లేబుళ్లు

14, సెప్టెంబర్ 2021, మంగళవారం


                                                                   ఆపన్నులు 
                                                                  ==========  

సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నర గంటలు. రాజగోపాలస్వామి గుడి గంట ఠంగ్…ఠంగ్ మంటూ వాయులీనమైన ప్రతిధ్వనితో మ్రోగింది. ఆరోజుకిక గుడి ద్వారం మూసి తాళంవేసి భక్తులందరూ వెళ్ళారా లేదానని చూశాడు పూజారి తిరువనంతాచార్యులు. లైట్లన్నీఆర్పి ఆలయపు ఆవరణలోనే మిద్దెపైనున్ననివాసానికి వెళుతూ చావడి మూలన ఏదో ఆకారం కదిలినట్లనిపించి లైట్ వేశాడు. ఎవరో వ్యక్తి  గోడనానుకుని కాళ్ళు జాపి కూర్చుని జోగుతున్నట్లనిపించి ''ఎవరదీ?" గద్దించి అడిగాడు పూజారి. అతన్నుంచి సమాధానం లేదు.  
''గుడి మూశాను ... ప్రసాదం అయిపోయింది. అందరూ వెళ్లారు. మీరు కూడా వెళితే బయట తలుపులు మూస్తాను" అన్నాడు పూజారి. 
అతనిలో కదలిక లేదు. కంగారుగా నాలుగంగల్లో అతన్ని చేరి మసక వెలుతురులో పరికించాడతణ్ణి. వయస్సు సుమారు ఏభై ఐదు, అరవై సంవత్సరాల మధ్య ఉంటాయి. పొట్టి లాల్చీ, జీన్స్ ప్యాంటులోఉన్నాడు.
చేతికి ఖరీదయిన వాచీ, ఉంగరపు వేలుకి వజ్రపుటుంగరం. పక్కనే బ్యాక్ ప్యాక్. 
ఉన్నవాడిలా కన్పించాడతను. తక్షణం అతని చేయి నందుకుని 'నాడి' పరీక్షించాడు.  మెల్లగా కొట్టుకుంటోంది. ఆయుర్వేద వైద్యంలో ప్రవీణుడయిన పూజారి తిరువనంతాచార్యులకి స్పష్టమయింది ఆవ్యక్తి  తినక నీరసంతో స్పృహకోల్పోయాడని.
భార్య పారిజాతంను కేకేసి "త్వరగా గ్లాసెడు మంచినీళ్లు తీసుకురా" బిగ్గరగా అరిచాడు పూజారి, మిద్దెపైనున్న భార్యకు వినిపించేలా. పరుగున మంచినీళ్ళు తెచ్చిందావిడ. 
నీళ్లు చిలకరించాడతని మొహాన పూజారి. 
అతని కనురెప్పలు కదిలాయి. మెల్లగా కదిలాడు. కదులుతున్న కనుగుడ్ల ఆనవాలు కనురెప్పలపైనుంచి పసిగట్టి, గట్టిగా తడుతూ అతన్నిస్పృహలోనికి రప్పించే ప్రయత్నం చేశాడు పూజారి. 
నీరసంగా కళ్లు తెరుస్తూనే పూజారి వంక చూస్తూ ''అనంతూ!'' అన్నాడతను హీన స్వరంతో. 
ఆ పిలుపుకు అనూహ్యంగా స్పందించింది అనంతాచార్యులు హృదయం. 
మనసు ఉత్తేజితమయిందిఒళ్ళు గగుర్పాటు చెందింది. వివశుడయ్యాడు పూజారి.         
ముప్ఫై అయిదు సంవత్సరాలపైమాటే అతనా పిలుపువిని. 
"ప్రకాశం...నువ్వా."!? ఒళ్ళు తెలియని ఉద్వేగంతో లేచి ఒంగుని ప్రకాశం భుజాలు పట్టుకుని కుదుపుతూ మోకాళ్ళమీద నిలిచి, అతని తల వెనకాలగా ఎడమచేతిని ఊతంగా చేర్చి కాసిన్ని మంచినీళ్లు పట్టాడతనికి.  
కొద్దిగా తేరుకుని కళ్ళు తెరిచి కొద్దిగా వెనక్కి జరిగి నీరసంగా గోడకు జేరగిలబడ్డాడు ప్రకాశం. 
"పారిజాతం! కొద్ది పంచదార వేసి త్వరగా వేడిపాలు తీసుకురా" అని భార్యకు చెప్పాడు 
తిరువనంతాచార్యులు. 
వేడి పాలుత్రాగి కొద్దిగా తేరుకున్నతను "అనంతూ... నీలో పెద్దమార్పేమీ లేదు. వయస్సు ఛాయలు కనబడుతున్నాయి. అంతే! నన్ను గుర్తించలేదు కదూ!" రహస్యం చెబుతున్నట్లుగా మెల్లగా అన్నాడు ప్రకాశం
"తరువాత మాట్లాడదాం ప్రకాశం! ఎప్పుడు తిన్నావు?" ప్రశ్నించాడు తిరువనంతాచార్యులు.
"నిన్నఉదయం భోజనం చేశాను. తరువాత ఏమీ తినలేదు. గుడి లోనికి వస్తూనే కళ్ళు తిరిగినట్లనిపించింది. ఈ మూలకు వచ్చి గోడకానుకుని కూర్చున్నాను. తరువాత ఏమైందో తెలియదు" అన్నాడు ప్రకాశం. 
"నీరసంగా ఉన్నావు. కొద్దిగా తిని, విశ్రాంతి తీసుకుందువుగాని. ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు" అంటూ ప్రకాశానికి చేతినందించి మిద్దె పైన తనింటికి  తీసుకెళ్లాడు తిరువనంతాచార్యులు. 
                                                                   * * * * *        
తెల తెలవారుతూనే గుడి గంటలు, సుప్రభాత మంత్రాలు వినబడ్డాయి ప్రకాశానికి. లుంగలు చుట్టిన పాత దూది పరుపు మీద చిరుగుల తెల్లటి చలువ దుప్పటి, కొసలు వ్రేలాడుతున్న తెల్లటి గలీబులో గట్టి పల్చని దిండు. పేదరికం తాండవిస్తూ కనిపించిందా ప్రదేశం. పక్కనే ఇంకొక పరుపు చుట్టేసి ఉంది. 
'ఓ! ... రాత్రి అనంతు ఇక్కడే పడుకుని లేచి వెళ్లినట్లుంది' అనుకుంటూ రాత్రి జరిగినదంతా మననం చేసుకుని, లేచి కూర్చుని పరిసరాలు పరికించి చూశాడతను. 
గోడలకి తాపడం చేసిన చైనా పింగాణీ టైల్స్, బెల్జియం అద్దాలతో నిగలాడుతూ ఉండే ఆ అద్దాలచావడిని శిధిలావస్థలో చూసి చలించిపోయాడు ప్రకాశం. 
గోడలుకున్న టైల్స్ ఊడి సున్నపు తాపడం పెచ్చులు ఊడుతున్న గోడలు, 
నెర్రెలు బాసి ఎర్రటి తారసు బిళ్ళలు జారి ఊడి పడేట్లుగా ఉన్న పైకప్పు, జీవంపోయి ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా వుంది. మాసిన చావడిలో మూసివున్న రెండు పడక గదులు.  ఇంకొక పక్క నల్లమద్ది భోషాణం, పాత పందిరిమంచం, మూలగా చేతులు విరిగిన టేకు కుర్చీల కుప్ప, ఆ మిద్దె  ఒకప్పటి వైభవానికి సాక్షీభూతంగా పడివున్నాయి. కిటికీ నుంచి కనిపించే పూలతోట, తులసి వనం, పెద్ద నందివర్ధన చెట్టు మాయమయ్యాయి. తోట చుట్టూవున్న ప్రహరీ గోడ ఆనవాళ్లులేవు. 
పిల్లల ఆటస్థలమైనట్లుగా వుంది. వేప, రాగి, ఉసిరి వృక్షాల ఉనికే లేదు. 
అదే ఆవరణలో బాల్యంలో తిరుగాడిన జ్ఞాపకాలు దొంతర్లుగా ప్రకాశం బుర్రలో తిరుగాడాయి.
                                                            * * * * *
"అనంతూ! ఈ రోజు సినిమాకెళదాం" పన్నెండో తరగతి సంవత్సర చివరి పరీక్షవుతూనే అన్నాడు ప్రకాశం. 
"వెళదాం గాని ఏమైంది మీ నాన్నగారి తిరుగు ప్రయాణం?"  అన్నాడు అనంతు 
"అదే అనంతూ ! ఎలా చెప్పాలో అర్ధంగావడం లేదు. నాన్నగారొక్కరే అమెరికా వెళతారనుకున్నాను. కాదట! కుటుంబం అందరం వెళ్ళితున్నామట. ఇక నా చదువక్కడే. 
మళ్లీ వస్తామో, రామో... తెలీదనంతూ !" అంటూ అతన్నిచుట్టుకుని బావురుమన్నాడు ప్రకాశం.   అనంతు ముఖం ఒక్కసారిగా వివర్ణమైంది. 
ప్రాణస్నేహితుడు తనని వదలి వెళ్లిపోతున్నట్లుగా అర్ధమయింది. కాళ్లక్రింద భూమి 
కదులుతున్నట్లనిపించిందతనికి. 
'నాచదువంతటితో ముగిసినట్లేనా ? ఇన్నాళ్లు ఖర్చు భరించి చదివించిన స్నేహితుని తండ్రి వెళ్లిపోతున్నారు. భవిష్యత్తు అర్ధం కావడంలేదు' అనుకుంటూ  
"కలిసి బి.ఇ చేద్దామనుకున్నాం కదా! చదువక్కడే అంటావేంటి ? తిరిగి రావడంలేదా?  
మరి ఆస్తి, ఇల్లు, గొడ్లు... ?" తిరిగివస్తామని చెబుతాడేమోనన్న గంపెడాశతో అన్నాడనంతు.   
మౌనంగా నేలచూపులు చూస్తున్న ప్రకాశాన్ని చూసి "అవును కదా! ఆవిషయాలు నీకెలా తెలుస్తాయి? మన చేతిలో ఏముంది. పెద్దవాళ్ళ నిర్ణయం. మనమేం చేయగలం" అన్నాడు అనంతాచార్యులు పరిస్థితనవగతం చేసుకుని నిట్టూరుస్తూ. 
"నిజంగా ఆవిషయాలు నాకు తెలియవనంతూ! నాన్నగారినడిగాను, నీ చదువుగురించి ఫీజులగురించి..." మొహమాటంగా అన్నాడు ప్రకాశం. 
"ఆయనేమన్నారు ?"
"నీ వెంతవరకు చదివితే అంతవరకూ తనే చదివిస్తానన్నారు. వెళ్ళేలోపు కొంత డబ్బు మీ నాన్నగారికిచ్చి నీ చదువు విషయం మాట్లాడతానన్నారు" అన్నాడు ప్రకాశం. 
అనంతు ముఖం వికసించింది.        
ఆ వారం రోజులు సినిమాలు, షికార్లు ఒకర్నొకరు వదలకుండా తిరిగారిద్దరు స్నేహితులు.
                                                                * * * * *
ప్రకాశం వెళ్లే రోజు రానేవచ్చింది. తిరువనంతాచార్యుల చదువుకయ్యే మొత్తం ఖర్చుతనే భరిస్తానని భరోసాఇచ్చి, చదువు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపవద్దని చెప్పి కొంత డబ్బు ఇచ్చివెళ్లారు ప్రకాశం నాన్నగారు. చిన్ననాటి నుంచి కలిసి చదుకున్నప్రాణస్నేహితులు అలా విడిపోయి 
'చికాగో' వెళ్ళిన ప్రకాశం ఇప్పడిలా ప్రత్యక్షమయ్యాడు దేవాలయంలో.   
                                                               * * * * *
ప్రకాశం నిద్రలేచాడో లేదో చూద్దామని అక్కడికొచ్చిన పారిజాతం 
"లేచారా బాబూ! గుడి వెనకాల చేద భావి ఉంది. బ్రష్ చేసుకుని వస్తే కాఫీ ఇస్తాను" అని చెప్పివెళ్ళింది పారిజాతం.  
"అలాగేనమ్మా!" అంటూ లేచి పక్కబట్టలు మడత బెట్టి బ్యాగ్ తో కిందకు వెళ్లి బ్రష్ చేసుకుని, మొండిగోడల బాత్రూమ్ లో స్నానం చేసి పైకి వచ్చేసరికి  గుళ్లో పూజ ముగించుకుని వచ్చాడు తిరువనంతాచార్యులు.
తేరిపార చూశాడు ప్రకాశం స్నేహితుని వంక.  
రాని వయస్సు ముఖంలో కనబడుతున్నా తరగని ముఖ వర్చస్సు, చెరగని చిరునవ్వు, ఉంగరాలు తిరిగి భుజాలమీదకు జారిన వత్తైన నల్లటి జులపాల జుట్టు, నిగ నిగలాడే నల్లటి విగ్రహం, దిద్దిన  తిరునామాలు! 
అప్రయత్నంగా లేచి నిలబడి తలవంచి రెండుచేతులు జోడించి నమస్కారం చేశాడు ప్రకాశం. 
ప్రతి నమస్కారం చేసి రెండుచేతులు పైకెత్తి "ఆయుష్మాన్ భవ'' అని అలవాటుగా  దీవించి, ప్రకాశం చేతిని పట్టుకుని పరీక్షించి "నాడి నిక్షేపంలా వుంది. ఇక చెప్పరా... ప్రకాశం!" అన్నాడు తిరువనంతాచార్యులు . 
ఇంతలో పారిజాతం కాఫీ తేవడంతో ఇద్దరు కాఫీ ముగించుకుని హాలులో కూర్చున్నారు. 
"నోరు జారాను. ఏమీ అనుకోవద్దు ? ఏమిటీ రాక ? ఎక్కడనుంచి ? ఎక్కడ దిగావు ? అమెరికానుంచెప్పుడొచ్చావు?" చొరవగాఅడిగాడు తిరువనంతాచార్యులు.   
"ఏం ఫరవాలేదు. నువ్వెలా పిలిచినా నాకిబ్బంది లేదు. అలాగే పిలువు ! మనసుకు హాయిగా ఉంది. ఇండియా వచ్చి రెండు వారాలైంది. కాశీనుంచి కన్యాకుమారిదాకా తిరిగి చివరిగా తిరుపతి నుంచి ఇక్కడికి వచ్ఛాను. నా సంగతలా ఉంచు. నేను వెళ్లిన దగ్గరినుంచి నీచదువు, పెళ్లి, పిల్లలు ...అన్ని విషయాలు చెప్పు" అన్నాడు ప్రకాశం.
"ఒక్కడివే వచ్చావా? భార్యా పిల్లలెవరూ రాలేదా? ఎలావున్నారు వారంతా ? నువ్వేమీ బాధల్లో లేవు కదా ? " ప్రశ్నార్థకంగా చూశాడు తిరువనంతాచార్యులు. 
"ఒక్కడినే వచ్చాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. భార్య తెలుగమ్మాయే. అందరూ బావున్నారు. బాగా సంపాదించాను. ఎలాటి బాధలూ లేవు. ఒక ముఖ్యమైన పని మీద వచ్చానిక్కడికి. నీ కథంతా విన్నాక నా విషయాలన్నీ చెబుతాను. ముందుగా నీ వంతు!" అన్నాడు ప్రకాశం.
"ఇన్ని సంవత్సరాలు మాతృదేశానికి, మాతృభాషకు దూరంగా అమెరికాలో ఉన్నా నీ తెలుగుభాషా ఉఛ్ఛారణలో ఏమాత్రం తేడా రాలేదే!"
నవ్వి ఊరుకున్నాడు ప్రకాశం.    
 "నా చదువుకి మీనాన్నగారిచ్చిన డబ్బు ఇంటి అత్యవసరాలకి ఖర్చు చేశారు. బి.ఇ లో సీట్ వచ్చింది. చేర్పించలేదు. నా మాట వినేవారు లేకపోయారు. చదువాగిపోయింది. 
పూజాదికాలు మొదలెట్టాల్సివచ్చింది. మామయ్య కూతురు పారిజాతంతో పెళ్లయింది. 
ఇద్దరు మగపిల్లలు. ఇంటర్ తోనే చదువాపేశారు. ఈవృత్తి వద్దు ... చదువుకొమ్మని చెప్పినా ఇద్దరూ పెడచెవిన బెట్టారు. చదువబ్బలేదు. వృత్తి విద్యకే తల ఒగ్గారు. ఇద్దరూ పూజారులే. పట్నంలోవారి బ్రతుకులు వారీడుస్తున్నారు. ఇక నా సంగతి కొస్తే ... అదిగో! ఆయన, మేము ఒకలాగే ఉన్నాము'' అన్నాడు తిరువనంతాచార్యులు గుడివైపు చూపిస్తూ. 
అతని కళ్ళలో, మాటల్లో చెప్పలేని, వ్యక్తీకరించని లోతైన వైరాగ్య భావన, బాధ ప్రస్ఫుటంగా  కన్పించింది.  
"సంపాదన గురించేకదా నువ్వలా అన్నది ... ఎందుకలా అన్నావు? నాకర్ధంకాలేదు. వివరంగా చెప్పు!"
"కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదు. వస్తున్నది ... భగవంతుడిస్తున్నదంతే నని నమ్మకం.     
అది తప్పో, ఒప్పో తర్కించే తత్వంకాదు నాది ! ఈ మాట నా నోట మొదటిసారిగా బయటకన్నాను. బ్రతకీడ్చడానికి సరిపుచ్చుకునే సంపాదన. 
ఇంగ్లీషులో అంటారుకదా 'స్ట్రగుల్ ఫర్ సర్వైవల్'... అదే మా పరిస్థితి!' 
ఆయుర్వేద వైద్యం చేస్తాను. ఆ వైద్యాన్ని, నన్ను నమ్మేవారు ఒకరో, ఇద్దరో రోగులు. వారేమైనా ఇస్తే పుచ్చుకుంటాను.    
దేవుడి మాన్యం రెండెకరాల పొలం కౌలు వస్తే వచ్చినట్లు. చేతికొచ్చిందాకా గండమే. తుఫాన్లు మింగుతాయో తెలియదు. కౌలుదారు దయ. మా ప్రాప్తం! ఎంతిస్తాడో, ఎగ్గొడతాడో తెలియదు.  
అది తప్ప వేరే చెప్పుకోతగ్గ ఆదాయం లేదు.  
పారిజాతం ముప్పూటలా కష్టపడుతుంది. ఎంబ్రాయిడరీ, టైలరింగ్ చేస్తుంది. నర్సింగ్ చేస్తుంది. పిండి వంటలు చేస్తుంది. నిజం చెప్పాలంటే తన సంపాదనే మా సంసారానికి అండ, అక్కర.  ఇన్నేళ్ళలో తనకి ఖరీదైన బట్ట, నగ ఒక్కటీ కొనిబెట్టలేకపోయాను. 
ఈ ఊళ్ళోనే కాదు. ఎక్కడో ఒకటి, అరా తప్ప అంతటా దేవాలయాల పరిస్థితి,  
పూజారుల పరిస్థితిదే !" అన్నాడు తిరువనంతాచార్యులు.
"అంటే ఆర్ధికంగా పుష్టి లేదనే కదా నీ వనేది"
"అవును! తరాలు మారాయి. నమ్మకాలు సడలాయి. విశ్వాసాలు మారాయి. మారుతున్నాయి.
ఇదివరలో రైతులు కూరగాయలతో సహా ఇంటికి సంబారాలు పంపేవారు. అన్నీ ఆగిపోయాయి. 
దీప, ధూప నైవేద్యాలకే నెలకు రెండు వందలన్నారు. ఇప్పటికి ఏడేళ్లుగా అదీ రాలేదు. జీత భత్యాలంటూ లేవు. హారతి పళ్లెంలో కానుకలు అరుదే. తరచూ దేవాలయానికి వచ్చే మనిషి ఇంటనే దణ్ణం పెట్టుకుంటున్నాడు. గుడికి రావడం తగ్గింది. పుట్టినరోజునో లేక పండగకో, పబ్బానికో మాత్రమే గుడికి రావడం. అదీ సమయం దొరుకుతే ! గుళ్లోనుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు ఊళ్ళోకెళ్ళి పదేళ్ల పైగా అయింది. ఇకముందు వెళతాయన్న నమ్మకం లేదు. దానికి తోడు ఏదో అంటు రోగంతో మేటి ప్రపంచమే ముడుచుకు కూర్చుంది. ఇక మా బోటి వారెంత ?" 
"అంటే జనాలలో మార్పు వచ్చిందనా నువ్వనేది ?"
"పూజారిగా నేను ఆ విశ్లేషణ చేయతగనేమో!"
"అనంతూ ! నాకో ఇల్లు కావాలి" హఠాత్తుగా టాపిక్ మారుస్తూ అన్నాడు ప్రకాశం. 
"ఇల్లేమిటి ? అద్దెకా ...  కొనడానికా? అమెరికా తిరిగి వెళ్లడంలేదా ?"ఆశ్చర్యంగా అడిగాడు తిరువనంతాచార్యులు 
"ఇప్పుడే వెళ్ళను. కొన్నాళ్లపాటిక్కడే, ఈ ఊళ్ళోనే ఉందామనుకుంటున్నాను"
"మీ నాన్నపాలికి వచ్చిన పాత పెంకుటిల్లు ఎన్నోఏళ్లుగా తాళం వేసి ఉంది. నువ్వుండడానికి బాగుండదేమో! ఆస్తి పంపకాలలో మీ తాతగారు మీ నాన్నపేరిట విల్లులో వ్రాసిన ఇల్లది. 
ఆలనా పాలనా లేక పాడుబడింది. బాగు చేయించుకుని ఆ ఇంటే ఉండొచ్చేమో చూడు!"
"అలాగా! నాన్నగారనలేదు. నాకు తెలియదు. తాతగారు పోయారుగా? మా పెదనాన్న, చిన్నాన్న వాళ్ళెవరూ ఆ ఇంటిని అట్టేపెట్టుకోలేదా ? ఇల్లు మాపాలికి వచ్చినా సరే... ఖాళీగా ఉంటేనే చూద్దాం. ఎవ్వరినీ నొప్పించవద్దు"
"మీ వారెవరూ ఆ ఇంట నివసించడం లేదు. అందరు భవంతులు కట్టుకున్నారు. అతిధుల కోసం ప్రత్యేకించిన ఇల్లట" 
"అలా బయటకెళదాం !" అన్నాడు ప్రకాశం ఇంటి వివరం వినడం ఇష్టంలేనట్లుగా 
"టిఫిను చేసి వెళదాం" అంటూ లోనికి వెళ్ళాడు తిరువనంతాచార్యులు. 
                                                                   * * * * *  
"ఇదే ఆ ఇల్లు ! ఇంటి తాళంచెవి ఉందేమో మీ అన్నగారింట్లో కనుక్కుందాం! అలాగే వారింటికి వెళ్లినట్లుంటుంది. నువ్వు వారిని పలకరించి నట్లుంటుంది" అంటూ  దేవాలయానికి దగ్గరలోనే ఉన్న ఇంటి గేటు తీసి పెద్ద భవంతిలోకి నడిచాడు తిరువనంతాచార్యులు. అతన్ననుసరించాడు ప్రకాశం. 
పలకరింపులు, కాఫీలయ్యాక "ఏరా! బాబాయి, పిన్ని అంతా బావున్నారా ? తోట,ఇల్లమ్మడానికి వచ్చావా ?" అన్నాడు ప్రకాశాన్ని ఉద్దేశించి పెదనాన్న కొడుకు.
"ఇంటి తాళం చెవి ఉందా?" అన్నాడు ప్రకాశం అతని ప్రశ్నకు సమాధాన చెప్పకుండా.
"అదిగో! ఆ గుంజ మేకుకి తగిలించి వుంది. ఇన్నేళ్ళలో ఎవరూ దాన్ని ముట్టుకోలేదు. నువ్వే అందుకో !" అన్నాడు తేలికగా.  
"ఇంటి పేపర్లు... ?" అన్నాడు ప్రకాశం 
"ఉంటావా రెండ్రోజులు ... ఎప్పుడొచ్చావు. ఎక్కడ దిగావు ? రాత్రి  భోజనానికి రా! ఏదైనా ఎవ్వారం ఉంటే మాట్లాడుకోవచ్చు.పేపర్లు తీసిఉంచుతాను. ఇంటితో బాటు మీనాన్న పాలికి రెండెకరాల మావిడి తోట కూడా వచ్చింది. దాని తాలూకూ డబ్బు, లెక్క నాదగ్గరే ఉన్నాయి. పట్టుకెళ్ళు" అన్నాడు అన్న.  
"వస్తాను" తాళంచెవి తీసుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న లోగిలికి  తుప్పుపట్టిన పాత గేటు తీసుకుని లోనికి నడిచారు వారిద్దరు.  
"వస్తానన్నావు ... ?" అన్నాడు తిరువనంతాచార్యులు ప్రకాశం మొహంలోకి సాలోచనగాచూస్తూ. 
"భోజనానికి"... 
ఇంటి తాళం తీసి "లోపల, వెనకాల పెరడు చూస్తూవుండు. పాతిల్లు, జాగ్రత్త!
చూసి నడువు పురుగు, పుట్ర ఉండగలవు. కూలి మనుషుల్ని, సుతారిని పిలుచుకొస్తాను. 
ఇల్లు శుభ్రం చేయించి నివాసయోగ్యంగా మరమ్మత్తులు చేయిద్దాము" అంటూ బజారు కెళ్ళాడు తిరువనంతాచార్యులు.     
                                                                     * * * * * 
ఇంటి మరమ్మత్తులు అదే రోజు వేగంగా మొదలయ్యాయి. 
ముందుగా ఇంటావరణలో ఉన్నపెద్ద వేపచెట్టు చుట్టూ నెర్రెలు బాసిన గుండ్రటి అరుగు, ఆపైన గోడల మరమ్మత్తులయ్యాయి. పట్నం నుంచి ఆటోల్లో పనివారు వచ్చి, వెళుతున్నారు. ఇంటికప్పు పూర్తిగా తిరగవేశారు. పడకగదులకు ఎ.సి లు బిగించారు. వంటిల్లు నిత్య నూతనంగా తయారయింది. బావికి మోటార్, కుళాయిలు ఏర్పాటయ్యాయి. చూస్తుండగానే  రెండు వారాల్లో ఇల్లంతా హంగులతో కళకళ్ళాడింది. ఇంటి బయట సున్నం, లోన రంగులు అయ్యాయి. 
'డబ్బుంటే కొండ మీది కోతైనా దిగి వస్తుందనే నానుడి కర్ధం ఇదేనేమో ! పాడుపడిందనుకున్న ఇల్లు వసతులతో కళకళలాడుతోంది' అనుకున్నాడు తిరువనంతాచార్యులు.
"ఇంటి మరమ్మత్తులన్నీ పూర్తయ్యాయి. ఇల్లిప్పుడు నివాసయోగ్యమే. నువ్వు, చెల్లాయి ఈ ఇంట్లో గృహప్రవేశంచేయాలి అనంతూ !" అన్నాడు ప్రకాశం. 
"మేమా? ఎందుకు? ఇంటిపై బోలెడంత ఖర్చుచేశావు. అంత ఆడంబరం భరించే శక్తి నాకు లేదు" నిరాసక్తిగా, ఒకింత ఆశ్చర్యంగా అన్నాడు తిరువనంతాచార్యులు. 
"నిన్నీ ఇంట్లోకి రమ్మనడానికి కారణం ఒకటి కాదు. మూడున్నాయి. తరువాత చెబుతాను"  
"నాకు గుడి, మడి, ఆచారం ఉన్నాయి"
"ఎప్పటిలానే పాటించు ! ఎవరు కాదన్నారు ?"
"గుడి నెవరు చూస్తారు ?"
"పూజారులంతా ఆలయావరణలలో నివసిస్తున్నారా? అందరికీ వసతుల్లేవే. అలాగే నువ్వు. 
గుడి కాపలా నీ బాధ్యతెలా అవుతుంది ?" ఆలోచనలో పడ్డాడు తిరువనంతాచార్యులు.     
"నాకయోమయంగా ఉంది. ఇప్పటికిప్పుడే  నిర్ణయం తీసుకోలేను. ఊహకందని మార్పు! 
పూర్వా పరాలు ఆలోచించుకునే అవకాశమివ్వు. నీకు ముందే చెప్పాను. కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదని ... "
"నీకు నువ్వుగా పరుగెత్తడం లేదే ! కాలమే మార్పులను తీసుకొస్తుంది. మన ప్రమేయం లేకుండానే  కొన్నిఅమరుతుంటాయి. కొన్ని అంది పుచ్చుకోవాలి. 
కొందరికి కర్మఫలం సఫలం, మరికొందరికి విఫలం! 
అదేమిటో, ఎందుకో ... అర్ధమయిన్నాడు మనిషికి పగ్గాలుండవుకదా! నీ శుశ్రూషకు ఫలంగా నీ రాజగోపాలస్వామే ప్రసాదించాడనుకోవచ్చుగదా! ఇలాటి మాటలు భక్తులెందరితోనో 
అనుంటావు. నీ సిద్ధాంతమే నీకు వర్తించదా!?"
"ప్రకాశం!  కొద్ధి సమయమివ్వు. మాటలతో మభ్యపెట్టకు. మానసిక దౌర్బల్యానికి గురిచేయకు!" అని చప్పున గుడి వైపు వడి వడిగా అడుగులేశాడు తిరువనంతాచార్యులు.     
                                                                      * * * * *
రాత్రి ఎనిమిదిన్నర గంటలు. గుడికి వచ్చాడు ప్రకాశం. ఇద్దరు గుడి చావడిలో కూర్చున్నారు. 
"ప్రకాశం ! ఏమిటిదంతా... ? అసలు నువ్వెందు కొచ్చావు ? కారణం చెబుతావా ? మన స్నేహితం మీద ఆన.  దేవాలయంలో కూర్చున్నావు. నిజం చెప్పు" 
"నువ్వా  ఇంట్లోకి మారతావా లేదా ? ముందుగా చెప్పు!" 
"ఇదేదో నాకు గోపాలస్వామి పెట్టిన పరీక్షలా ఉంది. చూశావుగా... ఆలయ పరిస్థితి. శిధిలావస్థలో ఉంది. ఉద్ధరణకు నడుంకట్టే మహానుభావుడెవరో రావాలి ! ఆనాటి దాకా  దేవాలయాన్ని వదిలి నా స్వసుఖం కోసం నీయింటికి రావడం అసమంజసం, అనైతికం. భక్తుల విశ్వాశాన్ని, నమ్మకాల్ని వమ్ము చేయను. దేవునికే గాదు, నామనః స్సాక్షికీ  సమాధానం చెప్పుకోలేను. నువ్వు గొప్ప స్నేహితుడివి. దైవ కార్య, కర్మల కంకితమైన నన్నాయనముందు దోషిగా నిలబెట్టకు! నిన్నర్ధిస్తున్నాను. 
కుచేలుని ఉద్ధరించడానికి వచ్చిన శ్రీ కృష్ణునిలా వచ్చావని అర్ధమైంది.నేనేమీ ఆచించలేదు. నేనీ మార్పునాకాంక్షించలేదు. అంగీకరించలేను. నన్ను క్షమించు" అతని గొంతు గాద్గగమైంది.
                                                                   * * * * *
ప్రకాశం దగ్గరిగా జరిగి స్నేహితుడి భుజం చుట్టూ చేయివేసి ఆప్యాయంగా వీపురాస్తూ 
"అనంతూ ! ధర్మాధర్మచింతన గురించి నీకు చెప్పేంత వాడి ఉన్నవాడిని గాను. అయినా అవసరం, సమయం, సందర్భం వచ్చింది కాబట్టి గీతలో శ్లోకం ఒకటి గుర్తుచేస్తాను.
 
సహజం  కర్మ  కౌంతేయ  సదోషమపి  న  త్యజేత్
సర్వారంభా  హి  దోషేణ  ధూమేనాగ్నిరివావృతా ||

దోషముతో కూడినదైనా సహజ కర్మను త్యజింపరాదు. నిప్పుని పొగ ఆవరించినట్లు మన  కర్మలలోను ఏదో ఒక దోషము ఉంటుందనే కదా శ్రీకృష్ణభగవానుడు చెప్పింది. 
మనం చేస్తున్నది అసహజ కర్మ కాదని నా ఉద్దేశ్యం! 
తిరువనంతాచార్యులు చకితుడై చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. 
"ఇప్పుడు సమయం వచ్చిందనంతూ! నువ్వాఇంట్లోకి ఎందుకు మారాలో మూడు కారణాలున్నాయన్నాను కదా... చెబుతాను. విను!
మొదటిది. మనం బాల్యంలో తిరుగాడిన ఈ దేవాలయం, మిద్దె పైన అద్దాలగది నన్నుగత కొన్నేళ్లుగా కలలో వెంటాడుతున్నాయి. గర్భగుడిపై గుమ్మటం నుంచి సున్నం, ఇటుక పెల్లలు రాలుతూ కనిపించేవి. నువ్వు వాటిని శుభ్రం చేస్తూ కన్పించేవాడివి. 
నేనిక్కడికొచ్చిన రోజు అద్దాలగదిలో నేను పడుకున్న చోట తెల్లారేసరికి సున్నం పెచ్చులు, ఇటుక పెల్లలు పైకప్పునుంచి రాలి పడ్డాయి. అదే దృశ్యం నాకు కలలో పదే పదే కన్పించేది. 
ఈ దేవాలయాన్ని, నువ్వుండే మిద్దెను పునర్మించడానికే వచ్చాను. నా కల అంతరార్ధ దైవేచ్ఛను నెరవేరుస్తాను. మిద్దె పునర్మితమయ్యాక నువ్వు, గ్రామ పెద్దలు కలిసి దాన్ని గ్రామ ప్రజల హితానికి, ప్రయోజనానికి ఉపయోగించండి. ఇది భగవత్పేరిత నిర్ణయం.  
రెండవది. ముఖ్యమైంది. నేను మరమ్మతులు చేయించిన ఇల్లు మాది కాదు. మీదే !
సరిగ్గా ఆరవై సంవత్సరాల క్రితం శార్వరి నామ సంవత్సర విజయదశమి రోజున ఆ ఇంటిని రాజగోపాలస్వామి దేవాలయ పూజారి పేరిట వ్రాసిన దస్తావేజు దఖలు పత్రం నా దగ్గర ఉంది. ఈ గుడి పూజారుల నివాసం కోసం ప్రత్యేకంగా మా తాతగారు నిర్మించిన ఇల్లది. 
ఇన్నేళ్లు ఈ విషయం ఎందుకు, ఎవరి స్వార్ధంతో మరుగున పడ్డదో, ఆ ఇల్లు మాకుటుంబ  స్వాధీనంలో ఎందుకు ఉందో కారణాలు నాకు తెలియవు. 
రాత్రి అన్న ఇచ్చిన ఆస్తుల వీలునామా పత్రంతో పాటు ఆ ఇంటి పాత దఖలు దస్తావేజు కూడా ఉంది. దీన్ని చూడు!  తెలిసీ స్వార్ధపూరితంగా ఇల్లు నాన్నపేరిట వీలునామా వ్రాశారు తాత! 
ఆ విషయమిప్పుడు,ఇక, అప్రస్తుతం ! 
ఈ క్షణంలో స్వామివారి సమక్షంలో మీకు చెందిన ఆ ఇంటిని నీకు దఖలు చేస్తున్నాను" అంటూ ఆ పాత పత్రాలు, స్నేహితుని పేరిట వ్రాసిన కొత్త పత్రాలు తిరువనంతాచార్యుల చేతిలో పెట్టాడు ప్రకాశం.  
ఇక మూడవది, చివరిది స్నేహధర్మం.  
నువ్వు అన్యధా భావించవద్దు! ఈ పాత పత్రాలు లేకున్నాఆ ఇల్లు, మామిడితోట నీ పరంచేసి వెళ్ళేవాడిని. అందుకే వచ్చాను. నాన్నగారితో మాట్లాడాను. సంతోషపడ్డారు. ఆయన సంతోషంగా తన అంగీకారాన్ని తెలియచేశారు.  
గీతానుసారం సహజ కర్మలను త్యజించరాదు కదా అనంతూ !" వినమ్రంగా, అనునయంగా సందర్భాన్ని అన్వయిస్తూ తలవంచి రెండుచేతులు జోడించి అన్నాడు ప్రకాశం .  
ఉద్వేగంతో లేచి నిల్చుని భగవత్ప్రసాదాన్ని స్వీకరించాడు తిరువనంతాచార్యులు అశ్రునయనాలతో.  

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254


                  

23, ఆగస్టు 2021, సోమవారం

నేటి సావిత్రి

                                                                 నేటి సావిత్రి
                                                            ==============           
తెల్లవారి లేచేసరికి తలుపులు బార్లా తెరిచివున్నాయి. బయట గేటు తాళం వేయడం మరిచి  అలాగే నిద్రపోయింది సీతమ్మ. మతిస్థిమితం లేని భర్త రాఘవరావు ఇంటినుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాన్నం వరకు సీతమ్మ, పనిమనిషి, ఇరుగు పొరుగు వారందరు ఇంటి చుట్టుపక్కల వీధులన్నీ గాలించారు. రాఘవరావు కనిపించలేదు. పోలిసు రిపోర్ట్ ఇచ్చింది భార్య సీతమ్మ.

"చూస్తమమ్మా! మీరూ రెండురోజులు చూడండి. చుట్టాలింటికి గాని,స్నేహితులింటికి గాని వెళ్ళిండేమో " అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
"స్వయంగా ఆయన ఎక్కడికీ వెళ్ళలేడు. డెబ్బై ఆరేళ్ల మతిస్థిమితంలేని పెద్దమనిషి బాబూ ! అయిదారేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నాను. రాత్రి తలుపులు తెరుచుకుని వెళ్ళిపోయాడు. 
పాపిష్టిదాన్నిగేటు తాళంవేయడం మరిచి నిద్రపోయాను. మనిషి మాయమయ్యాడు" ఏడుస్తూ తన గోడు చెప్పుకుంది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ తో అరవై ఆరేళ్ల సీతమ్మ.
"సరేనమ్మా! మతిలేని మనిషి అంటున్నారు కదా! రిపోర్ట్ రాసుకున్నాము. ఫోటోలు, ఫోను నంబరు ఇచ్చారు కదా... ఆచూకీ తెలుస్తూనే కబురు చేస్త..." అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
రాఘవరావు తప్పిపోయి మూడు రోజులయింది. పోలీస్ వారి నుంచి ఏ కబురూ లేదు.
మరుసటి ఉదయాన్నేనాలుగు మెతుకులు తిని పోలీస్ స్టేషనుకి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే బయట బెంచిమీద కూర్చుంది. బయటకు వెళుతూ సీతమ్మను చూసి
''చూడు పెద్దమ్మా! పెద్దాయన్ని వెదుకుతూ ఉన్నాం. నువ్వు స్టేషన్ కి వచ్చి ఎందుకు కూర్చుంటావ్ ? ఆయన దొరికితే మాదగ్గర వుంచుకోము కదా. ఇంటికి వెళ్లమ్మా!" అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గద్దిస్తూ.
"నాయనా! మూడు రోజులయింది పెద్దమనిషి కనబడక. దణ్ణంపెడతా. దయచేసి త్వరగా వెదకండయ్యా!" అంటూ రెండు చేతులు జోడించి సబ్ ఇన్స్పెక్టర్ ని ప్రార్ధించింది సీతమ్మ.
"మీరిక్కడకి రాకున్నా మీ వారిని వెతుకుతామమ్మా ! అవసరముంటే నేనే ఫోనుచేస్తాను. ఇక్కడ కూర్చుని మమ్ముల్ని ఇబ్బంది పెట్టవద్దు" అంటూ సున్నితంగా హెచ్చరించాడు సబ్ ఇన్స్పెక్టర్.
ఇంటికి వెళుతుండగా ఇంటి ఎదురుగా  ఉన్న సూపర్ బజార్ మేనేజర్ బయట నిలబడి ఉన్నాడు. సీతమ్మను చూసి లోనికి పిలిచి కూర్చోబెట్టి ఫ్రూటీ యిచ్చి, సి సి కెమెరాలో రికార్డయిన వీడియో  ఫుటేజీ ప్లే చేసి చూపించాడు.
రాఘవరావు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక గేటుతెరిచి ఇంటి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు వైపు నడవడం మొదలెట్టాడు. కాళ్లకు చెప్పులు లేవు. రోడ్డు పక్కనున్నవెల్డింగ్ షాపులో పనిచేస్తున్న కుర్రా డెవరో బయటకు వచ్చి ఆయన్నేదో అడిగినట్లనిపించింది. వీడియో రివైండ్ చేసి చూశారు. పలకరించిన వాడి మాట ఆయన వినిపించుకోలేదు. ఆపైన రోడ్డుకిరువైపులా ఉన్న పెద్ద చెట్లనీడ వల్ల చీకట్లో వీడియో ఫుటేజ్ మసకగా ఉండడంతో ఏమీ కన్పించలేదు.
ఇదే సంగతి సబ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళింది సీతమ్మ. వారు అంతగా స్పందించలేదు. 
"మేమూ ఆ వీడియో చూశామమ్మా! పెద్దాయన ఇంటినుంచి బయటకు వచ్చాక మెయిన్ రోడ్డు వైపు నడిచారు. కానీ మెయిన్ రోడ్డు దాకా వెళ్ళలేదు. వేరే కెమెరాల్లో రికార్డయిన వీడియోలు కూడా చూశాము. వెల్డింగ్ షాపులో  కుర్రాడు ఆ రాత్రి టైం అడిగాడట. వారి మాటకు ఆయన స్పందించలేదు. పార్కులోని కెళ్ళారేమోనని చూశాము. పార్కులో కెమెరాలు ఒక్కటీ పనిచేయడంలేదు. ఆ అర్ధరాత్రి సమయంలో ఆయన్నెవరూ గమనించినట్లు మాకు సమాచారమేమీ లేదు. పోలీస్ పెట్రోల్ టీం కూడా ఆ రాత్రి ఆయన్ని ఎక్కడా గమనించలేదు. ఉదయాన్నే రెగ్యులర్ గా నడకకు వచ్చేవారెవరూ ఆయన్ని చూసినట్లు సమాచారం లేదు. ఇన్వెస్టిగేషన్ అక్కడ ఆగిపోయింది" అన్నాడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్.
వారంరోజులు గడిచాయి. కేసులో పురోగతేమీ లేదు. క్రైమ్ కేసు కాకపోవడంతో కేసుకి ప్రాధాన్యత లేదు. కేసుని వారు సీరియస్ గా తీసుకున్నట్లనిపించలేదు. 
ఆ రోజు అమెరికా నుంచి రాఘవరావు కొడుకు పురుషోత్తం, న్యూజిలాండ్ నుంచి కూతురు పావని ఇద్దరు  వచ్చారు. ప్రయాణం వాయిదాలు వేసుకుంటూ నెలరోజులపాటు తల్లి దగ్గరే ఉండి, తండ్రిని వెదకడంలో చేయని ప్రయత్నం లేదు. పోలీసు పై అధికారులను ఎన్నోసార్లు కలిశారు. హాస్పిటళ్లు, వృద్ధాశ్రమాలు, చుట్టాలిళ్లు,స్నేహితుల ఇళ్ళు, పార్కులు వెదకని ప్రదేశం లేదు. పేపర్లలో, టీవీల్లో, గోడ పత్రికల్లో ప్రకటన వేయించారు. అయినా ఏ ఆధారమూ దొరకలేదు. రాఘవరావు ఆచూకీ దొరకలేదు.
తోడుగా ఉంటుందని ఊరినుంచి పిలిపించుకున్న అక్కతో కలసి, కొడుకు, కూతురు, పోలీసులు  వారిస్తున్నా, ప్రతిరోజూ పోలీసుస్టేషన్ వెళ్ళివస్తూనే వుంది సీతమ్మ! పోలీసువారు నోరు మెదపడం లేదు. పోలీసులు అన్నిస్టేషన్లకు సమాచారమిచ్చారు. 
''ఇంకా ఎక్కడ వెదకాలో చెప్పండి వెదుకుతాం'' అని విసుక్కుంటున్నారు పోలీసులు.
'జవాబుదారీతనం ప్రజలకేనా?' అనుకుంది సీతమ్మ. 
'మాయదారి జబ్బు ఆయనకే రావాలా! ఎక్కడున్నాడో...తిన్నాడో లేదో...ఒంటి మీద బట్టయినా వుందో లేదో' ? మతి సరిగ్గాఉన్ననాడే ఎదురుగా ఉన్నవస్తువే కనిపించేది కాదు. స్నానానికి టవల్ దగ్గరినుంచి అందించాల్సి వచ్చేది. వేళకింత పెడితే తినేవాడు. మాయమైపోయాడు. ఇంతపెద్ద పట్నంలో ఎక్కడని వెదకనయ్యా...!' అని కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తోంది అర్ధాంగి సీతమ్మ.
అవన్నీ 'అల్జీమర్స్ ' వ్యాధి లక్షణాలని ఆమెకు తెలియదు.పెద్దతనం, మతిమరపనే అనుకునేది సీతమ్మ .
"అమ్మా! పిల్లలూ, మా ఆయన రమ్మని గొడవ చేస్తున్నారు. క్షమించమ్మా ! నేను వెళ్లాలి" అంటూ కూతురు పావని తిరిగి న్యూజిలాండ్ వెళ్ళింది.
"పనులున్నాయమ్మా! నేను కూడా వెళ్లి తిరిగి వారం, పది రోజుల్లో మళ్ళీ వస్తాను" అని చెల్లెలు వెళ్లిన నాలుగో రోజు కొడుకూ తిరిగి వెళ్ళాడు.
నెల పది రోజులయింది రాఘవరావు ఇంటినుంచి తప్పిపోయి. చుట్టాలు,స్నేహితులు వచ్చి సీతమ్మను పరామర్శించి వెళుతున్నారు. మళ్లీ వస్తానన్నకొడుకు ఇంకా రాలేదు. సీతమ్మ ఒంటరి పోరాటం కొనసాగిస్తోంది. సీతమ్మకు తోడుగా వచ్చిన అక్క ఇంట వుంది.
                                                                    * * * * *
రాఘవరావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సంపాదించిన ప్రతి పైసా భార్య చేతిలో పెట్టేవాడు. పొదుపుగా ఖర్చుచేస్తూ హైదరాబాద్ 'రాజీవ్ నగర్' లో చిన్నఇల్లు కట్టుకుని కొడుకు, కూతుర్ని ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్లు చేశాడు. రిటైర్ అయ్యాక ఏడెనిమిది సంవత్సరాలు ఆరోగ్యంగానే ఉన్నాడు. తరువాత 'అల్జీమర్స్ ' వ్యాధి సోకి, ఐదారేళ్లుగా బాగా ముదిరి ఇంటినుండి బయటకు వెళ్ళి తప్పిపోయాడు. 
'పిల్లలిద్దరూ వచ్చి నెలరోజులపాటు విఫలయత్నం చేసివెళ్లారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. ఎన్నాళ్లని ఉంటారు ? వారికి ఉద్యోగాలు, సంసారాలు ఉన్నాయిగా!
ఉన్న నెలరోజులు పోలీస్ స్టేషన్, సిటీ చుట్టూ తిరిగినా ఏం ప్రయోజనం లేకపోయింది'
అనుకుంది సీతమ్మ తల్లిమనసుతో.  
                                                                    * * * * *                              
"ఇంట కూర్చుని చేసేదేముంది. రేపు పోలీస్ స్టేషనుకి వెళ్లివస్తాను" అంది సీతమ్మ అక్కతో.  
పోలీసుస్టేషనుకి వెళుతూ దారిలో వెల్డింగ్ షాపుకి వచ్చింది సీతమ్మ.
షాపులో భర్తను పలకరించిన కుర్రాడిని గురించి మళ్ళీ వాకబు చేస్తుండగా షాపు యజమాని బయటకు వచ్చి ''నా పేరు బాసిత్ అమ్మా! రావు సాబ్ నాకు తెలుసు. చాలా రోజులుగా ఆయన్ని చూడలేదు. ఆయన  'పానం' బాగుందా ? బయటకు రావడంలేదా ?
మీ ఇల్లు కట్టినప్పుడు ఇంటి గేటు, కిటికీలు నేనే తయారు చేసిన అమ్మా ! నిన్నుకూడా నేను గుర్తుపట్టింది" అన్నాడు బాసిత్ ఉర్దూ యాసతో
''అవును. ఆయనకి ఒంట్లో బాగాలేదు. మతి స్థిమితం లేక నెలరోజులు క్రింద ఇంటినుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము'' విషయం వివరిస్తూ అంది సీతమ్మ.
''ఏమిటీ ! నెలరోజులు అయిందా ? పెద్ద మనిషి కనబడలేదు. ఇంటికి రాలేదు ...!? ఏ ఖుదా !'' అన్నాడు బాధ వ్యక్తపరుస్తూ బాసిత్.
''నేను ఇట్లా చెబుతున్నయి అని ఏమీ అనుకోవద్దు బెహెన్. మీ అబ్బాయి పురుషోత్తం బాబు కూడా నాయనకోసం అమెరికా నుంచి వచ్చి నిజంగా బాధపడ్డడు. నా దగ్గరికి వచ్చి నువ్వు అడిగినట్లే వాడు అడిగింది. అప్పుడు నాకు అనుమానం రాలేదు. ఇప్పుడు నాకి ఒక అనుమానం వచ్చింది. మీకు నిజంగా సాయం చేద్దామని చెపుతున్నయి. ఇక్కడ పార్క్ లో బిచ్చగాళ్ళు చాలా ఉన్నయి. రోజూ వాళ్లందరినీ ఒక లీడర్ సిటీలో వేరే వేరే సెంటర్లకి తిప్పుతాడు. వాళ్ళని అడిగితే రాఘవరావు సాబ్ ని వాళ్ళెవరైనా చూసింరా అన్నఇన్ఫర్మేషన్ ఏమైనా దొరకవచ్చు" అన్నాడు బాసిత్ మెల్లగా రహస్యం చెబుతున్నట్లుగా.
అది విన్న సీతమ్మకు ఒక్క క్షణంలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వెంటనే నిరుత్సాహ పడుతూ ''బిచ్చగాళ్లను అడగాలా ఆయన గురించి...ఎందుకు ?" అని అడిగి ఆలోచించింది.
బాసిత్ అన్నమాట అర్ధం అవుతూనే ఒళ్ళు గగుర్పాటుతో బాటు ఆమె పంచేంద్రియాలు పనిచేయడం మానేశాయి. నిస్సత్తువ ఆవహించి, బాధతో విలవిల్లాడి పోయిందా మనిషి.
                                                                 * * * * *
ఇంటికి వెళ్ళాక రెండు, మూడు గంటలు మనిషి కాలేక పోయింది సీతమ్మ. తినలేదు.
పచ్చి గంగ ముట్టలేదు. గదిలోనుంచి బయటకు రాలేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి.
''మొక్కు తీర్చుకోవడానికి ఏదో క్షేత్రానికి వెళ్ళి వచ్చినట్లుగా ఒక్కొక్కరూ వచ్చి వెళ్లారు.
కుటుంబం కోసం జీవితాన్ని ధారపోసిన మనిషి దిక్కూ, మొక్కూలేక ఎక్కడో పడి ఉండవచ్చని తెలిశాక, జీవితమే వ్యర్థమనిపిస్తోంది. ప్రయోజకులైన కన్నబిడ్డలూ దగ్గరలేక, ఆయన అనాథ కావడం తనని నిలువునా తొలిచేస్తోంది'' అని అక్కతో చెప్పుకుని బాధపడ్డది సీతమ్మ.
"అవునే తల్లీ ! నీకు రావలసిన కష్టం కాదిది. తన పర అనకుండా ఎంతమందికి సాయం చేశావు.  అయినా ఏం ఖర్మమో దేవుడిట్లా వ్రాశాడు నీ నొసటన"
"నేను కష్టాల కెన్నడూ వెరవలేదక్కా! కష్టంలో కన్నబిడ్డలే అక్కరకు రాలేని పరిస్థితి! ఎప్పుడో, ఏదో, ఎవరికో సాయం చేశామని అనుకుని ప్రయోజనమేమిటి ? పురుషోత్తం పైచదువుకి అమెరికా వెళ్తానంటే 'మీరాదేశం వెళితే మరి రారు. మా ఇద్దరివిక ఒంటరి బతుకులే ! అయినా నీ భవిష్యత్తు నిలపడానికి నే నెవ్వరిని ? మనిషికి దేవుడు తలరాత ఒక్కసారే రాస్తాడంట. నేను కాదన్నా తిరిగి రాయడుగా!' అని ఆయన అన్నప్పుడు నాకర్ధం కాలేదు. ఆ ప్రతి మాట పొల్లుబోకుండా యదార్ధమయిందిప్పుడు.
'ముసలితనం, మతిమరుపనుకున్నానేగాని  రోగంతో బాధపడుతున్న విషయం తెలుసుకోలేనంత మూర్ఖురాలినయ్యాను. ఆయన తప్పి పోవడానికి కారణమయ్యాను. ఆయన దొరికిందాకా పోరాడుతాను' అని అక్కతో చెప్పుకుని బాధపడుతూ కన్నీరు మున్నీరయింది సీతమ్మ.
                                                                * * * * *
వెల్డింగ్ షాప్ యజమాని బాసిత్ సలహా మేరకు వరుసగా రెండురోజులు సీతమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధి చివర పార్కులోనే ఒక మూలగా కూర్చుంది. వచ్చేపోయే జనం గాక అయిదారుగురు బిచ్చగాళ్ళు, పల్లీలు, సమోసాలు, ఐస్ క్రీం అమ్మేవాళ్ళు, రోజంతా అక్కడక్కడే తిరుగుతూ కనిపించారు.
ఒక బిచ్చగాడు దుక్కలాగా ఉన్నాడు. ఓ కన్ను గుడ్డి. వాడికి పది రూపాయలిచ్చి రాఘవరావు ఫోటో చూపెట్టి అడిగింది సీతమ్మ. 
"ఈ ముసలాయన్నిఈ  పార్కులో ఎప్పుడయినా చూశావా?" అని....
''లేదమ్మా! నేను చూడలేదు" అంటూ పరుగులాంటి నడకతో వెళ్లిపోయాడక్కడనుంచి.
వేరే కొందరినీ అడిగింది సీతమ్మ. వారూ తెలియదని సమాధానం చెప్పారు.
బాసిత్ భాయ్ కి ఈ సంగతి చెబుదామని షాపుకి వెళ్ళింది. అతనప్పుడు షాపులో లేడు.
                                                                 * * * * *
మరుసటి రోజు మధ్యాన్నం ఒంటిగంటకు బాసిత్ భాయ్ గేటు తీసుకుని ఇంటికి రావడం చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది.
''నమస్తే అమ్మా ! రావు సాబ్ 'అతా, పతా' ఏమైనా తెలిసిందా?'' అనడిగాడు బాసిత్.
"ప్చ్! ఇంకాలేదు'' అంది సీతమ్మ నీరసంగా.
"నేను ఎంక్వైరీ చేసినాను. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ లతో మాట్లాడినాను. ఈ రోజు సాయంత్రం పోలీసులు రమ్మన్నారు. మీరు రెడీగా ఉండండి. నేను ఫోను చేసినప్పుడు వెంటనే స్టేషనుకి రండి'' అని చెప్పి ఆమె మొబైల్ ఫోనునంబరు నోట్ చేసుకుని వెళ్ళాడు బాసిత్.
తరువాత బాసిత్ భాయ్ ఫోను వచ్చిందాకా సమయం గడవడమే కష్టమయియింది సీతమ్మకి.
అసహనం, ఉద్విగ్నతతో అసలు కాలమే నిలిచి పోయినట్లనిపించిందామెకి. ఏభై ఏళ్లకు పైగా భర్తతో సాన్నిహిత్యం గుర్తుకి వచ్చి మనసంతా కకావికలమయింది. ఇంటికీ, బయటకు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. 
సాయంత్రం ఆరు గంటలయింది. బాసిత్ భాయ్ దగ్గనుంచి ఫోన్ రాలేదు.
'ఈరోజు ఆయన దొరుకుతాడనిపిస్తోంది' ఇవాళ ఇంటికి వస్తాడాయన అని పదే పదే మనసులో అనుకుంది. దేవుణ్ణి ప్రార్ధించింది.వెంకటేశ్వరస్వామికి ముడుపు కట్టింది.
ఇంతలో బాసిత్ భాయ్ దగ్గర నుంచి ఫోను,వెంటనే పోలీసుస్టేషన్ కి రమ్మని.
పది నిముషాల్లో స్టేషను కి వెళ్ళింది సీతమ్మ. 
ఇన్స్పెక్టర్ ఎదురుకుర్చీలో కూర్చుని ఉన్నాడు బాసిత్ భాయ్. సీతమ్మ వస్తూనే ఇన్స్పెక్టర్ కి పరిచయం చేసి "మీరు ఇక్కడే స్టేషన్లోనే ఉండండి అమ్మా! మేము ఇదే పనిమీద బయటకు వెళుతున్నాము" అన్నాడు బాసిత్.
"లేదు! ఆమెను మనతో తీసుకెళ్ళాలి... " అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
"ఇన్స్పెక్టర్ సాబ్! పెద్ద మనిషి. ఆమె అక్కడికి ఎందుకు ?" అన్నాడు బాసిత్ ఆందోళనగా.
"అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదు...ఆ గుంపులో ఆయన వుంటే గుర్తించాలి గదా! అందుకే ఆమెను తీసుకుని వెళదాము" అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
రెండు నిముషాల్లోనే 'చాయ్' వచ్చింది. సీతమ్మ వద్దంది.
ఇన్స్పెక్టర్ ఫోన్లో మాట్లాడుతూ గంటలు కొడుతున్నగోడ గడియారం వంక చూస్తూ 'అర్ధగంట తరువాత బయలుదేరుదామన్నాడు బాసిత్ భాయ్ తో. ఎక్కడికి వెళుతున్నది వివరాలేమీ తెలియదు.
అర్ధగంట తరువాత అందరు స్టేషను బయటకొచ్చారు.పెద్ద పోలీసు వేను, రెండు జీపులు, పదిమంది కానిస్టేబుళ్లతో అంత బందోబస్తుగా వెళుతుంటే ఏదో 'రెయిడ్' కి వెళుతున్నట్లుగా అనిపించింది.
బాసిత్ భాయ్ ని వెనక, సీతమ్మని ముందుసీటులో జీప్ ఎక్కమన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
గంటన్నర పైగా డ్రైవ్ చేసి సిటీకి దూరంగా విసిరేసినట్లు అక్కడక్కడ ఇళ్లున్న ఏదో 'కాలొనీ' కొచ్చి
ఒక పెద్ద షెడ్ దగ్గర ఆగాయి వెహికల్స్.
అది ఒక కోళ్ళ ఫారం. షెడ్ బయట పెద్ద బోర్డు ఉంది.
పోలీసులంతా బిల బిల మంటూ వేను దిగుతూనే షెడ్ నాలుగు వైపులా నలుగురు కానిస్టేబుళ్లు పొజిషన్ తీసుకున్నారు. కాంపౌండ్ గోడ ఎక్కి లోనికి దిగి గేటు తెరిచాక మిగతా పోలీసువారంతా లోనికి వెళ్తూనే గేటు మూసేశారు. బాసిత్, సీతమ్మ బయటే ఉన్నారు.
అయిదు నిముషాల తరువాత కానిస్టేబుల్ బయటకువచ్చి సీతమ్మని, బాసిత్ ని లోనికి తీసుకువెళ్ళాడు.
షెడ్  లోపల పరిస్థితి అతి భీతావహంగా, దయనీయంగాఉంది. దుర్వాసనతో ముక్కులు బద్దలయ్యేలా వుంది. కడుపులో దేవుతూ వాంతి వచ్చేలా అనిపించింది సీతమ్మకు.
లోన పసి పిల్లల దగ్గరనుంచి పండు వయసున్న ఆడా, మగ మనుషులందరు కలిపి సుమారు వందమందికి పైగా ఉన్నారు. షెడ్ అంతటా పాతపరుపులు, గోనె సంచులు, ప్లాస్టిక్ పట్టాలు,చిరిగిన దుప్పట్లు, జంపకానల మీద గోడలకు చేరి, అడ్డ దిడ్డంగా ఉన్నారు. కొందరు పడుకుని, కొందరు కూర్చుని జోగుతూ, కొందరు పేకలాడుతూ, జూదమాడుతూ కొందరు, ముక్కుతూ,మూల్గుతూ హీనంగా ఉన్నవారి పరిస్థితి చూసి చలించిపోయింది సీతమ్మ.
ఒక పక్కన నాలుగయిదు కుండల్లో నీరు,మసిబారిన పెద్ద డేక్సా గిన్నెల్లో అన్నం, పప్పు,  ఇంకొకమూలన దుర్వాసనగొడుతున్నచెత్తకుప్ప....!
"త్వరగా వెతకండమ్మా... మీ భర్త ఉన్నారేమో" అన్నాడు ఇన్స్పెక్టర్ హ్యాండ్ కర్చీఫ్ తో ముక్కు  నోరు కప్పుకుంటూ అంబులెన్సుకు, మున్సిపల్ అధికారులకు ఫోను చేశాడు. లోన ఉన్న గదులలో సోదా జరుగుతోంది.
పిల్లలను, వృద్ధులను చేతకానివారిని బలవంతగా ఎత్తుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నారన్న అభియోగంపై లోన ఉన్ననలుగురు నిర్వాహకులను చేతులకు బేడీలు వేసి బయటకు పట్టుకెళ్లారు పోలీసులు.
"నేను ఇటు పక్కన వెతుకుతాను. మీరు అటు పక్కన చూడండి అమ్మా!" అన్నాడు బాసిత్ వెంటనే.
ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ భర్తకోసం వెతకడం మొదలెట్టింది సీతమ్మ ముక్కుకి కొంగు అడ్డంగా పెట్టుకుని. ఇంటిదగ్గర పార్కులో దుక్కలాగా కన్పించిన ఒంటి కన్ను బిచ్చగాడు కన్పించాడు. వాడిని చూస్తూనే ఆశ్చర్యానికి లోనయింది సీతమ్మ. వెంటనే బాసిత్ భాయ్ కి, సబ్ ఇన్స్పెక్టర్ కి వాడిని చూపించి, భర్తకోసం శ్రద్ధగా వెదకడంమొదలెట్టింది.  
ఓ మూలన గచ్చునేలమీద ఓ గోనె సంచి కప్పి ఉన్న ఓ ఎముకుల గూడంటి మనిషిని చూసి అక్కడ ఆగింది సీతమ్మ. గోనె సంచి తీసి ముఖం పరీక్షగా చూసింది. మట్టితో జుట్టు మాసి,గడ్డం, మీసం పెరిగి గుర్తు పట్టలేనంతగా కళ్ళు లోతుకు పోయి, ఒళ్లంతా మట్టి కొట్టుకుపోయి, ఎక్కడో కొద్దిగా మినుకు, మినుకుమంటున్న ప్రాణం, అందీ అందనట్లున్ననాడి. పిడికెడంతున్నాడా మనిషి. ఎముకల గూడు మీద పల్చటి చర్మం. మోకాళ్ళమీద కూర్చుని ఆ మనిషిని పరిశీలనగా చూస్తే గానీ భర్తని గుర్తించలేకపోయింది సీతమ్మ. రెండు చేతులతో ఆయన భుజాలను పొదివి పట్టుకుని కింద కూలబడ్డది.
ప్రాణప్రదమైన భర్త దిక్కులేని వీధి జంతువులా, ఈగలు మూగి, స్పృహలేక కొన ప్రాణంతో  
పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది సీతమ్మ.
"బాసిత్ భాయ్ !" అంటూ పెద్ద కేకవేసింది సీతమ్మ.
పరుగున వచ్చాడు బాసిత్.
రెండుచేతులు జోడించి బాసిత్ కి నమస్కారం చేసి  రెండు చేతుల్తో భర్తను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చూసి "అమ్మా! ఏం చేస్తున్నావు. జర ఆగండి" అంటూ పరుగున బయటికి వెళ్లి అప్పటికే వచ్చిన అంబులెన్సు నుంచి స్టెచర్ ని,హెల్పర్ని కూడా తీసుకువచ్చాడు బాసిత్.
"అంబులెన్సులు వచ్చాయి. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి" అన్నాడు సబ్  ఇన్స్పెక్టర్, రాఘవరావు పరిస్థితి విషమంగా ఉండడం చూసి.
భర్తని స్టెచర్ మీదకు చేర్చి ,హెల్పర్ ఒక వైపు, రెండో వైపు బాసిత్ పట్టుకోగా స్టెచర్ పక్కన పట్టుకుని, యముడి బారి నుంచి భర్తను రక్షించుకున్నసావిత్రిలా నడిచింది సీతమ్మ అంబులెన్సు వద్దకు.
షెడ్ బయట, అప్పుడే వచ్చిన టి.వి.ఛానళ్ల వేన్లు, కెమెరాలతో కోలాహలంగా ఉంది. ఇద్దరు ముగ్గురు కెమెరాలతో సీతమ్మను పలకరించే ప్రయత్నం చేశారు. వారిని దాటి భర్త స్ట్రెచర్, బాసిత్ భాయ్ తో బాటు అంబులెన్సు ఎక్కింది సీతమ్మ. సైరను మోగుతూ అంబులెన్సు వేగంగా కదిలింది.  
"ఆక్సిజన్ పెట్టేనమ్మా! అర్ధగంటలో హాస్పటల్ కి వెళ్ళిపోతాం. మరేం భయంలేదు" అన్నాడు  బోయ్ రాఘవరావుని అంబులెన్సులో ఎక్కించిన మరుక్షణంలో
                                                   ===========xxx==========

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254

     




21, ఏప్రిల్ 2021, బుధవారం

                                                      అన్యధా శరణం నాస్తి 
                                                  ------------------------------------
                (ఈ మినీ కథ 'సహరి' కొసమెరుపు కధల పోటీ లో సా.ప్ర కు ఎంపిక కాబడింది)

      

"గీతా ! నువ్వున్నపళంగా బయలుదేరి హైదరాబాద్ రావాలి తల్లీ ! అసంబద్ధ, అసమంజస కోరిక కోరుతున్నానని మాత్రం అనుకోవద్దు. నువ్విప్పుడు రాకపోతే  అనర్ధం జరిగడం ఖాయం. నేనేమీ ఆషామాషీ మాటలు మాట్లాడడం లేదు. నా మాటల్లో తీవ్రత కూడా నీకు అర్ధంగాకపోవచ్చు. నువ్వు మీ అమ్మతో మాట్లాడి కూడా ప్రయోజనమేమీ లేదు" కెనడాలో ఉన్న కూతురిని ఫోనులో హెచ్చరిస్తూ అన్నాడు క్రిష్ణమూర్తి. 

"నాకు తెలుసు నాన్నా! అత్యవసరం అవుతే తప్ప మీరలా అనరు. కానీ నేనిప్పుడు రావడం కష్టం. ఉద్యోగంలో చేరి సంవత్సరం కాలేదు. శలవు దొరకాలి...ఖర్చు. నెత్తిమీద బరువులా బోలెడంత అప్పు. నువ్వేమో విషయేయమేమీ చెప్పకుండా ఇదిగో... ఇలా కంగారు పెట్టేస్తావు" అన్నది ఆందోళనగా అంది గీత.  

"గీతా ! నాకు చెప్పాలనిపించింది నీకు చెప్పాను. వివరాలు నాకు తెలియవు. 
ఊహాగానం చేయలేను. అసమర్ధుణ్ణి క్షమించు" అన్నాడు ఫోను పెట్టేస్తూ కృష్ణమూర్తి. 
తండ్రి గొంతులో ఆర్తిని గమనించి ఇంటి దగ్గర ఏమవుతుందో, ఏం చేయాలో తెలియక అమితాందోళన చెందింది గీత.
క్రిష్ణమూర్తి అమీర్ పేట చౌరస్తాపక్కనే వున్న అమ్మవారి గుడిలో పూజారి. సాత్వికుడు. 
అంతో ఇంతో వచ్చే రాబడితో పొదుపుగా కుటుంబాన్ని పోషించేవాడు. కూతురు గీత శ్రద్ధగా 
చదివి ఇంజనీరింగ్ చేసింది. క్యాంపస్ సెలక్షన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించింది. ట్రైనింగ్  అవుతూనే  తనని కెనడా పంపించారు కంపెనీ వారు. 
కొడుకు పార్ధసారధి. ఆరేళ్లనుంచి ఇంజనీరింగ్ పరీక్షలు వ్రాస్తూనే వున్నాడు.   
"ఆ ఇంజనీరింగ్  ఎలాగూ పూర్తిచేయలేక పోయావు. బ్రతుకు దెరువు కోసమైనా పూజాదికాలు నేర్చుకుని పూజారిగానైనా స్థిరపడవయ్యా" అన్నాడు కొడుకుతో కృష్ణమూర్తి.
''పూజారివై  నువ్వెలగబెడుతున్నావు. ఇక నేను పూజారిని కావాలా ?" అంటూ వెటకారంగా మాట్లాడేవాడు పార్ధసారధి . 
'దుర్గమ్మ తల్లీ ! వీడితో ఎలావేగేది ? హారతి పళ్లెంలో భక్తులు వేసే కానుకలు ఎప్పటికప్పుడు మాయం చేయడం, పోచికోలు తిరుగుడు తప్ప ఇల్లు, గమ్యం శూన్యం. వాడి చదువుకి చేసిన బ్యాంకు అప్పు నాలుగు లక్షలు, ఇతర అప్పులు రెండులక్షల చిల్లర మొత్తం వడ్డీలతో కలిపి పది లక్షలు భారమైకూర్చుంది. బ్యాంక్ నుంచి నోటిసుల మీద నోటీసులు వస్తున్నాయి. వాడికి చీమ
కుట్టినట్లు గా లేదు. అప్పు చెల్లించాలన్న ఆలోచనే లేదు ఆ అప్రయోజకునికి మంచి బుద్ధి ప్రసాదించు తల్లీ ' అని అమ్మవారితో మొరబెట్టుకుంటూ అప్పు చెల్లించే బాధ్యత నైతికంగా తనదేనని ఎల్లవేళలా చింతిస్తూ ఉంటాడు కృష్ణమూర్తి. 
''ఇరవై మూడేళ్లు నిండాయి. నీవల్ల పైసా సాయంలేకపోగా నాకు, గుడికీ నీవల్ల చెడ్డపేరొస్తోంది. 
నీ తోవ నువ్వు చూసుకో" అని తండ్రి అనడమే తరువాయి నాలుగు నెలల క్రింద మాయమయిన పార్ధసారధి ఈ రోజుకీ జాడలేడు.
"పార్ధు  తిరిగి వచ్చి గొడవేమైనా చేశాడా ? ఏవిటో ! ... ఈ నాన్నొకడు ! విషయమేమీ అర్దగాకుండా  మాట్లాడి ఫోను పెట్టేశాడు. అమ్మకుఫోను లేదు. ఇంకెవరికి ఫోనుచేసేది ... ఎవరినడిగేది ?  ఉదయాన్నే సంధ్యకు ఫోను చేసి సంగతేమిటో కనుక్కోవాలి అనుకుంటూ పనిలో
నిమగ్నమైంది  గీత. 
                                                                   * * * * *
ఇండియాలో తెల్లవారి తొమ్మిదవుతూనే  అమీర్ పేట, అమ్మవారి గుడికి ఆనుకునే వున్న 'మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫీసు' లో పనిచేస్తున్న క్లాసుమేట్ సంధ్యకి ఫోను చేసింది గీత.
"హేయ్ !... గీత ఎలావున్నావు ? వాంకోవర్ నుంచేనా ? ఏమిటి విశేషం ఫోనుచేశావు"అంది సంధ్య.  
"సంధ్యా! చిన్న సహాయం చేయగలవా? ప్లీజ్... చాలా అవసరం"
"డబ్బు మాత్రం అడక్కు. మాఆయనకు నాకు రోజూ ఇదే గొడవ "
"నో... నో.. డబ్బు కాదు. మాఇంటికి వెళ్లి అందరూ బాగున్నారా... లేదా చూసిరావా ప్లీజ్! 
నేనొక గంటతరువాత ఫోను చేస్తాను" ప్రాధేయబడుతూ అడిగింది గీత. 
"ఒకే ... మీ ఇంటికి  వెళ్లాలంటే చుట్టూతిరిగి వెళ్ళాలి. వన్ వే లతో పెద్ద తలనొప్పి. అర్జెంటుగా రిపోర్ట్స్ పంపించాలి. అవి అవుతూనే వెళతాను. ఎలెవన్ థర్టీ 
తరువాత ఫోను చెయ్యి. సరేనా !?" అంటూ ఫోను పెట్టేసింది సంధ్య. 
సరిగ్గా అనుకున్న టైం కి  ఫోను చేసింది గీత. 
"ఇదిగో ! ఇక్కడే ఉన్నాను. మీ అమ్మతో మాట్లాడు...అంటూ ఆవిడకు ఫోను ఇచ్చింది సంధ్య. 
"అమ్మా! బాగున్నావా ? పార్ధు ఎక్కడున్నాడో తెలిసిందా ? వాడు క్షేమంగా ఉన్నాడా ?
నన్నువెంటనే హైదరాబాద్ రమ్మని నాన్న ఫోను చేశారు.ఏమైంది ?" ప్రశ్నలతో ముంచెత్తింది తల్లిని గీత. 
"మేమిద్దరం బాగానే ఉన్నాము. పార్ధు జాడ తెలియదు. వాడు రాలేదు. ఆయన ఏ ధ్యాసలో ఫోను చేశారో ఏమో ! నువ్వెందుకు రావడం ఇప్పుడు. డబ్బు దండుగ . ఇద్దరం బాగానే ఉన్నాము. 
ఫోను ఆ అమ్మాయికి ఇస్తున్నాను" అంది తల్లి రంగనాయకి.
"ఒకే నా ! ఇక నేను ఆఫీసుకి వెళతాను" అంది సంధ్య 
"థాంక్ యు సంధ్యా ! థాంక్ యు సో మచ్ " అని ఫోను పెట్టేసి 
'ఏమిటీ మిస్టరీ ... వెంటనే రాకుంటే అనర్ధం జరిగి పోతుందంటాడు నాన్న! అంత బాగానే ఉంది అంటుంది అమ్మ... ఏవిటో అంతా అగమ్యగోచరం" అనుకుంటూ నిద్రలోకి జారుకుంది గీత. 
                                                                * * * * * 
పని ఒత్తిడితో తండ్రికి వారం పాటు ఫోను చేయలేదు గీత. ఆదివారం. ఇండియాలో సమయం ఉదయం ఎనిమిది దాటింది. గుడిలో ఉంటాడని తండ్రికి ఫోను చేసింది గీత. 
'ఫోన్ స్విచ్డ్ ఆఫ్' అని వస్తోంది. అర్ధగంట తరువాత కంగారుగామళ్ళీ ఫోను చేసింది. 'ఫోను స్విచ్డ్ ఆఫ్' అనే రికార్డెడ్ సమాధానం వస్తోంది. సంధ్యకు ఫోను చేసింది. 
ఆమె ఫోను ఎత్తలేదు. ఇద్దరు ముగ్గురు స్నేహితులుని కాంటాక్ట్ చేసింది. స్నేహితుడు రవీంద్ర మాట్లాడాడు. విషయం చెప్పి అర్జెంటుగా ఇంటికి వెళ్లి అక్కడనుంచి ఫోను చేయమని అడ్రసు వివరంగా చెప్పింది. అర్ధగంటలో అతను ఫోను చేశాడు.  
"గీతా ! గుడి వెనకాల వున్న సిమెంట్ రేకుల ఇల్లేనా ? తాళం వేసి ఉంది. గుడి కూడా తాళం వేసి వుంది. మూడు, నాలుగు రోజులనుంచి పూజారిగారు,ఆయన భార్య లేరని, పక్కనున్న కిరాణా షాపతను అంటున్నాడు. నువ్వు తెలుసట అతనికి. అతనితో మాట్లాడుతావా? "అంటూ గుప్తా ఫోన్ ఇచ్చాడు రవీంద్ర.
"గీతమ్మా ! కిరానా షాప్ గుప్తా అంకుల్ ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా ?  మీ నాయనగారు కాశీ వెళ్లారని తెలిసింది. అమ్మగారు అనారోగ్యంతో చౌరస్తా పక్కనే ఉన్న హాస్పిటలో చేరారు. మీ తమ్ముడు దేశాలు పట్టుకుపోయాడు. ఇంటి తాళం చెవి నాకు ఇచ్చి వెళ్లారు అమ్మగారు" అన్నాడు గుప్తా. 
గుప్తా ఫోను నంబరు తీసుకుని రవీంద్రకు థాంక్స్ చెప్పి ఫోను పెట్టేసి ఆలోచనపడింది గీత.
                                                                * * * * *
'అమ్మకు ఆరోగ్యం బాగాలేదా ? అందుకే నాన్న వెంటనే  రమ్మన్నారా ? ఇక తాత్సార్యం చేయడం మంచిదికాదు. ఒకసారి వెళ్లి రావడం బెటర్' అనుకుంటూ కంపెనీ అనుమతి తీసుకుని  
హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకుంది. రెండురోజుల తరువాత హైదరాబాద్ వచ్చింది గీత. 
అమీర్ పేటలో ఇంటికి చేరేసరికి ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉంది. కిరాణాషాప్ 
అమిత్ గుప్తాతో మాట్లాడింది. ఇంటి తాళంచెవి తీసుకుని స్నానంచేసి బయలుదేరి చౌరస్తా పక్కనే ఉన్న హాస్పిటల్ వెళ్ళి ఆరా తీసింది గీత. 
"రంగనాయకి నూట మూడో నంబరు గదిలో ఉంది" చెప్పింది రిసెప్షనిస్ట్
రూమ్ తలుపు కొట్టి లోనికి వెళ్ళింది గీత. అలికిడికి లేచింది రంగనాయకి. 
"గీతా నువ్వా ? ఎప్పుడొచ్చావు. నేనిక్కడున్నాని ఎవరుచెప్పారు ?" ఆశ్చర్యానందాలతో లేచి కూతురిని కౌగలించుకుంది  రంగనాయకి. 
"ఎవరు చెప్పలేదు. నేనే వెతుక్కుంటూ వచ్చాను. ఏమైందమ్మా నీకు ... ఆరోగ్యం బాలేదా ? 
సంధ్య వచ్చినప్పుడేమీ చెప్పలేదే ? ఎలా వున్నావమ్మా ? నీకిలావుండగా నాన్న కాశీ ఎందుకు వెళ్లారు?" ఆర్ద్రంగా అంది గీత ఏం వినాల్సి వస్తుందోనన్న భయంతో. 
"నేను బాగానే ఉన్నానమ్మా ! అనారోగ్యం ఏమీ లేదు. నేను చేసినపనే ఆయనకు నచ్చలేదు.. కోపం వచ్చి వెళ్లిపోయారు" అంది రంగనాయకి నిర్వికారంగా.
"అంత కాని పనేం చేశావమ్మా ?"ఆవేదనతో తల్లడిల్లిపోతూ అడిగింది గీత.     
"కాని పనేం చేయలేదు. డబ్బు కావాలి. సంసారాన్ని కాపాడుకోవాలి. అదే ధ్యేయంగా నడిచాను. 
మీ నాన్నగారు ఒప్పుకోరని ముందుగా చెప్పలేదు. ఆయన అపార్థం చేసుకుని నీతో మాట్లాడారు. డాక్టర్ చెప్పాక, వివరం విని తట్టుకోలేక  కోపంతో కాశీ వెళ్లిపోయారు.
డబ్బున్న వారే ఇల్లు, కార్లు అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. 
నేనెందుకు అద్దెకివ్వకూడదనుకున్నాను. ఇచ్చాను ! ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు". 
"అద్దెకిచ్చావా ... ఏమిచ్చావమ్మా? "
"గర్భం" అంటూ ముగించింది రంగనాయకి నిర్వికారంగా. 
తల్లి ఒడిలో వాలిన గీత కళ్ళనుండి అశ్రుధారలు ఆగకుండా వర్షిస్తున్నాయి.  
                                                     ----------xxx----------

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 98491 18254 

 (ఈ మినీ కథ 'సహరి' కొసమెరుపు కధల పోటీ లో సా.ప్ర కు ఎంపిక కాబడింది)



27, జనవరి 2021, బుధవారం

మానసం

                                                                    మానసం 
                                                                  ----------------

"హేయ్ తేజస్ !  లేవ్వయ్యా ... తొమ్మిది గంటలు దాటింది. నిన్ను, చిన్నినీ నిద్ర లేపడం రోజూ నాకో డ్యూటీ అయింది. మానస్ ని చూడు ...ఉదయాన్నేలేచి స్నానంచేసి ఎలా రెడీ అయి 
కూర్చున్నాడో!  లే ఇక !" అతను కప్పుకున్న బ్లాంకెట్ లాగేస్తూ అసహనంగా అంది కమల.
"ఈవేళ క్లాసులు లేవు. కాసేపు పడుకోనీ పిన్నీ"
"అదేంటి ? పదింటికి  క్లాస్ ఉందన్నావుగా" గుర్తు చేసింది కమల.
సైన్సు టీచర్ అంజని మేడం గుర్తుకి రావడంతో దిగ్గున లేచి పరుగున బాత్రూంకి వెళ్ళాడు తేజస్. అతను వచ్చేసరికి  డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉన్న బూస్ట్ రెండు గుక్కల్లో తాగి స్కూలుకి బయలుదేరా తేజస్. 
మానస్, తేజస్ కవలలు. ఇద్దరు ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
తల్లి అమల, తండ్రీ విశాల్ ఇద్దరు డాక్టర్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అసైన్మెంట్ మీద నైజీరియా వెళ్లి అక్కడ మూడేళ్లు పనిచేసి, అది పూర్తవుతూనే అమెరికా వెళ్లి నాలుగు సంవత్సరాలయింది.
నైజిరియా వెళుతున్నప్పుడే తేజస్, మానస్ లను హైదరాబాద్ లో స్వంత చెల్లెలు 'కమల' దగ్గర ఉంచి వెళ్ళింది అమల. కమలకి ఒక కూతురు. ముద్దుపేరు 'చిన్ని'. అన్నలిద్దరంటే దానికి ప్రాణం  తల్లిని అన్నలిద్దరితోబాటే 'పిన్నీ' అని పిలిచేది. 
అమెరికా వెళ్లిన వెంటనే పిల్లల్నిఅమెరికా తీసుకెళదామనుకున్నారు అమల ఆమె భర్త విశాల్. అనిశ్చితితో నాలుగేళ్లయినా తీసుకువెళ్ళలేదు. అదిగో, ఇదిగో నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. నాలుగేళ్లలో ఒకసారి హైదరాబాద్ వారు వచ్చి పిల్లల్ని చూసి వెళ్లారు. 
క్రిత సంవత్సరం మానస్, తేజస్ తలితండ్రుల దగ్గరకు వెళ్లి వేసవి శలవులు గడిపివచ్చారు. 
                                                                    * * * * *                                                  
"పిల్లల్ని హైస్కూల్ లెవెల్లో ఇక్కడికి తీసుకువస్తే 'కోప్ అప్' కాలేరు. అండర్ గ్రాడ్యుయేషన్ కి వస్తే. ఇక ఒక్కసారే ఇంటరయ్యాక తీసుకెళతామే ! ఇన్నేళ్లు పిల్లల్ని కన్నతల్లిలా చూసుకున్నావు.ఈ మూడేళ్లు కూడా కష్టమనుకోకే" అని చెల్లెల్ని అభ్యర్ధించింది అమల. 
"అక్కా! తేజస్ ఎక్కడున్నా, ఎవరితోనైనా కలిసిపోతాడు, నెగ్గుకొస్తాడు. మానస్ అలాకాదు. 
మౌనంగా ఉంటాడు. మీరెందుకు తీసుకెళ్లడంలేదనే చింత. ఆలోచన. దిగులుగా ఉంటాడు. 
వాడింట్లో ఉన్నంత సేపు నాకూతురినీ కూడా ముద్దు చేయను. స్కూల్నుంచి వస్తూనే  ''పిన్నీ...పిన్నీ'' అంటూ ఇల్లంతా వెదుకుతాడు.వాడికేదో భయం, అభద్రతక్కా! 
సున్నిత మనస్తత్వం. వాడిని మీరింకా ఇక్కడే వదిలిస్తే ...." అంటూ నీళ్లు నమిలింది కమల
"మా అశలు, ఆకాంక్షలూ అంతా వారే కదా! ఇంకా మూడేళ్లు. ఏం చేయగలం చెప్పు వీలు కానప్పుడు....అయినా వాళ్ళిక్కడికొచ్చాక ఇక్కడి రంగుల ప్రపంచాన్ని చూసి అన్నీ మరిచిపోతారు. నువ్వేం కంగారు పడకు" అంది అమల విషయాన్నిదాటవేస్తూ.
'వారి బాల్యాన్ని మీరెంతగా కోల్పోయారో గుర్తించేసరికి కాలం కరిగిపోతుందక్కా' అని పైకనలేక మనసులో ఆక్రోశిస్తూ. 
"అది కాదక్కా ...." ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నకమలను అడ్డుకుని 
"సరే లేవే ! మరీ పెద్ద మాటలు. పిల్లలకేం తెలుసు! మనమెలా పెరిగాం ? నాన్న మాటకు  ఎప్పుడైనాఎదురు మాట్లాడామా ? ఎటూ ఇంటర్ పూర్తయ్యాక తీసుకెళతానంటున్నాను కదా! మూడేళ్లు ... చూస్తూ గడిచిపోతాయి. వేసవిశలవుల్లో అందరూ ఇక్కడికి రండి. టికెట్లు బుక్ చేస్తాను.ఇద్దరితో రేపు మాట్లాడుతామని చెప్పు. కొద్దిగా బిజీగా ఉన్నాను '' అంటూనే ఫోను కట్ చేసింది అమల. 
'అందుకేనక్కా యదార్ధం చెప్పాలంటేనే నాకు జంకు' అనుకుంటూ పనిలో నిమగ్నమైంది కమల.
"అమ్మేనా ఫోనులో మాట్లాడింది ?"అడిగాడు అప్పుడే అక్కడికొచ్చిన మానస్.
"అవును ! మీతో రేపు మాట్లాడతానంది. వేసవి శలవుల్లో మనందరికీ అమెరికా టికెట్స్ బుక్ చేస్తానంది అమ్మ" అంది కమల మానస్ ని ఉత్సాహపరచడానికి.
"బిస్కట్ లే పిన్నీ! ఇంతకీ మేము అక్కడ స్కూల్లో చేరతున్నామా ? తిరిగి వస్తున్నామా?" కుతూహలంగా ప్రశ్నించాడు మానస్ .
"నాకు తెలీదు నాన్నా! నువ్వే అడిగి తెలుసుకో !" అబద్ధమాడింది కమల, మానస్ ని బాధపెట్టడం ఇష్టంలేక.
"నువ్వు చాలా మంచిదానివి పిన్నమ్మా ! లవ్ యూ" అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు మానస్.
"లవ్ యు టూ మానస్ !" అప్రయత్నంగానే మానస్ ని దగ్గరకు తీసుకుని హత్తుకుని, నుదురు మీద ముద్దుపెట్టుకుని ... నువ్వుకూడా చాలా మంచివాడివి మానస్ !" పొంగుకొస్తున్న కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుంటూ అంది కమల.
"నువ్వే మా అమ్మవి..."అంటూ వేగంగా వెళ్ళిపోయాడు మానస్ తన గది లోకి .
"మానస్! ... " ఆందోళనతో బిగ్గరగా పిలిచింది కమల.
వెనక్కు చూడకుండా, పలక్కుండా వెళ్ళి గది తలుపువేసుకున్నాడు మానస్.
మూసుకున్న గది తలుపుల వంక చూస్తూ నిరుత్తరి అయింది కమల. 
                                                             * * * * *
మానస్, తేజస్, కమల,చిన్నీ అమెరికా వచ్చిన వారం రోజులకే వేగస్, గ్రాండ్ కాన్యన్, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్ ట్రిప్ వేసింది అమల.
డాలస్ నుంచి లాస్ వేగస్ వెళ్లే ఫ్లైట్ లో తేజస్ తండ్రి పక్క సెటిలయ్యాడు. ప్రయాణికులు ఒక్కరొక్కరుగా సీట్లలో సెటిలవుతున్నారు. ఎయిర్ హోస్టెస్ కేబిన్ లగేజి సర్దుతోంది.
మానస్ వెళ్లి 'చిన్ని' పక్కన కూర్చున్నాడు.
"మానస్ నువ్విక్కడకి రా ! అక్కడ పిన్ని కూర్చుంటుంది" అంది అమల.
"ఇట్స్  ఓకే మామ్...ఐ యామ్ ఫైన్ హియర్" అన్నాడు మానస్ నిర్లక్ష్యంగా.
చిన్న బుచ్చుకుంది అమల. నిలబడి వారిని గమనిస్తూ వేచి చూసిన కమలను తన పక్కన సీట్లో కూర్చోమంది అమల అసహనంగా.
మానస్ ఉద్దేశ్యపూర్వకంగా తల్లికి దూరంగా మసలడం, అతని ప్రవర్తన, అసంతృప్తి స్పష్టమైన సంకేతాలతో కనిపిస్తోంది.ఎక్కడ అక్క తనని అపార్ధం చేసుకుంటుందేమోనన్న చింతతో 
తల్లడిల్లి పోయింది కమల.
"మానస్ ! నువ్వు అమ్మదగ్గర కూర్చో ! నేను చిన్నిదగ్గర కూర్చుంటాను" అంది కమల సీట్లోనుంచి వెనక్కి తిరిగి మాట్లాడుతూ.
"మీరిద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకోండి పిన్నీ!" అన్నాడు మానస్ అదే ధోరణితో.
వారం రోజుల ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక ఆరోజు అమల, విశాల్ కి  డే ఆఫ్ కావడంతో అందరూ హాల్లో కూర్చుని ట్రిప్ కబుర్లు చెప్పుకుంటున్నారు. 
"మానస్ ! వచ్చిన దగ్గర్నుంచి గమనిస్తున్నాను ? ట్రిప్ లో కూడా గెస్ట్ లా దూరంగా మసిలావు.   నువ్వు నీ ఇంటికి వచ్చావ్...తెలుసా ?!" అంది కొడుకుతో మాట్లాడాలని నిర్ణయించుకున్న అమల.
"మామ్! వాడినలా వదిలెయ్ ... ప్లీజ్" అన్నాడు తేజస్ వెంటనే కలుగచేసుకుంటూ.
"వాడిని మాట్లాడనివ్వు తేజస్ ! నువ్వెందుకు మధ్యలో కలుగచేసుకుంటావ్ ?!" సీరియస్ గా అంది అమల, తేజస్ ఎందుకన్నాడో ఆలోచించకుండా, అర్థచేసుకోకుండా.
వారికి ఏకాంతం కల్పిస్తూ అక్కడినుంచి వెళ్ళింది కమల చిన్నితో.
"కమాన్...మానస్ ! మాట్లాడు. నువ్వు.నీ మౌనం,నీ ప్రవర్తన భరించడం... కష్టంగానూ, చికాకుగా ఉంది. టాలరేట్ చేయలేకపోతున్నాను. చెప్పు!నీ ప్రాబ్లెమ్ ఏమిటి ?" కోపావేశంతో అడిగింది అమల.
"నా ఇంటికొచ్చానా ? ... ఐతే నేను హైదరాబాద్ లో ఎందుకున్నాను ?"సూటిగా అడిగాడు మానస్ టి.వి ఆన్ చేస్తూ. 
అతని చేతిలోనుంచి రిమోట్ లాక్కుని సోఫాలో గిరాటువేసింది అమల టి.వి ఆఫ్ చేసి . 
మానస్ ముఖం కందగడ్డలా ఎర్రగా అయింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. రెండుచేతులతో ముఖాన్నికప్పుకున్నాడు. 
అమల,విశాల్ ఇద్దరూ లేచి మానస్ దగ్గరికి వెళ్లారు.
"మానస్! నీ బాధ మాకు తెలుసు.మా సమస్యలే మీకు తెలియవు. మిమ్ముల్నిహైదరాబాద్ లోనే ఎందుకు ఉంచాల్సి వచ్చిందో చెబుతాను విను ! మేమిక్కడికి వచ్చాక రెండు సంవత్సరాలు సరిగ్గా సెటిల్ కాలేక పోయాము. ఇక్కడ ఉండడమా తిరిగి వెనక్కి ఇండియా వచ్చేయడమా అన్న డైలెమాలో ఉన్న కారణంగా మిమ్ముల్నితీసుకురాలే దు. థర్డ్ ఇయర్ తీసుకువద్దామనుకునే సరికి మీ అకడమిక్ ఇయర్ సగం అయిపొయింది. సారీ...మానస్ !" అంటూ మానస్ ని దగ్గరికి తీసుకున్నాడు విశాల్.
"ఇండియా నుంచి వచ్చిన వారికి హైస్కూల్లో కోప్ అప్ కావడం కష్టం అన్నారు ఫ్రెండ్సు. 
అందుకే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కి వస్తే మీకే ఇబ్బంది ఉండదని ఆలోచిస్తున్నాము" అంది అమల వారిద్దరినీ సాలోచనగా చూస్తూ.
"మామ్ ! నాకర్ధం కాలేదు నువ్వేం చెప్పావో" అన్నాడు తేజస్.
"ఇంటర్మీడియట్ దాకా అక్కడ, తరువాత యిక్కడ ... యాం ఐ రైట్ మామ్ ?"ధిక్కార స్వరంతో అన్నాడు మానస్.
"అవును మానస్ ! మీ కెరియర్ బాగుండాలనే అన్నీఅలోచించి, మేమీ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది'' అంది అమల.
"చాలా స్టడీ చేశాము. ఫ్రెండ్సుని విచారించాము. వారి పిల్లలతో మాట్లాడాము. మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి వెంటనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ లో చేరిపోవచ్చు.
ఎవ్విరిథింగ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్" అన్నాడు విశాల్.
దిగ్గున లేచి అక్కడ్నుంచి లేచి తన గదిలోకెళ్ళాడు మానస్.
విశాల్ నిరాశగా, నిస్సహాయంగా తనవంక చూడడం గమనించి "డోన్ ట్ వర్రీ. విశాల్ ! హి విల్ బి  ఆల్రైట్" అంది అమల భర్తకు ధైర్యం చెబుతూ.
                                                                    * * * * *
"హే గైస్ ... మూడురోజుల్లో తిరుగు ప్రయాణం. ఈ రోజు సాయంత్రం షాపింగ్ కి వెళదాం. బయటే డిన్నర్ చేసి వద్దాం ! ఒకే బోయిస్ !?" అన్నాడు విశాల్ హుషారుగా.
"ఒకే డాడ్" సంతోషంగా అన్నాడు తేజస్ తండ్రి మాటకు వెంటనే స్పందిస్తూ.
"మానస్ !  ఛీర్ అప్ ..." రెట్టించాడు విశాల్ మౌనంగా ఉన్న మానస్ వంక చూస్తూ. 
"విశాల్ ! వాడిని వదిలెయ్" అంది కిచెన్ లోపలి నుంచి అమల.
కిచెన్ లోనికి వెళ్ళాడు విశాల్. కిచెన్లోనుంచి బయటకు వెళ్ళబోయింది కమల.
"నువ్వుండు కమలా! వెళ్ళకు. మానస్ గురించి మాట్లాడాలి... వాడి ప్రవర్తన ఇబ్బందిగా వుంది.  ఇద్దరిలో ఎంత తేడా ? అక్కడకూడా ఇలానే ప్రవర్తిస్తాడా ? నువ్వెలా హేండిల్ చేస్తున్నావు వీడిని ?" ఉత్సుకతతో అడిగాడు విశాల్
"బావా! మీరిద్దరూ డాక్టర్లు. మనుషుల్నిచదవగలరు.వాడు చిన్నపిల్లాడు... ".
"సో వాట్... వుయ్ ఫెయిల్డ్ ! వాడి తత్వం ఏవిటో అసలర్థంగావడంలేదు !"
"వారిద్దరితో నాకెన్నడూ, ఎలాటి సమస్యా రాలేదు.వదిలేయండి బావా!
వాడే మెల్లగా కుదురుకుంటాడు. మీరేం వర్రీ కావద్దు" అంది కమల విశాల్ కి ధైర్యం చెబుతూ.
                                                                * * * * *
తిరిగి హైదరాబాద్ వస్తూనే స్కూళ్ళు.హడావుడి. తేజస్,మానస్ టెన్త్ క్లాస్ కి ప్రమోట్ అయ్యారు.
అమెరికా వెళ్లి వచ్చిన దగ్గరనుంచి మానస్ లో అనుకోని మార్పు. అందరితో కలవడం,  మాట్లాడడం. సంతోషంగా ఉండడం. వారాంతాలలో తల్లీ, తండ్రితో కబుర్లు. ఆహ్లాదంగా గడుస్తున్నాయి రోజులు. మరో మూడు కేలెండర్లు మారాయి.
తేజస్, మానస్ ఇంటర్మీడియట్ పరీక్షలు పాసయ్యారు. ఇద్దరి అమెరికన్  వీసాలు యూ.ఎస్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకి వేలిడేట్ అయ్యాయి. 
అమల, విశాల్ హైదరాబాద్ వచ్చారు. ప్రయాణం మూడు రోజుల్లో పడింది. 
తేజస్ తన బ్యాగేజీ సర్థండం మొదలెట్టాడు.
"మానస్! ... తేజస్ ప్యాకింగ్ అయింది. రేపు రాత్రికే ప్రయాణం. నువ్వింకా నీ బ్యాగులు సర్దడం  మొదలెట్టలేదు" సూట్ కేసు తీసుకువచ్చి హాల్లో పెడుతూ అంది అమల.   
మానస్ మనసు ససేమిరా అంటోంది. అయిష్టంగానే ''సరే మామ్!'' అంటూ దారికడ్డంగా ఉన్న సూట్ కేసు మీద నుంచి దుముకుతూ బ్యాలన్సు తప్పిబోర్లా పడ్డాడు మానస్. 
"అమ్మా... "అంటూ బాధగా అరిచాడు మానస్.
''మానస్!'' బిగ్గరగా అరుస్తూ పరుగున వచ్చి అతనికి చేయందించి లేపి "దెబ్బేమైనా తగిలిందా నాన్నా!" అంటూ మానస్ ఒళ్ళు తడిమి చూసింది కమల.
"దెబ్బేమీ తగల్లేదు లేవే ! లేచాడుగా... ఎందుకంత కంగారు" అంది అమల కూర్చున్న సోఫా మీదనుంచి లేవకనే. 
"ఏం కాలేదు పిన్నమ్మా ! మోచేతి కింద కొద్దిగా గీసుకుపోయిందంతే.  జీన్సుప్యాంటు కదా...కాళ్లకు  దెబ్బ తగలలేదు. నువ్వు కంగారు పడకు !" అన్నాడు తల్లి, పిన్నమ్మల ఇద్దరి వంక చూస్తూ
తన గదిలోనికి వెళ్ళాడు మానస్.                                                       
కమలకి పిల్లల ప్రయాణం అయోమయంగా వుంది. పదేళ్లుగా కలిసి ఉన్నపిల్లలు మరుసటి రోజు నుంచి ఇంట్లో కనిపించరన్న భావనే ఆమెను నిలవనీయడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీరింకి పోయింది.
మానస్ కొద్దిసేపటి తరువాత గదిలో నుంచి బయటకు వచ్చాడు. 
"మామ్...డాడ్ ! నేను మీతో అమెరికా రావడం లేదు. నా మనసెంతకూ అంగీకరించడంలేదు. నేనక్కడ ఇమడలేను. అక్కడికొచ్చి మిమ్ముల్ని ఇబ్బంది పెట్టడం నా కిష్టంలేదు.నేనిక్కడే చదువుకుంటాను. నన్ను క్షమించండి!" అంటూ వారి కాళ్లకు తలానించి,నమస్కరించి, తేజస్ ని కౌగలించుకుని ''అల్ ది బెస్ట్ తేజస్'' అన్నాడు ఉద్వేగంగా మానస్.   
మాన్పడిపోయింది అమల. 
"ఏం మాట్లాడుతున్నావ్ మానస్? ఇన్నేళ్లకు కుదిరింది ఫ్యామిలీ ఏకం కావడానికి. 
మూర్ఖంగా  రానంటున్నావు. ఒక్కడివిక్కడుండి ఏంచేస్తావ్ ?" తేరుకుని కోపంగా అంది అమల.
"పిన్ని వాళ్లంతా నా ఫామిలీ కాదా!? నీకు తెలుసా మామ్? ఐదేళ్ల క్రితం బాబాయిగారికి సౌదీలో పెద్ద జీతంతో జాబ్ వచ్చింది. ఆయన వెళ్ళలేదు. ఫ్యామిలీ కోసం ఆఫర్ ని వదులుకున్నారు. బాబాయిగారిని అడిగాను. 
మామ్, డాడ్ వెళ్లారు కదా విదేశాలకి ... డబ్బు బాగా సంపాదించవచ్చు కదా ! మీరెందుకు సౌదీ వెళ్లడంలేదని ? బాబాయిగారి సమాధానమేమిటో తెలుసా ? కుటుంబాన్నివదిలి వెళ్లడం ఇష్టంలేదని ... ఇక్కడ ఉద్యోగం, సంపాదన తృప్తిగానే ఉందని"
"ఎవరిష్టం వారిది మానస్! మీ కోసం...మీ భవిష్యత్తు కోసమే కదా మేం వెళ్ళింది.మాకోసం కాదు!  
నీ నిర్ణయం తప్పు. నువ్వొస్తున్నావు మాతో... దట్సాల్ " పూనకం వచ్చినట్లుగా బిగ్గరగా అరిచింది అమల. 
"సారీ మామ్...సారీ డాడ్ !...నన్నొదిలేయండి. నేను రాను. వీలవుతే మీరే ఇండియా తిరిగి వచ్చేయండి. డాక్టర్ల కొదవ చాలా ఉందిక్కడ" తెగేసి ఖచ్చితంగా అన్నాడు మానస్.
"అమలా! ఇక ఆపు. వాదన వదిలెయ్. జరగాల్సింది చూద్దాం !" వారిద్దరి మధ్య కలుగచేసుకుని చొరవగా అన్నాడు విశాల్. 
"ఒకే మానస్! ఇక్కడే ఉండి పోతానంటావు ... సరే! తరువాతేమిటి ... ?"
"నేను...నా భవిష్యత్ గురించి స్పష్టమైన అవగాహన వుంది. నేను అమెరికా రానన్నది అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి! పెద్ద,పెద్ద మాటలు చెప్పలేను గాని ఒక్క విషయం ఖచ్చితంగా చెబుతాను. నన్నుపెంచిన అమ్మని, నా దేశాన్నివదలి రాను. నన్ను క్షమించండి. మీరిద్దరూ కావాలి నాకు" ఒక్క ఉదుటున తండ్రి దగ్గరకొచ్చి చుట్టూ చేతులువేసి బావురుమన్నాడు మానస్. 
చలించి పోయాడు విశాల్. అతని కళ్ళు చెమర్చాయి. మానస్ ని హత్తుకుంటూ 
"ఒకే మానస్ ! నీ ఇష్టం. నాహృదయం చాలా తేలికయింది. సంతోషంగా ఉంది. నువ్వు, నీ ఆదర్శం,అవగాహన, దృఢ సంకల్పం, దృక్పథం...నాకర్ధమయ్యాయి. ఎంతో గర్వంగా ఉంది. త్వరలో ఇండియా వచ్చేస్తాము. ప్రామిస్!" అన్నాడు మానస్ ని గట్టిగా హత్తుకుని విశాల్. 
అవాక్కయి చూస్తూ ఉండిపోయింది అమల. సంతోషంగా కళ్ళుతుడుచుకుంది కమల.               
                                                     ~~~   ~~~   ~~~  ~~~  ~~~


రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
mobile number :9849118254

 
======================================================================
                                                      
                                                        హామీ పత్రము 
                                                         -------------------                                                            
''మానసం' కధ  నా స్వంత రచన. ఏ ఇతర రచనకు అనుసరణగానీ, అనువాదం కానీ కాదు. 
ఏ పత్రికలోనూ, వెబ్ పత్రికలలోగానీ, బ్లాగులోగానీ ప్రచురితము కాలేదు. అముద్రితము.  

కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254
అడ్రస్ : 
Flat No.713, SMR Vinay Symphony, 
Opp: Brahmakumari Shanti Sarovar,
Indiranagar, Gachibowli,
Hyderabad-500032   

    

17, సెప్టెంబర్ 2020, గురువారం

దిక్కులు, మూలలు, వేదాలు, జ్యోతిర్లింగాలు,పురుషార్ధాలు, పంచేంద్రియాలు, దేవతావృక్షాలు, పంచోపచారాలు, పంచారామాలు, షడ్రుచులు, తిరుపతిసప్తగిరులు,అరిషడ్వర్గాలు షడ్గుణాలు

దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

వేదాలు :(1) ఋగ్వే దం, (2) యజుర్వేదం,(3) సామవేదం,(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,(3) కామ,(4) మోక్షా

పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

పంచేంద్రియాలు : (1) కన్ను,(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,(5) చర్మం.

లలిత కళలు : (1) కవిత్వం,(2) చిత్రలేఖనం, (3) నాట్యం,(4) సంగీతం, (5) శిల్పం.

పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,(3) గోదావరి, (4) కావేరి,(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు : (1) మందారం, (2) పారిజాతం, (3) కల్పవృక్షం, (4) సంతానం, (5) హరిచందనం.

పంచోపచారాలు : (1) స్నానం,(2) పూజ,  (3) నైవేద్యం,(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.

పంచామృతాలు : (1) ఆవుపాలు,(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, (5) తేనె.

పంచలోహాలు : (1) బంగారం,(2) వెండి,  (3) రాగి,(4) సీసం, (5) తగరం.

పంచారామాలు : )1) అమరావతి,(2) భీమవరం, (3) పాలకొల్లు,(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,(3) చేదు, (4) వగరు,(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం,(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,(5) మదం, (6) మత్సరం.

సప్త ఋషులు : (1) కాశ్యపుడు,(2) గౌతముడు,  (3) అత్రి,(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతిసప్తగిరులు : (1) శేషాద్రి,(2) నీలాద్రి, (3) గరుడాద్రి,(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్తవ్యసనాలు : (1) జూదం, (2) మద్యం, (3) దొంగతనం, (4) వేట, (5) వ్యభిచారం, (6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు : (1) గంగ,(2) యమునా,  (3) సరస్వతి,(4) గోదావరి,  (5) సింధు,(6) నర్మద,  (7) కావేరి.
            
నవధాన్యాలు : (1) గోధుమ,(2) వడ్లు,  (3) పెసలు,(4) శనగలు, (5) కందులు,(6) నువ్వులు, (7) మినుములు, 
(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం, (2) పగడం, (3) గోమేధికం,(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,(7) కనకపుష్యరాగం, 
(8) పచ్చ (మరకతం), (9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 5) ఇనుము, (6) కంచు,(7) సీసం, (8) తగరం, 
(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,(6) భయానక, (7) బీభత్స, (8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి, (2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,(4) కూష్మాండ, (5) స్కందమాత, 
(6) కాత్యాయని, (7) కాళరాత్రి, (8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు : (1 ) వివాహం, ( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , (4 ) సీమంతం, (5) జాతకకర్మ, 
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, (8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, (10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,(2) కూర్మ, (3 ) వరాహ,(4) నరసింహ, (5) వామన,(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2) మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) తమిళనాడు ~ రామలింగేశ్వరం
 
తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,(3) మంగళ, (4) బుధ, (5) గురు,(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, (5) శ్రావణం, (6) భాద్రపదం, (7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, 
(9) మార్గశిరం, (10) పుష్యం, (11) మాఘం, (12) ఫాల్గుణం.

రాశులు : (1) మేషం,(2) వృషభం, (3) మిథునం, (4) కర్కాటకం,(5) సింహం, (6) కన్య, (7) తుల, (8) వృశ్చికం, (9) ధనస్సు, 
(10) మకరం, (11) కుంభం,(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, (3) తదియ, (4) చవితి,(5) పంచమి, (6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, (9) నవమి, 
(10) దశమి,(11) ఏకాదశి, (12) ద్వాదశి, (13) త్రయోదశి, (14) చతుర్దశి,(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, (3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, (6) ఆరుద్ర, (7) పునర్వసు,(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, (14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, (17) అనురాధ, (18) జ్యేష్ఠ,(19) మూల, (20) పూర్వాషాఢ, 
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,(23) ధనిష్ఠ, (24) శతభిషం, (25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, (27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107;

(2) విభవ :- 1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :- 
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. - 
1934, 1994, 2054, 2114

9యువ.  - 
1935, 1995, 2055, 2115

10.ధాత.  - 
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. - 
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. - 
1939, 1999, 2059, 2119

14.విక్రమ. - 
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. - 
1942, 2002, 2062, 2122

17.స్వభాను. - 
1943, 2003, 2063, 2123

18.తారణ. - 
1944, 2004, 2064, 2124

19.పార్థివ. - 
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. - 
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. - 
1948, 2008, 2068, 2128

23.విరోధి. - 
1949, 2009, 2069, 2129

24.వికృతి. - 
1950, 2010, 2070, 2130

25.ఖర. 
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ. 
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి. 
1956, 2016, 2076, 2136

31.హేవళంబి. 
1957, 2017, 2077, 2137

32.విళంబి. 
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి. 
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్. 
1962, 2022, 2082, 2142

37.శోభకృత్. 
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144, 

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ. 
1967, 2027, 2087, 2147

42.కీలక. 
1968, 2028, 2088, 2148

43.సౌమ్య. 
1969, 2029, 2089, 2149

44.సాధారణ . 
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్. 
1971, 2031, 2091, 2151

46.పరీదావి. 
1972, 2032, 2092, 2152

47.ప్రమాది. 
1973, 2033, 2093, 2153

48.ఆనంద. 
1974, 2034, 2094, 2154

49.రాక్షస. 
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156, 

51.పింగళ                 
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి         
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి              
1979, 2039, 2099, 2159

54.రౌద్రి                 
1980, 2040, 2100, 2160

55.దుర్మతి              
1981, 2041, 2101, 2161

56.దుందుభి             
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి         
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి                 
1984, 2044, 2104, 2164

59.క్రోదన                  
1985, 2045, 2105, 216

60.అక్షయ              
1986, 2046, 2106, 2166.