యోగభూమి
***********
ఆధ్యాత్మిక రంగంలో దేహంపట్ల విభిన్న అభిప్రాయాలు, ధోరణలు ఉన్నాయి. అది అశాశ్వతమని దానికి అంతగా మర్యాద ఇవ్వనవసరంలేదని అంటూనే పరమపద సాధనకు దేహం ఓ సాధనమని ,ఓ ఉపకరణమని దాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అంటుంటారు. ఈ రెండు వాస్తవాలే ! దేనినీ నిరాకరించనవసరం లేదు. నిజానికి దేహం పరమపద సోపాన అధిరోహణకు ఏకైక సాధనం.
అసలు ఈ 'దేహం' ఏమిటి ? కైవల్య సాధనలో దాని పాత్ర ఏమిటి ? మనిషి జన్మించాక తనదంటూ ఉన్నది, తనకంటూ ఉన్నది 'దేహం' మాత్రమే ! ప్రాపంచికమైనా , పారమార్ధిక మైనా ఆయా సాధనలకు మన దగ్గర ఏమున్నా లేకున్నా, అవసరమనుకున్నది లభ్యమైనా , కాకపోయినా దేహం మాత్రం మనతోనే ఉంటుంది. అదృష్ట వశాత్తు భగవత్సాధనకు అవసరమైన దేహాన్ని మాత్రం భగవంతుడు అప్రయత్నంగానే మనదగ్గరేముందో దాన్నే మన సాధనోపకరణంగా మనకు నిర్దేశించాడు. బహూకరించాడు. ఇది ఓ అద్భుతం. అదృష్టం !
మరి అలాంటి ఈ దేహంతో మనం ఏమిచేయగలం ? ఆలంకరించు కోగలం తినగలం. తాగగలం.
నిద్రించగలం. సుఖభోగాలనుభచగలం. చివరకు 'దేహాన్ని'మరణించడం. అంతేనా....? అంతే......... దేహాన్ని దాని సృజనోద్దేశ్యాన్ని ఆహార నిద్రాభయ మైధునాల కోసం మాత్రమే అని ఆలోచించే వారికి, ఆమేరకే వినియోగించే వారికి అంతే...............! వాస్తవంలో ఈ సృష్టిలో 'దేహ సృష్టి' కి ఓ మహోన్నత పవిత్రోద్దేశ్యం ఉంది. ఇంత కీలకమైన దేహాన్ని దానిలోని సకల సారాన్ని కేవలం అజ్జ్ఞాన స్థితిలో మనకందించాడు 'పరమాత్మ' ! ఎంత విచిత్రం ! ఆ పరమాత్మ అందిం చిన 'దేహంలో ' ఉన్న పరమాత్మను చూడలేని స్థితి మనది. ఆయనే అయిన మనం, మళ్ళీ ఆయనకోసమే అన్వేషించే విచిత్ర వర్తమాన స్థితి. మరి అలాంటి అపురూపమైన ఈ దేహాన్ని, ముఖ్యంగా అనిశ్చిత మైన ఈదేహాన్నిఎన్ని కళ్ళతో కాపాడుకోవాలి ? ఎంత అప్రమత్తులమై ఉండాలి. నిజమే.............ఈ దేహం అశాశ్వతమే! కాని దాని సృజనోద్దేశ్యం ఉత్కృష్టమైనది. దాని కర్తవ్యం నిరుపమాన మైనది ! సౌందర్య వ్యక్త రూపంగా అహంకార ప్రదర్శన వేదికగా దాన్ని మలుచుకోవడం కాని , భావించడంగాని సరికాదు . అందుకే అవసరాన్ని,ప్రయోజనాన్ని మించి దానిని కొలవడం సరికాదని విజ్ఞులు సూచిస్తారు. అందుకే దేహాన్ని సాత్విక , మితాహారంతో ఉపయుక్త జీవన విధానంతో దేహాన్ని ఆరోగ్యంగా, బలంగా ,బిగువుగా ఉంచుకోవలసిందే ! శుచి రీత్యా కొంత శారీరక సేవా అవసరమే....అంతవరకే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి