అనూహ్యం
---------------------
(ఏప్రిల్ '25 ప్రముఖ అంతర్జాల మాస పత్రిక 'రవళి' లో ప్రచురింపబడింది)
శశాంక్ కి రెండు సంవత్సరాలు నిండాయి. ఇంకా మాటలు రాలేదు. కనీసం 'అమ్మ' అని పలకడం రాలేదన్నచింత నిలవనీయడం లేదు తల్లి సుష్మను. ఇంటికి దగ్గరలో ఉన్న ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కి ఇప్పటికే రెండు, మూడు సార్లు చూపెట్టింది.
"బాబు బాగున్నాడమ్మా... ఏమీ ప్రాబ్లెమ్ లేదు. కొందరికి మాటలు మెల్లగా వస్తాయి. కంగారు పడకండి" ఆమె ఆందోళనను కొట్టిపారేశాడు డాక్టర్.
ఆ డాక్టర్ మీద నమ్మకం కుదరలేదు. సాయంత్రం భర్త మీద కోపం ప్రదర్శించింది సుష్మ.
"శశాంక్ ని చిల్డ్రన్ స్పెషలిస్ట్ కి చూపిద్దామంటే మీనమేషాలు లెక్కెడుతున్నావు. చాల రోజులనుంచి గమనిస్తున్నాను. ఈ మధ్య మరీనూ... ఉన్నట్లుండి దీర్ఘాలోచనపడిపోతావు. ఉలకవు పలకవు. ఏదైనా ప్రాబ్లమా అంటే ఏమీలేదంటావు. చిన్నవాడికేదైనా హెల్త్ ప్రాబ్లెమ్ ఉందేమోనన్న ఆనుమానానికి తోడు నీ ప్రవర్తన అర్ధంగాక భయపడి చస్తున్నాను'' ఆందోళనగా అంది సుష్మ.
"ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి భయపడతావు. పిల్లల్లో కొందరికి మాటలు, నడక ఆలస్యంగా వస్తాయి. నావరకు నాకు, ఆ రెండూ ఆలస్యమేనని మా అమ్మ అంటూవుండేది.
నా కేమయింది ? దుక్కలా ఉన్నాను. అనవసరపు ఆలోచనలు పెట్టుకోకు " అన్నాడు జితేంద్ర భార్యను అనునయిస్తూ.
"ఇదిగో ఇలా ఏదోవొకటిలా సర్ది చెప్పి మాయచేస్తావు. పిల్లాడిని స్పెషలిస్ట్ డాక్టర్ కి చూపిద్దామని మాత్రం అనవు. వాడి సంగతి పట్టించుకోవు" నిష్ఠూరంగా మాట్లాడి, భార్య కంట నీరు పెట్టుకునే సరికి అప్పటికప్పుడు 'పెడియాట్రిషియన్' అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు జితేంద్ర.
"రేపుదయం పదకొండు గంటలకు అప్పాయింట్మెంట్. వెళదాము" అని భార్యతో చెప్పి గదిలోనికి వెళ్లి బెడ్ మీద వాలిపోయాడు జితేంద్ర.
"రేపుదయం పదకొండు గంటలకు అప్పాయింట్మెంట్. వెళదాము" అని భార్యతో చెప్పి గదిలోనికి వెళ్లి బెడ్ మీద వాలిపోయాడు జితేంద్ర.
"ఏమిటో ఈ మనిషి ..." అని భారంగా నిట్టూర్చింది సుష్మ.
* * * * *
మరుసటిరోజు పదకొండున్నర గంటలకు శశాంక్ ని పరీక్షిస్తూ "చెప్పండి, కంప్లైంట్ ఏమిటి ?" అన్నాడు పెడియాట్రిషియన్.
"శశాంక్ కి రెండు సంవత్సరాలు నిండాయి. సాధారణంగా ఈవయసు పిల్లలు తల్లితో కబుర్లు చెబుతారు. వీడి దగ్గరనుంచి ఏ స్పందన లేదు. నవ్వుతాడు. కాని ఆ నవ్వు నన్నుచూసి కాదు. మమ్ముల్ని సూటిగా చూడడు. వెఱ్ఱి చూపులు చూస్తూ ఉంటాడు" అంది సుష్మ
డాక్టరు శశాంక్ ని నిశితంగా పరీక్ష చేశాడు.
"ప్రాబ్లెమ్ ఉంది. అది ఏమిటనేది ఇప్పుడే పూర్తిగా డయాగ్నైజ్ చేయడం కుదరదు.
'ఆటిజం' లక్షణాలు ఉన్నాయి. మీ కుటుంబాలలో ఎవరికైనా 'ఆటిజం వుందా?" అడిగాడు డాక్టరు.
"లేదు డాక్టర్ !" ఖచ్చితంగా అంది సుష్మ.
"నువ్వలా ఉండు! భార్యను వారిస్తూ..."ఈ జబ్బు హెరిడెటెరిగా వస్తుందా డాక్టర్ ?" సీరియస్ గా ప్రశ్నించాడు జితేంద్ర.
"జన్యుపరంగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగని, ఖచ్చితంగా చెప్పలేము" ఇతమిద్ధంగా ఏదీ తేల్చకుండా అన్నాడు డాక్టర్
''... ఎందుకలాడిగావు?" అన్నట్లు ప్రశ్నార్థకంగా తలఎగరేసి చూసింది సుష్మ భర్త వైపు.
మౌనంగా ఉన్నాడతను.
"ఎనీ థింగ్ ఎల్స్ ... మిస్టర్... ?"
"... జితేంద్ర" అంది సుష్మ.
"మై యంగర్ బ్రదర్ హేడ్ సచ్ ప్రాబ్లెమ్" అన్నాడు జితేంద్ర.
"ఏం మాట్లాడుతున్నావు జితేంద్రా...నీకో తమ్ముడు ఉన్నాడా!?" అంది సుష్మ. డాక్టర్ ఛాంబర్ లోనే ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చి చూస్తూ భర్త చెబుతున్నది నమ్మశక్యం కానట్లుగా.
"ఓకే. డీటెయిల్స్ చెప్పండి" జితేంద్ర వంక చూస్తూ అన్నాడు డాక్టర్.
"విజయేంద్ర నా స్వంత తమ్ముడు. నాకంటే ఐదేళ్లు చిన్న. వాడికి ఐదుసంవత్సరాలు వచ్చేవరకు కొద్ది మాటలే వచ్చాయి. పిలిస్తే పలికేవాడు కాదు. వెర్రి చూపులు చూసే వాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఏమాత్రం శబ్దాన్ని భరించేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు.
కొత్త వారినెవరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. బొమ్మల్ని, వస్తువుల్ని విసిరేవాడు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేసేవాడు. నా చిన్నతనంలో నేనే వాడితో ఆడుకోవాలన్నా, ఒంటరిగా వాడితో ఉండాలన్నా బెరుకుగా అనిపించేది" బాధగా చెప్పాడు జితేంద్ర
"ఇప్పుడెలా ఉన్నాడతను... ?"
"తెలియదు..." నిర్వికారంగా అన్నాడు జితేంద్ర.
భర్త తనకో స్వంత తమ్ముడున్నాడని చెప్పడంతో సుష్మకి కలిగిన విస్మయం కంటే అతనా విషయం దాచినందుకు వచ్చిన కోపాన్ని దాచుకోలేకపోయింది. హాస్పిటల్లో కోపగించడం బాగోదని, సభ్యత కాదని మౌనంగా ఉండిపోయింది సుష్మ.
"బాబు ఎదుగుదల నార్మల్ గా ఉంది. పిరియాడికల్ గా చూద్దాం" అని వేరే స్పెషలిస్ట్ డాక్టరుకి రిఫర్ చేస్తూ మరుసటిరోజు ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పి, ప్రిస్క్రిప్షన్ వ్రాసిచ్చాడు డాక్టర్.
భార్యాభర్తలు ఇంటికి తిరిగి వచ్చారు. తోవలో ఒకరితోనొకరు మాట్లాడుకోలేదు.
బద్దలవ్వబోయే అగ్నిపర్వతంలా సుష్మ, బద్దలయ్యి 'లావా, మేగ్మా' ను చిందించి, శాంతించిన అగ్నిపర్వతంలా జితేంద్ర, చెరొక గదిలో గడిపారు. ఇద్దరూ ఎంగిలి పడలేదు.
కాసేపటికి ఏడ్చి, ఏడ్చి కళ్ళు ఉబ్బి గదిలోనుంచి బయటకు వచ్చింది సుష్మ. అదే సమయానికి జితేంద్ర బయటకు వచ్చాడు.
"నీకో స్వంత తమ్ముడున్నాడన్న విషయాన్నినా దగ్గర దాచావు ? ఇంకెన్ని విషయాలు దాచావు?" కోపంగా అంది సుష్మ.
"మన పెళ్ళికి ముందే మీ అన్నయ్యకు చెప్పాను. నీతో చెప్పే అవకాశం రాలేదు. మీ అన్నయ్య మీ ఇంట్లో చెప్పాడనే అనుకున్నాను. నీతో నేను ఆ విషయాన్ని చెప్పకపోవడం నా తప్పో, బలహీనతో నాకు తెలియదు. ఎందుకని ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు" వంచిన తల ఎత్తకుండా సమాధానం చెప్పాడు జితేంద్ర.
"నిన్నని ప్రయోజన మేముంది. స్వంత అన్నే తెలిసీ చెప్పలేదు ... కనీసం ఇప్పుడైనా 'విజయేంద్ర' ఎక్కడున్నాడో చెబుతావా.... ఆరోగ్యం ఎలావుంది? ఏం చేస్తున్నాడు...?
అతని బాగోగులు ఎవరు చూస్తున్నారు? చివరిగా అతన్ని ఎప్పుడు చూశావ్ ?" ప్రశ్నల వర్షం కురిపించింది సుష్మ
"విజయేంద్ర, రాజారావు చిన్నాన్న దగ్గర మా ఊళ్ళో ఉన్నాడు. పన్నెండేళ్ల క్రితం నేను ముంబై వచ్చాక తిరిగి ఆ ఊరెళ్ళలేదు. విజయేంద్రను చూడలేదు" అపరాధభావంతో అన్నాడు జితేంద్ర ఆమె సూటి చూపులను తప్పించుకుంటూ.
"విజయేంద్రతో గాని, మీ బాబాయిగారి తోనూ కాంటాక్టులో లేవా?!"
"లేదు. చాలా లెటర్స్ వ్రాశాను. మాట్లాడడానికి ఎన్నోసార్లో ప్రయత్నించాను. బాబాయి దగ్గరి నుంచి ఎటువంటి సమాధానం లేదు. నన్ను ఆవూరినుంచి ముంబై పంపించిన రోజున, తిరిగి ఆవూరికి రావద్దని గట్టిగా చెప్పి నా దగ్గర మాట తీసుకున్నాడు బాబాయి. అందుకే వెళ్ళలేదు" అన్నాడు జితేంద్ర.
అతని సమాధానం విన్న సుష్మ మాన్పడిపోయింది. కాసేపటికి తేరుకుని
"మామయ్య గారు వద్దంటే మాత్రం ... నువ్వసలు మనిషివేనా? మానవత్వం లేదా? స్వంత తమ్ముడు, అందునా మానసిక వైకల్యం ఉన్నతమ్ముణ్ణి వదిలేసి ఇన్నేళ్ళు యథేచ్ఛగా ఎలా ఉన్నావు ? నీదింత రాతి హృదయమని గుర్తించలేక పోయాను... " కరకుగా అంది సుష్మ.
''నీకేం తెలుసు సుష్మా! ఈ పన్నెండేళ్ళుగా నేను ఎంత నరకం అనుభవించానో!
శశాంక్ ఎదుగుతున్నకొద్దీ, రూపంలోనూ, చేష్టలలోనూ విజయేంద్రను పోలి ఉండడంతో ప్రతిక్షణం తమ్ముడు గుర్తుకు వచ్చి ఆవిషయాన్ని మింగాలేక, కక్కాలేక ప్రతిక్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నాను'' అని అన్నాడు జితేంద్ర కిటికీ లోనుంచి బయటకు చూస్తూ
సుష్మ అప్పటికే లోనికి వెళ్ళిపోయింది. ఆమె తన మాటలు వినలేదన్న నిజాన్ని అతను గ్రహించలేదు.
కొద్దిసేపటికి సూట్ కేసు సర్దుకుని, బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయలుదేరింది సుష్మ.
జితేంద్ర ఎంత ప్రయత్నించినా సుష్మ ఆగలేదు.
"డ్రాప్ చేస్తాను ఉండు!" అని జితేంద్ర చెప్తున్నా వినకుండా "నీడ్ ఏ బ్రేక్" అంటూ టాక్సీ లో
వెళ్ళిపోయింది.
వెంట వెళ్లి భార్యను సమాధానపరిచే సాహసం కూడా చేయలేకపోయాడు జితేంద్ర.
ఆమె కోపం జితేంద్రకు తప్పుగా అనిపించలేదు.
తమ్ముడి విషయం భార్యకు ఇన్నేళ్లు ఎందుకు చెప్పలేకపోయాడో అన్న స్పష్టత అతనికే లేదు. అది యాదృచ్ఛికం కాదు, స్వయంకృతం అని అతనికి తెలుసు. బాబాయి అన్నమాట మనసు పొరల్లో దాగి అతని మీద భావాధిపత్యం కొనసాగించింది.
మనిషులు అవసరమైనప్పుడు అవసరాలకు, మనుగడకు అబద్ధమాడడం స్వాభావికం.
కానీ, మనిషి దాచిన నిజాన్ని, దాని భౌతికతను శాశ్వతంగా దాయడం అసాధ్యం.
మానసిక వైకల్యం వున్న తమ్ముడు వున్నాడని చెప్పడంవల్ల తన ఆస్తిత్వానికి ఎక్కడ హాని జరుగుతుందేమోనన్న భ్రమలో ఉండిపోయాడతను. ఆ ఆత్మన్యూనత వేటకుక్కలా జితేంద్రను వెంటాడుతూనే వుంది. సుష్మ తనని అసహ్యించుకోవడమే గాక లోకమంతా ఏకమై తనని వెలేసినంత ఏహ్యభావన తనని నిలువెల్లా కలిచివేస్తోంది.
కళ్ళు మూసుకుని సోఫాలో ఒరిగాడు. అతని ఆలోచనలు వేగంగా గతంలోకి వెళ్లాయి.
* * * * *
జితేంద్రది బందరు దగ్గర ఒక కుగ్రామం. చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, తమ్ముడు. స్వంతిల్లు. రెండెకరాల పొలం. అదీగాక వేరే ఐదెకరాల మెట్ట భూమి కౌలుకి సాగు చేసేవాడు తండ్రి. సంతోషంగా సాగుతున్నరోజులు. జితేంద్రకి ఐదేళ్ల తేడాతో తమ్ముడు పుట్టాడు. ముట్టుకుంటే మాసిపోయే ఛాయ. ఎంత అందంగా ఉన్నాడో అనుకున్నారందరూ.
రెండున్నర సంవత్సరాలు దాటినా విజయేంద్రకి మాటలు రాలేదు. పెద్దాసుపత్రికి వెళ్లి డాక్టరుకు చూపించారు. ఆయన ఇంకొక స్పెషలిస్ట్ డాక్టరు దగ్గరికెళ్ళమన్నాడు.
బాబుకి 'ఆటిజం' అన్నారు. మూణ్ణెల్ల కొకసారి చూపించమన్నారు. అయిదు సంవత్సరాలకు కొన్ని మాటలు వచ్చాయి. పిలిస్తే పలికేవాడు కాదు. స్కూల్లో చేర్పించారు. ఒక్క లెక్కల సబ్జెక్టులో అసామాన్య ప్రతిభ చూపేవాడు. మిగతా సబ్జెక్టులలో అంతంత మాత్రంగా ఉండే వాడు.
జితేంద్రను ఇంటర్ కి వచ్చాడు.
విజయేంద్రను హైదరాబాద్ లో స్పెషల్ స్కూల్లో చేర్పించమని స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పాడు. తనని తీసుకుని హైద్రాబాదు వెళ్లి వచ్చాడు తండ్రి. తల్లితో ఏదో చెబుతూ తండ్రి కంట నీరుపెట్టుకోవడం చూశాడు జితేంద్ర. డబ్బు లేదని అర్ధమైంది జితేంద్రకు. జితేంద్ర చదువుకు, విజయేంద్ర వైద్యానికి అప్పులయ్యాయి. కనీసం వడ్డీ కట్టలేని స్థితి వచ్చింది. వరుసగా రెండుసంవత్సరాలు తుఫాను తాకిడికి పంట చేతికి రాలేదు. అప్పుల బాధతో వారికి నిద్రపట్టేది కాదు. కాలం గడ్డుగా గడిచేది. ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చాడు తండ్రి. జితేంద్ర ఇంటర్ పరీక్షలు అయ్యాయి.
ఒకరోజు పొలంపనికి వెళ్లిన తలితండ్రులు ఇంటికి తిరిగి రాలేదు. పిడుగుపాటుకి ఇద్దరూ ఒకేసారి చనిపోయారు. వారి దినవారాలయ్యాయి. ఊరి పెద్దాయన జితేంద్రను ఉద్దేశించి మాట్లాడుతూ
''ఈ పిచ్చోడికి మీ చిన్నాయన రాజారావు ఓ ముద్ద పడేయకుండా ఉండడులే గాని వాడి మానాన వాడిని వదిలి, నువ్వయినా చదువుకుని ప్రయోజకుడివి కావాలి. ఉద్యోగం వచ్చాక వాడి మంచి, చెడు చూసుకోవచ్చు" అని జితేంద్రకు సలహా పడేశాడు.
తమ్ముడ్ని పిచ్చోడు అనేసరికి జితేంద్రకు కోపం వచ్చింది.పేదవాడి కోపం పెదవికి చేటు కదా! గుడ్లనీరు కుక్కుకోవడం మినహా ఏం చేయలేకపోయాడు.
ఇంత జరుగుతున్నా, విజయేంద్ర వాడి మానాన వాడు ఒకమూలన కూర్చుని ఆడుకునే వాడు.
తల్లి, తండ్రీ కన్పించకపోవడంతో అన్న జితేంద్రను ఓ కంట కనిబెడుతూ, వదిలేవాడు కాదు.
'నువ్వుకూడా నన్నొదిలి వెళ్తావా ?' అన్నట్లుగా వెంటాడేవి వాడి 'వాడి' చూపులు.
జితేంద్ర చిన్నాన్నరాజారావు మిగిలి ఉన్న ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చి మిగిలిన డబ్బు విజయేంద్ర వైద్యానికి తనదగ్గరే ఉంచుతానని చెప్పాడు. శలవులయిపోయాయి.
ఇంటర్ పాసయ్యాడు జితేంద్ర.
* * * * *
ఆ ఊరి కరణం గారబ్బాయికి ముంబైలో ఇంపోర్ట్స్ ఎక్సపోర్ట్స్ వ్యాపారం. చేతికిందకి నమ్మకమైన, చదువుకున్న కుర్రాడెవరైనా ఉంటే తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తానన్నాడు. జితేంద్ర గురించి చెప్పాడు రాజారావు.
"ఉద్యోగం ఇచ్చి ముంబైలో ఉండడానికి వసతి ఇస్తాను. మీ అన్న కొడుకు బాధ్యత ఇక నాది" రాజారావుతో అన్నాడు కరణంగారి అబ్బాయి. సంతోషంగా ఇంటికి వచ్చాడు రాజారావు.
"నీ ఇంటర్ అయిందిగా. పైచదువు చదివించే స్థోమతలేదు. కరణంగారబ్బాయి నీకు ఉద్యోగం ఖాయం చేశాడు. ఊళ్ళోనే ఖాళీగా ఉన్నావంటే ఈ వయసులో అల్లరి చిల్లర తిరుగుళ్ళు అలవాటవుతాయి. నీ తమ్ముడిని అంటున్నట్లుగానే నీకూ 'పిచ్చోడి అన్న' అని జనం నీకూ ముద్ర వేస్తారు . బతుకు ఛిద్రం అవుతుంది. ఈ ఊరు వదిలి వెళ్ళు. మరి రాకు!
బాబాయి ఊరి నుంచి తరిమేస్తున్నాడని అనుకోవద్దు. నీ భవిష్యత్తు కోసమే నేనీ నిర్ణయం తీసుకున్నాను. తమ్ముడి గురించి చింతపడకు. వాడిక మాబిడ్డ" అని చెప్పి ఆ మరుసటి రోజే జితేంద్రని స్నేహితునితో ముంబై పంపించాడు రాజారావు.
అతని దగ్గర ఇంపోర్ట్స్, ఎక్సపోర్ట్స్ వ్యాపారంలో సహాయకుడిగా చేరి, ఐదేళ్లలో మంచి జీతంతో ముంబైలో సెటిలయ్యాడు జితేంద్ర.
తమ్ముణ్ణి తీసుకెళ్తానని బాబాయికి ఉత్తరం రాశాడు. కరణంగారబ్బాయితో కూడా కబురుచేశాడు జితేంద్ర. తిరుగు టపాలో రాజారావు దగ్గర్నుంచి సమాధానం వచ్చింది.
"ముంబయి లాటి మహాపట్నంలో విజయేంద్రను నీదగ్గర పెట్టుకోవడం, వైద్యం, విద్య అంత సులభంకావు. నీ రోజువారి జీవితానికి, నీ ఉద్యోగానికి వాడు అడ్డంకి అవుతాడు. ఇద్దరికీ ఇబ్బంది అవుతుంది. నా మాట విను. విజయేంద్ర బాగున్నాడు. వాడిని మా స్వంత బిడ్డలా సాకుతాము.
వాడి గురించి ఆలోచన మానెయ్! ఇక్కడ మంచి పంతులుగారు వచ్చారు. వాడు తప్పక మెరుగవుతాడని నమ్మకం ఉంది. ఇదే విషయం మీ యజమానితో చెప్పాను. ఇదంతా నీ మంచికే చెబుతున్నానని గ్రహించు" అనునయంగా ఉత్తరం రాశాడు రాజారావు. తరువాత జితేంద్ర వ్రాసిన ఉత్తరాలకి సమాధానం రాలేదు.
కాలక్రమేణా వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. కరణం గారబ్బాయి అహ్మదాబాదు కొత్త బ్రాంచిలో సెటిలయ్యాడు. ఫలితంగా జితేంద్రకు ఊరి సంగతులుకూడా తెలియరాలేదు. పన్నెండేళ్ల కాలం గడిచిపోయింది.
అలా, ఆనాటి నుంచి ఈనాటి వరకు విజయేంద్ర ఎలా ఉన్నాడో జితేంద్రకు తెలియ రాలేదు.
* * * * *
ముంబైలో తనతో పనిచేసే ఓ తెలుగు స్నేహితుని చెల్లెలు సుష్మను పెళ్లిచేసుకున్నాడు జితేంద్ర. వారింట్లో ఒంటరివాడిగా పరిచయమయ్యాడు జితేంద్ర.
* * * * *
డాక్టరు అడిగిన కారణంగా జితేంద్ర తమ్ముడి విషయం వెలుగు చూడడంతో సుష్మ షాక్ కు గురయింది. భర్త అంతటి ముఖ్య విషయాన్ని తననుంచి దాచడంతో భర్త మోసం చేశాడన్న భావనకు లోనయింది.
జితేంద్రకు సంజాయిషీ ఇచ్చుకునే సమయం, అవకాశం ఇవ్వలేదు. పిల్లాడితో పుట్టింటికి వెళ్లడంతో అతనికి ప్రపంచమంతా శూన్యమనిపిస్తోంది.
* * * * *
భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిన రోజే జితేంద్ర అత్యవసర ఆఫీసు పనిమీద వారం రోజులు అహమ్మదాబాదు వెళ్లాల్సి వచ్చింది. క్యాంపుకు వెళ్లేముందు, తరువాత ఎన్నిసార్లు ఫోను చేసినా సుష్మ ఫోను ఎత్తలేదు. బావమరిదితో మాట్లాడుదామనుకున్నాడు. ప్రయోజనమేముంటుందన్న మీమాంశలో పడ్డాడు. జరిగిన తప్పిదాన్ని పదే పదే తవ్వుకోవడంకన్నాసరిదిద్దుకుని, ముందుకు పోవడమే మేలనుకున్నాడు.
ఊరినుంచి తమ్ముడిని తీసుకునివచ్చి, అప్పుడు భార్య ముఖం చూడాలని నిర్ణయించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు జితేంద్ర.
* * * * *
ఫ్లైట్లో విజయవాడకు వచ్చి అక్కడనుంచి క్యాబ్ లో ఊరికి చేరాడు. స్వంత ఇంటి ఆనవాలే లేదు. అదే స్థలంలో పెద్ద భవంతి వచ్చింది. గేటులోనుంచి ఇంటిముందు ఆవరణలో పచ్చటి చెట్లతో, పూలమొక్కలతో గార్డెన్ కళకళ లాడుతూ కన్పించింది. ఆ ఇంటికి ఆనుకుని ఉన్న బాబాయిగారి పాత పెంకుటింటి వైపు నడిచాడు. ఇంటి తలుపు బార్లా తెరిచేఉంది. ఇంట్లో పనివాళ్ళు వున్నారు. ఒక పనివాడు జితేంద్రను గుర్తించాడు.
"మీరు జితేంద్రబాబు గారు కదా...చిన్నప్పుడెప్పుడో చూశాను. మీ చిన్నాయన పక్కన భవంతిలో వుంటారు. రండి వెళదాం" అన్నాడు.
జితేంద్ర చేతినుంచి బ్యాగ్ అందుకుని రాజారావు ఇంటి ఆవరణ లోనికి నడిచాడు. పనివాడు "రాజారావు గారూ!" బిగ్గరగా పిలిచాడు పనివాడు.
రాజారావు బయటకు వస్తూనే జితేంద్రను గుర్తించి "ఎన్నేళ్ళకొచ్చావురా జీతూ!" అంటూ గట్టిగా కౌగలించుకున్నాడు.
"నీ మాటకాదని మన ఊరికి వచ్చాను. క్షమించు బాబాయ్!" అన్నాడు జితేంద్ర.
"మాట తప్పి మర్యాద దక్కించుకున్నావురా! ఆనాటి గడ్డు పరిస్థితుల్లో 'ఊరికి రావద్దు' అన్నంత మాత్రాన ఇన్నేళ్లు రాకపోవడమేమిట్రా? బాబాయి మీద అంత కోపం వచ్చిందా" అన్నాడు రాజారావు గద్గద స్వరంతో కళ్ల నీళ్లు పెట్టుకుని.
"నీ మీద నాకు కోపం ఏంటి బాబాయ్? నువ్వు, పిన్నిగాక మాకింకెవరున్నారు?" అన్నాడు జితేంద్ర.
"నిన్ను నీ తమ్ముడికి ఇన్నేళ్లు దూరంగా ఉంచాను. నాది పెద్ద తప్పిదమే!
అన్న, వదినా అకాలంగా పోయారు. ఆనాటి గడ్డు పరిస్థితుల్లో నీ భవిష్యత్తు దృష్ట్యా నిన్నిక్కడ నుంచి తరిమేశాను. ఇక్కడికి రావద్దన్నాను. నాకంతకన్నా వేరేమార్గం తోచలేదు. మీ తల్లి తండ్రులు చేసుకున్న పుణ్యాన, భగవంతుడు పంపినట్లుగా నువ్వెళ్లిన తరువాత ఈ ఊరికి ఒక మంచి పంతులు గారొచ్చారు. ఆయనకు మానసిక వైకల్యం ఉన్న కొడుకుండేవాడు. విజయేంద్ర వయసే. ఆయన వీళ్ళిద్దరికే ప్రత్యేకంగా చదువు చెప్పాడు. అలా వాడికి చదువు ఒంటబట్టింది. వయసు పెరిగే కొద్దీ, వెన్ను ముదిరే కొద్దీ కుదురుకున్నాడు. నిలకడ వచ్చింది. డిగ్రీ అయింది. ప్రయోజకుడయ్యాడు.
అవసరమున్న లేకున్నా, ఊళ్లు వదిలి పట్నాలకు పరుగెత్తే వారికి ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. వాడిని, వాడు సాగుచేసే తోటను, పొలాలను, సేంద్రీయ పంటలను చూసి తీరాల్సిందే!" విజయేంద్ర విజయాల గురించి ఏకరువు పెట్టాడు రాజారావు.
సంతోషం పట్టలేక "ఇంతకీ తమ్ముడేడి బాబాయ్ ?" అన్నాడు జితేంద్ర
"కొత్తగా పళ్ళ తోట కొన్నాడు. నెలరోజుల్నుంచి తోటపని లోనే తలమునకలై ఉన్నాడు. రెండు, మూడు రోజుల పాటు అక్కడే ఉంటానన్నాడు" అన్నాడు రాజారావు
"అక్కడికి వెళదాం బాబాయ్. తమ్ముడిని అర్జెంటుగా చూడాలి" అన్నాడు జితేంద్ర.
స్కూటర్ తీశాడు రాజారావు.
మట్టిరోడ్డు మీద అర్ధగంట ప్రయాణంచేసి వారిరువురు తోటకు చేరారు.
తోట కంచె పక్కగా తోవకు రెండువైపులా పేర్చిన ఎర్రటి ఇటుకల మధ్యగా ఎర్రటి గరుసుమట్టి తోవ. లోనికి వెళితే గాని కనుపించని చిన్న ఫామ్ హౌస్ ముందు ఆగింది స్కూటర్. స్కూటర్ దిగాడు జితేంద్ర. ఫామ్ హౌస్ కి ఎడంగా ఉన్న పూలతోట మధ్యలో శశాంక్ ని ఎత్తుకుని ఆడిస్తున్న విజయేంద్రను చూపాడు రాజారావు. తలలు ఊపుతూ గులాబీ పరిమళాల గుబాళింపుతో వీస్తున్న గాలితో ఊసులాడుతున్న గులాబీ పూల మొక్కలను చూసి కేరింతలు కొడుతున్నాడు శశాంక్ విజయేంద్ర చేతుల్లో.
ఊహించని ఘటనతో ఆశ్చర్యంతో నిశ్చేష్ఠుడై రాజారావు వంక చూశాడు జితేంద్ర. విజయేంద్ర పరుగున వచ్చి జితేంద్రను కౌగలించుకున్నాడు
"అంతాపైవాడి లీల. మీ ఇద్దరి జీవితాల్లో ఈ రోజువరకూ అన్ని సంఘటనలు అనూహ్యంగా జరిగాయి. నీ భార్య బంగారం. మరిది ఉన్నాడని తెలిసిన మరుక్షణం రెక్కలుగట్టుకుని ఇక్కడవాలింది. భగవంతుడు ఎప్పుడూ, ఎవరికీ అన్ని తలుపులు మూయడు. నీ తమ్ముడిని క్షేమంగా నీ కప్పచెబుతున్నాను. నా బాధ్యత తీరింది" గాద్గదికంగా అన్నాడు రాజారావు.
* * * * *
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నంబరు : 9849118254