లేబుళ్లు

26, జులై 2010, సోమవారం

powra hakkulu, baadhyatalu.

ఆదివారం 25 జూలై 2010



                                                       పౌర హక్కులు, బాధ్యతలు   
మన దేశ పౌరులలో ఎంతమందికి తమ,తమ హక్కుల గురించిగాని బాధ్యతల గురించిగాని తెలుసు అన్నది తర్కిస్తే వచ్చే సమాధానం ఖచ్చితంగా 35 % కంటే ఎక్కువుండరు అన్నదానిలో ఏమాత్రం సందేహంలేదు. సరే, ఈ 35 % పౌరులగురించి
మాట్లాడుదామంటే వారిలో ఎంతమంది తమ పౌర హక్కులు పోరాడకుండా సాధించుకుంటున్నారు, అలాగే ఎంతమంది తమ బాధ్యతలను నిర్వస్తిస్తున్నారు అని ఆరా తీస్తే వచ్చే సమాధానం సమ్మిళితమే. మన ఈ స్వతంత్ర భారతావనిలో పోరాడకుండా హక్కులు సాధిస్తున్నవారు ఎవరు అంటే ఖచ్చితంగా దాని సమాధానం మాత్రం మన దేశ ప్రస్తుత పార్లమెంటు / అసెంబ్లీ
సభ్యులు, న్యాయాదీశులు, ప్రభుత్వ ప్రధమ శ్రేణి కార్య నిర్వహణాధికారులు, ఆ ఫై కొద్దిమంది అతి ధనవంతులు, ఇతరులు.
ఇదండీ మన స్వతంత్ర భారతావనిలో రాజ్యాంగ బద్ధమైన హక్కులు అనుభావిస్తున్నవారి సంఖ్య.
దీనిలో లేశ మైనా అతిశయోక్తి లేదు.

అసలు పౌర హక్కుల గురించి తెలియక పోవడం వేరు. తెలిసి వాటిని పొందలేకపోవడం అంటే ఏమిటి అని ఈరోజు ఒక పదవతరగతి విద్యార్ధి నుంచి డిగ్రీ చదివే విద్యార్ధి వరకు ప్రశ్నించి చూడండి.
నూటికి 90 మంది పైగా తెల్లముఖం వేసే వాళ్ళే. ఆ పదిమందీ ఎవరయ్యా అంటే పైన
చెప్పిన పౌరుల పిల్లలే వారు కాని సగటు పౌరుల పిల్లలూ మాత్రం కాదు.
ఉదాహరణకు ఒక వీధిలో ఉన్న దేవాలయమో,మసీదు, చర్చి నుంచో మైకు శబ్దం తో ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే నో, నివాస స్థలాల్లో వ్యాపార సంస్థలు ఇబ్బంది పెడుతుంటే నో, మునిసిపాలిటి వారు త్రాగే మంచి నీరు సరఫరా చేయ కుంటే నో,
ఎదైనా ఆసుపత్రిలో ఓ కంటి బదులు ఇంకో కన్ను తీసేస్తోనో, హైదరాబాదు లో పాస్స్పోర్ట్ (Passport) సంబంధించిన పని ఎంతకైనా కాకుంటేనో, ఒక రేషన్ కార్డు పొంద లేకపోతేనో , ఇంటి పక్కన రాజకీయనాయకుడో లేక ప్రభుత్వ ఓ పెద్ద అధికారో నన్ను నా ఇంటినుంచి  అకారణంగా  పొమ్మంటే పోలీసులు నా పిర్యాదు తీసుకోక నా పైనే కేసు బనాయించడమో చేస్తుంటే నో , ఇక్కడ నా హక్కులు ఏమిటి, దానిని ఎవరు కాపాడుతారు? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
ఎదురుతిరిగామా ఎదురుదెబ్బలు కాచుకునే శక్తి సగటు పౌరునికి ఎంత వరకు వుంది ?
ఈజీవన గమనంలో ప్రతి పౌరుడికి ఇలాంటి సమస్యలు ఎన్నెన్నో!
ఎంతమంది ఇటువంటి విషయాల్లో పోరాడుతున్నారు? ఎంతమంది సర్దుకు పోతున్నారు? ప్రతి వ్యక్తి / పౌరుడు తమ చిన్న చిన్న
హక్కుల కోసం పోరాడాలంటే సాధ్యమా? అతని చిన్న జీవిత గమనానికి ఈ హక్కుల పోరాటం ఎంత అఘాతం?
మొన్న కేరళలో ఒక ఉపాధ్యాయుని చేయి నరికేశారు. ఎందుకు? అతని హక్కులేమయ్యాయి!
మాయగా, ఉన్నట్లు గానే ఉండీ ప్రతి వ్యక్తికి అందని హక్కులు ఉండీ ప్రయోజనం ఏమిటి? ఈ సమాజం లో ప్రతి వ్యక్తి కోసం ఈ వ్యవస్థ పనిచేయడం ఎప్పుడు ప్రారంభ మవుతుంది?

ఈ సమస్యకు మూలం నాకు తెలిసినంతవరకు ఈ దేశ పోలీసు యంత్రాంగమే!
అమెరికాలో దేశాధ్యక్షుని కూతురు త్రాగి గొడవ చేస్తే లోపల వేశేసారు పోలీసులు.ఈవిషయం వెంటనే దేశాధ్యక్షుని సహాయకుడు
ఆయన చెవినవేస్తే, కానివ్వండి, ఆమె తప్పు చేసింది శిక్ష అనుభవించాలి కదా! ఇందులో నేనేమి చేయగలను? అని ఊరుకున్నారు. అలాంటిది ఈ దేశం లో సాధ్యమా?
సవ్యమైన, సక్రమ మైన, నిష్పక్షపాత మైన పోలీసింగ్ (policing) ఉన్న దేశమే మానవ  హక్కుల్ని కాపాడగలదు. అలాటి దేశం లోనే ప్రజ, దేశం  సరైన అభివృద్ధి పధం లో పయనించగలదు. ఈ పోటీ ప్రపంచంలో తగిన స్థానం సంపాదించ గలదు   .   

ఈ దేశంలో పోలీసులని బ్రిటిష్ వారి పాలనలో వారిని ఈదేశ స్వాతంత్ర సమర యోధుల నుంచి, విప్లవ కారుల నుంచి రక్షించు కునేందుకు నియమించుకున్నారు. కాని, ఈరోజు కూడా ఈదేశ పోలీసు వ్యవస్థ పాలకుల రక్షణలో పునీతమవుతోంది.
ఏరోజైతే ఈ దేశ పోలీసు ప్రతి సామాన్య పౌరుడిని  పాలకులతోను, బలవంతులతోను,ధనవంతులతోను సమానంగా చూస్తారో ఆ రోజు పౌర హక్కులు వ్యవస్థీకృత మవుతాయి.
ప్రతి పౌరుడు ఈ దేశ రాజ్యాగం ఇచ్చిన హక్కుల్ని స్వేచ్చగా అనుభవించ గలుగుతాడు.
అంచేత, పోలీసులూ ఈ దేశ భవిత, మానవ హక్కులు  మీ చేతుల్లో వున్నాయి.. మీ 'ప్రమాణాల్ని' సాకారం చేయండి!
ఇక పౌర బాధ్యతల విషయం కొద్దాం.
ఈ దేశ ప్రజలు నూటికి డెబ్బై మంది గ్రామీణులు.వ్యవసాయం మీద ఇతర కులవృత్తులమీద జీవనం సాగించే వాళ్ళే.
వారికి ఈ హక్కులు, బాధ్యతలు,రాజ్యాగం వాటిగురించి పెద్దగా తెలీదు, పట్టించుకునే సమయమూ వుండదు.
కాని వారి బాధ్యతలు మాత్రం అన్ని రాజ్యాంగ పరిధిలోనే నిర్వస్తిస్తుంటారు. అదే చిత్రం.
కుటుంబ పరంగా, పెద్దలనుంచి, తరతరాలనుంచి సంక్రమించిన ఆస్తుల్లా అన్ని బాధ్యతలూ సక్రమంగా
నిర్వస్తిస్తుంటారు. వారికి ఈ బాద్యతలు ఎవరు చెప్పారు? వారు ఎలా నేర్చుకున్నారు?
అంటే ఏదో వ్యవస్థ వారి కుటుంబ వ్యవస్థ లోనే తర తరాలనుంచి పాతుకుపోయి చక్కగా పని చేసుకుపోతోంది.
కాని ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ  తరాల మార్పుతో కొట్టు,మిట్టాడుతోంది.
అందుకే  బాధ్యతల  నిర్వహణ కూడా కుంటుపడింది.
ఇంకా ఇతర కారణాలేమంటే వసతుల లేమి, ఆర్ధిక స్తోమత లేకపోవడం, విచ్చిన్న మవుతున్న కుటుంబ వ్యవస్థ,
కుల వ్యవస్థ, ప్రపంచీకరణ,అర్దమవని విద్యావ్యవస్థ,కూలుతున్న వివాహ వ్యవస్థ.
ఇక మిగతా 30 % ప్రజల విషయాని  కొస్తే వారంతా పట్టణాల్లో వుండేవారు. వారికి పొద్దున్న లేస్తే పరుగులు.
వారి జీవన పరుగులో బాధ్యతలు, హక్కుల గురించి ఆలోచించే తీరిక లేదు.
అందుకే వారి థైనందిన జీవితం లో ఏదైనా బాధ్యత నిర్వర్తించారంటే అది వారి తల్లి తండ్రుల నుంచి కాని, స్కూల్ నుంచి వచ్చిన
క్రమశిక్షణ గాని, స్నేహితుల వల్ల గాని అయివుండవచ్చు. ఈ ఫలితం ఖచ్చితంగా పని చేస్తున్న వ్యవస్థదే. కాని చెప్పడానికీ చాలా బాధ్యతా రాహిత్యాలు చాల వున్నాయి. కొన్ని చిన్నఉదాహరణలు. రోడ్డు మీద సర్కస్ డ్రైవింగ్ , ఉమ్మడం, చెత్త వేయడం , స్త్రీలను, పెద్దవారిని అగౌరవపరచడం. ఆస్తులు ఆక్రమించడం, ఇది వ్యక్తులకి సంబంధించింది.
అసలు పెద్ద బాధ్యతా రాహిత్యం ప్రభుత్వ శాఖలదే. సరి అయిన రవాణా సౌకర్యాలు సమకూర్చక పోవడం, స్వచ్చమయిన త్రాగు నీరు సరఫరా చేయక పోవడం, స్వప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం, తమవారికే  వసతులు కల్పించడం, సగటు మనిషిని వర్గ బేధాలతో పట్టించుక పోవడం, తమ పదవి కోసం, తమ,తమ ప్రభుత్వ స్థాపనకోసం అలవికాని ప్రమాణాలు చేయడం,వాటి కోసం పన్నులు వేయడం, ఇవన్నీ బాధ్యతా రాహిత్యాలే.
అసలు రాజ్యాగం, అందులో పొందుపరిచిన దేశ భద్రత, సార్వభౌమత్వం, జాతీయ ఝండా, అన్ని మతాల్ని గౌరవించడం,ఇంకా ఇతర పౌర బాధ్యతల గురించి , హక్కుల గురించి  తరువాత  చర్చిస్తాను.

కేశిరాజు వెంకట వరదయ్య
Flat No.301, Meenakshi Raji Residency,Rd.No.14, Banjara hills, Hyderabad-500034.
Ph.No.040-23552052. Mob.No. 98491 18254.
 నోట్: ఈ వ్యాసం నా స్వతం. దేనీ  అనువాదం కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి