లేబుళ్లు

1, జూన్ 2013, శనివారం

సూక్తులు / సుభాషితాలు ( Quotes / Sermons / Sookthulu / Subhashithaalu)

                    సూక్తులు  /  సుభాషితాలు ( Sookthulu (Sermons) / Subhashithaalu)
                       -----------------------------------------------------------------------------

      
  • సూక్తులు, సుభాషితాలు అంటే మన పూర్వీకులు, పెద్దలు , మేధావులు  చెప్పిన మంచి మాటలు.
  • ఆడం ఆపిల్ తిన్నాడు మన దంతాలు  ఇంకా నొప్పెడుతూనే వున్నాయి.   
  • చేయకూడని పనులు చేయడం  వలన మనిషి ఏ విధంగా చెడిపోతాడో, చేయవలసిన పనులు చేయకపోవడంవల్ల కూడా అంతే చెడిపోతాడు.   
  • రెండు విషయాలు మనిషిని ఆవిష్కరిస్తాయి  :-  ఒకటి :  నీ ఓపిక, నీ నిలకడ .... నీ దగ్గర ఏమీ లేనప్పుడు        రెండు:  సమాజంపట్ల  నీ వైఖరి నీ నడత ... నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు.     
  • నిన్ను నువ్వు పొగుడుకోకు .... ఎవరూ హర్షించరు. నిన్ను నువ్వు కించపరుచుకోకు .... అదే  నిజమని అందరూ నమ్ముతారు. 
  • మనిషికి అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే తానేమిటో తనకి తెలుస్తుంది.
  • ప్రతికూలతలు  మనిషికి మతాన్ని గుర్తుచేస్తాయి.
  • వ్యాపారం బాగున్నప్పుడు అదే ప్రచారం ఖర్చు భరిస్తుంది. అదే వ్యాపారం బాగాలేనప్పుడు ప్రచారం ఖర్చునువ్వే భరించాలి.
  • యుద్ధానికి పొమ్మనికాని, పెళ్లి చేసుకొమ్మని కాని ఎప్పుడూ ఎవ్వరికీ సలహా ఇవ్వకు.
  • సలహా ఇచ్చినంత తేలిగ్గా మనుషులు ఉదారంగా దేన్నీఇవ్వరు.
  • గొప్ప పూర్వీకులతో విందు అంత పసందుగా వుండదు.
  • కోపంతో వున్నప్పుడు ఎప్పుడూ, ఏ ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇవ్వకు.
  • తన కోపమే తన శత్రువు.
  • దురాశ దుఃఖానికి హేతువు.   
  • ఆడంబరాలతో అతిశయం ఏర్పడుతుంది.  
  • వెలుగు నంటే వుంటుంది చీకటి.
  • మనిషి తనని తాను నియంత్రించుకోగలగడం కంటే గొప్ప విజయం  లేదు.
  • సానుకూల పరిణామాలు మనల్ని ఉత్సాహపరుస్తున్న సమయంలోనే కొన్ని ప్రతికూల సంఘటనలొచ్చి కుంగదీస్తాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మార్గం నుంచి పక్కకు తొలగే పరిస్థితులను కల్పిస్తాయి. అలాంటి ఎన్నెన్నో ప్రతికూల పరిణామాలను కూడా ఎదురీది విజేతగా నిలిచిన వారు నిజమైన దీరోదాత్తులు.  
  • తన బలం, బలహీనతలు తెలుసుకుని బలహీనతలు అధిగమించే మనిషికి ఆత్మవిశ్వాసం మెండు.
  • ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నమనిషి  ప్రతికూల పరిస్థితుల్లో కూడాతనని తాను  'ఆవిష్కరించుకోవడం' లో కూడా ముందుంటాడు, విజేతగా నిలుస్తాడు.  
  • కోరికల వల్ల కోపం, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల  మరుపు, మరుపు వల్ల బుద్ధిహీనత అన్నది గీతాసారం. ఇందులో రహస్యాన్ని తెలుసుకున్న మనిషికి  'వివేచన'  కల్గుతుంది. 'వివేచన' కల్గిన మనిషి ప్రశాంతంత అలవడుతుంది. 
  • తాత్వికులు 'జ్ఞానాన్ని' మూడు విధాలుగా సముపార్జించవచ్చు అంటారు.  అందున మొదటిది  'అనుకరణ' (అంటే అనుకరించడం), రెండవది 'చింతన'. (అంటే గ్రహించడం) మూడవది 'అనుభవం'. ఇది అన్నిటికంటే కష్టమైనది, చేదైనది. అంటే స్వానుభవంతో నేర్చుకునే పధ్ధతి. 
  • తమ తమ శాస్త్రాలలో నిష్ణాతులమని చెప్పుకునేవారు కూడా 'ప్రయోగాలు' కొనసాగిస్తూనే ఉంటారు. అంటే వారికి ఇంకా తెలియనిఉన్నాయనే కదా. ఎన్నో తెలిసినా నాకింకా ఏమీ తెలీదని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పిన వ్యక్తి ' సోక్రటీసు' ఒక్కడే !
  • సప్తపాతకాలు :  దురహంకారం, అర్ధలోభం, కామం, వైషమ్యం, కోపం,శతృత్వం, సోమరితనం.  
  • దుర్లక్షణాలు : కామ, క్రోధ ,లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
  • కొన్ని విషయాల్లో అత్యవసరంగా  ఆపద్ధర్మంగా అసత్యమాడవచ్చునన్న'రాయితీ' నిచ్చింది మనకు  'మహాభారతకావ్యం'. కానీ అది సాకుగా తీసుకుని సకల సందర్భాలలో బొంకడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. అంటే మహాభారతంలో మనకు కొన్ని సందర్భాలలో అబద్ధామాడవచ్చు అని చెప్పిన దాన్నిఒక్క ముక్కలో చెప్పాలంటే ఆపద్ధర్మాలను నిత్యధర్మాలుగా మార్చి దుర్వినియోగం చేస్తున్నామనడంలో ఏమాత్రం  అతిశయోక్తి లేదు. 
  • అనుమానం పెనుభూతం. అది మనిషిని ఎంతటి నీచత్వానికైనా దిగజారుస్తుందని  పెద్దలెన్నడో చెప్పారు.
    మదిలో ఒకసారి అనుమాన బీజం పడితే చాలు  అది మనిషిని దిద్దుకోలేని తప్పులు చేయిస్తుంది. మనసును నిలువెల్లా కలుషితం చేసి హేతుబద్ధమైన ఆలోచనాశక్తిని నాశనం చేస్తుంది.
    అంతటితో ఆగదు. బుద్ధిని వక్రమార్గం పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే నీచత్వానికి దిగజారుస్తుంది.
    అంతే కాదు. మనిషిని క్రూరులుగా మారుస్తుంది.                      
  • మనుషులు 'సాయం ' చేసినంతమాత్రాన వారిలో  నీచత్వాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు !
  • ఏదీ అనుకున్నట్లుగా జరుగకపోవచ్చు. కానీ  'కరుణ' 'రాజీ' అన్నవి మనుషుల జీవితాల్లో చాలా అవసరం.
  • పురుషుడు నిష్క్రమిస్తే గదిలో ఏదో వదిలి వెళ్తాడు. అదే స్త్రీ నిష్క్రమిస్తే గది శూన్యమే. చివరికి జ్ఞాపకాలని కూడా తీసుకు వెళ్తుంది. 
  • అంతర్లోకాలలో  'నిధి' నిక్షిప్తం చేసుకునే వారు కొందరే. దాన్నెవరు  కొల్లగొట్టకుండా జాగ్రత్తపడాలి. 
  • నిజమైన ఆనందమంటే కొత్త విషయాలను తెలుసుకుందామనే కుతూహలమే.
  • సఫలమైనా, విఫలమైనా 'ప్రేమ' జీవితాలని మార్చివేస్తుంది. 
  • ఈ సకల చరాచర 'సృష్టి' లో ఒక్క మనిషికి తప్ప మరి దేనికీ జీవితాన్ని తన ఇచ్చానుసారం మలుచుకోగల జ్ఞానం గానీ అవకాశంగానీ సంపూర్ణంగా లేదు. 
  • భగవంతుని సృష్టిలో ప్రతిదీ అర్ధవంతమే. వ్యర్ధమేదీ లేదు. ఎటొచ్చీ వాటి ప్రాధాన్యం మనకు అర్ధం కానంతవరకు అవి వ్యర్ధమని అపోహపడుతుంటాము.
  • సాధన, శోధన, తపన, ఆవేదన, సంకల్పం  అనేవి  జిజ్ఞాసను వృద్ధిపరచుకునేందుకు అనువైన లక్షణాలు.    
  • జిజ్ఞాస లేకపోతే జ్ఞానం పెరగదు. జ్ఞానవృద్ధి జరక్కపోతే 'మేధ' వికసించదు. మేధ లేని నరుడు భూమికి, జాతికీ భారమవుతాడు. జిజ్ఞాస పిపాసికే ఆత్మజ్ఞాన ప్రాప్తి సాధ్యం. 
  • పాపాలు చేసి దేనినీ సంపాదించవద్దు.
  • అతి 'ఖర్చు' అప్పులకు దారి.
  • అతి తిండి అజీర్తికి హేతువు.
  • మనఃస్పర్ధలు కలిగించేలా మాట్లాడకండి. 
  • జీవితంలో 'ప్రాధాన్యాలు' లేకుంటే జీవితం 'స్తబ్దు'గా తయారవుతుంది. అందుకే మనిషి  తన జీవితంలో తగిన  'ప్రాధాన్యాలు' ఎంచుకుని అటుగా పయనం సాగించాలి.                                                    
  • 'నాగరిక జాతి' మాతృభాషలోనే మాట్లాడుతుంది' అని ప్రముఖ ఆంగ్ల కవి  డబ్ల్యూ.బి.ఈట్స్ వాఖ్యానించాడు. దీన్నిబట్టి  మనం మనది అంటే 'తెలుగువారిది' నాగరిక జాతి  అవునో, కాదో నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమయింది.                             
  • ఓర్పు, సహనం ఎంత చేదుగా ఉంటాయో వాటి వల్ల లభించే ఫలం అంత తియ్యగా ఉంటుంది.
  • ఆత్మ విశ్వాశం మనిషికి పెట్టని ఆభరణం.
  • భయపడే మనస్తత్వం ఉన్నవారికి ఎప్పుడు ప్రమాదం పొంచే ఉంటుంది.
  • పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి.
  • ఇతరుల అభిప్రాయాలకు భయపడినంత కాలం మనం ఏ పనిలోనూ విజయం సాధించలేము.
  • ఈలోకంలో నాకేమీ తెలియదని తప్పించుకునేవాడు చాలా తెలివికలవాడు. నాకు అన్నీ తెలుసు
    అని చెప్పేవాడు నిందల పాలవుతాడు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు చాలా
    బుద్దిమంతుడనిపించుకుంటాడు.
  • రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు. రోజువారీ నీ దినచర్యలోనే ఉంది !
  • హృదయం నిండా ఇతరులపట్ల సానుభూతి పొంగిపొరలే మనిషికి మాత్రమే వారిని విమర్శించే
    అధికారం ఉంటుంది.
  • ఏ ఆదర్శము లేని మనిషి తెడ్డు లేని నావ వంటివాడు.
  • జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితంరోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాల్ని నేర్పుతుంది.
    ఏ దేశానికైనా పెద్ద సంఖ్యా బలం ఉంటె చాలదు. ప్రజలు విద్యావంతులై , చైతన్యవంతులై,
    ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే  'జాతి'  జాగృతమవుతుంది, బాగుపడుతుంది.
  • ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓర్పు, సహనంతో వెతికితే అది దొరుకుతుంది.
  • ప్రోత్సాహం లేదని మంచిపనిని వాయిదా వేయకండి.
  • అహంకారం కలవారు అవతలిమనిషిని మనసారా అభినందించలేరు.
  • విజయం సాధించిన ప్రతి మనిషి వెనక  ఓ సాహసోపేతమైన నిర్ణయం తప్పక ఉండేవుంటుంది.
  • అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. అది జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
  • వేలకోట్ల ధనరాసుల కధిపతివైనా ఒక్క 'నిముషం' ఆయుషుని కొనలేవని తెలుసుకో!
  • నీ పొరపాట్లు, తొందరపాటు మరొకరికి అగచాటు కాకూడదు.
  • నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకిచ్చింది నీ 'పాలు'.
  • అనుకున్నామని జరగవు అన్నీ....అనుకోలేదని ఆగవు కొన్ని!
  • మనకు కావాలి అనుకున్నది దొరకనప్పుడు మనకు దొరికినదే 'కావాలి' అని అనుకోవడం ఉత్తమం.
  • జరిగేదేదో జరుగక మానదు. నీ అనవసర ఆందోళనతో జరిగే మార్పు ఏమీ ఉండదు.              
  • 'కల'లంటే నిద్రలో వచ్చేవే కాదు అవి సాకారం అయ్యేదాకా నిద్ర పోనివ్వనివి కూడా ! '
  • అందరినీ అన్నివేళలా సంతృప్తిపరచాలంటే ఓటమి తప్పదు.   
  • 'విజయం'  నిన్ను పదిమందికి పరిచయం చేస్తుంది. ఓటమి తో నీకు ప్రపంచం పరచయమవుతుంది. 
  • 'విజయాలు' తలకెక్కుతే  ఇక విజయాల బాట తప్పినట్లే ! 
  • 'విజయం ...గెలుపు'  శాశ్వతం కావు .  అలాగే  అపజయం, ఓటమి  'అంతిమం' కావు.  
  • వైఫల్యాలు  సాధారణంగా 'నిరాశ, నిర్లిప్తత'కు దారితీస్తాయి. వాటిని  అధిగమించే వాడే గెలుపు బాట  పడతాడు'. 
  • ఇతరుల్ని అదేపనిగా ప్రశ్నిస్తూ 'సవాలు' చేయువాడు, ఆక్షేపించువాడు, ప్రతివిషయాన్ని అభ్యంతరపెట్టువాడు ఏదో ఒకరోజు ఓడిపోకతప్పదు. అదే తనని తాను  'ప్రశ్నించు' కొనువాడు నిజ వర్తమానంలో జీవిస్తాడు ! ఆట కానీ, జీవితం కానీ  గెలుపు, ఓటములు సమానంగా తీసుకుంటేనే మనిషి మనుగడ.
  • చీకటి వెంట వెలుగు ఎలానో ఓటమి తరువాత గెలుపు అంతే అనుకోని రోజున మనిషి ప్రయత్నం చెయ్యడం మానేస్తాడు.
  • మనిషి  ఏ 'ప్రయత్నం' చేయని రోజున సృష్టి స్తబ్దుగా తయారవుతుంది.
  • భక్తి మార్గాలు :   సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం. (తొమ్మిది ) 
  • అష్ట దిక్పాలకులు : ఇంద్రుడు (తూర్పు), అగ్ని ( ఆగ్నేయం), యముడు (దక్షిణం), నిర్రుతి ( నైరుతి), వరుణుడు(పశ్చిమం), వాయు దేవుడు (వాయవ్యం), కుబేరుడు (ఉత్తరం), ఈశానుడు (ఈశాన్యం) 
  • అష్టపాశములు :  దయ, శంక, భయం,లజ్జ, జుగుప్స, కులం, శీలం, జాతి. ( ఈ అష్ట పాశములు మానవుణ్ణి 'సంసార బంధనం'లో  కట్టిపడేశాయి. 
  • అష్ట ఐశ్వర్యాలు :  ధనము, ధాన్యము, పుత్రులు,మిత్రులు,బంధువులు,వాహనములు, భ్రుత్యులు, దాసీజనము. 
  • నవధాన్యములు : వరి, కందులు, పెసలు, మినుములు, ఉలవలు,శెనగలు, గోధుమలు, నువ్వులు, అనుములు.        
  • అష్టకష్టాలు : దారిద్యం, అప్పు, యాచన ( బిచ్చమెత్తుకోవడం) , జారత్వం(వ్యభిచారం ), చోరత్వం (దొంగతనము), రోగం, వ్రుద్ధ్యాప్యం (ముసలితనం), ఉచ్చిష్ట భోజనం (ఎంగిలిమేతుకులు తినడం)
  • దూర దూరంగా నాటిన  'మొక్కలు'  కూడా పెరిగిన తరువాత  దగ్గరవుతాయి  కానీ 'మనుషులు'  ఎదిగే కొద్దీ  మనస్సులు  దూరమవుతున్నాయి.  
  • గొప్పగా తెలిసిన  వాళ్ళూ గోతిలో పడతారు. 
  • తన బలం కన్నా స్థాన బలం మిన్న. 
  • నిన్ను అకారణంగా పొగుడుతున్న వాడితో జాగ్రత్తగా ఉండు. 
  • ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు. 
  • 'తప్పులు' కోపాన్ని, 'క్షమ' శాంతాన్ని ప్రసాదిస్తాయి. 
  • అందరిని విశ్వసించకు. అలాగే అందరిని అనుమానించకు. 
  • యవ్వనం, నీడ, జీవితం,మనసు,ధనం, ప్రభుత్వం చంచలమైనవి. 
  • ఆడంబరం పెరిగే కొద్దీ  అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగేకొద్దీ  అనుబంధాలు తగ్గిపోతాయి. 
  • మనిషి వయస్సుతోపాటు రాగ, ద్వేషాలు కూడా మారుతూ ఉంటాయి. 
  • ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. 
  • నేల, నింగి, గాలి, నీరు, నిప్పు  అనేవి 'పంచభూతాలు'. 
  • మనిషి దేహం  'పాంచ భౌతికం'
  • పంచభూతాల సమాహారమే ఈ భూ భౌతిక ప్రపంచం. 
  • ధనార్జన చేయువానికి గురువులు, బంధువులు అన్నది ఉండదు. ఆకలిగొన్నవాడికి రుచి, పక్వం పట్టింపు ఉండదు. నేర్చుకోవాలి(చదువుకోవాలి) అన్న దృష్టి ఉన్నవాడికి నిద్ర, సుఖము తెలియదు. కోరికలతో సతమతమయ్యేవాడికి భయము, సిగ్గు ఉండవు.
  • ధనార్జన చేయువారికి గురువులు, బంధువులు అన్నతేడా ఉండదు. నిద్ర సుఖాన్ని ఎరగదు. కోరికలతో సతమతమయ్యే వ్యక్తులు భయము, లజ్జ లకు వెరవరు.        
  • ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. అదే నీవు ఏదైనా చిన్న తప్పు చేసినా కొండంతగా చూడు.
  • అభిప్రాయాలు మార్చుకోలేని మనిషి తనతప్పులు దిద్దుకోలేడు. నేటికంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలంటే కాలంతోపాటు మనిషిలో మార్పు అవసరం.
  • ఒక వ్యక్తి గురించి 'కధలు' వినాలంటే పక్క వారితో మాట్లాడండి. 'నిజాలు' వినాలంటే అతనితో మాట్లాడండి.
  • కోరికలులేని జీవితం నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ స్వంతమవుతుంది.
  • ఎక్కడ గెలిచినా (నెగ్గినా) నీవు పదిమందికి తెలుస్తావు.అదే ఓడిపోతే ప్రపంచం ఏమిటో  నీకు తెలుస్తుంది.
  • నీ తప్పు నీతో చెప్పేవాడు నీ స్నేహితుడు. అదే ఇతరులకు చెప్పేవాడు నీకు సరైన మిత్రుడు కాలేడు.  
  • విచిత్ర ప్రపంచం. పేద 'ఆహారం' సంపాదించడానికి కోసం మైళ్ళు నడుస్తాడు అదే 'ఆహారం' అరగడానికి  ధనికుడు మైళ్ళు నడుస్తాడు.
  • మనిషిలో 'ఆవేశం' ముందడుగు వేసిన ప్రతిసారి 'ఆలోచన' రెండడుగులు వెనక్కి వేస్తుంది.
  • ఓటమి,ఒంటరితనం ఈ రెండూ జీవితమంటే ఏమిటో నీకు సంపూర్ణంగా నేర్పుతాయి.
  • సమయం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు సమయం చేసుకుని గడుపు.
  • రావణ రాజ్యంలో విభీషణుడు,రామ రాజ్యంలో కైకేయి....భిన్న వ్యక్తిత్వాలు భిన్నప్రదేశాల్లో ఉంటారు.   
  • మనకు ఇష్టంలేని వ్యక్తులతోకూడా మంచిగాఉంటున్నామంటే మనం నటిస్తున్నట్లు కాదు. అవతల వ్యక్తుల అయిష్టాన్ని కూడా భరించి అర్ధంచేసుకుని ఙ్ఞానం మనకు ఉందని అర్ధం.
  • 'సమస్య' లేకుంటే మీ జీవితంలో కొత్తదనమేమీ లేదు. మీరెప్పుడూ జీవితంలో ఓడిపోలేదంటే మీరెప్పుడూ కొత్తదేమీ ప్రయత్నించలేదని అర్ధం.
  • ఒకరికి సహాయం చేయాలనుకుంటే కావలసింది డబ్బు కాదు మంచి మనస్సు.
  • మనుషుల మధ్య బంధాలు వాటంతట అవే దూరంకావు. వ్యక్తిత్వాలవల్లనో, ప్రవర్తనవల్లనో లేక వ్యక్తులపట్ల నిర్లక్ష్యము వల్లనో అవి దూరమవుతాయి.
  • ఎవరినైనా నీజీవితంలో నుంచి నీ మనః శాంతి కోసం తొలగించాల్సి వస్తే  దానికి నీవేమి బాధపడవలసిన పనిలేదు
  • నీ అనవసరపు అహంకారం నిన్ను అందరికీ దూరం చేస్తుంది.
  • విమర్శ ఎప్పుడూ సున్నితంగా,ఆలోచనాత్మకంగా, వివరంగా ఉండాలి. అతిగా ఉండకూడదు. పదే పదే తప్పుచేసేవాడిని మాత్రమే వ్యక్తిగతంగా విమర్శించవచ్చును.
  • కస్టాలు నిన్ను నాశనం చేయడానికి రావు. నీలో శక్తిసామర్ధ్యాలను వెలికి తీసేందుకు, నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు  మాత్రమే వస్తాయని భావించాలి.
  • నిన్ను వేధించే ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉండేతీరుతుంది. ఒకవేళ సమాధానం లేని  ప్రశ్న అవుతే సమస్య ప్రశ్నది కాదు...ప్రయత్నానిది!
  • అత్తలేని కోడలుత్తమురాలు  కోడల్లేని అత్త గుణవంతురాలు.
  • దేవుడు వరాలను ఇవ్వడు. అలాగే శాపాలను కూడా ఇవ్వడు. అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని అందిపుచ్చు కోవడం మన చేతుల్లోనే ఉంది. 
  • చేయలేమని కొన్నింటిని, కష్టమని కొన్నింటిని , చిన్నవని కొన్నింటిని వదిలేస్తే చివరకి ఏమీచేయని కొఱగానివాడిగా, ఏమీచేతగాని వాడిగా మిగిలిపోతావు. 
  • కాలంతో సమానంగా నడువు. కాలంతో స్నేహం చెయ్యి. ఆ కాలమే నీకు తోడుగా ఉటుంది. 
  • ప్రతి మనిషి జీవితంలో అతికష్టమైన పని నిన్ను నీవు తెలుసుకోవడం. అతి తేలికయిన పని ఇతరులకు సలహా ఇవ్వడం.  
  • విజయం. బద్దకం రైలు పట్టాల్లాంటివి...అవి రెండు ఎన్నడూ కలవవు.
  • నీటిలో పడవ ఉండాలికాని పడవలో నీరుండరాదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలతో జీవితాన్ని గడపరాదు.  
  • విచిత్రం ! మనిషి సంతోషంతో ఉన్నప్పుడు తప్పులు / పాపాలు  ఎక్కువగా చేస్తాడు. అదే    కష్టాలలో ఉన్నప్పుడు ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తాడు. 
  • కావాలన్నా తిరిగిరానిది 'గతం'. వద్దనుకున్నా వచ్చేది, తప్పనిది 'మరణం'.ఎంత ఉన్నా చాలనిది 'ధనం'.
  • సుఖాల్లో పట్టుకున్న చేతులకంటే కష్టాల్లో వదిలేసినా చేతులెప్పటికీ గుర్తుండి పోతాయి.
  • అన్నీ సాగితే 'రోగం' అంత భోగం లేదట. 
  • కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందట. 
  • అపద్ధాలు ఆడరా అంటే టంగుటూరు ఆవాలు తాటికాయలంత అన్నాడట.
  • చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద.
  • ఓటమి, ఒంటరితనం మనిషి జీవితంలో చాల నేర్పిస్తాయి. ఓటమి గెలవడాన్ని నేర్పిస్తే రెండోది ఎవరిని నమ్మాలో, ఎలా జీవించాలో నేర్పిస్తుంది.
  • జీవితంలో ముళ్లబాటలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు నీతో ఎవరున్నారో వాళ్ళని జీవితాంతం మర్చిపోకు.
  • నవ్వుతూ ఉండేవాళ్ళు తమలో ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. నవ్వలేని వాళ్ళు ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు                                                          
                                         
                 
       సంకలనం : కేశిరాజు వెంకట వరదయ్య
       మొబైల్ నం: 98491 18254
   

24, మార్చి 2013, ఆదివారం

 (తెలుగు అక్షరములు,గుడింతములు,విభక్తులు)
                                                                
                                                                 తెలుగు అక్షరములు

                                అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ (రు ) ౠ(రూ) ఌ (లు) ఎ ఏ ఐ  ఒ ఓ ఔ  అం  అః
                                          క ఖ గ ఘ  చ ఛ జ ఝ  ట డ ఢ ణ త థ ద ధ న
                                               ప ఫ బ భ మ  య ర ల వ శ ష స హ ళ క్ష ఱ







 తెలుగు  గుడింతములు 
అ   ఆ 
అం
అః
కా
కి
కీ
కు
కూ
కృ
కౄ
కె
కే
కై
కొ
కో
కౌ
కం
కః
 



ప్రత్యయములు - విభక్తులు


డు, ము, వు, లు - ప్రథమా విభక్తి


నిన్, నున్, లన్, గూర్చి, గురించి - ద్వితీయా విభక్తి


చేతన్, చేన్, తోడన్, తోన్ - తృతీయా విభక్తి


కొఱకున్ (కొరకు), కై - చతుర్ధీ విభక్తి
 

వలనన్, కంటెన్, పట్టి - పంచమీ విభక్తి


కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ -  షష్ఠీ విభక్తి


అందున్, నన్ - సప్తమీ విభక్తి 
 
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ - సంబోధనా ప్రథమా విభక్తి
 
(సూచన : ప్రత్యయములు - విభక్తులు  తెలుగుభాషలో వీటి యొక్క ప్రాశస్త్యం - వాడుక (ఉపయోగం )  గురించి వివరణ త్వరలో ఇవ్వగలను )