లేబుళ్లు

22, ఫిబ్రవరి 2026, ఆదివారం



       
   
                                                                    పాకెట్ మనీ  
                                                                 ---------------------  
       '' నాన్నగారు ఉదయం ఏడుగంటలనంగా వాకింగ్ కి వెళ్లారు ఇంకా రాలేదు.  పదిన్నరవుతోంది. రోజూ ఎనిమిదిన్నర తొమ్మిదింటి కల్లా వచ్చేస్తారు.
గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమోనని కూడా కనుక్కున్నాను, అక్కడా లేరు.
ఫోను కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. భయంగానూ, కంగారుగానూ ఉందమ్మా...నువ్వు మీఆయన త్వరగా రండి'' అని తల్లి విశాలాక్షి ఉదయం సరిగ్గా పది గంటలకు ఫోను చేయడంతో ఆఫీసులో పెర్మిషన్ తీసుకుని వెంటనే తల్లీ,తండ్రి ఉండే బాలాజీ అపార్టుమెంట్ కి వచ్చింది అర్పిత.
వస్తూనే తల్లితో మాట్లాడి అపార్ట్ మెంట్ లో తండ్రి రాఘవరావు 'వాకింగ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఇంటర్ కామ్ నుంచి ఫోన్ చేసి వారితో మాట్లాడి, రాఘవరావు మొబైల్ కి ఫోను చేసింది అర్పిత.
'ఫోన్ స్విచ్డ్ ఆఫ్' అని వాయిస్ మెసేజ్ వస్తోంది.వెంటనే అపార్ట్ మెంట్ సెక్యూరిటీకి కూడా ఫోను చేసి ఆరా తీసింది.
''చూస్తనే ఉన్నమమ్మా పెద్దమ్మ చెప్పింరు…సార్ క్రింద ఎక్కడా లేరు. మాకెవరికైనా అగపడితే మీకు ఫోనుచేసి చెబుతమమ్మా" అని అన్నాడు మెయిన్ గేట్ సెక్యూరిటి గార్డ్.
ఇంతలో అపార్ట్ మెంట్ లో  నలుగురు వచ్చి వివరాలు కనుక్కుని ''ఎక్కడైనా కూర్చుని కబుర్లు చెప్పుకోవడమో లేక ఎవరైనా పాతఫ్రెండ్స్ కలిశారో లేక లైబ్రరీకేమైనా వెళ్ళారేమో మీరేమీ కంగారు పడకండి'' అని అమ్మకు  ధైర్యం చెప్పి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళారు. రాఘవరావు తో పరిచయంలేని వాళ్ళు అపార్ట్ మెంట్ లో చాల తక్కువేమో. ఆరోజు  ఆదివారం కావడంతో అపార్ట్ మెంట్ లో ఒక్కొక్కళ్ళు వచ్చి ఏమైందని ఆరాతీస్తూ ఫ్లాట్ బయట పెద్ద గుంపు తయారయింది.
రాఘవరావు తో వాకింగ్ కు వెళ్ళే ఫ్రెండ్స్ బయటకు వెళ్లి తిరిగి వచ్చి 'మాతో వాకింగ్ నుంచి తిరిగి వచ్చాక గేటు దగ్గరనుంచి ఎక్కడికెళ్లారో ఏమో ఎక్కడా కన్పించలేదమ్మా' అని చెప్పి వెళ్లారు.
                                                                     * * * * *
                 మధ్యాన్నం 12' గంటలయిందిఅర్పిత, భర్త శశాంక్ వెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇచ్చివచ్చారు. ఫ్లాట్ బయట ఒకళ్ళిద్దరు తప్ప అందరు వెళ్ళిపోయారు. అడపా తడపా ఎవరో ఒకళ్ళు రావడం 'సార్' వచ్చారా అని అడగడం గాని ఇంటర్ కామ్ లో గాని ఎంక్వయిరీ చేస్తున్నారు. రాఘవరావు వాకింగ్ వెళ్లి వచ్చే త్రోవలో ఆక్సిడెంట్ కేసులేమయినా ఉన్నాయా ? అని కూడా ఎంక్వయిరీ చేశారు. కేసులేమీ లేవని తెలిసింది. రాఘవరావుకు పడనివారంటూ  ఎవరూ లేరు. రిటైర్ అయికూడా పదేళ్ళయింది.రోజూ వాకింగ్ నుంచి అపార్టుమెంటుకి తిరిగి వచ్చాక ఇంకొద్దిసేపు వాకింగ్  చేయడమో లేక వాళ్ళతో, వీళ్ళతో బాతాఖాని వేయడమో గానీ చేసేవారు. ఆ విషయమై ఆయనతో భార్య విశాలాక్షికి తరచూ వాగ్వాదం జరుగుతుండేది.
బ్రేక్ ఫాస్ట్ టిఫెన్ చల్లారి పోవడంగాని లేక ఆయన టిఫెన్ ఆమె వంటకి అడ్డం రావడం గాని జరిగేది. అందుకే ఆయన్నివాకింగ్ అయ్యాక తిన్నగా ఇంటికి రమ్మని పోరేది విశాలాక్షి.
అయన ఆమాటను ఎప్పుడూ ఖాతరు చేయలేదు.    
'టైం' దాదాపు ఒంటిగంట అవుతోంది. రాఘవరావు ఇంటికి రాలేదు
పోలీస్ ఇన్స్పెక్టర్ 'సురేందర్' వచ్ఛి అపార్టుమెంట్ సెక్యూరిటీ వారితో, రాఘవరావు వాకింగ్ ఫ్రెండ్స్ తో మాట్లాడి వచ్చి ఫ్లాట్ ముందు గుమికూడిన వారితో కూడా మాట్లాడి ఇంట్లోకి వచ్చాడు
''ఏమీ కంగారు లేదమ్మా, వచ్చేస్తారు. రాఘవరావుగారితో నాకు కొద్ధి పరిచయముందమ్మా '' అంటూఅయన '' ఎవరైనా బంధువులుగానీ స్నేహితుల ఇండ్లకేమైనా వెళ్ళే చాన్సు ఉందామ్మా"? అనడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా ఫ్రెండ్లీగా.
''ఉహూ… ఎప్పుడూ అలా వెళ్ళలేదు.వెళ్ళరు. వెళ్తేచెప్పే వెళతారు. ఆయన ఫోను ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయరు. టిఫెన్ చేయలేదు. స్నానం చేయలేదు. ఆకలికి ఆగే మనిషి కాదు.
ఏం మనిషో ఏమో, చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళారో, ఏమో ? ఇవతల మనుషులు కంగారు పడతారన్నధ్యాస కూడా లేకపాయే'' అన్నది విశాలాక్షి గద్గదస్వరంతో కళ్ళలో ఉబుకుతున్న కన్నీళ్లను చీర కొంగుతో ఒత్తుకుంటూ.
''అమ్మా ఏడవకు, ఇన్స్పెక్టర్ గారన్నట్లు బాబాయి ఇంటికి గాని లేక ఫ్రెండ్ ఇంటికేమైనా వెళ్ళేరేమో''? నేను శ్రీనివాస్ అంకుల్ కి నరేందర్ అంకుల్ కి ఫోను చేస్తాను'' అని పైకి గంభీరంగా అన్నా 'ఎక్కడికి వెళ్లి ఉంటారు' అనుకుంది అర్పిత మనసులో వ్యాకులపడుతూ.
''సార్ కి ఎవరితోనైనా శత్రుత్వం గానీ, ఏమైనా ప్రాపర్టీ గొడవలు గానీ, డబ్బు లావాదేవీలుగానీ ,
ఈ మధ్య గానీ, ఇదివరలో గానీ…సార్ ఎవరితోనైనా గొడవ పడ్డారా? 'అన్ వాంటెడ్ ఫోన్ కాల్స్ గానీ బెదిరిస్తూ ఫోన్లు ఏమైనా వచ్చాయా... కొద్దిగా గుర్తు చేసుకుని చెప్పండి'' ?  అన్నాడు కేసు పరిశోధనకు కావాల్సిన వివరాల్నిసేకరించే పనిలో పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్.
''లేదు బాబూ…మాకేమీ ప్రాపర్టీ గొడవలు లేవు. ఎవరి దగ్గర  డబ్బుఅప్పుగా తీసుకోవడం గానీ ఇవ్వడం గానీ లేదు. నెలనెలా పెన్షన్ వస్తుంది. కొద్దో గొప్పో రిటైర్మెంట్ డబ్బు బ్యాంకు లోనే
మా ఇద్దరి పేరా డిపాజిట్ చేశారు. ఉన్నది ఇదొక్కటే ఫ్లాట్. ఇంటా బయట ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు. ఎవరైనా గొడవ పడుతుంటే వాళ్లకి కూడా సర్ది చెపుతారు.
''అంతెందుకు...నీకు తెలుసో లేదో బాబూ'...ఆయన ఇక్కడి  'పోలీస్ స్టేషన్' కి కూడా ఒకటి రెండు సార్లు ఈ ఫ్లాట్స్ లో వాళ్ళు గొడవలు పడితే వచ్ఛి కేసు కాకుండా సర్ది చెప్పి వచ్చారు'' అంటూ సమాధానమిచ్చింది విశాలాక్షి.
''ఆ సంగతి నాకు తెలుసమ్మా. సార్ అలాగే నాకు పరిచయం అయ్యారు.అందుకే ఇందాక నేను వస్తూనే అన్నాను సార్ నాకు తెలుసునని'' అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్.
''అపార్ట్ మెంట్ లో ఎవరితో నైనా ఎప్పుడైనా గొడవపడ్డారా ? గుర్తు తెచ్చుకుని చెప్పండమ్మా'' అన్నాడు ఇన్స్పెక్టర్  మళ్ళీ గుచ్చి గుచ్చి అడుగుతూ.
''ఊహు… అలాంటిదేమీలేదు'' అంది అమ్మ నిక్కచ్చి గా.
''పొద్దుననంగా వెళ్లిన మనిషి రాలేదు.ఇక ఇప్పుడు...ఏం చేయాలి'' ? ఇన్స్పెక్టర్ గారూ
''ప్రాపర్టీ గొడవలు లేవు. ఎవరితోనూ గొడవలు లేవు. ఎవరినీ పల్లెత్తు మాట అనరట.ఇప్పటివరకూ నేను చేసిన ఎంక్వయిరీ లో అయన గురించి ఇక్కడున్న వారెవరూ చెడుగా చెప్పలేదు. ఆయన మీద అందరికీ గౌరవమే. ఆయన కనబడకుండా వెళ్ళడానికి ఏమీ 'లీడ్స్' కాని 'క్లూ గాని దొరకలేదు' అవి ఏమైనా దొరుకుతే కాని మా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అనుకోవడానికి ఎలాటి మోటివ్ గాని ఆధారం గానీ కనిపించడం లేదు. ఎటువంటి బెదిరింపు,డిమాండ్ ఫోన్ కాల్స్ రాలేదు.
కాబట్టి ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.ఆయన కెలాంటి ప్రాణభయం లేదు.సెక్యూరిటీ వాళ్ళతోనూ, అవసరమైతే ఆయన ఫ్రెండ్స్ తో మళ్ళీ మాట్లాడి వెళతాను'' అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ వెళుతూ చూడండమ్మా ''ఇప్పటివరకు నాకు చెప్పని కొత్త విషయం మీకేదైనా గుర్తుకు వచ్చినా, మీరింకేదైనా చెప్పదలుచుకున్నా నాకు వెంటనే ఫోను చేయండి'' అని నాన్నగారికి  సంబంధించిన  విషయాలన్నీ,రిటైర్మెంట్ కాకముందు ఆఫీసు విషయాలతో సహా అన్నీ వ్రాసుకుని తన పర్సనల్ ఫోను నంబరు ఇచ్చి వెళ్ళాడు ఇన్స్పెక్టర్.
ఆయన అటు వెళ్ళారో లేదో ''ఇదెక్కడి ప్రారబ్డమే తల్లీ... ఉన్నదేదో తింటూ ఎవరిమీద ఆధార పడకుండా మామానాన మేము బ్రతుకుతుంటే ఇదెక్కడి గొడవే తల్లీ'' అంటూ కూతురితో బాధ పంచుకుని కంట నీరు పెట్టుకుంది విశాలాక్షి.
''ప్రాణ భయం ఏమీ లేదన్నారు కదమ్మా ఇన్స్పెక్టర్ గారు.చూద్దాం సాయంత్రం వరకు'' అంటూ ఫోనునంబర్లు ఉన్న డైరీతీసి ఆయన పాత ఫ్రెండ్స్ కి, దగ్గరి బందువులకు ఒక్కొక్కరికీ ఫోనుచేసింది అర్పిత. ఒక్కరూ రాఘవరావు వచ్చారని చెప్పలేదు. తెలిసిన వారెవరి ఇండ్లకి రాఘవరావువెళ్లలేదన్న విషయం స్పష్టమైంది.ఇంటర్ కామ్ నిర్విరామంగా మోగుతూనే ఉంది.
'సార్' వచ్చారా లేదానని అపార్ట్ మెంట్ లో చాలామంది అడుగుతూనే ఉన్నారు.
విసుగొచ్చి కాసేపు ఫోను పక్కగా పెడితే ఒక్కొక్కళ్ళు స్వయంగా వచ్చి మరీ అడుగుతున్నారు.
ఇల్లంతా తిరణాలలా తయారయింది. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అర్ధం కావడంలేదు. ఆ అపార్టుమెంటు లిటిల్ ఇండియా... ''ఐసా కైసా హోగా అంకుల్ కె సాత్ 'ఇతనా ఆచ్ఛా ఆద్మీ హై ! ఆంటీజీ ' కుచ్ భీ హెల్ప్ హోనా జరూర్ పూచియే. 'హం పోలీస్ కె పాస్ జానే కేలియే భీ తయార్ హై. ఆప్ అకేలే నై హై" అంటూ కొందరు విశాలాక్షికి ధైర్యం చెబుతూనే ఉన్నారు.
''ఆంటీ, నేను పోలీస్ కమీషనర్ గారితో మాట్లాడాను.ఇంకాసేపులో 'సి.ఐ.డి' వాళ్ళు వస్తారు.
నేను వాళ్ళతో మాట్లాడతాను 'మీరేమీ కంగారు పడవద్దు. మన అపార్ట్ మెంట్ లో పెద్దాయన.'ఇలా మాయమవుతే మేమూరుకుంటామా '' ? అన్నాడు అమ్మతో అతని డాబు ప్రదర్శిస్తూ
శంకరరావు అదే ఫ్లాట్ లో ఉండే ఒక వ్యాపారవేత్త.      
                                                         * * * * *
సాయంత్రం నాలుగు గంటలు. ఇంట్లో ఎవ్వరూ ఏమీ తినలేదు. చుట్టుపక్కలవారు  టీ, కాఫీ తెచ్చిస్తున్నారు. ఎవరెవరో ఏదో ''ఫుడ్' తీసుకువచ్చి ఇంట్లో పెట్టి వెళ్లారు. ఇంకా తెస్తూనే ఉన్నారు. ఫుడ్ చాలా మంది తెచ్చారు' అని చెబుతే వాపసు తీసుకు వెళ్ళారు. అర్పిత కు  ఆకలేసి ఏదో కొద్దిగా తినేసింది. ఇన్స్పెక్టర్ గారికి ఫోను చేస్తే ఇంకా ఏమీ తెలియరాలేదని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పిఫోను పెట్టేశాడు. బాబాయిలు,అత్తలు,ఫ్రెండ్స్ ఒక్కొక్కరు దిగుతున్నారు.ఇల్లంతా ఒకటే సందడి, అల్లరి.
''వీరందరికీ  పడకలు,భోజనాలు ఎలాగా"? అని ఆలోచిస్తూ అదేమాట భర్త తో అంది అర్పిత.
''నువ్వేం కంగారు పడకు వాళ్ళు రాత్రికి ఉంటామంటే కొందరిని మనింటికి తీసుకు వెళ్దాం.  భోజనాలు బయటనుంచి తెప్పిద్దాం.కంగారేమీ లేదు'' అని ధైర్యం చెప్పాడు అర్పితకు భర్త శశాంక్. అది విన్నా స్థిమిత పడింది అర్పిత.
ఇంతలో ఎవరో ఇంటర్ కాంలో ఫోన్ చేసిరాఘవరావు ఉదయం నుంచి కనిపించడం లేదన్నవార్త, ఆయన ఫోటో ఏదో తెలుగు టి.వి లో వస్తోందని చెప్పిపెట్ట్టేశారు. మరుక్షణంలో తండ్రి గుర్తుకొచ్చి అర్పిత మనస్సులో తెలీని భయం, బాధ కలగలిపి కడుపులో వికారంగా అనిపించింది.
అర్పిత కళ్ళు మూసుకుని 'నాన్నగారు కనిపించకుండా పోవడమేమిటి' ?
ఆయన్ని అందరు అజాత శత్రువు' అంటారు. 'అంటే ఏమిటని' ఒక తాత గారిని అడుగుతే ఆయన చెప్పారు 'అజాత శత్రువు అంటే శత్రువు లేని వాడని అర్ధమని'...
'అలాంటాయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా'? చేస్తే ఎందుకు చేసి ఉంటారు ?
అయన దగ్గర డబ్బూ లేదు,దస్కంలేదు.దన్నులేదు.
ఎవరి జోలికి వెళ్ళరు. తనకు మాలిన ధర్మమెక్కువ. చేతిలో డబ్బుంటే ఎంతో
కొంత ఎవరికైనా ఇచ్చిందాకా ఆయనకు నిద్ర పట్టదు. అల్జీమర్స్ లాంటి వ్యాధి ఏమైనా ఇంత సడెన్ గా ఒక్కరోజులో వస్తుందా ?  లేక ఈ పార్శం గాక నాన్నగారి జీవితంలో వేరే ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా ? మా దగ్గరేమైన దాచారా ?.ఏదో సినిమాల్లో చూసినట్లు…మనసులో పరిపరి విధాల పిచ్చి ఆలోచనలతో తల తిరిగి పోతోంది ఆర్పితకు .
''ఛా, ఛా…నాన్నగారి గురించా నేనిలా ఆలోచించింది. నాకేమాత్రం బుద్ధి లేదు.తప్పయింది''
తనలో తాననుకుంటూ  'ఠపా...ఠపా' మని అర్పిత లెంపలు వేసుకోవడం గమనించి
''అదేమిటే లెంపలు వేసుకుంటున్నావు, నీలో నీవే ఏదో గొణుక్కుంటూ'' అంటూ విశాలాక్షి,శశాంక్ అర్పిత దగ్గరిగా వచ్చారు ఆమెను వింతగా,పరీక్షగా చూస్తూ.
అప్పటికి గాని ఆమెకు అర్ధంగాలేదు తను అసంకల్పితంగా లెంపలేసుకున్నానన్నసంగతి !
                                                                  * * * * *
సాయంత్రం ఏడుగంటలవుతోంది. రాఘవరావు ఇంకా తిరిగిరాలేదు.
ఆయన మొబైల్ ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తే వారూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఉదయం వచ్చిన శంకరరావు గారితో కలిసి 'పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్' అట, ఇంకొకతను 'మఫ్టీ' లో గంట క్రితం వచ్చి మళ్ళీ అన్నీ విషయాలడిగి రాసుకుని వెళ్ళాడు.
'రొటీన్ గా నైనా ఇంట్లో ఏమైనా మాట,మాట అనుకున్నారా? కోప తాపాలేమైనా వచ్చాయా'? డబ్బుకు ఏమైనా ఇబ్బంది ఉందా ?...
అలాగవుతే ఒకటి రెండు రోజుల్లో తిరిగి రావడం గానీ లేక చుట్టాల దగ్గర నుంచి ఫోను రావడంగాని జరుగుతుందని చెప్పి ఆయన 'విజిటింగ్ కార్డ్' ఇచ్చి ఏమైనా కొత్త సమాచారం తెలిస్తే వారిని ఫోను చేయమని చెప్పివెళ్ళాడు.
శంకరరావుగారు మళ్ళీ వచ్చి 'ఏం కంగారు పడకండి. అంకుల్ గారికేమీ కాదు.
క్షేమంగా తిరిగి వస్తారని' మాకు కొద్దిగా ఊరటగా మాట్లాడి వెళ్ళారు.
పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఇలా వచ్చి వెళ్ళాడో  లేదో ఉదయంవచ్చిన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేందర్ మళ్ళీ తిరిగి వచ్చి ''ఏమ్మా రెండు నిముషాలు మాట్లాడవచ్చా''? అని అడిగి లోనికి వచ్చి కూర్చుని ''ఉదయం నాన్నగారు అపార్ట్ మెంట్ కి తిరిగి వచ్చిన తరువాతనే ఎక్కడి కైనా వెళ్ళడం గాని ఎవరితోనైనా కలిసి వెళ్ళడం గానీ లేక తప్పిపోవడం గానీ జరిగి ఉండవచ్చు. అపార్ట్మెంట్ సెల్లారుతో సహా మావాళ్ళు అంతా క్షుణ్ణంగా వెదికారు.ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.  మా కమీషనర్ గారు కూడా ఎ.సి.పి గారికి ఈకేసు తనని స్వయంగా చూడమని ఫోను చేశారట.
ఇంతకుముందే ఎ.సి.పి గారు కూడా ఇక్కడికి వచ్చివెళ్ళారు. మీసెక్యూరిటీ టీమ్ తో మాట్లాడుతున్నాము. జరిగిన విషయాలన్నీ కలిపి ఆలోచిస్తే రాఘవరావుగారు ఎవరో తెలిసిన వాళ్ళతో  తన ఇష్టప్రకారమే వెళ్లారు అనుకోవడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే అపార్ట్ మెంట్ మెయిన్ గేటు దగ్గర అరడజను మంది గార్డులున్నారు. అక్కడ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమీ అనుమానాస్పద ఘటన జరగలేదు. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ  సి.సి కెమెరాలు లేవు. అదీకాక నాన్నగారితో ఉదయం నడకకు వెళ్ళిన ఫ్రెండ్స్ తోనే నాన్నగారు గేటు దాకా తిరిగి వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి".
"సో ఈ కేసు...హండ్రెడ్ పెర్సెంట్ సార్ కి బాగా తెలిసిన వ్యక్తులు ఆయనను మభ్యపెట్టి తీసుకెళ్ళి ఉంటారన్నకోణంలో చూస్తున్నాము. అయితే అలా జరగడానికి 'మోటివ్' కావాలి. దానికి ఆయనకేమయినా పాత కక్షలేమైనా ఉన్నాయా,? అపార్ట్ మెంట్ లో ఎవరితోనైనా గొడవ పడ్డారా'? ఇది ఎవరి పని...అన్నది తెలుసుకోవడానికి  మీరు ఇచ్చిన 'ఇన్పుట్' ఇన్ఫర్మేషన్ తో ఏ 'మోటివ్'కన్పించలేదు. ఏదైనా విషయం నాదగ్గర దాచి ఉంటే ఇప్పటికైనా మీరు చెబుతే ఈ కేసు సాల్వ్ చేయడానికి సార్ ని త్వరగా 'ట్రేస్' చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి మళ్ళీ వచ్చాను'' అని చెబుతూ మా మొహాల వంక కుతూహలంగా, పరీక్షగా, పరిశీలనగా చూశాడు ఇన్స్పెక్టర్.సురేందర్.
''అయ్యో…ఇన్స్పెక్టర్ గారూ' నో..నో అలాంటిది నిజంగా ఏమైనా ఉంటే మీకు చెప్పకుండా
దాచివుంచాల్సిన ప్రసక్తే లేదు. అమ్మగాని, నేను గాని నాన్నగారితో గొడవపడే అవకాశమే లేదు. కోపంగా ఎవరైనా ఏమైనా అన్నా ఆయన చాలా  తేలిగ్గా తీసుకునే మనిషి. మీరు అనుమానించ దగ్గ విషయమేమీ జరగలేదు.'' అని నేను చెబుతుండగానే ''డాడీ ఆరోగ్యం ఎలా ఉంది.ఏమైనా అల్జీమర్స్ గానీ ఇంకేదైనా ఆరోగ్యం ప్రాబ్లం ఏమైనా ఉందా''? అనడిగాడు ఇన్స్పెక్టర్ సూటిగా.  ''సర్ …నిజానికి నాకూ అదే అనుమానం వచ్చింది. ఆయనకు అలాటి జబ్బు ఏదీ లేదు. ఆయన ఆరోగ్యం చాలా బాగుంది. ఆయన ఫ్రెండ్స్ ని కూడా ఇదే  విషయం ప్రశ్నించి చూశాను.
'అదేమీ లేదు ఉదయం వాకింగ్ నుంచి వచ్చినతరువాత కూడా గేటు దగ్గర కూడా నవ్వుతూ సరదాగా ఎప్పటిలానే  ఉన్నారని ఎలాంటి టెన్షన్ తో ఉన్నట్లుగా కూడాలేరని' వారు చెప్పారు.
''క్రితం వారం నుంచి టెలిఫోను కాల్స్ చెక్ చేశాము. మీకు, మీ అమ్మగారికి, వాళ్ళ తమ్ముళ్ళకు, ఇద్దరిఫ్రెండ్స్ తోను,ఇక్కడ అపార్ట్ మెంట్ ఆఫీసు వాళ్ళతోనూతప్ప వేరే అనుమానాస్పద కాల్స్ ఏమీలేవు.అంతా మిస్టరీగా ఉంది'' అన్నాడు ఇన్స్పెక్టర్ తల వంచుకుని ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా.
''ఇంకొక్కవిషయం మిమ్ముల్ని అడగడం మరిచాను'. ''సార్ కి వాళ్ళ అన్నదమ్ములతో గాని అక్క చెల్లెళ్ళతోగాని ఆస్తుల విషయంలోకానివేరే ఏవైనా ఇతర గొడవలేమైనా ఉన్నాయా ''? ఏదో ఆలోచిస్తూ అడిగాడు 'ఇన్స్పెక్టర్.
''లేదు. మా బాబాయిలందరికి నాన్నగారంటే చాలా ప్రేమ, గౌరవం. వాళ్లకి ఆస్తులే లేవు.అయినా అలాటి విషయమేఏదైనా ఉంటే మీకు ముందుగానే చెప్పేదాన్నికదా ఇన్స్పెక్టర్ గారూ'' అన్నాను నేను చాలా విశ్వాసంగా.
''సరేనమ్మా…ఇక వస్తాను. ఏది ఏమైనా రాఘవరావు గారు క్షేమంగా త్వరగా తిరిగి వస్తారన్ననమ్మకం నాకుంది. కంగారేమీ పడవద్దు'' అని చెప్పి మళ్లీ కలుద్దామని చెప్పి ఇన్స్పెక్టర్ తలమీద కేప్ సర్దుకుంటూ వడి వడిగా వెళ్ళిపోయాడు.
ఇన్స్పెక్టర్ గారు అంత ఖచ్చితంగా, ధైర్యంగా డాడీ త్వరలో తిరిగి వస్తారని అంటున్నారంటే పోలీసులకి ఏమైనా క్లూ దొరికిందా? దొరికితే ఇంకా మనల్ని ఇతర విషయాల గురించి ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరమేముంది.
'ఏమో'... ఏదైనా క్లూ కోసం పోలీసులు ఇలాటి ప్రశ్నలు వేయడం చాలా సార్లు చదివినట్లుగా గుర్తుంది. అంతా అయోమయంగా ఏదో మిస్టరీలా ఉంది.
నాన్నగారు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు మొక్కుకుని అలా సోఫాలో ఒరిగాను. అమ్మ గదిలో పడుకునే ఉంది. అత్తయ్యలు, బాబాయివాళ్ళు ఇంకో గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
                                                               * * * * *
రాత్రి 10 గంటల 30 నిముషాలు. 
దగ్గరికి వేసి వున్నబయట తలుపు నిశ్సబ్దంగా, మెల్లగా తెరుచుకుంది.
హలో సోఫాలో పడుకున్నఅర్పిత ఆత్రుతగా గుమ్మం వంక చూసింది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది.
రాఘవరావు …తలుపు నెట్టుకుని  మెల్లగా లోనికి వచ్చారు.
'డాడీ' అంటూ ఉన్నపళాన లేచి రెండంగలలో దగ్గరికి వెళ్లి ఆయనను చుట్టేసుకుంది అర్పిత. ఆమె కన్నీళ్లు రాఘవరావు 'టీ' షర్ట్ ని తడిపేస్తున్నాయి.
''ఎవరికీ చెప్పకుండా 'ఎక్కడికెళ్ళారు? ఫోను ఎందుకు ఎత్తలేదు'' ? ఆప్యాయంగా అడిగింది అర్పిత ఆయన రెండు చేతులను పట్టుకుని ఆయన ముఖంవంక నిశితంగా పరిశీలనగా చూస్తూ... ఒక్కపూట కే గడ్డం మాసి, ఎడమ పక్కన మీసానికి చిన్నబ్రౌన్ కలర్ పేపర్ అంటుకుని ఉంటే తీసింది అర్పిత.
'అబ్బా' అన్నారు రాఘవరావు బాధగా మీసపు వెంట్రుకలకి అంటుకుని ఉన్న   
ఎధెసివ్ టేప్ ముక్కని అర్పిత ఒక్కసారిగా లాగడంతో.
అర్పితకు ఒక్కసారిగా తట్టింది ఆయన అరవకుండా నోటికి ఎవరో 'టేప్' వేశారని.
అంటేఆయనను ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారని అర్ధమయిందామెకు.
వెంటనే ఆయన ముంజేయి,చేతులు,మణికట్టు, కాళ్ళను పరిశీలనగా తడిమి చూసింది.
ఏదో తాడు వత్తుకుపొయిన గాట్లు, అక్కడక్కడ చర్మం ఎర్రగా కందిపోయి స్పష్టంగా కనిపించింది.
''ఏంటమ్మా...ఏం చేస్తున్నావు''? అంటూ సున్నితంగా నన్ను తప్పించుకుని లోనికి నడిచారు రాఘవరావు నింపాదిగా. ఆయన ముఖమంతా పీక్కు పోయింది.
తలమీద ఉన్న కొద్ది జుట్టు అస్తవ్యస్తంగా ఉంది. పొద్దున 'వాకింగ్' కి వేసుకెళ్ళిన జాగింగ్ 'పైజమా' 'టి షర్ట్' మీదనే ఉన్నారాయన. వెంటనే పోలీస్ స్పెక్టర్ ఫోన్ చేయాలనుకుంది అర్పిత ముందుగా నాన్నగారి సంగతి చూడడం ముఖ్యమని ఆయన చేయిపట్టుకుని సోఫాలో కూర్చొబెట్టి మంచినీళ్ళు ఇచ్చి 'గీజర్' ఆన్ చేసివచ్చి కొద్దిగా 'ఫ్రూట్ జ్యూస్' ఇచ్చాను.
ఆకలిగా ఉందేమో చప్పున జ్యూస్ త్రాగి గ్లాస్ తిరిగి ఇచ్చారు.
విశాలాక్షి ఆయన పక్కనే కూర్చుంది. ఆయన తమ్ముళ్లు, అక్కా, చెల్లెలు ఆయన చుట్టూ మూగి ఎక్కడికెళ్ళావని, మొబైల్ ఫోనుకేమయిందని ప్రశ్నలు మొదలెట్టారు.
పెద్దత్తయితే కళ్ళు తుడుచుకోవడం గమనించింది అర్పిత. వాళ్ళిద్దరి అనుబంధం గురించి తనకు తెలుసు. అందుకే పెద్దత్త దగ్గరిగా వెళ్లి డాడీవచ్చారు కదా అత్తా ఊరుకొమ్మని అనునయించింది. ఆమె తన ఎడం చేతిని అర్పిత భుజం చుట్టూ వేసి వీపు తడిమి వదిలింది.ఎంతో హాయిగా  అనిపించింది అత్త స్పర్శ ఆక్షణంలో అర్పితకు.
తోడబుట్టిన వారి అనుబంధం,ఆత్మీయత అంటే ఏమిటో చాలా దగ్గరిగా చూశాననిపించిండామెకు. ఇంతలో ఎలాతెలిసిందో ఏమిటో 'అపార్ట్ మెంట్ జనం ఒక్కొక్కళ్ళు వచ్చి పరామర్శించడం మొదలెట్టారు. పొద్దున్న మాట్లాడుదాం అని అందరికి చెప్పి తలుపులు వేసింది. ఇంటర్ కామ్ మోగుతూనే ఉంది.
బాబాయిని 'ఇంటర్ కాం' ఫోను దగ్గర కూర్చోబెట్టి చుట్టాలింటికి వెళ్లి వచ్చారని చెప్పమని
బాత్రూంలో వేడి నీళ్ళు బకెట్లోనింపడానికి వెళ్లి అక్కడినుంచే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ''నాన్నగారు తిరిగి వచ్చారండీ''...అని నేను చెబుతుండగానే ''నాకు తెలుసమ్మా...నేనే ఇంటిముందు వదిలి వెళ్ళాను. ముందా పెద్దాయన సంగతి చూడమ్మా ... పాపం బాగా అలిసి పోయినట్లున్నారు. ఏదైనా కొద్దిగా తిన్నాక ఒక నిద్ర మాత్ర వేసి పడుకో పెట్టేసేయమ్మా"...
రేపుదయం ఒకసారి స్టేషన్ కి వచ్చి కలవమని చెబుతూనే గుడ్ నైట్ చెప్పి మారు మాట్లాడనీయకుండా ఫోన్ కట్ చేశాడు ఇన్స్పెక్టర్ సురేందర్.
అర్పితకేమీ అర్ధం కాలేదు.
'పోలీస్ ఇన్స్పెక్టర్ 'డాడీ' ని ఫ్లాట్ దగ్గర వదిలి ఇంట్లోకి రాకుండా వెళ్ళడం ఏమిటి?
అంత మిస్టరీ గా ఉంది. 'డాడీ' ని ఇప్పుడు వివరమడిగే పరిస్థితి లేదు. బాగా టైర్డ్ గా ఉన్నారు.
ఇన్స్పెక్టర్ చెప్పినట్లు ఆయన ఏదైనా తిన్నాక, నిద్రమాత్ర ఇచ్చి పడుకోమని చెప్పాలి' అనుకుంటూ వెనక్కి వచ్చి ఆయన స్నానం చేసి వచ్చి తిని బెడ్ రూమ్ లోకి వెళ్ళాక
స్థిమిత పడ్డది అర్పిత.
                                                       * * * * *
                              
                  మరుసటి రోజు ఉదయం పది గంటలకల్లా పోలీస్ స్టేషన్ కి వెళ్లింది అర్పిత. ఇన్స్పెక్టర్ సురేందర్ గారింకా రాలేదు.'సార్ అయిదు నిముషాల్లో వస్తారమ్మా. సార్ రూం లో కూర్చోండనిచెప్పి వేడి టీ తెప్పించి ఇచ్చి వెళ్ళాడు ఓ కానిస్టేబుల్.
అంతలోనే ఇన్స్పెక్టర్ వస్తూనే నన్ను చూసి ''అరే…అప్పుడే వచ్చారా''?
'ఇట్స్ ఓకే…టు మినిట్స్' అని ఇద్దరు సబిన్స్పెక్టర్లను పిలిచి ఏవో కేసుల అప్ డేట్స్ తీసుకుని, వారికేవో సూచనలు చేసి ''ఆ ఇక  చెప్పమ్మా' ? ఎలాఉన్నారు డాడీ ? బ్యాక్ టు నార్మల్ కదా''...అంటూ చాలా నార్మల్ గా మాట్లాడారు స్పెక్టర్ సురేందర్.
''చెప్పండి సర్ …అసలేం జరిగింది'' ? అన్నది అర్పిత ఆత్రుతగా జరిగింది తెలుసుకోవాలన్న కుతూహలంతో. ఇన్స్పెక్టర్ సురేందర్ కేసు గురించి సీక్వెన్షియల్ చెప్పడం మొదలెట్టాడు.                                                                          * * * * *            
              గాంధీనగర్ పోలీస్ స్టేషను. రాత్రి తొమ్మిది గంటలు.
ఇన్స్పెక్టర్ సురేందర్ తన సబ్ ఇన్స్పెక్టర్ లతో కూర్చుని రాఘవరావు మిస్సింగ్ కేసు ప్రోగ్రెస్  చర్చిస్తున్నారు. టైం' ఎనిమిదిన్నర  దాటుతోంది. "ఇక మీరు బయలుదేరండి సర్. ఏమైనా అర్జెన్సీ ఉంటే ఫోను చేస్తాను'' అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటుండగానే ఇన్స్పెక్టర్ 'సురేందర్' 'మొబైల్' రింగయింది.
''హలో…నేనే సాబ్ 'యాదయ్య'ను 'బాలాజీ అపార్ట్ మెంట్ సెక్యూరిటి గార్డ్' ని  మాట్లాడుతున్నా. మీరు చెప్పినట్లు మూడో ఫ్లోర్లో ఆ 'ఫ్లాట్' కాడనే అటు ఇటూ తిరుగుతున్నసార్ .ఫ్లాట్ ఉదయం కెల్లి 'బందే' ఉంది.ఇయాల వాళ్ళెవరు కిందకు రాలేదు. ఆ ముగ్గురు పిల్లలు  లోపలే ఉన్నట్లుంది సాబ్. నాకు మస్తు అనుమానంగా ఉంది సాబ్. మీరు గిప్పుడే వచ్చేయండి. ఇద్దరు 'పోరలు' లోపలకి బయటకు తిరుగుతున్నరు. దర్వాజ ఊరికూరికే బందు చేస్తున్నరు. ఆ ఫ్లాట్ లోనే ఉండే ఇద్దరు పోరలు ఇంతవరకు ఈ దినం బయటకు రాలే. వాళ్ళ నాయనా, అమ్మా ఊరికి పోయింరంట. రెండు మూడు రోజులు దాకారారంట.' మీరు జల్దీ వచ్చేయండ్రి...నేను ఈడనే ఉంటా." అన్నాడు యాదయ్య సెక్యురిటి గార్డ్.
''సరే, యాదయ్యా నువ్వు అక్కడే ఉండు. నేను పది నిముషాల్లో అక్కడికొస్తున్నా'' అని ఫోను కట్ చేసి టైం చూసుకున్నాడు ఇన్స్పెక్టర్ సురేందర్. టైం తొమ్మిది గంటల ముఫై
నిముషాలవుతోంది.వెంటనే తను,సబ్ ఇన్స్పెక్టర్,ఇద్దరు కానిస్టేబుళ్ళ తో బాలాజీ అపార్ట్ మెంట్  పది నిముషాల్లో చేరుకున్నారు.
'గేటు దగ్గరినుంచి ఇంకొక గార్డ్ ని తీసుకుని లిఫ్ట్ లో థర్డ్ 'ఫ్లోర్' కి వెళ్లారు. 
ఫ్లోర్ చాల పొడుగ్గా ఉంది. అక్కడక్కడ 'లైట్స్' వెలగక పోవడంతో అంతగా వెలుగులేదు.
ఇంతలో 'యాదయ్య' నేను ఈడున్నాను సాబ్' అంటూ అటు చివరనుంచి అరిచాడు. పోలీసులు  ఆ టైం లో రావడం, ఉదయం నుంచి రాఘవరావు గారు కనిపించక పోవడంతో అదే ఫ్లోర్ లో బయటనే కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు రెసిడెంట్స్ పోలీసుల వెనకాలే నడుస్తూ 'రాఘవరావు  గారి సంగతి ఏమైనా తెలిసిందా 'సర్' అని అడగడం ఇన్స్పెక్టర్ 'సురేందర్' ఏమీ సమాధానం చెప్పకుండా 'ఫాలో మీ' అంటూ తనతో వాళ్ళని రమ్మని సైగ చేశాడు. వాళ్ళు ఏమిటో తెలియని 'క్యూరియాసిటి' తో పోలీస్ ఇన్స్పెక్టర్ ని వెనకాలే నడిచారు.
'యాదయ్య' చూపిన ఫ్లాట్ తలుపు కొట్టాడు ఓ మఫ్టిలో ఉన్న కానిస్టేబుల్.
మిగతావారంతా ఓ పక్కగా చీకటి నీడలో నిలబడి నిశ్సబ్దంగా గమనిస్తూ ఉన్నారు.
మెల్లగా తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఓ కుర్రాడు షుమారు 15 సంవత్సరాలు ఉంటాయేమో
తల కొద్దిగా బయటపెట్టి 'కౌన్ హై'... హూ ఈజ్ దట్ ? అన్నాడు రెండు భాషల్లో.
'వెంటనే కానిస్టేబుల్ మీ డాడీని పిలువమ్మా...నన్ను రమ్మన్నారు' అన్నాడు కానిస్టేబుల్.
'డాడీ ఈజ్ అవుట్ అఫ్ స్టేషన్ .. హి విల్ కం డే ఆఫ్టర్ టుమారో'.. యు కం లేటర్' అంటూ తలుపు వేయబోయే సరికి కానిస్టేబుల్ తన ఎడంకాలు లోపల అడ్డంగా బెడుతూ తలుపు గట్టిగా పట్టుకుని 'ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే పిలువు బాబూ"... కొద్దిగా పనిఉంది అంటూ తల లోనికి ఉంచి ఇంట్లోకి చూశాడు కానిస్టేబుల్.
'ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను ఇంకెవరు లేరు. మా పేరెంట్స్ ఊరి కెళ్ళారు' అన్నాడా కుర్రాడు తలుపు నెడుతూ. కానిస్టేబుల్ ఆ అబ్బాయి తలుపు మూయకుండా బలంగా వెనక్కి నెట్టడంతో ''హేయ్...వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్...ఐ విల్ కాల్ పోలీస్'' అంటూ అతనితో ఇంకొక కుర్రాడు కలిసి మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ని బయటకు నెట్టడానికి ప్రయత్నం చేస్తుండగానే పోలీసులంతా గుమ్మం ముందుకు వచ్చారు.
ఇన్స్పెక్టర్ సురేందర్ తనవెంట వచ్చిన ఇద్దరు రెసిడెంట్స్ కి అప్పటికే చెప్పాడు...  రాఘవరావుగారిని ఆ ఫ్లాట్లో బందీగా ఉంచినట్లుగా 'ఇన్ఫర్మేషన్' ఉందని,
తలుపు తీసిన కుర్రాడితో మాట్లాడి వాళ్ళపేరెంట్స్ ఫోను నంబరు తీసుకోమన్నాడు ఇన్స్పెక్టర్ సురేందర్. ఇంతలో తలుపు తీసిన కుర్రాడు అమాంతం బయటకు వచ్చి మెట్ల వైపు పరుగెత్తడం మొదలెట్టాడు. అనుకోని ఆ సంఘటనకు ఇద్దరు రెసిడెంట్స్ బిత్తరపోయి చూస్తుండగానే ఒక కానిస్టేబుల్ పరుగెత్తి  ఆకుర్రాడిని పట్టుకురావడం అతను ఏడుస్తూ ''నాకేమీ తెలీదు....వికాస్, నితిన్...వాళ్లిద్దరే 'అంకుల్'ని గదిలోఉంచారు'' అని గింజుకుంటూ పెద్దగా ఏడుస్తూ చెప్పాడు.
ఇన్స్పెక్టర్ సురేందర్, ఇద్దరు రెసిడెంట్స్ ఫ్లాట్ లోనికి వెళ్లారు.
ఒక్క బెడ్ రూం మినహా ఫ్లాట్ లో రెండు పడక గదులు తెరిచే ఉన్నాయి.
ఒక బెడ్ రూం లోపలినుంచి క్లోజ్ చేసి ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది.
ఇన్స్పెక్టర్ చేసిన 'సైగ' తో ఒక రెసిడెంట్ తలుపు కొట్టి 'నితిన్' నేను ప్రకాష్ అంకుల్ ని మాట్లాడుతున్నాను.
''మీ డాడీ ఫోన్ లో ఉన్నారు మీతో మాట్లాడాలట'' అని చెప్పడంతో తలుపు తీసిన వెంటనే  మొదట ఒక కానిస్టేబుల్ ఇద్దరు రెసిడెంట్స్, తరువాత ఇన్స్పెక్టర్ లోనికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి అందరు ఆవాక్కయి నోటమాట రాక ఒక్కక్షణం పాటు నిశ్చేష్టులై అయ్యారు.
'రాఘవరావుగారిని' ఒక డైనింగ్ టేబుల్ కుర్చీకి ప్లాస్టిక్ తాడుతో చేతులు వెనక్కి కట్టేసి కుర్చీని గదిలో ఒక మూలగా ఉంచి డైనింగ్ టేబుల్ అడ్డుగా ఉంచి, నోటికి ఎధెసివ్ టేప్ వేసి ఇద్దరు కుర్రాళ్ళు కాపలా ఉన్నరా గదిలో. కానిస్టేబుల్ వెంటనే ఆకుర్రాళ్ళను, ఆగదిని, వచ్చేటట్లుగారెండు మూడు ఫోటోలు, కట్టేసి ఉన్న రాఘవరావు గారిని క్షణంలో ఎవిడెన్స్ కి కావలసిన ఫోటోలు తీశారు. ఆ తరువాత బయటకు వచ్చి ఫ్లాట్ నంబరు వచ్చేట్లుగా ఫోటోలు తీశాడు. వెంటనే ఆయన కట్లు విప్పి కిచెన్ లోని  వెళ్లి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చిఇచ్చారు ఒక రెసిడెంట్. మొత్తం నలుగురు పిల్లలు వంచిన తలలు పైకి ఎత్తడం లేదు.
''ఎలా ఉన్నారు 'సర్' 'మీ ఫ్లాట్ దాక నడవగలరా'? అనడిగాడు రాఘవరావు గారిని ఇన్స్పెక్టర్ సురేందర్.
''ఆ' ఫరవాలేదు నడవగలను''  అన్నారు రాఘవరావు గారు.
లేచి మంచినీళ్ళు త్రాగి ఆయన తూలేసరికి పోలీస్ కానిస్టేబుల్ ఆయన్ని భుజాలచుట్టు చేయివేసి ఆయనతో నడిచి హాల్లో  'సోఫా'లో కూర్చోబెట్టి ఆయన దగ్గరే నిలబడి ఉన్నాడు. ఆయన కుడి చేత్తో ముఖం అంతా రాసుకుని ఎడం భుజాన్ని కుడిచేత్తో సర్దుకున్నారు.
సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఆ రూం అంతా సోదా చేసి, ఎధెసివ్ టేప్ రోల్ ని, ప్లాస్టిక్  తాళ్ళను, రాఘవరావు గారిని కట్టేసిన కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. పిల్లల నలుగురి పోకేట్ సోదా చేసి వాళ్ళ దగ్గరనుంచి రెండు మొబైల్ ఫోనులు స్వాధీనం చేసుకుని పిల్లల పేరెంట్స్ ని కాంటాక్ట్ చేశారు పోలీసులు.
ఇద్దరు పిల్లల పేరెంట్స్, అక్కడే ఉన్నరెసిడెంట్స్ తోమాట్లాడాక ఢిల్లీ నుంచి ఉదయమే వచ్చి పోలీసులను కలుస్తామన్నారు.
మిగతా ఇద్దరు పిల్లల పేరెంట్స్ వచ్చి ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతున్నారు.
అక్కడే ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ 'పంచనామా' పాపేరువర్క్ పూర్తిచేశారు.
కొద్దిగా తేరుకున్న 'రాఘవరావుగారు' లేచి తను వెళ్తానని ఆపిల్లలని 'పోలీస్ స్టేషన్'కి అప్పుడు తీసుకు వెళ్లవద్దని, వీలుంటే రాత్రి కాకుండా మరుసటి రోజు పిల్లలని 'ప్రశ్నించమని పోలీస్ ఇన్స్పెక్టర్ ని' అభ్యర్ధించారు రాఘవరావుగారు.
అందుకు ఒకింత ఆశ్చర్యం తో ఇన్స్పెక్టర్ ''అలాకుదరదు. వీళ్ళని ఇప్పుడు వదిలేసి వెళ్ళమని  మీరంటున్నారా' మంచితనానికి కి కూడా ఒక హద్దు ఉండాలి. ఇలాటి వాళ్ళు మంచితనాన్నిఅసమర్ధత, చేతకానితనంగా తీసుకుని రెచ్చిపోతూ ఉంటారు'' అన్నాడు అసహనం వెళ్లగక్కుతూ కరకుగానే పిల్లల వైపు చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్
నలుగురు కుర్రాళ్ళని,అంత దగ్గరుండి చూసిన రెసిడెంట్స్ ని, వేరే ఇద్దరి పేరెంట్స్ తో సహా పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు ఇన్స్పెక్టర్. రాఘవరావు గారితో ఆయన 'ఫ్లాట్' వరకు నడిచి ఇక మీరు వెళ్ళండి 'సర్' అని ఆయన ఇంటిలోనికి వెళ్ళడం చూసి.
                                                         * * * * *
''అదమ్మా జరిగిన కధ'' అన్నాడు ముందు రాత్రి జరిగినదంతా పూస గుచ్చినట్లుగా చెబుతూ.
''అంత బాగానే ఉంది ఇన్స్పెక్టర్ గారూ...అసలు  వాళ్ళు డాడీ ని ఎందుకు కిడ్నాప్ చేసినట్లు ? అసలు వాళ్ళ ఉద్దేశ్యమేమిటి ? మీరు ఆ టైం కి వెళ్ళక పోతే ఎం జరిగేది' ?
ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నలుగానే  ఉండిపోయయికదా ? అసలు ఈ క్రైమ్ కి ప్రేరణ, కారణం ఏమిటి?
డాడీనే వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు? నాకర్ధం కాలేదు'' అంది నిరుత్సాహంగా.
''ఈ ప్రశ్ననువ్వేస్తావని నాకు తెలుసు.నేను చెప్పేదానికన్నానువ్వు నీ కళ్ళతో చూసి నీ చెవులతో విను'' అంటూ కాలింగ్ బెల్ బజర్ నొక్కాడు ఇన్స్పెక్టర్.
'సర్' అంటూ స్టిఫ్ గా సెల్యూట్ చేశాడు లోనికి వచ్చిన కానిస్టేబుల్.
'ఆ నలుగురు కుర్రాళ్ళను వాళ్ళ పేరెంట్స్ ని లోనికి పంపించు ఇంకో రెండు కుర్చీలు  వేయించు ఇక్కడ" అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇన్స్పెక్టర్.
'నువ్వు ఇటు పక్కకి వచ్చి కూర్చోని సైలెంట్ గా జరిగేది చూడు,విను.
నీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది' అన్నాడు సురేందర్ ఇన్స్పెక్టర్ సీరియస్ గా.
ఆ నలుగురు కుర్రాళ్ళు, వాళ్ళ పేరెంట్స్,రాత్రి వచ్చిన ఇద్దరు రెసిడెంట్స్ కాక ఇంకా చాలా మంది రెసిడెంట్స్,ఇద్దరు లాయర్లు వచ్చినా వారిని తర్వాత కలుస్తానని లోనికి 'ఎలవ్' చేయలేదు ఇన్స్పెక్టర్.
పేరెంట్స్,ఇద్దరు రెసిడెంట్స్ కూర్చున్నాక 'లుక్ బాయ్స్' ''మీరు నలుగురు ఒకరి తరువాత ఒకరు జరిగింది జరిగినట్లు  చెప్పండి.
''అసలు ఏంజరిగింది ? రాఘవరావు గార్నిఎందుకు కిడ్నాప్ చేయవలసి వచ్చింది ? ఎలా చేశారు? మేము రాత్రి వచ్చి ఉండనట్లవుతే ఆయన్నిమీరు ఏం చేసేవారు? నాకు అంతా స్పష్టంగా గా చెప్పండి" అన్నాడు ఇన్స్పెక్టర్.
పేరెంట్స్ ఎవరూ పిల్లలు మాట్లాడేటప్పుడు కలగ చేసుకోవద్దు. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ టు యూ  ఆల్' అండ్ హిజ్ స్టేట్ మెంట్ విల్ బీ రికార్డెడ్ ఇన్ వీడియో...'నౌ కమాన్ ప్రొసీడ్'.
''నితిన్' ముందుగా నువ్వు చెప్పు '' అన్నారు ఇన్స్పెక్టర్.
'సర్' అంకుల్ గారు మంచి ఆయనే గాని మేము అపార్ట్ మెంట్ లో క్రికెట్ ఆడితే జాగ్రత్త
హార్ద్ బాల్ ఎవరికైనా తగుల్తే ప్రాబ్లం. టెన్నిస్ బాల్ తో ఆడండి. ఫుట్ బాల్ ఆడితే గ్లాసెస్ పగుల్తాయి అనేవాడు. సైకిల్ రైడ్ చేస్తే  స్లో గా వెళ్ళండి అంటాడు, ఆయన వస్తున్నాడు అంటే మాకు ఎప్పుడూ ఫ్రీడమ్ ఉండేది కాదు.
అపార్ట్మెంటులో ఒక రోజు ఒక పెయింటర్ సాయంత్రం వెళుతూ తన సామానంతా సెల్లార్ లో ఒక పార్కింగ్ లో పెట్టి వెళ్ళాడు. అది మేము చూశాము.
'మేము అంటే ఎవరెవరు' ? అన్నాడు ఇన్స్పెక్టర్ కొద్దిగా కరకుగా.
'నేను,సంజీవ్' చూశాము. ముందు ఏదైనా వాల్ కి పెయింట్ వేద్దామనుకున్నాము.
నెక్స్ట్ డే 'సండే' వచ్చింది. నేను సంజీవ్ కలిసి ఆ 'స్ప్రే' పెయింట్ గన్ తీసుకుని ఒక   కార్నర్ వాల్ కి వేస్తుంటే అది కొద్దిగా కార్ విండ్ షీల్డ్ మీద పడ్డది. దాంతో తుడవడానికి ప్రయత్నం చేశాము. కానీ గ్లాస్ అంతా నల్లగా పెయింట్ పట్టుకుంది. దాంతో  భయపడి పెయింట్ గన్ దాచేశాము. దాంతో సొసైటీ లో ఎవరో 'కార్ గ్లాస్' మీద పెయింట్ వేశారని బాగా గొడవయింది.
'వుయ్ హేడ్ ఫన్'. తరువాత వీలుదోరికినప్పుడెల్లా ఏదో ఒక కార్ విండ్ షీల్డ్ మీద పెయింట్ వేశాము. అలా అయిదు కార్ల గ్లాస్ మీద పెయింట్ వేశాము. సొసైటీ లో బాగా గొడవయ్యేది.
మేము నలుగురం బాగా నవ్వుకునే వాళ్ళం.
'మిగతా ఇద్దరి పేర్లేమిటి' ? ఇన్స్పెక్టర్ గట్టిగా అడిగాడు.
"నేను సంజీవ్ గాక  మిగతా ఇద్దరు వికాస్, దుశ్యంత్" అన్నాడు నితిన్.
ఇంతలో ఒక రోజు మా డాడీ 'ఆ పెయింట్ మా పిల్లలే వేస్తున్నారని సొసైటీ మీటింగ్ లో 'అడ్మిట్' చేశారు. ఆయనకు ఎలా తెలిసిందో మాకు తెలీదు'.
అది అడ్మిట్ చేసినందుకు ఆయనకు 'పదివేల రుపాయలు' పెనాల్టీ వేశారు సొసైటి వాళ్ళు. దాంతో మా 'మామ్' 'డాడ్' పనిష్మెంట్ గా మాకు 'పాకెట్ మనీ' ఇవ్వడం మానేశారు.
పెయింట్ మేము వేశామని మా డాడీ కి అంకుల్ 'పితూరీ' చెప్పి ఉంటారని మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు తెలిసింది మా బట్టల మీదపెయింట్ చూసి మా'మామ్' డాడీ కి చెప్పిందని...అది అంకుల్ కాదని.
ఆ గొడవ తరువాత మేము ఎక్కడికి వెళ్ళిన కమ్యూనిటిలో అందరు మమ్ముల్ని'క్రిమినల్' లాచూసే వారు.మాతో వేరెవరూ ఆటకు రావడం లేదు. ఫ్లాట్ కూడా వెకేట్ చేయమన్నారు.
మా 'పాకెట్ మనీ' పోవడమే గాక ఇదంతా అంకుల్ వల్లే  జరిగిందన్న కోపంతో ఆయనకు వార్నింగ్ ఇద్దామని మాఇంటికి తీసుకెళ్ళాను.
"అంకుల్ అంటే ఎవరు"? రెట్టించి అడిగాడు ఇన్స్పెక్టర్. రాఘవరావు అంకుల్. అంటే ?
నిన్న మేము మాఇంట్లో కట్టేసినతను"... స్పష్టంగా వారు చెప్పిందాకా రెట్టించాడు ఇన్స్పెక్టర్. "తరువాత ఏంజరిగింది" కంటిన్యూ అన్నాడు ఇన్స్పెక్టర్.
"మీరు రాక పోయినా, మీరు డిటెక్ట్ చేయకపోయినా అంకుల్ ని ఉదయమే
వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాము అనుకున్నాము. కానీ వదిలేయడానికి వీల్లేకుండా మాఎదురు ఫ్లాట్ లో నిన్న ఉదయం నుంచి ఏదో ఫంక్షన్ అయింది. ఫంక్షన్ కి వచ్చినవారు మా ఫ్లాట్ ఎదురుగా వరుసగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు.  వారంతా వెళ్లేసరికి సాయంత్రం అయింది.
అప్పటికే 'అంకుల్' కిడ్నాప్' అయినట్లు కమ్యూనిటీలో అందరికీ తెలిసింది. అంకుల్ ని అడగండి మేమందరం చాలాసార్లు 'సారీ' చెప్పాము. అంకుల్ బయటకు వెళ్లి అందరికి చెబుతారేమోనని భయపడ్డాము.
అదీగాక మా ఫ్లోర్ లో ఫంక్షన్, సెక్యూరిటీ గార్డ్ అక్కడే తిరుగుతూ ఉండడం వల్ల ఆయనను వదలడానికి వీలు కాలేదు. అంతే గాని ఆయన్ని మేము కట్టివేయాలనుకోలేదు.
ఇదంతా ఆక్సిడెంటల్ గా జరిగింది. మేము కావాలని చేసింది కాదు.  
ఇదంతా నావల్లే జరిగింది. మా పేరెంట్స్ కి గాని ఎవరికీ తెలీదు.
మిగతా ముగ్గురు నాకు హెల్ప్ చేశారు అంతే. తప్పంతా నాదే. ఇక ఎప్పుడూ ఇలా చేయను. మమ్ముల్నివదిలేయండి 'ప్లీజ్'...అంటూ బావురుమని ఏడుపు మొదలెట్టాడు నితిన్.
'అవునూ... ఆయనను మీ ఫ్లాట్ లోనికి ఎలా తీసుకు వెళ్ళారు' ? అడిగాడు ఇన్స్పెక్టర్ నితిన్ ముఖం లోకి నిశితంగా చూస్థూ.
'అంకుల్ ఉదయాన్నే వాకింగ్ నుంచి తిరిగిరావడం గేట్ దగ్గరే ఉన్న నేను గమనించాను.
ఆయన ఒక్కరే లిఫ్ట్ ఎక్కుతుంటే నేను ఆయనతో లిఫ్ట్ ఎక్కి మాటలు కలిపాను.
ఒక్కసారి ఫ్లాట్ కి వచ్చి మా ఫ్లాట్ లో దేవుడి ఫోటోని ఎక్కడపెట్టాలో మామ్ మిమ్ముల్ని అడగి  రమ్మంది,రండి అంకుల్ అని రిక్వెస్ట్ చేసి ఫ్లాట్ లోకి అయనను తీసుకువచ్చాను. రావడంతోనే మా బెడ్ రూమ్ లో దేవుడి ఫోటో ఎక్కడ పెట్టాలి అంకుల్ అని గది లోనికి తీసుకు వెళ్ళగానే  అక్కడే బయటనున్న ఉన్న'వికాస్' బయటనుంచి తలుపు వేశాడు.
'అరేయ్ 'పిల్లలూ' తప్పురా.మీ 'ఫ్యూచర్' పాడవుతుందిరా, వద్దురా బాబూ... నన్ను వదిలేయండి.
నేను ఎవ్వరికి చెప్పను' అని అయన బిగ్గరగా అనడంతో భయపడి నేనే బలవంతంగా నోటికి టేప్ వేశాను ఎక్కడ అరుస్తారోనన్న భయంతో.
''మేము కార్' మీద పెయింట్ వేశామని మా డాడీ కెందుకు చెప్పారు?  చెప్పండి ?
ఇక ముందు మాజోలికి రామని, మమ్ముల్ని టార్గెట్ చేయనని ప్రామిస్ చేయండి.మిమ్ముల్ని ఇప్పుడే వదిలేస్తాము" అని మేము చెప్పామో లేదో అంకుల్ ని అడిగి క్లారిఫై చేసుకోండి'' అన్నాడు నితిన్ ఏడుస్తూ !
తరువాత మిగతా ముగ్గురు పిల్లలు ఇంచు మించు ఇదే స్టోరీ రిపీట్ చేశారు.
ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ని పిలిచి పిల్లల ముందే వాళ్ళ తలితండ్రులకు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇలా జరగకుండా చూస్తామని తలితండ్రుల దగ్గర, మళ్ళీ ఇలాటి 'క్రైమ్' చేయమని పిల్లల దగ్గర లీగల్ అండర్ టేకింగ్, 'స్టేట్ మెంట్స్' తీసుకొమ్మని చెప్పి' అందరిని తన రూము బయటకు పంపించాడు ఇన్స్పెక్టర్ సురేందర్.
''ఏమ్మా … అంత  చూశావుగా'' అదీ యదార్ధంగా జరిగిన సంగతి' అన్నాడు ఇన్స్పెక్టర్.
ఇన్స్పెక్టర్ ని సాలోచనగా చూస్తూ 'నాకు ఇంకొక విషయం ఇంకా అర్ధం  కాలేదు ఇన్స్పెక్టర్ గారూ' అంది ప్రభ
''షూట్' నీ డౌట్ ఏమిటో చెప్పు''. అన్నాడు ఇన్స్పెక్టర్.
''ఫ్లాట్ లో పిల్లలే డాడీని కిడ్నాప్ చేశారన్నడౌట్ మీకు ఎలా వచ్చింది ? అంది ప్రభ ఇన్స్పెక్టర్ వంక సూటిగా చూస్తూ.   .
'ఈ కేసులో కిడ్నాప్ చేయడానికి మోటివ్ ఏమిటని ఆలోచిస్తే మీదగ్గర ఏవిధమైన క్లూ దొరకలేదు. ఏకేసైనా మోటివ్ తెలిస్తే గాని కేసుని సాల్వ్ చేయలేము. ఈకేసులో ఏవిధమైన నెగటివ్ ఎవిడెన్స్ లేదు. కాబట్టి బయటవాళ్ళెవరూనాన్నగారిని కిడ్నాప్ చేయలేదన్ననిర్ధారణకు వచ్చాము.
ఇక మిగిలింది ఫ్రెండ్స్, బంధువులు, ఇంట్లోవాళ్ళు. మీతో రెండు సార్లు మాట్లాడాక
అదీ రూల్ అవుట్ చేసుకున్నాము.
ఇక మిగిలింది అపార్టుమెంట్ లోవారు. అక్కడ ఎంతమందితో మాట్లాడినా రాఘవరావు గారి గురించి వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు.
'సెక్యురిటి గార్డ్' ఒకడు 'సార్' ఈ కాంప్లెక్ లో నలుగురు అల్లరి పోరలు ఉన్నారు.
వాళ్ళకి రాఘవరావు సార్ అంటే కోపం ఉంది సార్. ఒకణ్ణి ఇయాల పొద్దున్ననేను డ్యూటీ కి రాంగానే గేటుముందు చూసిన సార్. ఆ పిల్లగాడి తండ్రికి ఇక్కడ 'సొసైటీ'వాళ్ళు ఈ పోరల మూలంగానే ఏదో 'పెనాల్టీ' వేసింరు.
'రాఘవరావు సారేమో ఎప్పటికి ఆ పోరల్ని అట్టా చేయద్దు...క్రికేట్ గట్టి బంతితో ఆడొద్దు' అని చెబుతుండే.పోరలకేమో మస్తు కోపం వస్తుండే' అన్నఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
ఆ చిన్నక్లూతో ఆనలుగురు పిల్లల మీద వాచ్ పెట్టించాను.
అదీ సంగతి. రేపు నేనో లేక  మా సబ్ ఇన్స్పెక్టర్ గాని వచ్చి నాన్నగారిని కలుస్తామని చెప్పు.
కొద్ది పని ఉంది అంటూ కధ ముగించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్.
"డాడీ కంప్లైంట్ వెనక్కి తీసుకొమ్మని చెప్పి పంపారు నన్ను'' అంది అర్పిత.
"రాఘవరావుగారితో మాట్లాడాను. వారి స్టేటుమెంట్ తీసుకోవాలి. మధ్యాన్నం వరకు వస్తానన్నారు. ఆయన కంప్లైంట్ వాపస్ తీసుకుంటామని నాకూ ఫోన్ చేసి చెప్పారు.
ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశాము. మీరు ఏంచేయదలుచుకున్నా వ్రాసియివ్వండి. కోర్ట్ వారు నిర్ణయం తీసుకుంటారు"స్పష్టంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ సురేందర్. 
 
                                        * * * * *   సమాప్తం   * * * * *                                                                  
 
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
Mob. No.9849118254                        
          






















                                                                   
                                 



    
        

            

   
                 

 

గవేషణం 
======== 

గెలుపోటముల గుంజాటనలో
 
మానవయత్నం మానకు !

గతాన్ని గుమ్మంలో గుమ్మరించుకుంటూ 

గతస్మృతులే గమ్యంగా గతి లేని జీవితం గడపకు! 

గల గలా నవ్వడం మానేశానన్నా 

బతుకే చేదయిందన్నా... ఎవరిక్కావాలి నీ గోడు ?

గాథాభరితులు ఈ ఇలలో కోకొల్లలు

నీకేం!? నువ్వెంతో మేలు

నిచ్చెనలుంటాయి అందిపుచ్చుకో! 

చేవ తెచ్చుకుని తోవ చేసుకుంటూ చేతనైనట్లు బతుకు!

నీ బతుకు నీది, సారూప్యం వద్దు 

గడిచిన నిముషం పొద్దు, పద్దులోకే పోతుంది 

నిన్నటి మొన్నటి దాకా నువ్వేంచేశావో 

నిక్కచ్ఛిగా గణించుకో! 

వీసమెత్తైనా, గవాక్ష గవేషణలో నిదర్శనం నినదించాలి!

గతమంతా మేలేనని సాంత్వన చెందావా అంతే ! 

నీనడకింక నిద్రాణమే! 

నిరర్గళంగా పయనించాలి 

స్వాప్నికాస్వామ్యావిష్కారం  కోసం!

దారుల్లో దగాకోరులుంటారు

నివారకాలుంటాయి

నిరాశవద్దు, నిస్తేజం వలదు! 

ఉత్తేజం కావాలి! 

ఊసుల్లో ఊరేగొద్దు, 

ఉషస్సులో కురకాలి

మందలో వద్దు 

వందల్లో ఒక్కడివిగా ఛేదించి సాధించు!

వంది మాగధుల వందనాలు వద్దు

స్వావలంబన చేరువయ్యే వరకు విశ్వప్రయత్నం చేస్తూనే వుండు !

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
గచ్చిబౌలి, హైదరాబాద్ 
మొబైల్ నంబరు : 9849118254


 

 



                                                           పరోపకారం ఇదం శరీరం 

             ( ఈ కథ సాక్షి - ది. 7, సెప్టెంబర్ నెల - ఆదివారం - ఫన్ డే  లో ప్రచురింపడింది )   


"అన్నయ్యా! రామారావు బాబాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈసారి ఆయన  కండిషన్ క్రిటికల్ అన్నాడు డాక్టర్. నువ్వు చూసి వెళితే బావుంటుంది" స్వంత బాబాయి అనారోగ్యం కబురు తెలిసిన రెండురోజుల తరువాత ఊళ్ళో ఉన్న అన్న విశ్వనాధ్ కి తీరిగ్గా ఫోను చేశాడు తమ్ముడు శంకరం.  
"నేను సిటీకి నిన్ననే వచ్చాను. హాస్పిటల్లో ఉన్నాను. బాబాయి ఇంతకు ముందే పోయాడు.  కబురింకా ఎవరికీ చెప్పలేదు. బిల్లు డబ్బు పూర్తిగా కడితే గాని శవాన్నిఇవ్వరట...చంద్రం డబ్బు కోసం వెళ్ళాడు" నిర్లిప్తంగా అన్నాడు విశ్వనాధ్.
"సరేలే! ఈ వాదులాట మనకెప్పుడు ఉన్నదేగా! నిన్ననంగా సిటీకి  వచ్చినవాడివి ఇంటికి రాలేదు. 
నీ ఆరోగ్యం మాత్రం పట్టించుకోవు!" నిష్ఠుర మాడాడు శంకరం 
"బాబాయి దగ్గర నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవరూ రాలేదు. అందుకే రాలేకపోయాను" సంజాయిషీ ఇచ్ఛాడు విశ్వనాధ్
''ఏం వాడింట్లో మనుషులేమయ్యారు ? అన్నీ నాటకాలు..." ఉడుక్కుంటూ  అంటుండగానే  సిస్టర్ వచ్చి 'రామారావు పేషెంటు తాలూకు ఎవరున్నారో లోనికి రండి' అని చెప్పి వెళ్ళింది. తమ్ముడి ఫోను కట్ చేసి లోనికి వెళ్ళాడు విశ్వనాధ్. 
"డబ్బు కట్టి, రూమ్ నంబరు పద్దెనిమిదికి వెళ్ళండి. 'బాడీ' ఎంబామ్ అవుతోంది" అంటూ తొందరపెట్టింది సిస్టర్. 
''ఎంబామ్' అవుతోందా! అంటే ...  ?" ప్రశ్నించాడు విశ్వనాథ్. 
"ఏం లేదు! బాడీని 'రెడీ' చేస్తున్నాము" అని వివరం చెప్పకుండా లోనికి వెళ్ళింది నర్సు.  
చంద్రం సాయంత్రం ఆరుగంటల కొచ్చి బిల్లు కట్టాక శవాన్ని ఇచ్చారు. చంద్రం తన కారులో, విశ్వనాధ్ బాడీతో అంబులెన్సు లో చంద్రం ఇంటికి బయలుదేరారు.
                                                                   * * * * *
మరుసటిరోజు రామారావు దహన సంస్కారాలు పూర్తయ్యేసరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. అక్కడికొచ్చిన బంధువులు,స్నేహితులు ఒక్కొకరుగా స్మశానం వీడి వెళుతున్నారు. 
స్నానం చేసి, బట్టలు ఆరేసి ఓమూల బెంచీమీద నీరసంగా కూర్చుని ఉన్నాడు విశ్వనాథ్. . 
"శంకరం ఇంటికి వెళుతున్నావుగా... కర్మలకు రా అన్నా!" అని చెప్పివెళ్ళాడు చంద్రం.  
"పద! ఇక మనం కూడా వెళదాం " అన్నాడు శంకరం అన్న దగ్గరికొచ్చి.
ఆరేసిన బట్టలు మడిచి సంచిలో పెట్టుకుని "ఒంట్లో నలతగా, తల దిమ్ముగా ఉందిరా ! నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. ఆకలవుతోంది. అన్నం తిని వెంటనే ఊరికి బయలుదేరాలి. తెచ్చుకున్న డబ్బు ఖర్చయి పోయింది. దారి ఖర్చుకు డబ్బులు కావాలి" స్మశానం బయటకు నడుస్తూ, మొహమాటపడుతూ తమ్ముడితో మెల్లగా అన్నాడు విశ్వనాథ్. 
అదే సమయానికి వారి పక్కనుంచి 'మహాప్రస్థానం వేన్'  పెద్ద శబ్దం చేస్తూ వెళ్ళింది. ఆ రొదలో విశ్వనాథ్ మాటలు గాలిలో కలిసిపోయాయి. తన మాటలు శంకరం వినలేదని విశ్వనాథ్ గమనించలేదు. ఇద్దరూ స్మశానం నుంచి బయట రోడ్డు మీద ఆటో స్టాండ్ కి వచ్చారు. అదే సమయానికి ఫోను రావడంతో పక్కకి వెళ్లి మాట్లాడాడు శంకరం. 
తిరిగి వస్తూనే "అన్నయ్యా! మీ మరదలు ఫోను చేసింది. తనకు పట్టింపులు ఎక్కువ. స్మశానం నుంచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లాలట. నీకూ తెలిసేవుంటుంది. అందుకే నువ్వు సరాసరి వూరికి వెళ్ళు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు" అని పక్కనే నిలబడి, పాసెంజర్  కోసం తమనే గమనిస్తున్నఆటోని  పిలిచాడు శంకర్. 
"సార్ ని  బస్టాండ్ లో దింపు!" అని ఆటో డ్రైవర్ కి  చెప్పి, ఇంకొక ఆటో ఎక్కి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు శంకరం నిర్దయగా. 
                                                                 * * * * * 
తమ్ముడేమన్నాడో సరిగ్గా అర్ధమయ్యీ గాక క్షణంపాటు తొట్రుపాటుకి లోనయ్యాడు విశ్వనాథ్. 
తమ మధ్య జరిగిన సంభాషణ మననం చేసుకున్నాడు. తమ్ముడన్న మాట అప్పుడు అర్ధమైంది. . 
'అవును. వాడన్నది నిజమే. కొందరికిలాటి పట్టింపులు ఉంటాయి...అయినా స్వంత అన్నతమ్ముల మధ్య ఇలాటి ఆంక్షలా ?' విరుద్ధ ఆలోచనలతో విశ్వనాధ్ మనసు కళ్లెం లేని గుఱ్ఱంలా పరుగెట్టింది. 
అంతటి నిస్సత్తువ, అశక్తతలోను అతని పెదవులపై వెర్రి చిరునవ్వొక్కటి తళుక్కుమని మాయమైంది. ఇంటికి చేరాలి. ఎలా వెళ్ళాలి? అన్న ఆలోచన మిగతా ఏ ఆలోచనను దరిచేరనివ్వలేదు. ఏం చేయాలో తోచడం లేదు. 
తెచ్చుకున్నడబ్బు బాబాయి అత్యవసర మందులకు ఖర్చయింది. ఆ డబ్బును చంద్రాన్ని అడిగి తీసుకుందామనుకున్నాడు. మనసొప్పక అడగలేదు. ఇప్పుడు బస్ టికెట్ కి కూడా సరిపడా డబ్బు లేదు. ఎవర్ని అడగాలి. దిక్కు తోచని స్థితి. శరీరంలో సత్తువ క్షీణించింది. నాలుక పిడచగట్టింది. మెదడు మొద్దుబారింది. చుట్టూ ఏం జరుగుతుందో, తనెక్కడ వున్నాడో సైతం అర్ధం కావడంలేదనికి. ఆలోచనా శక్తి మందగించింది. ఎవరో...ఏదో...అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది.   
"ఏ బస్  స్టాండ్  కి వెళ్ళాలి  సార్ ?" అడుగుతున్నాడు ఆటో డ్రైవర్. 
సమాధానం ఏం చెప్పాలో తోచడం లేదు. అతనికి మెదడు నుంచి నోటిమాటకి సంకేతం అందడం లేదు. యాంత్రికంగా జేబులు తడుముకున్నాడు విశ్వనాధ్. 
జేబులో మిగిలి వున్న ఒక్క ఏభై రూపాయల నోటు, మొబైల్ ఫోను చేతిలోకి తీసుకున్నాడు.      
"ఎక్కడికెళ్ళాలి సార్ !?" మళ్ళీ అడిగాడు ఆటో డ్రైవర్, విశ్వనాధ్ ని పరికించి చూస్తూ. 
"ఆటో వద్దు. డబ్బు...ల్లేవు... " అతని నోట మాటలు ముద్దగా వచ్చాయి. .  
"'గూగుల్ పే'  ఉంది సార్! " 
"నాకు లేదు. బస్ స్టాండ్ కి దారి చెప్పు. నడిచి వెళతాను" ఒంట్లో శక్తి నంతా కూడదీసుకుని అంటూనే మొదలు నరికిన మానులా కుప్పకూలాడు విశ్వనాథ్. 
ఆటో అతను కంగారు పడుతూ ఆటో పక్కకు ఆపి, ఇంజిన్ ఆఫ్  చేసి, పడిపోయిన విశ్వనాధ్ ని తట్టి లేపుతూ, స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్నాడు.. పరుగున ఆటో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి విశ్వనాధ్  ముఖం మీద నీళ్లు చల్లుతూ  "సార్ ... సార్!' అంటూ తట్టి లేపే ప్రయత్నంచేశాడు.  
రెండు,మూడు నిముషాల తరువాత కొద్ది తెలివివచ్చి, మగతగా కళ్ళు తెరిచాడు విశ్వనాధ్. 
విశ్వనాథ్ వీపు చుట్టూ చేయివేసి కూర్చోడానికి సాయం చేశాడు. వాటర్ బోటిల్ అందించి "కాసిని నీళ్లు తాగండి సార్ !" అన్నాడు ఆటో డ్రైవర్.  
నీళ్లు తాగి "నా కేమయింది... ?" పీలగా లోగొంతుతో ప్రశ్నించాడు విశ్వనాథ్. 
"మీరు స్పృహ తప్పి పడిపోయారు. మీరు పడిపోయినప్పుడు ... మీ ఫోను, ఏభై రూపాయల నోటు  కింద పడ్డాయి'' అని వాటిని, బట్టలున్న బ్యాగ్ ని విశ్వనాధ్ చేతికి అందించాడు ఆటో డ్రైవర్.  
ఆ నోటుని తిరిగి అతనికే ఇచ్చి తినడానికి ఏమైనా తెమ్మని సైగ చేశాడు విశ్వనాధ్. 
అతను పరుగున వెళ్లి పక్కనే పాన్ షాపులో బిస్కట్ ప్యాకెట్ తెచ్చి ''ఇవి తినండి! మీ షుగర్ లెవెల్ పడిపోయినట్లుంది" అని పక్కనే ఉన్న పళ్ళ బండి మీదనుంచి రెండు అరటిపండ్లు తెచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగి, నాలుగు బిస్కట్టు,అరటి పండు తిని రెండో పండు బ్యాగులో వేసుకుని 
''చాలా సాయం చేశావు. థాంక్యూ తమ్మీ! ఒంట్లో ఇప్పుడు బాగుంది. కొద్దిగా శక్తి వచ్చింది" అని లేచి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు విశ్వనాధ్. 
"నిన్ను ఇందాక నా ఆటో కాడ వదిలి వెళ్ళినతను ఎవరు?" ఆటో డ్రైవర్ అడిగాడు 
"నా తమ్ముడు" అన్నాడు విశ్వనాథ్
"సొంత తమ్ముడా !? ఇందాక ఆయనన్న మాటలు నేను ఇన్నా. నిన్ను ఇంటికి రావద్దు. సీధా ఊరికి పొమ్మన్నడు కదా... !" అన్నాడు ఆటో డ్రైవర్
మౌనంగా  లేచి నిలబడి  "నేను వెళతాను" అన్నాడు విశ్వనాధ్. 
"ఎలా వెళతారు... ? డబ్బులు లేవన్నారు కదా!" అన్నాడు ఆటో  డ్రైవర్.  
"నడిచి వెళతాను. ఎవరైనా తెలిసిన వాళ్లకి ఫోను చేద్దామన్నా ఫోను ఛార్జ్ అయిపోయినట్టుంది.  నంబర్లు అందులో ఉన్నాయి. దేవుడేదో విధంగా తప్పక సాయం చేస్తాడు" అన్నాడు విశ్వనాధ్ ఆకాశంలోకి చూస్తూ. 
"అంతదూరం నడవడం కష్టమన్నా! నువ్వు నడిచే స్థితిలోలేవు. నిన్ను బస్సు స్టాండ్ లో దింపి వెళతాను" అని  విశ్వనాధ్ భుజం చుట్టూ చేయి వేసి ఆటో దగ్గరికి నడిచాడతను. 
"నీ పేరేంటి ?" అడిగాడు విశ్వనాధ్  
"శంకర్ "
"ఓ...నీది నా తమ్ముడి పేరే''
"తమ్ముళ్ళందరూ ఒకేలా ఉండరన్నా!"
"ఎందుకలా అన్నావు ?"
"మీకు తెల్వదా ? ... ఇంతకీ ఏ వూరెళ్ళాలి ?"  మాట మారుస్తూ అడిగాడు శంకర్   
"కోదాడ వెళ్ళాలి... శంకర్! నువ్వు నా ఫోను తీసుకో. నాకు బస్సు ఛార్జి మందం మూడు వందలివ్వు. ఫోను ఖరీదు వెయ్యి పదిహేను వందలుంటుంది" అన్నాడు విశ్వనాథ్. 
"తప్పు సార్! అట్టా మాట్లాడొద్దు. అవసరం ఎప్పుడు, ఎట్టా, ఎవరికి, ఎవరితో వస్తుందో ఎవరికి 
ఎరుకన్నా! సాయానికి వెల కట్టకూడదు" అన్నాడు ఆటో శంకర్. 
ఆటో స్పీడ్ అందుకుంది. కాసేపట్లో బస్సు స్టాండ్ ఎంట్రీ గేటు దాటి ఆటోని ఓ మూలగా పార్క్ చేశాడు శంకర్. విశ్వనాధ్ ని  క్యాంటీన్ కి తీసుకువెళ్లి భోజనం అయ్యాక, కోదాడ టికెట్ తీసుకుని బస్ ఎక్కించాడు.   
"శంకర్! నీ ఫోను నంబరు ఒక చిట్టి మీద రాసియివ్వు. ఊరికెళ్ళగానే డబ్బు పంపిస్తాను. 
నువ్వు చేసిన సాయం జీవితాంతం మరచిపోను. నీకు కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. చిన్న వాడివయినా చేతులెత్తి  దణ్ణం పెడుతున్నాను" నమస్కరిస్తూ అన్నాడు విశ్వనాథ్. 
చిట్టీ మీద తన ఫోను నంబరు రాసి ఇస్తూ "అన్నా! అట్టా చేయకు. నాకస్సలు నచ్చదు. నీ పానం బాగా లేదని కండక్టర్ కి చెప్పి, నా ఫోను నంబరు ఇంకో చిట్టీ మీద రాసిచ్చిన. తోవలో అవసరమొస్తే  నాకు ఫోను చెయ్యమని చెప్పిన. ఎందుకైనా మంచిది నీ తమ్ముడి ఫోను నంబరు నోటికి గుర్తుంటే నాకు చెప్పన్నా" అడిగాడు ఆటో శంకర్. 
ఫోను నంబరు చెప్పాడు విశ్వనాథ్. నంబరు నోటు చేసుకుని "ఇంటికి చేరంగానే ఫోను చెయ్యన్నా. నమస్తే! నేనుంట" అని చెప్పి బయటకు వచ్చి బస్సు స్టాండులో పబ్లిక్ ఫోను నుంచి విశ్వనాథ్  తమ్ముడు శంకరానికి ఫోను చేశాడు ఆటో శంకర్. 
                                                                     * * * * * 
 "హలో! 'సంకరం' గారేనా మాట్లాడేది ?"అన్నాడు ఆటో శంకరం 
"నాపేరు శంకరం... సంకరం కాదు" 
"సంకరన్నా! ఇది ఇను. ఇందాక ఒక పెద్దాయన అమీర్ పేట స్మశానం బయట ఆటో స్టాండు కాడ  స్పృహతప్పి  పడిపోయిండు. ఆయన ఫోను నుంచి గిదే నంబరుకి చివర ఫోను చేసిండు. అందుకే నీకు ఫోను చేసిన. ఆయన నీకు చుట్టమో, పక్కమో నాకు తెల్వదు. అంబులెన్సుకు నేనే ఫోను చేసిన. వాల్లొచ్చి ఆయన్ని తీసుకుపోయింరు. ఏ హాస్పిటల్ కి  తీసుకపోయిన్రో వివరాలు నాకు తెల్వదు. ఆమనిషి నీకు తెలిసుంటే వివరం కనుక్కుంటావని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోను చేసిన. గింతే... " అని ఫోను పెట్టేశాడు ఆటో శంకర్.   
                                                                     * * * * *
'అన్న' విశ్వనాథ్ కి ఏమైనా ప్రమాదం జరిగిందా నన్న అనుమానం వచ్చి భయపడ్డాడు శంకరం. వెంటనే అన్నకి ఫోను చేశాడు. ఫోన్ పనిచేయడంలేదని రికార్డెడ్ మెసేజ్ వస్తోంది. 
''రమా! అన్నయ్య స్మశానం దగ్గర ఆటో స్టాండ్ దగ్గర స్పృహతప్పి పడిపోయాడట. అంబులెన్సు వాళ్ళు ఏదో ఆస్పత్రికి తీసుకెళ్లారట. నీ మాట విని బుద్ధిలేని పని చేశాను. నీకు పట్టింపని నన్ను పెంచిన అన్నని  నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలి వచ్చాను. ఇంటికి రాకూడదన్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించాను. చేతిలో డబ్బుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అన్నయ్యను ఎక్కడని వెదకాలి ?" అని తలపట్టుకుని బాధ పడుతూ వెంటనే బయలుదేరాడు. 
ఆమీర్ పేట చుట్టు పక్కల వున్నఆసుపత్రులన్నీ మూడు గంటల పాటు వెదికాడు.
గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ చెక్ చేశాడు. జాడ  తెలియలేదు. మళ్ళీ అన్నకి ఫోను చేశాడు. ఇంకా ఫోన్ పనిచేయడంలేదని మెసేజ్ వస్తోంది. ఏం చేయాలో పాలు పోలేదు. 
ఊళ్ళో వదినకు ఫోను చేశాడు. అన్న ఇంకా రాలేదని, ఆయన ఫోను కూడా పనిచేయడంలేదని వదిన చెప్పింది. శంకరానికి ఇంకా కంగారెక్కువయింది. తను చేసిన పనికి శంకరం మనసు వ్రయ్యలయింది.  
ఇంతలో ఫోను మోగింది. ఫోను తీశాడు శంకరం. ఏదో ల్యాండ్ లైన్ నుంచి ఫోను. 
"శంకరం! ఇప్పుడే కోదాడలో బస్ దిగి నువ్వు కంగారు పడతావేమోనని బస్ స్టాండ్ నుంచి ఫోను చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళాక నీరసంతో కళ్ళుతిరిగి కూలబడ్డాను. 
ఎవరో ఆటో అతను ... అతని పేరు శంకరమే! స్వంత తమ్ముడిలా నాకు భోజనం పెట్టించి, టికెట్ కొని బస్  ఎక్కించి వెళ్ళాడు. క్షేమంగా ఊరికి చేరానని చెప్పడానికి ఫోను చేశాను. వుంటాను" అని చెప్పి ఫోను పెట్టేశాడు విశ్వనాధ్!    

                                    * * * * *            సమాప్తం          * * * * *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254                                                             


  
     
  



  
 

 

      
   

                                                                               శిశిరం

                   (ఈ కధ 'మే' నెల, 2013 - ఆంధ్రభూమి మాస పత్రికలో ముద్రితమైనది )   
     
                  అర్ధరాత్రి దాటింది. ఎంతకూ నిద్ర రావడం లేదు. అలసటగావుంది. రెండ్రోజుల్లో హైదరాబాదులో వుంటామనుకుంటేనే గుండెల్లోంచి తన్నుకు వస్తోంది ఒణుకు. బెడ్  మీద నుంచి లేచి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచనలో పడ్డాను. 
'హైదరాబాద్  వెళ్ళాక ఎక్కడో ఒకచోట కలవక పోతామా? ముందుగా నేనే వెళ్తాను. అమ్మా, నాన్న ఎలా స్పందిస్తారో. అసలు ఇంట్లోకి రానిస్తారా?' అన్న ప్రశ్నలు నామెదడుని  తొలిచేస్తున్నాయి. ఇన్నేళ్ళ తరువాత  తిరిగి హైదరాబాదుకి వెళుతున్నామని తెలిసిందగ్గర నుంచి  మనసుతో ఇదే తంతు.
                                                                  * * * * *
తొమ్మిది సంవత్సరాలయింది అమ్మా, నాన్నలని వదిలి అమెరికా వచ్చి. ఎన్నిసార్లు ప్రయత్నం
చేశానో మాట్లాడుదామని. ఫోను నంబరు మార్చుకున్నారు. నా స్నేహితులన్న వారిని దగ్గరికి రానివ్వలేదు. అమ్మ నా మాట వస్తేనే మాట మార్చేసేదట.
వాళ్ళ సంగతులు  కొద్దో, గొప్పో మొదట రెండు మూడేళ్ళు తెలిశాయి. ఎన్ని లెటర్లు వ్రాసినా సమాధానం లేదు. ఇక ఇమెయిల్స్ అయితే లెక్కే లేదు ! 
తరువాత మా స్నేహితురాలు చెప్పింది అమ్మవాళ్ళు ఇంట్లోలేరని!
''ఇంట్లో లేరంటే ఏమిటే? ఎక్కడికైనా వెళ్ళారా... సరిగ్గా కనుక్కోలేకపోయావా? ఎక్కడికి వెళ్తారు?
వెళ్ళినా ఎన్ని రోజులు ఉంటారు? నువ్వెన్నిసార్లు వెళ్లావు ?" అని వివరాలడిగితే దాని దగ్గరనుంచి  మారు సమాధానం లేదు.
అమ్మా, నాన్నకి బాగా తెలిసిన నా ఫ్రెండ్స్ ఇద్దరు 'లావణ్య,లత.
''నన్నడకే వాళ్ళ సంగతులు. మీ ఇంటికి వెళ్లాలంటే నాకు చచ్చే  భయం!'' అని ఖరాకండిగా చెప్పింది లావణ్య. ఇక మిగిలింది లత.
అది కూడా నేను అమెరికా వచ్చిన రెండేళ్ళ తరువాత నాతో పూర్తిగా మాటే మానేసింది. అది 
ఇప్పుడు ఎక్కడుందో, ఏంచేస్తుందో తెలీదు. అలా ఫ్రెండ్స్ తో  కూడా టచ్ పోయింది. 
ఈ తొమ్మిదేళ్ళు ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు.
అమ్మా, నాన్న, తమ్ముడు గుర్తు వస్తే చాలు ఆరోజంతా మనశ్శాంతి వుండేది కాదు.
నిద్ర పట్టేది కాదు. ఏ పని మీద దృష్టి ఉండేది కాదు. ఆఫీసులో చాలాసార్లు మేనేజరు మందలించేవాడు పని మీద దృష్టి ఉంచమని.
నా పరిస్థితి చూసి ''బ్రేక్ తీసుకో శిశిరా!" అని సలహా ఇచ్చాడు శశాంక్
తరువాత వరుసగా బాబు, పాప.  ఆ పై నేను, నా సంసారం, నాపిల్లలు, నా ఇల్లు! 
అయినా ఇన్నేళ్ళలో ఒక్కక్షణం కూడా అమ్మ,నాన్న,తమ్ముడిని తలవని క్షణం లేదు. 
'వాళ్ళకేనా, పట్టింపు, నాకు లేదా' అనిపించేది ఒక్కోసారి!
మన జీవనగమనంలో ఒడిదుడుకులొచ్చాయని కాలమేమీ ఆగదుగా!
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. వెనక్కి చూసుకుంటే కాలచక్రంలో తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి.
                                                                     * * * * *
నాతరువాత పన్నెండేళ్ళ తేడాతో పుట్టాడు తమ్ముడు 'రాజేష్'. ఇప్పుడు ఇరవై రెండేళ్ళువాడికి.  నాకు అమ్మకంటె నాన్నతో ఎంతో కలివిడి. నాన్న ఎన్నడూ గట్టిగా కోప్పడినట్లుగా గుర్తు లేదు.
నేను చదువులో ఎప్పుడూముందే. ఇంజినీరింగ్ ఎంట్రెన్సులో ఆరు వేలలో 'రేంకు' వచ్చినప్పుడు ''ఏం సరిగ్గా ప్రిపేరు కాలేదా'? టి.వి చూడ్డం ఎక్కువయిందా?" అని మందలించారు అంతే! 
అప్పుడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడున్నాయి? దాంతో నేను సిటి వదలి ఇంజనీరింగ్ బయట చెయ్యాల్సి వచ్చింది. నాన్ననాకు ఇరవై ఒక్క సంవత్సరాల వరకూ ఒక మంచి స్నేహితుడు లానే వున్నారు.
ఆయన ఒప్పుకోరని దాచి, ఆయనకు తెలీకుండా నేను చేసిన ఒకే ఒక్క పని ప్రేమ,పెళ్ళీ! 
పెళ్లి చేసుకుని శశాంక్ తో మా ఇంటికెళ్ళినప్పుడు నాన్న నోటి మాట రాక, నిశ్చేష్టులై, షాకులో కూడ అన్న ఒక్కటే మాట. 
''గాడ్ బ్లెస్ యు బోత్!" అని లోపలి కెళ్ళివచ్చి ఒక 'కవరు' నా చేతికిచ్చారు. 
"ఎవరి పెళ్ళికయినా వెళితే నేను ఇలాగే బహుమతి ఇస్తానమ్మా! అలాగే నీకు ఇచ్చాను'' అన్నారు కళ్ళజోడు క్రిందగా జారిన  రెండుకన్నీటి ధారలు తుడుచుకుంటూ అన్నారు.
''ఈ అబ్బాయి ఇంట్లోవాళ్లకైనా మీ పెళ్లి విషయం తెలుసా?'' అనడిగారు నాన్నగారు.'
ఆయన ముఖంలోకి చూసే ధైర్యం లేక నేను సమాధానం చెప్పలేదు.
శశాంక్  కల్పించుకుని "తెలుసండీ. మా వాళ్ళే చేశారీపెళ్ళి '' అన్నాడు.
''ఓ అలాగా!" అంటూ నా వంక చాలా బాధగా చూశారు నాన్న.
ఆ 'చూపు' నా గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. చేసిన పెద్ద తప్పుకు 
విల విల్లాడుతూ బాధగా తలవంచుకోవడం మినహా నేనేమీ మాట్లాడలేకపోయాను.
నాకిప్పటికీ నాన్నగారు బాధగా చూసిన 'ఆ చూపు' గుర్తుంది. అది నన్నునీడలా వెంటాడుతూనే ఉంది. 
'ఏం తప్పు చేశామని మాకీ శిక్ష వేశావు' అని  ఆయన నన్ను గుచ్చి, గుచ్చి అడిగినట్లుగానే అనిపించేది నాకు.
''దాని నగలు దానికిచ్చి బొట్టుపెట్టి పంపించు!'' అని అమ్మతో చెప్పి లోనికెళ్ళి మేము  వెళ్ళే దాకా ఆయన బయటకు రాలేదు.
ఆక్షణంలో, నేను నా అపరిపక్వ నిర్ణయంతో ఆ ఇంటికి పరాయిదాన్నయిపోయాను. ఆ రోజు నాన్నగారితో చనువుగా మాట్లాడలేక పోయాను. అమ్మ అరుస్తూనే వుంది. 
స్వతంత్రించి నేను వారికీ చెప్పకుండా చేసుకున్న కులాంతర వివాహానికి తట్టుకోలేక పోయారు.  నా నగలన్నీ నాకిచ్చేసి లోనికి వెళ్ళింది అమ్మ. ఆ సమయంలో తమ్ముడు ఇంట్లో లేడు. 
అలా ఆనాడు ఇంటినుంచి వెనుతిరిగిన నేను మళ్ళీ ఇన్నేళ్ల తరువాత హైదరాబాద్ తిరిగి వస్తున్నాను. 
                                                                 * * * * *
ఆనాడు అమెరికా బయలుదేరే ముందు ఫోన్లో నాన్నతో మాట్లాడినప్పుడు ఒక్కమాట అన్నారు.
''నన్ను మోసం చేసిన వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం వుండదమ్మా! ఆ సంగతి నీకు బాగా తెలుసు. ఇదే చివరిసారి, ఇక ఎప్పుడూ నాతో మాట్లాడాలని ప్రయత్నించకు. నన్నుబాధ పెట్టకు. ఇప్పటికే సగం చచ్చిపోయాను. మాఇంటికి' చాలా మంది వచ్చి వెళుతుంటారు. 
నిన్నుఆ అతిధి కోవలో చూడలేను. అలాగని నిన్ను పరాయిదానిలా చూడడం నావల్ల కావడం లేదు. ఇంతటితో మమ్ముల్ని వదిలేయ్. పిల్లా, పాపలతో కల కాలం హాయిగావుండు! ఎన్నడూ నాదగ్గరికి  రావద్దు. ప్రయత్నం కూడా చేయకు.
ఇంకొక విషయం ఎప్పటికీ గుర్తుంచుకో. నువ్వు కులాంతర వివాహం చేసుకున్నావని కాదు ఈ ఆంక్షలు. నన్ను శత్రువు కన్నాఎక్కువ మోసం చేశావు, అందుకు నిన్ను క్షమించలేను. దిక్కులేనిదానిలా నువ్వు నీ స్వంత  నిర్ణయం తీసుకున్నావు. అలాగే స్వతంత్రం గానే వుండు'' అని కరకుగా మాట్లాడారు నాన్నగారు.
తరువాత  నాన్నగారు నాతో మాట్లాడ లేదు. నా తప్పు నన్ను కసిగా వెంటాడుతూనే వుంది. 
కని పెంచిన వారిని, తోబుట్టువును వదిలేసి మూర్ఖంగా నా స్వార్ధం చూసుకున్నాను. అందుకే జీవితంలో తల్లీ, తండ్రీ ఉన్నా లేని దాన్నయ్యాను. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడని క్షణం లేదు.
'ఇప్పడు హైదరాబాద్ వెళ్తున్నాము. స్వామీ కరుణించి నాన్నగారి మనసు మారేలా చూడు. నాకు వాళ్ళు కావాలి'  అని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్ధించాను.  
                                                                 * * * * *
నాన్నగారు వాళ్ళు వుండేది అమీర్ పేటలో. మేముండబోయేది 'గచ్చిబౌలి' లో.
ఇంతలో చిన్నది నిద్రలేచి మంచం దిగి ''డాడీ...డాడీ'' అంటోంది. ఒక్క అంగలో  వెళ్లి దాన్ని అందుకుని 'క్రిబ్' లో పడుకో బెట్టాను. వెంటనే నిద్రపోయింది.
పెద్దవాడు బాబు. ఆరు సంవత్సరాలు. చిన్నదానికి మూడు సంవత్సరాలు..టైము చూశాను. రాత్రి  ఒకటయింది. 'శశాంక్' లేచి తనూ పనిచేసు కుంటున్నాడు.
''పడుకో శశాంక్ ! రేపే ప్రయాణం'' అని చెప్పి వచ్చి పడుకున్నాను.
                                                                 * * * * *
'లుఫ్తాన్సా' ఎయిర్ లైన్స్  విమానం హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ఆన్ టైం ల్యాండ్  అయింది. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలన్నీ ముగించుకుని  సూట్ కేసులన్నీ తీసుకుని బయటకు వచ్చేసరికి దాదాపు నాలుగయింది.
శశాంక్ తమ్ముడు  'శాయి' ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. కంపెనీ కారు వచ్చింది. డ్రైవర్ లగేజి అంతా  సదిరాక బయలుదేరాము.
'శాయి' మరో కారులో మావెనకే వచ్చాడు. నాలుగు బెడ్ రూముల ఫ్లాటు. చాలా బావుంది. 
ఏడో అంతస్తు.  ఖరీదైన ఇంటీరియెర్! దగ్గర్లో ఏదో స్టేడియం కనిపిస్తోంది!
ఎటు చూసినా మంచి 'వ్యూ' ఉన్న ఫ్లాటు.
శశాంక్ వాళ్ళ తమ్ముడు, మరదలు ఇద్దరు,  ఉదయానే మళ్ళీ వస్తామని వెళ్ళారు. 
అలసి పోయామేమో అందరం వెంటనే నిద్ర పోయాము.
                                                                 * * * * *
'కాలింగ్ బెల్' మోతకు దిగ్గున లేచాను. టైం చూశాను. ఉదయం పది గంటలు దాటింది. 
బాబోయ్, ఎంత నిద్ర పోయాము అనుకుంటూ లేచాను. జుట్టు సరిచేసుకుని తలుపు తీశాను.
శశాంక్ వాళ్ళ  తమ్ముడు అతని భార్య అనిత.
''అక్కా! కాలింగ్ బెల్, తలుపు, చాల సేపునుంచి కొడుతున్నాం. సారీ అక్కా! నిద్ర పాడు చేసినట్లున్నాం'' అంది లోనికి వస్తూ.
''భలేదానివి' రండి! పిల్లలు, శశాంక్ సరైన తిండి తిని రెండుమూడు రోజులైంది.
ముందు వాళ్లకి టిఫిన్ చేయాలి. శశాంక్ ఆకలికి అసలు ఆగలేడు" అంటూ లోపలి కొచ్చాను.
''అక్కా! మేము వస్తూ, టిఫెన్, భోజనం క్యారియర్  తీసుకుని వచ్చాము'' రెండు మూడు రోజులు భోజనం పంపిస్తాను. ఇప్పుడే వంట మొదలెట్టకు. ముందు సెటిల్ కండి కంగారేమీ లేదు" అంది అనిత.
''లేదు, అనితా! ఇవాళ నుంచి వంట కుర్రాడు వస్తాడు. నేను జాబు మానేసాను. పిల్లలతో కుదరడం లేదు". 
''అయ్యో! అంత డబ్బు ఎందుకు వదులుకోవడం.ఇక్కడ ఐదారు వేలు ఇచ్చామంటే మనుషులు  దొరుకుతారు. నువ్వు హాయిగా జాబులో చేరవచ్చు అక్కా!'' అంది అనిత.
''లేదు, అనితా! పిల్లలు కొద్దిగా ఎదిగిన దాక నేను జాబు మానేద్దామని ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నాము. శశాంక్నే ఇండియా ఆఫీసుకి హెడ్  వచ్చాడు. నేను కూడా జాబు చేయవలసిన అవసరం లేదు. మీరు కూర్చోండి'' వాళ్లకి  సోఫా చూపించి నేను బెడ్ రూమ్ లోకి వచ్చిశశాంక్ ని, పిల్లల్నిలేపాను.
లేస్తూనే పిల్లలు  ''మామ్  ఆకలి" అంటూ గొడవ మొదలెట్టారు.
పిల్లలు, శశాంక్  బ్రష్ చేసుకుని  టిఫెన్ తినేశారు. 
శశాంక్ వాళ్ళతో కాసేపు మాట్లాడి 'లేప్ టాప్'  ముందేసుకుని కూర్చుని, ఫోన్లో మాట్లాడుతున్నాడు. కొద్ది సేపటికి ఇద్దరు మనుషులు వచ్చారు. ఒకరు కుక్, ఇంకొకరు 'బోయ్'. 
కుక్ ఉదయం, సాయంత్రం వస్తాడట . ఇద్దరు తెలుగు వాళ్ళే. బావుందనుకున్నాను.
సాయంత్రానికి కూరలు, సామానుల లిస్టు రాసిస్తే, కిందనే షాపు ఉందట. తెస్తామన్నారు. .
వెంటనే శశాంక్ కి చెప్పాను. కేష్ కావాలని. పని కుర్రాడు చెప్పాడు కిందనే ఎ టి ఎం  వుందని.  హైదరాబాద్ ఎంత మారిపోయిందనుకున్నాను.
శశాంక్ గ్రౌండ్ ఫ్లోర్ కి  వెళ్లి కేష్ తెచ్చాడు. కావలసిన సామాను తెప్పించాను. 
అనితకు చెప్పాను. ఇక భోజనం పంపించవద్దని. వాళ్ళు సాయంత్రం వరకు వుండి వెళ్లారు.
                                                                * * * * *
అప్పుడే వారం రోజులయింది హైదరాబాద్ వచ్చి. పిల్లలు సెటిల్ అయ్యారు.
ఇద్దరు పిల్లలకి అపార్టుమెంటులో స్నేహితులు బాగానే తయారయ్యారు. కిందనే ఉన్న  సమ్మర్ స్కూల్ లో ఇద్దరినీ చేర్పించాను. 'స్విమ్మింగ్ క్లాస్' కి, ఆటలకు వెళుతున్నారు. 
                                                                * * * * *
ఆరోజు ఆదివారం!
శశాంక్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. వంటతను టిఫెన్ చేయడంతో అందరి బ్రేక్ ఫాస్ట్ అయింది, వంట మొదలెట్టాడు. నా మనసు బాలేదు. వచ్చి  వారం రోజులయినా ఇంతవరకు ఎవరినీ కలవ లేదు. మేము హైదరాబాద్  షిఫ్ట్  అవుతున్నట్లు ఎవరితోనూ చెప్పలేదు. 
'అమ్మవాళ్లతో  పరిచయమున్న నా స్నేహితులు ఇంకెవరు హైదరాబాద్ లో ఉన్నారా?' అని అలోచించాను. 
ఎంత అలోచించినా ఉన్నది ఇద్దరు స్నేహితులే. వారి 'పేరెంట్స్' కూడ అమ్మా వాళ్లకి బాగా పరిచయమే. వాళ్ళ ఇళ్ళ అడ్రసులు గుర్తుకి తెచ్చుకున్నాను.  
'ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాలి' అని దృఢంగా మనస్సులో అనుకున్నాను. 
ఇంతలో శశాంక్ "ఇదిగో శశీ! ఇవాళ నేను పిల్లల్ని చూసుకుంటాను. నువ్వు బయటకు వెళ్లదలుచుకుంటే వెళ్ళు. కారు, డ్రైవరు రెడీ'' అన్నాడు శశాంక్.
తను మనస్సులో ఏమనుకొని చెప్పాడో అర్ధం అయింది నాకు.
ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చి గదిలోకి వచ్చితలుపు వేసుకున్నాను.
శశాంక్ నా వెంటనే లోనికి వచ్చాడు.
''శశీ! ఇలా చూడు. నాకు తెలీదా, నీ బాధ?'' దగ్గరికి తీసుకుని వీపు రాస్తూ అన్నాడు శశాంక్ .
ఒక్కసారిగా భోరు మన్నాను. కంగారు పడి పోయాడు శశాంక్.
నాకళ్ళు తుడిచి ''వెళ్ళి అందరినీ కలిసిరా 'అల్ ది బెస్ట్'. నేను  తరువాత వస్తాను'' అన్నాడు శశాంక్. త్వరగా తెమిలి కింద కారు పార్కింగ్ కి వచ్చాను.
                                                                        * * * * *
ముందుగా శ్రీనగర్ కాలనీలో 'లావణ్య' పేరెంట్స్ ఇంటికి వెళ్లాను. లావణ్య వాళ్ళాయన 
తలుపు తీసి ''ఓ మీరా!'' అని నన్ను అదోలా చూస్తూ లావణ్యని పిలిచాడు.
అది నన్నుచూసి బిత్తరపోయి ''ఏంటే, ఎప్పుడొచ్చావు ? ఎక్కడ దిగావు? బాగున్నావా?
ఎన్నిసంవత్సరాలయిందే నిన్నుచూసి!" అంది గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది.
''మేము హైదరాబాద్  షిఫ్ట్ అయ్యాము. గచ్చిబౌలిలో ఇల్లు తీసుకున్నాము. నువ్వు, మీఆయన ఇక్కడ ఉన్నారేంటి? 'మీ అమ్మా, నాన్న వాళ్ళెక్కడ ? నన్ను చూస్తూనే  మీయన అదోలా ముఖం పెట్టాడు? అంతలా మోశావేంటి?" పాత రోజులు గుర్తుకి తెచ్చుకుంటూ అడిగాను దాన్ని. .
''ఛీ! అదేంటే అలా అంటావు. అమ్మావాళ్ళు అమెరికా లో అన్నయ్య దగ్గర సెటిలయ్యారు. వాళ్లకి 'గ్రీన్ కార్డు' వచ్చింది. ఏడేళ్ల క్రితమే వాళ్ళు అమెరికా వెళుతూ మమ్ముల్నిఈ ఇంట్లోకి 'షిఫ్ట్' కమ్మన్నారు" అని విశదంగా చెప్పింది లావణ్య.
"మిగతా సంగతులన్నీ తరువాత మాట్లాడుదాం! ముందు మా అమ్మావాళ్ళ సంగతి చెప్పు! నువ్వువాళ్ళని కలిసి ఎంత కాలమైంది? వాళ్ళెలా వున్నారు? తమ్ముడేం చేస్తున్నాడు? డాడీ, ఎలావున్నారు?" అంటూ నాన్న వాళ్ళ గురించి ఆరా తీస్తూ అడిగాను లావణ్యను
''మీ పెళ్లి అయిన  ఓ సంవత్సరం తరువాత నా పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్లాను. మీ అమ్మ నా ముఖం వాచేలా చివాట్లు పెట్టింది. నేను పారిపోయి వచ్చేశాను. తరువాత వాళ్ళని కలవలేదు" అంది లావణ్య 
"లత పెళ్లయిందా? అదెక్కడ ఉంది ? దాని అడ్రెస్ ఉందా?" అడిగాను. 
''అది పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడది పెద్ద సోషల్ వర్కర్. ఇంట్లో దొరకడం కష్టమే. టూర్లు వెళుతూ వుంటుంది. ముందు ఫోను చేద్దాం. ఇంట్లో వుంటే ఇద్దరం వెళదాం'' అంది లావణ్య.
''దాని ఫోను నంబరు ఇవ్వు" అని ఫోను నంబరు తీసుకుని తరువాత కలుస్తానని చెప్పి లేచాను. 
''అయ్యో! అదేంటే అప్పుడే వెళతావా? భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకుందాం'' అంది లావణ్య.
''లేదే... ఇప్పుడు నాకు వేరే పనుంది. తరువాత తీరిగ్గా కలుద్దాం.ఇక్కడే వుంటాను కదా" అని అక్కడ నుంచి  బయలుదేరాను. 
                                                                    * * * * *
కారు ఎక్కి డ్రైవర్నిపేరడిగాను. 
''అష్రాఫ్''  అన్నాడతను. 
''అమీర్ పేట వెళ్ళాలి'' అన్నాను.
అర్ధగంటలోపే  ''అమీర్ పేట వచ్చామమ్మా'',అన్నాడు అష్రాఫ్. 
మెయిన్ రోడ్డు చాలా మారి పోయింది. "ముందుకు వెళ్లి అక్కడ లెఫ్ట్ కి వెళ్ళు!" అని చెప్పి రోడ్డు వంక చూస్తున్నాను. మా ఇల్లు దగ్గరవుతున్నకొద్దీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఒళ్ళంతా చెమటతో తడిసి పోయింది.
''అష్రాఫ్! మెల్లగా వెళ్ళు''అన్నాను.
''ఏందమ్మా?" అన్నాడు. నా మాట గొంతు దాటి రాలేదని అర్ధమైంది. గొంతు పూర్తిగా గీర పోయింది.
శ్వాస తీసుకుని ''మెల్లగా వెళ్ళు'' అన్నాను.
''సరే అమ్మా!" అని మెల్లగా వెళ్తున్నాడు.
కుడి పక్కన రోడ్డుకి  తిరుగుతూనే కారు పక్కన పార్క్ చేసుకొమ్మని చెప్పి కారు దిగాను. 
మాఇల్లు అలాగే ఉంది. బాగా పాత బడింది.
పోషణ లేని మనిషిలా, మోడైన చెట్టులా, జరిగిన విషయాలకి సాక్షిలా అలా నిలబడి ఉంది.
'రంగులు వేసి ఎన్ని సంవత్సరాలయిందో' అనుకున్నాను.
గేటు పక్కనే వెలిసిన పాత బోర్డు.
"ప్రభుత్వ  బాలల సంరక్షణాలయం" డిపార్ట్ మెంట్  అఫ్ సోషల్ వెల్ ఫేర్, గవర్నమెంటు అఫ్ తెలంగాణ, బోర్డు చదివి కారు దిగి లోనికి వెళ్లాను.
''ఎవరూ కావాలమ్మా ?" అడిగాడు వాచ్ మెన్ . 
''ఇక్కడ వెంకటరావుగారు వాళ్ళు ఉండాలే? వాళ్ళ ఇల్లు కదా ఇది?"
''అదేందమ్మా! చానా సంవత్సరాలు అయినాది నేను ఈడ  వాచ్ మెన్ గా చేయబట్టి. ఈడ దిక్కులేని పిల్లలుంట రమ్మ. మీరు అడిగేటోళ్ళు ఎవరూ ఈడ లేరమ్మా'' అన్నాడు వాచ్ మెన్.
పక్కన వాళ్ళను కనుక్కుందామంటే ఇంటికి రెండువైపులా అపార్ట్ మెంటులు వెలిశాయి.  .
అంతా అయోమయం. ఏమీ తోచడం లేదు. తల తిరిగి పోతోంది. 
''సరేలే బాబూ' అని చెప్పిమళ్ళీ ఇంటి వంక చూసి కారు ఎక్కాను. 
నాకు తెలీకుండానే కళ్ళనుంచి నీరు చిందుతోంది. కళ్ళు తుడుచుకున్నాను.
''కళ్ళలో దుమ్ము పడిందామ్మా ?" అడిగాడు అష్రాఫ్.
నేనేమీ సమాధానం చెప్పలేదు. మనసు, మనసులో లేదు, భారంగా వుంది .
'ఏమయ్యారు...అమ్మా,నాన్నా?' కీడు శంకిస్తోంది మనసు .
'లేదు, లేదు... '  వేరే ఇంటికి  'షిఫ్ట్' అయి వుంటారు' మనసుకు సర్ది చెప్పుకున్నాను.
మనసు ఊరుకోవడం లేదు. 'షిఫ్ట్' కావడమేమిటి సొంతిల్లు కదా!' అని ప్రశ్నిస్తోంది. 
'ఇల్లు వదిలి ఎక్కడి కెళ్ళినట్లు? దీనికంతా నేనే కారణమా?' మనసు తొలిచేస్తోంది.
తల పగిలిపోతోంది. పిచ్చెక్కేలా వుంది. 
'అమ్మో, పిల్లలు, శశాంక్' మనసు హెచ్చరించింది. ఇంటికి చేరుతూనే స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి దేవుణ్ణి మనస్పూర్తిగా ప్రార్ధించాను. శశాంక్ పిల్లలిద్దరికి అప్పటికే అన్నం తినిపించాడు. 
ఏమయిందన్నట్లుగా  నావంక ప్రశ్నార్ధకం గా చూశాడు శశాంక్ నావంక. .
మౌనంగానే సమాధానం చెప్పాను 'ఏమీ కాలేదని'!
''ఏమిటి  ఏమయింది శశీ?" అంటూ దగ్గరి కొచ్చాడు శశాంక్.
''మా ఇంట్లో ఓ అనాధ శరణాలయం వుంది. అదీ అయిదారు సంవత్సరాల నుంచి ఉందట.  
మా ఇంటికి  రెండువైపులా అపార్ట్ మెంటులు కట్టారు. పాత వారెవరూ కనిపించలేదు.
లావణ్యను కలిశాను. తనకి అమ్మా వాళ్ళు ఎక్కడికెళ్లిందీ తెలియదంది. లతని కలవాలి. 
సరే గాని నువ్వు తిన్నావా?" అని శశాంక్ ని అడిగి నేను కాసేపు పడుకుంటానని చెప్పి వచ్చి బెడ్ మీదకు చేరాను. పడుకోవడానికి మనస్కరించలేదు. లేచి 'లత'  నంబరు డయలు చేశాను.
''హలో, ఎవరూ'? "అవతలి గొంతు గుర్తు పట్టాను. వేరే పరిస్థితి అయితే కాసేపు ఆట పట్టించే దాన్నే.
''ఏయ్, లతా! ఎలా ఉన్నావే?"అడిగాను నేనెవరో చెప్పకుండా.
''ఎవరు, మాట్లాడేది?" లత గొంతులో అసహనం. 
నేను 'శిశిర' ను అన్నాను. 
''ఎవరూ?"
''నేనే, లతా! 'శిశిర' ను''.
''గాడ్! నువ్వా...ఇండియాకి  ఎప్పుడొచ్చావు?"అడిగింది ఉద్వేగంగా లత.
"హైదరాబాదులోనే వున్నాను. లావణ్య దగ్గర నుంచి నీ నంబరు తీసుకున్నాను"
''నువ్వెక్కడ?" అడిగాను నేను.
"ఇప్పుడే ఇంటికి చేరాను. జుబిలీ హిల్స్ ఇంటి అడ్రస్ చెప్పింది.
''ఓ...పాతిల్లే కదా! నేను గంటలో వస్తానే, ఫరవాలేదా ? రానా ?"అడిగాను .
''రా! త్వరగా వచ్చేయ్ ! వెయిట్  చేస్తుంటాను'' హుషారుగా అంది లత.
గంటలో తిరిగి వస్తానని శశాంక్ తో  చెప్పి వెంటనే బయలు దేరాను.
క్రిందకు వచ్చేసరికి డ్రైవర్ లేడు. లంచ్ కి వెళ్లాడేమోనని అక్కడున్నసెక్యూరిటీ వాళ్ళని అడిగాను.
''బయట బడ్డీ కొట్టుకి  చాయ్ తాగనీకి పొయిండేమో... ఇప్పుడే పిలుస్తనమ్మా'' అంటూ సెక్యూరిటీ గార్డ్  పరుగెత్తి వెళ్లి అష్రాఫ్ ని  పిలుచుకొచ్చాడు.
''చాయి తాగుదామని ఇప్పుడే ఎల్లినానమ్మా'' అన్నాడు డ్రైవర్.
''ఫరవాలేదు. జూబిలీ హిల్స్ వెళ్ళాలి'' అని చెప్పి కారెక్కి డోర్ వేశాను.
అడ్రస్ చెప్పాను.  పదిహేను నిముషాల్లోనే ''వచ్చిన మమ్మా! ఇదే ఇల్లు" అన్నాడు డ్రైవర్.
ఇల్లు గుర్తు పట్టాను. చదువుకునే రోజుల్లో చాలా సార్లు వచ్చాను.
ఇంటికి పెద్ద గేటు. సెక్యూరిటీ గార్డ్ ఎవరని అడిగాడు 
పేరు చెప్పాను. సెల్యూట్ చేసి గేటు తెరిచాడు, కారు లోన పార్క్ చేసుకోమన్నాను. .
ఇంటి ముందు పెద్ద గార్డెన్. అందంగా వుంది. అంతా  తిరిగి  చూడాలనిపించినా సమయంలేక చూడలేదు. కారు దిగి ఇంటి వైపు చక చకా నడిచాను.
లత బయటే వుంది. ''ఏయ్! శశీ...ఎలావున్నావే?" ఆత్రంగా పరుగెత్తి వచ్చి కౌగలించుకుంది. ఇద్దరమూ కాసేపు అల్లాగే ఉండి పోయాము.
''ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం" అంది లత నా చేయి పట్టుకుని లోనికి నడుస్తూ.
''అమ్మా, నాన్నా,అన్న వాళ్ళు ఎలాఉన్నారు? ఇక్కడే వున్నారా?" లోనికి నడుస్తూ అడిగాను. .
''అందరం ఇక్కడే ఉన్నాము"
"నువ్వేంటి పెళ్లి.. '' నా ప్రశ్న పూర్తిచేయకముందే  ''నేనింకా పెళ్లి చేసుకోలేదు. చేసుకోను'' అంది లత ఖచ్చితంగా.
''అమ్మా, నాన్నా,అన్నయ్య, వదినా, పిల్లలు అందరు ఇక్కడే వున్నారు. చాలా ఇవన్ని!? ఎలాగు అడుగుతావని ముందే చెప్పేశాను. 'కాఫీ, టీ, కూల్ డ్రింకా...  ఏం తాగుతావు ?" అంది లత తన గదిలోకి నడుస్తూ. అదే గది! 
"కాఫీ తాగుదామే" అన్నాను నేను.
పై నుంచి రెండు కాఫీ తెమ్మని పురమాయించింది ''ఊ' ఇక చెప్పు!" అంది నా వంక సాలోచనగాచూస్తూ.
నేనే మొదలెట్టాను. వచ్చివారమయిందని, ఫ్యామిలీ విషయాలు, లావణ్యను కలిసింది అన్నీ క్లుప్తంగా చెప్పాను.
లత కూర్చున్నదల్లా లేచి కిటికీ దగ్గరికి వెళ్లి 'లాన్' లోకి చూస్తూ "అమ్మను కలిసావా?" అడిగింది లత.
నా మనసు కీడు శంకింస్తోంది. నన్ను నేను తమాయించుకున్నాను. 
''లేదు. కలవలేదు! కలుద్దామని ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు లేరు. సరికదా ఆ ఇంట్లో
శరణాలయం ఉంది. అక్కడ అమ్మా వాళ్ళ సంగతి ఎవరికీ తెలీదన్నారు'' నాకు తెలీకుండానే నాగొంతు గాద్గద మయింది.
''వాళ్ళ సంగతి కనుక్కుందామనే నీ దగ్గరికొచ్చాను. నాకసలు దిక్కు తోచడం లేదు.
తొమ్మిది సంవత్సరాలయింది వాళ్ళని కలిసి. నా అంత దురదృష్టవంతులెవరైనా ఉంటారా?
ఎంతమంది ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు ... కలిసి పోలేదు ? అంతా నా దురదృష్టం. 
నా గొంతు పూర్తిగా బొంగురు పోయింది. కన్నీళ్లు ధారలు కట్టాయి. 
"అవును శిశిరా! దేవుడు అందరి నుదుటా ఒకేలా వ్రాయడు కదా!" అంది లత నిర్వికారంగా. .
కాఫీ వచ్చింది ఇద్దరం తాగాము.
''అమ్మ, వృద్ధాశ్రమంలో ఉంది. కేశవగిరి దగ్గర !" అంది లత చాలా నార్మల్ గా. లత మాట  
వింటూనే  కాళ్ళ క్రింద భూమి జారి పోతున్నట్లనిపించింది.
'లత' కిటికి లో నుంచి బయటకు చూస్తూ మాట్లాడుతోంది ఇంకా.
''మొన్నీమధ్యనే వెళ్ళింది తను అక్కడికి. చాల కాలంనుంచి ఆ ఆశ్రమం లో వృద్ధుల సేవలో మమేకమైంది. రాజేష్ రెండు నెలల క్రిందనే ఎం ఎస్  చేయడానికి.అమెరికా వెళ్ళాడు.  తమ్ముడటు వెళుతూనే అమ్మ అపార్టుమెంటు నుంచి ఆశ్రమానికి షిఫ్ట్ అయింది. 
ఆశ్రమం నడపడంలో తనది చాల చురుకైన పాత్ర. అమ్మ అక్కడ ఒక్క రోజు లేకున్నాఆ వెలితి పూడ్చలేనిది అంటారు ఆశ్రమ నిర్వాహకులు'' అని ముగించింది లత.
నాకళ్ళ వెంట కన్నీటి ధారలు కారుతునే ఉన్నాయి. తుడుచుకునేందుకు కూడ ప్రయత్నం చేయలేదు. 
''నాన్నగారు ఎక్కడున్నారు? అమ్మ ఆశ్రమంలో చేరడమేమిటి?" భయపడుతూ అడిగాను. 
''శశీ! నాకు నువ్వు చాలా సార్లు ఫోను చేశావు. ఇక్కడ జరిగిన సంగతులన్నీ నీకు చెప్పినా, నువ్వు బాధ పడడం మినహా చేయ గలిగిందేమీ లేదు. అందుకే విషయాలు నీ నుంచి దాచాను" అంది లత తలవంచుకుని 'శిశిర' ముఖం వంక చూడకుండా.
''మీ అమ్మా, నాన్నా, నిన్ను పూర్తిగా విస్మరించారు. శిశిర అని ఒక కూతురు ఉందని ఉచ్చరించడం మానేశారు. నువ్వు వెళ్ళిన తరువాత మీ అమ్మానాన్న పరిస్థితి బాలేదని తెలిసి మీ ఇంటికి  వెళ్లి వారిని చాలా సార్లు కలిశాను. నీ పెళ్లయిన కొన్ని నెలలకే మీ నాన్నగారు వ్యాపారం మానేశారు. ఇల్లు ప్రత్యేకంగా అనాధ పిల్లల సంరక్షణాలయం పెట్టాలని షరతుపెట్టి 'డొనేట్' చేశారు.
ఉన్న డబ్బంతా తమ్ముడి పేరున, తన చదువుకి కావలసినదంతా బ్యాంకులో వేశారు.
ఇప్పుడు అమ్మ ఉన్న వృద్ధాశ్రమం స్థాపించి భారీగా ధన సహాయం చేశారు. అక్కడ వంద మందికి పైగా వృద్ధులు, దిక్కులేని వయసు మళ్ళిన అనాధలుంటారు. అమ్మ నాతో స్వయంగా చెప్పింది.  నువ్వు వెళ్ళినతరువాత కొన్నినెలలు పాటు మీనాన్నగారు నిద్ర పోలేదని. నేను ఆయన్ని చివర రోజులు దగ్గర్నుంచి చూశాను. ఎప్పుడూ నిన్ను గురించే పలవరించేవారు. .
ఒక రోజు నన్ను అడిగారు ''నేను దానికి ఏం తక్కువ చేశాను? ఏనాడు అది అడిగింది కాదనలేదే? ఇలా ఎందుకు చేసింది? నా పెంపకం లోనే ఏదో పెద్ద తప్పు వుంది. నేనేదో తప్పు చేశాను. లేకుంటే నాకూతురు అలా చేసి వుండేది కాదు'' అని కుమిలి, కుమిలి ఏడ్చారు. 
ఆయన్ని అలా చూడలేకపోయాను. అప్పట్లో నిజంగా నీ మీద చాలా కోపం వచ్చింది.  
తినేవారు కాదు. చిక్కి శల్యమయ్యారు. ఆరోగ్యం చెడింది. ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడి విషయాలు  నీకు చెప్ప వద్దని తన మీదనే  ప్రమాణం చేయించుకున్నారు. అలాగయితేనే నన్ను ఇంటికి రమ్మన్నారు. తరువాత నీ వెళ్ళిన  మరుసటి సంవత్సరమే ఆయన పోయారు.  
అప్పుడు నాకనిపించింది ఇక్కడి సంగతులు నీకు చెప్పేకన్నా బాధలో ఉన్న వారికి చేతనైన సేవ చేస్తూ వారికి దగ్గరగా ఉండడమే మేలనిపించింది. మా  నాన్నగారు కూడా అన్నారు.  వెంకటరావు కూతురుకి చాలా 'అట్టాచ్డ్' కదా లతా! అతను ఈ 'షాక్' నుంచి కోలుకున్న దాకా వాళ్ళింటికి వెళ్తూఉండమని ! నువ్వేమీ అనుకోవద్దు. నేను జరిగింది జరిగినట్లుగా చెబుతున్నాను. నీ పెళ్లి మీ కుటుంబంలో సమ్మూల మార్పులు తెచ్చింది. నా ఈ ప్రస్తుత జీవితానికి కూడా నాంది పలికాయి. అంటే నేనేదో నీ వల్ల సన్యాసిని 
అయ్యాను అనడం లేదు. నాకిష్టమైన జీవితం గడుపుతున్నాను. నేను నాపట్ల, నా జీవితం పట్ల పూర్తి అవగాహనతో, సంతోషంగా ఉన్నాను. ఒక విధంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ప్రస్తుత జీవితంతో నిస్సహాయులకు సాయ పడుతున్నాను. కొన్ని దారి తప్పిన జీవితాలకు మార్గదర్శకం చేస్తున్నాను. నా జీవితంలో ఒక స్థిర నిర్ణయం తీసుకోవడానికి నీ జీవితం నాకు మార్గదర్శక మైంది. నిన్నుతప్పుపడుతున్నానుకోవద్దు. 
నిన్ను అంతగా ప్రేమించిన తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. 
నీ ఇష్టప్రకారం నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళినంత మాత్రంతో 'మాజీవితం ఇక వ్యర్ధం' అనుకుని చేజేతులా  పచ్చని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకోవడం పెద్దవాళ్ళ తప్పు. 
అన్నట్లు మరిచి పోయాను. ఇంకొక ముఖ్యమైన విషయం. 
నువ్వెప్పుడైనా తారసపడితే  నీకివ్వమని రాజేష్  ఒక లెటరు ఇచ్చాడు. వాడు ఎం.ఎస్  చేయడానికి అమెరికా వెళుతూ ఇచ్చి వెళ్ళాడు. వాడు నన్ను'అక్కా'అని పిలుస్తాడు.
నీ పిల్లల్నినిన్ను,శశాంక్ ని, నాదగ్గర ఫోటోలలో చూస్తూనే వున్నాడు. వాడు నాకూ స్వంత  తమ్ముడే. వాడి విషయాలు కూడ కొన్నినీకు చెప్పాలి. కానీ వాడు నీకు ఇమ్మని ఇచ్చిన  లెటరు ముందు  ఇస్తాను. అది చదువు. తరువాత మిగతా విషయాలు మాట్లాడుదాం" అని వెనక్కి తిరిగి 'శిశిర' వంక చూసింది లత.
రెండు చేతులతో ముఖం కప్పుకుని కంటికి,మింటికీ ఏక ధారగా ఏడుస్తోంది శిశిర. ఆక్షణంలో తనో దుఃఖ దేవత లా కనిపించింది. 
''ఏయ్ శశీ! ఏమిటది? తమాయించుకో. అయిందేదో అయింది. అంతా విధి వ్రాత!
''లత ఏమిటి, వేదాంతం ఏమిటి' ? అనుకుంటున్నావా? నేను నీకు తెలిసిన పాత లతను కాను. ముందు ఈ నీళ్లు తాగు" అని గ్లాస్ నీళ్లు అందించింది. 
పక్కనే కూర్చుని 'శిశిర' భుజాల చుట్టూ చేతులు వేసి వీపు రాస్తూ వుంది. చిన్న పిల్లలా దాని ఒదిగి పోయాను. పెద్దగా ఏడ్చేశాను. బాధలో వున్నప్పుడు ఎవరైనా కొద్ది సానుభూతి చూపిస్తే, కన్నీళ్లు ఇదిగో మేము వున్నాం, అని వర్షిస్తాయి.
"శశీ! ఇదే జీవితం" అంటూ లేచి బీరువా నుంచి అంటించి ఉన్న ఎన్వలప్ ఇచ్చింది.
కవరు మీద  ఎర్ర అక్షరాలతో రాసి వుంది.
"అక్క కాని అక్కకు!"  అని వ్రాసి వుంది.
 నా మనసే కాదు. ఒళ్ళంతా చాలా భారమైంది. ఆ కవరు అటు, ఇటు తిప్పి చూశాను. అప్పటికప్పుడే కవరు  తెరిచి చదివదానికి  ధైర్యం చాలలేదు.
''శశీ, లెటరు ఇప్పుడు చదవకు. ఇంటికి వెళ్లి మెల్లగా చదువు. ఒక్కటి గుర్తుంచుకో!
స్నేహితురాలిగా ఒక సలహా! ఈ పరిణామాల ప్రభావం నీ కుటుంబం మీద పడకుండా చూసుకో. 
తప్పులు చేస్తాం. మనం చేసిన  తప్పుఇంత పెద్దదా? ఇన్ని జీవితాలమీద  దాని ప్రభావం ఉంటుందా? ఇన్ని జీవితాల గమనం మారుస్తుందా? అన్న ఆలోచనముందే వస్తే మనం తప్పు చెయ్యం కదా! అందుకే మళ్ళీ మళ్ళీ గట్టిగా చెబుతున్నా! నేను చెప్పడమే కాదు. 
నిన్ను హెచ్చరిస్తున్నాను కూడా! 
అమ్మ దగ్గరికి రేపు వెళదాం. ఉదయం ఎనిమిది గంటలకల్లా నేను మీయింటికి వస్తాను. తయారై వుండు'' అంది లత  నా భుజం తడుతూ. .
మంత్రముగ్ధలా తలఊపాను నేను.   
''బయలుదేరు.రేపు కలుద్దాం!'' నా ముఖం లోకి  సూటిగా చూస్తూ అంది లత.
వెళ్లి కారెక్కి  ''ఇంటికి వెళదాం'' అన్నాను డ్రైవర్ తో..
అర్ధగంటలో ఇంటికి వచ్చాను. లత చెప్పిన మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
లేని హుషారు తెచ్చు కున్నాను. ముఖం మీద ఖేదం కన్పించకుండా జాగ్రత్త పడ్డాను.
బయటి  తలుపులు దగ్గరికి వేసి వున్నాయి. లోపలకి వెళ్ళానో లేదో, పిల్లలు చుట్టేసుకున్నారు.
'ఎక్కడికి వెళ్ళావమ్మా, ఇంతసేపు మేము నీ కోసం ఎంత వెతికామో తెలుసా'? అన్నాడు బాబు.
శశాంక్  'లేప్ టాప్' తో  సహా బయటకు  వచ్చాడు.
''అదేంటి శశాంక్ పిల్లల్ని చూసుకుంటానన్నావు ... ఏమిటి వీళ్ళ గోల అన్నాను మామూలుగా
ఏంలేదు. ఇప్పడి దాకా నాతోనే ఆడుతునే ఉన్నారు. ఈ వెధవ అమ్మకూచి. వందసార్లడిగాడు నువ్వెక్కడికెళ్ళావని. 'వీ' గేము ఆడాము.అది నిద్ర పోయి ఇప్పుడే లేచింది. 
వెళ్ళిన పని ఏమయింది? కలిశావా అందరిని? అమ్మా, నాన్నా, తమ్ముడు ఎలావున్నారు?"  అడిగాడు శశాంక్ .
నేను మౌనంగానే ఉండడంతో ''సరే, మేడం! మీ ఇష్టం వచ్చి నప్పుడు చెప్పండి'' అన్నాడు శశాంక్. నా మౌనానికి అర్ధాన్ని వెతుక్కుంటూ.
''ఒక్కటి చెప్పు' అంతా బావున్నారా?"
''లేదు. తరువాత చెపుతాను''.
వెళ్లి తలస్నానం చేసి, వేడిగా కాఫీ తాగి పిల్లలకి డిన్నర్ పెట్టేసి వచ్చి హాలులో శశాంక్ దగ్గర కూర్చున్నాను.
''భోజనం చేయలేదు, ఆకలిగా లేదా?" అన్నాడు శశాంక్.
''ప్చ్....లేదు శశాంక్! ఆకలి లేదు.మనశ్శాంతి లేదు. అంతా నావల్లే ...!" అన్నాను ఏడుస్తూ.
ఊహించని పరిణామంతో కంగారు పడ్డాడు శశాంక్. .
''నాన్నగారు పోయారు!''
"వ్హాట్?" తను దిగ్గున లేచాడు. ఒళ్లోని 'లేప్ టాప్'  క్రిందకు జారింది. 
దాన్నిక్రింద పడకుండా ఒడిసి పట్టుకుని సోఫాలో పెట్టి ''ఏమైంది. ఎప్పుడు? ఎలా?" అని ఆరాతీశాడు చాల బాధతో ఆత్రుతగా.
''అమ్మ వృద్ధాశ్రమంలో చేరింది. తమ్ముడు అమెరికా వెళ్ళాడు" అంది శిశిర. 
శశాంక్ అడిగిన ప్రశ్నకు సమాధాన మివ్వ కుండానే!
''సారీ, శశీ! ఐ యాం ఎక్సట్రీమ్లీ సారీ! ఓహ్ 'గాడ్!" అని అంటూనే  రెండు చేతులతో
తలపట్టుకుని ఒక్కసారిగా సోఫాలో కూలబడ్డాడు.
నా వంక సూటిగా చూడలేక పోతున్నాడు. నా కంట్లోంచి నీరు ప్రవాహంగా ధారలుగా స్రవిస్తూనే వుంది. శశాంక్ వంచిన తల ఎత్తలేదు.
"నా వల్ల నా వాళ్ళు చెట్టు కొకరు, పుట్టకొకరు అయ్యారు. పచ్చని కుటుంబం నిలువునా కూలిపోయింది. నాన్న.. నా ప్రియమైన నాన్న...నా వల్ల ప్రాణం విడిచారు. 
ఇప్పుడు చేయడానికి ఇంక మిగిలిందేమీ లేదు. శశాంక్ ! అమ్మని కలిసి  తను ఒప్పుకుంటే మనింటికి తీసుకువస్తాను. ఏమంటావు?" అంది శిశిర' అభ్యర్ధనగా.
శశాంక్  తల ఎత్తి ''సారీ శశీ! మన పెళ్లి వల్ల  ఇన్ని దుష్పరిణామాలుంటాయని కలలోకూడా ఊహించలేదు. ఎప్పటికయినా కలుస్తారులే అనుకున్నా గాని, మీ కుటుంబం ఇంతగా విడిపోతుందని ఊహ కూడా రాలేదు. అలాకాదు శశీ ! తను ఒప్పు కుంటే తీసుకురావడం కాదు. అమ్మని  తప్పక తీసుకు రావాలి. మనవల్ల  ఆవిడ ఆశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా ఎవరికీ జరగ కూడదు. నేనూ వస్తాను మీ అమ్మగారి దగ్గరికి. ఆవిడను ఒప్పించే  ప్రయత్నం చేస్తాను. 
అది కూడ చేయకపోతే మనం మనుషుల కింద లెక్కరాము. ఈ బాధ మన జీవితాంతం నీడలా వెన్నంటే వుంటుంది. ఆ బాధ భరించడం నావల్ల కాదు. నీ వల్ల అసలే కాదు. మనం ఆవిడను ఒప్పించి తీసుకు రావాల్సిందే" ధృడంగా  అన్నాడు శశాంక్.
''లేదు, శశాంక్, అమ్మరాదు. మన దగ్గర వుండదు. తన మనసు విరిగి పోయింది నాకు తెలుసు.
ఈ జన్మకు ఈ బాధనుంచి విముక్తి లేదు' అంది శిశిర నిర్వేదంగా. 
''తప్పు చేశాం. దిద్దుకోవడానికి  మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాం. అధైర్య పడకు, అమ్మని తప్పక తీసుకు వద్దాం'' అన్నాడు శశాంక్. శశాంక్ మాటలు టానిక్ లా పనిచేశాయి.
శిశిర కు కొద్దిగా ధైర్యం వచ్చింది.
తమ్ముడి లేఖ శాంశాంక్ కి  చూపించడమా, లేదా? మనస్సులోనే తర్జన, భర్జన పడుతోంది శిశిర.
''ఇదిగో! ఇప్పుడేగా చెప్పాను, మళ్ళీ ఏమిటా ఆలోచన?" అన్నాడు శశాంక్.
''రేపు నీకు కుదురుతుందా శశాంక్  అమ్మ దగ్గరికి  రావడానికి ?  లత ఉదయాన్నే వస్తానంది. 
తనే అమ్మదగ్గరికి తీసుకెళ్తానంది. రేపు ఎనిమిది గంటలకల్లా తయారుగా ఉండమంది. 
ఆశ్రమం చాలా దూరమట. ఎక్కడో కేశవగిరి దగ్గరట!" అంది శిశిర
''కేశవగిరి దగ్గరా... ఆశ్రమం ?  చాలా దూరం. నేను వస్తాను.
''సరే, పిల్లల సంగతి ? ఓ పని చేద్దాం. అందరం కలిసే వెళదాం.  పిల్లల్ని అమ్మగారికి చూపించవచ్చు'' తనే అన్నాడు శశాంక్.
''మరి నీ ఆఫీసు? నా ఆఫీసు నాకు వదిలేయ్, నీకెందుకు చింత? సరేనా!"' అని లేప్ టాప్  ముందేసుకుని పనిలో పడ్డాడు శశాంక్.
తను చెప్పింది బాగానే వుందనిపించింది. అయినా మనసులో ఏదో శంక. ఎందుకయినా మంచిది.
లతతో చెపుతే మంచిది కదా, అని ఫోను చేసింది. ఎంతకూ తను ఫోను ఎత్త లేదు.
''భోజనం చేద్దాం శశాంక్!" ఆకలవుతోంది అంది శిశిర.
''నువ్వు తినేయ్ శశీ ! ప్లీజ్, నాకు పని వుంది నేను కాసేపాగి తింటాను' అన్నాడు శశాంక్.
శిశిర భోజనం త్వరగా ముగించేసి, చేసి పిల్లల గది లోకి వెళ్లి, దుప్పట్లు సరిచేసి,
గదిలోకి వచ్చి తమ్ముడి లేఖ తీసి కవరు తెరిచి బెడ్  మీద పడుకొని చదవడం ప్రారంభించింది.
                                                                     * * * * *
''అక్కా! నిన్నుఇలా సంభోదించడం కూడా నాకు ఇష్టం లేదు. 
ఎంత కాదనుకున్న నువ్వు తోబుట్టువ్వే కదా.  లతక్కే నాకు నిజ మైన అక్క అయితే బాగుండేదని  చాలాసార్లు అనిపించింది. కానీ దేవుడు మనం అనుకున్నవన్నీఇవ్వడుగా. నీ లాంటి వాళ్ళు దేవుడితో పోట్లాడి అయినా కావలసింది సాధించుకోగలరు. నాకంత శక్తి లేదు.
నేను లతక్కకి చాలా ఋణపడి వుంటాను. జీవితంలో నేను మనిషిగా నిలబడి ఈ రోజు  ఎం ఎస్  చేయడానికి  అమెరికా వెళుతున్నానంటే ఇదంతా తన చలవే! 
నిజంగా నువ్వంటే నాకు కోపమేమీ లేదు. నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికొచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఆరోజున మొదలయింది నా పతనం. నాన్నగారు ఆరోజు తరువాత తిరిగి మళ్ళీ మామూలు మనిషి కాలేక పోయారు. ఇల్లు నరకం గా ఉండేది. ఒకళ్ళతో ఇంకొకరు మాట్లాడే వాళ్ళం కాదు. ఉన్నది ముగ్గురం. ఇంట్లో ఎప్పుడూ  భయంకర నిశ్శబ్దం.
ఓ పండుగా లేదు. ఓ సెలేబ్రేషను లేదు. నేను మాట్లాడినా ఏదో ముక్తసరిగా మాట్లాడే వాళ్ళు.
డబ్బుకు తక్కువ లేదు. నాన్నగారు అడగ్గానే ఇచ్చేవారు. జాగ్రత్తగా చదువుకో, అనేవారు. 
ఆమాటొక్కటే అయన నాతో చనిపోయే వరకు మళ్ళీ,మళ్ళీ మాట్లాడిన మాట. 
అమ్మకు పూజలు,ఆశ్రమాలు ఎక్కువయ్యాయి. ఇంటిపట్ల ఉండేదికాదు. 
నాన్నగారు ఇల్లు దానం ఇచ్చేశారు. వేరే ఇంటికి మారేము. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే వాడిని. నాకు కాకూడని అలవాట్లు అయ్యాయి. ఒక సారి మోటర్ సైకిల్ ఆక్సిడెంట్ అయింది. నాకు ఒళ్ళంతా గాయాలు నాలుగు ఫ్రాక్చర్లు అయ్యాయి. లతక్క వాళ్ళ అన్న నన్నుహాస్పిటల్ లో చేర్పించారు. అక్క నన్ను చూడ్డానికి తరచూ హాస్పిటల్  కి వచ్చేది. నాకు  గాయాలు మానిన   తరువాత మూడు నెలలు పాటు  'రిహేబిలిటేషన్'  ట్రీట్ మెంటు ఇప్పించింది.
నీ పెళ్ళయిన  దగ్గరనుంచి నీవు 'లతక్క'తో కాంటాక్ట్ లో వున్నట్లు, తనతో తరచూ  మాట్లాడుతున్నట్లుగా కూడా అక్క చెప్పింది. తాను నీతో మాట్లాడమంది. నేనే నీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఈ లెటరు నీకు ఇమ్మని చెప్పాను. 
ఈపాటికి నీకు సంగతులన్నీ తెలిసి వుంటాయి. జరిగిన ఈ పరిణామాలన్నిటికీ నువ్వే బాధ్యురాలివని నేను అనడం లేదు. 
ఈ విషయమై  నేను, లతక్కా చాలా సార్లు వాదించుకున్నాము. లతక్క ఎప్పుడు నీ పక్షాన వాదించేది . ఈ విషయం ఎప్పుడూ నాకూ అర్ధం అయి కానట్లుగానే వుండేది. దాన్ని అలాగే వదిలేశాను. మనం ఎప్పుడయినా కలుస్తామా లేదా అన్నది కూడ నాకు ఊహకు అందని విషయం.
అందుకే అన్నీ కాలానికి వదిలేయడమే మంచిది! పిల్లలకి నేను తెలుసా ? 
శశాంక్ గారిని అడిగినట్లు చెప్పగలవు. ఇక వుంటాను.
తమ్ముడు.
                                                                       * * * * *
లత ఉదయం  సరిగ్గా ఎనిమిదిగంటలా కల్లా వచ్చింది. 
తను వస్తూనే ''హాయ్, లతా! ఎలా వున్నారు? " కుశల ప్రశ్నలు వేశాడు శశాంక్.
''ఐ  యాం  ఫైన్'' అంటూ ఇన్ని సంవత్సరాల తరువాతనా ఇండియా కి వచ్చేది?" అంది లత సరదాగా.
"అవును. రాలేక పోయాము'' అన్నాడు శశాంక్ నొచ్చుకుంటూ.
''కాని లతా! మీరు చాలా అన్యాయం చేశారు మాకు.శిశిరతో కాంటాక్ట్ లో ఉండి కూడా ఇక్కడ విషయాలు ఏమీ తనతో చెప్పలేదు. కనీసం వాళ్ళ నాన్నగారు.... '' అన్నాడు శశాంక్  సీరియెస్ గా.  .
నేను కల్పించుకుని ''లేదు శశాంక్! తన తప్పు లేదు. అమ్మా వాళ్ళు ఇక్కడి విషయాలు నాతో ఏమీ చెప్పవద్దని తన దగ్గర మాట తీసుకున్నారట '' అంది శిశిర.
''అయితే మాత్రం. తను నీ క్లోజ్ ఫ్రెండ్  కదా తను! నాన్నగారు చనిపోయిన విషయం కూడా చెప్పలేనంత దాపరికమా ? లతా! మీరు ఆ ఒక్క కబురయినా తనకు చెప్పాల్సింది.  
తను జీవితాంతం బాధపడే విషయమది'' నిక్కచ్చిగా అన్నాడు శశాంక్.
శశి వారించ బోయి ఏమనుకుందో ఊరుకుండి పోయింది.
''నిజమే... అది నా తప్పే! వాళ్ళ కిచ్చిన మాట ఈ ఒక్కవిషయం లోనైనా నేను ఖాతరు చేసి వుండాల్సింది కాదు. నువ్వన్నది కరెక్టే ... శశాంక్! నేను చేసింది ముమ్మాటికి పెద్ద తప్పే'' నొచ్చుకుంటూ అంది లత. .
''సారీ లతా! మిమ్ముల్నినొప్పించాలని కాదు. నాకే ఆవార్త పెద్ద షాకు. ఇక శిశిర విషయం వేరే చెప్పాలా... " అన్నాడు శశాంక్.
''టైం అవుతోంది. ఇక బయలుదేరుదామా'?" అంది లత టాపిక్ మారుస్తూ.
''లతా! పిల్లలూ, శశాంక్ కూడా వస్తారు అమ్మదగ్గరకు'' అంది శిశిర.
''నేనూ అదే చెబుదామనుకున్నా'' అంది లత.
''అందరం మా కారులో వెళ్దాం''! అన్నాడు'' శశాంక్.
దాదాపు గంట పైన పట్టిందిఆశ్రమం చేరే సరికి. కారు పార్క్ చేసి అందరం దిగాము.
యధాప్రకారం నాకు గుండె దడ మొదలయింది. నేను బాబు చేయి పట్టు కుని నడుస్తున్నాను. శశాంక్ పాపని నడిపిస్తున్నాడు. 
ఆశ్రమం ప్రశాంతంగా వుంది. త్రోవ రెండు వేపులా పెద్ద చెట్లు. వాటి మొదళ్ళ చుట్టూ అరుగులు,
ఆ అరుగుల మీద కొందరు కూర్చుని, ముడుచుకుని పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు.
కొందరు న్యూస్ పేపర్లు చదువుతున్నారు. కొందరు 'కేరమ్స్' ఆడుతున్నారు. చిన్నచిన్న కుటీరాల్లా కట్టారు. ఆశ్రమం చాల పెద్దది. మూడు పెద్ద బిల్దింగులు, చిన్న చిన్న కుటీరాలు చాలానే  వున్నాయి. లత ఆఫీసు వైపు నడుస్తోంది. లోపల దాదాపు వంద గజాలు నడిచి ఉంటాము.
పాపని ఎత్తుకుని నడుస్తూ నన్నేగమనిస్తున్నాడు శశాంక్.
'లత' ఆఫీసు లోనికి వెళ్లి రెండు మూడు నిముషాలయింది. తను ఒక్కతే తిరిగి వచ్చి మమ్ముల్నిఒక  రూముకి  తీసుకు వచ్చింది.లోపల చల్లగా వుంది చుట్టూ చెట్లు వుండడం వల్ల అనుకుంటాను. లోపల రెండు బెడ్స్, ఒక టేబులు,రెండు కుర్చీలు వున్నాయి. .
బాత్ రూం వుంది. రూము చాలా శుభ్రంగా వుంది. 
నా మనసంతా ఉద్విగ్నంగావుంది. అమ్మ ఎలా రియాక్ట్  అవుతుందో, నేను ఎలా రియాక్ట్ అవాలో అర్ధం కావడం లేదు. దానికి తోడు కడుపులోనుంచి తన్నుకొస్తున్న బాధ. ఏడుపు!
పావుగంట పైన అయింది. ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. ఎవరో కుర్రాడు వచ్చి మంచినీళ్లు, టీ, బిస్కట్స్ఇచ్చి వెళ్ళాడు. బయటనుంచి మాటలు వినబడుతున్నాయి. ఒకరి మాట అమ్మదేనని  గుర్తించాను. మాటలు ఆగిపోయాయి. అమ్మలోనికి వచ్చింది. ఆమె ముఖం ప్రశాంతంగా వుంది. 
ఎటువంటీ భావనా అమ్మ ముఖంలో నాకు కనుపించలేదు. 
నాకు ఏడుపు ఆగడం లేదు. కళ్ళ వెంట నీరు కారుతూనే వుంది.
''శిశిరా బావున్నావా అమ్మా! ఇద్దరు పిల్లలు కదా!" లత చెప్పింది.
''బావున్నావా బాబూ? ఎప్పుడు వచ్చారు హైదరాబాదు?" శశాంక్ ని పలకరించింది అమ్మ.
శశాంక్ వంగి అమ్మ కాళ్ళకు నమస్కరించి పిల్లలిద్దరితోను నమస్కారం చేయించి ''అమ్ముమ్మ'' అని చెప్పాడు. అమ్మ పాపని దగ్గరకు తీసుకుని ''నీ పేరేంటి ?" అని అడిగింది.
అది వాళ్ళ నాన్న కాళ్ళని చుట్టేసుకుంది.
''నీ పేరేంటి బాబూ?"బాబుని అడిగింది అమ్మ. 
''వెంకట్'' వెంటనే సమాధాన మిచ్చాడు వాడు స్పష్టంగా.
''అమ్మా!'' అన్నాను నేను. నా వైపు చూసింది అమ్మ.
అమ్మ కలివిడి చూసి నాకు దుఃఖం పొంగుకు వచ్చింది.
నేను నాకు తెలీకుండానే లేచి అమ్మా కాళ్ళు  చుట్టేసుకుని ''నన్ను క్షమించమ్మా!"అని
భోరుమన్నాను.
అమ్మ చాలా సున్నితంగా మందలిస్తూ ''లే శిశిరా! ఏమిటిది?  పిల్లలు భయ పడతారు" అంటూ భుజాలు పట్టుకుని లేపింది నా వీపు నిమురుతూ. ఆ క్షణం నేను పొందిన ఆనందం, అమ్మ స్పర్శ  అనిర్వచనీయం. ఈ 'ఆనందం' కోసం ఈ తొమ్మిదేళ్లు ఎదురు చూశాను.
నేను కళ్ళు  తుడుచుకుని ''అమ్మా! క్షమించమని అడిగే హక్కు లేదు నాకు. నా మూలంగానే ఇన్ని అనర్ధాలు జరిగాయి. కుటుంబం మొత్తం ఇలా చెట్టు కొకరమయ్యాము'' అన్నాను నేను బాధగా తలవంచుకుని.
''ఎందుకు అలా అనుకుంటున్నావు?"
''ఇలా జరిగేవన్నీమనవల్ల వల్ల జరిగాయనుకుంటే ఇక దేవుడు... సృష్టి అంతా మనచేతుల్లో ఉన్నట్లే గదమ్మా! మీ లాగా ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు ? అందరికీ ఇలాగే అయిందా.... 
లేదు కదా! ప్రతిమనిషికి  నొసటన  ఏమి వ్రాసివుందో అదే జరుగుతుంది. 
తెలీసీ, తెలియక ఎన్నో అనుకుంటువుంటాం. అల్పులం కదా!"అంది అమ్మ చాలా మామూలుగా.
అమ్మ మాట్లాతున్నంతసేపు అమ్మనే చూస్తూ వున్నా. ప్రశాంతంగా ఉందామె. 
''నేనిప్పుడే .పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకు వస్తాను" అంటూనే  బయటకు వెళ్ళింది అమ్మ.
నాకు నెత్తి మీదనుంచి వేయి ఏనుగుల బరువు దించి నట్లయింది. మనసు కొద్దిగా కుదుట పడ్డది.
ఒ పావు గంట తరువాత అమ్మ వచ్చింది. అందరికి టిఫెన్లు వచ్చాయి.
''అమ్మా! నీతో కొద్దిగా మాట్లాడాలి. చేసిన తప్పుకు ఫలితంగా నాన్నను పోగుట్టుకున్నాను. తమ్ముడు, నువ్వు, మన కుటుంబం కోల్పోయిన దానికంతా నేనే బాధ్యు రాలిని. ఆ తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయను. ఎవరు కాదన్నా నాకు నేను దోషినే''.దానికి ఫలితం నేను అనుభవించాల్సిందే!
లత, శశాంక్ ఇద్దరు లేచి బయటకు వెళ్ళడానికి  ఉద్యుక్తులయ్యారు.
"ఎవరు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. అమ్మా! నీతో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు
నేను,శశాంక్, నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాం. నీ తోనే మేముండాలని మాకోరిక!"
"అవును ఆంటీ! మా తెలిసీ తెలియని నిర్ణయంతో ఏమి కోల్పోయామో, కోల్పోయిన దాకా అర్ధంకాలేదు. మమ్ముల్ని మేము క్షమించుకోలేని ఈ క్షణం వస్తుందని ఎప్పుడూ వూహించలేదు.
మిమ్ముల్ని క్షమించమని అడిగే అర్హత మాకు లేదు. దానికి పరిహారంగా మిమ్ముల్ని మాదగ్గరికి రమ్మని అంటున్నామని మీరు అనుకోవద్దు. మిమ్ముల్ని కాపాడు కోవడమే మా బాధ్యత. .
ఇప్పటికే మామయ్యగారిని, కుటుంబాన్ని కోల్పోయారు మీ రందరు. ఇక నైనా సంతోషంగా వుండాలని మాకోరిక. అందుకే మీరు ఇక్కడ అంతా సెటిల్ చేశాక అందరం కలిసి ఉండాలని మా కోరిక. మీరు దయచేసి  రాను అనవద్దు" వేడికోలుగా అన్నాడు శశాంక్.
శిశిర కృతజ్ఞతాపూర్వకంగా చూసింది శశాంక్ వంక.
''పిల్లలూ! వినండి. నేను ఇందాక చెప్పాను, ఇదివరకు లతతో చెప్పాను.
శిశిర మీద నిజంగా నాకు కోపం ఏమీ లేదు. అప్పుడేమైనా అని ఉంటే అది ఆక్షణం వరకే.
జరగవలసినది జరిగింది. అందులో మీ తప్పు, నాతప్పు అని ఏమీ లేదు.
ఎవరి కర్మ ఎలావ్రాసివుందో అలా జరిగింది. జరుగుతుంది. ఇది వేదాంతం కాదు.
ఇంత కంటే ఏమీ చెప్పదలుచుకో లేదు. ఇక నేను ఇక్కడనుంచి 'షిఫ్ట్' కావడమంటూ జరిగేపనికాదు. అది సాధ్యం కాదు. ఇక్కడ నాకు చాలా బాధ్యతలు వున్నాయి.
దిక్కులేని వాళ్ళు ఈ ఆశ్రమంలో చాలామంది ఉన్నారు. ఇక్కడి విషయాలన్నీ లతకు విపులంగా తెలుసు. 
పిల్లలు పట్టించు కోని తల్లులు, తండ్రులు, అనాధలూ, అన్నీవుండి ఆదరణ కరువైన వాళ్ళు 
ఇలా చెబుతూపోతే  వినడానికే బాధగా వుంటుంది. ఇంకొక విషయం నిర్మొహమాటంగా చెపుతాను.
ఇక్కడ వీళ్ళందరికీ నా అవసరం వుంది.
నా కోసం, నా సుఖం కోసం, నేను ఇప్పుడు ఎక్కడికీ రాలేను. నా కేమి బాధల్లేవు. నాకు ఇక్కడ మనశ్శాంతి వుంది. ఇంకొంతమందికి మనశ్శాంతి కల్పిస్తున్నామని నా విశ్వాసం.
మీ ఈరాక తో, మీ పిలుపుతో నన్ను, నావిశ్వాశాన్ని సడలించే ప్రయత్నం చేయకండి.
వీలున్నప్పుడు తప్పక మీ ఇంటికి వస్తాను. పిల్లలతో గడుపుతాను. మీకు వీలున్నప్పుడు ఇక్కడికి  ఎప్పుడయినా రావచ్చు. నా ఈ శేష జీవితం ఈ ఆశ్రమానికే అంకితం! 
మళ్లీ, మళ్ళీ చెబుతున్నాను శిశిరా! నీ మీద నాకు కోపం లేదు. నువ్వుకూడా జరిగిన దానికి 'నేనే'  బాధ్యురాలినని నిందించుకోవద్దు. ఆత్మనింద మంచిది కాదు. నేను ఇప్పుడు చెపుతున్న ప్రతి మాట నిష్కల్మషంగా చెపుతున్నవే.
ఇంకొక విషయం శిశిరా!. తమ్ముడు యు.ఎస్. వెళ్ళాడు తెలుసుకదా!
వాడి భవిష్యత్తు ఇక మీ బాధ్యత. వాడితో మాట్లాడుతాను. నీతోమాట్లాడమని, నీతో కాంటేక్టులో ఉండమని చెబుతాను.
''శిశిరా! ఇది పిల్లలకి'' అంటూ ఒక కవరు ఇచ్చింది అమ్మ, నా చేతికి. ఇక వెళ్తాను. నాకు పనులున్నాయి" అని తను వెళ్లి పోయింది.
అమ్మలో ఎంత మార్పు. ఎంత ప్రశాంతత! 
"థాంక్ యు లతా! నీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు" అని లతని కౌగలించుకుంది శిశిర. 
"ఇక బయలుదేరుదామా?" అంది బయటకు నడుస్తూ లత 
"గాడ్! అ యామ్ సో గ్రేట్ఫుల్ టు యు!" అనుకుంటూ అమ్మ వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉండి పోయాను. శశాంక్ నన్ను భుజం తట్టాడు బయటకు నడుస్తూ. 
                                                 
                                                         --------సమాప్తం--------

రచన:-  
కేశిరాజు వెంకట వరదయ్య.
mob.no..9849118254