లేబుళ్లు

1, జులై 2016, శుక్రవారం

శిశిరం

                                                                      శిశిరం
                      
                 ( ఈ కధ  'మే' నెల, 2013 - 'ఆంధ్రభూమి మాస పత్రికలో ముద్రితమైనది )   
         
               

'ఎక్కడో ఒకచోట కలవక పోతామా? నేను మొదట వెళ్లి రావడం మంచిదా! ఎలా స్పందిస్తారో!
అసలు నన్ను ఇంట్లోకి రానిస్తారా' ? అన్న ప్రశ్నలు శిశిర మెదడుని తొలిచేస్తున్నాయి.
తిరిగి ఇన్నేళ్ళ తరువాత హైదరాబాదు వెళుతున్నామని తెలిసిందగ్గర నుంచి మనసుతో ఇదే తంతు. తొమ్మిది సంవత్సరాలయింది అమ్మా, నాన్నలని వదిలి అమెరికా వచ్చి.
ఎన్నిసార్లు ప్రయత్నం చేశానో మాట్లాడుదామని ...
దాంతో  ఫోను నంబరు కూడ మార్చుకున్నారు.
నా స్నేహితులన్న వారిని దగ్గరికి రానివ్వలేదు.
అమ్మ నా మాట వస్తేనే మాట మార్చేసేదట.
వాళ్ళ సంగతులు  కొద్దో, గొప్పో మొదట రెండు మూడేళ్ళు తెలిశాయి.
తరువాత మా స్నేహితురాలు చెప్పింది ఇంట్లో లేరని!
'ఇంట్లో లేరంటే ఏమిటే? ఎక్కడికైనా వెళ్ళారా'...సరిగ్గా కనుక్కోలేకపోయావా... ఎక్కడికి వెళ్తారు.
వెళ్ళినా ఎన్ని రోజులు ఉంటారు? నువ్వు ఎన్నిసార్లు వెళ్లావు'? అని దాన్ని అడిగితే మారు సమాధానం లేదు.
'అమ్మా, నాన్నకి బాగా తెలిసిన నా 'ఫ్రెండ్స్' ఇద్దరు...లావణ్య,లత.
'నన్నుఅడగకే వాళ్ళ సంగతులు. నాకు భయం అక్కడికి వెళ్ళాలంటేనే' అని కరాకండిగా చెప్పింది లావణ్య.
ఇక మిగిలింది 'లత'... అది కూడా నేను అమెరికా వచ్చిన రెండేళ్ళ తరువాత పూర్తిగా మాటే మానేసింది.
ఎక్కడుందో తెలీదు. ఏంచేస్తుందో తెలీదు.
ఈ తొమ్మిదేళ్ళు ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు.
అమ్మా, నాన్న, తమ్ముడు గుర్తు వస్తే చాలు ఆరోజంతా మనశ్శాంతి వుండేది కాదు.
నిద్ర పట్టేది కాదు.  ఏ పని మీద 'దృష్టి' ఉండేది కాదు.
ఆఫీసులో కూడా చాలాసార్లు మేనేజరు 'మందలించేవాడు'...పని మీద దృష్టి ఉంచమని.
నా బాధ, పరిస్తితి చూసి 'శశాంక్' అయితే ఒకసారి  'వర్క్ బ్రేక్' తీసుకో 'శిశిరా' అని సలహా ఇచ్చాడు.
తరువాత వరుసగా బాబు, పాప...నాసంసారం, నాపిల్లలు, నా ఇల్లు ...
'వాళ్ళకేనా....పట్టింపు, నాకు లేదా' అనిపించేది ఒక్కోసారి' ?
మనకోసం ... మన జీవనంలో ఒడిదుడుకుల కోసం  కాలమేమీ ఆగదుగా!
రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి.
ఒక్కసారి వెనక్కి చూసుకుంటే కాలచక్రంలో తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి.
                                            * * * * *
ఈ తొమ్మిదేళ్ళలో ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళసంగతులేమీ తెలవలేదు.
ఫ్రెండ్స్ కూడా ఎవరూ 'టచ్' లో లేరు.
లెటరు వ్రాసినా సమాధానం లేదు. లెటర్లు అందాయో లేదో కూడా తెలీదు.
'తమ్ముడు ఏమి  చేస్తున్నాడో తెలీదు ... దాదాపు  ఇరవై రెండేళ్ళువాడికి'
నాతరువాత పన్నెండేళ్ళ తేడాతో పుట్టాడు తమ్ముడు  రాజేష్.
'హైదరాబాదు కు వెళ్తున్నాం'  అని  శశాంక్ చెప్పిన దగ్గరనుంచి తలుచుకుంటేనే గుండెల్లో దడ.
ఆలోచన ఏదీ తెగడం లేదు. వాళ్ళని కలవడం తలుచుకుంటేనే  విపరీతంగా భయం,
ఏదో బాధ గుండెల్ని పిండుతోంది. నాకు అమ్మకంటె  నాన్నతో ఎంతో కలివిడి.
ఏనాడు నాన్న గట్టిగా కోప్పడినట్లుగా నాకు గుర్తు లేదు.
నేను చదువులో ఎప్పుడూముందే.  ఇంజినీరింగ్ ఎంట్రెన్సులో ఆరువేలలో 'రేంకు' వచ్చినప్పుడు 'ఏం సరిగ్గా ప్రిపేరు కాలేదా'? T.V చూడ్డం ఎక్కువయిందా, అని మందలించారు అంతే.
అప్పుడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడున్నాయి? దాంతో నేను సిటి వదలి ఇంజనీరింగ్ బయట చెయ్యాల్సి వచ్చింది. నాన్ననాకు ఇరవై ఒక్క సంవత్సరాల వరకూ ఒక మంచి స్నేహితుడు లానే వున్నారు.
ఆయన దగ్గర నేను దాచి, ఆయనకు తెలీకుండా చేసిన పని ప్రేమ, పెళ్ళీ ! 
పెళ్లి చేసుకుని నేను, శశాంక్ మా ఇంటికెళ్ళి నప్పుడు నాన్న నోటి మాట రాక, నిశ్చేష్టులై, షాకులో కూడ అన్న  ఒక్కటే మాట! ' గాడ్ బ్లెస్ యు బోత్'! అన్నారు వెంటనే  లోపలికెళ్ళివచ్చి ఒక 'కవరు' నా చేతికిచ్చారు.
ఆ 'కవరు' నా దగ్గరే వుందింకా!  ' ఏదైనా పెళ్లి కెళితే నేను ఇలాగే బహుమతి ఇస్తానమ్మా! అలాగే నీకు ఇచ్చాను' అన్నారు కళ్ళజోడు క్రిందగా జారిన  రెండు కన్నీటి ధారలు తుడుచుకుంటూ అన్నారు.
'ఈ అబ్బాయి ఇంట్లోవాళ్లకి ఈ పెళ్లి విషయం తెలుసా' ? అనడిగారు నాన్నగారు.'
నాన్నగారి ముఖంలోకి చూడలేక నేను సమాధానం చెప్పలేదు.
'శశాంక్' కల్పించుకుని  'తెలుసండీ... వాళ్ళే చేశారు పెళ్లి', అన్నాడు .
'అలాగా'... అంటూ నా వంక చాలా బాధగా చూశారు  నాన్న.
ఆయన ' చూపు' నా గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. విల విల్లాడుతూ బాధగా తలవంచుకోవడం మినహా నేను ఏమీ మాట్లాడలేకపోయాను. నాకు ఇప్పటికీ నాన్నగారి 'ఆ చూపు' గుర్తుంది.
ఆ 'చూపు'లోని  భావాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
' ఏం తప్పు చేశానని మాకు ఈ శిక్ష వేశావు' అని  ఆయన నన్నుగుచ్చి, గుచ్చి అడిగినట్లుగానే అనిపించింది నాకు.
'చాలా పెద్ద తప్పు చేశాను' అని చాలాసార్లు అనుకున్నాను.
'దాని నగలు దానికిచ్చేయ్' అంటూఅమ్మతో చెప్పి లోపలి కెళ్ళి నేను వెళ్ళిన దాకా బయటకు రాలేదు.
ఆక్షణంలో నేను నా అప్పటి నిర్ణయంతో ఆ ఇంటికి పరాయిదాన్నయిపోయానని భావించాను. స్వతంత్రించి నాన్నగారితో ఎప్పటిలా మాట్లాడలేదు. అమ్మ అయితే అరుస్తూనే వుంది, తట్ట్టుకోలేక పోయింది.
నా నగలన్నీ నాకిచ్చేసింది అమ్మ.
తొమ్మిది సంవత్సరాల కింద అమెరికా బయలుదేరే ముందు ఫోన్లో నాన్నతో మాట్లాడి నప్పుడు ఒక్కటే అన్నారు.
'నన్ను మోసం చేసిన వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం వుండదమ్మా'! ఆ సంగతి నీకు బాగా తెలుసు.
'ఇదే చివరిసారి, ఇక ఎప్పుడూనాతో  మాట్లాడాలని ప్రయత్నించకు. నన్నుబాధ పెట్టకు. నేను తట్టుకోలేను.
మనింటికి ....కాదు ..మాఇంటికి  చాలా మంది వచ్చి వెళుతుంటారు. వాళ్ళ లాగా నిన్నుఆ అతిధి కోవలో చూడలేను. నిన్ను పరాయిదానిలా చూడడం నావల్ల కాదు'.'ఇంతటితో మమ్ముల్ని వదిలేయ్.
పిల్లా, పాపలతో కల కాలం హాయిగావుండు.
'ఇకఎప్పుడూ  నాదగ్గరికి  రావద్దు...రావడానికి ప్రయత్నం కూడా చేయకు'.
నువ్వు కులాంతర వివాహం చేసుకున్నావని కాదు ఈ ఆంక్షలు.
'నన్ను శత్రువుకన్నాఎక్కువ మోసం చేశావు, అందుకని నిన్ను క్షమించలేను.
నీకు మేము లేము అనుకుని నువ్వు నీ స్వంత  నిర్ణయాలు  తీసుకున్నావు. అలాగే స్వతంత్రం గానే వుండు'.
అని చాలా కరకుగా మాట్లాడారు నాన్నగారు
తరువాత మరి నాన్నగారితో మాట్లాడ లేదు. నేను చేసిన తప్పు నన్ను నీడలా వెంటాడుతూనే వుంది.  కని పెంచిన వారిని,తోబుట్టువును వదిలేసి నా స్వార్ధం చూసుకున్నాను.
అందుకే జీవితంలో నా వారంటూ లేక ఒంటరి పక్షినయ్యాను.
చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాను.
ఇప్పడు హైదరాబాద్ వెళ్తున్నాము.
'భగవంతుడా... కరుణించి నాన్నగారి మనసుమారేలా చూడు. నాకు వాళ్ళు కావాలి' దేవుడి ముందు నిలబడి మనస్పూర్తిగా నమస్కరించాను.
*****

నాన్నగారు  వాళ్ళు  వుండేది అమీర్ పేట లో.
మేము ఉండబోయేది హై దగ్గర టెక్ సిటీ 'గచ్చిబౌలి'లోనట.
ఇంతలో చిన్నది నిద్ర లో  లేచి మంచం దిగి 'డాడీ...డాడీ' అంటూ  ఆగకుండా  వెళుతూనే వుంది.
ఒక్క అంగలో దాన్ని  అందుకుని  'క్రిబ్' లో పడుకో బెట్టాను. వెంటనే నిద్రపోయింది.
పెద్దవాడు బాబు. ఆరు సంవత్సరాలు. చిన్నదానికి మూడు సంవత్సరాలు. పెద్దవాడు మంచి నిద్రలో వున్నాడు.
టైము చూశాను. రాత్రి ఒంటి గంట అయింది.  'శశాంక్' ఇంకా పనిచేసు కుంటున్నాడు.
'ఇక లే....పడుకో శశాంక్ , తెల్లారితే ప్రయాణం' అని చెప్పి వచ్చి పడుకున్నాను.
*****

'లుఫ్తాన్సా' ఎయిర్ లైన్స్  విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో  ఆన్ టైం లేండ్ అయింది. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలన్నీ ముగించుకుని  సూట్ కేసులన్నీ తీసుకుని బయటకు వచ్చేసరికి దాదాపు రెండయింది.
'శశాంక్' వాళ్ళ తమ్ముడు వచ్చాడు ఎయిర్ పోర్ట్ కి. కంపెనీ  కారు వచ్చింది. లగేజి అంతా  సదిరి  డ్రైవర్ బయలుదేరాడు.
శశాంక్ వాళ్ళతమ్ముడు,' సాయి'  మరో కారులో  మావెనకే వచ్చాడు. కంపెనీ వాళ్ళు మా కోసం  లీజుకు తీసుకున్న ఇంటికే వచ్చాము. నాలుగు బెడ్ రూముల ఫ్లాటు. మూడో అంతస్తు. చాలా బాగా వుంది. బాగా ఖరీదైన ఇంటీరియెర్ ! పక్కనే ఏదో  స్టేడియం !
ఎటు చూసినా మంచి 'వ్యూ' ఉన్న ఫ్లాటు. శశాంక్ వాళ్ళ తమ్ముడిని  వుండమన్నాడు. అతను మళ్ళీ ఉదయం వస్తానని వెళ్ళాడు. అందరం  అలసి పోయామేమో వెంటనే నిద్ర పోయాము.
కాలింగ్ బెల్ మోతకు దిగ్గున లేచాను. టైం చూశాను. ఉదయం పది  గంటలు దాటింది . బాబోయ్, ఎంత నిద్ర పోయాము అనుకుంటూ లేచాను. జుట్టు సరిచేసుకుని తలుపు తీశాను.
శశాంక్ వాళ్ళ  తమ్ముడు అతని భార్య అనిత. 'అక్కా 'బెల్, తలుపు చాల సేపునుంచి కొడుతున్నాం.' సారీ, అక్కా నిద్ర పాడు చేశినట్లున్నాం'.
'భలేదానివి'! రండి, పిల్లలు సరైన తిండి తిని పాపం రెండు మూడు రోజులైంది. ముందు వాళ్లకి ఏమైనా తినడానికి చేయాలి' అన్నాను లోనికి నడుస్తూ. 
'శశాంక్ కూడ ఆకలికి అసలు ఆగలేడు! ఇప్పుడేమి చెయ్యాలి '? అని ఆలోచిస్తూ  లోపలి కొచ్చాను.
'అక్కా, ఇప్పడు, ఏమి చేయాల్సిన పని లేదు... మేము వస్తూ, టిఫెన్లు హోటల్ నుంచి , భోజనం ఇంటి నుంచి తీసుకుని  వచ్చాము'.
'ఇంకా రెండు మూడు రోజులు నేను భోజనం పంపిస్తాను. నువ్వేమి వంట మొదలెట్టకు.
ముందు సెటిల్ కండి కంగారేమీ లేదు.' అంది అనిత.
లేదు, అనితా, అంత అవసరం లేదు' ఇవాళ ఒక కుర్రాడు వస్తాడు.
'వంటా, ఇల్లు అన్నీ తనే చూస్తాడట. నేను జాబు మానేసాను. పిల్లలతో కుదరడం లేదు.
అయ్యో, అంత డబ్బు ఎందుకు వదులుకోవడం, ఇక్కడ నాలుగయిదువేలు ఇచ్చామంటే వంట,ఇల్లు శుభ్రంచేయ డానికి మనిషి దొరుకుతుంది. నువ్వు హాయిగా జాబులో చేరవచ్చు, అక్కా' అంది అనిత.
'లేదు, అనితా, పిల్లలు కొద్దిగా పెద్ద అయిందాక నేను మళ్ళీ జాబు చేయవద్దని ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నాము'.
శశాంక్ వాళ్ల కంపెనీ  వైస్ ప్రెసిడెంటుగా వచ్చాడు ఇక్కడికి. నేను కూడా జాబు చేయవలసిన అవసరం కూడా లేదు'
'మీరు  కూర్చోండి' అనివాళ్ళకి  సోఫా చూపించి నేను బెడ్ రూమ్ లోకి వచ్చిశశాంక్ ని, పిల్లల్నిలేపాను.
లేవడమే ఆలస్యం 'మామ్' ఆకలి అని గొడవ మొదలెట్టారు.
పిల్లలు, శశాంక్  బ్రష్ చేసుకుని  టిఫెన్ తినేశారు. శశాంక్ వాళ్ళతో  కాసేపు మాట్లాడి 'లేప్ టాప్'   ముందేసుకుని కూర్చుని, ఫోన్లో మాట్లాడుతున్నాడు. కొద్ది సేపటికి ఇద్దరు మనుషులు వచ్చారు. ఒకరు కుక్,ఇంకొకరు బోయ్ !
'ఏమైనా, పని వుంటే చెప్పండమ్మా'  అనడిగారు. కుక్ ఉదయం, సాయంత్రం రెండు పూటలా వస్తాడట.
తెలుగు వాళ్ళే. బానే వుంది అనుకున్నాను.
సాయంత్రానికి కూరలు, సామానులు ఏమి కావాలనో లిస్టు రాసిస్తే, క్రిందనే షాపు ఉందట వారే సామానులన్నీ తెస్తారట.
'కుక్' నే లిస్టు తయారు చేయమన్నాను.  అతను 'లిస్టు' తయారు చేసి ఇచ్చాడు.
నేను కొన్నికలిపి 'లిస్టు' షాపు కు పంపించాను.
వెంటనే శశాంక్ కి చెప్పాను. కొంత కేష్ కావాలని. పని కుర్రాడు చెప్పాడు కిందనే ATM వుందని.
అబ్బ హైదరాబాద్ ఎంత మారిపోయింది అనుకున్నాను. శశాంక్  క్రిందకు  వెళ్లి కేష్ తెచ్చాడు, వస్తూనే షాప్ లో డబ్బు ఇచ్చి వచ్చాడు.
అనితకు చెప్పాను. ఇక భోజనం పంపించవద్దని.వాళ్ళుసాయంత్రం వరకు వుండి వెళ్లారు.
*****

అప్పుడే వారం రోజులయింది హైదరాబాద్ వచ్చి. పిల్లలు సెటిల్ అయ్యారు.
వాడికి స్నేహితులు బాగానే తయారయ్యారు.
ఇదే కొద్దిగా స్లో. క్రిందనే  సమ్మర్ స్కూల్ కూడ పెట్టారు. ఇద్దరినీ చేర్పించాను. 
స్విమ్మింగ్ క్లాసెస్ కి కూడ వెళుతున్నారు. క్రిందనే మంచి ఆట స్థలం వుంది.
వీడి ఈడు పిల్లలు చాల మంది వున్నారు.
ఆదివారం. శశాంక్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. వంటతనితో టిఫెన్, వంట రెండు తయారు చేయిస్తున్నాను. కానీ మనస్సు ఎక్కడోవుంది. వారం రోజులయింది వచ్చి. ఇంతవరకు ఎవరినీ కలవ లేదు.
నేను వస్తున్నట్లు ఎవరితోనూ చెప్పలేదు. అమ్మవాళ్లకి పరిచయమున్నస్నేహితులు ఇంకా ఎవరు హైదరాబాద్ లోఉన్నారా అని అలోచించాను... ఊహూ...ఎంత అలోచించినా ఉన్నది ఆ ఇద్దరే.
వాళ్ళ 'పేరెంట్స్' కూడ అమ్మా వాళ్లకి పరిచయమే. వాళ్ళ ఇళ్ళు తనకి తెలుసు.
ముందు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అడ్రస్ లు తెలుస్తాయి.ముందు వాళ్ళని కలవాలి.
ఈ రోజు ఎలాగైనా వెళ్ళాలి అని దృడంగా మనస్సులో అనుకున్నాను.
ఇంతలో శశాంక్ పిలిచాడు.
'మేడం, టిఫెన్ అయిందాఅని'. టిఫెన్ టేబుల్ మీద పెట్టి శశాంక్ తో చెప్పాను.
'ఇదుగో... శశి, మాట.....ఇవాళ నేను ఇంట్లోనే వుంటాను. పిల్లల్ని చూసుకుంటాను.
ఏదైనా పని వుంటే వెళ్ళు,కారు, డ్రైవరు రెడీ' అన్నాడు శశాంక్.
తను మనస్సులో ఏమి ఉంచుకుని చెప్పాడో అర్ధం అయింది నాకు.
ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చిగదిలోకి వచ్చితలుపు వేసుకున్నాను.శశాంక్ నా వెంటనే లోనికి వచ్చాడు.
'ఏయ్, శశీ... ఇలా చూడు. నాకు తెలీదా, నీ బాధ' దగ్గరికి తీసుకుని వీపు రాస్తూ అన్నాడు శశాంక్ .
ఒక్కసారిగా బోరు మంది తను!
కంగారు పడి పోయాడు శశాంక్.
కళ్ళు తుడిచి .... వెళ్లి కలిసిరా 'అల్ ది బెస్ట్' ...! తరువాత నేను వస్తాను' అన్నాడు శశాంక్.
నేను కొద్దిగా తిని త్వరగా తెమిలి  బయలుదేరాను.
ముందుగా 'లావణ్య' వాళ్ళ పేరెంట్స్ వాళ్ళింటికి వెళ్లాను, శ్రీనగర్ కాలనీ.
వాళ్ళాయన తలుపు తీసి నేను చెప్పింది విని, 'ఓ మీరా'అన్నాడు నన్నుఅదోలా చూస్తూ లావణ్యని పిలిచాడు.
అది నన్నుచూసి బిత్తరపోయి, 'ఏంటే, ఎప్పుడొచ్చావు' ? ఎక్కడ దిగావు? బాగున్నావా?
ఎన్నిరోజులయిందే నిన్ను చూసి! అంది గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది.
'నేను వచ్చి వారం రోజులయింది. మా ఆయన కంపెనీ ఇక్కడ ఆఫీసుకు ఇండియన్ ఆపరేషన్స్ కి 'ఇన్ చార్జ్' గా వచ్చారు. ఇక్కడే గచ్చిబౌలిలో ఇల్లు తీసుకున్నాము. అందరమూ 'ఇండియా'కి వచ్చేశాము.
సరేనే, అమ్మావాళ్ళేరీ' మీరు ఇక్కడ ఉన్నారేంటి ?  నాపేరు చెప్పగానే, మీయన అదోలా ముఖం పెట్టాడేంటే ?  కొంపతీసి నామీద ఏమైనా మోశావేంటి' ? పాత రోజులు గుర్తుకి తెచ్చుకుంటూ వరుసగా ప్రశ్నమీద ప్రశ్న వేస్తూ అన్నాను.
'ఛీ', అదేంటే అలా అంటావు'? అంది, లావణ్య.
'అమ్మావాళ్ళు అన్నయ్య దగ్గర అమెరికా లోనే ఉన్నారు. వాళ్లకి 'గ్రీన్ కార్డు' వచ్చింది. నువ్వు వెళ్ళిన రెండేళ్లకే వాళ్ళు అమెరికాకి వచ్చారు.....మమ్ముల్నిఈ ఇంట్లోకి 'షిఫ్ట్' కమ్మన్నారు.
తను చెప్పేదానికి 'బ్రేక్' వేసి ఆపి సరేనే..... మిగతా సంగతులన్నీ తరువాత మాట్లాడుదాం'!
'ముందు మా అమ్మావాళ్ళ సంగతి చెప్పు! నువ్వువాళ్ళని కలిసి ఎంత కాలమైంది' ?
వాళ్ళంతా ఎలా వున్నారు? 'తమ్ముడేమి చేస్తున్నాడు? డాడీ, ఎలావున్నారు'?
'ఆగవే, నేను చెప్పేది విను'.....'నేను మీ పెళ్లి అయిన  ఓ సంవత్సరం తరువాత అనుకుంటా నా పెళ్లికి పిలవడానికి వెళ్లాను.
'మీ అమ్మ నా ముఖం వాచేలా చివాట్లు పెట్టింది. నేను పారిపోయి వచ్చేశాను.
వాళ్ళు పెళ్ళికి కూడా రాలేదు. తరువాత మళ్ళీ నేను వారిని కలవ లేదు'.
'లత' కేమైనా తెలుసేమో నాకు తెలీదు.'
'అదిచాలా మారింది. ఇప్పుడది  పెద్ద సోషల్ వర్కర్. ఇంట్లో దొరకడం కష్టమే! టూర్లు వెళుతూ వుంటుంది.
'ముందు దానికి ఫోను చేద్దాం. అది వుంటే ఇద్దరం వెళదాం' అంది లావణ్య.
'అయితే దాని ఫోను నంబరు నాకు ఇవ్వు. అని నంబరు తీసుకుని, కొద్దిగా సేపు మాట్లాడి వీలున్నప్పుడు కలుస్తాను' అని లేచాను నేను.
'అయ్యో, అదేంటే అప్పుడే వెళతావా'? భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకుందాం' అంది లావణ్య.
'లేదే... ఇప్పుడు నాకు వేరే పనుంది. తరువాత తీరిగ్గా కలుద్దాం. ఇక్కడే వుంటాను కదా ' అని బయలుదేరి
కారు దగ్గరకి వచ్చి డ్రైవర్ తో' బాబూ,అమీర్ పేట వెళ్ళాలి' అన్నాను.
పది నిముషాల్లో 'అమ్మా అమీర్ పేట వచ్చామమ్మా', అన్నాడు డ్రైవర్. బయటకు చూస్తూనే వున్నాను.
మెయిన్ రోడ్డు చాలా మారి పోయింది. ముందుకు వెళ్లి అక్కడ లెఫ్ట్ కి వెళ్ళు' ఇక వంద గజాల్లో మా ఇల్లు.
గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. వళ్ళంతా చెమటతో తడిసి పోయింది.
'డ్రైవర్ బాగా మెల్లగా వెళ్ళు' అన్నాను.
'ఏందమ్మా'?.నా మాట గొంతు దాటి రాలేదని అర్ధమైంది. గొంతు పూర్తిగా గీర పోయింది.
కూడ తీసుకుని 'మెల్లగా వెళ్ళు' అన్నాను.
'సరే అమ్మా', అని బాగా మెల్లగా వెళ్తున్నాడు.
కుడి పక్కన 'గల్లీ' లోకి తిప్పి ప్రక్కన ఆపమన్నాను.ఇల్లు అలాగే ఉంది. బాగా పాత బడింది.
పోషణ లేని మనిషిలా, మోడైన చెట్టులా, జరిగిన విషయాలకి సాక్షిలా అలా నిలబడి ఉంది.
'రంగు వేసి ఎన్ని సంవత్సరాలయిందో' అనుకున్నాను.
గేటు పక్కనే ఒక వెలిసి పోయిన పాత బోర్డు. "ప్రభుత్వ  బాలల సంరక్షణాలయం" డిపార్ట్ మెంట్  అఫ్ సోషల్ వెల్ ఫేర్, గవర్నమెంటు అఫ్  AP., బోర్డు చదివి కారు దిగి లోనికి వెళ్లాను.
'ఎవరూ కావాలమ్మా' ? అని అడిగాడు నన్ను, వాచ్ మెన్ లా వున్నాడు.
'ఇక్కడ వెంకటరావుగారు వాళ్ళు ఉండాలే' ? వాళ్ళ ఇల్లు కదా ఇది,
'అదేందమ్మా... చానా సంవత్సరాలు అయినాది నేను ఈడ ఉండబట్టి'...ఈడ  దిక్కులేని పిల్లలుంట రమ్మ'.
మళ్ళీ తనే ఆలోచించుకుని ' అయిదారు సంవత్సరాలు అయినట్లున్దమ్మా! అప్పటి నుంచి నేనే ఉన్ననమ్మా'.
'మీరు అడిగేటోళ్ళు ఎవరూఈడ లేరమ్మా' అన్నాడు వాచ్ మెన్.
పక్కన ఇంటి వాళ్ళను కనుక్కుందామంటే అటు,ఇటు రెండు వైపులా అపార్ట్ మెంటులు కట్టేశారు.
అంత అయోమయం. అగమ్యగోచరం. ఏమీ తోచడం లేదు. తల తిరిగి పోతోంది.
'సరేలే బాబూ' అని చెప్పిమళ్ళీ ఇంటి వంక చూసి  కారు ఎక్కిఇంటికి వచ్చాను.
నాకు తెలీకుండానే కళ్ళనుంచి నీరు చిందుతోంది. 'హేంకీ' తో కళ్ళు తుడుచుకున్నాను.
'ఏం దమ్మా... కళ్ళలో దుమ్ము పడిందా'? అనడిగాడు డ్రైవర్.
నేనేమీ సమాధానం చెప్పలేదు.
మనసు, మనసులో లేదు, భారంగా వుంది .
'ఏమయ్యారు...అమ్మా,నాన్నా'? మనసేదో కీడు శంకిస్తోంది.
'లేదు, లేదు, ఎక్కడికైనా 'షిఫ్ట్' అయి వుంటారు' మనసుకు సర్ది చెప్పాను.
అయినా సరే మనసు ఊరుకోవడం లేదు.'షిఫ్ట్' కావడమేమిటి' ? సొంత ఇల్లు కదా!అంది నా మనస్సు.
'అవునూ, ఇల్లు వదిలి ఎక్కడి కెళ్ళి నట్లు'? దీనికంతా నేనే కారణమా? మనసు తొలిచేస్తోంది.
తల పగిలిపోయేలావుంది, పిచ్చిఎక్కేలా వుంది. 'అమ్మో, పిల్లలు, శశాంక్' మనసు హెచ్చరించింది.
వెంటనే స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి దేవుణ్ణి  మనస్పూర్తిగా ప్రార్ధించాను.
శశాంక్ పిల్లలిద్దరికి అన్నం తినిపించాడు. ఏమయింది అన్నట్లుగా  నావంక ప్రశ్నార్ధకం గా చూసాడు.
నేను మౌనంగానే సమాధానం చెప్పాను ఏమీ కాలేదని!
'ఏమిటి , ఏమయింది, శశీ'? అంటూ దగ్గరి కొచ్చాడు,శశాంక్.
'మా ఇంటిలో ఓ అనాధ శరణాలయం వుంది' అదీ అయిదారు సంవత్సరాల నుంచి అక్కడే ఉందట', అక్కడ వాచ్ మెన్ చెప్పాడు.
'ఆ ఇంటికి అటు,ఇటు కూడ అపార్ట్ మెంటులు కట్టారు. పాత వాళ్ళుఎవరు కనిపించలేదు'.
ఒక ఫ్రెండ్ ని కూడ కలిశాను.తనకి ఏమీ తెలియదంది.ఇంకొక ఫ్రెండ్ ని  కలవాలి''.
'తనకేమైనా తెలుసేమో కనుక్కోవాలి'. సరే గాని,'నువ్వు తినేశావా'? అని శశాంక్ ని అడిగి నేను కాసేపు పడుకుంటానని చెప్పి వచ్చి బెడ్ మీదకు చేరాను.
మళ్ళీ లేచి లావణ్య ఇచ్చిన ఫోను నంబరు తీసి, 'లత'  నంబరు డయలు చేశాను.
'హలో, ఎవరూ'.........అవతలి గొంతు గుర్తు పట్టాను.
వేరే పరిస్థితి అయితే కాసేపు ఆట పట్టించే దాన్నే.
'ఏయ్, లతా,ఎలా ఉన్నావే'? అన్నాను నేను ఎవరో చెప్పకుండా.
'ఎవరు, మాట్లాడేది'? అవతల గొంతులో  అసహనం!
నేను, 'శిశిర' ను అన్నాను.
'ఎవరూ'?
'నేనే, లతా.....'శిశిర' ను'.
'గాడ్...నువ్వా...ఎక్కడనుంచి... ఇండియాకి  ఎప్పుడొచ్చావు'? అంది 'లత'.
హైదరాబాదు లోనే వున్నాను. లావణ్య దగ్గర నుంచి నీ నంబరు తీసుకున్నాను.
'నువ్వు ఎక్కడున్నావు'? అడిగాను నేను.
నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. జుబిలీ హిల్స్ లో ఇల్లు అడ్రస్ చెప్పింది.' ఓ, పాత ఇల్లే' అనుకున్నాను.
'నేను గంటలో వస్తానే, ఫరవా లేదా? రావచ్చా'? అన్నాను నేను.
'రా...త్వరగా వచ్చేయి! వెయిట్  చేస్తుంటాను' అంది హుషారుగా లత.
ఒక గంటలో వస్తానని శశాంక్ తో  చెప్పి వెంటనే బయలు దేరాను.
క్రిందకు వచ్చేసరికి డ్రైవర్ లేడు. లంచ్ కి వెళ్లాడేమోనని అక్కడ ఉన్నసెక్యూరిటీ వాళ్ళని అడిగాను.
'ఇక్కడే బయట బడ్డీ కొట్టు దగ్గరుంటాడమ్మా, 'చాయ్ తాగనీకి పొయిండేమో'ఇప్పుడే పిలుస్తా', అని సెక్యూరిటీ అతను వెళ్లి పిలుచుకొచ్చాడు.
'అమ్మా, చాయి తాగుదామని ఇప్పుడే ఎల్లినానమ్మా' అన్నాడు డ్రైవర్.
'ఫరవాలేదు... జూబిలీ హిల్స్ వెళ్ళాలి' అని కారెక్కి డోర్ వేశాను.
వెంటనే బయలు దేరాము, అడ్రస్ చెప్పాను డ్రైవర్ కి.
పదిహేను నిముషాల్లోనే,  'వచ్చిన మమ్మా' ఇదే ఇల్లు అన్నాడు డ్రైవర్. ఇల్లు గుర్తు పట్టాను.
చదువుకునే రోజుల్లో చాలా సార్లు వచ్చాను.
ఇంటికి పెద్ద గేటు. సెక్యూరిటీ అతను అడిగాడు 'మీరు ఎవరమ్మా? ఎవరు కావాలి'? అని.
నాపేరు చెప్పాను. సెల్యూట్ చేసి గేటు తెరిచాడు, కారుని కూడ లోనికి పంపించాడు.
ఇంటి ముందు పెద్ద గార్డెన్. అందంగా వుంది. అంతా  తిరిగి  చూడాలనిపించినా ఇప్పుదు కాదులే అనుకున్నాను.
ఇంటి వైపు చక చకా నడిచాను.
లత బయటే వుంది.' ఏయ్,శశీ...ఎలావున్నావే'? పరుగెత్తిట్టుగానే వచ్చిఒక్కసారిగా కౌగలించుకుంది.
ఇద్దరమూ కాసేపు అల్లాగే ఉండి పోయాము.
'పదవే... ఇంట్లోకి వెళ్లి మాట్లాడు కుందాం.'అంది లత.
'అమ్మా, నాన్నా' వాళ్ళు ఇక్కడే వున్నారా? ఇంటిలోనికి నడుస్తూ  అడిగాను నేను.
'అందరం ఇక్కడే ఉన్నాము. అందరం బాగానే  ఉన్నాము. నేనింకా పెళ్లి చేసుకోలేదు. చేసుకోను'.
'అన్నయ్య, వదినా, పిల్లలు అందరు ఇక్కడే వున్నారు. చాలా ? ఇవన్ని ఎలాగు అడుగుతావని ముందే చెప్పేశాను'!
'కాఫీ, టీ, కూల్ డ్రింకా ఏం తాగు తావే'? అంది తన గదిలోకి నడుస్తూ.
అదే గది. కాఫీ తాగుదామే అన్నాను నేను.
పై నుంచి రెండు కాఫీ తెమ్మని పురమాయించింది!
నేనే మొదలెట్టాను. వచ్చివారమయిందని, ఫ్యామిలీ విషయాలు, లావణ్యను కలిసింది అన్నీ క్లుప్తంగా చెప్పాను.
'లత' కూర్చున్న దల్లా లేచి కిటికీ దగ్గరికి వెళ్లి 'లాన్' లోకి చూస్తూ అంది.
'శశీ'  అమ్మను కలిసావా? అని అడిగింది లత.
'లేదు...కలవలేదు ఇంకా! కలుద్దామని ఇంటికోసం వెళితే అక్కడ వాళ్ళు లేరు.సరికదా ఆజాగాలో
అపార్ట్ మెంట్ కట్టారు'.
'అక్కడ ఎవరిని అడిగినా అమ్మా వాళ్ళ సంగతి ఎవరికీ తెలీదన్నారు'.
'వాళ్ళ సంగతి కనుక్కుందామనే నీ దగ్గరికొచ్చాను' నాకసలు దిక్కు తోచడం లేదు.
'తొమ్మిది సంవత్సరాలు అయింది'వాళ్ళని కలిసి. 'నా అంత దురదృష్ట వంతులేవరైనా ఉంటారా'?
'ఎంత మంది ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు'?  కలిసి పోలేదు ?
'అంతా నా దురదృష్టం'.
'ఆ,ఆ...సరే...ఆపు తల్లీ... అందరి నుదుటా ఒకటే వ్రాయడు, కదా ఆ...దేవుడు' అంది లత.
ఇంతలో కాఫీ వచ్చింది ..ఇద్దరం తాగాము.
'అమ్మ' వృద్ధాశ్రమంలోఉంది. కేశవగిరి దగ్గర !
నా కాళ్ళ క్రింద  భూమి జారి పోతున్నట్లు అనిపించింది అమ్మ వృద్ధాశ్రమంలో వుందని వినగానే.
'లత' నన్ను చూడకుండా కిటికి లో నుంచి  బయటకు చూస్తూ  చెపుతోంది ఇంకా.
'మొన్నీమధ్యనే వెళ్ళింది తను అక్కడికి. ఇదివరకు నుంచే ఆ ఆశ్రమంలో 'సేవ' చేస్తు వుండేది'.
'మీ తమ్ముడు రెండు నెలల క్రిందనే అమెరికా వెళ్ళాడు MS చేయడానికి'.
తను అటు వెళ్ళగానే అమ్మ ఆశ్రమానికి మకాం మార్చేసింది. 'తను అక్కడ చాలా పేరున్న వ్యక్తి. 
పేరు అంటే దాదాపు ఆశ్రమం నడపడంలో తనది చాల చురుకైన పాత్ర.
'తను ఒక్క రోజు అక్కడ లేకున్నాఆ వెలితి పూడ్చలేనిది అంటారు అక్కడి నిర్వాహకులు అందరూ'.
అంత మంచి పేరు తనకి అని ముగించింది లత.
నాకళ్ళ వెంట ధారలు కారుతున్నాయి కన్నీరు. తుడుచుకునేందుకు కూడ ప్రయత్నం చేయ లేదు తను.
తేరుకుని, 'సరే నాన్నగారు ఎక్కడ వున్నారు'?' అసలు అమ్మ ఆశ్రమం లో చేరడమేమిటి'?
'శశీ' నాకు నువ్వు చాలా సార్లు ఫోను చేశావు. నాకు తెలుసు. ఇక్కడ సంగతులు నీకు చెప్పినా, నువ్వు బాధ పడడం మినహా చేయ గలిగింది దేమీ లేదు. అందుకే కొన్ని విషయాలు నీ నుంచి దాచాను.
'మీ అమ్మా, నాన్నా, నిన్ను పూర్తిగా మరిచి పోయారు'.
నువ్వంటూ ఒక కూతురివి వున్నావని కూడ ఉచ్చరించడానికి కూడా వాళ్ళు ఇష్ట పడలేదు.
నువ్వు వెళ్ళిన తరువాత అమ్మని చాలా సార్లు కలిశాను.
నువ్వు వెళ్ళిన కొద్ది నెలలకే మీ నాన్నగారు వ్యాపారం మానేశారు.
ఇల్లు ప్రభుత్వానికి, ప్రత్యేకంగా, అనాధ పిల్లల సంరక్షణాలయం, పెట్టాలని షరతు పెట్టి 'డొనేట్' చేశారు.
ఉన్న డబ్బంతా తమ్ముడి పేరున, తన చదువుకి కావలసినదంతా బ్యాంకులో వేశారు.
ఇప్పుడు అమ్మ ఉన్న ఆశ్రమానికి కూడ కొన్ని లక్షలిచ్చారు.
అక్కడ వంద మందికి పైగా వృద్ధులు,దిక్కులేని వయసు మళ్ళినవారుంటారు. అమ్మ చెప్పింది.  నువ్వు వెళ్ళినతరువాత కొన్నినెలలు పాటు మీనాన్నగారు నిద్ర పోలేదట.
ఎప్పుడూ నిన్ను గురించే అలోచించే  వారట.
'నేను దానికి ఏం తక్కువ చేశాను'? ఏనాడు అది అడిగింది కాదనలేదే? ఇలా ఎందుకు చేసింది.
నా పెంపకం లోనే ఏదో పెద్ద తప్పు వుంది. నేనే ఏదో తప్పు చేశాను. లేకుంటే నాకూతురు అలా చేసి వుండేది కాదు, అని కుమిలి, కుమిలి ఏడ్చేవారట. విపరీతంగా బాధ పడేవారట.
ఆరోగ్యం చెడింది. నేను చూశాను. చిక్కి శల్య మయ్యారు. నీకు చెపుదామంటే ఎట్టి పరిస్థితిలోనూ  నీకు ఇక్కడి విషయాలు ఏమీ చెప్ప వద్దని  తన మీదనే  ప్రమాణం చేయించారు నాతో. 
తరువాత, నీ వెళ్ళిన సంవత్సరం, కొన్ని నెలల్లోనే ఆయన పోయారు.
తరువాత మీ అమ్మగారు కూడా నీకు ఇక్కడి ఏ విషయం కూడ నీకు చెప్పవద్దని నాదగ్గరమాట తీసుకున్నారు.
అలాగయితేనే నన్ను ఇంటికి రమ్మన్నారు. అప్పుడు నాకనిపించింది.
సంగతులు నీకు చెప్పేదానికన్నాబాధలో ఉన్న'వారికి' దగ్గరగా ఉండడమే మేలనిపించింది.
మా నాన్నగారు కూడా చెప్పారు...వెంకటరావు కూతురుకి చాలా 'అట్టాచ్డ్' కదా...లతా అతను ఈ 'షాక్' నుంచి కోలుకున్న దాకా వాళ్ళింటికి వెళ్తూఉండమని !
ఒక విధంగా, నీ పెళ్లి, మీ కుటుంబం, జీవితాలలో  అనుకోని మార్పులు తెచ్చింది.
'నా ఈ ప్రస్తుత జీవితానికి కూడా నాంది పలికాయి. అంటే నేనేదో సన్యాసిని అయ్యాను నీవల్ల అనడం లేదు.
నాకిష్టమైన జీవితం గడుపుతున్నాను. నేను నాపట్ల, నాజీవితం పట్ల పూర్తి అవగాహనతో చాలా సంతోషంగా ఉన్నాను. ఒక విధంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ప్రస్తుత జీవితంతో పది మందికి సాయ పడుతున్నాను.
కొన్ని దారి తప్పిన జీవితాలకు మార్గదర్శకం చేస్తున్నాను. నా జీవితంలో ఒక స్థిర నిర్ణయం తీసుకోవడానికి నీ జీవితం నాకు మార్గదర్శక మైంది. అంటే నిన్నుతప్పుపడుతున్నానుకోవద్దు. నువ్వు అంతగా ప్రేమించిన తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు.
నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళినంత మాత్రంతో ఏదో  జరిగిపోయింది....మాజీవితం ఇక వ్యర్ధం. అనుకుని చేజేతులా కుటుంబాల్నినిర్లక్ష్యం చేసుకోవడం లాటివి పెద్దవాళ్ళ తప్పు.
సరే ఇక ఆ విషయం ఇక వదిలేయ్.
అన్నట్లు మరిచి పోయాను...ఇంకో ముఖ్య మైన విషయం.
మీ తమ్ముడు నువ్వెప్పుడైనా నాకు తారసపడితే ఇవ్వమని ఒక లెటరు ఇచ్చాడు.
వాడు మొన్న అమెరికా వెళ్ళేటప్పుడు ఇచ్చివెళ్ళాడు.వాడు MS చేయడానికి అమెరికా వెళ్ళాడు.
వాడు నన్ను'అక్కా'అని పిలుస్తాడు.నీ పిల్లల్నినిన్ను,శశాంక్ ని,నాదగ్గర ఫోటోలలో చూస్తూనే వున్నాడు.
వాడునాకో సొంత తమ్ముడే.వాడి విషయాలు కూడ కొన్నినీకు చెప్పాలి. కానీ ముందు వాడు నీకు ఇమ్మని ఇచ్చిన    లెటరు ఇస్తాను. అది చదువు.ఇంకా వాడి విషయాలు  కావాలని పిస్తే అప్పుడు చెపుతాను అని వెనక్కి తిరిగి 'శిశిర' వంక చూసింది లత.
రెండు చేతులతో ముఖం కప్పుకుని ఏక ధారగా ఏడుస్తోంది 'శిశిర'.
ఆక్షణంలోతనో దుఃఖ దేవత లా కనిపించింది
'ఏయ్, శశీ, ఏమిటది, తమాయించుకో'. అయిందేదో అయింది.అంతా విధి వ్రాత.
'లత.... ఏమిటి, వేదాంతం ఏమిటి' ? అనుకుంటున్నావా'? నేను అప్పటి లత ను కాను'.
'ముందు ఈ నీళ్లు తాగు, అని గ్లాస్ ఇచ్చింది. పక్కనే కూర్చుంది. భుజాల చుట్టూ చేతులు వేశింది.
వీపు  రాస్తూ వుంది. చిన్న పిల్లలా ఒదిగి పోయాను దాని వళ్ళో, పెద్దగా ఏడ్చేశాను.
బాధలో వున్నప్పుడు ఎవరైనా కొద్దిగా సానుభూతి చూపిస్తే, కన్నీళ్లు ఇదిగో మేము వున్నాం, అని ఇలావర్షిస్తాయి.
పిచ్చి 'శశీ' ఇదే జీవితం.....అని లేచి  తన బీరువా నుంచి ఒక అంటించి ఉన్న కవరు ఇచ్చింది.
కవరు మీద  ఎర్ర అక్షరాలతో రాసి వుంది." అక్క కాని అక్కకు" క్రింద
"దిక్కులేని తమ్ముడు" అని వ్రాసి వుంది. నా మనసే కాదు. వళ్ళంతా చాలా భారమైంది.
ఆ కవరు అటు, ఇటు  తిప్పి చూస్తున్నాను. దాని తెరిచి చదివే ధైర్యం లేదు.
'శశీ, ఇప్పుడు చదవకు. ఇంటికి వెళ్లి మెల్లగా చదువు'. ఒక్కటి గుర్తుంచుకో... మంచి స్నేహితురాలిగా ఒక సలహా...
'ఈ విషయాల ప్రభావం నీ కుటుంబం మీద పడకుండా చూసుకో.తప్పులు చేస్తాం.మనం చేశే తప్పుఇంత పెద్దదా?
ఇన్ని జీవితాలమీద ప్రభావం ఉంటుందా? కొన్ని జీవితాల గమనం మారుస్తుందా? అన్న ఆలోచన ముందే వస్తే మనం తప్పులు చెయ్యం కదా. అందుకే మళ్ళీ మళ్ళీ గట్టిగా చెబుతున్నా'!
ఈ విషయాల ప్రభావం నీ కుటుంబం మీద అస్సలు పడ కుండాచూసుకో... నేను చెప్పడమే కాదు! నిన్ను హెచ్చరిస్తున్నాను".
'తమ్ముడి లెటరు కూడ నువ్వు కొద్దిగా కుదుట పడ్డాక చదువు'.
అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇవాళ ఇంక కుదరదు కాని రేపు వెళదాం.
రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేను నీ దగ్గరికి వస్తాను. తయారై వుండు'.
'శశీ, బయలుదేరు. రేపు కలుద్దాం'. నా ముఖం లోకి  సూటిగా చూస్తూ అంది లత.
మంత్ర  ముగ్ధలా లేచాను.
ఏమీ మాట్లాడ లేదు.వెళ్లి కారెక్కాను.'ఇంటికి వెళదాం' అన్నాను డ్రైవర్ తో..
అర్ధగంటలో ఇంటికి వచ్చాను. లత చెప్పిన మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి.
లేని హుషారు తెచ్చు కున్నాను. ముఖం మీద ఖేదం కన్పించకుండా జాగ్రత్త పడ్డాను.
బయటి  తలుపులు దగ్గరికి వేసి వున్నాయి. లోపలకి వెళ్ళానో లేదో, పిల్లలు చుట్టేసుకున్నారు.
'ఎక్కడికి వెళ్ళావమ్మా, ఇంత సేపు' మేము నీ కోసం ఎంత వెతికామో తెలుసా'? అన్నాడు బాబు.
శశాంక్  'లేప్ టాప్ ' తో  సహా బయటకు  వచ్చాడు.
''అదేంటి శశాంక్ పిల్లల్ని చూసుకుంటానన్నావు" ఏమిటి వీళ్ళ గోల అన్నాను మామూలుగా
ఏమీ లేదు. ఇప్పడి దాకా నాతోనే ఆడు తున్నారు.
ఈ 'వెధవ' అమ్మ కూచి, వందసార్లు అడిగాడు ఎక్కడికి వెళ్ళావని.
వాడు నేను 'వీ' గేము ఆడాము  చాలా సేపు. అది నిద్ర పోయి ఇప్పుడే లేచింది. అంతా మామూలే.
'సరే గాని వెళ్ళిన పని ఏమయింది'? కలిశావా అందరిని ? అని చూపుల తోనే అడిగాడు.
రెండు క్షణాలు ఆలోచించాను,' ఏమి చెప్పాలా'? అని.
నేను మౌనంగానే ఉండడంతో ...
'సరే, మేడం, మీ ఇష్టం వచ్చ్హినప్పుడు చెప్పండి' అన్నాడు శశాంక్. నా మౌనానికి అర్ధాన్ని వెతుక్కుంటూ.
'అదేం లేదు', శశాంక్. ఇప్పుడు కాదు! రాత్రికి చెపుతాను, అన్నాను లోగొంతుతో.
'ఒక్కటి చెప్పు' అంతా బావున్నారా'?
'లేదు'.. ' తరువాత చెపుతానన్నాను కదా'.
వేడిగా కాఫీ తాగి, వెళ్లి తలంటుకుని స్నానం చేసి పిల్లలకి డిన్నర్ పెట్టేసి వచ్చి హాలులో 'శశాంక్' దగ్గర కూర్చున్నాను.
'భోజనం చేయలేదు, ఆకలిగా లేదా'? అన్నాడు శశాంక్.
'ప్చ్...... లేదు, శశాంక్. ఆకలి లేదు....మనశ్శాంతి లేదు'....కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతూంటే తుడుచుకుంటూ, అన్నాను.
ఊహించని ఈ పరిణామాలతో...ఉక్కిరి, బిక్కిరి అవుతున్నాను 'శశాంక్'.
'నాన్నగారు పోయారు'... వ్హాట్? తను దిగ్గున లేచాడు. ఒళ్లోని 'లేప్ టాప్'  క్రిందకు జారింది.
దాన్నిక్రింద పడకుండా పట్టుకుని సోఫాలో పెట్టి, 'ఏమైంది...ఎప్పుడు'? ఎలా? అని ఆరాతీశాడు చాల బాధతో ఆత్రుతగా .
''అమ్మవృద్ధాశ్రమంలో చేరింది.తమ్ముడు అమెరికా వెళ్ళాడు"అంది 'శిశిర',
శశాంక్ అడిగిన ప్రశ్నకు సమాధాన మివ్వ కుండానే!
'సారీ, శశీ, ఐ యాం ఎక్స్ట్రీమ్లీ  సారీ .....ఓహ్...గాడ్ ...వాట్ యు అర్  అప్ టు'' ? అని పైకి అంటూనే  తనుకూడా రెండు చేతులతో
తలపట్టు కుని ఒక్కసారిగా సోఫాలో కూలబడ్డాడు. 'శిశిర' వంక సూటిగా చూడలేక పోతున్నాడు.
ఇంత జరగడానికి నేనుకూడా బాధ్యుణ్నేకదా అన్నబాధతో తల తరిగి పోతోంది.
'శిశిర' కళ్ళలో నీరు ప్రవాహంగా ధారలుగా స్రవిస్తూనే వుంది.తను వంచిన తల ఎత్తలేదు.
నా వల్ల  నావాళ్ళు చెట్టు కొకరు, పుట్టకొకరు అయ్యారు. కుటుంబం కూలి పోయింది..
ఇంకా చెప్పాలంటే పచ్చని కుటుంబం మోడై పోయిందన్నభావన విపరీతంగా బాధిస్తోంది.
ఇప్పుడు చేయడానికి ఇంక మిగిలిందేమీ లేదు. బాధ పడి ప్రయోజనం లేదు.
'శశాంక్......' అమ్మని కలిసి  తను ఒప్పుకుంటే మనింటికి తీసుకువస్తాను.'ఏమంటావు'? అంది 'శిశిర'.
'శశాంక్' తల ఎత్తి 'సారీ'...శశీ, మన పెళ్లి వల్ల  దుష్పరిణామాలుంటాయని కలలోకూడా ఊహించలేదు.
'సారీ....వెరీ,వెరీ సారీ....మన పెళ్లి తో మీ కుటుంబం ఇంతగా 'డామేజి' అవుతుందన్నఊహ కూడాలేదు.
'అలాకాదు 'శశీ', తను ఒప్పు కుంటే తీసుకురావడం కాదు. తనని తీసుకు రావడం మినహా మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు'.
మనవల్ల ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంవల్ల ఆవిడ ఆశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది'.
'ఇలా... ఎవరికీ జరగ కూడదు'.
'నేను కూడా వస్తాను...మీ అమ్మగారి దగ్గరికి'. ఆవిడను నువ్వొప్పించ లేకపోతే నేను ప్రయత్నం చేస్తాను.
అది కూడ చేయకపోతే మనం మనుషుల కింద లెక్కరాము. ఈ బాధ మన  జీవితాంతం నీడలా వెన్నంటే వుంటుంది. ఆ బాధ భరించడం నావల్ల కాదు. నీ వల్ల అసలే కాదు. మనం ఆవిడను ఒప్పించి తీసుకు రావాల్సిందే" ధృడంగా  అన్నాడు శశాంక్.
'లేదు, శశాంక్, అమ్మరాదు, మన దగ్గర వుండదు. తన మనసు విరిగి పోయింది' నాకు తెలుసు.
'నాకు ఈజన్మకు ఈ బాధనుంచి విముక్తి లేదు'. అంది 'శిశిర' నిర్వేదంగా!
'ఎందుకు అంత నిరాశ, నిర్వేదం.'ఆశ లేక పోతే మనిషే  లేడు '!
'మనది అత్యాశ కాదు' తెలియక తప్పులు చేశాం, 'దిద్దుకోవడానికి  మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాం'.
'అధైర్య పడకు, అమ్మని తప్పక తీసుకు వద్దాం'. అన్నాడు శశాంక్.
శశాంక్ మాటలు టానిక్ లా పనిచేశాయి. 'శిశిర' కు కొద్దిగా ధైర్యం వచ్చింది.
తమ్ముడి లేఖ చూపించడమా, లేదా, మనస్సులోనే తర్జన, భర్జన పడుతోంది 'శిశిర.'
'ఇదిగో, ఇప్పుడేగా చెప్పాను, మళ్ళీ ఏమిటా ఆలోచన'? సర్దుకొని, ఏమీలేదు శశాంక్.
'రేపు నీకు కుదురుతుందా రావడానికి' ?
లత, వస్తానంది, తనే అమ్మదగ్గరికి తీసుకెళ్తానంది. ఉదయం ఎనిమిది గంటలకల్లా తయారుగా ఉండమంది.
'ఆశ్రమం చాలా  దూరమట. ఎక్కడో కేశవగిరి దగ్గరట'! అంది 'శిశిర'.
'కేశవగిరి దగ్గరా... ఆశ్రమం ? అబ్బో, చాలా దూరం' నేను వస్తాను, 'సరే, పిల్లల సంగతి? ఓ పని చేద్దాం. అందరం కలిసే వెళదాం', తనే అన్నాడు శశాంక్.
'మరి నీ ఆఫీసు? నా ఆఫీసు నాకు వదిలేయ్, నీకెందుకు చింత' ? సరేనా! అని 'లేప్ టాప్'  ముందేసుకుని పనిలో పడ్డాడు శశాంక్.
తను చెప్పింది బాగానే వుందనిపించింది. అయినా మనసులో ఏదో శంక. ఎందుకయినా మంచిది.
లతతో చెపుతే మంచిది కదా, అని ఫోను చేసింది. ఎంతకూ తను ఫోను ఎత్త లేదు.
'భోజనం చేద్దాం' శశాంక్ ఆకలవుతోంది అంది శిశిర.
'నువ్వు తినేయ్ శశీ, ప్లీజ్, నాకు పని వుంది నేను కాసేపాగి తింటాను'.
శిశిర భోజనం త్వరగా ముగించేసి, చేసి పిల్లల గది లోకి వెళ్లి, దుప్పట్లు సరిచేసి,
గదిలోకి వచ్చి తమ్ముడి లేఖ తీసింది.
కవరు తెరిచి బెడ్  మీద పడుకొని చదవడం ప్రారంభించింది.

                                  'అక్కా', నిన్నుఇలా సంభోదించడం కూడా నాకు ఇష్టం లేదు. అయినా సరే, ఎంత కాదనుకున్ననువ్వు నా అక్కవే కదా. లతక్కే నాకు నిజ మైన'అక్క' అయితే బాగుండు అని చాలాసార్లు అనిపించింది. కానీ దేవుడు మనం అనుకున్నవన్నీఇవ్వడుగా. నీ లాంటి వాళ్ళు దేవుడితో పోట్లాడి అయినా కావలసింది సాధించుకోగలరు. నాకు అంత శక్తి లేదు. నేను తనకి చాలా ఋణపడి వుంటాను. జీవితంలో నేను మనిషిగానిలబడి ఈ రోజు MS  చేయడానికి  అమెరికా వెళుతున్నానంటే
ఇదంతా తన చలవే! నిజంగా నువ్వంటే నాకు కోపమేమీ లేదు.
నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికొచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఆరోజు నుంచి మొదలయింది నా పతనం.
నాన్నగారు ఆరోజు తరువాత మళ్ళీ మామూలు మనిషి కాలేక పోయారు. ఇల్లు నరకం.
ఒకళ్ళతో ఇంకొకరు మాట్లాడే వాళ్ళం  కాదు. ఉన్నది ముగ్గురం. ఎప్పుడు చూసినా భయంకర నిశ్శబ్దం.
ఓ పండుగా లేదు. ఓ 'సెలేబ్రేషను' లేదు.నేను మాట్లాడినా ఏదో ముక్తసరిగా మాట్లాడే వాళ్ళు.
డబ్బుకు తక్కువ లేదు.నాన్నగారు అడగ్గానే ఇచ్చేవారు. జాగ్రత్తగా చదువుకో, అనేవారు. ఇదొక్కటే మాట అయన నాతో చనిపోయే వరకు మళ్ళీ,మళ్ళీమాట్లాడిన మాట. అమ్మకు,పూజలు,ఆశ్రమాలు. నాన్నగారు ఇల్లు దానం ఇచ్చేశారు. వేరే ఇంటికి మారేము. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే వాడిని.
నాకు కాకూడని అలవాట్లు అయ్యాయి.ఒక సారి మోటర్ సైకిల్  ఆక్సిడెంట్ అయింది.
లతక్క వాళ్ళఅన్ననన్నుహాస్పిటల్ లో చేర్పించారు.అక్క నన్ను చూడ్డానికి వచ్చేది.
నాకు ట్రీట్ మెంటు చేశారు. అక్క నాకు  గాయాలు తగ్గిన  తరువాత
మూడు నెలలు వేరే చోట 'రిహేబిలిటేషన్' ట్రీట్ మెంటు ఇప్పించింది.
నీ పెళ్ళయిన  దగ్గరనుంచి నీవు 'లతక్క'తో కాంటాక్ట్ లో వున్నట్లు, నువ్వు తనతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లుగా కూడా అక్క చెప్పింది. కానీ నేనే ఎప్పుడూ నీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు.
ఈ లెటరు నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వస్తేనే నీకు ఇమ్మని చెప్పాను. ఈపాటికి నీకు సంగతులన్నీ తెలిసి వుంటాయి. జరిగిన ఈ పరిణామాలన్నిటికీ నువ్వే బాధ్యురాలివని నేను అనడం లేదు.
ఈ విషయమై  నేను, లతక్కా చాలా సార్లు వాదించుకున్నాము. తను నువ్వు బాధ్యురాలివి కాదని 'లతక్క' ఎప్పుడు వాదించేది. ఈ విషయం ఎప్పుడూ నాకూ అర్ధం అయి కానట్లుగానే వుండేది. దాన్ని అలాగే వదిలేశాను. మనం ఎప్పుడయినా కలుస్తామా లేదా అన్నది కూడ నాకు ఊహకు అందని విషయం.
అందుకే అన్నీ కాలానికి వదిలేయడమే మంచిది! నీ పిల్లలని,శశాంక్ గారిని అడిగినట్లు చెప్పగలవు.
ఇక వుంటాను.
తమ్ముడు.
                                     * * * * *

                                        లత ఉదయం  సరిగ్గా ఎనిమిదిగంటలా కల్లా వచ్చింది. 
'పరిచయమేమి అవసరం లేదు' నాకు తను, నేను తనకి తెలుసు కదా!'శశీ, అంది లత.
'హాయ్, లతా! ఎలా వున్నారు' ? అడిగాడు శశాంక్.
'ఐ  యాం  ఫైన్' అంటూ... ఇన్ని సంవత్సరాల తరువాతనా ఇండియా కి వచ్చేది? అంది లత సరదాగా.
ఒకసారి మావాళ్ళు వచ్చారు. నేను ఒక్కసారి వచ్చాను ఇండియా కి' కానీ నాకు ఈ విషయాలేమీ తెలియలేదు'..
'శశి' మాత్రం ఇదే రావడం మా పెళ్లి అయ్యాక, అన్నాడు శశాంక్ నొచ్చుకుంటూ.
'కాని 'లతా' మీరు చాలా అన్యాయం చేశారు మాకు.... తనతో కాంటాక్ట్ లో ఉండి కూడా ఇక్కడ విషయాలు ఏమీ తనతో చెప్పలేదు'...అన్నాడు సీరియెస్ గానే శశాంక్.
'నేను....కల్పించుకుని లేదు...శశాంక్...అమ్మా వాళ్ళు ఇక్కడి విషయాలు నాతో ఏమీ చెప్పవద్దని తనతో చెప్పారట'......
'అయితే మాత్రం....తను నీ ఫ్రెండ్ కదా...అంత పెద్ద సీరియెస్ విషయం, అదే...మీ నాన్నగారు చనిపోయిన విషయం  కూడా...చెప్పలేనంత దాపరికమా' ? మీరు...ఆ ఒక్క సంగతైనా తనకు చెప్పాల్సింది'.....తను జీవితాంతం బాధపడే విషయమది'....నిక్కచ్చిగా అన్నాడు శశాంక్.
శశి వారించ బోయి ఏమనుకుందో ఊరుకుండి పోయింది.
'నిజమే....అది నాతప్పే....వాళ్ళ కిచ్చిన మాట ఈ ఒక్కవిషయం లో నేను ఖాతరు చేసి వుండాల్సింది కాదు ....శశాంక్...అనేది కరెక్టే! 'నాది తప్పే...ముమ్మాటికి  పెద్ద తప్పే'నొచ్చుకుంటూ తప్పును ఒప్పుకుంటూ అంది 'లత'.
'సారీ...లతా...మిమ్ముల్నినొప్పించాలని కాదు...నాకే ఆవార్త  విన్నాక పెద్ద షాకు.
'ఇక 'శిశిర' విషయం వేరే చెప్పాలా'? అన్నాడు శశాంక్.
'సరే,...ఇక బయలుదేరుదామా'? అంది లత.
'లతా'.... పిల్లలూ, శశాంక్ కూడా వస్తారు,అమ్మదగ్గరకు'....' అంది 'శిశిర'.
'నేనూ అదే చెబుదామని అనుకుంటున్నా' అంది లత.
'అందరం మా కారులో వెళ్దాం అన్నాడు', శశాంక్.
దాదాపు గంట పైన పట్టింది...ఆశ్రమం చేరే సరికి.
కారు లోన పార్క్ చేశి అందరం దిగాము. మళ్ళీ యధాప్రకారం నాకు గుండె దడ మొదలయింది.
నేను బాబు చేయి పట్టు కుని నడుస్తున్నాను. శశాంక్ పాపని నడిపిస్తున్నాడు.
ఆశ్రమం చాలా ప్రశాంతంగా వుంది. త్రోవ రెండు వేపులా చెట్లు. కొన్నిచాలా పెద్ద చెట్లు. వాటి మొదళ్ళ  చుట్టూ అరుగులా  కట్టారు.
ఆ అరుగుల మీద కొందరు కూర్చుని, ముడుచుకుని పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు.
కొందరు న్యూస్ పేపర్లు చదువుతున్నారు. కొందరు 'కేరమ్స్' ఆడుతున్నారు. చిన్నచిన్న కుటీరాల్లా కట్టారు.
ఆశ్రమం చాల పెద్దది. రెండు మూడు పెద్ద బిల్దింగులు కూడ వున్నాయి. లత ఆఫీసు వైపు నడుస్తోంది.
లోపలి దాదాపు వంద గజాలు నడిచి ఉంటాము. పాపని ఎత్తుకుని నడుస్తూ నన్నేగమనిస్తున్నాడు శశాంక్.
'లత' ఆఫీసు లోనికి వెళ్లి రెండు మూడు నిముషాలయింది.
తను ఒక్కతే తిరిగి వచ్చి మమ్ముల్నిఒక  రూముకి  తీసుకు వచ్చింది.
లోపల చల్లగా వుంది చుట్టూ చెట్లు వుండడం వల్ల అనుకుంటాను. రెండు బెడ్స్, ఒక టేబులు,రెండు కుర్చీలు వున్నాయి లోపల. బాత్ రూం కూడ వుంది.రూము చాలా శుభ్రంగా వుంది. నాకు మనసంతా ఉద్విగ్నంగావుంది. అమ్మ ఎలా రియాక్ట్  అవుతుందో, నేను ఎలా రియాక్ట్ అవాలో అర్ధం కావడం లేదు. దానికి తోడు ఒకటే బాధ.
'అమ్మముఖం లోకి ఎలా చూడగలవు'? అని మనసు ఒకటే ప్రశ్నిస్తోంది.
పావుగంట పైన అయింది. ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు.ఎవరో కుర్రాడు వచ్చిమంచినీళ్లు,టీ,బిస్కట్స్ఇచ్చివెళ్ళాడు. ఇంతలో బయటనుంచి మాటలు వినబడ్డాయి. ఒకరి మాట అమ్మదే. గుర్తించాను.
రెండోవారు వెళ్ళిపోయారు. అమ్మలోనికి వచ్చింది. ఆమె ముఖం ప్రశాంతంగా వుంది. ఎటువంటీ భావనా ముఖంలో నాకు కనుపించలేదు. నాకు ఏడుపు ఆగడం లేదు.
కళ్ళ వెంట నీరు కారుతూనే వుంది.
'శిశిరా' బావున్నావా...అమ్మా' ?
ఇద్దరు పిల్లలు కదా...లత చెప్పింది.
'బావున్నావా బాబూ? ఎప్పుడు వచ్చారు హైదరాబాదు? శశాంక్ ని అడిగింది అమ్మ.
శశాంక్ వంగి అమ్మ కాళ్ళకు నమస్కరించి పిల్లలిద్దరితోను నమస్కారం చేయించి 'అమ్ముమ్మ' అని చెప్పాడు.
అమ్మ పాప దగ్గరకు వెళ్లి , 'నీ పేరేంటి తల్లీ' ?అని అడిగింది. అది వాళ్ళ నాన్న కాళ్ళని చుట్టేసుకుంది.
'నీ పేరేంటి బాబూ'? బాబుని అడిగింది అమ్మ. 'వెంకట్' అన్నాడు వాడు స్పష్టంగా...అమ్మా నాముఖం వేపు చూసింది.
అమ్మ కలివిడి చూసి నాకు దుఃఖం   పొంగుకు వచ్చింది.
నేను నాకు తెలీకుండానే లేచి అమ్మా కాళ్ళు  చుట్టేసుకుని 'నన్ను క్షమించమ్మా'....అని బోరుమన్నాను.
అమ్మ చాలా సున్నితంగా మందలిస్తూ 'లే' శిశిరా..లే...ఏమిటిది?  పిల్లలు భయ పడతారు.అంటూ
భుజాలు పట్టు కుని లేపింది నా వీపు రెండు చేతులతో నిమురుతూ. ఆ క్షణం నేను పొందిన ఆనందం
అనిర్వచనీయం. నేను కళ్ళు  తుడుచుకుని .... 'అమ్మా..క్షమించమని అడిగే హక్కుకూడా లేదు నాకు'.
'నా మూలంగానే ఇంత జరిగింది' అన్నాను నేను బాధగా తలవంచుకుని.
'ఎందుకు అలా అనుకుంటున్నావు'...?
'ఇలా జరిగేవన్నీమనవల్ల ... మనుషుల వల్ల జరిగాయనుకుంటే ఇక దేవుడు...సృష్టి...అంతా మనచేతుల్లో
ఉన్నట్లే గదమ్మా'మనం చాలా అనుకుంటు ఉంటాము.
'అనుకున్న వన్నీకావు....అనుకోనివన్నీఆగవు కదా 'శిశిరా'......
"మీ లాగా ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు ? అందరికీ ఇలాగే అయిందా.... కాదు"
'ప్రతిమనిషి నొసటన  ఏమి వ్రాసివుందో అదే జరుగుతుందమ్మా. విధివ్రాత అనుభవించక తప్పదమ్మా'..
'తెలియక ఎన్నో అనుకుంటువుంటాం.......అల్పులం కదమ్మా'...అన్నది అమ్మ చాలా మామూలుగా.
అమ్మ మాట్లాతున్నంతసేపు   అమ్మనే  చూస్తూ వున్నా...
''నేనిప్పుడే మళ్ళీ  వస్తాను.....  పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకు వస్తాను, అంటూనే  బయటకు వెళ్ళింది అమ్మ.
నాకు నెత్తి మీదనుంచి వేయి ఏనుగుల బరువు దించి నట్లయింది. మనసు కొద్దిగా కుదుట పడ్డది.
ఒ పావు గంట తరువాత అమ్మ వచ్చింది. అందరికి టిఫెన్లు వచ్చాయి.
'అమ్మా! నీతో కొద్దిగా మాట్లాడాలి...నువ్వెంత  కాదన్నానేను చేసిన తప్పుకు, దాని ఫలితంగా నాన్నను పోగుట్టుకున్నాను. తమ్ముడు,నువ్వు, మన కుటుంబం కోల్పోయిన దానికంతా.....నేనే బాధ్యు రాలిని ....నేను తప్పించు కోవడానికేమీ ఎవ్వరి మాటలు ఆసరాగా తీసుకోను. ఎవరు కాదన్నా నాకు  నేను దోషినే'...దానికి ఫలితం అనుభవించాల్సిందే!
లత, శశాంక్ ఇద్దరు లేచి బయటకు వెళ్ళడానికి  ఉద్యుక్తులయ్యారు.
ఎవరు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. లతా, శశాంక్ రండి అన్నాను నేను.
"అమ్మా...నీతో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు"
'నేను,శశాంక్...నిన్నుమాతో ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాం' నువ్వు ఇక మాతోనే వుండాలని మాకోరిక!
"అవును... ఆంటీ, మా తెలిసీ తెలియని నిర్ణయంతో ఏమి  కోల్పోయామో... కోల్పోయిన దాకా తెలవ లేదు.
మమ్ముల్ని మేము క్షమించుకోలేని ఈ క్షణం  వస్తుందని ఎప్పుడూ వూహించలేదు.
మమ్ముల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు.
దానికి పరిహారంగా మిమ్ముల్ని మాదగ్గరికి రమ్మని అంటున్నామని మీరు అనుకోవద్దు.
మిమ్ముల్ని కాపాడు కోవడమే మా బాధ్యత".
'ఇప్పటికే జీవితంలో ఎంతో కోల్పోయారు మీరు. ఇక నైనా మీరు సంతోషంగా వుండాలని మాకోరిక.
అందుకే మీరు ఇక్కడ అంతా సెటిల్ చేశాక మా దగ్గరికి రావాలని మా కోరిక.మీరు దయచేశి  రాను అనవద్దు " వేడికోలుగా అన్నాడు శశాంక్.
'శిశిర' కృతజ్ఞాతా పూర్వకంగా చూసింది శశాంక్ వంక.
'పిల్లలూ, వినండీ. నేను ఇందాక చెప్పాను, ఇదివరకు 'లత' తో చాలాసార్లు చెప్పాను.
'శిశిర' అంటే నిజంగా నాకు కోపం ఏమీ లేదు. అప్పుడే మైనా అని ఉంటె అది ఆక్షణం వరకే.
జరగవలసినది జరిగింది. అందులో మీ తప్పు, నాతప్పు అని ఏమీ లేదు. ఎవరి కర్మ ఎలావ్రాసివుందో అలా జరిగింది. జరుగుతుంది. ఇది వేదాంతం కాదు. ఈ విషయం లో మీకు నేను ఇప్పుడు ఇంత కంటే ఏమీ చెప్పదలుచుకో లేదు'.
'ఇక మీ దగ్గరికి వచ్చి వుండటమంటారా, ఇక్కడ నాకు చాలా బాధ్యతలు వున్నాయి.
దిక్కులేని వాళ్ళు ఈ ఆశ్రమంలో చాలామంది ఉన్నారు. ఇక్కడి విషయాలన్నీ 'లత' కు విపులంగా తెలుసు.
పిల్లలు పట్టించు కోని తల్లులు, తండ్రులు, ఎవరూ లేని అనాధలూ,అన్నీవుండి ఆదరణ కరువైన వాళ్ళు ఇలా చెబుతూపోతే  వినడానికే మీకు బాధగా వుంటుంది '.
"ఇదంతా విన్నాక కూడా నేను మీ దగ్గరికి వచ్చి వుండాలని మీరు కోరుకుంటే నా ఈ కుటుంబానికి నేను అన్యాయం చేసిన దాన్నవుతాను.  ఇంకొక విషయం నిర్మొహమాటంగా చెపుతాను.
ఇక్కడ వీళ్ళందరికీ నా అవసరం వుంది. నా కోసం, నేను సుఖంగా వుండడం కోసం, నేను ఇప్పుడు ఎక్కడికీ రాలేను. నా కేమి బాధల్లేవు. నాకు ఇక్కడ మనశ్శాంతి వుంది, కొంతమందికి మనశ్శాంతి కల్పిస్తున్నామని మా విశ్వాసం.
ఈ రాక తో, మీ పిలుపుతో నన్ను, నావిశ్వాశాన్ని సడలించే ప్రయత్నం చేయకండి.
'మీ ఇంటికి వస్తాను వీలున్నప్పుడు. నా ఈ జీవితం ఈ ఆశ్రమానికే అంకితం'.
'మళ్లీ, మళ్ళీ చెబుతున్నాను 'శిశిరా' నీ మీద నాకు 'కించిత్' కోపం కూడా లేదు'.
జరిగిన దానికి నువ్వే బాధ్యురాలివని బాధ పడడం మానెయ్. నీ తప్పేమీ లేదు.
ఇదివరకు నేను ఆ మాట అని ఉంటె ఆరోజు, ఆక్షణంలో ఆవేశంలో అన్నమాటలే అవి.
వాటినన్నిటిని మరిచిపో. నేను ఇప్పుడు చెపుతున్న ప్రతి మాట నిష్కల్మషంగా చెపుతున్నవే.
'ఇంకొక విషయం 'శిశిరా'. తమ్ముడు యు.ఎస్. వెళ్ళాడు తెలుసుకదా.
వాడి భవిష్యత్తు ఇక మీ బాధ్యత.
'వాడితో మాట్లాడుతాను...నీతోమాట్లాడమని, నీతో కాంటేక్టు ఉండమని చెబుతాను'.
'శిశిరా'.....'ఇది పిల్లలకి'....అంటూ ఒక కవరు ఇచ్చింది అమ్మ, నా చేతికి. ఇక వెళ్తాను. నాకు పనులున్నాయి.
అని తను వెళ్లి పోయింది. అమ్మలో ఎంత మార్పు. ఎంత ప్రశాంతత.
"గాడ్ ...  అయ్ ఏం గ్రే ట్ఫుల్ టు  యు" అనుకుంటూ  అమ్మ వెళ్ళిన వేపు అలా చూస్తూ ఉండి పోయాను,శశాంక్ నన్ను భుజం తట్టిన దాకా.

రచన:-  
కేశిరాజు వెంకట వరదయ్య.
mob.no..9849118254






















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి