లేబుళ్లు

21, నవంబర్ 2022, సోమవారం

అనుకున్నదొకటి ...

                                                           అనుకున్నదొకటి ...                                        
                                                    --------------------------------

శనివారం నుంచి పాఠశాలలకు, హాస్టళ్లకూ పదిహేను రోజులపాటు దసరా శలవలు. తలితండ్రులు, సంరక్షకులు వచ్చి పిల్లల్ని తీసుకువెడుతున్నారు. హాస్టల్లోవున్నవిద్యార్థులంతా కేరింతలు గొడుతూ ఇండ్లకు వెళుతున్నారు. సాయంత్రం నాలుగ్గంటలయ్యే సరికి  హాస్టల్లో ఆరవ తరగతి విద్యార్థి 'నందు' ఒక్కడే మిగిలాడు. నందుని తీసుకెళ్లడానికి తాత రాఘవయ్య రావాల్సి ఉంది. ఆయన రాలేదు. హాస్టల్ వార్డెన్ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారాయనకు.  ఫోను పలకడంలేదు.
నందూని హాస్టల్ దగ్గరలో నివసిస్తున్నవార్డెన్ సదాశివంకి అప్పగించి ముఖ్య వార్డెన్, ఇతర వార్డెన్లు ఇండ్లకు వెళ్లిపోయారు.
"ఏమైంది మీవాళ్ళకి ? ఎవ్వరూ రాలేదు నిన్ను తీసుకెళ్లడానికి"  విసుగ్గా నందుని ప్రశ్నించాడు  ఆరు గంటలదాకా వేచిచూసిన వార్డెన్ సదాశివం.
సమాధానం ఇవ్వలేదు నందు. మౌనంగా శూన్యపు దృక్కులతో చూస్తూ ఉండిపోయాడు.
నందూ కళ్ళలో దైన్యం కన్పించింది. అతని నిస్సహాయతను అర్ధం చేసుకున్నాడు సదాశివం. రాఘవయ్యకి మళ్ళీ ఫోన్ చేశాడు. 'ఫోన్ స్విచ్డ్ ఆఫ్' అని సందేశం వస్తోంది.
తనని కాంటాక్ట్ చేయమని సందేశంపెట్టి, అట్టముక్కమీద ఫోను నంబరు వ్రాసి హాస్టల్ తాళానికి తగిలించి, వాచ్ మెన్ కి చెప్పి, నందూని సైకిల్ వెనకాలెక్కించుకుని ఇంటికి బయలుదేరాడు హాస్టల్ వార్డెన్ సదాశివం.
ఇంటికి చేరుతూనే ముఖ్య వార్డెన్ కి ఫోను చేసి "సార్ ! నందు తాత గారు రాలేదు. నందూ నాదగ్గరే ఉన్నాడు. ఏం చేయమంటారు?" సూచనలడిగాడు సదాశివం. 
"మీ రూముకి తీసుకెళ్ళారా?"
"అవును సార్ ! నందుకీ భోజనం లేదక్కడ. నేనూ వంట చేసుకోవాలి. అందుకే రూముకి తీసుకు వచ్చాను"   
"పెద్దాయనకేదో ఇబ్బంది వచ్చి ఉంటుంది. రేపుదయం వరకూ చూడండి. పిల్లాడు జాగ్రత్త" అని సూచించాడు ముఖ్య వార్డెన్. 
"సరే…సార్! రేపుదయం రాఘవయ్య గారికి మళ్ళీ ఫోనుచేస్తాను" అని చెప్పి ఫోను కట్ చేశాడు సదాశివం. 
                                                                * * * * *
అంతకుముందు  రోజు  గురువారం నాడు 'నందు' తల్లి జాహ్నవి మారుపెళ్లి  శివప్రసాద్ తో ఏ హంగూ, ఆర్భాటమూ లేకుండా తిరుమల కొండపైన సత్రంలో అయింది. పెళ్ళికి వధూవరులు, శివప్రసాద్ తల్లితండ్రులు, జాహ్నవి తండ్రి రాఘవయ్య, తల్లి రత్నమాల మాత్రమే వచ్చారు. 
ఎవరి ముఖాల్లోనూ సాధారణంగా పెళ్లిళ్లలో ఉండే ఉత్సాహంగానీ, సరదాగానీ మచ్చుకైనా కనుపించడంలేదు. ప్రతిఒక్కరూ మోయలేని బరువులు మోస్తున్నట్లు యాంత్రికంగా మసులుతున్నారు. 
శుక్రవారం రోజు  స్వామివారి, అమ్మవారి దర్శనం చేసుకుని జాహ్నవి తలితండ్రులు తప్ప మిగతావారంతా తిరుపతి నుంచి నేరుగా విమానంలో ముంబై వెళ్లిపోయారు.
                                                                * * * * *
రాఘవయ్య, రత్నమాలతో  ఖమ్మం స్టేషనులో రాత్రి రెండుగంటలకు రైలు దిగుతూనే  మొబైల్ ఫోను కోసం జేబులు తడుముకున్నాడు. తిరుమలలో ఫోను స్విచ్ ఆఫ్ చేసి భార్య బ్యాగ్ లో దాచిన సంగతి గుర్తుకొచ్చి, ఫోను తీసుకుని స్విచ్ ఆన్ చేశాడు. ఫోను పలకలేదు. 
రైల్వే స్టేషనులో చార్జి చేసుకుని మిస్డ్ కాల్స్, సందేశాలు చూశాడు.
మనవడు నందు ఉన్న హాస్టల్ ల్యాండ్ లైన్ నుంచేగాక, వార్డెన్ మొబైల్ నుంచి  వచ్చిన  ఫోన్ కాల్స్ ,సందేశాలు చూసి కంగారుపడ్డాడు. 
తెల్లవారుతూనే వార్డెన్ కి ఫోను చేసి "నందు తాతయ్య రాఘవయ్యని మాట్లాడుతున్నాను. క్షమించాలి. నందూని సమయానికి తీసుకెళ్లలేకపోయాను. శలవుల సంగతి మరిచి వూరికెళ్ళాను. అర్ధగంటలో వస్తున్నాను" అని చెప్పి రైల్వే స్టేషన్నుంచి ఆటో చేసుకుని హాస్టల్ కి వచ్చాడు. అప్పటికే నందూతో హాస్టల్ దగ్గర వేచి చూస్తున్న సదాశివంకు కృతజ్ఞతలు చెప్పి, నందూని తీసుకుని వారి గ్రామం చేరారు రాఘవయ్య.  
                                                                  * * * * *                                               
"తాతా ! నిన్న హాస్టల్ కి ఎందుకు రాలేదు?" ఇంటికి వెళుతూనే చనువుగా అడిగాడు నందు. 
"హాస్టల్ కి శలవులని మరిచిపోయి ఊరికెళ్లాం నందూ ! అందునా ఫోను స్విచ్ ఆఫ్ యింది. దాంతో హాస్టల్ వార్డెన్ నిన్ను తీసుకెళ్లమని పెట్టిన సందేశం చూడలేకపోయాను. అందుకే  రాలేకపోయాను"అన్నాడు రాఘవయ్య నొచ్చుకుంటూ.
"తాతా ! నువ్వూరెళ్ళావు కదా! అక్కడ వార్డెన్ సందేశం చూసినా ఏం చేసేవాడివి?" అన్నాడు నందు. చర్నాకోలుతో చెళ్ళున మొహం మీద కొట్టినట్లనిపించి మౌనంగా ఉండిపోయాడు
రాఘవయ్య.
"నువ్వేవూరెళ్ళావు ? ఎందుకెళ్ళావు ?'' రెట్టించి అడిగాడు నందు. 
''వచ్చిన వెంటనే నిన్ను తీసుకొచ్చానుగా…ఇంక ఆ విషయం వదిలేసి ఏదైనా పుస్తకం తీసి
చదువుకో !" కోపంగా అన్నాడు రాఘవయ్య
చిన్నబోయాడు నందు. అయినా కుతూహలం ఆపుకోలేక వంటింట్లోకి వెళ్లి ''ఎక్కడికెళ్లారమ్ముమ్మా మీరు?" అడిగాడు నందు.  
"దేవుణ్ణి చూడడానికి తిరుపతి కొండకి వెళ్ళాం నాన్నా!" శాంతంగా చెప్పింది అమ్ముమ్మ రత్నమాల.
"ఓ అలాగా ! అమ్మ దగ్గరికి వెళ్లారేమోననుకున్నా! ఎప్పుడైనా అమ్మ దగ్గరికెళితే నన్ను కూడా తీసుకెళ్లండి అమ్ముమ్మా !" ఆర్ద్రంగా అడిగాడు నందు.
"నా తండ్రే ! అమ్మదగ్గరికెళ్ళామనుకున్నావా ? అమ్మదగ్గరికి తప్పక తీసుకెళతాను. 
సరేనా!" అంది నందూని దగ్గరికి తీసుకుని ప్రేమగా వీపు రాస్తూ సర్ది చెప్పింది రత్నమాల.
'ఎన్నిసార్లు చెప్పినా ఈ ముసలాయన ఇంతే…పసివాడని కూడా చూడకుండా కసురుకుంటాడు' గొణుక్కుంటూ బాధపడింది రత్నమాల.
"సరే అమ్ముమ్మా !'' అంటూ వంటింటినుంచి బయటకు వెళుతూ ఆగి వెనక్కి వచ్చాడు. 
''ఒక్కసారి అమ్మతో ఫోనులో మాట్లాడవచ్చా అమ్ముమ్మా! చాలా రోజులయింది. అడుగుదామంటే తాత కోపంగా ఉన్నాడు. భయమేస్తుంది" మూగగా రోదిస్తూ జీర గొంతుతో అన్నాడు నందు.
వంటింట్లో చేస్తున్నపని ఆపి "అమ్మతో మాట్లాడాలని వుందా! తాతతో చెబుతాను ఫోను అమ్మకు కలిపివ్వమని" అంది రత్నమాల మళ్ళీ నందూని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని హత్తుకుంటూ !
"వద్దు…అమ్ముమ్మా! వద్దు. తాత తిడతారు. నీ దగ్గర ఫోనుందేమోనని అడిగాను. పోనీలే అమ్ముమ్మా! అమ్మ ఫోను చేసినప్పుడే మాట్లాడుతాను" అంటూ షర్ట్ తో కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళాడు నందు.
'ఏం ఖర్మమో ఏమో! పసివాడి బ్రతుకు దిక్కులేని బ్రతుకయిపోయింది. అటు తల్లినీ ఏమనేట్టు  లేదు. ఇటు పసివాడు తల్లితో మాట్లాడే వీల్లేకపోయే' అనుకుంటూ గుండెల్లో పొంగుకొస్తున్న దుఃఖంతో వెళ్లి మంచంమీద వాలి కొంగుతూ కళ్ళు ఒత్తుకుంటూ పాత జ్ఞాపకాల్లో మునిగిపోయింది రత్నమాల.
                                                               * * * * *
జాహ్నవి మొదటి భర్త రామ్మోహన్  రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తను పనిచేస్తున్న విదేశీ కంపెనీ ముంబై శాఖకి హైద్రాబాదు నుంచి బదిలీ చేయించుకుని కొడుకు నందు  సహా మకాం మార్చింది.  ముంబైలో కొలీగ్  శివప్రసాద్ సహాయంతో ముంబైలో తనుండే ఇంటికి దగ్గరగా ఉన్న మంచి స్కూల్లో చేర్పించింది. 
                                                               * * * * * 
జాహ్నవి ముంబై వచ్చి సంవత్సరం గడిచిపోయింది. శివప్రసాద్ తో చనువు పెరిగింది.  పరిచయం ప్రేమగా మారింది.
ఒక రోజు వారిద్దరూ, నందు ముగ్గురూ కలిసి సినిమా చూసి బీచ్ లో కూర్చుని కబుర్లాడుతున్నారు.
నందూ ఇసుకలో ఆడుతున్నాడు.
"మనం పెళ్లి చేసుకుందాం జాహ్నవీ ! మా పేరెంట్స్ కి చెప్పాను. నిన్ను చూస్తామంటున్నారు. 
కానీ చిన్న ప్రాబ్లెమ్" అన్నాడు శివప్రసాద్ గుంభనగా.    
"నీ గురించి వివరాలన్నీ చెప్పాను కానీ నీకొక బాబు ఉన్నట్లు అమ్మా, నాన్నకు చెప్పలేదు.
నా ఉద్దేశ్యం...పెళ్ళయ్యాక మెల్లగా చెబుదామని !'' నసుగుతూ అన్నాడు శివప్రసాద్.
"అదెలా వీలవుతుంది? నేను మోసం చేసినట్లవుతుంది. తరువాత సమాధానం చెప్పుకోవడం   కష్టమవుతుంది. అలావద్దు" అతన్ని వారిస్తూ ఖచ్చితంగా అంది జాహ్నవి.
"నేననేదీ అదేకదా!"
"అంటే"...
"కష్టమవుతుంది…కానీ అసాధ్యం కాదుకదా !"
"నాకర్ధం కాలేదు, నువ్వేం చెప్పదలుచుకున్నావో... స్పష్టంగా చెప్పు "
"ముందు పెళ్లి కానీ! తరువాత మెల్లగా చెబుదాం!"
"అదెలా ? "
"నా దగ్గర పెర్ఫెక్త్  ప్లాన్ ఉంది" అన్నాడు శివప్రసాద్ ప్లానేమిటో చెప్పకుండా 
"అదేమిటో చెప్పు"
"నీకు బాబు ఉన్నాడన్న సంగతి పెళ్ళికి ముందు మా వాళ్లకి చెప్పడమా లేదా ? అంతవరకే…   ఆవిషయం ఒక్కటే ఆలోచించు. నా ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదానని నువ్వు బుర్ర బద్దలుకొట్టుకొనవసరం లేదు. దాన్ని నాకు వదిలెయ్ ! ప్లాన్ ఫూల్ ప్రూఫ్ " అన్నాడు శివప్రసాద్ నర్మగర్భంగా, మెస్మరైజింగ్ గా మాట్లాడుతూ.
కొలిమిలో ఎర్రగా కాల్చిన ఇనుములా వుందామె మనసు.
"నా మీద నమ్మకం లేదా?" అన్నాడు శివప్రసాద్.
కాల్చిన ఇనుము మీద సుత్తిపోటు పడుతూనే రూపాంతరం చెందినట్లు ఆమె మనసు మారుతోంది .
"నిన్నుపూర్తిగా నమ్మాను. బాబున్నాడని చెబుతే వచ్చే అడ్డంకి అర్ధమయింది" అంది జాహ్నవి.  
నమ్మకం మనుషుల్ని స్వతంత్రంగా ఆలోచించనివ్వదు.
తన ఆలోచనా పరిధిని అతను నిర్ణయిస్తున్నాడన్నవిషయాన్ని గ్రహించలేనంతగా వివేకాన్ని కోల్పోయింది జాహ్నవి. 
ఉచ్చులోపడుతున్నానన్న భావన గానీ, కొడుకు భవిష్యత్తు గురించిగానీ, అస్వతంత్రురాలవుతున్నానన్ననిజాన్నిగాని గమనించలేనంతగా అతన్ని నమ్మింది.
మరుసటి రోజు శివప్రసాద్ ని అడిగింది.
"పెళ్ళైన ఎన్నాళ్ళకి చెబుదామని నీ ఆలోచన?"
"మహా అయితే ఆర్నెల్లు…అప్పటికీ వీలుకాకపోతే సంవత్సరం గరిష్టంగా! అదీ నీకు పూర్తిగా సమ్మత మవుతేనే ! నీనిర్ణయానికే వదిలేస్తున్నా! నీకే మాత్రం ఇష్టం లేకున్నా నిర్మొహమాటంగా చెప్పు! నాకేమీ ఇబ్బంది లేదు.పెళ్లి వాయిదా వేసుకుందాం.అంతే ! 
ఇది చిన్న అవరోధం మాత్రమే. కొన్నాళ్ళు ఓపిక పడదాం!'' అన్నాడు శివప్రసాద్ తాపీగా  జాహ్నవి మీద మానసిక ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.
"నువ్వు చాలా క్లియర్ గా ఉన్నావు ప్రసాద్! నేనే  నిర్ణయానికి రాలేక పోతున్నాను" అంది జాహ్నవి అతని మాటలకి పూర్తిగా వశమై, అతని వంక మెచ్చుకోలుగా చూస్తూ.
"అన్నట్లు నీకో విషయం చెప్పడం మరిచాను. అమ్మా వాళ్ళు ఇంకొక సంబంధం చూశారు.
వద్దని చెప్పాను. నీ నిర్ణయమేమిటో చెప్పాలి త్వరగా" అన్నాడు శివప్రసాద్ జాహ్నవి మీద ఒత్తిడి పెంచుతూ.
నాలుగు రోజుల్లో ఊరికెళ్లొచ్చాక నిర్ణయం చెబుతానంది జాహ్నవి.
                                                                 * * * * *
వేసవి శలవులు కావడంతో వారంరోజులు శలవుపెట్టి  నందుతో స్వంతవూరు వచ్చింది జాహ్నవి.
తండ్రికి, తల్లికీ  వివాహ ప్రతిపాదన, శివప్రసాద్ గురించి అతని కుటుంబం గురించి తల్లితండ్రులకు చెప్పింది జాహ్నవి.
"నువ్వు మారుపెళ్లి చేసుకోవడం మాకు చాలా సంతోషం తల్లీ !
కానీ కొడుకున్నాడన్న విషయం ఆ అబ్బాయి తల్లితండ్రులకు చెప్పక పోవడం, దాచడం తప్పు. రేపతన్నెవరూ తప్పుబట్టరు, నీ నైతికతనే ప్రశ్నిస్తారు. రాజీ పడే చిన్న విషయం కాదు.
నందు తండ్రిని పోగుట్టుకున్న నష్ట జాతకుడు. నువ్వూ దూరమయ్యే పరిస్థితి వస్తే వాడి పరిస్థితేమిటో మనసుపెట్టి ఆలోచించు!" సూటిగా బిడ్డ వంక చూస్తూ అన్నాడు రాఘవయ్య. 
దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది జాహ్నవి.
"ఆ అబ్బాయి ఈ విషయాన్ని తలితండ్రుల వద్ద దాయడం, నిన్ను చెప్పవద్దని వారించడం వెనుకేదో మర్మం దాగుంది. చెప్పక, తప్పటడుగు వేస్తున్నావేమోనమ్మా !" నిర్మొహమాటంగా అన్నాడు రాఘవయ్య
"అవునమ్మా! నువ్వేమైనా మాయలోపడ్డావేమో!? జాగ్రత్త పడకుంటే నువ్వూ, నీ పిల్లాడు ఇద్దరూ ఆగమవుతారు" భర్తకి వత్తాసు పలుకుతూ అంది రత్నమాల.
"అమ్మా! చెబుదామనే   ప్రసాద్ తో  గట్టిగా అన్నాను. పెళ్లికి ముందు తలితండ్రులకీ విషయం చెప్పడం కి ఇష్టంలేదు. 
తీరా చెప్పాక, అతని తలితండ్రులు పెళ్లికి తిరస్కరిస్తే ...అవకాశం కోల్పోతామేమోనని మా  భయం. నేనూ ఆలోచించాను. ఒంటరి బ్రతుకు ఎంత కష్టమో మీకు తెలుసు ! 
అతను నాతోనే పనిచేసే తెలుగుతను. మంచివాడు. భగవంతుడిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే వివాహప్రతిపాదనకు ఒప్పుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కావాలి" అన్నది జాహ్నవి తన తలితండ్రులు చెప్పిన హితాన్ని ఉపేక్షిస్తూ.
"మా ఆశీర్వాదం నీ కెప్పుడూ ఉంటుంది తల్లీ" అన్నారు తల్లీ, తండ్రీ ఒకేసారి.
"వాడిని మళ్ళీ ముంబై తీసుకెళ్ళేవరకు మీరే వాడి బాగోగులు చూడాలి. డబ్బుకేమీ బాధలేదు. 
రేపే వెళ్లి  ఖమ్మం రెసిడెన్షియల్ స్కూల్లో మాట్లాడి నందుని చేర్పిద్దాము. నేను వెళ్ళగానే టి.సి పంపిస్తాను" ధృడంగా అంది జాహ్నవి తండ్రితో
                                                               * * * * *
స్వంతవూరికి వెళ్లి తల్లితండ్రులతో మాట్లాడివచ్చిన జాహ్నవి తన అంగీకారం చెప్పింది.
"నువ్వు మనః స్ఫూర్తిగా ఇష్టపడే ఓకే అన్నావుగా !" గంభీరంగా అడిగాడు శివప్రసాద్.
''అవును'' అంగీకారంగా తలఊపింది జాహ్నవి. 
జాహ్నవిని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేశాడు శివప్రసాద్. 
''జాహ్నవి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు'' తలితండ్రులకు చెప్పాడు శివప్రసాద్. కుటుంబసభ్యులెవరూ అభ్యంతర పరచలేదు.
"కొన్నాళ్లు ఒకర్నిఒకరు అర్థచేసుకొండి. తరువాత పెళ్లి " అంది శివప్రసాద్ అమ్మగారు.
తలలూపారు ఇద్దరూ అంగీకారంగా!
రెణ్ణెల్ల తరువాత...పెళ్లి ప్రస్తావన వచ్చింది.
"పెళ్లి తిరుపతి కొండమీద జరగాలి" తన మనసులో మాట చెప్పింది జాహ్నవి
"మీ అమ్మా నాన్నగారిని కలుస్తామని  అడుగుతున్నారు మాపేరెంట్స్ . వాళ్లు ఊరివాళ్ళు అంతగా మాట్లాడలేరని చెప్పాను. నిన్నడిగినా అదే మాట చెప్పు" ఏకపక్షంగా అన్నాడు శివప్రసాద్ 
ఇబ్బందిగా చూసింది జాహ్నవి. అతనదేమీ పట్టించుకోలేదు. 
పెళ్లి తిరుమలలోనని చెప్పడంతో ఇబ్బంది గా ఫీలయ్యారు శివప్రసాద్ తల్లితండ్రులు. 
"పెళ్లి అక్కడ చేయాలని వాళ్ళ మొక్కట. మనం ముంబై లో గ్రాండ్ గా రిసెప్షన్ పెట్టుకుందాం" చర్చకు తావివ్వకుండా తల్లితండ్రులకు చెప్పాడు శివప్రసాద్ ! 
నెల తరువాత ముహుర్తానికి పెళ్లయింది జాహ్నవి, శివప్రసాద్ కి తిరుమలలో. 
                                                              * * * * *
పెళ్లయి ఆరునెల్లయింది. జాహ్నవి, శివప్రసాద్ ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది.
నందు మాటెత్తితే  శివప్రసాద్ టాపిక్ ని మార్చడం గమనిస్తూ వస్తోంది జాహ్నవి. అతన్ని రెట్టించి సమస్యను జటిలం చేసుకోవాలనుకోవడంలేదామె.
అవకాశం కోసం ఎదురు చూస్తూవుంది. ఆరునెల్లలో కొద్ధి సార్లు మాత్రమే తండ్రితో, తల్లితో,  నందుతో మాట్లాడింది. ఒకరోజు శివప్రసాద్ ని గట్టిగా అడిగింది.
"నందూని ఎప్పుడు ముంబై తీసుకువద్దాం ప్రసాద్ ?"
"అమ్మావాళ్ళతో ఇంకా చెప్పలేదు కదా! ఈ వారం ప్రయత్నిస్తాను" భుజాలు ఎగరేస్తూ ఆమె మాటను తేలిగ్గా తీసుకుంటూ అన్నాడు శివప్రసాద్.
మౌనంగా అతని మాటను వినడం వినా మారుమాట్లాడలేకపోయింది జాహ్నవి.
                                                             * * * * *
పెళ్లయి సంవత్సరం దాటిపోయింది. నందూని ముంబై తీసుకువచ్చే విషయంలో భర్త కావాలనే తాత్సర్యం చేస్తున్నాడని అర్ధమయింది జాహ్నవికి. 
ఆ రోజు... ఒక నిర్ణయానికి వచ్చిన జాహ్నవి, ఆఫీస్ నుంచి తిరిగి వస్తూనే నిర్ణయాన్ని అమలులో పెట్టింది. 
"ప్రసాద్ ! రేపుదయం ఫ్లైట్ కి హైదరాబాద్ వెళుతున్నాను. అక్కడి బ్రాంచ్ లో కొద్ధి పని ఉంది. 
అది చూసుకుని మావూరికి వెళ్లి నందూని, అమ్మా వాళ్ళని చూసి నాలుగు రోజుల్లో తిరిగి  వచ్చేస్తాను.పెళ్లయ్యాక వెళ్లనే లేదు" అంది జాహ్నవి. 
"హ్యాపీ గా వెళ్ళిరా" అన్నాడు శివప్రసాద్ సంతోషంగా. 
                                                             * * * * *
జాహ్ణవి ఊరికి వెళ్లిన నాలుగోరోజు సాయంత్రం ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి తిరిగి వచ్చాడు శివప్రసాద్. వస్తూనే ఇంట్లో నందూని చూసి కలత చెందాడు. 
అతని మనసు ఉక్రోషంతో కుతకుతలాడింది. 
తనని సంప్రదించకనే జాహ్నవి నందుని ముంబై తీసుకురావడం అతనికి నచ్చలేదు. భోజనం రుచించలేదు. ముభావకంగా ఉన్నాడు.
నందూని పడుకోబెట్టి జాహ్నవి బెడ్ రూమ్ లోనికి వస్తూనే అప్రమత్తమయ్యాడు.  
అప్పటిదాకా అతని ముఖకవళికలను,ముభావకంగా వున్న భర్తను, గమనిస్తూనే ఉంది జాహ్నవి.
గదిలోనికి రావడంతోనే పలకరించాడు.    
''మీ అమ్మా నాన్నా బావున్నారా ? నందు కేమైనా హాలీడేస్ ఉన్నాయా?" ఏకబిగిన ప్రశ్నలు సంధించాడు శివప్రసాద్.  
"అమ్మా,నాన్నాఇద్దరు బావున్నారు. బట్టలు కొనుక్కొమ్మని  పదివేల రూపాయలిచ్చారు" అంది జాహ్నవి బెడ్ మీద కూర్చుంటూ. 
"నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు" కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు శివప్రసాద్.  
" ఏ ప్రశ్నకు ? " ఎదురుప్రశ్నతో భర్తని రెట్టిస్తూ అంది జాహ్నవి.      
"నందూ విషయం. అతన్నిక్కడికి  తీసుకొచ్చేముందు నన్నడగవలసింది కదా ?" అన్నాడు శివప్రసాద్ ఉక్రోషాన్ని వెళ్ళగ్రక్కుతూ.   
"లేదు ! వాడికిప్పుడు శలవులేమీ లేవు. టి.సి తీసుకుని వచ్చాను. వాడిక ఇక్కడే,  మనతోనే ఉంటాడు. పాత స్కూల్లో చేర్పిస్తున్నాను. వాడిని తీసుకొస్తున్నానని ముందుగా నీకు చెప్పడం, చెప్పకపోవడంలో తేడా ఏముంది ? నీ వెలాగూ  వాడి విషయాన్ని దాటవేస్తున్నావుగా!" అంది జాహ్నవి అతని స్పందనను  బేరీజు వేసి, అతనివంక సూటిగా చూస్తూ.  
"అదేమిటి ? తేడా లేకపోవడమేమిటి ? మనమనుకున్నదేమిటి ? నువ్వు చేసిందేమిటి ?" అన్నాడు శివప్రసాద్ ఉడుక్కుంటూ.  
"తేడా ఏముంది ? మనం అనుకున్నదే చేశాను. పెళ్లయి సంవత్సరం దాటింది. 
నీవిచ్చిన మాట తప్పావు. నందు మాట ఎత్తితే చాలు…కావాలనే తప్పించుకు తిరుగుతున్నావు. అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను" నిర్మొహమాటంగా, ఖచ్చితంగా అంది జాహ్నవి.
"జాహ్నవీ ! ప్రతి మనిషికి స్వార్ధం ఉంటుంది. అదే స్వార్ధం నాలోనూ ఒక పాలెక్కువే వుంది.
నిన్ను ప్రేమించాను. నీతో పెళ్ళవుతే భవిష్యత్తు బాగుంటుందనుకున్నాను. కానీ, నీ కొడుకుని మన పిల్లాడిగా చూడగలిగే విశాల మనస్తత్వం కాదు నాది.  అతనెలాగూ  హాస్టల్లో సెటిలయ్యాడు. ఇకముందూ అలాగే కంటిన్యూ అవుతాడు. ఎలాగూ మీ అమ్మా, నాన్న  అతని బాగోగులు చూస్తారు.
ఇక సమస్య  ఏముంది ?
నీ కొడుకును ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్లి చూసిరా! ఇక్కడ స్కూల్లో చేర్చవలసిన అవసరం ఏముంది? " జాహ్నవిని ఒప్పించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ  అన్నాడు శివప్రసాద్ తన నైజాన్నిబయటపెడుతూ.
"ఆహా ! నువ్వీ మాట ఏదో ఒక రోజు అంటావేమోనన్న అనుమానం గత కొద్దినెలలుగా నన్ను వేధిస్తూనే ఉంది. అదే నీ 'ప్లాన్'... అని నాకు  ఆలస్యంగా అర్ధమయింది.
అందుకే తప్పుని దిద్దుకుని నా 'ప్లాన్' ప్రకారం నేను నడుచుకున్నాను. 
నా కడుపులో పెరుగుతున్న బిడ్డతో మనం…అంటే మనిద్దరం కలిసి ఉండాలంటే, నందు  ఇక్కడే, మన దగ్గరే, మనింట్లోనే  ఉండాలి... ఉంటాడు ! ఈ విషయంలో నేనింతవరకు బాధ్యతారాహిత్యంగా పడ్డ రాజీ చాలు !" ధృడంగా అంది జాహ్నవి అతనన్నమాటలకు తీవ్రంగా స్పందిస్తూ.
"నాకింకొద్ధి సమయమివ్వు...ఈ విషయమేదో తేలేదాకా అతన్నక్కడే ఉంచు !" చివరి ప్రయత్నం చేస్తూ అన్నాడు శివప్రసాద్.
"ఇంకాపు ప్రసాద్ ! నందూకి నా అవసరం ఎంతవుందో నీ బిడ్డకి …కాదు…మన బిడ్డకీ నీ అవసరమంతే ఉంటుందని నువ్వు గ్రహిస్తే మంచిది. ఆలోచించుకో ! ఇందులో ఏమాత్రం బలవంతం లేదు!'' ప్రతిమాట ఒత్తి పలుకుతూ ఖచ్చితంగా, ఆవేశంగా అంది జాహ్నవి.
శివప్రసాద్ జాహ్నవి మాటలకు మాన్పడి పోయి, తను ఇదివరకన్న మాటలు తిరిగి అప్పజెప్పడం  గమనిస్తూ  మింగలేక, కక్కలేకా మౌనంగా ఉండిపోయాడు. 
''ఇంకొక  ముఖ్య విషయం నీకు చెప్పనే లేదు ! మీ అమ్మగారు, నేను వారం రోజుల  క్రితం గైనకాలజిస్ట్  దగ్గరికి వెళ్ళొచ్చాము. అంతా బాగుంది'' అంది డాక్టరు. 
''ఏం బాగుంది? కనబోయే రెండో బిడ్డకోసం జాగ్రత్తలన్నీ పాటిస్తున్నావు. కన్న కొడుకుపట్ల ఏమయ్యాయీ  జాగ్రత్తలు? పసివాడిని అమానుషంగా దూరంగా హాస్టల్లో ఎందుకు వేయాల్సొచ్చింది?'' అని  మీ అమ్మగారు నన్నుగట్టిగా మందలించారు .
"మీ అమ్మగారికి నేను చెప్పలేదు నాకింతకు మునుపే పదేళ్ల కొడుకున్నాడని ! 
నువ్వేమయినా పెళ్ళికి ముందే చెప్పి నాకు చెప్పడం మరిచిపోయావేమో…గుర్తుకు తెచ్చుకో!" అంది జాహ్నవి ఉద్వేగంగా.  
ఊహించని ఎదురుదాడికి సమాధానంలేక జాహ్నవి ముందు తను కురుచగా అయినట్లు భావిస్తూ, మౌనంగా ఉండిపోయాడు శివప్రసాద్.
మరుసటి రోజు ఉదయాన్నే జాహ్నవి నందూని తీసుకుని స్కూలుకి బయలుదేరింది. 
"జాహ్నవీ ! ఆగు. నందూని స్కూల్లో చేర్చడానికి నేనూ వస్తున్నాను !" అన్నాడు శివప్రసాద్ 
నందు భుజం చుట్టూ చేతులువేసి కారు దగ్గరికి నడుస్తూ. 
                                                          *  *  *  *  *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం: 9849118254  

                                                   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి