లేబుళ్లు

30, నవంబర్ 2011, బుధవారం

ఎల్లలెరుగని స్నేహ బంధం

                                                          ఎల్లలెరుగని   స్నేహ బంధం                
                                                      -----------------------------------

బంధాలు, అనుబంధాలు ఎంత లేవనుకున్నా, కావనుకున్న అవి  తెగి పోవు. ఏదో ఒక సందర్భంలోనో ఎక్కడో ఒకచోట మనుషుల్ని కలుపుతూనే ఉంటాయి.వాటికి  భాష, దేశం, వేషం అలాంటి హద్దులేమి లేవు.
ఈ మధ్యనే నేను అమెరికా వెళ్ళివచ్చాను.  అక్కడో చిత్ర మైన సంఘటన  జరిగింది.  అమెరికాలో డల్లాస్ లో నా కూతురు దగ్గర్నుంచి  కనెక్టి కట్ లోఉన్న  నా కజిన్ రెండు  రోజులు రావే అంటే వెళ్లాను. దాని కూతురు మెడిసిన్  చదువుతోంది. చక్కటి డాన్సరు. పదేళ్ళకి  పైగా భరత నాట్యం నేర్చుకుంది. వీకెండ్ కి  మా కజిన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక తమిళావిడది గోల్డెన్  జుబిలీ మ్యారేజ్ డే ఫంక్షన్ కి వెళ్ళాలంది. నన్ను ఫంక్షన్ కి రమ్మంది.
'వద్దులేవే ! అంతా పరిచయం లేని వాళ్ళు......నేను వచ్చి నిన్ను కూడా ఇబ్బంది పెట్టడమే...మీరు వెళ్లి రండి' అన్నాను  కాదులే చాల సరదాగా  వుంటుంది....పైగా నీ మేనకోడలు డాన్సు ప్రోగ్రాం వుంది రమ్మని  బలవంతంగా  తీసుకెళ్ళింది. ఫంక్షన్ చూశాక  నిజంగా' చిత్రం' అనిపించింది. ఇండియాలోకూడా  ఇటువంటి ఫంక్షన్లో అంత సాంప్రదాయం పాటించమేమో. విచిత్రం ఏమిటంటే ఫంక్షన్ లో  డ్రెస్ కోడ్ .కొంతమంది అమెరికన్లు మగవాళ్ళు ప్యాంటు /  పైజమా కుర్త , ఆడవాళ్ళు చీరలు,పంజాబీ డ్రెస్లు,చక్కటి నగలు ,  పాపిడిచేర్లు, గోరింటాకు, బొట్టు, గాజులు, వేసుకుని వచ్చారు. దాదాపు 200 మంది వరకు  అతిధులు వ చ్చారు. దోశలు, ఉప్మా ఇడ్లి ,పొంగలి ,సాంబారు, పరమాన్నం    ఓహ్......ఇంకా ఎన్నో  తినుబండారాలు వేడి వేడిగా ! వాళ్ళందరి ఉపన్యాసాలు అయ్యేసరికి మధ్యాన్నం రెండు  అయ్యింది. కొద్దిగా విరామమిచ్చి టంచనుగా మూడు గంటలకల్ల మాఅమ్మాయి డాన్సు   ప్రోగ్రాము మొదలెట్టారు.  మన భారతీయులు  సరే  అమెరికన్లు ప్రతివాళ్ళు అభినందించారు. అసలు చిత్రం ఇక్కడే జరిగింది . ఫంక్షన్ లో ఒక  అమెరికన్ లేడీ దాదాపు 80 సంవత్సరాలు  వుంటాయి. చక్కటి గులాబి రంగు పట్టు చీర  కట్టుకుంది.
ఆవిడ వేదిక మీదకు వెళ్లి గోల్డెన్ జూబిలీ జంటకు ఒక బహుమతి ఇచ్చింది.  మైకు తీసుకుని మాట్లాడింది.
తను ఇచ్చిన ప్రెజెంటేషను కాంజీవరం  పట్టు చీర అని అది  తనకు 1960 లో తనకు ఇంటిపక్కనున్న ఒక ఇండియన్ బహుమతి గా ఇచ్చిందని, తను ఆ  చీరను చాల ఇండియన్ ఫంక్షన్ల లో కట్టుకున్నానని  ఆ చీర ఈరోజుకి గూడా చెక్కు చెదర  కుండా వుందని అదే చీరను ఇప్పుడు కానుకగా ఇచ్చానని,
ఆ ఇంటి పక్కన స్నేహితురాలు  ఎవరో కాదు ఇప్పుడు వేదిక మీద మ్యారేజ్ గోల్డెన్  జూబిలీ చేసుకుంటున్న  ఆవిడని, తానిప్పుడు వేరే సిటీ లో  ఉంటున్నానని,ఇటువంటి వ్యక్తిత్వం,ఇటువంటి
సాంప్రదాయ జీవితం, వేడుకలు ఒక్క భారతీయులకు మాత్రమే సాధ్యమని ఇలాంటి స్నేహితులు వుండడం తనకు, తన వ్యక్తిత్వానికి, తన కుటుంబానికి చాలా మంచి జరిగిందని,
తనతో భారత దేశం సందర్శించానని, ప్రపంచం లోనే భారత దేశం ఒక మహోన్నత దేశమని ఇంకా ఎన్నో విషయాలు చెప్పి, ఇప్పటికి వారు చక్కటి  స్నేహితుల మని చెప్పి ఆ చీరని సభికులందరికీ చూపించమని కోరింది.
ఆవిడ చీర విప్పి  అందరికి వేదిక మీద నుంచి చూపెట్టింది. చక్కటి వంగపండు రంగు చీర , ఆరెంజ్ బోర్డర్,  ఝరీ అంచు ధగ ధగ మెరుస్తూ వుంది.
ఆవిడ కళ్ళలో కాంతి, ముఖంలో పట్టలేని సంతోషం  దాగలేదు. రెండు నిముషాలు ఆవిడ వేదికమీదనుంచి దిగివెల్లి తిరిగి వేగంగా వేదికమీదకు  వచ్చి
మైకు తీసుకుని తనకు 1961 లో మద్రాసు పెళ్లి అయిందని 1962 తన భర్త తో  అమెరికా వచ్చినట్లు, అప్పుడుఈ అమెరికన్ ఆవిడ  పక్కన ఇంట్లో ఉండేదని,
అమెరికా, భాష  కొత్త కావడం తో తనకేమి తెలియదని, సర్వం తానె అయి ఈ అమెరికన్ సాయం చేసిందని, అమెరికా  గురించి తనకెంతో నేర్పిందని,
తను అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి, ఇక్కడకొచ్చి చదువుకొని ఒక ఉన్నతోద్యోగిని  కావడానికి  తన  ప్రోత్సాహమే కారణమని , చాలా మంచి  స్నేహితురాలని,
తానిప్పుడు L.A ఉంటుందని తన  ఫంక్షన్ కి అంత దూరం నుంచి రావడమేకాక తనకో అపురూపమైన కానుక
ఇచ్చిందని ఇటువంటి  స్నేహితులుండడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పింది.
అదండీ స్నేహబంధం అంటే!
ఇంకేముంది.  కరతాళధ్వనులు మిన్నంటాయండీ..
నా పరిస్థితి  నాకు అర్ధం కాలేదు. కళ్ళు చమర్చాయి. ఏదోలోకంలో వున్నట్లయింది. ఆ క్షణం లో ప్రపంచం ఎంతో సుందరంగా కనిపించింది.

కేశిరాజు రజని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి