లేబుళ్లు

29, ఏప్రిల్ 2026, బుధవారం

గెలుపు ఓటములు (ఈనాడు 'మకరందం' పేజీ వ్యాసం)

                                                                  


( ఈనాడు-ది, 30-4-2026 తేదీన 'మకరందం' పేజీలో ప్రచురింపబడిన వ్యాసం )

గెలుపు,ఓటములు 

                                               

ఆట కానీ, జీవితం కానీ గెలుపు, ఓటములు సమానమని గ్రహించిన మనిషి ఎన్నటికీ వెనకడుగు వేయడు. అలాటి మనిషి జీవితంలో పరిపూర్ణత సాధిస్తాడు. 

చీకటి వెంట వెలుగు ఎలానో ఓటమి తరువాత గెలుపు సాధ్యం అన్నది ప్రాధమిక సూత్రం. 

గెలుపు అహంకారానికి దారి కారాదు. ఓటమి ఆత్మన్యూనతకు కారణం కారాదు.

మనిషి కార్యసాధనకు పూనుకోక 'గాలిలో దీపం పెట్టి  'దేవుడా నీవే దిక్కు' అని ప్రయత్నం చేయని వారికి ఫలితం శూన్యమే. అలాటి నిస్తేజుల కోసమే నీతి శతకాలలో ఉద్బోధలున్నాయి, మార్గ

నిర్దేశకాలున్నాయి.   

'ఆరంభించరు నీచ మానవులు విఘ్నయాస సంత్రస్తులై ... ప్రారబ్దార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ " అన్నారు భర్తృహరి. 

ఏదైనా పని ప్రారంభించినప్పుడు అడ్డంకులెదురైనా భయపడక చివరి వరకు శ్రమించడమే కార్యసాధకుని లక్షణమని 'భర్తృహరి' శతక సుభాషితం. 

విఫల యత్నాలు, కష్టాలు మనుషుల్లోని సామర్ధ్యాలను వెలికి తీస్తాయి. ప్రయత్నం లేని రోజున 'సృష్టి' స్తబ్దుగా తయారవుతుంది.

ప్రతి మనిషికి తన జీవనయానంలో ఊహించని సంఘటనలు, సమస్యలు ఎదురవుతుంటాయి.

అలా ఉత్పన్నమయ్యే సమస్యలను సంఘటితంగా ఎదుర్కొనడానికి సమయం ఉండదు.

వాటిని అప్రయత్నంగానే ఒంటిగా దుర్కోవలసి వస్తుంది. వేరే దారి ఉండదు. అలాటి సమయ, సందర్భాలలో ఏంచేయాలి అన్న ప్రశ్నకు 'భగవద్గీత' మార్గాన్ని స్ఫష్టంగా ఉపదేశించింది.

మనిషి చేయవలసిందల్లా  ఆ మార్గానికి తనని తాను అనుసంధానించుకోవడం. అనుసరించడం. 

కర్తవ్యాన్ని పాటించడం, చేతనయింది చేయడం. చేసిన ప్రతి పనికి ఫలితం ఆశించక, అత్యాశకు

పోకుండా ముందుకు సాగడమే.  

శ్రీకృష్ణుని వెన్నంటి ఉన్న అర్జునుడే కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధుగణాన్ని చూసి విషాదంలో మునిగిపోతాడు. 

'యుద్ధంలో గెలవగలనా ?' అన్న మీమాంసకు గురవుతాడు. ఆ పైన ధర్మసంస్థాపన కోసం యుద్హంలో పోరాడాడు. గెలుపు స్వంతమైంది.

హనుమంతుడు సీతమ్మవారి జాడ వెతుకుతూ లంకకు వెళ్లి సమయోచిత బల ప్రదర్శనతో లంకా దహనం చేసి 'తమ గెలుపు తధ్యమని, శ్రీరామునితో యుద్ధం 'నీ పతనానికి నాంది' అని రావణునికి చాటి చెప్పి, చేపట్టిన కార్యాన్ని దిగ్విజయంగా ముగించుకుని తిరిగి వచ్చాడు.  

తండ్రి హిరణ్యకశిపుడు తనని ఎంత హింసించినా ప్రహ్లాదుడు ఇసుమంతైనా చలించలేదు. గెలుపు తనకు సాధ్యం కాదని తెలిసినా నిబ్బరంగా తన దృఢత్వాన్ని, శ్రీమన్నారాయణుని పట్ల విధేయతని, విశ్వాశాన్ని వదల్లేదు.   

ప్రవహించే నదిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది, నిలిచిన నీరు కలుషితమవుతుంది. 

మనిషి కూడా అంతే. ఓటమికి భయపడి ప్రయత్నాన్ని నిలిపివేస్తే, అది కేవలం ఆ వ్యక్తికే పరిమితం కాదు, సమాజ అస్తిత్వానికే  విఘాతం కలిగుతుంది.  

అంచేత మనిషి తనేదైనా కార్యం తలుచుకున్నప్పుడు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడం,

ఆయా కార్య సాధన గురించి 'తన' వారితో తర్కించుకోవడం, కార్య విశ్లేషణ, ప్రణాళిక, ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మానసిక దృఢత్వం, సరైన సన్నద్ధతతో కార్యాచరణ రూపొందించుకోవడం ముఖ్యం. 

అలా సన్నద్హమైన వ్యక్తికి భవిష్యత్తు పట్ల స్పష్టత ఉంటుంది. ఎప్పుడైతే  చేసే పని పట్ల స్పష్టత ఏర్పడుతుందో ఆయా పనులు ప్రభావవంతంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుంది.

గెలుపు సాధ్యమవుతుంది. అనుకున్న లక్ష్యాలను అలవోకగా సాధిస్తారు.

అయితే మనిషి తన కోసం, తన వారి కోసం శ్రమించడం సర్వ సాధారణం. అదే పరవారికి, సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తే వారి శ్రమ సార్ధకమవుతుంది. జీవితాలకు గెలుపు వెలుగుల్ని పంచుతుంది.

-------------xXx------------ 


కేశిరాజు వెంకట వరదయ్య 
F.No.713-D, SMR Vinay Symphony, 
Gachibowli, Hyderabad.  
మొబైల్ నంబరు : 9849118254



  


ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞాని
ధుల్ గావునన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి