లేబుళ్లు

4, డిసెంబర్ 2010, శనివారం

బలవంతులు ( balavantulu )

బలవంతులు

సవ్వడి లేకుండా సర్రున వచ్చిందో సుడిగాలి
వస్తూనే చూపింది తన ప్రతాపం ఓ తాటాకు గుడిసెపై
తాటాకులన్నీ తడుముకుంటూ దగ్గరికైనాయి ....
మాయదారి 'సుడిగాలి' చప్పున ఎగరేసుకు పోతుందని !
సుడిగాలి చూసిందది!
చప్పున కోపం వచ్చింది దానికి
నన్ను కాదని మీరంతా ఒకటవుతారానని
అంతే! మరింత విజ్రుంభించి వీచింది మరొక్క సారి!
మళ్ళీ అంటుకు పోయాయి ఒకదాన్నొకటి ఆ తాటాకులు
ఈ సారి ఊరుకోలేదు 'సుడిగాలి'
గురిచూసి విరిచింది...
ఆదమరిచిన ఆకులని ....
ఎగరేసుకు పోయింది వాటిని పైపైకి
భయంతో వొణికి పోయాయి !
విలపించాయి....
'అన్నా...గాలన్నా...ఒదులు...మమ్మొదలమని'
బతిమాలాయి..బామాడాయి...
అయినా...వినలేదు సుడిగాలి !
విసిరింది..విసిరింది..అటూ ఇటూ!
దారిలేక, తెన్నులేక దారితప్పాయి తాటాకులు!
చేరలేదు తమవారిని!
అది చూసి నవ్వింది 'సుడిగాలి' పడీ, పడీ!
అది మొదలు అడ్దేలేకుండా పోయింది 'గాలికి'
ఎండుటాకుల్ని చూస్తే చాలు ఎగిరెగిరి పడేది!
గర్వ మెక్కింది 'గాలికి'
ఊళ లేస్తోంది!
ఊరేగుతోంది!
తనకెదురేలేదని ఎగిసెగిసి పడుతోంది!
ఆరోజు పెద్ద కొండరాయిని చూసింది!
' ఏయ్ ...లే... అడ్డులే..నాకడ్డులెమ్మంది!
కదల్లేదు....కొండరాయి!
మళ్ళీ కోపమొచ్చింది గాలికి
గట్టిగా వీచింది...
కొండను 'డీ' కొంది...
అంతే! ఎంత గట్టిగా 'డీ' కొట్టిందో
పక్కకి అటు,ఇటు జారింది  గాలి
కొండ కదల్లేదు, మెదల్లేదు!
మళ్ళీ వీచింది
మళ్ళీ మళ్ళీ వీచింది గట్టిగా
కొండను పెకలించి వేయాలని
కాలేదు తనవల్ల!
తోక ముడిచి వెనక్కి తిరిగింది గాలి !
పకాలున నవ్వు వినిపించింది గాలికి !
అవమానంతో సర్రున  కోపంవచ్చింది గాలికి!
అటు, ఇటు చూసింది నవ్విందెవరానని?
తాటి చెట్టుపైన పచ్చని తాటాకులు!
అటువొంక కోపంగా చూసింది గాలి
అయినా మళ్ళీ ఫక్కున నవ్వాయి 'తాటాకులు'

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య

     

మావూరి సౌరభం .....కవిత

మావూరి సౌరభం  
అమ్మల ఆరాటాలు
నాన్నల బ్రతుకు పోరాటాలు
తాతల దగ్గులు
ముసలమ్మల మూల్గులు
కలివిడి కుటుంబాలు
చలిమంటలు
కట్టెల మోపులు
కావిళ్ళతో నీళ్లు
జొన్న సంకటులు
కాలినడకలు
వీధి బడులు
గాడిపొయ్యి
వావిలాకులు
సొంత విత్తనాలు
కుక్కి మంచాలు
పేడ కుప్పలు
గొబ్బెమ్మలు
గూడ బాతులు
గొడ్ల పగ్గాలు
సాలీల మగ్గాలు
కుండల్లో నీళ్లు
'కండ'తో పనులు
కమ్మరి కొలిమి
కుమ్మరి కుండలు
కల్లు ముంతలు
చాకళ్ళ చలువలు
మంగళ్ళ సందడులు
మామిడి ఆకులు
వరి కంకులు
పట్టు పావడాలు
పిచ్చుకల కిచ కిచలు
కోయిలల కుహు..కుహులు
రాజగోపాలస్వామి
రాజగోపుర విశేషాలు
పండుగలు, పబ్బాలు
అల్లుళ్ళ ఆర్భాటాలు   
కప్పల పెళ్ళిళ్ళు
బతుకమ్మపాటలు
ఊరిదేవతల ఊరేగింపులు
గుళ్ళలో పొంగళ్ళు
గోరుముద్దలు
గిల్లిదండలు
గొలీల ఆటలు
గోలీ సోడాలు
ఏమైపోయా ఇవన్నీ!
కొంచెమై పోయాయి!
కరువై పోతున్నాయి!
ఊళ్ళు ఉఉగిసలాడుతున్నాయి
పట్టణాలపంచన చేరడానికి!
ఓ మనిషీ తిరిగి చూడు!
నీ వెక్కడున్నా నీ ఊరి వొంక!
రచన:
కేశిరాజు వెంకట వరదయ్య