లేబుళ్లు

16, నవంబర్ 2022, బుధవారం


                                                        అమ్మా, నాన్నా... ఓ శ్రియ 
                                                                     
పడకగది కిటికీ రెక్కలు తెరిచి కర్టెన్లు పక్కకు లాగడంతో భానుడి బంగారు ఛాయ ప్రభాత కిరణాలు నిద్రిస్తున్న 'శ్రియ' ముఖం మీదకు సూటిగా ప్రసరించాయి. ఆ నులువెచ్చని ఉషా కిరణాలు నిద్రిస్తున్న అమె కనురెప్పలను సృజించి నేత్రాలలోనికి  ప్రసరించి ప్రతిబింబించిన  వెలుగుతో కళ్ళు తెరవక తప్పిందికాదు శ్రియకి.
"గుడ్ మార్నింగ్ తల్లీ" అంటూ శ్రియ బెడ్ అంచున కూర్చుని ఆమె నుదుటిని సున్నితంగా ముద్దాడాడు తండ్రి శశాంక్.
ముడుచుకుని పడుకున్నదల్లా బద్ధకంగా కాళ్లు జాపి "కాసేపు పడుకోనీ డాడీ" అంటూ దుప్పటి  మీదకు లాక్కుంది శ్రియ.
"ఉదయాన్నే త్వరగా లేపమన్నావు కదమ్మా !" అన్నాడు మంచంమీద నుంచి లేచిన శశాంక్.
"ఫైవ్ మినిట్స్ డాడీ ! విసిగించకండి. పొండి" అంది గారాబంగా 
"లేపమన్నావని లేపాను. గీజర్ ఆన్ చేశాను. తరువాత లేటయింది. లేపలేదేంటని నన్ననకు. టిఫిన్ ఏంకావాలో చెప్పు! చేసింతరువాతపేచీ వద్దు?" అని ప్రశ్నించాడు శశాంక్.
"డాడీ... డాడీ ! ప్లీజ్... ఉప్మా, దోశ, అట్లు వద్దు.  అసలు టిఫన్ బాక్సు వద్దు ! నన్నుదోశ, ఉప్మా అని ఫ్రెండ్స్ టీజ్ చేస్తున్నారు" అంటూనే బెడ్ మీద నుంచి లేచి బాత్రూంలోకి పరుగెత్తింది శ్రియ. 
వెనక్కు వచ్చి బెడ్ షీట్ సరిచేసి దుప్పటి మడతబెట్టి బయటకు నడుస్తూ 
'ఏమవుతోందీ పిల్లకు? ఏంచేసినా కిమ్మనకుండా తినేది.ఫ్రెండ్స్ దగ్గర తింటుందేమో...' అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు శశాంక్.
పావుగంటలో తయారై వచ్చింది శ్రియ. తండ్రి కలిపి ఇచ్చిన హార్లిక్స్  రెండు గుక్కల్లో తాగేసి బ్యాగ్ తీసుకుని ఎవరో తరుముతున్నట్లు బయలుదేరింది
"స్కూల్ లేదుకదా ఎందుకా కంగారు ? మల్లిక వాళ్ళింటికేనా ? శలవొస్తే చాలు ఈ అమ్మాయి ఇక్కడికొచ్చి వాలిపోతుందనుకుంటారేమో వాళ్ళు" అన్నాడు శశాంక్ ఆందోళనగా.
"అదేం లేదు డాడీ ! వాళ్లేమనుకోరు. మా ఫ్రెండ్స్ అందరికీ  తెలుసు 'మామ్' లేదని !"
చివుక్కుమంది మనసు శశాంక్ కి. హృదయాన్ని మెలితిప్పినట్లనిపించింది. అమ్మని మరిచేలా కంటికి రెప్పలా గారాబంగా పెంచిన శశాంక్ కి కూతురి మాటలు మింగుడుపడలేదు. 
ఉవ్వెత్తున వచ్చిన ఉద్విగ్నాన్ని దిగమింగి  "అమ్మ లేదని వెళుతున్నావా !?" అన్నాడు గాద్గదంగా.  
అతని కనుకొలుకుల్లోంచి జారడానికి చేరువవుతున్న కన్నీటిని చుబుకం మీదకు జారకుండా చిటికెన వేలిగోటితో బయటకు చిమ్మాడు శశాంక్.
"ఆమె గురించి ఇప్పుడు సుత్తెందుకు డాడీ ? నన్నొదిలేయండి. నాకు లేటవుతోంది" అంది  శ్రియ విసురుగా. 
"ఎందుకెళుతున్నావ్ వారింటికి ? కారణం లేకుండా పరాయివారింటికి తరచూ వెళ్లడం మంచిది  కాదు. గమనిస్తున్నాను. బెంగళూరు వెళ్లివచ్చిందగ్గరినుంచి తప్పించుకు తిరుగుతున్నావు. 
నోటికెంత వస్తే అంతమాట అనేస్తున్నావు. శలవు వస్తే చాలు నన్నొదిలి వెళుతున్నావు.
ఈ పధ్ధతి మనిద్దరికీ మంచిదికాదు" అన్నాడు శశాంక్.
"సారీ డాడీ! హాలిడే వస్తే చాలు టైం పాస్ కావడంలేదు.బోర్ కొడుతుంది.మల్లికా వాళ్ళింటికి ఫ్రెండ్స్ వస్తారు. వెరైటీ ఫుడ్.హోమ్ థియేటర్, నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్...వాటెవర్ వుయ్ లైక్, అన్నీఉన్నాయి. అందుకే వెళుతున్నాను. ఇప్పడు టైం లేదు. రెండింటికల్లా వస్తాను అప్పుడు మాట్లాడతా " అంటూ తండ్రి పిలుపు  వినిపించుకోకుండా సైకిల్ తీసుకుని  పరుగెత్తింది శ్రియ. 
శశాంక్ కు ఒక్కసారిగా నిస్పృహ ఆవహించింది.
'శ్రియేనా ఇలా మాట్లాడుతున్నది. ఇలా ప్రవర్తిస్తోంది ? ప్రాణంబెట్టేది. కుదురైన పిల్ల ! ఎందుకిలా మారిపోయింది' అని చింతిస్తూ పడకకుర్చీలో కూర్చుని ఎడంచేతి వేళ్ళతో రెండుకళ్ళూ మర్దన చేసుకుంటూ గత జీవిత జ్ఞాపకాల దొంతరలోకి జారాడు శశాంక్.
                                                                * * * * *
డిగ్రీ అవుతూనే మొదటి ఉద్యోగ యత్నానికే యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ వచ్చింది శశాంక్ కి. వచ్చేజీతంలో ముప్పాతిక భాగం ఇంటికి పంపుతూ మిగిలిన డబ్బుతో సంతోషంగా జీవిస్తున్న శశాంక్ కి యూనివర్సిటీ బస్టాండ్ లో 'వల్లి' పరిచయమయింది. ఆమె కేంద్రీయ విదేశీ భాషల సంస్థలో లెక్చరర్  గా పనిచేస్తుంది. పరిచయం ప్రేమగామారింది.పెద్దల ఆశీర్వాదంతో పెళ్లయింది. అన్యోన్యమైన జంట. కువకువలాడుతూ గువ్వల జంటలా ఒకరినొకరు ఒదిలిఉండేవారు కారు. పెళ్లయి రెండు సంవత్సరాలు గడిచాయన్నది కుటుంబంలోకి కూతురు  'శ్రియ' రాకతోగాని అర్ధం కాలేదు వారికి. కాలం సాఫీగా గడుస్తోంది. శ్రియకి ఏడేళ్ళు వచ్చాయి. 
'వల్లి' లో అనుకోని మార్పు వచ్చింది. యాంత్రిక  జీవితంపట్ల  తీవ్ర అసంతృప్తి మొదలయింది.   
"ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. ఇంకా అద్దెకొంపే ! ఇండిపెండెంట్  ఇల్లుకొనాలి. కారు కావాలి " అంది ఒకరోజు భర్తతో తీవ్ర స్వరంతో.
"ఏమిటి కథ ! కోరికల లిస్ట్ పెరిగిపోతోంది.ఇప్పుడేమైంది ? సుఖంగా ఉన్నాం ! మెల్లగా ఒక్కొకటి సమకూర్చుకుందాం. మధ్యతరగతి వాళ్లమని గుర్తుంచుకో" అన్నాడు శశాంక్. 
"ఎన్నాళ్లని చాలీ చాలని బ్రతుకు శశాంక్ ! పద ! ఏదైనా వేరేచేశానికి వెళ్ళి రెండుచేతులా  సంపాదించుకొద్దాం" అంది వల్లి 
విలాస జీవితం కోసం అర్రులు జాచడం మొదలయింది. లేచింది మొదలు శశాంక్ ని వేధించడం రోజువారీ కార్యక్రమయింది.
ఒకరోజు భర్తతో మాట్లాడుతూ "నాకు తెలిసిన వాళ్ళద్వారా సౌదీ జిద్దాలో ఉద్యోగం వచ్చింది. 
మంచి జీతం. అయిదేళ్ల కాంట్రాక్టు. తరువాత పొడిగిస్తారు. నీకు కూడా వీసా వస్తుంది.    అక్కడికెళ్ళాక నువ్వూ ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. ఇక్కడ జీవితాంతం సంపాదించినా గొర్రెకు బెత్తెడే తోకన్నట్లు ఉంది మనసంపాదన. ఏదిఏమైనా కోటీశ్వరులం కావాలి. అదే నాధ్యేయం ! 
జిద్దా షిఫ్ట్ అవుదాం శశాంక్ ! ప్లీజ్... కాదనకు. నువ్వు కాదన్నా నేను ఒంటరిగా వెళతాను" అంటూ బెదిరించింది వల్లి.
"వేరే దేశానికెందుకూ ? అంతవసరమేమొచ్చింది మనకు ? ఇద్దరివీ ప్రభుత్వఉద్యోగాలు. 
కడుపులో చల్ల కదలకుండా జీవితం సాగిపోతుండగా ఎందుకా అత్యాశ  ? పరిధికి మించిన ధనకాంక్ష మేలుచేయదు. కీడు తలపెడతాయి. పిచ్చి ఆలోచనలు మానెయ్!"  
హెచ్చరించాడు శశాంక్. వినిపించుకోలేదు వల్లి.
'డబ్బువిలువ నాకు తెలిసినంత నీకు తెలియదుశశాంక్. చిన్నతనమంతా కటిక దరిద్రమనుభవించాను. అనాథలా హాస్టల్లో పెరిగాను. చేతిలో చిల్లిగవ్వలేక పడ్డ కష్టాలు నాకు పాఠాలు నేర్పాయి. 
'ధనంమూలం ఇదం జగత్' నానుడి నేనునమ్ముతాను. కాలు మీద కాలు వేసుకుని గడిపే జీవితం  కావాలి నాకు! కోటీశ్వరురాలయిందాకా ఎవరేమనుకున్నా విశ్రమించేది లేదు ! నేను, నాభర్త, నాకూతురు సుఖపడాలి' అని మనసులో అనుకుని ధృడ నిశ్చయానికి వచ్చింది వల్లి.  
వారం, పది రోజులపాటు ఇంట ఒకటే పోరు. తరచూ వాదనలు. భార్యాభర్తలిద్దరిమధ్య 
మనస్పర్థలు తారస్థాయికెళ్ళాయి. మాటల్లేవు. 
వారం రోజుల తరువాత ఇల్లు ప్రశాంతంగా ఉంది. కొన్నాళ్ల పాటు ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు. వల్లి విదేశీ ఉద్యోగ ప్రస్తావన మానుకుంది. 'అమ్మయ్య' అంతా సర్దుకుంది అనుకున్నాడు శశాంక్. 
                                                               * * * * *
ఒక రోజు కాలేజీ కెళ్లిన 'వల్లి' ఇంటికి రాలేదు. ఫోను ఎత్తడంలేదు. సమయం రాత్రి ఎనిమిదయింది. వల్లి సహ లెక్చరర్, దగ్గరి స్నేహితురాలు 'మహిమ'కి ఫోన్ చేశాడు శశాంక్.
"అదేంటి... వల్లి కాలేజీకి రావడమేంటి ? నాలుగురోజుల క్రితమే లాంగ్ లీవ్ మీద రిలీవ్ అయింది. ఈరోజు 'జిద్దా' వెళుతున్నానని, అక్కడ జాబ్ వచ్చిందని మీరు కూడా రెండునెలల్లో సౌదీ వస్తారని చెప్పిందే ! అసలేం జరిగింది ?" అంటూ ఆత్రుతగా ఎదురుప్రశ్నవేసింది మహిమ.
శశాంక్ కి  నోటమాటరాలేదు. నిశ్చేష్టుడయ్యాడు. తత్తరపడుతూ  "తరువాత ఫోను చేస్తానండీ" అని చెప్పి ఫోను పెట్టేశాడు శశాంక్. 
తల కొట్టేసినట్లయింది. అవమానభారంతో క్రుంగి పోయాడు.  
"ఏమయింది డాడీ అమ్మకి? " అడిగింది ఆరేళ్ళ శ్రియ.
"ఊరికెళ్లింది" అన్నాడు శశాంక్ శ్రియ వంక బాధగా చూస్తూ "ఎప్పుడొస్తుంది?"అమాయకంగా అడిగింది శ్రియ. 
'నాకు తెలుస్తే కదా తల్లీ నీకు  చెప్పేది !' అని మూగగా రోదిస్తూ, మోకాలి మీద చుబుకామానించి ప్రశ్నించిన శ్రియకు సమాధానం చెప్పలేదు శశాంక్. అతని గొంతు పెగల్లేదు. కళ్ళనిండా నీరు. పసి బిడ్డ తల్లడిల్లుతుందని తమాయించుకున్నాడు. దుఃఖాన్ని దిగమింగాడు. 
మరుసటిరోజు ఉదయాన్నే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేముందు తెలిసినవారి ద్వారా ఫ్లైట్ మానిఫెస్ట్ చెక్ చేయించుకున్నాడు శశాంక్. వల్లి 'జిద్దా' వెళ్లినట్లు నిర్ధారణ కావడంతో పోలీస్ రిపోర్ట్  ఇవ్వలేదు శశాంక్.
తను ఇల్లువదిలి వెళుతున్నట్లు లేశమైనా తెలియనివ్వలేదు వల్లి.  
వల్లి వెళ్లిన మరుసటిరోజు రాత్రి మహిమ మళ్ళీ ఫోను చేసింది. ఫోనులో ఆమె పేరు గుర్తించి శశాంక్  ఆమె ఫోను ఎత్తలేదు. సరాసరి ఇంటికే వచ్చింది మహిమ. ఆవిడను చూస్తూనే మొహంమీదనే తలుపు వేశాడు శశాంక్. 
"శశాంక్ గారూ! రెండునిముషాలు మాట్లాడాలి. దయచేసి తలుపు తీయండి" అంటూ పదినిముషాలపాటు తలుపు కొడుతూ పిలుస్తూనే వుంది. 
శశాం క్ఆమెను పట్టించుకోలేదు, తలుపూ తీయనూలేదు. కాసేపు వేచిచూసి వెళ్ళిపోయింది మహిమ. వారంరోజుల పాటు రోజూ ఫోనుచేస్తునే వుంది మహిమ. 
ఆమె నుంచి వచ్చిన ఫోను కట్ చేస్తూనే ఉన్నాడు శశాంక్. 
ఫోను నంబరు మార్చి కొత్త ఫోను తీసుకున్నాడు శశాంక్. 
                                                               * * * * *   
'వల్లి' ఇల్లు వదిలి వెళ్లి ఎనిమిది సంవత్సరాలయింది. శ్రియకి పధ్నాలుగేళ్ళు నిండాయి. 
                                                               * * * * *
ఆరోజు ఆదివారం. ఆలస్యంగా లేచి స్నానంచేసి కిచెన్లోనికి వచ్చింది శ్రియ.
"శ్రియా! నీతో మాట్లాడాలమ్మా" అన్నాడు కిచెన్ లోనికి వచ్చిన కూతురితో శశాంక్.
"సారీ...డాడీ ! నిన్ను బాధ పెడుతున్నానేమో"
"ఛా...ఛా...నువ్వు, నన్ను బాధ పెట్టడమేంటిరా! లేదు. వెళ్ళు ! పనులేమైనా ఉంటే చూసుకో. 
నీకిష్టమని బిర్యానీ చేస్తున్నాను. అవేవో కావాలన్నావు కదా ! నెట్ ఫ్లిక్స్ ,అమేజాన్ ప్రైమ్ ఏది కావాలో ఆర్డర్ చేసుకో ? పది నిముషాల్లో వస్తాను" అన్నాడు కుక్కర్ లో మసాలా దినుసులు  వేస్తూ. వంటింట్లో పనిచూసుకుని స్టవ్ కట్టేసి హాల్లోకి వచ్చాడు శశాంక్.
టివి చూస్తున్నదల్లా ఆపి  "ఏంటి డాడీ మాట్లాడాలన్నారు?" అంది శ్రియ.
"ఏమైంది నీకు  బెంగుళూరు ఫీల్డ్ ట్రిప్ వెళ్లి వచ్చిందగ్గరి దూరదూరంగా మసులుతున్నావు ? నేనింట్లో ఉండే ఒకటి, రెండు శలవురోజుల్లో కూడా ఇంటి పట్టున ఉండడం లేదు. మీద పడిపోయి మాట్లాడేదానివి. ఇప్పుడు, చెబుతున్న మాట కూడా వినడానికి ఇష్టపడడంలేదు. 
నాన్న మీద ఎందుకంత కోపమొచ్చింది ?" నిష్కపటంగా అడిగాడు శశాంక్.
"వదిలేయండి డాడీ !" అంటూ టివి ముందు కూర్చున్నదల్లా లేచి ముఖం చాటేసింది శ్రియ.  
"ఏం వదిలెయ్యాలమ్మా...! నానుండి ముఖం చాటేయాల్సి వచ్చిన విషయమేదో  చెప్పు! నువ్వడిగింది ఇన్నేళ్ళలో ఏదైనా కాదన్నానా ? అవేవో మల్లికా వాళ్ళింట్లో ఉన్నాయన్నావు.
అవేవో కావాలని నువ్వడగ లేదు" అన్నాడు శశాంక్.
"డాడీ! అవి మనింట్లో లేకపోవడం వల్లకాదు నేను ఫ్రెండ్సు ఇళ్లకు వెళ్ళేది. మీకిష్టం లేకుంటే  వెళ్లను. ఆవిషయమిక  వదిలేయండి" అంది  సీరియస్ గా మళ్ళీ విషయాన్ని దాటవేస్తూ.
"శ్రియా! విషయాన్ని దాటవేయవద్దు. నీ సమస్యేమిటో నాకు చెప్పు. ఎందుకు నానుంచి ముఖం చాటేస్తున్నావు ? " అన్నాడు శ్రియ ముఖం వంక  సూటిగా చూస్తూ.
తండ్రి సూటి చూపు తప్పించుకుంటూ "డాడీ ! నాకేం కావాలో మీరివ్వలేరు. వదిలేయండి !?"
అంది శ్రియ. నివ్వెరబోయాడు శశాంక్. 
"అంతగా తప్పించుకోకు. చెప్పు నీకేంకావాలో చెప్పకుండా నేనివ్వలేనని ఎలా నిర్ధారించుకుంటావు. అడుగిచూడు " అన్నాడు తనని తాను తమాయించుకుంటూ.  
"సరే డాడీ ! నాకావాల్సింది ఆడమన్నారుగా... సమయమొచ్చినప్పుడు అడుగుతాను. ఇప్పుడుకాదు. ఇప్పటికి  నన్నొదిలేయండి. నన్నింక విసిగించకండి" అంటూ ఏడుస్తూ తన గదిలోనికి వెళ్లి ధడాలున తలుపు వేసుకుంది శ్రియ.
అవాక్కయ్యాడు శశాంక్. 
తత్తరపాటుతో ఏం చేయాలో అర్ధంగాలేదు ఆ క్షణంలో ! తేరుకుని వెంటనే  శ్రియ గది తలుపు తట్టాడు. గదిలోన గడి పెట్టుకుంది శ్రియ.
"శ్రియా ! తలుపుతియ్యి" కంగారుగా తలుపుని తట్టాడు పలుసార్లు. 
"డాడీ ! ప్లీజ్... నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి" అంది శ్రియ.
 స్థిమితబడి హాల్లోకొచ్చి పడకకుర్చీలో వాలిపోయాడు.
                                                                  * * * * *
మరుసటి రోజు లంచ్ టైంలో ఆఫీసులో దిగాలుగా కూర్చున్నాడు శశాంక్. 
"ఏంటి సార్...లంచ్ క్కూడా వెళ్లకుండా అలా 'డల్' ఉన్నారు. ఏమైనా ప్రాబ్లమా ?" అంటూ ఆప్యాయంగా పలకరించింది కొలీగ్ నాగమణి.
"ఏం లేదు నాగమణి గారూ! ..."
"సార్... మిమ్ముల్ని పదేళ్లుగా ఎరుగుదును. మీరలా ఉన్నారంటే ఏదో సమస్య మిమ్ముల్ని బాధిస్తోంది. అవునా ?" రెట్టించిందావిడ 
మౌనంగా ఉండిపోయాడు శశాంక్.
"శ్రియ ఎలావుంది ?" కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చుని చొరవగా అంది నాగమణి.
సమస్యను వివరంగా చెప్పాడు శశాంక్.
"తినడంలేదు. శలవుల్లోకూడా స్నేహితులంటూ వెళుతోంది. అంతేనా ? ఇంకేమైనా అంటోందా ?" అంది శశాంక్ చెప్పినదంతా ఏకరువు పెడుతూ.
"ఇంకా... " అంటే అర్ధం కానట్లు ముఖం పెట్టాడు శశాంక్ ప్రశ్నార్థకంగా.
"సార్ ! నాకూ పద్నాలుగేళ్ళ కూతురుంది. ఆడపిల్లలు టీనేజిలో కొచ్చారంటే శారీరక, 
మానసిక ప్రవర్తనలో అనూహ్య మార్పులొస్తుంటాయి. వారి ప్రపంచమంటూ ఒకటి ఏర్పడడం ప్రారంభమవుతుంది. యవ్వనంలో అడుగిడుతున్న ఆడపిల్ల మనసంటేనే భావోద్వేగాల ప్రవాహం. స్నేహితులు, రంగు రంగుల కలలు, ఇవన్నీ గాక ఏమైనా ఆరోగ్య సమస్య ఏమైనా ఉంటే తల్లికి చెప్పుకుంటారు. శ్రియ మీకు చెప్పుకోలేక బాధపడుతుందేమో ! 
ప్రేమగా దగ్గరికి తీసుకుని అడగండి. ప్రయోజనముంటుంది" అంది నాగమణి. 
"థాంక్ యు  సో మచ్ మేడం ! ప్రయత్నిస్తాను. చాలా ఉపశమనంగా ఉంది " అన్నాడు శశాంక్ .
                                                                     * * * * *
మూడు నెలల క్రితం ఫీల్డ్ ట్రిప్ అంటూ  ఫ్రెండ్స్  నాలుగు రోజులు బెంగళూరు వెళ్లి వచ్చింది శ్రియ. ట్రిప్పులో సీనియర్ శశితో రూమ్ షేర్ చేసుకోవలసిరావడంతో శశి బాగా పరిచయమయింది. మాటల్లో శశి అడిగింది. "మీనాన్నగారు ఏంచేస్తారు?"
"యూనివర్సిటీ ఫిజిక్స్ ల్యాబ్ హెడ్"
"మీ అమ్మగారు కూడా వర్కింగ్ వుమనా?"
మౌనంగా ఉండిపోయింది శ్రియ క్షణకాలంపాటు ఏం చెప్పాలా నని ఆలోచిస్తూ. వర్కింగ్ వుమన్ అని చెబుతే గొప్పగా ఉంటుందని తలవూపుతూ "అవును" అంది శ్రియ 
"ఏంచేస్తారు ? ఎక్కడ ?" వెంటనే అడిగింది శశి
'సిటీలో పనిచేస్తుందని చెబితే మళ్ళీ వివరాలు అడుగుతుందేమో... ఎందుకొచ్చిన తంట అనుకుని  ''జిద్దాలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తుంది" పొడిగిన సంభాషణ ముగిద్దామని నోటికొచ్చిన మాట చెప్పింది శ్రియ. 
" వెరీ ఇంటరెస్టింగ్. మీ అమ్మగారి పేరేమిటి ?" ఆశ్చర్యం ప్రకటిస్తూ అడిగింది శశి. 
"వల్లి " అంది శ్రియ అప్రియంగా.       
"ఓ మై గాడ్ ... ఓహ్ మై గాడ్ !" అని చిన్న పిల్లలా ఎగురుతూ చప్పట్లు కొడుతూ... 
"నువ్వు వల్లి ఆంటీ కూతురివా !? నీకు తెలుసా... ! మీ మామ్, మా మామ్ మహిమ 'జిద్దా'లో ఒకింట్లోనే కలిసి ఉంటారు. కలిసి ఒక చోటనే పనిచేస్తున్నారు.ఇదిగో వారి ఫోటోలు చూడు!" అని తన ఫోను శ్రియకి ఇచ్చి సంతోషంగా చిన్నపిల్లల గెంతులేస్తూ, అకస్మాత్తుగా ఆగి 
"నువ్వు అబద్ధం చెబుతున్నావు. మీ మదర్ తో నీకు, మీ నాన్నకు సంబంధమే లేదుకదా! 
వల్లి ఆంటీ నాకు బాగా తెలుసు. ఆంటీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను నాలుగయిదు సార్లు జిద్దా వెళ్లి వచ్చాను. ఆంటీ నీ గురించి చెప్పారు. కానీ నువ్వు ఏం చదువుతున్నావు ? ఎక్కడ చదువుతున్నావన్న వివరం  తెలియదు.  నీ ప్రతి పుట్టినరోజుకి బహుమతి కొని దాచిపెడుతూఉంది. అవన్నీ నాకు చూపెట్టింది. ఆమెకి నువ్వు, మీనాన్న తప్ప వేరే లోకమే లేదు. ఆమె గది గోడనిండా మీ ఇద్దరి ఫొటోలే ! మీ నాన్నగారి వినకుండా, ఖాతరు చేయకుండా సౌదీ వెళ్లిందని మీనాన్న ఆమెను దూరంగా ఉంచారే గాని నువ్వు, మీనాన్న ఏం కోల్పోయారో మీకు తెలియదు" అంటూ మూడురోజులు బోలెడు కబుర్లు చెబుతూనే ఉంది శశి. వింటూనే వుంది శ్రియ. 
                                                        * * * * *
దసరా పండుగ శలవులు వరుసగా నాలుగు రోజులు వచ్చాయి.  
ఉదయాన్నే లేచి స్నానం చేసి బయటకువచ్చేసరికి హాల్లో తల్లీ ఫోటోకి దండ వేసి శ్రద్ధగా దణ్ణం పెడుతున్నాడు శశాంక్. 
"ఏంటి డాడీ? ఉదయాన్నే బామ్మఫోటో దగ్గర ..." అంది  ఆశ్చర్యపోతూ శ్రియ. 
"ఈవేళ నానమ్మ తిథిరా"అన్నాడు శశాంక్. 
"మీ అమ్మ... అదే నానమ్మంటే మీకు బాగా ఇష్టమా డాడీ!" అంది శ్రియ. 
"అదేం ప్రశ్నరా ? అమ్మంటే ఇష్టంలేని వాళ్లెవరైనా వుంటారా ? "అన్నాడు శశాంక్. 
"నాకవేమీ తెలవదు కదా డాడీ !" అంది శ్రియ. ఆమె గొంతు గాద్గదమైంది. 
ఊహించని సంభాషణకు నొచ్చుకున్నాడు శశాంక్.  
"డాడీ ! నేనడిగే ప్రశ్నకు నిజాయితీగా, నిర్మొహమాటంగా సమాధానం కావాలి నాకు. నానమ్మ సాక్షిగా చెప్పండి" అంది శ్రియ.
"అదేంటిరా! నీతో ఎన్నడయినా అబద్హమాడానా ? ఎందుకు అంత పెద్ద మాటన్నావు? "
"అయితే నిజం చెప్పండి ! ఆమ్మ మీద మీకేమైనా అనుమానమా ?"
బిత్తరపోయాడు శశాంక్ ఊహించని ప్రశ్నకు. చిన్నపిల్ల. అడగకూడని ప్రశ్న. ఎందుకడిగింది ? అతని మెదడులో తుఫాను. మనసు స్వాధీనంలో లేదు. ఒళ్ళంతా ప్రకంపనం. నీ సమాధానం ఏమిటి అంటోంది అతని మనసు. లేని ప్రశాంతత తెచ్చుకున్నాడు.
ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పమంది కూతురు.  
"లేదమ్మా ! మీ అమ్మ మీద నాకెలాటి అనుమానం లేదు" సమాధానం చెప్పాడతను.     
"అయితే అమ్మను  ఎందుకు వద్దనుకున్నారు ? మీకు చెప్పకుండా, మీరు వారించినా సౌదీ వెళ్ళిందన్న ఒక్క కారణం వల్లేనా ?"
శశాంక్ మౌనంగా ఉన్నాడు.
"నిజమే. వెళ్ళింది ! వెళ్ళాక పదే పదే మీకు ఫోను చేసినా మీరు కావాలని తప్పించుకున్నారు.   మాట్లాడలేదు. మహిమ ఆంటీ స్వయంగా ఫోను చేసీ, చేసీ విసిగి మనింటికి స్వయంగా వచ్చినా ఆమె మొహం మీదనే తలుపు వేశారు. ఫోను నంబరు కూడా మార్చుకున్నారు. అమ్మ సంజాయిషీ వినలేదు. పైగా అమ్మ వివరాలేమీ తెలియ రాలేదని, వెళ్లిన దగ్గరినుంచి ఫోనురాలేదని నెపం ఆమె మీద వేశారు. ఎందుకు చేశారిదంతా ?" సీరియస్ గా, ఖచ్చితంగా తండ్రిని నిలదీసి అడిగింది శ్రియ. 
మీద పిడుగులు పడుతున్నట్లుగా అనిపించింది శశాంక్ కి. తనతప్పులు సాక్ష్యాలతో ఎత్తిచూపుతూ కూతురునుంచి ప్రశ్నలు వచ్చేసరికి మాన్పడి పోయాడు శశాంక్. ఇంతకాలం తల్లిలేని లోటు తీరుస్తూ కంటికి రెప్పలా చూసుకున్న కూతురే తనని బోనులో దోషిలా నిలబెట్టి ప్రశ్నలు సందిస్తోంటే తట్టుకోలేక పోయాడు. ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాలేదతనకి. 
"మీ అమ్మకు డబ్బు పిచ్చి పట్టుకుంది. మనుషులంటే విలువలేదు. వద్దు, వెళ్లొద్దు అని వారించినా లెక్కచేయక పసిపిల్లవైన నిన్ను గాలికొదిలేసి చెప్పకుండా వెళ్ళిపోయింది. 
సరే...వెళ్ళింది ! ఆమె ప్రయత్నం చేసినా నేను మాట్లాడలేదు. 
అప్పుడైనా తిరిగి రావలసింది కదా! తను వస్తానంటే నేనేమీ అడ్డు పడలేదే !"
"డాడీ ! అమ్మేదో సాధించాలనుకుంది. జరిగినదంతా తరిచి చూసినా ఇద్దరి పంతాల మూలంగా ముగ్గురం కోల్పోయింది కొండంత. మీరిద్దరు చేసిన పొరబాట్లు దిద్దుకోండి డాడీ ! అమ్మకావాలి ... నాకు అమ్మకావాలి " అంటూ తండ్రికాళ్ళను చుట్టుకుపోయి గుండెలవిసేలా విలపించింది శ్రియ.  
అనూహ్య పరిణామంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు శశాంక్. 
అతని మనసులో భార్యపై గూడుకట్టుకున్న విముఖత భారంగా అనిపించిందతనికి ఆక్షణంలో. ఓడిపోతున్నానన్న భావన అతన్ని ఊరడిల్లనివ్వడంలేదు. కాలుతున్న ఇనుముపై సమ్మెటదెబ్బలా కూతురి మాటలు అతడి నిశ్చిత భావాల్నిప్రభావితం చేశాయి.         
"రేపు నా బర్తడే డాడీ ! నాతో రండి ! ఎక్కడికి అని అడగొద్దు" అంది శ్రియ తండ్రి చేయి గట్టిగా పట్టుకుని .  
"సరే!" అన్నాడు శశాంక్.
పదినిముషాల తరువాత "క్యాబ్ వచ్చింది. రండి!"అంది ప్రియ.
మౌనంగా కూతురి వెంట నడిచాడు శశాంక్. ఇద్దరూ క్యాబ్ లో కూర్చున్నారు.
"నువ్వన్నది నేను కాదనడంలేదు. ఆమె పశ్చాత్తాపపడి తిరిగి వస్తానంటే నేనెన్నడూ కాదనలేదు. ధనకాంక్షతో వెళ్లిన మీ అమ్మను క్షమించగలనేమోగాని కన్నబిడ్డను కనికరంలేకుండా వదిలివెళ్లిన తల్లిని క్షమించమంటావా?" అన్నాడు శశాంక్.
"మీకు తెలియదు. కన్నబిడ్డను అమ్మ మరువలేదు ! వెళ్లిననాట్నుంచీ ప్రతిక్షణంనుంచి మన ఎడబాటుతో నరకమనుభవించింది. పశ్చాత్తాప పడింది. నాకు తెలుసు. నా దగ్గర రుజువులున్నాయి" అంది శ్రియ గాద్గదంగా. 
పది నిముషాల తర్వాత క్యాబ్ ఓ ఇంటిముందు ఆగింది.
ఇద్దరూ దిగారు ... అది మహిమ ఇల్లని గుర్తించాడు శశాంక్. 
లోపలికి వెళుతూనే హాల్లో చివర దివాన్ మీద పడుకున్న వల్లిని చూసి చలించిపోయాడు శశాంక్. 
"వల్లీ!?" అన్నాడు అప్రయత్నంగా.  అతని గొంతులో లాలస తొణికిసలాడింది. 
"అవును. వల్లీనే ... అత్యాశకు పోయి నిన్నూ, శ్రియాను వదిలి వెళ్ళాను...ఆరోగ్యాన్నిపోగొట్టుకున్నా. 
క్షమించమని అడిగే సాహసం చేయను. క్షమించరాని నేరమేచేశాను" అంది వల్లి. 
ఆమె కణతల మీద ధారలుగా కారుతున్నాయి కన్నీళ్లు.
''అయిపోయిందేదో అయిపోయిందమ్మా ... మనింటికి వెళదాం! నీకేం కాదు అవునుకదా డాడీ ?'' అంది శ్రియ తల్లి భుజం చుట్టూ చేయివేసి. 
"పచ్చని సంసారాన్ని, పసిబిడ్డను వదిలి ఎండమావుల వెంటపడ్డాను. ధనమే సర్వస్వం కాదని ఆలస్యంగా అర్ధమైంది. ఇన్నేళ్ళు ఈ క్షణం కోసమే వేచి చూశాను" అంది వల్లి బెడ్ మీదనుంచి  మెల్లగా లేచింది కూతురి ఆసరాతో.  
"పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. గతం గతః. పద ఇంటికి వెళదాం వల్లీ ! " అన్నాడు వల్లిని పొదివి పట్టుకుని శశాంక్. 
                                                           * * * * * * * * *
                                                           అయిపొయింది  

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు :9849118254 

(ఈ కధ 'వెలుగు దర్వాజ', 14-02-2021, ఆదివారం అనుబంధం లో ప్రచురింబడింది)  







    


 


          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి