లేబుళ్లు

27, ఏప్రిల్ 2022, బుధవారం

స్వోత్కర్ష

                                                               
                                                                       స్వోత్కర్ష 
                                                                 -----------------------
                                        ( published in Sneha, prajashakti, Sunday edition) 

''ఇదిగో డ్రైవర్ ... నీపేరేంటన్నావ్'' అన్నాడు నారదమూర్తి .
''ఉదయ్ కిరణ్'' చెప్పాడతను మర్యాదగా.
"ఓ...ఉదయ్…ఈ ఉదయం లానే నీ పేరు చాలాబావుందయ్యా !
బస్సులో అందరూ ఆడవాళ్లు,పెద్దవాళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు ! అన్నట్లు మరిచాను. బండిలో స్టెఫ్నీఉందా ?  పంక్చర్ గట్రా అవుతే" .....
''ఉంది సార్. నాలుగు కొత్త టైర్లే. ఏమీ ప్రాబ్లెమ్ ఉండదు సార్''
''మీ ట్రాన్స్పోర్ట్ వారంతా ఇలాగే మాట్లాడుతారయ్యా. డబ్బుకు డబ్బు తీసుకుంటారు.
డొక్కు బళ్ళు తెచ్చి ఇబ్బంది పెడుతూవుంటారు. దూరం వెళుతున్నారుకదా ! అందుకే అడిగాను'' అన్నాడు నారదమూర్తి. 
''ఏవండీ…! ట్రిప్ అరేంజ్ చేసిన వాళ్ళు చూసుకుంటారుకదా అవన్నీ!
శుభమా అని బయలుదేరుతుంటే మీ ఆయనకెందుకా నోటి దురద, అనవసర పెత్తనం! 
క్రితం ట్రిప్ లో కమల బస్సెక్కుతుంటే 'జాగ్రత్త' అమ్మా! అన్నారు. మీరామాటంటూనే  కమల బస్సుమెట్టుమీదనుంచి జారిపడి పన్ను విరిగింది. మేము జాగ్రత్తగానే వెళ్ళొస్తాము. తమరు బయలుదేరండిక'' అంది మహతి నారదమూర్తి భార్య పుల్లవిరుపుగా బస్సులోనుంచి.
అయిష్టంగానే బస్సుకు దూరంగా వెళ్లాడు నారదమూర్తి. 
                                                            * * * * *                      
నారదమూర్తి, మహతి గేటెడ్ కమ్యూనిటీలో నాలుగో అంతస్థులో ఉంటారు. ఇద్దరూ సీనియర్ సిటిజన్స్. ఇద్దరూ సంవత్సరానికి రెండు, మూడు ట్రిప్పలు వేసుకుని 'డిస్కవర్ ఇండియా' అంటూ జామ్మున తిరుగుతూ వుంటారు. వాళ్ళిద్దరినీ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని  తెలిసిన వాళ్ళు, వాళ్ళ అపార్టుమెంటులో ఇరుగు పొరుగువారు అంటూవుంటారు. అన్నిటా చురుకుగా ఉంటారు. అందరితో బాగా కలిసి పోతారు. వాళ్లిద్దరు తిరగడమేగాక అపార్టుమెంటులో ఆడవారు, మొగవారు విడివిడిగా మూడు నాలుగు నెల్లకోసారి ఏదోఒక  ట్రిప్ వేసుకుని చూడని ప్రదేశాలు, గుళ్ళు గోపురాలు దర్శించుకుని వస్తుంటారు. పనిలోపని ఆడవారు గట్టిగా షాపింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈసారి కోస్తా ఏరియాలో గుళ్ళు, చీరల షాపింగ్ కని మినీ బస్సులో పదిహేనుమంది బయల్దేరారు. నారదమూర్తి వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి వచ్చి డ్రైవర్ తో మాట్లాడుతుంటే మహతి, నారదమూర్తిని అక్కడనుంచి తరిమేసింది. 
" ఇప్పటికే ఇంట్లో అల్మెరాలన్నీకిక్కిరిసి పోయాయి. ఇంకా చీరలు మాత్రం కొనకు" అని మహతికి చెప్పివెళ్ళాడు నారదమూర్తి అక్కడినుంచి వెళుతూ
                                                                    * * * * *
''అది నోరా లేక ఇంకేమన్నానా ? నువ్వు మాట్లాడకయ్యా మొగుడా అంటే ఊరుకోవు. చిలక జోస్యం చెబుతావు. దరిద్రం. ఆ అపశకునపు మాటలేమో అలానే అయిచస్తాయి ! 
ఇలా బయలుదేరి ఏభై కిలోమీటర్లు వెళ్ళామో లేదో బస్సుముందు టైర్ పంక్చర్. కొద్దిలో ప్రమాదం తప్పింది. బస్సులో మిమ్ముల్నితిట్టని వాళ్ళు లేరు. కొత్త టైర్ పంక్చర్ అయిందని బూతులు తిట్టాడు డ్రైవర్. వినలేక చెవులు మూసుకున్నాను. మీరింక మాఫ్రెండ్స్ దగ్గర ఏమైనా అపశకునపు మాటలు మాట్లాడారో మీకు మర్యాద ఉండదు. జాగ్రత్త"! అంటూ విషయం విశదంచేసి, ఫోనులో హెచ్చరించింది మహతి బస్సు బయలుదేరిన గంటకే ! 
ఆ కబురు విన్ననారదమూర్తికి తనేమైనా అంటే అది జరుగుతుందేమోనన్న ఉత్కంఠ మొదలయింది. కొద్ది అహంభావం మొలకెత్తింది. నాలుక మీద పుట్టుమచ్చవుంది. 
సరస్వతీ దేవి కటాక్షం మొదలయిందేమోనన్న భావన కాంక్రీటులా గట్టిపడడం మొదలయింది నారదమూర్తిలో !    
ఇదివరలో కూడా మహతి, పిల్లలు తరచుగా అనేవారు నారదమూర్తితో  'మీ నోటితో కీడు శంకించకండి అవి నిజమవుతాయని'...వారి మాటల్నిపిచ్చి నమ్మకాలంటూ కొట్టిపారేసేవాడు నారదమూర్తి.
ఇప్పుడు నారదమూర్తి రిటైర్ అయి ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్నాడు. వేరే పనీ, పాట లేదు. స్నేహితులతో, చుట్టాలతో ఫోనులో మాట్లాడడం, వార్తాపత్రికలు, వార, పక్ష,మాసపత్రికలు, పుస్తకాలు చదవడం, పాత పాటలు వినడం మినహా వేరే పని లేదు. 
వేరేవ్యాపకం లేదేమో నమ్మకాలని నమ్మడం మొదలెట్టాడు తనునూ !
                                                                 * * * * *
నారదమూర్తి వారుండే అపార్టుమెంటులో దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఉత్తరాదివాళ్ళు దుర్గ అమ్మవారి పెద్ద విగ్రహం తెచ్చి నవరాత్రి పూజలు ఘనంగా చేయాలని, దాండియా, డి.జె పెట్టవలసిందేనని కమిటీ సమావేశంలో తీర్మానించారు. వెంటనే  సాంసృతిక కమిటీ మెంబర్ గా నారదమూర్తి ''పెద్ద విగ్రహమవుతే క్లబ్ హౌస్ లోనికి తీసుకువెళ్లడం కష్టం…గుమ్మానికి తగిలితే విగ్రహం దెబ్బతింటుంది. బయట షామియానా వేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్టిద్దాం '' అన్నాడు నారదమూర్తి ముందుచూపుతో. 
దానిమీద చర్చ జరిగి వర్షం వచ్చే సూచనవుంది కాబట్టి లోనే క్లబ్ హౌస్ లోనే పూజలని తేల్చేశారు. నవరాత్రులలో మొదటిరోజు ఉదయాన్నేఅమ్మవారి విగ్రహం వచ్చింది. 
ఆరడుగుల ఎత్తున్న విగ్రహం ట్రాలీ లోనుంచి క్లబ్ హౌస్ లోనికి తరిలిస్తుంటే అమ్మవారి కిరీటం కాస్తా గుమ్మానికి తగిలి విరిగింది. కమ్యూనిటీలో నానా రభసయింది. 
నారదమూర్తి ముందే హెచ్చరించినా జాగ్రత్తలు తీసుకోలేదని కొందరు పనిగట్టుకుని  ప్రచారం చేశారు.అపశకునమన్నారు. విగ్రహం మార్చాల్సి వచ్చింది. ఖర్చు తడిసి మోపెడయింది. 
ఆ సంఘటన జరిగిన నాటినుంచీ నారదమూర్తి అహం మొక్క నుంచి 'చెట్ట'యింది. 
మాట తీరూ మారింది. తనమాటకు తిరిగేలేదన్ననమ్మకం తనలో ఏర్పడింది. 
అతని అహం మూర్తివంతమైంది. 
నారదమూర్తి  ప్రవర్తన ఎదుటివారికి రాను రానూ భరింపరానిదిగానూ, ఎబ్బెట్టుగాసాగింది. 
అతని అహం 'చెట్టు' నుంచి 'మాను' అయింది.  
తనని తానొక 'బాబా'గానో 'స్వామి'లానో భావించడం మొదలెట్టాడు. ఇంటా, బయటా అనవసరపు విషయాల్లో జోక్యం మొదలయింది. అతనిలో 'అహం'మూర్తి పెరుగుతున్నాడు.
'ఇంతింతై వటుడింతై మరియు దానంతై నభోవీథిపై నంతై.....బ్రహ్మాండాంత సంవర్ధియై' అన్నట్లు అతన్నిఅతని 'అహం'మూర్తి పూర్తిగా ఆవరించాడు !అవతరించాడు!
                                                                   * * * * * 

నారదమూర్తి వారుండే అపార్టుమెంటులో నీటి కొరతతో కొత్త బోరు వేయాలన్నప్రతిపాదనపై సొసైటీ సమావేశంలో చర్చ వాడిగా సాగుతోంది. సభ్యులు కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ 'బోరు' ఎక్కడవేయాలో నారదమూర్తిని అడిగితే బావుంటుందనన్నారు. కొందరు భూగర్భజల నిపుణుణ్ణి సంప్రదించాలన్నారు. నారదమూర్తిక్కూడా 'జియాలజీ'లో ప్రవేశం ఉందని ఎవరో చెప్పగా విన్నానని సెక్రటరీ అనడంతో మీటింగుకి నారదమూర్తిని పిలిచి 
"నారదమూర్తిగారూ ఈ సొసైటీకి  మీ సేవలు అమోఘం. సొసైటీలో ఇంకొక బోర్ వెల్ వేయాలని నిర్ణయించాం. బోర్ ఎక్కడ వేస్తే నీరు బాగా పడుతుందో కనుక్కునే బాధ్యత మీ భుజస్కంధాలమీద పెడుతున్నాం" అన్నాడు సొసైటీ సెక్రటరీ. 
ఆ పొగడ్తకు, సొసైటీలో వచ్చిన గుర్తింపుకు హీలియం గ్యాస్ కొట్టిన బెలూన్లా గాలిలో అలా  తేలుతున్నట్లనిపించింది నారదమూర్తికి. 
అతనిలో 'అహం'మూర్తి పరిధి దాటిపోయాడు.ఇదివరలో ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేవాడు. ఇప్పుడతనికి అనవసరమైన విషయంలేదు. ప్రతి విషయంలోనూ అతని ప్రమేయమే ! 
నిజాం, సర్కార్, కోస్తా హక్కులు ఒక్కరికే అన్నట్లు  నారదమూర్తిపై పూర్తి హక్కులన్నీ అహం మూర్తివశమయ్యాయి !    
'బోరు' వేయడానికి సరైన పాయింట్ కనుక్కునే బాధ్యత తనదని అందరిలో సొసైటీ వారికి మాటిచ్చాడు నారదమూర్తి. మాటైతే ఇచ్చాడు గాని ఏం చేయాలో అర్థంగావడం లేదు.
ఈ విషయమై మూడురోజులుగా రేయింబవళ్లు మదనపడుతున్నాడు. 
అహంమూర్తి అతన్ని రెచ్చగొడుతున్నాడు. 
"ఎవరో భూగర్భజల నిపుణుణ్ణి కనుక్కోవలసిన అగత్యం నీకేమిటి ? నేనునున్నాను కదా! 
ఫలానా స్థలమని ఎంపికచేసి చెప్పు"అన్నాడు అహంమూర్తి ఉరఫ్ నారదమూర్తి ఆత్మ.   
''లేదు. ప్రమాదం కదా ! ఒకవేళ నీరుపడకపోతే"? అనుమానం వ్యక్తం చేసింది నారదమూర్తి. ఆత్మ.  
"అర్ధంలేదు…ఇంతవరకు నేను చెప్పిన భవిష్యవాణి, శకునాలు, ఎన్ని నిజం కాలేదు ! 
ఇది కూడా అంతే ! ప్రయత్నం చెయ్యి" అన్నాడు అహం మూర్తి. 
నారదమూర్తికి అనుమానంగా ఉంది. తర్జనభర్జనపడుతోంది అతని మేధ. 
'అవమానంపాలవవుతావు. ఇదేమీ చిన్న విషయంకాదు. నలుగురితోపని. ఫలితం భౌతికం' అందతని మేధ. మేధని గెలవనివ్వలేదు అహంమూర్తి. 
ఈ సారికూడా అహంమూర్తికి పూర్తిగా వశమైపోయాడు నారదమూర్తి
                                       * * * * *
నిశీధిన, నిశ్శబ్దంగా ఉన్నసమయంలో భూమిమీద చెవ్వు ఆనించి వింటే, ఆప్రదేశంలో భూగర్భజలముంటే, ఆ నీటిప్రవాహ శబ్దం వినబడుతుందని, ఎప్పుడో ఎవరో చెబితే విన్నట్లుగా గుర్తు వచ్చిందతనికి.     
ఆ రోజు రాత్రి నిద్రపోలేదు నారదమూర్తి. అర్దరాత్రి దాటాక దాదాపు రెండుగంటలకు నాలుగో అంతస్తునుంచి కిందకు వచ్చాడు. అపార్టుమెంటులో ఒక మూలగా ఖాళీగా ఉన్నప్రదేశంలో తుప్పలు, ఎండిపోయిన ఆకులూ శుభ్రంచేసి తనతో తెచ్చుకున్నబెడ్ షీట్ కింద పరిచి బోర్లాపడుకుని చెవి భూమికి ఆనించి జాగ్రత్తగా విన్నాడు. నీటి ప్రవాహశబ్దం వినబడలేదు. 
ఇంకొక ప్రదేశానికి మారాడు. అక్కడా పడుకుని చెవి భూమికి ఆనించి విన్నాడు. ఎలాటి ప్రవాహశబ్దం వినబడలేదు. 
'ఓహో…బెడ్ షీట్ అడ్డం ఉంది' అనుకుని దాని పైఅంచు మడిచి పడుకుని కుడిచెవి నేల కానించి కదలక అయిదు నిముషాలబాటు తన ధ్యాసను సూక్ష్మంగా కేంద్రీకరించి భూగర్భనీటి  ప్రవాహశబ్దం వినబడుతుందోమోనని చెవు నిక్కరించి విన్నాడు. ఇంతలో చెంప మీద చురుక్కుమని ఏదో కుట్టినట్లనిపించి, తటాలున లేచి టార్చ్ లైట్ వేశాడక్కడ నారదమూర్తి. ఆవెలుతురులో స్పష్టంగా కనిపించింది చిన్న నల్లటి తేలొకటి కొండి ఎత్తుకుని పాకుతూ! 
కెవ్వున అరిచి చటుక్కున లేచి చెంప రుద్దుకుంటూ అలవికాని మంట, నొప్పితో విలవిల్లాడుతూ, బెడ్ షీట్ మరిచి అక్కడనుంచి పరుగులంకించుకున్నాడు నారదమూర్తి ! 
"ఎవరు ... కోన్ హై వో... చోర్… చోర్ అంటూ విజిల్ వేస్తూ వెంటబడ్డాడు లాఠీతో సెక్యూరిటీ గార్డ్"... 'ఖర్మ సమయానికి వీడొకడు' అనుకుంటూ అడ్డదిడ్డంగా పరుగెత్తి రొప్పుతూ లిఫ్ట్ దగ్గర దొరకనే దొరికాడు తరుముతున్నసెక్యూరిటీ గార్డ్ కి నారదమూర్తి. 
"ఓ ...ఏందీ సార్…గట్ట ఉరుక బడితివి…ఎవడో దొంగనా.... అనుకుని ...లాఠీ నూకెటోన్ని సార్ ! 
ఇంకా నయం...నీ రోజులు, నారోజులు బాగున్నయ్ ! అయినా ఈయాలటప్పుడు కింద ఏం చేస్తుంరు సార్ ?"అనిపైకని, గొణుక్కుంటూ వెళ్లిపోయాడక్కడి నుంచి సెక్యూరిటీ గార్డ్ . 
'బతుకుజీవుడా' అనుకుంటూ ఫ్లాట్ కొచ్చి కారు కీస్ తీసుకుని మరెప్పుడూ భవిష్యవాణి జోలికి వెళ్లరాదనుకుంటూ పొరపాటున గట్టిగా లెంపలేసుకుని నొప్పితో గిలగిల్లాడుతూ ఆసుపత్రికి బయలుదేరాడు నారదమూర్తి ఆ అర్దరాత్రి. 
అహంమూర్తి పూర్తిగా వదిలాడు నారదమూర్తిని ! 
                                                                        * * * * *
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నం. 9849118254                                   
              





31, అక్టోబర్ 2021, ఆదివారం

                                                                       పాకెట్ మనీ  

                                                                       
               ''నాన్నగారు ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లి ఇంకా రాలేదు. రోజూ ఎనిమిదిన్నర, తొమ్మిది కల్లా వచ్చేస్తారు. పదిన్నరవుతోంది.ఇంకా రాలేదు. క్రింద కూడా లేరట.  ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. కంగారుగా, భయంగా ఉందమ్మా !'' ఆందోళనగా అంది విశాలాక్షి, కూతురు అర్పితకు ఫోను చేసి . 
అర్పిత వెంటనే తండ్రి మొబైల్ కి ఫోన్ చేసింది. 'స్విచ్డ్ ఆఫ్' అని వాయిస్ మెసేజ్ వచ్చింది.  వెంటనే భర్త శశాంక్ కి చెప్పి తల్లితండ్రులుండే బాలాజీ అపార్టుమెంట్ కి వచ్చింది అర్ధగంటలో అర్పిత. 
'నాన్నగారెప్పుడూమొబైల్ స్విచ్ ఆఫ్ చేయరే' అనుకుంటూ అపార్టుమెంటులో తండ్రి వాకింగ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఇంటర్ కామ్ నుంచి ఫోన్ చేసి వారితో మాట్లాడి, అపార్ట్ మెంట్ సెక్యూరిటీకి ఫోను చేసి ఆరా తీసింది అర్పిత.
''చూస్తనే ఉన్నమమ్మా మేడం చెప్పింరు…అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్, క్లబ్ హౌస్, జిమ్, లైబ్రరి అంతా వెతికినం. రాఘవరావు సారు ఏడా లేరు. అగపడితే  ఫోనుచేసి చెబుతమమ్మా" అన్నాడు మెయిన్ గేట్ సెక్యూరిటి సూపర్ వైజర్.
రాఘవరావు గారి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. 
''ఎక్కడైనా కబుర్లు చెప్పుకోవడమో లేక క్లబ్ హౌస్ లైబ్రరీకి  వెళ్ళారేమో ! కిందకెళ్ళి చూసి వస్తాం. కంగారు పడకండి. వచ్చేస్తారు'' అని అమ్మకు ధైర్యం చెప్పి వెళ్ళారు. 
రాఘవరావు తో పరిచయంలేనివారు అపార్ట్ మెంట్ లో అరుదు. అందునా ఆదివారం కావడంతో అపార్ట్ మెంట్ లో రాఘవరావు గారు కన్పించడంలేదన్న వార్త గుప్పుమంది. ఒక్కొక్కరువచ్చి ఏమైందని ఆరాతీస్తూ ఫ్లాట్ బయట రెసిడెంట్స్ గుంపులుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. 
రాఘవరావు ఫ్రెండ్స్ తిరిగి వచ్చి '' ఆయన ఎక్కడా కన్పించలేదమ్మా ! వాకింగ్ అయ్యాక అపార్టుమెంటుకి తిరిగి వచ్చారు. ఇంకొద్దిసేపు చూసి పోలీసు కంప్లైంట్ ఇవ్వమ్మా'' అని సలహాఇచ్చి వెళ్లారు. 
                                                                     * * * * *
మధ్యాన్నం 12' గంటలుఅర్పిత, శశాంక్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చివచ్చారు
ఆక్సిడెంట్ కేసులేమయినా ఉన్నాయానని ఎంక్వయిరీ చేశాడు శశాంక్. అలాటి కేసులేమీ లేవు. 
రాఘవరావుకు రిటైర్ అయి పదేళ్ళయింది. వాకింగ్  తరువాత కనబడ్డ వారితో బాతాఖాని వేయడం ఆయన రొటీన్. ఆ విషయమై ఆయనకు, భార్య విశాలాక్షికి తరచూ వాగ్వాదం జరుగుతుండేది. చేసిన టిఫెన్ చల్లారి పోవడమో లేక ఆయన టిఫెన్ ఆమె వంటకి అడ్డురావడం గాని జరిగేది. అందుకే వాకింగ్ అయ్యాక తిన్నగా ఇంటికి రమ్మని పోరేది విశాలాక్షి. ఆ మాటను ఆయనెన్నడూ ఖాతరు చేయలేదు. 
టైం ఒంటిగంట అయింది. రాఘవరావు ఇంటికింకా రాలేదు. 
పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్ స్వయంగా టేక్ అప్ చేశాడీ కేసుని. అపార్టుమెంట్  కి వచ్చి సెక్యూరిటీ వారిని విచారించి రాఘవరావు ఫ్లాట్ కి వచ్చాడు.  
''రాఘవరావుగారితో కొద్ధి పరిచయముందమ్మా. ఆయన ఏ బంధువుల ఇండ్లకుగానీ, స్నేహితుల ఇండ్లకేమైనా వెళ్ళేరేమో ?" అన్నాడు ఇన్స్పెక్టర్ సందేహం వెలిబుచ్చుతూ. 
''ఉహూ... అలా చెప్పకుండా వెళ్ళేమనిషి కాదు. ఆయన ఫోను స్విచ్ ఆఫ్ కావడం ఇంతవరకు నేనెరుగను. స్నానం చేయలేదు. టిఫెన్ చేయలేదు. ఆకలికి తట్టుకునే మనిషి కాదు. చెప్పాపెట్టకుండా ఎక్కడికెళ్ళారో? కంగారు పడతామన్నధ్యాస కూడా లేకపాయే!'' అంది విశాలాక్షి గద్గదస్వరంతో ఉబుకుతున్నకన్నీళ్లను చీరకొంగుతో ఒత్తుకుంటూ.
''ఏడవకమ్మా! శ్రీనివాస్, నరేందర్ అంకుల్ కి ఫోను చేశాను. డాడీ, వాళ్ళిండ్లకు వెళ్ళలేదు.  
'ఎక్కడికెళ్లి ఉంటారీయన' అనుకుంది మనసులో వ్యాకులపడుతూ అర్పిత .
''ఆయనకి ఎవరితోనైనా శత్రుత్వం గానీ, ప్రాపర్టీ గొడవలు గానీ, డబ్బు లావాదేవీలున్నాయా?
ఎవరితోనైనా గొడవ పడ్డారా? అన్ వాంటెడ్ ఫోన్ కాల్స్, డబ్బు డిమాండ్ చేస్తూ గానీ, బెదిరింపు ఫోన్లు గానీ వచ్చాయా? గుర్తు చేసుకుని చెప్పండి'' అడు ఇన్స్పెక్టర్.  
''లేదు బాబూ ! మాకెలాటి ప్రాపర్టీ గొడవలు లేవు. ఎవరి దగ్గర డబ్బుఅప్పుగా తీసుకోవడం గానీ ఇవ్వడంగానీ లేదు. ఇంటా బయట ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు. నీకు తెలుసో లేదో...ఆయన ఒకటి రెండు సార్లు మీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ ఫ్లాట్స్ వాళ్ళ గొడవలు రాజీ చేయించి వచ్చారు'' అంటూ సమాధానమిచ్చింది విశాలాక్షి.
''ప్రాపర్టీ గొడవలు లేవు. ఎవరితోనూ గొడవలు లేవు. కిడ్నాపయ్యారనుకోవడానికి ఎలాటి మోటివ్ గాని ఆధారం గానీ కనిపించడం లేదు. ఎటువంటి బెదిరింపు, డిమాండ్ ఫోన్ కాల్స్ రాలేదు. ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చేస్తారు'' అన్నాడు. 
లేచి బయలుదేరుతూ  "చూడండమ్మా! నాకు చెప్పని కొత్త విషయం ఏదైనా గుర్తుకు వచ్చినా, మీరింకేదైనా చెప్పదలుచుకున్నా ఫోను చేయండి'' అని రాఘవరావు రిటైర్ కాకముందు ఆఫీసు విషయాలు అడిగి ఆయనవి నాలుగు ఫొటోలు తీసుకుని, పర్సనల్ ఫోను నంబరు ఇచ్చికేసు స్వయంగా తనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్పి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. 
వెళుతూ అపార్టుమెంటులో ఇద్దరు వాకింగ్ స్నేహితుల్ని విచారించి వెళ్ళాడు.                                    ఫోను డైరీ తీసి, పాత ఫ్రెండ్స్ కి, దగ్గరి బంధువులకు ఒక్కొక్కరికీ ఫోను చేసింది అర్పిత. వారెవరి ఇండ్లకి రాఘవరావు వెళ్లలేదన్న విషయం స్పష్టమైంది. 
ఇంటర్ కామ్ నిర్విరామంగా మోగుతూనే ఉంది. రెసిడెంట్స్ ఎంక్వైరీలతో విసుగొచ్చి కాసేపు ఫోను పక్కన పెట్టింది అర్పిత. దాంతో స్వయంగా వచ్చి మరీ అడుగుతున్నారు.     
                                                                    * * * * *
సాయంత్రం నాలుగు గంటలు
అపార్టుమెంటులో ఎవరెవరో టీ, కాఫీ, స్నాక్స్  తెస్తూనే ఉన్నారు. అర్పిత ఇన్స్పెక్టర్ కి ఫోను చేసింది. ఇంకేమీ తెలియరాలేదని చెప్పిఫోను పెట్టేశాడు ఇన్స్పెక్టర్. రాఘవరావు తమ్ముళ్లు, అక్క చెల్లెళ్లు ఒక్కొక్కరు దిగుతున్నారు. 
ఇల్లంతా సందడిగా, రభసగానూ తిరునాళ్లలా ఉంది.
''వీరందరికీ రాత్రికి భోజనాలు?" భర్తతో అంది అర్పిత అందరికీ టీ ఇస్తూ. 
''టెన్షన్ పడకు. బయటనుంచి తెప్పిద్దాం'' అన్నాడు శశాంక్. స్థిమిత పడింది అర్పిత.
ఇంతలో ఎవరో రెసిడెంట్ ఇంటర్ కాంలో ఫోన్ చేసి రాఘవరావు గారి మిస్సింగ్ కేసు వార్త, ఆయన ఫోటో తెలుగు టి.వి ఛానళ్లలో వస్తోందని చెప్పారు. 
వార్త టి వి లో చూసిందగ్గరనుంచి మనస్సులో తెలీని భయం, బాధ కలగలిపి తలనొప్పి, కడుపులో వికారంగా అనిపించి ఏడుపు ఆగలేదు అర్పితకు. 
'నాన్నగారు కనిపించకుండా పోవడమేమిటి ? ఆయన్నెవరు కిడ్నాపు చేశారు ? ఎందుకు ? అయన దగ్గర పెద్దగా డబ్బూ లేదు, దస్కంలేదు. దన్నులేదు. ఎవరితో గొడవలూ లేవు. అందునా తనకు మాలిన ధర్మమెక్కువ. డాడీ మా దగ్గర  సీక్రెట్స్ ఏమైనా దాచారా ... ఏదో సినిమాల్లో చూసినట్లు' అనుకుంది అర్పిత. 
'ఛా, ఛా…నాన్నగారి గురించా నేనిలా ఆలోచించింది. నాకే మాత్రం బుద్ధి లేదు. తప్పు,తప్పు ... సారీ డాడీ!' అనుకుంటూ లెంపలు వేసుకుంది అర్పిత అసంకల్పితంగా. 
''అదేమిటే లెంపలు వేసుకుంటున్నావు, నీలో నువ్వే గొణుక్కుంటూ'' కళ్ళువిప్పార్చి ఆశ్చర్యంగా అంది విశాలాక్షి. 
శశాంక్ అర్పిత దగ్గరిగా వచ్చి ఆమె మీదకు ఒంగి వింతగా, పరీక్షగా చూశాడు.
అప్పటికి గాని ఆమెకు అర్ధంగాలేదు తను అసంకల్పితంగా లెంపలేసుకున్నానన్నసంగతి !
                                                                  * * * * *
సాయంత్రం ఏడుగంటలు. రాఘవరావు మొబైల్ ఫోనింకా స్విచ్డ్ ఆఫ్ మోడ్ లోనే వుంది. . పోలీసులెవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు.  
''మేడం! మీరూ, ఆయన ఏమైనా మాట, మాట అనుకున్నారా? కోప తాపాలేమైనా వచ్చాయా ? 
డబ్బు ఇబ్బందులున్నాయా ? ఎప్పుడైనా ఇంట్లోనుంచి వెళ్లిపోతానని బెదిరించారా ? క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయా? ఎవరికైనా డబ్బు అప్పిచ్చి తిరిగివ్వమని ఒత్తిడి చేశారా?" కొత్త ప్రశ్నలు వేసి, కొత్త అనుమానాలు రేకెత్తించి వెళ్ళాడు.  
వెళుతూ విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏమైనా కొత్త సమాచారం ఉంటే ఫోను చేయమని చెప్పివెళ్ళాడు.
అతనలా వచ్చి వెళ్ళాడో లేదో ఇన్స్పెక్టర్ సురేందర్ మళ్ళీ వచ్చాడు. 
"రెండు నిముషాలు మాట్లాడవచ్చా?'' అని అడిగి కూర్చుని 
''ఉదయం రాఘవరావుగారు అపార్ట్ మెంట్ కి తిరిగి వచ్చిన తరువాతే ఎక్కడికో వెళ్ళడం గాని, కిడ్నాప్ కావడం గానీ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అపార్టుమెంట్  మెయిన్ గేటు దగ్గ్గర ఉదయం నుంచి అనుమానాస్పద ఘటనేమీ జరగలేదు. అక్కడ సి.సి కెమెరాలు లేవు. 
వాకింగ్  అయ్యాక అపార్టుమెంటు లోనికి తిరిగి వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. సో... తెలిసిన వ్యక్తులెవరో ఆయన్ని మభ్యపెట్టి తీసుకెళ్ళి ఉంటారన్నకోణంలో చూస్తున్నాము. 
దేనికైనా మోటివ్ ఉండాలి. అది తెలుసుకోవడంకోసమే వచ్చాను. ఏదైనా విషయం దాచి ఉంటే చెప్పండి. ఆయన్ని త్వరగా ట్రేస్ చేయడానికి ఉపయోగపడుతుంది'' అని చెప్పి తల్లీ కూతుళ్ళ వంక పరీక్షగా, పరిశీలనగా చూశాడు ఇన్స్పెక్టర్ సురేందర్.
''ఇన్స్పెక్టర్ గారూ ! అలాంటిదేమైనా ఉంటే మీకు చెప్పకుండా దాచివుంచే ప్రసక్తే లేదు. అమ్మగాని, నేనుగాని, వేరెవరైనా నాన్నగారితో గొడవపడే అవకాశమే లేదు. మీరనుమానించ దగ్గ విషయమేమీ జరగలేదు'' అంది అర్పిత. 
''రాఘవరావు గారికి వేరే ఆడవారితో సంబంధం .... ?" మెల్లగా అడిగాడు ఇన్స్పెక్టర్. 
"ఛ...ఛ...లేదు" ఖచ్చితంగా అంది అర్పిత.  
"అల్జీమర్స్ జబ్బేమైనా ఉందా?" అడిగాడు ఇన్స్పెక్టర్ సూటిగా.  
''సర్! నిజానికి నాకదే అనుమానం వచ్చింది. కానీ ఆయనకలాటి జబ్బేమీ లేదు. ఆరోగ్యం బాగుంది"
''టెలిఫోను కాల్స్ చెక్ చేశాము. అనుమానాస్పద కాల్స్ లేవు. మిస్టరీగా ఉంది'' అన్నాడు ఇన్స్పెక్టర్ పరిశీలనగా వారిని చూస్తూ.
''బంధువులెవరితోనైనా గొడవలేమైనా ఉన్నాయా?" సాలోచనగా చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్.
''లేవు'' అంది అర్పిత..
''సరేనమ్మా ! వస్తాను. ఏదేమైనా, రాఘవరావుగారు క్షేమంగా తిరిగి వస్తారన్ననమ్మకం నాకుంది'' కేప్ సర్దుకుంటూ వడి వడిగా వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్.
'ఇన్స్పెక్టర్ గారు అంత ఖచ్చితంగా, ధైర్యంగా డాడీ త్వరలో తిరిగి వస్తారని అంటున్నారంటే పోలీసులకేమైనా క్లూ దొరికిందా ? దొరికితే ఇంకా మమ్ముల్నిప్రశ్నించవలసిన అవసరమేముంది. అంతా అయోమయంగా ఉంది' అనుకుంది అర్పిత. 
తండ్రి క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు మొక్కుకుని హాల్లో సోఫాలో ఒరిగింది అర్పిత. విశాలాక్షి గదిలో పడుకునే ఉంది. రాఘవరావు తోబుట్టువులంతా వేరే గదిలో మాట్లాడుకుంటున్నారు.
                                                                     * * * * *
రాత్రి 10 గంటల 30 నిముషాలు. 
దగ్గరికి వేసి వున్నబయట తలుపు నిశ్సబ్దంగా, మెల్లగా తెరుచుకుంది.
హాల్లో సోఫాలో పడుకున్నఅర్పిత లేచి ఆత్రుతగా గుమ్మం వంక చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. రాఘవరావు …తలుపు నెట్టుకుని మెల్లగా లోనికి వచ్చారు. 
''డాడీ!" అంటూ ఉన్నపళాన లేచి రెండంగలలో వెళ్లి ఆయనను చుట్టేసుకుంది అర్పిత. 
''చెప్పకుండా ఎక్కడికెళ్ళారు? మీ ఫోనుకేమయింది ?" ఆప్యాయంగా అడిగి ఆయన రెండు చేతులను పట్టుకుని ఆయన ముఖంవంక నిశితంగా చూసింది. ఒక్కపూటకే ముఖమంతా పీక్కు పోయింది. తలమీద ఉన్న కొద్ది జుట్టు అస్తవ్యస్తంగా ఉంది. వాకింగ్ పైజమా, టి షర్ట్ మీదనే ఉన్నారాయన. గడ్డం మాసి, ఎడమ పక్కన మీసానికి బ్రౌన్ కలర్ ఎధెసివ్ గమ్ టేపు ముక్క అంటుకుని ఉంది. 
దాన్ని పట్టుకుని ఒక్కసారిగా లాగింది అర్పిత. చురుక్కుమంది ఆయనకు. 
''అబ్బా'' అన్నారు రాఘవరావు బాధగా ఎధెసివ్ టేప్ ముక్కని అర్పిత ఒక్కసారిగా లాగడంతో.
ఆయన అరవకుండా నోటికి గమ్ టేప్ వేశారని,ఆయనను ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారని అర్ధమయిందామెకు.
వెంటనే ఆయన చేతులు, మణికట్టు, కాళ్ళను పరిశీలనగా తడిమి చూసింది. మణికట్టు మీద 
తాడు వత్తుకుపొయిన గాట్లు, అక్కడక్కడ చర్మం ఎర్రగా కందిపోయి స్పష్టంగా కనిపించింది.
''ఏంటమ్మా...ఏం చేస్తున్నావు?" అంటూ అర్పితను సున్నితంగా తప్పించుకుని లోనికి నడిచారు రాఘవరావు. 
వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేయాలనుకుంది అర్పిత. ముందుగా తండ్రి సంగతి చూడడం ముఖ్యమని సోఫాలో కూర్చొబెట్టి మంచినీళ్ళు త్రాగాక ఆపిల్ జ్యూసిచ్చింది. ఆకలిగా ఉందేమో చప్పున త్రాగి గ్లాస్ తిరిగిచ్చారు. 
విశాలాక్షి ఆయన పక్కనే కూర్చుంది. ఆయన తమ్ముళ్లు, అక్కా, చెల్లెలు,ఆయన చుట్టూ మూగి  ప్రశ్నలు మొదలెట్టారు.
ఆయన పెద్దక్క కళ్ళుతుడుచుకోవడం గమనించింది అర్పిత. వాళ్ళిద్దరి అనుబంధం గురించి తనకు తెలుసు. అందుకే పెద్దత్త దగ్గరిగా వెళ్లి "డాడీ క్షేమంగా వచ్చారు కదా అత్తా" ఊరుకొమ్మని అనునయించింది. ఆమె తన ఎడం చేతిని అర్పిత భుజం చుట్టూ వేసి వీపు తడిమింది.
ఎంతో హాయిగా అనిపించింది అత్తస్పర్శ ఆక్షణంలో అర్పితకు.
తోడబుట్టిన వారి అనుబంధం, ఆత్మీయత అంటే ఏమిటో చాలా దగ్గరిగా చూశాననిపించిండామెకు. ఇంతలోనే ఎలాతెలిసిందో ఏమిటో అపార్ట్ మెంట్ జనం ఒక్కొక్కళ్ళు వచ్చి పరామర్శించడం మొదలెట్టారు.
"పొద్దున మాట్లాడుదాం. ప్లీజ్!" అని సున్నితంగా చెప్పి తలుపు వేసింది అర్పిత. ఇంటర్ కామ్ నిర్విరామంగా మోగుతూనే ఉంది. పినతండ్రిని ఇంటర్ కాం ఫోను దగ్గర కూర్చోబెట్టి చుట్టాలింటికి వెళ్లి వచ్చారని చెప్పమంది. 
బాత్రూంలో వేన్నీళ్ళు బకెట్లోనింపి, అక్కడినుంచే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ''నాన్నగారు  వచ్చారండీ !'' అంటుండగానే ''నాకు తెలుసమ్మా...నేనే ఆయన్నిఫ్లాట్ ముందు వదిలి వెళ్ళాను. ముందు పెద్దాయన సంగతి చూడమ్మా. బాగా అలిసిపోయారు. తిన్నాక ఒక నిద్ర మాత్ర ఇవ్వండి. ఉదయం మాట్లాడుదాం!" అని ఫోన్ కట్ చేశాడు ఇన్స్పెక్టర్ సురేందర్. 
'మిస్టరీగా ఉంది. డాడీని ఇప్పుడు వివరమడిగే పరిస్థితి లేదు. టైర్డ్ గా ఉన్నారు.
ఇన్స్పెక్టర్ చెప్పినట్లు డిన్నరయ్యాక నిద్రమాత్ర ఇచ్చి పడుకోమని చెప్పాలి' అనుకుంది. 
తండ్రి డిన్నర్ చేసి పడుకున్నతరువాత స్థిమితపడ్డది అర్పిత. 
                                                                    * * * * *                               
ఉదయాన్నే పదిగంటలకల్లా పోలీస్ స్టేషన్ కి వెళ్లింది అర్పిత. 
ఇన్స్పెక్టర్ సురేందర్ అర్పితను చూసి ''అరే…అప్పుడే వచ్చారా?"
''ఎలా ఉన్నారు డాడీ ? బ్యాక్ టు నార్మల్ కదా !'' 
''బావున్నారు. అసలేం జరిగింది సర్ ! " అడిగింది అర్పిత ఆత్రుతగా 
ఇన్స్పెక్టర్ కేసు గురించి సీక్వెన్షియల్ చెప్పడం మొదలెట్టాడు.                                                                                                                                  * * * * *  
గాంధీనగర్ పోలీస్ స్టేషను. ముందురోజు రాత్రి తొమ్మిది గంటలు.
ఇన్స్పెక్టర్ సురేందర్, సబ్ ఇన్స్పెక్టర్లతో కూర్చుని రాఘవరావు మిస్సింగ్ కేసు ప్రోగ్రెస్  చర్చిస్తున్నారు. ఆయన మొబైల్ రింగయింది. ఫోను ఎత్తాడు ఇన్స్పెక్టర్. 
''హలో గుడ్ ఈవెనింగ్ సర్ ! 
యాదయ్య, కానిస్టేబుల్ ఆన్ సర్వైలెన్స్ డ్యూటీ రిపోర్టింగ్ ఫ్రమ్ బాలాజీ అపార్ట్ మెంట్ సర్! ఆ ఫ్లాట్ లోపల ముగ్గురో, నలుగురో పిల్లలున్నారు సర్. ఇద్దరు పిల్లలు  రెండుసార్లు బయటకు వచ్చి మళ్ళీ లోనికి వెళ్లి తలుపు బంద్ చేశారు సర్! ఫ్లాట్ లో ఉండే ఇద్దరు పిల్లలు బయటకెల్లలే. వాళ్ళ పేరెంట్స్ ఊరికి పోయింరంట. రెండు మూడు రోజులుదాకా రారంట. మస్తు అనుమానంగా ఉంది. మీరు జల్దీ వచ్చేయండి...సార్ !" అన్నాడు యాదయ్య 
''సరే, యాదయ్యా ! అలర్ట్ గా ఉండు. పది నిముషాల్లో అక్కడుంటాం '' అని ఫోను కట్ చేసి టైం చూసుకున్నాడు ఇన్స్పెక్టర్ సురేందర్. టైం తొమ్మిది గంటల ముఫై నిముషాలవుతోంది. 
వెంటనే తను, ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుళ్ళతో బాలాజీ అపార్ట్ మెంట్ కి చేరుకున్నారు 
'గేటు దగ్గరినుంచి సెక్యూరిటీ గార్డ్ ని తీసుకుని థర్డ్ ఫ్లోర్ కి వెళ్లారు. అపార్ట్ మెంట్ 
ఫ్లోర్ పాసేజ్ పొడుగ్గా ఉంది. అక్కడక్కడ లైట్స్ వెలగక పోవడంతో అంతగా వెలుగులేదు.
చేయి ఊపాడు ఫ్లోర్ చివరనుంచి ముఫ్టీలోఉన్న కానిస్టేబుల్ యాదయ్య. 
పోలీసులు ఆ టైంలో రావడంతో అదే ఫ్లోర్ లో బయట కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు రెసిడెంట్స్ పోలీసుల వెనకాలే నడుస్తూ ''ఎనీ అప్డేట్ సర్ రాఘవరావుగారి కేసులో ... " అని అడగడంతో వారికి సమాధానం చెప్పకుండా ''ప్లీజ్ ఫాలో మీ'' అంటూ వారిని తనతో రమ్మని సైగ చేశాడు ఇన్స్పెక్టర్.  
ఏదో జరుగుతోందన్న ఉత్సుకతతో ఇద్దరు రెసిడెంట్స్ పొలిసు వారి వెనకాలే నడిచారు .
మఫ్టిలో ఉన్న కానిస్టేబుల్ యాదయ్య తను సర్వైలెన్స్ చేస్తున్న అనుమానాస్పద  ఫ్లాట్ తలుపుతట్టాడు.  
మిగతావారంతా ఓ పక్కగా గోడకానుకుని నిలబడి నిశ్సబ్దంగా గమనిస్తూ ఉన్నారు. ఫ్లాట్ తలుపు కొద్దిగా తెరుచుకుంది. 
సుమారు పదిహేను,పదహారు  సంవత్సరాల వయసున్న కుర్రాడు తల కొద్దిగా బయటపెట్టి 'కౌన్ హై... హూ ఈజ్ దట్ ? అన్నాడు రెండు భాషల్లో.
"మీ డాడీని పిలువమ్మా...నన్ను రమ్మన్నారు'' అన్నాడు కానిస్టేబుల్
''డాడీ  ఈజ్ అవుట్  అఫ్  స్టేషన్ .. హి  విల్  కం  డే  ఆఫ్టర్  టుమారో.. యు  కం  లేటర్ !'' అని విసురుగా తలుపు మూశాడు. కానిస్టేబుల్ తన ఎడంకాలు తలుపు కడ్డంగా బెట్టి తలుపు బలంగా లోనికి నెట్టి  
''ఇంట్లో పెద్దవాళ్ళుంటే పిలువు బాబూ... పనిఉంది" అని రెండుచేతులతో తలుపును  బలంగా తెరిచి  పట్టుకుని తలలోనికి ఉంచి ఇంట్లోకి చూశాడు కానిస్టేబుల్.
''ఇంట్లో ఎవరూ లేరు. నేనొక్కడినే ఉన్నాను. మా పేరెంట్స్ ఊరి కెళ్ళారు'' అన్నాడా కుర్రాడు తలుపుమూయడానికి నెడుతూ ...  
కానిస్టేబుల్ తలుపు బలంగా వెనక్కి నెట్టడంతో ''హేయ్...వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్...ఐ విల్ కాల్ పోలీస్'' అంటూ లోపలి నుంచి వచ్చిన ఇంకొక కుర్రాడితో కలిసి మఫ్టీలో ఉన్నకానిస్టేబుల్ ని బయటకు నెట్టడానికి ప్రయత్నం చేస్తుండగానే, యూనిఫార్మ్ లో ఉన్న పోలీసులు గుమ్మం ముందుకు వచ్చి తలుపు పూర్తిగా తెరిచారు. 
ఇన్స్పెక్టర్ ఇద్దరు రెసిడెంట్స్ కి  చెప్పాడు. రాఘవరావుని ఆ ఫ్లాట్లో బందీగా ఉంచినట్లుగా ఇన్ఫర్మేషన్ ఉందని, లోపలి వెళ్లి చూడమని. 
ఇంతలో తలుపు తీసిన కుర్రాడు సడెన్ గా బయటకు వచ్చి మెట్ల వైపు పరుగెత్తాడు. 
అనుకోని సంఘటనకు ఇద్దరు రెసిడెంట్స్ బిత్తరపోయి చూస్తుండగానే కానిస్టేబుల్ పరుగెత్తి 
ఆ కుర్రాడిని పట్టుకువచ్చాడు. తన పేరు సంజీవ్ అని, ఫ్లాట్ లో నితిన్, వికాస్, దుశ్యంత్ వున్నారని చెప్పాడు. 
ఇన్స్పెక్టర్ సురేందర్, కానిస్టేబుళ్లు, ఇద్దరు రెసిడెంట్స్ ఫ్లాట్ లోనికి వెళ్లారు. 
ఒక్క బెడ్ రూం మినహా ఫ్లాట్ లో వేరే రెండు బెడ్ రూములు తెరిచే ఉన్నాయి.
''నాకేమీ తెలీదు. నన్నొదిలేయండి. నితిన్, వికాస్,...వాళ్లిద్దరే అంకుల్ని గదిలో ఉంచారు'' అని గింజుకుంటూ పెద్దగా ఏడుస్తూ చెప్పాడు సంజీవ్.  
తలుపుతీసిన కుర్రాడితో మాట్లాడి వివరాలు సేకరించి వికాస్, సంజీవ్, దుశ్యంత్ పేరెంట్స్ ని ఫ్లాట్ కి పిలిపించాడు ఇన్స్పెక్టర్.

ఒక బెడ్ రూం లోపలినుంచి క్లోజ్ చేసి ఉంది. ఇన్స్పెక్టర్ చేసిన సైగ తో ఒక రెసిడెంట్ తలుపు కొట్టి ''నితిన్! నేను ప్రకాష్ అంకుల్ ని మాట్లాడుతున్నాను. మీ డాడీ ఫోన్ లో ఉన్నారు మీతో మాట్లాడాలట'' అన్నాడు. 
తలుపు తీశాడు నితిన్. అతని వెంట వికాస్ ఉన్నాడు. వెంటనే కానిస్టేబుల్, ఇద్దరు రెసిడెంట్స్, తరువాత ఇన్స్పెక్టర్ లోనికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి అందరు ఆవాక్కయ్యారు. 
రాఘవరావు చేతులు, కాళ్ళు వెనక్కికుర్చీకి  కట్టేసి, ఆ కుర్చీని ఒక మూలగా ఉంచారు. ఆయనకు డైనింగ్ టేబుల్ అడ్డుగా పెట్టారు. నోటికి ఎధెసివ్  గమ్ టేప్ వేసి ఇద్దరు కుర్రాళ్ళు కాపలా 
ఉన్నారు. ఇంట్లో మొత్తం నలుగురు కుర్రాళ్ళు  ఉన్నారు. అక్కడి దృశ్యం అంతా వీడియో, ఫోటోలు తీశాడు కానిస్టేబుల్.
సబ్ ఇన్స్పెక్టర్ రాఘవరావు కట్లు విప్పాడు. ఒక రెసిడెంట్ లోనికి వెళ్లి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. మొత్తం నలుగురు పిల్లలు వంచిన తలలు పైకి ఎత్తడం లేదు.
''ఎలా ఉన్నారు సర్! మీ ఫ్లాట్ దాకా నడచే ఓపిక ఉందా ? దెబ్బలేమైనా తగిలాయా ? హాస్పిటల్ కి వెళదామా" అని రాఘవరావుని అడిగాడు ఇన్స్పెక్టర్. 
''లేదు. దెబ్బలేమీ లేవు ... నడవగలను. హాస్పిటల్ అవసరం లేదు '' అంటూ లేచి నిలబడుతూ  తూలి పడబోయారు రాఘవరావు.  
కానిస్టేబుల్ ఆయన భుజాలచుట్టు చేయివేసి సోఫాలో కూర్చోబెట్టి ఆయన పక్కనే నిలబడి ఉన్నాడు. 
మంచినీళ్లు త్రాగి, రాఘవరావు కుడి చేత్తో ముఖం తడుముకుని, ఎడం భుజాన్ని కుడిచేత్తో వత్తుకున్నారు.
సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఆ గది క్షుణ్ణంగా సోదా చేసి, వారు వాడిన ఎధెసివ్ టేప్ రోల్ ని, ప్లాస్టిక్  తాళ్ళను, రాఘవరావు కట్టేసిన కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. పిల్లల నలుగురి జేబులు సోదా చేసి వాళ్ళ దగ్గరనుంచి రెండు మొబైల్ ఫోనులు స్వాధీనం చేసుకుని పిల్లల పేరెంట్స్ ని కాంటాక్ట్ చేశారు పోలీసులు.
నితిన్  పేరెంట్స్ ఢిల్లీలో ఉన్నామని, ఉదయమే పోలీసు స్టేషన్ కి వచ్చి కలుస్తామని చెప్పారు.  రెసిడెంట్ ప్రకాష్ వారితో మాట్లాడారు. 
కొద్దిగా తేరుకున్న రాఘవరావుగారు లేచి తను వెళ్తానని ఆ పిల్లలని అరెస్ట్ చేయవద్దని, మరుసటి రోజు పిల్లలని ప్రశ్నించమని పోలీస్ ఇన్స్పెక్టర్ ని రిక్వెస్ట్ చేశాడు. 
''మంచితనానిక్కూడా హద్దుండాలి. ఇలాటి వాళ్ళు మంచితనాన్నిఅసమర్ధత, చేతగానితనంగా తీసుకుని రెచ్చిపోతూ ఉంటారు. మీకేమైనా అయివుంటే పరిస్థితి ఏమిటి ? వీక్ హార్ట్ వాళ్ళవుతే ఏదైనా జరగొచ్చు. లా  విల్  టేక్  ఇట్స్ ఓన్  కోర్స్'' అన్నాడు ఇన్స్పెక్టర్.    
రాఘవరావు ఇంటికి వెళతానని లేవడంతో ఆయనకు ఎస్కార్ట్ గా ఫ్లాట్ వరకు నడిచి "మీరిప్పుడు వెళ్ళండి. రేపు స్టేషనుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళండి" అని రాఘవరావు ఇంట్లోకి వెళ్ళిన దాకా వేచి చూసి, ఫ్లాట్ కి  తిరిగి వచ్చాడు ఇన్స్పెక్టర్. 
పంచనామా, స్టేటుమెంట్లు అయ్యేసరికి తెల్లవారింది. ఉదయాన్నే నలుగురు జువనైల్ దోషుల్నిస్టేషనుకి తరలించారు పోలీసులు. వారివెంట కొందరు పేరెంట్స్,వెళ్లారు.    
                                                                       * * * * *
''అదమ్మా జరిగిన కధ"' అన్నాడు ఇన్స్పెక్టర్ .
''డాడీనే  ఎందుకు కిడ్నాప్ చేశారు? అదే మీ భాషలో... మోటివ్ ఏమిటి? మీరా టైంకి వెళ్ళకపోతే ఏం జరిగేది ? అన్నది ప్రశ్నలుగానే ఉండిపోయయికదా ?'' అంది అర్పిత కుతూహలంగా. 
''సమాధానం నేను చెప్పేకంటే మీరే వినండి'' అంటూ కాలింగ్ బెల్  నొక్కాడు ఇన్స్పెక్టర్.
''సర్'' అంటూ స్టిఫ్ గా సెల్యూట్ చేశాడు లోనికి వచ్చిన కానిస్టేబుల్. 
''ముందుగా ముగ్గురు పేరెంట్స్ ని, సాక్షులని లోనికి పంపించు. తరువాత ఒక్కొక్క పిల్లాణ్ణి పంపించు"
ఐదుగురు లోనికి వచ్చి కూర్చున్నారు. 
ముందుగా నితిన్ లోనికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.   
"రాఘవరావుగారి నెందుకు, ఎలా కిడ్నాప్ చేశారు? " అడిగాడు ఇన్స్పెక్టర్.
"పేరెంట్స్ ఎవరూ మాట్లాడవద్దు. వార్నింగ్ టు యూ ఆల్ ! నలుగురి దోషుల స్టేట్ మెంట్స్ ఆర్  రికార్డెడ్ ఇన్ వీడియో ఇన్ ప్రెజెన్స్ అఫ్ పేరెంట్స్ అండ్ విట్నెసెస్ ... కమాన్ ప్రొసీడ్. నితిన్ !'' అన్నాడు ఇన్స్పెక్టర్.
"సర్ ! చిన్న పిల్లలు....ఇదంతా ఆక్సిడెంటల్ గా జరిగింది. కేసు వద్దు సర్! పిల్లల ఫ్యూచర్ ..." అన్నాడు నితిన్  ఫాదర్ 
"నేరం పిల్లలు చేశారా... పెద్దవాళ్లు చేశారా కాదు. నేర తీవ్రతను బట్టి కేసు దోషులపై రిజిస్టర్ అవుతుంది. 
ఈ కేసు చిన్నది కాదు. ఆక్సిడెంటల్ అంతకన్నా కాదు. మీ పిల్లలు, మీరు అదృష్టవంతులు. రాఘవరావుగారికేమీ కాలేదు ... ముందు మీ పెంపకం గురించి ఆలోచించండి!" కరకుగా అన్నాడు ఇన్స్పెక్టర్. 
"కమాన్  నితిన్ ప్రొసీడ్" అన్నాడు ఇన్స్పెక్టర్ .  
''సర్! రాఘవరావు అంకుల్ మమ్ముల్ని సతాయించేవాడు. అపార్టుమెంటులో క్రికెట్ ఆడినా, ఫుట్ బాల్ ఆడినా గ్లాసెస్ పగుల్తాయని, వాకింగ్ చేసేవారికి దెబ్బలు తగుల్తాయని. సైకిల్ రేసింగ్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేసివాడు. ఆయన వల్ల మామా ఆటలకి ఫ్రీడమ్ ఉండేది కాదు.  
రీసెంట్ గా ఒకరోజు అపార్టుమెంటులో ఒక పెయింటర్ పనయ్యాక వెళుతూ మిగిలిన పెయింట్ డబ్బాలు, బ్రష్ లు సెల్లార్ పార్కింగ్ లో పెట్టి వెళ్ళడం మేము చూశాము. 
''మేము ...అంటే ఎవరెవరు?" కరకుగా అన్నాడు ఇన్స్పెక్టర్. 
''నేను, సంజీవ్'' 
"తరువాత... " 
"ఆ పెయింట్ ని ఏదైనా వాల్ కి వేద్దామనుకున్నాము. మరుసటి రోజు ఆదివారం. నేను, సంజీవ్ కలిసి సెల్లార్ లో ఒక కార్నర్ వాల్ కి పెయింట్ వేస్తుంటే జారి, స్పిల్ అయి పక్కన కార్ విండ్ షీల్డ్ మీద పడ్డది. ఆ పెయింట్ తుడిచాము. కారు గ్లాస్ మీద అక్కడక్కడ పెయింట్ డ్రై అయింది. 
ఆ కారు ఓనర్ సొసైటీ కి కంప్లంట్ చేశాడు. దాంతో సి. సి కెమెరాలు లేవు. ఎవరు వేస్తున్నారో తెలియక సొసైటీ లో బాగా అల్లరయ్యేది. వుయ్ హేడ్ గ్రేట్ ఫన్. అలా వీలుదోరికినప్పుడెల్లా సీక్రెట్ గా ఏదో ఒక కార్ విండ్ షీల్డ్ మీద పెయింట్ వేశాము. అలా అయిదు కార్ల గ్లాస్ మీద పెయింట్ వేశాము. ప్రతిసారీ గొడవయ్యేది. మేం నలుగురం నవ్వుకునే వాళ్ళం.
''పెయింట్ వేసిన మిగతా ఇద్దరి పేర్లేమిటి ?"ఇన్స్పెక్టర్ గట్టిగా అడిగాడు.
"వికాస్, దుశ్యంత్" అన్నాడు నితిన్. 
"తరువాత ఏమైంది ?"
"ఆ పెయింట్ మేమే వేశామని సొసైటీ మీటింగ్ లో మా డాడీ అడ్మిట్ చేశారు. మా డాడీకి సొసైటి వాళ్ళు పెనాల్టీ వేశారు. కార్ల పెయింట్ క్లీనింగ్ ఖర్చంతా డాడీ మీద పడ్డది. పనిష్మెంట్ గా డాడ్  'పాకెట్ మనీ' ఇవ్వడం మానేశారు. 
ఇదంతా  రాఘవరావు అంకుల్ కంప్లయింట్ వల్లే జరిగిందని మేము నలుగురం అనుకున్నాము. 
కమ్యూనిటిలో మేం 'బేడ్ బోయ్స్' అయ్యాము. పాకెట్ మనీ పోయింది. ఓనర్, అపార్టుమెంటు వెకేట్ చేయమన్నాడు. అందుకే అంకుల్ కి  వార్నింగ్ ఇద్దామని మా ఫ్లాట్ కి  తీసుకెళ్ళాను.
"అంకుల్ అంటే ఎవరు"? రెట్టించి అడిగాడు ఇన్స్పెక్టర్. 
"రాఘవరావు అంకుల్" వారు స్పష్టంగా చెప్పిందాకా రెట్టించాడు ఇన్స్పెక్టర్. 
"కంటిన్యూ..." అన్నాడు ఇన్స్పెక్టర్.
"అంకుల్ కి వార్నింగ్ ఇచ్చి వెంటనే వదిలేద్దామనుకున్నాము. వదిలేయడానికి వీల్లేకుండా మా ఎదురు ఫ్లాట్ లో  ఫంక్షన్ కి వచ్చిన వారు మా ఫ్లాట్ ఎదురుగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు.  సాయంత్రం వరకు క్రౌడెడ్ గా ఉంది. అప్పటికే అంకుల్ కిడ్నాప్ అయినట్లు కమ్యూనిటీలో గొడవ అవుతోందని, పోలీసులు వచ్చారని తెలిసింది. అదీగాక సెక్యూరిటీ గార్డ్ అక్కడే తిరుగుతూ ఉండడం వల్ల అంకుల్ ని వదలడానికి భయపడ్డాము. అంతేగాని ఆయన్ని మేము కట్టివేయాలనుకోలేదు. అంతా ఆక్సిడెంటల్ గా జరిగింది.  కావాలని చేసింది కాదు. ఇదంతా నావల్లే జరిగింది. తప్పంతా నాదే. ఇక ఎప్పుడూ ఇలాటి పని చేయను. మమ్ముల్నివదిలేయండి ప్లీజ్"అంటూ బావురుమని ఏడుపు మొదలెట్టాడు నితిన్.
''ఆయనను మీ ఫ్లాట్ లోనికెలా తీసుకు వెళ్ళారు ?" అడిగాడు ఇన్స్పెక్టర్ నితిన్ ముఖంలోకి నిశితంగా చూస్థూ.
''అంకుల్ ఉదయాన్నే వాకింగ్ నుంచి తిరిగిరావడం గేట్ దగ్గరే ఉన్ననేను చూశాను. 
ఆయన లిఫ్ట్ ఎక్కుతుంటే నేను లిఫ్ట్ ఎక్కి ఆయనతో మాటలు కలిపాను. ఇంట్లో దేవుడి ఫోటో ఎక్కడ ఫిక్స్ చేయాలో తెలవడంలేదు. అంకుల్ ని ఒకసారి వచ్చి వెళ్ళమని మామ్ చెప్పిందని చెప్పి ఫ్లాట్ లోకి తీసుకువచ్చాను.అంకుల్ లోనికి రాగానే వికాస్ తలుపు క్లోజ్ చేశాడు. 
అప్పుడే సంజీవ్ వచ్చి "ఎదురు ఫ్లాట్ లో ఏదో ఫంక్షన్ అవుతోంది. చాలామంది 
ఫ్లాట్ ఎదురుగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు అంకుల్ ని వదిలేస్తే ఆయన బయటకు వెళ్లి అందరికీ చెబితారేమో" అన్నాడు    
"ఆయన ఎవరికి చెప్పనని, తనని వదలమని గట్టిగా అనడంతో భయపడి నేనే అంకుల్ నోటికి టేప్ వేశాను. నలుగురం కలిసి ఆయన్ని కుర్చీకి కట్టేసి డైనింగ్ టేబుల్ అడ్డంగా జరిపాము. సాయంత్రం వరకు ఎదురు ఫ్లాట్ లో ఫంక్షన్ అవుతూనేవుంది. సెక్యూరిటీ గార్డ్, మరొక వ్యక్తి  అక్కడక్కడే తిరుగుతున్నారు. అందుకే అంకుల్ ని వదలడం కుదరలేదు" అన్నాడు నితిన్  
మిగతా ముగ్గురు పిల్లలు ఇంచు మించు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు.  
''అదీ యదార్ధంగా జరిగిన సంగతి'' అన్నాడు ఇన్స్పెక్టర్.
''ఇంకొక విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు'' అంది అర్పిత 
''షూట్...'' అన్నాడు ఇన్స్పెక్టర్.
''ఈ పిల్లలే డాడీని కిడ్నాప్ చేశారన్నడౌట్ మీకెలా వచ్చింది?" అంది అర్పిత ఇన్స్పెక్టర్ వంక సూటిగా చూస్తూ.   .
''ఏ కిడ్నాప్ కైనా మోటివ్ ఉంటుంది. అదేదో తెలిస్తే గాని కేసు సాల్వ్ కాదు. ఈ కేసులో నెగటివ్ ఎవిడెన్స్ లేదు. సో... బయటవాళ్లు చేసిన కిడ్నాప్ కాదని నిర్ధారణకు వచ్చాము. తరువాత  ఫ్రెండ్స్, బంధువులు. మీతో మాట్లాడాక అదీ రూల్ అవుటయింది. మిగిలింది అపార్టుమెంట్ లోవారు. అక్కడా రాఘవరావు గారి మీద ఎటువంటి నెగటివ్ రిపోర్ట్ లేదు. 
సెక్యురిటి గార్డ్ ఒకడు చెప్పాడు. కమ్యూనిటీ లో నలుగురు అల్లరి పిల్లలు ఉన్నారని... వాళ్ళకి రాఘవరావు సారంటే కోపమని చెప్పాడు. ఆ చిన్న'క్లూ' తో ఆ నలుగురు పిల్లల మీద, ఆ ఫ్లాట్ మీద  నిఘా ఉంచాము. తరువాత ఏం జరిగింది మీకూ తెలుసు" అంటూ ముగించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్.
"కంప్లైంట్ విత్ డ్రా చేసుకొమ్మన్నారు డాడీ" అంది అర్పిత.
"నాకూ అదేమాట చెప్పారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఆయన సేఫ్ గా వచ్చారు కాబట్టి మీ అందరికీ కేసు తీవ్రత తెలియడంలేదు. వీక్ మైండ్ మనుషులవుతే అలాటి సిట్యుయేషన్ లో ఏదైనా కావచ్చు. ఎనీహౌ మీ ఇష్టం. రాఘవరావుగారిని స్టేషన్ కి వచ్చిస్టేటుమెంటు యిమ్మన్నాను. ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశాము. మీరేం చేయదలుచుకున్నా వ్రాత పూర్వకంగా యివ్వండి. కోర్ట్ నిర్ణయం తీసుకుంటుంది. మా చేతుల్లో ఏమీ లేదు" స్పష్టంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ సురేందర్. 
                                        
                                                 * * * * *   సమాప్తం   * * * * *                                                                  
                         

  
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
Mob. No.9849118254                         
           




14, సెప్టెంబర్ 2021, మంగళవారం


                                                                   ఆపన్నులు 
                                                                  ==========  

సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నర గంటలు. రాజగోపాలస్వామి గుడి గంట ఠంగ్…ఠంగ్ మంటూ వాయులీనమైన ప్రతిధ్వనితో మ్రోగింది. ఆరోజుకిక గుడి ద్వారం మూసి తాళంవేసి భక్తులందరూ వెళ్ళారా లేదానని చూశాడు పూజారి తిరువనంతాచార్యులు. లైట్లన్నీఆర్పి ఆలయపు ఆవరణలోనే మిద్దెపైనున్ననివాసానికి వెళుతూ చావడి మూలన ఏదో ఆకారం కదిలినట్లనిపించి లైట్ వేశాడు. ఎవరో వ్యక్తి  గోడనానుకుని కాళ్ళు జాపి కూర్చుని జోగుతున్నట్లనిపించి ''ఎవరదీ?" గద్దించి అడిగాడు పూజారి. అతన్నుంచి సమాధానం లేదు.  
''గుడి మూశాను ... ప్రసాదం అయిపోయింది. అందరూ వెళ్లారు. మీరు కూడా వెళితే బయట తలుపులు మూస్తాను" అన్నాడు పూజారి. 
అతనిలో కదలిక లేదు. కంగారుగా నాలుగంగల్లో అతన్ని చేరి మసక వెలుతురులో పరికించాడతణ్ణి. వయస్సు సుమారు ఏభై ఐదు, అరవై సంవత్సరాల మధ్య ఉంటాయి. పొట్టి లాల్చీ, జీన్స్ ప్యాంటులోఉన్నాడు.
చేతికి ఖరీదయిన వాచీ, ఉంగరపు వేలుకి వజ్రపుటుంగరం. పక్కనే బ్యాక్ ప్యాక్. 
ఉన్నవాడిలా కన్పించాడతను. తక్షణం అతని చేయి నందుకుని 'నాడి' పరీక్షించాడు.  మెల్లగా కొట్టుకుంటోంది. ఆయుర్వేద వైద్యంలో ప్రవీణుడయిన పూజారి తిరువనంతాచార్యులకి స్పష్టమయింది ఆవ్యక్తి  తినక నీరసంతో స్పృహకోల్పోయాడని.
భార్య పారిజాతంను కేకేసి "త్వరగా గ్లాసెడు మంచినీళ్లు తీసుకురా" బిగ్గరగా అరిచాడు పూజారి, మిద్దెపైనున్న భార్యకు వినిపించేలా. పరుగున మంచినీళ్ళు తెచ్చిందావిడ. 
నీళ్లు చిలకరించాడతని మొహాన పూజారి. 
అతని కనురెప్పలు కదిలాయి. మెల్లగా కదిలాడు. కదులుతున్న కనుగుడ్ల ఆనవాలు కనురెప్పలపైనుంచి పసిగట్టి, గట్టిగా తడుతూ అతన్నిస్పృహలోనికి రప్పించే ప్రయత్నం చేశాడు పూజారి. 
నీరసంగా కళ్లు తెరుస్తూనే పూజారి వంక చూస్తూ ''అనంతూ!'' అన్నాడతను హీన స్వరంతో. 
ఆ పిలుపుకు అనూహ్యంగా స్పందించింది అనంతాచార్యులు హృదయం. 
మనసు ఉత్తేజితమయిందిఒళ్ళు గగుర్పాటు చెందింది. వివశుడయ్యాడు పూజారి.         
ముప్ఫై అయిదు సంవత్సరాలపైమాటే అతనా పిలుపువిని. 
"ప్రకాశం...నువ్వా."!? ఒళ్ళు తెలియని ఉద్వేగంతో లేచి ఒంగుని ప్రకాశం భుజాలు పట్టుకుని కుదుపుతూ మోకాళ్ళమీద నిలిచి, అతని తల వెనకాలగా ఎడమచేతిని ఊతంగా చేర్చి కాసిన్ని మంచినీళ్లు పట్టాడతనికి.  
కొద్దిగా తేరుకుని కళ్ళు తెరిచి కొద్దిగా వెనక్కి జరిగి నీరసంగా గోడకు జేరగిలబడ్డాడు ప్రకాశం. 
"పారిజాతం! కొద్ది పంచదార వేసి త్వరగా వేడిపాలు తీసుకురా" అని భార్యకు చెప్పాడు 
తిరువనంతాచార్యులు. 
వేడి పాలుత్రాగి కొద్దిగా తేరుకున్నతను "అనంతూ... నీలో పెద్దమార్పేమీ లేదు. వయస్సు ఛాయలు కనబడుతున్నాయి. అంతే! నన్ను గుర్తించలేదు కదూ!" రహస్యం చెబుతున్నట్లుగా మెల్లగా అన్నాడు ప్రకాశం
"తరువాత మాట్లాడదాం ప్రకాశం! ఎప్పుడు తిన్నావు?" ప్రశ్నించాడు తిరువనంతాచార్యులు.
"నిన్నఉదయం భోజనం చేశాను. తరువాత ఏమీ తినలేదు. గుడి లోనికి వస్తూనే కళ్ళు తిరిగినట్లనిపించింది. ఈ మూలకు వచ్చి గోడకానుకుని కూర్చున్నాను. తరువాత ఏమైందో తెలియదు" అన్నాడు ప్రకాశం. 
"నీరసంగా ఉన్నావు. కొద్దిగా తిని, విశ్రాంతి తీసుకుందువుగాని. ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు" అంటూ ప్రకాశానికి చేతినందించి మిద్దె పైన తనింటికి  తీసుకెళ్లాడు తిరువనంతాచార్యులు. 
                                                                   * * * * *        
తెల తెలవారుతూనే గుడి గంటలు, సుప్రభాత మంత్రాలు వినబడ్డాయి ప్రకాశానికి. లుంగలు చుట్టిన పాత దూది పరుపు మీద చిరుగుల తెల్లటి చలువ దుప్పటి, కొసలు వ్రేలాడుతున్న తెల్లటి గలీబులో గట్టి పల్చని దిండు. పేదరికం తాండవిస్తూ కనిపించిందా ప్రదేశం. పక్కనే ఇంకొక పరుపు చుట్టేసి ఉంది. 
'ఓ! ... రాత్రి అనంతు ఇక్కడే పడుకుని లేచి వెళ్లినట్లుంది' అనుకుంటూ రాత్రి జరిగినదంతా మననం చేసుకుని, లేచి కూర్చుని పరిసరాలు పరికించి చూశాడతను. 
గోడలకి తాపడం చేసిన చైనా పింగాణీ టైల్స్, బెల్జియం అద్దాలతో నిగలాడుతూ ఉండే ఆ అద్దాలచావడిని శిధిలావస్థలో చూసి చలించిపోయాడు ప్రకాశం. 
గోడలుకున్న టైల్స్ ఊడి సున్నపు తాపడం పెచ్చులు ఊడుతున్న గోడలు, 
నెర్రెలు బాసి ఎర్రటి తారసు బిళ్ళలు జారి ఊడి పడేట్లుగా ఉన్న పైకప్పు, జీవంపోయి ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా వుంది. మాసిన చావడిలో మూసివున్న రెండు పడక గదులు.  ఇంకొక పక్క నల్లమద్ది భోషాణం, పాత పందిరిమంచం, మూలగా చేతులు విరిగిన టేకు కుర్చీల కుప్ప, ఆ మిద్దె  ఒకప్పటి వైభవానికి సాక్షీభూతంగా పడివున్నాయి. కిటికీ నుంచి కనిపించే పూలతోట, తులసి వనం, పెద్ద నందివర్ధన చెట్టు మాయమయ్యాయి. తోట చుట్టూవున్న ప్రహరీ గోడ ఆనవాళ్లులేవు. 
పిల్లల ఆటస్థలమైనట్లుగా వుంది. వేప, రాగి, ఉసిరి వృక్షాల ఉనికే లేదు. 
అదే ఆవరణలో బాల్యంలో తిరుగాడిన జ్ఞాపకాలు దొంతర్లుగా ప్రకాశం బుర్రలో తిరుగాడాయి.
                                                            * * * * *
"అనంతూ! ఈ రోజు సినిమాకెళదాం" పన్నెండో తరగతి సంవత్సర చివరి పరీక్షవుతూనే అన్నాడు ప్రకాశం. 
"వెళదాం గాని ఏమైంది మీ నాన్నగారి తిరుగు ప్రయాణం?"  అన్నాడు అనంతు 
"అదే అనంతూ ! ఎలా చెప్పాలో అర్ధంగావడం లేదు. నాన్నగారొక్కరే అమెరికా వెళతారనుకున్నాను. కాదట! కుటుంబం అందరం వెళ్ళితున్నామట. ఇక నా చదువక్కడే. 
మళ్లీ వస్తామో, రామో... తెలీదనంతూ !" అంటూ అతన్నిచుట్టుకుని బావురుమన్నాడు ప్రకాశం.   అనంతు ముఖం ఒక్కసారిగా వివర్ణమైంది. 
ప్రాణస్నేహితుడు తనని వదలి వెళ్లిపోతున్నట్లుగా అర్ధమయింది. కాళ్లక్రింద భూమి 
కదులుతున్నట్లనిపించిందతనికి. 
'నాచదువంతటితో ముగిసినట్లేనా ? ఇన్నాళ్లు ఖర్చు భరించి చదివించిన స్నేహితుని తండ్రి వెళ్లిపోతున్నారు. భవిష్యత్తు అర్ధం కావడంలేదు' అనుకుంటూ  
"కలిసి బి.ఇ చేద్దామనుకున్నాం కదా! చదువక్కడే అంటావేంటి ? తిరిగి రావడంలేదా?  
మరి ఆస్తి, ఇల్లు, గొడ్లు... ?" తిరిగివస్తామని చెబుతాడేమోనన్న గంపెడాశతో అన్నాడనంతు.   
మౌనంగా నేలచూపులు చూస్తున్న ప్రకాశాన్ని చూసి "అవును కదా! ఆవిషయాలు నీకెలా తెలుస్తాయి? మన చేతిలో ఏముంది. పెద్దవాళ్ళ నిర్ణయం. మనమేం చేయగలం" అన్నాడు అనంతాచార్యులు పరిస్థితనవగతం చేసుకుని నిట్టూరుస్తూ. 
"నిజంగా ఆవిషయాలు నాకు తెలియవనంతూ! నాన్నగారినడిగాను, నీ చదువుగురించి ఫీజులగురించి..." మొహమాటంగా అన్నాడు ప్రకాశం. 
"ఆయనేమన్నారు ?"
"నీ వెంతవరకు చదివితే అంతవరకూ తనే చదివిస్తానన్నారు. వెళ్ళేలోపు కొంత డబ్బు మీ నాన్నగారికిచ్చి నీ చదువు విషయం మాట్లాడతానన్నారు" అన్నాడు ప్రకాశం. 
అనంతు ముఖం వికసించింది.        
ఆ వారం రోజులు సినిమాలు, షికార్లు ఒకర్నొకరు వదలకుండా తిరిగారిద్దరు స్నేహితులు.
                                                                * * * * *
ప్రకాశం వెళ్లే రోజు రానేవచ్చింది. తిరువనంతాచార్యుల చదువుకయ్యే మొత్తం ఖర్చుతనే భరిస్తానని భరోసాఇచ్చి, చదువు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపవద్దని చెప్పి కొంత డబ్బు ఇచ్చివెళ్లారు ప్రకాశం నాన్నగారు. చిన్ననాటి నుంచి కలిసి చదుకున్నప్రాణస్నేహితులు అలా విడిపోయి 
'చికాగో' వెళ్ళిన ప్రకాశం ఇప్పడిలా ప్రత్యక్షమయ్యాడు దేవాలయంలో.   
                                                               * * * * *
ప్రకాశం నిద్రలేచాడో లేదో చూద్దామని అక్కడికొచ్చిన పారిజాతం 
"లేచారా బాబూ! గుడి వెనకాల చేద భావి ఉంది. బ్రష్ చేసుకుని వస్తే కాఫీ ఇస్తాను" అని చెప్పివెళ్ళింది పారిజాతం.  
"అలాగేనమ్మా!" అంటూ లేచి పక్కబట్టలు మడత బెట్టి బ్యాగ్ తో కిందకు వెళ్లి బ్రష్ చేసుకుని, మొండిగోడల బాత్రూమ్ లో స్నానం చేసి పైకి వచ్చేసరికి  గుళ్లో పూజ ముగించుకుని వచ్చాడు తిరువనంతాచార్యులు.
తేరిపార చూశాడు ప్రకాశం స్నేహితుని వంక.  
రాని వయస్సు ముఖంలో కనబడుతున్నా తరగని ముఖ వర్చస్సు, చెరగని చిరునవ్వు, ఉంగరాలు తిరిగి భుజాలమీదకు జారిన వత్తైన నల్లటి జులపాల జుట్టు, నిగ నిగలాడే నల్లటి విగ్రహం, దిద్దిన  తిరునామాలు! 
అప్రయత్నంగా లేచి నిలబడి తలవంచి రెండుచేతులు జోడించి నమస్కారం చేశాడు ప్రకాశం. 
ప్రతి నమస్కారం చేసి రెండుచేతులు పైకెత్తి "ఆయుష్మాన్ భవ'' అని అలవాటుగా  దీవించి, ప్రకాశం చేతిని పట్టుకుని పరీక్షించి "నాడి నిక్షేపంలా వుంది. ఇక చెప్పరా... ప్రకాశం!" అన్నాడు తిరువనంతాచార్యులు . 
ఇంతలో పారిజాతం కాఫీ తేవడంతో ఇద్దరు కాఫీ ముగించుకుని హాలులో కూర్చున్నారు. 
"నోరు జారాను. ఏమీ అనుకోవద్దు ? ఏమిటీ రాక ? ఎక్కడనుంచి ? ఎక్కడ దిగావు ? అమెరికానుంచెప్పుడొచ్చావు?" చొరవగాఅడిగాడు తిరువనంతాచార్యులు.   
"ఏం ఫరవాలేదు. నువ్వెలా పిలిచినా నాకిబ్బంది లేదు. అలాగే పిలువు ! మనసుకు హాయిగా ఉంది. ఇండియా వచ్చి రెండు వారాలైంది. కాశీనుంచి కన్యాకుమారిదాకా తిరిగి చివరిగా తిరుపతి నుంచి ఇక్కడికి వచ్ఛాను. నా సంగతలా ఉంచు. నేను వెళ్లిన దగ్గరినుంచి నీచదువు, పెళ్లి, పిల్లలు ...అన్ని విషయాలు చెప్పు" అన్నాడు ప్రకాశం.
"ఒక్కడివే వచ్చావా? భార్యా పిల్లలెవరూ రాలేదా? ఎలావున్నారు వారంతా ? నువ్వేమీ బాధల్లో లేవు కదా ? " ప్రశ్నార్థకంగా చూశాడు తిరువనంతాచార్యులు. 
"ఒక్కడినే వచ్చాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. భార్య తెలుగమ్మాయే. అందరూ బావున్నారు. బాగా సంపాదించాను. ఎలాటి బాధలూ లేవు. ఒక ముఖ్యమైన పని మీద వచ్చానిక్కడికి. నీ కథంతా విన్నాక నా విషయాలన్నీ చెబుతాను. ముందుగా నీ వంతు!" అన్నాడు ప్రకాశం.
"ఇన్ని సంవత్సరాలు మాతృదేశానికి, మాతృభాషకు దూరంగా అమెరికాలో ఉన్నా నీ తెలుగుభాషా ఉఛ్ఛారణలో ఏమాత్రం తేడా రాలేదే!"
నవ్వి ఊరుకున్నాడు ప్రకాశం.    
 "నా చదువుకి మీనాన్నగారిచ్చిన డబ్బు ఇంటి అత్యవసరాలకి ఖర్చు చేశారు. బి.ఇ లో సీట్ వచ్చింది. చేర్పించలేదు. నా మాట వినేవారు లేకపోయారు. చదువాగిపోయింది. 
పూజాదికాలు మొదలెట్టాల్సివచ్చింది. మామయ్య కూతురు పారిజాతంతో పెళ్లయింది. 
ఇద్దరు మగపిల్లలు. ఇంటర్ తోనే చదువాపేశారు. ఈవృత్తి వద్దు ... చదువుకొమ్మని చెప్పినా ఇద్దరూ పెడచెవిన బెట్టారు. చదువబ్బలేదు. వృత్తి విద్యకే తల ఒగ్గారు. ఇద్దరూ పూజారులే. పట్నంలోవారి బ్రతుకులు వారీడుస్తున్నారు. ఇక నా సంగతి కొస్తే ... అదిగో! ఆయన, మేము ఒకలాగే ఉన్నాము'' అన్నాడు తిరువనంతాచార్యులు గుడివైపు చూపిస్తూ. 
అతని కళ్ళలో, మాటల్లో చెప్పలేని, వ్యక్తీకరించని లోతైన వైరాగ్య భావన, బాధ ప్రస్ఫుటంగా  కన్పించింది.  
"సంపాదన గురించేకదా నువ్వలా అన్నది ... ఎందుకలా అన్నావు? నాకర్ధంకాలేదు. వివరంగా చెప్పు!"
"కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదు. వస్తున్నది ... భగవంతుడిస్తున్నదంతే నని నమ్మకం.     
అది తప్పో, ఒప్పో తర్కించే తత్వంకాదు నాది ! ఈ మాట నా నోట మొదటిసారిగా బయటకన్నాను. బ్రతకీడ్చడానికి సరిపుచ్చుకునే సంపాదన. 
ఇంగ్లీషులో అంటారుకదా 'స్ట్రగుల్ ఫర్ సర్వైవల్'... అదే మా పరిస్థితి!' 
ఆయుర్వేద వైద్యం చేస్తాను. ఆ వైద్యాన్ని, నన్ను నమ్మేవారు ఒకరో, ఇద్దరో రోగులు. వారేమైనా ఇస్తే పుచ్చుకుంటాను.    
దేవుడి మాన్యం రెండెకరాల పొలం కౌలు వస్తే వచ్చినట్లు. చేతికొచ్చిందాకా గండమే. తుఫాన్లు మింగుతాయో తెలియదు. కౌలుదారు దయ. మా ప్రాప్తం! ఎంతిస్తాడో, ఎగ్గొడతాడో తెలియదు.  
అది తప్ప వేరే చెప్పుకోతగ్గ ఆదాయం లేదు.  
పారిజాతం ముప్పూటలా కష్టపడుతుంది. ఎంబ్రాయిడరీ, టైలరింగ్ చేస్తుంది. నర్సింగ్ చేస్తుంది. పిండి వంటలు చేస్తుంది. నిజం చెప్పాలంటే తన సంపాదనే మా సంసారానికి అండ, అక్కర.  ఇన్నేళ్ళలో తనకి ఖరీదైన బట్ట, నగ ఒక్కటీ కొనిబెట్టలేకపోయాను. 
ఈ ఊళ్ళోనే కాదు. ఎక్కడో ఒకటి, అరా తప్ప అంతటా దేవాలయాల పరిస్థితి,  
పూజారుల పరిస్థితిదే !" అన్నాడు తిరువనంతాచార్యులు.
"అంటే ఆర్ధికంగా పుష్టి లేదనే కదా నీ వనేది"
"అవును! తరాలు మారాయి. నమ్మకాలు సడలాయి. విశ్వాసాలు మారాయి. మారుతున్నాయి.
ఇదివరలో రైతులు కూరగాయలతో సహా ఇంటికి సంబారాలు పంపేవారు. అన్నీ ఆగిపోయాయి. 
దీప, ధూప నైవేద్యాలకే నెలకు రెండు వందలన్నారు. ఇప్పటికి ఏడేళ్లుగా అదీ రాలేదు. జీత భత్యాలంటూ లేవు. హారతి పళ్లెంలో కానుకలు అరుదే. తరచూ దేవాలయానికి వచ్చే మనిషి ఇంటనే దణ్ణం పెట్టుకుంటున్నాడు. గుడికి రావడం తగ్గింది. పుట్టినరోజునో లేక పండగకో, పబ్బానికో మాత్రమే గుడికి రావడం. అదీ సమయం దొరుకుతే ! గుళ్లోనుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు ఊళ్ళోకెళ్ళి పదేళ్ల పైగా అయింది. ఇకముందు వెళతాయన్న నమ్మకం లేదు. దానికి తోడు ఏదో అంటు రోగంతో మేటి ప్రపంచమే ముడుచుకు కూర్చుంది. ఇక మా బోటి వారెంత ?" 
"అంటే జనాలలో మార్పు వచ్చిందనా నువ్వనేది ?"
"పూజారిగా నేను ఆ విశ్లేషణ చేయతగనేమో!"
"అనంతూ ! నాకో ఇల్లు కావాలి" హఠాత్తుగా టాపిక్ మారుస్తూ అన్నాడు ప్రకాశం. 
"ఇల్లేమిటి ? అద్దెకా ...  కొనడానికా? అమెరికా తిరిగి వెళ్లడంలేదా ?"ఆశ్చర్యంగా అడిగాడు తిరువనంతాచార్యులు 
"ఇప్పుడే వెళ్ళను. కొన్నాళ్లపాటిక్కడే, ఈ ఊళ్ళోనే ఉందామనుకుంటున్నాను"
"మీ నాన్నపాలికి వచ్చిన పాత పెంకుటిల్లు ఎన్నోఏళ్లుగా తాళం వేసి ఉంది. నువ్వుండడానికి బాగుండదేమో! ఆస్తి పంపకాలలో మీ తాతగారు మీ నాన్నపేరిట విల్లులో వ్రాసిన ఇల్లది. 
ఆలనా పాలనా లేక పాడుబడింది. బాగు చేయించుకుని ఆ ఇంటే ఉండొచ్చేమో చూడు!"
"అలాగా! నాన్నగారనలేదు. నాకు తెలియదు. తాతగారు పోయారుగా? మా పెదనాన్న, చిన్నాన్న వాళ్ళెవరూ ఆ ఇంటిని అట్టేపెట్టుకోలేదా ? ఇల్లు మాపాలికి వచ్చినా సరే... ఖాళీగా ఉంటేనే చూద్దాం. ఎవ్వరినీ నొప్పించవద్దు"
"మీ వారెవరూ ఆ ఇంట నివసించడం లేదు. అందరు భవంతులు కట్టుకున్నారు. అతిధుల కోసం ప్రత్యేకించిన ఇల్లట" 
"అలా బయటకెళదాం !" అన్నాడు ప్రకాశం ఇంటి వివరం వినడం ఇష్టంలేనట్లుగా 
"టిఫిను చేసి వెళదాం" అంటూ లోనికి వెళ్ళాడు తిరువనంతాచార్యులు. 
                                                                   * * * * *  
"ఇదే ఆ ఇల్లు ! ఇంటి తాళంచెవి ఉందేమో మీ అన్నగారింట్లో కనుక్కుందాం! అలాగే వారింటికి వెళ్లినట్లుంటుంది. నువ్వు వారిని పలకరించి నట్లుంటుంది" అంటూ  దేవాలయానికి దగ్గరలోనే ఉన్న ఇంటి గేటు తీసి పెద్ద భవంతిలోకి నడిచాడు తిరువనంతాచార్యులు. అతన్ననుసరించాడు ప్రకాశం. 
పలకరింపులు, కాఫీలయ్యాక "ఏరా! బాబాయి, పిన్ని అంతా బావున్నారా ? తోట,ఇల్లమ్మడానికి వచ్చావా ?" అన్నాడు ప్రకాశాన్ని ఉద్దేశించి పెదనాన్న కొడుకు.
"ఇంటి తాళం చెవి ఉందా?" అన్నాడు ప్రకాశం అతని ప్రశ్నకు సమాధాన చెప్పకుండా.
"అదిగో! ఆ గుంజ మేకుకి తగిలించి వుంది. ఇన్నేళ్ళలో ఎవరూ దాన్ని ముట్టుకోలేదు. నువ్వే అందుకో !" అన్నాడు తేలికగా.  
"ఇంటి పేపర్లు... ?" అన్నాడు ప్రకాశం 
"ఉంటావా రెండ్రోజులు ... ఎప్పుడొచ్చావు. ఎక్కడ దిగావు ? రాత్రి  భోజనానికి రా! ఏదైనా ఎవ్వారం ఉంటే మాట్లాడుకోవచ్చు.పేపర్లు తీసిఉంచుతాను. ఇంటితో బాటు మీనాన్న పాలికి రెండెకరాల మావిడి తోట కూడా వచ్చింది. దాని తాలూకూ డబ్బు, లెక్క నాదగ్గరే ఉన్నాయి. పట్టుకెళ్ళు" అన్నాడు అన్న.  
"వస్తాను" తాళంచెవి తీసుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న లోగిలికి  తుప్పుపట్టిన పాత గేటు తీసుకుని లోనికి నడిచారు వారిద్దరు.  
"వస్తానన్నావు ... ?" అన్నాడు తిరువనంతాచార్యులు ప్రకాశం మొహంలోకి సాలోచనగాచూస్తూ. 
"భోజనానికి"... 
ఇంటి తాళం తీసి "లోపల, వెనకాల పెరడు చూస్తూవుండు. పాతిల్లు, జాగ్రత్త!
చూసి నడువు పురుగు, పుట్ర ఉండగలవు. కూలి మనుషుల్ని, సుతారిని పిలుచుకొస్తాను. 
ఇల్లు శుభ్రం చేయించి నివాసయోగ్యంగా మరమ్మత్తులు చేయిద్దాము" అంటూ బజారు కెళ్ళాడు తిరువనంతాచార్యులు.     
                                                                     * * * * * 
ఇంటి మరమ్మత్తులు అదే రోజు వేగంగా మొదలయ్యాయి. 
ముందుగా ఇంటావరణలో ఉన్నపెద్ద వేపచెట్టు చుట్టూ నెర్రెలు బాసిన గుండ్రటి అరుగు, ఆపైన గోడల మరమ్మత్తులయ్యాయి. పట్నం నుంచి ఆటోల్లో పనివారు వచ్చి, వెళుతున్నారు. ఇంటికప్పు పూర్తిగా తిరగవేశారు. పడకగదులకు ఎ.సి లు బిగించారు. వంటిల్లు నిత్య నూతనంగా తయారయింది. బావికి మోటార్, కుళాయిలు ఏర్పాటయ్యాయి. చూస్తుండగానే  రెండు వారాల్లో ఇల్లంతా హంగులతో కళకళ్ళాడింది. ఇంటి బయట సున్నం, లోన రంగులు అయ్యాయి. 
'డబ్బుంటే కొండ మీది కోతైనా దిగి వస్తుందనే నానుడి కర్ధం ఇదేనేమో ! పాడుపడిందనుకున్న ఇల్లు వసతులతో కళకళలాడుతోంది' అనుకున్నాడు తిరువనంతాచార్యులు.
"ఇంటి మరమ్మత్తులన్నీ పూర్తయ్యాయి. ఇల్లిప్పుడు నివాసయోగ్యమే. నువ్వు, చెల్లాయి ఈ ఇంట్లో గృహప్రవేశంచేయాలి అనంతూ !" అన్నాడు ప్రకాశం. 
"మేమా? ఎందుకు? ఇంటిపై బోలెడంత ఖర్చుచేశావు. అంత ఆడంబరం భరించే శక్తి నాకు లేదు" నిరాసక్తిగా, ఒకింత ఆశ్చర్యంగా అన్నాడు తిరువనంతాచార్యులు. 
"నిన్నీ ఇంట్లోకి రమ్మనడానికి కారణం ఒకటి కాదు. మూడున్నాయి. తరువాత చెబుతాను"  
"నాకు గుడి, మడి, ఆచారం ఉన్నాయి"
"ఎప్పటిలానే పాటించు ! ఎవరు కాదన్నారు ?"
"గుడి నెవరు చూస్తారు ?"
"పూజారులంతా ఆలయావరణలలో నివసిస్తున్నారా? అందరికీ వసతుల్లేవే. అలాగే నువ్వు. 
గుడి కాపలా నీ బాధ్యతెలా అవుతుంది ?" ఆలోచనలో పడ్డాడు తిరువనంతాచార్యులు.     
"నాకయోమయంగా ఉంది. ఇప్పటికిప్పుడే  నిర్ణయం తీసుకోలేను. ఊహకందని మార్పు! 
పూర్వా పరాలు ఆలోచించుకునే అవకాశమివ్వు. నీకు ముందే చెప్పాను. కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదని ... "
"నీకు నువ్వుగా పరుగెత్తడం లేదే ! కాలమే మార్పులను తీసుకొస్తుంది. మన ప్రమేయం లేకుండానే  కొన్నిఅమరుతుంటాయి. కొన్ని అంది పుచ్చుకోవాలి. 
కొందరికి కర్మఫలం సఫలం, మరికొందరికి విఫలం! 
అదేమిటో, ఎందుకో ... అర్ధమయిన్నాడు మనిషికి పగ్గాలుండవుకదా! నీ శుశ్రూషకు ఫలంగా నీ రాజగోపాలస్వామే ప్రసాదించాడనుకోవచ్చుగదా! ఇలాటి మాటలు భక్తులెందరితోనో 
అనుంటావు. నీ సిద్ధాంతమే నీకు వర్తించదా!?"
"ప్రకాశం!  కొద్ధి సమయమివ్వు. మాటలతో మభ్యపెట్టకు. మానసిక దౌర్బల్యానికి గురిచేయకు!" అని చప్పున గుడి వైపు వడి వడిగా అడుగులేశాడు తిరువనంతాచార్యులు.     
                                                                      * * * * *
రాత్రి ఎనిమిదిన్నర గంటలు. గుడికి వచ్చాడు ప్రకాశం. ఇద్దరు గుడి చావడిలో కూర్చున్నారు. 
"ప్రకాశం ! ఏమిటిదంతా... ? అసలు నువ్వెందు కొచ్చావు ? కారణం చెబుతావా ? మన స్నేహితం మీద ఆన.  దేవాలయంలో కూర్చున్నావు. నిజం చెప్పు" 
"నువ్వా  ఇంట్లోకి మారతావా లేదా ? ముందుగా చెప్పు!" 
"ఇదేదో నాకు గోపాలస్వామి పెట్టిన పరీక్షలా ఉంది. చూశావుగా... ఆలయ పరిస్థితి. శిధిలావస్థలో ఉంది. ఉద్ధరణకు నడుంకట్టే మహానుభావుడెవరో రావాలి ! ఆనాటి దాకా  దేవాలయాన్ని వదిలి నా స్వసుఖం కోసం నీయింటికి రావడం అసమంజసం, అనైతికం. భక్తుల విశ్వాశాన్ని, నమ్మకాల్ని వమ్ము చేయను. దేవునికే గాదు, నామనః స్సాక్షికీ  సమాధానం చెప్పుకోలేను. నువ్వు గొప్ప స్నేహితుడివి. దైవ కార్య, కర్మల కంకితమైన నన్నాయనముందు దోషిగా నిలబెట్టకు! నిన్నర్ధిస్తున్నాను. 
కుచేలుని ఉద్ధరించడానికి వచ్చిన శ్రీ కృష్ణునిలా వచ్చావని అర్ధమైంది.నేనేమీ ఆచించలేదు. నేనీ మార్పునాకాంక్షించలేదు. అంగీకరించలేను. నన్ను క్షమించు" అతని గొంతు గాద్గగమైంది.
                                                                   * * * * *
ప్రకాశం దగ్గరిగా జరిగి స్నేహితుడి భుజం చుట్టూ చేయివేసి ఆప్యాయంగా వీపురాస్తూ 
"అనంతూ ! ధర్మాధర్మచింతన గురించి నీకు చెప్పేంత వాడి ఉన్నవాడిని గాను. అయినా అవసరం, సమయం, సందర్భం వచ్చింది కాబట్టి గీతలో శ్లోకం ఒకటి గుర్తుచేస్తాను.
 
సహజం  కర్మ  కౌంతేయ  సదోషమపి  న  త్యజేత్
సర్వారంభా  హి  దోషేణ  ధూమేనాగ్నిరివావృతా ||

దోషముతో కూడినదైనా సహజ కర్మను త్యజింపరాదు. నిప్పుని పొగ ఆవరించినట్లు మన  కర్మలలోను ఏదో ఒక దోషము ఉంటుందనే కదా శ్రీకృష్ణభగవానుడు చెప్పింది. 
మనం చేస్తున్నది అసహజ కర్మ కాదని నా ఉద్దేశ్యం! 
తిరువనంతాచార్యులు చకితుడై చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. 
"ఇప్పుడు సమయం వచ్చిందనంతూ! నువ్వాఇంట్లోకి ఎందుకు మారాలో మూడు కారణాలున్నాయన్నాను కదా... చెబుతాను. విను!
మొదటిది. మనం బాల్యంలో తిరుగాడిన ఈ దేవాలయం, మిద్దె పైన అద్దాలగది నన్నుగత కొన్నేళ్లుగా కలలో వెంటాడుతున్నాయి. గర్భగుడిపై గుమ్మటం నుంచి సున్నం, ఇటుక పెల్లలు రాలుతూ కనిపించేవి. నువ్వు వాటిని శుభ్రం చేస్తూ కన్పించేవాడివి. 
నేనిక్కడికొచ్చిన రోజు అద్దాలగదిలో నేను పడుకున్న చోట తెల్లారేసరికి సున్నం పెచ్చులు, ఇటుక పెల్లలు పైకప్పునుంచి రాలి పడ్డాయి. అదే దృశ్యం నాకు కలలో పదే పదే కన్పించేది. 
ఈ దేవాలయాన్ని, నువ్వుండే మిద్దెను పునర్మించడానికే వచ్చాను. నా కల అంతరార్ధ దైవేచ్ఛను నెరవేరుస్తాను. మిద్దె పునర్మితమయ్యాక నువ్వు, గ్రామ పెద్దలు కలిసి దాన్ని గ్రామ ప్రజల హితానికి, ప్రయోజనానికి ఉపయోగించండి. ఇది భగవత్పేరిత నిర్ణయం.  
రెండవది. ముఖ్యమైంది. నేను మరమ్మతులు చేయించిన ఇల్లు మాది కాదు. మీదే !
సరిగ్గా ఆరవై సంవత్సరాల క్రితం శార్వరి నామ సంవత్సర విజయదశమి రోజున ఆ ఇంటిని రాజగోపాలస్వామి దేవాలయ పూజారి పేరిట వ్రాసిన దస్తావేజు దఖలు పత్రం నా దగ్గర ఉంది. ఈ గుడి పూజారుల నివాసం కోసం ప్రత్యేకంగా మా తాతగారు నిర్మించిన ఇల్లది. 
ఇన్నేళ్లు ఈ విషయం ఎందుకు, ఎవరి స్వార్ధంతో మరుగున పడ్డదో, ఆ ఇల్లు మాకుటుంబ  స్వాధీనంలో ఎందుకు ఉందో కారణాలు నాకు తెలియవు. 
రాత్రి అన్న ఇచ్చిన ఆస్తుల వీలునామా పత్రంతో పాటు ఆ ఇంటి పాత దఖలు దస్తావేజు కూడా ఉంది. దీన్ని చూడు!  తెలిసీ స్వార్ధపూరితంగా ఇల్లు నాన్నపేరిట వీలునామా వ్రాశారు తాత! 
ఆ విషయమిప్పుడు,ఇక, అప్రస్తుతం ! 
ఈ క్షణంలో స్వామివారి సమక్షంలో మీకు చెందిన ఆ ఇంటిని నీకు దఖలు చేస్తున్నాను" అంటూ ఆ పాత పత్రాలు, స్నేహితుని పేరిట వ్రాసిన కొత్త పత్రాలు తిరువనంతాచార్యుల చేతిలో పెట్టాడు ప్రకాశం.  
ఇక మూడవది, చివరిది స్నేహధర్మం.  
నువ్వు అన్యధా భావించవద్దు! ఈ పాత పత్రాలు లేకున్నాఆ ఇల్లు, మామిడితోట నీ పరంచేసి వెళ్ళేవాడిని. అందుకే వచ్చాను. నాన్నగారితో మాట్లాడాను. సంతోషపడ్డారు. ఆయన సంతోషంగా తన అంగీకారాన్ని తెలియచేశారు.  
గీతానుసారం సహజ కర్మలను త్యజించరాదు కదా అనంతూ !" వినమ్రంగా, అనునయంగా సందర్భాన్ని అన్వయిస్తూ తలవంచి రెండుచేతులు జోడించి అన్నాడు ప్రకాశం .  
ఉద్వేగంతో లేచి నిల్చుని భగవత్ప్రసాదాన్ని స్వీకరించాడు తిరువనంతాచార్యులు అశ్రునయనాలతో.  

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254