లేబుళ్లు

28, జనవరి 2014, మంగళవారం

సుబ్బారావు బదిలీ

                                                           సుబ్బారావు బదిలీ                                                           
                                                          ---------------------------

                            సుబ్బారావుకి హైదరాబాద్ 'బదిలీ' అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే రోజే వాళ్ళమ్మగారు, బామ్మగారు, అమ్ముమ్మగారు ఇంట్లో వారైతేనేం,చుట్టాలైతేనేం ... అందరుకల్సి మూకుమమడిగా తేల్చి చెప్పారు. ఉద్యోగం చేయదల్చుకుంటే అటు వైజాగ్, ఇటు నెల్లూరు వరకు మాత్రమే 'బదిలీ' గట్రా అవుతే వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అదేదో పేదరాశి పెద్దమ్మ కథలోలా పడమరదిక్కున ఏ పట్నం చెప్పకపోవడంతో
'అదేమిటే బామ్మా.. పడమర దిక్కు మరిచావు.. ఏ ఊరూ చెప్పలేదు.
గవర్నమెంటువారు అందునా కేంద్ర ప్రభుత్వం వారు అసలే వూరుకోరు. పడమర దిక్కున కూడా ఏదో ఒక ఊరో,పల్లో చెప్పవే బామ్మాఅన్నాడు సుబ్బారావుబామ్మగారిని ఆటపట్టిస్తూ .
ఆక్షణంలోనే సుబ్బారావు వాళ్ళ అమ్ముమ్మగారు సుబ్బారావు
తెలివితేటలకి మురిసిపొతూ 'మానాయనే' అనుకుంటూ రెండరిచేతులు కణతలకాన్చి ''పట పటా' శబ్దం చేస్తూ  మెటికలు పెటుక్కున విరిచారు.
'సరేరా' అంతలా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నా,బెజవాడో,లేక మన జగ్గయ్యపేటో
ఏదో ఒకటి ఆ జాబితాలో(లిస్ట్) వేసుకో' అంది వాళ్ళ బామ్మగారు చాలా ఉదారంగా సుబ్బారావు వేడుకోలు మన్నించి.
అప్పటికే సుబ్బారావు వాళ్ళ అమ్ముమ్మగారు,అమ్మగారు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు, బామ్మగారు ఎక్కడ కాదంటారోనని !
ఆవిడ తూర్పున  ఏకంగా మూడు వూళ్ళ పేర్లు చెప్పేసరికి  వాళ్ళు సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుందామనుకున్నారు  కానీ బామ్మగారు ఏమైనా అనుకుంటారని అక్కడితో ఆగిపోయారు తల్లీ కూతుళ్ళు.
అసలు సుబ్బారావు వేరే ఊళ్లకు ఉద్యోగరీత్యా వెళ్ళడానికి ఇంత 'యాగీ' ఏమిటనుకుంటున్నారట్లే ఉంది.
అక్కడే ఉంది అసలు కధ, కమామీషు. సుబ్బారావుకి 24 ఏళ్ళు.ఈ యేడాది పెళ్లి చేయాలనుకుంటున్నారు వాళ్ళ నాయనమ్మగారు.
'అదేవిటీ' చోద్యం కాకపొతే నిక్షేపంగా తల్లీ, తండ్రీ ఉన్నాఆవిడదేవిటటా పెత్తనం అన్నింటా'?
'హవ్వ, హవ్వ' అని చాటుగా బుగ్గలు నొక్కుకున్నవారు లేకపోలేదు.
కానీ అదంతే...ఆయింట అన్నింటా ఆవిడదే పెత్తనం. ఆవిడ 'కా' అంటే 'కా' 'కీ' అంటే'కీ'.
ఆవిడ ముందు ఎవరూ మారుమాట్లాడే వీల్లెదు.
సుబ్బారావు వాళ్ళ నాన్నగారికి నోట్లోనాలుక లేదా ? అంటే 'లేకేం' ఉంది. అందుకే అది ఆయనకి తల్లో నాలుకలానే ఉంటుంది.
తల్లో నాలుకంటే బామ్మగారు అప్పుడప్పుడు చెప్పే గతం గుర్తుకు వస్తోంది.

                                                      * * * * *

                         సుబ్బారావు తాతగారు 'ఇంగ్లీష్'వారి కాలంలోనే కాకినాడలో 'తాసిల్దార్' గిరి వెలగబెట్టారట. ఆరోజుల్లో ఆయనగారి ఇంగ్లీష్ వాగ్ధాటికి ఇంగ్లీష్ వారు ఆయనకీ విపరీతమైన గౌరవం ఇచ్చేవారట. దాంతో ఇంగ్లీష్ 'కలెక్టరు' గారికి తలలో నాలుకలా ఉంటూ 'దొరసానిగారి'కి కూడా బాగా దగ్గరయ్యారట. అసలే మంచి స్పురద్రూపి. చక్కటి ఆకారం.
అయినదానికీ కానిదానికి, దొరగారు ఊళ్ళో ఉన్నాలేకున్నా,ఆయన్ని'దొరసాని' గారు బంగాళాకు పిలిచేదట. గంటలతరబడి 'బాతాఖానీ' వేసేదట. దాంతో వాళ్ళూ, వీళ్ళూ చెవులుకొరుక్కునే వరకూ వచ్చి అదికాస్తా చిలవలు, పలవలు అయి బామ్మగారివరకుచేరి
ఆవిడ అలిగి కొడుకుతో సహా సొంతఊరికి వెళ్ళిపోవడం, ఆ పోవడం, పోవడం వెనక్కి రాకుండా చిల్లకల్లు, జగ్గయ్యపేటకు తిరుగుతూ ఆవిడ, హిందీ భాషలో భాషా ప్రవీణ, భాషా నిష్ణాత్  లాటి పరీక్షలు వ్రాసి భాషలో ప్రావీణ్యం సంపాదించడమే గాక జగ్గయ్యపేటలో ఓ పాఠశాలలో హిందీ పండిట్ గా పనిచేసి రిటైరు అయిందావిడ. రిటైర్  అయ్యాక కూడా కాకినాడలోనే  ఉండిపోయిన ఆయన, వార్ధ్యక్యం, రోగాలు రొస్టులు వచ్చి చరమాంకంలోగాని ఆయనగారికి భార్యాపిల్లలు గుర్తుకి రాలేదట. ఏదేమైనా చివర్లో కాకినాడలో ఇల్లూ,పొలమూ గట్రా అమ్మేసి దండిగా వచ్చిన సొమ్ము అంతా భార్య చేతిలో పెట్టి కన్నుమూశారట ఆయన. అన్నట్లు ఇంకొక విషయం మరిచానండోయ్.... దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆయన రెండు,మూడు సార్లు 'లండన్' వెళ్లి దొరసాని గారిని కలిసివచ్చారట కూడా!
ఇదంతా సొంతూరికి దూరంగా ఉద్యోగం చేయడంవల్లేనని బామ్మగారి ధృడ నమ్మకం.
అందుకే అప్పటినుంచి  కొడుకుని అంటిపెట్టుకుని ఉండిపోయారట ఆవిడ.
అంచేత తల్లిగారు గీసిన గీటు దాటడు సుబ్బారావువాళ్ల నాన్నగారు.
ఇదీ సుబ్బారావు ఉద్యోగానికి, బదిలీ కి ఉన్నలంకె. పైగా సుబ్బారావు కి అన్నీతాతగారి పోలికలట. ఇవన్నీగాక సుబ్బారావుకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చాక బామ్మగారు తీరిగ్గా కూర్చొని 'ఏరా' సుబ్బడూ'నీ ఉద్యోగం ఏమిటి? అసలు ఆఫీసులో నువ్వేం పని చేస్తావు' ? అనడిగారు.
అవకాశం దొరికిందిగదా అని తను ఆఫీసులో చేసేపని అంతా వివరిస్తూ 'మన జనాభాలో ఆడవారెంతమంది వారిలో పిల్లలెంతమంది, పద్నాలుగు సంవత్సారాల లోపు ఎంతమంది... అలాగే మగవారెంతమంది...'అని అన్నాడో లేదో బామ్మగారు మొదలెట్టేశారు దండకం.  'వెధవాయ్' ఎక్కడికి పోతాయి తాతబుద్ధులు. జనంలో ఆడవారెంతమంది ఉంటే నీకెందుకురా? అసలు నువ్వెళ్ళడానికి వీల్లేదు. ఉద్యోగం మానేయ్.ఉన్నదాంట్లోనే తిందాం! అంటూ బిగుసుకుపోయారావిడ. దాంతో సుబ్బారావు మాటల్లో అజాగ్రత్తగా వాడిన 'పదాలకు'  నాలుక్కరుచుకుని అందరూ కలిసి  ఆవిడను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా సుబ్బరావుని హైదరాబాదు పంపించే ప్రయత్నంలో 'బ్రహ్మ'గారిని పిలవకుండానే 'కంకణాలు'కట్టుకున్నారు ఇంట్లోవారందరు.
                                                                     * * * * *
       
                     డిగ్రీ పూర్తి చేశాక రెండున్నరేళ్లుగా విజయవాడలో 'ప్రాంతీయ జనాభాలెక్కల  ఆఫీసు'లో లెక్కలు వేస్తున్నాడుసుబ్బారావు. ఆ లెక్కలు ఎంతకూతేలక అసలు 'ఆంధ్రప్రదేశ్' జనాభాఎంతవుందో,అందులోఆడవారెంతమందో, మగవారెంతమందో, పిల్లలెంతమందో, వృద్దులెంతమందో, అందులో చదువుకున్నవారెంతమంది, వ్యవసాయదారులు, వృత్తి, వ్యాపారాల్లో ఎంతమంది అన్నిలెక్కలు చూడాలి... అక్కడ వెలగ బెట్టింది చాలు ఇక హైదరాబాద్ వచ్చేయ్ బాబూ' అని 'బదిలీ' చెశారు. అసలు సుబ్బారావుది జగ్గయ్యపేట పక్కనే ఉన్నఊరు చిల్లకల్లు. ఒకటోతరగతి నుంచి బి.ఎ వరకు తెలుగు 'మీడియం' లో జగ్గయ్యపేట లోనే అవలీలగా చదివేశాడు. పైగా కాలేజిలోనే కాదు జిల్లాకు కూడా 'ఫస్ట్' గా వచ్చేశాడు మావాడు అని చెప్పేది వాళ్ళ బామ్మగారు. దాన్ని అనువుగా తీసుకుని బామ్మగారిని ఒప్పించి  పై చదువులకు విశాఖపట్నం వెళతామంటే  'ససేమిరా' అంటూ చదివింది చాలు 'ఇక్కడో, విజయవాడలోనో ఏదో ఒక ఉద్యోగం చూసుకో' అని ఆజ్ఞాపించారు బామ్మగారు.
'కాదే బామ్మా' నీకు తెలుసుగా, నాకు డిగ్రీలో బాగా మార్కులు వచ్చాయి.
వైజాగ్ లో ఎం.ఏ చదువుకుంటానే 'బామ్మా' నాకు యూనివర్సిటీ  కాలేజిలో 'సీట్' వస్తుంది. తరువాత మంచి ఉద్యోగం వస్తుందే' అని మొరపెట్టుకున్నాడు బామ్మగారితో.
'చదివింది చాల్లే' నువ్వు కూడా పై చదువులు చదివి ఎక్కడికో వెళ్లి  'తాసిల్దార్' ఉద్యోగం వెలగపెట్టాలనుకుంటున్నావేమో ! నా బొందిలో ప్రాణం ఉండగా అది జరగదు.
'అంతే' అన్నారు వాళ్ళబామ్మగారు మొండిగా సుబ్బారావుని మారు మాట్లాడనీకుండా.
'అంతేనా' ? నీ మనసు మార్చుకోవా? అంటూ తొంబైఎనిమిది సార్లు బతిమాలాడు సుబ్బారావు బామ్మగారిని.
'మనసు మార్చుకోవడమేమిట్రా వెధవాయ్... నీ చదువుకు దానికి లింకేవిట్రా' అన్నారావిడ.
'లింకు లేకేమిటే' బామ్మా ? ఉంది. అందుకేగా నిన్నునూటఇరవై సార్లు బతిమాలాను అన్నాడు సుబ్బారావు.
'నూటఇరవై నార్లు బతిమాలడం ఏవిట్రా ? అర్ధం అయ్యేట్లు చెప్పరా' భడవాయ్' అన్నారు బామ్మగారు.
'మన రాజ్యాంగానికే ఇప్పటికే నూటాయిరవై సార్లు మార్పులు చేశారు.
నువ్వేమో నువ్వన్న'మాటనే' ఒక్కసారి మార్చనంటున్నావు' అన్నాడు సుబ్బారావు నిష్టూరంగా!
అంత పెద్ద పొగడ్త వచ్చేసరికి కొద్దిగా 'మనసు' ఏ మూలనో వెన్నలా కరగడం మొదలెట్టింది బామ్మగారిది.
సుబ్బారావు దురదృష్టం, ఆవిడకు ఆ క్షణంలోనే 'భర్తగారు' గుర్తొచ్చారు.
దాంతో ఆవిడ 'నన్నేమనుకుంటున్నావురా' 'తేడా' వచ్చిందని జీవితాన్నే పణంగా పెట్టిన దాన్ని,నా మాటంటే మాటే' అన్నారు బామ్మగారు.
ఏవో పెద్ద పరీక్షలు వ్రాసి ఐ.ఏ.ఎస్సో, ,ఐ పి.ఎస్సో, కనీసం గ్రూప్ వన్  స్టేటు సర్వీసెస్సో వ్రాసి తాతగారిలా పెద్ద ఆఫీసర్ అవుదామనుకున్న సుబ్బారావు 'ఫేట్' కాస్తా ఇలా 'సీల్' 'అయిపోయింది.
బి.ఏ వరకే చదువాపుచేసి మూకుమ్మడిగా జిల్లాలో ఉన్న వేల నిరుద్యోగులందరితో కలిసి వ్రాసిన పరీక్షల్లో విజయం వరించిన కొద్దీమందిలో ఒక్కడై ఆలస్యం చేయకుండా బామ్మగారు పెట్టిన ముహూర్తానికి  విజయవాడలో ప్రాంతీయ 'జనాభాలెక్కల' ఆఫీసు ఉద్యోగంలో చేరిపోయాడు.
                                                             * * * * *
                                             
              సుబ్బారావు వాళ్లనాన్నగారు  టీచర్. ఆయన రిటైర్ అయ్యేవరకు సుబ్బారావు, వాళ్ళమ్మగారు 'చిల్లకల్లు'లోవారి  పూర్వీకులు కట్టిన పాత పెంకుటిల్లు మాత్రం వదలకుండా దాన్నే ప్రతి సంవత్సరం  బాగుచేయించుకుంటూ అక్కడే ఉన్నారు.
సుబ్బారావు నాన్నగారు  ఆ తాలూకాలో అన్ని ఊళ్ళలో పనిచేసి చివరకు సొంతూరులోనే
'రిటైర్' అయ్యి' పింఛను' కోసం సంవత్సరం పైగా పడిగాపులు కాస్తున్నారు.
ఇంతలో సుబ్బారావుకి 'బదిలీ ' అయింది. అందునా హైదరాబాదు కి అయినట్లు తెలవడం
తోనే వాళ్ళ అమ్మగారు పక్కనే ఉన్న 'తిరుమలగిరి' వెంకన్నకు సుబ్బారావు జుట్టు ఇచ్చేస్తానని మొక్కోవడమే కాక 'ట్రాన్స్ఫర్' ఆగితే సుబ్బారావుతో పొల్లుదండాలు పెట్టిస్తానని మొక్కోవడం సుబ్బారావుకి తెలీకుండానే జరిగిపోయింది.
అయినా సుబ్బారావు హైదరాబాద్ బయలుదేరే రోజు రానే వచ్చేసింది.
మరుసటి రోజు ఉదయమే జగ్గయ్యపేటలో హైదరాబాద్ బస్ ఎక్కాలి.
బామ్మగారేమో 'ససేమిరా' అంటున్నారు.
సుబ్బారావు వాళ్ళ అమ్మగారు, అమ్ముమ్మ, నాన్నగారు మింగాలేక,కక్కాలేక,పిల్లాడి భవిష్యత్తు ఎలా? అని బామ్మగారికి వినీ, వినబడకుండా గొణుక్కుంటున్నారు.
'ఇక లాభంలేదు... ఊరుకుంటే ఊరా, పేరా? హైదరాబాద్ అంటే ఎంతభయమున్నాసరే,. వెళ్ళవలసిందే! అని లేని ధైర్యం తెచ్చుకుంటూ బామ్మగారిని ఒప్పించడానికి స్వయంగా తనే రంగంలోకి దిగి అటుఇటు చూసి పక్కనే పాతకుర్చీ మీద ఉన్న తువ్వాలు తీసి నడుముచుట్టూ బిగించి  బామ్మగారి వంక  ధైర్యంగా నడిచాడు సుబ్బారావు.
'అదికాదే బామ్మా'అందరూ తాతగారిలానే ఉంటారనుకుంటే ఎలా'?
'చిన్నప్పటి నుంచి నీ దగ్గరే ఉన్నాను కదా, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా'?
ఎప్పుడో ఏదో జరిగిందని కాళ్ళు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే ఎలానే ?
నాన్నగారు 'రిటైర్' అయ్యారు.
ఇంట్లో ఎవరో ఒకరం అన్నా ఉద్యోగం చేయకపోతే  ఎలా చెప్పు'? అంటూ బామ్మగారి పక్కనే 'బాసింపట్టు' వేసుక్కూర్చొని రాత్రి తాత గారు 'కల' లోకి వచ్చారే బామ్మాఅన్నాడు లో గొంతుకతో !
'నీ కలలోకి వచ్చాడా ఆయన 'ఏమిటటా'? కుతూహలం బయటకు కనుపించకుండా అడిగారు బామ్మగారు.
'అప్పటికీ నేను అడుగుతూనే ఉన్నా' కలలో రావడానికి బామ్మగారి అనుమతి తీసుకున్నారా ? లేదాని '? అతి అణుకువ నటిస్తూ.
'దానికాయన 'ఆ... ఇలాంటి వాటికి ఆడవారిని అడిగేదేమిటిరా 'వెధవకన్నా'నువ్వు నాఒక్కగానొక్క మనవడివి. నీ మంచీ,చెడు చూసే బాధ్యత నాకూ ఉంది. అయినా నీ'కల'లోకి రావడానికి ఆవిడ అనుమతి కావాలా ?  నా ఇష్టం ...' అంటూ 'నువ్వు కూడా నాలా అవుతావని ఆవిడ భయంరా కన్నా' నువ్వు హైదరాబాద్ వెళ్ళవద్దు. బామ్మగారి మాటవిను, అంటూ నాకు హితబోధ చేశారే బామ్మా అన్నాడు సుబ్బారావు .
'నేను నిన్ను ఒదిలి హైదరాబాద్ వెళ్ళను లేవే బామ్మా' ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాను అని ఆవిడ వళ్ళోతల ఆన్చి పడుకోబోయాడు సుబ్బారావు.
అంతే బామ్మగారు 'అపరకాళి'లా అయిపోయారు. ఒక్కసారిగా సుబ్బారావుని రెక్కపట్ట్టుకుని లేపుతూ 'ఆయనెవర్రా నిన్నాపడానికి...లే బయల్దేరు' సంచులు సదురుకో' ఉదయమే ప్రయాణం అంటూ ఒక్కుదుటున సుబ్బారావుని కుదేసి లోనికి వెళ్లి ఐదువేల రూపాయలు తెచ్చి 'ఇందా ఇవి దగ్గరుంచుకో.సరిపోకపోతే మళ్ళీ అడుగు, మరింత ఇస్తాను' అన్నారు బామ్మగారు కోపంతో ఎర్రగా అయిన ముక్కుపుటాలు కొంగుతో రుద్దుకుంటూ.
తన ఉపాయం ఫలించినందుకు సంతోషిస్తూ దాన్ని బయటకు కనుపించకుండా జాగ్రత్త పడుతూ మళ్ళీ బామ్మగారి మనస్సు ఎక్కడ మారుతుందోనని క్షణం కూడా వృధా చేయకుండా 'సరేనే' బామ్మా' నీ మాట నేనెప్పుడైనా జవదాటానా ? రేపుదయమే బయల్దేరతాను' అన్నాడు అమాయకంగా సుబ్బారావు .     
'నేను వెళ్లి చిన్నఇల్లు చూసుకుని నిన్నుతీసుకెళతాను.నన్నుదగ్గరుండి చూసుకుందుగాని'
అంటూ బామ్మగారిని సముదాయించి 'బ్యాగు' సదురుకుందామని లేచేసరికి బామ్మగారు రెక్క పట్టుకుని మళ్ళీ కూర్చోబెట్టి తల నిమురుతూ 'నీకు 'హిందీ' అంటేనే ఆమడ దూరం... అక్కడేమో తెలుగు మాట్లాడేవాళ్ళు కరువు కదరా ! అసలే పెద్దపట్నం పైగా ఏవో గొడవలు,నువ్వా...నోట్లో నాలుక లేని వెధవాయివి' అక్కడ ఎలా నెగ్గుకొస్తావురా'? దిగులుగా
నా తలమీద చేయివేసి ప్రేమగారాస్తూ 'సుబ్బడూ' నీ చిన్నప్పుడు  ఒకసారి హైదరాబాద్ వెళ్లాం గుర్తుందా'? అందావిడ .
'ఆ...గుర్తులేకేం' అంటూ ఒక్కసారి పది పదిహేనేళ్ళ క్రితం పాతజ్ఞాపకాలు వల్లె వేసుకున్నాడు సుబ్బారావు.
                                                   * * * * *
               ఆ రోజు హైదరాబాద్  బస్టాండ్ లో బామ్మగారు వారిస్తున్నాముందుగా తను బస్సు దిగడమే ఆలస్యం, ఒకడెవడో  సుబ్బారావు చేతిలో సూట్ కేస్ లాక్కుని  'ఆవ్ భాయ్' అంటూ ఓ పావులీటరు పాను తుపుక్కున ఉమ్మేసి బస్సు డోర్ దగ్గరే చుట్టూ మూగి ఉన్న జనం గుంపులోనుంచి వెళ్లిన 'రిక్షావాలా' వెంట వెళ్ళాలో బస్సులోనుంచి ఇంకా దిగని బామ్మగారి కోసం వేచి ఉండాలో తెలీక 'ఏయ్' బాబూ ఆగు... ఆగు' అని అరుస్తూ
'బామ్మా...బామ్మా... వాడెవడో సూట్ కేస్ తీసుకెళ్ళాడే' అని పెద్దగా అరుస్తూ బామ్మగారు దిగే దాకా ఆజనం గుంపులోనే నిలబడ్డాడు సుబ్బారావు. బామ్మగారు బస్సుదిగుతూనే  'ఏంటిరా... అరుస్తున్నావు ? సూట్  కేస్ ఏదీ' ? అంటూ ఆరాతీశారు.
'మరే...బామ్మా' వాడెవడో చేతిలో సూట్ కేస్ లాక్కెళ్ళా డే' నువ్విక్కడే ఉండు నేను చూసివస్తా...వాడిటే వెళ్ళాడు' అంటూ ఇవతలకు వచ్చి అటు ఇటు అంతా వెదికినా ఆమనిషి గాని, సూట్ కేస్ గాని కన్పించలేదు.
ఏం చేయాలో అర్ధం కాలేదు సుబ్బారావు కి' దూరంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అతనికి కంప్లైంట్ చేద్దామా బామ్మా'? అనడిగాడు.
'నువ్వలా ఆగు ... అంటూ 'ఎవడ్రా పిల్లాడి చేతిలో 'సూట్ కేసు' లాక్కెళ్ళింది ...
'సూట్ కేస్ కౌన్ కీంచ్ కె లేగయా' ? అంటూ అచ్చు హిందీలో అక్కడే ఉన్నవేరే రిక్షా వాళ్ళని నిలేసి కళ్ళు ఉరిమారు బామ్మగారు.
'మాజీ' ఆప్ కీ సూట్ కేస్ కహీ భీ నై జాతా' ఉధర్ బాజు కేలే వాలే కె పాస్ రేహ్తా ఉన్ కా రిక్షా'....అన్నాడు ఒకడు  గారపళ్ళు బయట పెట్టి ఇకిలిస్తూ.
'ఏమంటున్నాడే ...  బామ్మావాడు'? కొంగు లాగుతూ అడిగాడు సుబ్బారావు.
'అందుకేరా వెధవాయ్...హిందీ నేర్చుకోరా' అంటే ఎప్పటికప్పుడు ఎదోవంకపెట్టి తప్పిచ్చుకునే వాడివి.
'ఇప్పుడు చూడు వాడు మాట్లాడేది అర్ధంగాక  వెర్రి చూపులు చూస్తున్నావ్ వెధవాయ్'. ఇంటికెళ్ళాక ఇక ఊరుకునేది లేదు. కూర్చోబెట్టి హిందీ నేర్పిస్తాను చూడు' అంటూ మళ్ళీ రిక్షా వాళ్ళమీదకు యుద్ధానికి దూకడానికి అటు ఇటూ ఏదైనా ఎతైన బల్లా ఉందేమోనని చూశారు. అక్కడ అలాటిది ఏదీ లేకపోవడంతో ఒక్కడుగు ముందుకు వేసి, వెంటనే మళ్ళీ రెండడుగులు వెనక్కివేస్తూ ముక్కుమూసుకుని 'వారంరోజుల నుంచి స్నానం గట్రా చేసినట్లు లేరు.
'డోకొస్తోందిరా వెధవ కంపుతో' అన్నారు మనవడితో బామ్మగారు.
'బామ్మగారూ'మీ సూట్ కేసు ఎక్కడికీ పోదు' అటుపక్క అరటిపండ్ల బండి పక్కనే ఉంటుంది సూట్ కేస్ తీసుకెళ్ళిన వాడి 'రిక్షా'దగ్గరకని  చెప్పి సుబ్బారావు చేయి పట్టుకుని అటుగా వెళ్లి ఓ ఐదు నిముషాల తర్వాత ఆ రిక్షావాడిని పట్టుకుని సూట్ కేసు పట్టుకు వచ్చాడు ఎవరో కుర్రాడు మాతోనే బస్ లో వచ్చినతను.
'ఇంకా నయం ...ఈసారి వీడెవడో  పిల్లాడిని తీసుకెళ్ళాడు కాదు' వెధవ సూట్ కేస్ పోతేపోయింది.....
పిల్లాడు దక్కాడు. అంతేచాలు అని ఏడుకొండల వాణ్ణి మనసులో తలుచుకుంటూ
'రక్షించావు నాయనా' కలకాలం వర్ధిల్లు' అని ఆ కుర్రాణ్ణి  దీవించి అతని నుంచి కుడి చేత్తో సూట్ కేసు, ఎడం చేత్తో మనవణ్ణి అందుకుని  'ఇదేం పట్నం రా బాబూ ఎవడుబడితే వాడు... దేన్నిబడితే దాన్ని లాక్కెళుకు  పోతున్నారు...ఇంకా నయం నన్నులాక్కెళ్ళారు కాదు...'అయినా నన్నెవరు లాక్కెళతారులే.. ముసలి ముండాదాన్ని' అని అనుకుంటుండగానే
'మీరెక్కడకెళ్లాలో చెప్పండి బామ్మగారూ' నేను దిగబెట్టి వెళతాను' అన్నాడు ఆ కుర్రాడు.
'మా నాయనే అంతమాటన్నావు' అదేచాలు.  'నీకెందుకు నాయనా శ్రమ' చేసిన సాయం చాలు. మేము చిక్కడపల్లి  వెళ్ళాలి...'మేం వెళతాము'.
నాకు త్రోవ తెలుసు అని బామ్మగారు రిక్షా మాట్లాడారు.

                                                              * * * * *            
             దాదాపు పదిహేనేళ్ళ తరువాత హైదరాబాద్ బస్ స్టాండ్ లో దిగాడు సుబ్బారావు.  బస్ దిగుతూనే ఎందుకైనా మంచిదని ఒకచేత్తో పట్టుకుంటే సూట్ కేస్ లాక్కుంటారేమోనని రెండుచేతులతో సూట్ కేస్ గట్టిగా పట్టుకుని దిగుతూ తూలి  ఓ పడుచు అమ్మాయి మీద పడబోయి  ఆ అమ్మాయి భుజాన్ని పట్టుకుని  నిలబడ్డాడు సుబ్బారావు.
ఆ అమ్మాయి సుబ్బారావు చేతిని విసిరి కొడుతూ మొదలయింది 'వెధవ సంత' అని విసురుగా వెళ్ళిపోయింది. సుబ్బారావు 'సారీ' అండీ' అనే లోపునే ఆ అమ్మాయి వెళ్లి పోవడంతో'సర్లే, ఇంకెప్పుడయినా బస్ లో కల్సి నప్పుడు తప్పని సరిగా 'సారీ' చెబుదామని నిశ్చయించుకునే లోపునే వెనకనుంచి ఎవరో తోసిన తోపుకి సుబ్బారావు ఇద్దరు ముగ్గుర్ని నెట్టుకుంటూ బస్ అయితే పూర్తిగా దిగాడు. దిగడం తోనే ఇదివరకు బామ్మగారితో తను దిగిన ప్రదేశంగుర్తించగలనేమోనని వెతికాడు. అంత కొత్తగా ఉంది. ఆ బస్ స్టాండ్ కాదని తేల్చుకున్నాక వెతకడం మానుకున్నాడు. ఎందుకయినా మంచిదని అటు ఇటూ వెతికాడు. అప్పటి రిక్షావాడేమైనా ఉన్నాడేమోనని సూట్ కేస్ జాగ్రత్తగా పట్టుకొని వాడెక్కడ కనిపించక పోవడంతో 'అమ్మయ్య'  అని ఒక్కసారి నిట్టూర్చి పదినిముషాలుపాటు 'రిసీవ్' చేసుకోవడానికి వస్తానన్న'శర్మ' కోసం వేచి చూశాడు సుబ్బారావు .
ఈ లోపులో 'ఆవ్' సాబ్ కహా జానా హై? అని అడుగుతూ సూట్ కేస్ అందుకోవాడానికి చాలా మంది చేయి జాపడంతో 'బాబోయ్' జాగ్రత్తగా ఉండాల్సిందే... పాత రిక్షావాడు తనని గుర్తుపడతానని వేరేవాళ్లని పంపించినట్లున్నాడని అనుకుంటూ 'శర్మ' కోసం వెతుకుతూ, కనుచూపుమేరలో ఎక్కడా 'శర్మ' కనబడక పోవడంతో
'ఇదెక్కడి కర్మ రా బాబూ ఒక్కడినీ వెళ్ళాల్సొచ్చిందే' అనుకుంటూ ఆటోరిక్షా ఎక్కి 'చింతలబస్తీ' సిండికేట్ బ్యాంకు పక్కన గల్లీ లో దిగి శర్మ చెప్పిన మొండిగుర్తు 'దవాఖానా' బోర్డ్ కోసం వెతికాడు. బోర్డైతే కనిపించింది కాని బోర్డ్ మీద 'దవాఖాన్' అని ఉంది.
వెధవ ఈ శర్మ ఎప్పుడూ ఇంతే.స్పెల్లింగ్ మిస్టేక్స్ అలవాటు ఇంకా పోలేదు అనుకుంటూ ఆటో దిగి సులువుగానే 'శర్మ' రూం అడ్రస్  పట్టుకుని తలుపు తట్టాడు.
ఎవరో అమ్మాయి తలుపు తీసింది. కంగారుగా రెండడుగులు వెనక్కి వేసిన సుబ్బారావుతో చనువుగా  తెలిసిన వ్యక్తి లానే 'రండి' అంటూ రైలుడబ్బాల్లా వరుసగా ఉన్నమూడు గదుల ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది.
సుబ్బారావుకి అసలు ఇది 'శర్మ' రూమేనా అన్న అనుమానం వచ్చిఇంట్లోకి వెళ్ళకుండా గుమ్మం ముందే నిలబడి ఇది 'శర్మ' గారి రూమేనానండీ? అని అడిగాడు సుబ్బారావు.
సుబ్బారావు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా 'మీరు సుబ్బారావు గారు కదా' ఇంట్లోకి రండి
అన్నయ్య మీరు వస్తారని చెప్పాడు. తనకి 'డయేరియా'.మిమ్ముల్ని 'రిసీవ్ చేసుకోవడానికి'
బస్ స్టాండ్ కి రాలేక పోయాడు. లోపల పడుకున్నాడు' అంటూ తను లోనికి నడిచింది.
మంత్రముగ్దుడిలా  తను కూడా లోనికి నడిచాడు సుబ్బారావు ఆ అమ్మాయి వెనకాలే.
'శర్మ చెప్పనే లేదు రూము మార్చానని, రూములో తను ఒక్కడే ఉంటున్నాడు  అనుకున్నా... లేకుంటే ఇంకెక్కడైనా దిగే వాడిని' అనుకుంటూ సూట్ కేస్ ఓ పక్కన పెట్టిన సుబ్బారావుకి  మధ్యరూములోనుంచి  ముందు  రూములోనికి వస్తూ 'ఆరే అనుకున్న టైం కంటే అర్ధగంట ముందే వచ్చేశావే...ఎలావున్నావురా' ? అన్నాడు శర్మ ఆప్యాయంగా పలకరిస్తూ.
'ఏరా 'రూం' మార్చాననిగాని మీ చెల్లి కూడా నీతో ఉంటోందని కాని  చెప్పలేదు.
ఇబ్బంది కదా' నేను ఏదైనా హోటల్ కి వెళతాను' అన్నాడు సుబ్బారావు వెళదామన్ననిర్ణయానికొచ్చిలేచి నిలబడి.
'బాబూ... నీకోసం రూం 'రెడీ' గా ఉంది. నేను రూము ఖాళీ చేసి ఈ ఫ్యామిలీ పోర్షన్ లోకి మారాను.
'చెల్లి సివిల్స్ ఎక్జామ్స్ కి ప్రిపేర్ అవుతోంది. ఇక్కడే ఉంటుంది. అందుకే అటు పక్కన రూం ఖాళీ చేసి ఈ పోర్షన్ లోకి మారాను. రూం రెడీగా ఉంది ఈరోజు మంచిరోజు కూడా... నువ్వు దిగిపోవచ్చు అని శర్మ చెబుతుండగానే కాఫీ తెచ్చింది 'కిరణ్మయి' శర్మచెల్లెలు.
కాఫీ తాగుతూ ఆఫీసు కబుర్లలో మునిగి పోయిన వాళ్ళిద్దరికీ వంట అయింది లేచి స్నానాలు కానివ్వమని రెండు మూడు సార్లు గట్టిగా చెప్పివెళ్ళింది కిరణ్మయి.
వళ్ళు తెలీకుండా కబుర్లలో మునిగిపోయి ఇద్దరూ ఎంతకూ లేవకపోవడంతో ఏదైనా చేసి ఇద్దరినీ లేపాలని కిచెన్లో ఓపెద్ద గిన్నెను కావాలని కింద 'డాంమ్మని' పడేసింది కిరణ్మయి.
ఆశబ్దానికి ఇద్దరూలేచి 'కిచెన్' లోకి పరుగెత్తారు ఏమైందోనని. అక్కడ కూల్ గా పనిచేసుకుంటున్న కిరణ్మయిని చూసి వెనక్కి తిరిగి వెళ్తున్న అన్నతో మిస్టర్ 'శర్మా'
విపరీతంగా ఆకలవుతోంది. మీరేమో ఎంతకూ లేవడంలేదు.
అందుకే గిన్నెకింద పడేశాను.
నో 'డేమేజి' డన్ టు  యువర్ యుటెన్సిల్స్'శర్మా' అంటూ తల తిప్పకుండానే మాట్లాడుతూ!
'ఇంతకీ మీరిద్దరూ లేచినట్లేనా' నన్ను తినేయమంటారా'? అని సీరియెస్ గా అడిగింది కిరణ్మయి.
'నువ్వు తినేయి తల్లీ... వీడిని గృహప్రవేశం చేయించి వస్తాను' అని ఇద్దరు అటు సూట్ కేస్ తీసుకుని రూముకి  బయలుదేరారు.
'మీ ఫ్రెండ్ స్నానం చేశాక నన్నుపిలువు. పరమాన్నం చేశాను. సుబ్బారావుగారు మొదటిసారి రూములో దిగుతున్నారుకదా! అక్కడ దేవుడి ఫోటో పెట్టి దీపారాధన చేద్దాం.
తరువాత అన్నీఅక్కడికే తెస్తాను. అందరం అక్కడే భోజనం చేద్దాం' ఏమంటావురా' అంటూ 'అన్నయ్య' శర్మ వైపు చూస్తూ అంది కిరణ్మయి...సుబ్బారావు కృతజ్ఞతా పూర్వక చూపులు గమనిస్తూ !       
                                                  * * * * *

శని, ఆదివారాలు గడిచి పోయాయి. 'బాబూ' నాకు 'సిటి' ఎప్పుడు చూపెడతావు.
ఇక్కడ రోడ్లు, పరిసరాలు ఎప్పటికవగతమవుతాయో. 'శర్మ' కు నలతతో ఎక్కడికీ వెళ్ళకనే  రెండురోజులు గడిచిపోయాయని చింతిస్తున్న సుబ్బారావుతో 'నేను బస్ స్టాండ్ కి రాకపోవడమే నీకు ట్రైనింగ్ లో మొదటి భాగం' అన్నాడు శర్మ!
'చూశావా? ఇక్కడ ఒక మంచి 'రూము', 'నైబర్ హుడ్'  దొరకాలంటే దేవుడు దిగి వస్తాడు.
నీకు చూడు అన్నీఅమరినట్లుగా దొరికాయో' అన్నాడు శర్మ.
'అవునవును. నాకసలు  హైదరాబాద్ అంటేనే భయం. నువ్వుండబట్టి వచ్చాను.
లేకుంటే ఉద్యోగమే మానేసే వాణ్ని అన్నాడు సుబ్బారావు.
'అదేంటి ? ఉద్యోగం చేయకుండా ఎలా? తాత సంపాదించిన ఆస్తులు దండిగా ఉన్నాయేంటి' ? రెండు రోజులుగా అతన్ని గమనిస్తున్న ఉత్సుకతతో అడిగింది కిరణ్మయి.
'ఆ.. బాగానే ఉన్నట్లుందండీ ...' అన్నాడు సుబ్బారావు.
'అదేంటి' ఉన్నట్లుంది ఏమిటి... మీకు తెలీదా'? రెట్టించి అడిగింది కిరణ్మయి.
మౌనంగా ఉన్న సుబ్బారావుని ఉద్దేసించి 'చెప్పడం ఇష్టంలేకపోతే మానేయండి' అంది కిరణ్మయి అతని వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం అణుచుకుంటూ
'మాతాతగారు పోతూ, పోతూ పెద్ద మూట ఇచ్చివెళ్ళారట... వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం లేక తెలుసుకోలేదు' అన్నాడు సుబ్బారావు.
'ఒహో తన తాతగారిదేదో 'మిస్టరి' ఉన్నట్లుంది' తనకి చెప్పడం అంతగా ఇష్టంఉన్నట్లు లేదని అంతటితో ఆ 'టాపిక్' వదిలేసి 'సుబ్బారావు గారూ మిమ్ముల్ని ఓ విషయం అడుగుదామనుకుంటున్నాను... అడగమంటారా' ? అంది కిరణ్మయి సుబ్బారావు వైపు ఉత్సుకతతో చూస్తూ.
'అడగండి...అదీ మాతాతగారి విషయం తప్ప' అన్నాడు సుబ్బారావు
వస్తున్ననవ్వును ఆపుకుంటూ 'అదేమీ కాదండీ...మీరీ ఉద్యోగంలో చేరినప్పడి నుంచి మీ విషయాలు ఏదో ఒకటి అన్నయ్య చెబుతూనే ఉన్నాడు'.
'మీ అకాడమిక్ కెరియెర్ గురించి కూడా నాకు కొద్దో గొప్పో తెలుసు. మీరు ఈ చిన్న ఉద్యోగంలో ఎందుకు 'సెటిల్'అవుతున్నారో నాకు అర్ధం కావడంలేదు. మీరు కూడా నాతో 'సివిల్ సర్వీసెస్' ఎగ్జామ్స్ వ్రాయవచ్చుకదా' అంది కిరణ్మయి.
'వ్రాద్దామని ఇదివరకే అనుకున్నా. కానీ మా బామ్మగారికి నేను 'విజయవాడ' ప్రాంతం వదిలి వేరేచోట ఉద్యోగం చేయడం ఇష్టం లేక మానేశాను' అన్నాడు సుబ్బారావు
'అదీ.నాకు తెలుసు. ఇప్పుడిక హైదరాబాద్ వచ్చారు కదా ! ఇంకా మీకు జాయినింగ్ టైం ఉంది. ఈ ఎగ్జామ్స్ కి ఆప్లై చేయడానికి ఇంకా వారం టైం ఉంది.ఇద్దరం కలిసి అప్లై చేద్దాం. కలిసి ప్రిపేర్ అవుదాం. ఇది మంచి ఛాన్స్.ఎలెక్షన్లు వస్తున్నాయి. చాలా  పోస్టులు ఉన్నాయి.
సెలెక్ట్ అవుతే అయిదారు నెలల్లో క్లాస్ వన్ సర్వీస్ లో చేరిపోవచ్చు.రాకపోతే మీ ఉద్యోగం మీకెలాగు ఉంది' ఏమంటారు? ఊరిస్తూ  అంది కిరణ్మయి వేరే 'ఛాయెస్' ఇవ్వకుండా.
'సరే' నండి అన్నాడు బామ్మగారిని ఎలా ఒప్పించాలా  అని  మనసులో అలోచిస్తూ అన్నాడు సుబ్బారావు !
                                                     * * * * *
దాదాపు రెండు సంవత్సరాల తరువాత విజయవాడలో ఒకరోజు తహసీల్దార్ ఆఫీసులో.
'మై నేమ్ ఈజ్ కేథరిన్ ...ఐ యాం ఫ్రమ్ లండన్... థిస్ ఈజ్ మై గ్రాండ్ డాటర్ 'ఎలిజెబెత్ ' కాకినాడలో మెడిసిన్ చేస్తోంది. ఐ మెట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్...హి డైరెక్టేడ్ మీ టు సి యూ టు నో అల్ ది ఫార్మాలిటీస్   టు రిజిస్టర్ద్ ఏ 'ట్రస్ట్' ఇన్ ది నేమ్ అఫ్ వన్ మిస్టర్ సుబ్బారావు'.
ఐ వాంట్ టు సర్వ్ 'పూర్' ఇన్ అండ్ అరౌండ్ హిజ్ విలేజ్ 'చిలకలు' కష్టంగా ఊరిపేరు పలుకుతూ అంది 'కేథెరిన్'  విజయవాడ లో ట్రైనీ ' క్లాస్ వన్ తహసీల్దార్'తో.
'యాం రియల్లీ అమ్యూజ్డ్ టు నో యువర్ నేమ్ టూ' మిస్టర్.సుబ్బారావు.
నాకు తెలుగు బాగానే వచ్చు.'నేను మీకు 'ఇండిపెండెన్స్' రాకముందు చాలా సంవత్సరాలు కాకినాడ'లో ఉండి ఉన్నాను. ఇప్పుడు ఇక ఇక్కడనే ఉండి పేద ప్రజలకు 'సేవ' చేయదలచాను.
'లుక్' దీజ్ పేపర్స్ అంటూ 'ట్రస్ట్ కి సంబంధించిన పేపర్లు అన్నీ ఇచ్చింది కేథరిన్.
ఆ 'పేపర్లు' చూస్తున్నాడే గాని సుబ్బారావు మనసులో మనసులేదు. బుర్ర వేడెక్కి పోతోంది.
అనుమానం లేదు...'ఆవిడే ఈవిడ' తాతగారి పేరునే 'ట్రస్ట్' రిజిస్టర్ చేస్తోంది.
దాదాపు పది కోట్ల రూపాయలతో పేదప్రజల చదువు, ఆరోగ్యం, నీటి వసతుల కోసం 'ట్రస్ట్' ఏర్పాటు చేస్తోంది.
బామ్మగారి పేరు ట్రస్ట్ చైర్మన్ గా 'మెన్షన్' చేసింది.
ఇంతలో 'బిళ్ళ' బంట్రోతు వచ్చి 'సార్' మీనాన్నగారు,బామ్మగారట...వచ్చారు లోనికి పంపాలా' ? అని బంట్రోతు అంటుండగానే  నాన్నతో సహా లోనికి వచ్చింది బామ్మ.
గతుక్కుమన్న సుబ్బారావు దాక్కోడానికి సరైన కలుగేమీ కనిపించక కంగారుగా టేబుల్  సొరుగులో తలుంఛి 'నాకేమీ తెలీదే బామ్మా'ఈవిడ' ఆవిడేనని నాకు నిజంగా తెలీదే, నన్నునమ్ము' అంటూ వాపోయాడు సుబ్బారావు.
'అదేంటిరా... 'కేథరిన్' నీకు చెప్పలేదా'? మనింటికి వచ్చి నన్నుకలిసి వచ్చానని.
'నో...నేను ఎందుకు చెప్పాలి' తన తాతగారి ఫ్రెండ్ ని' నన్ను ఎలా ట్రీట్ చేస్తాడో చూద్దామని 'టెస్ట్' చేస్తున్నాను ?
'అచ్చు మా ఫ్రెండ్ సుబ్బారావులానే ఉన్నాడు అంటూ బామ్మగారి వంక చూసింది కేథరిన్.
'సారీ' కేథెరిన్,రావడం కొద్దిగా లేటయింది. వీడే నీఫ్రెండ్ సుబ్బారావు గ్రాండ్ సన్' ఆ అమ్మాయి 'ఎలిజెబెత్' కేథరిన్ మనవరాలటరా' కాకినాడలోనే చదువుతోంది.   
ఇంతలో 'హెడ్ క్లార్క్' లోనికి వస్తూ 'కంగ్రాట్యులేషన్స్' సర్ మిమ్ముల్ని సబ్ కలెక్టర్ గా కాకినాడకు ట్రాన్స్ఫర్  చేశారు' అన్నాడు.
'ఓ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్...ఎలిజబెత్, నేను ఇక నీదగ్గర ఉండవచ్చుకదా... ఇంకా హాస్టల్ లో ఎందుకు'? అంది కేథెరీన్ సుబ్బారావు వంక చూస్తూ.
'ఓ మైగాడ్' అన్నాడు సుబ్బారావు బామ్మగారి వంక చూస్తూ తలపట్టుకుని.
'సరి ... కధ సంపూర్ణం' అంటూ నిట్టూర్చింది బామ్మగారు.

రచన:
కేశిరాజు  వెంకట వరదయ్య
మొబైల్. నం. 9849118254
  

                                  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి