గతాన్ని గుమ్మంలో గుమ్మరించుకుంటూ
గతస్మృతులే గమ్యంగా గతి లేని జీవితం గడపకు!
గల గలా నవ్వడం మానేశానన్నా
బతుకే చేదయిందన్నా... ఎవరిక్కావాలి నీ గోడు ?
గాథాభరితులు ఈ ఇలలో కోకొల్లలు
నీకేం!? నువ్వెంతో మేలు
నిచ్చెనలుంటాయి అందిపుచ్చుకో!
చేవ తెచ్చుకుని తోవ చేసుకుంటూ చేతనైనట్లు బతుకు!
నీ బతుకు నీది, సారూప్యం వద్దు
గడిచిన నిముషం పొద్దు, పద్దులోకే పోతుంది
నిన్నటి మొన్నటి దాకా నువ్వేంచేశావో
నిక్కచ్ఛిగా గణించుకో!
వీసమెత్తైనా, గవాక్ష గవేషణలో నిదర్శనం నినదించాలి!
గతమంతా మేలేనని సాంత్వన చెందావా అంతే !
నీనడకింక నిద్రాణమే!
నిరర్గళంగా పయనించాలి
స్వాప్నికాస్వామ్యావిష్కారం కోసం!
దారుల్లో దగాకోరులుంటారు
నివారకాలుంటాయి
నిరాశవద్దు, నిస్తేజం వలదు!
ఉత్తేజం కావాలి!
ఊసుల్లో ఊరేగొద్దు,
ఉషస్సులో కురకాలి
వంది మాగధుల వందనాలు వద్దు
స్వావలంబన చేరువయ్యే వరకు విశ్వప్రయత్నం చేస్తూనే వుండు !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి