లేబుళ్లు

14, డిసెంబర్ 2019, శనివారం

మేమాశించేది కొద్ధి కరుణ....

                                         
                                             మేమాశించేది కొద్ధి కరుణ... 
                   ( ఈ కధ 18-12-2019  ఆంధ్ర జ్యోతి, నవ్య వీక్లీ  లో ప్రచురింపబడింది ) 


తెల్లవారుఝాము మూడు గంటలవుతోంది. నిద్రమాత్ర వేసుకునిపడుకుందేమో నిద్రగాఢతతో
మెలుకువ రాలేదు సుజాతకి. వాల్యూం తగ్గించి దూరంగా టేబుల్ మీదుంచిన మొబైల్ ఫోను ఎంతసేపునుంచి మోగుతుందో తెలీదు. చీమ చిటుక్కుమంటే లేచే కమలాకర్ లేవలేదు.
'ఈ టైంలో ఫోనుచేసిందెవరబ్బావేళా పాళా లేకుండా' అనుకుంటూ మెల్లగా లేచి  ఫోనందుకుని 'హలో' అంది సుజాత వెనక్కు వచ్చి బెడ్ మీద కూర్చుంటూ.
''త్వరగా తలుపు తీయమ్మా'' అంటూ సుపరిచతమైన గొంతు. సుజాతకి నిద్రమత్తు పూర్తిగా వదల్లేదు. మాట్లాడుతున్నదెవరో అర్ధం గావడంలేదు.
'అరవింద్ గొంతులా ఉంది.వాడీ వేళ ఫోను ఎందుకు చేస్తాడు? అనుకుంటూనే ''అరవింద్…నువ్వేనా ? తలుపుతీయడమేమిటి ? నాతో మాట్లాడుతున్నావా లేక అక్కడ కోడల్నిగాని  తలుపుతీయమంటున్నావా ? నాకేమీ అర్ధం కావడం లేదు'' అంది సుజాత మగతగా.
''అమ్మా నేనే  అరవింద్ నే మాట్లాడుతున్నా.హైదరాబాద్ వచ్చాను. మనింటి గుమ్మం ముందు నుంచుని మాట్లాడుతున్నా. అర్జంటుగా తలుపుతీయకపోతే గుమ్మం ముందే బయట పడకేస్తాను. తరువాత నీఇష్టం'' అన్నాడు అరవింద్ నవ్వుతూ.
'చెప్పాపెట్టకుండా ఏమి సర్పైజ్ లో  ఏమిటో' ? అనుకుంటూ
''ఏవండీ…చిన బాబు వచ్చాడు లేవండి'' అంటూ నిద్రపోతున్న కమలాకర్ ని తట్టి లేపి నాలుగంగల్లో గుమ్మం చేరి ''అరవింద్ నువ్వేనా'' ? అని కన్ఫర్మ్ చేసుకుని తలుపు తీసింది సుజాత. చేతిలో సూట్ కేసు పక్కన పెట్టి బ్యాక్ ప్యాక్ తీయకుండానే తల్లిని రెండుచేతులతో గువ్వలా హత్తుకున్నాడు ఆరడుగుల అరవింద్.                                         
                                                                     * * * * *
          ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చిన క్కగానొక్క కొడుకు అరవింద్ తో మాట్లాడుతూ ''వచ్చి రెండు రోజులయింది. వారం రోజుల్లో మళ్ళీ తిరుగుప్రయాణమంటున్నావు. ఉన్న రెండురోజులయినా ఇంటిపట్టున ఉన్నావా అంటే అదీ లేదు, పొద్దుననంగా వెళ్లిన వాడివి రాత్రికి తిరిగి వచ్చావు. ఇంతవరకు ఇంట్లో భోజనం చేయలేదు" అని అరవింద్ తో  నిష్ఠూరంగా అని "ఇక ఉండే వారంరోజులు ఆఫీస్ పనని బెంగళూరు వెళతానని వాడు బయలుదేరుతుంటే మీరేమీ మాట్లాడారేమండీ'' భర్త కమలాకర్ ముఖంలోకి సూటిగా చూస్తూ బాధగా,అసహనంగా అంటూ భర్త చేతిలో న్యూస్ పేపర్ ని లాగి కింద పడవేసింది సుజాత.
''బాగుంది. ఉరుమురిమి ఎవరిమీదో పడ్డట్లు నా మీద పడతావెందుకు ? వాడు,నువ్వు ఇద్దరు ఏమైనా చిన్నపిల్లలా ? ప్రతి చిన్న విషయానికి చిన్నప్పటి నుంచీ వాడిని వెనుకేసుకు రావడం నీకలవాటు. అందుకే నీతో చెప్పాడా విషయం. నీఇష్టం, వాడిష్టం. మీ ఇద్దరి సంవాదం లోకి  నన్ను లాగొద్దు. అయినా 'వాడేదో ఆఫీస్ పని అంటున్నాడు కదా' ! నసుగుతూ ముక్తాయింపు ఇచ్చి కుండా పడ్డ న్యూస్ పేపర్ ని తీసుకుని దాంట్లో మొహం దాచుకున్నాడు కమలాకర్.
''వాడి విషయంలో నామాటెప్పుడు నెగ్గింది గనక. నా చాదస్తం తప్ప'' గొణుగుతూ అంది సుజాత.
'ఆ...అవునవును…అమ్ములు మాటే వింటాడు వాడు'! అన్నాడు కమలాకర్ ఛలోక్తిగా భార్యవంక  కళ్ళు మిటకరించి ఇమోజి లో బొమ్మలా చూస్తూ. ఉరిమి చూసింది సుజాత భర్తవంక ఇక ఆపుతావా నీ సోది అన్నట్లు.
''నేను వచ్చిందే ఆఫీసు పనిమీద కదమ్మా! ఎందుకు రాద్దాతం... ఏమాత్రం వీలయినా ముందే వచ్చేస్తానమ్మా. బాధపడకు" అని తల్లికి నచ్చచెప్పి బ్యాక్ ప్యాక్ వీపుకు వేసుకుని బయటకు నడిచాడు అరవింద్.                                                                                    
                                                             * * * * *
''మీరేనా పేషెంట్ అటెండెంట్ ? ఆమె పరిస్థితి బాగాలేదు. క్రిటికల్ అనే చెప్పాలి. హాస్పిటల్ లో చేర్పించినప్పటి నుంచి ఆమెకు స్పృహ లేదు. మీకేమవుతుందావిడ ?''అని అడిగాడు అరవింద్ ని, ఐ.సి.యు లో అమ్ముల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్.
''అవును నేనే డాక్టర్. నా పేరు అరవింద్. ఆమె నాకేమీ బంధువు కాదు.అంతకంటే ఎక్కువ.
నా చిన్నప్పటి ఆయా... ఆరోగ్యం బాగాలేదు సిరీయస్ గా ఉందని ఫ్రెండ్ ద్వారా తెలిసి తన్నిచూడడానికి ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. వారంలో తిరిగివెళ్ళాలి. తనకంటూ ఎవరూ  లేరు. ఒంటరి. తన ఆరోగ్యం కుదుట పడితే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ చేర్చి వెళతాను. దయచేసి అమ్ములు ఆరోగ్యం ఎలావుందీ నాకు సరిగ్గా చెప్పగలరా డాక్టర్...ప్లీజ్ '' అడిగాడు అరవింద్ వేడుకోలుగా. 
''ఓహ్...ఈజ్ ఇట్ ? ఆస్ట్రేలియా నుంచి ఆయా ని చూడడానికి వచ్చారా... ఇంటరెస్టింగ్ ''? అంటూ ఆశ్చర్యంగా నమ్మశక్యంగానట్లుగా అన్నాడు డాక్టర్. 
''చిన్నతనంలో అమ్ములు నాకు చేసిన సేవల ముందు నా ఈచిన్నిపరామర్శ ఎందుకూ కొరగాదు. ఇట్స్ నథింగ్ డాక్టర్. నేను ఏం చేసినా తన ఋణం తీర్చుకోలేను '' గాద్గదికంగా అన్నాడు అరవింద్. 
''ఆమెకు ఎక్యూట్ న్యుమోనియా. లంగ్స్ బాగా ఇన్ఫెక్ట్ అయ్యాయి. ఊపిరి తీసుకోవడానికి  ఇబ్బంది పడుతోంది.ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉంచాము.స్టేబుల్ గానే ఉంది. ఏంటీ బయోటిక్స్ ఇస్తున్నాము. దేర్ ఈజ్ లిటిల్ ప్రోగ్రెస్. ఇట్ టేక్స్ టైం అండ్ ప్రోలాంగ్డ్ ట్రీట్మెంట్.  రెండురోజులు చూసి స్టేబుల్ గా ఉంటే రూముకి షిఫ్ట్ చేస్తాము'' అన్నాడు డాక్టర్. 
''ఆమె కోలుకుని మామూలు మనిషి కావాలి. తనకి మంచి ట్రీట్ మెంట్ చేయిద్దామని వచ్చాను. వేరే ఏదైనా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటారా ? మీరు మరోలా అనుకోవద్దు. దయచేసి అర్ధం చేసుకోండి...ప్లీజ్. ఖర్చు ఎంతైనా ఫరవాలేదు. నాకు సరైన సమాధానమివ్వండి"? రెండుచేతులు జోడించి వినయంగా అడిగాడు అరవింద్.
"చూడండి...మిస్టర్..."?
''అరవింద్...".
''నేనొక డాక్టర్ని. దేవుణ్ణి కాదు. మా ప్రయత్నం చేస్తాము. ఆపైన దైవేచ్చ...ఆమె మెల్లగా రికవర్ అవుతోంది.ఈ జబ్బే అలాటిది. ఆమె గురించి మీరు పడుతున్నఆవేదన, బాధ నాకు అర్ధమయింది. ఐ విల్ డు మై బెస్ట్. ఆమె తప్పక కోలుకుంటుంది. ఐ ప్రామిస్...షి విల్ బి ఫైన్. ఆపైన వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లడం మీఇష్టం"అన్నాడు డాక్టర్. 
హ్యాండ్ షేక్ చేస్తూ "థాంక్ యూ వెరీ మచ్ డాక్. ప్లీజ్ టేక్ కేర్ అఫ్ హర్ '' అన్నాడు అరవింద్ ఆర్ద్రంగా. అరవింద్ పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకుని, 'డోంట్ వర్రీ' అంటూ  అరవింద్ వీపు తట్టి ఐ.సి.యు లోనికి నడిచాడు డాక్టర్. డాక్టర్ హామీతో రిలాక్స్ అయి హాస్పిటల్ లాబీలో చివరన కూర్చుని గోడకానుకుని కళ్లు మూసుకున్నాడు అరవింద్. తన ఆలోచనలు అమ్ములు చుట్టూ పరిభ్రమించాయి.
                                                              * * * * *
ముప్ఫై సంవత్సరాలపైగా తన చిన్ననాటినుంచి ఇంట్లో పనిచేసిన అమ్ములుని ఇలా దిక్కులేకుండా వదిలేయడం కరెక్టేనా? ఏముందా మనిషికి ఆధారం ? ఉన్నఒక్క కొడుకు జబ్బు చేసిపోయాడు. కాలూ చేయి ఆడి ఒంట్లో సత్తువున్నంతకాలం పరాయి వారింటి శుభ్రత, వారిపిల్లల ఆలనేగాని జీవితంలో ఆమెకు ఒక ఆటా పాటా ? తినగా మిగిలింది పెడితే తిని, స్వంత బ్రతుకంటూ లేక శలవులేకుండా జీవితమంతా అలిసిన మనిషికి కనీస కృతజ్ఞతకూడా చూపించలేమా ? వారిలా అనాధల్లా రాలిపోవాలిసిందేనా ? మా కుటుంబం అమ్ములుకి తన వృద్ధాప్యం ఆదుకోవడానికి ఏదో ఒక ఆధారం ఏర్పాటు చేయవలసింది'...అనుకున్నాడు అరవింద్.
                                                              * * * * *
సుజాత గజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగి. నీటిపారుదల శాఖలో ఇంజనీర్. తరచూ రోజుల తరబడి క్యాంపులకి వెళ్ళవలసి వచ్చేది. అందుచేతనే ఇంటిపని, దుకాణంనుంచి నుంచి సామానులు తేవడం దగ్గరనుంచి అరవింద్ ని స్కూలుకి తయారుచేయడం, స్నానం చేయించడం, తినిపించడం లాటి పనులన్నీ నమ్మకంగా, నిజాయితీగా పనిజేసే అమ్ములికి అప్పజెప్పి తాను నిరాటంకంగా ఆఫీస్ పనులు చూసుకునేది సుజాత.మొదటినుంచి ముక్కు సూటి మనిషి. ఖచ్చితంగా మాట్లాడడం అలవాటు. దాంతో ఒక్కోసారి ఇంటా,బయటా కూడా ఇబ్బందిపడేది. అయినా సరే అలాగే ఉండేది. ఆమెకు భర్త కమలాకర్ పూర్తి సహకారం  ఉండేది. దాంతో ఆవిడ ఆఫిస్ పనే లోకంగా గడిపేది. కమలాకర్ ఒక ఎంఎన్ సి ఫ్యాక్టరీలో ఇంజనీర్. షిఫ్టులు ఉండేవి. ఉదయాన్నే వెళ్లి ఇంటికి మధ్యాన్నం మూడు గంటలకల్లా వచ్చేవాడు. ఇంటి విషయాల్లో కమలాకర్ జోక్యం ఎప్పుడూ ఉండేది కాదు.
అరవింద్ ఐ.ఐ.టి ముంబైలో బి.టెక్ లో చేరడానికి వెళ్లేంతవరకు సుజాత అలా ఆఫీసుకి అంకితం కావడంతో అమ్ములు అరవింద్ ని కంటికి రెప్పలా చూసుకొనేది. అరవింద్ కి ఒకసారి అమ్మవారు పోస్తే అమ్ములే రేయింబవళ్ళు బెడ్ పక్కనే ఉండి చేసిన సేవ అరవింద్ కిప్పటికీ బాగా గుర్తు. సుజాత ఒకసారి క్యాంప్ కు వెళ్ళినప్పుడు అమ్ములు కొడుకు సుబ్బుకి బాగా జ్వరమొచ్చింది. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు.
''అమ్ములూ పిల్లాడికి జ్వరం కదా. నువ్వు రెండురోజులు ఇంటిపట్టునే ఉండి వాడిని చూసుకో...నేను బాబుని చూసుకుంటాలే'' అని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి కమలాకర్ దగ్గరుండి వాడిని హాస్పిటల్ చేర్పించి బిల్లు తనే భరించాడు. 'చిన బాబుకి ఇబ్బంది అవుతదయ్యా' అంటూ రెండో రోజే పనికి తిరిగి వచ్చింది అమ్ములు. 
చిన్నతనం కావడంతో అరవింద్ కీ విషయాలు అంతగా అర్ధమయ్యేవి కాదు. 
''నీ కొడుక్కి టైఫాయిడ్ అటకదా. హాస్పిటల్ నుంచి వచ్చాక బట్టలు మార్చుకుంటున్నావా ? చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నావా లేదా''? అమ్ముల్ని అడిగింది సుజాత క్యాంప్ నుంచి తిరిగి వచ్చాక. ఎప్పుడూ లేంది కమలాకర్ జోక్యం చేసుకున్నాడు.  
''వాడికెలా ఉందని ఒక్క మాట అడగలేదు. తన బట్టల గురించి, చేతుల శుభ్రత  గురించి మాట్లాడుతున్నావా ? కమాన్ సుజాతా ! బి లిటిల్ కైండ్. తన కొడుక్కి జ్వరం'' అని భార్యని మొదటిసారిగా మందలించాడు కమలాకర్. 
అమ్ములు పరిధి మించి ఎప్పుడూ ఒక్క మాటకూడా మాట్లాడేది కాదు. తను కొద్దిగా ఆలస్యంగా వచ్చినా అరిచేది సుజాత. జీతం కట్ చేస్తాననేది.
''అమ్మ జీతం కట్ చేస్తే నేను దాచుకున్న డబ్బులు నీకిస్తాలే అమ్మూ. అమ్మకు చెపుతానులే నిన్ను అరవొద్దని '' అనేవాడు అరవింద్ అమ్ములతో.
'మా అయ్యే'...అంటూ రెండు చేతుల్తో అరవింద్ చెంపల్ని రాస్తూ తన రెండు కణతల మీద ఫట ఫటా మంటూ మెటికలు విరిచేది  అమ్ములు.
                                                                 * * * * *
స్నేహిహితుడొకతను అరవింద్ కి ఫోన్ చేసి 'అమ్ములు ఆరోగ్యం బాగాలేదు…ఇవాళో రేపో అన్నట్లుగా ఉంది. ఇంటి దగ్గరే పడి ఉందన్నవిషయం అరవింద్ కి తెలియచేస్తే అమ్ములు  కోసం వచ్చాడతను.
అమ్ములు కోసం హైదరాబాద్ వచ్చానంటే తల్లి ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆఫీసు పని మీద   బెంగుళూరు వెళుతున్నానని అబద్ధం చెప్పి అమ్ములు దగ్గర హాస్పిటల్లోనే ఉంటున్నాడతను. తండ్రితో కూడా ఈ విషయం ప్రస్తావించలేదు. డాక్టర్ తో మాట్లాడాక అరవింద్ కి  ధైర్యం వచ్చింది. డాక్టర్ ఫోను చేసి అమ్ములు మందులకు రెస్పాండవుతోందని, ఆరోగ్యం కుదుట పడుతోందని త్వరలో రూముకి మారుస్తామని చెప్పాడు.తను తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళేలోగా అమ్ములు డిశ్చార్జ్ అవుతే మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చి వెళదామని, అప్పటికి డిశ్చార్జ్ కాకుంటే హోమ్ వారే వచ్చి అమ్ముల్ని డిశ్చార్జ్ అయినవెంటనే వచ్చి హాస్పిటల్ నుంచి తీసుకువెళ్లే ఏర్పాటు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడతను. అమ్ముల్ని అయిదు రోజుల తరువాత రూముకి షిఫ్ట్ చేశారు. అరవింద్ ని చూసి బెడ్ మీద నుంచి లేవడానికి ప్రయత్నం చేస్తూ  గొంతు పెగలక రహస్యం మాట్లాడుతున్నట్లుగా "చినబాబూ... మీరా...ఎప్పుడు...అమ్మగారు..." ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ నీరసంతో ముక్కులో ఆక్సిజెన్ ట్యూబ్ తో మాట్లాడలేక పోయింది అమ్ములు. రెండుచేతులెత్తి అరవింద్ ని దగ్గరికి రమ్మని సైగ చేస్తుంటే చలించిపోయాడు అరవింద్.రెండురోజులు దగ్గరే ఉండి అమ్ములకి సపర్యలు చేశాడు. ఇంటికి తిరిగి వచ్చాడు అరవింద్.
                                                        * * * * *
"బెంగళూరునుంచేనా రావడం"అప్పుడే వచ్చిన అరవింద్ ని పలుకరించింది సుజాత.
"అవునమ్మా…కొద్ధి కాఫీ ఇస్తావా...తల నొప్పిగా ఉంది" అన్నాడు అరవింద్.   
"అమ్ములు ఎలావుంది"? సూటిగా ప్రశ్నించింది సుజాత.
అరవింద్ కి నెత్తిన పిడుగు పడినట్లనిపించింది. నిలువెల్లా కంపించి పోయాడు. 
ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. గొంతు తడారిపోయింది. ఏంసమాధానం చెప్పాలో అర్ధంకాలేదు.అటు ఇటు దిక్కులు చూశాడు తండ్రికోసం,ఆయనేమైనా ఈ ఆపదనుంచి గట్టెక్కిస్తాడేమోనని. ఆ ఛాయలలో కనిపించలేదు కమలాకర్.
"నేను కఠినాత్మురాల్ని, మానవత్వం లేని మనిషిని కాదు అరవింద్. క్రమశిక్షణ ఉన్నమనిషిని. ఎవరికీ వారే...మాకు మేమే అనుకుంటూ చిన్న కుటుంబాల్లో బిరిగీసుకుని బ్రతుకుతున్నఈసమాజంలో బ్రతికినన్నాళ్ళు ఇంకొకరిపై ఆధారపడకుండా ఎలాబ్రతకాలో ఖచ్చితమైన అవగాహన ఉన్నదాన్ని. అందుకే జీవితాంతం శ్రమించాను. ఆర్ధికంగా నిలబడ్డాను. అమ్ములుకి 'న్యుమోనియా' వచ్చి సీరియస్ కావడంతో నేనే నీకు నీ స్నేహితునితో ఫోను చేయించాను. నిన్నుబిడ్డలా సాకిన అమ్ముల్నిచూసి వెళతావా లేదా చూద్దామనుకున్నాను. వచ్చావు.సంతోషం...."
"అది కాదమ్మా ... " ఏదో సంజాయిషీ ఇవ్వబోయాడు అరవింద్. గొంతు పెగల్లేదు.
"నేను చెప్పదలుచుకున్నది పూర్తి చేశాక నువ్వుమాట్లాడు చినబాబూ. నేను వింటాను.
అమ్ముల్ని నేను, మీడాడీ హాస్పిటల్ చేర్పించడం ఇది మొదటి సారి కాదు.నువ్వు ఆస్ట్రేలియా వెళ్లి పన్నెండేళ్లయింది. ఈ పన్నెండేళ్లలో నాలుగయిదు సార్లు వచ్చావు. వచ్చిన ప్రతిసారి అమ్ములుకి ఒక చాకొలేట్ పాకెట్, డజను పళ్ళు, ఒక స్వెట్టర్, వెయ్యో రెండువేలో డబ్బిచ్చిఉంటావు. అంతేనా…ఇంకేమైనా చేశావా? లేదు కదా. దాంతోనే దాని జీవితం గడవదన్న సంగతి నీకు తెలుసు కదా" !
"అమ్ములుకి నేనేం చేశానో చెబుతా విను. తను మనింట్లో పనిచేసిన మొదటి నుంచి ఇన్నేళ్లు తనకిచ్చిన జీతంగాక తప్పక నెలకింతని ఆమె పేరుతోనే పి.పి.ఎఫ్ ఖాతాలో వేశాను.
అది పరిణితి చెంది లక్షల్లో ఉంది. నెలనెలా వడ్డీ వస్తుంది.తనకి హెల్త్ కార్డు ఇప్పిస్తున్నాను.
ఇప్పటికి ఇంటికి వచ్చి తింటుంది. తాగుతుంది. నేను బ్యాంకులో వేసి దాచిన డబ్బే దానికి ఆధారం. నేను గొప్పలు చెప్పుకోవడంలేదు. ముందుచూపుతో వ్యవహరించానని చెప్పడం నా ఉద్దేశ్యం. 
ఇక నీసంగతి... అమ్ములు విషయంలో నామీద  నీకు ఏవేవో అపోహలున్నట్లు నీ ప్రవర్తనే చెబుతోంది. అమ్ముల్ని చూడడానికి వచ్చినవాడివి మాదగ్గర ఆవిషయం ఎందుకు దాయవలసి వచ్చిందో నాకు అవగతం కావడంలేదు. నేనావిషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. దాన్నినాకు జరిగిన అవమానం గానే భావిస్తాను." అంది ఆవేశంగా సుజాత. 
'అమ్ముల్ని చూడ్డానికి వచ్చానమ్మా' అనివుంటే మేమింకా సంతోషించే వాళ్ళం.రేపు వృద్ధాప్యంలో మమ్ముల్ని కూడా ఆదరిస్తావన్న తృప్తిగా ఉండేది. 
అమ్ములు పట్ల నాకు ద్వేషభావం ఉందని చిన్ననాటి నుంచీ నీమనస్సులో అంతర్లీనంగా గూడు కట్టుకుని ఉందని నాకు తెలుసు. నీభావన నిజం కాదు అరవింద్. కాలం, వయస్సుతో బాటు నీలో ఆ భావన మాయమవుతుందనుకున్నాను. నీలో మార్పు వస్తుందనుకున్నాను. నా అంచనా తప్పయింది.     
నువ్వే కాదు...ఇలాటివి చాలా వింటున్నాము. మీ తరం యువత నుంచి ఇలాటి ప్రవర్తన కాదు మేమాశించేది. కొద్ధి కరుణ...ఆదరణ మాత్రమే" అంది సుజాత దీర్ఘంగా తన అసంతృప్తిని, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ, కళ్ళలో ఉబుకుతున్న కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకుంది.
'అమ్ముల్ని హాస్పిటల్లో మీరే చేర్పించారని, డబ్బు కట్టారని ఈరోజు ఉదయం హాస్పిటల్లో బిల్లు చెల్లిస్తున్నప్పుడు తెలిసిందమ్మా. నిన్నుఅపార్ధం చేసుకున్నానమ్మా. నీ ఔన్నత్యాన్ని గుర్తించలేక హీనంగా ప్రవర్తించానమ్మా'...మూగగా ఆక్రోశిస్తూ "క్షమించమ్మా తప్పయింది.క్షమించు" అన్నాడు దీనంగా తల్లి పాదాల మీద మోకరిల్లిన అరవింద్.   

                                   * * *                             * * *                              * * *


     

             

   

  

23, సెప్టెంబర్ 2019, సోమవారం

'నాటు'


                                                                          'నాటు' 
                                                                        =======

''మూడు రోజుల ముసురుతో మాంచి వర్షం పడ్డదిరా! ఈ వారంలో ఎట్లయినా 'నాటు' వెయ్యాలిరా' అన్నాడు'' అన్నాడు సర్వేశ్వరరావు కరెంటు పోవడంతో తనింటి పెరట్లో చేద భావినుంచి నీళ్లు తోడుతున్న జీతగాడు సుబ్బయ్యతో.
''ఏందయ్యా !? మీరు... నాటు వేస్తారా!?'' మళ్ళీ భావిలో బకెట్ వేస్తూ అన్నాడు యజమాని సుబ్బయ్యతో.
''అవున్రా! నాటు వేద్దామనుకుంటున్నా. ముందు మోటభావి తోటలో వేద్దాం. 
ఆ పన్లేవో త్వరగాచూడు !'' అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు సర్వేశ్వరరావు.'
''వారం దాకా ఎందుకయ్యా...రేపటి కల్లా అంతా రెడీ చెయ్యనూ'' అన్నాడు సుబ్బయ్య హుషారుగా బకెట్ ను బర బరా భావిలోనుంచి లాగుతూ యజమాని ఇంకా అక్కడే ఉన్నాడన్నధ్యాసతో.
'ఎన్నడూ లేంది అయ్యగారు గారు నాటు వేద్దామంటున్నారు.
అన్నీనాటువే ఏర్పాటు చెయ్యాలి. దీని సిగతరగ ఎన్నాళ్టికొచ్చిందీ అవకాశం.
అయ్యగారి దిమ్మ తిరిగిపోయేలా చేయాలి. 'బాగాచేశావురా సుబ్బిగా' అనిపించుకోవాలి. నా సామి రంగా...  య్యగారికి కొద్దిగా అలవాటైతే సొంతఖర్చు కొంత తగ్గించుకోవచ్చు'' అనుకుంటూ ఊహాలోకంలో మునిగి పోయాడు సుబ్బయ్య.
ఒళ్ళు తెలియని సంతోషంలో త్వరత్వరగా ఇంటిపనులు తెముల్చుకుని, బయటపనులు అన్నీ పూర్తిచేసుకుని సాయంత్రానికి యజమాని ఇంటికి చేరేసరికి, సర్వేశ్వరరావు హాళ్ళో అటు ఇటు తిరుగుతూ ఫోనులో మాట్లాడుతున్నాడు.
''రేపటికన్నీ ఏర్పాట్లు చేసినానయ్యా'' అన్నాడు సుబ్బయ్య గుసగుసగా, ఫోనులో మాట్లాడుతున్న సర్వేశ్వరరావుతో.
ముఖ్యమైన విషయమేదో ఫోనులోమాట్లాడుతూ సుబ్బయ్య చెప్పింది వినీ వినక తన వెనకాలే  తిరుగుతూ తనవంకే చూస్తున్నసుబ్బయ్యతో ''సరే రా... ఏర్పాట్లు చేశావుగా...డబ్బేమైనా కావాలంటే అమ్మగారి దగ్గరతీసుకెళ్ళు'' అన్నాడు సర్వేశ్వరరావు విసుగ్గా.
మరుసటి రోజు నాటుకి కావాల్సిన డబ్బు అమ్మగారి దగ్గర తీసుకుని క్షణంలో మాయమయ్యాడు సుబ్బయ్య.
                                                 * * *                 * * *               * * *
మరుసటి రోజు ఉదయాన్నేఏడుగంటలకి ఎప్పటిలా పనికి వచ్చాడు సుబ్బయ్య.
అప్పటికే తయారైవున్నసర్వేశ్వరరావు సుబ్బయ్యను చూస్తూనే ''నువ్వీవేళ ఇక్కడికెందుకు వచ్చావు? తోట దగ్గర పనంతా వదిలేసి. అసలే 'నాటు'...వెళ్ళు. టిఫిన్ చేసి నేనొక గంట గంటన్నర తరువాత వస్తాను. ఏర్పాట్లన్నీ అయ్యాయన్నావుకదా?" అన్నాడు సర్వేశ్వరరావు
తెల్లమొహమేసి తలగోక్కుంటూ నిలబడ్డ సుబ్బయ్యవంక చూస్తూ ''ఏవయిందిరా నీకు?
నువెళ్ళు. నేనొస్తున్నానని చెపుతున్నాగా'' అన్నాడు సర్వేశ్వరరావు సుబ్బయ్య వంక విసుగ్గా చూస్తూ.
''ఓర్నాయనో...ఏమైందీయనకు. పొద్దున్నే నాటంటాడు నేనేమో సాయంత్రానికి ఏర్పాటు చేస్తిని. ఇప్పుడేంచేయాల్రా దేవుడా !''...అనుకుంటూ భుజంమీద తువ్వాలని సరిచేసుకుంటూ
లగెత్తాడు సుబ్బయ్య తోటకి. మధ్యలో కాకా హోటల్ దగ్గర ఆగి నాటుకి కావలిసిన పదార్ధాలన్నీ తయారు చేయించి తీసుకుని తోటకి చేరాడు సుబ్బయ్య.
                                                   * * *           * * *          * * *
రెండు గంటల తరువాత తోటకొచ్చాడు సర్వేశ్వర్రావు.
వస్తూనే తోటలో పాకలోకి వస్తూ ''ఏమయిందిరా సుబ్బడూ! ముఠా రాలేదా ఇంకా ? అరకలేవీ... ?"
అన్నాడు సర్వేశ్వర్రావు పాకలో టేబుల్ మీద క్లాత్, 'నాటు' ప్యాకెట్లు, తినుబండారాలు వంక ఆశ్చర్యంగా చూస్తూ.
ఆయనమాటలు విన్న సుబ్బయ్య చేష్టలుడిగి కదలకుండా నిలబడి చేతులుకట్టుకుని
'అరకలేంది...ముఠా ఏందీ?'' అనుమానం మనసును  వేధిస్తున్నా 'అయ్య బాబోయ్ ఈయనగారికి కొత్తగా నాటు ముఠాఒకటి ఏర్పడిందా! ? ఎప్పుడు చెప్పనే లేదు…ఓరి బాబోయ్...నెవర్నీ పిలవలేదు.అంతా ఆగమాగంగా ఉంది' అనుకున్నాడు సుబ్బయ్యకి తలగోక్కుంటూ ఏం చేయాలో అర్ధంగాక. 
"ఏవిట్రా?తలగోక్కుంటూ ... వెర్రోడిలా ఆ చూపేంటి ? ఈ సీసాలేమిటి ? ఆ తిండేవిటి ... ?"  అర్ధంగాక  అడిగాడు సర్వేశ్వరరావు 
"నాటేస్తానన్నారు కదండీ మీరు ...! అయేనండి ఏర్పాట్లన్నీ... " 
నివ్వెరబోయి, నోట మాట రాక 'నాటు' వంక చూస్తూ ఉండిపోయాడు సర్వేశ్వర రావు.   
                                                * * *          * * *          * * *
రచన
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ : 9849118254


    


16, సెప్టెంబర్ 2019, సోమవారం


కేశిరాజు వెంకట వరదయ్య
అంశం: యురేనియం త్రవ్వకం పై చిట్టి కవిత
----------------------------------------------------------

నల్ల 'మల్లన్నా'
నీ పాద వన సర్వస్వం
మరో 'మధన' సాగరం !
క్షీర సాగర మధనం కాదది
అమృత 'శోధన' లేదక్కడ !
జీవకోటికి ప్రాణధార నదీమతల్లుల 'పాపిట'ను
చీలుస్తూ, ఛేదిస్తూ 'ఖని' కోసం
'ప్రాపులు' చేస్తున్నవికృత శోధన!
ప్రవచించు 'మల్లన్నా'అది కారాదని...
లేదన్న'లేపాక్షి' తోడు
లేచి రావలసిందే 'గరళకంఠా' నీవు మరొక్కమారు !

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం: 9849118254
  
వెయిట్ ప్లీజ్ ....... 

ప్రధానమంత్రి విదేశీ పర్యటన పూర్తి అయింది. క్యాబినెట్ మంత్రులు, ఉపమంత్రులు  విదేశీశాఖ కు చెందిన కార్యదర్శులు, విలేఖరులు, ఇంకా మందీ, మార్బలం  ఆయనతో వెళ్లిన వారంతా విమానంలో ఉన్నారు.
పదుల సంఖ్యలో వెళ్లిన విలేఖరులలో ఒక సీనియర్ రచయిత గుర్నాధం కూడా ఉన్నారు. ప్రధానమంత్రి  ఆయనను బాగా అభిమానించేవారు. గుర్నాధం మంచి చమత్కారి కూడా. విమానం ల్యాండ్ అయ్యే ముందు ప్రధానమంత్రి గుర్నాధంగారిని పిలిచితన పక్క సీటులో కూర్చోబెట్టుకుని ఏదో మాట్లాడారు. విమానం ల్యాండ్ అవుతోందని ఆయన అక్కడే కూర్చుండి పోయారు.
ఢిల్లీలో విమానం ల్యాండ్ అయింది. పది నిముషాలలో పార్కింగ్  బే లో వచ్చి ఆగింది.  ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి ముందుగా దిగి వెళ్ళాలి.
తరువాత వరుసగా క్యాబినెట్ మంత్రులు,ఉపమంత్రులు సెక్రటరీలు 'ప్రోటోకాల్' ప్రకారం ఒక్కొకరుగా దిగాలి.
ఫ్లైట్ కెప్టెన్, ఎయిర్ హోస్టెస్' ద్వారం దగ్గర ఉండి వెళ్లేవారికి వీడ్కోలు నమస్కారం చేయడానికి తయారుగా ఉన్నారు. ప్రధానమంత్రి ముందుగా దిగివెళ్ళాలి.
ఎయిర్ హోస్టెస్ డోర్ తెరిచి దిగవొచ్చు అన్న సంకేతం ఇవ్వడమే తరువాయి మన గుర్నాథంగారు ప్రధాన మంత్రితో మాట్లాడుతూ కలిసి 'ద్వారం' దగ్గరికి వచ్చారు ప్రోటోకాల్ పాటించకుండా.
ఇదిగమనించిన ఎయిర్ హోస్టెస్ చేయి అడ్డంగా పెట్టి  గుర్నాధం గారిని  ఆపుతూ 'వెయిట్ ప్లీజ్' అన్నది ఎయిర్ హోస్టెస్.
'సెవెంటీ నైన్'  ప్లీజ్ అంటూ  తాపీగా దిగి వెళ్లారు జర్నలిస్ట్, రచయిత 'గుర్నాధం' గారు 
                                     * * *                     * * *                     * * *