పరోపకారం ఇదం శరీరం
( ఈ కథ సాక్షి - ది. 7, సెప్టెంబర్ నెల - ఆదివారం - ఫన్ డే లో ప్రచురింపడింది )
"అన్నయ్యా! రామారావు బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈసారి ఆయన కండిషన్ క్రిటికల్ అన్నాడు డాక్టర్. నువ్వు చూసి వెళితే బావుంటుంది" స్వంత బాబాయి అనారోగ్యం కబురు తెలిసిన రెండురోజుల తరువాత ఊళ్ళో ఉన్న అన్న విశ్వనాధ్ కి తీరిగ్గా ఫోను చేశాడు తమ్ముడు శంకరం.
"నేను సిటీకి నిన్ననే వచ్చాను. హాస్పిటల్లో ఉన్నాను. బాబాయి ఇంతకు ముందే పోయాడు. కబురింకా ఎవరికీ చెప్పలేదు. బిల్లు డబ్బు పూర్తిగా కడితే గాని శవాన్నిఇవ్వరట...చంద్రం డబ్బు కోసం వెళ్ళాడు" నిర్లిప్తంగా అన్నాడు విశ్వనాధ్.
"ఓ నిన్ననే వచ్ఛావా! చంద్రం నిన్నేమైనా డబ్బు అడిగాడా?" ఆతృతగా అడిగాడు శంకరం
"అడిగాడు. అవసరానికి నేనేమీ సర్ద లేకపోయాను. సమయానికి వాడి దగ్గర డబ్బు లేదట.
అప్పో, సప్పో చేసి తెద్దామంటే సమయం లేదు. ఉత్త చేతుల్తో వచ్చాను. బిల్లు ఆరు లక్షల ప్యాకేజీ. చంద్రం ఇబ్బంది పడుతున్నాడు" బాధగా అన్నాడు విశ్వనాథ్ తమ్ముడు శంకరంతో.
"అన్నయ్యా! వాళ్ళదగ్గర డబ్బు లేకపోవడమేమిటి? జాలి కబుర్లు! నీ దగ్గర్నుంచి ఎంతో కొంత గుంజుదామని చంద్రం ప్రయత్నం. వాడు డబ్బు తిరిగిచ్చే మనిషి కాదు. నన్నూ అడిగాడు. నిర్మొహమాటంగా లేదని చెప్పాను" అన్నాడు శంకరం కఠినంగా.
"అవేం మాటలు రా! కష్టంలో సాయం చేయకపోతే ఎలా? అందునా మనకి సాయంచేసిన బాబాయి కుటుంబానికి..." తమ్ముడిని మందలించాడు విశ్వనాథ్.
"నీదంతా అమాయకత్వం. నేనన్నదాంట్లో తప్పేముంది? అందర్నీ నమ్ముతావు. చంద్రం సంగతి నీకు తెలియదు... టు ఉద్యోగం. ఇటు రియల్ ఎస్టేటు బిజినెస్. రెండు చేతులా సంపాయిస్తున్నాడు. బాబాయి మాత్రం తక్కువా? బోలెడంత వెనకేసుకున్నారు. వాళ్లకేం తక్కువని మనల్ని డబ్బడగాలి?" తమ్ముడి మాటల్లో ఈర్ష్యాద్వేషాలు విశ్వనాథ్ ని కలవరపెట్టాయి.
"ఎవరెంతటి వారైనా సమయానికి చేతిలో డబ్బుండకపోవచ్చు. అత్యవసరమని అడిగినా సాయం చేయలేక పోయాము..... ఇక ఆ విషయం వదిలెయ్" అసహనంగా అన్నాడు విశ్వనాధ్.
"అయినా, నీ దగ్గర డబ్బెక్కడుంది అప్పనంగా ఇవ్వడానికి ? అయినదానికీ, కానిదానికీ అప్పు చేస్తావు. వడ్డీలు కడతావు. నీకలవాటేగా...!" అన్నని రెట్టించి, దెప్పుతూ అన్నాడు శంకరం.
తమ్ముడి మాటలు మౌనంగా భరించాడు విశ్వనాథ్.
"సరేలే! ఈ వాదులాట మనకెప్పుడు ఉన్నదేగా! నిన్ననంగా సిటీకి వచ్చినవాడివి ఇంటికి రాలేదు.
నీ ఆరోగ్యం మాత్రం పట్టించుకోవు!" నిష్ఠుర మాడాడు శంకరం
"బాబాయి దగ్గర నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవరూ రాలేదు. అందుకే రాలేకపోయాను" సంజాయిషీ ఇచ్ఛాడు విశ్వనాధ్
''ఏం వాడింట్లో మనుషులేమయ్యారు ? అన్నీ నాటకాలు..." ఉడుక్కుంటూ అంటుండగానే సిస్టర్ వచ్చి 'రామారావు పేషెంటు తాలూకు ఎవరున్నారో లోనికి రండి' అని చెప్పి వెళ్ళింది. తమ్ముడి ఫోను కట్ చేసి లోనికి వెళ్ళాడు విశ్వనాధ్.
"డబ్బు కట్టి, రూమ్ నంబరు పద్దెనిమిదికి వెళ్ళండి. 'బాడీ' ఎంబామ్ అవుతోంది" అంటూ తొందరపెట్టింది సిస్టర్.
''ఎంబామ్' అవుతోందా! అంటే ... ?" ప్రశ్నించాడు విశ్వనాథ్.
"ఏం లేదు! బాడీని 'రెడీ' చేస్తున్నాము" అని వివరం చెప్పకుండా లోనికి వెళ్ళింది నర్సు.
చంద్రం సాయంత్రం ఆరుగంటల కొచ్చి బిల్లు కట్టాక శవాన్ని ఇచ్చారు. చంద్రం తన కారులో, విశ్వనాధ్ బాడీతో అంబులెన్సు లో చంద్రం ఇంటికి బయలుదేరారు.
* * * * *
మరుసటిరోజు రామారావు దహన సంస్కారాలు పూర్తయ్యేసరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. అక్కడికొచ్చిన బంధువులు,స్నేహితులు ఒక్కొకరుగా స్మశానం వీడి వెళుతున్నారు.
స్నానం చేసి, బట్టలు ఆరేసి ఓమూల బెంచీమీద నీరసంగా కూర్చుని ఉన్నాడు విశ్వనాథ్. .
"శంకరం ఇంటికి వెళుతున్నావుగా... కర్మలకు రా అన్నా!" అని చెప్పివెళ్ళాడు చంద్రం.
"పద! ఇక మనం కూడా వెళదాం " అన్నాడు శంకరం అన్న దగ్గరికొచ్చి.
ఆరేసిన బట్టలు మడిచి సంచిలో పెట్టుకుని "ఒంట్లో నలతగా, తల దిమ్ముగా ఉందిరా ! నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. ఆకలవుతోంది. అన్నం తిని వెంటనే ఊరికి బయలుదేరాలి. తెచ్చుకున్న డబ్బు ఖర్చయి పోయింది. దారి ఖర్చుకు డబ్బులు కావాలి" స్మశానం బయటకు నడుస్తూ, మొహమాటపడుతూ తమ్ముడితో మెల్లగా అన్నాడు విశ్వనాథ్.
అదే సమయానికి వారి పక్కనుంచి 'మహాప్రస్థానం వేన్' పెద్ద శబ్దం చేస్తూ వెళ్ళింది. ఆ రొదలో విశ్వనాథ్ మాటలు గాలిలో కలిసిపోయాయి. తన మాటలు శంకరం వినలేదని విశ్వనాథ్ గమనించలేదు. ఇద్దరూ స్మశానం నుంచి బయట రోడ్డు మీద ఆటో స్టాండ్ కి వచ్చారు. అదే సమయానికి ఫోను రావడంతో పక్కకి వెళ్లి మాట్లాడాడు శంకరం.
తిరిగి వస్తూనే "అన్నయ్యా! మీ మరదలు ఫోను చేసింది. తనకు పట్టింపులు ఎక్కువ. స్మశానం నుంచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లాలట. నీకూ తెలిసేవుంటుంది. అందుకే నువ్వు సరాసరి వూరికి వెళ్ళు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు" అని పక్కనే నిలబడి, పాసెంజర్ కోసం తమనే గమనిస్తున్నఆటోని పిలిచాడు శంకర్.
"సార్ ని బస్టాండ్ లో దింపు!" అని ఆటో డ్రైవర్ కి చెప్పి, ఇంకొక ఆటో ఎక్కి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు శంకరం నిర్దయగా.
* * * * *
తమ్ముడేమన్నాడో సరిగ్గా అర్ధమయ్యీ గాక క్షణంపాటు తొట్రుపాటుకి లోనయ్యాడు విశ్వనాథ్.
తమ మధ్య జరిగిన సంభాషణ మననం చేసుకున్నాడు. తమ్ముడన్న మాట అప్పుడు అర్ధమైంది. .
'అవును. వాడన్నది నిజమే. కొందరికిలాటి పట్టింపులు ఉంటాయి...అయినా స్వంత అన్నతమ్ముల మధ్య ఇలాటి ఆంక్షలా ?' విరుద్ధ ఆలోచనలతో విశ్వనాధ్ మనసు కళ్లెం లేని గుఱ్ఱంలా పరుగెట్టింది.
అంతటి నిస్సత్తువ, అశక్తతలోను అతని పెదవులపై వెర్రి చిరునవ్వొక్కటి తళుక్కుమని మాయమైంది. ఇంటికి చేరాలి. ఎలా వెళ్ళాలి? అన్న ఆలోచన మిగతా ఏ ఆలోచనను దరిచేరనివ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు.
తెచ్చుకున్నడబ్బు బాబాయి అత్యవసర మందులకు ఖర్చయింది. ఆ డబ్బును చంద్రాన్ని అడిగి తీసుకుందామనుకున్నాడు. మనసొప్పక అడగలేదు. ఇప్పుడు బస్ టికెట్ కి కూడా సరిపడా డబ్బు లేదు. ఎవర్ని అడగాలి. దిక్కు తోచని స్థితి. శరీరంలో సత్తువ క్షీణించింది. నాలుక పిడచగట్టింది. మెదడు మొద్దుబారింది. చుట్టూ ఏం జరుగుతుందో, తనెక్కడ వున్నాడో సైతం అర్ధం కావడంలేదనికి. ఆలోచనా శక్తి మందగించింది. ఎవరో...ఏదో...అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది.
"ఏ బస్ స్టాండ్ కి వెళ్ళాలి సార్ ?" అడుగుతున్నాడు ఆటో డ్రైవర్.
సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. అతనికి మెదడు నుంచి నోటిమాటకి సంకేతం అందడం లేదు. యాంత్రికంగా జేబులు తడుముకున్నాడు విశ్వనాధ్.
జేబులో మిగిలి వున్న ఒక్క ఏభై రూపాయల నోటు, మొబైల్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.
"ఎక్కడికెళ్ళాలి సార్ !?" మళ్ళీ అడిగాడు ఆటో డ్రైవర్, విశ్వనాధ్ ని పరికించి చూస్తూ.
"ఆటో వద్దు. డబ్బు...ల్లేవు... " అతని నోట మాటలు ముద్దగా వచ్చాయి. .
"'గూగుల్ పే' ఉంది సార్! "
"నాకు లేదు. బస్ స్టాండ్ కి దారి చెప్పు. నడిచి వెళతాను" ఒంట్లో శక్తి నంతా కూడదీసుకుని అంటూనే మొదలు నరికిన మానులా కుప్పకూలాడు విశ్వనాథ్.
ఆటో అతను కంగారు పడుతూ ఆటో పక్కకు ఆపి, ఇంజిన్ ఆఫ్ చేసి, పడిపోయిన విశ్వనాధ్ ని తట్టి లేపుతూ, స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాడు.. పరుగున ఆటో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి విశ్వనాధ్ ముఖం మీద నీళ్లు చల్లుతూ "సార్ ... సార్!' అంటూ తట్టి లేపే ప్రయత్నంచేశాడు.
రెండు,మూడు నిముషాల తరువాత కొద్ది తెలివివచ్చి, మగతగా కళ్ళు తెరిచాడు విశ్వనాధ్.
విశ్వనాథ్ వీపు చుట్టూ చేయివేసి కూర్చోడానికి సాయం చేశాడు. వాటర్ బోటిల్ అందించి "కాసిని నీళ్లు తాగండి సార్ !" అన్నాడు ఆటో డ్రైవర్.
నీళ్లు తాగి "నా కేమయింది... ?" పీలగా లోగొంతుతో ప్రశ్నించాడు విశ్వనాథ్.
"మీరు స్పృహ తప్పి పడిపోయారు. మీరు పడిపోయినప్పుడు ... మీ ఫోను, ఏభై రూపాయల నోటు కింద పడ్డాయి'' అని వాటిని, బట్టలున్న బ్యాగ్ ని విశ్వనాధ్ చేతికి అందించాడు ఆటో డ్రైవర్.
ఆ నోటుని తిరిగి అతనికే ఇచ్చి తినడానికి ఏమైనా తెమ్మని సైగ చేశాడు విశ్వనాధ్.
అతను పరుగున వెళ్లి పక్కనే పాన్ షాపులో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి ''ఇవి తినండి! మీ షుగర్ లెవెల్ పడిపోయినట్లుంది" అని పక్కనే ఉన్న పళ్ళ బండి మీదనుంచి రెండు అరటిపండ్లు తెచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగి, నాలుగు బిస్కట్టు,అరటి పండు తిని రెండో పండు బ్యాగులో వేసుకుని
''చాలా సాయం చేశావు. థాంక్యూ తమ్మీ! ఒంట్లో ఇప్పుడు బాగుంది. కొద్దిగా శక్తి వచ్చింది" అని లేచి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు విశ్వనాధ్.
"నిన్ను ఇందాక నా ఆటో కాడ వదిలి వెళ్ళినతను ఎవరు?" ఆటో డ్రైవర్ అడిగాడు
"నా తమ్ముడు" అన్నాడు విశ్వనాథ్
"సొంత తమ్ముడా !? ఇందాక ఆయనన్న మాటలు నేను ఇన్నా. నిన్ను ఇంటికి రావద్దు. సీధా ఊరికి పొమ్మన్నడు కదా... !" అన్నాడు ఆటో డ్రైవర్
మౌనంగా లేచి నిలబడి "నేను వెళతాను" అన్నాడు విశ్వనాధ్.
"ఎలా వెళతారు... ? డబ్బులు లేవన్నారు కదా!" అన్నాడు ఆటో డ్రైవర్.
"నడిచి వెళతాను. ఎవరైనా తెలిసిన వాళ్లకి ఫోను చేద్దామన్నా ఫోను ఛార్జ్ అయిపోయినట్టుంది. నంబర్లు అందులో ఉన్నాయి. దేవుడేదో విధంగా తప్పక సాయం చేస్తాడు" అన్నాడు విశ్వనాధ్ ఆకాశంలోకి చూస్తూ.
"అంతదూరం నడవడం కష్టమన్నా! నువ్వు నడిచే స్థితిలోలేవు. నిన్ను బస్సు స్టాండ్ లో దింపి వెళతాను" అని విశ్వనాధ్ భుజం చుట్టూ చేయి వేసి ఆటో దగ్గరికి నడిచాడతను.
"నీ పేరేంటి ?" అడిగాడు విశ్వనాధ్
"శంకర్ "
"ఓ...నీది నా తమ్ముడి పేరే''
"తమ్ముళ్ళందరూ ఒకేలా ఉండరన్నా!"
"ఎందుకలా అన్నావు ?"
"మీకు తెల్వదా ? ... ఇంతకీ ఏ వూరెళ్ళాలి ?" మాట మారుస్తూ అడిగాడు శంకర్
"కోదాడ వెళ్ళాలి... శంకర్! నువ్వు నా ఫోను తీసుకో. నాకు బస్సు ఛార్జి మందం మూడు వందలివ్వు. ఫోను ఖరీదు వెయ్యి పదిహేను వందలుంటుంది" అన్నాడు విశ్వనాథ్.
"తప్పు సార్! అట్టా మాట్లాడొద్దు. అవసరం ఎప్పుడు, ఎట్టా, ఎవరికి, ఎవరితో వస్తుందో ఎవరికి
ఎరుకన్నా! సాయానికి వెల కట్టకూడదు" అన్నాడు ఆటో శంకర్.
ఆటో స్పీడ్ అందుకుంది. కాసేపట్లో బస్సు స్టాండ్ ఎంట్రీ గేటు దాటి ఆటోని ఓ మూలగా పార్క్ చేశాడు శంకర్. విశ్వనాధ్ ని క్యాంటీన్ కి తీసుకువెళ్లి భోజనం అయ్యాక, కోదాడ టికెట్ తీసుకుని బస్ ఎక్కించాడు.
"శంకర్! నీ ఫోను నంబరు ఒక చిట్టి మీద రాసియివ్వు. ఊరికెళ్ళగానే డబ్బు పంపిస్తాను.
నువ్వు చేసిన సాయం జీవితాంతం మరచిపోను. నీకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. చిన్న వాడివయినా చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను" నమస్కరిస్తూ అన్నాడు విశ్వనాథ్.
చిట్టీ మీద తన ఫోను నంబరు రాసి ఇస్తూ "అన్నా! అట్టా చేయకు. నాకస్సలు నచ్చదు. నీ పానం బాగా లేదని కండక్టర్ కి చెప్పి, నా ఫోను నంబరు ఇంకో చిట్టీ మీద రాసిచ్చిన. తోవలో అవసరమొస్తే నాకు ఫోను చెయ్యమని చెప్పిన. ఎందుకైనా మంచిది నీ తమ్ముడి ఫోను నంబరు నోటికి గుర్తుంటే నాకు చెప్పన్నా" అడిగాడు ఆటో శంకర్.
ఫోను నంబరు చెప్పాడు విశ్వనాథ్. నంబరు నోటు చేసుకుని "ఇంటికి చేరంగానే ఫోను చెయ్యన్నా. నమస్తే! నేనుంట" అని చెప్పి బయటకు వచ్చి బస్సు స్టాండులో పబ్లిక్ ఫోను నుంచి విశ్వనాథ్ తమ్ముడు శంకరానికి ఫోను చేశాడు ఆటో శంకర్.
* * * * *
"హలో! 'సంకరం' గారేనా మాట్లాడేది ?"అన్నాడు ఆటో శంకరం
"నాపేరు శంకరం... సంకరం కాదు"
"సంకరన్నా! ఇది ఇను. ఇందాక ఒక పెద్దాయన అమీర్ పేట స్మశానం బయట ఆటో స్టాండు కాడ స్పృహతప్పి పడిపోయిండు. ఆయన ఫోను నుంచి గిదే నంబరుకి చివర ఫోను చేసిండు. అందుకే నీకు ఫోను చేసిన. ఆయన నీకు చుట్టమో, పక్కమో నాకు తెల్వదు. అంబులెన్సుకు నేనే ఫోను చేసిన. వాల్లొచ్చి ఆయన్ని తీసుకుపోయింరు. ఏ హాస్పిటల్ కి తీసుకపోయిన్రో వివరాలు నాకు తెల్వదు. ఆమనిషి నీకు తెలిసుంటే వివరం కనుక్కుంటావని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోను చేసిన. గింతే... " అని ఫోను పెట్టేశాడు ఆటో శంకర్.
* * * * *
'అన్న' విశ్వనాథ్ కి ఏమైనా ప్రమాదం జరిగిందా నన్న అనుమానం వచ్చి భయపడ్డాడు శంకరం. వెంటనే అన్నకి ఫోను చేశాడు. ఫోన్ పనిచేయడంలేదని రికార్డెడ్ మెసేజ్ వస్తోంది.
''రమా! అన్నయ్య స్మశానం దగ్గర ఆటో స్టాండ్ దగ్గర స్పృహతప్పి పడిపోయాడట. అంబులెన్సు వాళ్ళు ఏదో ఆస్పత్రికి తీసుకెళ్లారట. నీ మాట విని బుద్ధిలేని పని చేశాను. నీకు పట్టింపని నన్ను పెంచిన అన్నని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలి వచ్చాను. ఇంటికి రాకూడదన్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. చేతిలో డబ్బుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అన్నయ్యను ఎక్కడని వెదకాలి ?" అని తలపట్టుకుని బాధ పడుతూ వెంటనే బయలుదేరాడు.
ఆమీర్ పేట చుట్టు పక్కల వున్నఆసుపత్రులన్నీ మూడు గంటల పాటు వెదికాడు.
గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చెక్ చేశాడు. జాడ తెలియలేదు. మళ్ళీ అన్నకి ఫోను చేశాడు. ఇంకా ఫోన్ పనిచేయడంలేదని మెసేజ్ వస్తోంది. ఏం చేయాలో పాలు పోలేదు.
ఊళ్ళో వదినకు ఫోను చేశాడు. అన్న ఇంకా రాలేదని, ఆయన ఫోను కూడా పనిచేయడంలేదని వదిన చెప్పింది. శంకరానికి ఇంకా కంగారెక్కువయింది. తను చేసిన పనికి శంకరం మనసు వ్రయ్యలయింది.
ఇంతలో ఫోను మోగింది. ఫోను తీశాడు శంకరం. ఏదో ల్యాండ్ లైన్ నుంచి ఫోను.
"శంకరం! ఇప్పుడే కోదాడలో బస్ దిగి నువ్వు కంగారు పడతావేమోనని బస్ స్టాండ్ నుంచి ఫోను చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళాక నీరసంతో కళ్ళుతిరిగి కూలబడ్డాను.
ఎవరో ఆటో అతను ... అతని పేరు శంకరమే! స్వంత తమ్ముడిలా నాకు భోజనం పెట్టించి, టికెట్ కొని బస్ ఎక్కించి వెళ్ళాడు. క్షేమంగా ఊరికి చేరానని చెప్పడానికి ఫోను చేశాను. వుంటాను" అని చెప్పి ఫోను పెట్టేశాడు విశ్వనాధ్!
* * * * * సమాప్తం * * * * *
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు : 9849118254
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి