ఎవరు, ఎప్పుడన్నారు''? వివరాలు అడిగింది తల్లిని నీలవేణి.
''దాదాపు సంవత్సరం పైగా ఇంట్లో ప్రతిరోజూ ఇదే గొడవే...ఒకరోజు బయటకెళ్ళి వచ్చిన మనిషి చూశావా నీ కూతురు ఎంతపని చేసిందో...ఆ తెల్లపిల్ల ఎవరో కాదట నీ కూతురి కన్నకూతురట.అందుకే యశ్వంత్ పెళ్ళికి కూడా రాలేదట.ఆరోజుల్లోనే కన్నదట.
ఈ విషయం ఊరంతా కోడై కూస్తోందట.ఇక ఈ వూళ్ళో తలెత్తుకుని తిరగగలమా?
ఇద్దరం వెళ్లి గోదావరిలో దూకి చద్దాం పదా'' అని పెద్ద రాద్ధాతం చేశారు. అప్పటినుంచి బయటకు వెళ్లాలంటే నాకు జంకుగానే ఉంది ఎవరేమడుగుతారోనని. 
''ఎవరన్నారయ్యా అంటే చెప్పడు నాతో ఎవరూ అనలేదు గదయ్యా అంటే ''నువ్వు కూతురిని వెనకేసుకోస్తావని నీకు ఎవరూ చెప్పరు'' అంటాడు బిడియంగా.
''అంటే నీ కూతురుమీద ఎవరో అపవాదు వేస్తే నువ్వు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు గమ్మున
మాటలు విని ఇంటికొచ్చి శివాలెత్తుతావు.అంతే గాని కూతుర్నిమాత్రం వెనకేసుకురావు.
ఏం మనిషివయ్యా నువ్వు…వాటి పిల్లల జోలికేల్తే జంతువులు కూడా తిరగబడతాయి కదయ్యా.
ఆ జంతువులకున్న ఆపాటి ప్రేమ బిడ్డమీద నీకు లేకపోయేనని ఆయన నోరు మూయించాను.
ఆయన అనడమేగాని ఊళ్ళో నాతో ఎవ్వరూ ఇంతవరకూ ఆ మాట అనలేదు.
నేను వినలేదు.ఏది ఏమైనా సరే మీనాన్ననే నిలదీయి.నేను ఎన్నిసార్లడిగినా  చెప్పలేదు.
ఆమాట ఎవరన్నారు తేల్చాల్సిందే'' అని గట్టిగా చెప్పింది కూతురికి సీతారత్నం.
''ఇదివరకు ఒకసారి నేను ఫోన్లో నీతో మాట్లాడుతూ పిన్ని బాబాయి ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడ లేదని నేను నీకు చెబుతే నువ్వేమన్నావో గుర్తుందా ? ఏవో ఆస్తి గొడవల్లేవే అన్నావు.
ఏమిటి వాళ్లకు మనకు ఆస్తి గొడవలు. నాకు తెలిసినంత వరకు వాళ్ళకు మనకు పొలాల గొడవలేమీ లేవే ? కొత్తగా ఇప్పుడు కొత్తగా ఏం గొడవలు వచ్చి పడ్డాయి'' ? అంటూ తల్లిని
వివరం అడిగింది నీలవేణి.
''అప్పుడు నువ్వు ఫోనులో ఆడిగితే నీ మనసు బాధ పెట్టడం ఎందుకని ఏదో నోటికొచ్చిన మాట అనేశాను'' అంది సీతారత్నం నిర్వికారంగా.
''మీ నాన్న అనారోగ్యానికి తోడు ఈ మనాది మూలాన రెండేళ్లనుంచి కొబ్బరితోట, అరటితోట అన్నీమీ బాబాయే చూస్తున్నాడు.అప్పటినుంచి ఇంతవరకు డబ్బు ఎంత వచ్చిందో ఎంత జమ చేశాడో లెక్క, పత్రం లేదు. కొంత డబ్బు జమ చేయలేదని మీ నాన్నే అన్నాడు.
నాకు తెలిసి పొలాలు,వ్యవసాయం మొత్తం ఆయన అధీనంలోకి వెళ్ళిపోయాయి. 
వివరాలేమైనా అడుగుతే ఆడదానివి నీకెందుకని నన్ను తీసి పారేస్తాడు మీనాన్న.
''ఆస్తి కోసం నీ మీద ఈ అభాండం వేసి నిన్ను ఇక్కడికి రానీయకుండా చేయడానికి ఇదొక పన్నాగమని, ఏదో గూడుపుఠాని జరుగుతున్నట్లు నాకనుమానం. మీ నాన్న ధోరణి చూస్తే పొలాలు అన్నీ ఇక ఆయనకే కట్టబెట్టేట్టున్నాడు'' అంది సీతారత్నం.
                                                   * * * * *
సాయంత్రం నాలుగు గంటలవుతోంది. నీలవేణి హాల్లో సోఫాలో కూర్చుని టి.వి చూస్తున్న
తండ్రి దగ్గరికి వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుని ''నాన్నా… నీతో కొద్దిగా మాట్లాడాలి.
పొద్దున్ననువ్వన్న మాటలతో నాకు చచ్చిపోవాలన్న బాధ వేసింది అంటూ గాద్గదమైన
గొంతుతో కంట నీరు పెట్టుకుని 'నాన్నా' నువ్వు నన్నన్న మాట ఒట్టి నిందని నిరూపించుకోవలసిన అగత్యం నాకుంది. ఎవరో కావాలని ఏదో కారణంతో నీతో అలా చెప్పారు.
ఈ పిల్లపేరు 'ఏవా' అంటూ జరిగిన సంగతంతా వివరంగా చెప్పి
''ఏవా నా కన్నబిడ్డ అని నీతో ఎవరన్నారో వాళ్ళని ఇక్కడికి రమ్మను లేదా నన్నువాళ్ళదగ్గరికి తీసుకెళ్ళు'' ? అంటూ తండ్రిని గట్టిగా నిలదీసి అడిగింది నీలవేణి.
''ఎవరో అంటే నేనూరుకుంటానా అమ్మా' ? అన్నది ఎవరో కాదు. మీ పిన్నమ్మే స్వయంగా చెప్పింది. అందుకునే నేను నమ్మవలసి వచ్చింది. యశ్వంత్ పెళ్ళికి రాకపోతివి.
మీ బాబాయి, పిన్నమ్మ అమెరికా వచ్చినప్పుడు వాళ్ళని ఇంటికీ పిలవకపోతివి.కలవకపోతివి.
ఈ పిల్ల వల్లనే కదా నువ్వు వాళ్ళని నీ ఇంటికి పిలవలేదు.ఇంతకంటే ఋజువులు ఇంకేమి కావాలి'' ? అన్నాడు తండ్రి నీలవేణికి సమాధానం చెబుతూ.
తండ్రి చెప్పిన బదులు సమాధానానికి నీలవేణి నిర్ఘాంతపోయి, సావధానంగా మాట్లాడుతూ
''సరే నాన్నా పిన్ని చెప్పింది విన్నారు, నమ్మారు. ఇప్పుడు మీ కూతురి మాటకూడా వినండి.
మీరే ఆలోచించి నిజానిజాలు తేల్చండి. పిన్ని బాబాయి అమెరికా వచ్చినప్పుడు వాళ్ళు నాదగ్గరికి వచ్చారు. నా ఇంట్లో ఉన్నారు. వాళ్ళు నన్ను కలవలేదని చెబుతే వాళ్ళు కావాలని దేనికోసమో అబద్ధం చెబుతున్నారు.నేను రుజువులతో మాట్లాడుతున్నాను. బాబాయిని పిన్నిని ఇప్పుడే మీముందే అడుగుతాను పదండి'' అంది నీలవేణి తండ్రిని ఒప్పిస్తూ.
''అమ్మా నువ్వుకూడా బయల్దేరు అని ఏవా కి మంచి డ్రెస్ వేసి ఆ క్షణంలో బయలుదేరింది నీలవేణి తల్లితో సహా. కూతురు చెప్పింది సబబుగానే అనిపించింది ఆయనకు.
వెంటనే ఉత్తరీయాన్ని భుజం మీద వేసుకుని పదమ్మాఅంటూ బయలుదేరాడు తండ్రి.
వీళ్ళు వెళ్లేసరికి ప్రయాణ సన్నాహం లో హడావుడిగా ఉన్నారు వాళ్ళు.
''ఏరా…ఎక్కడికో బయలుదేరుతున్నట్లున్నారు'' ? అని తమ్ముడిని అడిగాడు రామరాజు.
''అవునన్నయ్యా మీమరదలు ఉన్నట్లుండి అన్నవరం,సింహాచలం వెళ్లివద్దామంది.
రేపుదయం సమయముండదని ఇప్పుడే సర్దుకుంటున్నాము'' అంటూనే ''ఎప్పుడువచ్చావు నీలమ్మా ? ఎలావున్నావు? బావున్నావా? యశ్వంత్ పెళ్ళికి రాకపోతి'' నిష్ఠూరంగా అంటూ
ఇద్దరూ పలకరించారు.
''బాగున్నాను బాబాయ్. వీసా ప్రాబ్లంతో యశ్వంత్ పెళ్ళికి రాలేకపోయాను. వాడికా సంగతి తెలుసు. సంగతులన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలిసినవేగా. కొత్తవేమున్నాయ్ బాబాయ్.
కొత్త సంగతల్లా ఈ పిల్ల నేను కన్నకూతురని పిన్ని నాన్నతో చెప్పిందట.
మా పరువు ప్రతిష్ట ఏం గావాలి ? ఏకంగా ఆ పిల్లను తీసుకుని తయారయ్యావు.
ఊళ్ళోమేము ఇక తలెత్తుకుని ఎలా తిరగాలి'' అని నేను గుమ్మంలో అడుగు పెడుతూనే
నాన్న శాపనార్ధాలు మొదలెట్టాడు.
''ఇన్నిసంవత్సరాల తరువాత నా ఊరికి వస్తే, నా ఇంటి గుమ్మంలోనే నాకీ విచిత్ర పరిస్థితి''
అంటూ పిన్ని వంక చూసింది నీలవేణి సూటిగా విషయం తేల్చుకోవడానికి.
''అయ్యో,అయ్యో' అదేవిటే…నేను అనడమేమిటి ? ఆ బిడ్డ సంగతి నాకు తెలియదా?
నువ్వా  పిల్లను పెంచుకుంటున్నావని, కన్నబిడ్డ లాగా చూసుకుంటున్నావని యశ్వంత్ నాతో చెప్పాడమ్మా. అదేమాట నేను మీనాన్నతో అదే...కన్నబిడ్డలా చూసుకుంటున్నదని'' అన్నాను.
అంతే. దానికే నిన్ను నేను ఏదో అన్నానని చిలవలు,పలువలు చేయకే తల్లీ'!
ప్రొద్దున లేస్తే మొహాలు చూసుకునే వాళ్ళం. మామధ్య గొడవెట్టకే తల్లీ.ఇవాళ ఉండి రేపెళ్లిపోయేదానివి'' అంటూ కొంగు నోటికడ్డెట్టుకుని ఏడుపులంకించుకుందావిడ.
''ఏవా ఎవరు ఏమిటి  నీకు తెలియాదా? యశ్వంత్ అన్నాడంటా వేమిటి పిన్నీ?
మీరు నాఇంటికి వచ్చినప్పుడు ఏవా మొదటి పుట్టినరోజు ఫంక్షన్ కి మనందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా…అప్పటి ఫోటో కూడా ఉంది నాదగ్గర అంటూ ఆల్బమ్ లో నుంచి
ఏవా మొదటి పుట్టినరోజు ఫోటోలు ఉన్న ఆల్బమ్ తీసి తండ్రి చేతికిస్తూ ''చూడండి నాన్నాఏవా తల్లితండ్రుల్ని.అప్పుడు ఏడాది పిల్ల ఏవా, పిన్ని,బాబాయి,యశ్వంత్, ఏవా తలితండ్రులు,నేను అందరం కలిసి ఉన్న ఫోటోఇది. బాబాయికి, పిన్నికీ ఈ పిల్ల తల్లితండ్రులు కూడా తెలుసు'' అంటూ ఆవేశంగా 'యశ్వంత్ చెప్పాడు అంటున్నావు'...''ఈ పిల్ల ఎవరో... నేను తనని పెంచుకుంటున్న సంగతి నీకు తెలిసీ ... ఇలాటి వదంతితో నన్నుమానాన్నకు, అమ్మకు దూరంచేసి ఏం సాధిద్దామని ? మా ఆస్థిమీద పెత్తనం చెలాయించడానికో లేక ఆస్తి వాల్చుకుని అనుభవించడానికో మీకు ఇంతకంటే వేరే మార్గం దొరకలేదా? చెప్పు పిన్నీ'' అంది నీలవేణి కోపంతో ఊగిపోతూ!
''అదీ సంగతి నాన్నా, ఇప్పుడేమంటారు'' ? ఊరంతా కోడై కూస్తున్నది.ఇంకేదేదో అన్నారు'' అంది నీలవేణి జరిగిన విషయాన్ని విశదం చేస్తూ. 
మరదలు చెప్పిన సమాధానానికి నిర్ఘాంతపోయి జేబులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకుని
చేతిలో ఉన్నఫోటోని పరికిస్తూ ''అర్డమయిందమ్మా. ఘోరమయిన తప్పిదం చేశాను.
కన్నబిడ్డను నమ్మలేదు. తప్పుడు మనుషుల తప్పుడు మాటలు విన్నాను. తప్పు పూర్తిగా నాదే క్షమించు తల్లీ'' అంటూ ఏదో నిర్ణయానికివచ్చినట్లు తమ్ముణ్ణి ఉద్దేసించి ''అరేయ్ రంగడూ తోట లెక్కంతా చూసి రెండురోజుల్లో డబ్బు అంతా జమ చేయి.
నీలమ్మ ఇక్కడ ఆడపిల్లల స్కూలు పెడుతుంది.పేదింటి పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంది. అర్ధం అయిందా…ఇక నువ్వేమీ కష్టపడాల్సిన పనిలేదు. నా పొలాల పనులన్నీ నేనే చూసుకుంటాను. వాటి జోలికింకరాకు'' అన్నాడు రామరాజు.
''పద నీలమ్మా…నెత్తిమీదనుంచి సంవత్సరం నుంచి మోస్తున్న బరువంతా తొలిగి ఒళ్లంతా తేలికగా అయింది. గుడికెళ్ళి ఇంటికెళదాం, పద తల్లీ'' అన్నాడు తండ్రి ఏవాని ఎత్తుకుని, కుడిచేత్తో కూతురి భుజం చుట్టూ చేయివేసి, మరదలినీ, తమ్ముడినీ ఏహ్యంగా చూస్తూ బయటకు హుందాగా నడిచాడు రామరాజు.
''నాన్నా…నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను.ఇక నేను వెనక్కి అమెరికా వెళ్ళను.మీతోనే ఉంటాను. ఇక్కడి పేద పిల్లల భవితవ్యానికి బాటలు వేస్తాను'' అంది నీలవేణి తండ్రి, తల్లి చుట్టూ ఆప్యాయంగా చేతులు వేసి బయటకు నడుస్తూ !
''మంచిది నీలమ్మా…అదికదూ ! ఇక్కడ పెద్ద చదువులు చదివినోళ్లంతా దేశం వదిలి పరాయిదేశాలకు వెళితే ఎట్టామరి ? అట్టా కాదుగాని ఒకసారి వెళ్లి పనులన్నీ పూర్తిచేసుకుని ఇదిగో ఈ ఏవమ్మ తాతలకు, నాయనమ్మకు చెప్పి ఈ చిన్నతల్లిని తీసుకుని రావమ్మా…నేను సాకుతాను ఈ బిడ్డని" అన్నాడు రామరాజు గుండెలనిండా సంతోషాన్ని నింపుకుని.
                                                                         
                                                                 * * * * * * * * * *


రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం.9849118254
  

 


                     

                                                       

-

14, డిసెంబర్ 2019, శనివారం

మేమాశించేది కొద్ధి కరుణ....

                                         
                                             మేమాశించేది కొద్ధి కరుణ... 
                   ( ఈ కధ 18-12-2019  ఆంధ్ర జ్యోతి, నవ్య వీక్లీ  లో ప్రచురింపబడింది ) 


తెల్లవారుఝాము మూడు గంటలవుతోంది. నిద్రమాత్ర వేసుకునిపడుకుందేమో నిద్రగాఢతతో
మెలుకువ రాలేదు సుజాతకి. వాల్యూం తగ్గించి దూరంగా టేబుల్ మీదుంచిన మొబైల్ ఫోను ఎంతసేపునుంచి మోగుతుందో తెలీదు. చీమ చిటుక్కుమంటే లేచే కమలాకర్ లేవలేదు.
'ఈ టైంలో ఫోనుచేసిందెవరబ్బావేళా పాళా లేకుండా' అనుకుంటూ మెల్లగా లేచి  ఫోనందుకుని 'హలో' అంది సుజాత వెనక్కు వచ్చి బెడ్ మీద కూర్చుంటూ.
''త్వరగా తలుపు తీయమ్మా'' అంటూ సుపరిచతమైన గొంతు. సుజాతకి నిద్రమత్తు పూర్తిగా వదల్లేదు. మాట్లాడుతున్నదెవరో అర్ధం గావడంలేదు.
'అరవింద్ గొంతులా ఉంది.వాడీ వేళ ఫోను ఎందుకు చేస్తాడు? అనుకుంటూనే ''అరవింద్…నువ్వేనా ? తలుపుతీయడమేమిటి ? నాతో మాట్లాడుతున్నావా లేక అక్కడ కోడల్నిగాని  తలుపుతీయమంటున్నావా ? నాకేమీ అర్ధం కావడం లేదు'' అంది సుజాత మగతగా.
''అమ్మా నేనే  అరవింద్ నే మాట్లాడుతున్నా.హైదరాబాద్ వచ్చాను. మనింటి గుమ్మం ముందు నుంచుని మాట్లాడుతున్నా. అర్జంటుగా తలుపుతీయకపోతే గుమ్మం ముందే బయట పడకేస్తాను. తరువాత నీఇష్టం'' అన్నాడు అరవింద్ నవ్వుతూ.
'చెప్పాపెట్టకుండా ఏమి సర్పైజ్ లో  ఏమిటో' ? అనుకుంటూ
''ఏవండీ…చిన బాబు వచ్చాడు లేవండి'' అంటూ నిద్రపోతున్న కమలాకర్ ని తట్టి లేపి నాలుగంగల్లో గుమ్మం చేరి ''అరవింద్ నువ్వేనా'' ? అని కన్ఫర్మ్ చేసుకుని తలుపు తీసింది సుజాత. చేతిలో సూట్ కేసు పక్కన పెట్టి బ్యాక్ ప్యాక్ తీయకుండానే తల్లిని రెండుచేతులతో గువ్వలా హత్తుకున్నాడు ఆరడుగుల అరవింద్.                                         
                                                                     * * * * *
          ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చిన క్కగానొక్క కొడుకు అరవింద్ తో మాట్లాడుతూ ''వచ్చి రెండు రోజులయింది. వారం రోజుల్లో మళ్ళీ తిరుగుప్రయాణమంటున్నావు. ఉన్న రెండురోజులయినా ఇంటిపట్టున ఉన్నావా అంటే అదీ లేదు, పొద్దుననంగా వెళ్లిన వాడివి రాత్రికి తిరిగి వచ్చావు. ఇంతవరకు ఇంట్లో భోజనం చేయలేదు" అని అరవింద్ తో  నిష్ఠూరంగా అని "ఇక ఉండే వారంరోజులు ఆఫీస్ పనని బెంగళూరు వెళతానని వాడు బయలుదేరుతుంటే మీరేమీ మాట్లాడారేమండీ'' భర్త కమలాకర్ ముఖంలోకి సూటిగా చూస్తూ బాధగా,అసహనంగా అంటూ భర్త చేతిలో న్యూస్ పేపర్ ని లాగి కింద పడవేసింది సుజాత.
''బాగుంది. ఉరుమురిమి ఎవరిమీదో పడ్డట్లు నా మీద పడతావెందుకు ? వాడు,నువ్వు ఇద్దరు ఏమైనా చిన్నపిల్లలా ? ప్రతి చిన్న విషయానికి చిన్నప్పటి నుంచీ వాడిని వెనుకేసుకు రావడం నీకలవాటు. అందుకే నీతో చెప్పాడా విషయం. నీఇష్టం, వాడిష్టం. మీ ఇద్దరి సంవాదం లోకి  నన్ను లాగొద్దు. అయినా 'వాడేదో ఆఫీస్ పని అంటున్నాడు కదా' ! నసుగుతూ ముక్తాయింపు ఇచ్చి కుండా పడ్డ న్యూస్ పేపర్ ని తీసుకుని దాంట్లో మొహం దాచుకున్నాడు కమలాకర్.
''వాడి విషయంలో నామాటెప్పుడు నెగ్గింది గనక. నా చాదస్తం తప్ప'' గొణుగుతూ అంది సుజాత.
'ఆ...అవునవును…అమ్ములు మాటే వింటాడు వాడు'! అన్నాడు కమలాకర్ ఛలోక్తిగా భార్యవంక  కళ్ళు మిటకరించి ఇమోజి లో బొమ్మలా చూస్తూ. ఉరిమి చూసింది సుజాత భర్తవంక ఇక ఆపుతావా నీ సోది అన్నట్లు.
''నేను వచ్చిందే ఆఫీసు పనిమీద కదమ్మా! ఎందుకు రాద్దాతం... ఏమాత్రం వీలయినా ముందే వచ్చేస్తానమ్మా. బాధపడకు" అని తల్లికి నచ్చచెప్పి బ్యాక్ ప్యాక్ వీపుకు వేసుకుని బయటకు నడిచాడు అరవింద్.                                                                                    
                                                             * * * * *
''మీరేనా పేషెంట్ అటెండెంట్ ? ఆమె పరిస్థితి బాగాలేదు. క్రిటికల్ అనే చెప్పాలి. హాస్పిటల్ లో చేర్పించినప్పటి నుంచి ఆమెకు స్పృహ లేదు. మీకేమవుతుందావిడ ?''అని అడిగాడు అరవింద్ ని, ఐ.సి.యు లో అమ్ముల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్.
''అవును నేనే డాక్టర్. నా పేరు అరవింద్. ఆమె నాకేమీ బంధువు కాదు.అంతకంటే ఎక్కువ.
నా చిన్నప్పటి ఆయా... ఆరోగ్యం బాగాలేదు సిరీయస్ గా ఉందని ఫ్రెండ్ ద్వారా తెలిసి తన్నిచూడడానికి ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. వారంలో తిరిగివెళ్ళాలి. తనకంటూ ఎవరూ  లేరు. ఒంటరి. తన ఆరోగ్యం కుదుట పడితే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ చేర్చి వెళతాను. దయచేసి అమ్ములు ఆరోగ్యం ఎలావుందీ నాకు సరిగ్గా చెప్పగలరా డాక్టర్...ప్లీజ్ '' అడిగాడు అరవింద్ వేడుకోలుగా. 
''ఓహ్...ఈజ్ ఇట్ ? ఆస్ట్రేలియా నుంచి ఆయా ని చూడడానికి వచ్చారా... ఇంటరెస్టింగ్ ''? అంటూ ఆశ్చర్యంగా నమ్మశక్యంగానట్లుగా అన్నాడు డాక్టర్. 
''చిన్నతనంలో అమ్ములు నాకు చేసిన సేవల ముందు నా ఈచిన్నిపరామర్శ ఎందుకూ కొరగాదు. ఇట్స్ నథింగ్ డాక్టర్. నేను ఏం చేసినా తన ఋణం తీర్చుకోలేను '' గాద్గదికంగా అన్నాడు అరవింద్. 
''ఆమెకు ఎక్యూట్ న్యుమోనియా. లంగ్స్ బాగా ఇన్ఫెక్ట్ అయ్యాయి. ఊపిరి తీసుకోవడానికి  ఇబ్బంది పడుతోంది.ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉంచాము.స్టేబుల్ గానే ఉంది. ఏంటీ బయోటిక్స్ ఇస్తున్నాము. దేర్ ఈజ్ లిటిల్ ప్రోగ్రెస్. ఇట్ టేక్స్ టైం అండ్ ప్రోలాంగ్డ్ ట్రీట్మెంట్.  రెండురోజులు చూసి స్టేబుల్ గా ఉంటే రూముకి షిఫ్ట్ చేస్తాము'' అన్నాడు డాక్టర్. 
''ఆమె కోలుకుని మామూలు మనిషి కావాలి. తనకి మంచి ట్రీట్ మెంట్ చేయిద్దామని వచ్చాను. వేరే ఏదైనా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటారా ? మీరు మరోలా అనుకోవద్దు. దయచేసి అర్ధం చేసుకోండి...ప్లీజ్. ఖర్చు ఎంతైనా ఫరవాలేదు. నాకు సరైన సమాధానమివ్వండి"? రెండుచేతులు జోడించి వినయంగా అడిగాడు అరవింద్.
"చూడండి...మిస్టర్..."?
''అరవింద్...".
''నేనొక డాక్టర్ని. దేవుణ్ణి కాదు. మా ప్రయత్నం చేస్తాము. ఆపైన దైవేచ్చ...ఆమె మెల్లగా రికవర్ అవుతోంది.ఈ జబ్బే అలాటిది. ఆమె గురించి మీరు పడుతున్నఆవేదన, బాధ నాకు అర్ధమయింది. ఐ విల్ డు మై బెస్ట్. ఆమె తప్పక కోలుకుంటుంది. ఐ ప్రామిస్...షి విల్ బి ఫైన్. ఆపైన వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లడం మీఇష్టం"అన్నాడు డాక్టర్. 
హ్యాండ్ షేక్ చేస్తూ "థాంక్ యూ వెరీ మచ్ డాక్. ప్లీజ్ టేక్ కేర్ అఫ్ హర్ '' అన్నాడు అరవింద్ ఆర్ద్రంగా. అరవింద్ పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకుని, 'డోంట్ వర్రీ' అంటూ  అరవింద్ వీపు తట్టి ఐ.సి.యు లోనికి నడిచాడు డాక్టర్. డాక్టర్ హామీతో రిలాక్స్ అయి హాస్పిటల్ లాబీలో చివరన కూర్చుని గోడకానుకుని కళ్లు మూసుకున్నాడు అరవింద్. తన ఆలోచనలు అమ్ములు చుట్టూ పరిభ్రమించాయి.
                                                              * * * * *
ముప్ఫై సంవత్సరాలపైగా తన చిన్ననాటినుంచి ఇంట్లో పనిచేసిన అమ్ములుని ఇలా దిక్కులేకుండా వదిలేయడం కరెక్టేనా? ఏముందా మనిషికి ఆధారం ? ఉన్నఒక్క కొడుకు జబ్బు చేసిపోయాడు. కాలూ చేయి ఆడి ఒంట్లో సత్తువున్నంతకాలం పరాయి వారింటి శుభ్రత, వారిపిల్లల ఆలనేగాని జీవితంలో ఆమెకు ఒక ఆటా పాటా ? తినగా మిగిలింది పెడితే తిని, స్వంత బ్రతుకంటూ లేక శలవులేకుండా జీవితమంతా అలిసిన మనిషికి కనీస కృతజ్ఞతకూడా చూపించలేమా ? వారిలా అనాధల్లా రాలిపోవాలిసిందేనా ? మా కుటుంబం అమ్ములుకి తన వృద్ధాప్యం ఆదుకోవడానికి ఏదో ఒక ఆధారం ఏర్పాటు చేయవలసింది'...అనుకున్నాడు అరవింద్.
                                                              * * * * *
సుజాత గజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగి. నీటిపారుదల శాఖలో ఇంజనీర్. తరచూ రోజుల తరబడి క్యాంపులకి వెళ్ళవలసి వచ్చేది. అందుచేతనే ఇంటిపని, దుకాణంనుంచి నుంచి సామానులు తేవడం దగ్గరనుంచి అరవింద్ ని స్కూలుకి తయారుచేయడం, స్నానం చేయించడం, తినిపించడం లాటి పనులన్నీ నమ్మకంగా, నిజాయితీగా పనిజేసే అమ్ములికి అప్పజెప్పి తాను నిరాటంకంగా ఆఫీస్ పనులు చూసుకునేది సుజాత.మొదటినుంచి ముక్కు సూటి మనిషి. ఖచ్చితంగా మాట్లాడడం అలవాటు. దాంతో ఒక్కోసారి ఇంటా,బయటా కూడా ఇబ్బందిపడేది. అయినా సరే అలాగే ఉండేది. ఆమెకు భర్త కమలాకర్ పూర్తి సహకారం  ఉండేది. దాంతో ఆవిడ ఆఫిస్ పనే లోకంగా గడిపేది. కమలాకర్ ఒక ఎంఎన్ సి ఫ్యాక్టరీలో ఇంజనీర్. షిఫ్టులు ఉండేవి. ఉదయాన్నే వెళ్లి ఇంటికి మధ్యాన్నం మూడు గంటలకల్లా వచ్చేవాడు. ఇంటి విషయాల్లో కమలాకర్ జోక్యం ఎప్పుడూ ఉండేది కాదు.
అరవింద్ ఐ.ఐ.టి ముంబైలో బి.టెక్ లో చేరడానికి వెళ్లేంతవరకు సుజాత అలా ఆఫీసుకి అంకితం కావడంతో అమ్ములు అరవింద్ ని కంటికి రెప్పలా చూసుకొనేది. అరవింద్ కి ఒకసారి అమ్మవారు పోస్తే అమ్ములే రేయింబవళ్ళు బెడ్ పక్కనే ఉండి చేసిన సేవ అరవింద్ కిప్పటికీ బాగా గుర్తు. సుజాత ఒకసారి క్యాంప్ కు వెళ్ళినప్పుడు అమ్ములు కొడుకు సుబ్బుకి బాగా జ్వరమొచ్చింది. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు.
''అమ్ములూ పిల్లాడికి జ్వరం కదా. నువ్వు రెండురోజులు ఇంటిపట్టునే ఉండి వాడిని చూసుకో...నేను బాబుని చూసుకుంటాలే'' అని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి కమలాకర్ దగ్గరుండి వాడిని హాస్పిటల్ చేర్పించి బిల్లు తనే భరించాడు. 'చిన బాబుకి ఇబ్బంది అవుతదయ్యా' అంటూ రెండో రోజే పనికి తిరిగి వచ్చింది అమ్ములు. 
చిన్నతనం కావడంతో అరవింద్ కీ విషయాలు అంతగా అర్ధమయ్యేవి కాదు. 
''నీ కొడుక్కి టైఫాయిడ్ అటకదా. హాస్పిటల్ నుంచి వచ్చాక బట్టలు మార్చుకుంటున్నావా ? చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నావా లేదా''? అమ్ముల్ని అడిగింది సుజాత క్యాంప్ నుంచి తిరిగి వచ్చాక. ఎప్పుడూ లేంది కమలాకర్ జోక్యం చేసుకున్నాడు.  
''వాడికెలా ఉందని ఒక్క మాట అడగలేదు. తన బట్టల గురించి, చేతుల శుభ్రత  గురించి మాట్లాడుతున్నావా ? కమాన్ సుజాతా ! బి లిటిల్ కైండ్. తన కొడుక్కి జ్వరం'' అని భార్యని మొదటిసారిగా మందలించాడు కమలాకర్. 
అమ్ములు పరిధి మించి ఎప్పుడూ ఒక్క మాటకూడా మాట్లాడేది కాదు. తను కొద్దిగా ఆలస్యంగా వచ్చినా అరిచేది సుజాత. జీతం కట్ చేస్తాననేది.
''అమ్మ జీతం కట్ చేస్తే నేను దాచుకున్న డబ్బులు నీకిస్తాలే అమ్మూ. అమ్మకు చెపుతానులే నిన్ను అరవొద్దని '' అనేవాడు అరవింద్ అమ్ములతో.
'మా అయ్యే'...అంటూ రెండు చేతుల్తో అరవింద్ చెంపల్ని రాస్తూ తన రెండు కణతల మీద ఫట ఫటా మంటూ మెటికలు విరిచేది  అమ్ములు.
                                                                 * * * * *
స్నేహిహితుడొకతను అరవింద్ కి ఫోన్ చేసి 'అమ్ములు ఆరోగ్యం బాగాలేదు…ఇవాళో రేపో అన్నట్లుగా ఉంది. ఇంటి దగ్గరే పడి ఉందన్నవిషయం అరవింద్ కి తెలియచేస్తే అమ్ములు  కోసం వచ్చాడతను.
అమ్ములు కోసం హైదరాబాద్ వచ్చానంటే తల్లి ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆఫీసు పని మీద   బెంగుళూరు వెళుతున్నానని అబద్ధం చెప్పి అమ్ములు దగ్గర హాస్పిటల్లోనే ఉంటున్నాడతను. తండ్రితో కూడా ఈ విషయం ప్రస్తావించలేదు. డాక్టర్ తో మాట్లాడాక అరవింద్ కి  ధైర్యం వచ్చింది. డాక్టర్ ఫోను చేసి అమ్ములు మందులకు రెస్పాండవుతోందని, ఆరోగ్యం కుదుట పడుతోందని త్వరలో రూముకి మారుస్తామని చెప్పాడు.తను తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళేలోగా అమ్ములు డిశ్చార్జ్ అవుతే మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చి వెళదామని, అప్పటికి డిశ్చార్జ్ కాకుంటే హోమ్ వారే వచ్చి అమ్ముల్ని డిశ్చార్జ్ అయినవెంటనే వచ్చి హాస్పిటల్ నుంచి తీసుకువెళ్లే ఏర్పాటు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడతను. అమ్ముల్ని అయిదు రోజుల తరువాత రూముకి షిఫ్ట్ చేశారు. అరవింద్ ని చూసి బెడ్ మీద నుంచి లేవడానికి ప్రయత్నం చేస్తూ  గొంతు పెగలక రహస్యం మాట్లాడుతున్నట్లుగా "చినబాబూ... మీరా...ఎప్పుడు...అమ్మగారు..." ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ నీరసంతో ముక్కులో ఆక్సిజెన్ ట్యూబ్ తో మాట్లాడలేక పోయింది అమ్ములు. రెండుచేతులెత్తి అరవింద్ ని దగ్గరికి రమ్మని సైగ చేస్తుంటే చలించిపోయాడు అరవింద్.రెండురోజులు దగ్గరే ఉండి అమ్ములకి సపర్యలు చేశాడు. ఇంటికి తిరిగి వచ్చాడు అరవింద్.
                                                        * * * * *
"బెంగళూరునుంచేనా రావడం"అప్పుడే వచ్చిన అరవింద్ ని పలుకరించింది సుజాత.
"అవునమ్మా…కొద్ధి కాఫీ ఇస్తావా...తల నొప్పిగా ఉంది" అన్నాడు అరవింద్.   
"అమ్ములు ఎలావుంది"? సూటిగా ప్రశ్నించింది సుజాత.
అరవింద్ కి నెత్తిన పిడుగు పడినట్లనిపించింది. నిలువెల్లా కంపించి పోయాడు. 
ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. గొంతు తడారిపోయింది. ఏంసమాధానం చెప్పాలో అర్ధంకాలేదు.అటు ఇటు దిక్కులు చూశాడు తండ్రికోసం,ఆయనేమైనా ఈ ఆపదనుంచి గట్టెక్కిస్తాడేమోనని. ఆ ఛాయలలో కనిపించలేదు కమలాకర్.
"నేను కఠినాత్మురాల్ని, మానవత్వం లేని మనిషిని కాదు అరవింద్. క్రమశిక్షణ ఉన్నమనిషిని. ఎవరికీ వారే...మాకు మేమే అనుకుంటూ చిన్న కుటుంబాల్లో బిరిగీసుకుని బ్రతుకుతున్నఈసమాజంలో బ్రతికినన్నాళ్ళు ఇంకొకరిపై ఆధారపడకుండా ఎలాబ్రతకాలో ఖచ్చితమైన అవగాహన ఉన్నదాన్ని. అందుకే జీవితాంతం శ్రమించాను. ఆర్ధికంగా నిలబడ్డాను. అమ్ములుకి 'న్యుమోనియా' వచ్చి సీరియస్ కావడంతో నేనే నీకు నీ స్నేహితునితో ఫోను చేయించాను. నిన్నుబిడ్డలా సాకిన అమ్ముల్నిచూసి వెళతావా లేదా చూద్దామనుకున్నాను. వచ్చావు.సంతోషం...."
"అది కాదమ్మా ... " ఏదో సంజాయిషీ ఇవ్వబోయాడు అరవింద్. గొంతు పెగల్లేదు.
"నేను చెప్పదలుచుకున్నది పూర్తి చేశాక నువ్వుమాట్లాడు చినబాబూ. నేను వింటాను.
అమ్ముల్ని నేను, మీడాడీ హాస్పిటల్ చేర్పించడం ఇది మొదటి సారి కాదు.నువ్వు ఆస్ట్రేలియా వెళ్లి పన్నెండేళ్లయింది. ఈ పన్నెండేళ్లలో నాలుగయిదు సార్లు వచ్చావు. వచ్చిన ప్రతిసారి అమ్ములుకి ఒక చాకొలేట్ పాకెట్, డజను పళ్ళు, ఒక స్వెట్టర్, వెయ్యో రెండువేలో డబ్బిచ్చిఉంటావు. అంతేనా…ఇంకేమైనా చేశావా? లేదు కదా. దాంతోనే దాని జీవితం గడవదన్న సంగతి నీకు తెలుసు కదా" !
"అమ్ములుకి నేనేం చేశానో చెబుతా విను. తను మనింట్లో పనిచేసిన మొదటి నుంచి ఇన్నేళ్లు తనకిచ్చిన జీతంగాక తప్పక నెలకింతని ఆమె పేరుతోనే పి.పి.ఎఫ్ ఖాతాలో వేశాను.
అది పరిణితి చెంది లక్షల్లో ఉంది. నెలనెలా వడ్డీ వస్తుంది.తనకి హెల్త్ కార్డు ఇప్పిస్తున్నాను.
ఇప్పటికి ఇంటికి వచ్చి తింటుంది. తాగుతుంది. నేను బ్యాంకులో వేసి దాచిన డబ్బే దానికి ఆధారం. నేను గొప్పలు చెప్పుకోవడంలేదు. ముందుచూపుతో వ్యవహరించానని చెప్పడం నా ఉద్దేశ్యం. 
ఇక నీసంగతి... అమ్ములు విషయంలో నామీద  నీకు ఏవేవో అపోహలున్నట్లు నీ ప్రవర్తనే చెబుతోంది. అమ్ముల్ని చూడడానికి వచ్చినవాడివి మాదగ్గర ఆవిషయం ఎందుకు దాయవలసి వచ్చిందో నాకు అవగతం కావడంలేదు. నేనావిషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. దాన్నినాకు జరిగిన అవమానం గానే భావిస్తాను." అంది ఆవేశంగా సుజాత. 
'అమ్ముల్ని చూడ్డానికి వచ్చానమ్మా' అనివుంటే మేమింకా సంతోషించే వాళ్ళం.రేపు వృద్ధాప్యంలో మమ్ముల్ని కూడా ఆదరిస్తావన్న తృప్తిగా ఉండేది. 
అమ్ములు పట్ల నాకు ద్వేషభావం ఉందని చిన్ననాటి నుంచీ నీమనస్సులో అంతర్లీనంగా గూడు కట్టుకుని ఉందని నాకు తెలుసు. నీభావన నిజం కాదు అరవింద్. కాలం, వయస్సుతో బాటు నీలో ఆ భావన మాయమవుతుందనుకున్నాను. నీలో మార్పు వస్తుందనుకున్నాను. నా అంచనా తప్పయింది.     
నువ్వే కాదు...ఇలాటివి చాలా వింటున్నాము. మీ తరం యువత నుంచి ఇలాటి ప్రవర్తన కాదు మేమాశించేది. కొద్ధి కరుణ...ఆదరణ మాత్రమే" అంది సుజాత దీర్ఘంగా తన అసంతృప్తిని, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ, కళ్ళలో ఉబుకుతున్న కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకుంది.
'అమ్ముల్ని హాస్పిటల్లో మీరే చేర్పించారని, డబ్బు కట్టారని ఈరోజు ఉదయం హాస్పిటల్లో బిల్లు చెల్లిస్తున్నప్పుడు తెలిసిందమ్మా. నిన్నుఅపార్ధం చేసుకున్నానమ్మా. నీ ఔన్నత్యాన్ని గుర్తించలేక హీనంగా ప్రవర్తించానమ్మా'...మూగగా ఆక్రోశిస్తూ "క్షమించమ్మా తప్పయింది.క్షమించు" అన్నాడు దీనంగా తల్లి పాదాల మీద మోకరిల్లిన అరవింద్.   

                                   * * *                             * * *                              * * *