లేబుళ్లు

31, అక్టోబర్ 2010, ఆదివారం

sathamaanam bhavathi.....

                                శతమానం భవతి.........


                                తెల్లవారుఝామున మూడవతోంది. నేను నాలుగ్గంటలకి అలారం పెట్టానే. మూడింటికే ఈఅలారం మోగిచస్తుందేమిటి అని విసుక్కుంటూ లేచి అలారం క్లాక్ ఆపాను. అయినా మోగుతూనే వుంది. ఓ ....అలారం కాదు ....ఫోను మోగుతోంది. 'ఇప్పుడు
ఎవరబ్బా ఫోను చేస్తోంది'?...ఈయన గారి ఫ్రెండ్ ఎవరైనా ఈయన గారితో  కేంప్ కి వెళ్ళే వాళ్ళు ఏమైనా ఫోను చేస్తున్నారా అనుకుంటూ ఫోను రిసీవర్ అందుకున్నాను. 'హలో....హలో...ఎవరూ మాట్లాడుతున్నది' ?
'నేను కోదాడు  నుంచి   'వాణి' ని మాట్లాడుతున్నాను...బావగారి ఇల్లేనా ?...గొంతులో ..ఆందోళన...ఏడుపు.....మిళితమై గద్గద స్వరంతో మాట్లాడుతోంది అవతలనుంచి...నేను వెంటనే గుర్తు పట్టాను...నా తోటికోడలు...' ఏమిటి మణీ ఈ టైములో ఫోను..
'అక్కయ్యా నువ్వేనా...మామయ్యగారికి హార్ట్ ఎటాక్ వచ్చిందో..ఏమిటో గుండెనొప్పి, వీపులో కూడ నొప్పితో విలవిల లాడిపోయారు వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాము ....హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. మీ మరిదిగారు, ఒక డాక్టరు, నర్స్ మామయ్యగారిని తీసుకుని అంబులెన్స్ లో బయలుదేరి కూడ ఒక గంట అయింది. బావగారిని అయిదింటి కల్లా
నిజాం హాస్పిటల్ కి రమ్మన్నారు. అక్కా సిటిలో అందరికీ నువ్వే చెప్పు...మామయ్యగారు ఎలావున్నారో కూడ నాకు కొద్దిగా ఫోను చేస్తూ వుండు...నాకు రావాలనే వుంది కాని పిల్లలతో కుదరదు నీకు తెలుసుగదా'! అని చెప్పవలసిందంతా చెప్పి ఫోను పెట్టేసింది. తను ఫోను పెట్టేసిన తరువాత గాని నాకు అసలు విషయం తలకెక్కలేదు. కంగారు మొదలయింది. వెన్నుల్లోంచి చలి మొదలయింది. వెంటనే ఆయనగారిని లేపి సంగతి చెప్పాను. ఆయన లేచి తమ్ముడికి ఫోను చేశారు.
నాలుగున్నరకల్లా హాస్పిటల్ చేరుకుంటాము నువ్వు కూడ వచ్చేసి అక్కడ ఏమైనా ఫార్మాలిటీస్ వుంటాయేమో చూడమని  చెప్పాడట తమ్ముడు. ఆయన తయారు కావడం మొదలెట్టారు. నేను వెంటనే దేవుడి దగ్గరికి దణ్ణం పెట్టుకున్నాను మామయ్య గారికి ఏమీ కాకూడదని క్షేమంగా వుండాలని. ఉదయం తొమ్మిది గంటలకల్లా పిల్లల్ని స్కూల్ కి పంపించి నేను హాస్పిటల్ కి బయలుదేరాను. తాతగారికి ఆరోగ్యం బాగాలేదు అని తెలిశాక మాముగ్గురు పిల్లలు  స్కూల్ కి వెళ్లనని  తను హాస్పిటల్ కి వస్తానని ఒకటే మారాం. తరువాత తీసుకెళ్తానని వాళ్ళని ఒప్పించే సరికి దేవుడు దిగి వచ్చినంత పనైంది. హాస్పిటల్ కి వెళ్లేసరికి మామరుదులు హాస్పిటల్ బయటే కన్పించారు. మా ఆడపడుచులు, చిన్నమామయ్యగారు ఒక్కొక్కరు హాస్పిటల్ కి రావడం మొదలెట్టారు. నేను దాదాపు మూడుగంటల దాక అక్కడే వున్నాను. మామయ్య గారిని ICU లో ఉంచారు. ఆరోగ్యం బాగానే వుంది స్టేబుల్ గా వున్నారు. నేను బయలుదేరేవరకు నేను లేక్కేసినంత వరకు మేము మాచుట్టాలు దాదాపు 70 మందిమి హాస్పిటల్ కి వచ్చాము. మామయ్యగారంటే అందరికీ ప్రాణం. చుట్టాల్లో ఆయన సాయం పొందని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. నేను స్పష్టంగా గమనించాను అందరి మొహాల్లో ఆందోళన కన్పించింది. దేవుడు కరుణించాడు.మామయ్యగారు క్షేమంగా వున్నారు. వారం రోజులు గిర్రున తిరిగాయి. మామయ్య గారిని ICU నుంచి వార్డ్ కి షిఫ్ట్ చేశారు. సెపరేట్ గది తీసుకుందామని ఈయన గొడవచేసినా మామయ్య గారు ఒప్పుకోలేదు. రోజు భోజనం తీసుకెళ్ళేదానిని. మేము వుండేది అమీర్ పేటలో. హాస్పిటల్ దగ్గరే కావడంతో తిరగడం పెద్ద ఇబ్బంది కాలేదు కాని పిల్లలు, వచ్చి పోయే వాళ్ళతోనే టైం కుదరక ఇబ్బంది పడ్డాను. ఒకరోజు మామయ్య గారి బెడ్ పక్కనే ఒక చిన్న కుర్రాణ్ణి  బెడ్ మీద చూశాను. చూడ్డానికి చక్కగా వున్నాడు....అతను ఎందుకు చేరాడు హాస్పిటల్ లో నాకు అర్ధ కాలేదు. అడుగుదామన్నా ధైర్యం చాలడం లేదు. తల్లి తండ్రుల్ని చూస్తె అతనికి తాత ...అముమ్మ లానో వున్నారు. చాలా ఆలస్యంగా పుట్టినట్లున్నాడు అనుకున్నాను. వాళ్ళ బాధ చూస్తుంటే కడుపు తరుక్కు పోయేది. ఏ క్షణంలో చూశానో, ఎందు చేతనో ఆ పిల్లాడిని చూస్తేనే చేతులెత్తి నమస్కారం చేయాలనిపించింది. ముఖంలో ఎంత కళో ! వేదం చదువుకుంటున్న పిల్లా డల్లే వుంది.
ముందు తలమీద జుట్టు తీసేసి గుండు, పెద్ద పిలక, ముఖం మీద  చక్కగాదిద్దిన గోవిందనామం, ఆ పిల్లాడ్ని చూస్తూ ఎంత సేపైనా అలానే వుండాలనిపించేది. ఎందుకో తెలీని అవ్యాజ మైన ప్రేమ. మనస్సులోనే చేతులెత్తి నమస్కారం చేసుకునేదాన్ని. అతన్ని చూస్తె నాకు మాత్రం భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నట్లనిపించేది. హాస్పిటల్ కి వచ్చానంటే అతనితో మాట్లాడనిదే నాకు మనశ్శాంతి వుండేది కాదు. ఎప్పుడూ చూసినా విష్ణు నామమో, గోవింద నామాలో, వేదమో ఏవో  భక్తి గీతాలు సన్నగా ఆలపిస్తూనే ఉండేవాడు. మామయ్యగారు  కూడా అన్నారు ఈ పిల్లాడిలో ఏదో తెలీని ఆకర్షణ శక్తి  ఉందమ్మా....మామూలు పిల్లాడు కాడు , మీ రెవ్వరూ ఇక్కడ లేనప్పుడు  అతను నాదగ్గరే కూర్చుంటాడమ్మా.......క్రిత రెండు రోజుల్లుంచి తను విపరీతంగా తల నొప్పితో బాధతో గిల గిల లాడి పోతున్నాడమ్మా.....ఆ నొప్పి వచ్చే సమయంలో అతను బెడ్ మీదనే పద్మాసనం వేసుకుని ప్రార్ధన చేస్తూ ఉంటాడమ్మా...తనకి బ్రెయిన్ ట్యూమర్ అట.
తను బాధ పడే విషయం తల్లీ, తండ్రికి మాత్రం తెలవనీయ వద్దంటాడమ్మా.....నిన్న తను నాకు ఒక ధర్మబోధ చేశాడమ్మా ......మానవుడు మరణానంతరం అతని ఆత్మ ఏ ఊర్ధ్వ లోకాలకెళ్ళినా భగవతారాధన అసాధ్యమట. ఒక్క మానవుడికే భగవంతుడ్ని తనకిష్టమైన రీతిలో సేవించే అవకాశమున్నదట! అలాంటి మనిషి జన్మఎత్తి దాన్నిభగవంతుని సేవలో సార్ధకం చేసుకోకుండా వెళ్లి పోతున్నాననే తనకి బాధట....ఏం చెప్పనమ్మా తనకి...నేను...... కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటే ....తాతగారూ.....మీరు ఇక సమయం వృధా చేయవద్దు...మీకు భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదిస్తాడు...ఇక సమయం అంతా భగవత్ సేవలో గడపమని నాకు ధర్మ బోధ చేశాడమ్మా... తరువాత నేను ఒక రోజు హాస్పిటల్ కి  ఉదయమే వెళ్లాను. నన్ను చూసి తను  'అమ్మా మా నాన్నగారు ఇంకా రాలేదు. నేను స్నానం చేసి వస్తాను. ఆయనగారు రాగానే  నేను 'లేకపోతే'..... 'కాదు'...'కాదు'......నేను కన్పించకపోతే  కంగారు పడతారు...దయచేసి నేను ఇప్పుడే వస్తానని చెప్పగలరా' అమ్మా....అన్నాడు ఆకుర్రాడు రెండు చేతులు జోడించి. 'అయ్యో ... అదెంత పని...బాబూ....అన్నాను.       
తను నాకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మాట్లాడినందుకు ...నా మనస్సు తెగ కలవర పడింది. ఆరోజే తెలిసింది నాకు.....ఆ పిల్లాడు ఇక ఈ భూమికి కొద్దిరోజుల... బంధువేనని....ఏ నిముషం లోనైనా....ఇహలోక ప్రయాణం ముగించవచ్చునన్ననిజం తెలిశాక తనని చూడడానికే నాకు భయం వేసేది.....ఆ సంగతి తెలిసిన మరుక్షణం నుంచి  క్షోభ...మనః క్లేశంతో నేను ఎంతగా  రోదించానో....నాకే తెలుసు. మరుసటి రోజు కూడ నేనే హాస్పిటల్ కి ఉదయాన్నే వెళ్లాను. పిల్లాడి తల్లి, తండ్రి ఇద్దరు వున్నారు. వాళ్ళు ఎందుకో హడావుడి పడ్తున్నారు.
డాక్టర్లు రౌండ్ కి వచ్చే సమయం. సంగతేమిటి అని కనుక్కుంటే తనని చూడడానికి  వేదపాటశాల నుంచి గురువులూ, కొంతమంది శిష్యులు వస్తున్నారట. వాళ్ళని లోనికి తీసుకురావడం కోసం పాపం ఆముసలాయన తంటాలు పడ్తున్నాడు. చూడమ్మా ఏమైనా సాయం చేయగలవేమో...వాళ్ళని లోనికి తీసుకురావడానికి....అన్నారు మామయ్యగారు.
ఆముసలాయాన్ని తీసుకుని హాస్పిటల్ సూపెరింటెండెంటు దగ్గరికి వెళ్లి మాట్లాడాను. తనకి ఏ పిల్లాడి కేసు సంగతి తెలసట...అయ్యో...ఇప్పుడు వచ్చారా వాళ్ళంతా...సరే...అని సెక్యురిటీని పిలిచి వాళ్ళందరిని లోనికి పంపించమని మా ముందే చెప్పారు...మేము వార్డుకి వెళ్ళామో లేదో బిల బిల మంటూ పది మంది...ఇద్దరు గురువులూ..ఎనిమిది మంది శిష్యులు..అందరూ వచ్చేశారు. వారి వేషధారణే ప్రత్యేకం. వారు వస్తూనే ఈ పిల్లాడు ఇద్దరు గురువులకి సాష్టాంగదండప్రణామం చేశాడు. వారు అంతా పిల్లవాడి చుట్టూనిలబడి మంత్రోచ్చారణ మొదలెట్టారు.
"శతమానం భవతి శత ఆయుహ్ స్స సేవెంద్రియే .....ఆ పిల్లవాడు వారిని వారించి తన నొక్కడినే కాదు అక్కడ ఉన్న 
అందరు రోగులని ఆశీర్వదించమని కోరాడు. ఈ హడావుడికి అప్పటికే హాస్పిటల్ స్టాఫ్ , రోగులు, డాక్టర్లు అందరు ఆ వార్డ్లో 
గుమి కూడారు. అయిదు నిముషాల పాటు వారి వేదోచ్చారణ.........సర్వేజనా సుఖినోభవంతు ....ఆశీర్వాదం తో వార్డ్ మార్మోగి పోయింది. హాల్లో ఉన్నఅన్యమతస్తులకు ఒక డాక్టర్ ' they are chanting manthras and giving blessings  for well being of all the patients herein at the request of that boy patient'  అని చెపుతూంటే నా కళ్ళ వెంట కన్నీటి ధార ఆగలేదు. మనసంతా ఉద్విగ్నంగా మారింది. తరువాత కొద్ది నిముషాల్లో వారంతా వెళ్లి పోయాక నేను తనతో 'వారంతా మీకోసం అంత దూరంనుంచి వచ్చి ఆశీర్వదిస్తుంటే  వారిని ఎందుకు వారించావు' అని అడిగాను.
అందుకతను 'అమ్మా...వారి ఆశీర్వాదబలం నాకంటే ఇక్కడ ఉన్నవారికి అవసరం. నాకెలాగు ఎవరి ఆశీర్వాదంతో ఇక పనిలేదు'.
అని నిర్విరాకారంగా బెడ్ మధ్యలో పద్మాసనం వేసుక్కూర్చుడతను కళ్ళు మూసుకుని. ఇక నావల్ల కాలేదక్కడవుండడం.
బయటకి వెళ్లి అక్కడవున్న బెంచ్ మీద కూర్చున్నాను సోబుతూ. నర్సులు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు, రోగులు ఎంతమందో కళ్ళుతుడుచుకోవడం గమనించాను నేను. మరుసటి రోజు ఉదయమే మామయ్యగారు తనక్కడ ఉండనని తనని డిశ్చార్జి చేసి తీసుకెళ్ళమని చెప్పడం ఆయన ఇంటికి తీసుకు రావడం జరిగింది. నేను తన విషయం కావాలనే మరి మాట్లాడలేదు. ఎందుకంటే తనని  ఓ చిన్ని విష్ణుమూర్తిగా నా మనః ఫలకం నుంచి తొలగించదలుచుకోలేదు.  
రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి