లేబుళ్లు

31, అక్టోబర్ 2010, ఆదివారం

sathamaanam bhavathi.....

                                శతమానం భవతి.........


                                తెల్లవారుఝామున మూడవతోంది. నేను నాలుగ్గంటలకి అలారం పెట్టానే. మూడింటికే ఈఅలారం మోగిచస్తుందేమిటి అని విసుక్కుంటూ లేచి అలారం క్లాక్ ఆపాను. అయినా మోగుతూనే వుంది. ఓ ....అలారం కాదు ....ఫోను మోగుతోంది. 'ఇప్పుడు
ఎవరబ్బా ఫోను చేస్తోంది'?...ఈయన గారి ఫ్రెండ్ ఎవరైనా ఈయన గారితో  కేంప్ కి వెళ్ళే వాళ్ళు ఏమైనా ఫోను చేస్తున్నారా అనుకుంటూ ఫోను రిసీవర్ అందుకున్నాను. 'హలో....హలో...ఎవరూ మాట్లాడుతున్నది' ?
'నేను కోదాడు  నుంచి   'వాణి' ని మాట్లాడుతున్నాను...బావగారి ఇల్లేనా ?...గొంతులో ..ఆందోళన...ఏడుపు.....మిళితమై గద్గద స్వరంతో మాట్లాడుతోంది అవతలనుంచి...నేను వెంటనే గుర్తు పట్టాను...నా తోటికోడలు...' ఏమిటి మణీ ఈ టైములో ఫోను..
'అక్కయ్యా నువ్వేనా...మామయ్యగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందో..ఏమిటో గుండెనొప్పి, వీపులో కూడ నొప్పితో విలవిల లాడిపోయారు వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాము ....హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. మీ మరిదిగారు, ఒక డాక్టరు, నర్స్ మామయ్యగారిని తీసుకుని అంబులెన్స్ లో బయలుదేరి కూడ ఒక గంట అయింది. బావగారిని అయిదింటి కల్లా
నిజాం హాస్పిటల్ కి రమ్మన్నారు. అక్కా సిటిలో అందరికీ నువ్వే చెప్పు...మామయ్యగారు ఎలావున్నారో కూడ నాకు కొద్దిగా ఫోను చేస్తూ వుండు...నాకు రావాలనే వుంది కాని పిల్లలతో కుదరదు నీకు తెలుసుగదా'! అని చెప్పవలసిందంతా చెప్పి ఫోను పెట్టేసింది. తను ఫోను పెట్టేసిన తరువాత గాని నాకు అసలు విషయం తలకెక్కలేదు. కంగారు మొదలయింది. వెన్నుల్లోంచి చలి మొదలయింది. వెంటనే ఆయనగారిని లేపి సంగతి చెప్పాను. ఆయన లేచి తమ్ముడికి ఫోను చేశారు.
నాలుగున్నరకల్లా హాస్పిటల్ చేరుకుంటాము నువ్వు కూడ వచ్చేసి అక్కడ ఏమైనా ఫార్మాలిటీస్ వుంటాయేమో చూడమని  చెప్పాడట తమ్ముడు. ఆయన తయారు కావడం మొదలెట్టారు. నేను వెంటనే దేవుడి దగ్గరికి దణ్ణం పెట్టుకున్నాను మామయ్య గారికి ఏమీ కాకూడదని క్షేమంగా వుండాలని. ఉదయం తొమ్మిది గంటలకల్లా పిల్లల్ని స్కూల్ కి పంపించి నేను హాస్పిటల్ కి బయలుదేరాను. తాతగారికి ఆరోగ్యం బాగాలేదు అని తెలిశాక మాముగ్గురు పిల్లలు  స్కూల్ కి వెళ్లనని  తను హాస్పిటల్ కి వస్తానని ఒకటే మారాం. తరువాత తీసుకెళ్తానని వాళ్ళని ఒప్పించే సరికి దేవుడు దిగి వచ్చినంత పనైంది. హాస్పిటల్ కి వెళ్లేసరికి మామరుదులు హాస్పిటల్ బయటే కన్పించారు. మా ఆడపడుచులు, చిన్నమామయ్యగారు ఒక్కొక్కరు హాస్పిటల్ కి రావడం మొదలెట్టారు. నేను దాదాపు మూడుగంటల దాక అక్కడే వున్నాను. మామయ్య గారిని ICU లో ఉంచారు. ఆరోగ్యం బాగానే వుంది స్టేబుల్ గా వున్నారు. నేను బయలుదేరేవరకు నేను లేక్కేసినంత వరకు మేము మాచుట్టాలు దాదాపు 70 మందిమి హాస్పిటల్ కి వచ్చాము. మామయ్యగారంటే అందరికీ ప్రాణం. చుట్టాల్లో ఆయన సాయం పొందని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. నేను స్పష్టంగా గమనించాను అందరి మొహాల్లో ఆందోళన కన్పించింది. దేవుడు కరుణించాడు.మామయ్యగారు క్షేమంగా వున్నారు. వారం రోజులు గిర్రున తిరిగాయి. మామయ్య గారిని ICU నుంచి వార్డ్ కి షిఫ్ట్ చేశారు. సెపరేట్ గది తీసుకుందామని ఈయన గొడవచేసినా మామయ్య గారు ఒప్పుకోలేదు. రోజు భోజనం తీసుకెళ్ళేదానిని. మేము వుండేది అమీర్ పేటలో. హాస్పిటల్ దగ్గరే కావడంతో తిరగడం పెద్ద ఇబ్బంది కాలేదు కాని పిల్లలు, వచ్చి పోయే వాళ్ళతోనే టైం కుదరక ఇబ్బంది పడ్డాను. ఒకరోజు మామయ్య గారి బెడ్ పక్కనే ఒక చిన్న కుర్రాణ్ణి  బెడ్ మీద చూశాను. చూడ్డానికి చక్కగా వున్నాడు....అతను ఎందుకు చేరాడు హాస్పిటల్ లో నాకు అర్ధ కాలేదు. అడుగుదామన్నా ధైర్యం చాలడం లేదు. తల్లి తండ్రుల్ని చూస్తె అతనికి తాత ...అముమ్మ లానో వున్నారు. చాలా ఆలస్యంగా పుట్టినట్లున్నాడు అనుకున్నాను. వాళ్ళ బాధ చూస్తుంటే కడుపు తరుక్కు పోయేది. ఏ క్షణంలో చూశానో, ఎందు చేతనో ఆ పిల్లాడిని చూస్తేనే చేతులెత్తి నమస్కారం చేయాలనిపించింది. ముఖంలో ఎంత కళో ! వేదం చదువుకుంటున్న పిల్లా డల్లే వుంది.
ముందు తలమీద జుట్టు తీసేసి గుండు, పెద్ద పిలక, ముఖం మీద  చక్కగాదిద్దిన గోవిందనామం, ఆ పిల్లాడ్ని చూస్తూ ఎంత సేపైనా అలానే వుండాలనిపించేది. ఎందుకో తెలీని అవ్యాజ మైన ప్రేమ. మనస్సులోనే చేతులెత్తి నమస్కారం చేసుకునేదాన్ని. అతన్ని చూస్తె నాకు మాత్రం భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నట్లనిపించేది. హాస్పిటల్ కి వచ్చానంటే అతనితో మాట్లాడనిదే నాకు మనశ్శాంతి వుండేది కాదు. ఎప్పుడూ చూసినా విష్ణు నామమో, గోవింద నామాలో, వేదమో ఏవో  భక్తి గీతాలు సన్నగా ఆలపిస్తూనే ఉండేవాడు. మామయ్యగారు  కూడా అన్నారు ఈ పిల్లాడిలో ఏదో తెలీని ఆకర్షణ శక్తి  ఉందమ్మా....మామూలు పిల్లాడు కాడు , మీ రెవ్వరూ ఇక్కడ లేనప్పుడు  అతను నాదగ్గరే కూర్చుంటాడమ్మా.......క్రిత రెండు రోజుల్లుంచి తను విపరీతంగా తల నొప్పితో బాధతో గిల గిల లాడి పోతున్నాడమ్మా.....ఆ నొప్పి వచ్చే సమయంలో అతను బెడ్ మీదనే పద్మాసనం వేసుకుని ప్రార్ధన చేస్తూ ఉంటాడమ్మా...తనకి బ్రెయిన్ ట్యూమర్ అట.
తను బాధ పడే విషయం తల్లీ, తండ్రికి మాత్రం తెలవనీయ వద్దంటాడమ్మా.....నిన్న తను నాకు ఒక ధర్మబోధ చేశాడమ్మా ......మానవుడు మరణానంతరం అతని ఆత్మ ఏ ఊర్ధ్వ లోకాలకెళ్ళినా భగవతారాధన అసాధ్యమట. ఒక్క మానవుడికే భగవంతుడ్ని తనకిష్టమైన రీతిలో సేవించే అవకాశమున్నదట! అలాంటి మనిషి జన్మఎత్తి దాన్నిభగవంతుని సేవలో సార్ధకం చేసుకోకుండా వెళ్లి పోతున్నాననే తనకి బాధట....ఏం చెప్పనమ్మా తనకి...నేను...... కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటే ....తాతగారూ.....మీరు ఇక సమయం వృధా చేయవద్దు...మీకు భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదిస్తాడు...ఇక సమయం అంతా భగవత్ సేవలో గడపమని నాకు ధర్మ బోధ చేశాడమ్మా... తరువాత నేను ఒక రోజు హాస్పిటల్ కి  ఉదయమే వెళ్లాను. నన్ను చూసి తను  'అమ్మా మా నాన్నగారు ఇంకా రాలేదు. నేను స్నానం చేసి వస్తాను. ఆయనగారు రాగానే  నేను 'లేకపోతే'..... 'కాదు'...'కాదు'......నేను కన్పించకపోతే  కంగారు పడతారు...దయచేసి నేను ఇప్పుడే వస్తానని చెప్పగలరా' అమ్మా....అన్నాడు ఆకుర్రాడు రెండు చేతులు జోడించి. 'అయ్యో ... అదెంత పని...బాబూ....అన్నాను.       
తను నాకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మాట్లాడినందుకు ...నా మనస్సు తెగ కలవర పడింది. ఆరోజే తెలిసింది నాకు.....ఆ పిల్లాడు ఇక ఈ భూమికి కొద్దిరోజుల... బంధువేనని....ఏ నిముషం లోనైనా....ఇహలోక ప్రయాణం ముగించవచ్చునన్ననిజం తెలిశాక తనని చూడడానికే నాకు భయం వేసేది.....ఆ సంగతి తెలిసిన మరుక్షణం నుంచి  క్షోభ...మనః క్లేశంతో నేను ఎంతగా  రోదించానో....నాకే తెలుసు. మరుసటి రోజు కూడ నేనే హాస్పిటల్ కి ఉదయాన్నే వెళ్లాను. పిల్లాడి తల్లి, తండ్రి ఇద్దరు వున్నారు. వాళ్ళు ఎందుకో హడావుడి పడ్తున్నారు.
డాక్టర్లు రౌండ్ కి వచ్చే సమయం. సంగతేమిటి అని కనుక్కుంటే తనని చూడడానికి  వేదపాటశాల నుంచి గురువులూ, కొంతమంది శిష్యులు వస్తున్నారట. వాళ్ళని లోనికి తీసుకురావడం కోసం పాపం ఆముసలాయన తంటాలు పడ్తున్నాడు. చూడమ్మా ఏమైనా సాయం చేయగలవేమో...వాళ్ళని లోనికి తీసుకురావడానికి....అన్నారు మామయ్యగారు.
ఆముసలాయాన్ని తీసుకుని హాస్పిటల్ సూపెరింటెండెంటు దగ్గరికి వెళ్లి మాట్లాడాను. తనకి ఏ పిల్లాడి కేసు సంగతి తెలసట...అయ్యో...ఇప్పుడు వచ్చారా వాళ్ళంతా...సరే...అని సెక్యురిటీని పిలిచి వాళ్ళందరిని లోనికి పంపించమని మా ముందే చెప్పారు...మేము వార్డుకి వెళ్ళామో లేదో బిల బిల మంటూ పది మంది...ఇద్దరు గురువులూ..ఎనిమిది మంది శిష్యులు..అందరూ వచ్చేశారు. వారి వేషధారణే ప్రత్యేకం. వారు వస్తూనే ఈ పిల్లాడు ఇద్దరు గురువులకి సాష్టాంగదండప్రణామం చేశాడు. వారు అంతా పిల్లవాడి చుట్టూనిలబడి మంత్రోచ్చారణ మొదలెట్టారు.
"శతమానం భవతి శత ఆయుహ్ స్స సేవెంద్రియే .....ఆ పిల్లవాడు వారిని వారించి తన నొక్కడినే కాదు అక్కడ ఉన్న 
అందరు రోగులని ఆశీర్వదించమని కోరాడు. ఈ హడావుడికి అప్పటికే హాస్పిటల్ స్టాఫ్ , రోగులు, డాక్టర్లు అందరు ఆ వార్డ్లో 
గుమి కూడారు. అయిదు నిముషాల పాటు వారి వేదోచ్చారణ.........సర్వేజనా సుఖినోభవంతు ....ఆశీర్వాదం తో వార్డ్ మార్మోగి పోయింది. హాల్లో ఉన్నఅన్యమతస్తులకు ఒక డాక్టర్ ' they are chanting manthras and giving blessings  for well being of all the patients herein at the request of that boy patient'  అని చెపుతూంటే నా కళ్ళ వెంట కన్నీటి ధార ఆగలేదు. మనసంతా ఉద్విగ్నంగా మారింది. తరువాత కొద్ది నిముషాల్లో వారంతా వెళ్లి పోయాక నేను తనతో 'వారంతా మీకోసం అంత దూరంనుంచి వచ్చి ఆశీర్వదిస్తుంటే  వారిని ఎందుకు వారించావు' అని అడిగాను.
అందుకతను 'అమ్మా...వారి ఆశీర్వాదబలం నాకంటే ఇక్కడ ఉన్నవారికి అవసరం. నాకెలాగు ఎవరి ఆశీర్వాదంతో ఇక పనిలేదు'.
అని నిర్విరాకారంగా బెడ్ మధ్యలో పద్మాసనం వేసుక్కూర్చుడతను కళ్ళు మూసుకుని. ఇక నావల్ల కాలేదక్కడవుండడం.
బయటకి వెళ్లి అక్కడవున్న బెంచ్ మీద కూర్చున్నాను సోబుతూ. నర్సులు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు, రోగులు ఎంతమందో కళ్ళుతుడుచుకోవడం గమనించాను నేను. మరుసటి రోజు ఉదయమే మామయ్యగారు తనక్కడ ఉండనని తనని డిశ్చార్జి చేసి తీసుకెళ్ళమని చెప్పడం ఆయన ఇంటికి తీసుకు రావడం జరిగింది. నేను తన విషయం కావాలనే మరి మాట్లాడలేదు. ఎందుకంటే తనని  ఓ చిన్ని విష్ణుమూర్తిగా నా మనః ఫలకం నుంచి తొలగించదలుచుకోలేదు.  
రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.

29, అక్టోబర్ 2010, శుక్రవారం

"Naa" tharam.

ఈ "నా" తరం


తరాలు మారుతున్నాయి .

తలరాతలు మారుతున్నాయి. నిన్న మొన్నటి క్రొత్త జీవితాలు నిలువునా కూలుతున్నాయి.

పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. నేటి యువతలో ( యువతీ యువకులు) చాలామందికి .

నేను, 'నా' అన్నమాట తప్ప వేరే ప్రపంచం లేదు. ఎక్కడో ఒకరో, ఇద్దరో తప్ప మిగతావారంత ఇలాగే వున్నారు.

ఈ వ్యవహారం ఇంతవరకయితే సర్దుకుపోవచ్చు. ఈవిషయం ఇక్కడ ఆగి పోవడం లేదు. ఇదొక జాడ్యం గా మారిపోయింది. వారిలో నేను, నాది, నా ఇష్టం అన్న వ్యవహారం తోనే కుటుంబాలలో గొడవలు, తేడాలు, అపార్ధాలు , అల్లర్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవి ఇక్కడ ఆగి పోవడం లేదు. కొన్ని జీవితాల నాశనానికి / అంతానికి నాంది పలుకుతున్నాయి. కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. కుటుంబ పెద్దలు దిక్కుతోచక గాలిలో దీపాన్ని చూస్తున్నట్లు కూలుతున్న జీవితాల్ని, విధిలేక, పాలుపోక, ఏమిచేయలేక చేష్టలుడిగి దిక్కు లేని వాళ్ళలాచూస్తూ దుఖ్హం దిగమింగుకుని జీవచ్చవాల్లా బతకల్సివస్తోంది .

ఉడుకురక్తం తో లేనిపోని ఆవేశ కావేశాలతో నిండు జీవితాలు నిలువునా కూల్చుకుంటు న్నారు.

భారత, హిందూ సాంప్ర దాయ వివాహ వ్యవస్థ కే పెద్దముప్పు వచ్చింది. వ్యవస్థ ని ఇప్పుడు కాళహస్తి గాలిగోపురం తో పోల్చవచ్చు. అది కూలింది. ఇది కూలడానికి తయారుగా వుంది. ఇంకా ఎన్నోరోజులు పట్టదు.

ప్రస్తుత ఈ మార్పుకి కారణం మారుతున్న ప్రపంచం, విదేశీ, స్వదేశి చదువులు, విదేశీ ఉద్యోగాలు,మరింతగా విదేశీయాత్రలు,విదేశీ నివాసం, పాశ్చ్యాత్య పోకడలు, ఇంటా, బయటా పరిస్టితులు, ఆర్ధిక ఎదుగుదల , స్వశక్తి , మారుతున్న సమాజ సమీకరణాలు,పురుషాధిక్యత, స్త్రీల ఆర్ధిక స్వావలంబన . ఇవన్ని చెడు చేస్తున్నాయని నేను చెప్పడం లేదు. చెడు ఆలోచనలకి దోహదం చేస్తున్నాయనడానికి ఏమాత్రం సందేహంలేదు. ఇవన్నిఎక్కడెక్కడో మనుషుల్ని ఎంత త్వరితగతిని కలుపుతున్నాయో అంత త్వరగానే విడతీస్తున్నాయి. బహుశా ఈ వ్యాసం చదువుతున్న ప్రతివారికి ఇటువంటి సంఘటనలు తెలిసేవుంటాయి. విడమరిచి చెప్పాలంటే ఎంత త్వరగా జీవితాలు ఒకటవుతున్నాయో అంత త్వరగానే కూలుతున్నాయి. నాకు తెలిసి ఇటువంటి ఘటనలు కోకొల్లలు. ఎందుకవుతోందిలా? కారణం వారా ? వారి తల్లితండ్రు లా ? సమాజమా? లేక పైన చెప్పిన కారణాలా ? ఎవరు దోషి ? ఎవర్ని నిందించి ప్రయోజనం ! దిగుమతి చేసుకున్న, మనదికాని నాగరికత తో ఈరోజున మన యువత కి / మనకి అవుతున్న హాని అంత, ఇంతా కాదు.

ఈ ప్రవాహం లో సమిధలు వాళ్ళే కాదు. మనందరినీ కలిపి లాక్కుని వెళుతున్నారు.కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ ఒకసారి కూలితే మళ్లి పునర్నిర్మించడం సాధ్యమా ? ఇది మానవతకి, మతాలకి కూడా చేటు.

అందుకే అభ్యర్ధిస్తున్నాఅందరిని. ఆలోచించండి ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామో . మేధావులు,సంఘ సంస్కర్తలు, శాస్త్రవేత్తలు, ముఖ్యంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు,ఇంకా పెద్దలు గమనించండి ....... జరుగుతున్నది అంత మనమంచికే అవుతే మంచిదే . కాలం నిర్ణయించే లోపులో జరగవలసిన నష్టం, హాని జరుగుతే మనల్ని మనం క్ష మించుకునే రోజు మిగిలి ఉంటుందా అనేది అనుమానమే. అందుకే ఈ వ్యాసం వ్రాస్తున్నాను. పెద్దలూ లేవండి , మేల్కోండి. పిల్లల్ని గమనిస్తు ఉండండి i . మూల వ్యవస్థల్ని కాపాడండి. ఒక్క వివాహవ్యవస్థ నే కాదు . సాంప్రదాయ వ్యవస్థలన్నీ కూలడానికి సిద్దంగా వున్నాయి. ఎప్పుడో హిందూ వ్యవస్థల మీద దాడులు జరిగాయి, జరుగుతున్నాయి ఇదివరకు అవి ఇతరులు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు.చివరకు వెంకన్ననే ఏడుకొండలు నీవికావు పో అన్నారు ఇంకేమి జరగనుందో ఎవరికీ తెలుసు.

ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తా విస్తు న్నానంటే మనవ్యవస్థ మీద మన యువతే దాడులు చేస్తున్నారు.అవి భౌతిక దాడులు కావు. అరువు తెచ్చుకున్న నాగరికతతో అతి అనాగరికంగా ప్రవర్ర్తిస్తూన్నారు. దానికి వారొక్కరే కారణం కాదు. ప్రతి కుటుంబపెద్ద, ప్రతి తల్లి,తండ్రి, గురువు ,సమాజం అందరు సమానంగా కారణమే.

పెంపకాల్లో తేడా వచ్చింది. తప్పుల్ని దిద్దుకోండి. పారాహుషార్ !

తల్లితండ్రుల్లార జాగ్రత్త , ముద్దు, ముచ్చట వరకు మంచిదే. మంచి నేర్పండి.లోకగ్జానం నేర్పండి.మీరెవరు, మీమూలాలేమిటి,చెప్పండి. పేద్దల్ని గౌరవించడం, అన్ని మీకు తెలుసు.వారికి చెప్పండి . మంచిగా పెంచండి. చూసి చూడనట్టు ఉండకండి ! తప్పులేమైన చేస్తే దండించండి ! మళ్లి ఆతప్పు చేయకుండా చూడండి.అలాగని పిల్లలకు స్వేఛ్చ లేకుండా చేయకండి .ఓ చక్కటి స్నేహితుడులా సహకారం ఇవ్వండి.వాళ్ళని చక్కని భారత పౌరుడుగా తీర్చి దిద్దండి.

రోజులు మారుతున్నాయి.

మార్పులు తధ్యం. మార్పు లేకపోతె మనిషి లేడు , మనుగడ లేదు .మనందరిలో మార్పు రావాలి. ఆమార్పురావాలంటే మనమేమి చెయ్యాలి. చెదపట్టిన వ్యవస్థ దానికదే బాగవుతుందా? కాదు!

అందుకే నాకు తోచిన నాలుగు వాక్యాలు వ్రాస్తున్నా!

ప్రపంచం పూర్వంలా లేదు. మారింది. మారుతోంది. మనిషి మారుతున్నాడు. ఆమార్పుమంచిది కావాలి. ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. మార్పు వ్యవస్థీకృతం కావాలి.

ఇప్పుడు దేశంలో హింస ఎలావుంది?

పిల్ల ల్నవదలడం లేదు. పెద్దల్ని వదలడంలేదు.స్త్రీల సంగతి చెప్పనవసరం లేదు.

హింస, నేరాలు,ఘోరాలు కూడా వ్యవస్తలో భాగం అయ్యాయి. ఇంకా చెప్పాలంటే వ్యవస్తీకృతం అయ్యాయి

వ్యవస్తీకృతం అయ్యాయి అని ఎందుకంటున్నానంటే ఒక్క మనిషి గాలిలో చిటికేస్తే దేశంమంతా ఎక్కడంటే అక్కడ దాడులు జరుగుతాయి.ఆ దాడులు చేస్తున్నవరెవరు? పాతికేళ్ల లోపు యువకులు/యువతులు. వారి వారి తల్లితండ్రుల

పెంపకం బాగుంటే అంతమంది దాడులు చేస్తారా? లేదు. చెయ్యరు. కాబట్టి తల్లితండ్రులూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి.

గురువులూ జాగ్రత్త .మీవిధులు మీరు సక్రమంగా నిర్వర్తించడం లేదనడం లో ఎలాంటి సందేహంలేదని ప్రజావాక్కు.దీంట్లో భిన్నాభిప్రాయం లేదు.

సంఘసంస్క్రత్తలూ మేల్కోండి. పత్రికలూ మోరాల్స్ పాటించండి. ఏదో ఒక రాజకీయ పార్టీ కో, సామా జిక వర్గానికో కొమ్ముకాయకండి. సంఘ హితం చూడండి, సొంతలాభం కొంత మానండి.

ఈరోజున యువత తప్పుదోవలో వున్నారంటే ముమ్మాటికి మీరు,మీ టీవీ ఛానల్స్,సినిమాలు చాలావరకు కారణం.

ఎందుకంటే మీకు మీ మీ పత్రికలూ / టివి లు / ratings ముఖ్యం. ఏదో ఒక విషయం లో sensation కావాలి. ముందు

నా ఛానల్ ప్రసారం చేసింది అన్నదే ముఖ్యం మీకు. అందులో కించిత్తు అయిన జనహితం వుందా , లేదా అన్న విషయం మీకు అవసరం లేదు. నయ్ తికత అసలే లేదు. కూలుతున్న కుటుంబ వ్యవస్తని బాగుచేయగల సామర్ధ్యం ఎవరికైనా వుందంటే వారు మీరే. ఇందుకు దయచేసి మీరు మీ మీ పరిధిలో ఏమి చెయ్యగలరో ఆలోచించండి .నడుం బిగించండి.దీనికి కొంత దూకుడు కావాలి. ఇందుకు సర్వశ్రీ శ్రీ రామోజీరావు, రామచంద్ర రావు,వేమూరి బలరాం, వెంకటేశ్వరరావు,టి.వెంకట్రామరేడ్డి ,మాలతీచందూర్,పి.వి.ఆర్.కే.ప్రసాదు,కే.విశ్వనాధ్,ఇంకా నేను తెలియక పేరు వ్రాయని పెద్దలు, తదితరులు కార్యాచరణ మొదలుపెడితే వ్యవస్థ కోలుకోవడానికి శ్రీకారం చుట్టిన వారవుతారు. చరిత్రకారులు అవుతారు. .

చివరిగా ఇంకొక్క విషయం. మొన్ననే జనాభా లెక్కల్లో ఒక విషయం తెల్సింది.

దీనికి పైన విషయాలకి సంబంధం లేదనుకున్నా ఖచ్చితంగా బంధం మాత్రం వుంది . అందుకే దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా.పాలకులు, జనం గమనించండి .

దక్షిణ భారతంలో కుటుంబాలు చక్కగా జనాభా నియంత్రించుకుని జనాభా పెరగకుండా పాలకుల చెప్పింది చెప్పినట్లుగా విని పాటించారు.

ఉత్తర భారతంలో మాత్రం జనాభా పెరుగుదల మాములుగానే వుంది. అందువల్ల దక్షిణభారతంలో వచ్చే పాతిక సంవత్సరాలలో యువత తగ్గి పోయి అంతా వయసు మీరినవాళ్లు తయారవుతారు. ఉత్తర భారత యువత సంఖ్య చక్కగా పెరుగు తుంది. మరి కుటుంబ వ్యవస్థ అవసాన దశ లోవున్న దక్షిణలో ఈ ముసలి వాళ్ళను ఎవరు భరిస్తారో. ఎందుకయినా మంచిది వృద్ధుల ఆశ్రమాలు పెంచుకుందాం.

కేశిరాజు వెంకట వరదయ్య.

Note: This essay (article) is wriiten by me and is not a copy/ translation of any others.

అడ్రస్:

K.V.Varadaiah,
superintendent Central Excise (Rted)

26, అక్టోబర్ 2010, మంగళవారం

నీసొంత మేమీ లేదిక్కడ .....కవిత

నీసొంత మేమీ లేదిక్కడ  
అక్కడెక్కడో మునిసిపాలిటీ వారు
కూల్చేశారట కూలీనుల ఇళ్ళు
కూలిన ఇళ్ళతో బజారున పడ్డాయి బ్రతుకులెన్నో!
ఇక్కడ రోడ్డు విశాలం చేయడంకోసం
కూల్చేశారు పచ్చని వటవృక్షాలనీ
కూల్చిన చెట్లమీద చెదిరిన పక్షులగూళ్ళు,గుడ్లూ!
ఇంకెక్కడో భూమిలో కంపనం వచ్చిందట
దానితో కూలాయి ఇళ్ళు
కూలిన ఇళ్ళలో ఎన్నో కప్పేసిన బ్రతుకులు!
మరెక్కడో పర్వతాల నుంచి జారిన వాగులతో
ఊళ్ళకి ఊళ్ళేపూడిపోయాయట
ఆ ఊళ్ళతో ఇక మిగిలింది మొండి గోడలేనట!
ఇంకా చెప్పేదేముంది!
నిరంతరం తూటాలకి, మానవబాంబులకి
బలవుతున్న జీవితాలకి లెక్కేలేదు!
ఏమిటీ బ్రతుకులు!
నీ బ్రతుకు పగ్గం నీదగ్గర లేనే లేదు!
మరెందుకీ ఉరుకులు పరుగులు.....
సొంతమేమీ లేదు !
అన్నసత్యాన్ని నిత్యం స్మరించు!
అప్పుడు అంతా నిర్మలం!  

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం. 9849118254   

23, అక్టోబర్ 2010, శనివారం

asooyavaddu...anandam muddu.

అసూయ వద్దు..ఆనందం ముద్దు.మా పక్కింటావిడా నేను బాగా కలిసి మెలిసి ఉంటాము. వాళ్ళు ముంబైలో పదేళ్ళ పైగా వుంది వచ్చారు.

ఆవిడ లేనప్పుడు నేను, నేను బజారుకెల్తే తను, పిల్లల్ని చూసుకుంటూ ఉంటాము. తనకు ఒక బాబు, ఒక పాప నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు. మా పెద్దమ్మాయి ఎంసెట్ లో మంచి రేంక్ తెచ్చుకుంది. సిటి లోనే మంచి కాలేజిలో ఫ్రీ సీటు వచ్చింది. వాళ్ళబ్బాయికి మంచి రేంక్ రాలేదు. పేమెంటు సీటు. అదీకూడా కూడ ఎక్కడో దూరంగా ఏదో చిన్న 'టౌన్' లో వచ్చింది.

అప్పటినుంచి తనలో కొద్దిగా మార్పు చూస్తున్నాను.

ఈర్ష్య సహజం కదా కొద్దిరోజులుంటుంది, తరువాత మమూలయి పోతుందిలే అని నేనే చాలా సర్డుకుపోయాను.

రాను రాను పిల్లల్ని సూటిపోటి మాటలనడం, నాతో సరిగ్గా మాట్లాడక పోవడం ప్రతిమాటకి ఏదో పెడ అర్ధాలు తీయడం మామూలయిపోయింది. వాళ్ళపాప మాబాబు ఇద్దరి టెన్త్ క్లాస్,సెంట్రల్ సిలబస్. ఇద్దరు చక్కటి ఫ్రెండ్స్. కలిసి చదువుకుంటారు. చదువులో ఇద్దరు ఒకరికొకరు పోటీ.

అది వీడికంటే నాలుగంటే,నాలుగు రోజులే పెద్ద. వీడు దాన్ని 'అక్కా' అని తెగ ఏడిపిస్తుంటాడు.

అది స్కూల్ నుంచి వచ్చిందంటే మా ఇంట్లోనే పాగా. తినడం, తాగడం చాలావరకు మా ఇంట్లోనే. మాకు ఎప్పుడూ అది పరాయి పిల్ల అనిపించలేదు.మాఇంట్లో పిల్ల లాగానే వుంటుంది. వాళ్ళ అమ్మలో ఈ మధ్య మార్పు వచ్చాక ఇది రావడం తగ్గింది.

ఒక రోజు అది బయట కన్పించే సరికి ' ఏమిటే రోజు మామూలుగా రావడం లేదు'? అని అడిగాను.

నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా 'మా మమ్మీ కి, మీకు ఏమైనా గొడవ అయిందా ఆంటీ' అనడిగింది.

'లేదే...అలాంటి దేమీ లేదు'....మేము ఎప్పటిలా బాగానే ఉన్నాము అన్నాను నేను.

'అదేం కాదు లే ఆంటీ...నాకు తెలుసు. అక్కకి మంచి ఎంసెట్ రేంకు, ఫ్రీ సీటు వచ్చిందగ్గరనుంచి ఇంట్లో మా అందరిని సతాయిస్తూనే వుంది'.

నన్నుకూడా ఎప్పుడూ లేంది ఎందుకూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతావు అంటోంది.

అందుకే నాకు మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారేమో నని అనుమానం వచ్చింది అంది అది.

నేను సంబాలించుకుని పెద్దవాళ్ళ సంగతులు మీకేందుకే చక్కగా చదువుకోక, అని దాన్ని మందలించి ఏమైనా సరే తనతో మాట్లాడాలి అనుకుని

అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి 'కీస్' పక్కన ఇంట్లో ఇవ్వడం అలవాటు.

ఈ మధ్య తను 'కీస్' తీసుకోవడం లేదు సరికదా నేను బయటకు వెళ్తున్నాను అని అబద్ధం కూడ చెబుతోంది.

అలా అబద్ధం చెప్పి నాకు దొరికి పోయింది కూడా. కారణం లేకుండా దూరమవు తున్నాట్లు అనిపించింది.

తను కూడ 'కీస్' ఇవ్వడం మానేసింది.

ఆరోజు 'దసరా' వస్తోందని షాపింగ్ కి వెళ్లాను.

ఇంటికి వచ్చేసరికి గేటు బయట కూర్చుని వున్నాడు మా బాబు. స్కూల్ టీచరు ఎవరో పోయారట.అందుకు హాఫ్ డే నే స్కూల్ అట.

వాడిని అలా బయట గేటు ముందు కూర్చోవడం చూసే సరికి నా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పిల్లలు చక్కగా కలిసి మెలిసి వుండేవాళ్ళు. అలాటిది వాళ్ళు ఇంట్లో ఉండగానే బాబు గేటు ముందు కూర్చోవడం నేను సహించలేక పోయాను. వెళ్లి ఆవిడను నాలుగు చివాట్లు పెడదామని అనుకుని అలా చేస్తే తనకు నాకు తేడా ఏముంటుంది నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను.

తాళం తీసి వాడికి టిఫెన్ పెట్టి' ఏం నాన్నా....బయట కూర్చున్నావు.. ఆంటీ వాళ్ళింట్లో కూర్చోలేక పోయావా'? అని అడుగుదామని నోటి దాకా వచ్చి కల్మషం తెలీని చిన్న మనసు బాధ పెట్టడం ఎందుకని ...ఊరుకున్నాను.

వాడు ఏమైనా చెపుతాడేమోనని ఎదురు చూశాను. అందుకు కూడా నామనసు ఎంతో బాధ పడింది.

కారణం లేకుండా ఎందుకావిడ ఇలా ప్రవర్తిస్తోందో అర్ధం కావడం లేదు.

లేక నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా తనపట్ల గాని, తన పిల్లల పట్లగాని....ఎంత ఆలోచించినా, అలాటి దేమీ లేదు.

రెండు రోజులయింది. ఆరోజు నుంచి బాబు నాతో ముభావకంగా వుండడం గమనించాను. ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు నాదగ్గరికి వచ్చి పక్కన పడుకుని ఆరోజు విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పే బాబు రెండు రోజులుగా ముభావకంగా వున్నాడు.ఇదే విషయాన్ని ఆయనతో అంటే పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇంకా 'అమ్మకూచి' అని ఎవరైనా ఎడిపించారేమో? కంగారు పడకు అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. నా మనసుమాత్రం ఊరుకోవడం లేదు. స్కూల్లో ఏమైనా జరిగిందా ? లేక నామనసు ఊహిస్తున్నట్లు పక్కింటావిడ ఏదో జరిగింది. బాబుని విషయమేమిటో కనుక్కుందామని నిర్ణయించుకున్నాను. పిల్లలకి ఆరోజు స్కూల్ కి శలవు. ఉదయం మావారు ఆఫీసుకి వెళ్ళడంతో పని ముగించుకుని బాబు గదిలోకి వెళ్లాను. వాడు కంప్యూటరు గేము ఆడుతున్నాడు. 'ఏం నాన్నా...హోం వర్క్ అలాటివేం లేవా'...ఉదయం లేచిన దగ్గర నుంచి చదువుకోక ఎంత సేపు ఆడతావు ఆ గేములు. ఇక ఆపు భోజనం చేసి చదువుకో' అని చెప్పానో లేదో వెంటనే వాడు హెచ్చు స్వరంతో

'చెల్లినైతే ఎంత సేపైనా ఆడుకోనిస్తావు, ఏమనవు. నేను కాసేపు ఆడుకుంటే కోప్పడతావు. నీకు ఆడపిల్లలంటేనే ఇష్టం. ఆంటీ కూడా చెప్పారు' మొదటసారి బాబు ఎదురు మాట్లాడడం చూశాను. అదీ వాడు నా వంక చూడకుండా తలవంచుకుని గట్టిగా మాట్లాడాడు.

ఒక్కక్షణం బిత్తరపోయాను. ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు. అలాగే నిలబడ్డాను. బాబు నన్ను రాసుకుంటూనే విసురుగా వెళ్లి

వాడే కంచం తీసుకుని భోజనం పెట్టుకున్నాడు. నేను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. నన్ను నేను సంబాలించుకున్నాను.

జరిగింది అర్ధం అయింది. పక్కింటావిడ వీడితో ఏదో తప్పుగా మాట్లాడింది. వాడి మనసు తీవ్రంగా గాయ పరిచింది.

ముందు వీడి సంగతి చూడాలి. తరువాత ఆవిడతో మాట్లాడి, పిల్లల దగ్గర పిచ్చి వేషాలేయవద్దని, పిచ్చి మాటలతో వాళ్ళ చిన్ని మనసుల్ని కల్మషం చేయవద్దని హెచ్చరించాలని నిర్ణయించుకున్నాను.

మరుసటి రోజు పని అంతా చేసుకుని పక్కింటికి వెళ్లాను.

నన్ను చూడ్డంతోనే...రా...లక్ష్మీ...షాపింగ్ కి పోలేదా...? రాని నవ్వు తెచ్చుకుంటూఅడిగింది శాలిని.

ఏమిటి 'శాలిని' నా షాపింగ్ తో నీకు చాలా ప్రాబ్లం గావున్నట్లుగా వుందే!

ఈ మధ్య ఇంటి 'కీస్' కూడ తీసుకోవడంలేదుగా! ఇంకా నీకెందుకు బాధ.

'సరేగాని ....సూటిగా అడుగుతున్నాను..చెప్పు? బాబు నేను లేనప్పుడు స్కూల్ నుంచి వస్తే కనీసం వాడిని ఇంట్లో కూర్చోమనలేనంత కఠినంగా తయారయ్యావు. మూడురోజుల క్రితం పండగ వస్తోంది కదా అని షాపింగ్ కి వెళ్ళాను. ఆరోజు నువ్వుకూడా బయటకు వెళ్తానని ఇంటి కీస్ కూడ తీసుకోలేదు. నువ్వు ఎక్కడికి పోలేదు.ఇంట్లోనే వున్నావు. నేను వచ్చేసరికి బాబు గేటు ముందు కూర్చుని వున్నాడు. చిన్నపిల్లాడని జాలి కూడ వేయలేదా? ఏం, ఎందుకు ఉన్నట్లుండి అంత చెడ్డ వాళ్లమయ్యాము ?

అసలు వాడు ఆరోజు మీ ఇంటికి వచ్చాడా? లేదా ? నాకు సమాధానం కావాలి.

'శాలిని' దగ్గరనుంచి సమాధానం లేదు. మౌనం గానే వుంది.

నిన్నే అడుగుతున్నాను శాలినీ సమాధానం చెప్పు రెట్టించి అడిగాను. దాదాపు పది సంవత్సరాలయింది మనం పక్క,పక్కన ఉండబట్టి. ఎప్పుడయినా ఇలా జరిగిందా? నాదగ్గర నీ పిల్లల్ని వుంచి వారం, పది రోజులు నువ్వు, మీవారు వూరికి పోయిన రోజులు మరిచిపోయావా? నీ కూతురు ఈరోజుకీ నా ఇంట్లో నాపిల్లలతో సమానంగా వుంటుంది. ఏరోజైనా తేడాగా చూసినట్లు కనీసం గమనించావా? ఏమైంది నీకు? అసలేం జరిగింది? నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా చెప్పు? తప్పు అయితే తప్పక దిద్దుకుంటాను.

పిల్లల విషయంలో నీ ప్రవర్తన నాకు చాలా అభ్యంతరకరంగా వుంది. నీ కూతురు నాఇంటికి రావడం మీద ఆంక్షలు. ఏమైనా బావుందా?పిల్లల చిన్ని మనసులు ఎంత బాధ పడతాయి. వాళ్లకి మంచి నేర్పాలి కాని 'ద్వేషం' నేర్పుతావా? ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి? నాకంటే ఎక్కువ చదువుకున్నదానివి. ఇదేనా నీ ఔన్నత్యం. చిన్న పిల్లలు.... వాళ్ళ మనస్సులో ద్వేషం, కల్మషం అలాంటివేమీ వుండవు. అలాంటిది వాడితో తనని ఆడ పిల్లకంటే తక్కువగా చూస్తానని అంటావా? తప్పు కదా శాలినీ.....నీ కూతుర్నే నా కూతుళ్ళతో సమానంగా చూశే నేను నాకొడుకుని తక్కువగా చూడటమా ....ఛీ ...ఎంతగా దిగజారి మాట్లాడావు శాలినీ...

వాడి చిన్న, సున్నిత మనస్సులో ఎంత 'విషం' కక్కావు? ఎందుకు ఇంత అసహ్యంగా ప్రవర్తించావు. చాలా తప్పు చేశావు.

ఇక ఎప్పుడూ నా పిల్లల జోలికి, నా జోలికి రాకు. గుడ్ బై ... అనేసి విసురుగా బయటకు వస్తుంటే...

వెనక నుంచి..'లక్ష్మీ.....లక్ష్మీ....సారీ....సారీ...ప్లీజ్'.....నన్ను క్షమించు..నిజంగా చాలా తప్పు చేశాను.

అసహ్యంగా ప్రవర్తించాను. మీ పెద్దమ్మాయికి మావాడికంటే మంచి 'రేంకు' వచ్చినప్పటినుంచి, ఇంకా దానికి' ఫ్రీ' సీట్ వచ్చేసరికి

నాకు నీ మీద అకారణంగా చాలా అసూయా, ద్వేషం, ఈర్ష్య అన్నీ గూడు కట్టుకున్నాయి. గుడ్డిదాన్నై పోయాను. మీ బాబు స్కూల్ నుంచి వస్తే చాలా అసహ్యంగా మాట్లాడాను. చిన్న పిల్లాడి మనస్సులో 'అనుమానం' నాటాను. ఇన్నేళ్ళ స్నేహానికి అర్ధం లేకుండా చేశాను. ఇప్పుడు నాకు నేనే చాలా అసహ్యంగా కనబడుతున్నాను. తప్పయింది లక్ష్మీ...వాడికి నీ మీద చాడీలు చెప్పాను. వాడికి 'సారీ' చెబుతాను ..లక్ష్మీ... అంటూ బోరున ఏడవడం మొదలెట్టింది.

నా ఆవేశం కూడ తగ్గింది.మామూలు మనిషినయ్యాను.

'చాల్లే'..... ఇక చాలు జరిగిందంతా. ఇంకా సిగ్గు లేకుండా వాడికి 'సారీ' చెబుతానంటున్నావు!

చిన్న పిల్లాడు వాడికి 'సారీ' చెప్పి ఇంకా చిన్నబుచ్చుకోవద్దు. వాడిని దీని గురించి ఇంకా ఆలోచింప చేయవద్దు.

నీకింకా బుద్ధి రాలేదు...అన్నాను అనునయంగా, నవ్వుతూ.

'నా కసలు బుద్ధి ఉంటేగా'? అంది శాలిని.

ఇదండీ కధ. మంచీ, చెడు విడి విడిగా వుండవండీ ఎక్కడా. రెండు మనలోనే వుంటాయి. మన ప్రవర్తనే మన మంచికి, చెడుకీ

గీటురాయి. పిల్లల ముందు మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడితే అదే వాళ్ళలో నాటుకుంటుంది. 'చెడు' అయితే చాలా త్వరగా అంటుకుంటుంది. పెద్దవాళ్ళం గమనిస్తూ వుండాలి. పిల్లలందరూ ఒకలా వుండరు. కొందరు బయట పడతారు. బయట పడని వాళ్ళతో, సున్నిత మనస్కులతో చాల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి విషయాల్లో సరైన సమయంలో వారి మనసులో వుండే 'భూతాన్ని' తరిమేయాలి. లేదా తరువాత చింతించినా, వగచినా ఫలితముండదు. తల్లిని మించిన 'శిల్పి' ప్రపంచంలో ఎక్కడా లేదు. తల్లి ఎలా చెక్కుతే ఆ బొమ్మ అలా తయారవుతుంది. ప్రపంచంలో మంచి పౌరులను ఏ దేశానికైనా అందించే భారం ఎప్పుడూ ఈ 'శిల్పు' లదే !

note: ఇది నా స్వానుభవం. పాత్రల పేర్లు మాత్రం మార్చడం జరిగింది.

రచన:-

కేశిరాజు రజని.