లేబుళ్లు

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

Ganga.

                                                          ఓం విఘ్ననాయకాయనమః                                                                                  


                                                                 గంగ

ఆదివారం. ఈరోజు ఇంట్లో ఆయన లేరు. ఏదో పని వుందని, సాయంత్రం దాకా రానని, భోజనం కూడ బయటే చేస్తా నని చెప్పి  వెళ్ళారు. నాకు బద్ధకం వేసి వంట కూడ చేయలేదు.రాత్రి చేసినవి రెండు చపాతీలు వుంటే తిని ఏదో పుస్తకం పట్టుకుని ఇట్లా నడుం వాల్చిపది నిముషాలు కాలేదు. కాలింగ్ బెల్ ఒకటే మోత ఆగకుండా. 'బుద్దిలేదు మనుషులకి వచ్చేదాకా ఆగొచ్చు కదా' అనుకుంటూ వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా పోలీసు కానిస్టేబుల్.
గుండె ఆగినంత పని అయింది. భయంతో ఆ క్షణంలో ఎన్నో పిచ్చిఆలోచనలు. ధైర్యం తెచ్చుకున్నాను.
'ఏమిటి'? అని నేను నోరు పెగల్చుకుని ప్రశ్నించే  లోపులోనే అతను ''శారద గారు  మీరేనా అమ్మా" అని చాలా మర్యాదగా అడిగాడు.
'అవును...నేనే' ? అన్నాను భయంతో వెన్నుల్లోంచి వస్తున్న వణుకుని కప్పి పుచ్చుకుంటూ,
'మీతో కొద్దిగా మాట్లడాలమ్మా' 'లోపలకి రావచ్చా'? అన్నాడతను నా ముఖంలోకి సూటిగా చూస్తూ.
'అసలు సంగతి ఏమిటో చెప్పు బాబూ, కంగారుగా వుంది' అంది ఆందోళనగా శారద. 
'ముందు ఇంటి లోని కి పదండమ్మా'..... నేను  ఇక్కడ లోకల్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్    నే నమ్మా...సార్ నాకు బాగా పరిచయమే నమ్మా,నా పేరు సత్యం'
'మీరు ముందుగా లోపలికి  వెళితే బావుంటుంది.ఇంట్లో సార్ వుంటే పిలవండమ్మా' కొద్దిగా మాట్లడాలమ్మా
నాకు క్షణ, క్షణానికి..గుండె దడ ఎక్కువయి పోతోంది... అప్రయత్నంగానే అతనికి దారి వదిలాను.
అతను హాలు లోనికి వచ్చి 'అమ్మా''మీవాళ్ళేవరైనా  'కాశీ' కి వెళ్ళరా'? అని అడిగాడు.
కొద్దిగా అలోచించి...ముఖం మీద చెమట చీర కొంగుతో తుడుచు కుంటూ'వుహూ' లేదే,అన్నాను నేను.
'స్నేహితులుకాని, దూరపు బంధువులు కాని,మీకు బాగా తెలిసిన వాళ్ళెవ రైనా ......'
'లేదు బాబూ' ... అసలు సంగతేమిటో చెప్పు' . టెన్షన్ భరించలేక.
'మీరేమీ కంగారు పడకండమ్మా'... 'ఇంట్లో మరెవరైనా వున్నా పిలవండమ్మా దయచేసి ' అన్నాడు కానిస్టేబులు బహుశా నా కంగారు చూసి 'వుండు మా పని పిల్ల వుంది పిలుస్తాను' అన్నాను నేను.
ఇంతలో'జ్యోతి పనిపిల్ల' అదే క్రిందకు వచ్చింది.
పోలీసుని  చూసి  ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది.
'ఇక్కడికి రా  అమ్మాయ్' అన్నాడు కానిస్టేబులు.
మాట్లాడ కుండా వచ్చి నాప్రక్కనే నిలపడింది.
'నేను అమ్మతో మాట్లాడి వెళ్ళిన దాకా ఇక్కడే వుండు.నీ పేరేంటి?
'ఈ పిల్ల పేరు జ్యోతి...మాఇంట్లో పనిచేస్తుంది'...
'చూడండమ్మా'  పోలిస్ కంట్రోల్ రూముకి 'కాశీ' ఘాట్ పోలీసు స్టేషను నుంచి ఉదయం ఫోను వచ్చిందమ్మా.
'అక్కడ పోలీసులకు గంగలో మునిగి  చనిపోయిన ఇద్దరూ స్త్రీల శవాలు దొరికాయి అమ్మా'...
'వాళ్ళబ్యాగు,సూట్ కేసు' లలో..మీ పేరు, అడ్రస్, ఫోను నంబరు, ఉన్న పేపరు దొరికిందట అమ్మా'....
'ఆ ఫోను నంబరు కి వాళ్ళు ఫోను చేస్తేఆ నంబరు పనిచేయడం లేదట' అందుకు పోలీసు కంట్రోల్ రూము కి 'మెసేజ్'  ఇచ్చారమ్మా'.. చనిపోయిన ఇద్దరిలో ఒకావిడకు దాదాపు 50 ఏళ్ళు, ఇంకొకావిడకు షుమారు 30 ఏళ్ళు ఉంటాయటమ్మా'...
'ఆ చనిపోయిన వారి పేర్లు వారికేమి తెలియ లేదమ్మా' అక్కడి పోలీసు వాళ్ళు 'కాశీ' నుంచి చనిపోయిన వారి ఫోటోలు కూడా 'ఫాక్సు' చేశారమ్మా'....
'కానీ, ఈ ఫాక్సు కాపీలో వారి ముఖాలు స్పష్టం గా లేవమ్మా....ఈ ఫోటోలు చూడండి' అని ఆ ఫాక్సు కాపీ నాకిచ్చాడు..
ఒక్క క్షణం నా కాళ్ళ క్రింద  భూమి కంపించినట్లయింది...ఫోటోలు ఎంత అస్పష్టంగా వున్నా వెంటనే గుర్తించాను.
"సరోజా ...గంగా".....
'ఎవరమ్మా..వాళ్ళు'? అడిగాడు కానిస్టేబులు..
'సరోజ .నా స్నేహితురాలు...'గంగ' ఆమె కూతురు'... వాళ్ళు మీ చుట్టాలేమీ కాదమ్మా'?
'కాదు...'సరోజ' నేను కలిసి  చదువుకున్నాము' నాకు చాల కావలసిన మనిషి, ప్రాణస్నేహితురాలు. 'గంగ' ఆమె కూతురు. మెంటల్లీ చాలెంజ్డ్ గర్ల్  !
'మరి, వాళ్ళ ఫ్యామిలీ...ఎవరూ లేరా అమ్మా' ? అన్నాడతను.
'వున్నారు, వాళ్ళ అమ్మా, నాన్నా, అత్త గారు' అందరూ వున్నారు,
'అర్ధం అయింది అమ్మా'....' పాడు లోకం'... అన్నాడు అతను వేదాంత ధోరణితో.
'సరే నమ్మా'....'మీరు ఫోటోలో వాళ్ళని గుర్తించారు కదమ్మా! అక్కడి పోలీసు స్టేషను నంబరు, అడ్రస్, SI పేరు,ఆ యన మొబైల్ ఫోను నంబరు  ఈ పేపరులో వ్రాసి  ఉన్నాయమ్మా, మీరు ఎంత త్వరగా వెళితే అంత మంచిది.శవాలు మార్చురీ లో వుంచారమ్మా. రెండు మూడు రోజులు చూస్తారమ్మా! లేకుంటే వాళ్ళు......మిగతా పని అంతా
చేశేస్తారమ్మా, త్వరగా నిర్ణయం తీసుకుని అక్కడ SI గారితో మాట్లాడండి' అన్నాడు సత్యం లేచి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ .
ఒక్క క్షణం ఆలోచించాను...
'బాబూ సత్యం...ఓ చిన్న సాయం చేస్తావా'? ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాను.    
' అయ్యో ఇంతగా అడగాలా.... చెప్పండమ్మా' చొరవ చూపిస్తూ అన్నాడు సత్యం. 
'నువ్వే ఒక్కసారి అక్కడి SI గారితో మాట్లాడి...సంగతి ఏమిటో కనుక్కుని, మేము ఈరోజే తప్పని సరిగా బయలుదేరుతామని చెప్పగలవా'?
'దానికేముందమ్మా, ఇప్పుడే మాట్లాడుతాను' అంటూ తన మొబైల్ తీశాడు, సత్యం కానిస్టేబులు.
'ఈ ఫోను నుంచి చెయ్యమ్మా', అని నా మొబైల్ అతని చేతికి ఇస్తూ', అన్నాను నేను అతని చొరవకు మనస్సులోనే మెచ్చుకుంటూ
'హలో 'కాశీ' ఘాట్ పోలీసు స్టేషన్? మై SI నిహాల్ యాదవ్ సాబ్ సే బాత్ కర్ సక్తా హూ'?
'మై హైదరాబాద్ 'కొండాపూర్' పోలీసు స్టేషన్ కానిస్టేబులు సత్యం.. బాత్ కర్ రహా హూ'...
'సుభ హ్' ఆప్  గంగా  మే డూబ్ కే మిలేసో దో  అవరతోం లాశోం కే బారే మే హైదరాబాద్  కంట్రోల్ రూం కో ఇన్ఫర్మేషన్ దియే థే!
'ఓ అవరత్..లాశోం కా 'నాం', అవర్ 'పతా'  మిల్ చుకా హై... ఉన్కే దోస్త్ కే 'పతా' సే ఏ మాలూం హువా హై! అవ్ర్ ఓ లోగోం కా నాం, పతా నోట్ కర్లీజియే'...అని నా పేరు, అయన పేరు, ఫోను నంబర్లు, అడ్రస్ అన్ని చెప్పాడు..నా అనుమతి తోనే..
మేము ఈరోజే బయలు దేరు తున్నామని, శవాలు ఉంచమని చెప్పి...ఫోను పెట్టేశి, నేను వెల్తానమ్మా, అని బయలు దేరాడు.
అతన్ని ఉండమని చెప్పి..నేను రెండు వందలు తెచ్చి ఇవ్వబోయాను.'
'వద్దమ్మా....వుంచండి'..అని సున్నితంగానే తిరస్కరిస్తూ  'మీ లాంటి స్నేహితులు...ప్రతి మనిషికి వుండాలమ్మా'అని నాకు నమస్కరించి  వెళ్ళాడతను.
ఒక్క క్షణం కూర్చున్నాను...'ఏమయిందమ్మా సరోజమ్మ గారికి, గంగమ్మ గారికి'? ఆందోళనతో అడిగింది జ్యోతి.
''వాళ్లిద్దరు కాశీ లో చనిపోయారటే' గంగా నదిలో స్నానం చేస్తు మునిగి పోయారట... జ్యోతికి వాళ్ళిద్దరూ తెలుసు.
అది పదేళ్ళ పైగా ఇంట్లో పనిచేస్తోంది. రెండు నిముషాలు మౌనంగా దాన్నే చూస్త్తు వున్నాను.
కళ్ళు తుడుచుకుంటూ అంది..'' పోనీలే అమ్మా...సరోజమ్మ కష్టాలు  తీరి పోయాయి'
ఆయమ్మ పడ్డ కష్టాల ముందు..సీతమ్మోరి కష్టాలెంతవమ్మా? దేముడు మంచి పనే చేసినాడు...ఆమె బతికున్నాజీవితాంతం బాధ పడేదే. ఆ తల్లి మనసు నాకు బాగా తెలుసు! వచ్చే జన్మ లోనన్న దేముడు ఆయమ్మని మంచి పుటక పుట్టించాల" అంది..కళ్ళు..ముక్కు తుడుచుకుంటూ.. జ్యోతి.
ఎంత ఆపుకుందామన్నా కనీళ్ళు ఆగడంలేదు..
ముందు ఆయనకు ఫోను చేశాను. వెంటనే ఇంటికి రమ్మన్నాను. అయన లేదు ఇప్పుడు రాలేను అని ఖచ్చితంగా చెప్పేశారు. ఇక అసలు సంగతి చెప్పక తప్పలేదు. వెంటనే బయలు దేరాలి అని చెప్పాను. టికెట్స్ సంగతి అవి చూడమని చెప్పాను. నేను వెంటనే ఇద్దరివి నాలుగు జతలు బట్టలు సదిరేశాను.ఆకలిగా లేదు.ఆయన వచ్చిన తరువాత ఆకలవుతే రెండు ముద్దలు తిన వచ్చులే అనుకున్నాను.  అర్ధ గంటలో ఆయన దగ్గరనుంచి ఫోను వచ్చింది. ట్రావెల్  ఏజెంట్  కి టికెట్స్ కోసం వాళ్ళ జూనియర్ పురమాయించాడట. మూడు  గంటలకల్లా  వస్తానన్నారు.
ఫోను బుక్ తీసి సరోజ వాళ్ళ నాన్నగారింటికి ఫోను చేశాను. ఎవరో పనివాడు ఫోను ఎత్తి సారూ వాళ్ళు మూడు రోజుల క్రింద అమెరికాలో అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళారు అమ్మా, అన్నాడు. అమెరికాలో వాళ్ల 'టైం' ఏమిటో ఆలోచించ కుండానే వెంటనే పెద్దదానికి, బాబుకి ఫోను చేసి వాళ్ళని వెంటనే సరోజ వాళ్ళ తమ్ముణ్ణి, సరోజ పేరెంట్స్ ని కాంటాక్ట్  చేసి ఈ సంగతులన్నీ చెప్పమని చెప్పి, కాశీ పోలీసుల  ఫోను నంబర్లు అన్నీ  ఇచ్చి వాళ్ళు వస్తారా, రారా, మమ్ముల్ని ఏమి చేయమంటారు, అన్నీవిపులంగా  కనుక్కుని వెంటనే  ఫోను చేయమని చెప్పాను.     
                           ఆలోచనలు ఎంత ఉగ్గ పట్టుకున్న ఆగడం లేదు. సరోజ వాళ్ళ ఫ్యామిలీ , మేము పక్క, పక్క ఇండ్లలో వుండే వాళ్ళం.  సరోజ కి నాకు నాలుగు రోజుల తేడా. ఇద్దరం చిన్నతనం లో ఒకటే వూళ్ళో ఉన్నామేమో ఒకర్ని వదలి ఒకళ్ళం వుండే వాళ్ళం కాదు. పండగలకి మా ఇద్దరిదే ఆర్భాటం. చదువుల్లో నేను ముందుండే దాన్ని. నేను డిగ్రీ చేసాను. అది డిగ్రీ మధ్యలో ఆపేసింది. అది నాకంటే తెలుపు,చాలా అందంగా వుండేది.అందరు దాన్ని అదృష్టవంతురాలవని అంటుండే వాళ్లు. వాళ్లకి బాగా ఆస్తి వుండేది. మా నాన్నగారు అంటుండే వారు, దానితో పోల్చుకోవద్దని. వాళ్లు చాల ధనవంతులని. ఇద్దరికీ నెల తేడాలో  పెళ్ళిళ్ళు అయ్యాయి. మా ఆయన అడ్వొకేటు. దాని భర్త జమీందారు గారి కొడుకు. పెద్ద ఆస్తి పరుడు. మా ఇద్దరికీ మొదటి సంతానం కూతుర్లే. నా కూతురికి దాని కూతురికి కూడా నాలుగు రోజులే తేడానే. నాకూతురు నాలుగు రోజులు పెద్దది. వారిద్దరికీ ముఫ్ఫై నిండాయి. సరోజ బ్రతికుందంటే ఆ కూతురికోసమే నని అందరికి తెలుసు. కూతురు మానసిక రోగి, మూర్చలు. తన పనులే తానే చేసుకోలేదు. అన్నిసరోజ  చేయాల్సిందే. కాల కృత్యాల దగ్గరనుంచి బట్ట కట్టడం కూడా తనే చేయాలి. ఒంటిలో కాళ్ళు,కళ్ళు రెండే సరైన అంగాలు.అదీ కొద్ది దూరం నడవగలదు. అంతే! దాన్ని తలుచుకుంటేనే మనసు భారమవుతుంది. కాసేపు మళ్ళీ మనిషిని కాలేను.
                          సరోజ పెళ్ళయిన మూడేళ్లకే భర్త ఏదో తెలియని రోగంతో పోయాడు. బాగా వున్నవాళ్ళు. పిల్ల సుఖ పడుతుంది , మంచి సంబంధం అని పెళ్లి చేసేశారు. అతనికి పెళ్ళికి ముందే రోగం వుండేదట. అంతా దాచేసి పెళ్లి చేశారు. కాపురానికి వెళ్ళేటప్పటికే భర్త రోగిష్టి అని, తను జీవితంలో పూర్తిగా మోసపోయానని, పెళ్ళిచేస్తే నన్న ఆరోగ్యం బాగు పడుతుందని చేశామని అత్తగారు ఎన్నోసార్లు అన్నారని, తనని నష్ట జాతకరాలినని, అందుకే కొడుకు ఆరోగ్యం పెళ్లయినా మెరుగవ్వలేదని అత్తగారు విపరీతంగా సాధించేదని సరోజ ఎన్నో సార్లు నాతో చెప్పుకుని ఏడ్చింది. పెళ్ళయిన ఏడాదికే బిడ్డని కంది సరోజ . ఆడపిల్లని కన్నావని సాధింపు, అందునా కొద్ది నెలలు నిండే సరికి పిల్లకి మూర్చలు వచ్చేవి. ఆ తరువాత కొద్ది కాలానికే సరోజ భర్త పోయారు. అక్కడ నుంచి దాని  జీవితం దుర్భర మయింది. పిల్ల మందులకి ,డాక్టర్ల ఫీజులకి కుడా డబ్బులు ఇచ్చేది కాదు అత్తగారు. మా బాబాయి గారు, పిన్ని ఇక దాన్ని అక్కడ వుంచడం క్షేమం కాదని దాన్ని తీసుకుని వచ్చారు. తరువాత పిన్నికూడా విసుక్కోవడం మొదలెట్టిందనీ, పిల్లని దగ్గరిక్కుడా రానిచ్చేది కాదని, బాబాయి గారే కొద్దో, గొప్పో చాలా నయమని అమ్మచెపుతుండేది. కాలం గడిచిపోయింది. రాక పోకలు తగ్గి పోయాయి. ఏదైనా ఫంక్షన్ లలోనో, పెళ్ళిళ్ళ లోనో  సరోజ అమ్మ,నాన్నకలిసే వారు. అది మాత్రం వచ్చేది కాదు. అలాంటప్పుడు నా మనసు తల్లడిల్లి పోయేది. దాన్ని ఎప్పుడూ నా సొంత అక్కగానే ఆనుకున్నా. ఏనాడు అదికూడా  నన్ను పరాయిగా చూడలేదు.
                        మా పెద్దది మాట్లాడినా,కనిపించినా, నేను దాని దగ్గరికి వెళ్ళినా, అది నాదగ్గరికి వచ్చినా నాకు సరోజ  కూతురు గుర్తుకు వచ్చేది. ఇక సరోజని  తలుచుకుంటేనే బాధ, ఆందోళన .ఈరోజుకీ దాన్ని తలుచుకుంటేనే నాకు  నేను ఏదో దోషిలా ఫీలయ్యేదాన్ని. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు అమెరికాలో నే ఉద్యోగాలు. ఆర్ధికంగా బాగానే వున్నాము. హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నాము. సరోజ తల్లి, తండ్రీ కూడా హైదరాబాదు లోనే  నివాసం. అది మాత్రం ఆ అవిటి పిల్లతో వూళ్ళో.నేను చాలా సార్లు ఇక్కడకి రావే, మాఇంట్లో  ఉండొచ్చు అన్నాను. మావారు కూడా రమ్మనే చెప్పారు. వాళ్ళ ఇంట్లోనే వుండ నప్పుడు మీ ఇంట్లో ఉండడానికి నాకు ఎట్లా వీలవుతుంది అనేది!   నేను ఒక్కదాన్ని, మా అయన  చాలాసార్లు వూరికి వెళ్లే  దాన్ని, పిల్లని చూసి వచ్చే దాన్ని. మా పిల్లలు కూడా ఇండియా వచ్చినప్పుడల్లా దాని కలవకుండా వెళ్ళడం అరుదు. గంగకి ఏవేవో తెచ్చే వాళ్ళు. పెద్దదానికి గంగ అంటే ఎంతో ప్రేమ.   చివరిసారి వెళ్ళినప్పుడు అనుకుంటాను సరోజ  నాతో అంది, వాళ్ళ  నాన్న కూడా ఈమధ్య రాలేదని.
నువ్వు ఒక్కదాని వేనే నాకు మిగిలింది. నాకేమయినా అనుకోకుండా అయితే ఈ పిల్ల సంగతి ఏమిటే ?
అందుకే దేవుణ్ణి ఒక్కటే ప్రార్ధిస్తున్నా! నాకంటే దాన్ని ముందు తీసుకెళ్ళమని ! పిచ్చిగా మాట్లాడ వద్దని వారించడం తప్ప నేనేం చేయలేక పోయాను. నా దగ్గరున్న కొద్ది డబ్బు దాని చేతిలో పెట్టాను. ఎప్పుడూ వారించేది, తీసుకుంటూ తిరిగి ఇచ్చేస్తానే అంది. తరువాత మూడు, నాలుగు సార్లు పిల్లల పురుళ్లకి అమెరికా వెళ్లి రావడం అయింది. దాంతో దాన్ని కలవక, పిల్లని చూడక..దాదాపు ఏడెనిమిది నెలలయింది. ఇప్పుడనిపిస్తోంది అయ్యో ఎంత తప్పు చేశాను, పిల్లని చూడక ఎన్నాళ్ళయింది. నామీద నాకే అసహ్యం వేసింది. ఎలాగు కారు వుంది. తీరిక చేసుకుని ఒక్కపూట వెళ్లి వచ్చుంటే బాగుండేది. ఎంత గా సముదాయించుకున్నా కళ్ళు చమరుస్తూనే వున్నాయి.
ఫోను మ్రోగడంతో నా ఆలోచనలకూ స్వస్తి చెప్పి ఫోను తీశాను. పెద్దమ్మాయి ఫోను.
సరోజ పెద్దమ్మ వాళ్ళ తమ్ముడితో, వాళ్ళ నాన్న గారితో అన్నీ చెప్పాను. వాళ్ళు వచ్చి రెండు రోజులే అయిందట. సరోజ పెద్దమ్మా వాళ్ళ నాన్నగారు,  తమ్ముడు టికెట్స్ దొరికితే  వెంటనే బయలు దేరు తామన్నారు. మిమ్ముల్ని అక్కడ అంతా మేనేజ్ చెయ్య మన్నారు. అంటే, ఏమిటే? వాళ్ళు వచ్చిందాకా మేము వెయిట్ చేయాలా?
'ఏమో నమ్మా, వాళ్ళు చెప్పింది నీకు చెప్పాను. సరేగాని, అమ్మా,ఎలా జరిగింది ఇదంతా'?
ఏమోనే...నాకు అంతా అయోమయం గాను, కంగారుగాను వుంది. మేము వెళ్ళి, వచ్చిన తరువాత అన్నీ చెపుతాను. అని ఫోను పెట్టేశాను. ఇంతలో ఆయన దగ్గరనుంచి ఫోను. రేపు ఉదయం 0630  hrs కి  ఫ్లయ్ ట్.  1030  hrs కల్లా కాశీ వయా ఢిల్లీ చేరాము. సరాసరి ఘాట్ పోలీసు స్టేషనుకి వెళ్ళాము. పరిచయం చేసుకున్నాక బ్యాగు, సూట్ కేసు, చూపించారు. నేను గుర్తించాను. పోలీసు ఫార్మాలిటీస్ ఏవో ఉన్నాయన్నారు. అన్నీ ఆయన చూసుకున్నారు. ఒక కానిస్టేబుల్  మాతో ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చారు. నాకు కాళ్ళు, చేతులలో వణుకు మొదలయ్యింది.వెన్ను లోంచి చలి వస్తోంది. మార్చురీ కి వచ్చాము.
రెండు బోడీస్ పోస్ట్ మార్టం చేసి ప్యాక్ చేసి ఉంచారు. ఇద్దరి ముఖాలు చూశాము. చక్కగా వున్నాయి. నాదగ్గర ఉన్న అమ్మ వారి కుంకుమ తీసి  ఇద్దరి ముఖాన దిద్దాను. నాకు ఏడుపు ఆగ లేదు. బోరున విలపించాను.ఆయన నన్ను బయటకు తీసుకు వచ్చి కూర్చోపెట్టారు. మళ్ళీ ఆయన పోలీసులతో, హాస్పిటల్ వారితో , ఇంకెవరితో నో మాట్లాడారు. ఆయన మళ్ళీ పెద్ద అమ్మాయితో మాట్లాడారు. సరోజ వాళ్ళ నాన్న గారు, తమ్ముడు బయలు దేరారట, రేపువుదయానికల్లా కాశీ వస్తారట. అప్పటి దాకా  మేము కూడా వెయిట్ చేద్దామని నిర్ణ ఇంచుకున్నాం. పోలీసు స్టేషన్ నుంచి పోలీసు వారు ఇచ్చిన  లగేజ్  తీసుకుని హోటల్ కి వచ్చేశాము. మరుసటి రోజు ఏర్పాట్లు అన్నీ  చూడమని అయన ఎవరికో పురమాయించారు. హోటల్లో దాని బ్యాగు,సూట్ కేసులో వస్తువులు బట్టలు అన్నీ తీసి చూశాను. దాని చాలా పాత  డైరీ ఒకటి, దానిలో  అక్కడక్కడా ఏవో వ్రాతలు, నా అడ్రస్, మా ఇంటి పాత ఫోను నంబరు..ఇంకా ఏవో డబ్బుల లెక్కలు, నేను తనకి ఇచ్చిన డబ్బుల లెక్ఖ తో సహా ! ఇంకా తను నాకు చాలా ఋణ పడి పోయానని, నా పిల్లలంతా ముగ్గురు  తననీ, తన పిల్లనీ, తన సొంత వాళ్ళకంటే ఎక్కువగాఆదరించారని, ప్రేమించారని , ఇంకో జన్మ అంటూవుంటే నా ఇంట్లో పుట్టి నా ఋణం తీర్చుకుంటానని వ్రాసింది. నా కళ్ళవెంట నీరు ధారలుగా కారుతోంది. డైరీ పక్కన పడేసి, బ్యాగులో / సూట్ కేసులో వస్తువులు /బట్టలూ అన్నీ ఒక్కటొక్కటిగా తీసి చూశాను. నేను మా పెద్ద దాని పెళ్ళిలో పెట్టిన కంచి పట్టు చీర కన్పించింది. చీర ఇంకా చెక్కు చెదర లేదు. నా బలవంతం మీద పెళ్ళిలో చీర కట్టుకుని వెంటనే విప్పేసింది. తరువాత మళ్ళీ కట్టి నట్టు లేదు. మెల్లగా  చీరను చేతిలోకి తీసుకున్నాను కాసేపు దాన్ని స్పృశిస్తూ అలాగే ఉండిపోయాను.
పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ చెప్పిన మాటలు చెవిలో మార్మోగుతున్నాయి. ' బడే అమ్మ కి సాడీ చోటే అమ్మ సాడీ కో  బాంద్ కే హై మాజీ '  దోనోం ఏక సాత్ మే డూబ్ గయే' ..... ఐసా లగా కీ ఓ దోనోం బాహర్  నికలనే కోషిష్ నయ్ కీ'
''ఎంత  యాతన పడ్డారో'... అనుకుంటూ చీరను  మళ్ళీ చూస్త్తూంటే లోపల మడతల్లో చిన్న చీటీ కన్పించింది. తీసి చూశాను.
ఏదో కొరిఎర్ రశీదు నా పేరున వుంది. మొన్ననే ఒక కవరు నాకు  హైదరాబాదు పంపినట్లుగా వుంది.' ఏమిటిది? ప్రమాదం కాదా'? అన్న భావనే నేను తట్టుకో లేక పోయాను. గుండె విపరీతంగా కొట్టుకుంది. ఒళ్ళంతా అంత AC లో కూడ చెమటలు పట్టాయి. ఇంతలో ఆయన వచ్చారు. రసీదు చూపించాను.
'దీనిని ఇప్పుడు ఎవరికీ చూపించకు' అన్నారు ఆయన.
                             తెల్లారింది.... ఎనిమిది గంటలకల్లా సరోజ తండ్రీ, తమ్ముడూ వచ్చారు....మమ్ముల్ని కలిశారు. ముభావకంగా వున్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, మేము  ఏమీ ఎక్కువగా మాట్లాడ లేదు......
'మీకెలా తెలిసింది'? ఈ సంగతి..... అని అడిగారు అంకుల్. పోలీసులు నాకు కబురు చేశారు అని చెప్పాను. తరువాత వాళ్ళు పోలీసులని కలిశారు. ఆయన, వాళ్ళ వంటిమీద నగలేమైనా ఉన్నాయా అనడిగారు...నాకు ఇప్పటి వరకు నాకు ఆ విషయం మీదకు ధ్యాస పోనేలేదు. పోలీసులు నగలేమీ లేవని చెప్పారు.  ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి  దహన సంస్కారాలన్నీ అయిపోయే టప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. స్నానాలు, దేవుడి దర్శనం పూర్తి చేసుకుని మేము సాయంత్రం నాలుగు గంటల  ఫ్లయట్ కి ఢిల్లీ వచ్చి, వెంటనే హైదరాబాద్ ఫ్లయట్ ఎక్కి, ఇంటికి చేరే  సరికి రాత్రి 11 గంటలు అయింది.
గుమ్మానికి కొరియెర్ నోటీసు వుంది ఫోన్ నంబరుతో సహా. తెల్లారి 9 గంటలకే కొరియెర్ ఆఫీసు కి ఫోన్ చేసి రొటీన్ లో పడిపోయాను. దాదాపు 11 గంటలకు కొరియెర్ అబ్బాయి వచ్చి కవరు డెలివరీ ఇచ్చి వెళ్ళాడు.
కవరు తీసుకున్న దగ్గరనుంచి కడుపులో నుంచి బాధ తన్నుకోవస్తోంది. ఇక టెన్షన్ భరించ లేక హాల్లో సోఫాలో చేరగిలి కవరు తెరిచిచూశాను. ఒక  లెటరు వుంది. చదవడం మొదలెట్టాను.

ప్రియమైన శారదకు,

                                   ఈ లెటరు నీ చేతికి అందేసరికి మేము తిరిగి రాలేనంత దూరానికి వెళ్లి పోయుంటాము.
నువ్వు ఈ లెటరు చదివి ఎలా రియాక్ట్  అవుతావో నా ఊహకు అందడం లేదు. నీ అంతగా నన్ను, గంగ ను ప్రేమించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరని నాకు తెలుసు. అందుకే చివరిగా నీకు, మీవారికి, మీ పిల్లలకీ కృతజ్ఞతలు చెపుదామని ఈ వుత్తరం వ్రాస్తున్నాను.

                                  శారదా జీవితంతో  అలిసి పోయాను. ఇక నావల్ల కాదు. నేను నీతో చాలా సార్లు అన్నాను. నేను ముందు వెళితే దీని సంగతి ఏమిటని? నిజం. ఈ ప్రశ్న నన్ను ప్రతిరోజూ, ప్రతి క్షణం వేధిస్తూనే వుంది. దానికి 30 ఏళ్ళు వచ్చాయి. దీనికి 15 ఏళ్ళు వచ్చిందగ్గరనుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. ఈ మధ్య జరిగిన రెండు, మూడు సంఘటనల తో నాకు అర్ధమైంది జీవితాంతం, ప్రతిక్షణం  గంగను  మానవ మృగాలనుంచి కాపాడడం నా వల్ల కాదేమోనని.
స్నానం చేసిరావాలన్నా, బాత్ రూం కి వెళ్లి రావాలన్నా, భయమే. తలుపులు మూసి వెళ్దామంటే 'గంగ' ఒకటే కేక లేస్తుంది. బట్టలులాగేసుకుంటుంది. క్రూరమైన ఈ మనుషుల మధ్య ఈ పిచ్చితల్లిని వదిలి వెళ్ళలేను. నాకు వంట్లో బావుండడం లేదు. డాక్టరు దగ్గరికి  వెళ్లా లని కూడా లేదు. ఈ బ్రతుకు  ఈడ్చే శక్తి నాకింక లేదు. బ్రత కాలన్నఇచ్ఛ
అసలే  లేదు.  నేను కన్న వారికే కాదు, భూమికే  భారమయ్యానన్న  సంగతి నాకు అర్ధ మయింది. అంతే కాదు  ఈ మధ్య నేను నాకే భారమయ్యా ననిపిస్తోంది. నేను నాకే భార మైతే మరి దాని సంగతో! అలాగని దాన్నికడతేర్చే కసాయి దాన్నీకాదు. నాకు బ్రతకాలని లేదు.
దానికి 'గంగ' అని పేరు ఏ క్షణాన పెట్టానో తెలీదు. 'గంగ' వాహిని లా పవిత్రంగా, నవ్వుతు,తుళ్ళుతూ ఉండాలనుకున్నాను. కాని భగవంతుడు దాని నొసటన ఇలా వ్రాశాడు.   అది పుట్టి నప్పటి నుంచి 'కాశీ' కెళ్ళా లని వుండేది. ఎప్పటి నుంచో నా 'గంగ' తో  ఈ 'గంగ' లో మునిగి పునీతం కావాలనుకున్నా. ఆక్షణం వచ్చేసింది.
ఏ జన్మ లో చేసిన పాపమో, నువ్వు, నీ కుటుంబానికి తప్ప  ఎవరికీ కాకుండా పోయాము. నా వాళ్ళందరికీ నా సంగతేమో గాని నా 'గంగ' అంటేనే దూరం. ఇంక  నా బ్రతుకు కి అర్ధం, పరమార్ధం ఏమీ కాన రావడం లేదు.     
'గంగ' లో మునిగితే మా పురాకృత పాపాల శేషం  ఇంకా మిగిలి  వుంటే కొట్టుకు పోతుందని 'గంగ'ను  తీసుకుని  'గంగ' కు  వచ్చాను.  నీకుటుంబం  మా పట్ల చూపిన ప్రేమ,ఆత్మీయత,అనురాగం నా సొంతమనుషుల్నుంచి
నేనేనాడు పొందలేదు. దాని కేనాడు నేను బాధ పడలేదు.
ఈ లెటర్ నీకు అందే వరకు నాన్నా,అమ్మా వాళ్ళు తమ్ముడి దగ్గరకు అమెరికా వెళ్లి వుంటారు. నీవు  తప్ప నాకు చెప్పుకునేందుకు వేరే వారున్నా...వారెవరు నాకు, నీఅంత అంతరంగికులు కారు. నీ ఋణం నేను తీర్చ లేదు. ఎందుకో తెలుసా?
మళ్ళీ జన్మ అంటూ వుంటే నీ ఇంట పుట్టాలని వుంది. ఇక వుంటాను,
నీ నెచ్చెలి 'సరోజ' కడసారి వీడ్కోలు! ఇక శలవు......
ఎప్పటికీ నీ ..... ,
సరోజ.
రచన:- 
కేశిరాజు వెంకట వరదయ్య

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి