లేబుళ్లు

16, మే 2012, బుధవారం

చిలకలగూడ రైల్వే బ్రిడ్జ్

                                                      చిలకలగూడ రైల్వే బ్రిడ్జ్  
                                                    -------------------------------------  
                     ( ఈ క్రైమ్ కథ  'మార్చి, ఏప్రిల్' 2013  రెండు  నెలలు  'ఆంధ్రభూమి'    
మాసపత్రిక లో ముద్రితమైనది) 
                                              

ఉదయం అయిదు గంటలయింది. అలారం నాలుగున్నరకే పెట్టుకుని పడుకున్నాను. మెలుకువ రాలేదు. గోదావరి ట్రెయిన్ కి మా ఫ్రెండ్ 'శ్రీహర్ష' వైజాగ్ నుంచి వస్తున్నానని ఫోను చేశాడు. అందుకే అలారం పెట్టుకున్నాను. గోదావరి ట్రెయిన్ సాధారణంగా అయిదున్నర, ఆరుగంటలలోపే సికిందరాబాద్ వచ్చేస్తుంది అనుకుంటూ త్వర త్వరగా బ్రష్ చేసుకుని బైక్ స్టార్ట్ చేసి బయలు దేరాను. బయటకు వచ్చిన తరువాత గాని తెలవలేదు. బయట మసక మసకగా వచ్చీ రాని వెలుతురుతో బాగా చల్లగా వుంది. స్వెట్టర్ వేసుకుని రావాల్సింది అనుకుంటూ అయినా పదిహేను నిముషాల్లోపే స్టేషను చేరుకుంటాలే పర్లేదు అనుకుంటూ బైక్ అక్సిలరేట్ చేశాను. మెట్టుగూడ చౌరాస్త, రైల్ బ్రిడ్జిదాటి చిలకలగూడ వైపు తిరిగాను. అక్కడే ఇంకొక రైల్ బ్రిడ్జి వుంది. అది సింగిల్ లేన్. అకస్మాత్తుగా బైక్ స్కిడ్ అవుతూ సర్రున జారింది. నేను బైక్ పడుతుంటేనే బాలన్సు చేసుకుంటూ ఎడమ కాలు రోడ్డు మీద బలంగా మోపి 'రైల్ బ్రిడ్జి రాంప్' మీదకు గెంతాను. రాంప్ మీద గడ్డి ఏపుగా పెరిగి గుబురుగా వుంది. గెంతుతూనే వీధి వేపర్ లాంప్ వెలుగులో గడ్డిలో పడిఉన్న ఓ చిన్నలెదర్ బ్యాగుగమనించాను. దుమ్ముపట్టిన గడ్డి గుబురుగా ఉండడంతో బ్యాగును ఎవరు చూసినట్లు లేదు. అందుకే అలా పడివుంది అనుకుంటూ దాన్ని అందుకోవడానికి ఒంగుతుంటేనే 'బాబోయ్..... బాంబేమో...జాగ్రత్త' అంటూ హెచ్చరించింది మనసు.
'ఆ'..బాంబు ఇక్కడెవడు పెడతాడు. కొద్దిగా లాజికల్ గా ఆలోచించాను. ఆక్షణంలోనే...'బాంబు కాదు' అని నామనసు కన్ఫర్మ్ చేశాక బ్యాగు గడ్డిలోనుంచి తీస్తూ అటుఇటు గమనించాను. మనసులో నాకు నేనే 'ఏమిటి దొంగలా అటూ ఇటూ చూస్తున్నావు' ? 'నువ్వేమీ దొంగతనం చేయడం లేదే'....అని మళ్ళీ మనసే తనకు తాను నచ్చచెప్పుకుంది. రోడ్డుఅంతా నిర్మానుష్యంగా వుంది. బ్యాగు జిప్ తీసి చూశాను. కేష్ చాలావుంది. చేయి లోనికి పెట్టి నోట్లకట్టలు తడిమి చూశాను. దాదాపు అన్నీ వేయి రూపాయల కట్టలు......బాబోయ్ ... డబ్బు లక్షలలో ఉన్నట్లుంది.... ఒక మొబైల్ ఫోను కూడా ఉంది. బ్రాండ్ న్యూ లా ఉంది. ఎందుకో తెలీదు వెన్నులోంచి జివ్వున చలి పుట్టుకు వచ్చింది.
వెంటనే టైం చూసి బాబోయ్ ట్రెయిన్ వచ్చేసుంటుంది. వాడు చంపేస్తాడు అనుకుంటూ బ్రిడ్జి రాంప్ మీదనుంచి కిందకు కాలు పెట్టానో లేదో కాలు సర్రున జారింది. రాంప్ గట్టు పట్టుకుని మళ్ళీ బేలన్సు చేసుకున్నాను. క్రింద చూస్తె అంత ముదురురంగు ఎరుపుగా 'బాబోయ్ ఎంత రక్తం.గడ్డ కట్టినట్లుంది' నీచు వాసన. రక్తం చూస్తూనే మనసులో ఏదో తెలీని ఆందోళన మొదలయింది.వెన్నులోంచి వణుకు మొదలయింది. ముందు ఇక్కడనుంచి బయలుదేర 
మంటోంది మనసు. ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు. త్వరగా బైక్ఎత్తి స్టార్ట్ చేసి దొరికిన జిప్ బ్యాగు సైడ్ 'కేరియెర్' బాక్సు లో జాగ్రత్తగా పెట్టి,దానిపైన బైక్ తుడిచే క్లోత్ కప్పి బాక్స్ లాక్ చేసి బయలుదేరేముందు మళ్ళీ నేలమీద గడ్డకట్టినా రక్తం వంక నిశితంగా చూశాను. చాలా రక్తం రోడ్డుమీద కాలవ కట్టింది. ఒళ్లంతా ఒక్కసారిగా గగుర్పొడిచింది. వెంటనే బైక్ ని జాగ్రత్తగా పక్కకు నడిపి ఒక్క నిముషంలో 'బోయిగుడ' వైపునున్న సికింద్రాబాద్ స్టేషనుకి చేరుకొని పార్కింగ్ లోనికి వెళ్ళకుండా 'యు' టర్న్ తీసుకుని మేము కలవాలని అనుకున్నచోట బైక్ పార్క్ చేసుకుని బైక్ ని ఆనుకుని నిలబడ్డాను. మనసింకా కుదుట పడలేదు. నా హార్ట్ బీట్ ' లబ్..లబ్ బదులుగా 'దడ...దడ' మని వెయ్యి వాట్ల 'బోసు స్పీకర్లో' ఏదో బీట్ పాటవస్తున్నట్లు గుండె అదురుతూ నాకే విన్పిస్తోంది. చలిలోనూ నా వళ్ళంతా అంతా చెమటతో తడిసింది. బ్యాగు తీసి వివరంగా మళ్ళీ చూద్దామంటే ధైర్యం చాలడం లేదు..... పైగా ఇది సమయం కాదు, సరైన ప్రదేశం కూడ కాదు. చాలా కేష్ ఉంది. మొబైల్ తీసి ఏదైనా నంబరు ఉంటుందేమోచూసి ఫోను చేద్దామా అన్న ఆలోచన వచ్చింది.... ఫోను చేయడం మంచిదా కాదా..... ఆలోచిద్దామంటే బుర్ర చురుకుగా పని చేయడం లేదు......పోనీ వద్దు అనుకుందామంటే తప్పు చేస్తున్నానా?....... అని ఒక పక్క మనసు పీకుతోంది. మెదడంతా మొద్దుబారినట్లుంది. పోలీసుస్టే
షనుకి వెళ్లి జరిగినదంతా చెప్పి బ్యాగు ఇచ్చేసి వద్దామా అనుకుంటే పోలీసులు వేసే యక్ష ప్రశ్నలకి......చివరకి అసలు నువ్వెవరు?......నీదగ్గరికి ఈ బ్యాగ్ ఎలా వచ్చింది? అని అడిగి నేను చెప్పేది నిజమని నమ్మక నన్ను మూసేస్తే ఏమిటి నా పరిస్థితి.......? అదీకాక ఏదైనా క్రిమినల్ ఆక్ట్ లో ఇన్వాల్వ్ అయిన మనిషికి సంబంధించిందా ఈ బ్యాగు, ప్రమాదంలో చనిపోయాడా, బ్రతికి వున్నాడా ? ......లేక ఏమైనా హత్యా....ఎవరిదీబ్యాగు? ఏదైనా కేసులో మెటిరియల్ ఎవిడేన్సా? ......ఇప్పుడు నేనేం చేయాలి, అసలు ఈ డబ్బు నాకెందుకు దొరికింది ?..... దొరికింది సరే ! అక్కడ పడివున్న దానిని అక్కడే ఉంచక పెద్ద మొనగాడిలా నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ? తీసుకుంటున్నప్పుడు ఎవరైనా చూశారేమో......ఫోటో ఏమైనా తీశారేమో ? అదేదో తెలుగు సినిమాలో NTR డైలాగులు గుర్తుకొచ్చినా పరిస్థితికి నాకే నవ్వొస్తోంది.......నామీద నాకే జాలి వేస్తోంది.
ఎటూ తేల్చుకోలేక ...మీమాంస తో తల తిరిగిపోతోంది. 'బాబోయ్.......ఈ ఆలోచన ఇంతటితో ఆపెయ్యాలి' అనుకున్నాను స్వగతంలో. ఇంకా ట్రైన్ వచ్చినట్లు లేదు. ముందు కొద్దిగా 'టీ' త్రాగుతే బావుండు అని అటుపక్కగా రెండు అడుగులు వేశాను. బ్యాగ్ గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగానో లేదో దూరం నుంచి పోలీసు కానిస్టేబుల్ 'వో భాయి సాబ్'...... అంటూ చేతిలో లాఠి ఊపుకుంటూ బిగ్గరగా పిలుస్తున్నాడు నన్నే. ఒక్కసారిగా గుండెదడ మొదలయింది. వళ్ళంతా వెయ్యి వోల్టుల కరెంటు పాస్ అవుతున్న ఫీలింగ్. కాళ్ళ క్రింద భూమి జారుతున్నట్లుగా, భూమి గిర్రున తిరుగుతున్నట్లుగా, కడుపులో వికారంగా అయింది. నేను అతన్ని చూస్తూ ఏమిటి అన్నట్లుగా చేయి ఊపాను. 'ఆప్ కూ ఈ పుకార్రుం.... ఓ గాడి 3421 ఆప్ కా హై క్యా'...? పెద్దగా అరుస్తూ అడిగాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ .
'నాదే అన్నట్లు తల ఊపుతూ.........హా... మేరా గాడీ హై'....అన్నాను మళ్ళీ చేయి ఊపుతూ.
'తో ఇధర్ ఆయియే...ఆప్కూ సాబ్ బులారై...' అన్నాడు కానిస్టేబుల్ అక్కడికి రమ్మని లాఠీని ఊపుతూ.
తనని అక్కడికి కానిస్టేబుల్ రమ్మంటున్నాడని రంగాకి అర్ధం అయింది.
అయిపొయింది, అంతా అయిపొయింది.
పోలిసుల చేతిలో పడ్డాను. వీడిప్పుడు బ్యాగు చెక్ చేస్తాడు. స్టేషను కి తీసుకువెళ్తాడు.
'లోపల లక్షల కేష్....ఎంత ఉందొ తెలీదు ! కొత్త సెల్ ఫోను..... ఆబ్యాగులో ఏదైనా క్రైంలో మెటిరిఎల్ ఎవిడెన్స్ అయివుంటే .....గోవిందా...గోవింద....ఇంతటి
తో మనకధ సమాప్తం........ ఇక జైలు పాలే'...!!! మనసు స్వగతంలో ఉక్కిరి బిక్కిరవుతుండగా .....
''నో...నో...నేనేం తప్పు చేశాను. బ్యాగు త్రోవలో దొరికింది ఇప్పుడే పది నిముషాల క్రితం...పోలీసుకి హేండ్ ఓవర్ చెయ్యాలి. ముందు ట్రైన్ టైం అయింది. ఫ్రెండ్ ని రిసీవ్ చేసుకున్నాక పోలీసు స్టేషనుకి వెళ్దామనుకున్నాను.' ఇంత మాత్రం డిఫెన్సివ్ గా మాట్లాడలేనా....అని లేని ధైర్యం నటిస్తూ, కొద్దిగా ముందుకెళ్ళి....... కానిస్టేబుల్ ని ఉద్దేశ్యించి 'క్యోం'? అన్నాను గట్టిగా శరీరంలో ఉన్న శక్తి అంతా కూడ తీసుకుంటూ...నేను గట్టిగా అన్నాననుకున్నమాట నాగొంతులోంచి కీచుగా వచ్చిందని నాకర్ధం అయింది. దానికి పోలీసు కానిస్టేబుల్ 'క్యా బోల్ రైజీ....జరా ఆవాజ్ సే బోలో... ' గాడీ ఉధర్ రఖ్ నేకా నై... గాడీ నికాల్ దీజియే నైతో......గాడీ లేకే ఇధర్ ఆయియే'...కచ్చితంగా చెప్పాడు కానిస్టేబుల్. నేను సరేనంటూ చేయిఊపి 'ఠీక్ హై.....గాడీ అభీ నికాల్ రుం'..... అని బ్రతికిందిరా గొర్రె అనుకుంటూ, మళ్ళీ వాడి మనసు ఎక్కడ మారుతుందోనని త్వరగా బైక్ స్టాండ్ తీసి కొద్దిగా ముందుకు వచ్చి ఒక పక్కగా మళ్ళీ బైక్ స్టాండ్ వేసి ఆనుకుని నిలబడ్డాను. ఇంతలో ఏదో ట్రైన్ వచ్చినట్లుంది. మెల్లగా జనం బయటకు వస్తున్నారు.
ఆటోలు, కార్ల హడావుడి కనబడుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చే, వెళ్ళే ప్రయాణీకులకు ట్రాఫిక్ బాధలు లేకుండా స్టేషను వెనకాల బోయిగుడ వైపు రైల్వే వారు డెవలప్ చేసిన ఎంట్రన్సు, పార్కింగు విశాలంగా సుఖంగా వుంది అనుకున్నాను. ఇంతలో' గోదావరి పదినిముషాలు లేటు' అని చక్కగా మూడు భాషల్లో రైల్వే వారి అనౌన్సుమెంట్ వినిపించింది. కొద్దిగా టెన్షన్ తగ్గింది. టీ తాగుదామని అటూ ఇటు చూశాను. బైక్ తీసుకుని దూరంగా ఉన్న బడ్డి కొట్టు దగ్గరికి వచ్చి'టీ' తీసుకుని పక్కగా నిలబడి 'టీ' ఆస్వాదించడం మొదలెట్టాను. బడ్డీ కొట్టుచుట్టూ కనీసం పది,పదిహేను మంది మూగి ఇడ్లి, దోశ, వడ, టీ, కాఫీ తాగే వాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు.కప్పులు, ప్లేట్లు కడిగిన నీళ్ళ లోనే మళ్ళీ మళ్ళీ కడుగుతున్నాడు పదేళ్ళ కుర్రాడు.
ఆ జనాల్ని చూస్తూ ఒక్కసారిగా అనాలోచితంగానే నా మనస్సు గతంలోకి వెళ్ళింది.
నేను, శ్రీహర్ష క్రితం ఏడు సంవత్సరాలుగా మంచి స్నేహితులం. ఇద్దరం చెన్నై దగ్గర 'గుమ్మడిపూండి' లో ఇంజనీరింగ్ (బి.ఇ) చేశాము. ఇద్దరం ఒకటే కంపనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గా చేరాము. వాడేమో వైజాగ్ బ్రాంచిలో, నేను హైదరాబాద్ లో పని చేస్తున్నాము. వాడికి హైదరాబాద్ అంటేనే భయం. చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడ కర్ఫ్యూలో ఇరుక్కున్నాడట. అదీ సంగతి.
'ఇప్పుడు వాడికి ఈ డబ్బు దొరికిన విషయం చెప్పాలా... లేదా'? అసలే చాదస్తుడు... భయస్తుడు. చెపుతే ఎలా రియాక్ట్ అవుతాడో......నాకే కంగారుగా.....అయోమయంగా వుంది. వీడివల్ల ఇంకా అయోమయం అవుతుందేమో. చెప్పకుండా ఎలా ?.వాడు ఇక్కడ, నా రూంలోనే పదిహేను రోజులు ఉంటాడు. ట్రైనింగ్ కి వచ్చాడు. ఎలా....?
ఏం చేయాలి...కిం కర్తవ్యం?..... ఆలోచిస్తూ టీ గ్లాస్ అక్కడవుంచి బైక్ వెనక్కితిప్పుతూ వెనక్కు చూశాను. 'శ్ర్రీహర్ష' దూరంగా ఇటువస్తూచేయి ఊపుతూ కన్పించాడు. సూట్ కేసు లాక్కుని వస్తున్నాడు. నేను ఆగి చేయి ఊపాను.
'అమ్మయ్య....ముందు ఇక్కడనుంచి బయటకు వెళ్ళాక ఆలోచిద్దాం'...వీడికి చెప్పి ఇద్దరం కలిసి ఆలోచిస్తే ఏదైనా మార్గం తోచక పోదు అని వాడికి విషయం చెప్పాలనే నిర్ణయించుకున్నాను. మరునిముషంలోనే మనసు చాల తేలిగ్గా, నెత్తిమీద నుంచి టన్నుబరువు తీసేసి నట్లయింది.
ఇంతలో 'ఏరా చాలా సేపయిందా వచ్చి.....వెయిట్ చేయబట్టి' ....ట్రైన్ పావుగంట లేటు.
'పద వెళదాం'అన్నాడు 'శ్రీహర్ష' నా సమాధానం కోసం వెయిట్ చేయకుండానే.
మళ్ళీ వెంటనే...'అరే..... అదేంటిరా...... పేంటు కింద అంత బ్లడ్ లాగా వుంది'
'అరే..ఈ లెఫ్ట్ చెప్పు నిండా బ్లడ్ రా.....ఏమయిందేమిటి'
'కిందగాని పడ్డావా...ఏమైనా దెబ్బలు తగిలాయా'....? ఆందోళనగా
నా పేంటు...చెప్పులు, నన్ను నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూస్తూ ....
'గాడ్...నాకు ఇప్పటి దాకా ఈ మరకలు కన్పించలేదు...రక్తపు మరకలు పేంటు మీద చెప్పులనిండా వున్నా నేను ఇప్పటిదాకా చూసుకోలేదు....ఇందాకటి నుంచి ....ఏదో వాసన కూడా వస్తోంది....ఎక్కడో బయటనుంచి అనుకున్నా.....ఇదన్నమాట...టెన్
షన్లో ఏమీ గమనించలేదు' 'నయం...పోలీసు కానిస్టేబుల్ దగ్గరకు రాలేదు' అనుకున్నాను మనసులో.
'అవునురా...స్టేషను కి వస్తూంటే బండి స్కిడ్ అయి పడ్డాను. దెబ్బలేమీ తగల్లేదు కానీ నేను పడ్డ చోట ఏదో ఆక్సిడెంట్ అయినట్లుంది. రోడ్డుమీద చాలా రక్తం గడ్డకట్టి వుంది. ఆ రక్తం మీదనే బండి స్కిడ్ అయింది.
లక్కీగా దెబ్బలేమీ తగల్లేదు.
'సరేరా .....ఇంటికివెళ్లి మాట్లాడుకుందాం...ముందు బైక్ ఎక్కు..సూట్ కేసు మధ్యలో పెట్టు... కొద్దిగా వెనక్కి జరిగి కూర్చో.జాగ్రత్త' అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి పావుగంటలో ఇంటికి చేరాం. ఇంటికి రావడంతోనే బైక్ పార్క్ చేసి బైక్ 'బాక్స్' లోని జిప్ బ్యాగు తీసుకుని లోపలకి తెచ్చిసూట్ కేసులో పెట్టి బట్టలు మార్చుకుని చెప్పులు శుభ్రంగా కడిగేశాను. పేంటు, షర్టు రెండు తడిపి 'డిటర్జెంట్' వేసి నాన బెట్టాను. బట్టలు తడపగానే విపరీతమైన వాసన...... లోనికి వచ్చేసరికి 'శ్రీహర్ష' మంచి కాఫీ రెడీ చేశాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ త్రాగాం. మధ్యలోనే వాడు నన్ను' ఏమిటిరా..... అంత పరధ్యాన్నంగావున్నావు. ఏమిటి వంట్లో బాలేదా? ఆదుర్దాగా అడిగాడు.
'అబ్బే..అదేం లేదురా బానే వున్నాను' అని సర్ది చెప్పాను.
ఇద్దరం స్నానం చేసి టిఫెన్ చేశాము.
'నేను ఇంకా అయోమయంలోనే వున్నాను. ఏంచెయ్యాలో అసలు అర్ధం కాని పరిస్థితి.
ఏమైనా సరే....ఇప్పడు వీడితో జరిగినదంతా చెప్పి బ్యాగు తీసి.......అంతా క్షుణ్ణంగా చూశాకనే ఈ విషయంలో ముందుకు ఎలా పోవాలన్నది నిర్ణయం తీసుకోవాలి. విషయం దాచేయాలని ప్రయత్నం చేస్తూ టైం వేస్టు చెయ్యడం మంచిది కాదు. 'ఈ బ్యాగులో ఉన్న కేష్ తో ఎవరి జీవితాలు ముడివడి వున్నాయో,
ఏ క్రైం కేసు ముడిపడి ఉందో '?.....అంచనాఎలాగు మన చేతిలో లేదు.అందుకే నడుం బిగించాల్సిందే....పోలీసు రిపోర్ట్ ఇవ్వవద్దు అని నిర్ణయించు కున్నాక ఈ బ్యాగుఎవరిదో వారికి ఎంత తొందరగా అందచేస్తే అంతమంచిది....అని నిర్ణయించుకోవడమే తరువాయి.'అరేయ్ నీతో ఒక విషయం మాట్లాడాలిరా'...అన్నాను 'హర్ష' తో.
'నాకు తెలుసు....ఏదో విషయం నీ మెదడు తొలిచేస్తోందని ! ఏమిటిరా.....ఏమైనా ప్రేమ వ్యవహారమా ఏమిటి' ? నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు హర్ష.
'లేదురా...జాగ్రత్తగా విను....ఉదయం నేను బయలుదేరిన దగ్గరనుంచి పూసగుచ్చినట్లుగా జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం...రా ' అని సీరియస్ గా సలహా అడిగాను.
'వాడు మౌనంగా చెప్పిందంతా విన్నాడు..... నోట మాట రాకుండా చిత్తరువులా అలానే ఉండిపోయాడు'
నాకు మాత్రం చాలా రిలీఫ్ వచ్చింది. గాలి తీసిన బెలూన్లా అయింది నా పొట్ట.
'దీర్ఘంగా ఆలోచిస్తున్న శ్రీహర్ష నుద్ద్యేసించి ....... అరేయ్..హర్షా'...గట్టిగా అరిచాను నేను.
'శ్రీహర్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి 'ఆ ....ఆ... అందుకే ఈ హైదరాబాద్ రావాలంటేనే నాకు దడ...వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి జరగాల్సిందే.....' ఇంతకీ ఆ బ్యాగు ఏది ?ఇలా తీసుకురా.. .అసలు బ్యాగులో ఏమున్నాయో నువ్వే పూర్తిగా చూడలేదు కదా .... ఇప్పుడు చూద్దాం...బ్యాగు ఎవరిదో....... ఏమైనా క్లూ' దొరుకుతుందేమో..... అంటూ తను లేచివెళ్ళి తలుపు వేసి కిటికీ కి ఉన్న కర్టెన్ కూడా సర్ది వచ్చాడు. అంత టెన్షన్ లో కూడా వాడి జాగ్రత్తకు నవ్వు వచ్చింది. బెడ్ మీద బెడ్ షీట్ ఒకటి సగం పరిచి ఇద్దరం కూర్చున్నాం బెడ్ మీద........నేను జిప్ బ్యాగు మొత్తం తెరిచి బోర్లించాను. సైడ్ పాకెట్స్ కూడా జాగ్రత్తగా చూశాను.
'వాడు బాగ్ లో నుంచి ముందుగా ఫోను తీసి చూస్తూ రేయ్...'రంగా' ఇది బ్రాండ్ న్యూ ఆపిల్ 'ఐ' ఫోనురా బాబూ...చాలా 'కాస్ట్లీ'..దాదాపు 30000 రూపాయల పైనే వుంటుంది. సరే ..కేష్ లెక్క పెడదాం .....అని ఇద్దరం కలిసి లేక్కేశాం .. తొమ్మిది లక్షల డెబ్భై వేలు వుంది.
తొమ్మిది వెయ్యిరూపాయల కట్టలు. రెండు అయిదువందలరూపాయల కట్టలు. ఒక కట్టలో 50000 ఇకొక చిన్న కట్ట్టలో 20000 రూపాయలు వున్నాయి. బ్యాగులో ఇంకేమీ లేదు. అసలు ఏమాత్రం 'క్లూ' దొరక లేదు.
'ఏమిట్రా బాబూ......ఈ మిస్టరీ'.......'చాలా సస్పెన్స్ గా వుంది.......ఎలారా ఈ మిస్టరీ ఛేదించడం....?
'వెళ్లి పోలీసుకి హ్యాండ్ ఓవర్ చేద్దామా అంటే.........నువ్వనేది కొంతవరకు కరెక్టే. అనవసరంగా కంపలో కాలు పెట్టడమే. అలాగని ఊరుకోవడానికి వీల్లేదు. ఇప్పటికే బ్యాగు దొరికి రెండు, మూడు గంటలవుతోంది. ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచిద్దాం.......పేపర్, పెన్ తీసుకో' అన్నాడు శ్రీహర్ష పెద్ద అపరాధ పరిశోధకుడిలా !
'మొదలు కరెన్సీ కట్టల మీద ఉన్నబ్యాండ్ మీద బ్యాంకు 'స్టాంప్'చూసి ఆ బ్యాంకు లో ఈ డబ్బు ఎవరు డ్రా చేశారో కనుక్కోవడం.......అని కరెన్సీ కట్టలుమొత్తం మళ్ళీ వివరంగా చూశాం కానీ మొత్తం కరెన్సీలో ఒక్క 500 రూపాయల కట్టమీద, ఇంకొక వెయ్యి కట్ట మీదనే బ్యాంకు పేరు ఉంది. మిగతా వాటికి రబ్బరు బ్యాండ్ మాత్రమే ఉంది. అదీ సిటిలో 'తార్నాక'లో స్టేటు బ్యాంకు. బహుశా మనకు ఈ ఆప్షను అంతగా పనిచేయదు. ఎందుకంటే ఈ మనీ బ్యాంకు నుంచి డ్రా అయ్యాక ఎన్ని చేతులు మారిందో తెలియదు. అయినాదీన్ని లాస్ట్ ఆప్షన్ గా రిజర్వ్ చేద్దాం'.......
'రెండోది, ప్రమాదం జరిగిన స్థలం కి సంబంధించిన పోలీసు స్టేషను దగ్గర లోపాయకారిగా ఎంక్వయిరీ చేయడం. వివరాలు తెలుసుకుని ప్రొసీడ్ కావడం'.......
'మూడవది న్యూస్ పేపరులో ఆ స్థలంలో జరిగిన ఆక్సిడెంట్ గురించి ఈరోజు అన్ని లోకల్ టి. వి న్యూస్ ఛానల్స్ లో చూడడం క్లూస్ ఫాలో కావడం.
ఒకవేళ మనకు ఈరోజే 'క్లూ' దొరికితే OK లేకుంటే రేపు అన్నీ న్యూస్ పేపర్లు వెదకడం. ఇదీ మన కార్యక్రమం'. ఒకవేళ మనకు ఇవేవీ వర్క్ అవుట్ కాకపోయినా మనం ఈ బ్యాగు ఎవరిదో కనుక్కోవడానికి ఇంకొక మార్గం కూడా వుంది. చూద్దాం.....ప్రస్తుతానికి ఈ రెండు...మూడు ఆప్షన్స్ ఫాలో అవుదాం. ముందు ఇవన్నీలోపల పెట్టి లోకల్ న్యూస్ టీవీ ఛానల్ పెట్టు'....... అని చెప్పి బెడ్ మీద నుంచి లేచి సోఫాలో సెటిల్ అయ్యి టి.వి.న్యూస్ చూడ్డం మొదలెట్టాడు శ్రీహర్ష. అన్ని తెలుగు న్యూస్ చానల్స్ లో లోకల్ న్యూస్ ఆగకుండా ఇద్దరు వంట చేసుకుంటూ రెండుగంటలపాటు చూసినా 'బ్యాగు' దొరికిన స్థలంలో ఏమీ ఆక్సిడెంట్ కాని 'క్రైం' రిపోర్ట్ అయినట్లుగాని 'న్యూస్' లేదు.
'రేయ్...రంగా..న్యూస్ లో ఏమీ రిపోర్ట్ కాలేదు. అసలు నీ లెక్క ప్రకారం రాత్రి 12 గంటలు ఉదయం అయిదు గంటలలోపులోనో అంటే నువ్వు బ్రిడ్జి దగ్గర కింద పడ్డ టైం లోపునో ఆక్సిడెంటో / హత్యనో అయిందనుకుంటే ఈ పాటికి న్యూస్ చానల్స్ టి.వి లు ఫ్లాష్ న్యూస్ అంటూ మొత్తుకుంటూ ఉండేవి. అలాంటి న్యూస్ ఏమీ ఫ్లాష్ కావడం లేదు. అంటే హత్య కాని ఆక్సిడెంట్ కాని కాలేదన్నమాట. పైగా నువ్వు కింద పడ్డ టైం కి రక్తం గడ్డ కట్టింది. అంటే అక్కడ ఆక్సిడెంట్ / హత్య నో జరిగి కనీసం మూడు, నాలుగు గంటల పైగా అయిఉండాలి. అయితే నీకాళ్ళకు అంటిన రక్తం, అక్కడ రోడ్డుమీద మడుగుగడ్డ కట్టిన రక్తం అసలు మనుషులదేనా లేక ఏదైనా జంతువుదా అన్నడౌట్ వస్తోంది' అన్నాడు శ్రీహర్ష తను చదివిన డిటెక్టివ్ బుక్స్ లో సంఘటనలు, మిస్టరీ కేసులలో తను సముపార్జించిన విజ్ఞాన సర్వస్వం గుర్తుకు తెచ్చుకుంటూ.. 'నువ్వేమంటావురా... అసలు మాట్లాడకుండా అంత సైలెంట్ అయిపోయావేంటిరా '.... 'రంగా'..... ముఖంలోకి నిశితంగా చూస్తూ అన్నాడు శ్రీహర్ష.
'అవునురా....నేను అదే ఆలోచిస్తున్నా..నీ ఆర్గుమెంట్ అంతా ఇప్పటి 'సిట్యుఏషను' కి
కచ్చితంగా అతికినట్లు సరిపోతుంది. అక్కడ ఏమైనా ఆక్సిడెంట్ జరిగుంటే ఈ పాటికి టి.వి న్యూస్ లో వచ్చివుండేదే. రాలేదు..... కాబట్టి నీ ఆర్గుమెంట్ కరెక్ట్'.
'కాని ఏ అర్ధరాత్రో ఎవరినైనా అక్కడ హత్యచేసి శవాన్ని ఎక్కడైనా పడేసి ఉంటే లేక ఆక్సిడెంట్ చేసి ఏదైనా హాస్పిటల్ ' పడేసి వుంటే, ఆ టైం లో బ్యాగు అక్కడ పడి ఉండవచ్చుకదా...... ఏమంటావురా' ? అన్నాడు రంగా సందర్భోచితంగా అలొచిస్తూ.
'అవున్రా... నువ్వు చెప్పిందికూడా ఈ 'సిట్యుఏషను' కి సరిగ్గా అతికినట్లుగా సరిపోయింది. కాని నువ్వు చెప్పిన ఈ రెండు సిట్యుఏషనులలో బ్యాగుఓనరు ని గుర్తించడం మనవల్ల కాని పనే. అయితే మరి ఈబ్యాగు ఎవరిది అక్కడకి ఎలా వచ్చింది? అన్నది ప్రశ్న గానే మిగిలి పోతోంది' అన్నాడు రంగా లేచి చేతులు వెనక్కు కట్టుకుని రూములో టెన్షనుగా అటూఇటూ తిరుగుతూ.
'సరేరా...మరి ఇప్పుడు ఏంచేద్దాం'.. ? ఆదుర్దాగా అడిగాడు శ్రీహర్ష.
'అదేరా.....ఆలోచిస్తున్నాను....
పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా మన వల్ల ఈ పని అవుతుందా'?
'మనం బ్యాగు సొంతదారుణ్ణి చేరగలమా?....అన్నది మనం తక్షణం అలోచించి నిర్ణయం తీసుకోవాలి.....ఇంకా లేటు అయినకొద్దీ మనం అనవసరంగా కేసులో ఇరుక్కున్న వాళ్ళమవుతామేమో నని భయంగా వుంది' అన్నాడు రంగా ఇంకా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ.
'అంతే కాదురా'..... ఈ 'కాష్ బాగ్' ఏదైనా క్రైం కేసు కి సంబంధించిన ' వైటల్ ' ఎవడేన్స్' అవుతే మనం ఆ కేసుకి, ఈ డబ్బు స్వంతదారుకు, పోలీసు ఇన్వెస్టిగేషను కి తీవ్ర విఘాతం కల్గించిన వాళ్ళమే కాక, మనమీద క్రిమినల్ చార్జెస్ కూడా ఫ్రేం చెయ్య వచ్చు' అన్నాడు శ్రీహర్ష తన డిటెక్టివ్ బుర్ర అంతా ప్రదర్సిస్తూ .
'పైగా ...'మనం' అని నన్ను కూడా కలుపుతావేరా...ఈగొడవలో.....' నాకేం తెలుసు నేను ఇప్పుడేకదా నీతో వచ్చింది...'
అన్నాడు శ్రీహర్ష తలవంచుకుని.
'అదేం లేదు బాబూ....తమరూ ఇప్పుడు ఈ విషయంలో సమాన భాగస్వాములే...మంచి, అయినా చెడు అయినా..
ఇద్దరం అనుభవించాల్సిందే'... అన్నాడు రంగా నిర్మొహమాటంగా 'శ్రీహర్ష' కళ్ళలోకి చూస్తూ అదేదో సినిమా లో సుభ్రమణ్యం డైలాగ్ అనుకరిస్తూ .
'అన్యాయం...అక్రమం...దగా..మోసం.
...' వూరి వాణ్ని, చిన్నవాణ్ణి చేసి నన్ను ఏదో కేసులో ఇరికిస్తున్నావు'..అన్నాడు లేచి నవ్వుతూ హర్ష.
'ఆ......అన్యాయం...అక్రమం...'వె
ధవ'.......నీ మూలంగా కాదు ఈ'న్యూసెన్స్'అంతా.......నన్ను స్టేషనుకి రమ్మనకుండా నువ్వే ఏ ఆటోలోనో తగలడితే సరిపోయేదిగా...స్టేషనుకి అనవసరంగా నన్ను రమ్మన్నావు'....ఉడుక్కుంటూ అన్నాడు రంగా.
'సరే లేరా....ఏదో సరదాగా అన్నాను....ఇప్పుడే ఏంచేద్దాం చెప్పు......' సీరియెస్ గా అడిగాడు శ్రీహర్ష.
'ఇంకాసేపు టి.వి లో లోకల్ న్యూస్ చూద్దాం' అంటూ టి.వి.న్యూస్ పెట్టాడు రంగా.
'ఫ్లాష్.....ఫ్లాష్' అంటూ స్క్రోల్ అవుతూ న్యూస్ ... వస్తోంది...చిలకలగూడ పోలీసు స్టేషను పరిధిలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర పాడుబడ్డ భావిలో 'శవం'.......శవాన్ని బయటకు తీయడానికి పోలిసుల ఏర్పాట్లు...ఇంకొద్దిసేపట్లో శవం వెలికి తీత'....
'దొరికిందిరా బిడ్డా ..... క్లూ...లే బయలుదేరు......మనం కూడా అక్కడికెళ్దాం...ఎవరైనా శవాన్ని గుర్తుపడతారేమో....లే త్వరగా తయారవ్వు...అన్నాడు రంగ హుషారుగా లేచి తను డ్రెస్ వేసుకుంటూ.
పదినిముషాలలో చిలకలగూడ పాడుబడ్డ భావి దగ్గరకి వచ్చారు ఇద్దరు. అక్కడేమీ హడావుడి లేదు.
భావి తనకి బ్యాగు దొరికిన రైల్వేబ్రిడ్జి దగ్గరనుంచి మహా అయితే వందగజాల దూరం ఉందేమో.
'అక్కడే రోడ్డుపక్కగా మోటర్ సైకిల్ మెకానిక్, చెప్పులు కుట్టే అతను ఇద్దరు వున్నారు'
'రంగా' మెల్లగా చెప్పులు కుట్టే అతని దగ్గరకు వెళ్లి తన బూట్లు పాలిష్ చెయ్యమని అడిగి ఒక కాలు అతని పోలిష్ బాక్స్ మీద పెట్టి...... 'ఏమిటి ఇక్కడ ఇందాక చాలా మంది జనం మూగివున్నారు...ఏమైంది? అని అడిగాడు రంగ.
'ఆ..మామూలే నయ్యా........ ఎవర్నో చంపి భావిలో పడేశారు. పోలీసులు ఇంతకు ముందే శవాన్నితీయించి అంబులెన్సు లో ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు బాబూ'
'ఇక్కడ ఎప్పుడూ...ఏదోఒకటి అవుతూనే ఉంటది ....అవును బాబూ రాత్రి తొమ్మిది దాటితే..లోకల్ రైళ్ళు దిగి ఇక్కడ సంగతి తెలీని జనంకొందరు పట్టాల మీదుగా ఇటు అడ్డంగా వస్తారు. పోకిరోళ్ళు, రౌడీలు వాళ్ళదగ్గర డబ్బులు, ఉంగరాలు, ఫోన్లు లాక్కుంటారు. ఎవరైనా అడ్డం తిరిగితే చంపి ఈ భావిలో పడేస్తారు. ఇది ఇప్పుడు కాదు బాబూ...నేను పదేళ్ళ పైన చూస్తానే వుండ...'అన్నాడు చెప్పులు కుట్టే అతను తల ఎత్తకుండానే తన పని చేసుకుంటూ.
'అలాగా...డబ్బులు, దోచుకోవడమే కాక మనుషుల్నిచంపేస్తారా...అంత దారుణంగా'....ఇంకా ఏదైనా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ తను ఇస్తాడేమో నని సంభాషణ పొడిగిస్తూ అన్నాడు రంగా.
'చెబుతున్నగదా బాబూ...ఎవరైనా ఎదురు తిరిగితే అంతే.....చూడరాదు.....రాత్తిరి చంపేసి పడేసిన బాబుకి పట్టుమని పాతికేళ్ళు లేవు...బాగా కొట్లాడినట్లుంది.....ఎక్కడో తగలరానిచోట తగిలినట్లుంది.
'దొంగముండా కొడుకులు బాబూ, ఆళ్ళునలుగురయిదుగురుఉంటారు.....
భావిలో పడేశారు...'పానం' ఉండగానే పడేసింరో....ఏం పాడో....పాడులోకం...అయిపోనాది బాబూ...' బాధ పడుతూఅన్నాడు చెప్పులు కుట్టేఅతను.
ఇంకా ఏమైనా ఎక్కువ మాట్లాడితే అతనికి అనుమానం వస్తుందేమోనని అక్కడితో ఆపి బైక్ దగ్గరికి నడిచాడు రంగా! ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్ళిఅక్కడ పరిస్థితి కూడా చూసి ఏమైనా 'క్లూ'దొరుకుతుందేమో చూద్దాం అనుకుంటూ ఇద్దరం ప్రభుత్వ హాస్పిటల్ కి బయలుదేరాం.
**********
ఇద్దరం మోటర్ బైక్ మీద హాస్పిటల్ కి చేరేసరికి టైం దాదాపు మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. హాస్పిటల్ కంపౌండ్ నిండా మనుషులు గ్రూపులు గా విడిపోయి అక్కడక్కడ సెటిల్ అయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్ కి పక్కగా ఓల్డ్ బోయిగుడ వైపున రోడ్డుకి అవతలపైన ఉంది శవాల 'పోస్ట్ మార్టం' సెక్షన్. దాని పక్కనే 'మార్చ్యురి'. బైక్ దిగకుండానే ఒక్కసారి పరికించి చూసాను. పనికిరాని ఫర్నిచరు, రక్తం మరకలతో ఎండిపోయిన రెండు పాత స్ట్రెచర్లు, పొడుగాటి సిమెంట్ రేకుల షెడ్ చూరు కింద రెండు పాత బెంచీలు, చాయ్ వాలా, భోరున ఏడుస్తూ కొందరు ......ఎటు చూసినా ఆ కంపౌండ్ అంతా దయనీయంగా ఉంది.
అక్కడ పక్కనే బైక్ పార్క్ చేసి రెండడుగులు వేశామో లేదో.......ఒకతను ఎవరో మావంక వస్తూనే 'క్యా సాబ్ ఆక్సిడెంట్ కేసు 'బాడీ' హైక్యా ......? తెలుగునా సార్ ? ఏందీ....ఆక్సిడెంట్ కేసా ? పోస్ట్ మార్టం తొందరగా అయిపోద్ది సార్? ......బాడీ వచ్చిందా? ....కబాయా ?....కహా సే ఆయా ? నాం క్యా హాయ్? పేరేంది సార్ ? మాట్లాడండి ...... ఆగకుండా ప్రశ్నమీద ప్రశ్న వేస్తూ మాదగ్గరికి వచ్చాడు. మాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలా...... ఇక్కడ బ్రోకర్ అని మాత్రం అర్ధం అయింది. వాణ్ని వదిలించుకోవడమే మంచిదన్నట్లుగా 'రంగా'....
' ఐసా కుచ్ భీ నహీ హై భాయి .... కిసీ కు మిల్నే ఆయే ......బస్ ....' అని వాడి వంకా చూడకుండానే బయటకు నడుస్తూ నన్ను కూడా 'ఫాలో' కమ్మని సైగ చెయ్యడంతో నేను కూడా వాడితో బయటకు నడిచాను. కొద్ది దూరం వచ్చి ముందుకి నడుస్తూ 'ఇదెక్కడి గొడవరా బాబూ.....వీడెవడో బంకలా పట్టుకున్నాడు'....అన్నాడు రంగా తిరిగి చూస్తూ వాడింకా ఫాలో అవుతున్నాడా అని పరికిస్తూ. వాడు ఫాలో కావడంలేదని నిర్దారించుకున్నాక ఒక పక్కగా ఆగి 'మార్చురీ' బాయ్ ని కలుద్దామా'? అని అడిగాడు రంగ.
'కలిసి వాడితో ఏమి మాట్లాడాలో నిర్ణయించుకున్నాక కలుద్దాం'....అన్నాడు శ్రీహర్ష.
వెంటనే త్వరగా హాస్పిటల్ లోకి నడిచాం .....గేటు దగ్గర సెక్యూరిటీ చెయ్యి అడ్డంగా పెట్టాడు.
రంగా వెంటనే పది రూపాయలు చేతిలో పెట్టాడు...నా చేయి పట్టుకుని లోనికి నడిచాడు.
సరాసరి మార్చురీ గది వైపు వెళ్ళాము. డోర్ క్లోజ్ చేసి ఉంది. ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక బాయ్ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
మమ్ముల్ని చూస్తూనే గార్డ్ లేచి వస్తూ 'ఎవరు సార్ ..... ఏం కావాలి' ?
'మేము 'డైలీ న్యూస్' నుంచి వచ్చాం ........క్రైం రిపోర్ట్ ....ఏమైనా విశేషాలు ఉంటె వ్రాసుకుందామని'.....
'ఎవరూ లేరులా వుంది'...... అంటూ వెనక్కి తిరిగాడు శ్రీహర్ష.....రంగా వంక కన్ను గీటుతూ .
'అదేంది ....సార్ ....ఆగండి. ఇయ్యాల రెండు 'బాడీ'లు వచ్చినయ్యి సార్ ....
ఒకటి 'బోయినపల్లి' చౌరస్తా.... ఆక్సిడెంట్, రెండోది చిలకలగూడా ....మర్డర్ కేసు.
రెండు కేసులు ఇంకా 'పోస్ట్ మార్టం' కాలేదు సార్. ఇంకొక రెండు గంటలలో 'పోస్ట్ మార్టం' అయిపోతది సార్.
డాక్టర్ ఇప్పుడే వస్తున్నానని కబురు చేసిండు.
'సరే... అంటూ వాడి చేతిలో వంద రూపాయలు పెట్టె సరికి సెల్యూట్ కొట్టి ....ఇంకా ఏమైనా సంగతి కావాలంటే చెప్పు సార్ 'అన్నాడు టక్కున సెల్యూట్ కొట్టి.
'మర్డరు కేసులో .....బాడీ గురించి ఎవరైనా వచ్చింరా '? 'కేసు గురించి ఏమైనా తెలుస్తే చెప్పు'అచ్చు రిపోర్టరులా పాకెట్ నోట్ బుక్, పెన్సిల్ పాకెట్ లో నుంచి తీసి వ్రాయడానికి సిద్ధమవుతు ...
'ఇంకా ...ఏమీ తెలవదు సార్....ఇచిత్రంగా ఉంది....ఇంతవరకు ఎవరూ రాలే'.....ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టిఅన్నాడు సెక్యురిటి గార్డ్.
'సరే.....నేను మళ్ళీ వస్తా....ఆ కేసు గురించి ఎవరైనా వస్తే ...పేరు.....ఫోన్ నంబరు ...అన్నీ నోట్ చేసుకో... ఇక మాకు
న్యూస్ కావలసినప్పుడల్లా నీ దగ్గరికే వస్తా'....నీ డ్యూటీ ఎన్ని గంటలదాకా ఉంది?
'అరె....ఫికరు చెయ్యకు సార్ ....నేను ఇప్పుడే రెండు గంటలకు డ్యూటీ ఎక్కినా సార్....రేపు మజ్జాన్నం దాకా నేనే ఉంటా సార్' నా పేరు 'మల్లేష్' .....ఉత్సాహంగా అన్నాడు.
'నీదగ్గర మొబైల్ ఉందా'......? తన జేబులు వెతుక్కుంటూ.
'ఉంది సార్......ఏమైనా కాల్ చేసుకోవాలా ఇదిగో సార్' జేబులోంచి మొబైల్ ఫోను తీసి ఇవ్వచూపుతు అన్నాడు సెక్యురిటి గార్డ్.
'లేదు... నీ నంబరు చెప్పు....నీకు ఫోను చేస్తా ఇంకో గంట తరువాత' ....
'నంబరు'......రాసుకో సార్.
ఫోను నంబరు నోట్ చేసుకుని హాలు బయటకు రాగానే మళ్ళీ తగిలాడు ఇందాకటి వాడు.
'క్యా హువా సాబ్..... 'పోస్ట్ మార్టం' తొందరగా చేయించాలా' మర్డరు కేసు కదా సాబ్ ? తెలిసిన వాళ్ళు ఉన్నారు సాబ్ మావెంటనే నడుస్తూ అన్నాడు బ్రోకరు.
'అరె భాయి....మాకేమీ సాయం అవసరం లేదు ......'గట్టిగా అన్నాడు రంగ.
'అరె ... అంత కోపం ఎందుకు సాబ్ ? మీరు అక్కడ వాడిని ఏదో' హెల్ప్' అడ్గు తున్నారు కదా......' అన్నాడు వాడు రంగా మొహంలోకి చూస్తూ.అన్నాడు.
'అయితే విను.....మేము న్యూస్ పేపర్ వాళ్ళం.....క్రైం న్యూస్ కోసం వచ్చాం.....చెప్పు...నీ పేరేంటి ?
'ఇక్కడ నీ పనేమిటి' ?...... జేబులో నుంచి పేపర్, పెన్నుతీసే సరికి అక్కడనుంచి ఒక్క ఉదుటున పరుగు లంకించుకున్నాడు బ్రోకరు.
'బతుకు జీవుడా.....' వీడు వదిలాడు .....ఇక మన పని ఏమిటి ? అన్నాడు కొద్దిగా అసహనంగా.
'ఏం ...ద....న్నా....అప్పుడే విసుగు వచ్చేస్తోంది....ఇంకా మొదల్లోనే ఉన్నాం'.....అన్నాడు రంగా శ్రీహర్ష్ ని
ఆట పట్టి స్తూ.
'సరే....తమ్మీ....ఇప్పుడు వాట్ నెక్స్ట్ ?........ఏంచేద్దాం' ? అన్నాడు శ్రీహర్ష వేరే గత్యంతరం లేక.
'ఇక్కడే ....ఇంకో గంట...రెండు గంటలు వెయిట్ చేద్దాం'...ఎవరైనా బాడీ కోసం వస్తారేమో చూద్దాం' అన్నాడు రంగ.
'సరే....నేను పోస్ట్ మార్టం రూం వైపు చూస్తూ వుంటాను. ఎలాగు పోలీసు కానిస్టేబుల్ ఇక్కడే వున్నాడు...ఎవరైనా వస్తే కచ్చితంగా అతన్ని కలుస్తారు....కనుక అతన్ని కనిపెట్టి వుంటాను....అన్నాడు శ్రీహర్ష.
'బావుందిరా....అలాగే' అన్నాడు రంగ.
                                                                  *******

అది చిలకలగూడ పోలీసు స్టేషను. టైం దాదాపు మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. ఎస్.ఐ రంగనాథ్ ఉదయం చిలకలగూడ రైల్వే బ్రిడ్జి దగ్గర భావిలో దొరికిన శవం కేసులో పట్టుకొచ్చిన అయిదుగురు జులాయిలను ఇంటరాగేట్ చేస్తున్నాడు. కానిస్టేబుల్ పరశురాం, మొయిన్ ఖాన్ అతనికి కొన్ని వివరాలు అందించారు. వాటి ఆధారంగా కేసులో ప్రొసీడ్ అవుతున్నాడు రంగనాథ్. ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్ రాలేదు. ముందుగా అయిదుగురు జులాయిల్ని వారి పద్దతిలో ఇంటరాగేట్ చేశారు పరశురాం, మొయిన్ ఖాన్. ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర బయట ఆటో గ్యాంగ్ తో గ్రూప్ క్లేషేస్ అయ్యాయని, బాగా కొట్లాట అయిందని, ఆ గొడవలో వీళ్ళ గ్రూప్ లో 'శ్రీను' బయటవాళ్ళు కొట్టుకొచ్చిన డబ్బు, మొబైల్ ఫోను కొట్టేసి పారిపోతుంటే ఆటో గ్యాంగ్ గుండాలు వాణ్ని వెంబడించారని, ఇంతలో పోలీసు వాళ్ళ పెట్రోల్ పార్టీ వచ్చిందని దాంతో ఎటువాళ్ళం అటు పారిపోయామని, చీకట్లో ఆ గొడవలో డబ్బుబ్యాగు ఎవరిదగ్గర చేరిందో తమకు తెలవదని , అది వారికెవరికి దొరకలేదని ఆబ్యాగులో మాత్రం చాలా డబ్బు ఉందని వాళ్ళు స్టేట్ మెంటు ఇచ్చారు. వాళ్ళ దగ్గర 'రికవర్' చేసిన కొద్ది డబ్బు, బంగారం, మొబైల్ ఫోనులు గాని ఈ కేసుకు సంబంధించి ఏమి 'లీడ్స్' గాని 'క్లూ' గాని దొరకలేదు. ఎస్.ఐ రంగనాథ్ కూడా దాదాపు రెండుగంటల పాటు ఒక్కరోక్కరిగా అందరిని మళ్ళీ ఇంటరాగేట్ చేశాడు.
'డబ్బు ఉన్న 'బ్యాగు', మొబైల్ ఫోను ఏమయ్యాయి'? పెన్సిల్ నుదురు మీద కొట్టుకుంటూ ఆలోచిస్తున్నాడు. వెంటనే సి.ఐ తో డిస్కస్ చేసి కేసు ప్రోగ్రెస్ డిస్కస్ చేసి సూచనలు, ఆదేశాలు తీసుకుని
వెంటనే పరశురాంని, మొయిన్ ఖాన్ ని పిలిచి ఆక్సిడెంట్ స్పాట్ కి వెళ్లి మిస్ అయిన ఆ రెండు వస్తువుల్లో ఏమైనా దొరుకుతాయేమో వెతకమన్నాడు........వాళ్ళు బయలుదేరుతుంటే వాళ్ళని వెనక్కి పిలిచి 'డిటైన్' చేసిన ఆ అయిదుగురు 'నిందితులలో' ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి వాళ్ళు అతని వెంటబడ్డ ప్రదేశం నుంచి ఎటాక్ చేసిన ప్రదేశం, అతన్ని పడేసిన భావి దగ్గర ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతకమన్నాడు. ఏచిన్న'క్లూ' కూడా వదలవద్దని గట్టిగా చెప్పి పంపాడు. తను వేరే స్టేషను లలో మనీ 'తెఫ్ట్' కేసులేమైనా రిపోర్ట్ అయ్యా ఏమోనని 'చెక్' చేసుకున్నాడు. అలాంటి కేసులేమీ రిపోర్ట్ కాకపోవడం తో వెళ్ళిన 'సెర్చ్' పార్టీ రిపోర్ట్ కోసం ఎదురు చూడసాగాడు.
వాళ్ళు వెళ్ళిన గంటలోపే పరశురాం ఫోను చేశాడు.
'సార్......మొబైల్ ఫోను ఒకటి దొరికింది....ఇక్కడే 'ఓల్డ్ బ్రిడ్జి' దగ్గరే తుప్పల్లో ఉంది. దానిమీద రక్తపు మరకలున్నాయి...సార్' అన్నాడు పరశురాం.
'ఫింగరు ప్రింట్స్ ఏమీ పడకుండా జాగ్రత్త .....మీరు వెంటనే వచ్చేయండి'.....పరశురాం కి చెప్పి వెంటనే హాస్పిటల్ కి ఫోను చేసి 'పోస్ట్ మార్టం' ఎంతవరకొచ్చిందో 'ఎంక్వైర్' చేసి వేరే ఫైల్ చూస్తూ 'సెర్చ్' పార్టీ కోసం వెయిట్ చెస్తూ కూర్చున్నాడు.
'పది నిముషాల్లో వాళ్ళు తిరిగిరావడం తోనే తను గ్లోవ్స్ వేసుకుని మొబైల్ ఫోను తీసుకుని 'రీసెంట్ కాల్స్' చూసి
ఒక నంబరు నుంచి 19 కాల్స్ గమనించాడు. వెంటనే అదే మొబైల్ నుంచి ఆనంబరుకి కాల్ చేశాడు.
అవతలనుంఛి ఎవరో పెద్ద మనిషి గొంతు వినిపించింది.
'హలో ఏమైపోయావురా బాబూ.....నిన్ననగా వెళ్లావు....రాత్రి అంతా ఏమైపోయావు, ఫోను ఎత్తవు......ఎక్కడున్నావు ...ఫోను ఎందుకు ఎత్తడంలేదు...ఇక నేనే బయలుదేరుదామనుకుంటున్నాను' గొంతులో తీవ్ర ఆందోళన గమనించాడు రంగనాథ్ ఎస్.ఐ.
అవతల మాట్లాడుతోంది ఓ పెద్దాయనలా ఉందని 'నా పేరు రంగనాథ్ అండీ....నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.........' అన్నాడు రంగనాథ్.
'ఈ నంబరు ఫోను ఎవరిదండీ ' ?.....అన్నాడు రంగనాథ్.
'మీరెవరండీ....ఈఫోను మీదగ్గరికేలా వచ్చింది....మావాడెక్కడ' ? తీవ్ర ఆందోళనతో బొంగురుపోయిన గొంతుకతో
'మీరేమీ ....కంగారు పడకండి... ఈ ఫోను నాకు దొరికింది... మీరు అడ్రస్ చెపుతే నేను వచ్చి ఫోను ఇద్దామని' ఫోను చేశాను కావాలని అబద్ధం చెప్పాడు రంగనాథ్
' అయ్యో...అయితే మా అబ్బాయి ఎక్కడ .......ఉ....న్నా...డు ' ? అడిగాడు ఆయన తీవ్ర ఆందోళనతో.
'చూడండి....మీ పేరేంటో.... మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు'.. మీ అడ్రస్ చెబుతే నేను ఇప్పుడే వచ్చి మీ ఫోను ఇవ్వగలను.
'బాబూ...నేను 'జనగాం' నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కేశవరావు. మా అబ్బాయి పేరు చంద్రకుమార్. నేను ఇప్పుడు జనగాం నుంచే మాట్లాడుతున్నాను' నీరసంగా సమాధానం చెప్పాడు కేశవరావు గారు.
'అలాగా అండీ ....అయితే ఇక్కడ మీవాళ్ళు ఎవరైనా వుంటే చెప్పండి....వాళ్లకి ఫోను ఇస్తాను' అన్నాడు ఎలాగైనా వాళ్ళ తో కాంటాక్ట్ కావాలి..... పెద్దాయనను ఏమీ పూర్తిగా తెలియకుండా కంగారుపెట్టకూడదన్న భావనతో.
'అలాగే బాబూ....నా తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటిలో ప్రొఫెసర్ ఏకాంబరేశ్వర రావు, ఫోను నంబరు చెపుతా నోట్ చేసుకో బాబూ....అంటూ ఆయన మొబైల్ నంబరు చెప్పాడు కేశవరావు గారు'......
'థేంక్ .... 'గాడ్' ఏదో ఒక కాంటాక్ట్ దొరికింది ' అని మనసులో అనుకుంటూ 'ఇంకో గంటలో మీకు మీ అబ్బాయి ఎక్కడవున్నాడో ఏమీ ఇన్ఫర్మేషన్ తెలవక పోతే మీ తమ్ముడి గారితో మాట్లాడి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి......
'ఇంకా లేటు చెయ్యకండి....' అని చెప్పి ఫోను కట్ చేసి వెంటనే తన మొబైల్ నుంచి ప్రొఫెసర్ ఏకాంబరేశ్వరరావుగారికి కాల్ చేశాడు.
'ఎస్....థిస్ ఈజ్ ప్రొఫెసర్ ఏకాంబరేశ్వర రావు .....హు ఈజ్ కాలింగ్'?
'సర్......నా పేరు రంగనాథ్....చిలకలగూడ 'ఎస్. ఐ ని' మీతో అర్జెంట్ గా రెండు నిముషాలు మాట్లాడాలి.
'ఎస్....ఇన్స్పెక్టర్ ...వాట్ ఈజ్ ది మేటర్' హౌ కేన్ ఐ హెల్ప్ యు' ? చాలా కూల్ గా అన్నారు ప్రొఫెసర్.
' సర్...మీ బ్రదర్ సన్ 'చంద్రకుమార్' కుమార్ గారి మొబైల్ ఫోను చిలకలగూడ దగ్గర రైల్వేట్రాక్ పక్కన తుప్పల్లో
దొరికింది ..... మీ బ్రదర్ కేశవరావు గారితో మాట్లాడాను. చంద్రకుమార్ నిన్న సిటి కి వచ్చారట.... ఇంకా ఇల్లు చేరలేదట....నేను వారికి పోలీసు నని చెప్పలేదు....పెద్దాయనలా అనిపించారు.....కంగారు పడతారేమోనని.....'
'ఎస్' ఇన్స్పెక్టర్ యు 'డిడ్' ఎ వండర్ఫుల్ జాబ్ ......ఐ రియల్లీ అప్రిసిఎట్ యువర్ కన్సర్న్ మిస్టర్ ....?'
'రంగనాథ్ సర్'........ఈ విషయంలో మిమ్ముల్ని నేను అర్జెంట్ గాఇప్పుడే కలవాలి.......మీతో చాలా అర్జెంట్ గా డిస్కస్ చేశే విషయాలు....మీకు చూపించవలసినవి ....ఉన్నాయి' గొంతులో 'అర్జెన్సి' అర్ధమయ్యేలా మాట్లాడాడు రంగనాథ్.
'ఎస్.....ఇన్స్పెక్టర్.....నేను 'యునివర్సిటి' నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎక్కడికి రావాలో చెప్పండి?
వెంటనే వచ్చేస్తాను' అన్నారు ప్రొఫెసర్ .
'సర్....మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ వెనక గేటు దగ్గరికి అంటే భోయిగూడ వైపుకి రండి' నేను మీకోసం వెయిట్ చేస్తూ వుంటాను' అని వెంటనే ఫోను 'కట్' చేశాడు రంగనాథ్ కావాలనే.
వెంటనే ఆ మొబైల్ ఫోనుని ఓ 'జిప్ లాక్ ' కవర్ లో వేసి దాన్ని తీసుకుని ఒక అర్ధగంటలో వస్తానని ఈ లోపులో ఫోరెన్సిక్ వారిని వెంటనే పిలవమని చెప్పి పరశురాం ని, మొయిన్ ఖాన్ ని పోలీసు స్టేషనులోనే ఉండమని చెప్పి తన 'బుల్లెట్' మోటర్ బైక్ స్టార్ట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ కి బయలు దేరాడు రంగనాథ్.
'రంగనాథ్ హాస్పిటల్ వెనకాల గేటు దగ్గర 'పోస్టుమార్టం' రూం దగ్గర ఓ పక్కగా తన బుల్లెట్ బైక్ పార్క్ చేసి టైం చూశాడు. మూడు ముప్ఫై అయిదు నిముషాలవుతోంది.
'రంగనాథ్' అక్కడ పోస్ట్ చేసిన 'డ్యూటీ' కానిస్టేబుల్ కోసం చుట్టూ కలియ చూశాడు. ఎక్కడా కన్పించలేదు.
'వీడు ఎక్కడున్నాడో.... అనుకుంటూ రూం వైపు నడిచాడు ఎస్. ఐ. రంగనాథ్.
'పోస్ట్ మార్టం' రూం ముందు బెంచి మీద కూర్చుని 'బీడీ' కాలుస్తున్నాడు 'కానిస్టేబుల్' ఇంతియాజ్ అలీ.
'రంగనాథ్' ని చూస్తూనే 'బీడీ' విసిరేసి 'సెల్యూట్' కొట్టాడు ఇంతియాజ్ అలీ.
' డాక్టరు సాబు ఇప్పుడే వచ్చిండు....ఇంకా మన బాడీ కి 'పోస్ట్ మార్టం' కాలేదు సాబ్..... బోయిన పల్లి ఆక్సిడెంట్ డెత్ కేసుది అవుతోంది సాబ్....... 'రిపోర్ట్' అంతా 'అప్ టు డేట్ ' చేశాడు ఇంతియాజ్ అలీ.
'వీడి బొంద 'తెలుగు'...... మన 'బాడీ' అట ......చంపుతున్నాడు వీడు'.....అనుకుంటూ.
'ఇంతియాజ్'.. ఇప్పుడు ఒకసారు వస్తాడు...ఆయనకు ఆ డెడ్ బాడీ చూపించు...ఆ సారు ఏమైనా గుర్తు పడతారేమో చూద్దాం...'..... అని చెప్పి వడివడిగా బయటకు నడిచాడు రంగనాథ్.
రెండు నిముషాల్లో వెనక గేటు దగ్గరకు వెళుతూనే గమనించాడు....తెల్లటి మారుతి కారు ఆగడం.
వెంటనే దిగి కార్ లాక్ చేసి వస్తున్నమనిషికి ఎదురుగా వెళ్లి...... 'ప్రొఫెసర్ ఏకాంబరేస్వర రావు' ?
చేతిని ముందుకు జాపుతు షేక్ హ్యాండ్ ఇచ్చి .....రండి సర్......రాత్రి చిలకలగూడా ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక
'డెడ్ బాడీ' ని భావిలోనుంచి రికవర్ చేశాము. ఈ ఫోను కూడా ఆ ప్రదేశం దగ్గరలోనే దొరికింది. ఈ ఫోనుకు.... దొరికిన బాడీ కి ఏమైనా సంబంధం ఉందా అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఈ మొబైల్ ఫోను చూడండి. ఇది మీ అన్నగారి అబ్బాయి 'చంద్రకుమార్' దేనా ? మీరేమైనా ఈ ఫోనును గుర్తించగలరా ? ఫోనును జిప్ లాక్ కవరుతోనే ప్రొఫెసర్ కి అందిస్తూ చాలా కూల్ గా మాట్లాడాడు రంగనాథ్.
'ఎస్ ....ఈ మొబైల్ 'చందుదే' నిన్నసాయంత్రం ఆరు .... ఆరున్నర మధ్య మాఇంటి నుంచే వాడు వేరే పని మీద వెళ్ళాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి పోతానన్నాడు.
'ఓకే.... ఇన్స్పెక్టర్.....లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ . లెట్స్ సి ది బాడీ.....' చాలా నిబ్బరంగా నడిచారు ప్రొఫెసర్.
ఇద్దరు 'పోస్ట్ మార్టం' రూం వైపు నడిచారు. గది తలుపు తెరిచాడు ఇంతియాజ్ అలీ .
అక్కడే ఉన్న బాయ్ వచ్చి బాడీ మీద షీట్ తీసి పక్కకు జరిగాడు.
'బాడీ ముఖం చూస్తూనే .....'నో...నో....చందు కాదు....నో.....'థేంక్ గాడ్' ఇట్ ఇజ్ నాట్ చందు.......' అని ఆయన ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ....బయటకు నడిచాడు ప్రొఫెసర్.
'హౌ సాబ్....ఈ పోరడు ........చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రైల్వే స్టేషను కాడనే వుంటడు.....రైల్వే వేడిని చాలా సార్లు పట్టుకున్నారు సాబ్' అన్నాడు ఇంతియాజ్ అలీచాలా కాన్ఫిడెంట్ గా.
'ముందే ఈ సంగతి ఎందుకు చెప్పలేదు నాకు ....' అన్నాడు రంగనాథ్ బయటకు నడుస్తూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ....
'ఇంతలో 'రూం' గుమ్మం ముందే నిలబడి లోపలి తొంగి చూస్తూ అందర్నీ గమనిస్తున్న అతన్ని 'మీరెవరు' అనడిగాడు..'రంగనాథ్'
'మా వాళ్ళది 'పోస్ట్ మార్టం' ఉందండీ అని పక్కకు నడిచాడు ఆ ఆగంతకుడు ఎవరోకాదు .....శ్రీహర్ష.
'ఒక్కనిముషం సర్......అంటూ మళ్ళీ లోనికి వెళ్లి 'ఇంతియాజ్....'పోస్ట్ మార్టం' కంప్లీట్ కాగానే స్టేషనుకి వచ్చెయ్యి లేటు చేయవద్దు....అర్జెంట్ పని ఉంది ' అని చెప్పి వచ్చాడు.
'బయటకు వస్తూనె 'సర్' బాడీ చంద్రకుమార్' ది 'కన్ఫర్మేడ్' గా కాదు. కాని ఆ పరిసరాల్లో దొరికిన ఫోను మాత్రం అతనిది.
"అంటే ఆ ఏరియా కి నిన్న చంద్ర కుమార్ వచ్చాడా?....వస్తే ఎక్కడికి వెళ్ళాడు ? ఈ ఫోను ఇక్కడ దొరకడ మేమిటి ? అతనికేమైనా అపాయం జరిగిందా ?.....అన్న ప్రశ్నలు బుర్రను తొలుస్తున్నా వెంటనే వర్తమానం లోకి వచ్చి ప్రొఫెసర్ వంక తిరిగి 'సర్'.......
"అతని దగ్గర ఏమైనా కేష్ గానీ వేరే విలువగలిగిన వస్తువులు గానీ ఉన్నాయా?
అతను మీతోగానీ, వారి కుటుంబ సభ్యులతోగాని మీఇంటి నుంచి వెళ్ళిన తరువాత మాట్లాడాడా?
మాట్లాడితే ఏమి మాట్లాడాడు?"...అన్న ప్రశ్నలకు సమాధానం మీరు....మీ అన్నగారితో మాట్లాడి ఇప్పుడు చెప్పగలరా"....' అన్నాడు రంగనాథ్ .
'మీకు ఇబ్బంది కాకుంటే ....మీరు కూడా స్టేషను కి వస్తే...మనం పది నిముషాలు కూర్చుంటే....
'ఐ థింక్ వుయ్ కెన్ థింక్ ఓవర్ .....అండ్ ప్రొసీడ్.....' అన్నాడు రంగనాథ్
'బయ్ అల్ మీన్స్....ఐ విల్ ఫాలో యు టు స్టేషన్' అన్నాడు ప్రొఫెసర్ కారు దగ్గరకు నడుస్తు.
ఫోను మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ వీరిద్దరిని వెనకాలే ఫాలో అవుతూ వచ్చి ప్రొఫెసర్ కార్ నంబరు నోట్ చేసుకున్నాడు శ్రీహర్ష.
వారిద్దరు స్టేషనుకి బయలుదేరి పది నిముషాల్లో చిలకలగూడ పోలీసు స్టేషను కి వచ్చేశారు.
ప్రొఫెసర్ 'కార్' పార్క్ చేసి బయటనిలబడి....'నేను మాఅన్నగారితోమాట్లాడి ఇప్పుడే వస్తాను' అన్నాడు రంగనాథ్ తో. రంగనాథ్ తలూపుతూ స్టేషన్ లోనికి నడిచాడు.
'స్టేషను కి రావడమే ఆలస్యం....పరశురాం కానిస్టేబుల్ రంగనాథ్ కి సెల్యూట్ కొట్టి రైల్వే పోలీసు ఎస్.ఐ గారు
ఫోను చేశారు.ఒక కానిస్టేబుల్ ని ఇచ్చి ఎవరో 'ఒకతన్ని' ఇక్కడకు పంపారు. ఆయన అర్జెంటు గా మిమ్మల్ని కలవాలంట. కంప్లైంట్ ఇవ్వాలంట. మీరు ఇప్పుడే వస్తారు ఆగమని చెప్పినం సార్ ' బ్రీఫ్ గా ఎస్.ఐ ' ఏబ్సేన్స్' లో స్టేషను లో ఏమిజరిగిందో చెప్పాడు.
'స్టేషనులోకి వెళ్లి 'హేట్' తీసి టేబుల్ మీద పెడుతూ ఎదురుగా కుర్చీలో కూర్చున్న అతన్నివివరంగా చూస్తూ.... నలిగిన మాసిన షర్టు మీద అక్కడక్కడ రక్తం మరకలు, నిద్ర లేనట్లు మొహం అంతా పీక్కు పోయి.....కళ్ళు ఎర్రగా, ఏదో పోగుట్టుకున్న వానిలా ఉన్న అతన్నిచూస్తూ 'చెప్పండి' వాట్ కెన్ ఐ డు ఫర్ యు' ? అన్నాడు.
అంతలో రైల్వే కానిస్టేబుల్ ' సార్ .....ఈవేళ పగలు ఒంటి గంటకు 'భోయిగూడ' వైపు రైల్వే పార్కింగ్ లాట్ లో ఓ మూల ఉన్న పాత అన్ క్లైమ్డ్ కార్ లోపల నోరుమూసి టేప్ వేసి, కాళ్ళు చేతులు కట్టి పడేసి మత్తులో ఉన్న ఇతన్ని ఎవరో చూసి మాకు రిపోర్ట్ చేశారు. మేము వెళ్లి ఇతన్ని రెస్క్యు చేసి కట్లువిప్పి, డాక్టరు కి చూపించి అతను కొద్దిగా తేరుకున్నాక ........ తనవి కేష్ పదిలక్షల దాకా పోయాయని కంప్లైంట్ చేయాలని చెబుతే
మా ఎస్.ఐ గారు మీ పోలీసు స్టేషన్ లో ఇతన్ని దించి రమ్మని నన్ను పంపారు సార్. ఇక నేను వస్తాను సార్' అని అతను బయలుదేరాడు.
రైల్వే కానిస్టేబుల్ అటు వెళ్ళగానే కూర్చున్నవాడల్లా లేచి ' సర్.....నా పేరు 'చంద్ర కుమార్', మాది జనగాం.....నిన్నరాత్రి......'
హబ్సిగూడా' లో మాకు రావలసిన డబ్బు పది లక్షలు కలెక్ట్ చేసుకుని అక్కడే ఒక మొబైల్ షో రూం లో ఒక ఆపిల్ ఐ ఫోను కొని లేటు కావడంతో కేష్ తో అప్పుడు జనగాం పోవడం 'రిస్క్' అని ఆటో తీసుకుని మారేడుపల్లి లో మా బాబాయి గారింటికి బయలుదేరాను. ఆటో మేట్టుగుడా రైల్వే బ్రిడ్జ్ దాటగానే రైల్ నిలయం వైపు తిరగకుండా చిలకలగూడ ఓల్డ్ బ్రిడ్జ్ వైపు తిరగగానే ఆటో స్లో అయింది. నేను రియాక్ట్ అయ్యే లోపునే ఇద్దరు గుండాల్లా ఉన్న ఇద్దరు ఆటోలో ఎక్కారు. ఒకడు డ్రైవరు పక్కన రెండో వాడు నాపక్కన కూర్చుంటునే నా మొహాన్ని ఏదో గుడ్డతో నొక్కి పెట్టాడు. తరువాత ఏమి జరిగిందో....ఏమో నాకు తెలియదు. రైల్వే పోలీసు వాళ్ళు నన్ను రెస్క్యు చేసిందాకా నేను స్పృహలో లేను. నా డబ్బు అంతా పోయింది. తరువాత ఏo జరిగిందోమీకు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ చెప్పాడు.
'సార్ 'నేను' ఒక ఫోను చేసుకోవచ్చా....ఇంటి దగ్గర మావాళ్ళు కంగారు పడుతూ వుంటారు'....ఆందోళనతో తను ఇంతవరకు ఇంటికి ఫోనుచేయలేదని గుర్తుకి వచ్చి.
'పరశురాం'....బయట ప్రొఫెసర్ 'సర్' ఉంటారు.....లోపలకి రమ్మని చెప్పుఅన్నాడు రంగనాథ్.
' ఈ ఫోను చూడండి.....ఇదేమైనా గుర్తు పట్టా గలరేమో.....' టేబుల్ సొరుగు నుంచి ఫోనుఉన్న జిప్ లాక్ కవరు
చూపిస్తూ '......అన్నాడు రంగనాథ్.
'అరె...ఈ మొబైల్ నాదేనండీ......' ఇక్కడికి ఎలా వచ్చింది' ? ఆశ్చర్యంగా అన్నాడు చంద్రకుమార్.
'ఆ సంగతి తరువాత .....ముందు మీ ఇంటికి ఫోను చేసి , పేపరు తీసుకుని ఒక కంప్లైంట్ వ్రాశి ఇవ్వండి అంటూ తన మొబైల్ ఫోను చంద్రకుమార్ కి ఇస్తూ' అన్నాడు రంగనాథ్ అతని ఆందోళన అర్ధం చేసుకుని.
ఇంతలో ప్రొఫెసర్ లోపలకి వస్తూనే చంద్రకుమార్ ని చూసి,
''అరే.....చందూ.....'నువ్వా' ఏమయిపోయావు ? ఎక్కడికి వెళ్లావు' ? 'వాట్ ఈజ్ థిస్ ఆల్ అబౌట్'' ఈజ్ ఎవ్విరి థింగ్ ఆల్ రైట్' ? అంటు చంద్రకుమార్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయివేసి ' ముందు ఇంటికి ఫోను చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పు' అని చెప్పిఆప్యాయంగా భుజం తట్టి తను రంగనాథ్ వైపు తిరిగి 'ఎస్.ఐ' గారూ.....'నేను మా అన్నయ్య గారితో మాట్లాడాను.....ఇప్పుడు 'చందు' కన్పించాడు కాబట్టి.....థింగ్స్ ఆర్ డిఫరెంట్ నౌ .....బట్ ఐ థింక్ సంతింగ్ ఈజ్ వెరీ సీరియస్..... ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఇన్ స్టాక్ '......అంటూ ఎడం చేత్తో నుదురు పట్టుకుని కళ్ళు మూసుకుని 'చందు' పక్క కుర్చీలో కూర్చున్నారు. ********
టైం సాయంత్రం నాలుగు గంటలవుతోంది. శ్రీహర్ష, రంగా ఇద్దరు హాస్పిటల్ 'పోస్ట్ మార్టం' రూం దగ్గరనుంచి బయలుదేరారు. మర్డరు కేసు 'బాడీ' కోసం ఎవరు రాకపోవడంతో. శ్రీహర్ష బైక్ మీద వెనకాల కూర్చున్నాడు. రంగాని 'చిలకలగూడ' పోలీసు స్టేషను దగ్గరకు పోనివ్వమన్నాడు. 'బైక్'ని ఓ పక్కగా పార్క్ చేసి పక్కనున్న పాన్ షాప్ ముందునుంచి స్టేషను కంపౌండ్లో ఎస్.ఐ బుల్లెట్ బైక్
స్టేషను బయట ఇందాకటి వైట్ మారుతి కార్ పార్క్ చేసి ఉండడం గమనించాడు.
'రంగా....నా 'సిక్త్ సెన్స్' చెబుతోంది....మనకు కావలసిన లీడ్ కచ్చితంగా ఈ కారు, కారులోని వ్యక్తి' అని నా నమ్మకం అని ధృడంగా అన్నాడు శ్రీహర్ష.
'అలా అయితే ఇక్కడే కాసేపు వెయిట్ చేద్దాం....ఆ కారు ఎక్కడికి వెళుతుందో ఫాలో అవుదాం' అన్నాడు రంగా శ్రీహర్ష మాట మీద నమ్మకముంచి.
'అరె ...మీరా? ఏందన్నా...... పోలీసు స్టేషనులో పనేమయినా ఉన్నదా ? అంతా మనోల్లె అన్నా '? గార పళ్ళతో 'పాను' నోట్లో కుక్కుకుంటు నవ్వుతు అడిగాడు 'పోస్ట్ మార్టం' రూం దగ్గర తారసపడ్డ బ్రోకరు.
'రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు ....ఇక్కడా వాడే.....ఇక బయలుదేరు మనం ఇక్కడ ఉండడం ప్రమాదం' అన్నాడు ' శ్రీహర్ష బైక్ దగ్గరకు నడుస్తూ.
'పోరా ....నీకు ప్రతీది అనుమానమే .....ఉండు..... అయిదు నిముషాలు చూద్దాం ' అన్నాడు రంగా ఆశావహంగా ఏదైనా 'క్లూ' దొరుకుతుందేమోనన్న ఆశతో .
రెండు, మూడు నిముషాలయిందో కాలేదో ప్రొఫెసర్ తో ఎస్. ఐ మాట్లాడుతు బయటకు రావడం గమనించాడు. వారి వెంట ఇంకొక వ్యక్తి ప్రొఫెసర్ వెనకాల స్టేషను బయటకు రావడం ... తరువాత ప్రొఫెసర్ అతను కలిసి కారు ఎక్కి బయలుదేరడం గమనించి రంగా కూడా వెంటనే బైక్ స్టార్ట్ చేసి రెడి గా ఉన్నాడు. 'శ్రీహర్ష' వారిద్దరిని పోలీసు స్టేషను గేటు దగ్గరనుంచి చాలా దగ్గరగా నడుస్తూ ఫాలో అవుతుండడం గమనించాడు రంగ. ఈ హడావుడిలో ఎస్. ఐ 'శ్రీహర్ష' ని గమనించడం రంగాకి స్పష్టంగా కనిపించింది.
కారు టర్న్ తీసుకుని సికందరాబాదు వైపు వెళ్తోంది.
శ్రీహర్ష వెనక ఎక్కడంతోనే ఆ కారుని మిస్ కాకుండా ఫాలో అవుతున్నాడు రంగ.
కారు ట్రాఫిక్ లో మెల్లగా వెళుతూ 'సంగీత్' సినిమా కూడలి మీదుగా ఈస్ట్ మారేడుపల్లి ...నర్సింగ్ హోం పక్కన సందులోకి
తిరిగి లెఫ్ట్ సైడ్ పెద్ద అశోక చెట్లు ఉన్న ఇంటి గేటులోనికి వెళ్ళడం చూసి రంగా కూడా ఇంకొద్ది ముందుకి వెళ్లి ఓ కూరగాయల దుకాణం దగ్గర ఆపాడు బైక్.
బైక్ ఆగడమే తరువాయి...శ్రీహర్ష వెంటనే బైక్ దిగి దుకాణం అతనితో ' ఇక్కడ దగ్గరలో తెల్ల మారుతి కారు ఉన్న సార్ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా బాబూ'?.....అనడిగాడు.
'అదేంది సార్...తెల్ల కార్లు చాలా మందికి ఉన్నాయ్....చిన్న తెల్ల కారా? చికాకుగా అంటూ
'ఇక్కడ నుంచి మూడో ఇంటిలో మాత్రం ప్రొఫెసర్ సారు వాళ్ళు ఉంటరు. ఆయనది పాత తెల్లకారు. చిన్నది' అన్నాడు దుకాణం అతను.
'ఆ..ఆ...అదే పాత తెల్ల కారు ఉన్న .ప్రొఫెసర్ గారే '.....జేబులోంచి పేపరు తీసి చదువుతున్నట్లుగా నటిస్తూ అన్నాడు శ్రీహర్ష.
'ఏకాంబసవ రావు ' సారేనా? ఆయన పేరుని ఖూనీ చేస్తూ,
ఆ పేరు పలకలేక నానా బాధ పడుతూ అన్నాడు దుకాణం అతను.
' ఆ....ఆ .....అవును ... ఏకాంబరేశ్వరరావు .......' ఆయన ఇల్లే కదా అది' అన్నాడు శ్రీహర్ష ఇంకా ఏమి మాట్లాడాలో పాలుపోక.
'జీన్స్...పేంటు వేసుకుని బాగా జుట్టు పెంచినకుర్రాడు ఒకతను ఆగేటు తెరుస్తున్నాడు' ఆ కుర్రాడు ఎవరు'? అన్నాడు శ్రీహర్ష.
'ఆయనా....ప్రొఫెసరు సారి కొడుకు......ఉత్త 'బేకారు' పోరడు...సారు ఎప్పుడు పరేశానే కొడుకు గురించి....
ఒక చదువు లేకపాయే....తింటడు.. పోకిరోల్లను వెంటేసుకుని తిరుగు....పోరిలను అల్లరి చేసుడు'.....
అరె ....మీతో ముచ్చట పెట్టుకుని నాపని పాడు....' అని తన పనిలో మునిగి పోయాడు దుకాణం అతను.
'వెళదాం పద ,తరువాత వద్దాం.....టైం అవుతోంది.....అని సర్రున బైక్ స్టార్ట్ చేసాడు రంగ' ఇక ఎక్కువసేపు అక్కడ వుంటే కష్టమని గ్రహించి.
ఓకే...అంటూ బైక్ ఎక్కాడు శ్రీహర్ష.
ఇంటికి చేరేసరికి సాయంత్రం ఆరు గంటలు దాటింది.
                                                                           ********

టైం రాత్రి తొమ్మిది గంటలవుతోంది.
రంగా, శ్రీహర్ష ఇద్దరు 'మెస్'లో భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి నడుస్తున్నారు.
శ్రీహర్ష మాట్లాడుతూ 'రంగా ...నేను గమనించాను...ప్రొఫెసర్ గారితో బయటకు వచ్చిన కుర్రాడు ఆయన తమ్ముడో...లేక దగ్గర చుట్టమో...బాగా పోలికలున్నాయి....అతని షర్టు మీద చాలా రక్తం మరకలున్నాయి....కచ్చితంగా అతనికి...ఈ కేసుకీ సంబంధం ఉందనే చెబుతోంది....నా 'సిక్త్ సెన్స్'....ఇంకేదో ఆలోచిస్తూ.
'రేయ్..రంగా...ఇంకొక 'క్లూ' వుందిరా...ఉదయం డబ్బు చూసినప్పుడు ఒక కట్టమీద....పెన్ తో వ్రాసిన స్క్రోల్ నంబరు చూసినట్లు గుర్తుందిరా...ఇంకో కట్టమీద బ్యాంకు బ్రాంచ్ పేరు వుంది. మనం ఆ బ్యాంకు బ్రాంచికి వెళ్లి ఆ స్క్రోల్ నంబరుతో ఎవరు డబ్బు 'డ్రా' చేశారో వివరాలు కనుక్కుంటే......సంగతి తేలిపోతుందిరా'.....అన్నాడు శ్రీహర్ష నడుస్తూనే రంగా
ముఖం లోకి సాలోచనగా చూస్తూ!
'నీ పరిశోధన ...పరిశీలనాశక్తి ...అమోఘంరా !...కాని మనకు ఆ బ్యాంకు లో ఆ స్క్రోల్ నంబరు
తో డబ్బు'డ్రా' చేసిన మనిషి వివరాలు ఎవరు చెపుతారు?.....మనం స్వయంగా వెళ్ళడానికి లేదు. ఎవరైనా కేషియెర్ కానీ ఆ బ్యాంకులో పనిచేసే వాళ్ళుకాని మనకు తెలిసిన వాళ్ళుంటే వివరాలు కనుక్కోవచ్చు. అయినా చూద్దాం......మాయింటి ఓనరు ఏదో బ్యాంకు లోనే వర్క్ చేస్తాడు...రేపటి వరకు వివరాలు ఏమైనా తెలుస్తాయేమో'...అన్నాడు రంగా ఇంటి తాళం తీస్తూ.
ఇంట్లోకి వెళ్ళడమే తరువాయి....టి.వి. పెట్టి లోకల్ న్యూస్ పెట్టాను. రెండు మూడు చానల్స్ మార్చాను. ఒక చానెల్ లో లోకల్ న్యూస్ లో..... ఉదయం చిలకలగూడ లో పాడుబడ్డ భావినుంచి నుంచి వెలికి తీసిన శవం తాలూకు పరిశోధనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను వెనుకాల కొంతమంది జులాయిలను కస్టడిలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించినట్లు ఓ ప్రయాణికుడి దగ్గర దోచుకున్న భారీ మొత్తం డబ్బు కోసం రెండు, మూడు గ్యాంగ్ లు రాత్రి చిలకలగూడ పాత రైల్వే బ్రిడ్జ్ దగ్గర బాగా గొడవ పడ్డట్లు, వారిలోనే ఒకడు శవమై భావిలో తేలినట్లు ఇప్పుడే అందిన వార్త' అని చెప్పిన విషయాన్నే మళ్ళీ రెండు మూడు సార్లు చెప్పి వార్తలు ముగించింది వార్తలు చదివిన రంగమాంబ. ఈవార్త విన్న శ్రీహర్షకి రంగా చెవిన వెయ్యాలని ఆరాటం.....బాత్రూంకి వెళ్ళిన రంగా ఎంతకీ బయటకు రావడం లేదు...... ఇక నావల్ల కాదు అనుకుంటూ బాత్ రూం తలుపు కొట్టే టైం కి రంగా తలుపు తీయడం, శ్రీహర్ష టి.వి వైపు చూస్తూ తన చేతిని రంగా ముఖం మీద చరవడం ఒక్కసారి జరిగి పోయాయి. ఒక్క క్షణం ఏం జరిగిందో...ఏం జరుగుతోందో..రంగాకి అర్ధం కాలేదు.....శ్రీహర్ష చేతి వేళ్ళు తన ముఖం, ముక్కు మీద తగిలి చుర్రుమనడంతో 'అబ్బా...రేయ్....అని మాత్రం అరిచాడు'...
" సారీ' రా...సారీ...అర్జెంటు వార్త నీతో చెప్పాలంటే........నువ్వు ఎంతకు బయటకు రావడంలేదు.......అందుకే బాత్రూం తలుపు తడుతున్నాను ...అంతలో తలుపు తీశావు...నా చేయి నీముఖానికి తగిలింది" అని చెప్పి రంగమాంబ న్యూస్ రీడర్ చదివిన వార్తలన్నీవివరంగా చెప్పాడు శ్రీహర్ష.
బాత్రూం నుంచి బయటకు వచ్చిన రంగా కి ఈవార్త విన్న వెంటనే ఒక అనుమానం వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా "అరేయ్...ఒకవేళ అతన్నిచంపిన జులాయి వెధవ లెవరైనా అతని దగ్గర ఒక 'కేష్ బాగ్' వుంది దానికోసం మేం వెంటబడ్డాం......కాని అతను దాన్ని ఎక్కడో దాచాడు ......మాకు దొరకలేదు' అని చెబుతే పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలావుంటుందంటావు? ప్రశ్నార్ధకంగా అడిగాడు 'రంగా'.
వెంటనే స్పందిస్తూ "ఒక్కటి చెప్పు..నువ్వు బాగ్ తీసుకున్నప్పుడు నిన్ను ఎవరైనా చూడడం గాని, నిన్ను అనుసరించడం గాని ఏమైనా జరిగుంటే.....పోలీసులు మనదాకా రావడం పెద్ద కష్టమైనపనేమీ కాదు"అన్నాడు శ్రీహర్ష.
'నిన్ను అడిగాను చూడు...నన్ను నేను చెప్పుచ్చుకుని కొట్టుకోవాలి'....అనుకున్నాడు మనస్సులో రంగా.
ఒక్కసారి తను స్కిడ్ కావడం.....'రాంప్' పైకి గెంతడం... దొరికిన బ్యాగు తీసుకుంటూ తను అటు..ఇటు..చూడడం........ఒక్కసా
రి పునః శ్చరణ చేసుకుని...తననెవరు చూడలేదని మళ్ళీ నిర్ధారణ కొచ్చాక..... ...'లేదురా.... నేను నీకు అప్పుడే చెప్పానుగా.... నన్నెవరు చూడలేదు......ఫాలో కాలేదు అని' అన్నాడు 'రంగ'.
శ్రీహర్ష మళ్ళీ టి.వి. ఆన్ చేసి లోకల్ న్యూస్ పెట్టాడు. రేపు హైదరాబాదు బంద్ .....ఏదో రాజకీయపార్టి డిక్లేర్ చేసింది. ఇంకా కొత్త న్యూస్ ఏమీ లేవు. రంగమాంబ ఇందాక చదివిన న్యూస్ నే మళ్ళీ చదువుతోంది.
'సరేరా...ఇక పడుకుందాం ...రేపు న్యూస్ చూసి ఆలోచిద్దాం... పడుకో.... ఇక అని ముసుగు కప్పేశాడు రంగ.
శ్రీహర్ష కూడ వెంటనే పడకేశాడు.
                                                                          *********

తెల్లవారింది. సోమవారం. టైం ఉదయం ఏడవుతోంది.
రంగా, శ్రీహర్ష కి లేవడానికి బద్ధకంగా ఉంది.
'అప్పుడే తెల్లారిందేమిటిరా బాబూ'? అన్నాడు శ్రీహర్ష దుప్పటి కాళ్ళ దగ్గరనుంచి తలవరకు పూర్తిగా మీదకు లాక్కుంటూ.
'కంగారేమీ లేదు పడుకో....ఇవాళ 'బంద్' డిక్లేర్ చేశారు....బస్సు లేమీ వుండవు....ఈవేళ ఆఫీసు కి వెళ్లకపోయినా అంత ప్రాబ్లం ఏమీ లేదు....చూద్దాం ! ఏమీ గొడవలు లేకపోతే ...బస్సులు తిరుగుతూ వుంటే ఆఫీసుకి వెళ్దాం!లేకపోతే అదీ లేదు....అయినా ఒకసారి ఆఫీసుకి ఫోన్ చేద్దాంలే తరువాత ...' అన్నాడు రంగ తను కూడా దుప్పటి పూర్తిగా కప్పుకుంటు.
ఓ పావుగంట తరువాత ' అరేయ్ రంగా....నిద్ర రావడంలేదురా...లే...ఒక్కసారి ఇవాళ ప్రోగ్రాం 'చాక్అవుట్' చేద్దాం లే' అని తను లేచి బెడ్ షీట్ తీసి మడతపెట్టేసి బాత్రూం లోకి నడిచాడు శ్రీహర్ష.
తనతోబాటే 'రంగా' కూడా లేచి బెడ్ సదిరి టి.వి. న్యూస్ పెట్టాడు ఒక చేత్తో 'హిందూ' ఇంగ్లీష్ పేపరు పేజీలు తిప్పుతూ 'ఏమైనా డబ్బు పోగుట్టుకున్న లేక 'తెఫ్ట్' కేసులేమైనా రిపోర్ట్ అయ్యా ఏమోనని వెతుకుతూ'.
టి.వి. న్యూస్ అంతా ఈ రోజు హైదరాబాద్ బంద్ గురించే దంచేస్తున్నాయి. సిటిబస్సు లేవీ తిరగవని 'ఆర్. టి. సి'. ఎం.డి. గారు డిక్లేర్ చేశారు.
'రంగా'ఇవాళ ఏమి చేద్దాం ? ఎలా 'ప్రొసీడ్' అవుదాం ? ఒక వంక న్యూస్ చూస్తూనే ఆలోచిస్తున్నాడు.
'బాబయ్యా....ఈవేళ రోజంతా వుంది ఆలోచించడానికి ...లేచి ముందు బ్రష్ చేసుకురండి' రంగా ఆలోచనను డిస్టర్బ్ చేస్తూ అన్నాడు శ్రీహర్ష టవల్ తో ముఖం తుడుచుకుంటూ కిచెన్ వైపు నడుస్తూ.
రంగా అటు బాత్రూం లోకి వెళ్ళగానే తను 'కాఫీ' చేయడంలో నిమగ్నమయ్యాడు శ్రీహర్ష.
శ్రీహర్ష కాఫీ కలపడం పూర్తి అవుతుండగానే రంగా బ్రష్ చేసుకుని వచ్చాడు.
ఇద్దరు 'కాఫీ' సిప్ చేస్తూ ఈరోజు ఎలా ప్రొసీడ్ అవుదామా అని ఎవరికివారే విడిగా ప్రోగ్రాం 'చాక్ అవుట్' చేసి కామన్ పాయింట్స్ మీద ప్రొసీడ్ అవుదామని నిర్ణయించుకున్నారు.
రంగా ముందుగా హౌస్ ఓనర్ ని కలిసి బ్యాంకు స్క్రోల్ నంబర్లు గురించి మాట్లాడి ఆ డబ్బు ఎవరు డ్రా చేశారో కనుక్కోవడం, ప్రొఫెసరు గారింటి దగ్గర కాసేపు 'కాపు'గాయడం, విషయ సేకరణ , పోలీసుస్టేషను నుంచి ఎవరైనా ఇంత మొత్తంలో డబ్బు పోయిందని కాని ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశారా కనుక్కోవడం ఆపైన దొరికిన డబ్బు ఎవరిదీ 'కన్ఫర్మ్ డ్' గా తెలుస్తే ఇద్దరు వెళ్లి ప్రొఫెసర్ గారిని, చంద్రకుమార్ ని కలవడం ... డబ్బు హ్యాండ్ ఓవర్ చేయడం ....... ఇదీ ప్రోగ్రాం.
'రంగా' క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా హౌసు ఓనర్ ని కలిశాడు.
వివరాలు తరువాత చెపుతానని కాని తనకు మాత్రం 'స్టేట్ బ్యాంకు' తార్నాక బ్రాంచ్ లో డబ్బు మీద వున్న స్క్రోల్ నంబరు తాలూకు వివరాలు అర్జెంట్ గా కావాలని చెప్పాడు. దాంతో ఆయన 'ఏ రోజు' స్క్రోల్ నంబరు ఇది? అనడిగారు. దాంతో 'రంగా' తెల్లమొహమేయకుండా వెంటనే ఆలోచించి నిన్నదో లేక మొన్నదో , అయివుంటుంది 'సార్'.....నాకు
ఇది చాలా అవసరమయిన ఇన్ఫర్మేషను .....మీరు తప్పక ఈ పని ఒక్కటి చేసి పెట్టాలి 'సర్' అని ఆయనతో తనకున్న చనువునంతా
ప్రదర్శించి ఈరోజు ఎలాగయినా ఇన్ఫర్మేషను తెస్తానని,తెలిసిన వెంటనే ఫోను చేస్తానని ఆయన దగ్గర ' ఏస్యురెన్స్' తీసుకుని వచ్చాడు రంగ.
ఇద్దరు తొమ్మిది గంటలకల్లా తెమిలి బయటపడి వీదిచివర బండి దగ్గర ఇడ్లి, దోశ తిని బైక్ ఎక్కి
'చెప్పు మొదలు ఎక్కడికి వెళదాం' ? అన్నాడు రంగ బైక్ స్టార్ట్ చేసి.
'చలో భాయి....ప్రొఫెసరు సర్ ఇంటి వేపు'....అన్నాడు శ్రీహర్ష చిన్నగా వచ్చీ రాని ఈలవేసే ప్రయత్నం చేస్తూ.
పావు గంటలో ప్రొఫెసరు గారిల్లు దాటి నిన్న వారు వెళ్ళిన దుకాణం దగ్గర ఆగారు.
'దుకాణం దారు లేడు..అతని భార్యలా ఉంది వయస్సు దాదాపు ముఫ్ఫై సంవత్సరాలకంటే ఎక్కువ ఉండవు. ఏవో కూని రాగం తీస్తూ దుకాణంలో కూర్చుని ఉంది......శకునం బావుందిరా'...అని పైకి అంటూనే షాపు లోనికి నడిచాడు
శ్రీహర్ష'.
'నిన్న దుకాణంలో ఈమె లేదు కాబట్టి .....మనం ఏదో కధ చెప్పి...వీలయినంత ఇన్ఫర్మేషను లాగాలి' అనుకుంటు ఆమె తో సంభాషణ మెదలెట్టాడు శ్రీహర్ష.
'ప్రొఫెసరు సారు వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరే కదమ్మా'...? ఆమె ముఖ కవళికలను గమనిస్తూ మొదలెట్టాడు శ్రీహర్ష.
'ఇక్కడి నుంచి మూడిళ్ళ పక్కనే గదా'.....అంది ఆమె.
'మీరెవరు ...బాబు....కాలేజీ పిల్లలా ? చదువు చెప్పించుకోనికి వచ్చింరా'? అమాయకంగా అడిగింది ఆమె.
'అవును...సారుని కలవాలి .......అని తన మాట పూర్తి కాకుండానే ' 'ఇప్పుడు ఎల్లకండి ...సారింట్లో పెద్ద కష్టం వచ్చింది.... సారు వాళ్ళ అన్న కొడుకువి పది లచ్చల రూపాయలు పోయినయంట...అమెరికా నుంచి వాళ్ళ అన్న పంపింనాడంట......
ఎవరో దొంగ ముండాకొడుకులు ఆటోలో వస్తుంటే బాబుకి మత్తుమందిచ్చి కట్టేసి డబ్బు అంతా కొట్టేసినారంట....పోలీసు కేసయిందంట....ఆబాబు, వాళ్ళ నాయన వాళ్ళు కూడ ఇక్కడే ఉన్నరు...మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళకండయ్య ....బాగుండదు' అని చాలా బాధపడుతూ చెప్పింది.
'అయ్యో పాపం ....అంత డబ్బు పోయిందా.... ఇంకా దొరకలేదా?...." ఆమె మాటల్లో బాధను తను పంచుకుంటున్నట్లుగా నొచ్చుకుంటూ అన్నాడు శ్రీహర్ష.
'లేదు...బాబు...పోలీసు వాళ్ళ చేతులో పనిగంద.....ఎప్పటికి దొరుకుద్దో....ఏమో'... పాపం మంచి మనుసులు ఆల్లంతా....ఇది ఆల్లకి రావలసిన కష్టం కాదు ' అంది దుకాణం ఆవిడ.
ఇంతలో దూరంగా నిలబడి ఉన్న 'రంగ' ప్రొఫెసరు గారి ఇంటి వంక చూస్తూ బైక్ స్టార్ట్ చేసి త్వరగా రమ్మన్నట్లుగా
సైగ చేయడంతో నేను సంభాషణ ఆపి వెంటనే వెళ్లి బైక్ ఎక్కాను.
రంగా బైక్ ప్రొఫెసరు గారి ఇంట్లో నుంచి బయలుదేరిన బైక్ ఫాలో అవుతున్నాడు. నేను వెనకాల కూర్చుని గమనించాను. ఆ బైక్ మీద వెళ్తోంది ప్రొఫెసరు గారి అబ్బాయి. అయిదు నిముషాల్లో సిఖ్ విలేజి 'లాంబ' సినిమా హాలు దగ్గర ఇరాని హోటల్ దగ్గర ఆగి బైక్ పార్క్ చేసి అటు ఇటు చూశాడు. పాను దుకాణం దగ్గర ఉన్నఇద్దరు గుండాల్ల ఉన్న మనుషులు ఇద్దరిది దాదాపు ముఫ్ఫై సంవత్సరాల లోపే ....పాను నముల్తూ సిగరెట్ తాగుతూ వచ్చి ప్రొఫెసరు గారబ్బాయిదగ్గరకి రావడమే ఆలస్యం
ఆ ఇద్దరిలొ ఒకడు ' ఏమ్....బె....ఇంకా నకరాలు పోతున్నవ్....పైసల్ ఏమనయి' ? కోపంగా అతని మీదకు వస్తూ ..
''అన్నా...నిజం అన్నా ....నిజంగా పైసల్ సంగతి నాకు తెలియదు....పైసలున్న 'బ్యాగు' ఆ లొల్లి లో
ఎవడో లాక్కున్నడు... అది కాస్త చీకట్లో రైల్ 'బ్రిడ్జి' కింద పడి పోయింది...అప్పుడే పోలీసు వాన్ ఆగింది....
అప్పుడు కరెంట్ లేదు.....పోలీసు వాళ్ళుచాల మంది వచ్చారు. అందుకే అక్కడనుంచి పారి పోయినా...
తరువాత వచ్చి బ్యాగు కోసం వెతికినా....దొరకలేదు....ఏమి చెయ్యాలో తెలీక పరేషాన్ లో వున్నా....మా అన్న
పైసలవి.....వాడికి దక్కలే ....నాకు దక్కలే......మొత్తం పది లక్షలన్నా...మా అన్న 'చిలకలగూడ పి.ఎస్.లో
కంప్లైంట్ గూడ ఇచ్చిండు.....ఏమి చెయ్యాలో తెలియక పెద్ద పరేషాన్ లో ఉన్నాపోలీసు ఎస్.ఐ కూడా నన్ను
డౌట్ చేస్తున్నట్లు మాట్లాడిండు....ఇక నన్నుపరేషాన్ చెయ్యకండి...నన్ను వదిలేయండి...అదీగాక మీకు ముందే చెప్పిన...అన్నకు ఏమీ కాగూడదని....మీరు కారులో కట్టి పడేసినారంట.....'' అన్నాడు బతిమిలాడుతూ వాడి చేతులు పట్టుకుని.
'అరె...మేమేమన్నా పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నామా' ?...రేపు ఉదయం కల్లా సగం పైసల్ తెచ్చి ఇవ్వక పోయినవంటే 'కొడకా' మీనాయనకు, పోలీసులకు ఈ దొంగతనమంతా నీ 'ప్లాన్' అని తెలిసి పోతది....నువ్వు జైలు కి పోతావ్...చూసుకో బిడ్డా' అని అతన్ని వెనక్కు నెట్టేసి క్షణంలో బైక్ మీద వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ....'
పక్కనే పిల్లర్ వెనక నిలబడి అంతా వింటున్న 'శ్రీహర్ష' వెళ్తున్నవాళ్ళ బైక్ నంబరు నోట్ చేసుకోవడం ఎవరు గమనించలేదు.
'జరిగిన గొడవతో కంగుతిన్న ప్రొఫెసరు గారి అబ్బాయి 'పాన్ ' షాప్ దగ్గరికి వెళ్లి సిగరెట్ తీసుకుని స్మోక్ చేస్తూ 'బైక్'దగ్గరికి వెళ్లి మొబైల్ లో ఎవరికో ఫోను చేసి చెవి దగ్గర పెట్టుకుని అవతల రెస్పాన్స్ కోసం ఎదురు చూడ సాగాడు.
'రంగా ఎక్కడున్నాడా అని అటు ఇటు చూశాడు శ్రీహర్ష'.
పాన్ షాప్ వెనక నుంచి వస్తూ మొబైల్ లోకి తదేకంగా చూస్తూ 'శ్రీహర్ష'ని రమ్మని చేత్తో సైగ చేస్తూ పిలిచాడు రంగ.
'అంతా ...రికార్డ్ చేశా...మాటలు వినబడడంల్లలేదు కాని...పిక్చర్ బాగా వచ్చింది చూడు'
అని మొబైల్ 'శ్రీహర్ష' చేతికిచ్చాడు.'
'ష్..ష్ ......మెల్లగా మాట్లాడు..... అంటూ మొబైల్ లో వీడియో క్లిప్ చూస్తూ ...'ఎక్సలెంట్' వీడియో అండ్ ఎవిడేన్స్'అన్నాడు శ్రీహర్ష.
నువ్వు ఇక్క్దడే వుండు అంటూ ప్రొఫెసర్ గారి అబ్బాయి దగ్గరగా వెళ్ళాడు శ్రీహర్ష.
'శ్రీహర్ష' ని గమనించి అతను ఇంకా కొద్దిగా దూరంగా వెళ్లాడతను.
రెండు మూడు నిముషాలు చూశి ఇద్దరు అతను ఎక్కడికి వెళతాడో ఫాలో అవుదామని
నిర్ణయించుకుని కొద్దిగా దూరంగా బైక్ మీద కాపు గాశారు ప్రొఫెసరు గారి అబ్బాయి కోసం.
పది నిముషాలాగాక అతను బయలు దేరి రావడం గమనించి వీరు ముందే బయలు దేరి అతనికి
అనుమానం రాకుండా ట్రాఫిక్ లో కలిసి అతను ఇంటివైపే వెళ్ళడం గమనించి వెస్ట్ మారేడుపల్లి నుంచి
వీళ్ళు సికింద్రాబాదు వైపు కదిలారు.
                                                                  ******

మధ్యాహ్నం రెండు గంటలు అవుతోంది. చిలకలగూడ పోలీసు స్టేషను.
ఇన్స్పెక్టర్ రంగనాథ్ ఏవో రిపోర్ట్స్ చూస్తున్నాడు. ఇంతలో టేబుల్ మీద ఫోను మ్రోగింది.
'హలో ...ఇన్స్పెక్టర్ రంగనాథ్ ...చిలకలగూడ....స్పీకింగ్.....'
అన్నాడు రంగనాథ్.
'సర్.... ఇన్ స్పెక్టర్ గారూ.....మీకు ఒక ఇన్ఫర్మేషను.....నిన్న మీదగ్గర రిజిస్టరు అయిన పది లక్షల రూపాయల
దొంగతనం కేసుకి సంబంధించి.....పూర్తి ఇన్ఫర్మేషను ఉన్న ఒక కవరు మీ మోటర్ బైక్ పక్కనే పడిఉంది.'
హలో మీరెవరు....మీ....అంతే...ఫోను డిస్కనెక్ట్ అయింది.
రంగనాథ్ వెంటనే లేచి బయటకు వచ్చి స్టేషను కాంపౌండ్లోనే పార్క్ చేసి ఉన్న తన 'బుల్లెట్' బైక్ దగ్గరకు వచ్చి
బైక్ పక్కనే గోడపక్కగా పడి ఉన్న ఒక పొడుగాటి కవరు తీసి అక్కడే ఉన్న 'సెంట్రి' ని ఎవరు దీన్ని లోపల వేశారు అని అడగబోయి అడగడం 'వేస్ట్' అని అనుకుంటూ స్టేషను లోపలికి వెళ్లి
తన సీట్లో సెటిల్ అయి 'కవరుని' వెంటనే ఓపెన్ చేద్దామనుకున్న వాడు చేయకుండా 'టేబుల్ లైట్ వేసి లైట్ వెలుతురులో కవరులో ఏముందోనని
తీక్షణంగా కవరుని అటు ఇటు తిప్పి కవరులో ఏదో పేపరు, కొన్ని ఫోటోలు ఉన్నట్లుగా గుర్తించాడు.
వెంటనే కవరు తెరిచి చూశి ఇన్ స్పెకరు, చిలకలగూడ, గారికి వుద్దేసించి వ్రాసిన లెటరు ఒకటి, రెండు ఫోటోలు
ఉండడం చూసి ముందుగా ఫోటోలను చూడడంతో ....రెండు ఫోటోలలో ఉన్నవ్యక్తులు పరిచయం
ఉన్న వారిలా ఉండడంతో 'పరుశురాం' ని పిలిచి ఫోటోలు చేతికిచ్చి చూడమని తను కవరులో ఉన్న లెటరు
సీరియెస్ గా చదవడం మొదలెట్టాడు ఇన్ స్పెక్టరు రంగనాథ్.
'ఫోటోలు చూసిన వెంటనే 'సార్'...... అని ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడై 'రంగనాథ్' లెటర్ సీరియెస్ గా చదవడం గమనించి ఫోటోలు చేతిలో పట్టుకుని రంగనాథ్ లెటర్ చదవడ పూర్తి అయ్యేవరకు చూసి రంగనాథ్ తల ఎత్తడంతోనే
'సార్' ఈ ఫోటో ప్రొఫెసరు గారి కొడుకుది, ఈరెండో ఫోటోలో ఉన్న ముగ్గురిలో కూడా అతను, మిగతా ఈ ఇద్దరు 'మన రికార్డులో ఉన్న 'రౌడి షీటర్ లు '....అని పరశురాం చెప్పడం ఆలస్యం ఒక 'టీం' ని ఆ ఇద్దరు రౌడి షీటర్ లను తీసుకురమ్మని పంపి , తన 'హేట్'
తీసుకుని పరశురాం ని మరో ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకుని ప్రొఫెసరు ఇంటికి బయలుదేరి పది నిముషాల్లో
ప్రొఫెసరు గారి ఇంటికి చేరారు.
ఇన్ స్పెక్టర్ రంగనాథ్ కి తెలీదు వారి 'జీప్' వెనుకగా ఒక మోటర్ బైక్ ఫాలో అవుతోందని.
పరశురాం దిగి గేటు తీయగానే కానిస్టేబుల్ అందరిని జీప్ లోనే ఉండమని 'రంగనాథ్' ఇంటిలోనికి వెళ్ళాడు.బయట తలుపు తీసే ఉంది. రంగనాథ్ బయట గుమ్మం దగ్గరున్న 'కాలింగ్ బెల్' కొట్టిన పది సెకండ్ల లోనే ప్రోఫెసరుగారి అబ్బాయి బయటకు వచ్చి ఇన్ స్పెక్టర్ ని చూసి
కంగారు పడడం అతని ముఖకవళికలలో స్పష్టంగా గమనించాడు రంగనాథ్. కంగారుని కప్పి పుచ్చుకుంటు
'సార్' డబ్బు ఏమైనా దొరికిందా' ? చాలా ఆత్రంగా అడిగాడు ప్రొఫెసరు గారి అబ్బాయి.
'దొరుకుతుంది.....ఎక్కడికి పోతుంది ? ఎవరు కొట్టేసారో మాకు 'క్లూ' దొరికింది. ఆవిషయం మాట్లాడడానికే
వచ్చాను.
'నాన్నగారు....చంద్రకుమార్ ....ఉన్నారా ? అనడిగాడు అతని కళ్ళలోనికి సూటిగా చూస్తూ.
''ఉన్నారు సార్.....అంటూ డాడీ....ఇన్ స్పెక్టర్ గారు వచ్చారు ...అని చెపుతూ సోఫా చూపిస్తూ కూర్చోండి...అని చెప్పి
లోనికి వెళ్లి మంచినీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చి పక్కగా నిలబడ్డాడు.
'ఇంతలో ప్రొఫెసరు గారు....చంద్రకుమార్.....చేతికి చిన్న కట్టు తో బయటకు వచ్చారు.
'మధ్య హాల్లోకి వస్తూనే 'గుడ్ మార్నింగ్' ఇన్ స్పెక్టర్ '....ఇంత త్వరగా మళ్ళీ...? ఏమిటి...విశేషం అన్నట్లుగా సాలోచనగా ఇన్ స్పెక్టర్ మొహంలోకి చూస్తూ.
'ఈ కేసులో ఊహించని పరిణామం ఒకటి మా దృష్టికి వచ్చింది సర్'....కొన్ని సాక్ష్యాధారాలు దొరికాయి....
అనుమానితుల ఫోటోలు కూడా దొరికాయి.....చంద్రకుమార్ గారు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులని ఏమైనా గుర్తించగలరేమో నని ఫోటోలు తీసుకుని వచ్చాను ...అంటూ చంద్రకుమార్ కి
'ముగ్గురు ఉన్న ఫోటో ఒక్కటి ఇచ్చాడు రంగనాథ్.
'ఫోటో చూసిన మరుక్షణం ....యా.....వీళ్ళిద్దరూ ఆ దొంగలే.... రన్నింగ్ ఆటోలోఎక్కి నా డబ్బుఅంటూ'తమ్ముడి ఫోటో వాళ్ళతో కలిసి వుండడం చూసి సంగతి అర్ధం అయి పోలీసు ఇన్ స్పెక్టర్ ఎందుకు వచ్చాడో అర్ధం అయి ....మాట్లాడడం ఆపు చేసి ఏమీ అర్ధం కానట్లు ....ఫోటో తిరిగి ఇన్ స్పెక్టర్ కి ఇస్తూ వుంటే ....ఆ ఫోటో మీ బాబాయి గారికివ్వండి' అన్నాడు రంగనాథ్.
'చంద్రకుమార్ ఆ ఫోటో చేతిలోనే పట్టుకుని బాబాయి గారికివ్వకుండా అలానే నిశ్చేష్టుడై రాయిలా ఉలుకు పలుకు లేక నిలబడిపోయాడు.
"అమెరికానుంచి అన్నడబ్బు పంపిన సంగతి, ఆరోజు డబ్బు తీసుకువద్దామని 'చరణ్' కి విపులంగా చెప్పిన గుర్తు, ఐ ఫోను కొందామని తనని రమ్మన్న సంగతి, తనకి వేరే అర్జెంట్ పని ఉండి రాలేనని వాడు చెప్పిన సంగతి గుర్తు వచ్చి సినిమా దృశ్యంలా తన కళ్ళ ముందు కదలాడింది. ఆక్షణంలో తమ్ముడు కూడా ఆ దొంగల గ్యాంగ్ లో ఉన్నాడన్న భావనతో ఈస్థితి లో బాబాయి తో ఎలా స్పందించాలో తెలీక చిత్తరువులా అయిపోయాడు.
'ఏమయిందిరా....అలా అయిపోయావు....ఆ ఫోటో ఇలా ఇవ్వు' అని ప్రొఫెసరుగారు చేయి జాపారు.
'లేదు...బాబాయ్...వీరెవరు తెలీదు ' అంటూ ఆందోళనగా "ఇన్ స్పెక్టర్ గారూ ఇందులో ఏదో పొరపాటు అయినట్టుగా ఉంది....ఈ ఫోటో బాబాయి గారు
చూశి ఏమి చేస్తారు....అనవసరమైన ఆందోళన తప్ప"....అంటూ ఫోటోని తిరిగి ఇన్ స్పెక్టర్ కి ఇచ్చాడు చంద్రకుమార్.
ఇన్ స్పెక్టర్ ఫోటో అందుకుంటు చంద్ర కుమార్ చేయి వణకడం గమనించాడు.
'సర్....మీరు చూడండి ఈ ఫోటో అంటూ ఆ ఫోటోని, ఆ లెటర్ ని ప్రొఫెసరు గారికి ఇచ్చాడు.....'
ప్రొఫెసరు గారు తన కళ్ళజోడు సవరించుకుంటూ ఫోటోని వివరంగా చూసి,లెటర్ కూడా పూర్తిగా చదివి
మాట్లాడకుండా లేచి ఫోటో,.లెటర్ తిరిగి ఇన్ స్పెక్టర్ చేతికి ఇచ్చి తన రూము కి వెళ్లి పోయారు. 'ఇన్ స్పెక్టర్ లేచి ప్రొఫెసరు గారి అబ్బాయి భుజం మీద చేయివేసి మీతో కొద్దిగా మాట్లాడాలి అంటూ తనని తీసుకుని బయటకు వెళ్తూ ....'చంద్ర కుమార్' గారూ మీకు స్టేషనుకి వెళ్లి ఫోను చేస్తాను ...మీరు ఒకసారి స్టేషనుకి రావాలి ....ఈ ఫోటోలో ఉన్న మిగతా ఇద్దరిని మీరు గుర్తించాలి....' అంటూ ప్రోఫెసరుగారి అబ్బాయి 'చరణ్' డ్రెస్ మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా తనతో స్టేషనుకి తీసుకుని వెళ్ళారు.

*********
పోలీసు ఇన్ స్పెక్టర్ 'చరణ్' ని తీసుకుని వెళ్ళిన పది నిముషాల్లో 'శ్రీహర్ష' 'రంగా' ప్రొఫెసరు గారింటికి వచ్చారు.
'రంగా' బయట కాలింగ్ బెల్ కొట్టాడు.'చంద్రకుమార్' వచ్చి తలుపు తీసి 'ఎవరు' కావాలండీ ? అని అడిగాడు.
'మీతోనే పని ఉండి వచ్చామండీ' అన్నాడు శ్రీహర్ష.
'నాతోనా ? మీరెవరో నాకు తెలీదే' ... నాతో మీకు పనేమిటి ? ఆందోళనతో అడిగాడు చంద్రకుమార్.
'మీరేమి కంగారు పడకండి.మేము మీకు అపరిచితులమైనా స్నేహితులం.మీతోనే కాదు.
ప్రొఫెసరు గారితో కూడా పని ఉందండీ.వారి ముందే మీతో మాట్లాడాలి' చాలా ముఖ్యమైన విషయమండీ అన్నాడు అతి వినయంగా 'రంగ'.
'ఒక్క నిముషం. బాబాయి గారితో మాట్లాడి వస్తాను'. అని అతి కంగారుగా లోనికి వెళ్ళాడు 'చంద్రకుమార్'.
'లోనికి వెళ్లి ప్రొఫెసరు గారిని ఎంత పిలిచినా ఆయన రూములోపల తలుపు వేసుకుని తీయడం లేదు.
ఎవరో ఇద్దరు తనని కలవాలని వచ్చారని చెబుతే....తను ఎవరిని కలవనని రెండురోజులు ఆగి రమ్మని చెప్పి
తలుపు మాత్రం తీయడం లేదు.
'చంద్రకుమార్' బయటకు వచ్చి ప్రొఫెసరు గారి ఒంట్లో బాగా లేదని తరువాత కలవమని చెప్పి తనతో
పని ఏమిటో చెప్పమని అడిగాడు.
'ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని ''మీరు పోగుట్టుకున్న డబ్బు గురించి మాట్లాడాలి'' అని చెప్పాడు 'శ్రీహర్ష.
'లోనికి రావచ్చా' ? అన్నాడు రంగ.
వారిని లోపలకి రమ్మని డ్రాయింగ్ రూం లో సోఫాలో కూర్చోమని లోపలకి వెళ్లి 'విషయం చెప్పి బాబాయ్ మీరు త్వరగా రావాలి...ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు పోయిన డబ్బు గురించి మాట్లాడడానికి వచ్చారు. మీరు త్వరగా బయటకు రావాలి ' అన్తూ తలుపు గట్టిగా కొట్టాడు 'చంద్రకుమార్.'ప్రొఫెసరు గారు తలుపు తీసుకుని బయటకు వచ్చి ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అంటూ షర్టు గుండీలు ఒకదానిది ఇంకో దానికి పెట్టుకుంటూ చంద్రకుమార్ వెంట ఆయన కూడా అతి కంగారుగా డ్రాయింగ్ రూం లోకి వచ్చి 'మీరెవరు....మీకు పోయిన డబ్బు తో సంబంధం ఏమిటి'? వరుసగా ప్రశ్నలు వేసి ... పోలీసు ఇన్ స్పెక్టర్ ని కూడా పిలవడం మంచిది కదా అన్నాడు.
'శ్రీహర్ష' షర్టు లోపల దాచిన 'డబ్బు జిప్ బ్యాగు' తీసి ఈ 'బ్యాగు' మీరేమైనా గుర్తించగలరా ? అన్నాడు చంద్రకుమార్ కి చూపిస్తూ.
చంద్రకుమార్ ఒక్క గెంతు తో శ్రీహర్ష దగ్గరికి వస్తు ' ఈ బ్యాగు నాదే.ఆటోలో వస్తుంటే ఈ బ్యాగుని దొంగలు కొట్టేశారు' అన్నాడు ఆత్రంగా.
'మీరు ఏమనుకోకపోతే ఈ బ్యాగులో ఉన్నఎంత డబ్బువుంది? ఇంకా ఏమి ఉన్నాయి చెప్పగలరా ? అనడిగాడు.
'ఈ బ్యాగులో తొమ్మిది లక్షల డెబ్భై వేలరూపాయలు, ఒక 'ఐ' ఫోను' ఉండాలి.అదే నేను పోలీసు కంప్లైంట్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాను అన్నాడు చంద్రకుమార్.
ప్రొఫెసరు గారికి ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. అంతా ఏదో మాయగా, ఏదో 'మేజిక్' షో చూస్తున్న అనుభూతి తో కన్నార్పకుండా వాళ్ళ వంక చంద్రకుమార్ వంక ఏదో 'ట్రాన్స్' లో ఉన్నట్లు చూస్తూ ఉండి పోయారు.
శ్రీహర్ష బ్యాగు జిప్ తీసి "చంద్రకుమార్ గారు!చూసుకోండి మీ డబ్బు ,'వస్తువులు  అన్నీ ఉన్నాయా"? అని బ్యాగ్ చంద్రకుమార్ చేతికి ఇచ్చాడు.
'చంద్రకుమార్ బ్యాగులో ఉన్న డబ్బు కట్టలన్నీ గ్లాస్ టేబుల్ మీద బోర్లించి అన్నీ లెక్క చూసుకుని 'మై గాడ్' డబ్బు అంతా ఎలా బాగ్ లో పెట్టానో అలాగే ఉంది 'ఐ ఫోను' కూడా ఉంది. నోట మాట రావడం లేదు. రెండు చేతులు ముఖం మీద కప్పుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.
''బాబాయ్! పోయిన డబ్బుఅంతా దొరికింది. వీళ్ళేవరో…మనుషులు కారు.దేవుళ్ళు'' ఇంకా ఏదో నోట్లోనే గొణుక్కుంటూ పదే పదే  రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ పట్టరాని సంతోషంతో అతని ముఖం వెలిగి పోతోంది.
చంద్రకుమార్  ఇంటి సభ్యులతో ఈ విషయం చెప్పడానికి లోనికి వెళ్ళాడు.
ప్రొఫెసరు గారు మంత్ర ముగ్దుల్లా చంద్రకుమార్ ని అనుసరించి లోనికి వెళ్లారు.
రెండు, మూడు నిముషాల తరువాత ఇంటిల్లపాది తిరిగి డ్రాయింగ్ రూం లోకి వచ్చేసరికి రూమ్ లో ఎవరు కనిపించలేదు. చంద్రకుమార్, ప్రొఫెసరు గారు ఇద్దరు గేటు బయటకు వచ్చి చూసినా ఎవరు కనిపించలేదు.
                                                            ---------xXx----------

                             
రచన:
కేశిరాజు వెంకట  వరదయ్య.
Mobile No. 9849118254
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి