లేబుళ్లు

2, మే 2012, బుధవారం

సింగిల్ మదర్ (single mother)

సింగిల్ మదర్  (single mother)
***********************

ఏ రోజైనా సరే ఒక్కసారి తీరిక చేసుకుని హైదరాబాదులో 'హైటెక్' సిటి దగ్గర సైబర్ టవర్స్, శిల్పారామం, మాదాపూర్, కొండాపూర్ పరిసరాల్లో ఉదయం కాని సాయంత్రం కాని ఏదో ఒక చక్కటి ప్రదేశం చూసుకుని కాసేపు అటు, ఇటు దృష్టి సారించండి. మెళ్ళోబాడ్జ్, ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని నడుచుకుంటునో, ఆటోలోనో, స్కూటీ మీదనో,కారు లోనో జుయ్యి, జుయ్యి ..... మంటూ వెళ్ళే 20 - 40 సంవత్సరాల మధ్య వయసులోనున్న ఆడవారు చాలా మంది కన్పిస్తారు. వారి కట్టు, బొట్టు తీరు నిశితంగా గమనించండి. భారత దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచే కాక విదేశీ మహిళల్ని కూడ గమనిస్తాం. చక్కటి మినీ భారత్ లా కన్పిస్తుంది. అంటే భారత దేశంలో ప్రతి జాతి, తెగ,మతానికి సంభంచించిన మనుషులు కన్పిస్తారు. అదీ... మన 'హైదరాబాద్' నగర ప్రాశస్త్యత. సరిగ్గా ఇలాంటి దృశ్యాన్ని నేను ' న్యూయార్క్' నగరంలో గమనించాను. న్యూయార్క్ నగరంలో ఏదైనా ముఖ్యకూడలి లో కాసేపు సాయంత్రం నిలబడితే చాలు. ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి, తెగ, మతాలకి సంభందించిన మనుషుల్ని చూడవచ్చు. ఇంతకీ ఆ 'హైటెక్ సిటి' పరిసరాల్లో కన్పించే యువతులంతా బహుశా ఏ కంప్యూటర్ ఇంజినీర్లో, కాల్ సెంటర్ ఉద్యోగులో లేక వేరే ఇతర ఉద్యోగులో అయిఉండవచ్చు. వీరే గాక దేశంలో పనిచేశే మహిళల్లో చాలామందికి వేళగాని వేళల్లో పని. అర్దరాత్రి లేదు, అపరాత్రి లేదు. చెవిలో మొబైల్ , వళ్ళో లేప్ టాప్
పెట్టుకుని ఇంటా, బయట ఎడతెగని పని. కుటుంబంతో కలిసి పట్టుమని వారానికి ఒక్క రోజు కలిసి గడపడం కూడా వారికి గగన కుసుమం. ఇంట్లో కుటుంబంతోనో / పిల్లలతోనో భర్త తోనో గడిపే సమయం కంటే వీరంతా ఇంటి బయట గడిపే సమయమే ఎక్కువ. దాంతో కొత్త పరిచయాలు, తోటి ఉద్యోగులతో స్నేహితం, దాపరికాలు లేకుండా మనస్సు విప్పి మాట్లాడుకోవడం ఎక్కువయ్యాయి. ఈ మహిళల్లో చాలామంది సాధారణ కుటుంబాల నుంచి , కాలేజి కాంపస్ నుంచి ఏకాయెకి పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు, ఒక్కసారిగా తమ తమ సమాజాల్లో పెద్ద హోదా వచ్చేసరికి 'అహంభావం' పెరిగిపోయి మనుషుల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. వీటన్నింటితో ఈ మహిళలలలో చాలామంది కుటుంబ సభ్యులతో సరిపడక పోవడం, భర్తలతో మనః స్పర్ధలు, ఇంటి పని ఆఫీసు పని ఒత్తిడి , అలవి కాని పనివేళలతో పిల్లల ఆలనా పాలనా స్వయంగా చూసుకోలేక పోవడం తో వేరేవారిపై అధారపడవలసి పడవలసి రావడం, దాంతో ఏమీ చేయలేని అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, ఒత్తిడి, మానసిక ఆందోళనతో వారి వారి జీవితాలు మసక బారుతున్నాయి. చిన్న చిన్న తగవులు, పెద్ద మనః స్పర్ధలుగా మారి భర్తతో విడిపోవాడానికి సమాయత్తం కావడం , పిల్లల నుండి దూరం కావడం లాటి తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయి. దాంతో వారి కుటుంబాలలో పలు విషయాల్లో ఎడతెగని ' ఘర్షణ'.. ! దాంతో తొందరపాటు, అపరిపక్వ నిర్ణయాలు ...... ఫలితం...విడిగా జీవించడం ! ఇంకొంచెం ముందుకెళితే 'విడాకులు'....... ఒంటరి జీవితం ! అదీకాక చిన్నకుటుంబాలు కావడంతో పెద్దవారి జోక్యం, సలహాలు లాటివి లేక 'విడాకుల' దాకా దారి తీస్తున్నాయి.
పట్టాణాలలో, మెట్రో సిటిలలో ఉండే మహిళలు పైన చెప్పిన కారణాలే కాక ఇంకా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైవాహిక జీవితంలో పొరపొచ్చాలొచ్చి కుటుంబాల నుంచి లేక భర్త నుంచో విడిపోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. మరి ఇవన్నీ లేని గ్రామీణ యువతులు , ఆట్టే చదువులేని, ఉద్యోగం లేని, పైసా సంపాదన లేని ఇంటిపట్టున మగవానిపై ఆధారపడి ఉండే సాంప్రదాయక కుటుంబాల్లో మహిళల్లో కూడ కుటుంబాల నుంచి విడిపోవడం, భర్త నుంచి విడిపోవడం, 'విడాకులు' కోరుకోవడం లాటి విపరీత పోకడలు సర్వ సాధారణ మయ్యాయి.దీనికి ముఖ్య కారణం ....మగవారి వ్యసనాలు, బీదరికం, టి.వి.లు, మారిన, మారుతున్న సమాజ సమీకరణాలు, పట్టణీకరణ, ఆర్ధిక వెసులుబాటు , కుటుంబ కలహాలు, సాంఘిక చైతన్యం, వ్యక్తిగత కారణాలు, లాటివి కారణాలు అనేకం. కాకపోతే వీరి సంఖ్య తక్కువే కాని నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. అసలు సంగతి 'విడిగా జీవించడం' 'విడాకులు తీసుకోవడం'.......ఎందుకు ఈనాడు మన సమాజంలో విచ్చలవిడిగా తయారయింది ? పైన ప్రస్తావించినట్లు ఇది సిటిల్లోనో, చదువుకుని ఉద్యోగం చేస్తున్న వారిలోనో, బాగా డబ్బున్న వారిలోనో లేక చదువులేని వారిలోనో, బాగా చదువుకుని ఏవో కారణాలతో ఇంటి పట్టున ఉన్నవారిలోనో, గ్రామీణ యువతుల్లోనో ఏదో వక తరగతి మహిళల్లో మాత్రమే 'విడిపోయి ఒంటరిగా' జీవిద్దాం అన్న ఆసక్తి కాని ఇచ్ఛగాని ఉంటుంది అనుకోను. విడిపోవడం...'విడాకులు' ఈ మారిన, మారుతున్న ఆధునిక భారతంలో ఓ చిన్న విషయం గా మారింది ! ఇది వరలో ఇది ఒక సాంఘిక దురాచారంగా 'విడిపోయి' జీవించే మహిళ జీవితం నరకప్రాయం గా ఉండేది. దాదాపు అలాటి వారిని సమాజం వెలివేసినట్లుగా చూసేవారు. వారి పట్ల చాల చిన్నచూపు ఉండేది. ఇప్పుడది లేదు. అలాటి  వారిని తలితండ్రులు, స్నేహితులు, చుట్ట పక్కాలు వారిని ఆదరిస్తున్నారు. అలాటి వారికి చక్కగా పునర్వివాహాలవుతున్నాయి. పాత కాలపు సాంఘిక కట్టుబాట్లు దూరమయ్యాయి....అవుతున్నాయి. అందరి మాదిరిగానే వారికి సమాజంలో సాధారణంగా గౌరవ మర్యాదలు దొరకడమే కాకుండా వారిపట్ల 'సానుభూతి' చూపే వారు కూడా ఉన్నారు. అదీకాక 'విడాకుల' అనంతరం వచ్చే 'భరణం' కూడా కొంతవరకు 'విడాకుల' సంఖ్య పెరగడానికి దోహదం చేస్తుందేమో. సమాజంలో వచ్చిన ఈ మార్పు కూడా మహిళలు 'విడాకుల' వైపు మొగ్గు చూపుతున్నారు.
భారత సాంప్రదాయంలో కుల మతాలకు అతీతంగా ఏ మహిళకైనా వివాహానంతరం భర్త తోడిదే లోకం. క్రిత దశాబ్దం వరకు అలానే జరుగుతూ వస్తోంది. నిజమే ! కాలం మారింది. మనుషులం మారుతున్నాం. మార్పులు అనేవి సహజం. కానీ మార్పు ఏదైనా మానవాళి కి మంచి జరిగేదయితే దాన్ని ఎంతటి క్లిష్టమయినదయినా మన జీవితాల్లోకి ఆహ్వానిచాల్సిందే ! కానీ ఈ 'విడిపోయి జీవించే' 'మార్పు' మంచిదని 'విడిపోయిన' వారు కూడా చెప్పరు ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు తప్ప. ఈ పది సంవత్సరాలలో ఏమైంది ? పట్టణాల్లోనే కాక గ్రామాలలో కూడా ఎందుకీ 'విడిపోక' విజ్రుంభిస్తోంది ?

నేటి మహిళల నడవడిక పాతకాలం మహిళల నాటి కాలమాన పరిస్థితులకు, వాటి కొలబద్దలకు లోబడినవి కాదు. వీరి ఆధునిక పోకడలు పాత తరాల వారికి అందరికి అర్ధం కావు. సయించవు.అర్ధం అయినా నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించేవారు వున్నారు. అందుకే బయటకు వెళ్లి పనిచేశే ఆడపిల్లలకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదేమంటే ఆఫీసు వదిలి ఇంటికి వచ్చాక వీలున్నంతవరకు ఆఫీసుని మరిచిపొండి. ఇంట్లో ఇల్లాలు గానే మెసలండి. మీ మీ పరిధి తెలుసుకోండి. అవసరానికయినా 'అహాన్ని' వదిలేయండి. 'అహం' వేరు. ఆత్మవిశ్వాసం వేరు. అలాగని అనవసరంగా వ్యక్తిత్వాన్ని చంపుకోమనడంలేదు. లేకుంటే వారి జీవితాలు నరక ప్రాయమవడానికి, ఎడతెగని మనః స్పర్ధలు రావడానికి, కుటుంబ విచ్చిత్తికి ఎంతో కాలం పట్టదు. తరువాత చింతించి ప్రయోజనం ఉండదు! గుర్తుంచుకోండి .....

ఈ విషయం నేపథ్యంలో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను . ఈ పైన పేర్కొన్న అనర్ధాలతో మనదేశంలో కొత్తగా గూడుకట్టుకుంటున్న జటిలమైన సమస్య 'సింగిల్ మదర్ ' ఫామిలీలు. అంటే ఇదివరకు ఈ సమస్య లేదా అంటే అది ఎక్కడో నూటికో కోటికో ఒక్కటుండేది ! ఇప్పుడది మారుతున్న సమాజ సమీకరణాలతో, తమఉద్యోగాలదన్నుతో ఆర్ధిక స్వావలంబనతో కొందరు మహిళలు తమ సహజ గుణమైన ఓర్పు, సహనం, క్షమాగుణం మరుస్తున్నారు. దానితో కుటుంబాలనుంచి విడిపోవడం తమకు తాముగా జీవించడం ప్రారంభించడంతో ' సింగిల్ మదర్ ' ఫ్యామిలీలు ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం మహిళలే అని అనడం లేదు. రెండు చేతులు కలుస్తేనే ఇలాటివి జరిగేది. ఇది ఇంకా పురుషాధిక్యప్రపంచం అన్న విషయాన్ని మరువకూడదు. అంటే ప్రతి దానికి స్త్రీలు అణిగి మణిగి ఉండాలన్నది, మనమే సర్దుకు పోవాలన్నది నా అభిమతం కాదు. తెగేదాక లాగడం మంచిది కాదు అన్న నానుడి మనకూ వర్తిస్తుంది ! ఒక యువతి నిర్భయంగా ఓ యువకుడిలా బ్రతకగల సమాజంగా మన సమాజం ఇంకా మారలేదు. తీర్చి దిద్దబడలేదు. కనుచూపు మేరలో మన సమాజం అందుకు అనువుగా మారుతుందన్న విశ్వాసం కలగడం లేదు ! అందుకే 'మహిళలూ.......బహుపరాక్'.......! జీవితాన్ని తేలిగ్గా తీసుకోకండి !
ఈరోజు 'వయసు'లో ఉన్నారు ఉద్యోగం, హోదా, డబ్బు దగ్గర ఉంటే లోకం అంతా రంగులమయంగానే వుంటుంది. ఈ దగ్గర రోజున మీకు సన్నిహితంగా మెలిగి అపరిపక్వ సలహాలిచ్చి రెచ్చగొట్టే స్నేహితులుగాని, ఇంకెవరైనా గాని రేపు మీదగ్గర ఉండరు. "మీ జీవితం మీదే....మరొకరు మీ జీవితాన్ని.....జీవితగమనాన్ని శాసించే అవకాశాన్ని ఇవ్వకండి". ఇది చిన్న విషయం కాదు. పెద్ద మనసుతో ఆలోచించండి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి. పది సార్లు ఆలోచించండి. అవసరమైతే 'విడాకులు' తప్పని నేననడం లేదు. కట్టుకున్న వాడు కరడు కట్టిన ఉన్మాదిలా మారితే 'విడాకులు' తప్పనిసరే! విడిపోవడం తమకు తాముగా జీవించడం ఇదివరకు పశ్చిమ దేశాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడా జాడ్యం మనదేశానికి కూడా పాకింది. దీనికి ముఖ్య కారణం మన 'వివాహ వ్యవస్థ' కు నెర్రెలు బారడం. మన యువతలో పాశ్చ్యాత్య పోకడలు వెర్రితలలు వేయడం. దీన్ని జటిలమైన సమస్య అని ఎందుకంటున్నానంటే దీనివల్ల పిల్లల భవిష్యత్తులో తీరని వెలితి....అనిశ్చితి......దానితో వారు రేపు ఎలాటి పౌరులవుతారు అనేది ప్రశ్నార్ధక మవుతుంది.......దీనికి కాలమే సమాధానమని సమాధాన పడుదామా......? ఆలోచించండి....

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.
Mob. No.9849118254 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి