ప్రేమ-దైవత్వం
ఉన్నతమైన ఆలోచనలు , ఆశయాలని దరి చేర్చుకునే వారే గొప్పవారు. అందరి మంచితోను అందరి ఆనందం ఉందని గ్రహించినవారే నిజమైన శ్రీమంతులు. అశాశ్వతమైన వేవో, శాశ్వతమైన వేవో భగవంతునికి ఇష్టమైన వేవో వీరు గ్రహించగలరు. ఇలాంటి మహా వ్యక్తులవల్లనే సామరస్య భావ మాధుర్యాలు జనవాహినిలో జీవం పోసుకుంటాయని లోక హితైషుల ఉద్బోధ.
ప్రపంచంలో ధనవంతులు, విద్యాధికులు, అనేకనేక రంగాలలో పేరుప్రఖ్యాతులు పొందినవారు, విజ్ఞాన ఖనులు ఉంటారు. కాని 'మానవప్రేమ'ను గ్రహించి ఆచరణలో పెట్టగలిగే వారికోసం అన్వేషించవలసి వస్తోంది. మనం వేరు, వారు వేరు అని ధనిక, పేద వర్గాల మధ్య, కులమతాల ప్రాతిప్రదికగా మనుషుల మధ్య అడ్డుగోడలు కట్టేవారు, అలా అలోచించేవారే శాతమే మనలో ఎక్కువ. పైగా వారి సంకుచిత ధోరణలు, ఇంపైన మాటలు ఆసక్తిగా వినేవారు ఎక్కువమందే మనలో వున్నారు. ఫలితంగానే ధర్మేతర శక్తులు తలెత్తుతున్నాయని శాంతి కాముకుల ఆవేదన. సాటి మనుషుల్నిప్రేమించడం, కష్టకాలంలో వారిని ఆదుకోవడం, మృదుభాషణం ....ఇవన్నీ అశాశ్వతమైన సంపదకన్నా, వజ్రవైడుర్యాలకన్నావిలువైనవేనన్న మహాత్ముల ప్రభోధాలను ఆచరించడంలో విఫలమవుతున్నారు, విస్మరిస్తున్నారు. మనుషులు 'తమని' ఆరాధించే వారికన్నా బక్క బ్రతుకుల ఆర్తులను ఆదరించేవారిని భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడని తత్వవేత్తల అమృతవాక్కు. ఇదే ప్రపంచంలో ఉన్న అన్ని మతాల
పవిత్రభావాలకు జీవ వాయువు. అందువల్లనే హృదయంలో మానవత్వం నిద్రపోతే 'దైవత్వాన్ని' దూరంచేసు కున్నట్లే నని తత్వవేత్తలు, మహర్షులు అన్నారు. ' ఆర్తులను' ఆదుకునే మనసు, శక్తివంచన లేకుండా సహాయం చేయడమే 'లక్ష్యం'గా చేసుకున్న మనుషులంతా మహనీయులే. అంతేకాక సర్వజనుల సుఖ సంతోషాలు కోరి, ఏనాడు ప్రత్యుపకారం ఆశించని వారి 'మానవసేవ' అభినందనీయమే....అజారామరమే ! వారంతా విశ్వప్రేమ తపస్వులే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి