లేబుళ్లు

4, డిసెంబర్ 2010, శనివారం

బలవంతులు ( balavantulu )

బలవంతులు

సవ్వడి లేకుండా సర్రున వచ్చిందో సుడిగాలి
వస్తూనే చూపింది తన ప్రతాపం ఓ తాటాకు గుడిసెపై
తాటాకులన్నీ తడుముకుంటూ దగ్గరికైనాయి ....
మాయదారి 'సుడిగాలి' చప్పున ఎగరేసుకు పోతుందని !
సుడిగాలి చూసిందది!
చప్పున కోపం వచ్చింది దానికి
నన్ను కాదని మీరంతా ఒకటవుతారానని
అంతే! మరింత విజ్రుంభించి వీచింది మరొక్క సారి!
మళ్ళీ అంటుకు పోయాయి ఒకదాన్నొకటి ఆ తాటాకులు
ఈ సారి ఊరుకోలేదు 'సుడిగాలి'
గురిచూసి విరిచింది...
ఆదమరిచిన ఆకులని ....
ఎగరేసుకు పోయింది వాటిని పైపైకి
భయంతో వొణికి పోయాయి !
విలపించాయి....
'అన్నా...గాలన్నా...ఒదులు...మమ్మొదలమని'
బతిమాలాయి..బామాడాయి...
అయినా...వినలేదు సుడిగాలి !
విసిరింది..విసిరింది..అటూ ఇటూ!
దారిలేక, తెన్నులేక దారితప్పాయి తాటాకులు!
చేరలేదు తమవారిని!
అది చూసి నవ్వింది 'సుడిగాలి' పడీ, పడీ!
అది మొదలు అడ్దేలేకుండా పోయింది 'గాలికి'
ఎండుటాకుల్ని చూస్తే చాలు ఎగిరెగిరి పడేది!
గర్వ మెక్కింది 'గాలికి'
ఊళ లేస్తోంది!
ఊరేగుతోంది!
తనకెదురేలేదని ఎగిసెగిసి పడుతోంది!
ఆరోజు పెద్ద కొండరాయిని చూసింది!
' ఏయ్ ...లే... అడ్డులే..నాకడ్డులెమ్మంది!
కదల్లేదు....కొండరాయి!
మళ్ళీ కోపమొచ్చింది గాలికి
గట్టిగా వీచింది...
కొండను 'డీ' కొంది...
అంతే! ఎంత గట్టిగా 'డీ' కొట్టిందో
పక్కకి అటు,ఇటు జారింది  గాలి
కొండ కదల్లేదు, మెదల్లేదు!
మళ్ళీ వీచింది
మళ్ళీ మళ్ళీ వీచింది గట్టిగా
కొండను పెకలించి వేయాలని
కాలేదు తనవల్ల!
తోక ముడిచి వెనక్కి తిరిగింది గాలి !
పకాలున నవ్వు వినిపించింది గాలికి !
అవమానంతో సర్రున  కోపంవచ్చింది గాలికి!
అటు, ఇటు చూసింది నవ్విందెవరానని?
తాటి చెట్టుపైన పచ్చని తాటాకులు!
అటువొంక కోపంగా చూసింది గాలి
అయినా మళ్ళీ ఫక్కున నవ్వాయి 'తాటాకులు'

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి