లేబుళ్లు

27, జులై 2025, ఆదివారం

                                                       చిలకలగూడ రైల్వే బ్రిడ్జ్  

                                                    -------------------------------------  
                     ( ఈ క్రైమ్ కథ  'మార్చి, ఏప్రిల్' 2013  రెండు  నెలలు  'ఆంధ్రభూమి'    
మాసపత్రిక లో ముద్రితమైనది) 
                                              

ఉదయం అయిదు గంటలయింది. 
అలారం నాలుగున్నర గంటలకి పెట్టుకుని పడుకున్నాను. మెలుకువ రాలేదు. గోదావరి ట్రెయిన్ కి మా ఫ్రెండ్ 'శ్రీహర్ష' వైజాగ్ నుంచి వస్తున్నానని ఫోను చేశాడు. 
'గోదావరి ట్రెయిన్ సాధారణంగా అయిదున్నర, ఆరుగంటలలోపే సికిందరాబాద్ వచ్చేస్తుంది' అనుకుంటూ త్వర త్వరగా బ్రష్ చేసుకుని బైక్ స్టార్ట్ చేసి బయలు దేరాను. బయటకు వచ్చిన తరువాత గాని తెలవలేదు. బయట మసక మసకగా వచ్చీ రాని వెలుతురుతో బాగా చల్లగా వుంది. 'స్వెట్టర్ వేసుకుని రావాల్సింది. పదిహేను నిముషాల్లోపే స్టేషను చేరుకుంటాలే పర్లేదు' అనుకుంటూ బైక్ అక్సిలరేట్ చేశాను. 
మెట్టుగూడ చౌరాస్త, రైల్ బ్రిడ్జిదాటి చిలకలగూడ వైపు తిరిగాను. అక్కడే ఇంకొక రైల్ బ్రిడ్జి వుంది. అది సింగిల్ లేన్. అకస్మాత్తుగా బైక్ స్కిడ్ అవుతూ సర్రున జారి పడింది. బాలన్సు చేసుకుంటూ ఎడమ కాలు రోడ్డు మీద బలంగా మోపి 'రైల్ బ్రిడ్జి రాంప్' మీదకు గెంతాను. రాంప్ మీద గడ్డి ఏపుగా పెరిగి గుబురుగా వుంది. గెంతుతూనే వీధి వేపర్ లాంప్ వెలుగులో గడ్డిలో పడి ఉన్న చిన్న లెదర్    హాండ్  బ్యాగ్  గమనించాను. 
'దుమ్ముపట్టిన గడ్డి గుబురుగా ఉండడంతో బ్యాగును  ఎవరు చూసినట్లు లేదు. అందుకే అలా పడివుంది' అనుకుంటూ దాన్ని అందుకోవడానికి ఒంగుతునే బాంబేమైనా వుందేమోనాని అనుమానం వచ్చింది. బ్యాగు గడ్డిలోనుంచి తీస్తూ అటుఇటు గమనించాను. రోడ్డు నిర్మానుష్యంగా వుంది. బ్యాగు జిప్  సున్నితంగా తీసి చూశాను. కేష్ చాలావుంది. నోట్లకట్టలు తడిమి చూశాను. దాదాపు అన్నీ వేయి రూపాయల కట్టలు. డబ్బు లక్షలలో ఉన్నట్లుంది. ఒక   బ్రాండ్ న్యూమొబైల్ ఫోను కూడా ఉంది.  భయం అనిపించింది. టైం చూసుకున్నాను.
'ట్రైన్  వచ్చేసుంటుంది. బయటకు రాగానే కనిపించకపోతే హర్ష గాడు చంపేస్తాడు' అనుకుంటూ బ్రిడ్జి రాంప్ మీద నుంచి కిందకు దిగాను. కాలు సర్రున జారింది. రాంప్ గట్టు పట్టుకుని మళ్ళీ బేలన్సు చేసుకున్నాను. నా పాదం పూర్తిగా నేల మీద  గడ్డ కట్టిన రక్తం మడుగులో పడింది. 
నీచు వాసన. జీవితంలో ఇదే మొదటిసారి అంత రక్తం చూడడం. మనసులో తీవ్ర ఆందోళన మొదలయింది. ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు.  
కింద పడ్డ బైక్  ని పైకె త్తి,  దొరికిన జిప్ బ్యాగుని సైడ్ ' బాక్సు లో పెట్టి మళ్ళీ  రోడ్డు మీద రక్తం వంక నిశితంగా చూశాను. రక్తం పల్లానికి ధార కట్టింది.    ఒళ్ళు గగుర్పొడిచింది. 
బయలుదేరి  నిముషంలో 'బోయిగుడ' వైపునున్న సికింద్రాబాద్ స్టేషనుకి చేరి మేము కలుద్దామనుకున్నచోట  బైక్ పార్క్ చేసి నిలబడ్డాను. మనసింకా కుదుట పడలేదు. 
ఇంకా ట్రైన్ వచ్చినట్లు లేదు. ముందు ఓ కప్పు  'టీ' పడితే గాని బుర్ర పనిచేయదు' అనుకుంటూ రెండడుగులు వేశాను. బ్యాగ్ గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగానో  లేదో దూరం నుంచి పోలీసు కానిస్టేబుల్ ''వో భాయి సాబ్ వాహా సే గాడి నికాల్డో'"' అంటూ చేతిలో లాఠి ఊపుకుంటూ బిగ్గరగా పిలుస్తున్నాడు.. 
'' గాడీ అభీ నికాల్ రుం'' అని అక్కడ్నుంచి   బైక్  తీసి ముందుకు వచ్చి ఒక పక్కగా బైక్ స్టాండ్ వేసి ఆనుకుని నిలబడ్డాను. 
ఇంతలో ఏదో ట్రైన్ వచ్చినట్లుంది. మెల్లగా జనం బయటకు వస్తున్నారు. ఆటోలు, కార్ల హడావుడి కనబడుతోంది. 
ఇంతలో "గోదావరి కొద్దీ నిముషాలలో ప్లాట్  ఫామ్  నంబరు రెండు కు వచ్చును" అని మూడు భాషల్లో  అనౌన్సుమెంట్ వినిపించింది. కొద్దిగా టెన్షన్ తగ్గింది. టీ కొట్టు దూరంగా కన్పించింది. బైక్ తీసుకుని  బడ్డి కొట్టు దగ్గరికి వచ్చి'టీ' తీసుకుని  ఆస్వాదించడం మొదలెట్టాను. 
టీ  కొట్టు దగ్గర జనాల్ని చూస్తూ  అనాలోచితంగానే నా మనస్సు గతంలోకి వెళ్ళింది.
                                                                * * * * *. 
నేను, శ్రీహర్ష క్రితం ఏడు సంవత్సరాలుగా మంచి స్నేహితులం. ఇద్దరం చెన్నై దగ్గర 'గుమ్మడిపూండి' లో ఇంజనీరింగ్ ,బి.ఇ  చేశాము. ఇద్దరం ఒకె కంపనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గా చేరాము. వాడేమో వైజాగ్ బ్రాంచిలో, నేను హైదరాబాద్ లో పని చేస్తున్నాము. వాడికి  మొదట్నుంచి హైదరాబాద్ అంటేనే భయం. చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడ కర్ఫ్యూలో ఇరుక్కున్నాడట. అదీ సంగతి!
'ఇప్పుడు వాడికి ఈ డబ్బు దొరికిన విషయం చెప్పాలా లేదా? అసలే చాదస్తుడు.భయస్తుడు. 
చెపుతే ఎలా రియాక్ట్ అవుతాడో.నాకే అయోమయంగా వుంది. వాడిక్కడ నా రూంలోనే పదిహేను రోజులు ఉంటాడు. ట్రైనింగ్ కి వచ్చాడు. ఏం చేయాలి?' అని ఆలోచిస్తూ టీ గ్లాస్ అక్కడవుంచి బైక్ వెనక్కితిప్పుతూ వెనక్కు చూశాను. 
శ్రీహర్ష దూరంగా ఇటు వస్తూచేయి ఊపుతూ కన్పించాడు. సూట్ కేసు లాక్కుని వస్తున్నాడు. నేను చేయి ఊపాను.
'అమ్మయ్య!.ముందిక్కడనుంచి బయటకు వెళ్ళాక ఇద్దరం కలిసి ఆలోచిస్తే ఏదైనా మార్గం తోచక పోదు' అని వాడికి విషయం చెప్పాలనే నిర్ణయించుకున్నాను. 
మరునిముషంలోనే నెత్తిమీద నుంచి టన్నుబరువు తీసేసి నట్లయింది.
ఇంతలో ''ఏరా చాలా సేపయిందా వెయిట్ చేయబట్టి' ట్రైన్ పావుగంట లేటు.
''పద వెళదాం'అన్నాడు శ్రీహర్ష నా సమాధానం కోసం వెయిట్ చేయకుండానే.. బండి వెనకాల ఎక్కుతూ "అదేంటిరాపేంటు కింద అంత  ఎరుపుగా బ్లడ్ లాగా వుంది.  లెఫ్ట్ చెప్పు నిండా బ్లడ్. ఏమయిందేమిటి ? బైక్ మీద నుంచి  పడ్డావా ? దెబ్బలు  లేమైనా తగిలాయా ?" అన్నాడు నన్ను నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూస్తూ. 
'గాడ్! ఇప్పటి వరకు ఈ మరకలు నేను చూడలేదు.రక్తపు మరకలు పేంటు మీద చెప్పులనిండా వున్నా నేను ఇప్పటిదాకా చూసుకోలేదు. నీచు వాసన వస్తోంది.ఇదన్నమాట.టెన్షన్  లో 
గమనించలేదు' అనుకున్నాను. .
''అవునురా!స్టేషను కి వస్తూంటే బండి స్కిడ్ అయి పడ్డాను. దెబ్బలేమీ తగల్లేదు.  కానీ నేను పడ్డ చోట ఏదో ఆక్సిడెంట్ అయినట్లుంది. రోడ్డుమీద చాలా రక్తం గడ్డకట్టి వుంది. ఆ రక్తం మీదనే బండి స్కిడ్ అయింది. ఇంటికివెళ్లి మాట్లాడ దాం. ముందు బైక్ ఎక్కి .సూట్ కేసు మధ్యలో పెట్టు.కొద్దిగా వెనక్కి జరిగి కూర్చో.జాగ్రత్త!" అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి పావుగంటలో ఇంటికి చేరాం. 
బైక్ పార్క్ చేసి  జిప్ బ్యాగు తీసుకుని లోపలకి తెచ్చి సూట్ కేసులో పెట్టి, బట్టలు మార్చుకుని చెప్పులు శుభ్రంగా కడిగేశాను. పేంటు, షర్టు రెండు తడిపి డిటర్జెంట్ లో వేసి నాన బెట్టాను. ఇంతలో హర్ష మంచి కాఫీ రెడీ చేశాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ త్రాగాం. 
"ఏమిటిరా! అంత పరధ్యాన్నంగావున్నావు. ఒంట్లో బాలేదా?" ఆదుర్దాగా అడిగాడు.
''అబ్బే..అదేం లేదు.  బానే వున్నాను'' అని సర్ది చెప్పాను.
ఇద్దరం స్నానం చేసి టిఫెన్ చేశాము.
నేనింకా  అయోమయంలోనే వున్నాను. ఏంచెయ్యాలో అర్ధం కాని పరిస్థితి.
'ఏమైనా సరే...వీడికి జరిగినదంతా చెప్పి, బ్యాగు తీసిఅంతా క్షుణ్ణంగా చూశాకనే ఈ విషయంలో ముందుకు ఎలా పోవాలన్నది నిర్ణయం తీసుకోవాలి. విషయం దాచకూడదు. ఇంక  టైం వేస్టు చెయ్యడం మంచిది కాదు. బ్యాగులో ఉన్న కేష్ తో ఎవరి జీవితాలు ముడివడి వున్నాయో,
ఏ క్రైం కేసు ముడిపడి ఉందో ? పోలీసు రిపోర్ట్ ఇవ్వదామా లేదా ఇద్దరం చర్చించి  నిర్ణయించు కున్నాక  కేష్  ఎవరిదో  వారికి  అందచేస్తే అంతమంచిది" అని నిర్ణయించుకోవడమే తరువాయి ''రేయ్ నీతో ఒక విషయం మాట్లాడాలిరా'' అన్నాను శ్రీహర్షతో.
''నాకు తెలుసు. ఏదో విషయం నీ మెదడు తొలిచేస్తోందని ! ఏమైనా ప్రేమ వ్యవహారమా ఏమిటి ?" కన్నుగీటి, నవ్వుతూ అడిగాడు శ్రీ హర్ష.
''లేదురా! జాగ్రత్తగా విను!" అని జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పి "ఇప్పుడు ఏం చేద్దాం ?" అని సీరియస్ గా సలహా అడిగాను.
శ్రీహర్ష మౌనంగా చెప్పిందంతా విని నోట మాటరాక చిత్తరువులా అయిపోయాడు. 
నాకు మాత్రం చాలా రిలీఫ్ వచ్చింది. గాలి తీసిన బెలూన్లా అయింది నా పొట్ట.
"అరేయ్..హర్షా!" వాడిని తడుతూ గట్టిగా అరిచాను.
శ్రీహర్ష ఉలిక్కిపడి '' నీ ఎంకమ్మ ! ఇదే కారణం. మీ హైదరాబాద్ రావాలంటేనే నాకు భయం  ఇక్కడికి వచ్చిన  ప్రతిసారి  ఏదో ఒకటి జరగాల్సిందే! ఇంతకీ ఆ బ్యాగు ఇలా తీసుకురా! అసలు బ్యాగులో ఏమున్నాయో నువ్వే పూర్తిగా చూడలేదు కదా! చూద్దాం...బ్యాగు ఎవరిదో ? ఏమైనా క్లూ' దొరుకుతుందేమో!" అంటూ లేచి తలుపు మూసి, కిటికీకున్న కర్టెన్ సర్ది వచ్చాడు. అంత టెన్షన్ లో కూడా వాడి జాగ్రత్తకు నవ్వు వచ్చింది. బెడ్ మీద ఇద్దరం కూర్చుని, బ్యాగ్ తెరిచి బోర్లించాను. సైడ్ పాకెట్స్ జాగ్రత్తగా చూశాను.
శ్రీహర్ష బ్యాగ్ లో నుంచి ముందుగా ఫోను తీసి చూస్తూ "రేయ్ రంగా! ఇది బ్రాండ్ న్యూ ఆపిల్ 'ఐ' ఫోనురా బాబూ. చాలా ఖరీదైంది"దాదాపు ఏభై వేల పైమాటే. ఇద్దరం కలిసి  కేష్ మొత్తం  లేక్కేశాం. తొమ్మిది లక్షల అరవై వేలు వుంది. వెయ్యిరూపాయల, అయిదువందలరూపాయల కట్టలు. వున్నాయి. బ్యాగులో ఇంకేమీ లేదు. 
''ఏమిట్రా బాబూ! ఈ మిస్టరీ చాలా సస్పెన్స్ గా వుంది.ఎలా ఛేదించడం ? పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దామా అంటే నువ్వనేది కొంతవరకు కరెక్టే!  అలాగని ఊరుకోవడానికి వీల్లేదు. ఇప్పటికే బ్యాగు దొరికి రెండు, మూడు గంటలవుతోంది. ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచిద్దాం.పేపర్, పెన్ తీసుకో'!' అన్నాడు శ్రీహర్ష అపరాధ పరిశోధకుడిలా!
''మొదటిది! కరెన్సీ కట్టల మీద ఉన్నబ్యాండ్ మీద బ్యాంకు 'స్టాంప్'చూసి ఈ డబ్బు ఎవరు డ్రా చేశారో కనుక్కోవడం" అని కరెన్సీ కట్టలుమొత్తం మళ్ళీ వివరంగా చూశాం.  మొత్తం కరెన్సీలో నాలుగు  కట్టల బాండ్  'తార్నాక' బ్రాంచి స్టేటు బ్యాంకు. ఈ ఆప్షను అంతగా పనిచేస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ఈ మనీ బ్యాంకు నుంచి డ్రా అయ్యాక ఎన్ని చేతులు మారిందో తెలియదు. దీన్ని లాస్ట్ ఆప్షన్ గా రిజర్వ్ చేద్దాం. 
రెండోది! ప్రమాదం జరిగిన స్థలం ఏ  పోలీసు స్టేషను  పరిధిలో ఉందో ఎంక్వయిరీ చేసి, వివరాలు తెలుసుకుని  ప్రొసీడ్ కావడం!
మూడవది! ఆ స్థలంలో జరిగిన ఆక్సిడెంట్ గురించి  న్యూస్ పేపర్లలో, లోకల్ టి. వి న్యూస్ ఛానల్స్ లో చూడడం, క్లూస్ ఫాలో కావడం!
ఈరోజే 'క్లూ' దొరికితే ఓకే.  లేకుంటే రేపు అన్నీ న్యూస్ పేపర్లు వెదకడం.ఇదీ  కార్యక్రమం. ఒకవేళ మనకు ఇవేవీ వర్క్ అవుట్ కాకపోయినా ఈ బ్యాగు ఎవరిదో కనుక్కోవడానికి ఇంకొక మార్గం వుంది. చూద్దాం...ప్రస్తుతానికి ఈ మూడు ఆప్షన్స్ ఫాలో అవుదాం. ముందు ఇవన్నీలోపల పెట్టి లోకల్ న్యూస్ టీవీ ఛానల్ పెట్టు'' అని చెప్పి బెడ్ మీద నుంచి లేచి సోఫాలో సెటిల్ అయ్యి టి.వి.న్యూస్ చూడ్డం మొదలెట్టాడు శ్రీహర్ష. 
అన్ని తెలుగు న్యూస్ చానల్స్ లో లోకల్ న్యూస్ ఆగకుండా రెండుగంటలపాటు చూసినా 'బ్యాగు' దొరికిన స్థలంలో ఏమీ ఆక్సిడెంట్ కాని 'క్రైం' రిపోర్ట్ అయినట్లుగాని 'న్యూస్' లేదు.
''రంగా! టివి న్యూస్ లో ఏమీ రిపోర్ట్ కాలేదు. నీ లెక్క ప్రకారం రాత్రి 12 గంటలు, ఉదయం అయిదు గంటల మధ్య ఆక్సిడెంటో, హత్యనో జరిగిందనుకుంటే ఈ పాటికి  టి వి న్యూస్ చానల్స్, ఫ్లాష్ న్యూస్" అంటూ మొత్తుకుంటూ ఉండేవి. అలాంటి న్యూస్ లేదు. అంటే హత్య కాని ఆక్సిడెంట్ కాని కాలేదన్నమాట. పైగా నువ్వు కింద పడ్డ టైం కి రక్తం గడ్డ కట్టింది. అంటే అక్కడ ఆక్సిడెంతో  హత్య నో జరిగి కనీసం మూడు, నాలుగు గంటల పైగా అయిఉండాలి. అయితే ఆ  రక్తం అసలు మనుషులదేనా లేక ఏదైనా జంతువుదా అన్నడౌట్ వస్తోంది'' అన్నాడు శ్రీహర్ష తను చదివిన డిటెక్టివ్ బుక్స్ లో సంఘటనలు, మిస్టరీ కేసులలో తను సముపార్జించిన విజ్ఞాన సర్వస్వం గుర్తుకు తెచ్చుకుంటూ. 
"ఇంతకీ నువ్వేమంటావు! మాట్లాడకుండా సైలెంట్ అయిపోయావేంటిరా!" రంగ ముఖంలోకి నిశితంగా చూస్తూ అన్నాడు శ్రీహర్ష.
''అవును. అక్కడ ఏమైనా ఆక్సిడెంట్ జరిగుంటే ఈ పాటికి టి.వి న్యూస్ లో వచ్చివుండేదే. రాలేదు. కాబట్టి నీ అస్సెస్మెంట్  కరెక్ట్  కావచ్చు!
కాని ఏ అర్ధరాత్రో హత్యజరిగి శవాన్ని ఎక్కడైనా పడేసి ఉంటే లేక ఆక్సిడెంట్ చేసి ఏదైనా హాస్పిటల్  పడేసి వుండ వచ్చుకదా! ఆ టైంలో బ్యాగు అక్కడ పడి ఉండవచ్చుకదా!" అన్నాడు రంగా సందర్భోచితంగా ఆలోచిస్తూ. 
''అవును.ఆలా కూడా అనుకోవచ్చు. కానీ  ఈబ్యాగు ఎవరిది ?" అన్నది ప్రశ్న గానే మిగిలి పోతోంది'' అన్నాడు రంగా లేచి చేతులు వెనక్కు కట్టుకుని రూములో టెన్షనుగా అటూఇటూ తిరుగుతూ.
''సరేరా! ఇప్పుడేం చేద్దాం?" ఆదుర్దాగా అడిగాడు శ్రీహర్ష.
"పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా మన వల్ల ఈ పని అవుతుందా? మనం బ్యాగు ఓనరుకి అందచేయగలమా? అన్నది అలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేటు అయినకొద్దీ అనవసరంగా కేసులో ఇరుక్కున్న వాళ్ళమవుతామేమో" నని భయంగా వుంది అన్నాడు రంగా దీర్ఘంగా ఆలోచిస్తూ.
''అంతే కాదు!ఈ 'కేష్' ఏదైనా క్రైం కేసుకి సంబంధించిన 'ఎవి డెన్స్' అవుతే కేసుకి, మనకీ, డబ్బు స్వంతదారుకు, పోలీసు ఇన్వెస్టిగేషను కి తీవ్ర విఘాతం కల్గించిన వాళ్ళమవుతాము. మన మీద క్రిమినల్ చార్జెస్ కూడా ఫ్రేం చెయ్య వచ్చు'' అన్నాడు శ్రీహర్ష తన డిటెక్టివ్ బుర్ర అంతా ప్రదర్సిస్తూ .
''పైగా 'మనం' అని నన్ను కలుపుతావేరా ఈగొడవలో. నాకేం తెలుసు నేను ఇప్పుడేకదా వచ్చింది" అన్నాడు శ్రీహర్ష తలవంచుకుని.
''అదేం లేదు బాబూ! నీకోసం నేను స్టేషన్ కి వస్తుంటేనే కదా ఇది జరిగింది. తమరూ ఈ విషయంలో సమాన భాగస్వాములే.మంచైయినా, చెడైనా,ఇద్దరం అనుభవించాల్సిందే'' అన్నాడు రంగా నిర్మొహమాటంగా శ్రీహర్ష కళ్ళలోకి చూస్తూ, అదేదో సినిమాలో సుబ్రమణ్యాన్ని అనుకరిస్తూ .
''అన్యాయం.అక్రమం.దగా..మోసం" అమాయకుణ్ణి చేసి నన్ను కేసులో ఇరికిస్తున్నావు'' అన్నాడు లేచి నవ్వుతూ హర్ష.
''ఆ...అన్యాయం...అక్రమం...వెధవ! నీ మూలంగా కాదు ఈ న్యూసెన్స్' అంతా. నన్నుస్టేషనుకి రమ్మనకుండా నువ్వే ఏ ఆటోలోనో తగలడితే సరిపోయేదిగా. షనుకి అనవసరంగా నన్ను రమ్మన్నావు. చూడు... ఇప్పుడేమైందో !'' ఉడుక్కుంటూ అన్నాడు రంగా.
''సరే లేరా!సరదాగా అన్నాను.ఇప్పుడే ఏంచేద్దాం చెప్పు!'' సీరియెస్ గా అడిగాడు శ్రీహర్ష.
''ఇంకాసేపు టి.వి లో లోకల్ న్యూస్ చూద్దాం!'' అంటూ టి.వి.న్యూస్ పెట్టాడు రంగా.
'ఫ్లాష్...ఫ్లాష్' అంటూ స్క్రోల్ అవుతూ తెలుగు న్యూస్ వస్తోంది.
చిలకలగూడ పోలీసుస్టేషను పరిధిలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర పాడుబడ్డ భావిలో 'శవం'.
శవాన్ని బయటకు తీయడానికి పోలిసుల ఏర్పాట్లు.ఇంకొద్దిసేపట్లో శవం వెలికి తీత.  
''మనమూ అక్కడికెళ్దాం. ఎవరైనా శవాన్ని గుర్తుపడతారేమో. చూద్దాం!"అన్నాడు రంగ హుషారుగా లేచి డ్రెస్ అవుతూ. 
పదినిముషాలలో చిలకలగూడ రైల్వే బ్రిడ్జి దగ్గర పాడుబడ్డ భావి దగ్గరకి వచ్చారిద్దరు. అక్కడేమీ హడావుడి లేదు. ఆ భావి రైల్వేబ్రిడ్జి దగ్గరనుంచి మహా అయితే వందగజాల దూరం ఉందేమో.
రోడ్డు పక్కనే మోటర్ సైకిల్ మెకానిక్, చెప్పులు కుట్టే అతను ఇద్దరు వున్నారు. 
"ఏమిటి అక్కడ జనం మూగివున్నారు..ఏమైంది?" చెప్పులు కుట్టే అతనికి బూట్లు  పోలిష్ కి  ఇచ్చి  అతన్ని అడిగాడు రంగ.
''మామూలేనయ్యా! ఎవర్నో చంపి భావిలో పడేశారు. పోలీసులు ఇంతకు ముందే శవాన్నితీసి   పంపించారు బాబూ! ఈడ రాత్రి తొమ్మిది దాటితే లోకల్ రైళ్ళు జనం కొందరు పట్టాల మీదుగా ఇటు అడ్డంగా వస్తారు. పోకిరోళ్ళు, రౌడీలు వాళ్ళ దగ్గర డబ్బులు, ఉంగరాలు, ఫోన్లు లాక్కుంటారు. ఎవరైనా అడ్డం తిరిగితే చంపి ఈ భావిలో పడేస్తారు. పదేళ్ళ పైన చూస్తానే వుండ'' అన్నాడు చెప్పులు కుట్టే అతను తల ఎత్తకుండా తన పని చేసుకుంటూ.
''అలాగా! దోచుకోవడమే కాక మనుషుల్నిచంపేస్తారా?" పనికొచ్చే ఇన్ఫర్మేషన్  కోసం సంభాషణ పొడిగిస్తూ అన్నాడు రంగా.
''చెబుతున్నగదా బాబూ! ఎవరైనా ఎదురు తిరిగితే అంతే. చూడరాదు. రాత్తిరి చంపేసి పడేసిన బాబుకి పట్టుమని పాతికేళ్ళు లేవు. బాగా కొట్లాడినట్లుంది. ఎక్కడో తగలరాని చోట తగిలినట్లుంది.
దొంగముండా కొడుకులు బాబూ! పానం ఉండగానే భావిలో  పడేసింరో... ఏం పాడో. పాడులోకం అయిపోనాది బాబూ!" బాధ పడుతూఅన్నాడు చెప్పులు కుట్టే అతను.
"గవర్నమెంట్  హాస్పిటల్ కి వెళ్ళి అక్కడే మైనా 'క్లూ'దొరుకుతుందేమో చూద్దాం" అన్నాడు  రంగ. 
                                                                       * * * * *
ఇద్దరు హాస్పిటల్ కి చేరేసరికి టైం దాదాపు మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. హాస్పిటల్ లో మనుషులు అక్కడక్కడ సెటిల్ అయ్యారు. హాస్పిటల్  కాంపాండ్  లో ఓల్డ్ బోయిగుడ వైపు దూరంగా ఉంది పోస్ట్ మార్టం సెక్షన్. దాని పక్కనే మార్చ్యురి. అటువంక  పరికించి చూసాను. పనికిరాని ఫర్నిచరు, రక్తం మరకలతో ఎండిపోయిన రెండు పాత స్ట్రెచర్లు, పొడుగాటి సిమెంట్ రేకుల షెడ్. చూరు కింద రెండు పాత బెంచీలు, అటు ఇటు తిరుగుతూ చాయ్ వాలా. ఏడుస్తూ కొందరు. ఎటు చూసినా ఆ కంపౌండ్ పరిస్థితంతా దయనీయంగా ఉంది.
బైక్ పార్క్ చేసి రెండడుగులు వేశాము. 
''క్యా సాబ్ ఆక్సిడెంట్ బాడీ హైక్యా? తెలుగునా సార్? ఏందీ ఆక్సిడెంట్ కేసా? పోస్ట్ మార్టం తొందరగా చేయిస్తా సార్! బాడీ వచ్చిందా ? కబాయా... కహా సే ? నాం క్యా హాయ్ షబ్? 
పేరేంది సార్? బోలో సాబ్!" అంటూ ఆగకుండా ప్రశ్నమీద ప్రశ్న వేస్తూ మాదగ్గరికి వచ్చాడు. 
మాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలా. ఇక్కడ బ్రోకర్ అని మాత్రం అర్ధం అయింది. వాణ్ని వదిలించుకోవడమే మంచిదనుకుని "ఐసా కుచ్ భీ నహీ హై భాయి. కిసీ సే మిల్నే ఆయే.బస్!" అని వాడిని ఇగ్నోర్ చేస్తూ బయటకు నడిచాం. 
కొద్ది దూరం వచ్చి ముందుకి నడుస్తూ ''ఇదెక్కడి న్యూసెన్స్  రా బాబూ! వీడెవడో జిడ్డులా పట్టుకున్నాడు" అన్నాడు రంగా వెనక్కు తిరిగి చూస్తూ.  
వాడు ఫాలో కావడంలేదని నిర్దారించుకున్నాక ఒక పక్కన ఆగి ''హాస్పిటల్  బాయ్ ని, మార్చురీ  బాయ్ నీ  కలుద్దామా?" అని అడిగాడు రంగ.
''కలుద్దాం'' అన్నాడు శ్రీహర్ష.
వెంటనే హాస్పిటల్ లోకి నడిచాం. గేటు దగ్గర సెక్యూరిటీ చెయ్యి అడ్డంగా పెట్టాడు.
రంగా వెంటనే పది రూపాయలు చేతిలో పెట్టాడు.  మార్చురీ గది వైపు వెళ్ళాము. 
డోర్ క్లోజ్ చేసి ఉంది. సెక్యూరిటీ గార్డ్, హాస్పిటల్  బాయ్ కూర్చుని  తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు.
 ''ఏం కావాలి సార్ ?" అడిగాడు గార్డు లేచి నిలబడి. 
''డైలీ న్యూస్ నుంచి వచ్చాం. క్రైం రిపోర్ట్ కోసం. కేసులేమీ లేనట్టుంది" అంటూ వెనక్కి తిరిగాడు శ్రీహర్ష. కన్ను గీటుతూ.
''అదేంది సార్! ఆగండి. ఇయ్యాల రెండు 'బాడీ'లు వచ్చినయ్యి ! ఒకటి బోయినపల్ల' చౌరస్తా ఆక్సిడెంట్, రెండోది చిలకలగూడా మర్డర్ కేసు. 'పోస్ట్ మార్టం' రెండు గంటలలో అవుద్ధి!.
డాక్టర్  సాబ్  వస్తున్నానని కబురు చేసిండు" అన్నాడు గార్డు.  
వాడి చేతిలో ఏభై  రూపాయల నోటు పెట్టే సరికి "ఇంకేమైనా కావాలంటే చెప్పు సార్!" అన్నాడు టక్కున సెల్యూట్ కొట్టి.
''చిలకలగూడ మర్డరు కేసు.గురించి  చెప్పు. ఎవరైనా వచ్చారా ?" న్యూస్  రిపోర్టరులా పాకెట్ నోట్ బుక్, పెన్సిల్ పాకెట్ లో నుంచి తీసి వ్రాయడానికి సిద్ధమవుతు. 
''ఇంకేమీ తెల్వదు సార్! ఇచిత్రంగా ఉంది. ఇంతవరకు ఎవరూ రాలే'' అన్నాడు సెక్యురిటి గార్డ్.
''సరే! మేము  మళ్ళీ వస్తాము. ఆ కేసు గురించి ఎవరైనా వస్తే పేరు, ఫోన్ నంబరు.అన్నీ నోట్ చేసుకో! డ్యూటీ ఎన్ని గంటలదాకా ఉంది?"
"అరె...ఫికరు చెయ్యకు సార్! నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కిన. రేపు మజ్జాన్నం దాకా  ఉంటా సార్!  
నా పేరు మల్లేష్" ఉత్సాహంగా అన్నాడు.
''నీదగ్గర ఫోను ఉందా?"
''ఉంది సార్! ఏమైనా కాల్ చేసుకోవాలా ఇదిగో సార్!" జేబులోంచి మొబైల్ ఫోను తీసి ఇవ్వజూపాడు  సెక్యురిటి గార్డ్.
'' నంబరు చెప్పు.నీకు ఫోను చేస్తా ఇంకో గంట తరువాత''
''రాసుకో సార్! " అని నంబరు చెప్పాడు సెక్యూరిటీ గార్డ్.
ఫోను నంబరు నోట్ చేసుకుని బయటకు రాగానే మళ్ళీ తగిలాడు ఇందాకటి బ్రోకర్ గాడు.
''క్యా హువా సాబ్! పోస్ట్ మార్టం తొందరగా చేయించాలా...మర్డరు కేసు కదా సాబ్ ? తెలిసిన వాళ్ళు ఉన్నారు సాబ్" మావెంట నడుస్తూ అన్నాడు బ్రోకరు.
''అరె భాయి!మేము న్యూస్ పేపర్ వాళ్ళం.క్రైం న్యూస్ కోసం వచ్చాం. చెప్పు.నీ పేరేంటి ?' నీ పనేమిటి?"  జేబులో నుంచి పేపర్, పెన్నుతీసే సరికి అక్కడనుంచి ఒక్క ఉదుటున పరుగు లంకించుకున్నాడు బ్రోకరు.
''బతుకు జీవుడా! వీడు వదిలాడు. వాట్  నెక్స్ట్ ??" అన్నాడు రంగ అసహనంగా.
'ఏం ...ద....న్నా! అప్పుడే విసుగు వచ్చేస్తోంది.ఇంకా మొదల్లోనే ఉన్నాం'' అన్నాడురంగా  శ్రీహర్షని ఆట పట్టి స్తూ.
''సరే తమ్మీ! వాట్ నెక్స్ట్ ? ఏంచేద్దాం?" అన్నాడు శ్రీహర్ష. .
''వెయిట్ చేద్దాం ! ఎవరైనా బాడీ తీసుకెళ్లడానికి వస్తారేమో చూద్దాం'' అన్నాడు రంగ.
''సరే నేను పోస్ట్ మార్టం రూం వైపు వుంటాను. పోలీసు కానిస్టేబుల్ ఇక్కడే  
ఉన్నాడు.ఎవరొచ్చినా  అతన్ని కలుస్తారు. నేను అతన్ని కనిపెట్టి  వుంటాను" అన్నాడు శ్రీహర్ష.
''ఒకే '' అన్నాడు రంగ.
                                                                  * * * * *
అది చిలకలగూడ పోలీసు స్టేషను. టైం దాదాపు మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. 
ఎస్.ఐ రంగనాథ్ ఉదయం చిలకలగూడ రైల్వే బ్రిడ్జి దగ్గర భావిలో దొరికిన శవం కేసులో కానిస్టేబుళ్లు కానిస్టేబుల్ పరశురాం, మొయిన్ ఖాన్  పట్టుకొచ్చిన అనుమానితులను ఇంటరాగేట్ చేస్తున్నాడు. వారయిదుగురు రౌడీషీట్ ఉన్నవాళ్లే. కానిస్టేబుళ్లు కొంత ఇన్ఫర్మేషన్ సేకరించారు. 
ఆ ఇన్ఫర్మేషన్  ఆధారంగా కేసులో ప్రొసీడ్ అవుతున్నాడు రంగనాథ్. 
ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్ రాలేదు. ముందుగా అయిదుగురు అనుమానితులను వారి పద్దతిలో ఇంటరాగేట్ చేశారు. 
ముందు రోజు రాత్రి చిలకలగూడ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర గ్యాంగ్ వార్ అయింది. లోకల్గ్ గ్యాంగ్ , ఆటోవాళ్ళ మధ్య గ్రూప్ 'క్లేషేస్' అయ్యాయని, కొట్లాట జరిగిందని, లోకల్ గ్యాంగ్  గ్రూపుకు చెందిన 'శ్రీను' ఆటో గ్యాంగ్  వారు ఎవరి దగ్గరో కొట్టేసిన డబ్బు సంచిని, కొట్టేసి పారిపోతుండగా ఆటోగ్రూపు వారు శ్రీనును వెంబడించారని, అక్కడే గ్రూపుల మధ్య కొట్లాట అయిందని, సరిగా అదేసమయానికి  మొబైల్ పోలీసు పెట్రోల్ పార్టీ రావడంతో, అందరం పారిపోయామని చెప్పారు. 
చీకట్లో డబ్బు బ్యాగు  శ్రీను దగ్గరనుంచి ఎవరి దగ్గరకి చేరిందో తమకు తెలవదని, క్యాష్ బ్యాగ్  లో  చాలా డబ్బుందని, అనుమానితులంతా ఒకేరకమైన స్టేట్ మెంటు ఇచ్చారు.  
'ఆ డబ్బు బ్యాగు, మొబైల్ ఫోను ఏమయ్యాయి?' పెన్సిల్ నుదురు మీద కొట్టుకుంటూ ఆలోచిస్తున్నాడు ఎస్ ఐ రంగనాథ్.  
సి.ఐ తో కేసు ప్రోగ్రెస్  డిస్కస్ చేసి సూచనలు, ఆదేశాలు తీసుకుని వెంటనే  కానిస్టేబుళ్లు పరశురాంని, మొయిన్ ఖాన్ ని పిలిచి ఆక్సిడెంట్ స్పాట్ కి వెళ్లి ఎవిడెన్స్  ఏమైనా దొరుకుతాయేమో వెతకమన్నాడు ఎస్ ఐ రంగనాథ్. 
నిందితులలో ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి సీన్  'రీ కన్ ష్ట్ర క్ట్' చేయమన్నాడు. 
రెండు గ్రూపుల మధ్య కొట్లాట జరిగిన  ప్రదేశం, శవం దొరికిన భావి దగ్గర ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతకమన్నాడు. ఏ చిన్న'క్లూ' కూడా వదలవద్దని గట్టిగా చెప్పి పంపాడు. వేరే స్టేషన్లలో మనీ 'తెఫ్ట్' కేసులేమైనా రిపోర్ట్ అయ్యా ఏమోనని 'చెక్' చేసుకున్నాడు. కేసులేమీ రిపోర్ట్ కాకపోవడంతో  ఆక్సిడెంట్  సైట్  కి  వెళ్ళిన 'సెర్చ్ పార్టీ' రిపోర్ట్ కోసం ఎదురు చూడసాగాడు.
గంటతరువాత పరశురాం కానిస్టేబుల్  ఫోను చేశాడు.
"'సార్! మొబైల్ ఫోను ఒకటి దొరికింది. 'ఓల్డ్ బ్రిడ్జి' దగ్గరే తుప్పల్లో ఉంది. దానిమీద రక్తపు మరకలున్నాయి" అన్నాడు పరశురాం.
"సరే! మీరు వెంటనే వచ్చేయండి'' అని పరశురాంకి  చెప్పి, 'పోస్ట్ మార్టం' రిపోర్ట్  కోసం  'ఎంక్వైర్' చేసి 'సెర్చ్' పార్టీ కోసం వెయిట్  చేస్తూ కూర్చున్నాడు.
వాళ్ళు తిరిగిరావడం తోనే తను గ్లోవ్స్ వేసుకుని దొరికిన మొబైల్ ఫోనులో  'రీసెంట్ కాల్స్' చూసి
ఒకటే నంబరు నుంచి పందొమ్మిది  కాల్స్ గమనించి, వెంటనే అదే మొబైల్ నుంచి ఆనంబరుకి కాల్ చేశాడు. 
''హలో! ఏమైపోయావురా ? నిన్ననగా వెళ్లావు. పని అయిందా ? రాత్రంతా ఎక్కడున్నావు? ఫోను ఎందుకు ఎత్తడంలేదు? ఇక నేనే బయలుదేరుదామనుకుంటున్నాను'' ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అవతలి నుంచి మాట్లాడుతున్న వారి గొంతులో తీవ్ర ఆందోళన గమనించాడు రంగనాథ్.  .
మాట్లాడుతోంది పెద్దాయనలా ఉందని ''నా పేరు రంగనాథ్ అండీ! నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.ఈ ఫోను ఎవరిదండీ?" అని అడిగాడు  రంగనాథ్.
''మీరెవరండీ ? ఈఫోను మీదగ్గరికెలా వచ్చింది. మావాడెక్కడ?" తీవ్ర ఆందోళనతో బొంగురుపోయిన గొంతుకతో మాట్లాడాడు అవతలనుంచి. 
''మీరేమీ కంగారు పడకండి. ఈ ఫోను నాకు దొరికింది. అడ్రస్ చెపుతే వచ్చి మీకు ఫోను ఇద్దామని ఫోను చేశాను" కావాలని అబద్ధం చెప్పాడు రంగనాథ్
''అయ్యో ! అయితే మా అబ్బాయి ఎక్కడ?" అడిగాడు ఆయన భయాందోళనతో.
''చూడండి! మీ పేరేంటో...  మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. మీ అడ్రస్ చెబుతే ఇప్పుడే వచ్చి మీ ఫోను ఇవ్వగలను" అన్నాడు రంగనాథ్.
''బాబూ!నేను జనగాం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కేశవరావు. మా అబ్బాయి పేరు చంద్రకుమార్" సమాధానం చెప్పాడు కేశవరావు గారు.
''అలాగా అండీ! అయితే ఇక్కడ మీవారెవరైనా వుంటే చెప్పండి. వాళ్లకి ఫోను అందచేస్తాను'' అన్నాడు రంగనాథ్  పెద్దాయనను కంగారు పెట్టకూడదన్న భావనతో.
''అలాగే బాబూ! నా తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటిలో ప్రొఫెసర్ ఏకాంబరేశ్వర రావు, 
ఫోను నంబరు  నోట్  చేసుకోగలవా? నేనూ తనతో చెబుతాను" అంటూ తమ్ముడి మొబైల్ నంబరు చెప్పాడు కేశవరావు గారు. 
'అమ్మయ్య! తీగ దొరికింది' అని మనసులో అనుకుంటూ  ''ఇంకో గంటలో మీ అబ్బాయి ఎక్కడవున్నాడో  ఇన్ఫర్మేషన్ తెలయక  పోతే మీ తమ్ముడి గారితో మాట్లాడి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. ఇంకా లేటు చెయ్యకండి" అని చెప్పి ఫోను కట్ చేసి వెంటనే తన మొబైల్ నుంచి ప్రొఫెసర్ ఏకాంబరేశ్వరరావుకి కాల్ చేశాడు.
''థిస్ ఈజ్ ప్రొఫెసర్ ఏకాంబరేశ్వర రావు .హు ఈజ్ కాలింగ్?"
''సర్! నా పేరు రంగనాథ్. చిలకలగూడ పోలీసు  'ఎస్.ఐ ని'. మీతో అర్జెంట్ గా రెండు నిముషాలు మాట్లాడాలి"
''ఒకే ఇన్స్పెక్టర్ !  హౌ కె న్ ఐ హెల్ప్ యు?"  కూల్ గా అడిగారు ప్రొఫెసర్.
''సర్!  మీ బ్రదర్ సన్  'చంద్రకుమార్'  గారి మొబైల్ ఫోను చిలకలగూడ దగ్గర రైల్వేట్రాక్ పక్కన తుప్పల్లో దొరికింది. మీ బ్రదర్ కేశవరావు గారితో మాట్లాడాను. చంద్రకుమార్ నిన్న సిటి కి వచ్చారట.ఇంకా ఇల్లు చేరలేదట. నేను వారికి పోలీసునని చెప్పలేదు.పెద్దాయనలా అనిపించారు. కంగారు పడతారేమోనని ఫోను దొరికిన సంగతి ఆయనకు చెప్పలేదు''
''యు డిడ్  ఎ వండర్ఫుల్ జాబ్  ఇన్స్పెక్టర్! ఐ రియల్లీ అప్రిసిఎట్ యువర్ కన్సర్న్! మిస్టర్...?'
''ఐ యాం  రంగనాథ్ సర్! మిమ్ముల్ని అర్జెంట్ గాఇప్పుడే కలవాలి.అర్జెంట్ గా డిస్కస్ చేసే  విషయం.మీకు చూపించవలసినవి ఉన్నాయి"'అర్జెన్సి  అర్ధమయ్యేలా మాట్లాడాడు రంగనాథ్.
''ఎస్ ఇన్స్పెక్టర్! నేను 'యునివర్సిటి' నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎక్కడికి రావాలో చెప్పండి? వెంటనే వచ్చేస్తాను'' అన్నారు ప్రొఫెసర్ .
''సర్! మీరు వెంటనే బోయిగూడ గవర్నమెంట్ హాస్పిటల్ వెనక గేటు దగ్గరికి రండి.  మీకోసం వెయిట్ చేస్తూ వుంటాను'' అని వెంటనే ఫోను 'కట్' చేశాడు రంగనాథ్. 
వెంటనే ఆ మొబైల్ ఫోనుని ఓ జిప్ లాక్  కవర్ లో వేసి దాన్ని తీసుకుని ఒక అర్ధగంటలో వస్తానని ఈ లోపులో ఫోరెన్సిక్ వారిని పిలవమని చెప్పి పరశురాంని, మొయిన్ ఖాన్ ని పోలీసు స్టేషనులోనే ఉండమని చెప్పి ప్రొఫెసర్ ని కలవడానికి  బోయిగూడ ప్రభుత్వ హాస్పిటల్ కి బయలు దేరాడు రంగనాథ్.
'రంగనాథ్ హాస్పిటల్ వెనుక గేటు దగ్గర పోస్టుమార్టం రూం దగ్గర  తన బుల్లెట్ బైక్ పార్క్ చేసి టైం చూశాడు. మూడు ముప్ఫై అయిదు నిముషాలవుతోంది. అక్కడి డ్యూటీ కానిస్టేబుల్ కోసం చుట్టూ కలియ చూశాడు. ఎక్కడా కన్పించలేదు.
'వీడు ఎక్కడున్నాడో' అనుకుంటూ రూం వైపు నడిచాడు ఎస్. ఐ. రంగనాథ్.
'పోస్ట్ మార్టం' రూం ముందు బెంచి మీద కూర్చుని బీడీ కాలుస్తున్నాడు కానిస్టేబుల్ ఇంతియాజ్. 
రంగనాథ్ ని చూస్తూనే బీడీ విసిరేసి సెల్యూట్' కొట్టి ''డాక్టరు సాబు ఇప్పుడే వచ్చిండు. ఇంకా మన బాడీ  'పోస్ట్ మార్టం' కాలేదు సాబ్! ముందు బోయిన పల్లి ఆక్సిడెంట్ డెత్ కేసుది అవుతోంది సాబ్ !" అక్కడి స్టేటస్  అప్ టు డేట్  చేశాడు ఇంతియాజ్. .
'వీడి బొంద తెలుగు. మన బాడీ అట' నవ్వుకుంటూ అనుకున్నాడు రంగనాథ్.
రెండు నిముషాల్లో వెనక గేటు దగ్గరకు వెళుతూనే గమనించాడు.తెల్ల మారుతి కారు ఆగడం.
కార్ లాక్ చేసి వస్తున్నమనిషికి ఎదురుగా వెళ్లి ''ప్రొఫెసర్ ... !?"
క్ హ్యాండ్ ఇచ్చి "రండి సర్! రాత్రి చిలకలగూడా ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర భావిలోనుంచి ఒక డెడ్ బాడీని  రికవర్ చేశాము. మీ అన్నగారి కొడుకు ఫోను కూడా ఆ ప్రదేశం దగ్గరలోనే దొరికింది. 
ఈ ఫోనుకు...బావిలో దొరికిన బాడీ కి ఏమైనా సంబంధం ఉందా అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఈ మొబైల్ ఫోను  మీ అన్నగారి అబ్బాయి 'చంద్రకుమార్' దేనా ? ఫోనును గుర్తించగలరా?" 
ఫోనును జిప్ లాక్ కవరుతోనే ప్రొఫెసర్ కి అందిస్తూ కూల్ గా మాట్లాడాడు రంగనాథ్.
''ఎస్! ఈ మొబైల్ 'చందుదే' నిన్నసాయంత్రం ఆరు,ఆరున్నర మధ్య మాఇంటి నుంచే బయటకు  వెళ్ళాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి పోతానన్నాడు. ఓకే ఇన్స్పెక్టర్!....లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ . లెట్స్ సి ది బాడీ...' చాలా నిబ్బరంగా నడిచారు ప్రొఫెసర్. 
"మీరు డెడ్ బాడీని చూసి  చందూది అవునా, కాదా  చెప్పండి ?" 
ఇద్దరు 'పోస్ట్ మార్టం' రూం వైపు నడిచారు. గది తలుపు తెరిచాడు ఇంతియాజ్. 
అక్కడే ఉన్న బాయ్ వచ్చి బాడీ మీద  బెడ్  షీట్ తీసి పక్కకు జరిగాడు.
బాడీ ముఖం చూస్తూనే ''నో...నో...చందు కాదు. నో!..'థేంక్ గాడ్' ఇట్ ఇజ్ నాట్ చందు!"అని భారంగా నిట్టూర్చి, ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ బయటకు నడిచాడు ప్రొఫెసర్.
''హా సాబ్!ఈ పోరడు  రైల్వే స్టేషన్చి తాన చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రైల్వే స్టేషను కాడనే వుంటడు..రైల్వే పోలీస్  వీడిని చాలా సార్లు పట్టుకున్నారు సాబ్!" అన్నాడు ఇంతియాజ్  కాన్ఫిడెంట్ గా.
''ముందే ఈ సంగతి ఎందుకు చెప్పలేదు నాకు" కోపంగా అతన్ని మందలిస్తూ  బయటకు  నడిచాడు రంగనాథ్  అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా. .
పోస్టుమార్టం గది గుమ్మం దగ్గ్గర్నుంచి లోపలి తొంగి చూస్తున్న శ్రీహర్షను ''మీరెవరు...ఏంకావాలి?" అడిగాడు రంగనాథ్. 
''మా వాళ్ళది పోస్ట్ మార్టం ఉందండీ" అని పక్కకు నడిచాడు శ్రీహర్ష.
''ఒక్కనిముషం సర్!" ప్రొఫెసరుతో చెప్పి  లోనికి వెళ్లి ''ఇంతియాజ్!పోస్ట్ మార్టం కంప్లీట్ కాగానే స్టేషనుకి వచ్చెయ్యి లేటు చేయవద్దు.అర్జెంట్ పని ఉంది"' అని చెప్పి వచ్చాడు.
బయటకు వస్తూనె ''సర్! బాడీ చంద్రకుమార్ ది కాదు. కాని భావి  పరిసరాల్లో దొరికిన ఫోను మాత్రం అతనిది. అంటే ఆ ఏరియాకి నిన్న చంద్ర కుమార్ వచ్చాడా? వస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఫోను ఇక్కడ దొరకడ మేమిటి ? అతనికేమైనా అపాయం జరిగిందా ?" అన్న ప్రశ్నలు రంగనాథ్  బుర్రను  తొలుస్తున్నయి. 
''సర్! మీ అబ్బాయి దగ్గర కేష్ గానీ వేరే విలువైన వస్తువులు గానీ ఉన్నాయా? అతను నిన్న బయటకు వెళ్ళాక కుటుంబ సభ్యులతో మాట్లాడాడా? మాట్లాడి ఉంటె  ఏమి మాట్లాడాడు?" అన్న ప్రశ్నలకు సమాధానం  కావలి. మీకు ఇబ్బంది కాకుంటే నాతో స్టేషను కి వస్తే పది నిముషాలు కేసు డిస్కస్ చేసి వెళ్ళవచ్చు" అన్నాడు రంగనాథ్
''బయ్ అల్ మీన్స్. ఐ విల్ ఫాలో యు టు స్టేషన్'' అన్నాడు ప్రొఫెసర్ కారు దగ్గరకు నడుస్తు.
ఫోను మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ వారిద్దరిని ఫాలో అవుతూ వచ్చి ప్రొఫెసర్ కార్ నంబరు నోట్ చేసుకున్నాడు శ్రీహర్ష.
వారిద్దరు పది నిముషాల్లో చిలకలగూడ పోలీసు స్టేషను కి వచ్ఛారు.
ప్రొఫెసర్  కారు పార్క్ చేసి బయటనిలబడి. "నేను మాఅన్నగారితోమాట్లాడి వస్తాను'' అన్నాడు. . 
రంగనాథ్  స్టేషనుకి రావడమే ఆలస్యం...పరశురాం కానిస్టేబుల్ రంగనాథ్ కి సెల్యూట్  కొట్టి 
"సార్!  రైల్వే పోలీసు ఎస్.ఐ గారు  ఎవరో 'ఒకతన్ని' ఇక్కడకు పంపారు. వాళ్ళ కానిస్టేబుల్ కూడా వచ్చాడు. అర్జెంటు గా మిమ్మల్ని కలవాలంట. కంప్లైంట్ ఇవ్వాలంట. అతన్ని మీ రూంలో ఉన్నాడు" అని చెప్పాడు.
తన గదిలోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నతన్ని వివరంగా చూశాడు రంగనాథ్. 
నలిగి, మాసిన షర్టు. దాని మీద అక్కడక్కడ రక్తం మరకలు. నిద్ర లేక మొహం అంతా పీక్కు పోయి, కళ్ళు ఎర్రగా, దిగులుగా ఉన్న అతన్నిచూస్తూ ''చెప్పండి! వాట్ కెన్ ఐ డు ఫర్ యు ?"అడిగాడు. 
ఇంతలో రైల్వే కానిస్టేబుల్  లోనికి వచ్చి సెల్యూట్ కొట్టి " సార్! ఈవేళ పగలు ఒంటి గంటకు భోయిగూడ  రైల్వే పార్కింగ్ లాట్ లో ఓ మూల ఉన్న పాత 'అన్ క్లైమ్డ్ కార్' లోపల నోరుకు టేప్ వేసి, కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉన్న ఇతని గురించి మాకో అనానిమస్   ఫోను కాల్ వచ్చింది.  మేము  ఇతన్ని రెస్క్యు చేసి  డాక్టరు కి చూపించి అతను తేరుకున్నాక "తనవి కేష్ పదిలక్షల దాకా పోయాయని కంప్లైంట్ చేయాలన్నాడు" క్రైమ్  మీ జ్యూరిస్ డిక్షన్  లో అయిందని  మా ఎస్.ఐ గారు మీ పోలీసు స్టేషన్ లో ఇతన్ని హ్యాండ్  ఓవర్  రమ్మని  నన్ను పంపారు సార్! రిపోర్ట్ పరుశురాం గారికి ఇచ్చాను. ఇక నేను వెళతాను సార్'' అని చెప్పి రైల్వే కానిస్టేబుల్  వెళ్ళాడు. 
                                                                * * * * *
రైల్వే కానిస్టేబుల్ అటు వెళ్ళగానే  "చెప్పండి! కంప్లైంట్  వివరాలు చెప్పండి !" అడిగాడు రంగనాథ్ . 
''సర్! నాపేరు  చంద్ర కుమార్.  మాది జనగాం.  నిన్న సాయంత్రం 'తార్నాక' స్టేటు బ్యాంకులో పది లక్షల రూపాయలు డ్రా చేశాను. అక్కడే మొబైల్ షో రూం లో ఒక 'ఆపిల్ ఐ ఫోను' కొన్నాను. అక్కడే  రెండు, మూడు గంటలు జనగాం బస్సు కోసం వెయిట్ చేశాను. బస్సు దొరకలేదు.    అప్పటికే రాత్రి ఎనిమిది కావడంతో అంత కేష్ తో అప్పుడు జనగాం పోవడం 'రిస్క్' అని  అక్కడ్నుంచి ఆటోలో మారేడుపల్లిలో మా బాబాయి గారింటికి బయలుదేరాను. 
ఆటో మెట్టుగుడ రైల్వే బ్రిడ్జ్ దాటగానే రైల్ నిలయం వైపు తిరగకుండా చిలకలగూడ ఓల్డ్ బ్రిడ్జ్ వైపు తిరిగింది. వెంటనే  ఆటో స్లో అయింది. నేను రియాక్ట్ అయ్యే లోపునే ఇద్దరు వ్యక్తులు  ఆటోలో ఎక్కారు. నాకు చెరొకవైపు కూర్చుని ఒకడు నన్ను గట్టిగ నొక్కి పట్టుకున్నాడు. నా ఫోను లాక్కున్నారు. రెండోవాడు నా మొహాన్ని ఏదో గుడ్డతో నొక్కి పెట్టాడు. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. రైల్వే పోలీసు వాళ్ళు నన్ను రెస్క్యూ చేసి కాపాడిందాకా నేను స్పృహలో లేను. నా దగ్గరున్న  తొమ్మిదిలక్షల అరవై వేల డబ్బు కొట్టేశారు. 
తరువాత ఏo జరిగిందో మీకు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ చెప్పాడు.
''సర్! నిన్న సాయంత్రం నుంచి ఇంటికి ఫోను చేయలేదు. నేను ఇంటికి ఒక ఫోను చేసుకోవచ్చా? ఇంటి దగ్గర మావాళ్ళు కంగారు పడుతూ వుంటారు" అన్నాడతను 
'"పరశురాం! బయట ప్రొఫెసర్ 'సర్' ఉంటారు. లోపలకి రమ్మని చెప్పు" అని .
''ఈ ఫోను చూడండి.గుర్తు పట్టా గలరేమో" టేబుల్ సొరుగు నుంచి ఫోనుఉన్న జిప్ లాక్ కవరు
చూపిస్తూ అన్నాడు రంగనాథ్.
''సార్! ఆ మొబైల్ నాదే! ఇక్కడికి ఎలా వచ్చింది?" ఆశ్చర్యంగా అన్నాడు చంద్రకుమార్.
''వివరాలన్నీ తరువాత. ముందు మీ ఇంటికి ఫోను చేసి మాట్లాడిన  తరువాత కంప్లైంట్ వ్రాసివ్వండి" అంటూ తన మొబైల్ ఫోను చంద్రకుమార్ కి ఇచ్చాడు రంగనాథ్. 
ఇంతలో ప్రొఫెసర్ లోపలకి వస్తూనే చంద్రకుమార్ ని చూసి ''చందూ! నువ్వా? ఏమయిపోయావు ? ఎక్కడికి వెళ్లావు? ఏమైంది నీకు ? ఈజ్ ఎవ్విరి థింగ్ ఆల్ రైట్ ?" ఆశ్చర్యంగా అంటు చంద్రకుమార్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయివేసి ''ముందు ఇంటికి ఫోను చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పు'' అని చెప్పిఆప్యాయంగా భుజం తట్టి తను రంగనాథ్ వైపు తిరిగి
''ఎస్.ఐ' గారూ! నేను మా అన్నయ్య గారితో మాట్లాడాను. 
ఇప్పుడు 'చందు' కన్పించాడు కాబట్టి థింగ్స్ ఆర్ డిఫరెంట్ నౌ. బట్ ఐ థింక్ సంతింగ్ ఈజ్ వెరీ సీరియస్ !" అంటూ ఎడం చేత్తో నుదురు పట్టుకుని కళ్ళు మూసుకుని చందు పక్కన  కుర్చీలో కూర్చున్నారు. 
                                                               * * * * *
టైం సాయంత్రం నాలుగు గంటలవుతోంది. మర్డరు కేసు 'బాడీ' కోసం ఎవరు రాలేదు. ఎవరు క్లెయిమ్శ్రీ చేయలేదు. హర్ష, రంగా అప్పటిదాకా వెయిట్ చేసి  ఇద్దరు హాస్పిటల్ 'పోస్ట్ మార్టం' రూం దగ్గరనుంచి బయలుదేరారు. 
అక్కడ్నుంచి 'చిలకలగూడ' పోలీసు స్టేషను దగ్గరికి వచ్చారు. స్టేషన్  ఎదురుగా ఉన్న పాన్ షాప్ 
దగ్గర్నుంచి  స్టేషనులోనికి  చూశారు శ్రీహర్ష.  యెస్.ఐ , బుల్లెట్ బైక్,  హాస్పిటల్ దగ్గర చూసిన  
తెల్ల మారుతి కార్ పార్క్ చేసి ఉండడం గమనించాడు.
''రంగా! నా 'సిక్త్ సెన్స్' చెబుతోంది. మనకు కావలసిన 'లీడ్' కచ్చితంగా ఈ  మారుతి కారులో వచ్చిన  వ్యక్తి అని నా నమ్మకం" అని ధృడంగా అన్నాడు శ్రీహర్ష.
''అలాగవుతే  కాసేపు వెయిట్ చేద్దాం. ఆ కారుని ఫాలో అవుదాం'' అన్నాడు రంగ. .
''అరే మీరా అన్నా! స్టేషనులో పనేమయినా ఉందా ? అంతా మనోల్లే. చెప్పండన్నా!" పాను నోట్లో కుక్కుకుంటు అడిగాడు 'పోస్ట్ మార్టం' రూం దగ్గర తారసపడ్డ బ్రోకరు.
''రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు, ఇక్కడకి తగలడ్డాడు వీడు. ఇక బయలుదేరు మనం ఇక్కడ ఉండడం ప్రమాదం'' అన్నాడు శ్రీహర్ష బైక్ దగ్గరకు నడుస్తూ.
''పోరా! నీకు ప్రతీది అనుమానమే. ఉండు! పది నిముషాలు చూద్దాం"' అన్నాడు రంగా ఆశావహంగా. 
రెండు, మూడు నిముషాలయిందో కాలేదో ప్రొఫెసర్ తో మాట్లాడుతు  ఎస్. ఐ బయటకు వచ్చాడు.  వారి వెంట మూడో వ్యక్తి  స్టేషను బయటకు వచ్చారు. వెంటనే  ప్రొఫెసర్,  అతను కలిసి కారు ఎక్కి బయలుదేరారు. రంగ వెంటనే బైక్ స్టార్ట్ చేసి రెడి గా ఉన్నాడు. శ్రీహర్ష వారిద్దరిని పోలీసు స్టేషను గేటు నుంచి దగ్గరగా నడుస్తూ ఫాలో కావడం గమనించాడు రంగ. 
తెల్ల కారు  సికిందరాబాదు వైపు వెళ్తోంది. 
శ్రీహర్ష  బైక్ ఎక్కుతూనే  తెల్ల మారుతి కారుని ఫాలో అయ్యాడు రంగ.
కారు 'సంగీత్' సినిమా కూడలి మీదుగా ఈస్ట్ మారేడుపల్లి శ్రీనర్సింగ్ హోం పక్కన సందులోకి తిరిగి లెఫ్ట్ సైడ్ 'అశోక' చెట్లు ఉన్న ఇంటి లోనికి వెళ్ళింది. కొద్దిగా ముందుకి వెళ్లి  కూరగాయల దుకాణం దగ్గర ఆపాడు బైక్ రంగ. .
బైక్ ఆగుతూనే దిగి "ఇక్కడ దగ్గరలో తెల్ల మారుతి కారు ఉన్న సార్ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా బాబూ?" దుకాణం అతన్ని అడిగాడు శ్రీహర్ష.
''తెల్ల కార్లు చాలా మందికి ఉన్నాయ్... చిన్న తెల్ల కారవుతే ఇక్కడ నుంచి మూడో ఇంటిలో ప్రొఫెసర్ సారు వాళ్ళు ఉంటరు. ఆయనది పాత తెల్ల మారుతి కారు'' అన్నాడు చిరాకుగా .
''ఆ...అదే పాత తెల్ల  మారుతీ కారు. ప్రొఫెసర్ సారే!" అతనికి అనుమానం రాకుండా జేబులోంచి పేపరు తీసి చదువుతున్నట్లుగా నటిస్తూ అన్నాడు శ్రీహర్ష. 
''ఏకాంబసవ రావు  సారేనా?" ఆయన పేరుని ఖూనీ చేస్తూ,
"అవును. ఏకాంబరేశ్వరరావుగారే" శ్రీహర్ష ఇంకా ఏమి మాట్లాడాలో పాలుపోక.
ఇంతలో జీన్స్ పేంటు వేసుకుని, బాగా జుట్టు పెంచినకుర్రాడు ఒకతను ఆగేటు తెరుస్తున్నాడు. 
ఆ కుర్రాడు ఎవరు?" అన్నాడు శ్రీహర్ష.
''ప్రొఫెసరు సారి కొడుకు.ఉత్త 'బేకారు' పోరడు. సారు ఎప్పుడు పరేశానే కొడుకు గురించి. ఆయన కడుపునా చెడబుట్టిండు. చదువు లేదు. తింటడు. పోకిరోల్లను వెంటేసుకుని తిరుగుడు,  ఆడపిల్లలను అల్లరి చేసుడు. మీతో ముచ్చట పెట్టుకుని నాపని పాడు" అని తన పనిలో మునిగి పోయాడు దుకాణం అతను.
''వెళదాం" అని రమ్మని సైగ చేస్తూ సర్రున బైక్ స్టార్ట్ చేసాడు రంగ. ఇంకా అక్కడ వుంటే దుకాణం అతనికి అనుమానం వస్తుందని 
"ఓకే" అంటూ బైక్ ఎక్కాడు శ్రీహర్ష. వారు ఇంటికి చేరేసరికి సాయంత్రం ఆరు గంటలు దాటింది.
                                                                * * * * *
'టైం' రాత్రి తొమ్మిది గంటలవుతోంది.
రంగా, శ్రీహర్ష ఇద్దరు 'మెస్'లో భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి నడుస్తున్నారు.
''రంగా! నువ్వు  గమనించావో, లేదో ప్రొఫెసర్ గారితో పోలీసు స్టేషను నుంచి వచ్చిన కుర్రాడు ఆయన తమ్ముడో లేక దగ్గర చుట్టమో, బాగా పోలికలున్నాయి. అతని షర్టు మీద రక్తం మరకలున్నాయి. ఖచ్చితంగా అతనికి ఈ కేసుకీ సంబంధం ఉందనే చెబుతోంది నా 'సిక్త్ సెన్స్!" అన్నాడు శ్రీహర్ష ఇంకేదో ఆలోచిస్తూ. 
తనే మళ్ళీ మాట్లాడుతూ "రేయ్..రంగా! ఇంకొక 'క్లూ' వుందిరా. ఉదయం  దొరికిన డబ్బు చూసినప్పుడు ఒక ఐదు వందల రూపాయల కట్ట బ్యాండ్ స్లిప్  మీద స్క్రోల్ నంబరు చూసినట్లు గుర్తుందిరా. ఇంకో కట్టమీద బ్యాంకు బ్రాంచ్ పేరు వుంది. మనం ఆ బ్యాంకు బ్రాంచికి వెళ్లి ఆ స్క్రోల్ నంబరుతో ఎవరు డబ్బు డ్రా  చేశారో కనుక్కుంటే సంగతి తేలిపోతుందిరా!'' అన్నాడు శ్రీహర్ష నడుస్తూనే రంగా వంక 
సాలోచనగా చూస్తూ!
''నీ పరిశోధన పరిశీలనాశక్తి  అమోఘంరా! కాని మనకు ఆ బ్యాంకులో  డబ్బు'డ్రా' చేసిన మనిషి వివరాలు ఎవరు చెపుతారు ? మనం స్వయంగా వెళ్ళడానికి లేదు. ఆ బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఎవరైనా  తెలిసిన వారుంటే వివరాలు కనుక్కోవచ్చు  మాయింటి ఓనరు ఏదో బ్యాంకు లోనే వర్క్ చేస్తాడు. అయినా  కేసు వివరాలు  ఇంకేమైనా తెలుస్తాయేమో చూద్దాం'' అన్నాడు రంగా ఇంటి తాళం తీస్తూ.
ఇంట్లోకి వెళుతూనే టి.వి. ఆన్ చేసి లోకల్ న్యూస్ పెట్టాను. రెండు మూడు చానల్స్ మార్చాను. 
ఒక లోకల్ న్యూస్  ఛానెల్లో 'ఉదయం చిలకలగూడ లో పాడుబడ్డ భావినుంచి నుంచి వెలికి తీసిన శవం తాలూకు పరిశోధనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను వెనుకాల కొంతమంది జులాయిలను కస్టడిలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించినట్లు, ఒక ఆటో ప్రయాణికుడి దగ్గర దోచుకున్న భారీ మొత్తం డబ్బు కోసం రెండు, మూడు గ్యాంగ్ లు రాత్రి చిలకలగూడ పాత రైల్వే బ్రిడ్జ్ దగ్గర బాగా గొడవ పడ్డట్లు, వారి లోనే ఒకడు శవమై భావిలో తేలినట్లు, డబ్బు ఏమయిందో ఇంకా  పోలీసులకు తెలియరాలేదని....ఇప్పుడే అందిన వార్త' అని, చెప్పిన వార్తనే మళ్ళీ మళ్ళీ చదివుతోంది రంగమాంబ. 
వార్తలు విన్న వెంటనే  "నువ్వు చెప్పు నీకు కేష్  బ్యాగ్  దొరికిన సమయంలో నిన్ను ఎవరైనా చూడడం గాని, నిన్ను అనుసరించడం గాని ఏమైనా జరిగుంటే పోలీసులు మన దాకా రావడం పెద్ద కష్టమైనపనేమీ కాదు" అన్నాడు శ్రీహర్ష వెంటనే స్పందిస్తూ.
'నిన్ను అడిగాను చూడు.నన్ను నేను చెప్పుచ్చుకుని కొట్టుకోవాలి' అనుకుంటూ జరిగిందంతా  పునః శ్చరణ చేసుకుని తననెవరు చూడలేదని నిర్ధారణ కొచ్చి "లేదురా. ఖచ్చితంగా నన్నెవరు చూడలేదు.ఫాలో కాలేదు" అన్నాడు రంగ. .
గంట తరువాత శ్రీహర్ష మళ్ళీ టి.వి. ఆన్ చేసి లోకల్ న్యూస్ పెట్టాడు. మరుసటి రోజు హైదరాబాదు బంద్. ఏదో రాజకీయపార్టి డిక్లేర్ చేసింది. కొత్త న్యూస్  లేవు. రంగమాంబ ఇందాక చదివిన న్యూస్ నే మళ్ళీ చదువుతోంది.
''సరేరా ఇక పడుకుందాం. రేపు న్యూస్ చూసి ఆలోచిద్దాం.పడుకో" అని ముసుగు కప్పేశాడు రంగ.
శ్రీహర్ష కూడ వెంటనే పడకేశాడు.
                                                                      * * * * *
తెల్లవారింది. సోమవారం. 
లేస్తూనే 'హిందూ' ఇంగ్లీష్ పేపరు పేజీలు తిప్పుతూ ఏమైనా డబ్బు పోగుట్టుకున్న లేక తెఫ్ట్ కేసులేమైనా రిపోర్ట్ అయ్యయాయని వెతికాదు శ్రీహర్ష .
టి.వి. న్యూస్ అంతా ఈ రోజు హైదరాబాద్ బంద్ గురించే దంచేస్తున్నాయి. సిటిబస్సు లేవీ తిరగవని 'ఆర్.టి.సి'. ఎం.డి. డిక్లేర్ చేశారు.
''రంగా! ఏవిటి ప్రోగ్రాం ? ఎలా ప్రొసీడ్ అవుదాం?" అడిగాడు శ్రీహర్ష. 
ఇవాళ హైదరాబాద్  బంద్. చూద్దాం! సిటీలో ఏమీ గొడవలు కాకుండా బస్సులు మామూలుగా తిరుగుతూ వుంటే ఆఫీసుకి వెళ్దాం!" అన్నాడు రంగ  
శ్రీహర్ష కాఫీ కలపడం పూర్తి అవుతుండగానే రంగా బ్రష్ చేసుకుని వచ్చాడు.
ఇద్దరు 'కాఫీ' సిప్ చేస్తూ ఈరోజు ఎలా ప్రొసీడ్ కావాలి అని నిర్ణయించుకున్నారు.
రంగా ముందుగా హౌస్ ఓనర్ ని కలిసి బ్యాంకు స్క్రోల్ నంబర్లు ఇచ్చి డబ్బు ఎవరు డ్రా చేశారో కనుక్కోవడం,  ప్రొఫెసరు గారింటి దగ్గర కాసేపు సర్వైలెన్స్ చేయడం, డబ్బు పోయిందని ఎవరైనా  ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశారామో పోలీస్ స్టేషన్ లో ఆరా  తీయడం, ఆపైన దొరికిన డబ్బు ఎవరిదీ 'కన్ఫర్మ్ డ్' గా తెలుస్తే ఇద్దరు వెళ్లి డబ్బు హ్యాండ్ ఓవర్ చేయడం! ప.
'రంగా' క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా హౌసు ఓనర్ ని కలిశాడు.
అయన వివరాలు కనుక్కుని చెపుతానని, బ్యాంకుస్క్రోల్ నంబరు, తీసుకున్నాడు. వెంటనే  ఆయన ''ఏ రోజు' స్క్రోల్ నంబరు ఇది?" అనడిగారు. 
"మొన్నది కావచ్చు సార్! నాకు ఇది చాలా అవసరమయిన ఇన్ఫర్మేషను. మీరు సాయం చేయాలి  సర్'' అన్నాడు రంగా  చనువునంతా ప్రదర్శించి  వివరాలు తెప్పిస్తానని  ఏస్యురెన్స్' తీసుకు వచ్చాడు రంగ.
ఇద్దరు తొమ్మిది గంటలకల్లా తెమిలి బయటపడి వీదిచివర బండి దగ్గర టిఫిన్ చేశాక 
''చెప్పు మొదలు ఎక్కడికి వెళదాం?"అన్నాడు రంగ బైక్ స్టార్ట్ చేసి.
''ఫెసరు సర్ ఇంటి వైపు'' అన్నాడు శ్రీహర్ష వచ్చీ రాని ఈలవేసే ప్రయత్నం చేస్తూ.
పావు గంటలో ప్రొఫెసరు గారిల్లు దాటి నిన్న వారు వెళ్ళిన కూరగాయల దుకాణం దగ్గర ఆగారు.
దుకాణం దారు లేడు..అతని భార్యలా ఉంది. ఏదో కూని రాగం తీస్తూ దుకాణంలో కూర్చుని ఉంది. "శకునం బావుందిరా" అని షాపు లోనికి వెళ్లి సంభాషణ మెదలెట్టాడు శ్రీహర్ష.
''ప్రొఫెసరు సారు ఇల్లు ఎక్కడమ్మా?" ఆమె ముఖ కవళికలను గమనిస్తూ మొదలెట్టాడు శ్రీహర్ష.
''మూడిళ్ళ పక్కన '' అంది ఆమె.
''మీరెవరు? కాలేజీ పిల్లలా? చదువు చెప్పించుకోనికి వచ్చింరా'?" అమాయకంగా అడిగింది ఆమె.
''అవును సారుని కలవాలి"అన్నాడు హర్ష 
"ఇప్పుడు ఎల్లకండి బాబూ...సారింట్లో పెద్ద కష్టం వచ్చింది. సారు అన్న కొడుకువి పది లచ్చల రూపాయలు  పొయినయంట. అమెరికా నుంచి వాళ్ళ అన్న పంపింనాడంట.ఎవరో దొంగ ముండాకొడుకులు ఆ బాబు ఆటోలో వస్తుంటే  ఆ బాబుకి మత్తుమందిచ్చి, కట్టేసి డబ్బు అంతా కొట్టేసినారంట. పోలీసు కేసయిందంట. ఆబాబు, వాళ్ళ నాయన  అందరు ఇక్కడే ఉన్నారు.
మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళకండయ్య. బాగుండదు'' అని బాధపడుతూ చెప్పింది.
''అయ్యో పాపం అంత డబ్బు పోయిందా? ...ఇంకా దొరకలేదా?" ఆమె బాధను పంచుకుంటున్నట్లుగా అన్నాడు శ్రీహర్ష.
''లేదు బాబూ ! పోలీసు వాళ్ళ చేతులో పనిగంద. ఎప్పటికైనా  దొరుకుద్దో. దొరకదో...పాపం మంచి మనుసులు ఆల్లంతా. ఆల్లకి రావలసిన కష్టం కాదు" అంది దుకాణం ఆవిడ.
ఇంతలో దూరంగా నిలబడి ఉన్న 'రంగ' ప్రొఫెసరు గారి ఇంటి వంక చూస్తూ బైక్ స్టార్ట్ చేసి త్వరగా రమ్మన్నట్లుగా సైగ చేయడంతో నేను సంభాషణ ఆపి వెంటనే వెళ్లి బైక్ ఎక్కాను.
రంగా బైక్ ప్రొఫెసరు గారి ఇంట్లో నుంచి బయలుదేరిన బైక్ ఫాలో అవుతున్నాడు. 
నేను వెనకాల కూర్చుని గమనించాను. ఆ బైక్ మీద వెళ్తోంది ప్రొఫెసరు గారి అబ్బాయి. 
అయిదు  నిముషాల్లో సిఖ్ విలేజి 'లాంబ' సినిమా హాలు దగ్గర ఇరాని హోటల్ దగ్గర ఆగి బైక్ పార్క్ చేసి అటు ఇటు చూశాడు. పాను దుకాణం దగ్గర ఉన్నఇద్దరు మనుషులు...పాను నముల్తూ, సిగరెట్ కాలుస్తూ వచ్చి ప్రొఫెసరు గారబ్బాయిదగ్గరకి వచ్చారు. 
''ఏం  బె! నకరాలు పోతున్నవ్ .. పైసల్ ఏమనయి?" కోపంగా ఇద్దరిలో ఒకడు అతని మీదకు వస్తూ ..
''అన్నానిజం అన్నా!పైసల్ సంగతి నాకు తెలియదు.పైసలున్న బ్యాగుని ఆకొట్లాటలో,
ఎవడో లాక్కున్నడు. బ్యాగు చీకట్లో రైల్ 'బ్రిడ్జి' కింద పడి పోయింది. అప్పుడే పోలీసు వాన్ ఆగింది..
కరెంట్ లేదు. పోలీసు వాళ్ళుచాల మంది వచ్చారు. అందుకే అక్కడ నుంచి పారి పోయి,.
తరువాత వచ్చి  బ్యాగు కోసం అంతా  వెతికినా దొరకలేదు.ఏమి చెయ్యాలో తెలీక పరేషాన్ లో వున్నా. మా అన్న పైసలవి. వాడికి దక్కలే. నాకు దక్కలే..మొత్తం పది లక్షలన్నా.
మా అన్న 'చిలకలగూడ పి.ఎస్.లో కంప్లైంట్  చేశాడు. మా ఫ్యామిలీ అంతా పరేషాన్ లో ఉన్నాం. పోలీసు ఎస్.ఐ కూడా నన్ను. డౌట్ చేస్తున్నట్లు మాట్లాడిండు. నన్నుపరేషాన్ చెయ్యకండి.
నన్ను వదిలేయండి.  మీకు ముందే చెప్పిన అన్నకు ఏమీ కాగూడదని. ఆయన్ని కొట్టి, కారులో కట్టి పడేసినారంట'' అన్నాడు బతిమిలాడుతూ వాడి చేతులు పట్టుకుని.
''మేమేమన్నా పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నామా? రేపు ఉదయం కల్లా సగం పైసల్ తెచ్చి ఇవ్వక పోయినవా కొడకా! మీనాయనకు పోలీసులకు ఈ దొంగతనమంతా నీ ప్లాన్ అని తెలిసి పోతది. 
జైలు కి పోతావు  బిడ్డా!"' అని అతన్ని వెనక్కు నెట్టేసి క్షణంలో బైక్ మీద వెళ్ళిపోయారు ఆ ఇద్దరూ. 
పక్కనే వున్నా ఫ్లైఓవర్  పిల్లర్ వెనక నిలబడి వారి సంభాషణ  వింటున్న 'శ్రీహర్ష' వారి  బైక్ నంబరు నోట్ చేసుకోవడం ఎవరు గమనించలేదు.
వారంటూ వెళుతూనే ప్రొఫెసరు గారి అబ్బాయి 'పాన్ ' షాప్ దగ్గరికి వెళ్లి సిగరెట్ తీసుకుని స్మోక్ చేస్తూ ఎవరికో ఫోను చేసి  రెస్పాన్స్ కోసం ఎదురు చూడ సాగాడు.
రంగా ఎక్కడున్నాడా అని అటు ఇటు చూశాడు శ్రీహర్ష. పాన్ షాప్ వెనక నుంచి వస్తూ మొబైల్ లోకి తదేకంగా చూస్తూ శ్రీహర్షని రమ్మని చేత్తో సైగ చేస్తూ పిలిచాడు రంగ.
''అంతా రికార్డ్ చేశా. మాటలు వినబడడం లేదు కాని పిక్చర్ బాగా వచ్చింది చూడు''
అని తన మొబైల్ 'శ్రీహర్ష' చేతికిచ్చాడు.'
''ష్..ష్  మెల్లగా మాట్లాడు" అంటూ మొబైల్ లో వీడియో క్లిప్ చూస్తూ ''ఎక్సలెంట్' వీడియో అండ్ ఎవిడేన్స్'' అన్నాడు శ్రీహర్ష.
"నువ్వు ఇక్క్దడే వుండు" అంటూ ప్రొఫెసర్ గారి అబ్బాయి దగ్గరగా వెళ్ళాడు శ్రీహర్ష.
'శ్రీహర్ష' ని గమనించి అతను ఇంకా కొద్దిగా దూరంగా వెళ్లాడతను.
అతన్ని ఫాలో అవుదామని నిర్ణయించుకుని దూరంగా బైక్ మీద వెయిట్ చేశారు. .
పది నిముషాలాగాక ప్రొఫె సర్  గారబ్బాయి  బయలుదేరడం గమనించి, అతనికి అనుమానం రాకుండా అతన్ని ఫాలో అయ్యారు.  అతను ఇంటివైపే వెళ్ళడం గమనించి వీళ్ళు సికింద్రాబాదు వైపు కదిలారు.
                                                                * * * * *
మధ్యాహ్నం రెండు గంటలు అవుతోంది. చిలకలగూడ పోలీసు స్టేషను.
ఇన్స్పెక్టర్ రంగనాథ్ ఏవో రిపోర్ట్స్ చూస్తున్నాడు. ఇంతలో టేబుల్ మీద ఫోను మ్రోగింది.
''హలో సబ్  ఇన్స్పెక్టర్ రంగనాథ్..చిలకలగూడ...స్పీకింగ్ !'' అన్నాడు రంగనాథ్.
''సర్! మీకు ఒక ఇన్ఫర్మేషను. నిన్న మీదగ్గర రిజిస్టరు అయిన పది లక్షల రూపాయల
దొంగతనం కేసుకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను ఉన్న ఒక కవరు మీ మోటర్ బైక్ పక్కనే వుంది. చూడండి" 
"హలో మీరెవరు...మీ...." మాట పూర్తి చేయకముందే ఫోను డిస్కనెక్ట్ అయింది.
రంగనాథ్ వెంటనే స్టేషను బయటకు వచ్చి  తన బుల్లెట్  బైక్  పక్కనే పడి ఉన్న ఒక పొడుగాటి ఎన్వలప్  తీసుకుని లోనికి వెళ్లి తన సీట్లో సెటిల్ అయ్యాడు. కవరుని టేబుల్ లైట్ వెలుతురులో 
జాగ్రత్తగా చూసి కవరులో ఏదో పేపరు, ఫోటోలు ఉన్నట్లుగా గుర్తించాడు. వెంటనే కవరు తెరిచి చూశాడు. కవరులో  ఇన్ స్పెకరుని వుద్దేసించి వ్రాసిన లెటరు ఒకటి, రెండు ఫోటోలుఉన్నాయి. ఫొటోలో ఉన్నవ్యక్తులు, ఎక్కడో చూసిన ముఖాల్లా ఉండడంతో పరుశురాంని పిలిచి ఫోటోలు    చూడమని తను కవరులో ఉన్న లెటరు చదవడం మొదలెట్టాడు రంగనాథ్.
ఫోటోలు చూస్తూనే "సార్!'.... అని ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడైన పరుశురాం, ఇన్స్పెక్టర్ లెటర్ చదవడం గమనించి ఫోటోలు చేతిలో పట్టుకుని ఆయన లెటర్ చదవడం పూర్తి అయ్యేవరకు చూసి "సార్! ఈ ఫోటోలో ఉన్నది  ప్రొఫెసరు గారి కొడుకు. రెండో ఫోటోలో ఉన్న ఇద్దరు  మన స్టేషన్  రికార్డులో ఉన్న రౌడి షీటర్ లు'' అని పరశురాం చెప్పాడు. 
వెంటనే ఒక  'టీం' ని ఆ ఇద్దరు రౌడి షీటర్ లను తీసుకురమ్మని పంపి, తను పరశురాంతో ప్రొఫెసరు ఇంటికి చేరారు.
ఇన్ స్పెక్టర్ రంగనాథ్ కి తెలీదు వారి జీప్ వెనుక మోటర్ బైక్ ఫాలో అవుతోందని.
పరశురాంని జీప్ లోనే ఉండమని 'రంగనాథ్'  ప్రొఫెసర్  ఇంటి లోనికి వెళ్ళాడు. 
బయట తలుపు తీసే ఉంది. రంగనాథ్ బయట గుమ్మం దగ్గరున్న కాలింగ్ బెల్  కొట్టిన పది సెకండ్ల లోనే ప్రొఫెసరుగారి అబ్బాయి బయటకు వచ్చి ఇన్ స్పెక్టర్ ని చూసి కంగారు పడడం అతని ముఖకవళికలలో స్పష్టంగా గమనించాడు రంగనాథ్. 
''సార్! డబ్బు దొరికిందా ?" చాలా ఆత్రంగా అడిగాడతను కంగారుని కప్పి పుచ్చుకుంటు.
''దొరుకుతుంది.ఎక్కడికి పోతుంది? డబ్బు కొట్టేయాలని ఎవరు ప్లాన్ చేశారో మాకు తెలిసింది  ఆవిషయం మాట్లాడడానికే వచ్చాను.
''నాన్నగారు, మీ అన్న చంద్రకుమార్, ఇంట్లో ఉన్నారా?" అనడిగాడు రంగనాథ్  అతని కళ్ళలోనికి సూటిగా చూస్తూ.
''ఉన్నారు సార్! రండి " అంటూ "డాడీ! ఇన్ స్పెక్టర్ గారు వచ్చారు"అని సోఫా చూపిస్తూ "కూర్చోండి" అని చెప్పి లోనికి వెళ్లి మంచినీళ్ళు ఇచ్చి పక్కగా నిలబడ్డాడు.
ఇంతలో ప్రొఫెసరు గారు, చంద్రకుమార్ చేతికి చిన్నబేండేజితో బయటకు వచ్చారు.
హాల్లోకి వస్తూనే ''గుడ్ మార్నింగ్' ఇన్ స్పెక్టర్" ఇంత త్వరగా మళ్ళీ వచ్చారు. ఏమిటి విశేషం"  సాలోచనగా ఇన్ స్పెక్టర్ మొహంలోకి చూస్తూ అన్నారు ప్రొఫెసర్ .
''ఈ కేసులో ఊహించని పరిణామం ఒకటి మా దృష్టికి వచ్చింది సర్!..కొన్ని సాక్ష్యాధారాలు కూడా  దొరికాయి. అనుమానితుల ఫోటోలు కూడా దొరికాయి..." 
"చంద్రకుమార్ గారు! ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులని గుర్తించగలరేమో నని అనుమానితుల ఫోటోలు తీసుకుని వచ్చాను.చూడండి"అంటూ చంద్రకుమార్ చేతికి ఫోటో ఒక్కటి ఇచ్చాడు రంగనాథ్.
ఫోటో చూసిన మరుక్షణం ఎస్...వీళ్ళిద్దరూ ఆ దొంగలే. రన్నింగ్ ఆటోలో ఎక్కి నాముఖాన్ని గుడ్డతో నొక్కి మత్తు మందు ఇచ్చింది వీళ్ళిద్దరే" అన్నాడు ఆవేశంగా చంద్ర కుమార్.
వెంటనే రెండో ఫోటో అతని చేతికి ఇచ్చాడు రంగనాథ్. 
తమ్ముడి వాళ్ళతో కలిసి ఫొటోలో వుండడం చూసి సంగతి అర్ధం అయి పోలీసు ఇన్ స్పెక్టర్ ఎందుకు వచ్చాడో అర్ధమయి, మాట్లాడడం ఆపు చేసి, ఫోటో తిరిగి ఇన్ స్పెక్టర్ కి తిరిగి ఇస్తుండగా "ఆ ఫోటో మీ బాబాయి గారికివ్వండి!'' అన్నాడు రంగనాథ్.
చంద్రకుమార్ ఆ ఫోటో పట్టుకుని బాబాయికి ఇవ్వకుండా అలానే నిశ్చేష్టుడై రాయిలా ఉలుకు పలుకు లేక ఆలోచిస్తూ, పరధ్యాన్నంగా నిలబడిపోయాడు.
అమెరికానుంచి అన్నడబ్బు పంపిన సంగతి చెప్పి ఆరోజు డబ్బు తీసుకువద్దామని, ఐ ఫోను కొందామని తమ్ముడు 'చరణ్' ని తనతో రమ్మని అడగడం, 'అర్జెంట్ పనిఉంది' రాలేనని చరణ్  చెప్పిన సంగతి గుర్తుకి వచ్చి, సినిమా దృశ్యంలా తన కళ్ళ ముందు కదలాడింది. 
తమ్ముడు కూడా ఆ దొంగల గ్యాంగ్ లో ఉన్నాడన్న సంగతి అర్ధమైంది. ఆస్థితిలో బాబాయి తో ఎలా స్పందించాలో తెలీక చిత్తరువులా అయిపోయాడు.
వెంటనే "ఇన్స్పెక్టర్  గారూ! నేను కంప్లైంట్  వెనక్కి తీసుకుంటున్నాను" అన్నాడు చంద్రకాంత్. 
''ఏమిట్రా! ఏమయింది?  కంప్లైంట్  విత్డ్రా చేసుకోవడమేమిటి ? ఎందుకలా మాట్లాడుతున్నావు. 
ఆ ఫోటో ఇలా ఇవ్వు'' అని ప్రొఫెసరుగారు చేయిజాపారు.
''లేదు బాబాయ్! కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారికి లెటర్ వ్రాసి ఇస్తాను" అంటూ ఆందోళనగా "ఇన్ స్పెక్టర్ గారూ ఇందులో ఏదో పొరపాటు అయినట్టుగా ఉంది.ఈ ఫోటో బాబాయి గారు చూసి ఏంచేస్తారు? అనవసరమైన ఆందోళన తప్ప" అంటూ ఫోటోని తిరిగి ఇన్ స్పెక్టర్ కి ఇచ్చాడు చంద్రకుమార్.
''సర్! మీరు చూడండి వీటిని..." అంటూ రెండు ఫోటోలని, ఆ లెటరుని ప్రొఫెసరు గారికి ఇచ్చాడు ఇన్స్పెక్టర్. 
ప్రొఫెసర్  కళ్ళజోడు సవరించుకుని రెండు ఫోటోలని చూసి, లెటర్ చదివి
సైలెంట్ గా తిరిగి వాటిని  ఇన్ స్పెక్టర్ చేతికి ఇచ్చి "చంద్రా! కంప్లైంట్  విత్డ్రా చేసుకోవద్దు. 
నీ డబ్బు తిరిగి నీ చేతికి రావాలి" అంటూ ఇన్స్పెక్టర్ ని ఉద్దేశించి  "ఇన్స్పెక్టర్! యు ప్లీజ్ ప్రొసీడ్ అహెడ్ ..." అంటూ లోనికి వెళ్లారు. 
ఇన్ స్పెక్టర్ లేచి చరణ్  భుజం మీద చేయివేసి "మీతో కొద్దిగా మాట్లాడాలి" అంటూ తనని తీసుకుని బయటకు వెళ్తూ ''చంద్ర కుమార్  గారూ! మీరు ఒకసారి స్టేషనుకి రావాలి. ఫోటోలో ఉన్న ఇద్దరిని గుర్తించాలి" అంటూ 'చరణ్' ని స్టేషనుకి తీసుకుని వెళ్ళారు.

                                                                      * * * * *
పోలీసు ఇన్ స్పెక్టర్ 'చరణ్' ని తీసుకుని వెళ్ళిన వెంటనే  శ్రీహర్ష, రంగ  ఇద్దరు  ప్రొఫెసరు గారింటికి వచ్చారు. 
రంగ బయట కాలింగ్ బెల్ కొట్టాడు. చంద్రకుమార్  వచ్చి తలుపు తీసి ''ఎవరు కావాలండీ?" అని అడిగాడు.
''మీతోనే పని ఉండి వచ్చామండీ'' అన్నాడు శ్రీహర్ష.
''నాతోనా ? మీరెవరో నాకు తెలీదే  నాతో మీకు పనేమిటి?" కంగారుగా అడిగాడు చంద్రకుమార్.
''కంగారు పడకండి. మేము మీకు అపరిచితులమైనా స్నేహితులం. మీతోనే కాదు.
ప్రొఫెసరు గారితో కూడా పనిఉందండీ. మేం మాట్లాడే విషయం వారి ముందే మాట్లాడాలి. 
చాలా ముఖ్యమైన విషయమండీ" అన్నాడు వినయంగా రంగ. .
''ఒక్క నిముషం. బాబాయి గారితో మాట్లాడి వస్తాను'' అని లోనికి వెళ్ళాడు చంద్రకుమార్. .
"బాబాయ్! మిమ్ముల్ని, నన్ను కలవాలని ఎవరో  తెలియని వ్యక్తులిద్దరు వచ్చారు" అని తలుపు తట్టాడు చంద్రకుమార్.  
"ఇప్పుడెవ్వరి ని కలవను. రెండురోజులు తరువాత రమ్మని చెప్పు" అని చెప్పి తలుపు తీయలేదు.
చంద్రకుమార్  బయటకు వచ్చి "బాబాయి గారి ఒంట్లో బాలేదు. రెండు రోజుల తరువాత రమ్మన్నారు. నాతో పని ఏమిటి?"  చెప్పండి అన్నాడు చంద్రకుమార్. 
''మీరు పోగుట్టుకున్న డబ్బు గురించి మాట్లాడాలి. లోనికి రావచ్చా?" అన్నాడు శ్రీహర్ష.
వారిని లోపలకి రమ్మని డ్రాయింగ్ రూం లో సోఫాలో కూర్చోమని లోపలకి వెళ్లి ''బాబాయ్!  మీరు త్వరగా రావాలి. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు,  పోయిన డబ్బు గురించి మాట్లాడడానికి వచ్చారు. 
మీరు త్వరగా బయటకు రావాలి" అంటూ తలుపు గట్టిగా కొట్టాడు చంద్రకుమార్.. 
ప్రొఫెసరు గారు  బయటకు వచ్చి "ఎవర్రా వాళ్ళు? ఎక్కడ?" అంటూ  చంద్రకుమార్ వెంట ఆయన కూడా కంగారుగా డ్రాయింగ్ రూం లోకి వచ్చి "మీరెవరు, మీకు పోయిన డబ్బుతో సంబంధం ఏమిటి?" వరుసగా ప్రశ్నలు వేసి " మీరు మాట్లాడేముందు పోలీసు ఇన్ స్పెక్టర్ ని కూడా పిలవడం మంచిది కదా!" అన్నారు. 
వెంటనే శ్రీహర్ష  షర్టు లోపల దాచిన డబ్బు జిప్ బ్యాగు తీసి "ఈ బ్యాగును గుర్తించగలరా?" అని అడిగాడు చంద్రకుమార్  ని. . .
చంద్రకుమార్ ఒక్క గెంతు తో శ్రీహర్ష దగ్గరికి వచ్చి ''ఈ బ్యాగు నాదే. ఆటోలో వస్తుంటే ఈ కేష్  బ్యాగుని  దొంగలు కొట్టేశారు'' అన్నాడు ఆత్రంగా.
''మీరు ఏమనుకోకపోతే ఈ బ్యాగులో ఉన్నఎంత డబ్బువుంది? ఇంకా ఏమి ఉన్నాయి చెప్పగలరా?" అనడిగాడు శ్రీహర్ష. 
''మొత్తం తొమ్మిది లక్షల అరవై వేలరూపాయలు తార్నాక స్టేటు బ్యాంకులో డ్రా చేశాను. బ్యాగులో  ఒక 'ఐ' ఫోను' ఉండాలి. పోలీసు కంప్లైంట్ లోనూ ఇదే  వ్రాశాను" అన్నాడు చంద్రకుమార్. 
ప్రొఫెసరు గారికి ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. అంతా మాయగా, ఏదో మేజిక్  షో' చూస్తున్న అనుభూతితో కన్నార్పకుండా వాళ్ళ వంక చంద్రకుమార్  'ట్రాన్స్' లో ఉన్నట్లు చూస్తూ ఉండి పోయారు.
శ్రీహర్ష బ్యాగు జిప్ తీసి "చంద్రకుమార్ గారు! చూసుకోండి మీ డబ్బు, వస్తువులు అన్నీ సరిగ్గా  ఉన్నాయా చెక్ చేసుకోండి" అని బ్యాగ్ చంద్రకుమార్ చేతికి ఇచ్చాడు. 
చంద్రకుమార్ బ్యాగులో ఉన్న డబ్బు కట్టలన్నీ గ్లాస్ టేబుల్ మీద బోర్లించి, లెక్క చూసి 
''మై గాడ్' డబ్బు అంతా ఎలా బాగ్ లో పెట్టానో అలాగే ఉంది.  ఐ ఫోను కూడా ఉంది. 
నోట మాట రావడం లేదు"  మీ ఇద్దరికి ఎలా థాం క్స్  చెప్పాలో అర్ధంకావడం లేదు" అంటూ 
వారికి నమస్కారం చేసి, చేతులు ముఖం మీద కప్పుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.
''బాబాయ్! పోయిన డబ్బుఅంతా దొరికింది. వీళ్ళేవరో మనుషులు కారు. దేవుళ్ళు'' ఇంకా ఏదో నోట్లోనే గొణుక్కుంటూ పదే పదే  రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ పట్టరాని సంతోషంతో  అతని కళ్ల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. 
చంద్రకుమార్ , ప్రొఫెసర్  రంగ, శ్రీహర్ష  ని కూర్చోమని చెప్పి  ఇద్దరు  ఇంటి సభ్యులతో ఈ విషయం చెప్పడానికి లోనికి వెళ్ళాడు.
రెండు, మూడు నిముషాల తరువాత ఇంటిల్లపాది తిరిగి డ్రాయింగ్  డ్రాయింగు  రూం లోకి వచ్చేసరికి రూమ్ లో ఎవరు కనిపించలేదు. గేటు బయటకు వచ్చి చూసినా  వారికి ఎవరు కనిపించలేదు.
                                                            ---------xXx----------

                             
రచన:
కేశిరాజు వెంకట  వరదయ్య.
Mobile No. 9849118254

 


18, జులై 2025, శుక్రవారం

                                                          

                                                                   ప్రణవ రాగం 
                                                                 ---------------------
( సెప్టెంబర్ ఎనిమదివ తేదీ, 2023  - 'సహరి' అంతర్జాల వారపత్రిక, సరస కథల పోటీలో బహుమతి పొందిన కథ) 
    
న్యూఢిల్లీ - డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రూర్కీస్టేషన్ లో ఆగి బయలుదేరింది. 
ఫస్ట్ క్లాస్ ఎ.సి బోగీ డోర్ నానుకుని నిలబడి బయటకు చూస్తోంది 'లయ'. ముఖం మీదకు జారి  ఎగురుతున్న ముంగురులను ఒకచేత్తో సర్దుకుంటూ, దూరంగా నీరెండలో రంగులు మారుతూ, 
ముగ్ధమనోహరంగా కన్పిస్తున్నపర్వతాలను చూస్తున్నఆమె మనసు పురివిప్పిన నెమలిలా   నాట్యమాడుతోంది. కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు దాటుతూ రైలు ముందుకు పరుగెడుతుంటే ప్రకృతి కనువిందు చేస్తోంది. 
"డోర్ క్లోజ్ చేయాలి లోనికెళ్ళండి మేడం" అన్నాడు ట్రైన్ అటెండెంట్.
కూపే లోనికి వచ్చి ఒంగి సీట్ కింద ఉంచిన బ్యాగ్  పాకెట్ లోంచి పుస్తకాన్నితీసుకుంటున్న భార్య లయను పరికించి చూశాడు ప్రణవ్. నలుపు రంగు పైజామా, గులాబి రంగు కుర్తా, నలుపు, బంగారు రంగు పల్లూ వేసుకుంది. ఆమె తల, భుజాల కదలికతో  నాట్యమాడుతున్నట్లుగా కదులుతున్న నల్లని ఒత్తైన వంకీలు తిరిగిన జుట్టు,స్టెప్ కట్ సిల్కీ టచ్ తో పాయలుగా చీలి వీపుపైనుంచి జారి సన్నని పరదాలా వ్రేలాడుతూ రెచ్చగొడుతున్న ఆమె అందాలను మసకలో చూసి తీయని అనుభూతి చెందాడతను.    
'కొద్దిగా ఒళ్ళు చేసి బాపూ బొమ్మలా ఉంది' ఆమె మేని సౌందర్యానికి ముగ్ధుడయి ఆమె మేని నుంచి కళ్ళు తిప్పుకోలేక  పోయాడు ప్రణవ్. 
బుక్ తీసుకుని, సీట్లో వెనక్కానుకుని కూర్చుని బుక్ మార్కర్ ఉన్నపేజీ తీసి చదవడం మొదలెడుతూ పుస్తకం అంచులనుంచి భర్త తనవంకే చూడడం గమనించింది లయ.  
అతనామె మేనుని అణువణువుని పరికించి చూస్తున్నట్లనిపించిందామెకు. చురుగ్గా తలెత్తి సూటిగా చూసింది భర్తను. అతను చూపులు మరల్చలేదు. రెప్పలార్చకుండా తనివిగా చూస్తూనే ఉన్నాడామెను. అతని సూదంటు చూపులు మరింతగా మీదకు చొచ్చుకువచ్చి ఆసాంతం ఆమె మేనిని వేళ్ళతో తడుతున్నట్లనిపించిందామెకు. 
స్త్రీ సహజమైన సిగ్గుతో క్షణంపాటు తొట్రుపడిందామె. సర్దుకుని కూర్చుని ముందుకు ఒంగి అతని మొహంలోకి సూటిగా చూస్తూ రెండు చిటెకలు వేసింది లయ. కళ్ళు విప్పార్చి కూల్ గా వెనక్కి జరిగి కూర్చున్నాడు. అతని పెదవులపై ఓ కొంటె చిరునవ్వొకటి రెండు సెకన్లపాటు అతని ముఖంలో రేఖామాత్రం కన్పించి మాయమైంది. 
లయ చదువుతున్న 'పెర్రీ మేసన్' మిస్టరీ థ్రిల్లర్ పుస్తకాన్ని పక్కనుంచి, స్టాండ్ కున్న వాటర్ బాటిల్ అందుకుని గట గటా సగం బాటిల్ నీళ్లు తాగి కూర్చుని, తనూ కళ్ళు విప్పార్చి పరీక్షగా చూసింది భర్తని.  
ఆరడుగుల బలిష్టమైన విగ్రహం పసిమి ఛాయ, కోల ముఖం, చిన్నినోరు,  క్లీన్ షేవెన్, వెడల్పాటి నుదురు, చురుకైన కళ్ళు, మళ్ళీ చూడాలనిపించే ఆకర్షణీయమైన విగ్రహం.  
అతను చూపులు మరల్చలేదు. వారి చూపులు ఢీకొన్నాయి. అతను తల ఎగరేశాడు చిలిపిగా ఏమిటన్నట్లు. 
                                                                    * * * * *                                                                           
నెలక్రితమైన వారి పెళ్ళిలో లయ ముక్తసరిగా మాట్లాడడం ప్రణవ్ కి గుర్తుంది. తల్లి అనారోగ్యంగా ఉందని ...పెళ్లయ్యాక తనతోనే ఉంటుందని, తనని ఒంటరిగా వదిలిరానన్నఆమె ప్రస్తావన, వెలిబుచ్చిన ఆందోళన కూడా గుర్తుంది. 
"హలో! ఏమిటా చూపు ?" తెచ్చిపెట్టుకున్నదర్పం ప్రదర్శించింది లయ. 
"ఇదే ప్రశ్న మిమ్ముల్నడుగుదామని ఇందాకట్నుంచి ప్రయత్నిస్తున్నాను" అన్నాడతను నిబ్బరంగా.  
"నేను మీవైపు చూశానా!?" ఆశ్చర్యంగా అంది లయ. 
"కాదనగలరా ?"
"యెస్ ... " 
"నా భార్యను నేను చూడకూడదా !? "
"ఇక చాలు! '' అన్నట్లు చేయి అడ్డంగా పెట్టి, బుక్ ముఖానికి అడ్డుగా పెట్టుకుంది లయ. 
"మీరేగా అడిగారు. మీ కాసక్తి లేదంటే ... ఇట్స్ ఒకే"
"...ఆసక్తేమిటి ?'' ప్రశ్నించింది లయ.  
"అదే...!" నీళ్లు నమిలాడు ప్రణవ్. 
ఆ  నిగూఢ పలుకుల సంకేతమేమిటో అర్ధమయ్యాక సిగ్గుతో పుస్తకం మొహానికి అడ్డుపెట్టుకుంది లయ, పుస్తకం అంచులనుంచి అతన్ని ఓరగా చూస్తూ. భర్తతో సంభాషణ మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తోంది ఆమెకు. కానీ బెట్టు చేస్తోంది మనసు.    
మళ్ళీ ఒక చిరునవ్వకటి రువ్వి, రయ్యిన లేచి అమాంతంగా లయ మీదుగా ఒంగాడు.  
అతను మీదకు వస్తున్నట్లుగా అనుభూతితో ఆమె గుండె శబ్దం లయ తప్పింది.  
సీట్ క్రింద నుంచి బ్యాగ్ లాగి సైడ్ పాకెట్ నుంచి బుక్ తీసి కూర్చుని  
"సారీ...'' అని బెర్త్ మీదకు జారి పడుకుని పుస్తకం మొహం దూర్చాడు ప్రణవ్ .  
'గాడ్! ఏమైంది నాకు. ఎందుకీ తత్తరబాటు' అనుకుంది లయ. 
ఆమె గుండె చప్పుడింకా లయకు రాలేదు. మనసు కోతిలా అనియంత్రంగా గెంతులేస్తోంది. 
అతని ప్రవర్తన కవ్వింపా లేక కాకతాళీయమా? అర్ధం కాలేదు లయకు.     
అతను చదువుతున్న పుస్తకమేమిటో చూడాలని ఉత్సుకత పెరిగి ఒంగి ఒదిగి పుస్తకం వంక చూసింది. 
జేన్ ఆస్టేన్ వ్రాసిన  'ప్రైడ్ అండ్ ప్రిజుడిస్' ... లయ కెంతో ఇష్టమయిన ఇంగ్లీష్ నవల. తను చదువుకునే రోజుల్లో ఆ నవల్లో నాయిక ఎలిజిబెత్ తో తనని పోల్చుకునేది. ఆమెలా ప్రవర్తించేది. ఆక్షణంలో ప్రణవ్ నవల్లో ప్రణయ కధానాయకుడు 'డార్సీ'లా అనిపించాడు. 
'... నా భార్యను నేను చూడకూడదా?' అతని మాటలామెను మురిపిస్తున్నాయి, మైమరిపిస్తున్నాయి. మనసుని గిలిగింతలు పెడ్తున్నాయి. ఒళ్ళంతా మత్తుగా, తీయని బాధ. అతని చేరువని కోరుకుంటోంది. ఆమెకు చెల్లెలు శ్రియ కబుర్లు గుర్తుకు వచ్చాయి. 
శ్రియకు ముందు పెళ్లయింది. పెళ్లయ్యాక నాలుగు రోజులపాటు భర్తతో పుట్టింట ఉంది. వారి స్వీట్ నథింగ్స్ నాన్ స్టాప్ గా చెప్పి విసిగించేది. అప్పట్లో లయకు ఆ మాటలు అప్పుడు రుచించేవి కాదు. 
శ్రియ స్విట్జర్లాండ్ వెళుతూ ఎయిర్ పోర్ట్ లో బై జెప్పి కన్నుగీటి చెవిలో రహస్యంగా చెప్పింది. 
''లయా! ప్రణవ్ ని పెళ్లి చేసుకుకుని హనీమూన్ కి స్విట్జర్లాండ్ వచ్చెయ్. దేవుడు వరంలా ఇచ్చిన మనిషిని కాదనకు. డోంట్ వేస్ట్ టైం'' శ్రియ మాటలు మళ్ళీ మళ్ళీ తలపుకు వస్తున్నాయి. 
ఇప్పుడా మాటలు లయకు తేనె మూటలా, తీయటి పలుకుల్లా గుర్తుకొస్తున్నాయి. తలుచుకున్నకొద్దీ, కొలనులో నీటి ఊటలా ఊరుతూ మదిని మథనం చేస్తున్నాయి. మనసు దూదిపింజంలా విహరిస్తోంది. ఒళ్లు గాలిలో తేలుతున్నట్లనిపిస్తోంది. మనసు వయసు తమకాన్ని తెలియజేయమని తీర్పు చెపుతోంది. ఊహల కుహరం నుంచి ఉఛ్వాస నిశ్వాసాలు భారమవుతున్నాయి. నిట్టూర్పుల పర్వంలో మదిన మదన ప్రేరిత పరువాల పరుపులు పరుచుకుంటున్నాయి. భర్తని మళ్ళీ క్రీగంట చూసింది లయ. అతనామెను చూడడం లేదు. 
అతనేమైనా మాట్లాడుతాడేమోనని ఆశగా చూసింది.   
'పుట్టిన్నాటినుంచి ఒక్కరోజైన కలిసి జీవించని ఒక పరాయి మనిషి సన్నిధితో ఇంత తన్మయత్వమా !?' 
చేతిలో ఉన్న నవలా పఠనం మీద ఏకాగ్రత కోల్పోయి పుస్తకం అంచుల్నుంచి తదేకంగా అతన్ని తమకంగా చూస్తూ 'ఎన్నడూ లేనిది ఏవిఁటీ బలహీనత. ఏమిటీ మధుర భావన. ప్రేమ, ఆరాధన అంటే ఇదేనేమో' అనుకున్నదామె. లేచి వాటర్ బాటిల్ తీసి చూసింది. నీళ్లు కొద్దిగా ఉన్నాయి. 
"నా బాటిల్ తీసుకోండి అభ్యంతరం లేకుంటే" అన్నాడతను చదువుతున్నపుస్తకంలో నుంచి తలెత్తకుండా, దృష్టి మరల్చకుండా. అతని కేరింగ్ కి ముగ్ధురాల యింది. బాటిల్ అందుకుని నీళ్లు తాగింది. వాచ్ చూసుకుంది. ఇంకా గంట ప్రయాణం ఉంది. తోచడంలేదు. చదవబుద్ధి కావడంలేదు. 
ప్రణవ్ తో  ఏదైనా మాట్లాడాలనిపిస్తోంది. మనసుపొరల్లో గూడుకట్టుకున్నక్రితపు అనాసక్తి గుట్టుగా గట్టుదాటుతోంది. సంభాషణ ఎలా ప్రారంభించాలో అర్థంకావడం లేదు. ఆమె మనసులో మాట 
విన్నట్లుగా ప్రణవ్ లేచి కూర్చుని బుక్ ని పక్కన ఉంచాడు. 
"బోర్ గా ఉందా లేక ఆకలేస్తుందా? లేక రెండునా... శాండ్విచ్ తినండి" అనునయంగా అంటూనే  బ్యాగ్ లోనుంచి ఆల్ల్యూమినమ్ రేప్డ్ పొట్లం తీసిచ్ఛాడామెకు. 
విస్మయంగా మనసులో మాటని ఇట్టే పట్టేసిన అతన్ని చూస్తూ "షల్ వుయ్ షేర్ ?" చిన్నపిల్లలా అంది లయ సంతోషంగా.  
"ఆర్ యు షూర్ ?" అన్నాడు ప్రణవ్ 
"యా!" అందామె.
''ఎవ్విరిథింగ్...?'' వినీ వినబడనట్టుగానే గొణిగాడతను. 
తనూ అతని మాటలను వినీ, విననట్టుగానే శాండ్విచ్  రేపర్  తీయడంలో నిమగ్నమయింది లయ. ఒక శాండ్విచ్ తీసుకుని, ప్యాక్  ప్రణవ్ కి ఇచ్చింది. అతను పుస్తకంలో ముఖం దూర్చాడు. 
థాంక్స్ చెప్పిబ్రెడ్ స్లైస్ తిని ముఖానికి నవల అడ్డుపెట్టుకుని గతంలోకి జారింది లయ.   
                                                         * *        * *        * * 
"ప్రణవ్ ఢిల్లీలోనే ఉంటాడు. మనకు దూరబ్బంధువు. నీకు తెలుసుకదా! తండ్రితో మనింటికి వచ్చాడు. మంచి కుర్రాడు. ఐ.పి.ఎస్. ఉన్నతోద్యోగి. నువ్వతనికి బాగా తెలుసు. నువ్వంటే ఇష్టమట. నిన్నే చేసుకుంటాననని మూడేళ్ళుగా భీష్మించుక్కుర్చున్నాడు. ఈ మాట ఆ అబ్బాయి తండ్రి చెప్పాడు. నువ్వేమో ఎన్నిసార్లడిగినా ఓ జడ పదార్థంలా కిమ్మనడం లేదు. వాళ్లకి నేను  సమాధానం చెప్పాలి. ఈ సంబంధం నీకు వరం లాటిది. నీ పెళ్లవుతే నాకు మనశ్శాంతి. నువ్విక ఈ విషయాన్ని నాన్చకు" అని గట్టిగా చెప్పింది మల్లిక. 
తల్లి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం, పెళ్ళవుతే తల్లిని ఒంటరిగా వెళ్ళవస్తుందని కాదనలేక, ఔననలేక, ఆమెను బాధపెట్టడం ఇష్టం లేక సతమతమయింది లయ. ఆ రోజు తల్లి పనిచేస్తున్న బ్యాంకు నుంచే సరాసరి హెల్త్ చెకప్ కి వెళ్లి వస్తూనే
"లయా ! ప్రణవ్  నాన్నగారు ఫోను చేశారు. ఏ సంగతి ఈరోజు వారికి చెప్పాలి. ముహుర్తాలు పెట్టించమని చెబుతున్నాను'' ఖచ్చితంగా అంది.
"నేనొక్కసారి  ప్రణవ్ తోమాట్లాడాలమ్మా" అంది లయ తల్లితో మెల్లగా. 
మల్లిక వేగంగా స్పందించి "ఇదిగో ఫోను కలిపాను మాట్లాడు" అని ఫోను లయ చేతికిచ్చింది మల్లిక ఏమాత్రం తాత్సర్యానికి తావివ్వకుండా. 
"ప్రణవ్! పెళ్లి నాకు ఓకే. ఒక్క కండిషన్ తో. అమ్మ మన తోనే ఉంటుంది. అలా అవుతే  మ్యారేజ్ ఈజ్ ఒకే ఫర్ మీ" అంది లయ. 
"అఫ్ కోర్స్ ... షీ ఈజ్ మై మామ్ టూ!" అన్నాడు ప్రణవ్.  
ప్రణవ్, లయల పెళ్లయింది. 
పెళ్ళికి వచ్చిన లయ ఫ్రెండ్స్ అందరూ "యు లక్కీ గర్ల్! మంచి మొగుణ్ణి కొట్టేశావ్. నౌకర్లు చాకర్లు... ఓహ్ ఇంక నీ లైఫే లైఫ్ ... " అని అభినందిస్తూనే వున్నారు.
                                                        * *           * *           * *
లయ పెళ్ళవుతూనే మల్లిక నారోగ్యం తో హనీమూన్ వాయిదా పడింది. 
నెలరోజులు తరువాత హనీమూన్ ట్రిప్ అనుకున్నారు. 
ఆ రోజు... స్విట్జర్లాండ్ కి బయలుదేరాలి. బ్యాగ్ సదురుకుంది లయ. ఉదయం నుంచి తల్లి కొద్దిగా  ఆయాసపడడం గమనించింది. లయ మనసు డోలాయమానంగా ఉంది.
''ఆయాసం ఎక్కువగా ఉంటే ఫోను చేయండి'' అని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి లయకు. అస్థితిలో తల్లిని వదిలి హనీమూన్ కి వెళ్లడానికి మనస్కరించడం లేదు. రిజర్వేషన్లన్నీ అయ్యాయి. ప్రయాణం సమయం గంటల్లోకొచ్చింది. మళ్ళీ వాయిదా అంటే ప్రణవ్, అతని కుటుంబం ఏమనుకుంటారో నన్న భయం వెంటాడుతోంది. 
కూతురి ఆందోళన చూసి "నేను బాగానే ఉన్నానమ్మా ... నువ్వెళ్లిరా !" అంది మల్లిక.  
జ్యూరిచ్ లో చెల్లెలు శ్రియకు  ఫోను చేసి "ఉదయం నుంచి  అమ్మ ఆరోగ్యం బాలేదు.  ఏంచేయాలో అర్థంగావడంలేదు" అంది లయ.
"ఫరవాలేదక్కా! నెలరోజులుగా స్టేబుల్ గానే ఉంది గదా. మెల్లగా కోలుకుంటుంది.పెద్దది కదా సమయం పడుతుంది. కంగారు పడకు. ట్రిప్ అంత ప్లాన్ చేశాము. అతిగా ఆలోచించక బయలుదేరు. మళ్ళీ వాయిదా అంటే బావుండదు" అంది శ్రియ.  
"ఈ స్థితిలో అమ్మని వదిలి రావాలని లేదు" ఖచ్చితంగా అంది లయ.  
"వాట్ ది హెక్ గోయింగ్ ఆన్ దేర్ ! రిజర్వేషన్లన్నీ అయ్యాయి. అన్నీ ఖరీదయినవి. 
వాళ్ళు రాకుంటే డబ్బంతా బొక్క. చెప్పు వాళ్ళకి. పెద్దామె కదా ! ఏవో రోగాలు వస్తుంటాయి. 
హనీమూన్ మానుకోవడమేమిటి. నాన్ సెన్స్" స్పీకర్లో మరిది అన్నమాటలు వినబడ్డాయి లయకు. అతనలా అమర్యాదగా మాట్లాడడం నచ్చలేదు లయకి. నొచ్చుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. 
''ట్రిప్ పోస్టుపోన్  చేస్తానమ్మా!" అంది లయ 
"వద్దు! అలాటి పని చేయవద్దు. నా మీద ఒట్టే. నువ్విక రెడీ కావాలి. ఫ్లైట్ టైం అవుతోంది. అల్లుడుగారు వచ్చే టైం అయింది" అంది మల్లిక మెల్లిగా బెడ్ మీద లేచి కూర్చుంటూ. 
ఇంతలో ప్రణవ్ దగ్గరినుంచి ఫోను.  
"అర్జెంటు పని వచ్చింది. నేను డైరెక్టుగా ఎయిర్ పోర్ట్ కి  వస్తాను. కౌంటర్ దగ్గర కలుద్దాం" అని ఫోను కట్ చేశాడు ప్రణవ్, మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా.
తల్లి బలవంతం చేయడంతో, అయిష్టంగా బయల్దేరి ఎయిర్ పోర్ట్ కి చేరి వెయిట్ చేస్తోంది లయ.  
కౌంటర్ మూసే అయిదునిముషాల ముందు వచ్చాడు ప్రణవ్.  
ఎయిర్ల పోర్ట్ కి వచ్చీ రాగానే లయ ముఖం చూస్తూనే 
"హేయ్! ఈజ్ ఎవిరీథింగ్ ఓకే ? మామ్ ఎలావున్నారు ?" ఆదుర్దాగా అడిగాడు. 
"ఉదయం నుంచి కొద్దిగా ఆయాస పడుతోంది" అంది లయ. 
"దెన్ వై దిస్ ట్రావెల్ ? దిస్ కెన్ వెయిట్ ... షీ ఈజ్ ఆల్ ఎలోన్. ఆంటీ నెవరు చూస్తారు? 
దిస్ ఈజ్ బాడ్. లెట్స్ గో బ్యాక్" మెరుపులాటి నిర్ణయం తీసుకుని తమని డ్రాప్ చేసి వెళ్లిన కారుని వెనక్కి పిలిచాడు ప్రణవ్. 
"టేక్ ది బ్యాగ్ లయా!" అంటూ ఎయిర్ పోర్ట్ బయటకు నడిచాడు ప్రణవ్. 
"థాంక్స్ ప్రణవ్ !" అంటూ మంత్రముగ్ధలా అతన్ననుసరించింది లయ. లయను ఇంటిదగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు ప్రణవ్. అతనలా వెళ్లిన గంటలోపునే హాస్పిటల్ నుంచి డాక్టర్, సిస్టర్ వచ్చి మల్లికను చెకప్ చేసి "మీరు లేచి తిరిగేంతవరకు ఈ నర్స్ డ్యూటీ ఇక్కడే" అని చెప్పి వెళ్ళాడు డాక్టర్. 
                                                               * *          * *          * * 
మరుసటి రోజు ఉదయాన్నే వచ్చాడు ప్రణవ్.                                                 
''ఆంటీ! డాక్టరుతో మాట్లాడాను. మీకే అనారోగ్యం లేదు. కొద్ది అలసట, అంతే! నాల్రోజుల్లో మామూలు మనిషిలా లేచి తిరుగుతారు" అన్నాడు ప్రణవ్ మల్లిక కాళ్లకు నమస్కారం చేస్తూ.  
"నా మూలంగా మీ ట్రిప్ మళ్ళీ కేన్సెల్ అయింది. బోలెడంత డబ్బు వృథా. చిన్నది చెప్పింది"
ప్రణవ్ లయ వంక చూశాడు. అతని చూపుల్లో కొద్ది తీక్షణత కన్పించింది. 
"అదేమిటి. రిజర్వేషన్స్ నువ్వుచేస్తానన్నావుకదా ?" లయకు మాత్రం వినబడేట్లుగా దగ్గరగా వచ్చి అన్నాడు ప్రణవ్  
"తరువాత మాట్లాడతాను" అని విషయాన్ని స్కిప్ చేసింది లయ. 
                                                              * *            * *           * *
వారం రోజుల తరువాత స్వస్థత చేకూరడంతో లేచి తిరగడం మొదలెట్టింది మల్లిక. 
నర్స్ రోజూ వచ్చి మల్లికను చూసి వెళుతోంది.  
"మగవాళ్ళంతా చెడ్డవారేనా ? లయా!" అడిగింది మల్లిక. 
సమాధానం చెప్పలేదు లయ. 
"ఇక మీరు హనీమూన్ ట్రిప్ కు వెళ్ళిరండి" అంది మల్లిక 
"ప్రణవ్ కి నువ్వే చెప్పు!" అంది తల్లితో లయ.  
మరుసటిరోజు ఉదయాన్నే వచ్చాడు ప్రణవ్.  
"ఆంటీ మాట్లాడారు. ఐ హేవ్ ఏ డ్రీం ప్లేస్ ఇన్ మై మైండ్" అన్నాడు ప్రణవ్ 
మౌనంగా ఉంది లయ. 
"సో...ఇట్స్ ఏ యెస్! యాం ఐ రైట్ ?... లయమౌనాన్ని అంగీకారంగా తీసుకుని "థాంక్స్! విల్ ప్లాన్ ఎవెర్థింగ్. ఈరోజు ఆదివారం. బుధవారం ప్రయాణం ..." అన్నాడు ప్రణవ్. 
లయ అంగీకారంగా తలూపింది.     
హనీమూన్ ప్రోగ్రాం చెప్పాడు ప్రణవ్. డెహ్రాడూన్ వరకు ట్రైన్ లో వెళదామంది లయ. 
బుధవారం లయను పిక్ చేసుకోవడానికి లోనికి  వస్తూనే "ఆంటీ! మేమెళ్ళాక మీకే అవసరమున్నా ఈ నంబరుకి ఫోను చేయండి. పదినిముషాల్లో మనిషి ఇక్కడ ఉంటాడు" నంబరు వ్రాసిన పేపర్ మల్లిక చేతికి ఇస్తూ అన్నాడు ప్రణవ్. లయ చూపులతో కృతజ్ఞతలు చెప్పింది ప్రణవ్ కి.    
                                                * *          * *            * *
నెక్స్ట్ స్టేషన్ డెహ్రాడూన్, "ప్యాక్ అప్ మేడం... " అన్నాడు ప్రణవ్.  
వర్తమానంలోకి వచ్చి "లయ అని పిలువ్ ప్రణవ్! ..." అంది మంద్రంగా. 
"లవ్! అని పిలిస్తే అభ్యంతరమా ?" అన్నాడు మెల్లగా. 
స్టేషనుకి పిక్ అప్ చేసుకునేందుకు కారు వచ్చింది. ముగ్గురు పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళతో రెండు నిముషాలు మాట్లాడి   
"హోటల్ కి వెళుతూనే ఈ రోజుకిక  రెస్ట్. రేపు ఉదయాన్నే ప్రయాణం బై రోడ్. విల్ డ్రైవ్ టు ఔర్ డ్రీం ప్లేస్ నియర్ 'కేదార్ కాంత' విలేజ్ అబౌట్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్" అన్నాడు ప్రణవ్   
స్టేషన్ నుంచి ఎస్కార్టుగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ కార్ వచ్చి వారు హోటల్లో దిగాక వెళ్ళింది. లయ రైల్వే స్టేషన్ నుంచి గమనిస్తూ ఉంది. ఎక్కడ ఎవరితోనూ మాట్లాల్లేవు.   
"ఎవిరీథింగ్ స్పిక్ అండ్ స్పాన్" అనుకుంది లయ.
అర్ధగంటలో 'రెడ్ ఫాక్స్ హోటల్' కి చేరారు. రిసెప్షన్ డెస్క్ వారు వెల్కమ్ చెప్పి రూమ్ బోయ్ కి కీస్ ఇచ్చి పంపించారు.  
కింగ్ సూట్ తాళం తీసి వెళ్ళాడు రూమ్ బాయ్. బెడ్ మీద లవ్ సింబల్ హార్ట్.  పూలతో గదంతా అందంగా అలంకరించి వుంది 
"ఆర్ యు టైర్డ్ ?"అడిగాడు అతను. 
తల అడ్డంగా ఊపింది లయ.
"రూమ్ ఎలా వుంది ?"
"బ్యూటిఫుల్" అంది లయ 
అతని కళ్ళు మెరిశాయి. హుషారుగా క్లాప్స్ కొట్టాడు ప్రణవ్. 
"మీరు..." ఏదో చెప్పబోయాడతను. 
"లయ..."
"లయా! మీరు రెడీ కండి. లంచ్ వస్తుంది. ఏమైనా స్పెషల్ కావాలా?"
"ఆకలిగా లేదు"
"ఐనా తినాలి ? లాట్ అఫ్ ట్రెక్కింగ్ అహెడ్ "
"... టుడే !?" చురుగ్గా చూసింది లయ, ప్రణవ్ ని. 
"ఐ మీన్ ... " చురుకుగా చూస్తూ ఏదో చెప్పబోతున్నతని నోటిని చొరవగా తన వేళ్ళతో మూసి తుర్రున బాత్ రూమ్ లోకి దూరింది లయ.   
                                                     * *         * *         * *
రాత్రి డిన్నర్ త్వరగా ముగించారు. 
సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఓపెన్ చేయమని తల్లి ఇచ్చిన ఎన్వలప్ తీసింది వేనిటీ బ్యాగులోంచి లయ. చిన్న పింక్  పేపర్ ఫోల్డ్ చేసి వుంది. ఫోల్డ్ తీసి చూసింది. 
శుభముహురత్ 'పది.ఒకటి' అని వ్రాసి వుంది. ఆ పేపర్ ప్రణవ్ చేతిలో ఉంచింది.
"యు నో వాట్ ఈజ్ దిస్ ?"
"సిగ్గుతో మొహం దాచుకుంది లయ"
అతనామె చేతులను మొహం మీదనుంచి తీసి దగ్గరకు తీసుకున్నాడామెను. లయ తలెత్తి అతని మొహంలోకి తన్మయంగా చూసింది. అతని  కౌగిలిలో తడిసి ముద్దయింది లయ. వారి శరీరాల్లో  అనిర్దిత కంపనం. గాఢంగా హత్తుకున్నాడామెను.అతని స్పర్శతో ఆమె దేహం దావానలమైంది. ఒళ్ళు ఓడి పొమ్మంటోంది. మనసు మైమరుస్తోంది.శరీరం పరవశం చెందింది. పరువాల పరదాలు తొలిగాయి. ఆమె తనువు అతనికి మరింత దగ్గరైంది. ప్రణవ ప్రణయ సామ్రాజ్యానికి పట్టపురాణయింది లయ. తనువులు సొక్కాయి. స్వేదం చమరుస్తోంది. అతని చిరు స్వేదాన్నిఅద్ది అతని హృదయం మీద వాలింది లయ. 

                                                      * *           * *             * *  
రచన : 
కేశిరాజువెంకట వరదయ్య 
మొబైల్ నంబరు: 9849118254













                                                            

9, జులై 2025, బుధవారం

అనూహ్యం


                                                                     
                                                                       అనూహ్యం
                                                                    ---------------------
  (ఈ కథ ప్రముఖ అంతర్జాల పత్రిక 'రవళి' లో ఏప్రిల్ '25 మాసములో ప్రచురింపబడింది)

శశాంక్ కి  రెండు సంవత్సరాలు నిండాయి. ఇంకా మాటలు రాలేదు. కనీసం 'అమ్మ' అని పలకడం  రాలేదన్నచింత నిలవనీయడం లేదు తల్లి సుష్మను. ఇంటికి దగ్గరలో ఉన్న ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కి ఇప్పటికే రెండు, మూడు సార్లు చూపెట్టింది.
"బాబు బాగున్నాడమ్మా... ఏమీ ప్రాబ్లెమ్ లేదు. కొందరికి మాటలు మెల్లగా వస్తాయి. కంగారు పడకండి" ఆమె ఆందోళనను కొట్టిపారేశాడు డాక్టర్. 
ఆ డాక్టర్ మీద నమ్మకం కుదరలేదు. సాయంత్రం భర్త మీద కోపం ప్రదర్శించింది సుష్మ. 
"శశాంక్ ని చిల్డ్రన్ స్పెషలిస్ట్ కి చూపిద్దామంటే మీనమేషాలు లెక్కెడుతున్నావు. చాల రోజులనుంచి గమనిస్తున్నాను. ఈ మధ్య మరీనూ... ఉన్నట్లుండి దీర్ఘాలోచనపడిపోతావు. ఉలకవు పలకవు. ఏదైనా ప్రాబ్లమా అంటే ఏమీలేదంటావు. చిన్నవాడికేదైనా హెల్త్ ప్రాబ్లెమ్ ఉందేమోనన్న ఆనుమానానికి తోడు నీ ప్రవర్తన అర్ధంగాక భయపడి చస్తున్నాను'' ఆందోళనగా అంది సుష్మ. 
"ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి భయపడతావు. పిల్లల్లో కొందరికి మాటలు, నడక ఆలస్యంగా వస్తాయి. నావరకు నాకు, ఆ రెండూ ఆలస్యమేనని మా అమ్మ అంటూవుండేది.
నా కేమయింది ? దుక్కలా ఉన్నాను. అనవసరపు ఆలోచనలు పెట్టుకోకు " అన్నాడు జితేంద్ర భార్యను అనునయిస్తూ.
"ఇదిగో ఇలా ఏదోవొకటిలా సర్ది చెప్పి మాయచేస్తావు. పిల్లాడిని స్పెషలిస్ట్ డాక్టర్ కి చూపిద్దామని మాత్రం అనవు. వాడి సంగతి పట్టించుకోవు" నిష్ఠూరంగా మాట్లాడి, భార్య కంట నీరు పెట్టుకునే సరికి అప్పటికప్పుడు 'పెడియాట్రిషియన్'  అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు జితేంద్ర.  
"రేపుదయం పదకొండు గంటలకు అప్పాయింట్మెంట్. వెళదాము" అని భార్యతో చెప్పి గదిలోనికి వెళ్లి బెడ్ మీద వాలిపోయాడు జితేంద్ర. 
"ఏమిటో ఈ మనిషి ..." అని భారంగా నిట్టూర్చింది సుష్మ.  
                                                                        * * * * *         
మరుసటిరోజు పదకొండున్నర గంటలకు శశాంక్ ని పరీక్షిస్తూ  "చెప్పండి, కంప్లైంట్ ఏమిటి ?" అన్నాడు పెడియాట్రిషియన్. 
"శశాంక్ కి రెండు సంవత్సరాలు నిండాయి. సాధారణంగా ఈవయసు పిల్లలు తల్లితో కబుర్లు చెబుతారు. వీడి దగ్గరనుంచి ఏ స్పందన లేదు. నవ్వుతాడు. కాని ఆ నవ్వు నన్నుచూసి కాదు. మమ్ముల్ని సూటిగా చూడడు. వెఱ్ఱి చూపులు చూస్తూ ఉంటాడు" అంది సుష్మ 
డాక్టరు శశాంక్ ని  నిశితంగా పరీక్ష చేశాడు. 
"ప్రాబ్లెమ్ ఉంది. అది ఏమిటనేది ఇప్పుడే పూర్తిగా డయాగ్నైజ్ చేయడం కుదరదు. 
'ఆటిజం' లక్షణాలు ఉన్నాయి. మీ కుటుంబాలలో ఎవరికైనా 'ఆటిజం వుందా?" అడిగాడు డాక్టరు.
"లేదు డాక్టర్ !" ఖచ్చితంగా అంది సుష్మ.  
"నువ్వలా ఉండు! భార్యను వారిస్తూ..."ఈ జబ్బు హెరిడెటెరిగా వస్తుందా డాక్టర్ ?" సీరియస్ గా  ప్రశ్నించాడు జితేంద్ర.  
"జన్యుపరంగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగని, ఖచ్చితంగా చెప్పలేము" ఇతమిద్ధంగా  ఏదీ తేల్చకుండా అన్నాడు డాక్టర్  

''... ఎందుకలాడిగావు?" అన్నట్లు ప్రశ్నార్థకంగా తలఎగరేసి చూసింది సుష్మ భర్త వైపు. 

మౌనంగా ఉన్నాడతను. 

"ఎనీ థింగ్  ఎల్స్ ... మిస్టర్... ?"
"... జితేంద్ర" అంది సుష్మ.  
"మై యంగర్ బ్రదర్ హేడ్ సచ్ ప్రాబ్లెమ్" అన్నాడు జితేంద్ర.  
"ఏం మాట్లాడుతున్నావు జితేంద్రా...నీకో తమ్ముడు ఉన్నాడా!?" అంది సుష్మ. డాక్టర్ ఛాంబర్ లోనే  ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చి చూస్తూ భర్త చెబుతున్నది నమ్మశక్యం కానట్లుగా. 
"ఓకే. డీటెయిల్స్ చెప్పండి" జితేంద్ర వంక చూస్తూ అన్నాడు డాక్టర్. 
"విజయేంద్ర నా స్వంత తమ్ముడు. నాకంటే ఐదేళ్లు చిన్న. వాడికి ఐదుసంవత్సరాలు వచ్చేవరకు కొద్ది మాటలే వచ్చాయి. పిలిస్తే పలికేవాడు కాదు. వెర్రి చూపులు చూసే వాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఏమాత్రం శబ్దాన్ని భరించేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు. 
కొత్త వారినెవరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. బొమ్మల్ని, వస్తువుల్ని విసిరేవాడు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేసేవాడు. నా చిన్నతనంలో నేనే వాడితో ఆడుకోవాలన్నా, ఒంటరిగా వాడితో ఉండాలన్నా బెరుకుగా అనిపించేది" బాధగా చెప్పాడు జితేంద్ర 
"ఇప్పుడెలా ఉన్నాడతను... ?"
"తెలియదు..." నిర్వికారంగా అన్నాడు జితేంద్ర.   
భర్త తనకో స్వంత తమ్ముడున్నాడని చెప్పడంతో సుష్మకి కలిగిన విస్మయం కంటే అతనా విషయం దాచినందుకు వచ్చిన కోపాన్ని దాచుకోలేకపోయింది. హాస్పిటల్లో కోపగించడం బాగోదని, సభ్యత కాదని మౌనంగా ఉండిపోయింది సుష్మ. 
"బాబు ఎదుగుదల నార్మల్ గా ఉంది. పిరియాడికల్ గా చూద్దాం" అని వేరే స్పెషలిస్ట్ డాక్టరుకి రిఫర్ చేస్తూ మరుసటిరోజు ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పి, ప్రిస్క్రిప్షన్ వ్రాసిచ్చాడు డాక్టర్. 
భార్యాభర్తలు ఇంటికి తిరిగి వచ్చారు. తోవలో ఒకరితోనొకరు మాట్లాడుకోలేదు. 
బద్దలవ్వబోయే అగ్నిపర్వతంలా సుష్మ, బద్దలయ్యి 'లావా, మేగ్మా' ను చిందించి, శాంతించిన అగ్నిపర్వతంలా జితేంద్ర, చెరొక గదిలో గడిపారు. ఇద్దరూ ఎంగిలి పడలేదు. 
కాసేపటికి ఏడ్చి, ఏడ్చి కళ్ళు ఉబ్బి గదిలోనుంచి బయటకు వచ్చింది సుష్మ. అదే సమయానికి జితేంద్ర బయటకు వచ్చాడు. 
"నీకో స్వంత తమ్ముడున్నాడన్న విషయాన్నినా దగ్గర దాచావు ? ఇంకెన్ని విషయాలు దాచావు?" కోపంగా అంది సుష్మ.   
"మన పెళ్ళికి ముందే మీ అన్నయ్యకు చెప్పాను. నీతో చెప్పే అవకాశం రాలేదు. మీ అన్నయ్య మీ ఇంట్లో చెప్పాడనే అనుకున్నాను. నీతో నేను ఆ విషయాన్ని చెప్పకపోవడం నా తప్పో, బలహీనతో నాకు తెలియదు. ఎందుకని ప్రశ్నిస్తే  నా దగ్గర సమాధానం లేదు" వంచిన తల ఎత్తకుండా సమాధానం చెప్పాడు జితేంద్ర. 
"నిన్నని ప్రయోజన మేముంది. స్వంత అన్నే తెలిసీ చెప్పలేదు ... కనీసం ఇప్పుడైనా  'విజయేంద్ర' ఎక్కడున్నాడో చెబుతావా.... ఆరోగ్యం ఎలావుంది? ఏం చేస్తున్నాడు...? 
అతని బాగోగులు ఎవరు చూస్తున్నారు? చివరిగా అతన్ని ఎప్పుడు చూశావ్ ?" ప్రశ్నల వర్షం కురిపించింది సుష్మ 
"విజయేంద్ర, రాజారావు చిన్నాన్న దగ్గర మా ఊళ్ళో ఉన్నాడు. పన్నెండేళ్ల క్రితం నేను ముంబై వచ్చాక తిరిగి ఆ ఊరెళ్ళలేదు. విజయేంద్రను చూడలేదు" అపరాధభావంతో అన్నాడు జితేంద్ర  ఆమె సూటి చూపులను తప్పించుకుంటూ.  
"విజయేంద్రతో గాని, మీ బాబాయిగారి తోనూ కాంటాక్టులో లేవా?!"
"లేదు. చాలా లెటర్స్ వ్రాశాను. మాట్లాడడానికి ఎన్నోసార్లో ప్రయత్నించాను. బాబాయి దగ్గరి నుంచి ఎటువంటి సమాధానం లేదు. నన్ను ఆవూరినుంచి ముంబై పంపించిన రోజున, తిరిగి ఆవూరికి రావద్దని గట్టిగా చెప్పి నా దగ్గర మాట తీసుకున్నాడు బాబాయి. అందుకే వెళ్ళలేదు" అన్నాడు జితేంద్ర. 
అతని సమాధానం విన్న సుష్మ మాన్పడిపోయింది. కాసేపటికి తేరుకుని  
"మామయ్య గారు వద్దంటే మాత్రం ... నువ్వసలు మనిషివేనా? మానవత్వం లేదా? స్వంత తమ్ముడు, అందునా మానసిక వైకల్యం ఉన్నతమ్ముణ్ణి వదిలేసి ఇన్నేళ్ళు యథేచ్ఛగా ఎలా ఉన్నావు ? నీదింత రాతి హృదయమని  గుర్తించలేక పోయాను... " కరకుగా అంది సుష్మ.
''నీకేం తెలుసు సుష్మా! ఈ పన్నెండేళ్ళుగా నేను ఎంత నరకం అనుభవించానో! 
శశాంక్ ఎదుగుతున్నకొద్దీ, రూపంలోనూ, చేష్టలలోనూ విజయేంద్రను పోలి ఉండడంతో ప్రతిక్షణం తమ్ముడు గుర్తుకు వచ్చి ఆవిషయాన్ని మింగాలేక, కక్కాలేక ప్రతిక్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నాను'' అని అన్నాడు జితేంద్ర కిటికీ లోనుంచి బయటకు చూస్తూ  
సుష్మ అప్పటికే లోనికి వెళ్ళిపోయింది. ఆమె తన మాటలు వినలేదన్న నిజాన్ని అతను గ్రహించలేదు. 
కొద్దిసేపటికి సూట్ కేసు సర్దుకుని, బాబుని తీసుకుని పుట్టింటికి  వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయలుదేరింది సుష్మ. 
జితేంద్ర ఎంత ప్రయత్నించినా సుష్మ ఆగలేదు. 
"డ్రాప్ చేస్తాను ఉండు!" అని జితేంద్ర చెప్తున్నా వినకుండా "నీడ్ ఏ బ్రేక్" అంటూ టాక్సీ లో  
వెళ్ళిపోయింది.
వెంట వెళ్లి భార్యను సమాధానపరిచే సాహసం కూడా చేయలేకపోయాడు జితేంద్ర. 
ఆమె కోపం జితేంద్రకు తప్పుగా అనిపించలేదు.  
తమ్ముడి విషయం  భార్యకు ఇన్నేళ్లు ఎందుకు చెప్పలేకపోయాడో అన్న స్పష్టత అతనికే లేదు. అది యాదృచ్ఛికం కాదు, స్వయంకృతం అని అతనికి తెలుసు. బాబాయి అన్నమాట మనసు పొరల్లో దాగి అతని మీద భావాధిపత్యం కొనసాగించింది. 
మనిషులు అవసరమైనప్పుడు అవసరాలకు, మనుగడకు అబద్ధమాడడం స్వాభావికం. 
కానీ, మనిషి దాచిన నిజాన్ని, దాని భౌతికతను శాశ్వతంగా దాయడం అసాధ్యం.  
మానసిక వైకల్యం వున్న తమ్ముడు వున్నాడని చెప్పడంవల్ల తన ఆస్తిత్వానికి ఎక్కడ హాని జరుగుతుందేమోనన్న భ్రమలో ఉండిపోయాడతను. ఆ ఆత్మన్యూనత వేటకుక్కలా జితేంద్రను వెంటాడుతూనే వుంది. సుష్మ తనని అసహ్యించుకోవడమే గాక లోకమంతా ఏకమై తనని వెలేసినంత ఏహ్యభావన తనని నిలువెల్లా కలిచివేస్తోంది. 
కళ్ళు మూసుకుని సోఫాలో ఒరిగాడు. అతని ఆలోచనలు వేగంగా గతంలోకి వెళ్లాయి. 
                                                                   * * * * * 
జితేంద్రది బందరు దగ్గర ఒక కుగ్రామం. చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, తమ్ముడు. స్వంతిల్లు. రెండెకరాల పొలం. అదీగాక వేరే ఐదెకరాల మెట్ట భూమి కౌలుకి సాగు చేసేవాడు తండ్రి. సంతోషంగా సాగుతున్నరోజులు. జితేంద్రకి ఐదేళ్ల తేడాతో తమ్ముడు పుట్టాడు. ముట్టుకుంటే మాసిపోయే ఛాయ. ఎంత అందంగా ఉన్నాడో అనుకున్నారందరూ. 
రెండున్నర సంవత్సరాలు దాటినా విజయేంద్రకి  మాటలు రాలేదు. పెద్దాసుపత్రికి వెళ్లి డాక్టరుకు చూపించారు. ఆయన ఇంకొక స్పెషలిస్ట్ డాక్టరు దగ్గరికెళ్ళమన్నాడు.
బాబుకి 'ఆటిజం' అన్నారు. మూణ్ణెల్ల కొకసారి చూపించమన్నారు. అయిదు సంవత్సరాలకు కొన్ని  మాటలు వచ్చాయి. పిలిస్తే పలికేవాడు కాదు. స్కూల్లో చేర్పించారు. ఒక్క లెక్కల సబ్జెక్టులో అసామాన్య ప్రతిభ చూపేవాడు. మిగతా సబ్జెక్టులలో అంతంత మాత్రంగా ఉండే వాడు. 
జితేంద్రను ఇంటర్ కి వచ్చాడు. 
విజయేంద్రను హైదరాబాద్ లో స్పెషల్ స్కూల్లో చేర్పించమని స్పెషలిస్ట్  డాక్టర్ చెప్పాడు. తనని తీసుకుని హైద్రాబాదు వెళ్లి వచ్చాడు తండ్రి. తల్లితో ఏదో చెబుతూ తండ్రి కంట నీరుపెట్టుకోవడం చూశాడు జితేంద్ర. డబ్బు లేదని అర్ధమైంది జితేంద్రకు. జితేంద్ర చదువుకు, విజయేంద్ర వైద్యానికి అప్పులయ్యాయి. కనీసం వడ్డీ కట్టలేని స్థితి వచ్చింది. వరుసగా రెండుసంవత్సరాలు తుఫాను తాకిడికి పంట చేతికి రాలేదు. అప్పుల బాధతో వారికి నిద్రపట్టేది కాదు. కాలం గడ్డుగా గడిచేది. ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చాడు తండ్రి. జితేంద్ర ఇంటర్ పరీక్షలు అయ్యాయి. 
ఒకరోజు పొలంపనికి వెళ్లిన తలితండ్రులు ఇంటికి తిరిగి రాలేదు. పిడుగుపాటుకి ఇద్దరూ ఒకేసారి  చనిపోయారు. వారి దినవారాలయ్యాయి. ఊరి పెద్దాయన జితేంద్రను ఉద్దేశించి మాట్లాడుతూ
''ఈ పిచ్చోడికి  మీ చిన్నాయన రాజారావు ఓ ముద్ద పడేయకుండా ఉండడులే గాని వాడి మానాన వాడిని వదిలి, నువ్వయినా చదువుకుని ప్రయోజకుడివి కావాలి. ఉద్యోగం వచ్చాక వాడి మంచి, చెడు చూసుకోవచ్చు" అని జితేంద్రకు సలహా పడేశాడు. 
తమ్ముడ్ని పిచ్చోడు అనేసరికి జితేంద్రకు కోపం వచ్చింది.పేదవాడి కోపం పెదవికి చేటు కదా! గుడ్లనీరు కుక్కుకోవడం మినహా ఏం చేయలేకపోయాడు. 
ఇంత జరుగుతున్నా, విజయేంద్ర వాడి మానాన వాడు ఒకమూలన కూర్చుని ఆడుకునే వాడు. 
తల్లి, తండ్రీ కన్పించకపోవడంతో అన్న జితేంద్రను ఓ కంట కనిబెడుతూ, వదిలేవాడు కాదు. 
'నువ్వుకూడా నన్నొదిలి వెళ్తావా ?' అన్నట్లుగా వెంటాడేవి వాడి 'వాడి' చూపులు. 
జితేంద్ర చిన్నాన్నరాజారావు మిగిలి ఉన్న ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చి మిగిలిన డబ్బు విజయేంద్ర వైద్యానికి తనదగ్గరే ఉంచుతానని చెప్పాడు. శలవులయిపోయాయి. 
ఇంటర్ పాసయ్యాడు జితేంద్ర. 
                                                                     * * * * *
ఆ ఊరి కరణం గారబ్బాయికి ముంబైలో ఇంపోర్ట్స్ ఎక్సపోర్ట్స్ వ్యాపారం. చేతికిందకి నమ్మకమైన, చదువుకున్న కుర్రాడెవరైనా ఉంటే తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తానన్నాడు. జితేంద్ర గురించి చెప్పాడు రాజారావు. 
"ఉద్యోగం ఇచ్చి ముంబైలో ఉండడానికి వసతి ఇస్తాను. మీ అన్న కొడుకు బాధ్యత ఇక నాది" రాజారావుతో అన్నాడు కరణంగారి అబ్బాయి. సంతోషంగా ఇంటికి వచ్చాడు రాజారావు.   
"నీ ఇంటర్ అయిందిగా. పైచదువు చదివించే స్థోమతలేదు. కరణంగారబ్బాయి నీకు  ఉద్యోగం ఖాయం చేశాడు. ఊళ్ళోనే ఖాళీగా ఉన్నావంటే ఈ వయసులో అల్లరి చిల్లర తిరుగుళ్ళు అలవాటవుతాయి. నీ తమ్ముడిని అంటున్నట్లుగానే నీకూ 'పిచ్చోడి అన్న' అని  జనం నీకూ ముద్ర వేస్తారు . బతుకు ఛిద్రం అవుతుంది. ఈ ఊరు వదిలి వెళ్ళు. మరి రాకు!
బాబాయి ఊరి నుంచి తరిమేస్తున్నాడని అనుకోవద్దు. నీ భవిష్యత్తు కోసమే నేనీ నిర్ణయం తీసుకున్నాను. తమ్ముడి గురించి చింతపడకు. వాడిక మాబిడ్డ" అని చెప్పి ఆ మరుసటి రోజే జితేంద్రని స్నేహితునితో ముంబై పంపించాడు రాజారావు. 
అతని దగ్గర ఇంపోర్ట్స్, ఎక్సపోర్ట్స్ వ్యాపారంలో సహాయకుడిగా చేరి, ఐదేళ్లలో మంచి జీతంతో ముంబైలో సెటిలయ్యాడు జితేంద్ర. 
తమ్ముణ్ణి తీసుకెళ్తానని బాబాయికి ఉత్తరం రాశాడు. కరణంగారబ్బాయితో కూడా కబురుచేశాడు జితేంద్ర. తిరుగు టపాలో రాజారావు దగ్గర్నుంచి సమాధానం వచ్చింది. 
"ముంబయి లాటి మహాపట్నంలో విజయేంద్రను నీదగ్గర పెట్టుకోవడం, వైద్యం, విద్య అంత సులభంకావు. నీ రోజువారి జీవితానికి, నీ ఉద్యోగానికి వాడు అడ్డంకి అవుతాడు. ఇద్దరికీ ఇబ్బంది అవుతుంది. నా మాట విను. విజయేంద్ర బాగున్నాడు. వాడిని మా స్వంత బిడ్డలా సాకుతాము. 
వాడి గురించి ఆలోచన మానెయ్!  ఇక్కడ మంచి పంతులుగారు వచ్చారు. వాడు తప్పక మెరుగవుతాడని నమ్మకం ఉంది. ఇదే విషయం మీ యజమానితో చెప్పాను. ఇదంతా నీ మంచికే చెబుతున్నానని గ్రహించు" అనునయంగా ఉత్తరం రాశాడు రాజారావు. తరువాత జితేంద్ర వ్రాసిన ఉత్తరాలకి సమాధానం రాలేదు. 
కాలక్రమేణా వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. కరణం గారబ్బాయి అహ్మదాబాదు కొత్త బ్రాంచిలో సెటిలయ్యాడు. ఫలితంగా జితేంద్రకు ఊరి సంగతులుకూడా తెలియరాలేదు. పన్నెండేళ్ల కాలం గడిచిపోయింది.   
అలా, ఆనాటి నుంచి ఈనాటి వరకు విజయేంద్ర ఎలా ఉన్నాడో జితేంద్రకు తెలియ రాలేదు.  
                                                                    * * * * *
ముంబైలో తనతో పనిచేసే ఓ తెలుగు స్నేహితుని చెల్లెలు సుష్మను పెళ్లిచేసుకున్నాడు జితేంద్ర.  వారింట్లో ఒంటరివాడిగా పరిచయమయ్యాడు జితేంద్ర.
                                                                    * * * * *  
డాక్టరు అడిగిన కారణంగా జితేంద్ర తమ్ముడి విషయం వెలుగు చూడడంతో సుష్మ షాక్ కు గురయింది. భర్త అంతటి ముఖ్య విషయాన్ని తననుంచి దాచడంతో భర్త మోసం చేశాడన్న భావనకు లోనయింది.
జితేంద్రకు సంజాయిషీ ఇచ్చుకునే సమయం, అవకాశం ఇవ్వలేదు. పిల్లాడితో పుట్టింటికి వెళ్లడంతో అతనికి ప్రపంచమంతా శూన్యమనిపిస్తోంది.     
                                                                    * * * * *
భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిన రోజే జితేంద్ర అత్యవసర ఆఫీసు పనిమీద వారం రోజులు అహమ్మదాబాదు వెళ్లాల్సి వచ్చింది. క్యాంపుకు వెళ్లేముందు, తరువాత ఎన్నిసార్లు ఫోను చేసినా సుష్మ ఫోను ఎత్తలేదు. బావమరిదితో మాట్లాడుదామనుకున్నాడు. ప్రయోజనమేముంటుందన్న మీమాంశలో పడ్డాడు. జరిగిన తప్పిదాన్ని పదే పదే తవ్వుకోవడంకన్నాసరిదిద్దుకుని, ముందుకు పోవడమే మేలనుకున్నాడు. 
ఊరినుంచి తమ్ముడిని తీసుకునివచ్చి, అప్పుడు భార్య ముఖం చూడాలని నిర్ణయించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు జితేంద్ర. 
                                                                   * * * * *
ఫ్లైట్లో విజయవాడకు వచ్చి అక్కడనుంచి క్యాబ్ లో ఊరికి చేరాడు. స్వంత ఇంటి ఆనవాలే లేదు. అదే స్థలంలో పెద్ద భవంతి వచ్చింది. గేటులోనుంచి ఇంటిముందు ఆవరణలో పచ్చటి చెట్లతో, పూలమొక్కలతో గార్డెన్ కళకళ లాడుతూ కన్పించింది. ఆ ఇంటికి ఆనుకుని ఉన్న బాబాయిగారి పాత పెంకుటింటి వైపు నడిచాడు. ఇంటి తలుపు బార్లా తెరిచేఉంది. ఇంట్లో పనివాళ్ళు  వున్నారు. ఒక పనివాడు జితేంద్రను గుర్తించాడు. 
"మీరు జితేంద్రబాబు గారు కదా...చిన్నప్పుడెప్పుడో చూశాను. మీ చిన్నాయన పక్కన భవంతిలో వుంటారు. రండి వెళదాం" అన్నాడు. 
జితేంద్ర చేతినుంచి బ్యాగ్ అందుకుని రాజారావు ఇంటి ఆవరణ లోనికి నడిచాడు. పనివాడు "రాజారావు గారూ!" బిగ్గరగా పిలిచాడు పనివాడు.   
రాజారావు బయటకు వస్తూనే జితేంద్రను గుర్తించి "ఎన్నేళ్ళకొచ్చావురా జీతూ!" అంటూ  గట్టిగా కౌగలించుకున్నాడు.  
"నీ మాటకాదని మన ఊరికి వచ్చాను. క్షమించు బాబాయ్!" అన్నాడు జితేంద్ర. 
"మాట తప్పి మర్యాద దక్కించుకున్నావురా! ఆనాటి గడ్డు పరిస్థితుల్లో 'ఊరికి రావద్దు' అన్నంత మాత్రాన ఇన్నేళ్లు రాకపోవడమేమిట్రా? బాబాయి మీద అంత కోపం వచ్చిందా" అన్నాడు రాజారావు గద్గద స్వరంతో కళ్ల నీళ్లు పెట్టుకుని. 
"నీ మీద నాకు కోపం ఏంటి బాబాయ్? నువ్వు, పిన్నిగాక మాకింకెవరున్నారు?" అన్నాడు జితేంద్ర. 
"నిన్ను నీ తమ్ముడికి ఇన్నేళ్లు దూరంగా ఉంచాను. నాది పెద్ద తప్పిదమే!
అన్న, వదినా అకాలంగా పోయారు. ఆనాటి గడ్డు పరిస్థితుల్లో నీ భవిష్యత్తు దృష్ట్యా నిన్నిక్కడ నుంచి తరిమేశాను. ఇక్కడికి రావద్దన్నాను. నాకంతకన్నా వేరేమార్గం తోచలేదు. మీ తల్లి తండ్రులు చేసుకున్న పుణ్యాన, భగవంతుడు పంపినట్లుగా నువ్వెళ్లిన తరువాత ఈ ఊరికి ఒక మంచి పంతులు గారొచ్చారు. ఆయనకు మానసిక వైకల్యం ఉన్న  కొడుకుండేవాడు. విజయేంద్ర వయసే. ఆయన వీళ్ళిద్దరికే ప్రత్యేకంగా చదువు చెప్పాడు. అలా వాడికి చదువు ఒంటబట్టింది. వయసు పెరిగే కొద్దీ, వెన్ను ముదిరే కొద్దీ కుదురుకున్నాడు. నిలకడ వచ్చింది. డిగ్రీ అయింది. ప్రయోజకుడయ్యాడు. 
అవసరమున్న లేకున్నా, ఊళ్లు వదిలి పట్నాలకు పరుగెత్తే వారికి ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. వాడిని, వాడు సాగుచేసే తోటను, పొలాలను, సేంద్రీయ పంటలను చూసి తీరాల్సిందే!" విజయేంద్ర విజయాల గురించి ఏకరువు పెట్టాడు రాజారావు. 
సంతోషం పట్టలేక "ఇంతకీ తమ్ముడేడి బాబాయ్ ?" అన్నాడు జితేంద్ర 
"కొత్తగా పళ్ళ తోట కొన్నాడు. నెలరోజుల్నుంచి తోటపని లోనే తలమునకలై ఉన్నాడు. రెండు, మూడు రోజుల పాటు అక్కడే ఉంటానన్నాడు" అన్నాడు రాజారావు 
"అక్కడికి వెళదాం బాబాయ్. తమ్ముడిని అర్జెంటుగా చూడాలి" అన్నాడు జితేంద్ర. 
స్కూటర్ తీశాడు రాజారావు.  
మట్టిరోడ్డు మీద అర్ధగంట ప్రయాణంచేసి వారిరువురు తోటకు చేరారు.  
తోట కంచె పక్కగా తోవకు రెండువైపులా పేర్చిన ఎర్రటి ఇటుకల మధ్యగా ఎర్రటి గరుసుమట్టి తోవ. లోనికి వెళితే గాని కనుపించని చిన్న ఫామ్ హౌస్ ముందు ఆగింది స్కూటర్. స్కూటర్ దిగాడు జితేంద్ర. ఫామ్ హౌస్ కి ఎడంగా ఉన్న పూలతోట మధ్యలో శశాంక్ ని ఎత్తుకుని ఆడిస్తున్న విజయేంద్రను చూపాడు రాజారావు. తలలు ఊపుతూ గులాబీ పరిమళాల గుబాళింపుతో వీస్తున్న గాలితో ఊసులాడుతున్న గులాబీ పూల మొక్కలను చూసి కేరింతలు కొడుతున్నాడు శశాంక్ విజయేంద్ర చేతుల్లో. 
ఊహించని ఘటనతో ఆశ్చర్యంతో నిశ్చేష్ఠుడై  రాజారావు వంక చూశాడు జితేంద్ర. విజయేంద్ర పరుగున వచ్చి జితేంద్రను కౌగలించుకున్నాడు 
"అంతాపైవాడి లీల. మీ ఇద్దరి జీవితాల్లో ఈ రోజువరకూ అన్ని సంఘటనలు అనూహ్యంగా జరిగాయి. నీ భార్య బంగారం. మరిది ఉన్నాడని తెలిసిన మరుక్షణం రెక్కలుగట్టుకుని ఇక్కడవాలింది. భగవంతుడు ఎప్పుడూ, ఎవరికీ అన్ని తలుపులు మూయడు. నీ తమ్ముడిని క్షేమంగా నీ కప్పచెబుతున్నాను. నా బాధ్యత తీరింది" గాద్గదికంగా అన్నాడు రాజారావు.  
                                                                    * * * * *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254









 

6, జులై 2023, గురువారం

 


                                                                      ఋణానుబంధం

                               ( ఈ కధ 'స్వాతి'  'అక్టోబరు' నెల 2012  సచిత్ర మాస పత్రికలో  ముద్రితమైనది)

                     మధ్యాహ్నం దాదాపు మూడున్నర గంటలవుతోంది. భోజనం చేసి ఇట్లా నడుం వాల్చానో లేదో కాలింగ్ బెల్ ఒకటే మోత. 
'పిల్లలు అప్పుడే వచ్చేశారా ?' అనుకుంటూ తలుపు తీశాను. 
ఎవరో పెద్దావిడ. దాదాపు 55 సంవత్సరాల పైనే వుంటాయి. 
ఒక్కసారి ఆవిడ ఒంక తేరిపార చూశాను. 
పసిమి వంటి ఛాయ. కళ్ళ కింద నల్లటి జీరలు. తైల సంస్కారం లేని జుత్తు. ఒక ప్రక్కనే అరిగిపోయిన రెండు రబ్బరు చెప్పులు. జీవంలేని జీవిలా ... చూస్తేనే తెలుస్తోంది బాగా బతికి చెడ్డవారిలా.
పాపం ఎండలో నడిచి వచ్చిందో ఏమో చెమటలు కారుతున్నాయి. రెండు చేతుల్లో పెద్ద ఖాకి సంచులు. సంచుల నిండా ఏవో ప్లాస్టిక్, స్టీల్ డబ్బాలు. చూస్తేనే తెలుస్తోంది. ఏవో అమ్ముకునేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సంచులు అతిజాగ్రత్తగా కింద వుంచి కుడిచేత్తో ఎడమ భుజాన్ని వత్తుకుంటూ, చెమట కొంగుతో తుడుచుకుంటూ నన్ను ఉద్దేశించి 'ప్రసాదరావు గారి ఇల్లు ఇదే కదమ్మా' అనడిగింది'. నేను 'అవునంటూ' తలూపుతూ తలుపు పూర్తిగా తెరిచి "మీకు మంచినీళ్ళు కావాలా?" అని అడిగి ఆవిడ సమాధాన మిచ్చేలోపునే చల్లటి మంచినీళ్లు తెచ్చి 
ఇచ్చాను. ఆవిడ రెండు గ్లాసుల నీళ్లు తాగి ''రక్షించావు తల్లీ! ఎంత దాహంగా ఉందో. అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. నా పేరు జానకమ్మ తల్లీ'' అంటూ 'ప్రసాదరావు, నన్ను... " అంటూ ప్రారంభించి నా ముఖ కవళికలు చూసి ఏకవచనంతో మాట్లాడానని గ్రహించి,''క్షమించమ్మా'' ప్రసాదరావుగారు ఇంటికి వెళ్ళమని చెప్పారమ్మా. మిమ్ముల్ని ఫోను చేయమన్నారు'' అందావిడ కొంగుతో మొహం వత్తుకుంటూ.
''ఇన్నాళ్ళు ఆఫీసు దగ్గరే వడియాలు,అప్పడాలు ఇచ్చేదాన్నమ్మా. ప్రసాదరావు గారే ఇప్పట్నుంచి ఇంట్లోనే ఇవ్వమన్నారమ్మా. అందుకే ఇలా వచ్చాను'' ఆయాసపడుతూ చెప్పిందావిడ.
''ముందు మీరిలా కూర్చుని కొద్దిగా విశ్రాంతి తీసుకోండి''....అని ఆవిడను డ్రాయింగ్ రూం సోఫాలో కూర్చోబెట్టి లోనికివచ్చి ఆయనకు ఫోను చేసి మాట్లాడి తిరిగి వచ్చిఆవిడ దగ్గర వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు, ఆవకాయ ఇంక వేరే పచ్చళ్ళు కావలసినవి తీసుకుని ఆవిడకు డబ్బు ఇచ్చేసి, ఆయ చెప్పినట్లు మా కాలనీలో వేరే ఇద్దరికీ  పరిచయం చేసి వాళ్ళు కావలసినవి తీసుకుంటుంటే నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు స్కూళ్ళ నుంచి వచ్చేశారు. ఆవిడ దగ్గర తీసుకున్న వన్నీ సదిరి పిల్లలకు వాళ్ళ కిష్టమయిన స్నేక్స్ పెట్టి ఇక సాయంత్రం వంటకుపక్రమించాను.
వంట చేస్తుంటే ఆ పెద్దావిడ గుర్తు కొచ్చి మనసు ఏదోలా అయింది.
'ఏం బ్రతుకులో.... ఏమిటో? భగవంతుడు చల్లగా చూడకపోతే అలానే వుంటుంది' పాపం ఆ పెద్దావిడ కృష్ణా ... రామా.....అంటూ ఇంట్లో ఎవరైనా చేసి పెడితే కూర్చుని తినే వయస్సులో ఇలా ...' అనుకుంటుండగా ఆవిడ...' ప్రసాదరావు'..... అని ఏకవచనంతో సంభోదించి మాట్లాడబోయి తమాయించుకుని 'ప్రసాదరావు' అనడం గుర్తు వచ్చి, ఆయనను ఏకవచనంతో మాట్లాడే చనువు, పరిచయం ఆవిడకు ఉండి ఉంటుందా ? లేక పెద్దావిడ కదా, అకస్మాత్తుగా నోరుజారి అలా పొరపాటుగా అన్నదా, తేల్చుకోలేకపోయాను.
'సరే, ఆయన్నే అడుగుతే పోలా' అనుకుని వంట పనిలో మునిగిపోయాను.
పిల్లలు ముగ్గురు నిశ్సబ్దంగా కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నారు.
అర్ధగంటలో నేను కూడ వంట పూర్తి చేసి ఫ్రెష్ అయి వచ్చి పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసే సరికి ఆయన వచ్చేశారు. ఆయనకు యధాప్రకారం ఫిల్టర్ కాఫీ ఇచ్చి వేడి నీళ్లు కూడా రెడీ చేసి వచ్చి పిల్లల దగ్గర కూర్చున్నాను. వాళ్ళతో ప్రతి రోజు కాసేపు కాలక్షేపం చేసే టైం అది. ఆయన కూడ కాఫీ తాగుతూ కాసేపు పిల్లలతో టైం పాస్ చేసి, ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి మా'టీం' లో చేరతారు. ఆరోజు స్కూల్లో జరిగిన విషయాలు అందునా మాచిన్నది ఏవో జోకులు, పోచికోలు కబుర్లు మోసుకు వచ్చి పేలుస్తుంది ఆ టైంలో. అందరం కాసేపు నవ్వు కుంటాము. 
ఇదీ సాయంత్రాలు మా పెర్మనెంట్ రొటీన్.
అందుకే నాకు సాయంత్రం ఈ అర్ధగంట 'టైం' అంటే ప్రత్యేకంగా చాలా ఇష్టం. మేం అయిదుగురం కలిసి ఉండే ప్రత్యేక క్షణాలవి. ఏరోజు కదే ప్రత్యేకం. మేము అయిదుగురం. మా చిన్న ప్రపంచం. రేపు పిల్లలు పెద్దయి, పెళ్ళిళ్ళు అయి ఎటు వాళ్ళు అటు వెళ్ళినా ఇలాంటి ప్రత్యేక క్షణాలు మా జీవితాంతం మా అయిదుగురికి ఉండాలని కోరుకోవడం నా స్వార్ధం అని తెలిసినా భగవంతుడు నన్నేమైనా కోరుకోమంటే ఇదే కోరిక కోరుకుంటాను.
తరువాత  జానకమ్మ గారు నెల రోజుల కొకసారి వచ్చి వడియాలు, అప్పడాలు ఇచ్చి వెళ్ళేది. మొదటి రెండు మూడు సార్లలోనే తను చాలా అభిమానం కల మనిషిగా నాకు అర్ధమయింది. ఇంట్లో టీ త్రాగడానికి మొహమాట పడేది. పొరబాటున టీ త్రాగితే ఇవి కొత్తగా చేసుకొచ్చానమ్మా! రుచి చూసి చెప్పు అని ఏవో స్నాక్స్ 'శాంపిల్' గా ఇచ్చి వెళ్ళేది.
నాకు అర్ధమయిదేమంటే తను ఎక్కడా ఋణపడకూడదన్న సిధ్ధాంతం తప్పని మనిషిలా అన్పించింది.
ఒకటి రెండు సార్లు తనతో ఈమాట అన్నాను.
''నాకు తెలుసు. ఆవిడ అంతే" అని ముక్తసరిగా జవాబిచ్చేవారు. దాంతో నాకు ఆవిడ గురించి తనకు తెలుసు కాని ఆయన చెప్పడంలేదు అని మాత్రం అర్ధం అయింది.
'సరేలే ..... ఆయనే ఎప్పుడో ఒకసారి చెప్పక పోతారా'  అని నేను అడగలేదు ఆయన చెప్పలేదు.
                                                               *******
                          'కాలచక్రం' ఎవరో 'ఏక్సిలరేటరు' తోక్కినట్లుగా గిర్రున తిరుగుతోంది. పిల్లల చదువులు హైస్కూల్ దాటి కాలేజిల్లోకి వచ్చారు. 
ఆరోజు ఆదివారం. ఉదయం 11 గంటలవుతోంది. 
గేటు బయట 'ఆటో' ఆగిన శబ్దమయింది. ఎవరో ఆడవాళ్ళు ఆటో దిగుతున్నారని చూసి గుమ్మంలోనే నిలబడి చూస్తున్నాను. ఎవరో ఆవిడ ఆటో దిగి డబ్బులిస్తుంటే వెనకనుంచి చూసి 'ఎవరబ్బా, తెలిసిన వాళ్ళలా వున్నారు' అని బయటకు వచ్చి చూసే సరికి 'జానకమ్మ గారు'.
ఇంత ఉదయాన్నే వచ్చిందేమిటి ? అందునా చేతిలో సంచులేమీ లేవు. కొద్దిగా విచిత్ర మన్పించింది. కొత్త చీరలా వుంది. మనిషి కూడా ఏదోలా కొత్తగా, సంతోషంగా కన్పించింది. 
తల దువ్వుకుంది. గుడికి వెళ్లి వస్తున్నట్లుగా ఉంది. చేతిలో కొబ్బరిచిప్ప, పూలు వాటితో బాటు ఓ పాత బౌండ్ 'నోట్ బుక్' ఉన్నాయి. ఇదివరలో ఎప్పుడు చూసినా నెత్తి మీద కొండంత భారం మోస్తున్న భూదేవిలా ఉండేది. ఇప్పుడు భారం అంతా దింపేసి నింపాదిగా, బాదరా బందీ లేని మనిషిలా కన్పించింది. లోపలికి వస్తూ ''మీ ఇంటి దగ్గర రామాలయానికి వచ్చానమ్మా.ప్రక్కనే కదా అని ఇలా వచ్చాను" అంటూ ప్రసాదం, పూలు నాచేతిలో పెట్టింది. 
నేనడగబోయే ప్రశ్నకు ముందు గానే సమాధానం చెపుతూ ''ప్రసాదరావుగారు ఉన్నారా అమ్మా ?" చాలా నెమ్మదిగా అడిగిందావిడ.
''ఉన్నారండీ.ఈవేళ ఆదివారం కదా.రండి" అంటూ బయట గదిలో సోఫా చూపించాను.
ఇంట్లోకి వెళ్లి బెడ్ రూం టి.వి. ముందు పిల్లలతో కూర్చుని ఏదో ప్రోగ్రాం చూస్తున్న ఆయనకు 'జానకమ్మ' గారు వచ్చారని చెప్పాను.
ఆయన వెంటనే లేచి బయటకు వెళ్ళారు. మళ్ళీ అనిపించింది నాకు. వీళ్ళకి ఏదో పాత పరిచయం ఖచ్చితంగా ఉందని.
రెండు నిముషాల్లో నేను ఆవిడకి మంచి నీళ్లు తీసుకు వెళ్ళాను. ఆయన ఇందాక ఆవిడ చేతిలో ఉన్న పాత 'నోట్ బుక్' పేజీలు తిరగేస్తున్నారు.
'నోట్ బుక్' తిరిగి ఆవిడకిచ్చాక ఆవిడ ''ఇక వస్తాను నాయనా'' అంది.
''అప్పుడే వెళ్తున్నారా.కొద్దిసేపు ఆగండి.కాఫీ తెస్తాను'' అన్నాను నేను.
''లేదమ్మా మా చెల్లెలు ఇంటికి కూడా వెళ్లి ఇంటికి వెళ్ళాలి''.అంటూ వెంటనే బయలు దేరింది ఆవిడ.
ఆవిడ అటు వెళ్ళగానే ''ఏమిటండీ ఆ నోట్ బుక్,.మీకు చూపెడ్తోంది? ఏవిటీ ఆవిడ కధ.ఈరోజు కొద్దిగా విచిత్రంగా వుంది.ఏమైనా నాకు చెప్పకూడని విషయమా? ఇదివరకు అడిగినా ఇన్ని సంవత్సరాలుగా ఏమీ వివరాలు చెప్పలేదు. అంతగా నాతోకూడా చెప్ప కూడని విషయమైతే వదిలేయండి'' నిష్టూరంగా అన్నాను.
''ఇందులో దాపరికమేమీ లేదు. నీకు చెప్పకూడని విషయమూఅంతకంటే కాదు. అది ఆవిడ ఎకౌంటు బుక్.  ఆవిడంటే నాకు మా అమ్మమీద ఉన్నంత గౌరవం. ఆవిడలాంటి గొప్ప వ్యక్తిత్వం, అభిమానం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు" చాలా కూల్ గా సమాధానం చెప్పి నా చేయి పట్టుకుని సోఫా లో తన పక్కనే కూర్చోపెట్టి చెప్పడం మొదలెట్టారు తను.
''నేను హైదరాబాదులో మొదటిగా 'జాబు'లో చేరినప్పుడు 'శర్మ' గారని నా ఫస్ట్ బాస్. ఈ జానకమ్మ గారు ఆయన భార్య. నాకప్పుడు హైదరాబాదు లో ఎవరితోనూ పరిచయం లేదు, తెలిసిన వాళ్ళు లేరు. ఈ మహానగరంలో అంతా కొత్త.హైదరాబాదులో దిగగానే సరాసరి ఆఫీసుకే వెళ్లాను.
శర్మగారు వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లారు. వారి ఇంటి దగ్గరే ఒక రూం అద్దెకు చూశారు. ఆయన స్కూటరు మీదనే ఆఫీసుకి వెళ్ళేవాడిని. నేను హైదరాబాదు వచ్చే సరికి నాన్నగారు చెల్లెలి పెళ్ళికి చేసిన అప్పులు, నేను చేసిన కొన్ని చిన్న చిన్న అప్పులు. వాటిని తీర్చడానికి విపరీతమైన వత్తిడి ఉండేది. నెలకింతని కొంత అప్పు తీర్చేవాడిని. అప్పులుకూడా శర్మ గారి సాయంతోనే ముందుగానే తీర్చేసి మెల్లగా ఆయనకు తిరిగి ఇచ్చేశాను. ఎన్నిసార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేశానో లెక్కే లేదు.
జానికమ్మ గారిని 'పిన్నిగారూ' అని పిల్చేవాడిని. వాళ్లకి పిల్లలు లేరు. నన్ను పెంచుకుంటానని సరదాగా అనేది ఆవిడ. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేయకుండా వెళ్లనిచ్చేవారు కాదు. 
నిజంగా ఆవిడ అన్నపూర్ణమ్మ తల్లే. 
శర్మగారు ఆఫీసు అయ్యాక విపరీతంగా పేక ఆడే వారు ఆఫీసులో ఉన్న కొంతమంది పేకాటరాయుళ్ళతో. ఆదివారాలు, శలవులు వచ్చాయంటే మనిషి కన్పించేవారు కారు. రాను రాను పేకాట పిచ్చి ఎక్కువయింది. జీతం మొత్తం అక్కడే అయిపోయేది. ఆవిడ ఎంత మొత్తుకున్నా ఆవిడ మాటలు గాలికొదిలేసే వారు. ఎక్కడ బడితే అక్కడ అప్పులు చేయడం మొదలెట్టారు. చివరికి పాలవాడిని కూడా వదలలేదు. ఆయనంటే ఆఫీసులో అందరికీ అమితమైన గౌరవం. పాదరసం లాటి మెదడు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా అయన సాయం చేయడంలో ముందు ఉండేవారు. అంచేత ఆయనకు అప్పుఇచ్చేవారు. అప్పులెక్కువయ్యేసరికి తిరిగి ఇవ్వడం తిరిగి ఇవ్వడం తక్కువయిపోయింది. అప్పుల వాళ్ళు ఇళ్ళకి రావడం మొదలెట్టారు.
నాదగ్గర అయితే లెక్కే లేదు.ఎన్నిసార్లు చేబదులు అంటూ డబ్బు తీసుకున్నారో! ఒకసారి నేనిక ఉండబట్టలేక చెప్పేశాను.
''సార్! నేను ఇంటికి డబ్బు పంపించడానికి ఇబ్బందవుతోంది. ఇక నన్ను డబ్బు అడగకండి సర్!" అని చాలా మొహమాట పడుతూ చెప్పాను. నన్ను మరి అడగలేదు. ఆఫీసులో పరిస్థితి దారుణంగా తయారయింది. ఆఫీసులో ఆయన ఎవరినీ వదలలేదు. దాదాపు ఒకరిద్దరు తప్ప అందరు అప్పు ఇచ్చిన వారే.
శర్మ గారు కన్పిస్తే చాలు.మనుషులు తప్పుకు తిరగడం మొదలయింది. 
''అప్పు లక్షకు పైగా అయింది'' అని ఒకసారి జానకమ్మ గారు నాతో చాలా బాధ పడుతూ అన్నారు.
''మీకు ఎలా తెలుసు ?" అని ఆవిడను అడిగాను.
''ఆయనే చెప్పారు.ఎక్కడో లెక్క వ్రాస్తున్నారట'' అని చెప్పింది ఆవిడ. 
ఇంతలో మమ్ముల్ని డిస్టర్బ్ చేస్తూ ''అమ్మా.ఆకలవుతోంది" అంటూ ముగ్గురు పిల్లలు ఒక్కసారి గదిలోంచి బయటకు వచ్చేశారు. అంతటితో అక్కడికి 'సశేషం' అయిందా కధ !
ఆదివారం కావడంతో నేను కూడ పనిలో నిమగ్నమయి మళ్ళీ ఆ టాపిక్ రైజ్ చేయలేదు ఆరోజుకి.
మరుసటి రోజు ఉదయం ఆయన ఆఫీసుకి వెళ్లారు. వెళ్ళిన గంటకే అంటే పదకొండు గంటలకు ఆయనదగ్గరనుంచి ఫోను... ఇంట్లో డబ్బు ఎంత వుందో తీసుకుని రెడిగా ఉండమని బయటకు వెళ్లాలని చెప్పిన పది నిముషాల్లో వచ్చి నన్ను బైక్ మీద ఎక్కించుకుని బయలు దేరారు. తనని చూడగానే అర్ధమయింది...ఏదో కాకూడనిది అయిందని.
తనే కొద్ది బైక్ మీద కొంత దూర మెళ్ళాక అన్నారు. జానికమ్మ గారు పోయారట. అక్కడికే వెళ్తున్నాం.
''డబ్బు ఎంత వుంది?'' అడిగారాయన. జానకమ్మ గారు పోయారట....అన్నమాట వినడం తోనే నేను దిగ్భ్రమ చెందాను. నిన్న ఉదయం చూశానావిడను. ఎప్పుడూ లేనిది ఆవిడ ఎంతో సంతోషంగా 
కనిపించింది. కొత్త చీర కట్టుకుంది. చనిపోతున్నట్లు తనకి ముందే తెలుసా? ఏమైనా ఆత్మహత్యా? మనసు పరి పరి విధాల పోతోంది. 
''ఏయ్....నిన్నే.ఎక్కడవున్నావ్ ?" అని ఆయన బైక్ నడుపుతూనే వెనక్కి తిరిగి బిగ్గరగా అడిగేసరికి ఈ లోకం లోకి  వచ్చాను నేను.
''ఆ...ఆ.....ఏదో పరధ్యానంలోకి వెళ్లాను.పాపం ఆవిడ గురించే ఆలోచిస్తున్నాను''
''సరే, డబ్బు ఎంత తెచ్చావు ?'' మళ్ళీ అడిగారాయన
''ఇంట్లో ఉన్నదంతా తెచ్చాను. షుమారు పదిహేను వేల దాకా ఉంది'' చెప్పాను నేను.
పావుగంటలో చేరాము రాంనగర్ గుండు దగ్గర జానకమ్మ గారి ఇంటికి .
ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు. రెండు గదులు.పెద్ద కాంపౌండ్. మూడు నాలుగు పోర్షన్లు. మామిడి, జామ, కొబ్బరి చెట్లు ఉన్న లోగిలి.
ఆవిడని బయట రూంలో చాప వేసి పడుకోపెట్టారు. మేము వెళ్తూనే అచ్చు జానకమ్మగారిలా ఉన్నావిడ బయటకు వచ్చి బోరున ఏడ్చేసింది.
"మొన్న శుక్రవారంతో అన్ని పూర్తిగా అప్పులన్నీ తీర్చేసి శనివారం నాడు పన్నెండు సంవత్సరాల తరువాత గుడికి వెళ్లి వచ్చింది బాబూ. నిన్న గుడికి వెళ్లి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి కాసేపు ఉండి నన్నుతనతో రమ్మని బలవంతంగా తీసుకువచ్చింది. బావ పోయాక దాదాపు పన్నెండు సంవత్సరాల తరువాత మాఇంటికి వచ్చింది. చాలా సంవత్సరాల తరువాత అర్ధరాత్రి దాటిం దాకా చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నాము. తెల్లవారే  సరికి ఇలా అవుతుందని కనీసం నాకు ఊహా మాత్రంగానైనా తోచలేదు. రాత్రి కబుర్లలో రెండు మూడు సార్లు ఇక తన ఇక బ్రతికి ఉండవలసిన అవసరం లేదంది. ఇన్నాళ్ళు బ్రతికి ఉండడానికి కారణం బావ చేసిన అప్పులేనంది. నీ సాయం గురించి పదే పదే చెప్పింది. దేవుడేదైనా వారం కోరుకొమ్మంటే నీలాటి వాడిని కొడుకుగా కావాలని కోరుకుంటానంది. చివరిగా నీ గురించి ఒక్కమాట చెప్పింది. తనకు తెలిసి నీ ఒక్కడి ఋణం కావాలని తీర్చకుండా వెళ్లి పోతానంది. 
'ఎందుకే అలాగా?' అంటే దాని సమాధానం. అతనికి ఋణపడి ఉంటె వచ్చే జన్మ అంటూ ఉంటె అతనింత పుట్టి అతని ఋణం తీర్చుకుంటానంది.
ఋణ విముక్తురాలయినందుకు ఏదో తెలీని బాధ, సంతోషం మిళితమైన ఆవేశంలో మాట్లాడుతోంది అనుకున్నా. కానీ తనువు చాలించే శక్తి ఇంతలా తనలో ఉందని ఊహించలేకపోయాను. 
శర్మ బావగారు చనిపోయాక మొదటిసారిగా చాలా సంవత్సరాల తరువాత 'జానకి' సంతోషంగా ఉండడం నిన్నచూశాను. చిన్నవాడి వైనా నీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాబాబూ! 
మే మేవ్వరం దాని కష్ట కాలంలో వెన్నంటి లేము. కన్నతల్లిలా చూశావట. ప్రతి రోజు తిన్నదో లేదో కనుక్కునే వాడివట. నీ ఋణం తీర్చుకోలేనంది. కన్నకొడుకు ఉంటే చూశే వాడో లేదో కాని ప్రసాదరావు నన్ను తల్లిలా ఆదరించాడంది. నాకో కొత్త చీర కొని ఇచ్చింది. జీవితంలో ఏమి అనుభవించిందో లేదో, బావగారు పోయాక మా ఎవరి ఇండ్లకు రాలేదు. ఎవర్నీ సాయం అడగలేదు. తిన్నదో, లేదో తెలీదు. బావగారు పోయిన రోజుల్లో 'నా దగ్గరికి రావే,నా దగ్గరే ఉండు' అని నేనన్న మాటలకు దాని సమాధానం నాకు ఇంకా గుర్తుంది.
''వద్దు లేవే! నేను బాగా ఉన్నప్పుడు రావడం వేరు.ఇప్పుడు రావడం వేరు. నా దురదృష్టం మీకేవరికి అంటకూడదు.పోయినాయనకేం, మహారాజులా వెళ్ళిపోయారు. ఆయన వదిలి వెళ్ళిన పనులు ఉన్నాయి..అవి పూర్తి చేయాలి. ఈ జీవితకాలం దానికే సరిపోతుందేమోనే'' అన్న మాటలు ఇప్పటికీ నా కింకా గుర్తున్నాయి. ఆ మాటల్లో మర్మం నాకప్పుడు అర్ధం కాలేదు. 
తరువాత కొన్ని విషయాలు తెలిశాయి. నేను సాయం చేయడానికి ముందు కొచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించింది. నన్ను మళ్ళీ తనని కలవడానికి కూడ రావొద్డంది. ఈ పన్నెండు సంవత్సరాలలో నా అంతట నేను తనని కలవడమే గాని తనంతగా తాను మాఇంటికి గాని చుట్టాల ఇండ్లకు గాని రాలేదు. ఎవరి దగ్గరా ఇస్తామన్నా పైసా సాయం తీసుకోలేదు. ఎవరింటా ఏ కార్యానికి రాలేదు. రెక్కలు ముక్కలు చేసుకుంది. ఇదిగో ఇలా అనాధ బ్రతుకయింది దానిది" అంటూ బోరుమందావిడ. కంటికీ , మింటికీ ఏక ధారగా ఏడ్చిందావిడ.
నేను ఆవిడను దగ్గరికి తీసుకున్నాను. ఓదార్చాను. తమాయించుకొమ్మని ముందు జరుగవలసిన పని చూడాలని చెప్పాను. ఆవిడ ఏడుస్తుంటే నాకూ ఏడుపు ఆగలేదు.నేను కూడా కొంగ నోటికి అడ్డు పెట్టుకుని మూగగా రోదించాను. 
ఆవిడ కొంగుతో కళ్ళు తుడుచుకుని, తన భర్త, కొడుకు తన వాళ్ళంతా అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారనీ చెప్పింది. 
ఇంతలో ఆయన కల్పించుకుని "బయటగదిలో మూలన ఒక ట్రంక్ పెట్టె ఉన్నదని దానిలో కొంత డబ్బు, ఓ కొత్త చీర ఉన్నాయని తను పోయాక అవి వాడాలని జానకమ్మగారు తనతో అయిదారు నెలల కింద అన్నారని, జానికమ్మగారి చెల్లెలు తో చెప్పారు. 
"అయితే ఆ పెట్టె చూద్దాం రండి'' అని మమ్ముల్ని కూడా లోనికి రమ్మని పిలిచింది.
అందుకు ఆయన '' మీరు వెళ్లి చూడండి'' అని సున్నితంగా చెప్పారు.
నేను, ఆయనా ఒక ప్రక్కగా నిలబడి చెట్లకింద సెటిల్ అయ్యాము. ఈయన ఆఫీసు వాళ్ళలా వున్నారు. చాలామంది వచ్చారు. అందులో చాలామంది ఆడవాళ్ళు వున్నారు. నాకు చాలా విచిత్రమనిపించింది. ఆవిడను చూడ్డానికి ఆఫీసు నుంచి ఇంతమంది రావడమేమిటి? ఆవిడ కనీసం ఆఫీసులో పనిచేసిన వుద్యోగి  కూడా కాదు. కానీ ఇంతమందిని ఇక్కడ చూశాక నాకు అర్ధమయింది ఏమంటే జానకమ్మ గారు మామూలుగా వడియాలు, అప్పడాలు ఆఫీసులు తిరిగి అమ్ముకునే సాధారణ వ్యక్తి కాదు అని నేను స్వగతంలో అనుకుంటుండగానే
పది నిముషాల్లో మళ్ళీ జానకమ్మ గారి చెల్లెలు వచ్చి చెప్పింది.'వారెవరు పైసా ఖర్చు చేయవలసిన పనిలేదని, పాతిక వేల దాకా కాష్, కొద్ది బంగారం, ముత్యం, పగడం, ఓ కొత్త చీర, దాంట్లో ఒక చిన్న చీటీ. అందులో 'ఇవన్నీనా చరమాంకం లో వినియోగించగలరు.ఇంతకు మించి పైసా కూడ ఎక్కువ ఖర్చు పెట్టవద్దు' అన్నమాట వ్రాసి ఉందని చెప్పిందావిడ.
ఇవన్నీచూసి, వినీ నాకు జానికమ్మగారి మీద విపరీతమైన అభిమాన మేర్పడింది.
మనుషుల్లో నిజంగా ఇలాటి నిష్కళంక, పరిపూర్ణ అభిమానధనులయిన మనుషులు ఉంటారా? అందునా ఒంటరి ఆడమనిషి, జీవితంలో విలువల కోసం ఇంత పోరాటం సాగించి, అనుకున్నది సాధించిన వెంటనే తన మరణాన్ని తనే శాసించుకుని వెళ్ళిపోయింది. మనసులోనే ఆవిడకు జోహార్లు అర్పించాను.
ఈ జీవిత పోరాటంలో ఆవిడకు బాసటగా నిలబడిన ఆయన్ని కూడా మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయాను.  ఆవిడ గురించి, ఆవిడ జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉత్సుకత ఏర్పడింది.
'బ్రహ్మగారు' వచ్చారు. జానకమ్మగారి చెల్లెలి కొడుకుతో కార్యక్రమమంతా చేయిస్తున్నారు.
'మహా ప్రస్థానం' వాన్ వచ్చింది. ఆయన నన్నుఇంటికి వెళ్ళమన్నారు. నేను ఆటోలో ఇంటికి వచ్చేశాను.
అయన ఇంటికి వచ్చేసరికి దాదాపు సాయంత్రం ఏడు గంటలు దాటింది.
రావడంతోనే స్నానం చేసి ''నేను ఏమీ తినను.నన్ను లేపవద్దు'' అనిచెప్పి పడుకున్నారాయన.
నాకూ మనసు బాగోలేక నేను తినలేదు. పిల్లలు భోజనం చేసి వాళ్ళ చదువుల్లో వాళ్ళు బిజీ అయ్యాక నేను వచ్చి పడుకున్నాను. ఈయన పడుకున్నారు కానీ నిద్ర పోయినట్లు లేదు.
నేను రూము లోకి వెళ్లేసరికి ఆయన ప్రక్కకి తిరిగి పడుకున్నారు.
''ఇంకా నిద్ర పోలేదా? చాలా లోగొంతుకతో అడిగాను తనని.
''ఉహూ.నిద్ర రావడంలేదు''.
''తలనొప్పిగా ఉందా...అమృతాంజనం రాసేదా?" అనునయంగా అడిగాను.
"లేదు.తలనొప్పి లేదు.చాలా బాధగా ఉంది. 'ఆవిడ'...అని అయన అంటుండగానే ఆయన గొంతు గాద్గదమైంది.
''దాదాపు పదిహేను సంవత్సరాలనుంచి చూస్తున్నాను. శర్మగారు పోయిన రోజునుంచి రోడ్డు మీద పడిన మనిషి తన కోసంకాక భర్త చేసిన అప్పులు తీర్చడంకోసం బ్రతికింది. అనుకున్న దానికంటే రెట్టింపు అప్పులున్నాయి ఆయన చనిపోయే నాటికి. లోన్ లు అన్ని మినహాయించుకున్నాక ఆఫీసు నుంచి పెద్దగా ఏమీ రాలేదు. ఇల్లు అమ్మినా తీరలేదు అప్పులు. ఆయన చేసిన అప్పులన్నీ క్షుణ్ణంగా ఒక నోటు బుక్ లో విపులంగా వ్రాశారు. 
ఎన్నిసార్లు అన్నదో నాతో ''ఈ వెధవ బ్రతుకు ఎప్పుడో చాలించేదాన్ని ప్రసాదూ!ఆయన చేసిన అప్పులు నన్ను బ్రతికిస్తున్నాయని...జీవితంలో కష్టాలను ఎవరికీ పంచకూడదని, ఎవరైనా తమ కష్టాలను పరవారికి చెప్పకూడదని, అలా చేస్తే మనం పల్చనవుతామని!" అదే నోట్ బుక్ మొన్న నాకు ఆవిడ చూపించింది. 
ఒక్కొక్కటి చొప్పున అప్పులన్నీ తీర్చేసింది ఆవిడ . కొంతమందికి, వాళ్ళు శర్మ గారికి అప్పుఇచ్చిన గుర్తు కూడా లేదు. వారెవరు తనని అప్పు తీర్చమని అడగలేదు కూడా.... అయినా సరే ఒక్కొక్కరిని కలిసి అప్పులు తీర్చేది. కొంతమంది ఈవిడ ఆఫీసుకి వచ్చిన రోజు ఆవిడను తప్పించుకు తిరిగేవారు. ఎందుకంటే ఆవిడ దగ్గరనుంచి శర్మగారికి ఇచ్చిన డబ్బు తీసుకోవడం ఇష్టంలేక. 
అలా ఆవిడ డబ్బు తిరస్కరించిన వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారివి వారి కివ్వవలసిన డబ్బు వారి  టేబుల్ మీద పెట్టి వెళ్ళేదావిడ. కొందరికి ఇళ్ళకు కూడ వెళ్లి అప్పు చెల్లించేది. ఆ నోట్ బుక్ లో వ్రాసిన అప్పులన్నీ తీర్చడానికి ఆవిడకు ఇన్నిసంవత్సరాలు పట్టింది. నోట్ బుక్ లో చివరి అప్పు శుక్రవారం నాడు తీర్చేసింది. నాకు తెలుసు ఆ చివరి అప్పు తీర్చేశాక ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదని! కానీ ఇంత త్వరగా ఆవిడ కనుమరుగై పోతుందనుకోలేదు'' ఆయన గొంతు పూర్తిగా గాద్గద మయింది.

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య.
Mob. No.9849118254