'పంచతంత్ర' కధలు-శ్రీ విష్ణుశర్మ గురించి
- - - - - -- - - - - - - - - - - - - -- -- - - -- - ------------
'పంచతంత్ర' కాల్పనిక కధలను ' విష్ణుశర్మ అనబడే భారతీయ పండితుని రచనలుగా వాసికెక్కాయి. ఈ కధలు దాదాపు క్రీ.పూ. 1200 - 300 సంవత్సరముల మధ్య వ్రాయబడిన రచనలుగా మేధావుల మరియు చరిత్రకారుల అంచనా.
కొందరు పండితులు,చరిత్ర కారులు విష్ణుశర్మ పండితుడు 3.వ. శతాబ్దం లో జీవించిన పండితుని గా గుర్తించారు. 'విష్ణుశర్మ' పండితుని అనువాద రచనలయిన ఈ 'పంచతంత్ర' కధలు ప్రపంచ చరిత్ర లోనే మత ప్రసక్తి లేని లౌకిక రచనలుగా ప్రసిద్ధి చెందాయి.
'పంచతంత్ర' కధలను మొదటిగా క్రీ.శ. 570 సంవత్సరములో మధ్య 'పర్షియా' భాష లోనికి పర్షియన్ రచయిత 'బోర్జుయా' వీటిని అనువాదము చేయగా ' కలీల -దిమ్న' కధలుగా ప్రాచుర్యము చెందినవి. క్రీ.శ.750 సంవత్సరములో పర్షియా ప్రజల రచయిత ప్రసిద్ధి చెందిన అబ్దుల్లా బిన్ ముఖఫా 'అరబిక్ భాష' లోనికి అనువాదము చేసెను. అరబ్బు దేశములోని 'బాగ్దాదు' నగరమందున రెండవ ఖలీఫా చే ఆవిష్కరింప బడిన ఈ 'పంచతంత్ర' అనువాద కధలు 'ఖురాను' తరువాత రెండవ స్థానమాక్రమించి మిక్కిలి ప్రసిద్ధి చెందినవి. 11 వ. శతాబ్దపు మొదలు లోనే 'పంచతంత్ర' కధలు ఐరోపా దేశమునకు చేరి 16.వ. శతాబ్దము వరకు గ్రీకు, లాటిన్, స్పానిష్, ఇటాలియన్, జర్మన్, ఇంగ్లీష్, పురాతన మత ప్రార్ధనల భాష లోనికి, తూర్పు ప్రాచ్య దేశ భాషల లోనికి అనువదింపబడి ఐరోపా దేశమున బైబుల్ తరువాత అంతటి ప్రజాభిమానము చెందిన కధలుగా పేరొందినవి. ఆపైన 'విష్ణుశర్మ' కధలు 'జావా' ద్వీపము నుంచి 'ఐస్ ల్యాండ్' ద్వీపము వరకు చేరినవి. ఫ్రెంచి దేశములో మిక్కిలి ప్రాచుర్యము చెందిన 'లా ఫాంటైన్' కధల పుస్తకములో 11- పంచతంత్ర కధలు చోటుచేసుకున్నవి.
'పంచతంత్ర' కధల మూలముగా చెప్పబడే ఒక కధలో దక్షిణ భారత దేశమందున్న'అమరశక్తి' అను రాజు 'మహిలారోప్య' అను రాజ్యమును పరిపాలించుచుండెను. ఆరాజుకు ముగ్గురు కొడుకులు. వారు మిక్కిలి బుద్ధిహీనులై, తెలివితక్కువ వారై ఉండిరి. అందుకు రాజు బహు చింతించుచూ మంత్రులతో సమా చన చేసి ఆ ముగ్గురు యువరాజులను 'విష్ణుశర్మ' అను పండితుడైన గురువు వద్దకు పంపి వారిని 'బుద్ధిమంతులు' చేయప్రార్ధించెను.అప్పటికే విష్ణుశర్మ 80 ఏళ్ల ముదుసలి కానీ పెక్కు శాస్త్రములలోప్రావీణ్యుడే కాక రాజకీయ కోవిదుడు, దౌత్య నీతిజ్ఞుడు. అందుచేత రాజు 'విష్ణుశర్మ' ను పిలిపించి తన కుమారులను గొప్ప పరిపాలకులుగాలుగా, బుద్ధిమంతులుగా తీర్చిదిద్దమని అందుకు 'విష్ణుశర్మ' కు నూరు 'గ్రామములు' కోరినంత బంగారమును బహుమతి గా ఇచ్చెదనని ప్రకటించెను. అందుకు 'విష్ణుశర్మ' రాజు గారు ప్రకటించిన బహుమతులను సున్నితముగా తిరస్కరించి 'ఆరునెలల' వ్యవధిలో యువరాజులకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దెదనని లేనిచో తన పేరు మార్చుకొనెదనని ప్రకటించెను. అనతికాలముననే బుద్ధిహీనులయిన యువరాజులకు
తర్ఫీదు నిచ్చుట, వారిని బుద్ధిమంతులు చేయుట అంత సులభముకాదని వారికి సాంప్రదాయ శిక్షణ సరికాదని ఏదైనా కొత్త కాల్పనిక పధ్ధతిలో బోధించవలెనని గ్రహించెను. అందుమొదలు సరికొత్త కల్పిత మైన చక్కటి కధలతో, ఆకధలలో జంతువుల పాత్రలతో అందు అయిదు భాగములుగా చేసి వారికి సంస్కృతములో విద్యా బుద్ధులు నేర్పుట మొదలిడెను. ఆ ఐదు భాగములు 'ఐదు తంత్రము'లుగా అనగా 'పంచ తంత్రము'లుగా వారికి నేర్పెను. అవి సంస్కృతములో 1) మిత్రబేధము 2) మిత్ర సంప్రాప్తి 3) సంధి 4) నిగ్రహం మరియు
5) అపరీక్షితకారకం. ఈ 'ఐదు' తంత్రములు ప్రతి మనిషి ప్రపంచములో మంచి పౌరునిగా, తెలివిగా జీవించుటకు కావాల్సిన సూత్రములగాను, వ్యూహరచనా సిద్దాంతములుగాను చెప్పెను. ఆ 'ఐదు' తంత్రములను కల్పిత కధలతో వారికి ప్రపంచ జ్ఞానము, రాజకీయ శాస్త్రము, కార్యనిర్వహణ బోధపడేలా బోధించి వారిని బుద్ధిమంతులుగా, మంచి పరిపాలకులుగా తీర్చిదిద్దెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి