లేబుళ్లు

30, జులై 2014, బుధవారం

కొండ


                                                         కొండ
                                                -----------------------
దాదాపు రాత్రి  రెండు గంటలవుతోంది. రేపు శలవు కదాని కొద్దిగా ఎక్కువ సేపు చదువుకొని ఇప్పుడే  పడుకున్నాను. ఇంతలో ఇంటి వెనకాల ఉన్న మా చేద భావినుంచి  'దబ్బు' మని  ఏదో పడ్డ శబ్దం. దానితో పాటు భావిలోగూటిలో ఉన్న పావురాలు భావిలోనే ఎగురుతున్న శబ్దం.
ఊళ్ళో విపరీతంగా దొంగతనాలు. ఎందుకైనా మంచిదని నాన్నగారిని కుడా లేపి ఇంటి వెనకాల లైట్స్ వేసి ఇద్దరం దొడ్లోకి వెళ్ళాము. భావిలో ఇంకా పావురాలు విపరీతంగా ఎగురుతున్న శబ్దం వస్తూనే వుంది. టార్చిలైట్ భావి లోకి ఫోకస్ చేశాను.
లైట్ కాంతి కన్పించే సరికి పావురాలు రెండు పైకి ఎగిరి బయటకి వచ్చేశాయి.
భావిలో నీళ్లు ఏదో పెద్ద వస్తువు పడ్డట్లుగా అలలతో కల్లోలంగా వుంది.
టార్చిలైట్ తో భావిలో అన్ని పక్కలా చూశాను. ఒక పక్కన కొద్ది ఒడ్డు పట్టుకుని చెయ్యి ఊపుతూ 'సార్ , సార్' రక్షించండి. భావి చాలా లోతుగా వుంది. తాడు వెయ్యండి'.
వాడి మాటలు ప్రతిధ్వనిస్తూ వినిపించాయి.
నాన్నగారు నేను బిత్తర పోయాం.
'అసలు ఎవడు వాడు ?  దొంగా? అయితే భావిలో ఎందుకు పడ్డాడు'? అంతా అయోమయంగా వుంది అనుకుంటూ 'ఎవరినన్నా పిలుద్దాం నాన్నా' అన్నాను నేను.
ముందు చేంతాడు వెయ్యి భావిలో. వాడు చస్తే మన చావుకొస్తుంది అన్నారు  నాన్నగారు.
నాకేమి అర్ధం కాలేదు. గబగబా భావిలోకి తాడు వదిలాను.
వాడు ఇటు పక్కకి కొద్దిగా ఈది తాడు పట్టు కున్నాడు.
చేంతాడు అంతా బలంగా లేదు నాన్నగారూ! వెళ్లి మోకు తెస్తాను. ఈ తాడు తెగితే వాడు మళ్ళీ  పడి చస్తాడు.
ఆ తాడు పైన ముడి వేసి పరుగెత్తి వెళ్లి మోకు తెచ్చి పైన కట్టి భావి లోకి వదిలాను.
రెండు తాళ్ళు జత చేసి  మెలిక వేశాను. వాడు మెల్లగా పైకి వచ్చిఒక్కసారిగా భావి అంచు మీదనుంచి దూకి పరుగు లంకించు కున్నాడు. నేను ధైర్యం చేసి ఒక్క ఉదుటున  పరుగెత్తి పట్టుకున్నాను వాడిని. వాడు గింజు  కుంటున్నాడు. లైట్ కాంతి లో వాడి ముఖం చక్కగా కనిపించింది.
నాన్నగారూ, వీడు 'కొండ' గాడు. ఈసారి బిత్తర పోవడం నాన్నగారి వంతు అయింది.
వాణ్ని లాక్కుని వరండా లోకి వచ్చాము.వాడు నిక్కరు నుంచి నీళ్లు  ఒడుస్తున్నాయి.
'ఏరా కొండా', భావిలోకి ఈవేళ  ఎందుకు దిగావు ? మేం రాక పోతే చచ్చేవాడివి గదరా 'గాడిద కొడకా' అన్నారు నాన్నగారు.
'మాట్లాడవేం? నాలుగు తగిలించ మంటావా'? కోపంగా లేచారు నాన్నగారు.
వాడు తలెత్తడం లేదు. చేతులు కట్టు కున్నాడు.
నేను లేచి నాన్నగారిని కూర్చో బెట్టి 'చెప్పరా'? మాట్లాడు. రెట్టించాను నేను.
మీకు తెలుసు గదండి అయ్యగారూ, మానాయనకి పక్ష వాతమని.
'పావురం ఇంటిలో పెంచుతే 'వాతం' నయమైతదని ఎవరోఅంటే ఇన్నాను.
చీకట్లో వాటికి కళ్ళు కన్పించవు కదా సులువుగా పట్టుకోవచ్చనుకొని భావిలోకి దిగాను. పావురాలని పట్టుకెళ దామని....పాడు పావురాలు చీకట్లోముఖం మీద తన్నినై. అందుకే పట్టు తప్పి భావిలో పడ్డ నయ్యా!
మిమ్ముల్ని ఆడుగుతే ఇవ్వరని, పావురాల్ని పట్టుకోనివ్వరని,అర్థరాత్రి భావిలో దిగి
ఇట్టాపట్టు బడ్డనయ్య. తప్పయింది.అంటు ఏడుపు లంకించుకున్నాడు 'కొండ'.
'పిచ్చి ముండా కొడకా' చచ్చే వాడివికదా! పదా, అన్నారు, నాన్నగారు లేస్తూ .
'ఈరాత్రి వేళ మీరెక్కడికి నాన్నగారూ'? అన్నాను నేను
'వీణ్ణి ఈవేషంలోనే తల్లి కి చూపించి రావాలి' అని బయలుదేరారు.
 'నేనూ వస్తాను' అని తలుపులు బయటనుంచి వేసి బయలు దేరాం.
'అయ్యా, బాయి వెనకాల చొక్కా వుందయ్యా, తెచ్చుకుంటా' అని పరుగెత్తాడు కొండ.
'అది అక్కడే  వుండనియ్యి. వాణ్ని లాక్కుని రా వెధవని' అంటూనే బయదేరారు నాన్నగారు.
నాన్నగారి వెంట నేను, వాడు వాళ్ళింటికి  వెళ్ళాం.
కొండ తలుపు కొట్టాడు.
తల్లి తలుపు తీసి, కొండను, నన్ను, నాన్నగారిని చూసి కంగారు పడింది.
కొడుకుని తడి నిక్కరుతో చూసింది.
"ఏరా అయ్యగారి భావిలో దిగినవా"?  వద్దని చిలక్కి చెప్పినట్లు చెప్పిన గదరా....అంటూనే రెండు చెంపలు వాయించింది" సీతమ్మ.
'ఏం దయ్యగారు…ఇయ్యాల టప్పుడు మీరు ఇట్లా వచ్చింరు' ? అంది సీతమ్మ.
నాన్నకి నాకు అంతా అయోమయం. నాన్న గారు కోపం అపులేకపోయారు.
అంటే  వీడు నీకు తెలిసే వచ్చాడా?  బుద్ధుందా అసలు.
పావురం  కోసం  అర్దరాత్రి భావిలో దింపుతావా? వాడు మునిగి చస్తే?
బిత్తరచూపులు చూసింది ...సీతమ్మ!
'పావురాలేంది అయ్యగారూ'నాకు అర్ధం కావట్లే అంది సీతమ్మ.
'అదేంటే ? తండ్రికి పక్ష వాతం కదా. పావురాన్ని ఇంట్లో పెంచుతే పక్ష వాతం తగ్గు తుందని ఎవరో చెప్పారని చెప్పాడే వాడు అన్నారు నాన్నగారు.
నన్ను అడిగితే కాదంటా నని అర్దరాత్రి భావిలో దిగాడు వాటిని పట్టుకుందామని .....
"అయ్యో...కాదయ్యగారు....అందుకు కాదు వాడు భావిలో దిగింది. ఏడుస్తూ అంది" సీతమ్మ.
విస్తుబోయి  నాన్నగారి వంక చూశాను నేను..నాన్నగారి పరిస్థితి కూడ అలాగే వుంది.
'కొండ' దిగ్గున ఒక్కసారి గా ముందుకు వచ్చి "అయ్య గారు నిద్రలో లేచింది...రాత్రి కొద్దిగా తాగింది కూడ...ఏదేదో మాట్లాడుతోంది అమ్మ " అంటూనే
తప్పయి పోయింది ....చమించండయ్యా...అంటూ నాన్నగారి కాళ్ళుపట్టుకున్నాడు 'కొండ'.
"వెధవ తాగినట్లున్నాడు...ఇందాకట్నుంచీ అందుకే నోరు విప్పలే.. అన్నారు నాన్నగారు వెనక్కి జరుగుతూ.
"అయ్యా నేను రేపు చెపుతా ఈడు ఎందుకు భావిలో దిగాడో", ఇప్పుడు  మీ రెల్లండి' అంది సీతమ్మ ఏడుస్తూనే కొడుకుని ఉరిమి చూస్తూ.
"సరే, పదరా వెళదాం. రేపు చూద్దాం ఈ వెధవ సంగతి." అన్నారు నాన్నగారు ఇంటికి నడుస్తూ.
'పావురం కాకపొతే వీడెందుకు భావిలో దిగినట్లు'?..'పావురం కాదురా, ఇంకేదో వుంది.
వాడేదో దొంగతనానికి వచ్చి ఏదైనా అలికిడి వల్ల భావిలో దిగాడా? ఎందుకు దిగినట్లు?
భావిలో బిందె గాని, వెండి వస్తువులు గాని ఏమైనా పడిపోయాయా కనుక్కో"అన్నారు నాన్నగారు..  '.అయినా సీతాలు రేపు చేపుతానందిగా'...నడువు అన్నారు నాన్నగారు వడిగా అడుగులు వేస్తూ.
ఇంటికెళ్ళే టప్పటికి మూడున్నర అయింది. అమ్మ లేచే వుంది. ఏమిటీ ? ఏమయింది? 'అర్దరాత్రి ఎక్కడికి వెళ్ళారు, తండ్రీ, కొడుకు'!
'తలుపులు కూడా సరిగ్గా వేయలేదు. గేదెలు గాని మళ్ళీ విడిపించుకున్నాయా?
మొక్కలన్నీ తోక్కేశాయా? ఎన్ని సార్లు చెప్పినా వాటికి ఇనుప గొలుసులు  తేరు.
మొక్కలన్నీ ధ్వసం'. అమ్మ గొణుక్కుంటూనే పడుకుంది.
'నువ్వు కూడ వెళ్లి పడుకోరా రాత్రి చాలా సేపు చదివినట్లున్నావుగా', అన్నారు నాన్నగారు.
పడుకున్నానే గాని నిద్ర రాలేదు. సీతమ్మ మీదే ధ్యాస అంతా.ఇంటిల్లి పాదికీ తలలో నాలుకలా వుంటుంది.
నేను పుట్టక ముందు నుంచి పనిచేస్తోంది ఇంట్లో అన్నలు, అక్కలు, మా చుట్టాలు, అంతెందుకు,బావలందరూ కూడ
చాలా అభి మానిస్తారు తనని. ఈ ఇంట్లో పని మనిషి గా ఎప్పుడు అనుకోలేదు తనని.
అమ్మ కూడా పల్లెత్తు మాట అనదు.
'కొడుకని కుడా చూడకుండా వాడు పావురానికి కాదు, వచ్చింది' అని చెప్పింది.
వెధవ 'కొండ' గాడు కూడా ఈ ఇంట్లో మనిషిలానే ఉంటాడు. నాకు వాడికి వయసులో అయిదు నెలల తేడా అని సీతమ్మ చెపుతూ వుంటుంది. వాణ్ని చదువుకొమ్మని నాన్నగారు చాలా ప్రోత్సహించారు. కానీ వాడికి చదువు అబ్బ లేదు. ఆరో తరగతి మధ్యలో  మానేశాడు.
ఇంట్లో అందరి దగ్గరా చనువు వాడికి. ఒకళ్ళకి తెలీకుండా అందరి దగ్గరా కొద్దో , గొప్పో డబ్బులు తీసుకుంటూనే ఉంటాడు. సోమరి వెధవ. ఈ మధ్య  వెధవకి
వ్యసనాలు కూడ అలవాటు  అయినట్లుంది. ఈమధ్య రెండు, మూడు సార్లు అయిదు,
పదీ కనపడలేదనీ అమ్మా అందీ, నా రూములో కూడ కొద్దిగా డబ్బులు మిస్సయినట్లు అనుమానం వచ్చింది. వెధవ పాడయ్యాడు.
వాడి తండ్రికి మందులు కూడా చాలా వరకు మాఇంటి నుంచే వెళ్తాయి.
ఒకసారి దీపావళి పండక్కి బావలు, అక్కలు,అన్నలు అందరు వచ్చారు.
వదిన నా  షర్టు గుండీ కుట్టి సూది వాడి చేతికిచ్చి కేలండర్ కి గుచ్చమంది.
'కొండ'గాడు వెళ్లి సూదిని  పవర్ సాకెట్ లో పెట్టాడు. కరెంటు షాక్కి వచ్చి మా బావగారి వొళ్ళో పడ్డాడు. అందరం ఒకటే నవ్వు కున్నాము.
ఏమయిందిరా అంటే 'దిమ్మ తిరిగింది,తరువాత ఏమయిందో తెలవదు.బావగారి ఒళ్ళో ఎట్టా పడ్డానో తెలీదు' అన్నాడు.
అది గుర్తు వచ్చినప్పుడల్లా అందరం పడీ,పడీ నవ్వు కుంటాం.
అలాంటి అమాయకపు వెధవ ఇలా తయారయ్యాడు అనుకుంటూ నిద్రకు కుపక్రమించాను.
తెల్లారింది.
నేను వేప పుల్ల నోట్లో వేసుకుని వాకిట్లోనే  వున్నా. సీతమ్మ వచ్చి తలెత్తకుండా వాకిలి వూడవడం మొద లెట్టింది. ఇంతలో నాన్నగారు కాఫీ  కప్పుతో వరండా లోకి వచ్చి" ఏమే' సీతాలు' రాత్రి ఏదో అంటివి.వాడు పావురాయి కోసం కాదా భావిలో దిగింది" మరి దేని కోసం ? అన్నారు , నాన్నగారు.,' ఏందో నయ్యా రాత్రి నిద్రలో  ఏం మాట్లాడానో, ఏందో ! వాడు పావురాయి'  కోసమే వచ్చిండటయ్యా'! అంది తల వంచుకుని వాకిలి ఊడుస్తూనే.
తను నిజం చెప్పడం లేదని ఏదో ఒత్తిడిలో వుందని సీతాలు ముఖ కవలికలే చెబు తున్నాయి. 'సరేలే వాడు జాగ్రత్త. వెధవ చేతికందకుండా పోయేటట్లు న్నాడు.
వాణ్ని ఒక కంట కనిపెడుతూ వుండు'అన్నారు నాన్నగారు లోపలి కి వెళ్తూ.
ఇంతలో పక్కింటావిడ గోడ మీద నుంచి పిలుస్తూ " ఏంటి కిట్టయ్య గారు రాత్రి గొడవ" అంది.
'కొండ'  రాత్రి పావురం కోసం భావిలో దిగాడు. 'అట్టానే అనుకోండి కిట్టయ్య గారు, ఎప్పుడో వాడు మీ ఇంటికో,మా ఇంటికో కన్నం వేసిందాక' అంది పక్కింటావిడ వెటకారంగా.
"అదేందమ్మా అట్లంటారు వాడేం చేశాడమ్మా" అంది సీతాలు.
సీతాల్తో మాట్లాడకుండా "ఇదిగో కిట్టయ్య గారు మొన్న మీరు  వూరు వెళ్లి నప్పుడు మీ పాత రేకులు వాడు సర్దు తుంటే చూశాను. తరువాత మీ అమ్మగారు వూరి నుంచి వచ్చాక రేకులు పోయినై, పాతవే నని పట్టించుకోలేదని" అన్నారు.
రాత్రి 'కొండ' భావి లో పావురాల్లకోసమే దిగాడంటే నేను నమ్మను. సరిగ్గా కనుక్కోండి' అంటూ వెళ్లినా ఆవిడ మాటలు విన్న నాకు అసలీ సంగతేమిటో తేల్చాలి అన్న భావన గట్టిగా స్థిరపడింది నామదిలో.
సీతాలు  తల ఎత్తకుండా పనిచేసు కుంటూనే  వుంది. వెధవ వాడి మూలాన్న సీతమ్మ మాట పడాల్సి వస్తోంది ఆనుకున్నా నేను. ఇంతలో నాన్నగారు  'కృష్ణా' ఇలారా! అన్నారు.
నేను నోట్లో వేప పుల్ల తీసి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను.
'సీతమ్మని  నువ్వు గాని ,అమ్మ గాని ఎవరూ ఏమి అడగొద్దు. దానంతట అది ఏమైనా చెపుతే నాకు చెప్పండి. మళ్ళీ చెపుతున్నా దాన్ని ఎవరూ ఏమీ అడగకండి.అమ్మకు కుడా చెప్పు' అన్నారు నాన్నగారు. అదీ దాని మీద మా అందరికి ఉన్న అభి మానం. వారం, పది రోజులయ్యాయి.
కొండ గాడు మళ్ళీ  కన్పించ లేదు. నాన్న  గారు మాత్రం వాడికి దగ్గర పట్టణం లో ఏదైనా వుద్యోగం వేయిద్దామని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుసు. దాదాపు నెల రోజుల తరు వాత అనుకుంటా నాన్న గారు పొలంలో నాట్లు. నువ్వు కూడా   పొలానికి రమ్మని చెప్పి ఉదయమే వెళ్ళారు. నేను నాన్నగారికి టిఫెన్ తీసుకుని తొమ్మిది గంటలకల్లా పొలానికి వెళ్ళాను. కొండ గాడు నారు కట్టలు అందిస్తూ, కుదప తొక్కుతూ పై పనులు చేస్తూ కన్పించాడు. ఎప్పుడు వస పిట్టలా వాగే వెధవ నావంకే సరిగ్గా చూడ్డం లేదు.' ఏరా కొండా  ఆరోజు నుంచి కనిపించడం మానేశావు   ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు'? అనడిగాను వాణ్ని.' అదేంటి కిట్టయ్య గారూ, నాన్న గారు చెప్పా లేదా! అయ్య గారు పట్నంలో
ఉద్యోగం వేయించారు. టెంపరవరి.  1500 /- జీతం కిట్టయ్య గారు.బుద్ధి వచ్చింది. చేరి కూడా పది రోజులయింది.
అయ్యగారు ఇవాళ కూలి కి రమ్మన్నారు. వచ్చినా' అన్నాడు హుషారుగా కొండ.
'సరేలే...పని చూసుకో' అని నాన్న గారికి   టిఫెన్ ఇస్తే  వద్దన్నారు. ఇంటికెళ్ళి స్నానం చేసి వస్తానన్నారు. సరే నాన్నగారూ..స్నానం చేసి,  భోజనం కూడా చేసి వచ్చేయండి  నేను ఇక్కడే వుంటాను,అన్నాను.'నాన్నగారు ఇంటికి వెళ్ళారు. ఇక నేను వాడితో కలిసి పని మొదలెట్టాను. ఎలా అయినా సరే ఆరోజు సంగతి ఇప్పుడు తేల్చాల్సిందే,  అనుకున్నా. దాదాపు పన్నెండు అయింది టైం.
కూలీ లంత భోజనాలు చేస్తున్నారు. నా దగ్గర టిఫెన్ తీసి తినడం మొదలెట్టా. కొండ గాడిని కూడ పిలిచా.
'ఏందీ కిట్టయ్య గారు టిఫెన్'? అన్నాడు కొండ. ఇడ్లీ ,దోస రెండు వున్నాయి రా...తిందాం." అన్నాను నేను.
ఎలాగయి నా సరే వాడి దగ్గరనుంచి ఆ రోజు విషయం లగాల్సిందే అనుకున్నా.
వాడు దగ్గరకొచ్చి కూర్చున్నాడు.
ఇద్దరం టిఫెన్ తినడం మొదలెట్టాం. నేను ఎలా మొదలు పెట్టాలి టాపిక్ అని ఆలోచిస్తున్నా.
"కిట్టయ్య గారూ, ఎందుకంత ఆలోచిస్తారు. మీకు కావలసింది ఆరోజు నేను భావిలో ఎందుకు దిగానని కదా"! ఇదుగోండి, వినుకోండి.నేను భావిలో దిగిన రోజు రెండు రోజుల ముందు మీపిన్ని గారు వచ్చారు కదా.
ఆవిడ రెండు రోజులు వున్నారుకదా.ఆవిడ బాగా నగలేసుకొచ్చారు.అమ్మగారు ఎందుకె ఇన్ని నగలేసుకోచ్చావు? అనడిగారు
అప్పుడు నేను అక్కడే వున్నాను. అమ్మగారు పిన్నిగారితో అసలే ఈ వూళ్ళో దొంగలు కదనే.జాగ్రత్త, ఎక్కడ దాస్తావు ఈ రెండు రోజులు? అనడిగారు అమ్మగారు.
'నీకెందుకే భయం. నానగలు, నేను ఎక్కడయినా దాచుకుంటాను. అదేనే ఎక్కడ దాస్తావు'? అని అమ్మగారు మళ్ళీ అడిగారు. "అబ్బా నీ భయం పాడుగాను. కంగారు పడకు. వాటిని ఒక ఇనుప తీగకు చుట్టి ప్లాస్టిక్ సంచిలో వుంచి మీ భావి లో వేశేశాను, దాచేశాను". అన్నారు మీ పిన్ని గారు."ఆ, అయ్యో..అయ్యో.. మళ్ళీ వాటిని ఎట్లా తీస్తావే? ఏమిటో ఈ పిల్ల అఘాయిత్యం"  ఏమండీ... అంటూ అమ్మగారు లోనికి వెళ్ళారు. పిన్ని గారేమో పగలబడి నవ్వుతు,
ఏరా 'కొండా' మీ అమ్మగారికి ఇంతా భయమేమిటి రా"? అన్నారు.
అబ్బ, భలే చాన్సులే అప్పుడే మనసులో అనుకున్నాను.
ఎలాగయినా సరే ఆ నగల్ని భావిలోనుంచి తీసి అమ్ముకుందా మనుకున్నాను.
వెంటనే నేను చేతిలో పని ఆపు చేసి భావి లోకి  తొంగి చూస్తుంటే అమ్మగారు, ఏం చేస్తున్నావురా అక్కడ అని గద్దించారు కూడా!  అదీ సంగతి… ఆ నగల కోసం దిగాను భావిలో. వెతికి,వెతికీ చచ్చాను. అసలు మీ పిన్ని గారు నగల్ని భావిలో వేయలేదు.
ఆవిడ ఎక్కడో దాచి అమ్మగార్ని నవ్వులాట  పట్టిస్తుంటే నేను నిజమే అనుకున్నాను.
బుద్ధి వచ్చింది కిట్టయ్య గారు.మళ్ళీ జన్మలో దొంగతనం గురించి ఆలోచన గూడా చేయను. అయినా దేవుడి లాంటి అయ్యగారింట్లో నే దొంగతనం చెయ్యాలనుకున్నా.చాలా తప్పు చేసినాను కిట్టయ్యగారు.
అమ్మ ఈ విషయం అయ్యగారికి చెప్పి చమించమని కాళ్ళు పట్టుకోమంది.లేకుంటే చస్తానని కూడ అన్నది. చమించండి. అయ్యగారికి, అమ్మగారికి చెప్పండి. నాకు అయ్యగారికి చెప్పే ధైర్నం లేదు. ఎంత పెద్ద మనసో అయ్యగారిది. ఇంకొక్క విషయం కిట్టయ్య గారు...అక్కలకి, అన్నలకి ఎవరికీ ఈ విషయం మాత్రం చెప్పొద్దు. నా పరువు పోద్ది.మళ్ళీ ఒక్క పైసా కూడ రాలదు.
వెధవ నీ బుద్ధి మారదురా అనుకున్నా.అయినా సరే వాడి మీద నాకు, కోపం గాని,అసహ్యం కాని కలగలేదు.ఇదంతా సీతమ్మ మీద మా కున్న అభిమానం.
ఇక చూడండి.......నాకు నవ్వు ఆగలేదు.ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి...ఎప్పుడు అందరికి చెప్పాలి, అన్న ధ్యాసలో పడ్డాను. ఈ విషయం గుర్తు కొచ్చినప్పుడల్లా అందరం తెగ నవ్వు కునే వాళ్ళం. సీతమ్మకూడా మాతో కలిసి నవ్వు కునేది.

కేశిరాజు వెంకట వరదయ్య.