లేబుళ్లు

17, జనవరి 2012, మంగళవారం

మానవదేహం



                                                                        యోగభూమి 
                                                                      ***********

                           ఆధ్యాత్మిక రంగంలో  దేహంపట్ల  విభిన్న అభిప్రాయాలు, ధోరణలు ఉన్నాయి. అది అశాశ్వతమని దానికి   అంతగా మర్యాద ఇవ్వనవసరంలేదని  అంటూనే  పరమపద సాధనకు దేహం ఓ సాధనమని ,ఓ ఉపకరణమని దాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని  అంటుంటారు. ఈ రెండు వాస్తవాలే ! దేనినీ నిరాకరించనవసరం లేదు. నిజానికి దేహం పరమపద  సోపాన  అధిరోహణకు ఏకైక సాధనం. 
                          అసలు ఈ 'దేహం' ఏమిటి ? కైవల్య సాధనలో దాని పాత్ర ఏమిటి ? మనిషి జన్మించాక  తనదంటూ ఉన్నది, తనకంటూ ఉన్నది 'దేహం' మాత్రమే ! ప్రాపంచికమైనా , పారమార్ధిక మైనా ఆయా సాధనలకు మన దగ్గర ఏమున్నా లేకున్నా, అవసరమనుకున్నది లభ్యమైనా , కాకపోయినా దేహం మాత్రం మనతోనే ఉంటుంది. అదృష్ట వశాత్తు భగవత్సాధనకు అవసరమైన దేహాన్ని మాత్రం భగవంతుడు అప్రయత్నంగానే మనదగ్గరేముందో  దాన్నే మన సాధనోపకరణంగా మనకు నిర్దేశించాడు. బహూకరించాడు. ఇది ఓ అద్భుతం. అదృష్టం !
                           మరి అలాంటి ఈ దేహంతో మనం ఏమిచేయగలం ? ఆలంకరించు కోగలం తినగలం. తాగగలం.
నిద్రించగలం. సుఖభోగాలనుభచగలం. చివరకు  'దేహాన్ని'మరణించడం. అంతేనా....? అంతే......... దేహాన్ని దాని సృజనోద్దేశ్యాన్ని ఆహార నిద్రాభయ మైధునాల కోసం మాత్రమే అని ఆలోచించే వారికి, ఆమేరకే వినియోగించే వారికి  అంతే...............! వాస్తవంలో  ఈ సృష్టిలో 'దేహ సృష్టి' కి ఓ మహోన్నత  పవిత్రోద్దేశ్యం ఉంది. ఇంత కీలకమైన  దేహాన్ని దానిలోని సకల సారాన్ని కేవలం అజ్జ్ఞాన  స్థితిలో మనకందించాడు 'పరమాత్మ' ! ఎంత విచిత్రం ! ఆ పరమాత్మ అందిం చిన 'దేహంలో ' ఉన్న పరమాత్మను చూడలేని స్థితి మనది. ఆయనే అయిన మనం, మళ్ళీ ఆయనకోసమే అన్వేషించే విచిత్ర వర్తమాన స్థితి. మరి అలాంటి అపురూపమైన ఈ దేహాన్ని, ముఖ్యంగా అనిశ్చిత  మైన ఈదేహాన్నిఎన్ని కళ్ళతో కాపాడుకోవాలి ? ఎంత అప్రమత్తులమై ఉండాలి.  నిజమే.............ఈ దేహం అశాశ్వతమే! కాని దాని  సృజనోద్దేశ్యం ఉత్కృష్టమైనది. దాని కర్తవ్యం నిరుపమాన మైనది ! సౌందర్య వ్యక్త రూపంగా అహంకార ప్రదర్శన వేదికగా దాన్ని మలుచుకోవడం కాని , భావించడంగాని  సరికాదు . అందుకే అవసరాన్ని,ప్రయోజనాన్ని  మించి  దానిని కొలవడం  సరికాదని విజ్ఞులు  సూచిస్తారు. అందుకే దేహాన్ని సాత్విక , మితాహారంతో ఉపయుక్త జీవన విధానంతో దేహాన్ని ఆరోగ్యంగా, బలంగా ,బిగువుగా ఉంచుకోవలసిందే ! శుచి రీత్యా కొంత శారీరక సేవా అవసరమే....అంతవరకే!            

ఆరోగ్యానికి హరివిల్లు



ఆరోగ్యానికి హరివిల్లు
---------------

మనం తినే ఆహారం ఎంత వర్ణ రంజితంగా, వైవిధ్యంగా భరితంగా వుంటే ఆరోగ్యానికి అంత మంచిదని ప్రయోజ నకారి అని, పోషకాహార నిపుణుల ఉద్దేశ్యం. రకరకాల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ,ఒంటికీ కూడా విందు చేస్తుంది. ఈ రంగురంగుల వృక్ష సంబంధమైన ఆహరంలో కీలకపోషకాలైన కెరోటినాయిడ్లు, బయో ఫ్లవనోఇడ్లు వంటివి ఉంటాయి. ఇవి మనశరీరంలో విశ్రుంఖల కణాల (ఫ్రీ రేడికల్స్) దాడిని అడ్డుకుంటాయి. అంతే కాక ఇవి వయసుతో పాటు శరీరంలో, శరీర కణాజాలంలోవచ్చే క్షీణతను నిలవరిస్తూ కణజాలన్ని కాపాడుతూ ఉంటాయి.
                       టొమాటో, పుచ్చకాయ, ద్రాక్ష,అంజీర లాటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపెన్....జీవకణాలలో ఒత్తిడిని తగ్గించే 'యాంటీ ఆక్సిడెంట్' గానే గాక శరీరంలోపల రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
                       బొప్పాయి, క్యారట్లు, చిలగడ దుంప లాటి పసుపు, నారింజ రంగులలో ఉండే పండ్లు కూరగాయల్లో 'బీటా కేరోటిన్లు' అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎప్పటికప్పుడు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరిచడానికి కావలసిన శక్తిని ఇస్తూ ఆ వ్యవస్థను మెరుగుపరుస్తుంటాయి. విటమిన్ 'ఎ' లోపం రాకుండానే కాక 'కేన్సర్' కారక కణాలను నివారిస్తూ ఉంటాయి.
                      ఇక మసాలా దినుసులు, పసుపు, గ్రీన్ టి, బత్తాయి,నారింజ వంటి పండ్లు, దుంపలు, కూరగాయల్లో అధికంగా ఉండే బయో ఫ్లవనాయిడ్లు గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇలా సహజంగా లభ్యమయ్యే అన్ని రంగుల పండ్లు, కూరగాయలు, దినుసులు, అన్ని రకాల పదార్ధాలకు ఏదో ఆరోగ్య ప్రయోజనం ఉంది. కాబట్టి సహజంగా లభించే రంగు, రంగుల పదార్ధాలు మితంగా ఎన్ని తింటే అంత మంచిదని గుర్తించండి.
                      ప్రొద్దున మంచి ఉపాహారం, తరువాత మిత భోజనం ఆరోగ్యానికి మంచిదని గుర్తించండి.
పొద్దున్న ఉపాహారం మానేస్తే శక్తి హీనత, మధ్యాహ్నం, రాత్రి భోజనం మానేస్తే మొదటికే మోసమని తెలుసుకోవడం మంచిది.
                     ఉపవాసమనో లేక బరువు తగ్గుదామనో చాలామంది తరుచు ఉపవాసం చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయని గుర్తుంచుకోండి. ఖాళీ కడుపుతో ఉండడం వల్ల బలహీనత, అసిడిటి, అలసిపోవడం, తీవ్ర తలనొప్పులు వంటి బాధలు వేధిస్తాయి.
                      కొందరు తినడం మొదలెడితే గొంతు దాకా ఆబగా తినేస్తుంటారు....ఎవరో తరుముతున్నట్లు గబగబా వేగంగా తినేస్తుంటారు. ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. ఆహారం నెమ్మదిగా నమిలి, రుచిని అస్వాదిస్తూ తినడం మంచిది. వేగంగా తినే వాళ్లకి ఎంత తిన్నా కడుపు నిండిన భావన ఉండదట. ఎందుకంటే మన కడుపు ఖాళీగా ఉందా లేక ఇంకా తినాలా లేదా కడుపు నిండిందా....వంటి సమాచారాన్ని మన మెదడుకు చేరవేయడానికి మన శరీరంలోనే ఒక 'వ్యవస్థ' ఉంది. ఆ సమాచారం మెదడుకు అందించడానికి ఆ వ్యవస్థకు దాదాపు 20 నిముషాల వ్యవధి కావాలి. కొందరు ఆలోపునే భోజనం ముగిస్తారు. దాంతో  గబా గబా తినే వారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. వారికి కడుపు నిండిందా లేదా అన్న విషయం తెలీక ఆకలి తగ్గిందని మెదడుకు సరైన సమాచారం అందక ఇంకా తినేస్తు ఉంటారు. ఫలితంగా కావలసిన దానికన్నా ఎక్కువ తినడం, ఊబకాయం బారిన పడడం తధ్యం.
                    అందుకే ఆహారాన్ని నింపాదిగా నమలడం,  మితంగా తినడం పిల్లలకు నేర్పండి. భారత దేశంలో కూడా 'ఫాస్ట్ ఫుడ్'  అలవాట్ల మూలంగా 'ఊబకాయ' లక్షణాలు కన్పిస్తున్న పిల్లలు, పెద్దలు  ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. అందువల్ల ఆహారం తినడం విషయంలో ఈ జాగ్రత్తలు అలవాటు చేసుకుంటే ప్రతి మనిషికి అవి మేలు చేస్తాయి.
                    తరువాత ముఖ్యంగా 'నీరు'......తిన్నది గొంతు దిగడానికి మాత్రమే అన్నట్లు వ్యవహరించే వారు మన దేశంలో ఎక్కువే. వారంతా గమనించి పాటించవలసిన విషయమేమంటే నీరు త్రాగడం ఆరోగ్యానికి అతి అవసరం. మనం జీవించడానికి గాలి ఎలా అవసరమో నీరు కూడా అంతే అవసరమని గుర్తించండి. మన శరీరంలో మలినాల విసర్జన మీరు తాగే నీటి పరిమాణం మీదే అధారపడుతుందని గ్రహించండి. రోజుకి కనీసం రెండు లీటర్ల నీరు శరీరానికి అవసరం. నిజానికి దాహమయినప్పుడు శరీరం కోరుకునేది 'నీరు' అన్నది తెలుసుకోవడం మంచిది. ఎ కూల్ డ్రింకు లో త్రాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే శుభ్రమైన నీరు త్రాగడం కంటే ఉత్తమ మైనది లేద్దని గ్రహించండి. 
                           







29, డిసెంబర్ 2011, గురువారం

ఈనాడు


నిజానికి 'ఇజా ' లేమి లేవు

ఉన్నదల్లా టూరిజం మాత్రమే

అని ఒకాయన అన్నాడని

గింజుకున్నారు గొంతుచించుకున్నారు

నిజం కాదా !

నిన్న మొన్నటి దాకా పోరాటం

నేడు దాసోహం అది కాదా నేటి నైజం

ఏమయిందా ' ఇజం'

పాతేశారా?

పాశవిక దాడులు

పౌర అణు ఒప్పందాలు

మీ   'నైజానికి' నిజానికి ఒప్పిదమేనా

వీటన్నిటిలో నీ ఒంతేమిటి

'లో' పాపాలు ఉత్తుత్తి పోరాటాలతో పోతాయా?

నిద్ర నటిస్తే నిశ్చింతేనా?

నాడు 'సై' తోడు నేడు 'చెయ్' తోడు

దేనికోసం? ఎవరికోసం ? మీపాట్లు !

పేదోని కష్టం కూస్తయినా గుర్తెరుగు!

మధ్యతరగతి మాటెఱిఁగి  నడువు
పాత వాసనతో నెగ్గుకోచ్చేరోజులు పోయాయి నేస్తమా!

నిద్రలే !


5, డిసెంబర్ 2011, సోమవారం

వసుధైక కుటుంబం

                                                                          వసుధైక  కుటుంబం          

                                          ప్రపంచం చిన్నదై  పోయింది. ప్రపంచమో ఓ కుగ్రామమయింది. ప్రపంచీకరణ తో దేశాలు కాలనీల్లా మారిపోతున్నాయి అనే మాటలు నాకసలు అర్ధమయ్యేవి కావు. మాచిన్నమ్మాయి, మావారు  ఈ మాటలు  నాకు అర్ధమయ్యేలా చెప్పాలని చాలా సార్లు ప్రయత్నం చేసి వారి  వల్ల కాక దాని ప్రయత్నం మానేశారు . ఈమధ్య జరిగిన ఒక సంఘటనతో ప్రపంచం చిన్నదై పోయిందని ఎందుకంటున్నారో సోదాహరణంగా అర్ధంమయింది.

                                         మాచిన్నమ్మాయి హైదరాబాదులో ఓ MNC లో పనిచేస్తోంది.  వాళ్ళకి ఓ కొత్త బాసు వచ్చాడట. అమెరికా నుంచి వచ్చాడట  అందునా చక్కటి తెలుగు మాట్లాడుతు న్నాడట. ఆయనే  ఏదైనా హాలిడే కి ఫామిలీస్ తో సహా బయటకు వెళ్దామని ప్రొపోజ్ చేసాడట అందుకు ఈ ఆదివారం వాళ్ళ ఆఫీసు వాళ్ళంతా వికారాబాద్ దగ్గర ఏదో రిసార్టుకు వెళదామని, అందరు కుటుంబాలతో సహా వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
'ఈ మధ్య మీరుకూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా రండి' అని మమ్ముల్ని కూడా బలవంతంగా తీసుకెళ్ళింది.
నేను కూడా సరే బావుంది ఎలాగైనా కార్తిక మాసం కదా ....ఈ సారి వనభోజనాలకు వెళ్ళలేదు ....
అందుకే దేముడు ఇలా అవకాశం కల్పించాడు అనుకున్నాను మనసులో ....బయటకు అంటే మళ్ళీ అంతా నీ చాదస్తం అంటారని. ఉదయాన్నే తొందరగా తెమిలి బయదేరామేమో 9 గంటలకల్లా రిసార్ట్ కి చేరాము. అప్పటికే వంద మందికి  పైగా వాళ్ళ ఆఫీసు వాళ్ళంతా వచ్చేశారు. అంతా హడావుడిగా వుంది. రంగు రంగుల ప్రపంచంలా అనిపించింది అక్కడ వాతావరణం చూస్తె..... ఎటు చూసినా  రంగు రంగుల  పూలు, రంగు రంగుల దుస్తుల్లో పిల్లలు, తల్లులు. ఉత్తర, దక్షిణ భారత దేశ ప్రజలంతా ఒక్క చోట చేరినట్లు చూడడానికి ఎంతో మనోహరంగా ఉందా దృశ్యం!
ఏ వంక వెళ్ళినాఇంగ్లీషు కంటే  భారతీయ  భాషల్లో బాసలు.....ఆహా ....భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా....సోషల్ సబ్జెక్టు లో ఈ విషయం చస్తే అర్ధం అయ్యేది కాదు....పాఠం  బట్టీ పాటే వాళ్ళం....ఇదన్న మాట విషయం!
చాలా పెద్ద రిసార్ట్ లా వుంది. రక రకాల చెట్లు. వచ్చిన  వారంతా గ్రూపులు, గ్రూపులుగా విడిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు ఆడుతున్నారు. మా అమ్మాయి, అల్లుడు గారు వాళ్ళ వాళ్ళ స్నేహుతుల గ్రూపుల్లో చేరి పోయారు.
మేమూ..... వాళ్ళ స్నేహితుల పేరెంట్స్ గ్రూపుల్లో చేరి పోయాము. రెండు, మూడు తెలిసిన ఫామిలీస్. అందరికి బ్రేక్  ఫాస్ట్  సర్వ్ చేశారు. టిఫెన్ చేసిన వాళ్ళు  వాటర్ గేమ్స్, షటిల్ బాడ్మింటన్ , టెన్నిస్   మొదలెట్టారు. మేము ఒక పెద్ద మర్రి చెట్టు కింద కార్పెట్ మీద సెటిల్ అయ్యాము.తరువాత అటు...ఇటు...తిరుగుతూ రిసార్ట్ లోవున్నా A C గదుల  వేపు వచ్చాము.
ఇంతలో 5-6 సంవత్సరాలుంటాయి...... ఓ చిన్నబాబు తెల్లగా, పొడుగ్గా... బంగారపు రంగు జుట్టు....చూస్తేనే తెలుస్తోంది.....విదేశీ పిల్లాడు  అని.... మా దగ్గరికి  వాడు విసిరిన  బంతి కోసం పరుగెత్తుకుంటూ వచ్చాడు. దగ్గరగావచ్చాక స్పష్టంగా చూశాను.....సందేహంలేదు.. వాడే....అచ్చువాడే....రాబర్టే..........ఆయనకూడాపిల్లాడిని చూస్తూ  నావంక   చూశారు ! దగ్గరికి వచ్చిన పిల్లాడిని......" ఏమోయ్........ఈ పిల్లాడు 'రాబర్ట్' కొడుకే అయి వుండాలి ఎలాంటి సందేహం లేదు ......చిన్నప్పుడు 'రాబర్ట్' అచ్చు ఇలానే వుండేవాడు కదా ' అన్నారు ఆయన నా సందేహం నివుర్తి చేస్తూ .
అంటే.....అమ్మాయి కి వచ్చిన కొత్త 'బాసు'  'రాబర్టే'....అన్నమాట......అని మనసులో అనుకుంటూ
బంతిని తీసుకుని ఆ పిల్లాడికి ఇచ్చి అడిగాను. 'where is dad'  ....?  అని .....
ఆ పిల్లాడు సమాధానం చెప్పకుండా దూరంగా  పరుగెత్తాడు.
మేమూ అక్కడ నుంచి మెల్లగా అందరు  ఉన్న చోటికి చేరాము. వెంటనే మా అమ్మాయిని కలిసి మీ కొత్త బాసు
పేరేంటి ?...అని అడిగాను.
ఎందుకూ? ...అంటూ...'రాబర్ట్ ' అంది !
ఇక నేను వుండబట్టుకోలేక పోయాను. ఒకసారి మమ్ముల్నిఅతనికి పరిచయం చేయవే....అతనెక్కడ వున్నాడు ?
వరుస ప్రశ్నలకి ....నా అకస్మాత్తు ప్రవర్తనకి మా అమ్మాయి బిత్తర పోయింది.
ఇంతలో అతనే మావేపు వస్తూ ' హే ...మీ   పేరెంట్స్ ని నాకు పరిచయం చేయవా" అంటూ మాకు రెండు చేతులతో
నమస్కారం చేస్తూ ...మమ్ముల్ని చూస్తూ....నమస్తే అంకుల్ ....నమస్తే ఆంటీ....అని మావంక అదోలా చూస్తూ ఒక్కసారిగా మాదగ్గరికి వచ్చి నాకూ, మావారికి పాదాభివందనం చేసి '' what a pleasant surprise aunty.........uncle....."  అంటూ నన్నూ మావారిని కౌగలించుకున్నాడు !
నేను ప్రతి నమస్కారం చేస్తూ......మీ మదర్ ' మేరీ'......ఎలావుంది?  రాబర్ట్ అని అడిగాను....
'మాం .....బావుంది...ఆరోగ్యం అంతగా బావుండలేదు....ఇక్కడే నాదగ్గరే వుంది....ఇక్కడికి రాలేదు....ఇంట్లో వుంది'...
అప్పటికే  మాచుట్టూ ఉన్నవాళ్ళకి అందరికీ ఇక్కడ ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు!
మా అమ్మాయి కూడా స్థాణువులా నిలబడి పోయింది.
మాఇద్దరి పరిస్థితి కూడా చాలా ఉద్వేగపూరితంగా తయారయింది.
అతనే తమాయించుకుని ఈ అంకుల్,అంటీ నేను చిన్నప్పుడు కాకినాడలో ఉన్న రోజుల్లో మా పక్క ఇంట్లోనే ఉండేవారు అదే పరిచయం,,,,అంటూ మా ఇద్దరి భుజాల చుట్టూ చేతులు వేసి ' give us little time' అని అక్కడి వాళ్ళతో చెబుతూ  తన ఫ్యామిలీ ఉన్న గెస్ట్ రూం  వంక తీసుకెళ్ళాడు !
                           సాయంత్రం తిరిగి వస్తూ అమ్మాయితో చెప్పాను అసలు సంగతి. రాబర్ట్' వాళ్ళ ఫ్యామిలీ కాకినాడలో  మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఫ్రెంచి దేశపు వ్యక్తి వాళ్ళ పూర్వీకుల కాలం నుంచి ఇక్కడే' యానాం' లో స్థిర పడ్డారు. ఆయనకు  దాదాపు నలభై సంవత్సరాలు ఉండేవి. తల్లిగారు బ్రిటిష్ దేశస్తురాలు. కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. కాకినాడలో ఏదో కాన్వెంట్ స్కూల్  head misstress  గా పనిచేసేవారు.' రాబర్ట్'  నాన్నగారు   దగ్గరలోనే ఉన్న పొగాకు ఫాక్టరీ లో పనిచేస్తూ బాగా అనారోగ్యం పాలయ్యారు. ఎక్కువ కాలం బతకడని  డాక్టర్లు చెప్పేశారు. వైద్యం ఖర్చు అంతా పొగాకు కంపెనీ భరించేది. దాదాపు సంవత్సరం పాటు హాస్పిటల్ కి వస్తూ పోతూనే ఉండేవారు . అప్పుడే రాబర్ట్ వాళ్ళ అమ్మగారు రాబర్ట్ ని మాకు అప్పగించి హాస్పిటల్ కి, ఉద్యోగానికి వెళ్ళే వారు. ఆ సంవత్సరం పాటు పాపం ఆవిడ పడ్డ బాధ నాకు తెలుసు.
'నీకు రాబర్ట్ గురించి పెద్దగా  తెలీదు. నువ్వు రెండు సంవత్సరాల పిల్లవను కుంటాను. కాని మీ అక్కకు, అన్నకు 'రాబర్ట్ ' బాగానే పరిచయం. కలిసి ఆడుకునే వాళ్ళు. దాదాపు సంవత్సరం పైన మనింట్లోనే ఉన్నట్లు  ఉండే వాడు'! వాడికి ఆవకాయ , పులిహార, కొబ్బరి కజ్జి కాయలన్నా ఎంత ఇష్టమో. అవి చేస్తున్నట్లు వాడు ఎలా పసిగట్టే వాడో వాడికి పెట్టిన దాక తల్లి పిలిచినా ఇంటికి వెళ్ళేవాడు కాదు.
వాళ్ళ నాన్నగారు బాగా సుస్తీ చేసి సంవత్సరం తిరగకుండానే హాస్పిటల్ లోనే పోయారు! అప్పటికి వీడికి 7 సంవత్సరాలు ఉండేవేమో! తరువాత వీళ్ళ అమ్మగారు వీడిని    తీసుకుని  లండన్ వెళ్లి పోయారు. దాదాపు 30 సంవత్సరాలు పైన   అయివుంటుంది ఇప్పటికి. ఇప్పుడు వీడు మళ్ళీ కలిశాడు. ఎంత విచిత్రం ! అనుబంధం, ఆత్మీయతకు  ఎల్లలు ఉన్నట్లు లేదు. కాలం ఎంత దూరాల నైనా ఎప్పుడో ఒకసారి దగ్గరికి చేరుస్తుందేమో !
ఈరోజు సంఘటన నా మనసుకు ఎంతటి  బలాన్ని తెచ్చిందంటే ముఫ్ఫై సంవత్సరాల వెనక్కి వెళ్లి పోయాను. భగవంతుడిని  మనసారా స్మరించాను. ప్రపంచమే ఒక వసుధైక  కుటుంబం అని ఎవరో అన్న మాటలు ఎంత సత్యమో అర్ధం అయింది!
రచన :
కేశిరాజు  వెంకట వరదయ్య.
  

   



                

30, నవంబర్ 2011, బుధవారం

ఎల్లలెరుగని స్నేహ బంధం

                                                          ఎల్లలెరుగని   స్నేహ బంధం                
                                                      -----------------------------------

బంధాలు, అనుబంధాలు ఎంత లేవనుకున్నా, కావనుకున్న అవి  తెగి పోవు. ఏదో ఒక సందర్భంలోనో ఎక్కడో ఒకచోట మనుషుల్ని కలుపుతూనే ఉంటాయి.వాటికి  భాష, దేశం, వేషం అలాంటి హద్దులేమి లేవు.
ఈ మధ్యనే నేను అమెరికా వెళ్ళివచ్చాను.  అక్కడో చిత్ర మైన సంఘటన  జరిగింది.  అమెరికాలో డల్లాస్ లో నా కూతురు దగ్గర్నుంచి  కనెక్టి కట్ లోఉన్న  నా కజిన్ రెండు  రోజులు రావే అంటే వెళ్లాను. దాని కూతురు మెడిసిన్  చదువుతోంది. చక్కటి డాన్సరు. పదేళ్ళకి  పైగా భరత నాట్యం నేర్చుకుంది. వీకెండ్ కి  మా కజిన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక తమిళావిడది గోల్డెన్  జుబిలీ మ్యారేజ్ డే ఫంక్షన్ కి వెళ్ళాలంది. నన్ను ఫంక్షన్ కి రమ్మంది.
'వద్దులేవే ! అంతా పరిచయం లేని వాళ్ళు......నేను వచ్చి నిన్ను కూడా ఇబ్బంది పెట్టడమే...మీరు వెళ్లి రండి' అన్నాను  కాదులే చాల సరదాగా  వుంటుంది....పైగా నీ మేనకోడలు డాన్సు ప్రోగ్రాం వుంది రమ్మని  బలవంతంగా  తీసుకెళ్ళింది. ఫంక్షన్ చూశాక  నిజంగా' చిత్రం' అనిపించింది. ఇండియాలోకూడా  ఇటువంటి ఫంక్షన్లో అంత సాంప్రదాయం పాటించమేమో. విచిత్రం ఏమిటంటే ఫంక్షన్ లో  డ్రెస్ కోడ్ .కొంతమంది అమెరికన్లు మగవాళ్ళు ప్యాంటు /  పైజమా కుర్త , ఆడవాళ్ళు చీరలు,పంజాబీ డ్రెస్లు,చక్కటి నగలు ,  పాపిడిచేర్లు, గోరింటాకు, బొట్టు, గాజులు, వేసుకుని వచ్చారు. దాదాపు 200 మంది వరకు  అతిధులు వ చ్చారు. దోశలు, ఉప్మా ఇడ్లి ,పొంగలి ,సాంబారు, పరమాన్నం    ఓహ్......ఇంకా ఎన్నో  తినుబండారాలు వేడి వేడిగా ! వాళ్ళందరి ఉపన్యాసాలు అయ్యేసరికి మధ్యాన్నం రెండు  అయ్యింది. కొద్దిగా విరామమిచ్చి టంచనుగా మూడు గంటలకల్ల మాఅమ్మాయి డాన్సు   ప్రోగ్రాము మొదలెట్టారు.  మన భారతీయులు  సరే  అమెరికన్లు ప్రతివాళ్ళు అభినందించారు. అసలు చిత్రం ఇక్కడే జరిగింది . ఫంక్షన్ లో ఒక  అమెరికన్ లేడీ దాదాపు 80 సంవత్సరాలు  వుంటాయి. చక్కటి గులాబి రంగు పట్టు చీర  కట్టుకుంది.
ఆవిడ వేదిక మీదకు వెళ్లి గోల్డెన్ జూబిలీ జంటకు ఒక బహుమతి ఇచ్చింది.  మైకు తీసుకుని మాట్లాడింది.
తను ఇచ్చిన ప్రెజెంటేషను కాంజీవరం  పట్టు చీర అని అది  తనకు 1960 లో తనకు ఇంటిపక్కనున్న ఒక ఇండియన్ బహుమతి గా ఇచ్చిందని, తను ఆ  చీరను చాల ఇండియన్ ఫంక్షన్ల లో కట్టుకున్నానని  ఆ చీర ఈరోజుకి గూడా చెక్కు చెదర  కుండా వుందని అదే చీరను ఇప్పుడు కానుకగా ఇచ్చానని,
ఆ ఇంటి పక్కన స్నేహితురాలు  ఎవరో కాదు ఇప్పుడు వేదిక మీద మ్యారేజ్ గోల్డెన్  జూబిలీ చేసుకుంటున్న  ఆవిడని, తానిప్పుడు వేరే సిటీ లో  ఉంటున్నానని,ఇటువంటి వ్యక్తిత్వం,ఇటువంటి
సాంప్రదాయ జీవితం, వేడుకలు ఒక్క భారతీయులకు మాత్రమే సాధ్యమని ఇలాంటి స్నేహితులు వుండడం తనకు, తన వ్యక్తిత్వానికి, తన కుటుంబానికి చాలా మంచి జరిగిందని,
తనతో భారత దేశం సందర్శించానని, ప్రపంచం లోనే భారత దేశం ఒక మహోన్నత దేశమని ఇంకా ఎన్నో విషయాలు చెప్పి, ఇప్పటికి వారు చక్కటి  స్నేహితుల మని చెప్పి ఆ చీరని సభికులందరికీ చూపించమని కోరింది.
ఆవిడ చీర విప్పి  అందరికి వేదిక మీద నుంచి చూపెట్టింది. చక్కటి వంగపండు రంగు చీర , ఆరెంజ్ బోర్డర్,  ఝరీ అంచు ధగ ధగ మెరుస్తూ వుంది.
ఆవిడ కళ్ళలో కాంతి, ముఖంలో పట్టలేని సంతోషం  దాగలేదు. రెండు నిముషాలు ఆవిడ వేదికమీదనుంచి దిగివెల్లి తిరిగి వేగంగా వేదికమీదకు  వచ్చి
మైకు తీసుకుని తనకు 1961 లో మద్రాసు పెళ్లి అయిందని 1962 తన భర్త తో  అమెరికా వచ్చినట్లు, అప్పుడుఈ అమెరికన్ ఆవిడ  పక్కన ఇంట్లో ఉండేదని,
అమెరికా, భాష  కొత్త కావడం తో తనకేమి తెలియదని, సర్వం తానె అయి ఈ అమెరికన్ సాయం చేసిందని, అమెరికా  గురించి తనకెంతో నేర్పిందని,
తను అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి, ఇక్కడకొచ్చి చదువుకొని ఒక ఉన్నతోద్యోగిని  కావడానికి  తన  ప్రోత్సాహమే కారణమని , చాలా మంచి  స్నేహితురాలని,
తానిప్పుడు L.A ఉంటుందని తన  ఫంక్షన్ కి అంత దూరం నుంచి రావడమేకాక తనకో అపురూపమైన కానుక
ఇచ్చిందని ఇటువంటి  స్నేహితులుండడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పింది.
అదండీ స్నేహబంధం అంటే!
ఇంకేముంది.  కరతాళధ్వనులు మిన్నంటాయండీ..
నా పరిస్థితి  నాకు అర్ధం కాలేదు. కళ్ళు చమర్చాయి. ఏదోలోకంలో వున్నట్లయింది. ఆ క్షణం లో ప్రపంచం ఎంతో సుందరంగా కనిపించింది.

కేశిరాజు రజని