లేబుళ్లు

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఋణానుబంధం ( ఈ కధ 'స్వాతి' ' అక్టోబరు' నెల 2012 సచిత్ర మాస పత్రికలో ముద్రితమైనది)


                                                                    ఋణానుబంధం  

                               ( ఈ కధ 'స్వాతి'  ' అక్టోబరు' నెల 2012  సచిత్ర  మాస పత్రికలో  ముద్రితమైనది)

                     మధ్యాహ్నం దాదాపు మూడున్నర గంటలవుతోంది. భోజనం చేసి ఇట్లా నడుం వాల్చానో లేదో కాలింగ్ బెల్ ఒకటే మోత. పిల్లలు అప్పుడే వచ్చేశారా ? అనుకుంటూ తలుపు తీశాను. ఎవరో పెద్దావిడ. దాదాపు 55 సంవత్సరాల పైనే వుంటాయి. ఒక్కసారి ఆవిడ ఒంక తేరిపార చూశాను. పసిమి వంటి ఛాయ. కళ్ళ కింద నల్లటి జీరలు. తైల సంస్కారం లేని జుత్తు. ఒక ప్రక్కనే అరిగిపోయిన రెండు రబ్బరు చెప్పులు. జీవంలేని జీవిలా .......... చూస్తేనే తెలుస్తోంది బాగా బతికి చెడ్డవారిలా..... పాపం ఎండలో నడిచి వచ్చిందో ఏమో...విపరీతంగా రొప్పుతూ ఉంది.  తల్లోంచి చెంపల మీదుగా చెమటలు కారుతున్నాయి. రెండు చేతుల్లో పెద్ద ఖాకి సంచులు. సంచుల నిండా ఏవో ప్లాస్టిక్, స్టీల్ డబ్బాలు. చూస్తేనే తెలుస్తోంది. ఏవో అమ్ముకునేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సంచులు అతిజాగ్రత్తగా కింద వుంచి కుడిచేత్తో ఎడమ భుజాన్ని వత్తుకుంటూ,చెమట కొంగుతో తుడుచుకుంటూ  నన్ను ఉద్దేశించి 'ప్రసాదరావు గారి ఇల్లు ఇదే కదమ్మా' అనడిగింది'. నేను 'అవునంటూ' తలూపుతూ .......తలుపు పూర్తిగా తెరిచి ........ మీకు మంచినీళ్ళు కావాలా? అని అడిగి ఆవిడ సమాధాన మిచ్చేలోపునే చల్లటి మంచినీళ్లు తెచ్చి ఆవిడ కిచ్చాను. ఆవిడ రెండు గ్లాసుల నీళ్లు తాగి 'రక్షించావు తల్లీ.....ఎంత దాహంగా ఉందో.....అప్పుడే ఎండలు మండి పోతున్నాయి'....
'నా పేరు జానకమ్మ తల్లీ'...... అంటూ 'ప్రసాదరావు....నన్ను '....అంటూ ప్రారంభించి నా ముఖ కవళికలు చూసి ఏకవచనంతో మాట్లాడానని గ్రహించి,...... 'క్షమించమ్మా....' ప్రసాదరావు గారు ఇంటికి వెళ్ళమని చెప్పారమ్మా....మిమ్ముల్ని ఫోను చేయమన్నారు'......అందావిడ కొంగుతో మొహం వత్తుకుంటూ.
'ఇన్నాళ్ళు ఆఫీసు దగ్గరే వడియాలు,అప్పడాలు ఇచ్చేదాన్నమ్మా....ప్రసాదరావు గారే ఇప్పట్నుంచి ఇంట్లోనే ఇవ్వమన్నారమ్మా .....అందుకే ఇలా'....... ఇంకా ఆయాసపడుతూ చెప్పిందావిడ.
'ముందు మీరిలా కూర్చుని కొద్దిగా విశ్రాంతి తీసుకోండి'....అని ఆవిడను 'డ్రాయింగ్ రూం' సోఫాలో కూర్చోబెట్టి లోనికివచ్చి ఆయనకు ఫోను చేసి మాట్లాడి తిరిగి వచ్చిఆవిడ దగ్గర వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు, ఆవకాయ ఇంక వేరే పచ్చళ్ళు కావలసినవి తీసుకుని ఆవిడకు డబ్బు ఇచ్చేసి, ఆయ చెప్పినట్లు మా కాలనీలో వేరే ఇద్దరికీ  పరిచయం చేసి వాళ్ళు కావలసినవి తీసుకుంటుంటే నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు స్కూళ్ళ నుంచి వచ్చేశారు. ఆవిడ దగ్గర తీసుకున్న వన్నీ సదిరి పిల్లలకు వాళ్ళ కిష్టమయిన స్నేక్స్ పెట్టి ఇక సాయంత్రం వంటకుపక్రమించాను.
వంట చేస్తుంటే ఆ పెద్దావిడ గుర్తు కొచ్చి మనసు ఏదోలా అయింది.
'ఏం బ్రతుకులో.... ఏమిటో' ?....భగవంతుడు చల్లగా చూడకపోతే...అలానే వుంటుంది' పాపం ఆ పెద్దావిడ ....కృష్ణా....రామా .....అంటూ ఇంట్లో ఎవరైనా చేసి పెడితే కూర్చుని తినే వయస్సులో ఇలా .....అనుకుంటుండగా ఆవిడ...' ప్రసాదరావు'..... అని ఏకవచనంతో సంభోదించి మాట్లాడబోయి తమాయించుకుని 'ప్రసాదరావుగారు' అనడం గుర్తు వచ్చి....ఆయనను ఏకవచనంతో మాట్లాడే చనువు, పరిచయం ఆవిడకు ఉండి ఉంటుందా ? లేక పెద్దావిడ కదా....అకస్మాత్తుగా నోరుజారి అలా పొరపాటుగా అన్నదా..... తేల్చుకోలేకపోయాను.
'సరే.....ఆయన్నే అడుగుతే పోలా'.......అనుకుని వంట పనిలో మునిగిపోయాను.
పిల్లలు ముగ్గురు నిశ్సబ్దంగా కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నారు.
అర్ధగంటలో నేను కూడ వంట పూర్తి చేసి ఫ్రెష్ అయి వచ్చి పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసే సరికి ఆయన వచ్చేశారు. ఆయనకు యధాప్రకారం ఫిల్టర్ కాఫీ ఇచ్చి వేడి నీళ్లు కూడా రెడీ చేసి వచ్చి పిల్లల దగ్గర కూర్చున్నాను. వాళ్ళతో ప్రతి రోజు కాసేపు కాలక్షేపం చేసే టైం అది. ఆయన కూడ కాఫీ తాగుతూ కాసేపు పిల్లలతో టైం పాస్ చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి మా'టీం' లో చేరతారు. ఆరోజు స్కూల్లో జరిగిన విషయాలు అందునా మాచిన్నది ఏవో జోకులు, పోచికోలు కబుర్లు మోసుకు వచ్చి పేలుస్తుంది ఆ టైంలో. అందరం కాసేపు మనసార నవ్వు కుంటాము. ఇదీ సాయంత్రాలు మా పెర్మనెంట్ రొటీన్.
అందుకే నాకు సాయంత్రం ఈ అర్ధగంట 'టైం' అంటే ప్రత్యేకంగా చాలా ఇష్టం. మేం అయిదుగురం కలిసి ఉండే ప్రత్యేక క్షణాలవి. ఏరోజు కదే ప్రత్యేకం. మేము అయిదుగురం. మా చిన్న ప్రపంచం. రేపు పిల్లలు పెద్దయి, పెళ్ళిళ్ళు అయి ఎటు వాళ్ళు అటు వెళ్ళినా ఇలాంటి ప్రత్యేక క్షణాలు మా జీవితాంతం మా అయిదుగురికి ఉండాలని కోరుకోవడం నా 'స్వార్ధం' అని తెలిసినా భగవంతుడు నన్నేమైనా కోరుకోమంటే ఇదే కోరిక కోరుకుంటాను.
తరువాత నెల రోజుల కొకసారి వచ్చి వడియాలు, అప్పడాలు ఇచ్చి వెళ్ళేది. మొదటి రెండు మూడు సార్లలోనే తను చాలా అభిమానం కల మనిషిగా నాకు అర్ధమయింది. ఇంట్లో 'టీ' త్రాగడానికి మొహమాట పడేది. పొరబాటున టీ త్రాగితే ఇవి కొత్తగా చేసుకొచ్చానమ్మా......రుచి చూసి చెప్పు అని ఏవో స్నాక్స్ 'శాంపిల్' గా ఇచ్చి వెళ్ళేది.
నాకు అర్ధమయిదేమంటే తను ఎక్కడా ఋణపడకూడదన్న సిధ్ధాంతం తప్పని మనిషిలా అన్పించింది.
ఒకటి రెండు సార్లు తనతో ఈమాట అన్నాను. 'నాకు తెలుసు' ఆవిడ అంతే .........అని ముక్తసరిగా జవాబిచ్చేవారు. దాంతో నాకు ఆవిడ గురించి తనకు తెలుసు కాని ఆయన చెప్పడంలేదు అని మాత్రం అర్ధం అయింది.
'సరేలే ..... ఆయనే ఎప్పుడో ఒకసారి చెప్పక పోతారా'.... అని నేను అడగలేదు ఆయన చెప్పలేదు.
                                                               *******
                          'కాలచక్రం' ఎవరో 'ఏక్సిలరేటరు' తోక్కినట్లుగా గిర్రున తిరుగుతోంది. పిల్లల చదువులు హైస్కూల్ దాటి కాలేజిల్లోకి వచ్చారు. ఆరోజు ఆదివారం. ఉదయం 11 గంటలవుతోంది. గేటు బయట 'ఆటో' ఆగిన శబ్దమయింది. ఎవరో ఆడవాళ్ళు ఆటో దిగుతున్నారని చూసి గుమ్మంలోనే నిలబడి చూస్తున్నాను. ఎవరో ఆవిడ ఆటో దిగి డబ్బులిస్తుంటే వెనకనుంచి చూసి 'ఎవరబ్బా....తెలిసిన వాళ్ళలా వున్నారు'... అని బయటకు వచ్చి చూసే సరికి 'జానకమ్మ గారు '......ఇంత ఉదయాన్నే వచ్చిందేమిటి ? అందునా చేతిలో సంచులేమీ లేవు. కొద్దిగా విచిత్ర మన్పించింది. కొత్త చీరలా వుంది. మనిషి కూడా ఏదోలా కొత్తగా అనిపించింది. మనిషి కూడా సంతోషంగా కన్పించింది. తల దువ్వుకుంది. గుడికి వెళ్లి వస్తున్నట్లుగా ఉంది. చేతిలో కొబ్బరిచిప్ప, పూలు వాటితో బాటు ఓ పాత బౌండ్ 'నోట్ బుక్' ఉన్నాయి. ఇదివరలో ఎప్పుడు చూసినా నెత్తి మీద కొండంత భారం మోస్తున్న భూదేవిలా ఉండేది. ఇప్పుడు భారం అంతా దింపేసి నింపాదిగా, బాదరా బందీ లేని మనిషిలా కన్పించింది. లోపలికి వస్తూ 'మీ ఇంటి దగ్గర రామాలయానికి వచ్చానమ్మా....ప్రక్కనే కదా అని ఇలా వచ్చాను...అంటూ ప్రసాదం, పూలు నాచేతిలో పెట్టింది '. నేనడగబోయే ప్రశ్నకు ముందు గానే సమాధానం చెపుతూ 'ప్రసాదరావుగారు ఉన్నారా అమ్మా' ? చాలా నెమ్మదిగా అడిగిందావిడ.
'ఉన్నారండీ......ఈవేళ ఆదివారం కదా'.....రండి... అంటూ బయట గదిలో సోఫా చూపించాను.
ఇంట్లోకి వెళ్లి బెడ్ రూం టి.వి. ముందు పిల్లలతో కూర్చుని ఏదో ప్రోగ్రాం చూస్తున్న ఆయనకు 'జానకమ్మ' గారు వచ్చారని చెప్పాను.
ఆయన వెంటనే లేచి బయటకు వెళ్ళారు. మళ్ళీ అనిపించింది నాకు. వీళ్ళకి ఏదో పాత పరిచయం కచ్చితంగా ఉందని.
రెండు నిముషాల్లో నేను ఆవిడకి మంచి నీళ్లు తీసుకు వెళ్ళాను. ఆయన ఇందాక ఆవిడ చేతిలో ఉన్న పాత 'నోట్ బుక్' పేజీలు తిరగేస్తున్నారు.
'నోట్ బుక్' తిరిగి ఆవిడకిచ్చాక ఆవిడ 'ఇక వస్తాను....నాయనా' అంది.
'అప్పుడే వెళ్తున్నారా.....కొద్దిసేపు ఆగండి....కాఫీ తెస్తాను' అన్నాను నేను.
'లేదమ్మా....మా చెల్లెలు ఇంటికి కూడా వెళ్లి ఇంటికి వెళ్ళాలి'.....అంటూ వెంటనే బయలు దేరింది ఆవిడ.
ఆవిడ అటు వెళ్ళగానే 'ఏమిటండీ.....ఆ నోట్ బుక్ ....మీకు చూపెడ్తోంది' ?
"ఏవిటీ ఆవిడ కధ ....ఈరోజు కొద్దిగా విచిత్రంగా వుంది ''.....
'ఇప్పుడేమో......నోట్ బుక్ చూపిస్తోంది.....ఏమైనా నాకు చెప్పకూడని విషయమా' ?
'ఇదివరకు అడిగినా ఇన్ని సంవత్సరాలుగా ఏమీ వివరాలు చెప్పలేదు'.....
'అంతగా నాతోకూడా చెప్ప కూడని విషయమైతే వదిలేయండి'.....నిష్టూరంగా అన్నాను.
'ఇందులో దాపరికమేమీ లేదు......నీకు చెప్పకూడని విషయమూఅంతకంటే కాదు. అది ఆవిడ ఎకౌంటు బుక్' ఆవిడంటే నాకు మా అమ్మమీద ఉన్నంత గౌరవం' ......ఆవిడలాంటి గొప్ప వ్యక్తిత్వం, అభిమానం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు...........చాలా కూల్ గా సమాధానం చెప్పి నా చేయి పట్టుకుని సోఫా లో తన పక్కనే కూర్చోపెట్టి చెప్పడం మొదలెట్టారు తను.
'' నేను హైదరాబాదులో మొదటిగా 'జాబులో' చేరినప్పుడు 'శర్మ'గారని నా ఫస్ట్ బాస్. 'ఈ జానకమ్మ గారు' ఆయన భార్య. నాకప్పుడు హైదరాబాదు లో ఎవరితోనూ పరిచయం లేదు, తెలిసిన వాళ్ళు లేరు. ఈ మహానగరంలో అంతా కొత్త.హైదరాబాదు లో దిగగానే సరాసరి ఆఫీసుకే వెళ్లాను. 'శర్మగారు' వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లారు. వాళ్ళ ఇంటి దగ్గరే ఒక రూం అద్దెకు చూశారు. ఆయన స్కూటరు మీదనే ఆఫీసుకి వెళ్ళేవాడిని. నేను హైదరాబాదు వచ్చే సరికి నాన్నగారు చెల్లెలి పెళ్ళికి చేసిన అప్పులు, నేను చేసిన కొన్ని చిన్న చిన్న అప్పులు
వాటిని తీర్చడానికి విపరీతమైన వత్తిడి ఉండేది. నెలకింతని కొంత అప్పు తీర్చేవాడిని. అప్పులుకూడా శర్మ గారి సాయంతోనే ముందుగానే తీర్చేసి మెల్లగా ఆయనకు తిరిగి ఇచ్చేశాను. ఎన్నిసార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేశానో లెక్కే లేదు.
జానికమ్మ గారిని 'పిన్నిగారూ' అని పిల్చేవాడిని. వాళ్లకి పిల్లలు లేరు. నన్ను పెంచుకుంటానని సరదాగా అనేది ఆవిడ. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేయకుండా వెళ్లనిచ్చేవారు కాదు. నిజంగా ఆవిడ అన్నపూర్ణమ్మ తల్లే ! శర్మగారు ఆఫీసు అయ్యాక విపరీతంగా పేక ఆడే వారు ఆఫీసులో ఉన్న కొంత మంది పేకాటరాయుళ్ళతో. ఆదివారాలు, శలవులు వచ్చాయంటే మనిషి కన్పించేవారు కారు. రాను రాను పేకాట పిచ్చి ఎక్కువయింది. జీతం మొత్తం అక్కడే అయిపోయేది. ఆవిడ ఎంత మొత్తుకున్నా ఆవిడ మాటలు గాలికొదిలేసే వారు. ఎక్కడ బడితే అక్కడ అప్పులు చేయడం మొదలెట్టారు. చివరికి పాలవాడిని కూడా వదలలేదు . ఆయనంటే ఆఫీసులో అందరికీ అమితమైన గౌరవం. పాదరసం లాటి మెదడు. ఎవరికీ ఎ ఆపద వచ్చినా అయన సాయం చేయడంలో ముందు ఉండేవారు. అంచేత ఆయనకు అప్పుఇచ్చేవారు. అప్పులెక్కువయ్యేసరికి తిరిగి ఇవ్వడం తిరిగి ఇవ్వడం తక్కువయిపోయింది . అప్పుల వాళ్ళు ఇళ్ళకి రావడం మొదలెట్టారు.
నాదగ్గర అయితే లెక్కే లేదు.ఎన్నిసార్లు చేబదులు అంటూ డబ్బు తీసుకున్నారో ! ఒకసారి నేనిక ఉండబట్టలేక చెప్పేశాను. 'సార్ ...నేను ఇంటికి డబ్బు పంపించడానికి ఇబ్బంది అవుతోంది ....ఇక నన్ను డబ్బు అడగకండి సర్ ' అని చాలా మొహమాట పడుతూ చెప్పాను. నన్ను మరి అడగలేదు. ఆఫీసులో పరిస్థితి దారుణంగా తయారయింది. ఆఫీసులో ఆయన ఎవరినీ వదలలేదు. దాదాపు ఒకరిద్దరు తప్ప అందరు అప్పు ఇచ్చిన వారే.
శర్మ గారు కన్పిస్తే చాలు.......మనుషులు తప్పుకు తిరగడం మొదలయింది. 'అప్పు లక్షకు పైగా అయింది' ....అని ఒకసారి జానకమ్మ గారు నాతో చాలా బాధ పడుతూ అన్నారు.
'మీకు ఎలా తెలుసు' ? అని ఆవిడను అడిగాను.
'ఆయనే చెప్పారు......ఎక్కడో లెక్క వ్రాస్తున్నారట' అని చెప్పింది ఆవిడ. ఇంతలో మమ్ముల్ని డిస్టర్బ్ చేస్తూ 'అమ్మా....ఆకలవుతోంది.....అంటూ ముగ్గురు పిల్లలు ఒక్కసారి గదిలోంచి....బయటకు వచ్చేశారు. అంతటితో అక్కడికి 'సశేషం' అయిందా కధ !
ఆదివారం కావడంతో నేను కూడ పనిలో నిమగ్నమయి మళ్ళీ ఆ టాపిక్ రైజ్ చేయలేదు ఆరోజుకి.
మరుసటి రోజు ఉదయం ఆయన ఆఫీసుకి వెళ్లారు. వెళ్ళిన గంటకే అంటే పదకొండు గంటలకు ఆయనదగ్గరనుంచి ఫోను. ఇంట్లో డబ్బు ఎంత వుందో తీసుకుని రెడిగా ఉండమని బయటకు వెళ్లాలని చెప్పిన పది నిముషాల్లో ఆయన వచ్చి నన్ను బైక్ మీద ఎక్కించుకుని బయలు దేరారు. తనని చూడగానే అర్ధమయింది.....ఏదో కాకూడనిది అయిందని.
తనే కొద్ది బైక్ మీద కొంత దూర మెళ్ళాక అన్నారు....'జానికమ్మ' గారు పోయారట. అక్కడికే వెళ్తున్నాం.
'డబ్బు ఎంత వుంది' ? అడిగారాయన.జానకమ్మ గారు పోయారట....అన్నమాట వినడం తోనే నేను దిగ్భ్రమ చెందాను. నిన్న ఉదయం చూశానావిడను. ఎప్పుడూ లేనిది
ఆవిడ ఎంతో సంతోషంగా కని పించింది. కొత్త చీర కట్టుకుంది. చనిపోతున్నట్లు తనకి ముందే తెలుసా....? ఏమైనా ఆత్మహత్యా? మనసు పరి పరి విధాల పోతోంది!
'ఏయ్....నిన్నే....ఎక్కడవున్నావ్' ? అని ఆయన బైక్ నడుపుతూనే వెనక్కి తిరిగి బిగ్గరగా అడిగేసరికి ఈ లోకలోకి వచ్చాను నేను.
'ఆ...ఆ.....ఏదో పరధ్యానంలోకి వెళ్లాను...పాపం ఆవిడ గురించే ఆలోచిస్తున్నాను'
'సరే....డబ్బు ఎంత తెచ్చావు '? మళ్ళీ అడిగారాయన
'ఇంట్లో ఉన్నదంతా తెచ్చాను. షుమారు పదిహేను వేల దాకా ఉంది' చెప్పాను నేను.
పావుగంటలో చేరాము ....రాంనగర్ గుండు దగ్గర జానకమ్మ గారి ఇంటికి .
ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు .....రెండు గదులు. పెద్ద కాంపౌండ్. మూడు నాలుగు పోర్షన్లు. మామిడి, జామ, కొబ్బరి చెట్లు ఉన్న లోగిలి.
ఆవిడని బయట రూంలో చాప వేసి పడుకోపెట్టారు. మేము వెళ్తూనే అచ్చుజానకమ్మ గారిలా ఉన్నావిడ బయటకు వచ్చి బోరున ఏడ్చేసింది.
మొన్న శుక్రవారంతో అన్ని పూర్తిగా అప్పులన్నీ తీర్చేసి 'శనివారం' నాడు 12 సంవత్సరాల తరువాత గుడికి వెళ్లి వచ్చింది బాబూ......నిన్న గుడికి వెళ్లి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి కాసేపు ఉండి నన్నుతనతో రమ్మని బలవంతంగా తీసుకువచ్చింది. బావ పోయాక దాదాపు పన్నెండు సంవత్సరాల తరువాత మాఇంటికి వచ్చింది. చాలా సంవత్సరాల తరువాత అర్ధరాత్రి దాటిం దాకా చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నాము. తెల్లవారే  సరికి ఇలా అవుతుందని కనీసం నాకు ఊహా మాత్రంగానైనా తోచలేదు. రాత్రి కబుర్లలో రెండు మూడు సార్లు ఇక తన ఇక బ్రతికి ఉండవలసిన అవసరం లేదంది ! ఇన్నాళ్ళు బ్రతికి ఉండడానికి కారణం బావ చేసిన అప్పులేనంది. నీ సాయం గురించి పదే పదే చెప్పింది. దేవుడే దైనా వారం కోరుకొమ్మంటే నీలాటి వాడిని కొడుకుగా కావాలని కోరుకుంటానంది. చివరిగా నీ గురించి ఒక్కమాట చెప్పింది. తనకు తెలిసి నీ ఒక్కడి ఋణం కావాలని తీర్చకుండా వెళ్లి పోతానంది !
'ఎందుకే.........అలాగా' ? అంటే దాని సమాధానం.......'అతనికి ఋణపడి ఉంటె .....వచ్చే జన్మ అంటూ ఉంటె అప్పుడు అతని ఋణం అప్పుడు తీర్చుకుంటానంది.
'ఋణ విముక్తురాలయినందుకు ఏదో తెలీని బాధ, సంతోషం మిళితమైన ఆవేశంలో మాట్లాడుతోంది అనుకున్నా.....కానీ తనువు చాలించే శక్తి ఇంతలా తనలో ఉందని ఊహించలేకపోయాను' .
'శర్మ...బావగారు చనిపోయాక మొదటిసారిగా చాలా సంవత్సరాల తరువాత 'జానకి' సంతోషంగా ఉండడం నిన్నచూశాను. చిన్నవాడి వైనా నీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా....బాబూ....మే మేవ్వరం దాని కష్ట కాలంలో వెన్నంటి లేము. కన్నతల్లిలా చూశావట. ప్రతి రోజు తిన్నదో లేదో కనుక్కునే వాడివట. నీ ఋణం తీర్చుకోలేనంది. కన్నకొడుకు ఉంటె చూశే వాడో లేదో కాని ప్రసాదరావు నన్ను తల్లిలా ఆదరించాడంది. నాకో కొత్త చీర కొని ఇచ్చింది. జీవితంలో ఏమి అనుభవించిందో లేదో......బావగారు పోయాక మా ఎవరి ఇండ్లకు రాలేదు. ఎవర్నీ సాయం అడగలేదు. తిన్నదో, లేదో తెలీదు. బావగారు పోయిన రోజుల్లో 'నా దగ్గరికి రావే.....నా దగ్గరే ఉండు......' అని నేనన్న మాటలకు దాని సమాధానం నాకు ఇంకా గుర్తుంది.......
'' వద్దు లేవే....నేను బాగా ఉన్నప్పుడు రావడం వేరు....ఇప్పుడు రావడం వేరు......నా దురదృష్టం మీకేవరికి అంటకూడదు......పోయినాయనకేం.....మహారాజులా వెళ్ళిపోయారు. ఆయన వదిలి వెళ్ళిన పనులు ఉన్నాయి....అవి పూర్తి చేయాలి. ఈ జీవిత కాలం దానికే సరిపోతుందేమోనే''........అన్న మాటలు ఇప్పటికీ నా కింకా గుర్తున్నాయి. ఆ మాటల్లో మర్మం నాకప్పుడు అర్ధం కాలేదు. తరువాత కొన్ని విషయాలు తెలిశాయి. నేను సాయం చేయడానికి ముందు కొచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించింది. నన్ను మళ్ళీ తనని కలవడానికి కూడ రావొద్డంది. ఈ పన్నెండు సంవత్సరాలలో నా అంతట నేను తనని కలవడమే గాని తనంతగా తాను మాఇంటికి గాని చుట్టాల ఇండ్లకు గాని రాలేదు. ఎవరి దగ్గరా ఇస్తామన్నా పైసా సాయం తీసుకోలేదు. ఎవరింటా ఏ కార్యానికి రాలేదు. రెక్కలు ముక్కలు చేసుకుంది. ఇదిగో ఇలా అనాధ బ్రతుకయింది దానిది.........అంటూ బోరుమందావిడ. కంటికీ , మింటికీ ఏక ధారగా ఏడ్చిందావిడ.
నేను ఆవిడను దగ్గరికి తీసుకున్నాను. ఓదార్చాను. తమాయించుకొమ్మని ముందు జరుగవలసిన పని చూడాలని చెప్పాను. ఆవిడ ఏడుస్తుంటే నాకూ ఏడుపు ఆగలేదు.....నేను కూడా కొంగ నోటికి అడ్డు పెట్టుకుని మూగగా రోదించాను
ఆవిడ కొంగుతో కళ్ళు తుడుచుకుని........తన భర్త, కొడుకు తన వాళ్ళంతా 'అంత్యక్రియలకు' కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారనీ చెప్పింది. ఇంతలో ఆయన కల్పించుకుని బయటగదిలో మూలన ఒక ట్రంక్ పెట్టె' ఉన్నదని దానిలో కొంతడబ్బు, ఓ కొత్త చీర ఉన్నాయని తను పోయాక అవి వాడాలని 'జానకమ్మగారు' తనతో అయిదారు నెలల కింద అన్నారని.....జానికమ్మగారి చెల్లెలు తో అన్నారు. అది విన్న ఆవిడ అయితే ఆ పెట్టె చూద్దాం రండి' అని మమ్ముల్ని కూడా లోనికి రమ్మని పిలిచింది.
అందుకు ఆయన '' మీరు వెళ్లి చూడండి'' అని సున్నితంగా చెప్పారు.
నేను, ఆయనా ఒక ప్రక్కగా నిలబడి చెట్లకింద సెటిల్ అయ్యాము. ఈయన ఆఫీసు వాళ్ళలా వున్నారు. చాలామంది వచ్చారు.అందులో చాలామంది ఆడవాళ్ళు వున్నారు. నాకు చాలా విచిత్రమనిపించింది. ఆవిడను చూడ్డానికి ఆఫీసు నుంచి ఇంతమంది రావడమేమిటి? ఆవిడ కనీసం ఆఫీసులో పనిచేసిన వుద్యోగి  కూడా కాదు. కానీ ఇంతమందిని ఇక్కడ చూశాక నాకు అర్ధమయింది ఏమంటే  జానకమ్మ గారు మామూలుగా వడియాలు, అప్పడాలు ఆఫీసులు తిరిగి అమ్ముకునే సాధారణ వ్యక్తి కాదు అని నేను స్వగతంలో అనుకుంటుండగానే
పది నిముషాల్లో మళ్ళీ జానకమ్మ గారి చెల్లెలు వచ్చి చెప్పింది......'వారెవరు...పైసా ఖర్చు చేయవలసిన పనిలేదని .....'' పాతిక వేల దాకా కాష్ ....కొద్దిగా బంగారం, ముత్యం, పగడం....ఓ కొత్త చీర....దాంట్లో ఒక చిన్న చీటీ.....అందులో ఇవన్నీనా చరమాంకం లో వినియోగించగలరు.ఇంతకు మించి పైసా కూడ ఎక్కువ ఖర్చు పెట్టవద్దు" అన్నమాట వ్రాసి ఉంది అని చెప్పిందావిడ.
ఇవన్నీచూసి, వినీ నాకు 'జానికమ్మ'గారి మీద విపరీతమైన అభిమాన మేర్పడింది.
మనుషుల్లో నిజంగా ఇలాటి నిష్కళంక, పరిపూర్ణ అభిమానధనులయిన మనుషులు ఉంటారా? అందునా ఒంటరి ఆడమనిషి .......జీవితంలో విలువల కోసం ఇంత పోరాటం సాగించి, అనుకున్నది సాధించిన వెంటనే ......తన మరణాన్ని తనే శాసించుకుని వెళ్ళిపోయింది. మనసులోనే ఆవిడకు జోహార్లు అర్పించాను.
ఈ జీవిత పోరాటంలో .... ఆవిడకు బాసటగా నిలబడిన ఆయన్ని కూడా మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయాను.  ఆవిడ గురించి, ఆవిడ జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉత్సుకత ఏర్పడింది.
జనాల్లో ఒక్కసారిగా కదలిక చూసి అటుగా చూసే సరికి
'బ్రహ్మగారు' వచ్చారు. జానకమ్మగారి చెల్లెలి కొడుకుతో కార్యక్రమమంతా చేయిస్తున్నారు.
'మహా ప్రస్థానం' వాన్ వచ్చింది. ఆయన నన్నుఇంటికి వెళ్ళమన్నారు. నేను ఆటోలో ఇంటికి వచ్చేశాను.
అయన ఇంటికి వచ్చేసరికి దాదాపు సాయంత్రం ఏడు గంటలు దాటింది.
రావడంతోనే స్నానం చేసి 'నేను ఏమీ తినను....నన్ను లేపవద్దు' అని పడుకున్నారాయన.
నాకూ మనసు బాగోలేక నేను తినలేదు. పిల్లలు భోజనం చేసి వాళ్ళ చదువుల్లో వాళ్ళు బిజీ అయ్యాక నేను వచ్చి పడుకున్నాను. ఈయన పడుకున్నారు కానీ నిద్ర పోయినట్లు లేదు.
నేను రూము లోకి వెళ్లేసరికి ఆయన ప్రక్కకి తిరిగి పడుకున్నారు.
'ఇంకా నిద్ర పోలేదా'.... ? చాలా లోగొంతుకతో అడిగాను తనని....
'ఉహూ......నిద్ర రావడంలేదు'......
'తలనొప్పిగా ఉందా...అమృతాంజనం రాసేదా? అనునయంగా అడిగాను.
లేదు...తలనొప్పి లేదు.....చాలా బాధగా ఉంది.....'ఆవిడ'....అని అయన అంటుండగానే ఆయన గొంతు గాద్గిదమైంది.
''దాదాపు పదిహేను సంవత్సరాలనుంచి చూస్తున్నాను. శర్మగారు పోయిన రోజునుంచి రోడ్డు మీద పడిన మనిషి తన కోసంకాక భర్త చేసిన అప్పులు తీర్చడంకోసం బ్రతికింది. అనుకున్న దానికంటే రెట్టింపు అప్పులున్నాయి ఆయన చనిపోయే నాటికి. లోన్ లు అన్ని మినహాయించుకున్నాక ఆఫీసు నుంచి పెద్దగా ఏమీ రాలేదు. ఇల్లు అమ్మినా తీరలేదు అప్పులు. ఆయన చేసిన అప్పులన్నీ క్షుణ్ణంగా ఒక నోటు బుక్ లో విపులంగా వ్రాశారు. ఎన్నిసార్లు అన్నదో నాతో.....'ఈ వెధవ బ్రతుకు ఎప్పుడో చాలించేదాన్ని ప్రసాదూ ..... ఆయన చేసిన అప్పులు నన్ను బ్రతికిస్తున్నాయని .......జీవితంలో కష్టాలను ఎవరికీ పంచకూడదని,  ఎవరైనా తమ   కష్టాలను పర వారికి చెప్పకూడదని, అలా చేస్తే మనం పల్చనవుతామని' ! అదే నోట్ బుక్ మొన్న నాకు ఆవిడ చూపించింది. ఒక్కొక్కటి చొప్పున అప్పులన్నీ తీర్చేసింది ఆవిడ . కొంత మంది కి  వాళ్ళు శర్మ గారికి అప్పుఇచ్చిన గుర్తు కూడా లేదు. వారెవరు తనని అప్పు తీర్చమని అడగలేదు కూడా....అయినా సరే ఒక్కొక్కరిని  కలిసి అప్పులు తీర్చేది. కొంతమంది ఈవిడ ఆఫీసు కి వచ్చిన రోజు ఈవిడను తప్పించుకు తిరిగేవారు. ఎందుకంటే ఆవిడ దగ్గరనుంచి శర్మగారికి ఇచ్చిన డబ్బు తీసుకోవడం ఇష్టంలేక. అలా ఆవిడ డబ్బు తిరస్కరించిన వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారివి వారి కివ్వవలసిన డబ్బు వారి  టేబుల్ మీద పెట్టి వెళ్ళే దావిడ. కొందరికి ఇళ్ళకు కూడ వెళ్లి అప్పు చెల్లించేది. ఆ నోట్ బుక్ లో వ్రాసిన అప్పులన్నీ తీర్చడానికి ఆవిడకు ఇన్నిసంవత్సరాలు పట్టింది. నోట్ బుక్ లో చివరి అప్పు శుక్రవారం నాడు తీర్చేసింది. నాకు తెలుసు ఆ చివరి అప్పు తీర్చేశాక ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదని !  కానీ ఇంత త్వరగా ఆవిడ కనుమరుగై పోతుందనుకోలేదు'' ఆయన గొంతు పూర్తిగా గద్గద మయింది.
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య.
Mob. No.9849118254                                              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి