లేబుళ్లు

31, అక్టోబర్ 2010, ఆదివారం

'పునరపి'...(punarapi)

                                                   
                                                           పునరపి … 
                                                     ------------------------

తెల్లవారుఝామున మూడవతోంది.
'నాలుగ్గంటలకి అలారం పెట్టానే…మూడింటికే మోగిచస్తుందేమిటి ఈ అలారం'
అని విసుక్కుంటూ లేచి అలారం 'క్లాక్' ఆపాను. అయినా ఆగకుండా మోగుతూనే వుంది...
ఒక్క క్షణం ఆలోచించి 'ఓ' అలారం కాదు. ల్యాండ్ ఫోనా ?
'ఈ సమయంలో ఎవరబ్బా ఫోను చేస్తోంది'? ఈయన గారి ఫ్రెండ్ ఎవరైనా 'కేంప్'కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా  ఫోను చేస్తున్నారా' అనుకుంటూ ఫోను రిసీవర్ అందుకున్నాను.
'హలో...హలో' అని అరుస్తున్నాఎంతకూ అవతలనుంచి మాట వినబడకపోవడంతో ఎవరూ? అంటూ విసుగ్గా అడిగాను నేను.
'నేను...కోదాడు నుంచి 'వాణి' ని మాట్లాడుతున్నాను' ఫోనులో ఆమె మాట లోతు భావిలోనుంచి
వస్తున్నట్లుగా అస్పష్టంగా ఉన్నాగుర్తించాను' మా తోటికోడలు 'వాణి' గొంతుకని.
'బావగారి ఇల్లేనా' ? గొంతులో 'ఆందోళన...ఏడుపు' మిళితమైన స్వరంతో మాట్లాడుతోంది
'ఏమిటి వాణీ' ఈ టైములో ఫోను ? అందరూ బావున్నారా ? ఆదుర్దాగా అడిగాను నేను.
'అక్కయ్యా నువ్వేనా'? మామయ్యగారికి 'హార్ట్ ఎటాక్' వచ్చిందో...ఏమిటో ?
గుండెనొప్పి, వీపులో నొప్పితో విలవిల లాడిపోయారు.
వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాము. డాక్టరు గారు ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు.
మీ మరిదిగారు, ఒక డాక్టరు,నర్స్,మామయ్యగారిని తీసుకుని 'అంబులెన్స్'లో బయలుదేరి  గంటకు పైగా అయింది. బావగారిని అయిదింటి కల్లా 'నిజాం హాస్పిటల్' కి రమ్మన్నారు మీ మరిది.
'సిటిలో అందరికీ నువ్వే చెప్పు.మామయ్యగారు ఎలావున్నారో' నాకు ఫోను చేస్తూ వుండు.
నాకు రావాలనే వుంది కాని పిల్లలతో కుదరదు నీకు తెలుసుగదా'! అని చెప్పి ఫోను పెట్టేసింది మా తోడికోడలు.
తను ఫోను పెట్టేసిన తరువాత గాని నాకు విషయం పూర్తిగా తలకెక్కలేదు.
కంగారు, వెన్నుల్లోంచి వణుకు మొదలయింది.
ఆయనగారిని లేపి సంగతి చెప్పాను.
వెంటనే ఆయన 'అంబులెన్సు'లో కూడా వస్తున్న తమ్ముడికి ఫోను చేసి వివరాలు కనుక్కుని   తమ్ముళ్ల కి, అక్కచెల్లెళ్లకి ఫోను చేశారు.
'నాలుగున్నరకల్లా హాస్పిటల్ చేరుకుంటాము నువ్వు కూడ వచ్చేసి అక్కడ 'అడ్మిషన్  ఫార్మాలిటీస్' వుంటాయేమో చూడమని చెప్పారట. హాస్పిటల్ వెళ్ళడానికి కొద్దిగా టైం ఉందని ఈయన తయారు కావడం మొదలెట్టారు.
నేను వెంటనే దేవుడి దగ్గరికి దణ్ణం పెట్టుకున్నాను మామయ్య గారికి ఏమీ కాకూడదని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని.
ఉదయం తొమ్మిది గంటలకల్లా పిల్లల్ని స్కూల్ కి పంపించి నేను హాస్పిటల్ కి బయలుదేరాను.
తాతగారికి ఆరోగ్యం బాగాలేదు అని తెలిశాక మాఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్లమని తాము  హాస్పిటల్ కి వస్తానని ఒకటే మారాం. తరువాత తీసుకెళ్తానని వాళ్ళని ఒప్పించే సరికి దేవుడు
దిగి వచ్చినంత పనైంది. హాస్పిటల్ కి వెళ్లేసరికి మా మరుదులు హాస్పిటల్ బయటే కన్పించారు.
మా ఆడపడుచులు, చిన్నమామయ్యగారు ఒక్కొక్కరు హాస్పిటల్ కి రావడం మొదలెట్టారు.
నేను దాదాపు మధ్యాన్నం మూడుగంటల దాక అక్కడే వున్నాను.అందరం బయట బెంచీలమీద,చెట్లకింద గుంపులుగా చేరాము.
మామయ్య గారిని ఐ.సి.యు లో ఉంచారు. ఆరోగ్యం నిలకడ గానే ఉందని డాక్టర్లు చెప్పారు.
అందరం కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాము.
మామయ్యగారంటేమాఅందరికీ ప్రాణం. చుట్టాల్లో ఆయన సాయం పొందని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు.
నేను స్పష్టంగా గమనించాను అందరి మొహాల్లో ఆందోళన కన్పించింది.
తెలియకుండానే నాలుగు రోజులు గడిచాయి.
దేవుడు కరుణించాడు.మామయ్యగారు క్షేమమని డాక్టర్లు చెప్పారు.
పెద్దాయనకదా 'ఆపరేషన్' వద్దు మందులతోనే చూద్దామన్నారు.
మామయ్య గారిని 'ఐ.సి.యూ' నుంచి వార్డ్ కి మార్చారు.
ప్రత్యేక గది తీసుకుందామని ఈయన గొడవచేసినా మామయ్య గారు ఒప్పుకోలేదు.
వార్డులోఉంటేనే డాక్టర్లు బాగాచూస్తారని, ఒంటరితనం ఉండదని మామయ్యగారి వాదన.
హాస్పిటల్ ఇంకా మూడు, నాలుగురోజులు ఉండాలన్నారు.
రోజూ మామయ్యగారికి భోజనం తీసుకెళ్ళేదానిని. మేము వుండేది అమీర్ పేటలోనే.
కావడంతో అటూ ఇటూ తిరగడం పెద్దగా ఇబ్బంది కాలేదు.
కాని పిల్లలు, స్కూలు, వచ్చి పోయే వారితో సమయం
కుదరక బాగా ఇబ్బంది పడ్డాను.
                                                              * * * * *
మామయ్య గారిని 'వార్డ్' లోనికి మార్చిన రోజునే పక్కబెడ్ మీద ఒక చిన్నకుర్రాణ్ణి చూశాను.
వయసు పది పదకొండు సంవత్సరాలుంటాయేమో. చూడ్డానికి ఎంత అందంగా వున్నాడో.
నా రెండు కళ్ళు చాలలేదనిపించింది.
ఏం జబ్బు చేసి ఆచిన్న పిల్లాడిని హాస్పిటల్ లో చేర్చారో నాకు తెలియలేదు. అడుగుదామన్నా ధైర్యం చాల లేదు. సభ్యత కాదని అడగలేదు.
అతనితో ఉన్నవాళ్లను  చూస్తె అతనికి తాత,అముమ్మో ,నాయనమ్మలానో అనిపించారు.
వాళ్ళ బాధ చూస్తుంటే కడుపు తరుక్కు పోయేది.
ఏ క్షణంలో చూశానో, ఎందుచేతనో ఆ పిల్లాడిని చూస్తేనే మనస్సులో ఎంతో గౌరవభావం కలిగేది అతని ముఖంలో ఎంత వర్ఛస్సో !
'వేదం చదువుకుంటున్నపిల్లాడల్లే వుంది' అనుకున్నాను.
ముందు తలమీద జుట్టు తీసేసి గుండు,వెనుకాలపెద్ద శిఖ. ఎప్పుడు చూసినా ముఖం మీద చక్కగా దిద్దిన చెరగని గోవిందనామం, చిరునవ్వు, చిన్ని'విష్ణుమూర్తి' లా అతన్నిచూస్తూ
ఎంత సేపైనా అలానే ఉండిపోవాలనిపించేది.
అతనిమీద తెలీని అవ్యాజ్యమైన ప్రేమఏర్పడింది. ఎందుకని నన్నెవరైనా ప్రశ్నిస్తే
నావద్దేమీ సమాధానం లేదు. తన్నిచూసినప్పుడల్లా నాకు మాత్రం చిన్ని'విష్ణుమూర్తి' ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లనిపించేది. ఎందుచేతనో నమస్కారం చేయాలనిపించేది. మనస్సులో చేసుకునేదాన్ని. హాస్పిటల్ కి వచ్చానంటే అతన్నిచూడాలని,మాట్లాడడానికి మనసు
తహతహ లాడేది. నా మాతృహృదయంలో ఎక్కడో, ఏదో తెలియని ఆత్మీయ స్పర్శ.
జీవితంలో అతణ్ణి చూడడం ఇదే మొదటిసారి అయినా నాకూ అతనికీ ఏదో అవినాభావ సంబంధం ఉందనిపించేది నాకు.
ఎప్పుడూ చూసినా విష్ణు నామమో, గోవింద నామ స్మరణో,వేదమో, భక్తి గీతాలో సన్నగా ఆలపిస్తూనే ఉండేవాడు.
మామయ్యగారు కూడా అన్నారు ఈ పిల్లాడిలో ఏదో తెలియని
ఆకర్షణ శక్తి ఉంది. సాధారణవ్యక్తిత్వం  కాదమ్మా అతనిది …!
కానీ దురదృష్టవంతుడమ్మా. రెండు సంవత్సరాలక్రింద తలితండ్రులు ఇద్దరూ
ఒకేసారి పోయారట. అన్ని టెస్టులు చేశారటమ్మా. తనకి ' బ్రెయిన్ ట్యూమర్' అట. 
పరిస్థితి చాలా విషమమటమ్మా. రెండేళ్ల పైగా తను ఎలా నెగ్గుకొచ్చాడా' అని డాక్టర్లకే 
ఆశ్చర్యమట.  
మీరెవ్వరూ ఇక్కడ లేనప్పుడు నాదగ్గరికి వచ్చి కూర్చుంటాడమ్మా'.
రెండు రోజుల్లుంచి తను విపరీతమైన తలనొప్పితో బాధతో గిల గిల లాడి పోతున్నాడమ్మా.
ఆ నొప్పి వచ్చే సమయంలో అతను బెడ్ మీదనే పద్మాసనం వేసుకుని ప్రార్ధన చేస్తూ ఉంటాడు
'నర్స్' వచ్చి ఏవో మందులు, ఇంజెక్షన్లు ఇస్తుందమ్మా అతనికి.
'న్యూరో' వార్డులో బెడ్ ఖాళీ అవడంతోనే అక్కడికి మారుస్తారట.
తను నొప్పితో  బాధ పడే విషయం తన తాతగారికీ, అమ్ముమ్మగారికీ తెలవనీయవద్దని
సిస్టర్లకి, డాక్టర్లకి చెబుతున్నాడమ్మా ! ఎంత పెద్దమనసమ్మా…ఆచిన్న కుర్రాడిది, అన్నారు మామయ్యగారు నొచ్చుకుంటూ.
'నిన్న నాకతను చెప్పాడమ్మా 'మానవుని మరణానంతరం అతని ఆత్మ ఏ ఊర్ధ్వ లోకాలకెళ్ళినా భగవతారాధన అసాధ్యమట.
ఒక్క మానవుడికే తనకిష్టమైన రీతిలో భగవంతుడ్నిసేవించే అవకాశమున్నదట'.  'అలాంటి మనిషి జన్మఎత్తి దాన్నిభగవంతుని సేవలో సార్ధకం చేసుకోకుండా వెళ్లిపోతున్నాననీ,
తలితండ్రులను కొలిచే భాగ్యం భగవంతుడు తనకి ఇవ్వలేదని బాధటమ్మాఅతనికి…చిన్నవాడైనా ఎంతటి జ్ఞాన వంతుడమ్మా 'మామయ్య గారి గొంతు గాద్గదం గావడం నేను గమినించి వారిని వారించాను.
'తాతగారూ'...మీరు ఇక సమయం వృధా చేయవద్దు.మీకు భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్షు ప్రసాదించాడు.ఇక సమయం అంతా భగవత్ సేవలో గడపమని నాకు ధర్మ బోధ చేశాడమ్మా' అంటూ కళ్లనీళ్ల పర్యంతమవుతూ చెప్పారు మామయ్యగారు.

                                        * * * * *

మరుసటి రోజు నేను హాస్పిటల్ కి ఉదయమే కాఫీ, టిఫెన్ పట్టుకువెళ్లాను.
అతన్ని కూడా టిఫెన్ చేయమన్నాను, అతను నన్ను వారిస్తూ
'తాత గారు వాళ్ళు ఇంకా రాలేదు. నాకు లేటయింది.
స్నానం చేసి వస్తాను. వాళ్ళు వస్తూనే నేను 'లేకపోతే' ... 'కాదు' 'కాదు' నేను కన్పించకపోతే
కంగారు పడతారు. నేను స్నానానికి వెళ్లానని,తిరిగి ఇప్పుడే వస్తానని దయచేసి చెప్పగలరా? మరవొద్దు 'అమ్మా' అన్నాడు ఆకుర్రాడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ.
'అయ్యో' అదెంత పని బాబూ... అలాగే' అన్నాను నేను నొచ్చుకుంటూ.
అతని మాటల 'అంతరార్ధం' అర్ధమయ్యాక నా మనస్సు తెగ కలవరపడింది.
అందునా ఆరోజే తెలిసింది నాకు…ఆ పిల్లాడిక భూమికి బహు కొద్దీ 'రోజుల' బంధువేనని…ఏ నిముషం లోనైనా ఇహలోక ప్రయాణం ముగించవచ్చునన్ననిజం తెలిశాక తన
ముఖంలోకి సూటిగా చూడడానికే నాకు భయం వేసేది. ఆ సంగతి తెలిసిన మరుక్షణం
నుంచి క్షోభ, మనః క్లేశంతో నేను మూగగా ఎంతగా రోదించానో నాకే తెలుసు.

                                           * * * * *
మరుసటి రోజు హాస్పిటల్ కి సాయంత్రం వెళ్లాను. దాదాపు ఆరుగంటలవుతోంది.
ఆ పిల్లాడి తాతగారు, అమ్ముమ్మ ఇద్దరూ వున్నారు. ఎందుకో హడావుడి పడ్తున్నారు.
సంగతేమిటి అని కనుక్కుంటే తనని చూడడానికి వేద పాఠశాల నుంచి అతని గురువులు, సహాధ్యాయులు రావడం లేటయియిందట. వాళ్ళని విజిటింగ్ 'అవర్స్' సమయం 
అయిపో యిందని సెక్యూరిటీ గార్డులు లోనికి రానివ్వడం లేదట.
'వాళ్ళని లోనికి తీసుకురావడం కోసం పాపం ఆముసలాయన తంటాలు పడ్తున్నాడు.
ఏమైనా సాయం చేయగలవేమో చూడమ్మా' అన్నారు మామయ్యగారు.
ఆముసలాయాన్ని తీసుకుని 'సెక్యూరిటీ చీఫ్' దగ్గరికి వెళ్లి మాట్లాడాను.
తనకి ఆ  పిల్లాడి కేసు సంగతి తెలసట...'అయ్యో' విజిటింగ్ టైం అయిపోయిందమ్మా.
ఇప్పుడు వచ్చారా వారంతా'.
'అనుమతినిస్తాను కానీ పేషెంట్ ని చూసి వెంటనే బయటకు రావాలమ్మా' అనిచెప్పి
'సెక్యురిటీ గార్డ్స్' పిలిచి ఒక గార్డ్ ని తోడిచ్చి వారందరిని లోనికి పంపించమని మా ముందే చెప్పారు
గురువులు,అతని సహాధ్యాయులు అందరూ మాతోనే బిల బిలమంటూ 'వార్డుకి' వచ్చేశారు.
వారు అక్కడికి వస్తూనే డ్యూటీ సిస్టర్ వారిస్తున్నా తను ఇద్దరు గురువులకి సాష్టాంగదండప్రణామం చేశాడు.
వారంతా పిల్లవాడి చుట్టూనిలబడి మంత్రోచ్చారణ మొదలెట్టి
"శతమానం భవతి శత ఆయుః స్ససేవేంద్రియే ప్రతిదిష్ఠతీ'...అని ఆశీర్వచనం
ముగించకముందే ఆ పిల్లవాడు గురువులుకి చేతులు జోడించి నమస్కారం చేస్తూ తననొక్కడినే కాదు అక్కడ ఉన్న రోగుల నందరినీ ఆశీర్వదించమని కోరాడు.
ఆ హడావుడికి అప్పటికే హాస్పిటల్ స్టాఫ్, రోగులు, డాక్టర్లు,సెక్యూరిటీ గార్డులతో సహా
అందరూ వార్డులో గుమి కూడారు.
పది నిముషాలబాటు శ్రావ్యంగా సాగిన వారి వేదోచ్ఛారణ 'సర్వేజనా సుఖినోభవంతు' అన్నముగింపువరకు హాస్పిటల్ 'వార్డ్' అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
అదే వార్డులో ఉన్నఅన్యమతస్తులకు ఒక 'డాక్టర్' అక్కడ జరుగుతున్నదేమిటో వివరిస్తూ
'ఇక్కడున్న రోగులందరికీ మంచి జరగాలని, ఆరోగ్యం కుదుటబడాలని ఆ పిల్లాడి కోరికపై
ఆ గురువులు ఆశీర్వదించారు' అని చెపుతూంటే నాకళ్ళు చెమర్చాయి. మనసంతా ఉద్విగ్నంగా మారింది.
నా చేతి రుమాలుతో నా ముఖం దాచుకున్నాను.
కొద్ది నిముషాల్లో వారంతా వెళ్లి పోయాక నేను తనని 'వారంతా నీ కోసం అంత దూరంనుంచి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తుంటే వారిని ఎందుకు వారించావు' అని అడిగాను.
అందుకతను 'అమ్మా…నాకు తెలిసినంత వరకు ఏ ప్రాణికైనా కాలం తీరనిదే మరణం రాదు.
కాల ప్రవాహానికి మనమెవ్వరం అతీతులం కాదు. కాలాన్ని జయించే మార్గం అంతకన్నాలేదు.
నాకు తెలుసు నాకిక ఎంతో సమయం లేదని.
'వేద పండితులయిన గురువుల ఆశీర్వాదబలం అందరికీ చెందాలని అలా కోరాను…అంతే మరే విశేషములేదు 'తల్లీ' అన్నాడతను నిర్వికారంగా. 
'లోకః సమస్తాస్సుఖినోభవంతు' అంటూ రెండుచేతులూ జోడించి నమస్కారం చేయడం నేను గమనించాను.
వెంటనే  బెడ్ మధ్యలో పద్మాసనం వేసుక్కూర్చున్న తను నిముషంలోనే 'అమ్మా..అమ్మా' అని బిగ్గరగా మూల్గుతూ రెండు కణతలు, మెడవెనుకాల చేతులతో నొక్కుకుంటూ బాధతో మెలికలు తిరుగుతూ బెడ్ మీద పడిపోతున్న తనని మెల్లగా బెడ్ మీద వాలే లోపులోనే తను స్పృహకోల్పోతున్నట్లుగా అనిపించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'డాక్టర్' ని పిలిచాను
డాక్టర్,సిస్టర్ ఇద్దరూ వచ్చి పరీక్షించి వెంటనే అతన్ని 'ఐ.సి.యూ' కి మార్చాలని క్షణాల్లో
స్ట్రెచర్ మీదకు మార్చి ఐ.సి.యూ కి తీసుకెళ్లారు.
అతని అమ్ముమ్మ, తాత గారు వెంట వెళుతూ 'పక్కనే, 'మినీ స్టీల్ అల్మెరా' లో ఉన్నవస్తువులని
సంచిలో సదిరి ఉంచు తల్లీ' తరువాత వచ్చి తీసుకెళతాము అనిచెప్పారు.
వాళ్ళటు వెళ్ళగానే నేను ఆ 'మినీ స్టీల్ అల్మెరా' లోపల ఉన్నచిన్న సంచీ, టిఫన్ బాక్స్,
మందులు, వాటి వెనుకాల ఒక ఫోటో ఫ్రేమ్ తీసి బ్యాగ్ పెడుతూ ఆ ఫోటోలో ఉన్న ఇద్దరినీ పరిశీలనగా చూశాను.
ఫోటో చూస్తూనే వీళ్ళని ఎక్కడో చూశానే, పరిచయమున్నవ్యక్తుల్లాగా ఉన్నారు…'ఎవరబ్బా వీళ్ళు' అని ఆలోచించడం మొదలెట్టానో లేదో వెంటనే గుర్తుకు వచ్చారు వాళ్లిద్దరూ !
వారెవరో గుర్తుకు రావడంతోనే నా ఒళ్ళు స్వాధీనం తప్పి, 'మినీ స్టీల్ అల్మెరా' పక్కనే,
ఫోటో చేతిలో పట్టుకుని కూలబడిపోయాను. భూమి అంతా గిర్రున తిరిగుతున్నట్లనిపిస్తోంది.
ఒళ్ళంతా ఒక్కక్షణంలో చెమటలు బట్టాయి. గుండె వేగంకొట్టుకోవడం మొదలయింది.
ఈ 'బాబు' తలితండ్రులా వారు 'కాదు…కాదు' అని బిగ్గరగా అరవాలనిపిస్తోంది.
నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
'భగవంతుడా…ఎంత నిర్దయుడవయ్యా'...తన తలితండులను నాకళ్లెదుటే కడతేర్చావు.
'ఇప్పుడు…' కనీసం కాపాడ వయ్యా తండ్రీ' అంటూ మనసులో నిస్థూరంగా ప్రార్ధిస్తూ
ఆ ఫొటోలో వారిని కలిసిన క్షణాలు తలుస్తూ గోడకు చేరగిలబడ్డాను .

                                                            * * * * *
15 జూన్ 2013.
'చార్ ధామ్' యాత్రలో చివరిదైన 'కేదార్ నాధ్' యాత్ర ముగించుకుని ఆరోజు భారీ వర్షసూచన ఉండడంతో ఉదయం ఎనిమిది గంటలకే 'కేదారనాథ్' నుంచి బయలుదేరి నడిచి 'సోన్ ప్రయాగ్'  వెళ్ళేవాళ్ళం తిరుగు ప్రయాణం మొదలెట్టాము.
గుర్రాలు, డోలీల్లో వచ్చేవాళ్ళు కొద్దిగా లేటుగా బయలుదేరాతామన్నారు .
మేము బయలుదేరిన కొద్దిసేపటికే వర్షం మొదలయింది.
వర్షంలో నేను,మావారు, మాతో వచ్చిన మరికొంతమందిరి 'గౌరీకుండ్' త్వరగా చేరుకోవాలని వడివడిగా అడుగులేశాము. అందరం 'ఉలెన్ స్వెట్టర్లు' వేసుకుని వాటిపై రైన్ కోట్లు వేసుకున్నాము.
బయలుదేరిన కొద్ధి సేపటికే వర్షం భీకరరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా వర్షం.
ఎక్కడా తలదాచుకోవడానికికూడా సరైన ప్రదేశం కనిపించలేదు.
దారిలో ఎక్కడ చూసినా ప్రవహిస్తున్నవర్షపు నీరు.
జాగ్రత్తగా అడుగులేస్తూ బురదలో మళ్ళీ నడక మొదలెట్టాము. 
పగలు పది గంటలు కాకుండానే వాతావరణమంతా చీకటి పడ్డట్లుగా తయారయింది.   
కొండలపై నుంచి అక్కడక్కడా దొర్లుతున్నరాళ్లు, మట్టిపెళ్లలు, ప్రాణాలు అరచేతిలో 
పెట్టుకుని, పూర్తిగా తడిసి విపరీతమైన చలికి వణుకుతూ, ఒకరినొకరం వదలకుండా
ఎలాగైనా కిందకు చేరాలన్న పట్టుదలతో కొండల వాలుగా మసకగా కనబడుతున్న  
కాలిబాటలో మళ్ళీ మెల్లగా నడక మొదలెట్టాము.
మాతో తెచ్చుకున్న బట్టల సంచులుతడిసి బరువెక్కాయి.వాటిని మోయలేక 
నడక సాఫీగా సాగ లేదు.కనుచూపు మేర ప్రాణి అన్నది కనబడడంలేదు.
చూస్తుండగానే మాముందున్న కాలిబాట అమాంతంగా కూలిపోయి లోయలోకి పెద్ద గండి ఏర్పడింది. కొండలపైనుంచి వస్తున్నవరద ఉధృతికి గండి అంతకంతకూ పెద్దదయింది.
మేమంతా ప్రాణాలు ఉగ్గబట్టుకుని రాళ్లతో కొద్దీ విశాలంగా వున్న ప్రదేశానికి వెనక్కి
తిరిగి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాము.
ఎవరి సహాయం లేకుండా 'గౌరీకుండ్' కాదుగదా క్రిందకు వెళ్లడం అసంభవం అని తేల్చుకున్నాము.
బయలుదేరి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురం తెలుగువాళ్ళం.
మిగతా వారంతా గుజరాతీలు. అందరం అక్కడే రెండుమూడు గంటలు చిక్కుకుపోయి,
పక్కనే ఉన్న కొండ ఎక్కి అటుపక్కకి దిగడానికి ఏమైనా వీలు ఉన్నదేమోనని ప్రయత్నించి, వర్షంమూలంగా మావల్లగాక రెండు పెద్ద బండరాళ్ల మధ్య చిన్న గుహలా వున్నచోట అందరం  తలదాచుకున్నాము.
మొబైల్స్ ఫోన్లు పనిచేయడం లేదు. సిగ్నల్స్ పూర్తిగా పోయాయి.
మిగతా ప్రపంచంతో మాకు సంబంధం తెగిపోయిందని మాకర్ధమయింది.
ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది.
జీవితంలో పుట్టి బుద్ధెరిగి అంత వర్షం ఎప్పుడు చూడలేదు. లోయలో ఎక్కడో అడుగున ప్రవహించే 'మందాకిని'నది ప్రమాదంగా అతివేగంతో ప్రవహిస్తూ దాదాపు లోయపైకి వచ్చిభీకరంగా ఉంది. చుట్టూనీరు. అడుగు వేయలేని పరిస్థితి.
అలా నలభై గంటలు పైగా క్షణం ఒక యుగంలా అక్కడే అందరం జాగారం చేస్తూ ఉండిపోయాము.
'ప్లాస్టిక్' సంచుల్లో తడిసి ముద్దకాకుండా మిగిలిన తిండి వస్తువులుంటే పంచుకున్నాము.
పగలు రాత్రి తేడా తెలియలేదు. మందాకినీ ప్రవాహ నీరు
మేము తలదాచుకున్న కొండ  అంచుపై దాకా చేరింది.  
ఆకలి,చలి.ఒకరినొకరు దైన్యంగా చూసుకోవడం తప్పితే చేయగలిగిందేమీ లేదు. 
కొందరు అటు ఇటు కొండలమీద తిరిగి ఏవో కాయలు, ఆకులు, అలములు తిన్నారు. 
మేము నలుగురం చివరి బిస్కట్ లు అయిపోయాక నీళ్లు తాగి ఉన్నాము.
అందరి దగ్గర మిగిలిఉన్న తినుబండారాలు అయిపోయాయి.
అందరం శుష్కించి పోయాము. ప్రాణాలతో తిరిగి వెళతామన్నఆశ సన్నగిల్లింది.
వర్షం ఇంకా ఎక్కువయింది.
ఆస్థితిలో అక్కడే నలుగురం తెలుగువాళ్ళం ఒకరినొకరు వదలకుండా కలిసే ఉన్నాం.
వాళ్లిద్దరూ అప్పుడు మనసువిప్పి మాట్లాడుతూ ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆరోగ్యం బాగాలేదని,
చికిత్స జరుగుతోందని, రెండుమూడేళ్ళ కంటే ఎక్కువకాలం బ్రతకడని,స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా తమ చేతుల్లో ఏమీలేదనిఅన్నారని, కొడుకు కోరికపై ఇంటిదగ్గరే ఉన్నవేద పాఠశాలలో చేర్పించామని, అతడిని రక్షించమని 'బదరీనాధుణ్ని' 'కేదారేశ్వరుని'తో మొర పెట్టుకుందామని వస్తే ఇలాగయిందని, ప్రాణాలతో తిరిగి వెళతామో లేదో…బిడ్డకి 'దిక్కెవరు'? మహాప్రభో అంటూ హృదయవిదారకంగా రోదించారు.
17 జూన్ 2013
తెల్లవారుతూనే ప్రళయం మాచుట్టుముట్టింది.
మందాకినీ నది ఉప్పెనలా మాపై విరుచుకుపడింది. 
మేము తలదాచుకున్న ప్రదేశం మునగడం, రాళ్లు జారి మానలుగురిలో వారిద్దరూ, మరి కొందరు మందాకినీ ప్రవాహంలో కొట్టుకు పోవడం కళ్లారా చూశాను.
తరువాత వారి జాడ తెలియ లేదు. మేము, మరికొందరం అదృష్టవశాత్తూ ఏదో
ఆసరా దొరికి కొండమీదకు ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడం, మమ్ముల్నిరెండురోజుల తరువాత 'మిలిటరీ రెస్క్యూ టీమ్' వాళ్ళు రక్షించడం, ఆపై మేము క్షేమంగా తిరిగి రావడం అంతా గుర్తుకొచ్చింది.ఆ తలితండ్రుల రోదన మళ్ళీ ఇప్పుడు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్లనిపించింది.
ఇంతలోమామయ్యగారు 'ఏంటమ్మా' ఎందుకు అలా అయిపోయావు ?
'ఎవరిదమ్మా ఆ ఫోటో ? అంటూ బెడ్ మీద నుంచి లేచి కూర్చుని నా వంకే చూస్తూ ప్రశ్నించారు  మామయ్య గారు .
ఈ విషయాలన్నీ చెప్పి ఆయన్ని బాధించడం ఇష్టంలేక ఆయన నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ లేచి నిలబడి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ 'ఏం లేదు మామయ్యగారూ'
ఫోటో అతని తలితండ్రులదిలా ఉంది.అందుకే బాధనిపించింది' అని అప్పటికి తప్పించుకున్నాను.
ఇక నావల్ల కాలేదక్కడ వుండడం.
బయటకి వెళ్లి అక్కడవున్న బెంచ్ మీద కూర్చున్నాను సోబుతూ.
అతన్ని తీసుకువెళుతున్నప్పుడు నర్సులు,ఇద్దరు ముగ్గురు డాక్టర్లు, రోగులు ఎంతమందో కళ్ళుతుడుచుకోవడం గమనించాను.
మరుసటి రోజు ఉదయమే మామయ్యగారు హాస్పిటల్ నుంచి 'డిశ్చార్జి' కావడం ఆయనని
ఇంటికి తీసుకు రావడం జరిగింది.
నేను మామయ్య గారితో ఆకుర్రాడి విషయం ఏ కబురు వినాల్సి వస్తుందోనని మరి మాట్లాడే  ధైర్యం చేయలేక పోయాను.
తనని ఓ చిన్ని 'విష్ణుమూర్తిగా' నా మనః ఫలకం నుంచి తొలగించదలుచుకోలేదు.
 
రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.
మొబైల్ నం : 9849118254

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి