లేబుళ్లు

13, జులై 2012, శుక్రవారం

ఎడ్లబండి

                                                                ఎడ్లబండి 
                                                           ------------------
                ( ఈ కధ  'తెలుగు వెలుగు'  జులై నెల మాసపత్రిక లో ప్రచురింపబడినది )

             సూర్యాస్తమయానికి ఇంకా నాలుగయిదు నిమిషాలున్నట్లుంది. కనుమరుగవుతున్న సూర్యకాంతి,  ముసురుకుంటున్నచీకటి కలసి 'సంధ్యవేళకు' పురుడుపోస్తున్నట్లుగా ఉంది. సోమయ్య గారి ఇంట్లో పెద్దరావి చెట్టు మీదకు పక్షులు గూళ్ళకు  చేరుతున్నాయి. గూళ్ళలో ఉన్నపక్షి పిల్లలు ఆరోజు చివరి బుక్క ఆహారం కోసం నోళ్ళు తెరిచి ఆరాటపడుతున్నాయి. బజార్లో దుమ్ములేపుకుంటూ ఒకదాన్నొకటి నెట్టుకుంటూ గేదెల మందలు  గుంపులు గుంపులుగా ఇండ్లకు చేరుతున్నాయి. లక్ష్మయ్య గోలిసోడా బండి కిర్రు కిర్రు లాడుతూ భారంగా వెళుతోంది. పక్క వీధిలో రాజగోపాలస్వామి గుళ్ళోగంటలు వినబడుతున్నాయి. పైన పెద్దపక్షులు తిరిగేవేళని  చంటి పిల్లల్నితల్లులు ఇళ్ళ లోకి తీసుకువెళ్తున్నారు. అప్పుడే వేసిన వీధి దీపాలు లో వోల్టేజితో మిణుకు మిణుకుమని వెలుగుతున్నాయి.లక్ష్మీకాంతయ్యగారు ఆరుబయట అరుగుమీద కూర్చున్నారు.
ఆ రోజు లక్ష్మీకాంతయ్యగారు అరుగుమీదకు  వస్తూ నాలుగేళ్ల మనవణ్ణి ఎత్తుకుని వచ్చితన పక్కనే
కూర్చోబెట్టుకున్నారు. నీలపురంగు చెక్స్ షర్ట్, జీన్స్ నిక్కరు వేసుకుని   తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేట్లు ఉన్నాడు. అరుగు మీద నుంచి కాళ్ళు   కిందకు జార్చి కాళ్ళు ఊపుతూ తాతగారితో ఏవో కబుర్లు ముద్దు ముద్దుగా  చెబుతూవున్నాడు. సాధారణంగా లక్ష్మికాంతయ్యగారు అరుగు మీద కూర్చునే 'టైం' అది.
ఆయన అక్కడ కూర్చున్నారంటే కచ్చితంగా సాయంత్రం ఆరుగంటలయిందన్నమాట. అప్పటినుంచి దాదాపు గంటసేపు అక్కడే కూర్చుంటారు. ఆ సంగతి ఆవూరి వారందరికీ తెలుసు. ఆయన వయస్సు దాదాపు 65 సంవత్సరాలుంటాయి. ఊరివారంతా  చనువుగా, గౌరవంగా'కాంతయ్య' గారూ అని  పలకరిస్తుంటారు ఆవూరి జనం ఎవరికైనా స్వంత విషయాల్లో కానీ, ఏదైనా వ్యవహారంలో కానీ  సలహా,సంప్రదింపులు కావాలంటే  ఆయన ఈ అరుగుమీద కూర్చున్నప్పుడు వారొచ్చివిషయం చెప్పుకుంటారు. వారికి సలహా ఇవ్వడమో లేక అవసరమైతే ఏదైనా వ్రాత కోతలుంటే ఉదయం ఇంటికి రమ్మని వారిపనేదో కానిస్తారు. అందుకు  ప్రతిఫలంగా వారు ఏదిచ్చినా స్వీకరిస్తారు. వారిచ్చే తృణమో, ఫలమో, ధనమో
ఏదైనా సరే వూరిలో దిక్కులేని వృద్ధులకో, ఏ చేతగాని వికలాంగులకో చేరిపోతుంది.
వారిదో చిన్నవూరు. దాదాపు అయిదు వేలవరకు జనాభా.
వూళ్ళో అందరికి ఆయన అన్నా, వారి కుటుంబమన్నాఓ ప్రత్యేక అభిమానం.
పేదలంటే ఆయనకు ఎందుకో అమిత అభిమానం. ఏదైనా కష్ట మొచ్చిందంటే వారికి ముందు గుర్తు వచ్చేది
ఆయనే ! ఊరికి ఏసమస్య వచ్చినా ఊరి పెద్దలు ఆయన్నిసంప్రదించకుండా ఏమీనిర్ణయాలు తీసుకోరు.
ఆయన్నిఆవూరికి 'సర్పంచి' చేయాలన్నఆవూరి జనం కోరిక మాత్రం తీరలేదు.
వారెంత ప్రయత్నించినా ఆయన మాత్రం రాజకీయాల్లోకి రానని తెగేసి చెప్పారు.
ఇవాళ మనవడితో వచ్చి అరుగుమీద కూర్చున్నారు కాని ఆయన ముఖం అంత ప్రసన్నంగాలేదు.
చూస్తేనే తెలుస్తోంది. ఏదో తనలోతానే మదనపడుతున్నారు. గోడకు జారి అరుగుమీద పరధ్యాన్నంగా మనవడి భుజంమీద చేయివేసి కూర్చున్న ఆయన ఎడ్లబండి గురవయ్య వచ్చి రెండుచేతులు కట్టుకుని
నిలబడడం, కాంతయ్యగారి దృష్టి  తన  మీద పడకపోవడంతో అలాగే ఆయన పలకరించేంత వరకు
ఓపిగ్గా అలాగే నిలబడ్డాడు. దాదాపు అయిదు నిముషాలదాక అలాగే నిలబడిన  గురవయ్య కూడా తనలో తాను ఏదో ఆలోచిస్తూ ఏమారి పోయాడు. కాంతయ్య గారు గురవయ్య వచ్చినిలబడటం గమనించి  'ఏం గురవయ్యాఇలాగొచ్చావేంటి' ? లేచి అరుగుమీద గొంతి క్కూర్చుని సాదరంగా అడిగారు.
పరధ్యానంగా ఉన్న గురవయ్య తను ప్రస్తావించదలుచుకున్నవిషయం ఎలా మొదలెట్టాలో తెలీక నీళ్ళు
నములుతూ నిలబడ్డాడు. గురవయ్య ఏదో చెప్పదలుచుకుని చెప్పడానికి సంశయిస్తున్నాడని గ్రహించి  " ఏరా....గురవా...ఇంట్లో అంతా బాగున్నారా? ఏమైనా డబ్బులు కావాలా? ఏమిటి విషయం. చెబుతేనే గదా తెలిసేది ? ఇక్కడదాకా వచ్చి చెప్పడానికి ఏమిటిరా  అనుమానం?  ఏం  కష్టం వచ్చింది?" "పెద్దపిల్ల కాపురానికి పోయింది గదా? సుఖంగా ఉందా, ఏదైనా కష్టం వచ్చిందా"? అన్నారు కాంతయ్య.  గురవయ్య చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి వాడి మనసెరిగి ఆరా తీయడం మొదలెట్టారు లక్ష్మీకాంతయ్య గారు.
అసలు వచ్చిన సంగతేమి  చెప్పకుండా... ''పెద్దబ్బాయి గారొచ్చారా అయ్యా'' అని అడిగి  కాంతయ్యగారు  సమాధానం ఇవ్వకముందే ''ఏం... చిన బాబూ నీ పేరేంది?' పెద్దయ్యాక బాగా చదువుకొని తాతయ్యను 'అమెరికా' తీసుకుపోతవా?" అంటూ చిన్నబాబుని పలకరించి,
కాంతయ్య గారడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ''అయ్యా పిల్లకేం బాగుంది...డబ్బు కూడా ఆవసరంలేదయ్యా, విషయం ఎట్లాచెప్పాలోఅర్ధగావడంలేదు. మీకు తెలుసు నాకు 'జత' ఎడ్లు వుండే. వాటిలో ఒకటి పెద్దదయి పనిలో తొందరగా అలసిపోయి  పనికి అడ్డంకులు వస్తుండె. ఎప్పుడులేనిది  మాటఇచ్చిన వారిని ఇబ్బ్బంది పెడుతుంటిని, ఇటుచూస్తే ఎద్దు ముసలిదయింది.జీవితం అంతా కష్టం చేసి నా ఇంటి బాగుకే దాని రక్తం ధారపోసింది. ఇప్పుడు వయసు  మీద బడ్డది  కదా! దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కొద్దిగా విశ్రాంతి ఇద్దామని ఇంకొక ఎద్దుని పక్కవూరి నుంచి
కొనుక్కుని వచ్చి బండి నడిపిస్తుంటిని. ఎద్దుని కొనుక్కొచ్చిన వారానికే 'ప్రెసిడెంటు' గారి ఎద్దు ఒకటి చనిపోయిందని  నా కొత్త  ఎద్దు రెండురోజులకి  కావాలని, దుక్కి దున్ని తిరిగి ఇస్తానని తోలుకుపోయి ఇప్పటికి నెల రోజులపైన  అయింది .... ఎన్నిసార్లడిగినా ఇవాళ, రేపు అని ఎద్దుని మాత్రం తిరిగి తోలలేదు .... నాఎద్దు వాళ్ళ ఎద్దుకి  జత కలిసి రెండో దానితో బాగా మాలిమి అయ్యిందని దాన్ని అక్కడే వదిలేసి  ఐదువేలో, ఆరువేలో  డబ్బు తీసుకెళ్ళమని ఆయన పాలేరు 'లింగయ్య'తో.' కబురుచేసింరయ్యా ప్రెసిడెంటు గారు ... ఇది ఆయనకు పుట్టిన బుద్ధి కాదయ్యా. ఆడు 'పాలేరు 'లింగయ్య' ఆ'ఎద్దు'ని  మాఅయ్యగారికి ఇయ్యరాదే" అంటూ నన్ను రెండు మూడుసార్లు   అడిగిండయ్యా ! నేను  ఇవ్వనని చెప్పినానయ్యా. వాడి ' పెళ్ళాం ' వైస్ ప్రెసిడెంటు' అని వాడికి బాగా గీర బాబూ. ఆఎద్దుని నేనే ఇరవై అయిదు వేల రూపాయలకు కొనుక్కోచ్చినానయ్యా... అదీ మా చెల్లె వాళ్ళదగ్గర. దాన్నివాళ్ళు వేరేవాళ్ళకి అమ్ముకుంటే ఇంకా ఎక్కువే వస్తదయ్యా !
ఇప్పుడు నేనేమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఆయన ఇచ్చేడబ్బువద్దు. ఆయనా వద్దు... నా ఎద్దుని తిరిగి ఇస్తే చాలు. ఐదువేలు తీసుకోపో...ఆరువేలు తీసుకపో...ఇంతకంటే మంచిది వస్తది. ఇంకో ఎద్దుని కొనుక్కోఅంటున్నారయ్యా. పెద్దోళ్ళు ఏం చేసినా చెల్లుద్ది. ఏం మాట్లడనివ్వడంలేదు, ప్రెసిడెంటు ఇంట్లోఉండి కూడా కలవడం లేదు. మాట్లాడట్లేదు. పైగా 'పెద్దాయనతో మాట్లాడేదేవుంది ఇందులో ? అయిదు వేలు కావాల్నా... ఆరువేలు కావాల్నా చెప్పుఇప్పిస్తా!' అంటున్నాడయ్యా లింగయ్య.... అదీ విషయం అయ్యా" అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు గురవయ్య.
"ఇన్నేళ్ళు ఆ తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి కోవెల దగ్గరికి ఎంతమందిని నాబండిలో తీసుకుపోయి వచ్చిన్నో ....ఆ సామి సాయం చేయక పోతాడా అని ఎదురు చూసీ,చూసీ ... ఏం పాలుబోక మీదగ్గరికొచ్చినా నయ్యా.
ఏం చెయ్యాలో చెప్పండయ్యా. మీరు తప్ప నాకు ఇక న్యాయం చేసే వేరే దిక్కు కనిపించలేదయ్యా అంటూ......కళ్ళలో నీళ్ళుసుడులు తిరుగుతుండగా గొంతు బొంగురు పోయి ఇక మాట్లాడలేక గొంతు మూగవోయింది గురవయ్యది. నెత్తిమీది తలకట్టు పాగా తువ్వాలు తీసుకుని కళ్ళు వత్తుకుంటూ ఇంకేదో చెప్పబోయి నోటమాట రాక ఊరుకుండి బోయాడు గురవయ్య.
కాంతయ్య గారికి గురవయ్య చెప్పిన విషయం పూర్తిగా అర్ధం అయింది.
విషయం చిన్నది కాదు. చాకచక్యంగా, సమయోచితంగా తేల్చవలసిన విషయం.
అని మనసులో అనుకుంటూ ''గురవయ్యానీ ఎద్దు తిరిగి నీ దగ్గరికి రావడానికి కొద్దిగా
సమయం  బడుతుంది. నువ్వు ఓపిక బట్టాలి. పెద్దవాళ్ళతో వ్యవహారం.....బెడిసిందంటే  మొదటికే మోసం వస్తుంది. ఈవిషయం ఇంకెవరితోను మాట్లాడవద్దు. నాదగ్గరికి వచ్చినట్లుగాని, నాకు ఈ విషయం చెప్పినట్లుగానీ ఎవరితోనూ..... చివరికి నీ భార్యతోకూడా చెప్పవద్దు. ఓ వారం పదిరోజులు ఈ విషయాన్నిపూర్తిగా మరిచిపో. అటు వెళ్లొద్దు. నీ ఎద్దు నీఇంటికి వచ్చేస్తుంది. ఏం భయపడకు...వెళ్లి నీ పనులు చూసుకో'' అని అభయమిచ్చిపంపించారు గురవయ్యని లక్ష్మీకాంతయ్యగారు.
గురవయ్యని అటు పంపించి మెల్లగా అరుగుమీద నుంచి దిగి మనవడి  వేలు పట్టుకుని మెల్లగా నడిపిస్తూ, మనవడు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతూ ఇంటికి  బయలుదేరారు కాంతయ్య గారు.
                                                       * * * * *
                  ఇంటికి  వెళ్లాడే గాని  గాని గురవయ్య మనసులో మనసు లేదు. మనసంతా చికాకుగా ఉంది. అనవసరంగా కాంతయ్య గారిని ఇబ్బంది పెట్టానేమోనని మనసు ఒకటే పీకుతోంది.
అసలే ఆ ప్రెసిడెంట్ మంచోడు కాదు. కాంతయ్యగారేమో ఊళ్ళో ఎవరికైనా, ఎవరివల్లయినా  అన్యాయమేమైనా
అయిందని తెలుస్తే చాలు ఊరుకునే మనిషి కాదు. ఆరు నూరయినా న్యాయం చేయకుండా ఉండే మనిషి కానే కాదు. ఇట్లాంటి విషయాల్లో ఆయన సొంత ఖర్చుకయినా వెనకాడే మనిషి కాదు. అట్లాగని పెద్ద కామందు కాదు. ఆయనకున్ననాలుగెకరాలతో పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడాయన. ఇప్పుడు నామూలంగా ప్రెసిడెంటు తో
కాంతయ్య గారికి  లేనిపోని గొడవ అవుతుందా అన్న భావన గురవయ్య మనసు తినేస్తోంది.
నావల్ల పదిమందికి సాయంచేసే  మంచిమనిషికి ఏదైనా చెడు జరుగుద్దేమో! అది వూరికి మంచిది గాదని  గురవయ్య  మనసు గింజుకులాడుతోంది. అందుకే గురవయ్య 'ఏమయితే అయింది.....ఎలాగయినానా బాధ నేనే పడతాను. ఆ పెద్దాయన్నిఎందుకు బాధపెట్టాలి.....ఉదయాన్నేవెళ్లి  కాంతయ్య గారిని కలిసి 'నాబాధ నేనేపడతాను' మీరు ఈ గొడవలో ఏమీ కలగచేసుకోకండి' అని చెపుదామని నిర్ణయించుకున్నాడు  గురవయ్య.  అప్పడికి గాని మనసు శాంతించలేదు.
                                                             *  *  *  *  *  *  *
                      
                   రెండురోజుల తరువాత కాంతయ్యగారు  పంచాయతి బోర్డ్ ఆఫీసు ముందుగా  వెళ్తూ
 నేను ఎక్కడ ఇబ్బందుల్లో పడతానన్నగురవయ్య ఆలోచన గురించి, అతని పెద్ద మనసు  గురించి ఆలోచిస్తూ నడుస్తున్న కాంతయ్య గారిని  పంచాయితీ  బోర్డ్ ఆఫీసు నుంచి బయటకు వస్తున్న సర్పంచి శివాజీ  గమనించి ''కాంతయ్య గారూ! నమస్కారం,
'బాగున్నారా'?  నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను. మీతో మాట్లాడే విషయమొకటి వచ్చింది. మీరు రాసిపెట్టిన అర్జీ వల్ల వూరికి మూడు మరుగుదొడ్లు మంజురయ్యాయి. వాటికి స్థలాలు ఎంపిక  చేయమని కలెక్టరు గారినుంచి లెటరు వచ్చింది. ఈ విషయంలోనే మీ సలహా తీసుకుందామని నేనే మీదగ్గరికి వద్దామనుకున్నాను. ఇంతలో మీరే కలిశారు.
''నా దృష్టిలో నాలుగయిదు స్థలాలు ఉన్నాయి. కట్ట అవతల నాది ఒక జాగా, వైస్ ప్రెసిడెంటుది కూడా ఊరవతల గుండ్ల చెరువు దగ్గర  కొద్దిగా సౌడు జాగా ఉందట. మీకు తీరిక ఉంటె వాటినే ఇప్పుడే చూసి  వద్దాం. ఏమంటారు కాంతయ్య గారూ?" అన్నాడు యధాలాపంగా ప్రెసిడెంటు శివాజీ.
కాంతయ్య గారికి ఆక్షణంలో  'వీళ్ళా' ప్రజాసేవకులు అనిపించింది. అయినా తనని తాను తమాయించుకుని
''మీకు పనికిరాని  మీ స్థలాలు అమ్ముకోవడానికి వచ్చిన అవకాశంలాఉంది ఈ వ్యవహారం....మీరు ఆ జాగాల్లో ఊరికి అంత దూరం లో మరుగుదొడ్లు ఎవరికోసం.. ఎందుకు కట్టడం? ఎవరికీ పనికిరావు. నువ్వు చెప్పిన స్థలాలు మరుగుదొడ్లకి  పనికిరావు.  వాటి సంగతి పూర్తిగా మరిచిపొండి'' అని నిర్మొహమాటంగాచెబుతూ, 
''శివాజీ!'ముందుగా వూరిలో ఏఏ వాడల్లో మరుగుదొడ్లు లేక జనం ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ మరీ అవసరమో నిర్ణయించుకుని ఆయాప్రదేశాల్లో పదిమంది మనుషుల్నిసంప్రదించి ముఖ్యంగా స్త్రీలను దృష్టిలో ఉంచుకుని వారికి ఎక్కడ సదుపాయంగా ఉంటుందో కనుక్కుని, ఆయావాడల్లో స్త్రీలకు సదుపాయంగా ఉండే స్థలాల్నిఎంపిక చేస్తే బావుంటుంది కాని....ఎక్కడో దూరాన ఎవరికీ పనికిరాని,ఆ సదుపాయానికి కొరగాని స్థలాలు పనికిరావు. నువ్వు,నీ మనుషులు, నేను వెళ్లి ఏదో స్థలాల్నిఎంపిక చేయడం సరైన పద్ధతి కాదు శివాజీ" అన్నారు కాంతయ్య గారు. 
'వ్యవహారం అడ్డం తిరిగింది. జనం దృష్టికి వెళ్తే 'ఛీ' కొడతారు'
అని మనసులో అనుకుంటూ ప్రెసిడెంటు శివాజీ వెంటనే 'ప్లేటు' మార్చి''కాంతయ్యగారూ, అర్ధమయింది, పని చిన్నదా, పెద్దదా అన్నది కాదు ముఖ్యం. అందునా జనహితానికి  ఏంచేయాలో క్షణంలో చెప్పారు. జనాభీష్టం లేని నిర్ణయాలు కొరగావు. అందుకే జనాలందరికీ మీరంటే అంత గౌరవం కాంతయ్యగారూ....మీరు చెప్పేదాకా నాకు తోచనేలేదు.మీరు చెప్పినట్లే చేసి ఆ మూడు స్థలాల్నిఎంపిక చేసి మీకు చెబుతాను.
మళ్ళీ కలెక్టరు గారికి అర్జీ వ్రాద్దురు గాని'' అని చెప్పి ''నమస్కారం అయ్యా వస్తాను" అంటూ వెళ్ళబోయెసరికి  ''శివాజీ....ఒక్క క్షణం....నాకో చిన్నపనిఉందయ్యా నీతో"అన్నారు కాంతయ్య గారు.
''అదేంటి కాంతయ్య గారూ!దానికోసం ఇంత దూరం వచ్చారా'?  ఎవరితోనైనా కబురుచేయలేకపోయారా!"
నొచ్చుకున్నట్లుగా అన్నాడు శివాజీ .
''ఇక్కడికొచ్చాక గుర్తువచ్చింది శివాజీ .... మా ఎడ్లబండి 'రోజా' ఇనప పట్టీ ఊడిపోయింది. అవసరంగా బండి కావాల్సివచ్చింది. నీకు వీలవుతే నీ 'ఎడ్లబండి' రెండు రోజులకి ఇవ్వగలవేమోనని అడుగుదామని '' అన్నారు శివాజీ ముఖం లోకి సూటిగా చూస్తూ....అన్నారు కాంతయ్య గారు.
''అయ్యో.... అదెంత పని కాంతయ్య గారూ...నేను ఇప్పడు పంపనా....లేక మీరు మీ మనిషి పంపుతారా?
వెంటనే బండి ఇస్తాను అన్నాడు శివాజీ ఏమాత్రం సంశయించకుండా.
'రేపు ఉదయం మనిషిని ఎడ్లతో పంపుతాను....బండి పంపించు' అంటూ వెనుదిరిగారు కాంతయ్య గారు.
                                                          * * * * *

                       వారంరోజులతరువాత.... కాంతయ్య గారిల్లు. ఉదయం ఎనిమిది గంటలవుతోంది.ప్రెసిడెంటు శివాజీ గారి ఎడ్లబండి కాంతయ్య గారి దొడ్లోనే ఉంది. ప్రెసిడెంటు శివాజీ గారి కొడుకు కాంతయ్య గారి ఇంటికి వచ్చి వరండాలో నిలబడి 'సార్........సార్ .' అంటూ బిగ్గరగా పిలిచాడు వరండా లోనుంచి ఇంట్లో ఎవరు కనబడక పోయేసరికి .
ఇంట్లోనుంచి పనిమనిషి  వచ్చి' మీరా...అబ్బాయిగారూ...పొద్దుటే ఇలాగోచ్చారేటి'? అంది తలుపు చాటునుంచి
ముఖమొక్కటే బయటకు పెట్టి.
'అయ్యగారు పూజ చేసుకుంటున్నారు....ఇంకో అయిదు, పదినిముషాలలో పూజ 
అవుతే గాని బయటకు  రారు. అప్పటి దాకా కూకుంటారా ? కొద్దిగా 'కాఫీ'గాని తెమ్మంటారెంటి ?" అంటూ వరుసగా   ప్రశ్నల వర్షం కురిపించింది పనిమనిషి అతనికి  మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.
''ఉహూ... అవసరం లేదు. ప్రెసిడెంటు గారి అబ్బాయి 'చిన్నా' వచ్చాడని చెప్పు'' అన్నాడతను ముఖంలో అసహనం దాచుకుంటూ. 
''సరే, అలాగే చెబుతాను మీరు అలా కూర్చోండి. అయ్యగారు వస్తారు" అంటూలోనికి  వెళ్ళింది పనిమనిషి.
అయిదు నిముషాలు దాటింది.కాంతయ్య గారింకా బయటకు రాలేదు. చిన్నా కి
నిముషాలు గంటల్లా అనిపిస్తున్నాయి. అతని సహనం నశించింది. ఆక్షణంలో తండ్రిని  విసుక్కున్నాడు తనకు ఇటువంటి పని  అప్పచేప్పినందుకు ... అసలు నాన్నకు ఎవరికి ఏపని చెప్పలోకుడా బొత్తిగా తెలీడం లేదు.
ఈయన కోసం ఇంకా ఎంతసేపు 'వెయిట్ ' చెయ్యాలో '......అనుకుంటూ అటు, ఇటు కాలు గాలిన పిల్లిలా తిరగడం మొదలెట్టాడు ' చిన్నా.
రెండు మూడు నిముషాల తరువాత  'ఏమయ్యా పట్నంనుంచి ఎప్పుడు వచ్చావు? చదువు ఎలావుంది ?
శ్రద్ధగా చదువుతున్నావా? చనువుగా, ఆప్యాయంగా వాకబు చేస్తూ అడిగారు కాంతయ్యగారు.
'బాగా చదువుతున్నాను సార్' తను కాంతయ్య గారిని చూస్తూనే ఒంగి కాళ్ళకునమస్కారం చేస్తూ.
కాంతయ్యగారు అతని తలమీద రెండు చేతులుంచి  మనఃస్ఫూర్తిగా ఆశీర్వదించి అతని వీపుతటుతూ!
''ఆ ఇక  చెప్పు, నాతో ఏదైనా పనిఉండి  వచ్చావా లేక మీనాన్నగారుపంపించారా...ఏదైనా కబురు చెప్పిరమ్మన్నారా?  అయినా చదువుకునే కుర్రాడివి. రెండు రోజుల శలవులు గడపడానికి వచ్చి ఉంటావు .....నిన్ను ఎందుకు ఇలా పంపాడుమీనాన్న? పాలేరుని
పంపవలసింది. సరే చెప్పు.... ఏమిటి సంగతి'' ? అని  పైకి అంటూనే 'శివాజీ' బండి తిరిగి పంపించమని కబురు
చేసి ఉండాలి అని మనసులో అనుకున్నారు కాంతయ్య.
'ఏం లేదు సార్.... మీరు మా 'ఎడ్లబండి' అవసరం ఉండి తెచ్చుకున్నారట గదా! నాన్నగారు దాన్నితిరిగి
పంపించమని చెప్పిరమ్మన్నారు....అందుకే  ఇలావచ్చాను సార్....' అన్నాడు 'చిన్నా' రెండు చేతులు కట్టుకుని వినయంగా. ఒక్కక్షణం కాంతయ్య గారికి మనసులో తను శివాజీకి చెప్పవలసిన గుణపాఠం ఈకుర్రాడి ద్వారా కాకూడదు అనిపించింది. ఇలాంటి విషయాల్లో పిల్లల మనసులు ప్రభావితం చేయకూడదన్న
'ఇంగితాన్ని' ఆక్షణంలోనే అమలు పరిచారు. వెంటనే తమాయించుకుని ' నాన్నగారికి చెప్పు. ఆ బండితో ఇంకాకొద్దిగా పని ఉంది. ఆపని అయిన వెంటనే బండిని తిరిగి పంపిస్తానని చెప్పు...'
అని చాలా అనునయంగా చెప్పిఅతన్ని పంపించారు.
                                                 * * * * * *

                         అదే రోజు సాయంత్రం ఎప్పటిలా బయట అరుగు మీద కూర్చున్నారు. 'నా పేరు లింగయ్య.
'ప్రెసిడెంటు గారి 'పాలేరునండి'  మీరు బండి ఇస్తానంటే తీసుకురమ్మన్నారయ్యా 'శివాజి'గారు'. ఎడ్లని తీసుకువచ్చి
బండితీసుకు పొమ్మంటారా అయ్యా...' రెండుచేతులూ కట్టుకుని తలకు కట్టుకున్నతలపాగా తీసి చేతిలో పట్టుకుని అన్నాడు పాలేరు లింగయ్య. ఆక్షణంలో గురవయ్య చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ
'ఏరా, లింగయ్యా... మీ అయ్యగారి ఎద్దు ఒకటి చనిపోయిందట గదరా.... కొత్తది కొన్నారా? ' వాకబు చేస్తున్నట్లుగా అడిగారు కాంతయ్య గారు.'అవునయ్యా ఒక ఎద్దు చనిపొయిందయ్యా.....అందుకే బండ్ల గురవయ్య 'ఎద్దుని'  తెచ్చుకుని పని నడిపిస్తున్నామయ్యా. అన్నాడు లింగయ్య.
'అదేంటిరా....మరి గురవయ్య ఎద్దుని మీరు  తెచ్చుకుంటే మరి వాడేం చేస్తున్నాడు? వాడు రెండో ఎద్దు ఇంకొకటి
తెచ్చుకున్నాడేంటి ?  విషయాన్నివాకబు చేస్తున్నట్లుగా అడిగారు కాంతయ్యగారు.
'అవునయ్యా....వాడు ఓ ఎద్దుని మొన్ననే కొనుక్కొచ్చాడు. సరే వాడి దగ్గర ఎలాగు రెండు ఎడ్లు ఇదివరకే ఉన్నాయని మేము ఒక ఎద్దుని నాలుగు రోజులు కావాలని 'అరువు' తెచ్చుకున్నామయ్యా. ఇప్పుడు గురవయ్య  తన ఎద్దుని తిరిగి ఇమ్మని అడుగుతున్నడయ్యా....ఇంకా ఎద్దుని తిరిగి పంపలేదు' అని వివరంగా చెబుతూ...'అయ్యా.... అయ్యగారు ఆలస్యం అయిందని కేకలేస్తారు.
బండిని తీసుకు పొమ్మంటారా అయ్యా'? అన్నాడు లింగయ్య ఎక్కడ విషయం మొత్తం చెప్పాల్సి వస్తుందోనని ఆందోళనతో !
'లింగయ్యా...మీ అయ్యగారి 'బండి' కొద్దిగా తేలిగ్గా ఉన్నట్లుందిరా...మాఎడ్లు బండిని 'లోడుతో' సహా తేలిగ్గా
లాగుతున్నాయిరా....మా బండికంటే మీ అయ్యగారి 'బండి' మాఎడ్లకి బాగా సరిపోయినట్లుందిరా!
అందుకే నేను ఆ'బండిని' ఉంచేసుకుందామనుకుంటున్నాను. మీ అయ్యగారికిచెప్పు....దాని ఖరీదు
రెండువేలరూపాయలు ఉంటుందేమో....ఆ డబ్బుపంపిస్తానని నేను చెప్పానని మీ అయ్యగార్కి చెప్పు' అని అరుగు దిగి వడి వడిగా  ఇంటివేపు నడిచారు కాంతయ్యగారు. కాంతయ్య గారు చెప్పింది విన్నాక నోట మాట రాక ఏం చెయ్యాలో తెలీక తల గోక్కుంటూ దిక్కులుచూస్తూ అక్కడే నిలబడి పోయాడు 'లింగయ్య'.  
'ఏమిటి' లింగయ్యా....ఒక్కడివే ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? అని అటుగా వెళుతూ పలకరించిన
'గురవయ్య' వంక అదోలా చూస్తూ ఏం మాట్లాడకుండా.....తలకట్టు  తువ్వాలని భుజాన వేసుకుంటూ  పరుగులాటి నడకతో వెళ్ళాడు లింగయ్య అక్కడనుంచి.
'ఈడేంటబ్బా...ఈ యేలప్పుడు వీడు ఈడ నిలబడి దిక్కులు చూస్తున్నాడు' ఏదో మర్మం ఉన్నాది. ఇయాల కాకపోతే రేపు తెలవదా.'  అనుకుంటూ ఇంటి బాట పట్టాడు గురవయ్య.
                                                   * * * * **

                    మరుసటిరోజు ఉదయం ఏడుగంటలవుతోంది. కాంతయ్యగారు బయట వాలు కుర్చీలో కూర్చుని మీద పడుకున్న మనవడి వీపు రాస్తూ, తను కూడా  కళ్ళుమూసుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయారు.
ఇంతలో తన రెండుకాళ్లని ఎవరో స్పృశించినట్లు ఆనిపించి  ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. ఎదురుగా బండ్ల గురవయ్య.  రెండు మోకాళ్ళు నేలకానించి తల కాళ్ళ కానించి లేవలేదు. 'రేయ్ గురవా......ఏం పనిరా ఇది.... లే.' అంటూ ఒకచేత్తో మనవణ్ణి పొదివి పట్టుకుని  మరో చేత్తో అతని భుజం పట్టి లేపి ....'ఎద్దు' ఇంటికి వచ్చిందేమిటి ? తాపీగా అడిగారు కాంతయ్య గారు.
నోట మాటరాక తల ఊపాడు బండ్ల గురవయ్య కళ్లలో ఉబికి వస్తున్న నీటిని తుడుచుకుంటూ.
'సరే....దొడ్లోకి వెళ్లి  ప్రెసిడెంటు గారి 'ఎడ్లబండి' ఉంది, నేను పంపించానని చెప్పి దాన్నిజాగ్రత్తగా  ఆయనకి అప్పచేప్పిరా.... మరి ఈ విషయాన్ని ఇంతటితో మరిచిపో...
ఎవరితోనూచెప్పకు..... అంటూ ఇంటిలోనికి నడిచారు కాంతయ్యగారు మనవడికి  నిద్రాభంగం కాకుండా భుజమ్మీదకి మెల్లగా మార్చుకుంటూ.' వెనకనుంచి గురవయ్య రెండు చేతులెత్తి మళ్ళీ మొక్కుతూ ''ఈ ఊరు పుణ్యం చేసుకున్నదయ్యా....నీలాంటి వాడిని ఈవూరిలో కని'' అని తనలో తానే గొణుక్కుంటూ దొడ్లోకి నడిచాడు.

                                                       ************

         
 రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.
Mob. No.9849118254